Wednesday, April 11, 2012

అల్లుకున్న ‘కోటి’ జ్ఞాపకాలు---మల్లోజుల వేణుగోపాల్



కిషన్‌జీ జ్ఞాపకాలు 2011 నవంబర్ 24 నుంచి ఇప్పటివరకూ నిరంతరం నాస్మృతిపథంలో మెదులుతూనే ఉన్నాయి. 54 సంవత్సరాల నా జీవితం ఆయన నుంచి ఒక్కక్షణం కూడా విడదీయ రానంతగా అల్లుకుపోయి ంది. గాఢమైన ఆత్మీయ అనుబంధంతో నిండిపోయింది. ‘రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం మిన్న’ అని నమ్మిన మా మధ్య సంబంధం, వర్గ రాజకీయాలకు లోబడి సాగిన నెత్తుటి బంధంతో నిండిన విప్లవ బంధం. కిషన్‌జీ అమరత్వం విన్న తర్వాత మాపార్టీ నాయకులు ‘జిఎస్’, ‘రాంజీ నీకు సోదరుడే కాదు, అంతకంటే ఎక్కువగా గురువు. సహచరుడు నాయకుడు. ఈ నష్టం వ్యక్తిగతంగా కంటే పార్టీకి విప్లవానికి తీరనిదని నీవు దుఃఖిస్తున్నావు కదూ. నీకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను’ అంటూ రాశారు. మా పార్టీ మరో నాయకులు మధ్య రీజియన్ కార్యదర్శి ఆనంద్ ‘వారిది రక్త సంబంధమేగాక, కామ్రేడ్స్ ఆన్ ఆర్మ్స్‌లాగా ఉద్యమంలో పనిచేశారు. రాజకీయ మిత్రుత్వాన్ని కోల్పోవడంతో ఆయనకు తీవ్ర మనస్థాపం కలుగుతుంది. ఈ సమయంలో నేను దగ్గరగా లేకపోవడాన్ని దురదృష్టంగా భావిస్తున్నాను’ అంటూ రాశారు. 

నిజంగా కిషన్‌జీ నా తోడబుట్టిన వాడు కావడం నాకు ఎంతో గర్వంగా ఉంది. ఆయన నాకు నాయకుడు కావడం నా జీవితానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఆయన నన్ను విప్లవోద్యమంలోకి తీసుకురావడానికి, నిలబెట్టడానికి చేసిన కృషి, అందించిన తోడ్పాటు ఏతోటి కామ్రేడ్‌కూ ఇచ్చిన దానికన్నా తక్కువ కాదు. నేను విప్లవోద్యమంలో ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. నా సన్నిహిత సహచరుడు రాజు తనకు రాం జీదా రాసిన మాటలను ఉల్లేఖిస్తూ నాకు ఒక లేఖ రాశారు. ‘లాల్‌గఢ్ ప్రజల ప్రేమ, ఆత్మీయత, అభిమానా న్నీ ఎన్నటికీ మరువలేను. సర్వస్వాన్ని ఒడ్డి వాళ్లు చేసిన గొప్ప పోరాటంలో ఉండి వాళ్ల రుణం తీర్చుకుంటాను అంటూ రాంజీ నాకు రాసిన మాటను నిలబెట్టుకున్నాడు. ఇక మనం ఆయనకు నిజమైన వారసులుగా ఆయన బాటలో నడుద్దాం’ అంటూ రాజు హృదయాంతరాళంలో నుంచి ఉబికి వస్తున్న దుఃఖాన్ని మాటల్లో మలచి రాశాడు. ‘నీవు రాసిందానికే అందరం కట్టుబడి ఉందామని ప్రజాయుద్ధ సైనికులుగా మృత్యుమేఘాలను చీల్చుకుంటూ అమరుల ఆశయాల వెలుతుర్లలో పురోగమిద్దామనీ, రాంజీ స్వప్నం దండకారణ్యాన్ని బీహార్-జార్ఖండ్‌లను విము క్తి ప్రాంతాలుగా మలిచి భారతదేశ రాజకీయ చిత్రపటంపై ఎర్రరంగు పులుముదాం’ అంటూ రాజుకు బదులిచ్చాను. 

