Wednesday, March 14, 2012

బహుజనవాద విజయం - చందవోలు శోభారాణి



నిచ్చెనమెట్లలా వుండే మన కులవ్యవస్థను, సమాంతరంగా నిలబెట్టాలని కలలుగన్న మాన్యులు కాన్షీరాం. దానికి ఒకే ఒక మార్గం రాజ్యాధికారంలో అన్ని కులాల వారికి సమాన భాగస్వామ్యం. కులం పేరుతో ఊరికి దూరంగా నెట్టివేయబడిన కులాలు, కుల పోరాటాలు మాత్రమే కాదు - కుల రాజకీయ పోరాటాలు చేయాలని తెగేసి చెప్పిన యదార్థవాది కాన్షీరాం. 

భారతదేశ రాజకీయాలను ఒకకొత్త మలుపు తిప్పిన 'ఎక్స్‌ప్లోజివ్ పొలిటీషియన్' 'కాన్షీరాం' అని దివంగత ప్రధాని వి.పి.సింగ్ అన్న మాటలు, కార్యరూపంలో ఈ రోజు మన కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్న దిగంబర సత్యం. భారతదేశాన్ని కేవలం 3 లేదా 4 కులాలు మాత్రమే పరిపాలించినప్పుడు, అవి కుల రాజకీయాలు అని ఎవరూ అనలేదు. ఆ నలుగురికే కాదు అందరికీ రాజ్యాధికారాన్ని కులాల వారీగా పంచాలి అని కాన్షీరాం అన్నప్పుడు అందరూ (అగ్రకులాల వారు) ఆయన కులాలను రెచ్చగొడుతున్నారన్నారు. కాన్షీరాం వెనుకబడిన కులాలను చైతన్యపరచడాన్ని - కులాలను రెచ్చగొడుతున్నట్లు అభివర్ణించిన శక్తులన్నింటినీ మట్టికరిపించారు. బహుజనుల్లో ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవం వారి నరనరాన జొప్పించారు. 
ప్రపంచంలో పేద, ధనిక అనే రెండు వర్గాలు ప్రధానంగా వుంటాయి. పేదలు అణచివేతకు గురౌతుంటారు. అగ్రకులం - అణచివేయబడిన కులం అనే భేదం మనదేశంలో మినహా ప్రపంచంలో ఎక్కడా లేదు. కేవలం ఈ కులవివక్షే, అన్ని వనరులు పుష్కలంగా వున్న భారతదేశాన్ని అన్నందొరికితే చాలు అనే దయనీయ స్థితికి దిగజార్చింది. అందుకే కాన్షీరాం తెగేసి చెప్పారు. భారతదేశంలో కులం వల్ల నష్టపోయిన వాళ్ళు కుల రాజకీయ పోరాటాలు చేయాలన్నాడు. తద్వారా రాజ్యాధికారంలో భాగస్వామ్యం తీసుకోమన్నాడు. 

తమ జాతుల్ని సామాజికంగా, ఆర్థికంగా, ఆత్మగౌరవంగా బ్రతకడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన రాజ్యాధికారమనే 'మాస్టర్ కీ'ని లాక్కోమన్నారు. మనువాదం నుంచి బయటపడి హేతువాదులుగా మారి బహుజనవాదాన్ని గెలిపించమన్నారు. సులువైన భాషలో అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ఉదాహరణకి... భారతదేశంలో ఒక అగ్రకుల పేదవాడు - ఒక తక్కువ కుల ధనికుడితో కలిసి జీవించడు, తినడు, తాగడు, వివాహమాడడు, సమంగా చూడడు. ఇంకా చెప్పాలంటే అంటుకోడు. ఇవి కాన్షీరాం మాటలు. ఇవి చాలవా? దీనికి విరుగుడు బహుజనులు రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోవడం మాత్రమే అన్న ఆ ధీరుడు ఏ ఆయుధం పట్టలేదు. కనీసం గన్‌మాన్‌లను కూడా వెంటపెట్టుకొని తిరగలేదు. 
తాను పిలుపునిచ్చిన బహుజన వాదానికి కాన్షీరాం వాడిన ఆయుధాలు, అక్షరాలు, మాటలు మాత్రమే. 'ఓట్లు మావైతే సీట్లు మీవా?' 'ఇకపై చెల్లదు', 'మన లక్ష్యం భారతదేశాన్ని బహుజనులు పరిపాలించడం' లాంటివి. కూలి పనికి వెళ్తేగాని కడుపు నిండని బహుజనులకు రాజ్యాధికారం ఎలా సాధ్యం అని నవ్వారు. అందుకే 'బహుజన సమాజ్ పార్టీ' ఆవిర్భవించింది. కాన్షీరాం చాలా సులువుగా తన అభ్యర్థులను గెలిపించారు. దానికి ఆయన వాడిన అక్షర ఆయుధం 'బి.యస్.పి అభ్యర్థులకు' 'ఒక ఓటుతో పాటు ఒక రూపాయినోటు' కూడా యివ్వండి అని అభ్యర్థించాడు. ఆశ్చర్యం - కాంగ్రెస్ కంచుకోట అయిన యు.పి.లో బి.యస్.పి నీలిరంగు బహుజన బావుటా ఎగురవేసింది. 

