Monday, October 31, 2011

(హజారే నిరశన )అసంపూర్ణ ఉద్యమం By ఉణుదుర్తి సుధాకర్ Andhra Jyothi 1/11/2011


అసంపూర్ణ ఉద్యమం

అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన అన్నా హజారే నిరశన దీక్ష పాక్షిక విజయంగా ముగిసిందని ఇప్పుడందరూ అంగీకరిస్తున్నారు. ఈ ఊహించని విజయం వెనక ఉన్న శక్తులేమిటి? ఈ ఉద్యమం, రాబోయే కాలంలో రానున్న ఏయే మార్పుల్ని సూచిస్తోంది? హజారే ఉద్యమంలో నాలుగు ప్రధానాంశాలు స్పష్టంగా కన్పిస్తాయి. మొదటిది- ఇదొక స్వయం ప్రజ్వలితమైన స్పాంటేనియస్ ఉద్యమం. అతి తక్కువ కాలంలోనే ఇది దేశవ్యాప్తంగా విస్తరించింది. నిప్పుకణం కోసం ఎదురుచూసిన ఎండుటాకుల కుప్ప మాదిరిగా దేశం యావత్తూ ఒక్కసారి భగ్గుమంది. రాంలీలా మైదానం ఒక యాత్రా స్థలంగా మారింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే ఉత్సాహం వెల్లివిరిసింది.

అన్ని వర్గాలూ, వయో సమూహాలూ, ఆడా మగా, చిన్నా చితకా స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. అందరి ముఖాల్లోనూ ఒక ఆశాకిరణం తాండవించింది. అయితే ఈ ఉద్యమం ప్రధానంగా -ఆర్థిక సంస్కరణల తరవాత ఉద్భవించిన కొత్త మధ్య తరగతి నడిపించిన మొదటి ఆందోళన. అందుకే కొత్తగా సచేతన మవుతూన్న ఈ సామాజిక వర్గాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడం అవసరం. భారతదేశపు స్వాతంత్రోద్యమంతో సహా చరిత్రలోని అన్ని ఉద్యమాలకూ, విప్లవాలకూ పునాది ఏర్పరిచింది మధ్యతరగతి ప్రతినిధులే. వామపక్షీయులు, పెట్టీ బూర్జువా అనే తిట్టు మాటని ఎంత తరచుగా ప్రయోగించినప్పటికీ ఇది వాస్తవం.

గతంలోనూ, ఇప్పుడూ కూడా ఇందుకు రెండే కారణాలు కనిపిస్తున్నాయి. అవి-దోపిడీనీ, అన్యాయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోగల వెసులుబాటు ముందుగా మధ్యతరగతి వారికి ఏర్పడడమూ, ప్రజల పక్షాన నిలబడాలని వాళ్ళు నిర్ణయించుకోవడమూను. ఇప్పటి అవినీతి వ్యతిరేక ఉద్యమానికి కూడా ఇదే వర్తిస్తుంది. భారతదేశపు మధ్యతరగతి వర్గీయుల సంఖ్య పది కోట్లా, పాతికకోట్లా అనే చర్చను పక్కన పెడితే ఆర్థిక సంస్కరణల తరువాత ఈ వర్గం గణనీయంగా పెరిగిపోయిందనీ, ఈ వర్గంలో కేవలం అగ్రవర్ణాలే కాక, ఇతర కులాల ప్రాతినిధ్యం (అట్టడుగు కులాల నుంచి మధ్యతరగతిలోకి అడుగుపెట్టిన వారితో సహా) గుణాత్మకంగా మారిపోయిందనీ చెప్పుకోవాలి. ఒక అంచనా ప్రకారం వర్తమాన భారతదేశపు మధ్యతరగతి జనాభా మొత్తం అమెరికా జనాభాకు అతిచేరువలో ఉన్నది. సంఖ్యా పరంగా అందుకే అది ఇటు దేశీయ పరిశ్రమలకూ, వాణిజ్యానికే కాక, అటు బహుళ జాతి సంస్థలకూ కూడా అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

సంస్కరణలకు పూర్వం మన మధ్యతరగతిలోని ప్రధాన సభ్యులు భూములు కోల్పోయిన బ్రాహ్మణులు, భూమిని ఇంకా అంటిపెట్టుకొని ఉన్న అగ్రకుల సమూహాలు, శూద్రులు. వీళ్ళలో అధిక శాతం విద్యావంతులు, తద్వారా ఉపాధ్యాయులు, న్యాయవాదులు, ప్రభుత్వ రంగ ఉద్యోగులు వగైరా. భూమి బలం ఉన్న వాళ్ళల్లో కొంతమంది కొత్తగా ఏర్పడుతూన్న వ్యాపారాల వైపు మొగ్గితే మరికొంత మంది (ముఖ్యంగా ప్రాంతీయ) రాజకీయాల్లోకి మళ్ళారు. ఈ గతకాలపు మధ్యతరగతి నుంచే కమ్యూనిస్టు ఉద్యమం మొదలు జెపి ఉద్యమం దాకా అన్ని రకాల నాయకత్వ శ్రేణులూ పుట్టుకొచ్చాయి. ఆనాటి మధ్యతరగతిని స్థూలంగా (చర్చకోసం) సర్కారీ మధ్యతరగతి అని భావిస్తే, నేటి మధ్యతరగతిని కార్పొరేట్ మధ్యతరగతిగా ఊహించవచ్చు. ముఖ్యమైన అంశం ఏమిటంటే గతకాలపు మధ్యతరగతితో పోలిస్తే, నేటి మధ్యతరగతిలో వివిధ కులాల ప్రాతినిధ్యం, ప్రమేయం పెరిగాయనే చెప్పుకోవాలి. మరి ఈ కలగూరగంపలోని ఏ సారూప్యత వీరినందరినీ అన్నా హజారే ఉద్యమం వైపు నడిపించింది?

ఏ ఉద్యమంలోనైనా ప్రజల్ని కూడగట్టు కోవడానికి ఒక తీవ్ర మైన అసంతృప్తి, ఒక ఉమ్మడి శత్రువు ఉండి తీరాలి. అందీఅందని ఆర్థికాభివృద్ధి, అవినీతి మూలంగానే ఆర్థిక ప్రగతి అందకుండా పోతోందనే అసంతృప్తి, ఆవేదన ఒక వైపు, ఇందుకు సంస్థాగత రాజకీయాలు, ముఖ్యంగా రాజకీయ నాయకులే ప్రధాన శత్రువులుగా అడ్డుపడుతున్నారనే ఆలోచన మరో వైపు అన్నా ఉద్యమపు చోదక శక్తులు. రాజకీయవ్యవస్థపై ప్రకటితమైన తీవ్ర అసంతృప్తి చివరికి రాజ్యాంగం తమకు హమీ ఇచ్చిన వెసులు బాట్లకు ముప్పు కలిగిస్తుందేమోనని ఒక దశలో దళితులు, బహుజనులు, మైనారిటీ వర్గాల వారు కలవరం చెందారు. అటువంటిదేమీ లేదని సర్దిచెప్పడానికి అన్నా హజారే ఉద్యమం విరమించే నాటికి ఒక దళిత బాలికనీ, ఒక ముస్లిం బాలికనీ స్టేజి మీదకి తీసుకురావాల్సిన అవసరాన్ని నిర్వాహకులు గుర్తించారు. ఏ ఉద్యమానికైనా కనీస అవసరాలైన అసంతృప్తి, ఉమ్మడి శత్రువు అన్నా ఉద్యమంలో కూడా ఉన్నాయి గాని, మూడో మూల స్తంభం అయిన 'మరో ప్రపంచం' లేదు.

ఉన్నా అది అసంపూర్ణంగానే ఉండిపోయింది. అప్పటికప్పుడు పుట్టుకొచ్చే ఉద్యమాలన్నిటినిలోనూ కనిపించే అసంపూర్ణతే ఇది ('సంపూర్ణ విప్లవం' అని నినదించిన జేపీ ఉద్యమంలో కూడా ఈ అస్పష్టత అనివార్యం అయింది). అన్నా ఉద్యమానికి 'మరో ప్రపంచం'గాని ప్రత్యామ్నాయాన్ని చేరుకొనే మార్గనిర్దేశనం గానీ లేనప్పటికీ ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ రాబోయే మంచి రోజుల పట్ల తమ తమ అభిప్రాయాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఉహాజనిత ప్రత్యామ్నాయంలోని ప్రధాన అంశాలు: అవినీతి లేని భారతదేశం, అందరికీ అందుబాటులో అభివృద్ధి, చట్టబద్ధమైన పాలన, సంక్షే మరాజ్యం... ఈ విధంగా విస్తరించుకుంటూ పోవచ్చు. అటు హిందూరాజ్యాన్ని , ఇటు సామ్యవాదాన్ని దూరంగా ఉంచి, రాజకీయాలకు అతీతమైన (అంతకన్నా ముఖ్యంగా రాజకీయాలకు వ్యతిరేకమైన) ఉద్యమంగా దీని తొలిదశను నడిపించడంలో అన్నా ఉద్యమపు నిర్వాహకులు (నాయకులు అనలేం) సఫలీకృతులయ్యారు. భారతదేశపు నిర్దిష్ట కఠిన వాస్తవాలైన కుల వైరుధ్యాల్ని, ప్రాంతీయ అసమానతల్నీ, మత పరమైన విభజనల్ని, రాజకీయ శక్తుల్నీ ఈ ఉద్యమం తాత్కాలికంగానైనా ఎలా అధిగమించగలిగింది? ఇది ఎంతకాలం సాధ్యం?

అన్నా ఉద్యమం ఏ ఒక్కరాజకీయ పార్టీనో, సమూహాన్నో తన లక్ష్యంగా చేసుకోకుండా 1947 తరవాత మొట్ట మొదటిసారిగా మొత్తం వ్యవస్థాగత రాజకీయ సంస్థలన్నింటినీ వాటితో బాటు పార్లమెంట్‌నీ రక్షాత్మక వ్యూహంలోకి నెట్టివేసింది. రాజ్యాంగపు ఔన్నత్యాన్ని, పార్లమెంటు ఆధిపత్యాన్నీ, వీటితో బాటు తమ ఉనికినీ సమష్టిగా పునరుద్ఘాటించుకోవలసిన స్థితికి రాజకీయ పక్షాలన్నీ చేరుకున్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా, నాయకుడైనా ప్రజలకే జవాబుదారులనే గుర్తింపు సర్వత్రా బలపడింది. ఇది అన్నా ఉద్యమం సాధించిన ప్రధాన విజయం. ముందు ముందు ఏం జరగబోతోంది? నిజంగా అవినీతి అంతరిస్తుందా? ఈ ప్రశ్నలకి జవాబు వెతుక్కోవడానికి ముందు అవినీతి ఒక జాతీయ జాడ్యం లేదా వ్యసనం కాదు, లంచగొండితనం చేతి దురద కాదు అని గ్రహించాలి. పరిమితమైన అవకాశాల నుంచి, అభద్రత నుంచి దురాశ నుంచి మొదలైన అవినీతి ఇందిరాగాంధి కాలంలో వ్యవస్థీకృతమయింది.

లైసెన్సులు, పర్మిట్లు, 'సోషలిస్టు' మోడల్‌లో అక్రమ సంపాదనకు రాజమార్గాలయ్యాయి. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాక పాత మోడల్ పోయి దాని స్థానంలో సరికొత్త అవినీతి అవకాశాలు, మార్గాలు ఏర్పడ్డాయి. అంతకన్నా ముఖ్యంగా అవినీతి స్థాయి అనూహ్యంగా పెరిగిపోయింది. సుమారు ఏభై ఏళ్ళ స్వాతంత్య్రం తరవాత కీలక రంగాల్లో తన అసమర్థతను పెంచుకొంటూ పోయిన పాలకులు (ఏ పార్టీ వారైనా), చేతులెత్తేశారు. విద్య, ఆరోగ్యం, మౌలికసదుపాయాలు అదే క్రమంలో ప్రైవేటురంగం చేతుల్లోకి మారాయి. చివరికి పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌తో అవినీతి పరాకాష్టకు చేరుకుంది. ఈ అభివృద్ధి మేడిపండు మాత్రమే అని ఇప్పుడిప్పుడే అందరికీ తెలిసివస్తోంది. అయితే ఈ మేడిపండు సృష్టి వెనుక కొత్త మధ్యతరగతి విడుద లచేసిన మార్కెట్ శక్తులు దాగి ఉన్నాయి.

కొత్త మధ్యతరగతి సృష్టించిన మార్కెట్లకూ వాణిజ్య అవకాశాలకూ డిమాండ్ చేస్తున్న వస్తువులకూ సర్వీసులకూ సరిగ్గా అమరిపోయే విధంగా కొత్త అవినీతి బాటలు ఏర్పడ్డాయి. ప్రపంచంలోనే అత్యధిక వృద్ధిరేటుతో పెరుగుతున్న భారతదేశపు మొబైల్ ఫోనుల కనెక్టివిటీకీ 2జీ స్కామ్‌కి దగ్గర చుట్టరికం ఉన్నది. అలాగే మౌలిక సదుపాయాలు, విద్యా ఆరోగ్య వ్యాపారాలు కూడా అభివృద్ధి కన్నా వేగవంతంగా అవినీతిమార్కెట్ శక్తులకు అనుగుణంగా స్పందించింది. నేటి తరం రాజకీయ నాయకులు ముందుగా అక్రమ సంపాదనకూ పకడ్బందీ అయిన చట్రాన్ని నిర్మించుకొని తర్వాతే దాని చుట్టూ అభివృద్ధి పథకాలను రూపొందిస్తున్నారు. కొత్త అవినీతికి ఉన్న మరో లక్షణం భూదాహం. ఏదో ఒక అభిృద్ధిపథకం, పరిశ్రమ పేరుతో వందలాది ఎకరాలను స్వంతం చేసుకొనే ప్రయత్నంలో అంతా నిమగ్నమై ఉన్నారు. ఐటి అయినా, ఇన్ ఫ్రాస్ట్రక్చరైనా, ప్రైవేటు కళాశాలలైనా అందరిదీ అదే దారి. ప్రభుత్వం తన పాత్రని కుదించుకుంటూ పోతూ ఉంటే ఈ కొత్త అభివృద్ధి శక్తులు మరింత విజృంభిస్తున్నాయి. వాటిని ఎవరైనా అడ్డుకుంటే అభివృద్ధి వ్యతిరేకులుగా వాళ్ళని చిత్రీకరించడం జరుగుతున్నది.

అభివృద్ధికీ అవినీతికీ మధ్య ఏర్పడిన ప్రగాఢమైన సంబంధాన్ని విడగొట్టి ఆ జంటను వేరుచెయ్యాలని అన్నా ఉద్యమం ప్రయత్నించింది. కనీసం ఆ దిశలో మొదటి అడుగు వేసింది. ఇది ఆ ఉద్యమం సాధించిన రెండో ఘన విజయం. అసలు ఏ రకమైన అభివృద్ధిఅయినా అట్టడుగు వర్గాల నుంచే మొదలవ్వాలనే సాధారణ సూత్రాన్ని మరచిపోయిన పాలకులు ఇప్పుడు అందరూ అభివృద్ధిక్రమంలో భాగస్వాములవ్వాలని ఉద్ఘాటిస్తున్నారు. ఇవాళ అభివృద్ధి ఎవరి కోసం అనే మౌలికప్రశ్న రేఖామాత్రంగానైనా చాలా మందికి స్ఫురిస్తున్నది. ఒక వేళ ఈ ప్రశ్నకి జవాబు చెప్పుకోగలిగి, అభివృద్ధిమోడల్‌ని సంస్కరించుకోగలిగితే అది నిజమైన ఆర్థిక సంస్కరణ అవుతుంది. అయినప్పటికీ ఆ మోడల్ నయినా అవినీతి కౌగిలి నుంచి విడదీయడం ఎలా? అనే ప్రశ్న మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ రెండో ప్రశ్నకు జవాబు ఒక్కటే. అది ప్రజాస్వామ్య విలువల్ని, సంస్థల్నీ బలోపేతం చెయ్యడం.

ఈ విషయం అందరికన్నా బాగా పాలకులకీ తెలుసు గనుక అవకాశం దొరకగానే అన్నా బృందంతో మొదలుపెట్టి, స్వచ్ఛంద సంస్థలపైనా సమాచార హక్కు పైనా, పత్రికా స్వేచ్ఛ పైనా ఎదురుదాడులు మొదలుపెట్టారు. మున్ముందు ఇవి ఇంకా ఉధృతం కాబోతున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ ఎదురుదాడులు ఆగే అవకాశం లేదు. అన్నా మొదలు పెట్టిన ఉద్యమం కొనసాగడమే ఇందుకు పరిష్కారం. చివరగా ఒక మాట. అవినీతి వ్యతిరేక ఆందోళన ద్వారా మొదటిసారిగా బరిలో దిగిన కొత్త మధ్య తరగతి రాజకీయాలకు అతీతంగా ఉండిపోతుందని భావించడం సరికాదు. వాళ్ళల్లో కొంత మంది స్వచ్ఛంద సంస్థలకూ, ప్రజాస్వామ్య వాదులకూ అలాగే ఆధ్యాత్మిక సంస్థలకూ ప్రాంతీయ రాజకీయాల చట్రంలో ఎక్కడో ఒకచోట మరికొంత మంది ఇమిడిపోవచ్చు. అయితే ఎవరి నిర్ణయాలకు వారిని వదిలివేసేందుకు రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయనుకుంటే అది అమాయకత్వం అవుతుంది. కొత్తగా ఏర్పడుతున్న ఈ సమూహాన్ని తమకు అనుగుణంగా మలచుకొనేందుకు వివిధ పార్టీలు కసరత్తులు మొదలుపెట్టాయి.

ప్రస్తుతానికి కాంగ్రెస్ తన శక్తుల్నీ, సమయాన్నీ ఎదురుదాడులకే పరిమితం చేసింది. ప్రధాన రాజకీయ పార్టీలన్నింటిలోకీ బిజెపికీ ఈ కొత్త మధ్యతరగతిని తనవైపు తిప్పుకోగల అవకాశాలు మెండుగా ఉన్నాయి. అఖండ భారత్, బాబాల ఆధ్యాత్మికత, చరిత్ర పట్ల అసమగ్ర, ఆశాస్త్రీయ అవగాహన, అన్నిటి కన్నా ముఖ్యంగా తీవ్ర అసంతృప్తి బిజెపికి మంచి సాధనాలు. గుజరాత్‌ను ఒక ఆదర్శ వంతమైన అభివృద్ధి మోడల్‌గా ప్రచారం చెయ్యడం , నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా సూచించే ప్రయత్నం, ఇవేవీ కూడా యాదృచ్ఛికం కాదు. రాబోయే పరిణామాలకు ముందస్తు హెచ్చరికలు. ఆరెస్సెస్, ఎబివిపిల మార్గాన కాకుండా మధ్యతరగతిని డైరెక్ట్‌గా రిక్రూట్ చేసుకునేందుకు మొట్ట మొదటి సారిగా బిజెపికి ఒక గొప్ప అవకాశం ఏర్పడింది. అద్వానీ రథయాత్ర వెనక ఉన్న అసలైన ఆశయం బహుశా ఇదే.
- ఉణుదుర్తి సుధాకర్ 

అక్కరకురాని బీసీ కమిషన్ By ఆర్. కృష్ణయ్య అధ్యక్షులు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం Andhra Jyothi 1/11/2011


అక్కరకురాని బీసీ కమిషన్

ప్రస్తుతం రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల కాలపరిమితి ముగిసింది. గత పాలకమండలిని పునర్నియామకం చేయడానికి ప్రభుత్వం సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. కొత్తగా చైర్మన్, సభ్యులను నియమించేందుకు కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. అయితే రాష్ట్రంలోని బీసీ కమిషన్‌కు ఏ అధికారాలు లేవు. కేవలం నామ మాత్రంగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాలలో బీసీ కమిషన్‌కు విశేష అధికారాలు కల్పిస్తూ ఆయా ప్రభుత్వాలు చట్టాలను సవరించాయి. ఇదే రీతిలో మన రాష్ట్ర బీసీ కమిషన్ చట్టం 20/1993ను సవరించాలి. బీసీలకు ప్రయోజనం చేకూర్చేవిధంగా అన్ని సమస్యలలో బాసటగా నిలిచే "అపద్భాందువు''గా బీసీ కమిషన్‌ను పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ డిమాండ్ బీసీ వర్గాలనుండి బలంగా ముందుకు వస్తుంది. అధికారాలు లేకుండా "ఆచరణ'' చేయమంటే సాధ్యమయ్యే పనికాదు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అన్నట్లు రాజకీయ లబ్ధికోసం "రాజ్యాంగాన్నే'' ఇప్పటికి 95 సార్లు సవరించుకున్న మనం బీసీలకు చేదోడు-వాదోడుగా ఉండేందుకు బీసీ కమిషన్ చట్టాన్ని పలు ఆమోదయోగ్యమైన సవరణలతో ముందుకు తీసుకువెళ్ళడం అసాధ్యం ఏమికాదు. బీసీల అభివృద్ధి, రక్షణ సమగ్ర వికాసాన్ని ఆకాంక్షించిన మనదేశ అత్యున్నత న్యాయస్థానం 1993లో మండల్ కేసుగా ప్రసిద్ధిపొందిన ఇందిరాసాహ్ని వ్యాజ్యంలో వెలువరించిన తీర్పులో శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్లు ఏర్పాటు చేయాలని సూచించింది. ఆ మేరకు జాతీయ, రాష్ట్రాల స్థాయిలో ప్రభుత్వాలు కమిషన్లు నెలకొల్పినప్పటికి ఎలాంటి అధికారాలను కల్పించకపోవడంతో 'రబ్బర్‌స్టాంప్' ఆర్గనైజేషన్లుగా రూపాంతరం చెందాయి తప్ప, ఈ సామాజిక వర్గాలకు ఇన్నాళ్ళుగా ఏ మాత్రం ఆశించినరీతిలో ప్రయోజనాలు చేకూర్చ లేదు. ఇందుకు ప్రభుత్వపరంగా బీసీ సామాజిక వర్గాల సంక్షేమంపట్ల చిత్తశుద్ధి లోపించడం ఒక కారణం అయితే ఈ వర్గాలను ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం మరొక కారణం. అంతేగాక ఈ వర్గాలకు 'అధికారం' శాసించేస్థితికి రాకపోవడం మరో ప్రధాన కారణం.

