Saturday, February 25, 2012

మానవీయ వృత్తి 'నర్సింగ్' - ఎం. హేమలత సరోజిని


'మానవసేవే మాధవ సేవ' స్ఫూర్తితో సాగే విశిష్టమైన వృత్తే నర్సింగ్. కారు చీకటిలో కరుణామయ చూపులతో దారిచూపే వెలుగును చేతబట్టిన సేవామూర్తులు నర్సింగ్‌కు ప్రతీకలుగా మదిలో మెదులుతారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో నర్సింగ్ వృత్తి చాలా పురాతనమైనది, ప్రశస్థమైనది. ఆరోగ్యం, స్వస్థతలకు సంబంధించిన అంశాలన్నిటితో వ్యవహరించడంలో నర్సింగ్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మానవ ప్రాణి ఉనికిలోకి వచ్చిన నాటి నుంచి నర్సింగ్ వృత్తి కొనసాగుతోంది. యుద్ధాలు, అంటువ్యాధులు ప్రబలిన సందర్భాల్లో బాధితులకు శుశ్రూష చేసి, ప్రజలకు సేవలందించడంలో ఆశ్రమాలు, ఆరామాలు పడుతున్న శ్రమలో కీలక పాత్ర పోషిస్తున్నది నర్సులే. 

కొన్ని శతాబ్దాలుగా సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆరోగ్య సేవా రంగం, వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ స్పృహలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ రంగంలో పనిచేసేందుకు సేవా భావం, నైపుణ్యాలు మాత్రమే చాలదు. వాటితోపాటు ఆ వృత్తికి సంబంధించిన నైతిక వర్తన, విధివిధానాలున్న నర్సింగ్ కోడ్‌ను కూడా నేర్చుకోవడం అవసరం. దాంతో నర్సింగ్ శిక్షణ కోసం ఇతర వృత్తుల కంటె భిన్నంగా దీనికి ప్రత్యేకమైన బోధన, శిక్షణ అవసరం అవుతుంది. 

మానవజాతికి వైద్య సహాయం, సేవ అందించే లక్ష్యంతో ఈ వృత్తి నడుస్తుంది. అన్ని తరాలు, కుటుంబాలు, గ్రూపులు, మతస్థులు, ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు, రోగులకు స్వతంత్ర, సహకార సంరక్షణ అందించడంతో నర్సింగ్ ముడిపడి ఉంటుంది. సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం, అందుకు ప్రోత్సహించడం వంటి విధులను కూడా నర్సింగ్ నిర్వహిస్తుంది. ఆరోగ్య విధాన రూపకల్పనలో పాల్గొనడమే కాక, రోగ నివారణ, పరిశోధన, ఆరోగ్య వ్వవస్థల నిర్వహణ, సంబంధిత విద్య వంటి కార్యకలాపాలు కూడా నర్సింగ్ కీలక విధులుగా ఉంటాయి. 

గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నేటి నర్సులు మరిన్ని బాధ్యతలను, ప్రత్యేక కర్తవ్యాలను నిర్వహించవలసి ఉంటుంది. కెరీర్ కోసం ప్రయత్నిస్తున్న యువతీ యువకులకు నర్సింగ్‌లో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. రోజు రోజుకు పురోగమిస్తున్న భారతీయ వైద్య ఆరోగ్య సంరక్షణ రంగం యువతకు మంచి భవిష్యత్‌ను అందించే పరిస్థితులు ఉన్నాయి. 

సేవ, విజ్ఞానము, ఉపాధి మార్గము అన్న మూడు అంశాలు నర్సింగ్ వృత్తి ఎంపికలో ఉన్నాయి. జాతీయ ఆరోగ్య సంరక్షణ రంగం, ఆరోగ్య వికాసాలకు నర్సింగ్ ఒక మూల స్తంభంగా పనిచేస్తుంది. ఒక వ్యక్తి మానవుల పాలిట దైవసమానమైన వ్యక్తిగా ఈ వృత్తి ద్వారా గుర్తింపు లభిస్తుంది. రోగులు స్వస్థతపొంది ఆరోగ్యవంతులుగా మారేందుకు నర్సుల సహాయం కోసం ఎల్లప్పుడూ ఎదురుచూస్తుంటారు. 

