Wednesday, September 14, 2011

పోరు బతుకే మన మార్గం - వరవరరావు Andhra Jyothi 14/09/2011


పోరు బతుకే మన మార్గం

- వరవరరావు

'పుటుక నీది చావు నీది
బతుకంతా దేశానిది'

అని జయప్రకాశ్ నారాయణ్ గురించి కాళోజీ రాసిన ఈ చరణాలను మనం జీవితమంతా ప్రజల కోసం పనిచేసినవారి గురించి గుర్తు చేసుకుంటూనే ఉన్నాం. కాళోజీ చనిపోయినప్పుడు గుర్తుచేసుకున్నాం. జయశంకర్ చనిపోయినప్పుడు గుర్తుచేసుకున్నాం. ఇందులోని సారాంశాన్ని ఏ మేరకు మనసుకు పట్టించుకున్నాం?

పుటుకొక్కటి ఎవరి స్వీయ నిర్ణయంపై జరిగేది కాదు. పుట్టిన ఏ ప్రాణి పుట్టుకా ఆ ప్రాణి స్వీయ ఇచ్ఛపై గానీ, నిర్ణయంపై గానీ ఆధారపడలేదు. కాని ప్రతిమనిషీ తన బతుకునూ, చావునూ దేశకాల పరిస్థితులపై తన చైతన్యంపై ఆధారపడి నిర్ణయించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఇట్లా బతుకాలని, ఇట్లాగే బతుకాలని నిర్ణయించుకోవచ్చు. తన స్వాధీనంలో లేని సాధ్యాసాధ్యాలను మినహాయిస్తే అట్లా బతుకడం కోసం ప్రయత్నించవచ్చు.

'ప్రజలే చరిత్ర నిర్మాతలు' అన్నప్పుడయినా ప్రజలు కూడ తమ ఇచ్ఛ మేరకే, పవిత్రమైన కోరిక మేరకే చరిత్రను నిర్మించలేరని, ప్రపంచాన్ని మార్చలేరన్నది కూడ నిజమే. దానికెన్నో అంతర్, బహిర్ శక్తుల దోహదం, ప్రేరణ కావాలి. అంతర్, బహిర్ శక్తుల అవరోధాలు, ప్రతిబంధకాలూ ఉంటాయి. అంటే ముందుగా మనకొక బతుకు ఉండాలి. 'శరీరం ఆద్యం ఖలుధర్మ సాధనం'. నువ్వు సాధించదలుచుకున్న లక్ష్యానికి ముందు నువ్వు ఉనికిలో ఉండాలి కదా. బతికుంటే బలుసాకు కూడ తినవచ్చునంటారు. అయితే మంచి బతుకు కొరకు ఎంతో విలువయిన బతుకులు బలిఅయిపోతున్న దృశ్యాలను కూడ మనకళ్ల ముందు నిత్యమూ చూస్తున్నాం.

ఈ బలికావడం బతుకుపోరులోనా? బతుకు నుంచి పారిపోయా? పోరాడి బలి అయిపోతున్నామా? జీవితం ఇంకా చూడకుండానే బలి అయిపోతున్నామా? పుటుకకూ చావుకూ మధ్యన ఒక విస్తారమైన బతుకు ఉంది కదా- చిగురించి, మొగ్గవేసి, పువ్వు పూసి కాయో, పండో కాకున్నా పువ్వుగా రాలిపోయినా గాలిలో మిగిలే పరిమళమయినా ఉంటుంది కాని చిగురించకుండానే మనకు మనం చిదిమేసుకొనే జీవితాలు ఏం సందేశాన్ని ఇస్తాయి?

తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థులు, యువకులు ఒక తెలంగాణ వారసత్వాన్నే ముందుకు తీసుకపోతున్నారా? తెలంగాణ గర్వంగా చెప్పుకునే వారసత్వం ఏమిటి? సమ్మక్క సారక్కలది కదా? పగడిద్దరాజుది కదా? సేనాని జంపన్నది కదా? వీళ్లంతా చక్రవర్తితో పోరాడి యుద్ధంలో అమరులయ్యారు. ఏడువందల ఏళ్ల క్రితం.