బీసీ వర్గాలకు చెందిన నాయకులు ప్రభుత్వాధినేతలుగా ఉన్న రాష్ట్రాలలో "ఈ కమిషన్ల'' చట్టాలకు మౌలిక సవరణలు చేశారు. అందుకు ఉదాహరణగా ఉత్తరప్రదేశ్, సిక్కిం, కర్నాటక, బీహార్ రాష్ట్రాలలో కమిషన్లు మార్గదర్శకంగా నిలుస్తాయి. ఎస్.సి, ఎస్.టి, మైనార్టీ, మహిళా కమిషన్లకు విశేషాధికారాలు కల్పించి బీసీ కమిషన్‌కు అధికారాలు లేకపోవడం సహించరాని విషయం. మన రాష్ట్రం విషయానికి వస్తే బీసీల సమగ్రాభివృద్ధి కోసం యేటా రూ.2700 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తూ దేశం మొత్తానికి సంక్షేమ కార్యక్రమాల అమలులో మొదటి స్థానంలో నిలుస్తున్నాం. ఇక్కడి పథకాలు ఒక్కరోజులో వచ్చినవికావు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యలో 35 యేళ్ళుగా అనేక పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా బీసీలు దశల వారీగా సాధించుకున్నవి. ఇక్కడ అమలులో ఉన్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలులో లేవు. అయితే కళ్ళముందే సంక్షేమ పథకాలకు అధికారులు తూట్లు పొడిచే చర్యలకు ప్పాలడుతున్నప్పుడు సమగ్రంగా విచారించి చర్యలు చేపట్టడానికి ప్రత్యేకమైన చట్టబద్ధ సంస్థ అవసరం వుంది.

బీసీలు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో అభివృద్ధిలోకి రావాలని రాజకీయాలకు దూరంగా ఉద్యమించి దశలవారీగా సాధించుకున్న సంక్షేమ పథకాల అమలులో అనేక అక్రమాలు-అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షించడం, అమలు తీరుతెన్నులు పరిశీలించడం, ఉదాసీన వైఖరిని కట్టడి చేయడం, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవడం, సమగ్రమైన అధ్యయనాలు నిర్వహించడం, సర్వేలు చేపట్టడం, ఈ సామాజిక వర్గాల వాస్తవ జీవన స్థితిగతులను నిశితంగా పరిశీలించడం, రిజర్వేషన్ల అమలులో లోపాలను సరిదిద్దడం, సమర్థంగా అమలయ్యేలా చర్యలు చేపట్టడం, కొత్త పథకాలకు రూపకల్పన చేయడం, ఆర్థిక సంవత్సరం కోసం ఖర్చుచేయాల్సిన నిధులకుగాను ముందస్తు 'బడ్జెట్' ఇతర ప్రణాళికలు తయారు చేయడం, అవినీతికి తావులేని విధంగా బీసీ సంక్షేమ శాఖ అమలుచేసే అన్ని పథకాలు, కార్యక్రమాలపై పూర్తిస్థాయిలో నిఘావిభాగంగా పనిచేసే ఒక 'పర్యవేక్షణ వ్యవస్థ' అవసరం. ప్రతి అంశాన్ని ముఖ్యమంత్రి, మంత్రుల స్థాయిలో పరిష్కరించడం సాధ్యమయ్యే పనికాదు.

అందుకు చట్ట ప్రకారం ఏర్పాటై ప్రత్యేకంగా ఉన్న 'రాష్ట్ర బీసీ కమిషన్'ను ఉపయోగించుకోవాల్సి ఉంది. ఈ దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్‌కు అధికారాలు పెంచుతూ పటిష్టపరచవలసిన అవసరం ఉంది. ప్రస్తుతం మన రాష్ట్ర బీసీ కమిషన్‌కు బీసీ జాబితాలో కులాలను తొలగించడం, చేర్చడం మినహా, వేరే అధికారాలు లేవు. అలాగే ప్రభుత్వం కోరితే ఏదైనా అంశంపై నివేదికలు సమర్పించడంలాంటి పరిమిత అధికారాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం మేరకు కమిషన్ చైర్మన్, సభ్యులను బీసీల వాస్తవ జీవన స్థితిగతులపై ఏమాత్రం పరిజ్ఞానం లేని వారిని నియమించడం వలన 'కమిషన్' పనితీరు ఆశాజనకంగా కొనసాగడం లేదు. ప్రధానంగా చైర్మన్‌గా రిటైర్డ్ జడ్జీలను నియమిస్తుండడం వలన వయోభారంతో వీరు సరిగా పనిచేయలేక పోతున్నారు. వీరికి బీసీల పట్ల అవగాహన ఉండటం కూడా అరుదు. వీరు ఆకళింపు చేసుకునేసరికే పుణ్యకాలం కాస్తా పూర్తయి కొత్త పాలకమండలి నియామకం కావడం సాధారణ అంశంగా మారింది.

జాతీయ, రాష్ట్రాల పరిధుల్లో రాజ్యాంగబద్ధ హక్కులు కలిగి ఉన్న ఎస్.సి, ఎస్.టి, మహిళా, మైనార్టీ కమిషన్ల సభ్యులు ప్రధానంగా చైర్మన్ల నియామకాలలో ఆయా సామాజిక రంగాలలో విశేషంగా కృషిచేస్తున్న ప్రముఖుల్ని, సామాజిక వేత్తలను, రాజనీతిజ్ఞులను నియమించుకునే సంప్రదాయాన్ని కేంద్ర, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. అలాంటప్పుడు బీసీ కమిషన్లకు ఈ వర్గాలపై పరిజ్ఞానంలేని జడ్జీలను నియమించాలనే నిబంధన సమంజసం కాదు. ఇందులో ఎలాంటి హేతుబద్దత లేదు. సాధారణంగా రిటైర్డ్ జడ్జీలు మాత్రమే చైర్మన్లుగా పనిచేయడానికి సమ్మతిస్తారు. అయితే ఈ హోదా వారికి సమాజంలో గౌరవం లభించడానికి దోహదం చేస్తుంది. కాని బీసీలకు ఏమాత్రం ప్రయోజనం లేదనే వాస్తవాన్ని ప్రభుత్వాలు గమనించాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో ఒక అడుగు ముందుకు వేసి బీసీల సమగ్రాభివృద్ధిని కాంక్షించిన ఉత్తరప్రదేశ్, సిక్కిం, కర్ణాటక, బీహార్ రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడి బీసీ కమిషన్ చట్టాలను సవరించి, కమిషన్‌లకు ఆ ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను పర్యవేక్షించే విశేషాధికారాలను కల్పించాయి. చైర్మన్, సభ్యులుగా సామాజిక వేత్తలను, ఈ వర్గాల హక్కుల కోసం పనిచేసే రాజకీయ వేత్తలను నియమించుకోవడానికి వీలుగా చట్టాల్ని సవరించుకున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్‌గా ఈ సామాజిక వర్గాలకు చెందిన సామాజిక వేత్తను లేదా సామాజిక హక్కుల కోసం విశేషంగా పనిచేసిన రాజనీతిజ్ఞుడిని నియామకం చేయడానికి కమిషన్ చట్టం 20/1993ను సవరించాలి. ఇందుకు సిక్కిం, కర్ణాటక, బీహార్, యుపి బీసీ కమిషన్ చట్టాలను ఆధారంగా తీసుకోవాలి.

బీసీ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, రిజర్వేషన్ల అమలును పూర్తిస్థాయిలో పర్యవేక్షించి బాధ్యులపై చర్యలు చేపట్టడానికి కమిషన్ అధికారాలను విస్తృతపర్చాలి. అందుకు ఉత్తరప్రదేశ్ బీసీ కమిషన్ చట్టాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులను ముగ్గురినుండి, ఐదుగురికి పెంచాలి. ఇందులో ఒకరు తప్పక ఈ సామాజిక వర్గాలకు చెందిన మహిళా ప్రతినిధికి అవకాశం కల్పించాలి. అందుకు ఉత్తరప్రదేశ్, కర్నాటక బీసీ కమిషన్ చట్టాలను పరిగణలోకి తీసుకోవాలి. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీకాల పరిమితి 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలకు పెంచాలి.
- ఆర్. కృష్ణయ్య
అధ్యక్షులు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం

Thursday, October 27, 2011

తెలంగాణ ఉద్యమం- సామాజిక న్యాయం By Chamakura Raju Dated 28/10/2011


తెలంగాణ ఉద్యమం- సామాజిక న్యాయం
- నాయకత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం
- రాబోయే తెలంగాణలో వారి వాటా కూడా ప్రశ్నార్ధకమే
- ఉద్యమంలో ముందుకు వచ్చిన రెండు అగ్రకులాలు
- బీసీల తెరమరుగుకు అన్ని పార్టీలలో కుట్రలు
- మంద కృష్ణ నినాదాన్ని ఎందుకు అందిపుచ్చుకోరు?
- ఇప్పటికైనా వాటా కోసం బీసీలు డిమాండ్‌ చేయాలి!


telanganaతెలంగాణ ఉద్యమం మహోద్యమంగా మారింది. తెలంగాణ ప్రజానీకం ఉద్యమంలో పాల్గొంటున్న క్రమంలో ఒక బలమైన వాదం వినిపిస్తోంది. అదే సామాజిక న్యాయ నినాదం. ఇంత మహా ఉద్యమం జరుగుతుంటే, ఈ సామాజిక న్యాయ నినాదం (కొందరు దీనిని కుల వాదంగా చూస్తున్నారు) ఇంత కీలక దశలో, సంక్లిష్ట సమయంలో అవసరమా అన్నది నేడు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. అయితే ఈ వాదం వినిపించడానికి కారణాలను మాత్రం ఎవరూ విశ్లేషించడం లేదు. పైగా దీనిని ఒక శుష్క వాదంగా కొట్టివేస్తున్నారు. ఈ దశలో సామాజిక న్యాయ నినాదం ఆవశ్యకతపై విశ్లేషించవలసి ఉన్నది.
తెలంగాణ ఉద్యమం నడుస్తున్న చరిత్ర ప్రతి తెలంగాణ పౌరునికి తెలుసు.

ఉద్యమంతో అన్నీ తెలుసుకున్నారు. అయితే ఈ ఉద్యమంలో కనుపించని కోణం కూడా మరొకటి ఉంది. అవే అగ్రకులాలు వేస్తున్న ఎత్తుగడలు, పాచికలు, పకడ్బందీగా అమలు చేస్తున్న కుట్రలు. 2001లో ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ ఆవిర్భవించింది. ఈ పార్టీ ఆవిర్భావానికి ముందు తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణలో- నియోజక వర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ దేవేందర్‌ గౌడ్‌, శ్రీనివాస యాదవ్‌, కృష్ణ యాదవ్‌, కడియం శ్రీహరి, సుద్దాల దేవయ్య, ఎల్‌. రమణ వంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు చక్రం తిప్పగలిగారు. సమర్ధవంతమైన మంత్రులుగా రాణించగలిగారు. ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ ఆవిర్భావం అనంతరం జరిగిన రాజకీయ పరిణామ క్రమంలో ఎన్నో మార్పులు సంభవించాయి. క్రమంగా నియోజక వర్గాల స్థాయిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నేతలు అన్ని పార్టీల్లో కనుమరగయ్యారు.

అదే క్రమంలో వెలమ కుల నేతలు వెలగడం మొదలు పెట్టారు. మావోయిస్టు (అప్పట్లో పీపుల్స్‌ వార్‌) పార్టీ హెచ్చరికలతో తమ గ్రామాలు, భూములు వదిలి నగరాలకు వలస వెళ్ళారు. అనంతరం ఉద్యమం వల్ల తెలంగాణ వ్యాప్తంగా ఎందరో వెలమ నాయకులు ఎదిగారు. 2004 ఎన్నికల అనంతరం డా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో కాంగ్రెస్‌ పార్టీ వల్ల కోమటిరెడ్డి, జానారెడ్డి, జీవన్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులు మంత్రులుగా ప్రముఖంగా ముందుకు వచ్చారు. వైఎస్‌ఆర్‌ మంత్రివర్గంలో చేరిన తెరాస మంత్రులుగా వెలమలే వెలిగారు. మొత్తంగా నాటి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా వెలమ దొరలు, కాంగ్రెస్‌ ద్వారా రెడ్లు రాజ్యాలు (జిల్లాలలో) ఏలుతున్నారు.

అన్ని రాజకీయ పార్టీల్లో ఎదుగుదలను పరిశీలిస్తే, ఎంతో మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలను తెలంగాణ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల్లో కేవలం జెండాలు మోసే, జిందాబాద్‌ కొట్టే కార్యకర్తలుగా, ద్వితీయ శ్రేణి నాయకులుగా పరిమితం చేశారు. కె. చంద్రశేఖరరావు నాయకత్వంలో ఎంతో మంది (ఆయన అల్లుడు, బిడ్డ, కుమారుడు సహా) ఇన్‌స్టంట్‌ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వెలమలే ఎదిగారు. కాంగ్రెస్‌లో రెడ్లే ఇన్‌స్టంట్‌ ఎంపీలుగా తయారయ్యారు. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే, మరో వైపు జాయింట్‌ ఏక్షన్‌ కమిటీ (జెఏసీ)ల ద్వారా మరొక వ్యూహం అమలులోకి వచ్చింది. ఈ తెలంగాణ జేఏసీల ఆవిర్భావం, పటిష్ఠం, ప్రస్తుతం నడుస్తున్న తీరును క్షుణ్ణంగా పరిశీలించాలి. కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్‌లో చేసిన రెండవ ప్రకటన అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించేందుకు అందరూ (అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు) కలిసి ఒక కూటమి ఏర్పాటయ్యింది.

అదే తెలంగాణ జాయింట్‌ ఏక్షన్‌ కమిటీ. ఈ కమిటీని హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ప్రకటించారు. దీనికి కన్వీనర్‌గా ప్రొ కోదండరామ్‌ను ఎన్నుకున్నట్టు ప్రకటించారు. అప్పుడు ఈ జెఏసీలో కాంగ్రెస్‌, బీజేపీ, టిడిపి, సిపిఐ (ఎం.ఎల్‌), న్యూ డెమోక్రసీ, టిఆర్‌ఎస్‌లతో బాటు ఎమ్మార్పీఎస్‌, తెలంగాణ మాల మహానాడు, తెలంగాణ ఉద్యోగుల సంఘం, తెలంగాణ ఎన్జీఓల సంఘం తదితర ప్రజాసంఘాలతో బాటు ఇతర కుల సంఘాలు కూడా భాగస్వామ్యం పొందాయి. ఈ జేఏసీని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ప్రాంతమంతటా వివిధ స్థాయిల్లో జెఏసీలు ఆవిర్భవించాయి. ఈ జెఏసీలు పల్లె పల్లెలో, పట్టణ స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో యూనిట్ల వారీగా ఉద్యమ స్ఫూర్తితో ముందుకొచ్చాయి. ఏ విధమైన స్వార్ధ రాజకీయ, కుల తదితర స్వార్ధ ప్రయోజనాలు లేకుండా ఏర్పడ్డాయ

ఈ జెఏసీల ఏర్పాటు వెనుక ఏ కులాల, రాజకీయ పార్టీల ప్రాబల్యం కూడా లేదు. అన్నీ స్వతంత్రంగా ఏర్పడినవే. ఈ జెఏసీలలో కీలకంగా నిలచి నాయకత్వం వహించినవారిలో అధికులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చెందిన విద్యావంతులు, విద్యార్థులు, యువకులు. ఈ జెఏసీలు ఎక్కడికక్కడ తమకు చేతనైన పద్ధతిలో ఉద్యమించాయి. వివిధ ప్రాంతాలలో సామాజిక వర్గాలు, ఉద్యోగులు, ఇతర ప్రైవేటు సంస్థలు నాయకత్వం వహిస్తున్నాయి. సరిగ్గా ఇదే తరుణంలో ఒక కుట్ర మొదలైంది. తెలంగాణ ప్రాంత జెఏసి కన్వీనర్‌గా ఉన్న కోదండరామ్‌ ఛైర్మన్‌గా మారి జెఏసిల పటిష్ఠం, సమన్వయం పేరుతూ ఊరూరా తిరగడం మొదలుపెట్టారు. తన పేరులో రెడ్డి కులాన్ని సూచించే పదాన్ని చేర్చుకోకుండా, ఈ ప్రొఫెసర్‌ వివిధ ప్రాంతాలలో ఉన్న జెఏసిలకు రెడ్డేతర వ్యక్తులు నాయకత్వం వహిస్తున్న స్థానాలలో రెడ్డి కులస్థులను ఛైర్మన్లుగా, కన్వీనర్లుగా నియమించాలని ఒత్తిడి తేసాగారు.

అలా నియోజక వర్గ స్థాయిలో ఒత్తిడికి లొంగనివారికి పైన సూపర్‌ న్యూమరి పోస్టులను సృష్టించి తన సామాజిక వర్గానికి చెందినవారిని- ఏ ఉద్యమ నేపథ్యం లేకున్నా, జెఏసీల ఏర్పాటులో వారి పాత్ర లేకున్నా నియామకం చేశారు. ఇలా నియామకం జరిగినవే- రంగారెడ్డి జిల్లా తూర్పు విభాగం జెఎసి ఛైర్మన్‌, వరంగల్‌ జిల్లా జెఏసి ఛైర్మన్‌- ఇలా నియోజక వర్గాల మొదలు జిల్లా స్థాయి వరకూ తన సామాజిక వర్గానికి చెందినవారిని జెఏసీ నాయకులుగా నిలబెట్టారు. ఇదే తతంగం కొన్ని ఉద్యోగ సంఘాల జెఏసిల్లో కూడా జరిగిందని కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. ఈ విధంగా తన సామాజికవర్గం వారిని నాయకులుగా తయారు చేసే విధంగా జెఏసిలను నాయకుల్ని చేస్తూ- పటిష్ఠం పేరుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యమ నాయకులను అట్టడుగుకు తొక్కి వేశారు.

తెలంగాణ ఉద్యమంలో ఒకవైపు ప్రజలు ఉధృతంగా పాల్గొంటూ ఉంటే, మరోవైపు కె. చంద్రశేఖర రావు వెలమలను, కోదండరామ్‌ రెడ్లను నాయకులుగా తయారు చేసే ఫ్యాక్టరీగా ఈ ఉద్యమాన్ని మార్చారు. మొత్తంగా ఉద్యమం చేస్తున్నది, త్యాగాలు చేస్తున్నది, అరెస్టుల్ని, లాఠీ చార్జ్‌లను, పోలీసు కేసులను ఎదుర్కొంటున్నది బడుగులైతే నాయకత్వం వహిస్తున్నది మాత్రం ఈ రెండు అగ్రకులాలే అని స్పష్టంగా అర్ధమవుతున్నది. ఈ కుట్రలను గమనించిన ఎమ్మార్‌పిఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ- రేపటి తెలంగాణలో తమ వాటా ఎంత అని ప్రశ్నిస్తూ సామాజిక తెలంగాణ కోసం డిమాండ్‌ చేస్తున్నారు.

అయితే కొందరు అగ్రకుల నాయకులు, కొందరు కుహనా సామాజిక న్యాయవాదులు దీనిని కుల కోణంగా చిత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందు తెలంగాణ అయితే రానివ్వండి, ఆ తర్వాత సామాజిక అంశాన్ని పరిశీలిద్దాం అంటూ సమస్యను దాటవేసే యుక్తులు పన్నుతున్నారు. ఈ కుట్రను గమనించలేని కొందరు బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యావంతులు కూడా ఇదే అంటున్నారు. వేల సంవత్సరాల కిందట, బ్రాహ్మణవాదులు అమలు చేసిన బానిస భావజాలం లాగే నేడు బానిస రాజకీయ భావజాలాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల మెదళ్ళకు తమ తమ మీడియాల ద్వారా ఎక్కిస్తున్నారు. అందుకే వారు ఖచ్చితంగా ప్రశ్నించలేకపోతున్నారు.

rajuగిరిజనుల గురించి, ముస్లింల గురించి, దళితుల గురించి రేపటి తెలంగాణలో ఖచ్చితమైన రాజకీయ వాటాను ప్రస్తావిస్తూ జనాభాలో 52 శాతం ఉన్న బీసీల వాటా గురించి ప్రస్తావించకపోవడం ఎంత రాజకీయ కుట్రో బీసీలు ఇంకా అర్ధం చేసుకోకపోవడం విచారకరం. ఆ విషయాన్ని ప్రస్తావించిన మంద కృష్ణపై అగ్రకుల నాయకత్వాలు ఎదురు దాడి చేయించడం ఖండనీయం. మంద కృష్ణ వాదనను బీసీలు అందిపుచ్చుకోక పోవడం తెలంగాణలోని బీసీల పరిస్థితిని తెలుపుతోంది. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా రాజకీయంగా అన్యాయానికి గురవుతున్నది బీసీ సామాజిక వర్గాలే. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నవారిలో కూడా 50 శాతం మంది బీసీ వర్గాలవారే అనేది నిర్వివాదం. ఉద్యమంలో బలంగా పాల్గొంటున్నప్పుడు తమ వాటా గురించి నిలదీయవలసిన అవసరం ఉన్నది. లేకపోతే మోసపోయేది బీసీలే, నష్టపోయేది కూడా వారే!

Saturday, October 22, 2011

ఐలమ్మే మా అమ్మ - మందకృష్ణ మాదిగ Andhra Jyothi 23/10/2011


ఐలమ్మే మా అమ్మ
- మందకృష్ణ మాదిగ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనేది తెలంగాణ లోని నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష. ఈ ఆకాంక్ష అణగారిన కులాల విద్యార్థుల, యువతీ యువకులు త్యాగాలతో ప్రబలంగా మారింది. లక్ష్యాన్ని సాధించటం కోసం జరుగుతున్న యుద్ధంలో తెలంగాణలోని 90 శాతం గల బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీల ప్రజలే సైనికులు. అందుకు వారు సమిధలవుతున్నారు. తెలంగాణను సచ్చైనా సాధించాలని అణగారిన కులాల విద్యార్థినీ విద్యార్థులు యువతీ యువకులు నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని చూడకముందే ఈ లోకాన్ని వీడుతున్నారు.

