Wednesday, September 7, 2011

మట్టి మనుషుల మనీషి - డాక్టర్ యం.ఎఫ్.గోపీనాథ్ Andhra Jyothi 17/10/2010


మట్టి మనుషుల మనీషి

- డాక్టర్ యం.ఎఫ్.గోపీనాథ్

పదిహేనేళ్ళ క్రితం నాటి మాట. మిత్రులు రమణారెడ్డి, క్రిష్ణయ్య హైదరాబాద్‌లోని ఇండియన్ ఎయిర్‌లైన్స్ కాలనీలో మేమున్న యింటికి వచ్చి తలుపు కొట్టారు. నేను యింకో గంట గడిస్తే కరీంనగర్ వెళ్ళేవాణ్ణి. కంగారుపడుతూ వచ్చిన యిద్దరూ 'శంకరన్ గారికి బాగాలేదు. ఆస్పత్రికి రమ్మంటే రావటం లేదు. తెల్లవారిన తరువాత వెళ్తానంటున్నారు. మీరు చెప్పితే వింటారు. మీరు వచ్చి చూచి నిర్ణయించి, ఏమైనా చేయాలి' అన్నారు.

వెంటనే బయలుదేరి శంకరన్‌గారు ఉండే అపార్ట్‌మెంట్‌కి వెళ్ళాము. బెడ్ మీద సైలెంట్‌గా నిద్ర పోకుండానే పడుకొని ఉన్నారు శంకరన్ గారు. చేయి పట్టుకొని నాడి చూస్తే గుండె క్రమం తప్పి కొట్టుకుంటుంది. నాడి బలహీనంగా వుంది. ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పారు. 'మారుమాట్లాడకుండా బయలుదేరండి హాస్పిటల్‌కి వెళ్దాము' అన్నాను. శంకరన్ ఏమీ మాట్లాడకుండా బట్టలు మార్చుకుని వెంట వచ్చారు.

మెడిసిటి హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి ఇసిజి తీసి చూస్తే యాక్యూట్ యాంటీరియర్ వాల్ మయోకార్డియల్ ఇన్ఫార్‌క్షన్ అంటే హార్ట్ ఎటాక్; సాధారణ హార్ట్ ఎటాక్ కాదు; కాంప్లికేటెడ్ హార్ట్ ఎటాక్. అంటే హార్ట్ ఎటాక్‌తో పాటు గుండె కొట్టుకోటంలో క్రమం తప్పింది. దీన్నే వైద్య పరిభాషలో ఎరిథ్మియా అంటారు. ఐసి సియులో అడ్మిట్ చేసి వైద్యం మొదలుపెట్టాను. అర్థ గంటలో బిపి పడిపోవటం, వెంట్రిక్యూలార్ ట్యాకికార్డియా, ఆ వెంటనే వెంట్రిక్యులార్ ఫిబ్రిలేషన్ రావటం, డి.సి. షాక్ యివ్వటం చేశాను.

హార్ట్ ఎటాక్స్‌తో చనిపోయే వారి సంఖ్య 100 అనుకొంటే ఈ వందలో 60 శాతం మొదటి గంటలో ఈ వెంట్రిక్యులార్ ఫిబ్రిల్లేషన్ వల్లనే చనిపోతారు. టైంకి పేషెంట్ హాస్పిటల్‌లో ఉంటే డాక్టర్ గాని, సిస్టర్ గాని గుర్తిస్తే అర నిమిషం లోపల డి.సి.షాక్ యివ్వగలిగితే అప్పుడు మ్రాతమే ఇలాంటి పేషెంట్స్ బ్రతుకుతారు. లేకుంటే చనిపోతారు. ఇవ్వన్ని కూడా క్షణాల్లో జరిగే సంఘటనలు.

