Wednesday, March 7, 2012

మహిళా ఉద్యమ చైతన్య పతాక - బట్టు వెంకయ్య



సమాజంలో నిరక్షరాస్యత నిర్మూలనకు మహిళా పాఠశాలలు ప్రారంభించి 'విద్య' ద్వారా వారిని చైతన్య వంతులను చేసిన 'ప్రధమ మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలే'. దేశంలో బహుజనులపై బ్రాహ్మణ భావ జాలాన్ని రుద్దకుండా దాని పునాదులను కూకటివేళ్ళతో పెకలించిన సామాజిక విప్లవ మూర్తి ఫూలే. సమాజంలోని హిందూ మతోన్మాదులు ఫూలే చేపట్టిన ఉద్యమాలను వ్యతిరేకించి ఆమెను సాంఘిక బహిష్కరణకు గురిచేసారు. ఫూలేపై కర్రలు, కత్తులు, రాళ్లు, బురద, పేడ నీళ్లతో భౌతిక దాడులు చేసేవారు. సమాజంలో ఎన్నో అవమానాలు, ప్రతికూల సంఘటనలు ఎదురైనప్పటికీ ఆత్మ స్థైర్యాన్ని, మనో నిబ్బరాన్ని కోల్పోకుండా 'సామాజిక పరివర్తన' కోసం అహర్నిశలు కృషి చేసిన ధీరోదాత్తురాలు సావిత్రి బాయి ఫూలే. సావిత్రి 1831, జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా, కావాడి గ్రామంలో జన్మించింది. 

తల్లి లక్ష్మీబాయి. తండ్రి ఖండోజీ. ఆమెది 'మాలి' అనే పూలు అమ్ముకునే వెనుకబడిన తరగతుల కుటుంబం. సావిత్రి బాల్యంలో నిరక్షరాస్యురాలు. నాటి సామాజిక, ఆర్ధిక పరిస్ధితులు ఆమెను ప్రాథమిక విద్యాభ్యాసానికి దూరం చేసాయి. సావిత్రికి 1840లో మహాత్మా జ్యోతి బాయి ఫూలేతో బాల్య వివాహం చేసారు. అప్పుడు ఆమె వయస్సు 9 సంవత్సరాలు. సావిత్రికి 'విద్య' పట్ల గల ఆసక్తిని గమనించిన ఫూలే స్వయంగా ఆమెకు 'ప్రాథమిక విద్యను' నేర్పించారు. అనంతరం పూనేలో శివరామ్ కావల్కర్ అనే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుని వద్ద 'పాఠశాల విద్యను' పూర్తిచేయించాడు. 

నాటి సమాజంలో బహుజనులకు చదువు నేర్పేందుకు బ్రాహ్మణ ఉపాధ్యాయులు నిరాకరించటం వలన వివక్ష ప్రదర్శించటం వలన బహుజనులకు విద్య నేర్పేందుకు మహాత్మా జ్యోతి బాయి ఫూలే తన సహచరిణి సావిత్రి బాయి ఫూలేకు స్వయంగా 'ఉపాధ్యాయ శిక్షణను' ఇచ్చారు. ఆమె విద్యా బోధనలో మెళకువలను, నైపుణ్యాలను భర్త వద్ద నేర్చుకుని, బోధనలో అనుభవాన్ని సంపాదించింది. సమాజంలో వివక్ష, అంటరాని తనం, మూఢాచారాలను అంతమొందించేందుకు బహుజన మహిళలను విద్యావంతులను చేయాలనే ఆశయంతో 1848, మే 15వ తేదీన పూనేలోని బుధవారపు పేటలో 9 మంది బాలికలతో ప్రత్యేక పాఠశాలను ఫూలే దంపతులు ప్రారంభించారు. 

ఈ పాఠశాలలో విద్యా బోధనకు ఉపాధ్యాయురాలుగా సావిత్రి బాయి ఫూలేను ఆయన నియమించారు. 'ఇల్లాలి చదువు - ఇంటికి వెలుగు', 'చదువు నేర్చిన పడచు - అన్నింటా ముందునడచు' అనే నినాదాలతో బహుజన బాలలకు విద్యపట్ల ఆసక్తిని, ఆవశ్యకతను నూరిపోసింది ఫూలే. అనతి కాలంలోనే 30 మంది బడిఈడు పిల్లలను బడిలో చేర్పించి విద్యా బుద్ధులు నేర్పించారు. 'స్త్రీలు వంటింటి కుందేళ్ళు' కాదని చాటి చెప్పి, 1851-52 విద్యా సంవత్సరంలో పూనే పరిసర ప్రాంతాలలో 18 ప్రాథమిక పాఠశాలలను స్థాపించి, వందలాది బహుజన బాలలను అక్షరాస్యులను చేసిన విద్యా ప్రదాత ఫూలే. నాటి సమాజంలో బ్రాహ్మణాధిపత్య పురోహితులు చేసే వడ్డీ వ్యాపారాలకు వ్యతిరేకంగా బహుజనులను చైతన్య వంతులను చేసిన సంఘ సంస్కర్త ఫూలే. 

