Monday, September 12, 2011

మతహింస బిల్లు - సంపాదకీయం Andhra Jyothi 13/09/2011


మతహింస బిల్లు
- సంపాదకీయం

దేశంలో నానాటికి పెరుగుతున్న హింస ఒక సవాలుగా మారింది. మత, వర్గ, కుల, ప్రాంత, జాతి వేర్పాటు ఉద్యమాల్లో, వివిధ నిరసనల్లో వ్యక్తమవుతున్న హింసాకాండను నిరోధించేందుకు యూపీఏ ప్రభుత్వం '2011- మతతత్వం. లక్ష్య హింసల (న్యాయం, పరిహారాల లభ్యత) నిరోధక బిల్లు'ను రూపొందించింది. దీన్ని సంక్షిప్తంగా 'మతహింస నిరోధక బిల్లు'గా పిలుస్తారు. ఢిల్లీలో గత శనివారం ఏర్పాటు చేసిన 'జాతీయ సమగ్రతా మండలి' (ఎన్ఐసి) సమావేశంలో మతహింస నిరోధక బిల్లుపై వాడి, వేడి చర్చసాగింది.

2008 అక్టోబర్‌లో ఎన్ఐసి భేటీ తర్వాత మూడేళ్ళ అనంతరం ఢిల్లీ హైకోర్టు బాంబు పేలుళ్ళ నేపథ్యంలో మళ్లీ సమావేశమైంది. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు ఉగ్రవాదం, మావోయిస్టుల హింసలని ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, పార్లమెంటులో విపక్షనేతలు, జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలు హాజరయ్యారు. రాజ్యాంగ విరుద్ధంగా దేశ సమాఖ్య (ఫెడర ల్) వ్యవస్థకు ఈ బిల్లు ద్వారా కేంద్రం ముప్పు తెస్తోందని అనేక రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశా యి.

మెజారిటీ మతస్తులకు వ్యతిరేకంగా ఈ బిల్లు రూపొందించారని బిజెపి విమర్శిస్తోంది. దేశ ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్న మతహింస, ఉగ్రవాదం, ఇతరత్రా రూపాల్లోని హింసాకాండల పై లోతైన చర్చ జరగాల్సిన ఎన్ఐసి సమావేశానికి ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, బీహార్ తదితర ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు గైర్హాజరు అయ్యారు.

యూపీఏ కీలక భాగస్వా మి తృణమూల్ కాంగ్రెస్ సైతం ఈ బిల్లును వ్యతిరేకించగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మౌనం వ హించారు. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి మతోన్మాద హింస, మైనార్టీల పట్ల వివక్ష, కుల, మత మారణకాండ వంటి విషయాలపై జాతీయ సమగ్ర విధానాన్ని పాలకులు రూపొందించలే దు. ఆ సంక్లిష్ట అంశాలను ప్రభుత్వాలు కేవ లం శాంతి భద్రతల సమస్యలుగానే పరిగణించి పరిష్కరించేందుకు ప్రయత్నం చేయడంతో అవి మరింత జటిలమై సమాజానికి సవాళ్ళుగా మారాయి.

సోనియా గాంధీ నేతృత్వంలోని జాతీయ సలహా మండలి (ఎన్ఏసీ) రూపొందించిన మతహింస నిరోధక బిల్లు వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా ఎన్ఏసీ రాజ్యాంగబద్ధతపై విమర్శలు వచ్చాయి. జన్‌లోక్‌పాల్ బిల్లు వ్యవహారంలో అన్నా హజారే నేతృత్వంలోని పౌరసమాజం చట్టసభలకు అతీతంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించిన యూపీఏ ప్రభుత్వం, ఎన్ఏసి అనే రాజ్యాంగ విరుద్ధమైన సంస్థను ఎలా ఏర్పాటు చేసింది? ప్రభుత్వానికి విధాన రూపకల్పన, శాసన నిర్మాణానికి సంబంధించి సూచనలు, రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ఎన్ఏసి సిఫారసులు చేస్తుంది.

