Dalit Information and Education Trust (DIET)

Monday, April 4, 2016

మార్క్సి‌స్టు‌దృక్కోణంలో కులం By -ప్రభాత్‌ పట్నాయక్‌ అనువాదం: నెల్లూరు నరసింహారావు


Tue 05 Apr 03:57:25.161118 2016
కుల అణచివేతతో సహా అన్ని రకాల అణచివేతలకూ వ్యతిరేకంగా జరిగే అన్ని పోరాటాలూ పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోయటమనే ప్రధాన లక్ష్యాన్ని విస్మరించకుండా వుండేందుకే మార్క్సిజంలో 'వర్గం' అనే భావనకు అంత ప్రాధాన్యత ఏర్పడింది. అంతేకాకుండా అన్ని పోరాటాలూ ఆ అవసరంలో భాగంగా ఉండితీరాలని మార్క్సిజం చెబుతున్నది.

                దేశంలోని అనేక ఉన్నత విద్యా సంస్థలపైన హిందుత్వ శక్తులు దాడులు చేస్తున్న నేపథ్యంలో కులం గురించి వామపక్ష మేథావులలో ఒక నూతన చర్చ మొదలయింది. కుల అణచివేత సమస్యను మార్క్సిస్టు దృక్పథంతో అర్థం చేసుకుంటున్న తీరును ఈ చర్చ మరోసారి ముందుకు తెచ్చింది. వర్తమానంలో జరిగే పోరాటాలపై ఈ చర్చ ప్రభావం తక్షణమే వుండకపోవచ్చు. అయితే ఇది సైద్ధాంతిక ఎజెండాలో భాగమైన అంశం కాదనలేము.
మార్క్సిజం 'కులం' కంటే 'వర్గం'కు ప్రాధాన్యతనిస్తుందని, కుల విభజనకంటే వర్గ విభజన ఆధారంగానే మార్క్సిజం సమాజాన్ని ప్రాథమికంగా అర్థం చేసుకుంటుందని, తద్వారా కుల సమస్యకు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని చాలామంది ముఖ్యంగా దళిత మేథావులు ఆరోపిస్తున్నారు. పరస్పరం మినహాయింపబడని మూడు మేథో వైఖరులను ఈ చర్చలో మనం గమనించవచ్చు. మొదటి వైఖరి ప్రకారం భారతదేశంలో కుల, వర్గ అణచివేతలు దాదాపు ఆచ్చాదించబడి(ఓవర్‌లాప్‌) వుంటాయి. అణచివేతకు గురవుతున్న కులాలు అణచివేతకు గురవుతున్న వర్గాలకు ఉపసముదాయాలు(సబ్‌సెట్‌)గా వుండటమే కాకుండా అవి ఆ వర్గంలో ప్రధాన భాగంగా వుంటాయి. అందువల్లనే చాలామంది రచయితలు పైన వివరించినట్టుగా వాదిస్తూ దేశంలో జరుగుతున్న దోపిడీ ప్రక్రియను వర్ణించటానికి 'కులం-వర్గం' అనే ఏక పదబంధాన్ని ఉపయోగిస్తుంటారు.
కులం, వర్గం భావనల మధ్య తేడాకుగల ప్రాధాన్యతను రెండవ వైఖరి వివరిస్తుంది. అయితే సమాజంలో మార్పును తీసుకొచ్చేందుకు కావలసిన రాజకీయ ప్రమేయంలో రెండింటిలో ఒకదానికి రెండవ దానికంటే ఎక్కువ ప్రాధాన్యత వున్నట్టు ఈ వైఖరి భావిస్తుంది. కొందరు వర్గ ప్రాతిపదికన నిర్వహించే పోరాటాలకు ప్రాధాన్యతనిస్తే, మరికొందరు కుల అణచివేతకు వ్యతిరేకంగా నిర్వహించే పోరాటాలకు ప్రాధాన్యతనిస్తారు.
మూడవ వైఖరి ఫ్రెంచ్‌ మార్క్సిస్టు తత్వవేత్త లూయి అల్థూజర్‌ ప్రతిపాదించిన 'నిర్మాణవాద మార్క్సిస్టు సిద్ధాంతం'చేత ఉత్తేజిత పద్ధతికి సంబంధించినది. అయితే ఆల్థూజర్‌ తన సిద్ధాంతాన్ని తీసుకెళ్ళాల్సినంత తీసుకెళ్ళలేదని ఈ వైఖరి విమర్శిస్తుంది. ఈ వైఖరి ప్రకారం ఏ కాలంలోనైనా సమాజంలో అనేక రకాల వైరుధ్యాలు వుంటాయి. ఒక వైరుధ్యం మరో వైరుధ్యంకంటే ప్రాధాన్యతగలదని చెప్పేందుకు వీలుపడదు. ఒక విశేష క్షణంలో వీటిలో ఏ వైరుధ్యమైనా ముందుకు వచ్చే అవకాశం వుంటుంది. ప్రగతిశీల శక్తులు తమ శక్తియుక్తులను అలా ముందుకు వచ్చిన వైరుధ్యంపై కేంద్రీకరించాల్సి వుంటుంది. అలాంటి ఆచరణ ప్రక్రియతో ఒక సంధిగ్ద స్థితి ఉత్పన్నమౌతుందనీ, అలా సామాజిక నిర్మాణం మొత్తంగా పరివర్తన చెందేందుకు అవకాశం ఏర్పడుతుందని ఈ రచయితలు భావిస్తారు. కుల, వర్గ, లింగ సమస్యలు వివిధ కాలాలలో పోరాట క్షేత్రాలుగా ఆవిర్భవించే అవకాశం ఉంటుందనేది చివరి వాదన. ఏ క్షేత్రం ముందుకు వస్తే ఆ క్షేత్రంలో ప్రగతిశీలశక్తులు పోరాటాన్ని నిర్వహించాల్సి వుంటుంది. 'వర్గ వైరుధ్యం' ఇతర వైరుధ్యాలకన్నా విశిష్టతగలదని చెప్పే అవకాశం ఇక్కడ ఉత్పన్నం కాదు.
నిశ్చల దృశ్యంగా సమాజం
ఈ మూడు మేథో వైఖరులలో ఒక మౌలిక అంశం ఉమ్మడిగా వుంటుంది. ఏ వైరుధ్యం ప్రధానమైనదనే విషయాన్ని చర్చించే వారంతా సమాజాన్ని నిశ్చలస్థితిలో చూస్తారు. వేరే మాటల్లో చెప్పాలంటే ఘనీభవించిన చట్రంలో బిగించబడిన సమాజంలోని వైరుధ్యాన్ని వీరు చర్చిస్తారు. మొత్తంగా పరివర్తన చెందని సమాజంలో వివిధ కాలాలలో వివిధ వైరుధ్యాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయని చెప్పే ఈ చివరి మేథో వైఖరి కూడా సమాజాన్ని ఘనీభవించిన చట్రం ధృక్కోణంలోనే చూస్తుంది. చూసీచూడగానే ఈ వైఖరి అలా లేదనిపిస్తుంది. ఎందుకంటే వివిధ కాలాలలో వివిధ వైరుధ్యాలు ప్రాధాన్యతలోకి వస్తాయని ఇది చెబుతుంది. ఇది ఘనీభవించిన చట్రంలోని సమాజం గురించి కాకుండా మారుతున్న సమాజం గురించి మాట్లాడుతుంది. అయితే సర్వోత్కృష్ట(ప్రైమసి) వైరుధ్యంలో ఇది ఊహిస్తున్న మార్పు వివిధ ఘనీభవించిన చట్రాలలో అడ్డంగా ఒక వైపు నుంచి మరోవైపు వుంటుంది. సమాజానికి చెందిన ఒక ప్రత్యేకమైన ఘనీభవించిన చట్రంలో ఒక వైరుధ్యానికి సర్వోత్క ృష్టత వుంటుందని, అదేవిధంగా మరో ప్రత్యేకమైన ఘనీభవించిన చట్రంలో మరో వైరుధ్యం సర్వోత్కృష్టత పొందే అవకాశం వుంటుందని ఈ మేథో వైఖరి భావిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే భారతదేశంలో 'కుల', 'వర్గ' సమస్యలపై చర్చ ఘనీభవించిన సామాజిక చట్రంలో జరుగుతుంటుంది. ఇటువంటి చట్రంలో 'కుల' సమస్య కంటే 'వర్గ' సమస్యకు మార్క్సిజం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుందని పొరపాటుగా భావించటం జరుగుతున్నది. ఇది పొరపాటు అనటానికిగల కారణమేమంటే ఒక ఘనీభవించిన చట్రంలో ఒక భావాభివర్గం(క్యాటగిరి) మరొక భావాభివర్గం కంటే ప్రాధాన్యత కలిగివుంటుందని చెప్పటంతో మార్క్సిజానికి సంబంధం లేదు గనుక. ఒక చట్రం నుంచి మరో చట్రంలోకి మన ప్రస్థానం ఎలా జరుగుతుందనే విషయాన్ని మార్క్సిజం వివరిస్తుంది. వేరే విధంగా చెప్పాలంటే ఏ చట్రంలోనైనా కుల, వర్గ, లింగ సంబంధిత సంబంధాల, ఇతర సంబంధాల సముదాయం వుంటుంది. ఈ సకల సముదాయాల సమస్తం పూర్ణత (మార్క్సిస్టు తత్వవేత్త జార్జి లుకాస్‌చే ప్రతిపాదింపబడిన 'టోటాలిటీ' భావన ఇక్కడ ఉపయోగించటం జరిగింది) అవుతుంది. ఈ పూర్ణత లేక మనం చర్చిస్తున్న కుల-వర్గ సంబంధాల సముదాయం కాలక్రమంలో మారుతుంటుంది. ఇది ఎలా, ఎందుకు మారుతుంది? అనే ప్రశ్నను మార్క్సిజం లేవనెత్తుతుంది. వేరే మాటల్లో చెప్పాలంటే ఈ సముదాయంలో ఏ అంశం స్వతహాగా లేక ఆంతర్యంలో (ఇన్‌ట్రిన్‌సికల్లీ) ఎంత ముఖ్యమైనది అనే విషయానికి ప్రాముఖ్యత లేదు(దీనికిదిగానే పరిగణనలోకి తీసుకోవాలనటం అర్థంలేనిది). అయితే ఈ సముదాయాన్ని ముందుకు నడిపించేది ఏమిటనేదే అసలు విషయం. ఈ ప్రశ్నకు మార్క్సిజం ఇచ్చే సమాధానం చారిత్రక భౌతికవాదానికి సంబంధించినదై వుంటుంది. ప్రముఖ రష్యన్‌ మార్క్సిస్టు జివి ప్లెఖానోవ్‌ తన ప్రశంసనీయ గ్రంథం 'ద డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ మోనిస్టు వ్యూ ఆఫ్‌ హిస్టరీ'లో చెప్పినట్టు చారిత్రక భౌతికవాదం మార్క్సిజం ప్రత్యేకత. అయితే పెట్టుబడిదారీ వ్యవస్థచే ప్రభావితమౌతున్న వర్తమానకాలాన్ని గురించి ఈ దృష్టికోణం నుంచి చర్చించే ప్రయత్నం చేస్తే వుపయోగకరంగా వుంటుంది.
పెట్టుబడిదారీ వ్యవస్థను విశ్లేషించటంపైనే మార్క్స్‌ తన జీవిత కాలాన్నంతా వెచ్చించాడు. ఈ వ్యవస్థకుగల సద్యోజనిత (స్పాన్‌టెనైటి) స్వభావాన్ని ఆయన ఎత్తిచూపాడు. వాస్తవంలో ఈ వ్యవస్థకు స్వయం చాలకత వుంటుంది. ఈ స్వయంచాలకత నిశ్చితమైన అంతర్వర్తిత ధోరణులకు లోనవుతుంది. ఈ ధోరణులు మానవ కోరికకూ, చైతన్యానికీ అనుగుణంగా ఉండకుండా స్వతంత్రంగా వుంటాయి (ఉదాహరణకు 1930వ దశకంలోని మహామాంద్యాన్ని ఎవరూ కోరుకోలేదు. అలాగే వర్తమానంలోని ప్రపంచ పెట్టుబడిదారీ సంక్షోభం నుంచి బయటపడటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది కొనసాగుతూనే వున్నది). అంతేకాకుండా ఈ అంతర్వర్తిత ధోరణులు జనింపజేసే ప్రతిస్పందనలు మానవులు స్వబుద్దితో చేస్తున్నవి కావు. పరిస్థితుల ప్రభావంవల్ల వారు అలా ప్రవర్తిస్తారు.. అలాచేయకపోతే ఆర్థిక వ్యవస్థలో వారు తమ స్థానాన్ని కోల్పోతారు. ఉదాహరణకు పెట్టుబడిని కూడబెట్టటం పెట్టుబడిదారులకు ఇష్టముండాలనేమీలేదు. కానీ అలా చేయకపోతే వారు వ్యవస్థలో తమ స్థానాన్ని కోల్పోతారు. పోటీ తట్టుకోలేక వారు నాశనమై పోతారు. ఇంకా చెప్పాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థలో పెట్టుబడిదారులు కూడా పరాయీకరణకు గురవుతారు.
దీనినిబట్టి అర్థమయ్యేదేమంటే పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న క్రమంలో కుల-వర్గ సమిష్టి సంబంధాల స్వభావం నిరంతరం మారుతూవుంటుంది. అయితే వ్యవస్థకుగల సద్యోజనిత లేక యాదృచ్ఛిక స్వభావాన్ని అధిగమించకుండా మానవులు స్వేచ్చను సాధించటం దుస్సాధ్యం. అంటే ఈ పెట్టుబడిదారీ వ్యవస్థనే అధిగమించాలి. అలా వ్యవస్థ రద్దు కావటం వర్గ దోపిడీకే కాకుండా కుల అణచివేతకు కూడా అవసరమౌతుంది. వ్యవస్థ రద్దుకాకుండా కొనసాగుతున్న స్థితిలో అణగారిన కులాలకు చెందిన కొందరు కార్మికవర్గ స్థాయినుంచి బూర్జువా లేక వృత్తి నిపుణులవంటి ఉన్నతవర్గ స్థాయికి 'ఎగబాక' గలుగుతారు(దక్షిణ ఆఫ్రికాలోని నల్లజాతివారికి సంబంధించి ప్రపంచబ్యాంకు, ఇతరుల దార్శనికతగా ఈ భావన వుండేది). అయితే దాదాపుగా అణగారిన కులాలకు చెందినవారంతా వర్గ దోపిడీలోనే కాకుండా కుల అణచివేతలో కూడా కూరుకుపోయి వున్నారన్న వాస్తవం మారదు.
పెట్టుబడిదారీ వ్యవస్థను
అధిగమించాల్సిన ఆవశ్యకత
ఈ వ్యవస్థలో వర్గ దోపిడీని అలానే కొనసాగనిచ్చి, కుల అణచివేత అనే ఒక సజీవ వాస్తవికతకు బదులుగా కుల అణచివేతలేని మరో ప్రత్యామ్నాయ వాస్తవికతను సృష్టించటం సాధ్యపడదు. కాబట్టి పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగమించకుండా కుల అణచివేతను అంతం చేయటానికి పోరాటం చేస్తున్నవారు విజయం సాధించలేరు. క్లుప్తంగా చెప్పాలంటే కులం రూపుమాపాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థ అంతం కావాల్సి వుంటుంది. పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగమించటంతోనే కుల అణచివేత అంతం కాదు అనేది నిజం. అయితే పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగమించిన తరువాత స్థితి కుల అణచివేతను అంతం చేయటానికి చాలకపోయినప్పటికీ అది ఆవశ్యక స్థితిగా వుంటుంది. ఇదీ మార్క్సిజం ప్రాథమిక నిర్ధారణ.
'కులం', 'వర్గం'లలో ఏ భావాభివర్గానికి ప్రాధాన్యత నివ్వాలనే విషయంపై చర్చ ఈ ధృక్కోణం నుంచి జరగాలి. అంతేగానీ సమాజాన్ని ఒక నిశ్చల దృశ్యంగా భావించి ఈ సమస్యను అర్థం చేసుకునే ప్రయత్నం చేయటంవల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదు. ప్రస్తుతం పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగమించటం కుల డిమాండ్‌గా ఉండజాలదు. అధిగమించాల్సిన అవసరమున్న ఒక వ్యవస్థగా పెట్టుబడిదారీ విధానాన్ని గుర్తించటం, దానికి ప్రత్యామ్నాయంగా ఏర్పడే వ్యవస్థకు సంబంధించిన భావనలు కుల సమస్య విశ్లేషణకు ఆవల వుంటాయి. ఎవరైనా నిజాయితీగా, నిలకడగా కుల నిర్మూలన లక్ష్యాన్ని పట్టించుకుంటే వారు తప్పకుండా ఇటువంటి నిర్ధారణలకే వస్తారు. అలా చేస్తున్నప్పుడు కుల దృష్టికోణం పరిధి దాటి వెళ్లాల్సి వుంటుంది. వేరేవిధంగా చెప్పాలంటే ఎవరైనా కేవలం కుల దృష్టికోణం చట్రంలోనే ఇరుక్కుపోతే ఆ వ్యక్తి కుల అణచివేతను అధిగమించటంలో కూడా విజయవంతం కాలేడు.
వర్గ దృష్టికోణానికే ప్రాధాన్యతను ఇస్తుందనే ఆరోపణ మార్క్సిజం ఎదుర్కొంటున్నది. దీనికి కారణం వర్గ దోపిడీని అంతం చేయటానికే కాకుండా కుల, ఇతర రూపాలలోని అణచివేతలను కూడా అంతం చేయటానికి పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగమించాల్సి వుంటుందనే అవగాహన మార్క్సిజానికి వుండటమే. పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగమించిన తరువాత కూడా కుల అణచివేత కనుమరుగవదు. అంటే కుల అణచివేత ప్రత్యేక స్వభావాన్ని కలిగివున్నదనీ, దానిని కేవలం వర్గ దోపిడీకి కుదించటం కుదరదనీ అర్థం. మన సమాజంలో కుల అణచివేత చాలా లోతుగా పాతుకుపోయింది. దానిని నిర్మూలించటం అటుంచి కనీసం పరిస్థితిని మెరుగుపర్చటం కూడా పెట్టుబడిదారీ వ్యవస్థలోగానీ, పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోయటానికి ముందుగానీ సాధ్యపడదు. అంతేకాకుండా పెట్టుబడిదారీ వ్యవస్థ కూలిపోయిన తరువాత కూడా సుధీర్ఘ పోరాటాలు చేయకుండా కుల అణచివేతను నిర్మూలించటం సాధ్యపడదు. క్లుప్తంగా చెప్పాలంటే కుల అణచివేత అనేది మన సమాజంలో బాగా వేళ్లూనుకుని వుంది. అంత తేలిగ్గా అధిగమించటం సాధ్యం కాదు. అయితే కుల అణచివేతకు ప్రాధాన్యతనివ్వటం, దాని ప్రాముఖ్యతను, స్థిరత్వాన్నీ గుర్తించటం వేరువేరు విషయాలు. కుల అణచివేతతోపాటు అన్ని రకాల అణచివేతలనూ రూపుమాపటానికి పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగమించాల్సి వుంటుందని భావించటంవల్లనే వర్గ పోరాటానికీ, వర్గ వైరుధ్యానికీ మార్క్సిజం ప్రాధాన్యతనిస్తున్నది.
అయితే పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా చేసే పోరాటానికి ప్రాధాన్యతనివ్వటమంటే కుల అణచివేతను విస్మరించమనిగానీ, దానిని అధీన అంశంగా భావించమనిగానీ చెప్పినట్టు కాదు. అంతేకాకుండా కుల అణచివేత అంశాన్ని విస్మరించటంవల్ల పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం బలహీనపడుతుంటే ఆ పరిస్థితిని వర్గ పోరాటాన్ని ఎక్కువగా పట్టించుకోవటంవల్ల ఏర్పడిన స్థితిగా అర్థం చేసుకోకూడదు. వాస్తవంలో అది వర్గ పోరాటాన్ని బలహీనపరుస్తుంది. కుల అణచివేతతో సహా అన్ని రకాల అణచివేతలకూ వ్యతిరేకంగా జరిగే అన్ని పోరాటాలూ పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోయటమనే ప్రధాన లక్ష్యాన్ని విస్మరించకుండా వుండేందుకే మార్క్సిజంలో 'వర్గం' అనే భావనకు అంత ప్రాధాన్యత ఏర్పడింది. అంతేకాకుండా అన్ని పోరాటాలూ ఆ అవసరంలో భాగంగా ఉండితీరాలని మార్క్సిజం చెబుతున్నది.
-ప్రభాత్‌ పట్నాయక్‌ 
అనువాదం: నెల్లూరు నరసింహారావు 
సెల్‌: 8886396999
Published in Nava Telangana Dated: 05/04/2016
Posted by Dalit Blog at 10:48 PM No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: కులం వర్గం