బాల్యం నాటి కోటన్న జ్ఞాపకాలు నాలో చాలా బలంగా ముద్రపడిపోయాయి. ఇంట్లో ముగ్గురం అన్నదమ్ములం అయినా నాకు కోటన్నతోనే అనుబంధం ఎక్కువ. అన్నదమ్ములుగా పావురం ఎక్కువగా పంచుకున్నది ఆయనతోనే. చిన్న పిల్లలుగా ఆడుకున్నది, కలెబడ్డది ఆయనతోనే. నాకు చదువు చెప్పడానికి ముఖ్యంగా గణితం చెప్పడానికి చాలా శ్రద్ధ చూపేవాడు. ఎన్నిసార్లు ఆయన చేతిలో దెబ్బలు తిన్నానో! కానీ దగ్గరికి తీసుకొని గుండెకద్దుకొని తలనిమిరి ప్రేమను పంచుకోవడంతో దూదిపింజల్లా ఆ బాధ మర్చిపోయి నవ్వుతూ పరుగెత్తడం నాకు ఇంకా గుర్తే. ఇంటి వెనుక పెరట్లో కాయకూరల చెట్లకు ఉదయం సాయంత్రం నీళ్లు పోయడం, ఇంట్లో పొయ్యిలోకి కర్రలు కొట్టివ్వడం.. ఆయన చేస్తుంటే నేనూ, అమ్మా అందరం తోడుండేది. ఈ అనుభవం మధ్య తరగతి కుటుంబాల పిల్లల్లో చాలా సాధారణమైందే. కానీ మేం పెరుగుతున్న కొద్దీ మా మధ్య రాజకీయ వాతావరణంలో స్నేహం, చర్చలూ పెరగసాగాయి. ఆయన చెప్పిన విప్లవ కార్యక్షికమాల్లో నేను నిమగ్నం కావడం పెరిగింది. 

మా బాపుకూ ఆయనకూ మధ్య రాజకీయ చర్చలు ఎక్కువగా జరిగేవి. ఆంధ్రమహాసభ, రజాకార్లు (నిజాం సైన్యాలు) కమ్యూనిస్టుల గురించి వాళ్ల మధ్య జరిగే చర్చ, నిజాయితీ కలిగిన కాంగ్రెస్, కమ్యూనిస్టుపార్టీల నాయకులు ఇంట్లో బాపుతో జరిపే చర్చలు చాలా ఆసక్తికరంగా ఉండేవి. అవి ఆయనలో హేతువాద దృక్పథాన్ని, ప్రగతిశీల భావాలనూ పెంచాయి. ఖాకీ నిక్కర్ వేసుకొని , కర్ర పట్టుకొని, కాషాయ జెండా వారి శాఖ కార్యక్షికమాలకు వెళ్లిన ఆయనలో ఒక వైపు ఇంట్లో చర్చలు, మరోవైపు 1960ల కల్లోల దశాబ్దం (హంగ్రీ సిక్ట్సీస్) మౌలిక మార్పులకు పునాదులు వేసింది.

1969లో యువత ప్రత్యేక తెలంగాణ నినాదంతో వీధుల్లోకి వచ్చింది. ఆ సమయంలోనే ‘వసంత కాల మేఘ ఘర్జన’ మనదేశాన్ని ఒక కుదుపు కుదిపింది. మనదేశంలో ఊడలు దిగి ఉన్న రివిజనిజపు నడ్డీని విరిచింది. దోపిడీ పాలకవర్గాలకు అది చేర్చిన సామాజిక విప్లవ సందేశాలు వారిలో వణుకును పుట్టించాయి. ఒక వైపూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, మరో వైపు దేశవ్యాప్తంగా నక్సల్బరీ రాజకీయ విప్లవోద్యమం ఎక్కడికక్కడే యువతను విపరీతంగా ఆకర్షించాయి. రెండూ తీవ్ర అసమానతల ఫలితంగానే తలెత్తాయి. మొదటిది-వూపాంతాల మధ్య దోపిడీతో తలెత్తిన అసమానతల ఫలితం కాగా, మరోటి- వర్గాల మధ్య కొనసాగుతున్న ఆర్థిక,రాజకీయ దోపిడీ అసమానతల మూలంగా అనివార్యమైంది. ప్రాంతాల మధ్య అసమానతలు ప్రాంతాల విభజనతో పరిసమాప్తి అయ్యేది ఎంత మాత్రం కాదనీ, భారతదేశమే అసమానాభివృద్ధి కలిగిఉన్న దేశమనీ నక్సల్బరీ విప్లవోద్యమం సుస్పష్టం చేసింది.

