Saturday, March 31, 2012


ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టసాధన ఐక్య ఉద్యమ విజయం

దళిత, గిరిజనులతోపాటు ఐక్య ఉద్యమం సాధించిన విజయం చట్టం అమలు జరిగితే దేశ చరిత్రలోనే చారిత్రాత్మకఘట్టం అవుతుంది. దళిత, గిరిజనుల అభివృద్ధికి తోడ్పడుతుంది. సంఘాలకు భిన్నాప్రాయాలు ఉన్నా సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమిస్తే విజయం తధ్యమని ఈ ఉద్యమం నిరూపించింది. ఈ ఉద్యమానికి సహకరించిన, మద్దతు ఇచ్చిన, పాల్గొన్న సంఘాలు, సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలకు, చట్ట బద్ధత కల్సించేందుకు ఒప్పుకున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు అందరూ సంఘటితంగా కృషి చేయాల్సి ఉన్నది.


దళిత, గిరిజనుల జనాభా నిష్పత్తికి తగ్గకుండా రాష్ట్ర ప్రణాళిక బడ్జెట్‌లో నిధులు ఫూల్‌ చేసి ప్రత్యేకంగా కేటాయించి వారి ప్రత్యేక ప్రయోజనాలకే ఖర్చు చేసేందుకు చట్టం తీసుకురావాలని 100కు పైగా దళిత, గిరిజన, ప్రజా సంఘాలు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల సాధన ఐక్య కార్యాచరణ కమిటి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో నిర్వహించిన ఉద్యమం, అధికారపార్టీలోని ఎస్సీ, ఎస్టీ యం.ఎల్‌.ఏ., యం.ఎల్‌.సి.లు, మంత్రులు ప్రభుత్వంపై తెచ్చిన ఒత్తిడి ఫలితంగా ప్రభుత్వం దిగి వచ్చింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్వయంగా శాసనసభలోను, శాసనమండలిలోను ఒక ప్రకటన చేస్తూ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుకు, చట్ట బద్దత కల్పించేందుకు అధ్యయనం చేయడానికి మంత్రులతో సబ్‌కమిటి వేస్తామని, రెండు నెలల్లో ఈ ప్రకియ పూర్తి చేస్తామని, రెండు రోజులు ప్రతేకంగా శాసనసభ నిర్వహించి, చట్ట బద్దత కల్పిస్తామని ఈ బడ్జెట్‌ నుండే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఐక్య కార్యాచరణ కమిటి శిబిరానికి ఉపముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహ, అధికార పార్టీ యం.ఎల్‌.ఏలు వచ్చి సబ్‌ప్లాన్‌ అమలుకు చట్టం తెస్తామని స్పష్టమైన హామీ ఇచ్చి నిరసన దీక్షలను విరమింప చేశారు. ఇది ఐక్య ఉద్యమం సాధించిన విజయం.
