Friday, February 17, 2012

ఎస్సీ, ఎస్టీ, నిధుల మళ్లింపు 2జి కన్నా పెద్ద కుంభకోణం--జాన్‌ వెస్లీ




1952-53 నుండి కేంద్రంతోపాటు అన్ని రాష్ట్రాల బడ్జెట్లలో ఎస్సీ,ఎస్టీలకు ఖర్చు చేయాల్సిన నిధుల్లో లక్షల కోట్లు ఒక పథకం ప్రకారం దారి మళ్లించాయి.. ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని చెప్పవచ్చు. ఇప్పటివరకు లక్షా 76వేల కోట్ల 2జి స్పెక్ట్రమ్‌ కుంభ కుంభకోణమే అతి పెద్దదనుకుంటున్నాము. కానీ, 2జి కన్నా ఇది రెండున్నర రెట్లు పెద్దది. దేశ జనాభాలో 16 శాతం ఉన్న దళితులకు కేంద్ర ప్రణాళిక బడ్జెట్‌లో ఈ సంవత్సరం 50వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా 30 వేల 500 కోట్లు ప్రతిపాదించింది. అందులో ఇప్పటివరకు 10 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. గత దశాబ్ధం లెక్కలు చూస్తే ఎస్సీలకు ఖర్చు చేయాల్సిన నిధుల్లో 4 లక్షల కోట్లు కోత విధించింది.
కేంద్ర, రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్‌లలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుకు, ఎస్సీ, ఎస్టీ నోడల్‌ ఏజెన్సీలకు చట్టబద్ధ్దత కల్పించమంటే బెల్లం కొట్టినరాయిలా గమ్మున ఉన్నది. రాష్ట్రంలో 23 శాతానికిపైగా ఉన్న దళిత, గిరిజనుల సమస్యలపై శాసనసభ, శాసనమండలి రెండు రోజులు ప్రత్యేక చర్చ జరిపి వారి అభివృద్ధికి పూనుకోవాలని, అధికార, ప్రతిపక్ష పార్టీల శాసనసభ్యులను కెబిపిఎస్‌ కోరింది. సబ్‌ప్లాన్‌కై చట్టం సాధించేందుకు అన్ని దళిత, గిరిజన, ప్రజాసంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని, రాజకీయ పార్టీలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ''ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల సాధన ఐక్యకార్యాచరణ కమిటీి'' పిలుపునిచ్చింది. దళిత, గిరిజన వాడల్లో సభలు జరిపి తీర్మానాలు చేసి ముఖ్యమంత్రికి పంపాలని కోరింది. కమిటీ పిలుపు మేరకు ఈనెల 15 నుండి రాష్ట్రవ్యాపితంగా పాదయాత్రలు, సైకిల్‌ యాత్రలు మొదలయ్యాయి. 25వరకు ఇవి కొనసాగుతాయి. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే దళిత, గిరిజనులు, ప్రజాసంఘాలు ''మహాసంగ్రమానికి'' సన్నద్ధ్దమవుతాయి.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ ఆవశ్యకత
దేశ, రాష్ట్ర జనాభాలో దళిత, గిరిజనుల జనాభా శాతానికి ఏమాత్రం తక్కువ కాకుండా అదనంగా కేంద్ర, రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్లలో నిధులు కేటాయించి వారి ప్రయోజనాలకే ఖర్చు చేసేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం 1980లో ఎస్సీలకు స్పెషల్‌ కాంపోనెంట్‌ ప్లాన్‌ (ప్రస్తుతం ఎస్సీ సబ్‌ప్లాన్‌గా మార్చారు), గిరిజనులకు ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌ను రూపొందించింది. వీటిని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ, జాతీయ ప్రణాళిక సంఘం మెంబర్‌ సెక్రెటరీగా ఉన్న నేటి ప్రధాని మన్మోహాన్‌సింగ్‌లు లేఖలు రాసి 40 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ అవి అమలుకు నోచుకోవడం లేదు. ప్రస్తుతం కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నా, వీటిని అమలు చేయకుండా ప్రభుత్వాలే కులవివక్ష పాటిస్తున్నాయి. దళిత, గిరిజనుల నిధులను దోచి అగ్రకుల ధనికవర్గాల ప్రయోజనాల కోసం వెచ్చిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం వుండడం వల్ల అవి అమలుజరుగుతున్నాయి. సబ్‌ప్లాన్‌ అమలుకు చట్టం లేకపోవడం వల్లే సరిగా అమలుకు నోచుకోవడం లేదు.
రాష్ట్రంలో సబ్‌ప్లాన్‌ అమలౌతుందా?