అంతే బహుజన, అగ్రభాగ జన కుల రాజకీయ పోరాటాలు ఊపందుకున్నాయి. ఆ క్రమంలో ఎన్నో బి.సి. రాజకీయ పార్టీలు బహుజన వాదంతో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, రాజకీయ పార్టీలు బహుజన, ప్రజాసంఘాలు, బహుజన యూనియన్లు, బహుజన విప్లవ సంఘాలు, బహుజన నాయకత్వాన కులనిర్మూలనా సంఘాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి మర్రిచెట్టులా ఊడలతో బిగుసుకుంటున్నాయి. బహుజనులు వారి స్వంత బ్యానర్ల మీద నిలబడడం మొదలు పెట్టారు. దానికి బహుజన సమాజ్ పార్టీ అనే పేరే పెట్టనవసరం లేదు. బహుజన వాదులుగా మారి మనువాదాన్ని మట్టి కరిపిస్తున్నారా? లేదా? అనేది ముఖ్యం. 
దీనికి సమాధానం ఔను. పర్యవసానంగా వి.పి.సింగ్ లాంటి మానవతావాది, ఎన్.టి.రామారావు లాంటి ఉదాత్తవాది, దేవగౌడ లాంటి బి.సి. రాజకీయ ఉద్దండులు దేశ ప్రధానుల వరసలో పరుగులు తీశారు. కె.ఆర్.నారాయణన్ లాంటి ప్రజాస్వామ్యవాదులు రాష్ట్రపతులయ్యారు. వందలాది బహుజన నాయకత్వాలు దేశవ్యాప్తంగా పుట్టుకొచ్చాయి. ఫూలే, సాహు మహరాజ్, పెరియార్, నారాయణగురు, కబీర్ లాంటి పేర్లు వెలుగులోకి తీసుకురావటమే కాకుండా, వారిలా హేతుబద్ధంగా ఆలోచించి, వారు చేసిన సామాజిక పోరాటాలను రాజకీయ పోరాటాలుగా తీర్చిదిద్దారు. ఇక మాయావతి విషయాన్ని క్లుప్తంగా చూద్దాం. కాన్షీరాం శిష్యురాలిగా జీవితం ప్రారంభించి, ఉత్తరప్రదేశ్‌లో మాత్రమే కాక దేశవ్యాప్తంగా పర్యటనలు చేశారు. 

ఆమెను కూడా తన మాదిరిగానే ఒక 'విస్ఫోటన రాజకీయ నాయకురాలి'గా మలిచాడు కాన్షీరాం. ఆయన శిష్యరికంలో మాయావతి బహుజనులకు రాజ్యాధికార వాతావరణాన్ని ఉత్తరప్రదేశ్‌లో వ్యవస్థీకరించింది. ఉత్తరప్రదేశ్ ఆకారమే మార్చింది. మనుషులందరూ సమానంగా చూడబడాలనే సంకల్పంతో అందరినీ కలుపుకొని తన సామ్రాజ్యాన్ని సర్వజన సమాజంగా మార్చింది. 
అందులో భాగంగా పేదలుగా ఉన్న అగ్రకులాల వారికి సీట్లిచ్చి గెలిపించింది. అందరిచేత 'శహబాష్' అనిపించుకుంది. విమర్శచేసిన వారు లేకపోలేదు. కానీ ఆమె వ్యూహాత్మకంగా రాజకీయాలు నడిపింది కాబట్టే 4 సార్లు యు.పి.లో తను తిరుగులేని నాయకురాలై కాన్షీరాంని ఒక బహుజన ఫిలాసఫర్‌గా ప్రపంచానికి తెలియజేసింది. ప్రజాస్వామ్యంలో గెలుపు, ఓటములు సహజం. మాయావతి సీట్ల రూపంలో నిన్న జరిగిన ఎన్నికల్లో ఓడిపోవచ్చు. కానీ నైతికంగా, చైతన్యపరంగా, ఆమె అనుక్షణం గెలుస్తూ వచ్చి కాన్షీరాం అందించిన నీలిబావుటాని ఎర్రకోటపై ఎగురవేయడానికి దగ్గరగా జరిగింది. 
మాయావతి ఓటమి - ములాయం విజయం వారిద్దరి వ్యక్తిగత గెలుపు ఓటములు. కానీ ఖచ్చితంగా అది కాన్షీరాం అందించిన బహుజనవాద విజయం. అందుకే ప్రథమ స్థానంలో గతంలో వున్న కాంగ్రెస్ అంతమయ్యే దిశగా ఉత్తరప్రదేశ్‌లో ప్రయాణం కుంటుతూ సాగుతోంది. యు.పి.లో గత ఎన్నికల విజయం బహుజనవాద విజయంగా బహుజనులు ఇప్పుడు గుర్తించకపోతే మళ్ళీ మన శత్రువులు పంజా విప్పుతారు. అందుకే మాయావతి ఓడిపోయినా, ములాయం సింగ్ గెలుపుని బహుజనుల గెలుపుగానే యావత్ భారతదేశం గుర్తిస్తుంది. 
తాత్కాలికంగా మాయావతి, ములాయంల ఓటమి చేతులు మారుతున్నా, వారి ఉమ్మడి శత్రువులైన కాంగ్రెస్, బి.జె.పి.లను ఓడిస్తున్నారు. మళ్ళీ కాన్షీరాం గురించి. బాబాసాహెబ్ అంబేద్కర్ సాగించిన ధీరోదాత్త సామాజిక న్యాయపోరాటాన్ని ఆయన వారసుడిగా కాన్షీరాం మరింత ముందుకు తీసుకెళ్ళాడు. సామాజిక, రాజకీయ పోరాటాలను, చైతన్య ఉద్యమాలను సమాంతరంగా సాగించి భారతదేశ రాజకీయ చిత్రపటాన్ని తల్లక్రిందులుగా చేసి 'అమ్మో కాన్షీరాం వస్తున్నాడు'... అని అందరూ భయపడేలా చేసుకున్నాడు. శత్రుపక్షాలన్నీ కాన్షీని ఓడించడానికి నడుంకట్టాయి. ఆయన చేసిన అవిశ్రాంత పోరాటంలో ఎక్కడో గుండె చిక్కపట్టింది. ఆలోచనతో మెదడులో నరాలు తెగిపోయేది కూడా గమనించలేదు. 

