Saturday, February 25, 2012

రాబోయే తెలంగాణలో! -సుజాత సూరేపల్లి


రేపు రాబోయే తెలంగాణలో జరిగే పరిణామాలు తలచుకుంటే ఒళ్ళు ఒక్కసారిగా జలదరిస్తుంది. చిన్న ఉదాహరణ: కరీంనగర్‌కి సంవత్సరం క్రితం ఉద్యోగ రీత్యా రావడం జరిగింది. వస్తూనే మల్లా రెడ్డి, ఇతర స్థానిక రాజకీయ నాయకులు నన్ను, ప్రొఫెసర్ రేవతిని పిలిచారు. అక్కడ మహిళలు అందరూ ఏకగ్రీవంగా నన్ను ప్రతినిధిగా ఎన్నుకున్నారు. బహుశా ఒక్కటే ఒక రీజన్- నాకు ఉద్యమాలతో సంబంధం ఉండడం. నేను ఏ రాజకీయ పార్టీలో లేకపోవడం అనుకుంటా.. ఐతే ఒక రాజకీయ పార్టీకి చెందిన ఒకరిద్దరు మాత్రం వెంటనే అభ్యంతరం చెప్పడం జరిగింది. నేను ఈ జిల్లాకి చెందిన దానిని కాదు కాబట్టి నాయకత్వంలో ఉండడానికి వీలులేదు అని. ఐతే దానికి అందరు అంగీకరించలేదు. 

సరే, అక్కడి నుంచి గ్రానైట్ మైనింగ్ మీద ఇక్కడ ఉన్న ఉద్యమకారులతో కలిసి ప్రయాణం మొదలుపెట్టాము. ఇదివరకు ఉన్న భూనిర్వాసిత ఐక్యవేదిక నుంచి తెలంగాణ భూమి రక్షణ సంఘంగా ఏర్పడి, కేవలం సహజ వనరుల హక్కుల కోసం పనిచేద్దామని నిర్ణయించాము. ఇక్కడ మిత్రులతోటి, వారి ఆలోచనల తోటి కలిపి ఏర్పడిన ఉద్యమ వేదిక. ఒక సంవత్సర కాలంలో చాలా పనులు చేశాము. ప్రజలను చైతన్యపరచడం, ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకుపోవడం, కోర్టులు, జైళ్ళకి తిరగడం కూడ అయింది. వేల కరపత్రాలు ఎన్నో గ్రామాలలో పంచడం చివరికి ఒక ఉద్యమ రూపం తీసుకుంది. 

ఐతే ఇక్కడ ఉన్న ఇతర సంఘాల వాళ్ళు, తీవ్రమైన దుష్ప్రచారం మొదలుపెట్టారు. నేను వచ్చినంక వారి ఉనికికి దెబ్బ తగిలిందని, వారి వారి సంఘాలలో ఉన్న నాయకులు అందరు ఇందులో భాగస్వాములై వారిని పనిచేయకుం డా చేసానని ముందుగా వచ్చిన ఆరోపణ. నిజానికి ప్రతి మీటింగ్ కూడ కొన్ని వందల మెసేజ్‌లు, ఫోన్‌లు చేయడం, పత్రికా ప్రకటనలు ఇవ్వడం జరిగింది. చివరికి బ్లాగ్ కూడ పెట్టి సమాచారం అందులో ఉంచడం కూడా జరుగుతుంది. ఆరోపణలేమీ పట్టించుకోకుండా ముందుకు పోతూనే ఉన్నాము. ఈ క్రమంలో మల్యాల మండలం మేడంపల్లిలో మహిళలు క్వారీ పై దాడి చేసారని ఊరందరినీ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. 

హుటాహుటిన పోయి అందరు నాయకులకి చెప్పి మొత్తానికి చాలామందిపై కేసులు రాకుండా చూడగలిగాము. అయినా ముగ్గురు నలుగురు జైలు పాలు అయ్యారు. ఆరా తీస్తే అధికార పార్టీకి చెందిన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు (మంత్రిపదవిలో ఉన్నారు) ఈ కుట్రలో భాగస్వామి అని తెలిసింది. వెంటనే నిరసనగా హక్కుల సంఘాలు కలిసి ఆ ఊరివారికి మద్దతు తెలుపుదామని అనుకున్నాము. మాకంటే ముందుగానే స్థానిక పోలీస్‌వారు బయటి వ్యక్తులు ఈ ఊరికి ఎవరు వచ్చినా మిమ్మల్ని అందరిని నక్సలైట్ల పేరుతో జైలులో పెడతాం అని బెదిరించారు. 