2011 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో ఎస్సీలు 16.2, ఎస్టీలు 6.6 శాతం ఉన్నారు. రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్‌లో అంతే శాతం నిధులు అన్ని శాఖలు ప్రత్యేకంగా కేటాయించి ఖర్చు చేయాలి. కానీ, ఈ రెండింటికి కలిపి 8 శాతానికి మించి ఖర్చు చేయలేదు. కెవిపిఎస్‌ ఉద్యమం ఫలితంగా 2007 నుండి జనాభా శాతానికి అనుగుణంగా నిధులు కేటాయిస్తున్నా ఖర్చు చేయకుండా కోత, దారి మళ్లింపు కొనసాగుతూనే ఉంది. 2011-12 సంవత్సరంలో రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్‌లో ఎస్సీలకు 7,500 కోట్లు, కేంద్ర ప్రణాళికా బడ్జెట్‌ నుండి మరో 7,500 కోట్లు మొత్తం 15,000 కోట్లు ఈ సంవత్సంర ఖర్చు చేయాల్సిఉండగా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించనే లేదు. రాష్ట్రం 7 వేల కోట్లు కేటాయిస్తామని ప్రతిపాదించి అందులో 3 వేల కోట్లు దళితులకు ప్రయోజనం లేని జలయజ్ఞం, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, మెట్రోరైల్‌ నిర్మాణం, హుస్సేన్‌సాగర్‌ ఆధునీకరణ, పార్కుల అభివృద్ధి, తదితర రంగాలకు దారి మళ్లించింది. గత 19 సంవత్సరాలలో ఎస్సీలకు ఖర్చు చేయాల్సిన రు.25 వేల కోట్లు కోత పెట్టి దారి మళ్లించారు. ఖర్చు చేశామంటున్న నిధుల్లో బినామీ పేర్లతో అవినీతికి పాల్పడ్డారు.
అభివృద్ధిలో కులవివక్ష
బడ్జెట్‌లో వాటా దక్కక దళిత, గిరిజన నివాస ప్రాంతాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. రాష్ట్రంలో కోటి 50 లక్షలకుపైగా ఉన్న దళితులు 70వేల దళితవాడలు, బస్తీల్లో ఉన్నారు. వీటిలో సగం కుటుంబాలకు ఇండ్లస్థలాలు కానీ , ఇండ్లు కానీ లేవు, 65 శాతం వాడల్లో రక్షిత మంచినీటి సౌకర్యం లేదు, 85 శాతం కుటుంబాలకు మురుగుదొడ్లు లేవు, వీధిలైట్లు, రోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్స్‌ తదితర సౌకర్యాలు లేక మురికి వాడలుగా మారాయి. విద్య, వైద్యం, ఉపాధి ఇలా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. అగ్రకులోన్మాదులు దళితులను అంటరానితనం, కులవివక్షకు గురి చేస్తుంటే, ప్రభుత్వాలు అభివృద్ధికి నిధులు కేటాయించకుండా అంతే కులవివక్ష పాటిస్తున్నాయి.
సబ్‌ప్లాన్‌ అమలుకు కెవిపిఎస్‌ ఉద్యమం
కెవిపిఎస్‌ ఆవిర్భవించిన కొద్దికాలం నుండే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు చేయాలని ఆందోళన చేసినా టిడిపి ప్రభుత్వం స్పందించలేదు. 2004 ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీల నాయకులతో సదస్సు నిర్వహిస్తే వైఎస్‌ రాజశేఖరరెడ్డి హాజరై కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక 2007 వరకు ఆ ఊసే ఎత్తలేదు. 2008లో కెవిపిఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షలు బి.వి.రాఘవులుతోపాటు 23 జిల్లాల నుండి 25 మంది నిరవధిక నిరాహార దీక్షలు నిర్వహించడంతో అన్ని దళిత, గిరిజన, ప్రజాసంఘాలు, సంస్థలు మద్దతునిచ్చాయి. అన్ని పార్టీల ఎంఎల్‌ఏలు రెండు రోజులు శాసనసభను స్తంభింపజేేశారు. నిర్బంధాన్ని అధిగమించి వేలాది మంది దళితులు ఛలో అసెంబ్లీకి తరలివస్తే ప్రభుత్వం దిగొచ్చి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుకు ఎస్సీ, ఎస్టీ నోడల్‌ ఏజెన్సీలను, ముఖ్యమంత్రి అధ్యక్షతన అపెక్స్‌బాడీలను ఏర్పాటు చేసింది. నాటి నుండి జనాభా శాతానికి అనుగుణంగా నిధుల కేటాయింపులు జరుపుతున్నా, ఖర్చు చేయడం లేదు. దళిత, గిరిజనులకు ప్రయోజనం లేని రంగాలకు దారి మళ్లిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుకు చట్టం చేయాలని కెవిపిఎస్‌, గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ, అదే సందర్భంలో సిపియం రాష్ట్ర నాయకులు నిరవధిక నిరాహార దీక్షలు నిర్వహించగా మేధావులతో కమిటీి వేస్తామని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌ కుమార్‌ రెడ్డి హామీ ఇచ్చి నేటికీి అమలు చేయడం లేదు.