అయినప్పటికీ ప్రాంతాల మధ్య అసమానతలు ఏనాటికానాటికి తీవ్రమవుతుండడంతో ముందుకొచ్చిన విభజనోద్యమాలను ప్రజల ఆకాంక్షల నేపథ్యంలో మార్క్సిస్టు అవగాహనతో నిర్దందంగా తొలిసారిగా సమర్థించిన విప్లవ పార్టీ భారత కమ్యూనిస్టుపార్టీ (మార్క్సిస్టు- లెనినిస్టు)యే. ఆ విభజనోద్యమాలను అంతిమంగా ప్రజాస్వామ్య విప్లవోద్యమాలతో అనుసంధానించాలని కూడా ఆ పార్టీ చెప్పుతూ తనశక్తి మేరకు అది అందులో పాల్గొన్నది. కోటేశ్వర్లు చాలా క్రియాశీలంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. కొద్ది రోజులు జైళ్లోనూ గడిపివచ్చారు. కానీ ఆ ఉద్యమాన్ని దొరల నాయకత్వం (మర్రి చెన్నాడ్డి నాయకత్వం వహించిన తెలంగాణ ప్రజాసమితి) నీరు గార్చింది. తెలంగాణ మరోసారి మోసపోయింది. 1946-51 మధ్య వీరోచితంగా సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మూడువేల గ్రామాలను విముక్తి చేసి, పదిలక్షల ఎకరాల దొరల భూములను పేద రైతాంగానికి పంపకం చేసి చివరకు నాయకత్వ ద్రోహానికి బలైంది. ఆ పోరాటంలో దాదాపు నాలుగువేల మంది రైతులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. వారంతా తమ రక్తంతో ఎర్రజెండాకు వన్నె తెచ్చారు.

తెలంగాణ సందేశాన్ని దేశ విదేశాలకు చాటారు. సరిగ్గా అదేకాలంలో దీర్ఘకాల ప్రజాయుద్ధ పంథాలో ప్రాంతాల వారిగా రాజ్యాధికార స్వాధీన వ్యూహంతో సాగిన చైనా విప్లవోద్యమం విజయం సాధించగా తెలంగాణ విమోచనోద్యమం మాత్రం ద్రోహానికి బలైంది. మళ్లీ అదే రీతిలో 20 ఏళ్ల తర్వాత 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రోద్యమం దొరల ద్రోహానికి బలైంది. నిజమైన కార్మికవర్గ విప్లవపార్టీ నాయకత్వం లేకుండా జాతుల విముక్తి పోరాటాలు సైతం విజయం సాధించలేవని టర్కీ కెమెల్‌పాషా తర్వాత ప్రపంచ పరిణామాల నేపథ్యంలో మార్క్సిజం చాలా ముందుగానే తేటతెల్లం చేసింది. ప్రపంచ పెట్టుబడితో పోరాడకుండా జాతులకు విముక్తి లభించదంటూ చాటి చెప్పింది. అందుకే వర్గయుద్ధాలు, జాతి ఉద్యమాలు అవి ఏవైనా నిజమైన విప్లవ కార్మికవర్గ పార్టీలు లేకుండా తమ లక్ష్యాలను సాధించలేవనీ తెలిసి వచ్చిన కోటన్న, ‘కోటి రత్నాల వీణ’ తెలంగాణను దాటి ‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి’! ‘పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప’ అన్న చారివూతక సత్యంతో మమేకమైనాడు. నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాట వారసత్వ జెండాను ఎత్తిపట్టాడు. అప్పటికీ ఆయన ఉన్నత విద్య కోసం పుట్టి పెరిగిన పెద్దపల్లి వదిలి జిల్లా ముఖ్య పట్టణం కరీంనగర్ చేరాడు. 

