Saturday, February 25, 2012

నిజాం నిరంకుశుడు కాదా? -ఎస్వీ సత్యనారాయణ


'ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టవద్దు' (ఫిబ్రవరి 28, ఆంధ్రజ్యోతి) అంటూ 'ముస్లిం ఫోరం ఫర్ తెలంగాణ' పక్షాన డాక్టర్ రఫత్ సీమా, కనీజ్ ఫాతిమా రాసిన దిగ్భ్రాంతికరమైన వ్యాసం చూశాను. ఆశ్చర్యమేసింది. నిజాంను నిరంకుశ నిజాం అనకూడదని, నిజాంను తిడుతూ పాటలు పాడితే ముస్లింల ఆత్మ గౌరవం దెబ్బతింటుందని, నిజాం మతసహనం గల ధర్మ ప్రభువని, హక్కుల సంఘాల చరిత్రలో ముస్లింలు కానరారని వ్యాస సారాంశం. క్లుప్తంగా స్పందిస్తాను. 

'బండెనక బండి కట్టి' అనే పల్లవితో ఎర్రబాడు దొర జన్నారెడ్డి ప్రతాపరెడ్డి అనే భూస్వామిపై రాసిన పాట వేరు. అదే బాణీని తీసుకుని యాదగిరి అనే ప్రజాకవి 'నైజాము సర్కరోడా-నాజీల మించినోడా! యమబాధ బెడితివి కొడుకో-నైజాము సర్కరోడా!' అనే పాటను అల్లి, పాడి ప్రచారం చేశాడు. ఈ ఒక్కపాట రాసినందుకే యాదగిరిని నిజాం పోలీసులు పాత సూర్యాపేట వద్ద పట్టుకుని కాల్చిచంపారు. 

'గోలకొండ ఖిల్లా కింద-నీ గోరి కడతం కొడుకో నైజాం సర్కరోడా!' అన్న ప్రజాగ్రహం 1947 నాటిది, 'మా భూమి' సినిమాది కాదు. నిజాం మత సహనం గురించి, చేసిన అభివృద్ధి గురించి గోరంతను కొండంతగా చేసి ఇంగ్లీష్‌లో ఏమి రాస్తున్నారో నాకు తెలియదు గానీ, హైదరాబాద్ సంస్థానంలో పుట్టి పెరిగిన నా తల్లితండ్రులు, అమ్మమ్మ నానమ్మలు చెప్పిన భయానకమైన గాథలు ఇంకా నా చెవుల్లో మార్మ్రోగుతూనే ఉన్నాయి. 

'అది ఒక దయ్యాల మేడ- శిథిల సమాజాల నీడ/పీనుగులను పీక్కుతినే -రాబందుల రాచవాడ/ ఆద్యంతం అంతులేని- అరిష్టాల మహా పీడ/ఎటుచూస్తే అటు చీకటి- ఎటు కన్నా శిథిలాలే' అంటూ 'హవేలీ' అనే కవితలో మఖ్దూం వర్ణించిన చీకటి రాజ్యం నిజాం సంస్థానం. నిరంకుశ రాజరికం, భూస్వా మ్య పీడన, వెట్టి చాకిరి, బానిసత్వం, నిరక్షరాస్యత, బలవంతపు మతమార్పిడి, ప్రజల ప్రాణాలకూ, మానాలకూ రక్షణలేని దుర్మార్గమైన వ్యవస్థ, విపరీతమైన పన్నుల భారం, అత్యధిక ప్రజల మాతృభాష, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల అణచివేతల పరాకాష్ట ఆసఫ్‌జాహీల పరిపాలన. రోలుపన్ను, రోకటి పన్ను, పెండ్లికి పన్ను, సమర్తాడితే పన్ను, తీర్థమాడితే పన్ను, పిల్ల పుడితే పన్ను, ముసల్ది చస్తే పన్ను- ఇలా ప్రజల గోళ్ళు ఊడదీసి వసూలు చేసిన సొమ్ముతో నిజాం నవాబు ఖజానా నిండింది. నిజమే, మీరన్నట్లు నిజాం నవాబు అత్యంత సంపన్నుడే. అయితే ఈ సంపద ఎక్కడ్నించి వచ్చింది?