పాలనలో చెరగని సంతకం Byరావెల కిషోర్‌ బాబు సాంఘిక, గిరిజన సంక్షేమ సాధికారత శాఖామాత్యులు, ఆంధ్రప్రదేశ్‌


05-04-2016 00:38:58

భారత దేశ నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో సాటి మనిషిని స్మృశించడం పాపమనే అంటరానితనానికి అడుగడుగునా లేత వయస్సులోనే బాబూ జగ్జీవన్‌రామ్‌ మానసిక క్షోభను అనుక్షణం అనుభవించారు. ఆనాటి ఆ కుళ్లు వ్యవస్థ గర్భాన్ని చీల్చుకొని మొక్కవోని ఆత్మవిశ్వాసంతో అచంచలమైన పట్టుదల, దీక్షలతో జీవనసమరాన్ని కొనసాగించారు. అట్టడుగు ప్రజల పక్షాన పోరాట యోధునిగా భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థల్లో సుదీర్ఘకాలం అత్యున్నతమైన పార్లమెంటేరియన్‌గా, పరిపాలన వ్యవస్థలో పటిష్ఠమైన పరిపాలనాదక్షుడుగా ప్రజాస్వామ్య నిరంకుశత్వాన్ని ఎదుర్కొన్న అసలుసిసలైన ప్రజాస్వామ్యవాదిగా డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ భారతదేశ చరిత్రలో అజేయంగా నిలిచారు.
 
