Saturday, February 25, 2012

మానుకోట ఏమంటున్నది? - పసునూరి రవీందర్


నేషనల్ దళిత్ ఫోరం తరఫున ఇటీవల మానుకోటను నిజనిర్ధారణ కమిటీ సందర్శించింది. ఆ కమిటీలో 'సింగిడి' తెలంగాణ రచయితల సంఘం తరఫున సభ్యుని గా పాల్గొన్న నేను బాధితులతో, ప్రత్యక్ష సాక్షులతో మాట్లా డి, ఈ ఘటన వెనుక దాగిన నిజానిజాల పట్ల ఒక దృష్టికోణాన్ని మానుకోట ఘటనను అర్థం చేసుకోవలిసిన తీరును వివరిస్తున్నాను. 

కొన్ని దశాబ్దాలుగా వరంగల్ జిల్లా గడ్డ మీద మానుకోట పోరాటాల నిలయంగా వర్ధిల్లుతున్నది. మానుకోట, ఆ చుట్టుపక్కల తండాలు, పల్లెల జనమంతా ఏదో ఒక ఉద్యమంతోటో లేక రాజకీయ పార్టీతోనో ప్రత్యక్ష సంబం ధం కలిగి క్రియాశీలంగా పనిచేసిన చరిత్ర ఉన్నవారు. బలవంతపు విలీనానికి ముందే తెలంగాణ కోసం పోరాడిన చరిత్ర కూడా మానుకోటకు ఉంది.

పోలీసు యాక్షన్ తరువాత ప్రభుత్వ ఉద్యోగాలలో దొంగ ముల్కీ సర్టిఫికెట్ల ద్వారా ప్రవేశించిన స్థానికేతరుల మీద 1952లో గైర్ ముల్కీ ఉద్యమం వరంగల్‌లోనే ప్రారంభమైంది. స్థానికేతరులైన ఆంధ్ర ప్రజలు ఇక్కడి ఉద్యోగాలను ఆక్రమించి, తమ పొట్ట గొడుతున్నారంటూ వరంగల్ విద్యార్థులు ఉద్యమాన్ని ప్రారంభించారు. 

navya.ఆ ఉద్యమంలో భాగంగా 1952 ఆగస్టు ఎనిమిదవ తేదీన మానుకోటలో విద్యార్థులు వెయ్యిమంది విద్యార్థులు తరగతులను బహిష్కరించి ప్రదర్శనలు తీశారు. వరంగల్ విద్యార్థి సంఘం పిలుపు మేరకు 'బే ముల్కీలు వాపసు పోవాల'ని సమ్మె చేశారు. మళ్ళీ అదే మానుకోట జగన్ గో బ్యాక్ అని 58 ఏళ్ల తరువాత కూడా నినదించింది. 

మానుకోట కాల్పుల్లో గాయపడ్డ వారిలో తొమ్మిది మంది జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకుంటున్నారు. మహబూబాబాద్ వెళ్ళడానికి ముందు బాధితులను పరామర్శించడమే ప్రథమ కర్తవ్యమ ని మా టీం భావించింది. అందువల్ల వరంగల్ నగరంలోని ఎంజిఎం ఆసుపత్రికి వెళ్ళాము.

దాదాపుగా అందరి కాళ్ళ కు, నడుముకు బుల్లెట్లు తాకాయి. మమ్మల్ని చూడగానే కొంచెం సవరించుకుని ధైర్యంగా ఘటన వివరాలు చెప్పడానికి సిద్ధమయ్యారు. గాయపడిన వారిలో కానీ, వారి కుటుంబ సభ్యులలో కానీ దిగులు కనిపించలేదు. మరో యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు కనిపించారు. ఈ ఒక్క దృశ్యం చాలు తెలంగాణ ఉద్యమ చైతన్యాన్ని అర్థం చేసుకోవడానికి..

