Wednesday, September 7, 2011

సమతా దార్శనికుడు -డా. కత్తి పద్మారావు Andhra Jyothi 14/04/2011


సమతా దార్శనికుడు

-డా. కత్తి పద్మారావు

navya.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావులు ఐదుగురిలో ఒకరు. భారత ఉపఖండంలో బుద్ధుని తరువాత పేర్కొనదగిన దార్శనికుడు అంబేద్క ర్. ఆయన మౌలికంగా హేతువాది. మన సమాజంలోని సామాజిక అసమానతల మూలాలు కులంలో ఉన్నాయని, కుల వ్యవస్థకు పునాదులు హిందూ మతవ్యవస్థలో ఉన్నాయని ఆయన గ్రహించారు. ప్రత్యామ్నాయ సంస్కృతీ రూపకల్పనకు పూనుకున్న అంబేద్కర్ కుల నిర్మూలనకు కృషి చేశారు. ఆ కృషికి పరాకాష్టగా బౌద్ధ ధర్మాన్ని ప్రవచించారు. పితృస్వామ్య వ్యవస్థను ఎదిరించి స్త్రీకి సమానత్వాన్ని కోరాడు. భూమిని, పరిశ్రమలను జాతీయం చేయడం ద్వారా ఆర్థిక సమానత్వాన్ని సాధించగలమని అంబేద్కర్ విశ్వసించారు.


వర్తమాన భారతదేశంలో కులం ఆధునిక రూపం ధరిస్తుంది. కులాంతర వివాహాల ద్వారా కులం పునాదులను కూల్చివేయాలని అంబేద్కర్ ప్రవచించా రు. కులాంత ర వివాహాలు జరుగుతున్నా కుల సంస్కృతి చిట్టెంగట్టుకు పోతూ వుంది. ఆర్థిక, సాంఘిక స్థాయి పెరిగినా, వీధుల్లోను హోటళ్ళలోను, రైళ్ళలోను అందరూ కలిసిపోతున్నారు. అయితే అంతరంగంలో కులం రూపు మాసిపోవ డం లేదు. పెద్ద పెద్ద పట్టణాల్లో కూడా కుల కల్యాణ మండపాలు, కులవివాహ వేదికలు కులసమీకరణలను నిర్ధారిస్తున్నాయి.

ఈ విచిత్ర వాస్తవాన్ని డాక్టర్ అంబేద్కర్ నాడే ఇలా విశ్లేషించారు: 'హిందువు తన కుల ఆచారాలను పాటించే పద్ధతి చూస్తే చాలా తమాషాగా ఉంటుంది. వేలాది హిందువులు నిత్యమూ రైల్వే ప్రయాణాలు, విదేశీయాత్రలు వంటి ఎన్నో సందర్భాలలో కులాచార నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉంటారు. అయినా జీవితమంతా కులాన్ని పాటించడం పట్ల పట్టుదలగా ఉంటారు. ఈ ధోరణి హైందవేతరులకు ఎంతో వినోదాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ విచిత్ర పరిస్థితికి హేతువు ఏమిటి? అని తరచి చూస్తే హిందువుడి ఆలోచనా శక్తి ఎంత అస్వతంత్రం, శృంఖలాబద్ధం అయిపోయిందో తెలుస్తుంది'.

ఇతర మతాలు కూడా కులం దగ్గర పట్టుదలగానే ఉన్నాయి. క్రైస్తవ మతంలోకి మారిన హిందువులు, ఎస్సీలు తమ కులాల పునాదిని అలాగే కాపాడుకుంటున్నారు. ఈ దశలో కుల అస్తిత్వ వాదాలు కులం పునాదిని కూల్చడానికి ప్రయత్నిస్తూ తమ హక్కుల కోసం పోరాడవలసి వుంది. అయితే కులాన్ని రద్దు చేసే హక్కులకోసం పోరాటం ఆశ్చర్యాన్ని గొలుపుతూవుంది. ఈ విధానాల వలన కులం ఆధునికంగా రూపాంతరాలుచెందుతూ బతుకుతుంది. కులం బతికినంతకాలం అస్పృశ్యత భౌతికంగా కాకపోయినా భావరూపంలో ఉంటుంది.

కులం పునాదిమీద, మతం పునాదిమీద, ఆరాధనలతో ఎదిగే రాజకీయ నాయకత్వం భారత్‌ను పారతంత్య్రం నుంచి విముక్తి చేయలేదని చెప్పారు. ఈ క్రమంలో రేనడే, గాంధీ, జిన్నాలపై చేసిన విశ్లేషణల్లో, నాయకుడు హేతువాది గా ఎదగాలని, పత్రికలను ప్రచారాన్ని, వందిమాగధులను, వంశ పారంపర్య వారసత్వాలను కులనామాలను ధరించడం ద్వారా పైకి ఎదిగేవారు భారతదేశ పునర్నిర్మాణానికి బాటలు వేయలేరని నిక్కచ్చిగా చెప్పారు. గాంధీ, జిన్నాలు అనుసరించిన రాజకీయ నీతిజ్ఞతా దారిద్య్రంవల్ల, దేశంలో ఏ విషయాలు స్పష్టమైన రూపానికి రాలేకపోయాయని ఆయన చెప్పారు.

