Saturday, December 20, 2014

మనం మరిచిన ‘మూల’ యోధుడు (శ్యాం సుందర్‌) - ఎ.ఎన్‌. నాగేశ్వర రావు

మనం మరిచిన ‘మూల’ యోధుడు - ఎ.ఎన్‌. నాగేశ్వర రావు

శ్యాం సుందర్‌ లాంటి అనితర సాధ్యమైన విప్లవ కారులు, మేధావులు చాలా అరుదు. సమాజం ఆయన్ని సరైన రీతిలో అర్థం చేసుకోకపోవడమే కాకుండా, వారి జీవితకాలంలో సరయిన గుర్తింపునూ ఇవ్వకపోవడం దురదృష్టకరం. దేశంలో వర్గం, కులం అని విడదీయబడిన శక్తులు నేడు చావోరేవో తేల్చుకొనే పరిస్థితి ఏర్పడింది. సమైక్యతకు గండిపడి, అగ్ర కులాల చేతుల్లో అధికారం కేంద్రీకరించబడిన స్థితిలో దళితులు, మైనారిటీలు, వెనకబడిన కులాలు తమ స్థైర్యాన్ని కోల్పోతున్నాయి. సనాతన సిద్ధాంతాలూ వివిధ రూపాలలో విజృంభిస్తున్నాయి. ఇలాంటి సంక్షుభిత స్థితిలో శ్యాం సుందర్‌ లాంటి వారి ఆలోచనలు, రచనల అవసరం ఉంది.
బలవంతులదే చరిత్ర. అగ్రవర్ణాలదే ఈ దేశ చరిత్ర. జ్ఞాతుల చరిత్ర తప్ప అజ్ఞాతుల చరిత్ర మనకు అక్కర్లేదు. చరిత్ర చీకటి గుయ్యారంలో ఎందరో అగుపడకుండా చిదిమేసిన చరిత్ర మనక్కావాలి. అలాంటి కోవలోనే మూల భారతీయ ఉద్యమ పితామహుఢు బత్తుల శ్యామసుందర్‌ చరిత్ర కూడా నిర్లక్ష్యానికి గురయింది. ఆయన రచనలు మరుగునపడ్డాయి. అలనాటి హైదరాబాదు సంస్థానంలోని ఔరంగాబాదులో 1908 డిసెంబరు 21న బత్తుల శ్యాంసుందర్‌ ఒక పేద దళిత కుటుంబంలో పుట్టారు. ఉస్మానియా విశ్వవిద్యాలయలంలో ఆర్థిక , రాజనీతి, న్యాయశాసా్త్రల్లో ఉన్నత విద్య అభ్యసించారు.
1930-34 సంవత్సరాల మధ్యలో నిమ్న జాతి యువతరాన్ని సమైక్యపరచి ‘యంగ్‌ మెన్స్‌ అసోసియషన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’ను స్థాపించారు. తద్వారా హైదరాబాద్‌ రాష్ట్రంలో దళితుల విద్య, ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యల గురించి పోరాటం సాగించారు. స్వదేశీ లీగ్‌ సభ్యునిగా, హైదరాబాద్‌ లైబ్రరీ సొసైటీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశాలకు బాబాసాహెబ్‌ అంబేద్కర్‌కు మద్దతుగా యూత్‌ లీగ్‌ ఆఫ్‌ అంబేద్కరైట్స్‌ స్థాపించారు. పి.ఆర్‌. వెంకటస్వామి, భాగ్యరెడ్డి వర్మ లాంటి సహచరులతో హైదరాబాద్‌లో దళితులకు ఎన్నో విద్యా వసతి సౌకర్యాల కోసం ఉద్యమించారు. నిజాం నవాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ, అతి సామాన్యమైన జీవితాన్ని గడిపారు. దళిత మైనారిటీ వెనకబడిన వర్గాల విముక్తి కోసం జాతీయ స్థాయిలో ఎన్నెన్నో సంఘాలను స్థాపించారు. సభలు, సమావేశాలు ఏర్పరచి నాటి జాతీయ ప్రాంతీయ నాయకులతో సన్నిహిత రాజకీయ సంబంధాలు కొనసాగించారు. 1946లో నిజాం ప్రభుత్వం నుంచి శాంతి సామాజిక సేవలకుగాను ఖుసురూ-ఎ-డక్కన్‌ అవార్డు, బంగారు పతకం అందుకున్నారు. గ్రాడ్యుయేట్‌ నియోజక వర్గం నుంచి హైదరాబాద్‌ శాసనసభకు, ఉస్మానియా సెనేట్‌ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. నిజాం రాష్ట్రంలో దళిత కులాల ప్రజా ప్రతినిధులను ఆ ప్రజలే ఎన్నుకునేందుకు వీలుగా ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ 24 వేల గ్రామాల నుంచి 50 వేల మందితో బ్రహ్మాండమైన ప్రదర్శన నిర్వహించారు. 1948లో హైదరాబాద్‌ రాష్ట్ర శాసనసభకు డిప్యూటీ స్పీకర్‌గా ఎంపికయ్యారు. దళితుల విద్యా వసతి సౌకర్యాల అభ్యున్నతి కోసం నిజాం నవాబును ఒప్పించి, హైదరాబాద్‌ శాసనసభచే ఆమోదింప చేసి, ఒక కోటి రూపాయల ఫండ్‌ను ఏర్పాటు చేయడంలో శ్యాంసుందర్‌ కీలక పాత్ర నిర్వహించారు. ఆనాటి కాలంలోనే ప్రత్యేక తెలంగాణ కోరుతూ... హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలని ప్రధాన మంత్రికి బహిరంగ లేఖ రాయడం చరిత్ర.
మరాట్వాడాలోని మిళింద్‌ కాలేజీ, విద్యా సంస్థల నిర్మాణానికి డాక్టర్‌ అంబేద్కర్‌ అభ్యర్థన మేరకు నిజాం నుంచి 12 లక్షల రూపాయలను విరాళంగా ఇప్పించారు. హైదరాబాద్‌ స్టేట్‌ ఇండియాలో విలీనం తర్వాత, ఆ 12 లక్షల రూపాయలను తిరిగి చెల్లించాలని అంబేద్కర్‌ మీద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోర్టులో కేసు పెట్టింది. ఆ కేసును న్యాయస్థానంలో సవాల్‌ చేసి శ్యాంసుందర్‌ వాదించి గెలిచారు. న్యాయస్థానంలో ఆయన వాదనా పటిమకు, ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి ఈ వ్యాజ్యం ఒక మచ్చు తునక. దేశవ్యాప్తంగా నిమ్న వర్గాల విద్యావసతుల కోసం డాక్టర్‌ అంబేద్కర్‌ ఏర్పాటు చేసిన పీపుల్స్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీకి ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యనిగా శ్యాం సుందర్‌ ఎంపికయ్యారు. తద్వారా దేశ వ్యాప్తంగా దళితులకు విద్యార్జన కోసం విద్యాలయాల ఏర్పాటులో తన వంతు సాయాన్ని కొనసాగించారు. కేవలం క ట్టుబట్టలతో, అద్దె గదిలో అత్తెసరి వసతులతో శ్యాంసుందర్‌ జీవితాన్ని అతి సామాన్యంగా గడిపారు. నిజాం నవాబు సన్నిహిత మిత్రడై ఉండి కూడా, ఎ ందరో సన్నిహితులు అత్యున్నత పదవుల్లో ఉండినా తన కోసం ఇసుమంతైనా వారిని ఉపయోగించుకోని అభిజాత్యం ఆయనది. ఒక సామాన్య బ్రహ్మచారి, మద్యపాన వ్యతిరేకి, కచ్చితమైన నియమాలతో, సూటిదనం, మచ్చలేని వ్యక్తిగా పేరుబడ్డ శ్యాంసుందర్‌ నిరాడంబరంగా ఉన్నతమైన జీవితాన్ని గడిపారు. ఉర్దూ, మరాఠీ, ఆంగ్లం, హిందీ, కన్నడ భాషలలో పండితులు. లక్షలాది మందిని సమ్మోహితులని చేసే ప్రసంగ శక్తి ఆయనది.