పై చదువులకు కరీంనగర్ వెళ్లిన కోటన్న అక్కడ ఉన్నత విద్యతోపాటు విప్లవ రాజకీయాల పోరాటాక్షరాలు దిద్దుకోసాగాడు. నాకు తెలిసినంత వరకు ఆయనకు మొదటి రాజకీయ మిత్రుడు ప్రెస్ విజయకుమార్ అనుకుంటాను. ఆయన సాన్నిహిత్యంతో కరీంనగర్ రాజేశ్వరి కళాశాలలో కోటన్నకు విప్లవ రాజకీయలబ్బుతున్న యువకులతో పరిచయమైంది. చదువులోనూ చురుకైనవాడు కావడం, విప్లవ రాజకీయాలతో మమేకం అవుతుండడంతో సహజంగానే తోటి యువకులలో మంచి గుర్తింపు వచ్చింది. 1990 దశకంలో మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో న్యాయవాద వృత్తి కొనసాగిస్తూ విప్లవ రాజకీయాలకు దూరంకాలేక, శత్రువు నిర్బంధానికి తట్టుకోలేక కుటుంబ ఒత్తిళ్ల మధ్య చందుపట్ల కృష్ణాడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. మన కోటన్న రాజకీయాల్లో చేరాక అత్యంత సన్నిహితుడైనవాడు ఈయనే. 1973లో కోటన్న, కృష్ణాడ్డి కలిసి భారత స్వాతంత్య్ర దిన బూటకాన్ని ఎండగడుతూ నిరసనగా మూడు రంగుల జెండాకు నిప్పుపెట్టారం ఆనా డు యువకుల్లో నిజమైన స్వాతంత్య్ర సముపార్జన కోసం రగిలిన ఆగ్రహ పరితాపాలను అర్థం చేసుకోగలిగిన వాళ్లు కోటన్న రాంజీగా, కిషన్‌జీగా ఎదగడాన్ని సవ్యంగానే అర్థంచేసుకోగలుగుతారు.

ఆయన మిత్ర బృందంలోని వాళ్లు విద్యాభ్యాసం తర్వాత జీవిక అన్వేషణలో రాజీపడి ఎక్కడో చోట స్థిరపడినప్పటికీ ఆయన పట్ల సదభివూపాయంతోనే ఉన్నారనడానికి ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నవాళ్లు మాట్లాడింది సరిపోతుంది. కథా రచయితలలో పేరున్న కాలువమల్లయ్య కోటన్నకు చాలా కాలం రూమ్‌మేట్. 

ఎర్ర రాజకీయాల ప్రభావం కోటన్నలో అధికం అవుతున్న కొద్దీ జిల్లాలోని పాత కమ్యూనిస్టులతో ఆయనకు అనుబంధం పెరిగింది. పెద్దపల్లిలో తమ వాడకట్టుకే ఉండే ఆంథ్రోపాలజిస్టు డాక్టర్ రాజారాం సింగ్(అమర భారతిగా ప్రసిద్ధి)తో చాలా సాన్నిహిత్యం ఏర్పడింది. డాంగే మొదలు మావో రచనల వరకు ఆయన లైబ్రరీలో దొరికేవి. సింగ్‌గారు పోలీసు బాధిత రైతుల, పార్టీకార్యకర్తల కేసులను సుల్తానాబాద్, కరీంనగర్ కోర్టుల్లో వాదించేవారు. ఆయన దగ్గర జూనియర్స్‌గా చేరిన గుణవంత్‌సింగ్, రాంరెడ్డి లాంటి యువ లాయర్లు కూడా కోటన్నతో పరిచయమున్నవాళ్లే. జిల్లాలోని చాలామంది న్యాయవాదులతో ఆయనకు చాల మంచి పరిచయం ఉండేదనడానికి ఆయన మృతిపట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ బూటకపు ఎన్‌కౌంటర్‌ను ఖండిస్తూ విధులను బహిష్కరించడం కన్నా నిదర్శనం ఏం కావాలి. నాలుగేళ్ల క్రితం సింగ్‌గారి మరణవార్త విని కోటన్న నాకు రాసిన ఉత్తరంలో వాళ్లమధ్య ఉన్న సాన్నిహిత్యం కన్నా, ఒక మార్క్సిస్టు ఆంథ్రోపాలజిస్టుగా ఆయన చేసిన కృషి, విప్లవమేధావిగా జిల్లా రైతాంగ ఉద్యమానికి ఆయన అందించిన సేవలను ఎక్కువ గా కొనియాడారు. 