సబ్‌ప్లాన్‌ అమలుకు కెవిపిఎస్‌ ఉద్యమం
కెవిపిఎస్‌ ఆవిర్భవించిన కొద్దికాలం నుండే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు చేయాలని ఆందోళన చేసినా టిడిపి ప్రభుత్వం స్పందించలేదు. 2004 ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీల నాయకులతో సదస్సు నిర్వహిస్తే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హాజరై కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక 2007 వరకు ఆ ఊసే ఎత్తలేదు. 2008లో కెవిపిఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.వి.రాఘవులుతోపాటు 23 జిల్లాల నుండి 25 మంది నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. అన్ని దళిత, గిరిజన, ప్రజాసంఘాలు, సంస్థలు ఆ దీక్షలకు మద్దతునిచ్చాయి. అన్ని పార్టీల ఎంఎల్‌ఏలు రెండు రోజులు శాసనసభను స్తంభింపజేశారు. ప్రభుత్వ నిర్భందాన్ని అధిగమించి వేలాది మంది దళితులు ఛలో అసెంబ్లీ తరలివస్తే ప్రభుత్వం దిగి వచ్చి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుకు ఎస్సీ, ఎస్టీ నోడల్‌ ఏజెన్సీ (జి.ఓ.నెం.117)లను, ముఖ్యమంత్రి అధ్యక్షతన అపెక్స్‌బాడీ (జి.ఓ.నెం.77)లను ఏర్పాటు చేసింది. వాటికి సబ్‌ప్లాన్‌ నిధులు కేటాయించకుండా, ప్రత్యేక అధికారాలను కాగితాలకే పరిమితం చేసింది. నాటి నుండి జనాభా దామాషాకు అనుగుణంగా నిధుల కేటాయింపులు జరుపుతున్నా, ఖర్చు చేయడం లేదు. దళిత, గిరిజనులకు ప్రయోజనం లేని రంగాలకు దారి మళ్లిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు చట్టం చేయాలని కెవిపిఎస్‌, గిరిజన సంఘం, వ్యవసాయమ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ, అదే సందర్భంలో సిపియం రాష్ట్ర నాయకుల నిరవధిక నిరాహార దీక్షలు నిర్వహించగా మేధావులతో కమిటి వేస్తామని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌ కుమార్‌ రెడ్డి హామీ ఇచ్చి నేటికి అమలు చేయడం లేదు.
ఐక్య ఉద్యమం
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుకు చట్టబద్ధత కల్పించాలని, బడ్జెట్‌ ప్రతిపాదించే సందర్భంలోనే సబ్‌ప్లాన్‌ నిధులను వేరు చేసి ఎస్సీ, ఎస్టీ నోడల్‌ ఏజెన్సీలకు కేటాయించాలని, జనరల్‌ బడ్జెట్‌లో అందరితోపాటు దళిత, గిరిజనుల ప్రయోజనాలకు ఖర్చు చేస్తునే సబ్‌ప్లాన్‌ నిధులను వారి జనాభా ప్రతిపాదికన కేటాయించి వారి ప్రత్యేక ప్రయోజనాలకే ఖర్చు చేయాలని, ఈ నిధుల దారి మళ్ళింపు, కోత విధించరాదని, అలా చేసిన అధికారులపై సంబంధిత మంత్రులను చట్టపరంగా శిక్షించే విధంగా చట్టం రూపొందించాలని, కార్పోరేషన్స్‌, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌లతోపాటు అన్ని సంస్థలకు వచ్చే నిధుల్లో అక్కడి జనాభా ప్రతిపాదికన సబ్‌ప్లాన్‌ అమలు చేయాలని తదితర డిమాండ్స్‌పై కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌), గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సంఘాలను, సంస్థలను, మేధావులను ఆహ్వానించి 2011 మే 8న ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల సాధన ఐక్యకార్యాచరణ కమిటిని ఏర్పాటు చేశారు. 100 సంఘాలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. మాజీ ఐఏఎస్‌, ఐపిఎస్‌ అధికారులు, మేధావులు పాల్గొన్నారు. మాజీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కాకి మాధవరావును చైర్మన్‌గా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాపితంగా అన్ని జిల్లాల్లో డివిజన్‌, మండల స్థాయిల్లో ఐక్యకార్యాచరణ కమిటీలు ఏర్పడ్డాయి. స్థానికంగా 873 సంఘాలు ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యాయి. సదస్సులు, రౌండ్‌టేబుల్‌ సమావేశాలు, సైకిల్‌ యాత్రల ద్వారా సబ్‌ప్లాన్‌పై ప్రజలకు అవగాహన కల్పించి ప్రభుత్వంపై ఒత్తిడి చేసింది. అధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి, స్పీకర్‌, గవర్నర్‌, శాసనసభ పక్ష నాయకులకు పై డిమాండ్స్‌ పరిష్కారించాలని పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చింది. లేఖలు, గ్రామ సభల తీర్మానాలు చేసి ముఖ్యమంత్రికి పంపాయి. అయినా ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో మార్చిలో శాసనసభ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌వెస్లి, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాంనాయక్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.