మొగల్ చక్రవర్తిచేత దక్కన్ సూబాకి సుబేదార్‌గా నియమితుడై వచ్చిన నిజాముల్ ముల్క్ ఖమ్రుద్దీన్ 1724లో స్వతంత్రాన్ని ప్రకటించుకుని, హైదరాబాద్ సంస్థానంలో ఆసఫియా రాజ్యస్థాపన చేశా డు. కట్టుబట్టలతో సుబేదార్‌గా ఈ సంస్థానానికి వచ్చిన ఖమ్రుద్దీన్ వారసులు ప్రపంచంలోనే అత్యంత సంపన్నులు ఎలా అయ్యారు? లక్షలాది ఎకరాల భూమిపై ఆధిపత్యాన్ని, హక్కుల్ని ఎవరి చెమట, రక్తాలను ధారపోస్తే పొందగలిగారు? ఆలోచించండి. ఇక మత సహనం సంగతి? ఒకే రోజు ఇక్కడ హిందువుల పండుగ, ముస్లింల పండుగ వస్తే హిందువుల వేడుకలు నిషేధింపబడేవి.

హైదరాబాద్ సంస్థానంలోని అనేక దేవాలయాలు మసీదులుగా మారాయి. బలవంతపు మతమార్పిడిలు జరిగాయి. ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని దినదిగండంగా బ్రతికారు. మా తండ్రితాతలు గళ్ళ లుంగీలు కట్టుకుని, తలపై కుచ్చు టోపీలు పెట్టుకుని తిరగాల్సిన దుష్టవ్యవస్థ మత సామరస్యమా? 'నిజాంలో కూడా మంచి-చెడూ రెండూ ఉన్నాయి' అని భావిస్తున్నా మీరు మంచి ఎంత? చెడు ఎంత? ప్రజలకు జరిగిన మేలు ఎంత? కీడు ఎంత? నిజాం పాలన సమర్థనీయమా? నిరాకరించదగిన దా? అన్న అంశాలను లౌకికి దృష్టితో, సంయమనంతో చూడండి. బాలగోపాల్ చెప్పినట్లు 'మనకు తెలియకుండానే హిందూయిజం మన మెదళ్ళ మీద పని చేస్తుంది' అనే మాటకు ఒక సవరణ-'మనకు తెలియకుండానే మతం మన మెదళ్ళ మీద పనిచేస్తుంది'అని మొన్నటి వ్యాసం చదివాక నాకన్పిస్తుంది. 

'హైదరాబాద్ సంస్థానంలో కాంగ్రెస్ ఉద్యమాలు చేయవలసిన అవసరం లేదు' గాంధీజీ ఏనాడూ చెప్పలేదు. నిజాం పరిపాలన నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా కొనసాగుతుందని గాంధీజీ ఎప్పుడూ కీర్తించలేదు. ఇక్కడ రాజకీయ పార్టీలపై నిషేధం ఉంది కాబట్టి, ఉద్యమాలు శాంతియుతంగా జరిగే పరిస్థితి లేదు కాబట్టి, హింసాయుత ఉద్యమాలు జరుగుతాయి. 

కాబట్టి గాంధీజీ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించాడు. అంతేకానీ ఉద్యమించవలసిన అవసరంలేని ప్రజాహిత పరిపాలన ఇక్కడ కొనసాగుతున్నదని గాంధీజీ భావించ లేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తుది దశకు నిర్ణయాత్మకమైన దశకు చేరుకున్న ప్రస్తుత తరుణంలో కులాలకు, మతాలకు అతీతంగా అందరం కలిసి ఉద్యమిద్దాం. ఐక్యంగా ఆలోచి ద్దాం. మీరన్నట్లు వక్రీకృత చరిత్ర మీద ప్రజాస్వామ్య సమాజం నిర్మితం కాదు.
Andhra Jyothi News Paper Dated : 7/3/2010

No comments:

Post a Comment