ఐక్యరాజ్య సమితికి హైదరాబాద్‌ రాష్ట్రం నుంచి 90 లక్షల మంది దళితుల ప్రతినిధిగా హాజరయి, వారి సమస్యల గురించి ప్రపంచ స్థాయి ప్రతినిధుల ముందు శ్యాంసుందర సవివరంగా ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని ప్రపంచ పత్రికలన్నీ పతాక స్థాయిలో ప్రచురించాయి. ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచి డైలీ ‘లీ మాండె’ మొదటి పేజీలో హోచిమెన్‌, శ్యాంసుందర్‌ ఫ్రెంచి ప్రధాని కలిసి ఉన్న ఫోటో, సంప్రదింపుల వివరాలు ప్రచురించిందని చెబుతారు. ప్రపంచ నాయకులతో వివిధ దేశాలలో వారి అతిథిగా శ్యాంసుందర్‌ గడిపారని, వారందరితో స్నేహ సంబంధాలు ఉండేవని తెలుస్తోంది. చౌ ఎన్‌ లై మన దేశాన్ని తొలిసారి సందర్శించినపుడు, ఆయన ప్రధాని నెహ్రూతో, హైదరాబాద్‌లో శ్యాంసుందర్‌ అనే మిత్రుణ్ణి కలవాల్సి ఉందని తె లిపారట.
హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో శ్యాం సుందర్‌ను ఢిల్లీ రప్పించారట. ప్రపంచ స్థాయి మేధావులు హెరాల్డు, జెలాస్కీ, జీన్‌ పాల్‌ సారె్త్ర వంటి వారితో శ్యాంసుందర్‌కు సన్నిహిత సంబంధాలు ఉండేవి. వీటన్నింటి వివరాలు తెలియాంటే ఆనాటి సమకాలీన పత్రికలు, ప్రాంతాలు, ఆధారాలు దొరకబుచ్చుకోవాలి. ఇదంతా సులభ సాధ్యం కాదు. ప్రభుత్వపరంగా ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి చేయాల్సిన బాధ్యత ఇది.
ఈ దేశంలో వాస్తవమైన దళిత ఉద్యమం ఏదయినా ఉందంటే అది శ్యాం సుందర్‌ 1948లో ప్రారంభించిన భీం సేన. సుశిక్షితులైన మిలిటెంట్‌ అంకిత భావం కలిగిన దళిత యువతను ఇందులో సమ్మిళితం చేసి, వారి ఆచరణ ద్వారా విప్లవకర భావజాలంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర ప్రాంతాలలో తమ ప్రభావాన్ని కొనసాగిస్తూ అంబేద్కర్‌కు వెన్నుదన్నుగా నిలిచారు. వాస్తవానికి భీంసేన కొనసాగించిన కార్యక్రమాలు మహారాష్ట్రలోని దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమానికి మాతృకగా పనిచేసింది. తద్వారా యావద్భారతదేశ దళిత ఉద్యమానికి భీం సేన ఉద్యమం వేగుచుక్కగా పనిచేసింది.
వాస్తవాల మీద, న్యాయం పునాదుల మీద నిలబడి పీడిత వర్గాల పక్షాన పోరాడే ఆత్మరక్షణ దళంగా భీం సేనను శ్యాంసుదర్‌ తయారు చేశారు. భీం సేనకు ప్రణాళిక-నియమ నిబంధనలు తయారు చేసి వాటిని దళిత యువతరంలో విస్తృతంగా ప్రచారం చేసి సైనికులను తయారు చేశాడు. తరతరాలుగా సైనిక జాతిగా ఉండిన దళిత జాతితో మాజీ సైనికులతో భీంసేన సభ్యులకు తర్ఫీదునిప్పించారు. తనే స్వయంగా రాజకీయ సిద్ధాంతాల గురించి ప్రసంగాలు చేసేవారు. అంబేద్కర్‌ రచనలు విస్తృతంగా భీం సేన ప్రచారంలోకి తెచ్చింది. తమను తాము మూల భారతీయులుగా ఆయన ప్రకటించారు. తన మహత్తర రచన ‘మూల భారతీయులు‘లో దళితుల గురించి చెబుతూ ‘అనాగరికులైన ఆర్యుల రాకకు ముందు ఈ దేశాన్ని పాలించిన పాలకులం మేము. మేం మూల భారతీయులం ఎన్నటికీ హిందువులం కాము. సరికదా భారత దేశంలో హిందూ రాజ్యం ఏర్పడడానికి ఏ రకంగానూ సహకరించం.
అంతేకాదు హిందూ రాజ్యాన్ని ధ్వంసం చేయడానికి ఏ అవకాశమొచ్చినా విడిచి పెట్టం’ అని అంటారు శ్యాం సుందర్‌. డాక్టర్‌ అంబేద్కర్‌ ప్రసిద్ధ రచన ‘కుల నిర్మూలన’లో ప్రతిపాదించిన సిద్ధాంతాలను శ్యాం సుందర్‌ మరింత విస్తృతపరచి ఎన్నో చారిత్రాత్మక గ్రంథాలను రచించడం జరిగింది. కర్ణాటకలో భీం సేన హిందూ కులోన్మాదుల ఆగడాలను అడ్డుకుంది. దళిత కులాల యువత తల పై కెత్తుకొని నడిచే ఆత్మస్థైర్యాన్నిచ్చింది. దళితులు చైతన్యవంతులవడంతో భూస్వామ్యవర్గాలయిన లింగాయత్‌, గౌడ వర్గాలు దళితుల పట్ల అత్యాచారాలు చేసేందుకు జంకారు.
దళిత-ముస్లిం ఐక్య సంఘటన అనేది దేశంలోనే ఒక వినూత్నమైన అత్యవసర విముక్తి సిద్ధాంతంగా, శ్యాంసుందర్‌ మేధోశక్తికి ప్రతీకగా నిలిచింది. సమాజపు అట్టడుగు చీకటి కోణం నుంచి ఎంతో శ్రద్ధాసక్తులతో పరిశోధించడం మూలంగా, ఈ రెండు జాతులు అణచివేతకు గురయి, నేడు ఒకే రకమైన సామాజిక అసమానతలకు లోనయ్యారని శ్యాంసుందర్‌ ఆధారాలతో నిరూపించడం జరిగింది. దేశ చరిత్రలో నిరంతరం పీడింపబడ్డ ఈ రెండు జాతులు ఐక్యమై ఒక బలీయమైన శక్తిగా ఎదిగి, సామాజిక ఆర్థిక విప్లవాన్ని వేగవంతం చేసి భారత దేశ నిజమైన విప్లవాన్ని విజయవంతం చేయాలనేది శ్యాం సుందర్‌ కోరిక. దళిత సమస్యకు పరిష్కారం కనుక్కొనే మార్గంలో భాగంగా ముస్లింలను మిత్ర సహిత బంధంగానూ, హిందూ అగ్రకులాలను శత్రుపూరితంగానూ సిద్ధాంతీకరించాడు. దానితో సనాతన హిందువులు శ్యాంసుందర్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు.
హైదరాబాద్‌ విలీనం అనంతరం ఆయన మీద కేసులు పెట్టి అరెస్టు చేసి శారీరకంగానూ, మానసికంగానూ హింసకు గురిచేశారు. ఏటికి ఎదురీదడం, సమాజ రుగ్మతల మీద పోరాడడం విప్లవకారుల కర్తవ్యం. ఆ బాధ్యతను శ్యాం సుందర్‌ సమర్ధంగా నిర్వర్తించారు. హిందూ కులవాదులు ఆయన మీద బనాయించిన కుట్ర కేసుకు ఆయన సమాధానంగా ‘సజీవ దహనం’ అనే గ్రంథాన్ని రచించారు. అందులో దళితులు హిందువులు కారనే చారిత్రక వాస్తవాన్ని సజీవ సాక్ష్యాలతో భారత న్యాయస్థానానికి, తద్వారా యావద్భారత ప్రజానీకానికి బహిరంగంగా వెల్లడి ంచారు.