ఇప్పుడు భారత్, పాకిస్థాన్‌లలో నెలకొన్న అనేక అసందిగ్ధతలకు కారణం రాజకీయ నాయకుల కులమత ద్వేషాలే. తమ తమ కులమతాల ఆధిపత్యాలపోరులో తరతరాల భారతదేశ లౌకిక వాదానికి వీరు తిలోదకాలు ఇచ్చారు. వంశపారంపర్య రాజకీయ సంక్షోభం మిన్నంటుతునేవుంది. ఆరాధనాభావంతో రాహుల్‌గాంధీని, నెహ్రూవంశ రాజకీయ పునరుద్ధరణలో భాగంగా ప్రధానిని చేసే ప్రయత్నం చేస్తున్నారు.

నిజమే రాహుల్‌గాంధీ అమేథిలో పేదల ఇళ్ళల్లో దళితుల ఇండ్లలో రొట్టె మిరపకాయను నమిలి తింటున్నారు. ఇటువంటి స్థితిలో భారతదేశం ఉండడానికి కారణం ఎవరు? స్వాతంత్య్రం వచ్చి 62 ఏండ్లు అవుతున్నా ఎందుకు దళితులు, ఆదివాసులు, దుర్భర దారిద్య్రంతో ఉన్నారు. దీనికి కారణం రాహుల్‌గాంధీ తాతముత్తాతలు కాదా! సంవత్సరానికి దాదాపు 20 లక్షల మంది ఐదేళ్లలోపు పిల్లలు చనిపోతుంటే అందులో 10లక్షల మంది ఆకలి, ఆహారలేమి వల్ల చనిపోవడం, పాలక వర్గానికి సిగ్గుచేటుకాదా?

ఆహార భద్రతా బిల్లు పెడతామంటున్నారు. కేంద్రప్రభుత్వం ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి 6.75కోట్ల మంది దారిద్య్రరేఖకు దిగువ స్థానంలో ఉన్నట్టు లెక్కించారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో బీపీఎల్ కార్డులు కోట్ల మందికి ఇచ్చి ఉన్నారు. కేంద్ర రాష్ట్రాల అంచనాలు వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉన్నాయి. నిజానికి 20 కోట్ల మంది భారతీయులు ఆహారలేమితో ఉన్నారు. వీరిలో దళితులు ఆదివాసీ లు ఎక్కువ. అంబేద్కర్ చెప్పినట్టు భూమికి బదులుగా బియ్యం ఇవ్వాలనుకోవ డం సోషలిజానికి వెన్నుపోటు పొడవడమే. ముఖ్యంగా ఇంతవరకు దళితుల, ఆదివాసీల వాడలకు లింకురోడ్లు లేవు. 60శాతానికి పైగా దళితవాడలకు ఆదివాసీవాడలకు విద్యుత్, తాగునీటి సౌకర్యం, గృహవసతి లేదు.

అందుకే అంబేద్కర్ దళితులకు ఆదివాసీలకు భూవసతిని కల్పించండని నొక్కి చెప్పాడు. అందుకోసం నాడే భూమి కొనుగోలు పథకాన్ని ప్రతిపాదించాడు. పరిశ్రమలను జాతీయం చేయడం ద్వారా దళితులను కార్మికులుగా రూపొందించాలని చెప్పా డు. అయితే ఇప్పటివరకు పాలించిన ప్రభుత్వాలు పరిశ్రమల్ని ఎత్తివేయడమో ప్రైవేటీకరించడమో చేశాయికానీ జాతీయీకరణ చేయలేదు. అందువల్ల ప్రజలు బియ్యం అడుక్కునే వారిగానే మిగిలిపోయారు.

జనరల్ మార్కెట్‌ని కార్పొరేట్ వ్యవస్థకు అప్పజెప్పి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుంటే, ప్రభు త్వ పంపిణీ విధానమంతా కుప్పకూలిపోతే ఆహారభద్రత లేక ప్రజలు అన్నార్త లు అవుతుంటే, ప్రభుత్వ గోడౌన్స్‌లో ఆహార ధాన్యాలను నిల్వ చేయలేని పరిస్థితిలో అవి ఎలుకలు, పందికొక్కుల పాలవుతుంటే ప్రజల్లో 20శాతం మంది భిక్షగాళ్లుగా జీవన భద్రత లేక జీవించే హక్కును కోల్పోతున్న సందర్భంలో అంబేద్కర్ ఆశయాలను నేడు మళ్ళీ పునరుజ్జీవింపచేసుకొని ముందుకు వెళ్ళవలసిన చారిత్రక అవసరం ప్రభుత్వాలకు లేదా? డైరెక్టుగా దళితుల చేత ఎన్నుకోబడకుం డా మెజారిటీ అగ్రకులాల ప్రజలచేత ఎన్నుకోవడం వలన దళిత ఎమ్మెల్యేలు నోరెత్తలేని మూగజీవులుగా అసెంబ్లీలో, పార్లమెంటులో ఉన్నారనేది సత్యం.