స్వేచ్ఛ సమానత్వం, సౌభ్రాతృత్వం, సమసమాజం అనే ప్రజాస్వామ్య మానవతా విలువలను తన జీవితకాలం నిబద్ధతతో ఆచరించారు. అత్యున్నతమైన విలువల కోసం జీవితాంతం అలుపెరగని పోరాటం చేశారు. భారతదేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విడుదల, విముక్తి చేయడానికి స్వాతంత్య్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని 1942 ఆగస్టు 19న అరెస్టయి 14 నెలలు జైలు జీవితం అనుభవించారంటే మాతృ దేశం పట్ల ప్రేమ, స్వాతంత్య్రం పట్ల నిబద్ధత ఎంతగా వున్నాయో అర్థమవుతుంది.
జగ్జీవన్‌రామ్‌ విద్యార్థి దశలో అంటరానితనం రూపంలో వివక్షకు అవమానాలకు గురి అయినా అత్యంత ప్రతిభాపాటవాలు కలిగిన విద్యార్ధిగా రాణించడం ఆయనలో ఉన్న ఆత్మవిశ్వాసం, శక్తి సామర్థ్యాలకు నిదర్శనం. ఆ దశలోనే భావి భారత చరిత్రను ప్రభావితం చేసే నాయకత్వ లక్షణాలను జగ్జీవన పుణికి పుచ్చుకున్నారు. విద్యార్థి దశ తరువాత భవిష్యత్‌ ఉద్యమాలకు పునాదిగా సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపారు బాబూజీ. 1934లో కలకత్తాలో అఖిల భారతీయ రవిదాస్‌ మహాసభ స్థాపించారు. కులవ్యవస్థకు, అసమానతలకు, వివక్షకు వ్యతిరేకంగా సంత్‌ గురు రవిదాస్‌ ఆదర్శాలను ప్రచారం చేయటానికి సాంస్కృతిక ఉద్యమానికి బాబూజీ నడుంబిగించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వాన్ని సాధించి, సామాజిక పరివర్తన తీసుకొని రావాలంటే, సాంస్కృతిక ఉద్యమం అవసరం. ఎందుకనగా మానసిక ఆలోచనలు, వైఖరులు, సనాతన ఆచార సాంప్రదాయాలలో మార్పు వస్తే తప్ప నూతన ప్రజాస్వామిక, సమసమాజం నిర్మాణం సాధ్యం కాదని ఆనాడే బాబూజీ తలచారంటే సామాజిక వ్యవస్థల పట్ల, పరివర్తన పట్ల వారికి ఒక నిర్దిష్టమైన ప్రామాణికమైన అభిప్రాయాలు ఉన్నవని తెలుస్తున్నది.
 
         కార్మిక హక్కుల సంక్షేమం కోసం కార్మికుల మహాసభను స్థాపించడం బాబూజీ వర్గ దృక్పథాన్ని సూచిస్తుంది. పేద, ధనిక వర్గాల మధ్య అసమానతలు, దోపిడీ వ్యవస్థలు రూపుమాపుటకు బాబూజీ ఆనాడే కంకణం కట్టుకున్నారు. ఆ తరువాత వారు కార్మిక శాఖామాత్యులుగా 1946-1952, 1966-67 సంవత్సరాల కాలంలో పనిచేసి తనకున్న అధికారం ద్వారా కార్మికుల జీవన భద్రత కోసం, కార్మిక వ్యవస్థలో అనేక విప్లవాత్మకమైన చట్టాలు చేశారు. 1946లో తాత్కాలిక పార్లమెంట్‌కు ఎన్నిక, 1947లో రాజ్యాంగ నిర్మాణ సభ ఎన్నికతో ఆయన పార్లమెంటరీ ప్రస్థానం మొదలైంది. లోక్‌సభకు ఎనిమిది సార్లు ప్రాతినిధ్యం వహించి 1979 వరకు కొనసాగి, సుదీర్ఘ కాలం సుప్రసిద్ధ పార్లమెంటేరియన్‌గా ప్రజాసేవలో దేదీప్యమానంగా వెలిగారు. కార్మికుల పాలిట బాంధవుడుగా పేరొందారు.
 
         భారతదేశంలో కోట్లాదిమంది అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా వారిని కులవ్యవస్థ కోరల నుంచి విడిపించడానికి 1936 నుంచి 1942 వరకు ఆలిండియా డిప్రెస్‌డ్‌ క్లాసెస్‌ లీగ్‌కు అధ్యక్షులుగా ఉండి సామాజిక ఉద్యమ రథానికి నాయకత్వం వహించి నడిపించారు. ఈ ఉద్యమ నాయకుడిగా అణగారిన కులాల ఆశాజ్యోతిగా గుర్తింపు పొందడం వల్ల అతి చిన్న వయస్సులోనే 28 ఏళ్ళకే బీహార్‌ శాసన మండలిలో ఎమ్మెల్సీగా నియమించబడ్డారు. 1937లో బీహార్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో డిప్రెస్‌డ్‌ క్లాసెస్‌ లీగ్‌ ద్వారా తనతో పాటు 14 మందిని ఎన్నిక కావడం బాబూజీ రాజకీయ ప్రస్థానంలో తొలి సోపానం. ఇది ఒక చారిత్రాత్మక విజయం. ఈ విజయమే బాబూజీ భారతదేశ రాజకీయ చరిత్రను రాయడానికి తొలి అధ్యాయంగా నిలిచింది. ఆ తరువాత బ్రిటీష్‌ నిరంకుశ విధానాలకు నిరసనగా రాజీనామా చేసి, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకెళ్ళారు. కేంద్ర కార్మిక శాఖామాత్యులుగా జగ్జీవన్‌రామ్‌ పనిచేసిన కాలం (1946-52, 1966-67)లో కార్మికుల భద్రత, సంక్షేమం కోసం అనేక చట్టాలు చేసి, అమలు జరిపి సాధించిన విజయాలకు గాను ‘‘భారతదేశ కార్మిక చట్టాలకు జనకుడు’’గా కొనియాడబడినారు. భారత రైల్వే శాఖ మంత్రిగా ఉన్న కాలం (1956-1962)లో దేశంలోని రైల్వేలను ఆధునికీకరించి, నూతన రైల్వే మార్గాలను నిర్మించి, ప్రయాణికుల భద్రత, రైల్వే కార్మికుల, ఉద్యోగుల సంక్షేమానికి కృషి చెయ్యడంతో ‘‘రైల్వేల పితామహుడు’’గా జగ్జీవన్‌రామ్‌ కీర్తించబడినారు. కేంద్ర రవాణా, కమ్యూనికేషన్ల శాఖల మంత్రిగా ఉన్న కాలంలో (1962-1963) దేశ ప్రజల అవసరాలను తీర్చగలిగే విధంగా నూతన రోడ్డు మార్గాలను నిర్మించారు. దేశంలోని గ్రామీణుల చెంతకు పోస్టాఫీసు సేవలను చేర్చడం జగ్జీవన్‌రామ్‌ సాధించిన విజయాల్లో ఒకటిగా పేర్కొనవచ్చు. జగ్జీవన్‌రామ్‌ విమానయాన శాఖలో ఇండియన్‌ ఎయిర్‌ లైన్‌ను జాతీయం చేశారు.
ఆహారం, వ్యవసాయం, పౌర సరఫరాల శాఖలకు మంత్రిగా పనిచేసిన కాలం (1967-70)లో వ్యవసాయ రంగంలో యంత్రాలను ప్రవేశపెట్టి, నీటి వనరులను అభివృద్ధి పరిచి, దేశంలో మిగులు ఆహార ధాన్యాలు పండించి ‘‘హరిత విప్లవం’’ సాధించిన ఘనత బాబూజీకే దక్కుతుంది. మరల 1974 నుంచి 77 వరకు కేంద్ర వ్యవసాయం,
 
         నీటిపారుదల శాఖలకు బాబూజీ మంత్రిగా పనిచేశారు. 1970 నుంచి 74 వరకు దేశ రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో బాబూజీ రక్షణ పరిశోధనా రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపెట్టారు. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో భారతదేశం విజయభేరి మోగించింది. అసాధారణ ప్రజ్ఞాపాటవాలు, అజేయమైన నాయకత్వ లక్షణాలు, సుదీర్ఘమైన రాజకీయ పాలనా అనుభవం, సమదృష్టి ఉన్న డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌ రామ్‌ని ప్రధానమంత్రి పదవి వరించనీయకుండా కాంగ్రెస్‌ పార్టీ అడ్డుకుంది. కాంగ్రెస్‌ పార్టీ జగ్జీవన్‌రామ్‌కి చేసిన అన్యాయం దేశంలోని దళితుల సంక్షేమం విషయంలో ఆ పార్టీ వివక్షాపూరిత వైఖరికి స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తుంది. దేశంలోని దళిత, ఆదివాసీ, బలహీన వర్గాల అభ్యున్నతిని దిగజార్చే కాంగ్రెస్‌ పార్టీ వివక్షాపూరిత వైఖరిని బట్టబయలు చేస్తుంది.
తెలుగుదేశం పార్టీ మహానేత స్వర్గీయ యన్టీఆర్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాబూజీ స్ఫూర్తితో దళితులు, ఆదివాసులు, బలహీనవర్గాల సాధికారం కోసం ప్రారంభం నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వమే బషీర్‌బాగ్‌లో జగ్జీవన్‌రామ్‌ కాంస్య విగ్రహాన్ని స్థాపించింది. హైదరాబాద్‌ కొత్తపేటలో బాబూ జగ్జీవన్‌ రామ్‌ స్మృతిలో అతిపెద్ద కమ్యూనిటీ హాల్‌ను నిర్మించింది. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం యస్సీ, యస్టీల ఆర్థిక సంక్షేమం కోసం వెయ్యి కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాల కార్యాచరణని కొనసాగిస్తున్నది. గృహ నిర్మాణం, విద్య, మౌలిక వసతుల కల్పన, దళిత, ఆదివాసీ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడం మొదలగు కార్యక్రమాలతో డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ ఆశయాలను తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు కొనసాగిస్తున్నది. ఆ మహనీయునికి ఇవే మా ఘనమైన నివాళులు. 
రావెల కిషోర్‌ బాబు 
సాంఘిక, గిరిజన సంక్షేమ సాధికారత శాఖామాత్యులు, ఆంధ్రప్రదేశ్‌

Andhra Jyothi Telugu News Paper Dated: 05/04/2016
Posted by Dalit Blog at 10:43 PM No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: రావెల కిషోర్‌ బాబు

భారత ‘అమూల్య రత్న’ బాబూజీ! By Krupakar Madiga


05-04-2016 04:05:38

వలసపాలన నుంచి విముక్తి కోసం, కుల నిర్మూలన కోసం జరిగిన స్వాతంత్ర్యోద్యమం, కుల నిర్మూలన కోసం జరిగిన సామాజిక సంస్కరణోద్యమాలు కన్న ముద్దు బిడ్డ బాబూ జగ్జీవన్‌రామ్‌. భారత దేశ స్వరాజ్య ఉద్యమంతో, తదనంతరం జరిగిన దేశ పునర్నిర్మాణంతో ముడివడిన జగ్జీవన్‌రామ్‌ జీవితం రాజకీయ, సామాజిక, చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉంది. జగ్జీవన్‌రామ్‌ని స్మరించుకోవడం అంటే భారత దేశ స్వాతంత్య్రం, సామాజికోద్యమాల ప్రాంగణాన జరిగిన ఉప్పొంగిన సమరోజ్వల సమున్నత ఘట్టాలను గుర్తు చేసుకోవడమే. కుల రహిత సమాజం కోసం జీవితాంతం ఆయన పోరాడారు. 
జగ్జీవన్‌రామ్‌ మహోన్నత నాయకత్వం, వ్యక్తిత్వం, సేవలు భారత దేశ ప్రజాస్వామిక వ్యవస్థలకు, సంస్థలకు మహా బలాన్ని చేకూర్చిపెట్టాయి. జగ్జీవన్‌రామ్‌ వ్యక్తిత్వం మరెవ్వరితోనూ పోల్చజాలనిది. పార్లమెంటు లోపలా, బయటా హుందాయైున జీవితం, వ్యక్తి త్వం ఆయన సొంతం.
 