శ్యాం సుందర్‌ అభిప్రాయం ప్రకారం పీడిత జాతులకు, దళిత వర్గాలకు మతం ఎలాంటి పరిష్కారాన్ని చూపలేదు. చూపదు. కనుక మత వ్యవస్థ అనేది తిరోగమన మార్గం. కేవలం మతం మార్చుకున్నంత మాత్రాన దళితులకు సంబంధించిన సామాజిక, ఆర్థిక రాజకీయ సమస్యలు తీరుతాయని ఆయన భావించలేదు. మూల భారతీయులైన దళితులకు మతమనేది లేదు. కేవలం ముస్లింలను, క్రిస్టియన్లను ఎదుర్కోవడం కోసం సంఖ్యాబలం కోసం దళితులను హిందువులుగా సనాతన హిందువులు కోరుతున్నారు. ఇది రాజకీయంగా హిందువులకు అవసరం. హిందూ మహాసభ దేశంలో కుల నిర్మూలనా సంఘాలు స్థాపించడం వెనుక అసలు ఉద్దేశం ఇదే. వీరి తొలి కార్యక్రమం దళితులకు హిందువులమనే స్పృహ కలిగించడం. తర్వాత దేవాలయ ప్రవేశం లాంటి పై పై పూతలు, వీటివల్ల దళితుల ఆర్థిక సామాజిక రాజకీయ వివక్ష, తరతరాల వెనుకబాటుతనం పోతాయా? శ్యాం సుందర్‌ హేతుబద్ధమైన తీవ్ర వాదనల ద్వారా, రచనల ద్వారా గొప్ప చర్చను లేవదీశారు. కానీ ఆయన రచనలన్నీ నేడు చార్వాకులు రచనల్లా చీకటిలో చిదిమి వేయబడ్డాయి. వాటిని దొరకబుచ్చుకునే ప్రయత్నం మన తరమన్నా చేయగలిగితే, ఒక మేధావి అంతరంగాన్ని, దేశ సమస్యలపై ఆయన వైఖరిని, వివిధ రకాల మార్గాంతరాలను మనం తెలుసుకోగలం. తద్వారా ఆయన ఉద్యమించిన చరిత్ర బహిర్గతపరచగలుగుతాం.
కర్ణాటక విధానసభలో సభ్యునిగా శ్యాం సుందర్‌ కానసాగినంత కాలం పీడితుల పక్షాన చిచ్చర పిడుగులా పోరాడారు. కర్ణాటక శాసనసభలో నిమ్న వర్గాలకు విద్యా భూసంస్కరణలకు సంబంధించి విస్తృతంగా చర్చించినట్లు ఆయన సమకాలికులు ఇప్పటికీ చెబుతుంటారు. కర్నాటక రాషా్ట్రనికి భూ సంస్కరణల మార్గదర్శిగా శ్యాం సుందర్‌ని పేర్కొంటారు. ఆయన శాసనసభలో చేసిన కీలకమైన ఉపన్యాసాలను కన్నడంలో ముదించడం జరిగింది. కర్ణాటకలో ఆయన స్థాపించిన భీం సేన బలవత్తరమైన విముక్తి సేనగా రూపుదిద్దుకుంది. శ్యాం సుందర్‌ నేతృత్వంలో మెరికల్లాంటి దళిత యువకులు వేలాది మంది సుశిక్షితులుగా మారిన చరిత్ర ఉంది. శ్యాంసుందర్‌ మహారాష్ట్రలో పర్యటిస్తున్నప్పుడు బొం బాయిలోని ఒక దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, భీంసేనను కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే 10వేల మంది సభ్యులు ఉన్నట్లు, సభ్యులంతా నెలకు పదిపైసలు చెల్లిస్తారనీ, మొత్తం దేశవ్యాప్తంగా రెండు లక్షల మంది సభ్యులుంటారని తెలిపారు. మాజీ సైనికులతో స్వయం రక్షణకు సంబంధించి సైనిక శిక్షణను భీం సేన సభ్యులకు అందజేశారు. భీం సేనకు తన సొంత రాజ్యాంగం, జెండా, అజెండా ఉన్నా యి. నిమ్న వర్గాల మీద, దళితుల మీద ఎక్కడ అకృత్యాలు, అత్యా చారాలు జరిగినా భీం సేనకు సమాచారం తెలిసిన వెంటనే అక్కడి ప్రజలకు సహకారంగా రంగంలోకి దిగేది. ఈ సంస్థ కాన్షీరాం తర్వాత కాలంలో స్థాపించిన బాంసెఫ్‌కు మాతృకగా అనిపిస్తుంది
శ్యాం సుందర్‌కు దేశవ్యాప్తంగా రాజకీయ రంగంలో మిత్రులుండేవారు. ఆయన బెంగుళూరులో బస చేసినపుడు వి.వి.గిరి, దేవరాజ్‌ అర్స్‌, ఉమా శంకర్‌ దీక్షిత్‌ లాంటి వాళ్ళు ఎక్కువగా కలిసేవాళ్లు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ధరంసింగ్‌, ఎస్‌.యం.కృష్ణ లాంటి వాళ్ళు మల్లిఖార్జున్‌ ఖర్గె, మొయిలీ లాంటి వాళ్ళు ఆయనకు శాసనసభలో యువ సహచరులు. ఎందరో యువ శాసనసభ్యులు శ్యాం సుందర్‌ ఉపన్యాసాలను, ఆయనతో సాహచర్యాన్ని అభిలషించేవారు. ఆయన గంటల తరబడి దళితుల వెనుకబడిన వర్గాల, మైనారిటీల సమస్యల గురించి చర్చిస్తున్నపుడు వారు ఉత్తేజంతో ఆయన అనుయాయులుగా ఉండేవారని చెబుతారు. హిందీ, ఆంగ్ల, ఉర్దూ, కన్నడ, తెలుగు భాషల్లో ఆయన రచనలు వెలువడ్డాయి. ‘భూ దేవతోంకా మేనిఫెస్టో’, ‘దే బర్న్‌’, భీం సేన అవర్‌ పాస్ట్‌ అండ్‌ ప్రజెంట్‌’ ముఖ్యమైన రచనలు అనేకం ఉన్నాయి.
శ్యాం సుందర్‌ లాంటి అనితర సాధ్యమైన విప్లవ కారులు, మేధావులు అరుదు. సమాజం వారిని సరైన రీతిలో అర్థం చేసుకోకపోవడమే కాకుండా, వారి జీవితకాలంలో సరయిన గుర్తింపును కూడా ఇవ్వకపోవడం దురదృష్టకరం. దేశంలో వర్గం, కులం అని విడదీయబడిన శక్తులు చావోరేవో తేల్చుకొనే పరిస్థితి ఏర్పడింది. సమైక్యతకు గండిపడి, అగ్ర కులాల చేతుల్లో అధికారం కేంద్రీకరించబడిన స్థితిలో దళితులు, మైనారిటీలు, వెనకబడిన కులాలు తమ స్థైర్యాన్ని కోల్పోతున్నాయి. నేడు సనాతన సిద్ధాంతాలు వివిధ రూపాలలో విజృంభిస్తున్నాయి. ఇలాంటి సంక్షుభిత స్థితిలో శ్యాం సుందర్‌ లాంటి వారి ఆలోచనలు, రచనల అవసరం ఉంది.