ఆ ఉత్తరం చదువుతున్నంత సేపూ నాలో పెద్దపల్లి, శివాలయం వీధి, సింగ్‌గారు, ఆయన కుటుంబం మెదిలాయి. అలాగే అమరుడు నల్లా ఆదిడ్డి కేసులో ఆదిలాబాద్‌కు కోర్టు పని మీద వచ్చి అక్కడి తన వకీలు మిత్రులకు నా యువ మిత్రుడు అంటూ సింగ్‌గారు నన్ను పరిచయం చేసిన జ్ఞాపకం తళుక్కున మెరిసింది. సిరిసిల్లాలో అమృతలాల్ శుక్లా, వేములవాడలో గుమ్మి పుల్లయ్య, పెద్దపల్లిలో గట్టెపల్లి మురళి లాంటి పాత కమ్యూనిస్టులందరితో ఆయన నెరపిన సంబంధాలు జిల్లాలో విప్లవోద్యమ పునాదులు బలపడడానికి తోడ్పడ్డాయి. కరీంనగర్‌లో విద్యనభ్యసిస్తున్న కాలంలోనే కోటన్నకు వరంగల్ నుంచి సాహితీ మిత్రులు వెలువరించే సృజన పత్రికతో అనుబంధం పెరిగింది. ఆ క్రమంలోనే కరీంనగర్‌లో విప్లవ సాహిత్య ప్రచురణకు ‘విద్యుల్లత’ పత్రిక శ్రీకారం చుట్టిందనుకోవచ్చు. నేను పెద్దపల్లి కాలేజీలో చదువుకునే రోజుల్లో (1973-74లో) కోటన్న మా కాలేజీకి వచ్చి సృజన పత్రిక చందాలు కట్టించడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. అప్పుడు వీవీ (వరవరరావు)సార్ సిక్రింవూదాబాద్ కుట్ర కేసులో నిర్బంధంలో ఉంటే(పి.డి ఆక్ట్ అనుకుంటా) హేమక్క సంపాదకత్వంలో సృజన పత్రిక వెలువడుతుందని ఎంతో ఉత్సాహంగా చెప్పిన విషయం మా కాలేజీ ప్రిన్సిపాల్ పరమ రియాక్షనరీ రాజ్‌మహ్మద్‌కూ, ఇంగ్లిషు లెక్చరర్ కాషాయ రాజకీయాలోచనాపరుడు నర్సయ్యకు గిట్టలేదు. వాళ్లు అవాకులు చెవాకులతో పత్రిక నిర్వహణపై ఆరోపణలు చేస్తే కోటన్న నాయకత్వంలో విద్యార్థులందరం ఆందోళనకు దిగాం. అప్పటికే ఆయనకు విద్యార్థులతో బలమైన సంబంధాలు ఏర్పడివున్నాయి.