ఈ వార్త తెలిసిన వెంటనే రాష్ట్రంలోని టాప్ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు, రిటైర్ అయిన అధికారులు వచ్చారు. శంకరన్ గారి పరిస్థితి చూచి ఒక స్టేజిలో 'డిక్లేర్ చేయవలసి వస్తుందా? లేక ఇంక ఏమైనా ఆశ ఉందా' అని అడిగారు. ఇంకొక అర్థగంట సమయమివ్వండి అన్నాను. క్రమంగా గుండె స్పందనలు, నియమ బద్ధంగా కొట్టుకోవటం మొదలయి బిపి నిలకడ గావడం మొదలయింది. నమ్మకం దొరికింది. ఫరవాలేదు,

90 శాతం సేఫ్ అని బాధ్యులైన ఆఫీసర్స్‌కి చెప్పాను. ఆ రెండు రోజులు రాత్రి, పగలు నేను మెడిసిటీ హాస్పిటల్ లోనే డ్యూటీ చేశాను. వాస్తవంగా నేను అప్పుడు మెడిసిటీలో పనిచేయటం లేదు. కాని నేనక్కడే ఉండాలనుకున్నాను. అప్పుడు నన్నొక డాక్టర్ అడిగాడు: 'మీది పీపుల్స్ వార్ పార్టీ కదా, ఈ ఐఎఎస్ ఆఫీసర్ కూడానా?' అని. కాదు, ఆయన 'మనిషి' అన్నాను.

'అయితే మిగతా వాళ్ళో?' అన్నాడా డాక్టర్. ఆయన 'పరిపూర్ణ మానవుడు' అన్నాను. రెండు రోజుల తరువాత శంరన్‌గారికి కరొనరి యాంజియోగ్రఫీ చేశాను. ఒక ముఖ్యమైన రక్తనాళం మూసికొని పోయింది. ఆ రక్తనాళం సప్లై చేసే భాగం (గుండె కండరం) పనిచేయదు. డాక్టర్ సోమరాజు గారితో సహా అందరం కల్సి శంకరన్ గారికి బైపాస్ సర్జరీ గానీ, యాంజియో ప్లాస్టీ గాని అవసరం లేదని, మందులతోనే వైద్యం చేయాలని నిర్ణయించాము.

తరువాత ఆయన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఉన్న ప్రొఫెసర్ కె యస్ రెడ్డి దగ్గరకు వెళ్ళి చూపించుకుని వచ్చి నాకు రిపోర్టు చూపించారు. వారు కూడా మెడిసిన్స్ వాడితే సరిపోతుంది అన్నారు. వారి 'ఆహారపు అలవాట్లు, మందుల క్రమం తప్పకుండా వాడటం వలన ఈ పదిహేను సంవత్సరాలు వారి నిస్వార్థ సేవలు సామాన్య ప్రజల కందాయి.

ఒక అరుదైన వ్యక్తిత్వం గల ఆఫీసర్ శంకరన్. 1978లో ఒక రోజు డాక్టర్ మల్లు రవి ఉస్మానియా మెడికల్ కాలేజీకి వచ్చి నన్ను కలసి శంకరన్ విషయంలో మాధవరావు (ఐఎఎస్ అధికారి) నీతో మాట్లాడాలన్నారని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు గొడవ చేస్తున్నారని, ఆ విషయమై మాట్లాడాలన్నారని రవి వివరించారు. నేనప్పుడు ఉస్మానియా మెడికల్ కాలేజి స్టూడెంట్ యూనియన్‌కి జనరల్ సెక్రటరీని.

లెఫ్ట్ వింగ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్‌తో సంబంధాలున్న వాణ్ణి. శంకరన్‌కు వ్యతిరేకంగా ఈ వామపక్ష విద్యార్థి సంఘాలే గొడవ చేస్తున్నాయి. కారణం క్రితం రోజు సెక్రటేరియట్‌కి యూనివర్శిటీ విద్యార్థులు ఉపకార వేతనాల విషయమై శంకరన్ (సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి)తో మాట్లాడడానికి వెళ్ళారు. అప్పుడు అక్కడ ఏదో గొడవ జరిగి స్టూడెంట్స్ మీద లాఠీ చార్జి జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల అసోసియేషన్స్ అభియోగం ఏమంటే శంకరన్ వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయించారని. వాస్తవంగా ఆ లాఠీచార్జ్‌కి శంకరన్ గారికి సంబంధం లేదు.