- ఎ.ఎన్‌. నాగేశ్వర రావు
(నేడు బత్తుల శ్యాంసుందర్‌ జయంతి)
Andhra Jyothi Telugu News Paper Dated: 21/12/2014 

Saturday, December 6, 2014

కుల, వర్గ రహిత సమాజమే అంబేద్కర్‌ అభిమతం By జి. రాములు


            డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ భారతదేశం గర్వించదగ్గ సామాజిక విప్లవకారులలో అగ్రగ ణ్యుడు. గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశ రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, సాహిత్య రంగాలలో అంబేద్కర్‌ ప్రభావం అనన్యసామాన్య మైంది. తరతరాలుగా కులపీడనకు గురై, సమాజం నుంచి వెలివేయబడిన బానిసత్వం కంటే హీనంగా చూడబడుతున్న అస్పృశ్య అణగారిన ప్రజలకు ఆయన ఆరాధ్యదైవంగా నిలిచిపోయాడంటే ఆయన గురించి లోతుగా అధ్యయనం చేయాల్సిందెంతో ఉంది. అంబేద్కర్‌ దళితునిగా జీవించడమే కాదు అంటరాని తనం, కుల వివక్షలకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడాడు. తాను స్వయంగా పేదరికాన్ని అనుభవిం చాడు. భూస్వామ్య విధానం దుష్టస్వభావాన్ని గ్రహించాడు. దానికి వ్యతిరేకంగా పోరాడాడు. సమ సమాజం కావాలన్నాడు. 'బోధించు, సమీకరించు, పోరాడు' అన్న అంబేద్కర్‌ నినాదం ఎంతో ప్రఖ్యాతి గాంచింది. ఆయన తన అభిప్రాయాలను నిర్భయం గా బోధించాడు. వాటి అమలుకై సమీకరించాడు. లక్ష్య సాధనకై నిరంతరం పోరాడాడు. చాలా మంది అంబేద్కర్‌ రచనలను అధ్యయనం చేయకుండానే కేవలం కుల సమస్య గురించే ఆయన అధ్యయనం చేశాడని, అంటరాని వాడు కాబట్టి అంటరానితనానికి వ్యతిరేకంగా కృషి చేశాడని, దళితుల రిజర్వేషన్లకై కృషి చేశాడనే చులకన భావన కలిగి ఉన్నారు. కానీ ఆయనకు దేశ ఆర్థిక విధానం, ప్రభుత్వ స్వభావం, ఉత్పత్తి సాధనాలు, కార్మికోద్యమం, భూస్వామ్య విధానం, స్త్రీ సమస్యలు, ఫాసిజం, దేశ సమగ్రత, కుల వ్యవస్థ, దాని అమానుషత్వం పట్ల స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. ఆయన అభిప్రాయాలతో ఏకీభవించొచ్చు లేదా విభేదించొచ్చు. కానీ ఆయన వాటన్నింటినీ అధ్యయనం చేసింది, తనదైన రీతిలో భాష్యం చెప్పింది సుస్పష్టం. అంబేద్కర్‌ చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలనే పరిశీలిద్దాం. ఉత్పత్తి గుర్తించాలన్నాడు. ప్రజలందరికీ భూమిపై సమాన హక్కులుండాలన్నాడు. కులమతాలకతీతంగా భూములను కౌలుకివ్వాలన్నాడు. గ్రామాల్లో భూస్వామిగాని, కౌలుదారుగాని, వ్యవసాయ కూలీలు గాని ఉండరాదన్నాడు. అందరూ సమానమే అన్నాడు. అందరూ ఉత్పత్తిలో భాగం కావాలన్నాడు. ప్రభుత్వమే నీరు, పని చేసే పశువులు, పరికరాలు, ఎరువులు, విత్తనాలు అందజేయాలన్నాడు. అందు కయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలన్నాడు. భూస్వామ్య విధానం సమాజ పురోగతికి ఆటంకమ న్నాడు. చెప్పడమే కాదు భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాడాడు. ఆనాటి మహారాష్ట్రలోని 'కొంకణ' ప్రాంతంలో భూమి మీద హక్కులు 'ఖోటీ'లనబడే భూస్వామ్య వర్గ చేతుల్లో ఉండేవి. వారు రైతులపై శిస్తు రూపాన అధికంగా డబ్బు వసూలు చేసేవారు. అదే విధంగా పండించిన పంటలో కూడా దౌర్జన్యంగా భాగం తీసుకునేవారు. ఇది కొన్ని దశాబ్దాలపాటు కొనసాగింది. ఈ 'ఖోటీ' పద్ధతికి వ్యతిరేకంగా అంబేద్కర్‌ రైతు ఉద్యమాన్ని నడిపాడు. అటు ఉద్యమాన్ని నిర్మిస్తూనే మహారాష్ట్ర శాసనసభలో తానే 'ఖోటీ' నిర్మూలన కొరకు 1937లో బిల్లు ప్రవేశపెట్టాడు. అది చివరకు 1949లో చట్ట రూపం ధరించే వరకూ పోరాడాడు. అదే విధంగా 'దేశ సౌభాగ్యం దేశ పారిశ్రామికీకరణ మీద ఆధారపడి ఉంది. జాతీయ యాజమాన్యంలో అది జరగాలేకాని ప్రయివేటు వ్యక్తుల పరంగా కాదు' అంటూ ప్రైవేటీకరణను అంబేద్కర్‌ ఖండించాడు.
               దేశంలో ప్రస్తుతమున్న కుల, వర్గ పీడనకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి కార్మికవర్గమే నాయకత్వం వహించాలన్నాడు. 'దేశానికి నాయక త్వం అవసరం. అయితే ఆ నాయకత్వాన్ని వారు వహిస్తారా అన్నది ప్రశ్న. దేశానికి అవసరమైన అలాంటి నాయకత్వాన్ని శ్రామికవర్గం మాత్రమే సమకూర్చగలదని చెప్పడానికి నేను సాహసిస్తు న్నాను' అని 1942 డిసెంబర్‌లో 'శ్రామికవర్గం- ఆదర్శవాదం' అనే విషయంపై మాట్లాడుతూ స్పష్టం చేశారు. కార్మికవర్గ సమస్యలు ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. కార్మికవర్గ భవిష్యత్తుకు సాంఘిక న్యాయం, సాంఘిక భద్రత పునాదులు కావాలని, పటిష్టమైన కార్మిక చట్టాలు దోహదపడుతాయని భావించాడు. అందుకు ముఖ్య చట్టాలైన కనీస వేతనాల చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, కార్మిక సంఘాల గుర్తింపు చట్టాల కొరకు కార్మికుల ప్రతినిధిగా ప్రభుత్వ కమిటీలలోనూ, లాయర్‌గా కోర్టులోనూ, చట్టసభల్లో సభ్యునిగానూ అవిరళ కృషిచేశాడు.
            డాక్టర్‌ అంబేద్కర్‌కు ఫాసిజం ప్రమాదం పట్ల స్పష్టమైన అభిప్రాయం ఉంది. అది మానవాళి మనుగడకు ముప్పని గ్రహించాడు. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో ఆయన 1942లో ఆకాశవాణిలో చేసిన ప్రసంగం గమనిస్తే 'ఈనాడు జరుగుతున్న రెండవ ప్రపంచ యుద్ధం కేవలం ప్రపంచాల విభజన కోసం మాత్రమే కాదు. నియంతృత్వం మీద విజయం సాధించి స్వేచ్ఛా సమానత్వాలు నెలకొల్పడానికి మన కార్మికులు తమ సంపూర్ణ మద్దతివ్వాలి. సాధించబోయే విజయం నూతన, సామాజిక వ్యవస్థకు దోహద పడాలి. స్వాతంత్య్రం సాధించినంత మాత్రాన సరిపోదు స్వాతంత్య్ర ఫలితాలు మనం నిర్మించుకోబోయే సమతా సమాజం మీద ఆధారపడి ఉండాలి' అంటూ ఫాసిజానికి వ్యతిరేక పోరాటంలో కార్మికవర్గ ప్రయోజనాలు ఎలా ఉపయోగించుకోవాలో కూడా సూచించాడు. డాక్టర్‌ అంబేద్కర్‌ దేశ సమగ్రత కాపాడాలని కోరాడు. కులాలు, మతాలు, జాతులు, అనేక సంస్కృతులున్న ఈ దేశంలో ఐక్యంగా ఉంటేనే ప్రయోజనమని భావించాడు. 'పాకిస్తాన్‌'లాగా 'దళితస్తాన్‌' 'హరిజన్‌స్థాన్‌' లాంటి నినాదాలివ్వడం ఆ రోజుల్లో పెద్ద సమస్యేమీ కాదు. అయినా ఇవ్వలేదంటేనే ఆయనకు దేశ సమగ్రతపట్ల ఉన్న చిత్తశుద్ధి ద్యోతకమవుతుంది. కుల, వర్గ దోపిడీ లేని రాజ్యం కావాలన్నాడు. అలాంటి రాజ్యం కావాలంటే దానంతటదే రాదన్నాడు. అందుకు పోరాటమే శరణ్యమన్నాడు. రాజ్యాధికారమే పీడిత వర్గాల సామాజికాభివృద్ధికి ఏకైక మార్గం. రాజ్యాధికారం లేకుండా మన అభివృద్ధి అసంభవం అని స్పష్టంగా చెప్పాడు.