ప్రజాస్వామ్యం, ప్రజాస్వామిక విలువల పట్ల జగ్జీవన్‌ రామ్‌కు ఉన్న ప్రగాఢమైన నమ్మకం, రాజీలేని వైఖరి కాంగ్రెస్‌ పార్టీకి రాజీ నామా చెయ్యటం వలన మరింత వెలుగు చూసింది. భారత రిపబ్లిక్‌ లోక్‌సభకు 1952 నుంచి వరుసగా ఎనిమిదిసార్లు జగ్జీవన్‌రామ్‌ ఎన్ని కయ్యారు. ముప్ఫై మూడు సంవత్స రాలు కేంద్ర మంత్రిగా, దేశ ఉప ప్రధానిగా దేశంలో ప్రజారాజ్య నిర్మాణా నికి నిరంతరం కృషి సాగించారు. ప్రథమ పార్లమెంటేరియన్‌గా నిలిచారు. జగ్జీవన్‌రామ్‌ సుదీర్ఘ కాలం కేంద్ర మంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్‌లో కొనసా గారు. పుట్టుకతో సంక్రమించిన కుల వివక్షలు, అణచివేతలకు వ్యతిరేకంగా జగ్జీవన్‌రామ్‌ పోరాడారు. చదువుల్లో ఉత్తమ శేణ్రి విద్యార్థిగా రాణిచారు. చిన్న వయసులోనే నిర్మాణాత్మక తిరుగుబాటు స్వభావం, దార ్శనికత కలిగిన సామాజిక, స్వాతంత్ర్యోద్యమ మహా నాయకుడిగా స్వయం కృషితో ఎదిగిన విప్లవ శక్తి జగ్జీవన్‌రామ్‌ అనేది చరిత్ర చెప్పిన సత్యం.
 
1908 ఏప్రిల్‌ ఐదవ తేదిన జగ్జీవన్‌రామ్‌ బీహరు రాష్ట్రంలో షాబాద్‌ (ప్రస్తుతం భోజ్‌పూర్‌) జిల్లాలోని చిన్న గ్రామమైన చాంద్యాలో జన్మించారు. తల్లిదండ్రులు వసంతీ దేవి, శోభీ రామ్‌. సామాన్య కుటుంబం. చర్మకార కులం. మొత్తం విద్యార్థి జీవితమంతా అడుగడునా ఎదరైన కుల వివక్షను ప్రతిఘటిస్తూ జగ్జీవన్‌రామ్‌ఎదిగారు.
డిగ్రీ చదివేందుకు జగ్జీవన్‌రామ్‌ కోల్‌కతాకు వచ్చిన ఆరు నెలల్లోనే వెల్లింగ్టన్‌ స్క్వేర్‌లో ముప్ఫై అయిదు వేల కార్మికులను కూడగట్టి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ విజయంతో జగ్జీవన్‌రామ్‌ సుభాస్‌ చంద్రబోస్‌, చంద్రశేఖర్‌ అజాద్‌ వంటి చాలామంది జాతీయ నాయకుల దృష్టిలోకి వచ్చారు. కమ్యూనిస్టు మేనిఫెస్టో, పెట్టుబడి గ్రంథాలతోపాటు ఇతర సోషలిస్టు సాహిత్యం అధ్యయనం చేశారు. 1934లో జగ్జీవన్‌రామ్‌ కలకత్తాలో అఖిల భారతీయ రవిదాస్‌ మహాసభను స్థాపించారు. గురు రవిదాస్‌ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అనేక జిల్లాల్లో రవిదాస్‌ సమ్మేళనాలు నిర్వహించారు. సాంఘిక సంస్కరణల కోసం వ్యవసాయ కారర్మికుల మహాసభ, ఆలిండియా డిప్రెస్డ్‌ క్లాసెస్‌ లీగ్‌ మొదలైన సంఘాలను స్థాపించారు. బీహార్‌లో 1934లో జరిగిన భయంకరమైన భూ కంపం సందర్భంగా జగ్జీవన్‌రామ్‌ ప్రజలకు సహాయ, పునరావాస చర్యలు చేపట్టారు. 1935కలో జరిగిన డిప్రెస్డ్‌ క్లాసెస్‌ లీగ్‌ కాన్ఫరెన్స్‌కు జగ్జీవన్‌రామ్‌ అధ్యక్షత వహించారు. ఆ సంస్థకు అప్పటి నుంచి 1942 వరకు ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1935లో కాన్పూర్‌కు చెందిన సంఘ సేవకుడడు డాక్టర్‌ బీర్బల్‌ కుమార్తె ఇంద్రాణిదేవితో జగ్జీవన్‌రామ్‌ వివాహం జరిగింది.
సాంఘిక సం్కరణ కోసం చేస్తున్న ఉద్యమంలో భాగంగా అణగారిన కులాలవారికి ఓటు హక్కు కావాలని 1935 అక్టోబర్‌ 19న రాంచి వచ్చి హైమండ్‌ కమిటీ ముందు జగ్జీవన్‌రామ్‌ ప్రాతినిథ్యం వహించారు. 1936లో బీహార్‌ శాసనసభలో ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. 1937లో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో డిప్రెస్డ్‌ క్లాసెస్‌ లీగ్‌ తరపున 14 మంది రిజర్వుడ్‌ స్థానాల్లో గెలుపొందారు. దాంతో జగ్జీవన్‌రామ్‌ ఒక రాజకీయ నిర్ణయాత్మక శక్తిగా, కింగ్‌ మేకర్‌గా ఎదిగారు. 1937 బీహార్‌ శాసనసభలో వ్యవసాయం, సహకార పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి మంత్రిత ్వ శాఖలకు పార్లమెంటరీ సెక్రెటరీగా జగ్జీవన్‌రామ్‌ నియమితులయ్యారు. అండమాన్‌ ఖైదీలను రెండవ ప్రపంచయుద్ధంలోకి దించాలనే బ్రిటీష్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన మంత్రిమండలికి రాజీనామా చేశారు. జగ్జీవన్‌రామ్‌ శాసనోల్లంఘన, సత్యాగ్రహ ఉద్యమాల్లో పూర్తిగా మునిగిపోయారు. వార్ధా వెళ్లి మహాత్మా గాంధీతో ఆయన అనేక విషయాలపై చర్చించారు. 1942లో జగ్జీవన్‌రామ్‌ బొంబాయిలో అగ్రనేతల సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అప్పుడే కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న క్విట్‌ ఇండియా పోరాటంలో క్రియాశీలంగా పాల్గొని అరెస్టయి జైలు జీవితం గడిపారు. కార్మిక, రక్షణ, రైల్వేలు, ఆహారం, పౌర సరఫరాల పంపిణీ, వ్యవసాయం, నీటిపారుదల, ఉపాధి, పునరావాసం, రవాణా, విమానయానం, తంతి, తపాలా మొదలగు మంత్రిత్వ శాఖలను జగ్జీవన్‌రామ్‌ విజయవంతంగా నిర్వహించారు.
 
ముప్ఫైమూడేళ్ళకు పైగా కేంద్ర కేబినెట్‌ మంత్రిగా, దేశ ఉపప్రధాన మంత్రిగానూ డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ తీసుకున్న అసంఖ్యాక నిర్ణయాలు, ఆయన నాయకత్వాన చేసిన అనేక ముఖ్యమైన మౌలికమైన చట్టాలు దేశ సామాజిక పరివర్తనలో, అమలు జరిగిన సామాజిక న్యాయంలో ప్రస్ఫుటంగా ప్రతిఫలిస్తున్నాయి. దేశంలోని పేద వర్గాలు, శ్రామిక ప్రజలు, సగటు మనుషులు, వెనకబడిన వర్గాలు, ముఖ్యంగా షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల వారి హక్కులు, అభివృద్ధి కోసం జగ్జీవన్‌రామ్‌ తీవ్రంగా కృషి చేశారు. 1946లో తాత్కాలిక పార్లమెంటుకు, 1947లో రాజ్యాంగ నిర్మాణ సభకు జగ్జీవన్‌రామ్‌ ఎన్నుకోబడ్డారు. అంటరానతనాన్ని శిక్షార్హమైన నేరంగా ప్రకటించి, దాన్ని రద్దు చేస్తూ రూపొందించిన అధికరణం-17ను రాజ్యాంగంలో చేర్చడానికి; ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనకబడిన వర్గాలకు సంబంధించిన హక్కుల కోసం జగ్జీవనరామ్‌ తీవ్రంగా కృషి చేశారు. మహిళలకు ఆస్తి, ఇతర హక్కులు ప్రతిపాదిస్తూ అప్పటి కేంద్ర న్యాయ శాఖ మంత్రి డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ హిందూ కోడ్‌ బిల్లును ఆయన బలపరిచారు. 1955లోనే పౌరహక్కుల పరిరక్షణ చట్టం కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నించారు.
1969లో అధికార కాంగ్రెస్‌ పార్టీకి జగ్జీవన్‌రామ్‌ అధ్యక్షుడయ్యారు. 1977లో ఇందిరాగాంధీ నియంతృత్వ విధానాలతో విభేదించి, కాంగ్రెస్‌ పార్టీపై తిరుగుబాటు ప్రకటించి బయటకు వచ్చిన జగ్జీవన్‌రామ్‌ ‘ప్రజాస్వామిక కాంగ్రెస్‌’ (కాంగ్రెస్‌ ఫర్‌ డెమొక్రసీ) అనే పార్టీని స్థాపించారు. 1980 మార్చిలో ‘కాంగ్రెస్‌ (జె)’ పేరుతో పార్టీని స్థాపించారు. దామోదరం సంజీవయ్యను ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చేయటంలో జగ్జీవన్‌రామ్‌ కీలక పాత్ర నిర్వహించారు. సామాజిక, రాజకీయ, బానిసత్వాలపై జీవితాంతం యుద్ధం చేసిన బాబూజీ ఎప్పటికీ, ఎల్లరికీ,స్ఫూర్తిదాత. 
కృపాకర్‌ మాదిగ

Published in Andhra Jyothi 05/04/2016
Posted by Dalit Blog at 10:41 PM No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: కృపాకర్ మాదిగ

జాతీయ నాయకుడు జగ్జీవన్‌రామ్‌ By డొక్కా మాణిక్యవరప్రసాద్‌ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీమంత్రివర్యులు


05-04-2016 00:42:02

స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు ఒకరిచ్చేవి కావు. ఆత్మబలంతో ఐక్య ప్రతిఘటనతో సాధించుకోవలసినవి.. అన్నాడు బాబూ జగ్జీవన్‌రామ్‌. ఈ వ్యాఖ్యలో జగ్జీవన్‌రామ్‌ ఆత్మ మనకు దర్శనమిస్తుంది. దళిత అణగారిన వర్గాలను ఉద్దేశిస్తూ తాము ఏ విధంగా సమాజాన్ని, జీవితాన్ని జయించాలో బాబూ జగ్జీవన్‌రామ్‌ చేసిన ఉద్భోద ఇది. 
జగ్జీవన్‌రామ్‌ స్వాతంత్ర్యోద్యమంలో సమరశీలంగా పాల్గొన్నారు. బెంగాల్‌ విభజన ప్రకంపనలు దేశమంతటా పరివ్యాపితమై ఉన్నాయి. వందేమాతర ఉద్యమగాలులు వీస్తున్నాయి. మరోవైపు దళితులు, అణగారిన వర్గాలు చదువుకు దూరంగా ఉండాలనే ఆంక్షలకు వ్యతిరేకంగా 19వ శతాబ్ది చివరి భాగంలో వచ్చిన సంస్కరణ ఉద్యమాల చొరవతో ఈ వర్గాలు చదువుబాట పట్టాయి. గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి వచ్చి స్వాతంత్య్ర సమరానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ సామాజిక నేపథ్యంలో జగ్జీవన్‌రామ్‌ 1908 ఏప్రిల్‌ 5న చాంద్వా గ్రామంలో జన్మించారు. జగ్జీవన్‌ బాల్యం నుంచి వ్యక్తిగతంగా శుభ్రతకి చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. బాల్యం నుంచే తులసీదాసు, స్వామిశివనారాయణ, కబీరు మొదలగు పండితుల కీర్తనల ప్రభావం ఆయనపై ఉంది. పాఠశాల విద్య అభ్యసించే రోజుల్లో అస్పృశ్యులకు ప్రత్యేకంగా తాగు నీరు ఏర్పాటు చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విధంగా ఇంటా బయటా ఉన్న సామాజిక నేపథ్యం జగ్జీవనను బాల్యంలోనే సంఘర్షణకు గురి చేసింది. జగ్జీవన్‌రామ్‌ దేశానికి స్వాతంత్య్రంతో పాటుగా దళితుల సాంఘిక, ఆర్థిక అభ్యున్నతిని కాంక్షించారు. అందుకే ఆయన మొదట సాంఘిక సంస్కర్తగా పనిచేయాలని నిశ్చయించుకున్నారు.
          