ఓటు బ్యాంకు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మతోన్మాద రాజకీయాల నుంచి భూముల స్వాధీనం దాకా సకల అంశాలపై రాజ్యాంగేతర ఎన్ఎసి ప్రభుత్వాన్ని శాసిస్తోందని విమర్శలున్నాయి. మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలు, మహిళల్లో వివక్షకు గురవుతున్నామనే భావనను తొలగించేందుకు ఈ మతహింస నిరోధక బిల్లు ఉద్దేశించిందని ప్రభుత్వం వాదిస్తోంది.

మత హింసాకాండను, అల్లర్లను అణచివేసేందుకు మెరుపు దాడులకు దిగేందుకు వీలుగా 'జాతీయ భద్రతా గార్డు'ల ప్రాంతీయ కేంద్రాలు, తీరం పొడవునా ఆధునాతన గస్తీ యంత్రాంగం ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. కేంద్రం ఇలాంటి జోక్యంతో రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను ఈ ముసాయిదా బిల్లు ద్వారా అతిక్రమిస్తోందని అనేక రాష్ట్ర ప్రభుత్వాల ఆందోళనలు వ్యక్తం చేయడం సమంజసమైనదే. ఆ రూపంలో దేశంలోని సమాఖ్య వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం విఘాతం కలిగించిన ట్లవుతుంది.

సమాఖ్య వ్యవస్థకు విఘాతం కల్గించడమనే సాంకేతికపరమైన అంశం విషయాన్ని పరిష్కరించుకోవడం కొంత సులువే. అయితే దృక్పథపరంగా తలెత్తిన వివాదం మరొకటి ఉంది. దేశంలో ఎక్కడ మతతత్వ అల్లర్లు చెలరేగినా మెజారిటీ వర్గానికి చెందిన వ్యక్తులు, సంస్థలనే పూర్తిగా బాధ్యులను చేస్తూ, మైనారిటి వర్గానికి చెందిన వారిని తప్పుపట్టడానికి నిరాకరిస్తున్న బిల్లు వైఖరిని బిజెపి పూర్తిగా తప్పుపట్టింది.

అలాగైతే గోధ్రా రైలు బోగీలకు నిప్పుపెట్టి కరసేవకుల మరణానికి కారణమైన హంతకులు, ముంబాయి, ఢిల్లీ, పుణె తదితర ప్రాంతాల్లో వరుస బాంబు పేలుళ్ళతో మారణహోమం సృష్టిస్తున్న ఉగ్రవాదులు సైతం ప్రతిపాదిత చట్టం పరిధిలోకి రారని వాదిస్తోంది. ఆ కోణంలో శిక్షలకు సంబంధించి బిల్లులో ప్రతిపాదించిన నిబంధనలు ప్రజాస్వామ్య సమాజానికే అవమానమని బిజెపి విమర్శిస్తోంది.

అయితే అయోధ్య రామజన్మభూమితో మొదలై ముంబై, గుజరాత్ మైనారిటి వర్గాల మారణహోమాలు, మలేగావ్, మక్కా మసీదు, అజ్మీరే షరీఫ్, సంరnౌతా ఎక్స్‌ప్రెస్ వంటి హింసాత్మక ఘటనల వెనుక కొన్ని హిందూత్వ తీవ్రవాద శక్తులున్నాయని దర్యాప్తులో తేలిన విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్న సందేహం మిగిలే ఉంటుంది. బాధిత మైనారిటీ సమూహాల నుంచి వస్తున్న ప్రతిక్రియను అర్ధం చేసుకొని సరైన పరిష్కారాలను కనుగొనాలి.

మతోన్మాదాన్ని, మత తీవ్రవాదాన్ని శాస్త్రీయంగా అర్ధం చేసుకొని ఎదుర్కొన్నప్పుడే ఉగ్రవాదాన్ని సమర్ధవంతంగా నిర్మూలించగలం. జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ నివేదిక ప్రకారం ముస్లింల జీవన ప్రమాణాలు ఎస్సీ, ఎస్టీల కంటె కొంచెం ఎక్కువగాను, బీసీల కంటె బాగా తక్కువగానూ ఉన్నాయి. సాంఘిక, ఆర్థిక, రాజకీయ, విద్యా రంగాలలో ముస్లింలు అత్యంత వెనుకబడి ఉన్నారని, జనాభారీత్యా కూడా వారి సంఖ్య తగ్గుతోందని ఆ నివేదిక వెల్లడించింది.