స్త్రీలు భారత సమాజంలో నికృష్టమైన జీవితాలు గడుపుతున్నారని 'ప్రతి స్త్రీని శాస్త్ర దాస్యం నుండి విముక్తి' చేయాలన్నాడు. ఈ లక్ష్యం చేరుకునే క్రమంలో 'హిందూకోడ్‌' బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాడు. ఆనాటి సనాతన, సంప్రదాయ అగ్రకుల పాలకులు నిరాకరించారు. ఆ బిల్లు ఆమోదానికి తోడ్పడని ప్రధాని నెహ్రూ వైఖరికి నిరసనగా కేంద్రమంత్రి పదవికే రాజీనామా చేసిన ఆదర్శవంతుడు, త్యాగశీలి అంబేద్కర్‌. శ్రామిక మహిళల 'ప్రసూతి ప్రయోజనాల చట్టం' కొరకు పోరాడిన వారిలో డాక్టర్‌ అంబేద్కర్‌ ముందుపీఠిన ఉన్నాడు. ఈ దేశం అభివృద్ధి కాకపోవడానికి, శ్రామికులంతా ఐక్యం కాకపోవడానికి, దోపిడీ కొనసాగటానికి కుల వ్యవస్థ పెద్ద ఆటంకమని గుర్తించాడు. అందుకే కుల సమస్యలపై ప్రత్యేకంగా ఆయన పరిశోధన చేశాడు. రాజ్యాధికారానికై శ్రమజీవులను ఐక్యం కాకుండా చేస్తున్న ప్రతిబంధ కాల్లో కుల వ్యవస్థ చాలా కీలకమైందిగా గుర్తించాడు. దేశంలో శ్రమ విభజనే కాదు శ్రామికుల మధ్య విభజన అనే తరతరాల అగాధం ఉందన్నాడు. ఇది అగ్రకుల దోపిడీ వర్గాల రక్షణకు పెట్టనికోటలా ఉందన్నాడు. శ్రామికుల మధ్య ఐక్యతకై ప్రత్యేక ప్రయత్నం, నిరంతర ప్రయత్నం జరగాలన్నాడు. 'విప్లవం తేవడానికి భారతదేశంలోని కార్మికవర్గ ప్రజలంతా ఏకం అవుతారా? నా దృష్టిలో ఆ శక్తి ఒక్కటే... అదేమిటంటే తనతోపాటు విప్లవంలో పాల్గొంటున్న వారిలో ఒకరి పట్ల ఒకరు సంపూర్ణ విశ్వాసం చూపగల్గాలి' అన్నాడు. 'మనుషులు తరతరాలుగా సాంఘిక అణచివేతకు గురవుతున్నారు. ఆస్తి సమానత్వం కొరకు మాత్రమే విప్లవంలో పాల్గొనరు. విప్లవం సాధించిన తర్వాత కుల, మత భేదాలు లేకుండా సమానత్వంగా చూడబడతామనే గ్యారంటీ ఉంటేనే అరమరికలు లేకుండా విప్లవోద్యమంలో పాల్గొంటార'న్నాడు.
అందుకే 'కుల నిర్మూలన' అనే చారిత్రాత్మకమైన గ్రంథంలో అనేక విషయాలు రాశాడు. భారతదేశం సామాజిక విప్లవోద్యమ ఆవశ్యకత మిగతా దేశాల న్నింటి కంటే ఎక్కువగా ఉందని భావించాడు. సామాజిక ఉద్యమంలో కీలకమైనది 'కుల వ్యవస్థ వ్యతిరేక పోరాటం' అని భావించాడు. స్వకుల వివాహాలే కులవ్యవస్థను కొనసాగించడంలో కీలక పాత్ర వహిస్తున్నాయని, అందుకు స్వకుల వివాహా లను నిరుత్సాహపర్చాలని విస్తృతంగా ప్రచారం చేశాడు. ఏదైనా పోరాడితేనే పోతుందని, కాబట్టి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడితేనే కులం బలహీన పడుతుందన్నాడు. కుల వ్యవస్థ బలహీన పడటం వర్గ ఐక్యత పటిష్టతకే తోడ్పడుతుందన్నాడు. కుల వ్యవస్థ వర్గ దోపిడీని రక్షిస్తుందన్నాడు. వాస్తవానికి కమ్యూని స్టుల అభిప్రాయాలకు అంబేద్కర్‌ ఆలోచనలకు సామీప్యమే ఎక్కువ. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు 1998 నవంబర్‌ 20న ఆంధ్రజ్యోతికిచ్చిన ఇంటర్వ్యూలో 'అంబేద్కర్‌ అభిప్రాయాలకు, కమ్యూనిస్టుల అభిప్రాయాలకు పెద్దతేడా లేదు. కొన్ని విషయాల్లో కమ్యూనిస్టుల కన్నా ముందున్నారు కూడా. దేశంలో ఉన్న భూమిని జాతీయం చేయాలని చెప్పడం ఎంతో ముందు చూపుతో కూడింది. హిందూ ధర్మశాస్త్రాలను తూర్పారాపట్టాలని, వాటిని ఓడిస్తే తప్ప కుల వ్యవస్థ పోదని చెప్పడం అంబేద్కర్‌ చాలా ప్రధానంశంగా తీసుకున్నాడనే అంశాన్ని రుజువు చేస్తుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయాధికారం కావాలన్నారు. నిజానికి కమ్యూనిస్టులతో అత్యంత చేరువగా అభిప్రాయమున్న వ్యక్తి అంబేద్కర్‌. అయితే రాజ్యాంగ యంత్రం, ప్రజాస్వామ్యం, తదితర విషయాల్లో కొన్ని విభేదాలున్నాయి' అని చెప్పిన అంశాలు సదా గమనంలో ఉండటం అవసరం.
             డాక్టర్‌ అంబేద్కర్‌ 58వ వర్ధంతి సందర్భంగా నిజమైన నివాళి అర్పించడమంటే కుల, వర్గ రహిత సమాజం కొరకు పోరాడటమే. 

Prajashakti Telugu News Paper Dated: 05/12/2014 

Friday, December 5, 2014

చెదలు పట్టిన చైతన్యం - డా. ఎం.ఎఫ్‌. గోపీనాథ్‌



‘మన రాష్ట్రం-మన పాలన’ అనుకున్న మూడవ రోజు నుంచే రైతుల బతుక్కి భరోసా లేక 480 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. ఉద్యమానికి ఊపిరిలూదిన ఉస్మానియా విద్యార్థుల్ని ‘నియామకాలు-నిధులు-నీళ్ళు’ నినాదాలు ఎక్కిరించి నిరాహారదీక్షకు నెట్టబడ్డారు. హైదరాబాద్‌ చుట్టూరా ఉన్న 21 లక్షల ఎకరాల భూమి బడా పెట్టుబడిదారులకు అధికారిక ధారాదత్తం కాబోతున్నది. దళితుల మూడు ఎకరాల భూమి నినాదం అమలు ‘చంద్ర’ మండలంలోనో లేక అంగారక గ్రహంలోనో సాధ్యమయ్యేట్లున్నది.
పాలక వర్గం మేధావుల్ని ఎంత ఎక్కువగా తనలో యిముడ్చుకుంటుందో, అంత స్థిరంగానూ, అంత ప్రమాదకరంగానూ దాని పాలన తయారవుతుంది.
- మార్క్స్‌
ఆంటోనియో గ్రాంసీ 1930ల్లో ఇటలీ సమాజంలో వస్తున్న మార్పుల్ని ఆ సమస్యల పట్ల మేధావుల స్పందనను గురించి వివరించే క్రమంలో మేధావుల్ని రెండు రకాలుగా విభజించాడు. వారినే సాంప్రదాయక మేధావులు, సజీవ మేధావులు అన్నాడు. సాంప్రదాయక మేధావులు యథాతథ వాదులు-పాలక వర్గ పక్షపాతులు. పాలక వర్గాల దోపిడీకి, అరాచకాలకు రంగులద్దుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించేవారు. ఈ కోవలకి చెందినవారే మతాధిపతులు, పూజారులు, సామాజిక శాస్త్రవేత్తలు/ఆర్థిక శాస్త్రవేత్తలు తదితరులూను. ప్రజల సమస్యల పట్ల సానుభూతి, సహా నుభూతి ఉన్న మేధావి వర్గం సాంప్రదాయ మేధావివర్గానికి భిన్నంగా ఉంటుంది. దీన్నే ఆర్గానిక్‌ ఇంటెలెక్చువల్స్‌/ సజీవ మేధావి వర్గం అన్నాడు గ్రాంసీ. ఉదాహరణకు వామపక్ష మేధావులు, తెలంగాణ మేధావులు మొదలగు వారు. సాంప్రదాయక మేధావులతో గానీ, సజీవ మేధావులతో గానీ సమస్య లేదు. సమస్య ఎప్పుడొస్తుంది? సజీవ మేధావులుగా చలామణీలో ఉన్న వామపక్ష, దళిత, తెలంగాణ మేధావులు ఏ ఉద్యమాల గురించి అయితే ప్రజలకు వివరించి, ప్రజల్ని భాగస్వాములుకండని ప్రభోదించారు కదా. మరి ఆ ఉద్యమాల్ని స్వార్థపరులు కొందరు హైజాక్‌చేసి, నిరంకుశ నాయకులుగా తయారయ్యారో, తయారవుతున్నారో ఆ నిరంకుశత్వాన్ని నిరసించవల్సిన ఈ సజీవ మేధావులు సడెన్‌గా బ్రెయిన్‌లెస్‌/ స్పైయిన్‌లెస్‌ మృత జీవులుగా మారిపోతున్నప్పుడు తప్పక సమ స్య వస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో గానీ, తెలంగాణ రాష్ట్రం కొరకు జరిగిన పోరాటంలో గానీ పాల్గొన్న ‘వామపక్షం’ బురఖా వేసుకొన్న మేధావులు, తెలంగాణ ఉద్యమ ముసుగు వేసుకొన్న భూస్వామ్య బ్రాహ్మణీయ శక్తులకు అన్ని విధాల తమ సహాయ, సహకారాలందించారు. సామాజిక తెలంగాణ, ప్రజాస్వామ్య తెలంగాణకు ప్రతిగా కుట్రపూరిత దొరస్వామ్య అనుకూల ‘గెట్టు’ తెలంగాణకే మద్దతుపలికారు. మొదట తెలంగాణ రానియ్యండన్న మోసపూరిత వాదనతో తెలంగాణలోని సోషల్‌ ఆర్గనైజేషన్స్‌ అన్నింటినీ నిర్వీర్యం చేసారు. వామపక్ష విప్లవ పార్టీలకు మద్దతుదారులుగా చలామణి అవుతున్న కొందరు మేధావులు. తెలంగాణ భూస్వామ్య ప్రతినిధి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఏకంగా సివిల్‌ లిబర్టీస్‌ మీటింగ్‌కి గౌరవ అతిథిగా ఆహ్వానించారు.
