Thursday, January 26, 2012

ప్రపంచ మేధావికి అవమానం - దుడ్డు ప్రభాకర్



తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత అరాచక గుంపు నాలుగు అంబేద్కర్ విగ్రహాలను ఒక పథకం ప్రకారం ధ్వంసం చేసింది. సాటి మనిషిని మనిషిగా గుర్తించి గౌరవించే సమాజం కోసం, మానవీయ విలువల కోసం జీవితాంతం కృషి చేసిన 'భారతరత్న'కు అవమానం జరిగింది. 

దేశ ప్రజలంతా ఉమ్మడిగా ఖండించాల్సిన ఈ దుశ్చర్యకు నిరసనగా కేవలం దళిత సమాజం మాత్రం స్పందించింది. రాష్ట్ర వ్యాపితంగా ర్యాలీలు, రాస్తారోకోలు నిరసన కార్యక్రమాలు జరిపారు, జరుపుతున్నారు. పలువురు మంత్రులు, పిసిసి చీఫ్, చిరంజీవి పలు రాజకీయ నాయకులు విగ్రహాల విధ్వంసాన్ని ఖండించారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేసి విగ్రహాలు ధ్వంసమైన చోట ప్రభుత్వ ఖర్చుతో కొత్త విగ్రహాలు ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. 

ఈ సందర్భంగా 'కొందరు స్వార్థరాజకీయ ప్రయోజనం కోసం ఈ దుశ్చర్యకు పాల్పడ్డార'ని అన్ని రాజకీయ పక్షాలు ప్రకటించాయి. ఆది నుండి అంబేద్కర్ బొమ్మను తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్న అగ్రకుల నాయకులే ఇలాంటి ప్రకటనలు చేయడం 'దొంగే దొంగ దొంగ' అని అరిచినట్లుంది. 48 గంటల్లో నిందితులను అరెస్టు చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. గతంలో అనేకసార్లు తూర్పుగోదావరి జిల్లాలోనే అంబేద్కర్ విగ్రహాలకు చెప్పుల దండలు వేసిన సంఘటనలు, ధ్వంసం చేసిన సందర్భాలు జరిగాయి. ఇంతవరకూ ఎవ్వరినీ అరెస్టు చేసిన దాఖలాలు కనిపించలేదు. ఇపుడు కూడా అందుకు భిన్నంగా జరుగుతుందని ఊహించలేం. 

గత నెల లండన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ సర్వేలో ప్రపంచ వ్యాపితంగా టాప్ 100 మేధావుల్లో డా. బి.ఆర్. అంబేద్కర్‌కు మొట్టమొదటి స్థానం దక్కింది. అది విదేశీ పత్రికల్లో బ్యానర్ వార్తగా ప్రచురితమయింది. ఇండియాకే గర్వకారణమైన ఈ వార్తను మనదేశ మీడియా గాని, పాలకులు గాని పట్టించుకోలేదు. ప్రపంచ మేధావుల్లో అగ్రగణ్యుడిగా గుర్తింపు పొందిన అంబేద్కర్‌కు ఈ మాతృభూమిలో అవమానాల పరంపర కొనసాగుతూనే వుంది. ప్రపంచ దేశాలలో కీర్తించబడుతున్న ఈ విశ్వమానవుడు నవభారత రాజ్యాంగ నిర్మాత కూడా. 

అలాంటి అంబేద్కర్‌ను ఈ దేశం జాతీయ నాయకుడిగా గుర్తించకపోవడానికి నేటికీ నిరాటంకంగా కొనసాగుతున్న అమానుషమైన నిచ్చెనమెట్ల కులవ్యవస్థే కారణం. ప్రపంచ మేధావిని కేవలం ఒక కులానికి చెందిన వ్యక్తిగా చిత్రీకరించడంలో ఈ దేశ అగ్రకుల బ్రాహ్మణీయ మనువాదుల కుట్ర వుంది. పాలకుల కుటిల కౌటిల్య నీతి దాగి వుంది. ఒక్క అంబేద్కరే కాదు, లోకాయతులు మొదలుకొని కులవ్యవస్థను సవాల్‌చేసిన ప్రతి ఉద్యమకారుడ్ని, మేధావిని, కవిని, కళాకారుడ్ని సాధ్యమైతే అంతం చేయడం, కాకుంటే ఆయాకులాల పరిధిలోకి కుదింపుచేసే కుట్రలు ఈ దేశ చరిత్ర నిండా మనకు కనిపిస్తూనే వున్నాయి. 

అంబేద్కర్‌ను దళితులకే పరిమితం చేయడం వెనుక ఆయన్ని తక్కువ చేయడంతో పాటు ఈ దేశ పాలకులకు మరికొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అంబేద్కర్ విగ్రహాల చాటున దళితుల ఓట్లను కొల్లగొట్టడం, దళితుల్ని మభ్యపెట్టి దోపిడీని సజావుగా కొనసాగించడం లాంటివి ఉదాహరణంగా చెప్పుకోవచ్చు. అనివార్య పరిస్థితుల్లోనే ఈ దేశ పాలకులు అంబేద్కర్‌ను ఆ మాత్రమైనా తెరమీదకు తెచ్చారు. దళితుల్లో రాజకీయ చైతన్యం పెరుగుతున్న దశలో, దేశవ్యాపితంగా దళిత ప్రతిఘటనా పోరాటాలు ముందుకొస్తున్న సందర్భంలో అంబేద్కర్‌కు భారతరత్న ప్రకటించారు. అంబేద్కర్ రచనల్ని వెలుగులోకి తేవడం, అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంటులో పెట్టడం అందులో భాగమే. 