చట్టంకై ఐక్య ఉద్యమం
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుకు చట్టం చేయాలని కెవిపిఎస్‌తోపాటు రాష్ట్ర స్థాయిలో 100 దళిత, గిరిజన, ప్రజాసంఘాలు, సంస్థలు, మేధావులు, రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఐపిఎస్‌లతో ఐక్యకార్యచరణ కమిటీి ఏర్పడింది, ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధానకార్యదర్శి కాకి మాధవరావు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల సాధనకు ఈ కమిటీ ఆందోళన కొనసాగిస్తున్నది.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుకు సూచనలు
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుకు కేంద్ర ప్రభుత్వం, జాతీయ ప్రణాళికా సంఘం, జాతీయ ఎస్సీ కమీషన్‌, గవర్నర్ల కమిటీలు పలు సూచనలు చేశాయి. 1. కేంద్ర, రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్‌లలో ఎస్సీ, ఎస్టీల జనాభా శాతానికి అదనంగా నిధులు కేటాయించాలి. 2. బడ్జెట్‌లో ప్రత్యేక పద్దు కింద నిధులు కేటాయించాలి. (ఎస్సీ 789, ఎస్టీ 786) 3. సబ్‌ప్లాన్‌ నిధులపై కోత విధించరాదు, వాటిని దారి మళ్లించకూడదు. 4. నిధులు ఖర్చుచేయకుండా మురగబెట్టకూడదు. 5. ఖర్చు చేయని నిధులు వచ్చే సంవత్సరం బడ్జెట్‌లో కలిపి అదనంగా కేటాయించాలి. 6. దళిత, గిరిజనులకు ప్రత్యేక ప్రయోజనం కలిగించే వాటికే ఖర్చు చేయాలి. 7. జనరల్‌ బడ్జెట్‌లో యథాతథంగా అందరితోపాటు ఎస్సీ, ఎస్టీలకు నిధులు ఖర్చు చేయాలి. 8. సబ్‌ప్లాన్‌ అమలు, పర్యవేక్ష్యణకు రాష్ట్ర నోడల్‌ ఏజెన్సీలతోపాటు, జిల్లా, తాలుకా స్థాయిలో మానిటరింగ్‌ కమిటీిలు ఏర్పాటు చేయాలి. 9.వేతనం, ఉపాధి, గ్రామీణ ఉపాధి హామీ పథకాలకు ఖర్చు చేసిన నిధులను సబ్‌ప్లాన్‌ ఖర్చుగా సూచించకూడదు. 10. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుకు చట్టం చేయాలని 12వ పంచవర్ష ప్రణాళికలో అమలు చేయాలని జాతీయ ప్రణాళికా సంఘం కూడా సూచించింది. 11.రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 38, 46 సబ్‌ప్లాన్‌ అమలు చట్టాన్ని బలపరుస్తున్నాయి.
డిమాండ్స్‌: 1.రాష్ట్ర ప్రణాళిక బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుకు ఈ శాసనసభ సమావేశాల్లో చట్టం చేయాలి. 2.ఎస్సీ, ఎస్టీ నోడల్‌ ఏజెన్సీలకు చట్ట బద్దత కల్పించాలి. 3. సబ్‌ప్లాన్‌ నిధులు ఎస్సీ, ఎస్టీ నోడల్‌ ఏజెన్సీలకు కేటాయించి ఖర్చు చేయాలి. 4. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు కేటాయించాలి. 5. దళిత, గిరిజనుల సమస్యలపై 2 రోజులు శాసనసభ, శాసన మండలిలో ప్రత్యేక చర్చ జరపాలి. 6.కేంద్ర, రాష్ట్ర, జిల్లా పరిషత్‌, కార్పొరేషన్‌, మున్సిపాల్టీ, స్థానిక సంస్థలు, మండల, గ్రామ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు చేయాలి. 7.సబ్‌ప్లాన్‌ అమలుకు జిల్లా, మండల స్థాయిలో నోడల్‌ కమిటీ ఏర్పాటు చేయాలి. 8. ఇంతవరకు కోత విధించిన, దారి మళ్లించిన నిధులను తిరిగి దశల వారీగా కేటాయించాలి. 9. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్‌ చైర్మన్‌, సభ్యులను వెంటనే నియమించాలి.


(రచయిత కెవిపిఎస్‌ రాష్ట్రకార్యదర్శి)
Prajashakti News Paper Dated 18/02/2012 
-జాన్‌ వెస్లీ;

No comments:

Post a Comment