కాని తెలంగాణకు నాయకత్వం వహిస్తున్నామని చెప్పే వెలమ, వెలమ దొరల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు అదే తెలంగాణ సాధించే లక్ష్యం కోసం ఒక్కరంటే ఒక్కరు కూడా ఈనాటికీ ఆత్మహత్యలు చేసుకునే వైపు పోలేదు. తెలంగాణ సాధించటమే ఒక లక్ష్యంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయని వారి త్యాగాలు వృ«ధా కావని దొరలు అంటున్నారు. ఆ సమున్నత లక్ష్య సాధన కోసమే అణగారిన కులాల పిల్లలు చేసుకుంటున్న ఆత్మహత్యలే త్యాగాలయితే ఆ స్థాయి త్యాగాలు తెలంగాణకు నాయకత్వం వహిస్తున్నామని చెబుతున్న వెలమ దొరల సామాజిక వర్గీయులు ఒక్కరంటే ఒక్కరు ఎందుకు త్యాగాలు చెయ్యలేకపోయారో చెప్పటానికి దొరలు ఎవ్వరూ నోరు విప్పడం లేదు. దొర కులంలోని ఎవ్వరు త్యాగాలు చేసే అవకాశం లేదు.

వారికి ఆ అవసరం కూడా లేదు. పెద్దదొర కెసిఆర్ తెలంగాణ కోసం తలనరుక్కుంటానంటాడు. కాని నరుక్కోడు. అల్లుడు హరీశ్‌రావు మీడియా ముందు పోలీసుల ముందు కిరోసిన్ చల్లుకొనే ప్రయత్నం చేయడం ద్వారా ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్టుగా నటిస్తుంటాడు. కాని చేసుకోడు. ఎందుకంటే, ఇప్పటివరకు ఆత్మహత్యలు చేసుకున్నవారెవ్వరు నూటికి 99 శాతం మీడియా ముందు, పోలీసులు ముందు చేసుకోలేదు. దొర కొడుకు, తెలంగాణ కోసం జైలు కెళ్ళటానికయినా సిద్ధమేనని ఉద్యమకారుడి స్థాయిలో ప్రకటనలిస్తుంటాడు.

అయితే తెలంగాణ కోసం ఇప్పటివరకు ఉద్యమాలు చేసి జైలుకెళ్ళిన వేలాది అణగారిన కులాల విద్యార్థులు, యువకుల్లో ప్రగల్భాలు పలికిన దొర కొడుకు ఉండడు. ఎందుకంటే దొర కొడుకు జైలు కెళ్ళితే, అసెంబ్లీ కెళ్ళే ఇంకో కుమారుడు లేడు కనుక. దొర ఒకానొక కొడుకు జైలుకెందుకెళ్ళాలి? అసెంబ్లీకే వెళ్ళాలి. జైలుకెళితే ఖైదీగా ఉండాల్సివస్తుంది. కాని అసెంబ్లీ కెళితే ప్రజాప్రతినిధిగా అనుభవం వస్తుంది. తెలంగాణ రాక ముందే ప్రజాప్రతినిధిగా అనుభవం వస్తే, తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రిగా పరిపాలించటానికి ఆ అనుభవమే పనికి వస్తుంది.

ఇక తెలంగాణలో బతుకమ్మ సంస్కృతిని బతికించాలంటే బతికించటం కోసం ప్రజలను జాగృతం చేయాలంటే దొర కూతరుకు తప్ప తెలంగాణలోని ఏ ఆడపడుచుకు ఆ అర్హతే లేదు. జాగృతం చేసే అర్హత ఇంకో అణగారిన కుల మహిళ సాధిస్తే దొరలపాలనకే చరమ గీతం పాడే మాయావతి లాగా మారుతుందేమోనని భయం పెద్ద దొరను వెంటాడుతుంది. తెలంగాణ అనే నాలుగు అక్షరాలను, తన కుటుంబంగా చేసి, తాను, కొడుకు, అల్లుడు, కూతురు నాలుగున్నర కోట్ల ప్రజలకు సెంటిమెంటు రుద్దుతున్నారు. దొరలు రాసిన సెంటుకు గుబాళించే సువాసన లేదు. కాని అణగారిన కులాలను ఆత్మహత్యలకు ప్రోత్సహించే విషపూరిత మందు ఉంది.

ఆ విషపూరిత మత్తు మందును తమ సామాజికవర్గానికి పూయరు, వారి సామాజిక వర్గానికి రాయరు. అందువల్ల వెలమ దొరల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళెవరు ఆత్మహత్యలు చేసుకోరు. ఎందుకంటే గ్రామాల్లో ఉండే వెలమ దొరలు సెంటిమెంటుకు చిత్తయ్యేవారు కాదు. వారు, బతికి వుండి గ్రామాల్లో అణగారిన వర్గాల ప్రజల మీద తెలంగాణ వచ్చినా రాకపోయినా గ్రామాల్లో పెత్తనం చేయాలనుకుంటారు తప్ప చావాలనుకోరు. ఒక లక్ష్యం కోసం త్యాగాలు చేసేవారు అణగారిన వర్గాల జనులు.

అందుకే వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణను పరిపాలించటం కోసం, తెలంగాణలోని అన్ని గ్రామాల మీద పెత్తనం చేయటమే లక్ష్యంగా బతికుండాలనుకునే వారు వెలమ దొరలు. అందుకు వీరు బతికి ఉండాలి. అందుకే వీరు ప్రాణ త్యాగాలు చెయ్యరు. ఇప్పటికి ఆత్మహత్యలకు పాల్పడ్డ దాదాపు 700 మందిలో ఒక్కరు కూడా వెలమ దొరల సామాజికవర్గానికి చెందినవారు లేకపోవడమే ఇందుకు సాక్ష్యం.

ఇక ఇప్పుడు తెలంగాణ రాకముందే దొరసానుల రూపముండే ఒక బొమ్మను పెట్టి ఆమెనే తెలంగాణ తల్లిగా అణగారిన కులాల చేతనే భజన చేయించటం ప్రారంభించారు. ఈ బొమ్మనే పీడిత కులాల వారందరికి అమ్మను చేసి సెంటిమెంటు ముసుగులో పీడితకులాలపై సాంస్కృతిక, మానసిక దాడిని ప్రారంభించారు. ఇప్పటివరకు దొరలు అణగారిన కులాలపై చేసిన భౌతిక, లైంగిక దాడుల కంటే దొరసాని రూపంలో ఉండబడే బొమ్మను అణగారిన కులాలందరి మీద అమ్మగా రుద్దే సాంస్కృతిక దాడి అతిభయంకరమైంది. శాశ్వతంగా తెలంగాణలో అణగారిన కులాలను అణచివేయటానికి ఈ బొమ్మ దొరల చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం కాబోతుంది.

ఈ దాడిని ఇప్పుడే ఎదుర్కోవాలని ఇప్పుడు ఎదుర్కోకపోతే ఇక ముందు ఎదుర్కోవటం దాదాపు అసాధ్యమే అవుతుందని అణగారిన కులాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రపంచంలో జీవించిన, జీవిస్తున్న ప్రతి జీవికి తల్లి ఉంటుంది. మానవుడిగా జీవించిన, జీవిస్తున్న ప్రతి వ్యక్తికి తల్లి ఉంటుంది. ప్రతి తల్లికీ పేరుంటుంది. అంతెందుకు, మన దేశంలో మూడుకోట్ల దేవుళ్ళు, దేవతలున్నారని ఒక విశ్వాసం. దేవుడికయినా, దేవతకయినా ఖచ్చితంగా పేరుంటుంది. నాకు తల్లి వుంది. నా తల్లి పేరు కొమురమ్మ. నాకు తండ్రి వున్నాడు. నా తండ్రి పేరు కొమురయ్య. నాకు జిల్లా వుంది. అది వరంగల్. నాకు ఊరుంది.

హంటర్‌రోడ్ శాయంపేట. నా స్వగ్రామంలో, గ్రామప్రజలు పూజించే దేవతలు, దేవుళ్ళు ఉన్నారు. మా ఊర్లో శివాలయం ఉంది. అక్కడ దేవుడు శివుడు. మా ఊరిలో ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. అక్కడ దేవుడు ఆంజనేయుడు. మా ఊరు చెరువుకట్ట మీదకట్ట మైసమ్మ దేవత ఉంది. మా ఊర్లో పెద్ద పండుగ పోచమ్మ పండుగ. పోచమ్మ తల్లినే దేవతగా పూజించే మా ఊరిలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఘనంగా పోచమ్మ పండుగ చేస్తారు. మా ఇంట్లో ఇంటిదేవతగా ఎల్లమ్మ తల్లిని పూజించే వారు. ఈ విధంగా ప్రతివ్యక్తికి తల్లితండ్రులున్నారు. వాళ్ళకు పేర్లున్నాయి. ఎవరి విశ్వాసం ప్రకారం వాళ్ళు పూజించే దేవుళ్ళు, దేవతలున్నారు.

ప్రతి దేవుడికి, ప్రతి దేవతకి పేరుంది. మా ఊర్లోనే కాదు, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో కూడా. మరి ఇప్పుడు తెలంగాణ గ్రామాల్లో తెలంగాణ పేరుతో వెలుస్తున్న ఈ బొమ్మకు తల్లిదండ్రులెవరు, వారి పేర్లేంటి? సాధారణంగా, హిందువుల్లో వితంతువులే బొట్టు తీస్తారు. ఈ బొమ్మరూపంగావున్న ఈ అమ్మకు పెళ్ళి అయితే భర్త ఎవరు, ఆ భర్త పేరేంటి? ఈమె పుట్టినిల్లెక్కడ, మెట్టినిల్లెక్కడ? ఎవరైనా చెప్పగలరా? కనీసం అమ్మ అని చెబుతున్న ఈ బొమ్మకు పేరైనా చెప్పగలరా? ఎవ్వరూ చెప్పలేరు.

ఇది వాస్తవం. ఇక ఈ బొమ్మ రూప శిల్పి దొరే గనుక దొరసాని రూపాన్ని చాలా అందంగా చిత్రించాడు. తన దగ్గరున్న శిల్పులతో అపురూపంగా చిత్రించారు. ఆ అపురూపమైన బొమ్మకు, తలమీద ధగధగమెరిసే బంగారు కిరీటం, కొట్టొచ్చినట్టు ఆకర్షణీయంగా కనిపించే ముక్కుపుడక, చెవులకు ఒదిగివుండే గంటీలు, మెడకు కంఠాహారము, దానికింద బంగారు చైన్, నెక్‌లెస్‌లు ధరించివున్నాయి, నడుముకు వడ్డాణము, రెండు చేతులకు బంగారు కడియాలు, అబ్బో ధగధగ మెరిసే ఎర్రటి పట్టు చీర, మొత్తానికి పీడిత కులాలు కూడా మైమరిచిపోయే విధంగా అందమైన బొమ్మను తయారుచేయించి ఈమెనే మీ అమ్మ అని చెప్పి గౌరవించడం, పూజించడం దొరలు చేయమంటున్నారు.

పీడిత కులాల, మహిళల సంస్కృతి సంప్రదాయం లేని ఈ బొమ్మ అందరికి అమ్మ ఎలా అవుతుంది? తినడానికే తిండి సరిగాలేని, బతకడమే కష్టంగా జీవించే కూలీనాలీ చేసుకునే అణగారిన కులాల తల్లులకు ఒంటినిండా బంగారం, వడ్డాణాలు, కిరీటాలు, నక్లెస్‌లు వేసుకుని తిరిగే పరిస్థితే లేదు, పట్టెడన్నమే సరిగా లేని నా తల్లులకు పట్టు వస్త్రాలు ఎక్కడివి. మోసం చేసేటోళ్ళ, దగా చేసేటోళ్ళ ఇండ్లలో బంగారు నాణేలు, వజ్రాలుంటాయి. కూలి చేసుకుని బతికే మా ఇండ్లలో కడుపు నిండా మా తల్లులకు తిండేలేదు, ఒంటి మీద పట్టు చీరలెక్కడివి, ఒంటినిండా బంగారమెక్కడిది. అందుకే, మీరు పెట్టే ఈ బొమ్మ మాకు అమ్మ ఏనాటికి కాదు. ఆ బొమ్మను బజారులో పెట్టడం కంటే, మీ గడీల్లో పెట్టుకుంటే మీకే మంచిదేమో ఆలోచించుకోండి.

తెలంగాణలో కాకతీయ రాజుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడి వీరమణం పొందిన మా ఆదివాసీ గిరిజన వీరవనితలైన సమ్మక్క, సారక్కలను మేము దేవతలుగా కొలుస్తున్నాము. వారి త్యాగాలు అడవులను దాటి, సరిహద్దులను దాటి దేశ వ్యాప్తమైంది. రెండున్నర సంవత్సరాలకోసారి దాదాపు కోటి మంది ఒక్క దిక్కున చేరి (మేడారం జాతర) సమ్మక్క సారక్కలను పూజించుకునే సంప్రదాయం ప్రపంచాన్నే ఆకర్షిస్తుంది. ఆ ఇద్దరూ మా ఆదివాసీ మహిళలైనందుకు మేమెంతో గర్వపడుతున్నాము. వారే మా దేవతలుగా, అన్యాయానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మా ఇలవేల్పులుగ మేమెప్పుడూ పూజిస్తుంటాము.

ఆ కోవలోనే దాదాపు ఆరు దశాబ్దాల క్రితం, దేశ్‌ముఖ్‌లకు, భూస్వాములకు, వారి గూండాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి, పోరాడి విజయం సాధించిన చాకలి ఐలమ్మే మా అణగారిన కులాలకు మొత్తం వివక్షకు, దోపిడీకి గురిఅవుతున్న వర్గాలకు స్ఫూర్తి. దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి, వందలాది గ్రామాల్లో అణగారిన కులాల మహిళల్ని, ప్రజల్ని నిరంతరం వేధించే కిరాతకుడు. జనగామ తాలూకాలో విసునూరు రామచంద్రారెడ్డి తదితర భూస్వాములు సంఘంలో ఉన్నారనే నెపంతో ప్రజలపై తప్పుడు కేసులు బనాయించడం, హింసలకు గురిచేయడం పరిపాటిగా మారింది.

విసునూరు రామచంద్రారెడ్డి పరిపాలించే గ్రామంలో ఒకటైన జనగామ తాలూకా పాలకుర్తిలో సంఘాన్ని బలపరిచే దృఢ సంకల్పం గల చాకలి ఐలమ్మ అంటే కిరాతకుడైన రామచంద్రారెడ్డికి కన్నెర్రయింది. ఐలమ్మ పొలాన్ని స్వాధీనం చేసుకోటానికి పొలంలో ఉన్న పంటను కోయించుకెళ్ళటానికి వందలాది గుండాలను పంపించాడు. దేశ్‌ముఖ్‌కి అండగా వచ్చిన వందలాది గూండాలను ఎదుర్కొని చితకతన్ని, వారు పారిపోయేటట్లు చేయడంలో వీరోచితంగా పోరాడింది ఐలమ్మ. పంటను గాని, భూమిని గాని దొరలు, పోలీసులు స్వాధీనం చేసుకోలేకపోవటానికి తమ భూమిని, తమ పంటను సంరక్షించుకోవటానికి ఐలమ్మ చేసిన పోరాటం ఆనాడు విజయవంతం అయింది.

పేరు మోసిన కిరాతకుడైన దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డిపై చాకలి ఐలమ్మ సాధించిన ఈ విజయం మొత్తం తెలంగాణ పీడిత కులాల ప్రజల్ని ఉత్తేజపరిచింది, ధైర్యాన్నిచ్చింది. ఈనాటి దొరలు అవలంబిస్తున్న కుట్రలు కుతంత్రాల నుండి మా అణగారిన వర్గాలను రక్షించుకోటానికి సెంటిమెంట్‌ను అడ్డంపెట్టుకొని చెలాయించాలనుకున్న దొరల ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే పీడిత కులాలందరికీ చాకలి ఐలమ్మే ఆదర్శం. కులాలకు అన్ని రంగాల్లో న్యాయబద్ధంగా దక్కాల్సిన న్యాయమైన వాటాను సాధించుకునే మా పోరాటంలో అడ్డొచ్చే ఈనాటి దొరలను, దొరలకు వత్తాసు పలికే దళారులను మా చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే ఎదుర్కొంటాం. న్యాయమైన పోరాటానికి స్ఫూర్తినిచ్చిన ఐలమ్మను మా తెలంగాణ తల్లిగా, ఆ తల్లి విగ్రహాలను తెలంగాణ మొత్తం పెడతాం. మాకు ఐలమ్మే తెలంగాణ తల్లి. అంతేకానీ దొరలు పెట్టిన ఈ బొమ్మ మాకెన్నటికీ తల్లి కానే కాదు.

- మందకృష్ణ మాదిగ
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు

Thursday, October 20, 2011

ఎన్.ఎచ్.సెవెన్-జోడేఘాట్ బాట By -వరవరరావు Namasethe telangana Dated 21/10/2011

ఎన్.ఎచ్.సెవెన్-జోడేఘాట్ బాట
ఎన్.ఎచ్.సెవెన్-నోరు తిరిగిన వాళ్లు ఇట్లాగే పిలుస్తారు. తిరగని వాళ్లు సామాన్య గోండు ప్రజానీకం ఈ ‘జాతీయ రహదారి’ని చూసి కూడా ఉండరు గనుక వాళ్లు జోడేఘాట్ బాట గురించి, అడవి దారుల గురిం చి తప్ప దాని గురించి ఏమీ చెప్పలేకపోవచ్చు. చెప్పినా ఈ రాజమార్గం నిర్మా ణ సందర్భంగా తమ నిర్వాసిత హృదయవిదారక గాథలే చెప్పవచ్చు.
కాని మన బోటి వాళ్లకు ఈ ఫోర్‌లేన్ రోడ్డు మీద ప్రయాణం ఎంత హాయి గా ఉంటుందని..హంసతూలికా తల్పం మీద తేలిపోతున్నట్లు. హంసలంటూ ఉంటే ఆ తూలికాతల్పం కోసమే ఎన్ని పీకలు తెగి హంసలు హింసకు బలి అయిపోవాలో-ఆ శయ్య మీద ఉన్నపుడు మనకెట్లా తెలుస్తుంది. బైపాస్ రోడ్లు-ఎక్కడా అందమైన పల్లెటూర్ల బోర్డులే తప్ప (అందమైనవి పల్లెటూర్లు గాదు సైన్‌బోర్డులు) ఏ ఒక్క ఊరు తగలదు. కవులమైతే ఎన్. గోపీ వలె కలవరపడతాం.

ఇదివరకు పల్లెల గుండెల్లోంచి వెళ్లేవాళ్లం
గతుకుల రోడ్లయినా అవి మట్టి స్పందనల్లా ఉండేవి
పొలిమేరలు దగ్గరవగానే
గాలి..మనుష్యుల ఊపిరిలా పరిమళించేది
చాయ్ తాగిన గుడిసె హోటళ్లూ
ఒక్క ఆవలింతలో..అలసటను ఊదేసి
ఊరినంతా పీల్చుకునేవాళ్లం/ఇంత గొప్ప అనుభవం
ఒక్క బైపాస్ రోడ్డుతోదూరమైంది
రక్త ప్రసారానికి/అడ్డొస్తే గదా బైపాస్!
కాని ఇది రక్త బంధాలను తప్పుకపోయే స్పీడ్ రేస్..
ఎక్కడికి? ఢిల్లీకి. పల్లెల్నించి కాదు. పల్లెల్ని మినహాయించి.
కలపాల్సిన రోడ్లు/ఇప్పుడు చీలిన పాశాలవుతున్నాయి
మనుష్యుల్ని వదిలేసి/ఇంత వేగంగా ఎక్కడికి?
కేంద్రీకరించిన అధికారం దగ్గరికి. అక్కడి నుంచి ఒక దురూహ దాహంతో శ్రీనగర్ దాకా సైన్యం వెళ్లి దురాక్షికమించనూవచ్చు. అయినా అక్కడి దాకా పోయే అధికారం ఆకాశంలోనే ఎగురుతున్నది. పార్లమెంట్‌లో బిల్లు పెట్టాల్సిన ప్రజా ప్రతినిధులకు ఈ జాతీయ రహదారి కూడా నామోషియే. అంతర్జాతీయ విమానాక్షిశయాలు తప్ప నిరాక్షిశయుల సంగతి పట్టదు.ఆర్మూరు దాటిన దగ్గర్నించీ ఆదిలాబాద్ మార్గం మరీ ఆశ్చర్యమేసింది. నిర్మల్ ఘాట్‌రోడ్ ఏది? కొండలను తవ్వేసి బండలను పిండేసి, ఆదివాసుల నెత్తుర్లే కంకరగా ఈ రోడ్డు వేశారా! పొచ్చెర్ల జలపా తం సైన్ బోర్డు దగ్గరి నుంచి స్పష్టంగా చూశాను. వృక్షాల మొదళ్లు మిగిలి ఉన్నాయి. పొచ్చెలు, బొబ్బెలు నరికేసిన గోండుల మొండి దేహాల వలె.మన సుఖం మనుషులకెంత కష్టం. అయితే మనమెవరం? మన ప్రయాణమెక్కడికి? జోడేఘాట్‌కు. కొము రం భీం నుంచి స్ఫూర్తి పొందడానికి. ఆదిలాబాద్ కలెక్ట ర్ చౌరస్తా పజల చౌరస్తా కాదది-జిల్లా అధికారిది) లో ఈ నెలలోనే కొమురం భీం విగ్రహం పెట్టారు. కొమురం అంటే సొగసయినవాడు అని అర్థం. భీం అంటే చెప్పనక్కర్లేదు కదా. ఆయన చేతిలో తుపాకి కూడ ఉంది. కొమురం భీం ‘బస్ట్’ మాత్రమే అయితే ఆయన అంతిమంగా ఎంచుకున్న పోరాట మార్గం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శాంతియుతంగా పోరాడుతున్న వాళ్లకు సరియైన స్ఫూర్తినిస్తుందో లేదోనని అనుకున్నట్టున్నారు. ఆయన నిలు సాయుధ విగ్రహం పెట్టారు. కొమురం భీం స్ఫూర్తి ఏమిటి? ‘మా ఊళ్లో మా రాజ్యం’.