దళిత రాజకీయ ప్రాతినిథ్యం మూగదిగా, చెవిటిదిగా అయిపోవడం వలన అగ్రకుల పాలకులు వేసే భిక్ష తప్ప, పోరాడి సాధించుకునే తత్వం దళిత రాజకీయ నాయకత్వానికి లేకుండా పోయింది. అంబేద్కర్ నాడే గాంధీకి చెప్పాడు ఉమ్మడి ఎన్నిక పద్ధతి అంటే అది దళిత రాజకీయాలను కుదవ పెట్టడమే అని. నేడు ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మత ఉగ్రవాద బూచిని చూపించి హిందూ దేశం లో మతోన్మాదాన్ని పెంచుకోవడానికి కొన్ని సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి. మహిళా రిజర్వేషన్లని కాంగ్రెస్, బిజెపి, సిపిఎంలో ఉన్న అగ్రవర్ణాలు ముక్తకంఠంతో సమర్థించడం వల్ల రిజర్వేషన్ విధానానికి కుటుంబ కుల రాజకీయ పెత్తనాలకు ద్వారాలు తెరచినట్టే అవుతుంది.

స్త్రీ స్వేచ్ఛ అంటే తప్పకుండా అది అన్ని కులాల్లో ఉన్న స్త్రీలకు సమంగా రాజ్యాధికారం ఇవ్వడం ద్వారానే అది సాధ్యం అవుతుంది. అంబేద్కర్ ప్రతిపాదించిన విద్యా విప్లవాన్ని భారత ప్రభుత్వం 60శాతం కూడా సాధించలేకపోయింది. దళితులు, ఆదివాసీల హాస్టళ్లు వసతులు లేని నరక కూపాలుగా మారాయి. నేటికి ఐఐటి, ఐఐఎం లాంటి జాతీయ స్థాయి సంస్థల్లో ఇప్పటికీ దళితులపై అస్పృశ్యతను పాటిస్తున్నారు.

అంబేద్కర్ విగ్రహాలకు ముసలి కన్నీరుతో ఆయన జయంతులకు నివాళులు అర్పిస్తున్న పాలకులు ఆయన ఢిల్లీలో నివసించిన భవనాన్ని, బాంబేలో ఉన్న ఆయన లైబ్రరిని, నాగ్‌పూర్‌లోని బౌద్ధ దీక్షా భూమిని ఆయన నిర్యాణమైన చైత్ర భూమిని ఎందుకు జాతీయ గుర్తింపు స్థలాలుగా కేటాయించి ఆయన భద్ర పరిచిన వస్తువులను ఎందుకు మ్యూజియంగా రూపొందించడం లేదు. అంబేద్కర్ ప్రతిపాదించిన బౌద్ధ భారత సూత్రాలే భారత దేశాన్ని పునర్నిర్మించగలవు.

ఈదిశగా వివక్షలేకుండా అంబేద్కర్ ఆయన సిద్ధాంతాల్ని ఆచరణలను పునర్వివేచించుకొని జాతి ముందుకు కదలడమే ఆయనకు నిజమైన నివాళి. భారత ఉపఖండం సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా పునర్మించబడటానికి కావలసిన సూత్రాలు, ధర్మాలు భారత రాజ్యాంగంలో ఆయన పొందుపరిచారు. ఆయన ఈ తత్వాన్ని బౌద్ధం నుంచి స్వీకరించారు. రాజనీతజ్ఞతలో అంబేద్కర్ అశోకునంతటివాడు. భారత సమాజం పునర్జీవింపబడాలంటే కుల, మత రహితమె ౖన లౌకిక సామాజిక న్యాయం కలగాలంటే రాజ్యం అంబేద్కర్‌ను అనుసరించాలి. ఆచరించాలి. లేకుంటే భారత దేశం భావభౌతిక దశల్లో తాకట్టులోనికి వెళ్లే ప్రమాదం ఉంది. ఒక దార్శనికుడు ఒక వెయ్యేళ్ల ముందు చూపుతో తన దర్శనాన్ని రూపొందిస్తాడు. దానిని అందుకోవడంలోనే ప్రజా చైతన్యం ఆధారపడి ఉంది. అంబేద్కర్‌ది సమతా దర్శనం. ఆ దిశగా పయనిద్దాం.

-డా. కత్తి పద్మారావు
(వ్యాసకర్త దళిత ఉద్యమ నేత)
(నేడు అంబేద్కర్ 120వ జయంతి)

No comments:

Post a Comment