నర్సింగ్ వృత్తి ద్వారా అనేక లాభాలున్నాయి. ఒక నర్సు తన కార్యాచరణ ద్వారా అనునిత్యం ప్రజా జీవితాలలో నిజమైన భిన్నత్వానికి నిదర్శనంగా నిలుస్తారు. నర్సింగ్ వృత్తిని ఎంచుకున్న వ్యక్తులు రోగులకే కాకుండా తనకు, తన కుటుంబానికి, తన ప్రాంతీయలకు తన జ్ఞానాన్ని, అనుభవాన్ని పంచేందుకు వీలుంటుంది. నర్సింగ్ వృత్తిలో పదోన్నతి, ఉద్యోగ భద్రత, పనివేళల అనుకూలత వగైరాలకు అవకాశం మెండుగా ఉంది. ఉన్నత విద్యను అభ్యసించగలిగిన చాలా మంది నర్సులు మేనేజర్స్, విద్యావంతులు, పరిశోధకులు, నర్స్ ప్రాక్టీషనర్స్, క్లీనికల్ నర్స్ స్పెషలిస్టులు వగైరాలుగా మరింత స్వతంత్రంగా వ్యహరించగలిగే అవకాశం ఉంది. 

సహకారం, స్వతంత్రత రెండు అంశాలతో కూడిన వృత్తి ఇది. హాస్పిటల్ నర్సింగ్, కమ్యూనిటీ నర్సింగ్, స్కూల్ నర్సింగ్, మెడికల్ అసిస్టెన్స్ వగైరా వైవిధ్యభరిత రంగాలలో నర్సింగ్ వృత్తి ఉంది. ఉన్నత విద్యాప్రమాణాలు, శిక్షణ అర్హతలు, నైపుణ్యంగల నర్సులకు విస్తృతమైన కేరీర్ అవకాశాలున్నాయి. మరే ఇతర వృత్తులలోనూ ఇంతటి వెసులుబాటు, ఆత్మ సంతృప్తి, ఉద్యోగ భద్రత ఉండదు. 

నిరంతరం సవాళ్ళతో, ఆకర్షణీయ వేతనంతో కూడిన ఉపాధి కోసం వెతుకులాడే వారికి నర్సింగ్ వృత్తి ఒక మంచి మజిలీ. నూటికి నూరు శాతం ఉద్యోగ భద్రత ఉండడమే కాకుండా పట్టుదల, దృఢ నిశ్చయంతో చక్కటి సవాళ్ళతో కూడిన కేరీర్‌గా నర్సింగ్ ప్రసిద్ధి చెందింది. బహుళ అవకాశాలున్న ఏకైక వృత్తి ఇది. స్త్రీ వృత్తులకు సంబంధించిన నర్సింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణీయమైన జీతాలతో కూడిన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఇతరులకు సహకరించాలన్న జిజ్ఞాస, ఇతరుల బాధలు, రుగ్మతల పట్ల సానుభూతి ఉండి ఆ రంగంలో ఉపాధి కోసం అన్వేషించే యువతీ యువకులకు నర్సింగ్ చక్కటి వృత్తిగా నిలుస్తుంది. 

నర్సింగ్ అనేది కేవలం స్త్రీలకు మాత్రమే ప్రత్యేకించిన వృత్తి కాదు. అనేక మంది పురుష నర్సులు అంకితభావంతో, తాదాత్మ్యంతో ఈ రంగంలో పనిచేస్తున్నారు. మనకు సాధారణ విషయంగా కనపడే దాతృత్వం ఇతరులకు అత్యంత విలువైనదిగా ఉంటుంది. మీరు దయాళువు అయినట్లయితే, సంరక్షించే స్వభావాన్ని కలిగి ఉన్నట్లయితే, మీ కెరీర్ ద్వారా ఇతరులను ప్రభావితం చేసి, వారి మన్ననలను పొందాలనుకున్నట్లయితే నర్సింగ్‌ను మించిన మంచి వృత్తి వేరొకటి ఉండదు. వైద్య రంగంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం బాగా అభివృద్ధి చెందినప్పటికీ వ్యక్తి కేంద్రిత ఆరోగ్య సమగ్ర సంరక్షణ ఇప్పటికీ అవసరం కాబట్టి నర్సింగ్ వృత్తికి ఎల్లవేళలా డిమాండ్ ఉంది. 

రాబోయే రోజుల్లో దేశం వైద్య, ఆరోగ్య రంగంలో విశేషమైన ప్రగతిని సాధించబోతోంది. మెడికల్ టూరిజంకు మన దేశం ఒక ప్రపంచ కేంద్రంగా అవ తరించనుంది. ఈ నేప థ ్యంలో వైద్య సంరక్షణలో నిపుణుల అవసరం బాగా పెరగనుంది. 

- ఎం. హేమలత సరోజిని
ప్రిన్సిపాల్, ఈశ్వరీబాయి మెమోరియల్
కాలేజ్ ఆఫ్ నర్సింగ్
Andhra Jyothi News Paper Dated : 26/02/2012 

No comments:

Post a Comment