తొమ్మిది మందిలో ఐదుగురు లంబాడీలు, ఇద్దరు బీసీలు, ఇద్దరు దళితులు. తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచి ఈ జిల్లాలో లంబాడీల పోరాట పటిమ సజీవంగానే ఉందనడానికి ఈ ఐదుగురు ప్రత్యక్ష సాక్షులుగా కనిపించారు. అక్షర పరిజ్ఞానం అంతంత మాత్రమే కలిగిన వీరంతా తెలంగాణను అధ్యయనం చేసిన విద్యావంతులు. 

మొదటగా వ్యవసాయ కూలీ రావోజీ నాయక్‌ను కలిశా ము. తొడ నుండి బుల్లెట్ దూసుకుపోయి కదలలేని స్థితిలో ఉన్నాడు. కూలీ చేసుకుంటే తప్ప బతుకు గడవని రావోజీ నాయక్ కదిలిస్తే తెలంగాణ ఉద్యమ చైతన్యం ధార లై ప్రవహించింది. అతని ముఖం మీద చెరగని గుండె ధైర్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.

వాంకుడోతు హచ్యా అనే ఒక సినిమా థియేటర్ గేట్ కీపరు కు కూడా సరిగ్గా తొడభాగం లో బుల్లెట్ గాయమైంది. తన పని తాను చేసుకుని బతికే హచ్యానాయక్ తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించాలనుకున్నా డు. అందుకోసం ఆ రోజు పని మానుకుని పోరాటంలో పాల్గొనడమే పనిగా పెట్టుకున్నాడు. తన తండాకు చెందిన విద్యార్థులు జగన్‌ను అడ్డుకోవడానికి వెళుతున్నారని తెలిసి, తాను కూడా స్వచ్ఛందంగా నిరసన లో పాల్గొన్నాడు. ఎలా జరిగిందో చెప్పమంటే ఒక పోరాట నవల కావాల్సినంత కథాంశాన్నే కళ్ళ ముందుంచాడు హచ్యానాయక్. 

'మాది ఒక చిన్న తండా సారు. రెక్కల కూలీ తప్ప ఇంకో అదెరువు లేదు. తెలంగాణ కోసం నడుస్తున్న ఉద్యమాన్ని చూసి నా రక్తం ఉడికి పోయింది. తెలంగాణ వస్తే మా బాధలు తీరుతాయని సమజైంది. చిన్న పిల్లలు సదువులు పక్కన పెట్టి పోరాడడం నాక్కూడ పోరాడాలనే బుద్ధినిచ్చింది. ఇట్లా మా ఊరి విద్యార్థులతో కలిసి తెలంగాణ పోరాటానికి నేను కూడా పోయిన. కానీ, మా జిల్లోల్లే బయిటోళ్ళకు మద్దతుగా నిలబడుతున్నారని తెలిసి కడుపు రగిలిపోయింది. ఇగ పానం పోయినా పర్వా లేదనుకున్న' - ఈ మాటలు వింటుంటే స్వాతంత్య్ర పోరాటం గుర్తుకొచ్చింది. 

జగన్ యాత్రను అడ్డుకోవాలని మానుకోట చుట్టుపక్క ల గ్రామాల ప్రజలు, తండాల్లో జీవించే లంబాడీలు ఒక్కటయ్యారు. తాము చేసే కూలీ పనులను పక్కన పెట్టి ఆ రోజుకు అదే తమ కర్తవ్యంగా భావించారు. తమ కోసం తాము బతకాలనుకోవడం లేదు ఇవాళ తెలంగాణ జనం. అందరి బాగు కోసం, రేపటి తమ బిడ్డల భవిష్యత్తు కోసం తమ వంతుగా త్యాగాలు చేయాలనుకుంటున్నారనడానికి బంజార బిడ్డల మాటలే ఆధారాలు.

వీరి మాదిరిగానే మిగిలిన వారు కూడా. గాయపడ్డ వారిలో విద్యార్థులు కూడా ఉన్నారు. మానుకోట చుట్టుపక్కల గల పల్లెలు, తండాల నుంచి అందరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి, సొంతంగా చార్జీలు పెట్టుకుని ఆటోలల్ల మానుకోట రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. నినాదాలు చేసి శాంతియుతంగా నిరసన తెలపాలనుకున్నారు.