ఆ గొడవ వామపక్ష విద్యార్థి సంఘాల వారు చేసింది, అదీ శంకరన్ గారిని టార్గెట్ చేస్తూ! అప్పుడు సెల్ ఫోన్లు లేవు కాబట్టి నేను డాక్టర్ మల్లు రవి కోఠీలోని టెలీఫోన్ ఆఫీస్ కెళ్ళాము. నేను మాధవరావు గారికి ఫోన్ చేసి వెంటనే ఆయన తన సహజ తీవ్ర స్వరంతో 'ఏమయ్యా, మీ స్టూడెంట్స్‌కి బుద్ధుందా ?

శంకరన్ గారి లాంటి వ్యక్తి మీదేనా మీ ఊరేగింపులు, ఉద్యమాలు? మీరొక్కరేనా ఈ దేశాన్ని బాగు చేసే వాళ్ళు? -చివాట్లు పెట్టడం మొదలు పెట్టారు. నేనన్నాను 'సార్, నాకింత వరకు తెలియదు. ఇప్పుడే రవి చెప్తుంటే విన్నాను. నాకు 48 గంటల టైం ఇవ్వండి' అన్నాను. 'నీవేమి చేస్తావో నాకు తెలియదు' అన్నారు మాధవరావుగారు. అప్పటివరకు శంకరన్ గారిని నేను కలవ లేదు. కానీ డాక్టర్ రవికి, మాధవరావు గారికి మాటిచ్చాను.

రెండు రోజుల తర్వాత నేను మాధవరావుగారికి ఫోన్ చేసి మీరంతగా చెప్పిన శంకరన్ గారిని కలవాలనుకుంటున్నానని అన్నాను. రమ్మన్నారు. సెక్రటేరియట్‌లో మాధవరావుగారి ఆఫీీస్‌కి వెళ్తే వారే శంకరన్ గారికి ఫోన్ చేసి మీ స్టూడెంట్ లీడరొచ్చాడు, మిమ్ముల్ని కలుస్తాడంట, పంపమంటారా? అన్నారు. నన్ను శంకరన్ గారి ఆఫీసుకి వెళ్లమన్నారు మాధవరావుగారు.

శంకరన్ గారి ఆఫీస్‌కి వెళ్ళి తలుపులు తీసివుంటే (వారి తలుపులు ఎప్పుడూ, ఎవరికైనా తెరిచే ఉంటాయనుకుంటా!) లోపలికి వెళ్ళాను. కుర్చీలో ఎవ్వరు లేరు. మరుక్షణంలో హవాయి స్లిప్పర్స్ వేసుకొని, సగం చేతుల తెల్ల చొక్కా, తెల్ల ప్యాంట్ వేసుకున్న ఓ ఐదడుగుల ఎత్తున్న వ్యక్తి యాంటి రూమ్ నుంచి బయటకు వస్తున్నాడు. ఆ మనిషిలో పూర్తిగా ఒక బంట్రోతు కుండే లక్షణాలు గాని, ఒక ఐఎఎస్ ఆఫీసర్‌కు ఉండే దర్పంగాని లేవు.

నేను మాత్రం శంకరన్ అనే వ్యక్తి ఈయన కాదనే నిర్ధారణకు వచ్చి 'నేను శంకరన్ గారిని కలవాలి' అన్నాను. ఆ వ్యక్తి కనీసం కుర్చీలో కూర్చున్నా నా సందిగ్ధం, సమస్య తీరిపోయేది. కాని ఆ మట్టి మనుష్యుల పక్షపాతి టేబుల్ ప్రక్కనే నిలబడి 'నేనే శంకరన్, కూర్చోండి' అన్నారు. ఆ సమయంలో నాలో కలిగిన భావాలు అప్పుడే కాదు, ఇప్పుడు కూడా వివరించలేను. ఎందుకంటే చెప్పేందుకు మాటలు, రాయటానికి పదాలు దొరుకుతే కదా!