అడవిలో తాము పోడు చేసుకున్న భూముల్ని జాగీర్దార్లు ఆక్రమించుకున్న దగ్గర్నించి- విన్నపాలు, మహజర్లు, న్యాయస్థానాలు, జంగ్లాతు వాళ్ల నుంచి అవ్వల్ తాలూకాదార్ దాకా నైజాం దాకా కాళ్లరిగేలా తిరిగే ప్రయత్నాలు - అన్నీ అయిపోయి మళ్లీ నేల మీదికే వచ్చి ఆత్మరక్షణ కోసం దాడినెదుర్కొని కేసయి జైలుపాలు కాకుండా తప్పించుకొని పారిపోయి అస్సాం తేయాకు తోటల్లో తోటి కార్మికుల కష్టాలను, సంఘటిత చెతన్యం చూసి అడవిపుత్రులలో పీడనకు, దోపిడీకి, ప్రతిఘటనకు పోరాటానికి ఎల్లలు లేవని తెలుసుకొని తిరిగివచ్చి పన్నెం గూళ్లల్లో తన ప్రజల్ని కూడగట్టి నైజాంతో,ఆయనకు అండగా నిలిచిన బ్రిటిష్ వాళ్లతో సాయుధంగా పోరాడిన యోధుడు. ఆయన ఏ ఒక్క పోరాట రూపాన్నీ వదిలిపెట్టలేదు. తమ పోడు భూముల్ని ఆక్రమించుకున్న వాళ్లతో మొదలుకొన్ని అన్ని స్థాయిల్లో నైజాం దాకా చర్చలు జరిపాడు. సహాయం చేసిన వకీలును, పత్రికా సంపాదకుణ్ని నిరంతరం సంప్రదించాడు. ప్రతి సందర్భంలోనూ తన ప్రజల్ని సమీకరించి సమావేశపరిచి తాను జరిపిన చర్చలన్నీ వివరించాడు. 2010 జనవరి 5 వలె, 2011 అక్టోబర్ మొదటివారం వలె ప్రభుత్వంతో, కాంగ్రెస్ పెద్దలతో ఏం మంతనాలు జరిగాయో చెప్పకుం డా దాచలేదు. తన ప్రజలకు సంబంధించినంత వరకు చర్చలూ పారదర్శకంగానే చేశాడు. వాళ్ల అమోదంతోనూ, అండతోనూ పోరాటం చేశాడు. ఈ క్రమమంతా ఆయన గ్రహించిందల్లా, తనతో ఉన్న పీడిత, పోరాట ప్రజల అవగాహనకు తెచ్చిందల్లా భూమి మీద అధికారం రావాలంటే రాజ్యం మీద అధికారం రావాలి అని.


పన్నెండూళ్లే కావచ్చు కాని ఆ ఊళ్లపై అక్కడి ప్రజల కు అధికారం కావాలి. భీం కుటుంబ సభ్యులందరికీ వాళ్లు దున్నుకునే భూమి పట్టా చేస్తానని ఆశ చూపింది ప్రభుత్వం. ప్రజలందరి తరఫున మాట్లాడవద్దన్నది మంత్రి పదవులు, తాయిలాలు తీసుకుని న్యాయమెన తెలంగాణ ప్రజల పోరాటానికి ద్రోహం చేస్తున్న రాజకీయ నాయకుల వలె ఆయన రాజీ పడలేదు. ఆఖరి శ్వాస దాకా పోరాడి అమరుడయ్యాడు. ఓడిపోయాడు. కాని లొంగిపోలేదు. కాని మన భూమి, మన నీళ్లు, మన వనర్లు, మన పాలన మనకు అంటే ఏమిటో డ్బై ఏళ్ల క్రితమే స్పష్టమెన దార్శనికత ఇచ్చిపోయాడు. పోరాటం ఎందుకో చెప్పాడు. ఎట్టా చేయాలో చెప్పాడు. ఎక్కడ చేయాలో చెప్పాడు. శత్రు పసిగట్టాడు. మిత్రులందర్నీ కూడగట్టాడు. ప్రజల మీద ఆధారపడ్డాడు. ప్రజల మధ్య నిలిచి, ప్రజల్ని సాయుధుల్ని చేసి పోరాడాడు.
ఉట్నూరూ, జైనూరు, బాచేఝరి, హట్టి, జోడేఘాట్ -1940 సెప్టెంబర్ 1న నేలకొరిగాడు. అక్కడ ఒక రాయి. ఒక కర్ర పాతి గోండులు, కోలాము లు, ఏరధానులు, ఏరమేశులు పీడిత, పోరాట ప్రజలందరూ తలుచుకుంటున్నారు. ఈ గడచిన పున్నమి అక్టోబర్ 11న ఆయన వర్ధంతి. ఆయన సంస్మరణ. భీం స్ఫూర్తి ఏమిటి? స్వపరిపాలన, రాజీలేని పోరాటం, పోరాట కొనసాగింపు. పాలకుర్తి ఐలమ్మ పొలంమడిలోని పంట ఆమె ఒడిలోకి చేర డం. బందగీ భూమి కోసం చేసిన న్యాయపోరాటం, దొడ్డి కొమురయ్య దొర ల అణచివేతకు వ్యతిరేకంగా చేసిన రైతుకూలీ పోరాటం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, మూడువేల గ్రామాల్లో పది లక్షల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని ప్రజలు అనుభవించిన బీజ ప్రాయమెన అధికారం .అదీ కొమురం భీం స్ఫూర్తి అంటే నాయకత్వం చేసిన ద్రోహం కాదు.
నక్సల్బరీలో సంతాల్ ఆదివాసులు అందుకున్న కొమురం భీం స్ఫూర్తి మన భూమి మనకు దక్కాలంటే మనకు రాజ్యాధికారం దక్కాలన్న దార్శనికతను ఇచ్చింది. కొమురం భీం పోరాటం వలెనే అది శ్రీకాకుళంలో సెట్‌బ్యాక్‌కు గురయినా జగిత్యాల, సిరిసిల్లాల నుంచి అది జైత్రయావూతయే.

మళ్లీ ఒకసారి ప్రజలు ‘ఊరు మనది, వాడ మనది, దొర ఏందిరో, దొర పెత్తనమేందిరో’-అని బండెడ్లు ఒకటై ఎగబడిన స్ఫూర్తి. కొమురం భీం డ్బై ఏళ్లు పయనించి, నక్సల్బరీ నుంచి, వైనాడు దాకా పయనించి, తెలంగాణ అడవు ల నుంచి మళ్లా తెలంగాణ మైదానాలకు పయనించి 1981లో మళ్లా తన ఇంద్ర చేరుకున్నాడు. ఎంతో నెత్తురు ధారపోశాడు. తోట రాముని తొడ కు కాటా తగిలిందని పరధాను, పరమేసు పసరు పోసి కట్టుకట్టారు. ఇంద్ర శ్యాం, సాహు, గజ్జెల గంగారాం, జంగు దాదా కావడానికన్నా ముందే కొమురం భీం పెద్ది శంకర్ అయి పేరొంది అడవుల్లో ప్రవేశించాడు. అంతే.. తిరిగి వెనక్కు చూడలేదు. ముప్ఫై ఏళ్లుగా దేశానికి స్వపరిపాలన అంటే ఏమి టో, ప్రజల అభివృద్ధి నమూనా అంటే ఏమిటో, జల్, జంగల్, జమీన్ మీద ప్రజల సాధికారత అంటే ఏమిటో జనతన సర్కార్ ద్వారా ఇవ్వాళ దండకారణ్యలో ఆచరించి చూపుతున్నాడు. నూట ఏభై ఏళ్ల కిందటి కానూసిద్ధూల నాయకత్వంలోని సంతాల్ పోరాటం ఇవ్వాళ కానూ సిద్ధూల మిలీషియా నాయకత్వంలో జంగల్ మహల్ పోరాటమైంది. బిర్సా ముండా పోరాటం, రాంచీ బిర్సా ముండా జెల్లో ఉరికంబం మీద నిలిచిన జీతన్ మరాండీ కళా స్పందన సాంస్కృతిక ఆచరణలో ప్రతిఫలిస్తున్నది. అల్లూరి సీతారామరాజు, ద్వారబంధాల చంద్రయ్య మొదలు వెంపటాపు సత్యం వరకు మన్నెం, శ్రీకాకుళాల్లో సాగిన పోరాటం సోంపేట నుంచి నారాయణపట్నం వరకు కంపెనీ చట్టాల్ని, అడవి చట్టాల్ని ధిక్కరించి తమ భూముల్ని, హక్కుల్ని కాపాడుకున్న పోరాటాలుగా సాగుతున్నది.
వందేళ్ల క్రితం గూండాదర్ భూంకాల్ ఇవ్వాళ దండకారణ్యంలో భూకంపాన్ని సృష్టిస్తున్నది. గ్రీన్‌హంట్ ఆపరేషన్ పేరుతో ప్రజల మీద రాజ్యం ప్రకటించిన యుద్ధాన్ని నిలువరిస్తున్నది. ఇదంతా జిందాల్, ఎస్సార్, టాటా, పోస్కో, వేదాంత ఏ బడా కంపెనీ అయినా కావచ్చు, ఏ బహుళజాతి కంపె నీ అయినా కావచ్చు అడవిలో అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్న పోరాటం. అర్ధసైనిక బలగాలను, సైన్యాన్ని ప్రాణాలొడ్డి మట్టికరిపిస్తున్న పోరాటం. గ్రామరాజ్యాల నాయకత్వంలో గ్రామాభివృద్ధి సాధించుకుంటున్న పోరాటం. ఆకాశంలోనేకాదు, అడవిలోనూ సగమైన మహిళలు పాల్గొంటున్న పోరా టం. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రాన్ని ధిక్కరిస్తున్న పోరాటం. అంటే జల్ జంగిల్ జమీన్ కోసం ప్రభుత్వాలకు, కంపెనీలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం. దాని పాలకులయిన భూస్వామ్య, పెట్టుబడిదారీ పెత్తందారీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం. ఇది సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం. ఢిల్లీ రాజమార్గాన్ని పల్లెల కాలిబాటలు ప్రశ్నిస్తున్న పోరాటం.

మనం తెలంగాణలో కొమురం భీం స్ఫూర్తితో ఏం కోరుకుంటున్నాం. మన తెలంగాణలో మనం మన భూములు, మన వనర్లు, మన చదువులు, మన కొలువులు, మన భాష, మన సంస్కృతి, మన ఆత్మగౌరవం మనకు దక్కే స్వపరిపాలన కోరుకుంటున్నాం. అందుకోసం మనం సమ్మక్క సారలక్కలు మొదలు బందగీ, ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, మొండ్రాయి, మొగ్దుం మొహియుద్దీన్, నల్లా నర్సింహులు, గొల్ల ఎలమంద, సూర్యపేట రాములమ్మలలో జాక్‌లు రాళ్లు, బైరాన్‌పెల్లి ప్రజలు పోరాడిన స్ఫూర్తినే గ్రహిస్తున్నా మా? ఇంద్ర గోండులు ఏమడిగారు. అప్పటికింకా తమ చంద్రవంశపు గోండ్వానా రాజ్యాన్ని రాంజీ గోండు పాలించి, ఇంగ్లిష్ వారితో పోరాడి ఉరికంభమెక్కిన రాంజీ గోండుల రాజ్యాన్ని మళ్లా సాధించుకుంటామని ప్రకటించలేదు. ఇంద్ర మారణకాండలో చిందిన రక్తంతో మాత్రం మళ్లీ రగల్ జెండాను ఎత్తుకున్నారు. ఇంద్ర సంఘటన నాటికి గోండులు, కోలాము లు, తాము పోడు చేసుకున్న భూములపై తమకు పట్టాలివ్వాలన్నారు. తాము పండించే పత్తి, పోగాకు, మిర్చిలకు గిట్టుబాటు ధరలు కావాలన్నా రు. వలసవచ్చే ఆదివాసేతరులు, తప్పుడు తూకాలతో, మోసపు కొలతలతో తమ అడవి సంపదలు కొని మోసం చేయొద్దన్నారు. గిరిజన రైతు కూలీ సంఘాలు పెట్టుకొని 1981 ఏప్రిల్ 20న సభ తలపెట్టారు. ప్రభుత్వం సహించలేకపోయింది.
ముప్ఫై ఏళ్లలో అడవి ఎంత పలచబడిపోయింది! కాలిబాటలు తారు రోడ్లయినవి. ఇరవై శాతం ఆదివాసేతరులు వలసవచ్చి తిష్ఠ వేశారు. దళారీలు కోటీశ్వరులయ్యారు. అన్ని పార్టీల ఎం.ఎల్.ఎ.లు, ఎం.పి.లు రిజర్వ్ స్థానా ల్లో గెలిచిన వాళ్లతో సహా అగ్రవర్ణ, అగ్రవర్గ పెత్తందార్లతోపాటు అడవి సంపదను దోచుకునే, అదివాసులకు వచ్చే రాజ్యాంగ, చట్టపరమెన హక్కుల్ని హరించే వారయ్యారు. చివరకు డిటిఎఫ్ నుంచి ఎదిగి ఆదివాసీ నాయకుడైన ఎం.ఎల్.ఎ. కూడ తొండ ముదిరి ఊసర కొమురం భీం ఆశయ సాధన మళ్లా ముందుకొచ్చింది.

ఆదివాసుల్లో కూడా వర్గీకరణ జరగాలనే ప్రజాస్వామిక డిమాండ్ ముందుకు వచ్చింది. తెలంగాణలో స్వపరిపాలన అంటే ఆదిలాబాద్ జిల్లా లో గోండుల, కోలాముల నాయకత్వంలో జరగాల్సిన ప్రజాస్వామిక పోరాటమేనని కొమురం భీం గుర్తు చేసుకున్నాడు.ఉట్నూరు, జైనూరు, బాచేఝరీ, హట్టెల మీదుగా జోడేఘాట్ బాట రోడ్డు కాని రోడ్డు. అది రాజమార్గం కాదు. అందుకే అక్కడ కొమురం భీం నేలకొరిగిన చోట కొము రం భీంను స్మరించుకుంటామంటే మావోయిస్టులు మందుపాతరలు పెట్టారు వెళ్లొద్దని కలెక్టర్‌ను, ఎం.ఎల్.ఎ.ల ను, అధికారులను, రాజకీయ నాయకులను పోలీసులు వారించారు. అధికారం హట్టెలోనే లాంఛనం పూర్తి చేసుకున్నది. ఆదివాసులు జోడేఘాట్‌లో కొమురం భీంను స్మరించుకున్నారు.
మరి మందుపాతర ఎక్కడున్నట్లు? జైనూరు మార్చనాయి వెపు పోతే పెదవాగు ఉన్నది. పెదవాగు మీద మూడు వందల కోట్ల రూపాయలతో కొమురం భీం ప్రాజెక్టు కట్టారు. అదీ ప్రభుత్వం పెట్టిన మందుపాతర. కాంట్రాక్టర్లు పెట్టిన మందుపాతర. ఇరవై ముప్ఫై గోండు గ్రామాలు మునిగిపోయాయి. వేలాది మంది నిర్వాసితులయ్యారు. మరి ఆ నీళ్లు ఎక్కడికి పోయాయో, పోతున్నాయో ఆసిఫాబాద్ వెళ్లి అధికారాన్ని అడగాల్సిందే.

కుంతాల జలపాతం శకుంతల కుంతలాలు ఆరబోసుకున్న జలపాతమని చెప్తారు. మూడు వైపులా దట్టమెన అభయారణ్యాలు. అంత లోతుకు జలపాతం దూకుతున్న సుడిగుండాల దగ్గరికి వెళ్లి చూస్తే రాళ్లమీద ప్రభుత్వ సర్వే చిహ్నాలు. జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కోసం, ఇనుప రజం తవ్వకాల కోసం, గ్రానైటు రాయి తవ్వకాల కోసం ప్రయత్నాలు. ఆ కోండల్లో ఒక సొరంగం ఉంది. వర్షాలు పుష్కలంగా కురిసిన ఈ సమయంలో ఆ సొరంగంలో ఒక శివలింగం ఉందని, శివరాత్రి రోజు ఆ సొరంగంలోకి వెళ్లి పది మంది పూజలు చేసేంత స్థలం ఉందని ఎవరైనా చెప్తే నమ్మలేం. నిర్మల్ చిత్రాలకు ఉపయోగించే కర్ర, రంగులు అక్కడి చెట్లల్లో దొరుకుతాయి. అది ఆదివాసీ సంస్కృతికి, కళలకు, సౌందర్యారాధనకు కాణాచిగా ఉన్న ప్రాంతం. అది రేపు హై సెక్యూరిటీ హైడెల్ ప్రాజెక్టు కానున్నది. ఎవరికోసం? ఏ గోండు గూడాల్లో చీకట్లను పారదోలడం కోసం.
నిర్మల్‌లో ప్రజలు కొమురం భీం స్ఫూర్తి చాలదన్నట్లు, గోండులతో పాటు, బడుగు వర్గాలను కూడా కూడగట్టడానికి సర్వాయి పాపని పోరాట స్ఫూర్తికి కూడా రూపమిచ్చారు. ఇవ్వాళ ట్యాంకుబండు మీద కూడా కొమురం భీం విగ్రహం పెట్టాలని తెలంగాణ ముక్తకం అడుగుతున్నది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీదనే ఎన్.ఎచ్. సెవెన్ మొదలవుతుంది. జోడేఘాట్‌లో నేలకొరిగిన చోటు నుంచి పునరుత్థానం చెంది, ఒళ్లు విరుచుకొని, గుండెలుప్పొంగించి జిల్లా కేంద్రం అదిలాబాద్‌కు వచ్చి తుపాకి అందుకొన్న కొమురం భీం నిలు విగ్రహం ట్యాంక్‌బండ్ దాకా వీరవిహారం చేస్తూ వస్తుందో, జోడేఘాట్ బాట ఢిల్లీ రాజమార్గాన్ని జయిస్తుందో? ఇదంతా విగ్రహరాధనేనా? పోరాట స్ఫూర్తియా? అన్నదే నాలుగు కోట్ల ప్రజల ప్రశ్న. నాయకులకు అర్థమయ్యే భాషలో అడగాలంటే మిలియన్ డాలర్ల ప్రశ్న.
-వరవరరావు

Tuesday, October 18, 2011

లంబాడీలు ఆదివాసీలు కారు - వూకే రామకృష్ణ Andhra Jyothi 19/10/2011


లంబాడీలు ఆదివాసీలు కారు

- వూకే రామకృష్ణ

మన పాలకులు ఆదివాసీల అభివృద్ధికి పాటుపడకపోవడమే కాకుండా, వారిని అణగదొక్కే విధానాలకు పాల్పడుతున్నారు. ఓటుబ్యాంకు రాజకీయాలకు ప్రాణం పోస్తూ కులాలను తెగలలో విలీనం చేసి ఆదివాసీల భవితవ్యాన్ని ప్రశార్థకం చేస్తున్నారు. 1976లో ఎస్.టి. జాబితాలో అక్రమంగా కలుపబడిన లంబాడీలు ఆదివాసీల రిజర్వేషన్లు దోచుకుంటున్నా పాలకవర్గాలు ఏమీ పట్టనట్లుగా ఉంటున్నాయి.

దీనిని సహించలేని ఆదివాసీలు, రిజర్వేషన్‌లలో దగాకు వ్యతిరేకంగా పోరాట మార్గమే శరణ్యంగా ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకూ చారిత్రక పోరాటానికి సిద్ధమవుతున్నారు. లంబాడీలను ఎస్‌టి జాబితా నుంచి తొలగిస్తేనే 'ఆదివాసీలకు మనుగడ' అని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. ఈ సందర్భంలో ఇంతకూ లంబాడీలు షెడ్యూల్ తెగకు చెందినవారా? చరిత్ర కాలం నుంచి ఆదివాసీ తెగలతో సహజీవనం చేసినట్టూ, చారిత్రక పోరాటం చేసినట్లు ఏమైనా ఆధారాలున్నాయా? భారత రాజ్యాంగం ప్రకారం వీరిని ఎస్.టి.లుగా గుర్తించారా? అని ఒకసారి చరిత్ర పరిశీలిస్తే 'లేదు' అనే కారణం కనిపిస్తుంది.

భారతదేశ మూలవాసులుగా ప్రసిద్ధికెక్కిన వారు ఆదివాసీలు. వీరినే మొదటగా 'ద్రావిడ పూర్వ ఆదివాసీలుగా' పిలిచేవారు. ఈ వారసత్వ ఫలితమే ప్రస్తుత ఆదివాసీ తెగలు. మధ్యప్రదేశ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్, పశ్చిమబెంగాల్ ఈ మధ్య భూభాగాన్ని 'గోండ్వానా రాజ్యమని' అంటారు. ఈ గోండ్వానా రాజ్యాన్ని ఏలిన వారు గోండులు, కోయతూర్ (కోయ) ఆదివాసీలు గోండ్వానా ప్రాంతంలో పరిపాలించిన చారిత్రక ఆధారాలు పరిశీలిస్తే ఆదిలాబాద్ జిల్లాలో సిర్పూర్, ఉట్కూర్, చెన్నూర్, నిర్మల్ ప్రాంతాలను ఆత్రం వంశీయులు పాలించారు.

ఆదివాసీలకు రాచరిక పోరాటాలు, బ్రిటీష్ వ్యతిరేక పోరాటాలతో పాటుగా, స్వాతంత్య్ర అనంతరం కూడా పోరాటం చేయక తప్పడం లేదు. చరిత్రలో రామాయణం, మహాభారతం, పురాణాల్లో, రాచరిక పాలనలో స్వాతంత్య్ర సమరంలో, సాంస్కృతిక సంప్రదాయాల్లో వేషధారణలో, భౌగోళిక విస్తీర్ణంలో కూడా ఆదివాసీలతో 'లంబాడీ జాతికి' సంబంధం లేదు. షెడ్యూల్డ్ తెగలతో లంబాడీలనూ ఏ రాష్ట్రంలో కలపకున్నా మన రాష్ట్రంలో కలిపినందుకు ప్రతిఫలం ఏమిటనేది పరిశీలిస్తే 2001 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 50,24,104 మంది గిరిజనులు నివసిస్తున్నారు.

