Saturday, February 4, 2012

కమ్యూనిస్టులు సంఘటితమవ్వాలి

కమ్యూనిస్టులు సంఘటితమవ్వాలి
-ఇంటర్వ్యూ : సి.వి.ఎల్.ఎన్.ప్రసాద్

ప్రగతిశీల ప్రపంచాన్ని ఊహించటం.. అలాంటి ప్రపంచ నిర్మాణానికి అవసరమైన భావజాలాన్ని వ్యాప్తి చేయటం సులభమైన విషయమేమీ కాదు. అలాంటి బాధ్యతను స్వీకరించిన అరుదైన రచయితల్లో స్వీడన్‌కు చెందిన జాన్ మిర్డాల్ ఒకరు. పెట్టుబడిదారీ సిద్ధాంతాన్ని నమ్మి ఆచరించే పాశ్చాత్యదేశాల్లో లెఫ్ట్ భావజాలాన్ని ప్రచారం చేసిన మేధావుల్లో ఆయన ముందు వరసలో ఉంటారు. స్వీడన్‌లో పుట్టి పెరిగిన జాన్ తల్లితండ్రులు గునార్ మిర్డాల్, అల్వా మిర్డాల్ ఇరువురూ నోబెల్ బహుమతి గ్రహీతలు కావటం ఒక విశేషం. 

దాదాపు రెండేళ్ల క్రితం మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి గణపతి ఇంటర్వ్యూతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన జాన్‌కు భారత్‌తో చాలా సన్నిహిత సంబంధం ఉంది. భారత కమ్యూనిస్టు ఉద్యమాన్ని చాలా కాలంగా ఆయన విశ్లేషిస్తూ వస్తున్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో మారుతున్న ఆధునిక ప్రపంచంలో.. భారత దేశంలో మార్క్సిస్టు ఉద్యమ ప్రభావం ఎలా ఉందనే అంశంపై ఆయన రాసిన 'రెడ్ స్టార్ ఓవర్ ఇండియా' పుస్తకం విడుదల సందర్భంగా.. హైదరాబాద్‌కు వచ్చిన జాన్‌తో ఈ వారం ముఖాముఖి.. 

పెట్టుబడిదారీ వ్యవస్థలు తీవ్ర సంక్షోభానికి గురవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచాన్ని ఏ కోణం నుంచి చూడాలి?
నేడు ప్రపంచం సంక్షోభంలో ఉంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ విఫలం కావటం వీటిలో ఒక ప్రధానమైన కార ణం. దీని వల్ల ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. గత కొన్ని దశాబ్దాలుగా పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయాలేమీ లేకుండా చూడటానికి అనేక శక్తులు ప్రయత్నించాయి. ఈ ప్రయత్నంలో భాగంగా అనేక వ్యవస్థలను నాశనం చేసేశాయి. దీని వల్ల సంక్షోభం ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలేమీ లేవనే భావన కలుగుతుంది. వివిధ దేశాల్లో ఉన్న కమ్యూనిస్టు పార్టీలు సంఘటితంగా ముందుకు వెళ్లలేకపోవటాన్ని కూడా మనం గుర్తించాలి. అలా వెళ్లలేక పోవడం వల్ల అనేక ప్రమాదాలు ఏర్పడతాయి. 

సమీప భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలేర్పడతాయని భావిస్తున్నారు?
చరిత్రను జాగ్రత్తగా గమనిస్తే పెట్టుబడిదారీ వ్యవస్థ విఫలమయిన సందర్భాలలో మితవాద శక్తులు, అందులోనూ తీవ్రమితవాదులు బలోపేతం అవుతారు. దీని వల్ల అనేక అనర్థాలు కలుగుతాయి. చరిత్రలో జర్మనీని ఇలాంటి సంఘటనకు ఒక పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు. భారత్‌లో కూడా ఈ తరహా ప్రమాదం పొంచి ఉంది. 