అక్కడి ప్రజలు రహస్యంగా ఈ వార్త అందించి ఎవరి ఇళ్ళలో వాళ్ళు భయంగా దాక్కున్నారు. ఇక లోపట ఉన్నవాళ్ళని విడిపిద్దామని డిఎస్‌పితో మాట్లాడి, లాయర్లతో మాట్లాడి ఎన్నో కష్టాలు పడినాము. కొందరు క్వారీ యజమానులు మమ్మల్ని రానీయకుండా వాళ్ళే బెయిల్‌పై విడుదల చేయించి, మేము కొన్ని కోట్లు వారివద్ద తీసుకున్నామని, ప్రజలని మధ్యలోవదిలివేశామని ప్రచారం మొదలుపెట్టారు. ఈ విషయం కూడ అక్కడి ప్రజలే చెప్పారు. అయినా వెనక్కి తగ్గకుండా మా పనులు మేము అవిశ్రాంతంగాచేస్తూనే ఉన్నాము. 

ఈ అపవాదులు మాకు కొత్త కాదు. అయినా, అతి దగ్గర మిత్రులు, ఉద్యమ నాయకులు కూడ నమ్ముతుండడంతో నిజంగా బాధవేస్తుంది. అసలు ఏ ఆధారంగా ఒక ఆరోపణని నమ్ముతూ ప్రచారం చేస్తారు? కనీసం మమ్మల్ని అడిగి తేల్చుకోవాల్సిన బాధ్యత కూడ లేకుండా, విచిత్రంగా ప్రవర్తించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ మధ్య కాలంలో మరొక నిందారోపణ. నేను ఎమ్మెల్యే పదవికో లేక ఎంపి పదవి కోసమో పనిచేస్తున్నానని. అసలు రాజకీయాలలో నిలబడాలంటే ఇవన్ని అవసరమా? 

ఇంతవరకు ఒక్క పైసా కూడా బయటి నుంచి తీసుకోకుండా, జీతంలోంచి ఖర్చు పెడుతూ, అప్పు లు చేస్తూ, కుటుంబాలకి దూరంగా ఉంటూ, వ్యక్తిగత జీవితాలని మరిచిపోయి చేస్తూన్న పనికి ఇది ఒక బహుమతా? ఈ మధ్య కాలంలో ఇక అప్పులని భరించలేక ఒక పెద్ద మనిషిని కరపత్రాలకి బిల్లు చెల్లించమని అడిగాము. అది కూడా డైరెక్ట్‌గానే. ఇది నిజంగా శీల పరీక్ష లాగానే ఉంటుంది నిజమైన కార్యకర్తకి. నిజంగా ఉద్యమాలలో భాగస్వామ్యం ఉన్నవారు, నిజాయితీగా మాట్లాడేవాళ్ళు ఇట్లా అనరు. కేవలం ఆ పనులు చేసేవాళ్ళే నమ్ముతారు అని తెలిసినా కూడా. ప్రపంచం అంతా వారిలాగే ఉంటుంది అనుకుంటే ఎట్లా? 

నిన్నటికి నిన్న ప్రాణహిత-చేవెళ్ల ప్రజాభిప్రాయ సేకరణలో మేము ఎం తో కష్టపడి విషయాలు సేకరించి, గ్రామాలు తిరుగుతూ ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకొని, ఇంజనీర్ల దగ్గర కూర్చుని టెక్నికల్ విషయాలు నేర్చుకొని ముందుకెళ్తున్నాం. ఇక్కడ ఉన్న మా కుమారస్వామి, మాకు పెద్ద చీఫ్ ఇంజనీర్ మా సంఘంలో సభ్యుడు. జగన్‌మోహన్‌గారు భీష్మ పితాజీ ఎన్నో గంటలూ, రోజులు , రాత్రులు, పగళ్ళు ప్రతి విషయాన్ని చర్చిస్తాము. 