నూతన ఆర్థిక విధానాలు అమలులో భాగంగా దళితుల బతుకులు ఛిద్రమౌతుంటే దళితుల్ని మభ్యపెట్టడానికి, వారి దృష్టి మళ్ళించడానికి పాలకులే పనిగట్టుకొని దళితవాడల్లో అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు దళితుల్ని ప్రోత్సహించారు. నేటికీ అంబేద్కర్ వర్ధంతులు, జయంతుల తంతుతోనే కాలం గడుపుతూ అంబేద్కర్ ఆశయాలను, ఆకాంక్షలను తుంగలో తొక్కుతున్నారు. 

దళితులపై, పీడిత కులాలపై ఈ దేశ పాలకుల, సామ్రాజ్యవాదుల దోపిడీ తీవ్రతరమౌతున్న కొద్దీ పీడకుల వ్యూహాలు మారుతున్నాయి. అంబేద్కర్‌ను కేవలం మాలల నాయకుడిగా చూపడం కోసం మాదిగల ప్రతినిధిగా జగ్జీవన్‌రామ్‌ను తెరమీదకు తెచ్చారు. గత రెండు సంవత్సరాల నుంచి బిసిల ప్రతినిధిగా మహాత్మా జ్యోతిరావుఫూలేను ముందుకు తెచ్చి బిసి నాయకులతో పూలే జయంతి ఉత్సవ కమిటీలను వేస్తున్నారు. 

పాలకుల కుట్రల ఫలితంగా అంబేద్కర్ యావత్భారతదేశ ప్రజల ప్రతినిధి కాలేకపోయినా దళితులకు మరింత దగ్గరయ్యాడు. దళిత ఆత్మగౌరవ పోరాట ప్రతీకగా దళితుల గుండెల్లో నిలిచిపోయాడు. అందువల్లనే దళితుల ఆత్మగౌరవ ప్రతిఘటనా పోరాటాలు ఉధృతంగా నడుస్తున్న రోజుల్లో అంబేద్కర్‌ను పాలకులు కీర్తించారు. ఆ పోరాటాలు బలహీనపడుతున్న క్రమంలో అంబేద్కర్ విగ్రహాలు అవమానించబడుతున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారుతున్న దశలో అట్టడుగుస్థాయి నిరుపేద దళితులు దిక్కులేని వారవుతున్నారు. 

అలాంటి దళితులు ఆత్మగౌరవ చైతన్యాన్ని ప్రదర్శిస్తున్న సందర్భాలలో సహించలేని పెత్తందారీ శక్తులు దళితులపై దాడులతో తృప్తిచెందడం లేదు. దళిత చైతన్యస్ఫూర్తి ప్రధాత అయిన అంబేద్కర్ విగ్రహాలపై దాడులకు తెగబడుతున్నారు. అంబేద్కర్‌ని కుల నాయకుడిగా కుదించడం వల్లనే ఇలాంటి విధ్వంసాలు దేశవ్యాపితంగా నిర్భయంగా, నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అందుకు ఈ దేశ పాలకులను ప్రథమ ముద్దాయిలుగా చేర్చాలి. వారి కుట్రలకు పావులుగా ఉపయోగపడుతున్న దళిత రాజకీయ నాయకులతో సహా అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ సభ్యులు కూడా ఈ నేరంలో భాగస్వాములే. 

అంబేద్కర్ తన జీవితాంతం తను ఎంచుకున్న పద్ధతిలో కులనిర్మూలన కోసం నిజాయితీగా పోరాడారు. కుల పునాదులపై నిర్మితమై బలోపేతమౌతున్న హిందూమత వ్యవస్థపై రాజీలేని పోరాటం చేశారు. అంటరానితనం లేని సమాజం కోసం కలలుగన్నారు. కనుకనే ప్రపంచంలో అత్యధిక విగ్రహాలున్న రెండవ వ్యక్తిగా ప్రజల ఆరాధ్యులుగా నిలిచారు. 

ప్రజా ధనాన్ని దోపిడీ చేసిన అవినీతిపరులు, వేటగాళ్ళ విగ్రహాలు వీధివీధినా వెలుస్తుంటే సామాజిక న్యాయస్ఫూర్తి ప్రధాత, రాజ్యాంగ రూపకర్త అయిన అంబేద్కర్ విగ్రహాలు కూల్చబడుతున్నాయి. దళిత ఆత్మగౌరవ ప్రతిఘటనా పోరాట చైతన్యం పెరిగినపుడు మాత్రమే దళిత ఆత్మగౌరవ ప్రతీక అయిన అంబేద్కర్ విగ్రహాలపై దాడులు ఆగుతాయి. అంబేద్కర్ ప్రతిమలను కాపాడుకోవలసిన బాధ్యత దళితులది మాత్రమే కాదు. ఈ దేశ ప్రజాస్వామిక వాదులందరి కర్తవ్యంగా వుండాలి. 

- దుడ్డు ప్రభాకర్
కులనిర్మూలనా పోరాట సమితి, రాష్ట్ర అధ్యక్షులు
Andhra Jyothi News Paper Dated 27/1/2012

No comments:

Post a Comment