కానీ వీరి కన్నా ముందే వర్గీయులైన దంపతులు తమ అనుచర గణాలతో ఖద్దరు బట్టలేసుకుని ప్లాట్‌ఫాం మీదున్నారు. అయి నా కూడా వెనుకడుగు వేయని తెలంగాణ ప్రజలు శాంతియుతంగా ర్యాలీ తీస్తూ జగన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశా రు. ఇది సహించని ఖద్దరు వేషాల్లోని జగన్ గణం ఒక్కసారిగా వారిపై విరుచుకుపడింది.

తెలంగాణ ఉద్యమకారులను కొట్టడం ప్రారంభించింది. తమపై దాడి చేస్తున్న వారు రాయలసీమకు చెందిన వారని తెలంగాణ ఉద్యమకారులు గ్రహించారు. ఒకరిద్దరిని పట్టుకుని నిలదీయగా, వారు ఈ విషయం అంగీకరిం చి వదిలివేయమని బతిమిలాడారు. దీంతో ఉద్యమకారులు వారిని వదిలివేశారు. ఇంతలో జగన్ సొంత పత్రికకు చెంది న వాహనాల్లో మందీ మార్బలం దిగి రాళ్ళు రువ్వడానికి యత్నించారు. ఈ విధంగా మానుకోట రైల్వేస్టేషన్ తెలంగాణ ఉద్యమకారులతో, జగన్ అనుచరగణంతో రెండు శిబిరాలుగా తయారైంది. 

కాల్పులు జరిపిన వారిలో కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారని గాయపడ్డ తెలంగాణ బిడ్డలు చెప్తున్నారు. మానుకోట విశ్రాంతి గదిలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు రివాల్వర్ తో కాల్పులు జరిపిన విషయం మీడియా కూడా చిత్రీకరించింది. అయితే రివాల్వర్‌తో కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరనేది ప్రభుత్వానికి, పోలీసులకు తెలుసు. అయినా చెప్పడం లేదు. 

తెలంగాణ విద్యార్థులు చనిపోయినప్పుడు రాని జగన్ ఇప్పుడు ఎందుకు వస్తున్నడన్న అని తొమ్మిదవ తరగతి చది వే వెంకటేశ్ అడిగిండు. ఐస్‌క్రీంలు అమ్మే నర్సయ్య కొడుకు వెంకటేశ్ రోజూ తెలంగాణ కోసం ర్యాలీలు,ధర్నాలలో పాల్గొంటున్నాడు. వీరంతా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, ఉద్యమావశ్యకతను ఎంతో అవగాహనతో వివరించడం విశేషం. 

జగన్ ఆధిపత్యయాత్రను అడ్డుకుందాం అనే పోస్టర్లు మాకు మానుకోట వీధుల్లో, రైల్వే స్టేషన్లో కనిపించాయి. జగన్ పర్యటనను అడ్డుకోవాలని తెలంగాణ జెఎసి నాయకులు పత్రికల ద్వారా కూడా పిలుపునిచ్చారు. అయినా జగ న్ యాత్ర చేపట్టడం వల్ల, దానిని ముఖ్యమంత్రి రోశయ్య నిలిపివేయించకపోవడం వల్ల పరిస్థితి విషమించింది. 

ఆ రోజు ఏమి జరిగిందనేది స్టేషన్ మాస్టర్ చెప్పడానికి వెనుకాడాడు. డోర్నకల్ రైల్వే పోలీస్ స్టేషన్‌లో అడగమని దాటవేశాడు. స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళితే కేసు సిబిఐకి పంపా ము అంటూ దాటవేశాడు తప్ప నోరు మెదపడానికి సాహసించడం లేదు. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణకు ప్రజానీకం సిద్ధంగా ఉన్నారనడానికి మానుకోట ఘటన ఉదాహరణ. 

- పసునూరి రవీందర్ 
(రీసెర్చి స్కాలర్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం)
Andhra Jyothi News Paper Dated : 13/6/2010

No comments:

Post a Comment