బ్రెయిన్‌స్ట్రోక్‌తో 2006 అక్టోబర్ 9న ఆయన చనిపోయి బహుజనవాదానికి కొత్త పుట్టుకనిచ్చారు. కొత్తపుంతలు తొక్కించాడు. కాన్షీ పోరాట ఫలితంగా రాష్ట్ర మంత్రుల నుంచి, ప్రధాన మంత్రి, రాష్ట్రపతులు, స్పీకర్లు, బహుజనం నుంచి వందలాది మంది క్యూ కడుతున్నారు. ఇది నగ్నచరిత్ర. దీన్ని కాదన్నవాడు ద్రోహి లేదా బహుజన విద్రోహి. చివరి ప్రశ్నగా ఆయన్ని 'మీరు ఎలా బ్రతికి చనిపోవాలనుకుంటున్నారు' అన్నదానికి ఆయన సమాధానం ఇలా. 'నేను చనిపోయే నాటికి నాపేరు మీద ఒక్క రూపాయి కూడా నా సొంతంగా ఉండకూడదు' అని అవినీతి రాజకీయ నాయకులు చెంపచెళ్లు మనిపించాడు. భారతదేశ రాజకీయాల్లో అవినీతి రహిత రాజకీయ నాయకుల్లో ఒకే ఒక్కడు మాన్యశ్రీ దాదాసాహెబ్ కాన్షీరాం. కాన్షీరాం లాంటి ఎక్స్‌ప్లోజివ్ పొలిటీషియన్స్ మన బహుజన జాతుల నుంచి ఎందరో పుట్టాలి. 
త్యాగపూరిత జీవితాలు జీవించాలి. మన పిల్లల భవిష్యత్తులు ఫూలే బాటలు కావాలి. అలాంటి త్యాగధనుల మార్గంలో నడిచేవారిని చట్టసభల్లోకి నడిపిద్దాం. బహుజన వాదాన్ని గెలిపిద్దాం. సామాజిక న్యాయాన్ని, అవినీతి రహిత సమాజాన్ని, సర్వజన సమ సమాజాన్ని, బుద్ధం, ధమ్మం, సంఘం శరణం గచ్చామి అనేది జాతీయ గీతంగా మార్చే సమాజాన్ని నిర్మిద్దాం. కాన్షీరాంకి భారతరత్న బిరుదు అడగడం ఆయన్ని అవమానించడమే. దాన్ని దాటి ఆయనను ప్రపంచ రాజకీయ మేధావిగా ప్రపంచ పత్రికలు ఇప్పటికే గుర్తించడం మనం గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకొని తీరాలి. అందుకే 'మన పెదవులు మాట్లాడొద్దు. మన చేతలు మాట్లాడాలి' అని అన్న కాన్షీరామ్ మాటల్ని ఆచరణలో పెడదాం. 

- చందవోలు శోభారాణి
ప్రజారాజ్యం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేశారు
(నేడు కాన్షీరాం జయంతి)
Andhra Jyothi News Paper Dated : 15/03/2012 

No comments:

Post a Comment