ఈ మేధావులు ఎందుకు యింతగా దిగజారారు? మావోయిస్ట్‌ ఎజెండానే మా ఎజెండా అన్న కేసీఆర్‌ సాధారణ ప్రజాస్వామ్య హక్కు అయిన సభ జరుపుకునే హక్కుని గూడా (గత సెప్టెంబర్‌ 21న) దక్కనియ్యలేదు. మరి తెలంగాణ మేధావి వర్గం నోరెందుకిప్పట్లేదు? ఇవి క్రోనీ కేపిటలిజం రోజులు. క్రోనీ కాపిటలిజం (ఆశ్రిత పెట్టుబడి), క్రోనీ మేధావుల్ని (ఆశ్రిత మేధావుల్ని) తయారు చేసుకుంది. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యల సందర్భంలో గానీ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ‘బి’ కేటగిరీ విద్యార్థుల ఫీజు ఉమ్మడి రాష్ట్రంలోను, పక్క రాష్ట్రంలోను అంతకు ముందున్న రూ.5 లక్షల 25వేల నుంచి అకస్మాత్తుగా రూ.9.5 లక్షల నుంచి 12 లక్షల వరకు పెంచినప్పుడు కానీ నోరెత్తని తెలంగాణ ఉద్యమ మేధావివర్గం మౌనాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? తెలంగాణ రైతులు అనుభవిస్తున్న కరెంట్‌ కష్టాల్ని తీర్చడానికి మూడు సంవత్సరాలు అవసరమా? ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంతో కుదుర్చుకున్న 1000 మెగావాట్ల కరెంట్‌ని తెలంగాణ రైతులకు అందించటానికి, కరెంట్‌ స్తంభాలు, వైర్లు వేయడానికి మూడు సంవత్సరాలు పడ్తాయా? అంతకన్నా సులువైన మార్గం తెలం గాణ విద్యుత్‌ ఉద్యోగ మేధావులు సూచించలేరా? తెలంగాణ ప్రభుత్వం-ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాల మధ్య జరిగిన సామరస్య ఒప్పందాల్ని కేంద్రప్రభుత్వం తనకు నష్టం లేనంతవరకు ఒప్పుకుని తీరుతుంది. ఉన్న కరెంట్‌లైన్ల ద్వారానే రామగుండం నుంచి కేంద్రానికి వెళ్ళే భాగాన్ని తెలంగాణకి మళ్ళించి వెంటనే తెలంగాణ రైతు ఆత్మహత్యల్ని ఆపవచ్చు. మరి ఇంతటి ప్రాముఖ్యం ఉన్న విషయాన్ని తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన మేధావివర్గం చర్చకెందుకు పెట్టడం లేదు? ప్రత్యేక రాష్ట్రం వస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ‘తెలంగాణ జిందా తిలిస్మాత్‌’ని ప్రజాసమూహాల మెదళ్ళకి నిత్యం పూసిన మేధావివర్గం యిప్పుడు పట్టిన మౌన వ్రతానికి అర్థం ఏమిటి? రైతు ఆత్మహత్యలు పక్క రాష్ట్రంలో లేవా అని ప్రశ్నించే మేధావి వర్గం, కాంగ్రెస్‌, టీడీపీ పాలన వల్లనే ఈ ఆత్మహత్యలు అంటున్న తెలంగాణ మీడియా, కాంగ్రెస్‌ని, టీడీపీని ఓడించి టీఆర్‌ఎస్‌కి అందుకే కదా పట్టం కట్టామని గజ్వేల్‌లోనే ఓ రైతు నిలదీసినప్పుడు ఏమి సమాధానం చెప్పారు? దొరసాని బతుకమ్మకి పది కోట్లు, మెట్రోపాలిస్‌ డ్రింకింగ్‌-డ్యాన్సింగ్‌ పార్టీకి 500 కోట్లు ఖర్చుపెట్టిన తెలంగాణ ప్రభుత్వానికి ఆత్మహత్యలు చేసుకొన్న రైతు కుటుంబాన్ని ఓదార్చే, బతుకు భరోసా ఇచ్చే టైం గానీ లేదా? రైతు కుటుంబాల బాకీలు గరిష్ఠంగా మూడు లక్షల దాకా ఉంటాయేమో. ఆ మాత్రం అయినా అందించి బజారున పడ్డ ఆ కుటుంబాలను ఆదుకోవచ్చు. ఆ మేరకు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన మేధావులు రాష్ట్ర ముఖ్యమంత్రిని ‘బాంచెన్‌ దొరా అప్పుల పాలైన మన రైతుల బాకీ తీర్చి రైతుల బతుక్కి భరోసా యివ్వండని’ అయినా ప్రాధేయపడవచ్చు తప్పులేదు!
దళితులకు మూడెకరాల భూమి, పెట్టుబడి ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో తొలి దళిత ముఖ్యమంత్రి లాంటి నినాదమేనని యిప్పటికే స్పష్టమయింది. మహబూబ్‌నగర్‌లో పంచిన పట్టాలు (భూమికాదు) పట్టుకొని ‘మూడు ఎకరాలు’ భూమెక్కడుందా ఆని వెదుకుతున్నారు దళితులు. దివంగత రాజశేఖర్‌ రెడ్డి అన్నట్లు దళితులకు భూ పంపిణీ ‘ఒక నిరంతర ప్రక్రియ’ అంటే అది ఎప్పటికీ ముగియదు. తెలంగాణ భూమండలం మీద భూమి దొరకట్లేదు కాబట్టి, ‘చంద్ర’ మండలంలోనో, అంగారక గ్రహంలోనో దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానంటారేమో కేసీఆర్‌!
అరవై సంవత్సరాల మన తల్లి తెలంగాణ దాస్య శృంఖలాలు తెంపి వలస పాలకుల కబంధ హస్తాల చెరనుంచి ‘గెట్టు’ తెలంగాణని మాత్రమే సాధించుకున్నామన్న విషయం మరచిపోవద్దు. తెలంగాణ వెనుకబాటుతనానికి కారకులైన ఏ భూస్వామ్య వర్గాలు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి తరిమివేయబడ్డారో ఆ దొరల చేతిలోకే నూతన తెలంగాణ రాష్ట్ర అధికారం బదలాయించబడ్డది. భారతదేశ స్వాతంత్య్ర పోరాట ఫలితం ఏ విధంగానైతే యూరో ఆర్యన్ల నుంచి ఇండో ఆర్యన్ల చేతిలోకి అధికార మార్పిడి జరిగిందో అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్‌ వలన మూడు లక్షల మంది గిరిజనులను బలిచ్చి హైదరాబాద్‌ని పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా, గవర్నర్‌ పాలన క్రింద ఉండే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్న తరువాత ‘గెట్టు’ తెలంగాణ ఇవ్వబడింది. ఇది ఆంధ్ర పెట్టుబడిదారీ వలసవాదానికి, తెలంగాణ భూస్వామ్య నయా పెట్టుబడిదారీ వర్గానికి మధ్య కుదిరిన ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ పవర్‌ ఎగ్రిమెంట్‌ ఫలితమే. తెలంగాణ శ్రమ సంస్కృతి ‘బంగారు బతుకమ్మ దొరసాని’ అవతారం ఎత్తి కళ్ళముందే కదలాడసాగింది. స్వచ్ఛమైన తెలంగాణ భాషా సంస్కృతి, బూతు భాషా సంస్కృతిగా మీడియాకెక్కింది. పండగరోజే యింట్లో పీనుగులున్నట్లు ‘మన రాష్ట్రం-మన పాలన’ అనుకున్న మూడవ రోజు నుంచే రైతుల బతుక్కి భరోసా లేక 480 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు.