         1926లో జరిగిన ఒక సమావేశంలో జగ్జీవన్‌రామ్‌ ఉపన్యాసానికి ఆకర్షితుడైన పండిట్‌ మదనమోహనమాలవ్యా ఆయన్ను బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించేందుకు ఆహ్వానించారు. బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో చదివే రోజుల్లో కులాలు వాటి అంతరాలపై జగ్జీవన అధ్యయనం చేశారు. కలకత్తా యూనివర్సిటీలో ఉండగా వేలాది కార్మికులు పాల్గొన్న ఒక సభలో జగ్జీవన్‌రామ్‌ ఉపన్యాసం నేతాజీ సుభాష్‌ చంద్రబో్‌సను ఆకర్షించింది. ఆ రోజుల్లోనే చంద్రశేఖర్‌ ఆజాద్‌, మన్మధ్‌నాథ్‌ గుప్తా వంటి విప్లవ నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి. 1934లో బీహార్‌లో సంభవించిన భూకంపం నేపథ్యంలో బాధితులను పరామర్శించేదుకు మహాత్మా గాంధీ వచ్చినపుడు జగ్జీవన్‌రామ్‌కు ఆయనతో మొదటి పరిచయం జరిగింది. ఈ పరిచయం ఆయన రాజకీయ దృక్పథంలో గొప్ప మార్పును తెచ్చింది. జగ్జీవన రామ్‌ 1937లో వ్యవసాయ కూలీల కోసం ‘కౌత్‌మజ్దూర్‌ సభ’ ఏర్పాటు చేశారు. ఆయన అనేక కార్మిక సంఘాలకు నాయకత్వం వహించారు. స్వాతంత్య్ర పోరాటంలో, నవభారత నిర్మాణంలో ఆయన సమకాలీనుల్లో మేటి నాయకుడిగా నిలిచారు. ఆయన ఒక్క హరిజనులకు మాత్రమే నాయకుడు కాదు. కుల మతాలు భాషా ప్రాంతాలకు అతీతమైన జాతీయ నాయకుడినని జగ్జీవన నిరూపించుకున్నారు. దళితులు తామొక ఐక్య సంఘటనగా ఏర్పడాలని, విద్యావంతులు కావాలని, మద్యపానాదులకు దూరంగా ఉండాలని ఉద్భోదించారు. బాబూ జగ్జీవన్‌రామ్‌ స్వాతంత్య్ర పోరాటంలో పలు మార్లు జైలుశిక్ష అనుభవించారు. క్విట్‌ ఇండియా ఉద్యమకాలంలో జైలు జీవితం గడిపే రోజుల్లో చరిత్ర రాజకీయార్థిక శాస్ర్తాలను అధ్యయనం చేశారు. నాటి యువతలో మార్క్స్‌ సిద్ధాంతాలపై ఉన్న మక్కువను తెలుసుకునేందుకు ఆమూలాగ్రం మార్క్స్‌ సిద్ధాంతాలను అధ్యయనం చేశారు. ఆయన జీవిత సారాంశం నేటి యువతకు ఉత్తేజాన్ని నింపుతుంది.
            కమ్యూనల్‌ అవార్డు, పూనా ఒడంబడికల సందర్భంగా అంబేద్కర్‌ వాదనలను బలపరుస్తూ దళిత, అణగారిన వర్గాల ప్రయోజనాల నిమిత్తం గాంధీకి జగ్జీవన్‌రామ్‌ లేఖ రాశారు. రాజ్యాంగ సభలో సైతం జగ్జీవన్‌రామ్‌ కీలక భూమిక నిర్వహించారు. తన సోదరుడు అసమాన ప్రతిభావంతుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను రాజ్యాంగ రచనాసంఘం బాధ్యతలు తీసుకునేందుకు తన వంతుగా గాంధీ, నెహ్రూ, పటేల్‌ వంటి మహామహులను ఒప్పించారు. తద్వారా ఈ దేశానికి తలమానికం వంటి రాజ్యాంగం రచించేందుకు కృషిసల్పిన రాజకీయ నేర్పరి బాబూ జగ్జీవన్‌రామ్‌. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి దళితుల రిజర్వేషన్ల అమలుకు కాపలాదారునిగా, ఉద్యోగ, విద్యా రంగాల్లో వారి హక్కులకు భంగం వాటిల్లకుండా కాపాడిన వ్యక్తి బాబూజీ. బీహార్‌ శాసనమండలికి ఇరవై ఎనిమిదేళ్ళ ప్రాయంలో ఎంపికయ్యారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో కేంద్ర వ్యవసాయ, ఆహార శాఖల మంత్రిగా పనిచేసినపుడు హరిత విప్లవానికి నాంది పలికి ఆకలి సమస్యకు పరిష్కారం చూపారు. ప్రజా పంపిణీ వ్యవస్థని (పీడీఎస్‌) ప్రవేశపెట్టి నిరుపేదల ఆకలి తీర్చేందుకు శ్రీకారం చుట్టారు.
 
ఆహార సమస్యను తీర్చేందుకు ఆయన చూపిన చొరవ, ఆనుసరించిన శాసీ్త్రయ పద్ధతులు తనకు గొప్ప స్ఫూర్తినిచ్చాయని స్వామినాథన్‌ వంటి ప్రముఖ శాస్త్రవేత్త చెప్పటం జగ్జీవన్‌రామ్‌ ముందు చూపుకు తార్కాణం. దేశ రక్షణ మంత్రిగా పాకిస్థాన్‌ను ఓడించి బంగ్లాదేశ్‌ ఆవిర్భావానికి బాటలు వేశారు. యుద్ధ సమయంలో సైనికులతో కలసి తిరుగుతూ యుద్ధం పాకిస్థాన్‌ భూభాగంలో మాత్రమే జరగాలని, భారత్‌ భూభాగంలో కాదని ఉద్భోదిస్తూ సైన్యంలో ఒక సైనికుడిగా మెలిగారు. భారత్‌ సైన్యం విజయం సాధించిన మొదటి యుద్ధం దళితుడైన జగ్జీవన్‌రామ్‌ నాయకత్వాన జరిగింది కావటం ఒక చారిత్రక విషయం. కేంద్ర మంత్రిగా సుదీర్ఘకాలం పలు శాఖలను సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా, నిబద్ధతతో నిర్వహిస్తూ ఎదుటివారిని నొప్పించకుండా ప్రశంసార్హంగా మెలగడంలో బాబూ జగ్జీవన్‌రామ్‌ నాటి నేటి పాలకులకు ఆదర్శప్రాయులు.
 
      బాబూ జగ్జీవన్‌రామ్‌ జీవిత పర్యంతం దేశ సేవకే అంకితమై నవభారత నిర్మాణానికి పునాదులు వేసిన దార్శనికుడు. కేంద్రంలో పలు మంత్రిత్వ శాఖలు నిర్వహించిన పాలనాదక్షుడు. ఆలోచనల్లోని పరిపక్వత, మాటల్లోని సూటిదనం, నిర్ణయాల్లో లోతైన అవగాహన, కష్టాల్లో కృంగిపోక మొక్కవోని ధైర్యం, చర్చల్లో పదునైన మేధావితనం, ప్రత్యర్ధులతో సైతం ఔరా అనిపించగల రాజనీతిజ్ఞత, తర్కం, లోతైన విషయ పరిజ్ఞానం అన్నీ కలగలసి బాబూ జగ్జీవన్‌రామ్‌ను దేశం ఒక విలక్షణ నాయకుడిగా గుర్తించి నీరాజనాలు పట్టేందుకు దోహదం చేసాయి. స్వాతంత్ర్యానికి పూర్వం, స్వాతంత్ర్యానంతరం నవభారత నిర్మాణంలో ఆయన పాత్ర శ్లాఘనీయం.
         పార్లమెంటులో జగ్జీవన్‌రామ్‌ మాట్లాడితే ఒక అక్షరాన్ని తొలగించడం గానీ ఒక అక్షరాన్ని చేర్చడం గానీ ఎవ్వరికీ సాధ్యం కాదని ఒక సందర్భంలో ప్రముఖ సోషలిస్టు నాయకుడు ప్రొఫెసర్‌ మధు దండావతే ప్రశంసించారు. 1986 జూలై 17న బాబూ జగ్జీవన్‌రామ్‌ సంస్మరణార్థం పార్లమెంట్‌లో ఆదిలాబాద్‌ తెలుగుదేశం పార్లమెంట్‌ సభ్యుడు సి.మాధవరెడ్డి ప్రసంగిస్తూ ‘ఆ మహామనిషి బాబూ జగ్జీవన్‌రామ్‌ గారితో పాటు 1952లో మొట్టమొదటి పార్లమెంటులో సభ్యునిగా ఉండే అవకాశం నాకు దక్కింది. ఆనాడు పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయంలో జగ్జీవన్‌రామ్‌ యువ మంత్రిగా సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉంటే నేను జోక్యం చేసుకోబోయినపుడు డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ ముఖర్జీ నన్ను వారిస్తూ నీవు నెహ్రూనైనా అడ్డగించవచ్చు కానీ జగ్జీవనను ఆపడం సాధ్యం కాదు, అంతటి నేర్పరి జగ్జీవన్‌రామ్‌ అన్నారు. ఎప్పటికైనా ఒక హరిజనుడు ప్రధాన మంత్రి కావాలని ఈ దేశం కోరుకుంటే దానికి తగిన వ్యక్తి జగ్జీవన్‌రామ్‌ అని శ్యాంప్రసాద్‌ ముఖర్జీ చెప్పారు’. ఈ మాటలు వాస్తవ రూపం దాల్చకపోవటం దేశ సామాజిక చరిత్రలో ఒక వైఫల్య గాథ. ఈ దేశంలో ప్రజలందరి చేత ‘బాబూజీ ’అనే పిలుపు పొందిన గౌరవం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే దక్కింది. ఒకరు మహాత్మా గాంధీ కాగా మరొకరు మహా దార్శనికుడు బాబూ జగ్జీవన్‌రామ్‌. ఇంతటి అరుదైన గౌరవం పొందిన వ్యక్తికి భారతరత్నగా గౌరవం దక్కకపోవడం బాధాకరం. 
1979 జూలై మాసంలో సంభవించిన జనతా సంక్షోభంలో మెజారిటీ పార్లమెంటరీ పార్టీ నాయకుడైన బాబూ జగ్జీవన్‌రామ్‌కు ప్రధాన మంత్రి అవకాశం ఇవ్వకపోవడం ఆనాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి నిర్ణయం ప్రశ్నార్థకం. కాదంటే చారిత్రక సందర్భంలో సమాధానం అన్వేషించవలసిన విషయం. బాబూ జగ్జీవన్‌రామ్‌ కలలు, ఆదర్శాలు నెరవేర్చేందుకు నేడు అందరూ కలసి కృషి చేయవలసిన అవసరం ఉంది. 
డొక్కా మాణిక్యవరప్రసాద్‌ 
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీమంత్రివర్యులు
Published in Andhra Jyothi Telugu News Paper Dated:05/04/2016
Posted by Dalit Blog at 10:37 PM No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: డొక్కా మాణిక్యవరప్రసాద్‌