సర్వాయి పాపడు యుద్ధంలో అమరుడయ్యాడు. కొమురం భీం 'మా ఊళ్లో మా రాజ్యం' అని ప్రకటించి పన్నెండూర్లు స్వాధీనం చేసుకొని భూమి దున్నుకొని, పంట ఇంటికి చేర్చి, అది కాపాడుకోవడానికి నిజాం సైన్యంతో పోరాడి అమరుడయ్యాడు.ఇవ్వాళ కొమురం భీం తెలంగాణ పోరాటానికి, స్వపరిపాలన ఆకాంక్షకు, అట్టడుగు ప్రజలు చేసే పోరాటానికి, స్థానిక పోరాటాలకు, ఆదివాసుల, మూలవాసుల పోరాటానికి పర్యాయపదమయ్యాడు. ప్రతీక అయ్యాడు.

అట్లే బందగీ-అచ్చంగా ఇవ్వాళ తెలంగాణ ప్రజలు చేస్తున్నటువంటి న్యాయ పోరాటం చేశాడు. తెలంగాణ ప్రజల హక్కులను కోస్తాంధ్ర సంపన్న వర్గాల, కులాల వేళ్ల మీద లెక్కపెట్టే దళారులు నెత్తిగొట్టి హరించివేస్తున్నట్లే విసునూరి దేశ్‌ముఖ్ అండ జూసుకొని బందగీ పెద్దన్న అబ్బసలీ బందగీ భూమిని ఆక్రమించుకున్నాడు. ఇంకో ఇద్దరు తమ్ముల భూములను కూడ ఆక్రమించుకున్నాడు. బందగీ పన్నెండేళ్లు న్యాయపోరాటం చేసి గెలిచాడు. అబ్బసలీ దొర అండ చూసుకొని అతణ్ణి చంపేశాడు.

అయినా ఆనాటి నుంచీ తెలంగాణ గడ్డ మీద భూమికోసం, న్యాయం కోసం చేసే పోరాటానికి బందగీ సంకేతమయ్యాడు. ఇవ్వాళ మనం ప్రతి సంవత్సరం కామారెడ్డిగూడెంలో బందగీ ఉర్సు జరుపుకుంటున్నాం. ఉస్మానలీఖాన్ చావు పుటుకలను కాదు బందగీ అమరత్వాన్ని తలచుకుంటున్నాం - ముఖ్యంగా పోరాట ప్రజలం.

అట్లాగే పాలకుర్తి ఐలమ్మ తన పంట ఇంటికి చేర్చుకునే హక్కు కోసం పోరాడి గెలిచింది - విసునూరి దేశముఖ్ మీద. న్యాయమైన కూలిరేట్ల కోసం పోరాడి అమరుడయ్యాడు దొడ్డి కొమురయ్య. ఆయన వారత్వాన్ని అదే కడవెండిలో పుట్టిన సంతోష్ రెడ్డి ఇటీవల దాకా కొనసాగించి దొడ్డి కొమురయ్య పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లి దేశానికే ఆదర్శప్రాయమైన విప్లవకారుడయ్యాడు.

ఈ సంతోష్ రెడ్డి మన జనగామలో, మన ఉస్మానియా క్యాంపస్‌లో చదువుకున్న విద్యార్థియే. జార్జి రెడ్డి, జంపాల ప్రసాద్‌ల నుంచి మొదలుకొని మధుసూధన్ రాజ్ యాదవ్, వీరన్న, రంగవల్లి, వీరారెడ్డి, ప్రసాదు, పులి అంజయ్య, గోపగాని ఐలయ్య, జనార్ధన్-ఎందరెందరు విద్యార్థులు పోరాడి అమరులయ్యారు. పుటుకకూ చావుకూ మధ్యన ఎంత పోరు బతుకు రచించారు వాళ్లు! తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎందరో విద్యార్థి యువజనులు పాల్గొన్నారు.

నీ కాల్మొక్త, బాంచెన్ దొర అన్న వెట్టి మనుషులు కూడ వెట్టి నుంచి, బానిసత్వం నుంచి విముక్తం కావడానికి సాయుధ పోరాటం చేశారుగాని అణచివేతకు, దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడి చనిపోయారు తప్ప, తమను తాము చంపుకోలేదు. దొరల గడీలలో లైంగిక అత్యాచారాలకు గురయినా, దాసీలుగా పిలువబడిన ఆడబాపలు, తమ మౌన ధిక్కారంతో బతికి గెలిచారు గానీ, పోరాటకాలంలో ఆ దొరల అంతు చూశారు గానీ ఆత్మహత్యలు చేసుకోలేదు.