ఉద్యమానికి ఊపిరిలూదిన ఉస్మానియా విద్యార్థుల్ని ‘నియామకాలు-నిధులు-నీళ్ళు’ నినాదాలు ఎక్కిరించి నిరాహారదీక్షకు నెట్టబడ్డారు. హైదరాబాద్‌ చుట్టూరా ఉన్న 21 లక్షల ఎకరాల భూమి బడా పెట్టుబడిదారులకు అధికారిక ధారాదత్తం కాబోతున్నది. అయితే దళితుల మూడుఎకరాల భూమి నినాదం అమలు ‘చంద్ర’ మండలం లోనో లేక అంగారక గ్రహంలోనే సాధ్యమయ్యేట్లున్నది. ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో తరతరాలుగా నివసిస్తున్న లక్షల దళిత కుటుంబాలకు ఈ మూడు ఎకరాల భూమి విషయంలో ప్రభుత్వం అధికారిక నిశ్శబ్దం పాటిస్తుంది. ఆంధ్రా వలస పాలకుల హయాంలో మూతపడ్డ అజాంజాహి మిల్స్‌, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ సంగతేందో యిప్పటివరకు నోరు మెదపలేదు. నిజాం, పాలేరు షుగర్‌ ఫ్యాక్టరీలను రైతుల నోళ్ళలో దుమ్ముకొట్టి కారుచౌకగా అమ్మినప్పుడు వేసిన రంకెలు ఏమయ్యాయి? ‘మన ఊరు-మన ప్రణాళిక’ మన దొర-మన దొర దోపిడీగా మరానున్నదా? మావోయిస్ట్‌ ఎజెండానే మన ఎజెండా అన్న నాయకులకు మరి ఆదిలాబాద్‌లో ఎన్‌కౌంటర్లు చెయ్యమని మావోయిస్టులే చెప్పారా? ఇవన్నీ తెలిసిన మేధావి వర్గం మౌనమేలా? తెలంగాణలోని అన్ని కుల/వర్గాల సమస్యలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటునే జిందా తిలిస్మాత్‌గా చూపించిన మేధావివర్గం పట్టిన ఈ నూతన మౌనదీక్షను అర్థం వెతుక్కోలేని స్థితిలో చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలున్నారనే భ్రమకు గురౌతున్నారా ఈ మేధావులు? ఈ 13 సంవత్సరాల్లో దళిత చైతన్యం ధ్వంసం చేయబడ్డది. వామపక్ష భావజాలాన్ని భ్రష్టు పట్టించారు. విద్యార్థుల భవిష్యత్తు అంధకారమౌతుంది. రైతులు ఆత్మహత్యలే పరిష్కారమనుకుంటున్నారు. కరెంట్‌ కష్టాలు తీరేట్లు లేదు. మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల సమస్యల్ని ప్లేబాయ్‌ క్లబ్‌లో, ఫేజ్‌-3 క్లబ్లుల్లో, కరీంనగర్‌ని న్యూయార్క్‌గాను, నిజామాబాద్‌, ఖమ్మంలను లండన్‌ గాను అనుకొని, హైదరాబాద్‌ని గ్లోబల్‌ సిటీ అనుకుని బతికేయండని అంటున్నారు. అట్లా అనుకుంటూ ఈ పాపం అంతా పక్కరాష్ట్రం వాళ్ళ మీదకు నెట్టేసి బతుకులీడుద్దామా? గెట్టు తెలంగాణని గట్టు మీద పెట్టి జన తెలంగాణని సాధించుకుందామా? ఇక బేరసారాల రాజకీయాలను పక్కన బెడదాం.
డా. ఎం.ఎఫ్‌. గోపీనాథ్‌
అధ్యక్షులు, తెలంగాణ జనసమితి

Andhra Jyothi Telugu News Paper Dated: 05/12/2014 

మన్నించు బాబా సాహెబ్‌! By కొంగర మహేష్‌



వేలాది సంవత్సరాలుగా ఈ దేశంలోని మనిషికి పట్టిన మైలను శుభ్రం చేస్తూ, సాటి మనిషి అశుద్ధాన్ని సైతం ఎత్తిపోస్తున్న మట్టిమనుషులను ఇంకా అంటరానివారుగానే చూస్తోన్నవారి మెదళ్లను క్లీన్‌ చేయడానికి ఘనమైన ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దేశంలోని కుల వ్యవస్థను నిర్మూలించడమే అసలైన స్వచ్ఛ భారత్‌గా మారుతుందన్న సత్యాన్ని ఈ పాలకులు ఎప్పటికి గుర్తిస్తారు? కుల నిర్మూలన మాని కులోద్ధరణకు పాటుపడుతున్న ప్రభుత్వాలనే మేం ఇంకా నమ్ముతున్నాం.
‘జయంతులనాడు వచ్చినవాడు వర్ధంతులనాడే కనిపిస్తాడ’ని సామెత!! ఇప్పుడు మీ విషయంలో అదే జరుగుతుంది సాహెబ్‌! మీ జయంతి, వర్ధంతి వేడుకలు కూడా అదే రీతిగా మారిపోయాయి మహాత్మా అంబేద్కరా!! మీరు పుట్టిన ఏప్రిల్‌ 14న, చనిపోయిన డిసెంబర్‌ 6వ తేదీలను ఘనంగా జరుపుకుంటున్నాం. నిన్నా మొన్నటి దాకా ఇందులో ఏప్రిల్‌ నెలను పండుగ మాసంగాను, రెండో సందర్భాన్ని విషాదంగానే అయినా ఘనంగానే స్మరించుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు, పాలకులు, రాజకీయానాయకులకు ఈ రెండు రోజులూ పండుగ రోజులుగా మారాయి. మాకూ అలాగే తయారయ్యాయి. కొందరైతే వాటిని ఎందుకు జరుపుకుంటున్నారో, సందర్భమేమిటో కూడా తెలియకుండా జరుపుకుంటున్నారు. జయంతిని వర్థంతి అంటారు... వర్థంతిని జయంతి అంటారు. ఏదన్నా మీ కోసమేనంటారు. మా గురించి ఎప్పుడూ మాట్లాడని వాళ్ళూ ఈ రెండు రోజులు తెగ మాట్లేడేస్తారు.
అసలు మీ కోసమే తమ జీవితాలు, పరిపాలన అన్నట్లుగా ఊకదంపుడు ఉపన్యాసాలిస్తారు. మిమ్మల్ని ఒకనాడు దేశద్రోహి అన్నవాళ్లకు మీరిప్పుడు దేశభక్తుడుగా కనిపిస్తున్నారు... అంటరానివాడు అన్నవాళ్లకూ ఆరాధ్యదైవమయ్యారు. ఏమైనా అందరి నోళ్లలో అంబేద్కర్‌ ఆలాపనే! ఏం చేస్తాం! కమ్యూనిస్ట్లు నుంచి హిందూ కుల వాదుల దాకా అందరికి ఇప్పుడు మీ అవసరమే మరీ! అందుకే మిమ్మల్ని ఓన్‌ చేసుకోకుండా ఉండలేకపోతున్నారు. ‘అలాంటి వారంతా నా వేడుకలు ఘనంగా చేస్తున్నారు. మరీ నా వారసులుగా మీరేం చేస్తున్నారు నా కోసం?’ అని మాత్రం అడగకండి. ఎందుకంటే మిమ్మల్ని మేం ఎప్పుడో మరిచిపోయాం.. ఒక్క ఫోటోకు దండేసి దండం పెట్టడం.. ఊరూరా, వీధివీధినా మీ విగ్రహాలు ప్రతిష్ఠించడం తప్ప... అసలు మీరు మా కోసమే పుట్టారని మేం గుర్తుంచుకుంటే గదా! మిమ్మల్ని స్మరించుకోవడానికి. మీరు మా కోసమే జీవితాన్ని ధారపోశారని తెలిస్తే గదా,! మీ ఆశయాలను కొనసాగించడానికి! ఇంతకంటే ఇంకేం కృతఘ్నత కావాలి?