Tuesday, February 16, 2016

‘దళిత’ అక్షరానికి దారులు వేసిన పుస్తకం! By Sangishettey Srinivas

‘దళిత’ అక్షరానికి దారులు వేసిన పుస్తకం! 
15-02-2016 00:38:06

గుడిలోన మీపూజ గుడిబైట మాపూజ/ ఎన్నాళ్ళు! చేతుమో అన్నినాళ్ళు! /వూరిలో మీ బావి - వూరికావలిమాది/ ఎన్నాళ్ళు! వుండునో అన్నినాళ్ళు! / బడిలోన మీవారు -బడియెదుట మావారు / ఎన్నాళ్ళు! వుందురో అన్నినాళ్ళు! / నట్టింట మీతిండి -నడివీధిలో మాకు / ఎన్నాళ్ళు! పెడుదురో అన్నినాళ్ళు! / పోదు యీ అంటు జాఢ్యము పోదుపోదు / రాదు మతవర్గ రహిత సామ్రాజ్యమింక / పంచములతోడ బాంధవ్యముంచకున్న / హృదయ పరివర్తనంబు చేనొదవునన్న? అంటూ హైదరబాద్‌ కేంద్రంగా దళిత సాహిత్యోద్యమానికి దారులు వేసిన దార్శనికుడు శంకర్‌దేవ్‌. మొత్తం భారతదేశంలో ‘దళిత’ పదాన్ని సాహిత్య రంగంలో మొదటిసారిగా వాడింది కూడా ఈయనే! సమాజ పరంగా దళిత పదాన్ని ‘అంటరాని’ వారినుద్దేశించి ఫూలే, అంబేద్కర్‌లు చాలా ముందే వాడినప్పటికీ సాహిత్య రంగంలో ఆ పదాన్ని మొదట వాడింది హైదరాబాద్‌ సాహిత్యకారులే! ఇప్పటి వరకు సాహిత్య చరిత్రలో దళిత అనే పదాన్ని మొదటిసారిగా వాడింది 1958లో అని రికార్డయింది. ఈ పదం చాలా పాపులర్‌ అయింది మాత్రం 1972లో ‘దళిత్‌ పాంథర్స్‌’ రచనల మూలంగా అని చరిత్ర చెబుతుంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన సాహిత్యాన్ని పరిగణనలోకి తీసుకొని ‘దళిత’ చరిత్రను తిరగరాయాల్సి ఉంది. ఇప్పుడు కొత్తగా అందుబాటులో ఉన్న సాహిత్యాన్ని ఆధారంగా చేసుకొన్నట్లయితే 1954లోనే తొలిసారిగా సాహిత్యంలో ‘దళిత’ అనే పదం వాడింది హైదరాబాద్‌కు చెందిన మాజీ మంత్రి శంకరదేవ్‌ అని రుజువవుతుంది.
 
పాత హైదరాబాద్‌ రాజ్యంలోని బీదర్‌కు చెందిన శంకర్‌దేవ్‌ మొదటి నుంచి ఆర్యసమాజ్‌ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. అందుకే పేరు చివర విద్యాలంకార్‌ అని కూడా పెట్టుకున్నాడు. బీదర్‌-హైదరాబాద్‌ కేంద్రంగా అస్పృశ్యతా నివారణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. అటు సామాజిక, రాజకీయ రంగాలతో పాటు సాహిత్య రంగంలో కూడా తనదైన ముద్రవేసిండు. బీదర్‌ నుంచి హైదరాబాద్‌ అసెంబ్లీకి శాసనసభ్యుడిగా ఎన్నికై బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖని నిర్వహించాడు. ఆ తర్వాత కర్నాటక-బీదర్‌ నుంచి మూడు సార్లు కాంగ్రెస్‌ పార్టీ తరపున పార్లమెంటు సభ్యుడిగా కూడా ఎన్నికయిండు. శంకరదేవ్‌ ఆర్యసమాజ్‌, ముఖ్యంగా కేశవరావు కోరట్కర్‌ ప్రభావంతో, గాంధీ/ అంబేద్కర్‌ స్ఫూర్తితో ‘దళిత సారస్వత పరిషత్తు’ని హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌ కేంద్రంగా ప్రారంభించారు. ఆ తర్వాత దీని కేంద్రకార్యాలయం దోమలగూడకు మారింది. ఈ సారస్వత పరిషత్తు వారు అంటరానితనాన్ని నిర్మూలించేందుకు సాహిత్యాన్ని వాహికగా చేసుకొని తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో అనేక పుస్తకాలు ప్రచురించారు. ‘సేవక్‌’ పేరిట తెలుగు, ఇంగ్లీషు భాషల్లో సామాజిక పక్షపత్రికను ప్రచురించారు. ఇక్కడ ‘దళిత’ పదం గురించి కొంచెం వివరణ అవసరం. నిజానికి దళిత అనే పదం మొదట్లో అణగారిన వర్గాలందరికీ వర్తించేది. అయితే అది రాను రాను భారత సమాజంలో ‘అంటరాని’ తనాన్ని అనుభవిస్తున్న వారికి మాత్రమే పరిమితమైంది. మరాఠీ భాషలో దళిత అంటే బ్రోకెన్‌ లేదా విధ్వంసమైన. జ్యోతిరావు ఫూలే మొదట ఈ ‘దళిత’ అనే పదాన్ని వాడుకలోకి తెచ్చారు. సమాజంలో అత్యంత వెనుకబడిన, కుల వివక్షతకు గురవుతున్న అతిశూద్రులను ‘దళిత’ అనే పేరుతో ఫూలే గౌరవించాడు. (ఎలీనార్‌ జీలియట్‌, 1992). ఆ తర్వాత 1888లో ఫూలే కాలంలోనే ఆయన అనుయాయి, సత్యశోధక్‌ సమాజ్‌లో చురుకైన నాయకుడు మహర్‌ కులానికి చెందిన గోపాల్‌ బాబా వాలంగ్‌కర్‌ ‘దళిత’ అనే పదాన్ని ఇప్పుడున్న అర్థంలో వాడాడు. ‘అనార్య దోష్‌ పరిహారక్‌ మండల్‌’ తరపున మహర్‌, చమార్‌లను సంఘటితం చేసి వర్ణవివక్షతకు, దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు ఈ పదాన్ని ఉపయోగించాడు. (ఫిలిప్‌ కానిస్టేబుల్‌; 1997) The term dalit in Sanskrit is both a noun and an adjective. As a noun, dalit may be used for all three genders, masculine, feminine, and neuter. It has been derived from the root dal which means to crack, open, and split, and so on. When used as a noun or adjective, it means burst, split, broken or torn asunder, downtrodden, scattered, crushed, destroyed. (Massey; 1995) ‘దళిత’ అంటే ‘చెల్లా చెదురు’, ‘ఛిన్నాభిన్నం’, ‘నాశనమైన’, ‘ధ్వంసమైన’, ‘నలిగిన’, ‘అణగారిన’ ‘పీడిత’ అనే అర్థాలున్నాయని వామన్‌ శివరామ్‌ ఆప్టే తన 'The practical Sanskrit - English Dictionary' నిఘంటువులో చెప్పిండు. సాహిత్య రంగంలో మొట్టమొదటి సారిగా 1958లో బొంబాయి (ముంబయి)లో జరిగిన మహారాష్ట్ర దళిత సాహిత్య సంఘం సమావేశాల్లో ఈ పదాన్ని ఉపయోగించారు. 'To me, Dalit is not a caste. He is a man exploited by the social and economic traditions of this country. He does not believe in God, Rebirth, Soul, Holy Books teaching separatism, Fate and Heaven because they have made him a slave. He does believe in humanism. Dalit is a symbol of change and revolution’ (quoted in N.R. Inamdar. Contem-porary India, Poona, 1982). 1930వ దశకం నుంచి ‘దళిత’ పదాన్ని అంబేద్కర్‌ సామాజికంగా అణచివేతకు, అస్పృశ్యతకు గురైన వారికి ఉపయోగించడమే గాకుండా ప్రచారంలోకి తీసుకొచ్చాడు. ఏది ఎట్లున్నా 1970వ దశకంలో మరాఠీలో ‘దళిత్‌ పాంథర్‌’ వుద్యమంతోనే ఈ పదం విస్తృతమయింది. ఈ వుద్యమ ప్రభావంతో మరాఠీలో చాలా సాహిత్యం వెలువడింది. 1972లో రాజా ధలేతో కలిసి నామ్‌దేవ్‌ దస్సాల్‌ దళిత్‌ పాంథర్స్‌ ని స్థాపించాడు. మిలిటెంట్‌గా నడిచిన ఈ సంస్థకు అమెరికన్‌ ‘బ్లాక్‌ పాంథర్స్‌’ స్ఫూర్తి. బాబూరావ్‌ బగుల్‌, శంకర్‌రావు కారత్‌ రాసిన కథలు తర్వాతి తరానికి స్ఫూర్తిగా నిలిచాయి. దయాపవార్‌, త్రయంబక్‌ సప్కలేలు ఎంతో దళిత కవిత్వాన్ని సృజించారు. వీరి రచనలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తించబడ్డాయి, మెప్పుని పొందాయి. (జీలియట్‌, ఇంట్రొడక్షన్‌ టు దళిత్‌ పొయెట్రీ; 1982). దళిత్‌ పాంథర్స్‌లో మహిళలు కూడా ఉన్నారు. హీరా బానిసోడ్‌, జ్యోతి లంగేవార్‌, కుముద్‌ పావడేలు ఇందులో ప్రముఖులు. (చల్లపల్లి స్వరూపరాణి, ఇపిడబ్ల్యు- ఏప్రిల్‌ 25- మే 31- 1998)
 
దళితులు అనే పదం ఒక కులానికి పరిమితమైన పేరు కాదు. అది ఒక సమూహం యొక్క అస్తిత్వం. వేలయేండ్లుగా అవమానానికి, హేళనకు గురైన పదాల స్థానంలో తమ ఆత్మగౌరవాన్ని సాధించుకునేందుకు, కాపాడుకునేందుకు ‘దళిత’ అనే పదాన్ని సమాజంలో అణచివేత, హింసను అనుభవించిన వారు ముందుకు తీసుకొచ్చిన పదమిది. దళిత్‌పాంథర్స్‌కు మార్గదర్శి, మరఠ్వాడా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ గంగాధర్‌ పంత్వానే దళిత పదాన్ని ఇలా నిర్వచించాడు. ‘‘దళిత అనేది కులం కాదు. సామాజికంగా, ఆర్థికంగా, సంప్రదాయాల పేరిట అణచివేతకు గురైనవాడు. వాడు దేవుడు, పునర్జన్మ, ఆత్మ, విభజన వాదాన్ని ప్రేరేపించే గ్రంథాల్ని నమ్మడు. కర్మ, స్వర్గం అనే వాటిని కూడా నమ్మడు ఎందుకంటే ఈ నమ్మకాలన్నీ అతణ్ణి బానిసగా తయారు చేశాయి. అతడు మానవత్వాన్ని నమ్ముతాడు. దళిత అంటేనే మార్పుకు, విప్లవానికి ప్రతీక’’. ఈ విషయాన్ని జీలియట్‌(2001)కు రాసిన లేఖలో పంత్వానే వివరించాడు.
 
నిజానికి ‘దళితులు’ అనే పదాన్ని వెనుకబడిన తరగతులు, ఆదివాసీలు, గిరిజనులు, షెడ్యూల్డ్‌ కులాల వారు ఇంకా చెప్పాలంటే కుల పరంగా పీడన, అణచివేతను, వివక్షతను, హేళనను ఎదుర్కుంటున్న వారందరికీ కలిపి ఈ పదాన్ని గతంలో వాడిండ్రు. మహారాష్ట్రలోని ‘దళిత్‌ పాంథర్స్‌’ ఉద్యమం, ఆంధ్రప్రదేశ్‌లోని ‘దళిత మహాసభ’, ఇంటర్నేషనల్‌ దళిత్‌ సాలిడారిటీ నెట్‌వర్క్‌, ‘దళిత్‌’ మానవ హక్కులు తదితర సంఘాలు, సంస్థలు ‘దళిత’ పదాన్ని విస్తృతంగా ప్రచారంలో పెట్టాయి.
 