ఈ నెల 7వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు నా మిత్రుడు ఒకరు ఫోన్ చేసి 'మీరు చెప్తుండే యస్.ఆర్.శంకరన్ చనిపోయారని టీవీలో స్క్రోలింగ్ వస్తుంది, చూడండి' అన్నాడు. ఒక్కసారి కూలిపోయినట్టనిపించింది. కాళ్ళ క్రింద భూమి కదలిపోయినట్లనిపించింది. విషయం తెలుసుకొంటే 1995లో లాగే ఉదయం ఆయనను పరీక్షించిన డాక్టర్ కూడా గుండె కొట్టుకోవడంలో తేడా ఉంది. హాస్పిటల్‌కి వెళ్ళాలని చెప్పారని, కానీ వారు వెళ్ళలేదని రెండు గంటల తరువాత చూస్తే వారు చనిపోయి ఉన్నారని తెలిసింది.

అప్పుడు అనిపించింది- నేనెందుకు ఖమ్మంలో ఉన్నాను, హైదరాబాద్‌లో ఉన్నట్లయితే శంకరన్ గారిని కాపాడుకోగలిగే వాళ్లం కదా అని. ఎందుకంటే హైదరాబాద్‌లో శంకరన్ గారిని పరీక్షిస్తున్న ప్రతిసారి డాక్టర్ సోమరాజు గారిని అడిగేవాడిని - 'శంకరన్ గుండె పనితనం ఎలా ఉంది' అని? వారి గుండె పనితనం రక్తాన్ని పంపుచేసే గుండె సామర్థ్యం (లెఫ్ట్ వెంట్రిక్యూలార్ ఎజెక్షన్ ఫ్రాక్షన్) బాగానే ఉందని చెప్పి ఎంతో కాలం కాలేదు.

1995లో గుండె లయ తప్పినప్పుడు కరెంట్ షాక్ ఇచ్చి రక్షించుకున్నాను కదా! ఆ అవకాశం ఇప్పుడు చేజార్చుకున్నాం. ఆయన బ్రతికే ఉన్నట్లయితే ఆపరేషన్ గ్రీన్ హంట్ కు కనీసం విరామం దొరికేదని, కొన్ని (ఉద్యమకారుల) ప్రాణాలకు, మరికొన్ని అమాయక (గిరిజన) ప్రాణాలకు భరోసా పడేవారనే ఆశ నిరాశ అయిపోయింది.

నువ్వు మార్క్సిస్ట్‌వి కాదు
అయినా ఈ దేశం గర్వించదగ్గ మానవతా వాదివి
నువ్వు ఉద్యమకారుడివి అంతకన్నా కాదు
అందుకే ఏ నినాదమివ్వకుండా వెళ్ళావు
కనీసం నీవిచ్చిన నినాదమిచ్చి నిద్రపోదామంటే
నీవు పచ్చి ఆచరణ వాదివి, అందుకే నీవంటే భయం
నీవు ఒఠ్ఠి మట్టి మనిషివి అందుకే మట్టి డప్పులే మోగాయి
మంత్రోచ్ఛరణలకు బదులు!
ఆచరణవాదీ! ఈ భూమ్మీదకు మళ్ళెపుడొస్తావు?
ఆ, ఏం లేదు, కాస్త మీనుండి నేర్చుకుందామనే.....
-శంకరన్ గారి జీవితచరిత్ర విద్యార్థులకు పాఠ్యాంశం కావాలనే ఆశతో-
- డాక్టర్ యం.ఎఫ్.గోపీనాథ్

No comments:

Post a Comment