ఈ జనాభాలో 41 శాతం షెడ్యూల్డ్ ప్రాంతంలో 30 ఆదివాసీ తెగలు నివసిస్తుండగా మైదాన ప్రాంతంలో 59 శాతం మందికి చెందిన ఐదు తెగలు నివసిస్తున్నాయి. మైదాన ప్రాంత గిరిజనుల అక్షరాస్యత 34 శాతం ఉంటే, షెడ్యూల్డ్ ఏరియా విద్యార్థుల అక్షరాస్యత 20 శాతంగా ఉంది. రాజ్యాంగంలో సూచించిన 360 ఆర్టికల్ 25 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో అడవి ప్రాంతంలో స్థిర నివాసం కలిగిన 30 తెగలను నిజమైన ఆదివాసీలుగా పేర్కొంది. కాని నేడు ఈ తెగలకు రిజర్వేషన్ ఫలాలు అందక నానాటికీ కనుమరుగయిపోతున్నారు.

1950 నుంచి 1975 వరకు అభివృద్ధి వైపు సాగిన ఆదివాసీల ప్రయాణం కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడీలను ఎస్‌టి జాబితాలో చేర్చాలనే నిర్ణయంతో అభివృద్ధి ఆగిపోయింది. అక్షర జ్ఞానం లేని ఆదివాసీ సమూహాలు మాకు అన్యాయం జరుగుతుందని గొంతు ఎత్తలేని పరిస్థితులలో, స్వార్థపర రాజకీయాలతో ఓటు బ్యాంకు కోసం 1970 వరకు బిసి(ఎ)లుగా జీవో ఎం.ఎస్. నెం.1773 (ఎస్‌డబ్ల్యు), 23 సెప్టెంబర్ 1970 ప్రకారం రిజర్వేషన్‌లను అనుభవించిన లంబాడీలతో పాటుగా ఎరుకల, యానాది కులాలనూ రాష్ట్రపతి ఆమోద ముద్ర లేకుండా పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టకుండా 1976 అక్టోబర్ 29న షెడ్యూల్ తెగల చట్టం ప్రకారం 108 జాబితా నెం 29, జీవో ఎం.ఎస్ నెం.149 ప్రకారం డినోటిఫైడ్ ట్రైబ్స్‌గా ఐదు సంవత్సరాల ప్రాతిపదికన కలపడం జరిగింది.

1961 జనాభా ప్రకారం 96,174 జనాభా కల్గిన లంబాడీలు, 1971 జనాభా లెక్కల ప్రకారం 1,32,464కు పెరిగారు. 1976లో ఎస్‌టి జాబితాలో చేర్చిన తదుపరి మహారాష్ట్రలో బిసిలుగా, రాజస్థాన్‌లో ఓసిలుగా, కర్ణాటకలో ఎస్‌సిలుగా చెలామణి అవుతున్న వారు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి 1981 జనాభా లెక్కల ప్రకారం 11,58,342కి పెరిగారు. విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో లంబాడీల ఆధిపత్యాన్ని గమనిస్తే ప్రజాస్వామ్యంలో సామాజిక న్యాయాన్ని పాలకవర్గాలు ఏనాడో పాతర పెట్టారు. విద్యారంగంలో 2005 ఎస్‌టి రిజర్వేషన్ జాబితా పరిశీలిస్తే బి.ఇ/బి.టెక్ సీట్లు 6542లో 5,821 సీట్లు లంబాడీ, యానాది, ఎరుకల వారు పొందగా, 30 తెగలుగా ఉన్న ఆదివాసీలకు 127 మాత్రమే లభించాయి.

ఐఐటి, ఎన్.ఐ.టి. మెడిసిన్ కోర్సులలో చేర్పించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రతిభా పాఠశాలలు, గురుకుల కళాశాలలో లంబాడీ వర్గం పైచేయి సాధించింది. 2005లో వందశాతం ఉద్యోగాలలో 57 శాతం లంబాడీలు, 26 శాతం ఎరుకలు, 7 శాతం యానాదులు పొందారు. 30 ఆదివాసీ తెగలకు మాత్రం 10 శాతం ఉద్యోగాలు లభించాయి. మైదాన ప్రాంత ఏరియాల్లో ఎస్‌టిలుగా కొనసాగుతున్న లంబాడీలు షెడ్యూల్డ్ ఏరియాలోకి వచ్చి స్థానిక తహసీల్దార్ల దగ్గర అక్రమ ఏజెన్సీ సర్టిఫికెట్స్ పొంది రాజకీయ బలంతో ఉద్యోగాలు దోచుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఐ.ఏ.ఎస్.గాని, ఐ.పి.ఎస్‌గాని ఆదివాసీలు లేరంటే ప్రజాస్వామ్య పాలన ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక రాజకీయ రంగంలో శ్రీకాకుళం నుండి ఆదిలాబాద్ వరకూ అటవీప్రాంత ఏజెన్సీలో మూడు లోక్‌సభ స్థానాలు, 19 అసెంబ్లీ స్థానాలు, యస్.టిలకు కేటాయించారు. అందులో 30 తెగల నుండి 14 మంది ఎమ్మెల్యేలు ఉండగా, 5 స్థానాలు లంబాడీలు ఉన్నారు.

రెండు పార్లమెంట్ స్థానాలు లంబాడీలు పొందారు. 70 శాతం ఆదివాసీ జనాభా కలిగిన మహబూబాబాద్ (వరంగల్) ఎం.పి స్థానం, ఖానాపూర్ (ఆదిలాబాద్) స్థానాలు 30 శాతం జనాభా కలిగిన లంబాడీలు పొందారంటే ఆదివాసీల నిరక్షరాస్య త, అమాయకత్వం అంచనా వేయవచ్చు. భారత రాజ్యాంగం 342(1) క్లాజు ప్రకారం భారత రాష్ట్రపతి కేంద్రంలో కొన్ని రాజ్యాంగ సంస్థలను కొన్ని భాగాలు షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించవచ్చు. 342(2) క్లాజు ప్రకారం రాష్ట్రంలో గవర్నర్‌ని సంప్రదించి షెడ్యూల్ తెగలను చేర్చే అధికారం పార్లమెంట్‌కు ఉంటుంది. కాని కొన్ని కొలబద్దలు ప్రమాణాలు పరిగణనలోకి తీసుకోవాలి.

1) ఆదిమ లక్షణాలు గోచరించడం, 2) నిర్దిష్టమైన సంస్కృతి సాంప్రదాయాలు కల్గి ఉండటం, 3) భౌగోళికంగా అటవీ ప్రాంతంలో ఉం డటం, 4) ఇతరులతో సంబంధాలు నెరపడానికి బెరుకుగా చూపడం, 5) వెనకబాటుతనం. ఈ నిబంధనలకు లంబాడీలకు ఏమాత్రం పోలిక లేదు. ఆదివాసీలతో సంబంధం లేని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎస్‌టి జాబితాలో చేర్చబడిన లంబాడీలను ఏ నిబంధనతో కలిపారో ప్రజలకు తెలియజేయాలి. తద్వారా లంబాడీలను ఎస్‌టి జాబితా నుండి తొలగించాలి. పాలకులు లంబాడీల అభివృద్ధికి నిజంగా పాటు పడాలనుకుంటే ఎస్.టి.ల నుండి తొలగించిన తరువాత వారికి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి.

(గుజరాత్ గుజ్జర్ల తరహాలో) జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు ఆదివాసులకూ కల్పించాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఆదివాసులకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏ మాత్రం లాభం ఉండదు. కెసిఆర్ ఇస్తానన్న 12 శాతం రిజర్వేషన్లు కూడా లంబాడీలు దోచుకుంటారు. కాబట్టి ఆదిలాబాద్ నుండి శ్రీకాకుళం వరకూ ఉన్న ప్రతి ఆదివాసీ కొమరం భీం, మల్లు దొర, ఘంటం దొర, అల్లూరి పోరాట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని పై డిమాండ్ల సాధన కోసం మిలిటెంట్‌గా పోరాడాలి.

- వూకే రామకృష్ణ
ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్, ఖమ్మం జిల్లా కార్యదర్శి

Monday, October 17, 2011

కొలిమంటుకున్నది - రామా చంద్రమౌళి Andhra Jyothi 18/10/2011


కొలిమంటుకున్నది

- రామా చంద్రమౌళి

వర్తమాన సంక్షుభిత తెలంగాణ ప్రజాజీవిత బీభత్స దృశ్యాన్ని అందరూ ఒక చోద్యం చూస్తున్నట్టు చూస్తూ చేష్టలుడిగి ఒట్టి సాక్షులుగా మాత్రమే మిగిలిపోతున్నారు. అసమర్థ ప్రభుత్వం, బాధ్యతలు విస్మరించిన రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, కమిటీల కచేరీలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పాలకులు, రోబో పాత్రల్లో జీవిస్తున్న వేలమంది పోలీసులు, ఒట్టి అరుపులతో తమను తామే మోసం చేసుకుంటున్న మే«ధావులు, రేటింగ్‌లతో, 'ఎక్స్‌క్లూజివ్'లతో పులకించిపోతున్న మీడియా... అసలేం జరుగుతోందిక్కడ? ఎందుకింత ఉదాసీనత?

ఒకవైపు నెలరోజులకుపైగా సకల తెలంగాణ జనం శాంతియోధులై... పిల్లలు, పెద్దలు, స్త్రీలు, వృద్ధులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, వృత్తికూలీలు, ఉద్యోగులు... అందరూ ఏకైక గాఢ ఆకాంక్షతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం గర్జిస్తూంటే... ప్రతి దినం వందలకోట్ల రూపాయల నష్టం వాటిల్లుతూ, సంచితంగా ఉత్పత్తి రంగంలో కోట్లాదికోట్ల నష్టం పేరుకుపోతూంటే, విద్యార్థుల అమూల్య జీవితాలు మసిబారిపోతుంటే, సకల వృత్తులూ స్తంభించి జీవితం స్తంభించిపోయి కకావికలౌతూంటే.. ఎందుకీ మొద్దునిద్ర..?

ఎందుకీ అచేతన నిష్క్రియత్వం..? అధ్యయనాలేమైనాయి..? పరిశీలనలేమైనాయి..? గూఢచర్య, నిఘా నివేదకలేమైనాయి? అవేవీ 'అసలు సత్యాన్ని' ప్రస్ఫుటపర్చడంలేదా? మొన్న నారాయణగూడలో ఒక ఊరేగింపు జరిగింది. పెంటకుప్పలపై చెత్తకాగితాలను, ఖాళీసీసాలను, అట్టపెట్టెల తుక్కును ప్లాస్టిక్ గోతాల్లో ఏరుకునే వందకుపైగా శుద్ధమానవులు... 'జై తెలంగాణ', 'మాకు మా తెలంగాణ కావాలె' అనే నినాదాలతో బిగించిన పిడికిళ్ళ దండు..; దానికి ఓ వంద గజాల వెనుక డాక్టర్స్ ర్యాలీ... 'వుయ్ వాంట్ తెలంగాణా'. ఏమర్థమౌతోంది..? ఇంటగ్రేషన్..

లోయ ర్ లిమిట్ జీరో టు అప్పర్ లిమిట్ ఇన్‌ఫినిటీ... అది నిమ్న ప్రజల గుం డె లోలోతుల్నుండి, అత్యున్నత విద్యావంత ప్రజావర్గాల దాకా విస్తరించి... తెలంగాణ నాలుగున్నరకోట్ల ప్రజల గుండె గుండెలో రగులుతున్న నిప్పువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంక్ష యింక ఏరకంగా వ్యక్తీకరించబడాలె? ఎంతసేపూ పాలకులకు... రాజ్యాధికారం, ప్రభు త్వ ఏర్పాటు సమీకరణాలు, శాసన సభ్యుల లోక్‌సభ సభ్యుల కప్పలతక్కెడ గెంతుల లెక్కలు, నటనలు, కుట్రలు, తాత్సారాలు, మోసాలు, మభ్యపెట్టడాలు, బ్లాక్‌మెయిలింగ్‌లు తప్పితే ప్రజల ఆకాంక్ష, ప్రజల యోగక్షేమాల స్పృహ, ప్రజల ఆలోచన, ప్రజల అభిప్రాయాలను గౌరవించే ప్రజాస్వామిక సంస్కారం, నైతికత... ఇవేమీ అవసరం లేదా? ఇక చాలు, ఇప్పటికే భవిష్యత్తులో రాష్ట్రం కోలుకోలేని విధంగా చాలా ఆర్థికంగా ధ్వంసం జరిగిపోయింది. ఇక దోబుచులాటలు, దొంగాటలు, నాటకాలు, నీతిబోధలు ఆపి... క్రింది అంశాలపై ప్రతి ఒక్కరూ దృష్టి కేంద్రీకరించాలి.

(1) పార్టీలు ఏవైనా... తెలంగాణ ప్రజాప్రతినిధులందరికీ అ«ధిష్ఠానం తెలంగాణ ప్రజలే... వాళ్ళందరూ అనివార్యంగా ప్రజాస్వామ్యంలో ప్రజలమాటనే వినాలి. ప్రస్తుతం ప్రజల ఆకాంక్ష 'ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు'... అందువల్ల ప్రజాప్రతినిధులందరూ తక్షణం వాళ్ళ వాళ్ళ పార్టీ అధిష్ఠానాలను ధిక్కరించి ప్రజా ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనాలి.పార్టీలకతీతంగా శాసనసభ్యులు, తెలంగాణ మంత్రులు గవర్నర్‌ను కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరిస్తున్నట్టుగా ఒక లేఖనివ్వాలి. అప్పుడు అనివార్యమై ఈ ప్రభుత్వం కూలిపోయే సంక్షోభమేర్పడి.. 'మేం మీ దగ్గరికి రావడం కాదు... మీరే మా దగ్గరికి వస్తారు' అనే స్థితి ఏర్పడుతుంది.

(2) ఎప్పుడైనా ప్రజానిరసన స్వరూపం... 'ఉద్యమం... తిరుగుబాటు... యుద్ధం' క్రమంలో వృద్ధి చెందుతుంది... ఇప్పుడున్న ఉద్యమస్థితి యిక సహనాన్ని దాటి 'తిరుగుబాటు' అనే సంక్లిష్ట స్థితిలోకి రూపాంతరం చెందబోతోంది.. ఇది గగనమెత్తు తీవ్రరూపం దాల్చకముందే 'తాత్సార' సిద్ధాంతాన్ని కేంద్ర ప్రభుత్వ పాలకులు సత్వరం విడిచిపెట్టి వెన్వెంటనే 'తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు'ను ప్రకటించాలి. తెలంగాణ ఉద్యమాన్ని ఒక రాజకీయ, సామాజిక సమస్యగా కాకుండా ఒక 'ఆత్మగౌరవ' పరితపనగా గుర్తించాలి.

(3) భారతదేశానికి మున్ముందు 'ప్రధాని' కావాలని ఆపేక్షించే రాహుల్ గాంధీ నెలరోజులనుండి జరుగుతున్న 'తెలంగాణ' ఉద్యమాన్ని పట్టించుకోకపోవడం ఆయన రాజకీయ అజ్ఞానాన్ని, అపరిపక్వతను ఉదాసీనతను చాటి చెబుతున్నాయి. తెలంగాణ సమస్యను సత్వరం పరిష్కరించడంలో రాహుల్ చురుకైన పాత్ర వహించకపోవడం అతనికి రాజకీయంగా చాలా నష్టాన్ని కష్టాన్నీ కలుగజేస్తుంది. అది రాహుల్ సత్వరం గ్రహించి ఒక యువ నాయకునిగా తెలంగాణ పరిష్కారంలో చురుగ్గా పాల్గొనాలి.

(4) సకల పౌరజీవితం స్తంభించిన వర్తమానంలో ఉన్నతస్థాయి జ్ఞానవేత్తలు ఒక సమూహంగా ఏర్పడి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, పార్టీల ఉన్నత అధినేతలను వాస్తవ నివేదికలతో కలిసి చర్చించి వాళ్ళు విస్మరిస్తున్న నైతిక బాధ్యతల గురించి గుర్తుచేయాలి. పరిష్కారానికి ఒక ఉత్ప్రేరకంగా పనిచేయాలి.

(5) మీడియా వద్ద తాము ప్రసారం చేసిన అసలైన వాస్తవ ఉద్యమ సమాచారం ఉంది. ఎంతసేపూ తమ రేటింగ్‌లూ, ఎక్స్‌క్లూజివ్ ప్రసారాలు, చర్చలు వదిలిపెట్టి జనహితం కోసం ఒక బాధ్యతాయుతమైన కార్యసాధక ధ్యాస బృందంగా ఏర్పడి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, పార్టీ అధిష్ఠానాలతో ఎందుకు రాయబారం చేయకూడదు.

(6) తెలంగాణ, ఆంధ్ర పెద్దలు, మేధావులు... ఇరుప్రాంతాల కీలక వ్యక్తులను ఒకచోట... పబ్లిగ్గా కూర్చోబెట్టి ఒక సర్వజన ఆమోదయోగ్య పరిష్కార సాధన దిశగా ఎందుకు ప్రయత్నం చేయరు? రాజకీయ జీవులు, ప్రజాప్రతినిధులు రెండు మూడు నాల్కలతో అనైతికంగా ప్రవర్తించడాన్ని మానవీయకోణంలో ఎందుకు ప్రశ్నించకూడదు?

(7) ఒక సార్వభౌమ ప్రభుత్వం అధికారికంగా 'తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు'ను ప్రకటించి, మాటతప్పి తోకముడుచుకోవడం, ప్రపంచ సభ్య దేశాల దృష్టిలో ఎలా ఉంటుంది? 'మాటకు కట్టుబడి ఉండాలి' అన్న నైతికధర్మ స్పృహ దేశ ప్రభుత్వాలకు అవసరం లేదా? దాదాపు అరవైఏండ్ల నిరంతర సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ ప్రజలు నినదిస్తున్న 'ప్రత్యేక రాష్ట్ర కాంక్ష' ఇప్పుడు ఇక పెట్రోల్ బావి తగులబడ్తున్నట్టు, వేసవిలో అడవి అంటుకున్నట్టు, ఆకాశమే అగ్నివర్షమై కురుస్తున్నట్టు ప్రళయభీకరమై మనందరి ముందు ప్రత్యక్షమై నిలబడి ఉంది. దీన్ని నిలువరించడం ఎవరితరమూ కాదు. కుట్రలు, కుతంత్రాలు, కుటిల కుత్సితాలు ఈ మహోగ్ర ఉద్యమాన్ని చల్లార్చలేవు. కాస్త ముందూ వెనుక ప్రజల విజయం తథ్యం.

- రామా చంద్రమౌళి
(వాస్తకర్త ప్రొఫెసర్, కవి, రచయిత)

ఉద్యమ సుడిలో బడుగుల విద్య - పాపని నాగరాజు Andhra Jyothi 18/10/2011


ఉద్యమ సుడిలో బడుగుల విద్య
- పాపని నాగరాజు

వేల సంవత్సరాలుగా నిచ్చెనమెట్ల కులవ్యవస్థ శూద్రులను విద్యకు దూరం చేసింది. ఈ చారిత్రక అన్యాయాన్ని గ్రహించిన చార్వాకులు, లోకాయతులు మొదలు మహాత్మ జ్యోతిరావు ఫూలే, డాక్టర్ అంబేద్కర్ వరకు విద్యతోపాటు సమస్త సకల జీవన రంగాలు, సంపద వరకు మాక్కావాలని పోరాడారు. ఈ క్రమంలో బ్రాహ్మణ-బనియాలతో ఫూలే; హిందూ దోపిడీ వర్గాల, బ్రిటీష్ వలసవాదులతో అంబేద్కర్‌లు పోరాడారు. రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ కొన్ని రిజర్వేషన్ ఫలాల్ని సాధించిపెట్టారు.

అయినా ఈ శూద్రకులాల పేదలు ఆ ఫలాల్ని చేజిక్కించుకోలేకపోతున్నారు. దానికి విద్యాలేమియే ప్రధాన కారణం. ఆనాడు మహాత్మ జ్యోతిరావు ఫూలే తలపెట్టిన మహోజ్వల ఆధునిక బ్రాహ్మణేతర పోరాట స్రవంతికి తన చదువుతోనే అంకురార్పణ జరిగింది. ఆధునిక జీవితం ఆరంభమయ్యేది స్కూలుతోనే, స్కూలు విద్యతోనే. కనుక ఫూలే విద్యకి అంత ప్రాధాన్యత ఇవ్వాలన్నాడు. ఆ ప్రాధాన్యాన్ని ఆయన మాటల్లోనే చెప్పుకుందాం. "విద్యలేనిదే వివేకం లేదు.

వివేకంలేనిదే వికాసం లేదు. వికాసం లేనిదే (మానవీయ సమానవీయ) విలువలేదు. విలువలేనిదే పురోగతి లేదు. పురోగతిలేనిదే ప్రగతి లేదు. ప్రగతిలేకనే శూద్రులు (అతిశూద్రులు) అధోగతిపాలయ్యారు. ఇంతటి అనర్దమూ (అతిముఖ్యమైన) ఒక్క అవిద్యవల్లనే జరిగింది.'' అని పూలే అంటాడు. తెలంగాణలో భూస్వాముల వివక్ష, దాడులు, అసమానతలు, దోపిడీ ఆధిపత్యం మూలంగా విద్య వీరికి అందలేదు. ఈ క్రమంలో తెలంగాణ రైతాంగ పోరాటం నక్సలైట్ ఉద్యమం వారిలో చైతన్యాన్ని రగిలించింది.

ఆ స్ఫూర్తితో, ఆ మహానీయులు సాధించిన రిజర్వేషన్ ఫలాల మూలంగా శూద్రులైన బడుగులు ఇప్పుడిప్పుడే అనగా 15-20 ఏళ్ళుగా విద్యాఫలాల్ని అనుభవించడానికి దరిచేరుతున్నారు. వీరి విద్యాభివృద్ధి మూలంగా అధికారాన్ని ఎలా పట్టుకోవాలో తెలుసుకునే అవకాశం ఉంది. ఆ ప్రమాదాన్ని గ్రహించిన అగ్రకుల ధనికవర్గాలు పాలకులు దుర్బుద్దితో మళ్ళీ ప్రైవేటీకరణను వెంటేసుకొచ్చి దూరంగా నెట్టారు.