ఆమె పాఠశాలకు వెళ్ళే సమయంలో 'మను'వాదులు బురద, పేడ నీళ్ళతో దాడి చేస్తే, తిరిగి ఇంటికి రాకుండా అక్షరాస్యత ఫలాలు బలహీన వర్గాల బాలలకు అందించాలనే లక్ష్యంతో ఒక జత దుస్తులను అదనంగా పాఠశాలకు తీసుకెళ్ళి అక్కడే దుస్తులు మార్చుకుని అకుంఠిత దీక్షతో విద్యాబోధన చేసింది ఫూలే. పాఠశాల సమీపంలో హిందూ మతోన్మాదులు ఫూలేను దూషిస్తూ, అవమానిస్తూ ఆటంకాలు కలిగించేవారు. ఫూలే ఏ మాత్రం అధైర్య పడకుండా ఆత్మ స్థైర్యంతో బహుజన బాలల్లో అక్షరాస్యత, నైతిక విలువలు పెంపొందించారు. హిందూ సమాజంలోని పెద్దలు మహాత్మా జ్యోతి బా ఫూలే వద్దకు వెళ్ళి మీ కొడుకు-కోడళ్ళు హిందూ సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ సమాజానికి అపచారం, అవమానం కలిగిస్తున్నారని, వారి చర్యలను నివారించాలని ఆయన వద్ద పంచాయితీ పెట్టినప్పుడు ఫూలే దంపతులు బ్రాహ్మణ వాదులకు ఓర్పు, సహనంతో సమాధానం చెప్పేవారు. 

సావిత్రి బాయి ఫూలే సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా బహుజనులను చైతన్యులను చేసేందుకు 1848లో 'కావ్యఫూలే' అనే కవితను, 1849లో 'భావన కృషి' కావ్య సంగ్రహ గ్రం థాన్ని, 1850లో 'విద్య' పేరుతో శీర్షికలను రచించారు. తన రచనల ద్వారా అజ్ఞానం, మూఢనమ్మకాలు, దురాచారాలపై బహుజనులను జాగృతం చేసారు ఫూలే. 'సత్యశోధక సమాజాన్ని' స్థాపించి దాని ద్వారా బాల్య వివాహాలు, సతీ సహగమనం, భ్రూణ హత్యలు, వ్యభిచార వృత్తి వంటి అమానవీయ సంఘటనలను వ్యతిరేకిస్తూ మహిళలను సమీకరించి పోరాటాన్ని నిర్వహించారు ఫూలే. 

సమాజంలోని అసత్య, కుల వివక్ష, సాంఘిక బహిష్కరణల నివారణకు కులాంతర, మతాంతర వివాహాలు జరిపిననాడే కుల నిర్మూలన జరిగి, సమ సమాజం ఏర్పడుతుందని ఉద్భోదించిన బహుజన మహిళా దార్శనికురాలు సావిత్రి బాయి ఫూలే. సమాజంలోని బలహీన వర్గాల మహిళలకు సామాజిక న్యాయ పోరాటాలు నేర్పి వారిని బానిసత్వం, వెట్టి చాకిరీ నుంచి విముక్తి చేసేందుకు అవిరళ కృషి చేసిన ఆదర్శ మహిళ ఫూలే. 

వైద్య విద్య నేర్పించి సమాజానికి వైద్య సేవలందించే విధంగా అతన్ని తీర్చిదిద్దటం ఆమె 'ఆదర్శ వ్యక్తిత్వానికి' నిలువెత్తు నిదర్శనం. సమాజంలోని కుల, మత, వర్ణ వివక్షలకు వ్యతిరేకంగా మానవ హక్కుల ఉద్యమాలు నడిపిన సంఘ శ్రేయోభిలాషి ఫూలే. బహుజనులను బానిసత్వం నుంచి విముక్తి చేసేందుకు సమావేశాలు నిర్వహించి 'జ్ఞాన బోధ' చేసిన బహుజనుల శ్రేయోభిలాషి ఫూలే. 

