Sunday, October 2, 2011

దళితుల దరి చేరని బతుకమ్మ By Bumpally Kammari Renuka Surya News Paper 02/10/2011


దళితుల దరి చేరని బతుకమ్మ
hari
బతుకమ్మ పండుగను గత సంవత్సరం కోటి బతుకమ్మల జాతర పేరిట తెలంగాణ ఉద్యమంలో భాగం చేశారు. ఈ పండుగ తెలంగాణ ప్రజల సంస్కృతికి ప్రతీకగా ఉన్నదనీ, గత కొద్ది సంవత్సరాలుగా తొక్కి పెట్టడం వల్ల తమ రాకతోనే ఈ సంస్కృతి బయటకు వచ్చినట్టు టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌ రావు కుటుంబ సభ్యులు, అనుచరులు ప్రజల్ని భ్రమల్లో పడేశారు. నిజానికి ఈ మలి దశ తెలంగాణ ఉద్యమం 1969 కంటె భిన్నంగా మెజారిటీ దళి త, బహుజన, ఆదివాసీ గిరిజన, మత మైనారిటీలు, పేద వర్గాలకు జనాభా దామాషా ప్రకా రం స్ర్తీ పురుషులకు అన్ని రంగాల్లో వాటా ప్రాతినిధ్యాన్ని సమానంగా పంపిణీ జరగాలనే డిమాండ్‌- అమరుడు మరోజు వీరన్న సారథ్యంతో తెలంగాణ మహాసభ ద్వారా మొదలైంది.


ఆనాడే బతుకమ్మ పండుగనే కాదు, సమస్త దళిత, బహుజన పీడిత కులాల, తెగల సంస్కృతులను వెలికి తీసి ఒక ప్రజా ప్రవాహంగా తెలంగాణ అంత టా వర్ధిల్లింపచేసింది. నాటి నుంచి నేటి వరకూ అనేకమంది అనుకరిస్తున్నారనేది కాదనలేనిది. ఎప్పుడైతే ప్రజా ఉద్యమ శక్తులను క్రమ క్రమం గా అగ్రకులాల దళారీ పాలకులు చుట్టివేసి, అణచివేయడం జరిగిందో ఆనాటినుంచి అగ్రకుల వర్గాల చేతుల్లోకి తెలంగాణ ఉద్యమాన్ని భౌగోళికం పేరుతో తీసుకోగలిగారు. తదనంతరం పరిణామాలు రోజుకో విధంగా నిత్యం బయటపడుతున్న విషయం విదితమే. టీఆర్‌ఎస్‌ పార్టీ అగ్రకుల ఉన్నత వర్గాల పార్టీ. ఈ ఉద్యమాన్ని తను, తన కుటుంబమే నిర్మిస్తున్నదన్నట్టు నేడు ప్రజలందరికీ నమ్మబలక చూస్తున్నారు. ప్రజా ఉద్యమకారులను తెరమీదకు రానివ్వక పోవడమే ఇందుకు నిదర్శనం.

కోటి బతుకమ్మల జాతర, లేదా ఊరూరా బతుకమ్మ పేరిట గత సంవత్సరం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్విహంచారు. కేవలం ఒక బతుకమ్మ సంబరాలతోనే తెలంగాణ సంస్కృతిని రక్షించగలరా అనే ది ప్రశ్న. తెలంగాణలో ఈ బతుకమ్మ పండుగతో బాటు జాంబవంతుడి (మాదిగ) సంస్కృతి, ఎరుకల, యానాది, కమ్మర, కుమ్మర, గౌడ, కురుమ, గొల్ల, చాకలి, మంగలి, ముస్లిం మతస్థుల ఆచారాలను, దళిత బహుజనుల సంస్కృతులను తెలంగాణ జాగృతిలో చేర్చవలసిన అవసరం లేదా? బతుకమ్మ పండుగలో ఉన్నత వర్గాల మహిళలు దళితులను దగ్గరకు రానివ్వని పరిస్థితి తెలంగాణ అంతటా ఉన్నది.