వారే మరో రూపంలో వలసవాదులుగా కొనసాగినవారు తెలంగాణలో విద్య మొదలు సమస్త జీవన రంగాలు, వనరులు, సంపద ఇలా అనేక వాటిపై పెత్తనం చెలాయించి బడుగులను పాతాళంలోకి నెడుతున్నారు. మొత్తంగా తెలంగాణపైగానీ, బడుగులపైగానీ పెత్తనంచేసి తెలంగాణను అడ్డుకునేది రెండున్నర జిల్లాల రెండున్నర అగ్రకుల బడా పెట్టుబడిదారీ, పాలకవర్గాలే. కనుక రెండోదశ(1997)లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం వివిధ సామాజిక సర్వజనుల మహాసంగ్రామంగా మారి ఇప్పుడు కాక మరెప్పుడు తెలంగాణ రాదనే దృఢసంకల్పంతో ఏకోన్ముఖంగా సాగుతున్నది.

ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, కార్మికులు, రైతాంగం, మహిళలు, సామాజిక కులాల వారు, విద్యార్థి యువజనులు ఇలా ఎందరో పాల్గొంటున్నారు. పరిపాలన వ్యవస్థను స్థంభింపచేసేందుకు ఉద్యోగస్తులే కాదు న్యాయశాఖ, రక్షణ- పోలీసులుశాఖలతో పాటు, ఆదాయం వచ్చే బొగ్గుగని, రిజిస్ట్రేషన్స్, స్టాంపులు, మద్యం, పన్నుల, ఎక్సైజ్ శాఖలు ఇలా అన్ని రంగాలను ఈ ఉద్యమంలోగాని, సమ్మెలోగాని పాల్గొనేలా చేస్తూ ప్రజాప్రతినిధులు త

మ పదవులకు రాజీనామా చేస్తే తెలంగాణ కచ్చితంగా వచ్చితీరుతుంది. కానీ ఒక్కవిద్యాసంస్థల (పాఠశాల) విద్యార్థులు పాల్గొంటేనే తెలంగాణ వస్తుందనేదికాదు. కానీ ఉద్యమంలో విద్యార్థులు ఒకభాగంగా ఉంటున్నారు. నిజానికి ఈ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్నది బడుగులేనన్నది కాదనలేని సత్యం. వీరు చదువులకు దూరంగా ఉద్యమాల్లో - ఆత్మబలిదానాలలో ముందుంటున్నారు. పాలకవర్గాల, పెట్టుబడిదారుల పిల్లలు విదేశాల్లో ఇతర బడా విద్యాసంస్థల్లో చదువుతున్నారు.

దళిత బహుజన - పేదలు ఈ అరకొర చదువుల మూలంగా అగ్రకుల - ఉన్నత వర్గాల - సీమాం«ద్రులతో పోటీని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. ఈ పరిస్థితి ఇలా ఉన్న తెలంగాణ ఉద్యమాన్ని ఇంతటి పతాకస్థాయిలోకి తెచ్చింది ఈ 'బడుగు'లేనన్నది వాస్తవం. ఈ అభిప్రాయం సీమాం«ద్రులచే లోపాయికారి ఒప్పం దం కుదుర్చుకొన్నదని గానీ, ముందు షరతులతో కూడిన ఒప్పందాలను కుదర్చుకొన్నాకనే భౌగోళిక తెలంగాణకు అంగీకరించే వాదం అంతకన్న కాదు మాది. బేషరతుగా తెలంగాణ ఇవ్వాలంటున్నా, అందుకోసం పోరాడుతు న్న సామాజిక తెలంగాణవాదం మాది.

తెలంగాణలో ఏ పాలకులు అధికారంలోకి వచ్చిన బడుగుల విద్యాభివృద్ధి ఏనాడు కోస్తాం«ద్రులకన్న అభివృద్ధి కాలేదు. అందుకు కారణం పాలకులకు ప్రజలు దరిద్రులుగా ఉంటేనే వారిబూటకపు వాగ్దానాలతో ఓట్లేయించుకొని సమాజాన్ని దోచుకోవచ్చనే. సమైక్యాంధ్రప్రదేశ్‌లోని, తెలంగాణ ఉద్యమం మొదలుతో ఎన్నికైన మన ప్రజాప్రతినిధులు వారి నియోజకవర్గాలలో కనీసంగా ఏకోపాధ్యాయులను లేకుండా విద్యార్థుల 1:30 ప్రకారం కాకుండా తరగతి గదికొక్కరైన ఉపాధ్యాయుడిని నియమించిన చరిత్ర ఈ పాలకులకు ఉందా? భవనాలులేక పూరిగుడిసెల్లో, చెట్లకింద చదువులు, ఉన్న ఏకోపాధ్యాయ స్కూళ్లను ఎత్తివేయడం, మూత్రశాలలు, మరుగుదొడ్లు, మంచినీటిసౌకర్యం లేనివి ఎన్నో బడులు ఉన్నాయి.

మూతపడున్నవి, మూతపడ్డవి కూడా కోకొల్లలు. పైగా తెలంగాణ అంతటా ప్రైవేటుగా చదివించలేని బడుగులకు ప్రతి గ్రామంలో ప్రైవేటు బడులు దర్శనమిస్తున్నాయి. ఈ ప్రైవేటు బడుల ప్రభావం ఎంతటి స్థాయిలో ఉందంటే నేడు తెలంగాణ అంతటా 10వేల పాఠశాలల్లో చదువుతున్న 50 లక్షల మంది విద్యార్థులు సమ్మెలో పాల్గొంటున్నట్టు ఆ యాజమాన్యాలు ప్రకటించాయి. కనుక ప్రాథమికంగా 10వ తరగతి వరకు ప్రతి 100 మందిలో 30 మంది బడిగడపతొక్కుతున్న వారుగా, ప్రతి 300 మందిలో ఒక్కరే డిగ్రీగా, ప్రతి 600 మందిలో ఒక్కరే పీజీగా, ప్రతి 5000 మందిలో ఒక్కరు ఇంజనీరుగా, 12000 మందిలో ఒక్కడాక్టరుగా చదువుతున్నారు.

అంటే బడుగులకు ప్రాథమికంగా రావాల్సిన విద్య సరిగ్గా రాక, వచ్చినా ఇంగ్లీష్ రాక చదువులకు స్వస్తిపలకాల్సివస్తోంది. మరి పాలకులు వా రి రికార్డుల్లో ఈ ప్రాంతానికి - బడుగు ల విద్యాభివృద్ధికి అధికస్థాయిలో నిధు లు, విద్యాసంస్థల్ని కేటాయించినట్లు ఉ న్నా అవి దారిమళ్ళించబడి ప్రైవేటు విద్యాసంస్థలుగా వృద్ధిచెందుతున్నా యే తప్ప ప్రభుత్వాధీనంలోనివి కాదు. పాలకులకు చిత్తశుద్ధి లేదని పై విషయాలను పరిశీలిస్తే అర్థం అవుతుంది.

కావున ఇంతటి చారిత్రక అన్యాయం తెలంగాణ బడుగులకు జరిగిందనే దృష్టిలో పెట్టుకొని నేటి తెలంగాణ ఉద్యమంలో బడుగులు చదివే విద్యాసంస్థలను మినహాయింపునిచ్చే ఉద్యమరూపాలను, ఎత్తుగడలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఆలోచించమని ఉద్యమకారులను కోరుతున్నాను. విద్య బడుగుల దరిచేరడానికి ప్రస్తుతం భౌగోళిక తెలంగాణ ద్వారా సాధ్యం కాదు. సీమాంధ్ర బడా అగ్రకుల విద్యాపెట్టుబడిదారులకు బదులు తెలంగాణ అగ్రకుల బడా విద్యపెట్టుబడిదారులే విద్యాసంస్థల్ని నెలకొల్పుకుని మళ్లీ దోచుకోవడం జరుగుతుంది.

మెజార్టీ ప్రజలందరికీ విద్య చేరాలంటే దేశీయ ప్రగతిశీల భౌగోళిక సామాజిక స్వత్రంత విద్యా విధానంతోనే సాధ్యం. ఈ స్థితిలో నేడు సీమాం«ద్రులు పేరెంట్స్ కమిటీ పేరిట తెలంగాణను అడ్డుకునేవారుగా ఉన్నారు. నిజానికి వలసవాద అగ్రకుల బడా విద్యాపెట్టుబడిదారుల కార్పొరేట్ విద్యాసంస్థల్లో, ఇంటర్నేషనల్, ఢిల్లీ పబ్లిక్ స్కూళ్లలో చదివించే సీమాంధ్ర అగ్రకుల బ్యూరోక్రాట్సే ఆందోళనలు చేపడుతున్నారు. ఈ పేరెంట్స్ కమిటీవారు బడులు తెరవాలంటున్నారేగానీ తెలంగాణ ఇవ్వాలనడం లేదు.

తెలంగాణకు మేం వ్యతిరేకం కాదంటున్న వీరు తెలంగాణ ఉద్యమంలో వీరి పాత్ర ఏస్థాయిలోఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అందుకే సీమాంధ్ర పెట్టుబడిదారులు, పాలకులు, మీడి యా వంతపాడుతుందే కానీ తెలంగాణ వాదులు కాదు. పైగా ప్రభు త్వం సమ్మె విరమింపజేయమని హెచ్చరిస్తుందే కానీ తెలంగాణను ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ప్రభుత్వ మొండితనం ఎంతస్థాయి లో ఉందంటే గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల్ని పోలీసులచే కఠినంగా అణిచైనా అడ్డుకోకుండా నిర్వహించాలని తపిస్తుంది. అణిచివేతల్ని ప్రదర్శిస్తుందని అనేక ఘటనలు రుజువుచేస్తున్నాయి.

కేంద్రం తెలంగాణ ఇవ్వదని, తెలంగాణలో 'బడుగుల' చదువులు అభివృద్ధి కావని, సమ్మె ఆగదని, ఈ పరిస్థితుల్లో తెలంగాణ బడు(గు)ల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలాగా తయారైంది. ఇలా కావడానికి అగ్రకుల దళారీ దోపిడీవర్గ వలసవాదులు, పాలకులు బాధ్యులు అవుతారు. ఈ అనిశ్చితిని పరిష్కరించాలని పాఠశాలేతర విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, రైతాంగం, మహిళలు, సామాజిక కులాల వారు, యువజనులు, లాయర్లు, కోర్టుసిబ్బంది ఎక్సైజ్ పోలీసులు, న్యాయశాఖ, రక్షణ- పోలీసుశాఖలతో పాటు, ఆదాయంవచ్చే బొగ్గుగని, రిజిస్ట్రేషన్స్, స్టాంపులు, మద్యం, ఎక్సైజ్ ఇలా అన్నిరంగాలను, అందర్ని పాల్గొనేలా చేసి భౌగోళిక తెలంగాణతో పాటు సామాజిక తెలంగాణను సాధించుకుందాం.

- పాపని నాగరాజు
తెలంగాణ బహుజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు

Saturday, October 15, 2011

బీసీల అభివృద్ధిని అడ్డుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం By -ఆర్. కృష్ణయ్య Namasethe Telangana Dated 16/10/2011

బీసీల అభివృద్ధిని అడ్డుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ వారి అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా విద్యా,ఉద్యోగ, ఆర్థిక, రాజకీయాభివృద్ధికి చిత్తశుద్ధితో పాటుపడటం లేదు. పైగా అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో బీసీల గొంతు నొక్కడానికే కుట్రలు చేస్తున్నది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీ వ్యతిరేక విధానాలనే అవలంబిస్తున్నది. దీనికి తాజా ఉదాహరణ సుప్రీంకోర్టు తీర్పును సాకుగా తీసుకొని పంచాయితీరాజ్ సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించడానికి కుట్ర చేసింది. దీనికి వ్యతిరేకంగా బీసీ సంక్షేమ సంఘం పెద్ద ఎత్తున ఉద్యమానికి సన్నాహాలు చేయడంతో.. ప్రభుత్వం తాత్కాలికంగా వెనకడుగు వేసింది. పరిస్థితులు ఇలా ఉంటే.. వివిధ పార్టీలలోని బీసీ నాయకులు ఎవరూ బీసీ సమస్యల పట్ల చిత్త శుద్ధితో పట్టించుకోవటం లేదు. తమ రాజకీయ మనుగడ కోణంలోనే సమస్యలను చూస్తున్నారు కానీ... మెజారిటీ బీసీ ప్రజల ప్రయోజనాలను పట్టించుకోవటం లేదు. దీనిని అలుసుగా తీసుకొన్న వివిధ పార్టీల అగ్రకుల నాయకత్వం బీసీల ప్రయోజనాలను తుంగలో తొక్కుతోంది. రా జ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 340 ప్రకారం బీసీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. కానీ దీనిని పట్టించుకోకుండా..అందరూ బీసీ అభివృద్ధికి తూట్లుపొడుస్తున్నారు.
బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి కూడా.. బీసీ వ్యతిరేక చర్యలే చేపడుతున్నారు. ఇకనైనా బీసీల అభివృద్ధికి చర్యలు చేపట్టాలి.బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలని 2008లో అసెంబ్లీలో తీర్మానం చేశారు. కానీ దానిపై ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వంపై ఏవిధమైన ఒత్తిడి చేయడం లేదు.

ఈ విషయాన్ని గాలికి వదిలేశారు. దీనిపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించాలి.అలాగే సుప్రీంకోర్టు తీర్పు సాకుగా తీసుకొని ఉన్న రిజర్వేషన్లను తగ్గించే చర్యలు తీసుకుంటున్నారు. దీనికి స్వస్తి పలకాలి. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా ‘బి- కేటగిరి’ విద్యార్థులకు 2009 కౌన్సిలింగ్‌లో ఎలాంటి ఫీజులు వసూలు చేయలేదు. జీఓ నెం.18లో ఎస్సీ, ఎస్టీలతో సమానం అని స్పష్టంగా ఉండటంతో అప్పుడు ఫీజులు వసూలు చేయలేదు. దీంతో ఎంతో మంది బీసీ విద్యార్థులు చదువుకుంటున్నారు. కానీ ఇప్పడు ప్రభుత్వం ఫీజులు చెల్లించడానికి అనేక అడ్డంకులు కల్పిస్తున్నది. ఫీజులు చెల్లించడానికి నిరాకరిస్తున్నది. హైకోర్టు ‘ఫీజులు చెల్లించాల్పిందే’నని చెప్పినా.., ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీనికి వ్యతిరేకంగా బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమించడంతో.. అప్పటి సీఎం రోశయ్య బీసీ విద్యార్థులకు ఫీజులు చెల్లించాలని జీఓ నెం.222/2010 ను జారీ చేశారు. కానీ దీనిని అమలు చేయలేదు. బడ్జెట్‌ను విడుదల చేయలేదు. ఫీజులు చెల్లించలేదు. దీంతో.. బీసీ విద్యార్థులు కాలేజీలలో నానా యా తనలు పడుతున్నారు. యాజమాన్యాల వేధింపులకు బలిఅవుతున్నారు. అలాగే... ప్రభుత్వం బీసీల వ్యతిరేక వైఖరి విడనాడాలి. బీసీ కులాలకు చెందిన జూనియర్ అడ్వకేట్లకు నెలకు 500 రూపాయలు చెల్లిస్తున్నారు.

స్టయిఫండ్ ను ఎస్సీ, ఎస్టీ లకు నెలకు 500ల నుంచి వెయ్యికి పెంచింది, కానీ.. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు పెంచకుండా అలాగే ఉంచింది. ఎప్పుడో 1984లో నిర్ణయించిన స్టయిఫండును పెరుగుతున్న ధరల కనుగుణంగా పెంచడానికి బదులు అలాగే ఉంచడం ఎంతవరకు సబబో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. హైస్కూలు విద్యార్థులకు కూడా మెస్ చార్జీల కోసం 960 రూపాయలు కేటాయిస్తోంది. కానీ.. జూనియర్ అడ్వకేట్లకు మాత్రం 500 మాత్రమే ఇస్తామనడం బీసీల పట్ల ప్రభుత్వానికి ఉన్న ప్రేమ అర్థం అవుతోంది. బీసీ జూనియర్ అడ్వకేట్లందరికీ.. నెలకు కనీసం అయిదువేలకు తగ్గకుండా స్టయిఫండ్ ఇవ్వాలి. బీసీల విద్యాభివృద్ధి కోసమని 2010 జూన్‌లో కొత్తగా 300 బీసీ బాలుర కాలేజీ హాస్టళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ.. ఇప్పటి వరకూ ఒక్కదానిని కూడా ప్రారంభించలేదు. దీనిని బట్టి బీసీల పట్ల ప్రభుత్వానికి ఉన్న ద్ధ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. అలాగే 2008లో కాలేజీ అమ్మాయిల కోసం కూడా 300 హాస్టళ్లను ప్రారంభిస్తున్నామని ప్రకటించి ఇప్పటికీ 64 హాస్టళ్లు ప్రారంభించనేలేదు. ఇది బీసీ వ్యతిరేక చర్య కాకుంటే ఏమవుతుందో ప్రభుత్వమే చెప్పాలి.ప్రపంచీకరణ, సరళీకరణ విధానాల ఫలితంగా కులవృత్తులన్నీ.. నాశనమై గ్రామీణ వృత్తిదారులంతా.. ఆకలితో అలమటిస్తున్నారు. వీరి అభివృద్ధికోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ఏమీ తీసుకోవడంలేదు. శాలివాహన, విశ్వవూబాహ్మణ, వాల్మీకి, మేదర, సగర, దర్జీ, దూదేకుల, కృష్ణబలిజ/పూసల, బట్రాజు తదితర కులవృత్తుల వారికి ఫెడరేషన్లు ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. ఉన్న వాటికి కూడా నిధులు మంజూరు చేయలేదు.అలాగే గ్రామాలలో అధికంగా ఉన్న చేనేత కార్మికులు, గీత కార్మికులు ఆకలి చావులకు గురవుతున్నారు. కాబట్టి రాష్ట్ర బడ్జెట్‌లో కుల వృత్తిదారుల అభివృద్ధికోసం ప్రత్యేక నిధులు కేటాయించాలి.

ఇక రాష్ట్రంలోని బీసీ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించకుండా.. ప్రభు త్వం నిర్లక్ష్యం చేస్తోంది. పక్క రాష్ట్రాల్లో బీసీలకు వందనుంచి రెండువందల కోట్ల రూపాయలు కేటాయిస్తుంటే.. మన రాష్ట్రం మాత్రం కేవలం 10 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంటోంది. రాష్టంలోని బీసీ కులాల జనాభా ప్రాతిపదికన చూస్తే.. కనీసం 500 కోట్లు కేటాయించాలి. అప్పుడు 4 కోట్లమంది బీసీలు అభివృద్ధిబాటన పడతారు.
బీసీల విద్యాభివృద్ధి కోసం పాటుపడుతున్నామని చెప్పుకుంటున్న ప్రభు త్వం పదిలక్షల మంది పాఠశాల విద్యార్థులకు నాలుగేళ్లుగా మెస్ చార్జీలు పెంచడంలేదు. దీంతో.. పెరిగిన ధరల నేపథ్యంలో అర్థాకలితో విద్యార్థులంతా అలమటిస్తున్నారు. పేద , బీసీ బడుగు వర్గాల పాలిట వరవూపసాదంగా మారిన ఫీజు రీయింబర్స్ మెంట్ స్కీమ్ ను కూడా ప్రభుత్వం నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో.. పేద కుటుంబంలో పుట్టిన ఎంతోమంది విద్యార్థులు ప్రొఫెషనల్ వృత్తి విద్యాకోర్సులు చదువుతున్న వారు అయోమయంలో పడ్డారు. చదువులు కొనసాగించలేక నానా కష్టాలు పడుతున్నారు. గత సంవత్సరం నుంచి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్‌ను ఎత్తివేయడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తోంది. దీంతో..రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు అనేక విధాలుగా కష్టాల పాలవుతున్నారు. కొంతమంది.. చదువులు కొనసాగించలేక మధ్యలోనే చదువులు విడిచిపెడుతున్నారు. మరి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఫీజులు చెల్లించడం ఇష్టంలేక అనేక రకాలుగా ప్రభుత్వం ప్రతిబంధకాలను సృష్టిస్తోంది.

ఇలా.. బీసీ వ్యతిరేక చర్యలను ఎనై్ననా చెప్పుకోవచ్చు. నామినేటెడ్ పోస్టులలో, కలెక్టర్ల నియామకాలలో బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది. కేవలం బీసీ ఉన్నతాధికారులపై ఏసీబీతో దాడులు చేయిస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన ఐఏఎస్ ఆఫీసర్లపై కూడా దాడులు చేస్తున్నారు. ఇంత అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్ పార్టీలోని బీసీ నాయకులు, మంత్రులు పతిపక్షపార్టీ నేతలు నోరు మెదపడం లేదు. బీసీలను రాజకీయంగా అణచివేయడానికి ఎన్నో కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు బీసీ సంక్షేమ సంఘం బీసీలకు అండగా నిలిచి పోరాడుతోంది. ఈ పరిస్థితుల్లో బీసీలంతా ఐక్యమై ఆకలి పోరాటం చేయడమే కాదు, ఆత్మగౌరవ పోరాటాన్ని కూడా చేయాల్సిఉంది. అంతిమంగా రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాల్సిఉంది. 
-ఆర్. కృష్ణయ్య
అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సంక్షేమ సంఘం

గాంధీ-కోతి కథలు వద్దు - గోగు శ్యామల Andhra Jyothi Dated 16/10/2011


గాంధీ-కోతి కథలు వద్దు

- గోగు శ్యామల

తెలంగాణ స్వరాష్ట్ర పోరాటం గూర్చి కంచ ఐలయ్య ఒక సామాజిక శాస్త్రవేత్తగా తెగ బాధపడుతున్నారు. 'గాంధీతాతా నువ్వే చెప్పు' (అక్టోబర్ 11, ఆంధ్రజ్యోతి) అన్న ఐలయ్య వ్యాసం ప్రకారం ఆయన బాధపడుతున్న అంశాలివి: (అ) తెలంగాణ బిసిలు, 'కమ్మ క్యాపిటల్' పాలన తెలంగాణ ప్రజలకు ఒక వరంలా ప్రాప్తించిన తరువాతనే కొంతైనా బతుకు దెరువులతో అటు ఇటు కదలగలుగుతున్నరట;

(ఆ) రెడ్లు, కమ్మలు అధికారం కోసం కొట్లాడుకుంటుంటే కమ్మలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని బాధను వ్యక్తం చేసిండు; (ఇ) ఇదే సమయంలో తెలంగాణ రెడ్లను, వెలమలను కమ్మొళ్ళు తమ కాళ్ల కింద తొక్కేసిండ్రని ఇంకో తీరు బాధపడ్డడు; (ఈ) అన్ని రంగుల పార్టీల కోతులన్నీ కరప్షన్‌తో చిన్న రాష్ట్రాల ఉద్యమాన్ని జోడించి సోనియా గాంధీని ఇటలీకి పంపించాలని వ్యూహం పన్నుతున్నారని బాధపడ్డడు.