మనువాదల దుష్టచర్యలకు అణు మాత్రమైనా భయపడక నిత్యం ఫూలేకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆయనకు మనోధైర్యాన్ని నూరిపోసిన ఆదర్శ సతీమణి సావిత్రి బాయి ఫూలే. సామాజిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ఫూలే చేస్తున్న ఉద్యమాలను స్ఫూర్తిగా తీసుకుని సుగుణాబాయి, ఫాతిమా అనే సహోపాధ్యాయినులు ఉద్యమాల వైపు ఆకర్షింపబడి ఆమె వెంట సంఘ సంస్కరణోద్యమాలకు కదం తొక్కేటట్లు చేసిన బహుజన మహిళోద్యమ పతాక ఫూలే. యశ్వంత్, సుగుణాబాయి, ఫాతిమాలను ఉద్యమాలవైపు స్వతంత్రంగా నడిపించి సమాజంలో వేళ్ళూనుకున్న మూఢాచారాలు, అసమానతలు, దౌర్జన్యాలను దనుమాడిన వీరవనిత ఫూలే. సమాజంలోని శూద్ర, శోషిత వర్గాల ప్రజలకు సామాజిక న్యాయ ఉద్యమాలు నేర్పిన గొప్ప ఆదర్శ మహిళ హక్కుల ఉద్యమాలు నిర్వహించే విధం గా బహుజన స్త్రీలకు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను కల్పించిన 'స్త్రీ విము క్తి' ప్రదాత ఫూలే. 'స్త్రీలు అబలలు కాదు సబలలు' అని ఆనాడే ఎలుగెత్తి చాటి వారికి పురుషులతో పాటు సమానహక్కులు, హోదా, గౌర వం కోసం జీవితాంతంపోరాడిన ఉద్యమకారిణి సావిత్రి బాయి ఫూలే. 

19వ శతాబ్దంలో 'స్త్రీ విముక్తి' ఉద్యమాల ద్వారా వితంతు వివాహాలను జరిపించిన ఆదర్శ మహిళ ఫూలే. 14 సంవత్సరాలలోపు బడిఈడు పిల్లలను గుర్తించి వారికి చదవటం, రాయటం, చేయటం వంటి కృత్యాలను నేర్పి వారిలో జ్ఞాన జ్యోతులను వెలిగించిన గొప్ప సంఘసేవకురాలు ఫూలే. స్త్రీలకు 'మహిళా మండళ్ళను' స్థాపించి, భర్త చనిపోయిన మహిళలను ఓదార్చేందుకు ఆశ్రయం కల్పించిన మహిళా పక్షపాతి ఫూలే. పేద గర్భిణీ స్త్రీలకు సహాయపడేందుకు 'ప్రసూతి వైద్యశాలల'ను ఏర్పాటుచేసి, స్వయంగా మంత్రసాని చర్యలు చేశారు సావిత్రి బాయి ఫూలే. 'సామాజిక పరివర్తన' కోసం మురికి కూపంలాంటి నాటి సమాజాన్ని సంస్కరించి, పట్టుదలతో, నిబద్ధతతో 'సామాజిక విప్లవోద్యమాలను' నిర్వహించి, బహుజనుల్లో చైతన్య జ్వాలను రగిల్చిన ఆదర్శ మహిళ ఫూలే. 

పూనేలో కరువు విలయ తాండవం చేసినప్పుడు పునరావాస, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి ఉచిత వసతి, ఉపాధి అవకాశాలను కల్పించిన మానవతావాది ఫూలే. 1897లో పూనేలో ప్లేగు వ్యాధి సోకినప్పుడు వారికి సకల పరిచర్యలను చేసిన దేవతామూర్తి. ఫూలే సేవలను, సంఘ సంస్కరణోద్యమాలను జీర్ణించుకోలేని హిందూ ఛాందసవాదులు ఆమెను సాంఘిక బహిష్కరణకు గురిచేశారు. 'ప్లేగు వ్యాధి' గ్రస్తులకు సేవచేస్తూ, ప్లేగు వ్యాధి సోకి 1897, మార్చి 10వ తేదీన ఫూలే కన్నుమూశారు. నేటి మహిళలు సావిత్రి బాయి ఫూలేను ఆదర్శంగా తీసుకుని, సమాజంలో వివక్ష, అసమానతలు, పురుషాధిక్యతకు వ్యతిరేకంగాపోరాడి 'మహి ళా సాధికారతను' సాధించడమే సావిత్రి బాయికి నిజమైన నివాళి. 

- బట్టు వెంకయ్య
రాష్ట్ర కార్యదర్శి, బహుజన టీచర్స్ అసోసియేషన్
(నేడు ప్రపంచ మహిళా దినోత్సవం, మార్చి 10న సావిత్రి బాయి వర్ధంతి
Andhra Jyothi News Paper Dated 08/03/2012 

No comments:

Post a Comment