రాష్ట్ర విప్లవ రాజకీయాలలో ‘విరసం’ ఏర్పాటు తర్వాత ప్రారంభమైన విప్లవ ప్రజాసంఘాల నిర్మాణ ప్రక్రియలో కోటన్న జిల్లాలో చురుకైన నాయకత్వ పాత్ర పోషించాడు. జిల్లాలో విప్లవ విద్యార్థి సంఘ నిర్మాణానికి తొలి రోజుల్లో పెద్దపల్లి, మంథని, జమ్మికుంట క్రియాశీల కేంద్రాలుగా నిలిచాయి. ఐటీఐలలో రాడికల్ విద్యార్థిసంఘం నిర్మాణానికి పెద్దపల్లి ఐటిఐలోనే పునాదులు పడ్డాయనే విషయాన్ని గుర్తుపెట్టుకున్నవాళ్లకు దాని వెనుక కోటన్న కృషి ప్రధానమని విడిగా చెప్పాల్సిన పనేలేదు. 197 ‘జగిత్యాల జైత్రయాత్ర’ నాటికే జిల్లాలో పేరున్న ప్రజానాయకులలో ఒకరైన అమరుడు సాయిని ప్రభాకర్ ఆ ఐటిఐ ద్వారానే విప్లవ రాజకీయాలోకి వచ్చాడు. కోటన్ననే ఆయనకు మొదటి రాజకీయ గురువు. 
ఎమ్జన్సీ చీకటి రోజుల్లో రహస్య జీవితం గడిపిన జిల్లా విప్లవకారులలో కోటన్న ఒకరు. ఎమ్జన్సీ రోజుల్లో పెద్దపల్లి పవర్‌హౌజ్ పక్క ఉన్న దర్గా (పెద్దమామిడి తోట),దర్గా దరిదాపుల్లో ఉన్న దగ్గు రాయలింగం వాళ్ల ఇళ్లు, రాఘవపురం చాలా కాలం షల్టర్ ఇచ్చాయి.

ఆ రోజుల్లో పవర్‌హౌజ్‌లో ఉద్యోగం చేస్తున్న నిజాం వెంక బాల్‌లింగాడ్డిలతో కోటన్నకు మంచి స్నేహం ఉంది. ఎలాంటి పరిచయాలనైనా, సంబంధాలనైనా రాజకీయ పరిచయాలుగా, సంబంధాలుగా మలచుకోవడం కోటన్న ప్రత్యేకత. ఏ ఇంటికి వెళ్లినా, ఎక్కడ షెల్టర్ తీసుకున్నా ఆ ఇంటి పిల్లలకు ప్రియమైన మామయ్యగానో, బాబాయ్‌గానో, మహిళలతో ప్రేమను పంచుకునే అన్నగానో, తమ్ముడిగానో, కొడుకుగానో వ్యవహరిస్తూ సొంతఇల్లు లాగానే, అంతా తన వాళ్లుగానే వ్యవహరించడం ఆయనలోని విప్లవ మానవీయ సంబంధాలను ఎత్తిపడుతుంది. ఆయన అమరత్వం తర్వాత ఒక సీనియర్ కామ్రేడ్ నాకు రాసిన ఉత్తరంలో- ‘నేను దాదా (అన్న)తో లాల్‌గఢ్‌లో తిరిగినపుడు ఏ వూరికి వెళ్ళినా చిన్నారి పిల్లలంతా పోటీపడుతూ ఆయన చేయిపట్టుకుని విడవకుండా నడుస్తూ ఊరి ముచ్చట్లు ఆయనతో పంచుకుంటుంటే వీధి మహిళలు తమ ఇంట్లో అడుగుపెట్టి వెళ్ళమంటూ ఆయనను ఆహ్వానించిన దృశ్యాలు నేను మరువలేకపోతున్నాను’ అంటూ ఆ ప్రజా నాయకునికి ప్రజలతో అల్లుకపోయిన అనుబంధాన్ని వ్యక్తం చేశాడు. ప్రజలతో అంతటి సంబంధాలు పంచుకోలేని వాళ్లు విప్లవోద్యమంలో రహస్య జీవితాన్ని గడుపలేరు. ఆ జనజీవన స్రవంతికి దూరమైన వాళ్లు ఏనాటికైనా ఖాకీల మురికి కూపంలో కలువాల్సిందే. 

-మల్లోజుల వేణుగోపాల్ 
(కిషన్‌జీ తమ్ముడు, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు) 
( మిగతా.. రే
Namasete Telangana News Paper Dated : 12/4/2012

No comments:

Post a Comment