ఒక దిక్కు ఢిల్లీలో రాజఘాట్ దగ్గర మూడు కోతుల వెనుక ఓ అజ్ఞాత కోతికూడా ఉందని ఐలయ్య అంటుండు. మరి ఈ కోతుల గుంపును ఉత్తర తెలంగాణలో తంతే హైదరాబాద్ పరుపులో పడ్డరని రాసిండు. ఐలయ్య ప్రకారం తన్నింది గూడా కోతే గదా? తన్నింది, తంతె పడింది ఒకే జాతి కోతులే గదా? తెలంగాణ ఇస్తే హైదరాబాద్‌లో గుజరాత్ మారణకాండ రిపీట్ అయితదని అసదుద్దీన్ ఓవైసీని మించి అనవసర బీకర భాష వాడి పంచాంగం చెప్పిండు. అయినా ఒక చిన్న ప్రశ్న. తాను చెప్పిన ఆ అజ్ఞాత కోతికి కాశాయ కోతికి జోడీ కుదిర్చి.. వానర రామదండుకు నాయకత్వానికి జోడీ కుదిర్చి ఊచకోత పంచాంగం జెప్పిండు.

ఇంత జోడీలు కుదిర్చె ఐలయ్యగారు బహుజనుల జోడీలను యాడ ముదిరిపెట్టిండు? అసలు ఆయన జెప్పే పంచాంగం ఏంది? బహుజన పంచాంగమా? సోనియా గాంధీ కాంగ్రెస్ పంచాంగమా? విశాలాంధ్ర, సమైక్యాంధ్ర కోసం ఈ కోతుల పంచాంగమా? అంబేద్కర్ చిన్న రాష్ట్రాల ఆవశ్యకత సూత్రీకరణను డిస్‌ప్రూఫ్ అని చెప్పే ప్రయత్నం చేయడానికి గాంధీ మనుమడి అవతారమెత్తిండేమో?

ఐలయ్య ఒకటి మాత్రం గుర్తించుకోవాలి. మనువాదులకు, ద్విజులకు, ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని అవతారాలెత్తినా అంబేద్కర్ సిద్ధాంతాన్ని డిస్‌ప్రూఫ్ చేయడానికి సాధ్యం కాలేదని, అంతనుకుంటే తొక్కి పెట్ట వచ్చు, అణిచిపెట్ట వచ్చు. కాని డిస్‌ప్రూఫ్ అనే ప్రసక్తి చరిత్రలో, ముఖ్యంగా వర్తమానంలో జరగలేదు. అయినా ప్రత్యేక తెలంగాణకై బహుజనుల ఆకాంక్ష పట్ల తన వైఖరేందో ప్రకటించలేదు.

'తాతా తాతా' అంటూ గాంధీ చెప్పిన కోతుల కథ ను అడ్డం పెట్టుకొని డొంకతిరుగుడు కథలు చెపుతుండు. ప్రస్తుతం ఈ కథలు చెప్పుడు ఐలయ్యకే కాదు ఎవ్వరికీ సాధ్యపడదు. ఎవ్వరైనా కూడా నాలుగు కోట్ల ప్రజలు మూకుమ్మడిగా 'సకలజనుల సమ్మె'లో పాల్గొని తమ ఆకాంక్షను చాటుతున్నపుడు ప్రత్యేక తెలంగాణకు అనుకూలమా లేక గుప్పెడు దళారీలు, పెట్టుబడీదారులు, మాఫియాలు డబ్బుసంచుల బలంతో ముందుకు తెస్తున్న సమైక్యాంధ్ర, విశాలాంధ్ర డిమాండుకు అనుకూలమా తేల్చి చెప్పాల్సిందే.

నేటి సకల జనుల సమ్మె తెలంగాణ ఉద్యమపు అత్యున్నత దశ. ప్రపంచంలో కనివినీ ఎరుగని రీతిలో ఇది జరుగుతున్నది. ఈ ఉద్యమాన్ని ప్రధానంగా అనేక ఉత్పత్తి కుల, తెగ, జాతి అస్తిత్వాల ప్రజలు నడిపిస్తున్నారు. 1969 కంటె ముందునుంచే లక్షలాది ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఆ ఉద్యమం నేడు కోట్ల జనసంఖ్యలో పాల్గొనే దశకు చేరింది. దీనితోపాటు అనేక అస్తిత్వాలు పాలుపంచుకుంటున్న రాజకీయేతర, ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమమిది.

'ఇది మాది' 'మాది మాక్కావాలె' అంటే ఈ ప్రాంతం మాది. ఇక్కడి సమస్త వనరులు, నీరు, భూమి మాది అనీ తేల్చి చెపుతున్నారు. "ఇక్కడ పరాయి పాలన వద్దు, మా ప్రాంతాన్ని మేమే పరిపాలించుకుంట ం!'' అని ఉద్యమం చేస్తున్నరు, ప్రాణ త్యాగాలు చేస్తున్నరు. 'మాకు స్వాతంత్య్రం వచ్చింది' అనుకున్న తరువాత దాదాపు 'భారతదేశంలోనే మొట్ట మొదటిసారిగా మందుకొచ్చిన రాజకీయేతర ప్రాంతీయ అస్తిత్వ అతిపెద్ద ఉద్యమం ఇదే' అని కూడా చెప్పుకోవాల్సి ఉంది.

అయితే అధికార రాజకీయ పార్టీలు, వాటి పెత్తనాన్ని సపోర్టు చేసే శక్తులు బెల్లమున్న దగ్గర ఈగలు ముసిరినట్లు, ఓట్లు, సీట్లు, అధికార అందలం కోసం ఉద్యమం చుట్టూ అలుముకోవచ్చు. వారి వారి పంపకాల సమస్యలు ఉద్యమం చుట్టూ ముసురుకోవచ్చు. అంతమాత్రాన రెడ్డి వెలమ, కమ్మ అనే మూడు పాలకవర్గ కోతులు గుంపు కథ తెలంగాణ రాష్ట ఉద్యమానికి, చోదక శక్తులుగా ఉన్న బహుజనులకు ఎట్ల సరిపోతది? దేశంలో అన్నీ రాజకీయ పార్టీలు, కూటములు, శక్తులు, ప్రభుత్వ వ్యవస్థలు, కాంగ్రెసు, కాషాయ కూటమి మొదలుకొని కమ్యూనిస్టు, మార్క్సిస్టు, లెనినిస్టు, మావోయిస్టుల దాకా తెలంగాణతో సహా యావత్ దేశంలో విఫలమయిన నేపథ్యంలో కోట్ల ప్రజలు పాల్గొని నడుపుతున్న మహా ఉద్యమం నేటి సకలజనుల సమ్మె.

తెలంగాణలో సామ్రాజ్యవాద కార్పొరేట్ల, దళారుల పెత్తనం కింద కొనసాగుతున్న వనరుల దోపిడీని పై రాజకీయ శక్తులు ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలా, కండ్లప్పగించి శ్రోతల తీరులో చూస్తున్నారు. వారి సిద్ధాంతాల నాటి నుంచి నేటి వరకూ పూర్తిగా దిగజారిన నేపథ్యంలోనే స్వరాష్ట్ర ఉద్యమం నడుస్తున్నది. అందుకే అనేక సాంప్రదాయ ఉత్పత్తి వృత్తుల, అస్తిత్వ బహుజన ప్రజల ఆకాంక్షలు నెరవేరకపోగా తరతరాల నాటి కుటుంబ వృత్తులకు, వృత్తులే, జాతులకు జాతులే నేడు అంతర్ధానానికి, అడ్డు, అంతులేని విధ్వంసానికి గురయితున్నవి. ఈ దశలోనే తెలంగాణ ఉద్యమం, సకల జనుల సమ్మె పెల్లుబుకింది.

అంతేకాని ఎవరో మూడు కో తులో, ఏదో అధికార కోతుల గుంపులో, లేదా అజ్ఞాత రాజకీయ కోతులో తెలంగాణ ఉద్యమాన్నిగాని, సకల జనుల సమ్మెను గాని చేయడంలేదు. తెలంగాణ ప్రాంతాన్ని, జీవావరణాన్ని, వనరులను, వీటిపై ఆధారపడి బతికే అనేక ఉత్పత్తి అస్తిత్వాల బహుజన సమాజాన్ని, దాని పోరాట చరిత్రను ఈ కోతుల గుంపులకు మెడలో మెడల్స్‌గా వేసి అప్పజెప్పడమే వ్యాసకర్త ఉద్దేశంగా కనిపిస్తున్నది. ఇది ఏం సామాజిక శాస్త్రం? ఏ సామాజిక వర్గాల ప్రయోజనమో వ్యాసకర్త స్పష్టం చేయాల్సి ఉన్నది.

తెలంగాణ ఉద్యమం పట్ల వలసాంధ్రా కోతి రాజకీయాలకు మన సోషల్ సైంటిస్ట్ బలైండా? బక్రా అయిండా?? ఎందుకంటే ఉద్యమం కీలక దశలోనున ్న సందర్భంలో అడుసుమిల్లి , లోక్‌సత్తా జయప్రకాశ్‌లు, ముఖేష్ నాగేందర్లు, లగడపాటి, రాయపాటి, కావూరి, రేణుకా చౌదరి, శైలజానాథ్, జేసి, టీజీల లొడలొడలన్నీ ఫేలైనవి. ఈ స్థితిలో బహుజన మేధావి అయిన కంచ ఐలయ్యగారి ద్వారా గాంధీ-కోతి కథలతో బహుజనులను బక్రా చేద్దామనుకున్న కాంగ్రెస్ కోతిరాజకీయాలకు తానే బక్ర అయిండా? అన్నది తేలడానికి వారాలు కాదు రోజులు చాలు.

ఇప్పటికైనా సారూ.. కోతి కథలు పక్కకు పెట్టి చెవులు, కండ్లు మూసుడు మాని తెలంగాణ రాష్ట్ర ఉద్యమ లోతులను, బహుజన ఆకాంక్షలను ఉన్నదున్నట్లు మాట్లాడితే బాగుంటుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం, వలసాంధ్ర దోపిడి పీడనల నుంచి విముక్తి కోసం లక్షలాది మంది ప్రభుత్వోద్యోగులు, ఎవరికి వారుగా, సమిష్టిగా - సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, న్యాయ శాఖలోని ప్రభుత్వోద్యోగులకు తోడు అడ్వొకేట్లు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, యాజమాన్యాలు, టీచరు మొదలుకొని అన్ని తరగతుల ఉద్యోగులు, ఆఫీసరు మొదలుకొని గుమాస్తా వరకు సమ్మె చేస్తున్నరు.

ఇదే సకలం, కనీవినీ ఎరుగని రీతిలో కొనసాగుతున్నది. కులవృత్తులవారిగా చూస్తే చాకలి, మంగలి, అవుసుల తదితర పంచదాయిల పోరాటం, మాదిగ, గొల్లకుర్మ, ముత్రాసి, గంగపుత్రులు, బేగరి, గౌడు, లంబాడ, కోయ, గోండు, మున్నూరుకాపు, మాల, ముస్లిం, క్రిస్టియన్, అర్చకులు, జండరు పరంగా అన్ని అస్తిత్వ సమాజాల్లోని స్రీలు పోరాడుతున్నారు. ప్రతిపనిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ప్రజలు పోరాడుతూ వందలాది విద్యార్థుల బలిదానాలతో, కష్ట నష్టాల కోర్చి సకల జనుల సమ్మె వరకు చేరుకున్నారు.

అద్వితీయమైన నేటి మన సకల జనుల సమ్మెను పట్టుకొని 'గీ చిన్న తెలంగాణ' అనీ ఒక సోషల్ సైంటిస్ట్ అంటాడా? ఈయనకు గీ తెలంగాణ రాష్ట్రం బాధకన్నా.. గా 'సోనియా కాంగ్రెస్‌ను, అధికారంను వదిలి ఇటలీ తిరిగి పోతన్నదే' అనే బాధనే మిన్ననా? ఇదేం తర్కమో బహుజనులు బాగానే అర్ధం చేసుకోగలరు. వలసవాద కోతి రాజకీయాలను, రాజకీయ శక్తులను బాగానే అర్థం చేసుకున్నందువల్లనే సకల జనుల సమ్మెలో పాల్గొంటున్నరు. మొదటిసారి తెలంగాణలో అన్ని దళారీ రాజకీయ పెత్తనాలను తిరస్కరించి స్వతంత్ర ఇచ్ఛతో తమ తమ సమస్యలకు స్వతంత్రమైన స్వపరిపాలన, రాజకీయ అధికారాల కోసం తమ భవిష్యత్తును నిర్ధారించుకునే దిశగా, నిర్మించుకునే దిశగా తెలంగాణ కోసం సకల జనులు కదిలిండ్రని అర్ధం చేసుకోవాల్సి ఉంది.

- గోగు శ్యామల
రచయిత్రి

Friday, October 14, 2011

దారితప్పుతున్న అన్నాలు By - డొక్కా మాణిక్య వరప్రసాద్ Andhra Jyothi 15/10/2011


దారితప్పుతున్న అన్నాలు

రాజకీయ మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని తెగనాడి మతపరమైన మెజారిటీ రాజకీయాల దిశగా దేశాన్ని నడిపించే మహాకుట్ర అన్నాల ఉద్యమంలో దాగివుంది. అన్నా హజారే, బాబా రాందేవ్, మోడీ, అద్వానీ చెలిమికి అదే ప్రాతిపదిక.

అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించడం కంటే అన్నా హజారేను గాంధీజీ సరసన నిలబెట్టాలనే తాపత్రయం అన్నా బృందంలో ఎక్కువగా వుంది. దేశ స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించే నాటికే గాంధీజీ దక్షిణాఫ్రికాలో పలు పోరాటాలు నడిపారు. యువకుడుగా ఉన్నప్పుడే జాతిపితకు సత్యాగ్రహం గురించిన అవగాహన ఏర్పడింది. కానీ గాంధీ చిత్రపటం నేపథ్యంలో అవినీతి వ్యతిరేక జన లోక్‌పాల్ చట్టం కోసం దీక్ష చేసిన అన్నా వయో వృద్ధుడైనప్పటికీ గతంలో ఆయన ఏ దురన్యాయాలకు వ్యతిరేకంగా ఏమిచేశాడు అన్న ప్రశ్నకు 'అన్నా'ల వద్ద సమాధానం లేదు.

గాంధీజీ దృష్టిలో సామాజిక మార్పు శాసనాలతో వచ్చేది కానేకాదు. ఆయనది నైతిక మార్గం. శాసనమార్గం కాదు. జాతి వివక్షతో తనపై దాడికి పాల్పడిన సందర్భాల్లో కూడ ఆయన పోలీస్ స్టేషన్‌కు వెళ్ళడానికి నిరాకరించారు. అహింసాయుత సత్యాగ్రహ పద్ధతిలో శత్రువులో మానసిక పరివర్తన తేవడం ఆయన సన్మార్గంగా భావించారు. కానీ అన్నా హజారేది అందుకు భిన్నమైన మార్గం.

అది శాసనాల ద్వారా అవినీతి నిర్మూలన మార్గం. గాంధీజీకి నైతికమార్పు అప్రాముఖ్యం. గాంధీ మరణ శిక్షను వ్యతిరేకించాడు. అవినీతిపరులకు ఉరిశిక్ష విధించాలనేది అన్నాల డిమాండ్. ఎంత తేడా! అయినా అన్నా హజారేను గాంధీ సమానుడిగా, ఈనాటి గాంధీగా చూపే ప్రయత్నాల్లో అన్నాలు వున్నారు. వారి ఉద్యమాన్ని రెండో స్వాతంత్య్ర పోరాటంగా భ్రమింపజేస్తున్నారు. పౌర సమాజం అనే భావనను అన్నాలు బలంగా తెరపైకి తెచ్చారు. రెండున్నర దశాబ్దాల క్రితమే 'పౌరసమాజం-రాజ్యం' అనే రెండుగా దేశాన్ని చూడడం మొదలైంది. వాటి పరిధి, పరస్పర ప్రభావాల చర్చ జరిగింది, ముగిసింది. పౌర సమాజం గురించి విశేష సైద్ధాంతిక కృషి జరిపిన నీరా చందోక్ ఇటీవల రాసిన ఒక వ్యాసంలో ఇక పౌర సమాజంలో మన యాత్ర ముగిసినట్టేనా? అని సందేహించారు.

పౌర సమాజం గురించిన ఈ చర్చ గురించి అన్నాలకు ఏ మాత్రం తెలుసోగానీ పౌర సమాజం పార్లమెంటు కంటే ఉన్నతమైనదనే ప్రచారాన్ని వారు ప్రారంభించారు. సమాజ జీవితపు రాజకీయ వ్యక్తీకరణగా చట్టసభలు వచ్చాయి. అలా సమాజం నుంచి రాజకీయాలు విడిపోయాయి. మిగిలిన డొల్లను పౌరసమాజం అనవచ్చు. అది రాజకీయరహితమైనది.

ప్రస్తు త రాజకీయాల్లో విలువల సంక్షోభానికి పౌర సమాజంలో రాజకీయాల పట్ల వుండే ఏహ్య భావం, నిష్క్రియాపరత్వం ప్రధాన కారకాలుగా చెప్పవచ్చు. ఆర్థిక లావాదేవీల్లో నిరంతరం వుండే స్వార్థపర మనుషులు మెసలేది పౌర సమాజం అని జర్మన్ తత్వవేత్త హేగెల్ భావించాడు. స్వలాభాపేక్షతో సంచరించే రాజకీయరహిత మానవుల సముదాయమైన పౌర సమాజాన్ని రద్దుచేసే దిశగా పని చేయాలని కారల్ మార్క్స్ భావించాడు.

పౌర సమాజం అన్నిటికంటే పవిత్రమైనదనే భావాన్ని నెలకొల్పడం అనేది చరిత్ర తెలియని వాళ్ళకు ఉత్తేజకరంగా వుండవచ్చేమో కానీ చరిత్ర చదువుకున్న వాళ్ళకు కాదు. 'ఐ హేట్ పాలిటిక్స్' అనే వాళ్ళు అన్నాలుగానూ, నీతివాక్య ప్రబోధకులుగానూ నిష్క్రియాపరులుగానూ దర్శనమివ్వవచ్చు గానీ, వాళ్ళ వల్ల అంతిమంగా దేశానికి జరిగేది గుండు సున్న (సామాన్యులకిచ్చే సంక్షేమ పథకాలను ఆడిపోసుకునేది కూడా వీళ్ళే).

ఈ అన్నాల పౌర సమాజంలో ఆమ్ ఆద్మీకి స్థానం లేదు. సామాన్యుల పోరాటాలు వీరికి పట్టవు. రైతులు, కూలీలు, కర్షకులు, కార్మికులు చేసే ఏ ఉద్యమం కూడా 'పౌర సమాజం' చేసే ఉద్యమంగా భావించబడదు. అన్నాలు ఈ ఉద్యమంలో మమేకం అవడం అటుంచి కనీసం సానుభూతి కూడా ఏనాడూ ప్రకటించిన పాపాన పోలేదు. వీళ్ళకి గత ఉద్యమ చరిత్ర శూన్యం.

దారుణ మారణకాండకు సంఘ్‌పరివార్ శక్తులు తెగబడిన సందర్భాల్లో ఈ అన్నాలు, వారి పౌర సమాజం ఎక్కడుంది? అని అరుంధతీరాయ్ వేసిన ప్రశ్నకు జవాబు లేదు. ఏనాడూ ఏ సామాజిక దురన్యాయాన్ని గురించి కూడా కాసింత గొంతెత్తకుండానే వృద్ధుడైపోయిన అన్నా హజారే దశాబ్దాల కుంభకర్ణ నిద్ర అనంతరం మేల్కొన్న భారత 'రిప్‌వాన్ వింకిల్' అని చెప్పొచ్చు.

కేజ్రీవాల్‌తో సహా పలువురు ముఖ్యులకు సంఘ్ పరివార్ శక్తులతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు వున్నాయన్నది బహిరంగ రహస్యమే. అన్నా ఉద్యమిస్తే ఆర్ఎస్ఎస్ మద్దతిస్తుందని ఆ సంస్థ బాధ్యులు గత మార్చిలోనే రాసిన లేఖను దిగ్విజయ్ సింగ్ గురువారం బయటపెట్టాడు. అన్నా, ఆరెస్సెస్ మధ్య సంబంధం ఇక ఎంత మాత్రం రహస్యం కానేకాదు. మతంపేరిట మూడువేల మంది ముస్లింలను ఊచకోత కోసిన గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోడీని అన్నా పొగిడారు.

దానిపై తీవ్ర విమర్శలు రాగా నాలిక కరుచుకున్నారు. సంఘ్‌పరివార్‌తో అన్నాల సంబంధం బహిర్గతమైతేనే ఇరువురికీ లబ్ధి చేకూరుతుంది. కాబట్టి అన్నాలు ప్రత్యక్ష రాజకీయాలకు దిగజారి రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించడమే ధ్యేయమని ప్రచారం చేస్తూ మతతత్వ వాదులను గెలిపించే ప్రయత్నంలో ఉన్నారు. అద్వానీ అవినీతి వ్యతిరేక రథయాత్రకు అనుగుణంగానే అన్నాలు పావులు కదుపుతున్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రపతి అభ్యర్థిగా అన్నాను నిలబెట్టే దిశగా సంఘ్ పరివార్ కృషి చేస్తుందని వచ్చిన వార్తల్లో నిజం లేకపోలేదు.

రాజ్యాంగ సంస్థలపై ప్రజలలో అవిశ్వాసం రేకెత్తించడం అన్నాలు చేస్తున్న మరో పని. ఇటీవల కేజ్రీవాల్ ఒక ఇంగ్లీష్ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక అడుగు ముందుకేసి పార్లమెంటు కంటే అన్నానే గొప్పవాడు అని వ్యాఖ్యానించాడు.