తెలంగాణ ప్రత్యేకతను, పోరాట సంప్రదాయాన్ని, సంస్కృతిని ఈ వారసత్వం చెప్పే శరీరాలు పులకించేలా చెప్పుకుంటాం కదా. 1968-69లో మళ్లీ ప్రారంభమైన విప్లవ పోరాటంలో గానీ, ప్రత్యేక తెలంగాణ పోరాటంలో గానీ అమరులయిన వందలాది మంది పోరాడి అమరులయిన వాళ్లే. ఒక్కటి- ఒక్కటంటే ఒక్కటి కూడా ఆత్మహత్య కాదు. 1978 లక్ష్మీరాజ్యం -పోశెట్టిల అమరత్వంతో ప్రారంభమై ముప్పై ఏళ్లకు పైగా ఇప్పటికీ కొనసాగుతున్న విముక్తి పోరాటంలో అమరవులవుతున్న వాళ్లంతా పోరాడి ప్రాణాలు తృణప్రాయంగా అర్పిస్తున్న వాళ్లు.

ప్రాణమెంత విలువయిందో, తర్వాత తరానికి స్వాతంత్య్రాన్ని సాధించడం కోసం అంత తృణప్రాయంగా త్యాగం చేయవల్సిందే-కానీ, పోరాడి. మరి ఎందుకు ఈ ఆత్మహత్యలు- రెండు బలమైన కారణాలు కనబడుతున్నాయి. ఒకటి- సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ప్రభావం. రెండు-స్వార్థ రాజకీయ నాయకుల రెచ్చగొట్టే ప్రసంగాలు. నూతన ఆర్థిక విధానం పేరుతో సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ప్రారంభమైన 1991 నుంచీ వివిధ జీవనరంగాల్లో మనం ఆత్మహత్యల విషాదాన్ని చూస్తున్నాం.

ఇది ఎనభైలలో, ముఖ్యంగా రాజీవ్ గాంధీ దేశాన్ని ఇరవై ఒకటవ శతాబ్దంలోకి నడిపిస్తానన్న వాగ్దానంతోనే ప్రారంభమైన ధోరణి. సాంకేతిక విజ్ఞానం, ప్రైవేటీకరణ వృత్తి పనులను ఛిద్రం చేసి ఆత్మహత్యలు ప్రారంభమైనవి. ఇవి మగ్గాలు నమ్ముకొని బతుకుతున్న చేనేత కార్మికుల బతుకులు పవర్‌లూమ్‌లు మొదలు జెట్‌లూమ్‌ల దాకా దూసుకొచ్చిన సాంకేతిక జ్ఞానాభివృద్ధికి శరీర శ్రమ బలిఅయిన విషాద ఆత్మహత్యలు. వీటికి తోడు రైతుల జీవితాల్లో ఒక మార్కెట్ మాయ ప్రవేశించింది. భూమి, ఎరువులు, విత్తనాలు, నీళ్లు-అన్నిటి మీద తన ఆచరణజ్ఞానమున్న రైతు 'అభివృద్ధి' చెందిన 'జ్ఞానం'తో వీటన్నిటికీ పరాయి వాడయ్యాడు.

పత్తితో ప్రారంభమైన వేల సంవత్సరాల నాగరికత పెట్టుబడి పుణ్యమా అని పత్తిరైతుల ఆత్మహత్యలకు దారితీసింది. ఇట్లా జీవితంలోని ఒకొక్క శ్రామికరంగం మార్కెట్ మాయాజాలం అర్థం చేసుకోలేక ఆత్మహత్యల నైరాశ్య సంప్రదాయమొకటి ప్రవేశించింది. వరంగల్‌లో ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ సదస్సు (డిసెంబర్ 97) జరిగేనాటికి వరంగల్ జిల్లా పరకాల, చిట్యాల మండలాల్లోనే ఎందరు పత్తి రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారో. పురుగు మందులు పురుగుల్ని చంపడానికి కాదుగానీ రైతులు చావడానికి చాల పనికొచ్చినవి. గుంటూరు జిల్లా నకిలీ విత్తనాల, నకిలీ ఎరువుల వ్యాపారులు మాత్రం కోట్లకు పడగలెత్తారు.

ఆ సదస్సు ఆత్మహత్యలు చేసుకున్న పత్తి రైతులను స్మరిస్తూ, కుటుంబాలకు సానుభూతి ప్రకటించి ఊరుకోలేదు. ఆ కుటుంబాలకు ఆర్థికంగా, హార్ధికంగా అండగా నిలిచింది. అంత కన్నా ముఖ్యంగా రైతులకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు. దళారీ ప్రభుత్వాలపై పోరాడుదాం అని చైతన్యపరిచింది. ఏ భూమిలో ఏ పంట పండించాలో మార్కెటు మాయలో పడకుండా, రైతులు తమకాళ్లపై తాముఎట్లా నిలబడాలో చైతన్యం కలిగించడానికి ప్రయత్నించింది.

ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడదలుచుకుంటే మన భూమి, మన జలాలు, మన వనర్లు, మన చదువులు, మన కొలువులు మనకు దక్కాలని పోరాడమని 'వరంగల్ డిక్లరేషన్' చాలా వివరంగా బోధపరిచింది. 2009 నవంబర్ 29న కెసిఆర్ నిరాహార దీక్ష -అరెస్టుల దగ్గర్నించీ ఒక ఉజ్వల పోరాటం ఎట్లా ప్రారంభమైందో - ఈ వెలుగు కింద నీడ వలె ఆత్మహత్యలు కూడ అట్లా ప్రారంభమయ్యాయి. నాయకులు పూనకం వచ్చినట్లు ప్రసంగిస్తారు. విద్యార్థి యువతరం ప్రాణాలు తీసుకుంటారు. ప్రతి ఆత్మహత్యా ప్రక్రియకు నాయకులు చేసిన ప్రకటనల ఆధారాలను చాల స్పష్టంగా హేతువులుగా చూపవచ్చును.

కిరోసిన్ పోసుకొని తగులబడిపోతానన్న నాయకునికి అగ్గిపెట్టె దొరకదు కాని శ్రీకాంతాచారి రెండు చేతులకూ కొరోసిన్ డబ్బా, అగ్గిపెట్టె కూడా అందివస్తుంది. ఒక నాయకుడు మెడకోసుకుంటానంటాడు ఒక యువకుడది ఆచరించి చూపుతాడు. ఆశలు, భ్రమలు కల్పించడం నాయకుల వంతు. ఆశ ఎంత ఉవ్వెత్తు ఎగిస్తే నిరాశ అంతలోతుగా విసిరికొడుతుంది. పోనీ వీళ్లేమయినా యుద్ధరంగంలో తాము కూడా కత్తులూ, కటార్లూ తీసుకొని దిగిన నాయకులూ-సైన్యాధ్యక్షులా? అంటే కాదు. వీళ్లకున్న ఒకే ఒక్క యుద్ధరంగం ఎన్నికలు. వీళ్లు చేయగలిగినవి (అవయినా చేయగలిగితేనే) రాజీనామాలు-మళ్లీ చేయగలం యుద్ధం ఎన్నికలు.

అందాకా ఏమీచేయరని కాదు. కాని మనసులో ఎన్నికల మీద దృష్టి పెట్టుకొని, ముఖ్యంగా 2014 ఎన్నికల మీద దృష్టి పెట్టుకొని ఏ పిలుపు ఇచ్చినా అందులో చిత్తశుద్ధి, తెగింపు లేవనేది స్పష్టమే. 'తెలంగాణ రాకపోతే విషం తాగిచచ్చుడే' అంటే మనం ఏ పోరాట మార్గం చూపుతున్నట్లు? సకల జనుల సమ్మె పిలుపు ఇచ్చి ప్రభుత్వాలను స్తంభింప చేయవలసిన, చేయగలిగిన మనకు మన బతుకు ఆగమయిపోతుంది అని భయ సందేహాలు ఎందుకు కలుగుతున్నాయి? అయితే మరి భ్రమలు కల్పించడమెందుకు? ఆశలు, భమ్రలు కల్పించి రెచ్చగొట్టడం నాయకుల వంతవుతున్నది. వచ్చెవచ్చె -రెండు వారాలే- ఇంక ఇదే ఆఖరు సభ. ఆఖరి పండుగ, ఆఖరి ఆత్మహత్య - ప్రతి మొదలూ ఒక ఆఖరు, ప్రతి ఆఖరూ ఒక మొదలు.

పార్లమెంటు దగ్గర ఆత్మహత్య చేసుకుంటే చైతన్య పూర్వకంగా పార్లమెంటులో బాంబు వేసి ఉరికంబమెక్కిన భగత్ సింగ్‌తో పోలిక. దయచేసి భగత్ సింగ్, ఆదిరెడ్డిల పోలికలు వద్దు. వాళ్లకు స్పష్టమైన దృక్పథమున్నది. సమమసమాజ లక్ష్యం ఉన్నది. విముక్తిమార్గం ఉన్నది. ఆ పోలికలతో మరింత మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపించకండి. పోరాటం చేయడానికి ఆ పోలికలు చెప్పండి. ఆత్మహత్యలను అర్థం చేసుకుందాం. ఆవేదన చెందుదాం. కాని గ్లోరిఫై చేయవద్దు.

- వరవరరావు

No comments:

Post a Comment