హిందూ కుల వ్యవస్థ మనుధర్మ శాసనాలకు బలై.. మూతికి ఉంత, నడుముకు చీపురు... ఎక్కడో ఊరికి దూరంగా విసిరేసినట్లు.. జంతువులుగా కూడా బతుకలేని మాకు.. బతుకంటే ఎంటో చూపించి సమ సమాజంలో ఆత్మగౌరవంతో జీవించేందుకు రాచబాటలు వేసిన మీకు... మీ ఆశయాలు, ఆదర్శాలకు ముళ్లబాటలు వేశాం.. మనిషిని మనిషిగా కూడా చూడలేని ఏ సమాజానికి వ్యతిరేకంగా తుదికంటా పోరాడారో... ఇప్పుడదే వ్యవస్థలో అంటకాగిపోతున్నాం. రాజ్యాధికారంలో వాటా పొందడం మాట అటుంచి మాకు అన్యాయం జరిగినప్పుడు కూడా ఒక్కటిగా నిలబడలేకపోతున్నాం. పైగా మాలోని ఒక్కో గ్రూపు ఒక్కోసారి ఒక్కో అగ్రకులానికి వత్తాసుపలుకుతూ వారి అడుగుల్లో అడుగులేస్తూ వారినే అందలమెక్కించడానికి ఎంతటి శ్రమనైనా ఓర్చు కుంటోంది. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి. పోతున్నాయి. అయినా మా బతుకులు మాత్రం ఏ విధంగానూ మారడం లేదు. ఏవీ కూడా మీ పేరు చెప్పకుండా పుట్టని పార్టీ. సంఘం లేదంటే అతిశయోక్తి లేదు. ఐక్యతను పక్కనబెట్టి విడివిడిగా మీ పేరుతో ఇలా రోజుకో గ్రూపు మీ లోనుంచి పుట్టుకొస్తుంటే దీన్ని చైతన్యమనాలో... అవివేకమనాలో అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం.
దేశ విదేశాల రాజ్యాంగాలను తిరగేసి ప్రపంచంలోని పార్లమెంటరీ ప్రజాస్వామిక దేశాలకే ఆదర్శంగా అందించిన రాజ్యాంగాన్నే తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి ఈ ప్రభుత్వాలు. మీరు ప్రసాదించిన హక్కులు, అవకాశాలు రాజ్యాంగం అమలైన 64 ఏళ్ళలో ఏవీ సరిగ్గా, చట్టబద్ధంగా అమలుకు నోచుకోలేదు. ఆర్థికంగా సామాజికంగా బలంగా ఉన్న వర్గాలతో మేము పోటీపడలేమని అందుకు రిజర్వేషన్లు కల్పించారు. పాలకుల స్వార్ధ బుద్ధి, కుల రాజకీయాల వల్ల ఆరు దశాబ్దాలైనా అవి సక్రమంగా అమలుకాక, అమలైనవి కూడా అందాల్సిన వారికి అందకుండా పోతున్నాయి. మాలో కూడా అందుకున్న వాళ్లే అనుభవిస్తూ.. అత్యంత వెనకబడినవాళ్లకు అందడం లేదు. ఫలితంగా మాలో కూడా అంటరానివాళ్ళలోనే అంటరానివాళ్ళు పుట్టుకొస్తున్నారు. చమర్‌, మహార్‌, మాల, మాదిగలంటూ మా మధ్యే గోడలు, ఎన్నటికీ తేలని గొడవలు. ఇంకా ఎక్కువగా మాట్లాడితే మాకిచ్చే అవకాశాల పరిధిని పెంచాలని పోరాడుతున్నాం కానీ అందరం సమానంగా పంచుకోవడానికి మాత్రం వెనకడుగు వేస్తున్నాం. చివరికి రిజర్వేషన్లు అనేవి లేకపోతే మాకు బతుకులు లేవన్న పరిస్థితి కొచ్చేశాం. మీరిచ్చిన అవకాశంతోనే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి గొప్ప గొప్ప చదువులు చదువుకుంటున్నాం. మేధావుల్లా చలామణి అవుతున్నాం. అయినా సంకుచిత బుద్ధిని వీడటం లేదు.
రాజకీయ రిజర్వేషన్లతో రాజ్యాలేలుతున్నాం. ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులనే పదవులు అనుభవిస్తున్నాం. అయినా మా జీవితాల్లో మార్పులు రావడం లేదు. ఎందుకంటే మీరు చెప్పిన సమాజాన్ని మరచిపోయాం కాబట్టి. ఎన్నికల సమయంలో అధికారికంగా అఫిడవిట్లో సమర్పించే లెక్కల్లో కూడా మనవాళ్లే ముందున్నారు. కానీ ఏం లాభం ‘అదిగో మావాడు కోట్లు సంపాదించాడు’ అని తప్ప గర్వంగా చెప్పుకునేంత పనులేం చేయడంలేదు వారు. వారు జాతి పేరు చెప్పుకునే బాగుపడుతున్నారు, బలపడుతున్నారు. వారు సంపాదించిన సంపదలో కనీసం పది శాతం కూడా తమ జాతికోసం ఖర్చు పెట్టకుండా మీరు బోధించిన ‘పే బ్యాక్‌ టు ద సొసైటీ’కి తూట్లు పొడుస్తున్నారు. సర్వసమస్యలకు పరిష్కారమని మీరు చెప్పిన రాజ్యాధికార ‘మాస్టర్‌ కీ’ని ఎప్పుడో పోగొట్టుకున్నాం. మేం కూడా అగ్రవర్ణాల్లాగే పూటకో మాట, రోజుకో కండువా కప్పుకొని చపలచిత్త మనస్తత్వంతో కాలం వెళ్లదీస్తున్నాం. ‘కులం పునాదుల మీద జాతిని గానీ, నీతినిగాని నిర్మించలేం’ అని మీరంటే వాటి మీదే అధికార బురుజులు నిర్మిస్తున్న వారితోనే చేతులు కలిపి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాం. ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి అగ్రకులాల పంచన చేరి... వారు విదిల్చే తాయిలాల కోసం కాచుక్కూర్చుంటున్నాం. అగ్రకులాల చేతుల్లో ఆటబొమ్మలుగా మారిపోయాం.
హిందుత్వ-మనువాద పునాదితో బాధ్యతలు చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని స్వచ్ఛంగా మారుద్దామనుకుంటున్నారు. అందుకోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు. పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యానికి మంచిదే. కానీ వేలాది సంవత్సరాలుగా ఈ దేశంలోని మనిషికి పట్టిన మైలను శుభ్రం చేస్తూ, సాటి మనిషి అశుద్ధాన్ని సైతం ఎత్తిపోస్తున్న మట్టిమనుషులను ఇంకా అంటరానివారుగానే చూస్తోన్నవారి మెదళ్లను క్లీన్‌ చేయడానికి ఘనమైన ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దేశంలోని కుల వ్యవస్థను నిర్మూలించడమే అసలైన స్వచ్ఛ భారత్‌గా మారుతుందన్న సత్యాన్ని ఈ పాలకులు ఎప్పటికి గుర్తిస్తారు? కుల నిర్మూలన మాని కులోద్ధరణకు పాటుపడు తున్న ప్రభుత్వాలనే మేం ఇంకా నమ్ముతున్నాం. ఏ జెండా పు(ప)డితే ఆ జెండా పట్టుకు వేలాడుతున్న మాతో.. ‘మీ కంటూ ఒక జెండా అజెండా ఉందన్న’ సంగతి చెప్పేదెవరు తండ్రీ! ఇప్పటికీ మిమ్మల్ని అన్యాయంగా పక్కనబెట్టినా, మీ పేరే చెప్పుకుంటూ.. కూర్చున్న కొమ్మలనే నరుక్కుంటున్న అజ్ఞానపు అవివేకంతో దారితప్పిన గొర్రె పిల్లల్లా తలోదిక్కున వెళ్తున్న మమ్మల్ని మన్నించుమనే అర్హత కూడా లేదేమో! రోజురోజుకీ రూపం మార్చుకుంటూ ఆధునిక భారతాన్ని బలి తీసుకుంటున్న కులకోరల్ని నలిపేయడానికి, దారీ తెన్నూ లేకుండా ఆగమైపోతు న్న నీ జాతిని పెడదోవనుంచి విడిపించి, మీరు సూచించిన మా ర్గంలో నడిపించడానికి, మళ్లీ ఎప్పుడు పుడ్తావ్‌ బాబా సాహెబ్‌!?
- కొంగర మహేష్‌
రీసెర్చ్‌ స్కాలర్‌, ఓయూ
(రేపు బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి)

Andhra Jyothi Telugu News Paper Dated: 05/12/2014