బతుకమ్మను కేవలం ఉన్నత (అగ్ర) వర్గాలు, బహుజనులైన బీసీ లు మాత్రమే జరుపుకుంటారు. ఒక వేళ జరుపుకున్నా, అగ్రకులాలతో సమానంగా ఆడకూడదని సంప్రదాయం ముసుగులో దళితులను వెలివేసిన పరిస్థితి గ్రామాలలో ఉన్నది. నిజాని కి గుమ్మడి ఆకు, తంగేడు పూలు, గునక పూలు తెచ్చి, గ్రామ చావిడి వద్దకు బతుకమ్మను మోయడం, తదుపరి చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేసేవరకూ బడుగు వర్గాల పురుషు లు మాత్రమే ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అగ్రకుల మహిళలు మాత్రం ఆడి, పాడి ఆనందం పొందడం ఎంతవరకూ న్యాయం? కేవలం సంపన్న అగ్రకులాలు, బీసీ మహిళలు జరుపుకు నే ఈ పండుగను తెలంగాణ సంస్కృతిగా దేశ విదేశాలకు పరిచయం చేయడం దురదృష్టకరం.

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడినంత మాత్రాన దళితులకు సమాన హోదా రాదన్నది జగమెరిగిన సత్యం. ఈ పండుగను తెలంగాణ ప్రాంతం లో దళితులు జరుపుకోరన్న విషయాన్ని మరుగున పడవేసి విదేశాలలోని తెలంగాణ వాదులైన అగ్రకులాల వారిని బతుకమ్మ పండుగ జరుపుకోవాలని పిలుపు ఇవ్వడం కుల తత్త్వమే తప్ప తెలంగాణ వాదం కాదు. ఆశ్వయుజ మాసం లో దసరా, బతుకమ్మ పండుగలను అగ్రవర్ణ కులాలతో బాటు అభివృద్ధి చెందిన బీసీ కులాలవారు జరుపుకుంటున్నారు. ఆర్యేతర శూద్ర వర్ణ, జాతి తెగల్ని ఆర్యజాతికి చెందిన వారే నిర్మూలించి బ్రాహ్మణీయ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను సృష్టించారు. కింది కులాల ప్రజలను తమ బానిసలుగా మార్చుకున్నారు. కనుకనే వారు మాత్రమే దసరా పం డుగ సందర్భంగా బతుకమ్మ పండుగను విజయోత్సవాలుగా జరుపుకుంటున్నారు. దళిత మై నారిటీ మతస్థులను పక్కన పెట్టి అగ్రకుల ఉన్నత వర్గాల మహిళలతో జతకట్టి బతుకమ్మను ఆడుతున్నారని అర్ధం చేసుకోవాలి.

kammarirenuka
వేల సంవత్సరాలుగా ఈ దేశ గ్రామీణ సమాజం అంటరానితనానికి గురవుతున్నది. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థగా ఏర్పడింది. ఊరు- వాడలుగా చీలి వివిధ రకాల వివక్షలకు, హత్యా కాండలకు, దోపిడీ అసమానతలకు గురవుతున్న దళితులను కూడా బతుకమ్మ పండుగ జరుపుకోవాలని తెలంగాణ వాదులు పిలుపునివ్వడం లేదు? ఇందులో అగ్రకుల కోణం లేదా? యావత్‌ తెలంగాణలోను బడుగు వర్గాల మహిళలు బతుకమ్మ పండుగ జరుపుకున్నప్పుడే, కులాల అంతరాలు తొలగి మహిళలందరూ కలసి బతుకమ్మ ఆడినప్పుడే ఈ పండుగను తెలంగాణ ప్రజల పండుగగా అభివర్ణించుకోవచ్చు. నేడు తెలంగాణను భౌగోళికం గా ప్రకటించాలని దళిత మహిళలు పోరాడుతున్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కుల జనాభా దామాషా ప్రకారం స్ర్తీ పురుషులకు అన్ని రంగాలలో వాటా, ప్రాతినిధ్యం కావాలని పోరాడుతున్నారు. అప్పుడే దళితులు, బీసీలు, ముస్లిం మైనారిటీలు, గిరిజనులు బతుకమ్మ, ఇతర తెలంగాణ సంస్కృతులకు దరి చేరే అవకాశం ఉంటుంది.

No comments:

Post a Comment