సాహిత్యంలో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ‘దళిత’ పదం వాడుక 1954లో వాడడం జరిగింది. అదీ తెలుగులో! హైదరాబాద్‌కు చెందిన శంకరదేవ్‌ అనే ఆర్యసమాజీయుడు ‘హరిజన శంఖారావం’ పుస్తకాన్ని వెలువరించాడు. ఈ పుస్తకం ‘దళిత సారస్వత పరిషత్తు’ తరపున వెలువడింది. ఈ పరిషత్తు హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి పనిచేసింది. ఈ పుస్తకానికి శంకరదేవ్‌ ముందు మాటలో కూడా ‘దళిత’ అనే పదాన్ని వాడిండు. ‘‘ఈ కాలములో దళితులను సంఘటిత పర్చుట, సరియైన మార్గంలో నడుపుట, చాలినంత రాజకీయ విజ్ఞత చేకూర్చట నేటి సంఘనాయకుల ధర్మంగా వున్న కారణంతో ఈ చిన్న పుస్తకం ‘హరిజన శంఖారావం’ పేరుతో ప్రచురించడమైనది. పుస్తకము చిన్నదిగాను, శైలి సులభముగాను గ్రామీణ ప్రజానీకానికి చక్కగా అర్థమయ్యేటట్లు వ్రాయడమైనది. కాలము మారిపోగా, రాజకీయ సాధనాలకు ఈ దళితులను విభిన్న రాజకీయ పార్టీలు తమతమ కొరముట్లుగా వాడుకోదలచిన అదనులో, ఈ పుస్తకము హరిజనులకు, కనువిప్పుముగా ప్రకటించబడినది. (శంకరదేవ్‌;1954). 1950వ దశకం నాటికే దళితులను వివిధ రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని చూస్తున్నదనే అవగాహనతో ఈ పుస్తకం రాయడమైంది. ఈ పుస్తకంలో దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు పేర్కొంటూ వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్‌ రాసిన భారత రాజ్యాంగంలో దళితుల మేలుకోసం చేసిన చట్టాలను పేర్కొన్నారు. ‘‘సకల మానవకోటి సరి సమానత్వాన్ని, శంఖారవంబుతో చాటండి చాటండి!’’ అంటూ పిలుపునిచ్చాడు. ‘జాతి అభిమానానికై, జాతి ఉద్ధారణ కొరకు, ఎవరి రక్త నాళాలు ఉబుకుతున్నాయో, ఎవరి హృదయాల్లో ఆరని అగ్నిజ్వాలలు మండుతున్నాయో, అట్టి హరిజన యువకులకే యీ హితవులు, హెచ్చరికలు, ఉద్భోధలు’’ అంటూ స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల కోసం నినదించాలన్నారు.
 
తే.గీ// నేను స్వేచ్ఛా విహారిని, లేని పోని/ బంధనములకు లోనగు వాడగాను /గగన మార్గాన నెగయం గలను భూమి / గర్భమును చీల్చుకొనిపోవ గలను నేను - అని తాను నినదిస్తూ తన తోటి వారందరిచేత అనిపించాడు. ఇంకా నిద్రావస్థలో ఉన్నట్లయితే నష్టం జరుగుతుందని హెచ్చరించిండు. మనలో అంబేద్కర్‌, జగ్జీవన్‌రామ్‌ లాంటి గొప్పవాళ్ళున్నారు. అవకాశం దక్కినట్లయితే అనేక మంది అలాంటి మహనీయులు తయారవుతారు. అది మీరే కావచ్చు అని దళితులను చైతన్యవంతుల్ని చేసేందుకు రాసిన ఈ వ్యాస సంకలనంలో అక్కడక్కడా పద్యాలు కూడా ఉన్నాయి. ‘నిలవండి నిలవండి,నిలచి పోరాడండి/ పారిపోతే పిరికి పందలంటారోయి/గెలవండి యిక ముందు గెలుపు మీదేనండి/పిలవండి నోరెత్తి దళిత జాతులనెల్ల/ కలసి, సంఘీభావబల పరాక్రమముతో (నిల)
 
‘మీకు విద్యాబుద్ధి లభియించునందాక/ మీ బానిసత్వాలు మాయమౌనందాక/ మీయిళ్ళు వాకిళ్ళు స్వవనీయమగుదాక/ మీ వెట్టి చాకిరీ మిము బాయునందాక/నిలవండి బలముతో నిలచి పోరాడండి’ - అని పాటలు రాసి ప్రచారం చేసిండు. దళితుల్లో ఐకమత్యావశ్యకతను విడమర్చి చెప్పిండు. ‘ఇంకోసారి మీకు హెచ్చరిస్తున్నాను. అది ఐకమత్యం. మీయింటిలోని చెత్తాచెదారాన్ని ఊడ్చే చీపురు సంగతి మీరెప్పుడైన విచారించారా? చీపురుకట్టలోని ఒక్క పుడకను విడదీసి, దానితో మీ యిల్లు ఊడిచచూడండి- వ్యర్థము. చెత్త ఎక్కడిదక్కడనే ఉంటుంది. సరే అనేక పుడకలను ఏకముగా చేర్చి ఊడ్చి చూడండి. మీ యిల్లు ఈషణ్మాత్రాన శుభ్రమైపోతుంది’’. దళితులకుపయోగ పడు చట్టాలు, ఆయా చట్టాల్లో వచ్చిన మార్పులు, భూమిపట్టాలు, ఉద్యోగాల్లో దళితులకు అమలవుతున్న రిజర్వేషన్లు, విద్యా రంగంలో ఉపయోగించుకోవాల్సిన వనరులు తదితర విషయాల్ని ఇందులో చెప్పిండు. మద్యపాన నిరోధ ప్రాధాన్యత కూడా విశదీకరించిండు. ప్రభుత్వం తరపున సీ్త్రలకు లభించాల్సిన వసతులు, ఆస్పత్రి సౌకర్యాలు, అధికారాలు, వారి ప్రస్తుత స్థితిగతులు కూడా శంకర్‌దేవ్‌ చర్చకు పెట్టిండు. ‘హైద్రాబాదు రాష్ట్రములోని ప్రతి జిల్లాలో, ప్రతి తాలూకాలో, ప్రతి గ్రామములో దళితజాతికి సంబంధించిన రచనలు, గేయాలు, హరికథలు, బుఱ్ఱకథలు, నాటకాలు విరివిగా తయారు అవుతున్నాయి. మీలో వ్రాయగలిగిన వారుంటే, వ్రాయండి. దళిత సారస్వతాన్ని పెంపొందించండి. కవులు, గాయకులు, నటకులు, మీలో ఉంటే బయటికి రండి. మీకు చేయూత దొరుకును. ‘‘లెండోయి, లెండోయి, లెండోయి, లెండోయి/ దండు లేచిపోయే లెండోయి లెండోయి/ తేరు తరలిపోయే లెండోయి లెండోయి/ తెల్లవారిందాక, తెలివొంది లేవండి!!’’
 
‘‘మీ యిల్లు మీ వాడ మీ జీవితాలన్ని/ కూలి కుమిలిపోయే, గేళిపాలైపోయే/ కూడు గుడ్డలు లేక పాడైన గతమేమి/ గాఢనిద్రావస్త కప్పుకొన్నదిగాన, లెండోయి’’ ‘‘తూర్పు కొండలపైని సూర్యడుదయించాడు/ మారిపోతుంది భూమండలంబేకమై/ కులములు, గోత్రాలు, కలుములు, లేములు/ తలక్రిందులై విప్లవాలు దొరలెను గాన. లెండోయి’’ అంటూ పాటల ద్వారా చైతన్య పరిచిండు. దండు అనే పదాన్ని సాహిత్యంలోకి తీసుకొచ్చిండు. ఆంగ్లములో ‘దళిత్‌ లిటరేచర్‌ సొసైటీ’గా పిలువబడ్డ ఈ సంస్థ మేనేజర్‌గా శాసనసభ్యులు కళ్యాణరావు నిన్నే వ్యవహరించారు. మొదట పదివేల కాపీలతో ఈ పుస్తకాన్ని బాగ్‌లింగంపల్లి(హైదరాబాద్‌)లోని సుధాన ప్రింటరీ వాళ్ళు ముద్రించారు. ‘అమర సందేశం పేరిట’ గాంధీ ముఖచిత్రంతో రెండో పుస్తకాన్ని శంకర్‌దేవ్‌ హిందీలో రాసిండు. దీన్ని తెలుగులోకి సి.ఐ. అడ్రూస్‌, యం.జె.త్యాగరాజు అనే జంటకవులు అనువదించారు. ఈ వ్యాస సంపుటి 1955లో ప్రచురితమయింది. ఇందులో మొత్తం ఏడు వ్యాసాలుంటే ప్రతి వ్యాసం చివరలో అద్భుతమైన పద్యాలున్నాయి. ఈ పుస్తకానికి అప్పటి హైదరాబాద్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ముందుమాట రాస్తూ ‘‘.. దళిత సారస్వత పరిషత్తు ప్రచురణలు, సామాజిక చైతన్యతకు ఎంతయు వుపయుక్త పడతాయని, దళిత సారస్వత ప్రియులు మరీ మరీ యిట్టి గ్రంథాలు ప్రజానీకానికి అందించగలరని, తద్వారా సాంఘిక సమత సాధించగలరని నమ్ముచు ఈ గ్రంథాన్ని చదువరులకు సన్నిహిత పరుస్తున్నాను’’. ఈ పుస్తకం గురించి ‘మా రెండో పుష్పం’ పేరిట జంటకవులు ఇలా పేర్కొన్నారు. ‘‘ప్రకృతిలో ఏ ఫలమైనా ఆలస్యంగా లభ్యమౌతుంది. మా దళిత సారస్వత వనం లో పలురకాల భాష ఫల మహీరుహాల నాటు పెట్టితిమి. ఇప్పుడిపుడే తోట కాతకు మరలింది. ప్రపథమంగా మా తోటనుండి ‘హరిజన శంఖారవాన్ని’ అనేక ప్రాంతాలకుఎగుమతి చేసి వున్నాము. ప్రథమఫలం రుచితనానికి చదువందితలు యీ తోట ఫలాలనే యపేక్షిస్తున్న కారణంచేత యీ రెండో పుష్పాన్ని మీ చేతి కందిస్తువున్నాం’’. ‘పొలమున ధాన్యరాసుల బండ్లకెత్తించి/ తమవిగాతని వొందు దళిత ప్రజలు/బానెడు జున్నుపాలను బిండి మీదుచె/ తలదాల్చి కొనితెచ్చు దళిత ప్రజలు/ తనువును దేశ స్వాతంత్య్రతకై యర్పి/ తము సేయ పరుగిడు దళిత ప్రజలు/ రాజకీయా చదరంగ రంగపు పాచి/ కల రీతి వర్తించు దళిత ప్రజలు/ నిలువనీడలేక నీడలు కల్పించు/ తనకు లేని దానధర్మమిడును/ తిండిలేని వాని తినమంద్రుపస్తుండె/ దళితజాతికన్న లలితులెవరు?’ అంటూ ప్రశంసించాడు. 1955 నాటికే ఈ సారస్వత పరిషత్‌ తరపున తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో పుస్తకాలు ప్రచురించారు. అవి. 1. హరిజన శంఖారవం (తెలుగు), 2. హరిజన సంఘాల మాన్యువల్‌ (హిందీ), దళిత జాతీయ సంఘం దాని కర్తవ్యం (తెలుగు), 3. వాట్‌ అండ్‌ వై (ఇంగ్లీషు), అస్పృశ్యతా నివారణపై కరపత్రాలు, పోస్టర్లు (తెలుగు). వీటితో పాటు త్వరలో అచ్చుకానున్నవి పేరిట దళిత ప్రశ్నోత్తర చంద్రిక (తెలుగు), చిరంజీవి మనువుగానికి తాత (తెలుగు), హరిజన్‌ టుడే అండ్‌ టుమారో (ఇంగ్లీషు), నాటికలు, బుర్రకథలు, నాటకాలు తయారీలో ఉన్నాయి అని పేర్కొన్నారు. ఈ పుస్తకాల్లోని పద్యాలు, దళిత పదం గురించి ఇంతవరకు తెలుగు సాహిత్యంలో సరైన స్థానం దక్కలేదు. తగినంత చర్చ కూడా జరగలేదు. మరుగున పడ్డ తెలంగాణ, తెలుగు సాహిత్య చరిత్ర ముఖ్యంగా విస్మరణకు గురైన దళిత సాహిత్య చరిత్రను రికార్డు చేసుకోవడం ఈనాటి అవసరం. హైదరాబాద్‌ కేంద్రంగా 1956కు పూర్వం అనేక దళిత రచనలు వెలువడ్డాయి. కాని వాటికి తెలుగు సాహిత్య చరిత్రలో సరైన స్థానం దక్కలేదు. మల్లెల దావీదు రాసిన ‘అస్పృశ్యత’ కావ్యం మాదిగ మహనీయుడు ముదిగొండ లక్ష్మయ్యకు అంకితమీయబడింది. ‘అస్పృశ్యత’ అంశం మీద వెలువడ్డ ఈ కావ్యం గురించీ, రాజకీయ రంగంలో ఉంటూ, అచలబోధ చేస్తూ సమాజంలో రావాల్సిన మార్పుల్ని పేర్కొంటూ అరిగె రామస్వామి అనేక పద్యాలు రాసిండు. వీటన్నింటితోబాటు భాగ్యరెడ్డి వర్మ సంపాదకీయాలు, వ్యాసాలు, రచనలు కూడా పుస్తకాలుగా/పునర్ముద్రణ కావాల్సిన అవసరముంది. అప్పుడే తెలంగాణ లేదా తెలుగు దళిత సాహిత్యంపై సాధికారికంగా మాట్లాడ్డానికి వీలవుతుంది. ఆ ప్రయత్నంలో భాగమే ఈ వ్యాసం.
 