కమ్యూనిస్టు ఉద్యమాలు సంఘటితంగా లేకపోవటం వల్ల కలిగే నష్టాలేమిటి?
ప్రపంచంలో ఉన్న కమ్యూనిస్టు ఉద్యమాలు సంఘటితంగా లేవనేది సత్యం. ఇవన్నీ కలిసి ఉంటే ఒక దాని నుంచి మరొకటి శక్తిని పొందగలుగుతాయి. ప్రస్తుతం వివిధ దేశాల్లో కమ్యూనిస్టు ఉద్యమాలు తమ తమ ప్రాంతాల్లో బలంగానే ఉన్నాయి. కాని వీటి ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు వాల్ స్ట్రీట్ మార్చ్‌ను తీసుకుందాం. ఇలాంటి ఉద్యమాన్ని కనక కమ్యూనిస్టులు వాడుకోగలిగితే ప్రపంచానికి మేలు కలిగేది. కమ్యూనిస్టులు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఉద్యమాన్ని తీసుకురాలేకపోవటానికి సంఘటితంగా లేకపోవటమే ప్రధానమైన కారణం. 

మీరు భారత్‌లో కమ్యూనిస్టు ఉద్యమాన్ని చాలాకాలంగా పరిశీలిస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల్లో ఓటమి పాలయ్యాయి. పార్టీల క్యాడర్ కూడా తగ్గిపోతోంది. దీనికి ఎలాంటి కారణాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు?
దీనికి ప్రధానమైన కారణం కమ్యూనిస్టు పార్టీలు అనుసరిస్తున్న విధానాలు. ప్రతి దేశానికి తనవైన ప్రత్యేక సమస్యలు ఉంటాయి. వాటిని పరిష్కరించగలిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. దీనికి ఎలాంటి మోడల్ అవసరమనే విషయాన్ని స్పష్టంగా నిర్ధారించుకోవాలి. సోవియట్ యూనియన్‌లోనో, చైనాలోనో, లాటిన్ అమెరికాలోనో విజయవంతమయిన మోడల్ ఇక్కడ పనిచేయకపోవచ్చు. అంతే కాకుండా పరాజయం ఎదురయినప్పుడు దాని వెనకున్న కారణాలను విశ్లేషించుకోవాలి. ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవాలి. ఇది కష్టమైన పనే. కాని వేరే మార్గం లేదు. నా ఉద్దేశంలో ఈ దేశంలో ఉన్న కమ్యూనిస్టులందరూ సంఘటితంగా పనిచేయాలి. అవసరమైతే ఒక ఫ్రంట్‌గా ఏర్పడాలి. కమ్యూనిస్టు సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం, పార్టీ వ్యవస్థను బలోపేతం చేసుకోవటం చాలా కీలకమైన అంశాలు. 

దేశంలో ఉన్న సహజవనరుల కోసం అనేక మంది ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివాసీలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రపంచంలో మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటి?
సహజవనరుల కోసం పెట్టుబడిదారులు చేస్తున్న ప్రయత్నాలు భారత్‌కో.. ఆంధ్రప్రదేశ్‌కో పరిమితమయినవి కావు. ప్రపంచంలో అనేక దేశాల్లో ఈ తరహా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. వారి తరపున పోరాడే పార్టీలపైన, నాయకులపైన ఉంది. అయితే ఈ పోరాటంలో ఆదివాసీలకు నష్టం కలగకూడదు. చాలా సార్లు ఈ దోపిడీ అభివృద్ధి పేరిట జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ప్రజల పక్షాన పోరాడుతారో వారిని ప్రగతి నిరోధకులుగా, అభివృద్ధి వ్యతిరేకులుగా వర్ణిస్తారు. అభివృద్ధి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పెట్టుబడిదారులు కోరుకొనే అభివృద్ధి. రెండోది ప్రజలు కోరుకొనే అభివృద్ధి. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా చాలా సార్లు ప్రజలకు తెలియకపోవచ్చు. దీని గురించి స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నంలో కవులు, కళాకారులు కూడా క్రియాశీలక పాత్ర పోషించాలి. చరిత్రను మ«థిస్తే సాహిత్యం ద్వారా పురుడుపోసుకున్న అనేక ఉద్యమాలు మనకు కనిపిస్తాయి.

-ఇంటర్వ్యూ : సి.వి.ఎల్.ఎన్.ప్రసాద్
Andhra Jyothi News Paper Dated 05/2/2012 

No comments:

Post a Comment