దేశంలోని మైనార్టీల్లో అధిక శాతంగా ఉన్న ముస్లింలు తీవ్రమైన దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. 1992 బాబ్రీ మసీదు విధ్వంసంతో మొదలైన ఆధునిక మత విధ్వంసకాండకు ఆద్యులైన రాజకీయ పార్టీ నేతలే అందుకు సమాధానం చెప్పవలసి ఉంది. జాతీయవాదం పేరిట జనం మధ్యలోకి వస్తున్న ఈ రాజకీయాలు మెజార్టీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నాయి. మైనారిటీ మతోన్మాదం కూడా లౌకిక వాదానికి ప్రమాదకరం. మైనారిటీ మతస్తుల పట్ల అణచివేత, వివక్ష అంతమై సకల సామాజిక రంగాలలో అభివృద్ధి ఫలాలను వారు అందుకోలేనంత వరకు మైనారిటీ మతోన్మాద ప్రమాదం పొంచే ఉంటుంది.

సచార్ క మిటీ సూచనల ప్రకారం మైనారిటీలకు ప్రత్యేకంగా ఉప ప్రణాళికలను రూపొందించి అభివృద్ధికి కృషి చేయాలి. అల్లర్ల విషయంలో మైనారిటీలకు మినహాయింపు కల్పించడం వరకే పరిమితమైతే ఆశించని లక్ష్యం నెరవేరకపోగా సమస్య మరింత జటిలమవుతుంది. పెరుగుతున్న సామాజిక, ఆర్థిక అసమానతలు, యువత ప్రాథమిక అవసరాలు తీరకపోవటం వల్లే ఈ అశాంతి పెరుగుతోంది. యువత భవితకు నిరుద్యోగం పెనుశాపంగా మారింది. మైనారిటీ, మెజారిటీ ఉగ్రవాదాలకు పునాది ఈ సామాజిక అశాంతే. అధిక ధరలు, నిరుద్యోగం, దేశంలో పేద, ధనిక వర్గాల మధ్య అనూహ్యంగా పెరిగిన అంతరాలు తదితర సామాజికార్థిక సమస్యల పరిష్కారంతో మత హింస ప్రధానంగా ముడిపడి ఉంది.

మత హింసతో పాటు ఈ బిల్లు లక్ష్య హింసను కూడా సమానంగా ప్రస్తావిస్తోంది. వామపక్ష తీవ్రవాదం, ఈశాన్య రాష్ట్రాల వేర్పాటు వాదం, ప్రాంతీయ ఉద్యమాలతో పాటు అనేక ప్రజా ఉద్యమాల్లో నిరసనలు వ్యక్తం చేసేందుకు హింసకాండను సాధనంగా వినియోగిస్తున్నారని ఈ బిల్లు వ్యాఖ్యానించింది.

అంటే దేశ సమస్యలను సకాలంలో పరిష్కరించని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వివిధ ప్రజా శ్రేణులు చేస్తున్న మిలిటెంట్ ఉద్యమాలను సైతం అణచివేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసుకుంది. జైతాపూర్ అణువిద్యుత్, సింగూర్, నందిగ్రాంలాంటి ప్రజాపోరాటాలు, పోస్కోలాంటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఆదివాసీ పోరాటాలను ఉగ్రవాద హింసాకాండతో పోల్చి తీవ్రంగా అణచి వేసేందుకు ఈ బిల్లు ద్వారా కేంద్రం చట్టబద్ధత కల్పించుకుంటోంది. పౌర సమాజం హక్కులను హరించివేసే ఈ చట్టాన్ని ప్రజలు తిప్పికొట్టాలి

No comments:

Post a Comment