- సంగిశెట్టి శ్రీనివాస్‌
9849220321
Andhra Jyothi Telugu News Paper Dated: 15/02/2016 
Posted by Dalit Blog at 9:28 AM No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: సంగిశెట్టి శ్రీనివాస్
Newer Posts Older Posts Home
Subscribe to: Posts (Atom)

Labels

  • ‘ఆకలి కేకల పోరుయాత్ర’ (2)
  • AISF (1)
  • Anand Teltumbde (1)
  • Asaiah (3)
  • Avitikathalu (12)
  • Chandraiah Gopani (1)
  • DIET (2)
  • Discrimination in Universities (1)
  • Dr K. Satyanarayana (4)
  • Dr. Chinnaiah Jangam (1)
  • Dr. P Kanakaiah (2)
  • Education (3)
  • EFLU (1)
  • EGS (3)
  • HBT (1)
  • ICDS (1)
  • Kalpana Kannabiran (2)
  • KCR TRS (1)
  • KG .సత్యమూర్తి (17)
  • Kuldeep Nayar (1)
  • Laxmipeta atrocity on Dalits (19)
  • manual scavengers (1)
  • Nelson Mandela (1)
  • Nikhila Henry (1)
  • Novel (1)
  • P.S. KRISHNAN (1)
  • Palla Trinadha Rao (1)
  • Poverty (1)
  • Praveen Kumar IPS Issue (3)
  • R S Praveen Kumar (3)
  • Renowned Scholars (1)
  • S R Shankran IAS (2)
  • Sub Plan (6)
  • Suicieds (2)
  • Sukhadeo Thorat (1)
  • SWAEROES (1)
  • UDIT RAJ HANY BABU (1)
  • Universities (2)
  • YK (1)
  • అత్యాచార ఘటన (7)
  • అనుబంధకులాలు (1)
  • అరూరి సుధాకర్ (1)
  • అల్లం నారాయణ (9)
  • అవినీతి (3)
  • ఆచార్య అడపా సత్యనారాయణ (1)
  • ఆదినారాయణ (2)
  • ఆదివాసీలు (56)
  • ఆహార భద్రతా చట్టం (2)
  • ఇనప ఉపేందర్ & కోట రాజేశ్ (1)
  • ఇఫ్లూ రస్ట్‌గేషన్ (3)
  • ఈశ్వరీబాయి వర్ధంతి (2)
  • ఉ.సా (8)
  • ఉ.సా. (7)
  • ఉప ప్రణాళిక (సబ్ ప్లాన్) (7)
  • ఎన్. వేణుగోపాల్ (7)
  • ఎస్వీ సత్యనారాయణ (1)
  • ఎస్సీ వర్గీకరణ (5)
  • ఓల్గా (2)
  • కంచ ఐలయ్య (36)
  • కత్తి పద్మారావు (11)
  • కదిరె కృష్ణ (14)
  • కనీజ్ ఫాతిమా (4)
  • కాకి మాధవరావు (1)
  • కాన్షీరాం (1)
  • కార్తీక్ నవయాన్ (3)
  • కులం (9)
  • కులం వర్గం (6)
  • కృపాకర్ మాదిగ (16)
  • కొంగర మహేష్ (2)
  • కొప్పుల రాజు IAS (3)
  • కొలకలూరి ఇనాక్ (2)
  • కోనేరు కమిటీ (1)
  • గజ్జల కాంతం (1)
  • గాదె వెంకటేష్ (1)
  • గాలి వినోద్ కుమార్ (2)
  • గిన్నారపు ఆదినారాయణ (2)
  • గుడపల్లి రవి (1)
  • గుర్రం సీతారాములు (11)
  • గెడ్డం ఝాన్సీ (1)
  • గోగు శ్యామల (7)
  • ఘంటా చక్రపాణి (15)
  • చరిత్ర (1)
  • చర్మాలు శుభ్రం (1)
  • చిక్కుడు ప్రభాకర్ (5)
  • చిందు ఎల్లమ్మ (1)
  • చినువా అచెబే (1)
  • చుక్కా రామయ్య (2)
  • చుండూరు తీర్పు (5)
  • చెట్టుపల్లి మల్లికార్జున్ (1)
  • జయధీర్ తిరుమలరావు (1)
  • జాన్‌వెస్లి (1)
  • జి. రాములు (1)
  • జి. వివేక్‌ (1)
  • జిలుకర శ్రీనివాస్ (12)
  • జూపాక సుభద్ర (20)
  • జోగిని వ్యవస్థ (1)
  • డా. ఎ. సునీత (1)
  • డా. పి. కేశవకుమార్ (1)
  • డా. వెంకటేష్ నాయక్ (1)
  • డా.కాలువ మల్లయ్య (1)
  • డాక్టర్‌ నాగరాజు అసిలేటి (1)
  • డేవిడ్ (13)
  • డొక్కా మాణిక్యవరప్రసాద్‌ (1)
  • తెలంగాణ (24)
  • దళిత ప్రతిఘటనా నినాదం (2)
  • దళితులు (38)
  • దుడ్డు ప్రభాకర్ (9)
  • నయనాల సతీష్ కుమార్ (1)
  • నలమాస కృష్ణ (1)
  • నలిగంటి శరత్ (1)
  • నిజాం బ్రిటిష్ (1)
  • పసునూరి రవీందర్ (7)
  • పి. ఎస్. కృష్ణన్ (1)
  • పిడమర్తి రవి (1)
  • పైడి తెరేష్‌బాబు (1)
  • పౌరహక్కులు (8)
  • ప్రభాత్‌ పట్నాయక్‌ (3)
  • ప్రొఫెసర్‌ జి. కృష్ణారెడ్డి (1)
  • ప్రొఫెసర్ జి. లక్ష్మణ్ (1)
  • ప్రొఫెసర్ భంగ్యా భూక్యా (10)
  • బండమీది శ్రీనివాస్ (1)
  • బతుకమ్మ (2)
  • బామ (1)
  • బి సి (6)
  • బి.ఎస్.రాములు (1)
  • బిసి (1)
  • బీఫ్ ఫెస్టివల్ Articles (22)
  • బృందాకరత్‌ (4)
  • బొజ్జా తారకం (2)
  • భగత్ సింగ్ (1)
  • భూ సంస్కరణల చట్టం (1)
  • భూతం ముత్యాలు (1)
  • మందకృష్ణ మాదిగ (18)
  • మల్లెపల్లి లక్ష్మయ్య (3)
  • మహిళలు (20)
  • మహెజబీన్ (1)
  • మానవ హక్కులు (1)
  • మాన్యువల్‌ స్కావెంజర్స్‌ (2)
  • ముస్లిం (6)
  • మూడో జెండర్ (1)
  • యం.ఎఫ్.గోపీనాథ్ (14)
  • యింద్రవెల్లి రమేష్ (1)
  • రంగనాయకమ్మ (4)
  • రమేశ్ హజారి (2)
  • రావెల కిషోర్‌ బాబు (1)
  • వరవరరావు (12)
  • వికలాంగులు (22)
  • విప్లవ సాంస్కృతిక (1)
  • విభజన (4)
  • విమల. కె (1)
  • విశారధన్ (1)
  • వేముల ఎల్లయ్య (4)
  • వేలుపిళ్లై ప్రభాకరన్ (1)
  • సంగిశెట్టి శ్రీనివాస్ (5)
  • సా మాజికన్యాయం (13)
  • సామజిక తెలంగాణా (10)
  • సామాజిక శాస్త్రాల (1)
  • సామాజికన్యాయం (13)
  • సి. కాశిం (10)
  • సిలువేరు హరినాథ్ (2)
  • సీపీఐ (మావోయిస్టు) (2)
  • సుజాత సూరేపల్లి (25)
  • హరగోపాల్ (33)
  • హైదరాబాద్‌ రాష్ట్రం దళితుల పోరాటం (1)
  • హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ 2014 (2)

Followers

Blog Archive

  • ▼  2016 (5)
    • ▼  April (4)
      • మార్క్సి‌స్టు‌దృక్కోణంలో కులం By -ప్రభాత్‌ పట్నాయక...
      • పాలనలో చెరగని సంతకం Byరావెల కిషోర్‌ బాబు సాంఘిక, ...
      • భారత ‘అమూల్య రత్న’ బాబూజీ! By Krupakar Madiga
      • జాతీయ నాయకుడు జగ్జీవన్‌రామ్‌ By డొక్కా మాణిక్యవరప్...
    • ►  February (1)
      • ‘దళిత’ అక్షరానికి దారులు వేసిన పుస్తకం! By Sangish...
  • ►  2015 (8)
    • ►  December (2)
    • ►  October (1)
    • ►  May (3)
    • ►  February (1)
    • ►  January (1)
  • ►  2014 (94)
    • ►  December (4)
    • ►  November (2)
    • ►  October (3)
    • ►  September (1)
    • ►  August (10)
    • ►  July (24)
    • ►  June (7)
    • ►  May (13)
    • ►  April (13)
    • ►  March (3)
    • ►  February (11)
    • ►  January (3)
  • ►  2013 (263)
    • ►  December (14)
    • ►  November (27)
    • ►  October (25)
    • ►  September (29)
    • ►  August (14)
    • ►  July (16)
    • ►  June (10)
    • ►  May (21)
    • ►  April (30)
    • ►  March (23)
    • ►  February (30)
    • ►  January (24)
  • ►  2012 (443)
    • ►  December (36)
    • ►  November (20)
    • ►  October (18)
    • ►  September (14)
    • ►  August (24)
    • ►  July (33)
    • ►  June (32)
    • ►  May (29)
    • ►  April (60)
    • ►  March (61)
    • ►  February (74)
    • ►  January (42)
  • ►  2011 (269)
    • ►  December (31)
    • ►  November (40)
    • ►  October (30)
    • ►  September (167)
    • ►  April (1)

About Me

My photo
Dalit Blog
The education and political power are the two main weapons... And it is democratic right.
View my complete profile
Travel theme. Powered by Blogger.