అట్లనే మా మార్వాడీ సుదర్శను మాకు ఒక సైనికుడి లాంటివాడు. దుర్వాస రెడ్డి అందరినీ ఒక తాటికి తీసుకు వచ్చే మేధావి. పెంటయ్య సార్ పెద్ద మనిషి తరహాలో ఉంటారు. వీరందరూ కూడా స్థానికులే. కన్వీనర్‌గా మాత్రం నేను బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా కుమార్ లాంటి వాళ్ళ ప్రోద్భలంతో అందరం దీనిపై పని చేద్దామని నిర్ణయించుకొని మా అభిప్రాయాలను పబ్లిక్ హియరింగ్‌లో చెప్పడం జరిగింది. ఒక్క పార్టీ నాయకుడికి కూడా ఇన్ని విషయాలు తెలుసనీ మేము అనుకోవడం లేదు. అందరు మేము చెప్పిన విషయాలపై సానుకూలంగానే స్పందించారు. 

ఐతే ఒక్క ఎమ్మెల్యే మాత్రం ఒక ప్రశ్న వేసినందుకు వ్యక్తిగత దూషణకి దిగి, తన అనుచరవర్గాన్ని నా మీదకి పంపి, నానా రభస చేసారు.. అందరి సమక్షంలోనే. మిగిలిన నాయకులు ఒక సినిమాగా చూస్తూ ఉండిపోయారు. తరువాత కొందరు ప్రజలు వత్తిడి చేయడంతో ఖండించారు. అసలు నేను చేసిన తప్పు ఏమిటో నాతో సహా, అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు మాట్లాడరా? ప్రశ్నించరా? ఆయన మొదట చెప్పిన అభ్యంతరం నాది ఈ జిల్లా కాదని, నేను రైతుని కాదని, పాఠాలు తప్ప ఇంకో పని నేను చేయకూడదని ఆయన బాణీలో చెప్పారు. 

మరి ఎవరు ఏ పనిచేయాలో ఆయన సెలవివ్వలేదు. ఈ తతంగం అంతా చూస్తు న్న మీడియా మాత్రం కనీసం రిపోర్ట్ చేయలేదు. ఒకరో ఇద్దరో ఉన్నది కాస్తా రాసారు. రెండో రోజు ప్రజాసంఘాల నిరసనకి పత్రికలూ రాయక తప్పలేదు. అంటే మీడియాకి, ప్రతనిధులకి, పార్టీలకి ఒక న్యాయ కోణం కాని, జెండర్ కోణం కాని ఉన్నాయా అని ప్రశ్న వేసుకోవాలి. ఇక్కడ కులం దృష్టిలోంచి చూడడం కాదు, ఒక మహిళగా, బేలగా కూడ కాదు సమస్య. ఎవరు మాట్లాడాలన్నదే అసలు సంగతి. ఈ దేశంలో మహిళలు ధైర్యంగా ముందుకు రావాలంటే ఎంత కష్టపడాలో కూడ దృష్టిలో ఉంచుకోవాలి. 

అంతో ఇంతో చదువుకొన్న నా పరిస్తితే ఈ విధంగా ఉంటే మరి మామూ లు మనుషులు, ఆడవాళ్ళ పరిస్తితి? ఇక్కడ జరిగిన సంఘటన తెలంగాణ లో, ఇక్కడి ప్రజాప్రతినిధుల సమక్షంలో, ఇక్కడి వనరుల కోసం, ఇక్కడి వ్యక్తులు ప్రశ్నించారు. ఫలానా ఆయన దళిత ఎమ్మెల్యే కాబట్టి నేను కాని, ఎవరు కాని మాట్లాడొద్దని ఎన్నో అభ్యర్థనలు. న్యాయంకోసం మాట్లాడని వారు నాయకులు ఎట్లా అవుతారు? 

పోలేపల్లి ప్రజలు నాకు ఇంటిపేరు నిచ్చారు. నన్ను ఒక సొంత బిడ్డగా చూసుకున్నారు. ఇక్కడ కూడా అనేక సంఘాలు, వ్యక్తులు కులాలకి, మతాలకి అతీతంగా మద్దతునిచ్చారు. ప్రజల మద్దతు లేనిదే మేము ఎక్కడ పనిచేయలేము. మా మిత్రులు, సహోపాధ్యాయులు అంటున్నారు: రాబోయే తెలంగాణలో కాబోయే విజయవాడలు, గుంటూర్లు ఎన్నో.. అన్నిటికి సిద్ధం కండి అని. అవునా, నిజమేనా మిత్రులారా? కలలుగన్న తెలంగాణలో కన్నీళ్ళే మిగలనున్నాయా? 

-సుజాత సూరేపల్లి
Andhra Jyothi News Paper Dated : 11/05/2011

No comments:

Post a Comment