పార్లమెంటు కంటే పౌరుడే గొప్ప అని రాజ్యాంగం చెప్పింది కాబట్టి తానన్నది సరైనదేనని సమర్థించుకోజూచాడు. కానీ రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం పార్లమెంటు కంటే పౌరుడు గొప్ప అనేది ఆయన చెప్పలేక పోయాడు. ఇప్పటివరకూ 'పౌరుడు వర్సెస్ పార్లమెంటు' అనే చర్చ రాజ్యాంగ ప్రవచనంలోకి రాలేదు. హెచ్.ఎమ్.సీర్వాయ్, గ్రాన్‌విల్లీ ఆస్టిన్ లాంటి రాజ్యాంగ కోవిదులు రాసిన గ్రంథరాజాల్లో గానీ, వి.ఆర్.కృష్ణయ్యర్, కోకా సుబ్బారావు, భగవతి, చంద్రచూడ్, హెచ్.ఆర్.ఖన్నా లాంటి ఉద్దండులైన న్యాయమూర్తుల తీర్పుల్లో గాని కన్పించని చర్చను కేజ్రీవాల్ లేవనెత్తారు. పౌరులకు పార్లమెంటుకు మధ్య లేనిపోని అగాధం సృష్టించి, ఒక తప్పుడు చర్చను రేకెత్తించి రాజ్యాంగాన్ని, రాజ్యంగ సంస్థలను బలహీనపరిచే దురుద్దేశపూరిత ప్రయత్నంలో అన్నాలు నిమగ్నమయ్యారు.

రాజ్యాంగం ప్రకారం పౌరులకు విశేష ప్రాధాన్యం ఉంది. పౌరసత్వ ప్రాతిపదికనే ఓటు హక్కుతో పలు హక్కులు ప్రజలకు ఇవ్వబడ్డాయి. అలాంటి పౌరుల రాజకీయ వ్యక్తీకరణగా ఏర్పరచబడిన పార్లమెంటును కించపరచడం అంబేద్కర్ విరచిత రాజ్యాంగానికి ఎసరు పెట్టే ప్రయత్నం తప్ప మరోటి కాదు. సంఘ్ పరివార్ శక్తులు అధికారంలో ఉన్న కాలంలో రాజ్యాంగాన్ని తిరిగిరాయాలనే విఫలయత్నం చేయడాన్ని ఈ సందర్భంలో గుర్తుచేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే శక్తుల నుంచి రాజ్యాంగ సంస్థలకు వస్తున్న ముప్పు గురించి ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం వుంది.

దేశంలో అవినీతి బాగా వేళ్ళూనిందనటంలో సందేహం లేదు. ప్రపంచీకరణతో పాటు ఈ అవినీతి మన దేశంలోనూ ప్రపంచ వ్యాప్తంగానూ కొత్తపుంతలు తొక్కుతున్నది. దాన్ని కట్టడి చేయాల్సిందే, శిక్షించాల్సిందే. అందుకోసం చట్టపరమైన మార్గాలను అన్వేషించాల్సిందే. ప్రపంచీకరణ పేరిట లబ్ధి పొందిన వర్గాల 'పౌర సమాజం' అవినీతిని అంతమొందించ లేదనడంలో అతిశయోక్తి లేదు.

తిలాపాపం తలాపిడికెడు అన్న చందంగా ఇప్పటివరకూ దేశంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అధికారంలో వున్న ప్రతిపార్టీ ఈ అవినీతి వట వృక్ష ఛాయలో సేద తీరినదే. కానీ అన్నాలు పాపమంతా కేవలం ప్రస్తుత పాలకులదే అన్నట్టు చిత్రీకరించి గాలి జనార్ధన రెడ్డి లాంటి వారిని తయారుచేసిన సంఘ్‌పరివార్‌కు లబ్ధి చేకూర్చే ప్రయత్నంలో వున్నారు. మసీదులు కూలగొట్టే, మత కల్లోలాలు సృష్టించే, ప్రజాస్వామ్య రాజకీయాలను ద్వేషించే, 'ఆమ్ ఆద్మీ'ని ఈసడించుకునే, స్త్రీలను అణగదొక్కే, దళితులను వివక్షకు గురిచేసే ఈ శక్తుల గురించి ప్రజలు బాగా అవగాహన చేసుకోవాల్సి వుంది.

అన్నా ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలత మోతాదుకు మించినదని కొన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. వాటిని సైతం పక్కన బెట్టి నేరుగా అన్నాలతో చర్చలు జరిపి పలు డిమాండ్లు అంగీకరించినా వారు సంతృప్తి చెందకపోవడానికి కారణం సంఘ్ పరివార్‌కు లాభం చేకూర్చాలన్నదే. లేకపోతే అన్నాలు అమ్మకానికో (డిజిన్వెస్ట్‌మెంట్) మంత్రిని కేబినెట్‌లో వుంచుకొని బాల్కో లాంటి లాభసాటి ప్రభుత్వ సంస్థలను చౌకగా అమ్మి సొమ్ముచేసుకున్న వారిని పల్లెత్తు మాట ఎందుకనరు? ఒక పక్క పార్లమెంటును ప్రశ్నిస్తూ మరో పక్క మోడీని ఎలా సమర్థిస్తారు?

ప్రస్తుత రాజకీయ పార్టీలలో గిరిజన, దళిత, బలహీన వర్గాలకు, మైనారిటీలకు మహిళలకు లబ్ధిచేకూర్చే పలు పథకాలతో సామాన్యుల ఆదరణ చూరగొన్న జాతీయ పార్టీ కాంగ్రెస్ తప్ప మరొకటి లేదు. కాంగ్రెస్ పార్టీ సిసలైన సెక్యులరిస్టు పార్టీ. అలాంటి పార్టీని దెబ్బ తీసిన పక్షంలో లబ్ధి పొందేవి అన్నాల వర్గ స్వభావం కలిగిన వర్గాలే, వారి పార్టీలే, సెక్యులరిజాన్ని, ఆమ్ ఆద్మీని దెబ్బతీసే సంఘ్ పరివార్ శక్తులే.

అంబేద్కర్ అన్నట్టు 'మెజారిటీలు రెండురకాలు: (అ) మతపరమైన మెజారిటీ; (ఆ) రాజకీయ పరమైన మెజారిటీ. రెండవదాన్ని మార్చవచ్చు. కానీ మతపరమైన మెజారిటీ అలా కాదు. అది పుట్టుకతో ఏర్పడేది. రాజకీయ పార్టీల్లో ఎవరికైనా ప్రవేశం ఉంటుంది. కానీ మతపరమైన మెజారిటీ విషయంలో తలుపులు మూసి వుంటాయి. దాని రాజకీయాలు దానిలో పుట్టిన వాళ్ళే నిర్ణయిస్తారు'. రాజకీయ మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని తెగనాడి మతపరమైన మెజారిటీ రాజకీయాల దిశగా దేశాన్ని నడిపించే మహాకుట్ర అన్నాల ఉద్యమంలో దాగివుంది. అన్నా హజారే, బాబా రాందేవ్, మోడీ, అద్వానీ చెలిమికి అదే ప్రాతిపదిక.
- డొక్కా మాణిక్య వరప్రసాద్
రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు 

సకల జనుల సమ్మె-అణచివేత By పొఫెసర్ హరగోపాల్ Namasethe telangana 15/10/2011

సకల జనుల సమ్మె-అణచివేత
భారత రాజ్య వ్యవస్థ ప్రజా ఉద్యమాలకు ప్రజాస్వామ్యబద్ధంగా స్పందించడం చాలా కాలం కిందటే మానుకుంది. నాలుగు ఐదు దశాబ్దాలు గా ఎలాంటి ఉద్యమానై్ననా అణచివేయవచ్చు అనే పరిష్కారాన్ని ఎన్నుకోవ డం వలన, పోలీసు, మిలటరీ, పారా మిలటరీ దళాల సంఖ్య వాటి మీద ఖర్చు అనూహ్య స్థాయికి చేరుకుంది. ఇంకా బలగాలను బెటాలియన్లను పెంచుతామని, అంతర్జాతీయ ఆయుధ మార్కెటుకు బాసటగా నిలుస్తామని నిరంతరంగా వాగ్దానాలు చేస్తూనే ఉన్నారు. ఉద్యమాలు ఉధృతంగా జరగడానికి, వీటిని నిరోధించలేకపోవడానికి ఆధునిక ఆయుధాల కొరతను ఒక కారణంగా చెబుతున్నారు. ప్రజాస్వామ్యమంటే అతి స్వల్ప బలవూపయోగంతో కూడిన పాలన అనే అవగాహన ఎక్కువగా కనిపించడం లేదు. ఎవ్వరు కూడా ఇంత బలవూపయోగం రాజ్యానికి ఎందుకు అవసరమని కాని, ప్రజల అసంతృప్తికి మూల కారణాలను వెతకడం కాని చేయడం లేదు.

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జైరాం రమేశ్ మావోయిస్టు ఉద్యమం మీద చేసిన ఒక ప్రసం గం ‘హిందూ’ ఆంగ్ల దిన పత్రికలో (14-10-2011పచురితమైంది. ఆయ న ఆలోచన హోంమినిస్టర్ చిదంబరం ఆలోచనకు కాస్త భిన్నంగా ఉంది. అంటే ఆయన అణచివేత వద్దని అన్నారని కాదు. అణచివేతతో పాటు గిరిజనుల అభివృద్ధి గురించి కూడా ఆలోచించాలి అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే పెద్ద ‘విప్లవాత్మక ఆలోచన’గా అగుపిస్తుంది. ‘స్వాతంత్య్రం’ వచ్చి న తర్వాత 1948 జనవరిలో గాంధీ ఒక ప్రసంగంలో మిలటరీ, పోలీసులను ఉపయోగించి చేసే ఏ పరిపాలన అయినా పరాయి పాలనే అంటూ పాలకులు ఎవరు అనే ప్రశ్న కాదు. పాలన ఎలా జరుగుతున్నది అన్నదే స్వతంత్ర దేశానికి ప్రమాణం అని అన్నారు. ఇవి ఇప్పుడు పరిపాలిస్తున్న వారి కి ఒక ‘దేశ ద్రోహి’ మాటలుగా అనిపించినా ఆశ్చర్యం లేదు.

గాంధీ మార్గాన్ని, గాంధీ పద్ధతులను వదిలివేయడమే కాక ఆ పద్ధతులను అసహ్యించుకునే ఒక పాలకవర్గం జాతీయస్థాయిలో, ప్రత్యేకంగా మన రాష్ట్రం లో చాలా బలంగా ఉన్నది. గాంధీ భవన్ పేరు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ, తాము గాంధీ వాదులుగా చెబుతున్న కొందరు కాంగ్రెస్ ‘తత్వవేత్తలు’ ఒక ప్రజా ఉద్యమాన్ని ముఖ్యంగా లక్షలాది మంది, బహుశా కోట్లాది మంది శాంతియుతంగా తమ ఆకాంక్షలను వ్యక్తీకరిస్తున్న ప్రక్రియను గౌరవించి యుద్ధవూపాతిపదిక మీద స్పందించి ఉంటే ప్రజలు హర్షించేవారు. గాంధీ పద్ధతులకు సాధికారత చేకూరేది. ప్రజలకు శాంతియుత పద్ధతుల మీద విశ్వాసమేర్పడేది. ప్రజాస్వామ్యవాదులకు మావోయిస్టు ఉద్యమంతో లేదా ఇతర మిలిటెంట్ ఉద్యమాలతో వాదించడానికి ఒక అవకాశముండేది. హింసాయు త పద్ధతులను ఉపయోగించే రాజ్యాన్ని ప్రతిహింస ద్వారా మాత్రమే ప్రజలు ఎదిరించగలరు అనే రాజకీయ విశ్వాసాన్ని ఎలా ఎదుర్కొవాలి అనేది ప్రజాస్వామ్యవాదులందరికీ అదిపెద్ద సవాలుగా మిగిలింది.

మావోయిస్టు పద్ధతులను విమర్శనాత్మకంగా చూసిన బాలగోపాల్ బతికుంటే ఏమి రాసేవాడో, ఏమి మాట్లాడేవాడో తెలియదు కాని, ఒక సందర్భంలో మావోయిస్టు ఉద్య మం బలపడుతున్నది కదా అని ఒక టీవీ చానెల్ అడిగితే ‘మంచిదే కదా’ అని అన్నాడు. బహుశా ఆయనకు కూడా పాలకుల పట్ల వారి పద్ధతుల పట్ల ఏ మాత్రం విశ్వాసముండేది కాదు. అందుకే జీవితమంతా పోరాటాలవైపు నిలబడ్డాడు.
స్వాతంవూతోద్యమం తర్వాత బహుశా ఇంత అహింసాపూరిత ఉద్యమం తెలంగాణ ఉద్యమమే అయి ఉంటుంది. ఈశాన్య భారత ఉద్యమాలు, పంజా బ్ ఉద్యమం, కాశ్మీర్ ఉద్యమం, ఇలా చాలా ఉద్యమాలు హింస లేదా ప్రతిహింసతో కూడుకున్నవే. మన రాష్ట్రంలో పౌరహక్కుల ఉద్యమం దాదాపు ఒక దశాబ్ద కాలం ఈ అంశాన్ని చర్చించింది. ఈ అంశం మీద విడిపోయింది.

ప్రధానంగా జరిగిన చర్చలో ప్రతిహింసను ఉపయోగించే వారు చాలా సంయమనం పాటించాలని, మనిషి ప్రాణాన్ని గౌరవించాలని, తమ పద్ధతులను నిరంతరంగా సమీక్షించుకోవాలని, వాళ్లు కోరుకున్న కలలు కన్న వ్యవస్థ నిర్మాణం ప్రజాస్వామ్యంగా, మానవీయంగా ఉండాలని, అది నిర్మించడానికి తమ పద్ధతులను ఆ కోణం నుంచి, ఆ ప్రమాణం నుంచి పరిశీలించాలనే చర్చ చాలా లోతుగా ఘాటుగా జరిగింది. ఈ చర్చ ఒక రకం గా శాంతి చర్చలకు దారి వేసింది. అంతిమంగా శాంతి చర్చలు వాస్తవ రూపం తీసుకున్నా యి. ఒక విప్లవ పార్టీ రాజ్యంతో చర్చించడం చరివూతలో చాలా అరుదుగా జరుగుతుంది. చర్చలు విఫలమయ్యాయి. కేంద్ర హోం మంవూతిత్వ శాఖ ఈ మధ్య కాలంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ శాంతి చర్చలు జరపాలనుకుంటే ఆంధ్రవూపదేశ్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఆ కాలంలో నక్సలైట్ పార్టీలు చాలా బలపడ్డాయని ముఖ్యంగా ల్యాండ్ మైనింగ్ విస్తృతంగా చేశారని ఒక పెద్ద మోసపు, అబద్ధపు ప్రచారాన్ని చేసింది. నిజానికి మన రాష్ట్రంలో శాంతి చర్చల వలన ఈ ఉద్యమాలు దెబ్బతిన్నాయన్నది ఒక వాస్తవం.

ఈ చర్చను పక్కకు పెట్టి శాంతియుత పద్ధతుల మీద అంత విశ్వాసము న్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పద్ధతులనే గత నెల రోజులుగా పాటిస్తూ, ఇంత పెద్ద ఎత్తున ప్రజలు తమ నిరసనను, తమ ఆకాంక్షను వ్యక్తీకరిస్తుంటే ఎందుకు స్పందించలేకపోతున్నాయి అనేది పెద్ద ప్రశ్న. గాంధీ పద్ధతుల ద్వారా లక్షలాది ప్రజలు తమ ‘స్వపరిపాలనను’ కోరుకుంటుంటే, లగడపాటి నిర్వహించిన ‘వందే గాంధేయం’ సదస్సుకు గులాం నబీ ఆజాద్ ఎందుకు హాజరయినట్టు? లగడపాటి సంపదకు గాంధీ నిరాడంబరతకు ఏమైనా సంబంధముందా? ఆజాద్ ఈ సదస్సుకు హాజరై లగడపాటి ధన బలం పట్ల తన ‘గౌరవాన్ని’ ప్రకటించుకోవడం తప్ప తెలంగాణ ప్రజల గాంధీయిజం ఆచరణను ఎందుకు విస్మరించినట్టు? అది ఏ సందేశాన్ని ఇచ్చినట్టు? రాజకీయాలలో హిపోక్షికసి ఉందని అందరికీ తెలుసు.

కాని దానికి ఏమైనా పరిమితులున్నాయా లేక ఇది హద్దులు దాటిన హిపోక్షికసా? దీంట్లో ప్రమాదం; ప్రజలకు ఈ రాజకీయాల పట్ల, గాంధీ శాంతియుత పద్ధతుల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం మరింత సన్నగిల్లితే అది ఎటు దారి తీస్తుందో కేంద్ర ప్రభుత్వం ఏమైనా అవగాహన చేసుకుంటున్నదా? ఆలోచిస్తున్నదా అన్నది అనుమానమే.

తెలంగాణ ఉద్యమాన్ని కటువుగా ఎదుర్కొంటామని ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ప్రకటించారు. పోలీసు బలగాలను పెంచారు. కార్యకర్తలను, నాయకులను అరెస్టు చేస్తున్నారు. పోలీసు అధికారులు హోం మినిస్టర్ ప్రమేయం లేకుండా, తామే ప్రెస్ మీట్‌లు పెట్టి ప్రకటన మీద ప్రకటన చేస్తున్నారు. హింసాయుత ఉద్యమాలైతే కొంత అర్థం చేసుకోవచ్చు. ఉద్య మం వలన ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయనేది వాస్తవమైనా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉద్యమాలు ఎలా చేయాలో పోలీస్ ఆఫీసర్లే చెప్పాలి. ఇది ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షకు ఎలా జవాబు అవుతుంది? ఎందుకు ప్రజ ల ఆకాంక్షను గుర్తించలేకపోతున్నారు, గౌరవించలేకపోతున్నారు అన్నది ప్రశ్న. అలాగే కార్మిక సంఘాలను విడదీయాలని, రైతులను విద్యుత్తు ఉద్యోగులకు వ్యతిరేకంగా, తల్లిందంవూడులను ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా సమీకరించడానికి ప్రయత్నిస్తున్నారు.

ప్రభుత్వాలు ఇలాంటి చాణక్యనీతిని అవలంబించినా తెలంగాణ ప్రజలు దాన్ని బాగానే అర్థం చేసుకుంటున్నారు. రైతులైనా, ప్రయాణీకులైనా, తల్లిదంవూడులైనా ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వము ఒకరికి వ్యతిరేకంగా మరొకరిని సమీకరించడం ప్రజాస్వామ్య సంస్కృతి ఎలా అవుతుంది? ఉద్యమాల వలన ప్రజలకు అసౌకర్యం కలగడం వలన ప్రజా ప్రభుత్వం స్పందిస్తుంది అనే భావనతో ఈ నిరసన రూపాలు ముందుకు వచ్చాయి. కానీ ప్రజల అసౌకర్యాన్ని మిషగా చూపించి ఉద్యమాలను విభజించడం చాలా విచిత్ర ధోరణి. అంటే.. తమ అధికారం తప్ప ఏదీ పట్టని ప్రభుత్వాలు ఎందుకు అధికారంలో ఉన్నట్టు? అధికారం లక్ష్యం కేవలం ఆధిపత్యమేనా? లేక అది సమస్యలను పరిష్కరించడానికి ఒక సాధనమా అనే ప్రశ్న కూడా అడగవలసి ఉంటుంది. ఇలాంటి తప్పుడు పద్ధతులకు లోను కాకుండా రైతులు, ప్రయాణీకులు, తల్లిదంవూడు లు, ఇతర ఇబ్బందులకు గురై న వాళ్లు తెలంగాణ ప్రజాస్వామ్య ఆకాంక్షను గుర్తించి ఎందుకు పరిష్కరించడంలేదని అడుగుతూ అసలైన పరిష్కారాన్ని చేపట్టాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టాలి.

అప్పుడే ప్రభుత్వాలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రవర్తించడానికి అవకాశం ఏర్పడుతుంది. లేకుంటే నిరసన తెలుపుతున్న వర్గాలను చూపించి ఉద్యమాలను అణచివే సే ప్రమాదముంటుంది. అది ఏ వర్గానికి కూడా దీర్ఘ కాలంలో మంచిది కాదు.

తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని ప్రభుత్వాలు తమకుండే ‘పశు బలం’తో అణచివేయవచ్చు. హైద్రాబాదులోని ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారులు తాత్కాలికంగా విజయాన్ని సాధించవచ్చు. పెట్టుబడి చరివూతలో ఎప్పుడు లేనంత బలంగా ఉంది. దీని విర్రవీగుడు వెనక అంతర్జాతీయ పెట్టుబడి కూడా ఉంది. ఇది కార్మికులను, రైతులను, విద్యార్థులను, ఉద్యోగస్తులను అంతకుమించి ప్రజలందరినీ ప్రజాఉద్యమాలతో పాటు అణచివేసి తమ ప్రయోజనాలను, తమ లాభాలను కాపాడుకోవాలను కుంటున్నది. అందు కే అటు ఆంధ్ర ప్రాంత ప్రజలకు, ఇటు తెలంగాణ ప్రాంత ప్రజలకు ప్రయోజనం లేని పరిష్కారాలను సూచిస్తున్నది. లేకుంటే హైద్రాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించమనడము ఎవరు చెప్పిన ప్రత్యామ్నాయమో, అది ఏ ప్రజల ప్రయోజనం కొరకో ఆలోచించాలి. పెట్టుబడి ప్రజా ప్రయోజనాలను దాటి తన స్వతంవూతతను చాటుకుంది. తమకు లాభాలు, ప్రజల కు లాఠీలు తూటా లు. ఇదీ ప్రజాస్వామ్యం! పెట్టుబడి రాజ్యహింస, ప్రైవేటు హింసను వ్యవస్థీకృతం చేసింది. ఈ వ్యవస్థీకృత హింసను తెలంగాణ ప్రజ లు ఎలా ఎదుర్కొంటారు అన్నది చరిత్ర తెలంగాణ ఉద్యమానికి విసిరిన సవాలు. ఉద్యమం అంతిమంగా ఏం సాధించినా, సాధించకపోయినా, సకల జనుల సమ్మె ఒక చరివూతాత్మక సంఘటనే. 
పొఫెసర్ హరగోపాల్