మురళీకృష్ణతోపాటు 11 సంఘాల నుండి 11 మంది 72 గంటలు 2012 మార్చి23 నుండి 26 వరకు నిరహార దీక్షలు నిర్వహించారు. ఈ దీక్షలకు మద్దతుగా సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, సిపిఐ నుంచి గుండా మల్లేష్‌, టిఆర్‌ఎస్‌ నుంచి మాజీ మంత్రి చంద్రశేఖర్‌, కెటిఆర్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి నల్లా సూర్య ప్రకాష్‌, బిజెపి నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి, న్యూడెమోక్రసి నుంచి డివికృష్ణ, టిడిపి నుంచి మోత్కుపల్లి నర్సింహులు ఒక రోజు చొప్పున నిరసన దీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా రాష్ట్ర నలుమూలల నుండి మార్చి 26న వేలాది మంది చలో అసెంబ్లీకి తరలి వచ్చారు. టిడిపి అధ్యక్షులు చంద్రబాబు, లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షులు జయప్రకాష్‌ నారాయణ దీనికి మద్దతు ఇచ్చారు. ప్రధాని మాజీ కార్యదర్శి కెఆర్‌ వేణుగోపాల్‌, ఐక్యకార్యాచరణ కమిటి చైర్మన్‌, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, దానం ఐఏఎస్‌(రి), డిటి నాయక్‌ ఐపిఎస్‌(రి), ప్రొ.సత్యనారాయణ, సినీయర్‌ జర్నలిస్ట్‌ మల్లేపల్లి లక్ష్మయ్య, గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి మాజీ యంపి బాబురావులతోపాటు వామపక్ష నాయకులు, పలు సంఘాల నాయకులను అరెస్టు చేసింది.
ఈ ప్రభుత్వ నియంతృత్వ చర్యలను నిరసిస్తూ దళిత, గిరిజనుల డిమాండ్స్‌ ప్రభుత్వం శాసనసభలో నిర్దిష్ట హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు, సంఘాల నాయకులతోపాటు వేలాది మంది సామూహిక దీక్షలో బైఠాయించడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వ నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాపితంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు జరిగాయి. శాసనమండలిలో సైతం 59 మంది యం.ఎల్‌.ఏ.లు సంతకాలు చేసి సబ్‌ప్లాన్‌పై చర్చను ప్రారంభించారు. అధికార పార్టీలోని ఎస్సీ ,ఎస్టీ యం.ఎల్‌.ఏ.లు మంత్రులతో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహా ఆధ్వర్యంలో సమావేశమై ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చారు. ప్రజల వ్యతిరేకతను గమనించిన ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్‌ పార్టీని ఈసడించుకుంటున్న విషయాన్ని గమనించి తప్పని స్థితిలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుకు చట్టం చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. 24 గంటల సామూహిక దీక్ష అనంతరం ఉపముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహ బృందం శిబిరానికి వచ్చి సబ్‌ప్లాన్‌ అమలుకు చట్టం చేస్తామని హామీ ఇచ్చి దీక్షను విరమింపజేయించింది.
దళిత, గిరిజనులతోపాటు ఐక్య ఉద్యమం సాధించిన విజయం చట్టం అమలు జరిగితే దేశ చరిత్రలోనే చారిత్రాత్మకఘట్టం అవుతుంది. దళిత, గిరిజనుల అభివృద్ధికి తోడ్పడుతుంది. సంఘాలకు భిన్నాప్రాయాలు ఉన్నా సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమిస్తే విజయం తధ్యమని ఈ ఉద్యమం నిరూపించింది. ఈ ఉద్యమానికి సహకరించిన, మద్దతు ఇచ్చిన, పాల్గొన్న సంఘాలు, సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలకు, చట్ట బద్ధత కల్సించేందుకు ఒప్పుకున్న ప్రభుత్వానికి ఐక్య కార్యాచరణ కమిటి ధన్యవాదాలు తెలియజేస్తున్నది. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు సంఘటితంగా కృషి చేయాల్సి ఉన్నది.


(రచయిత కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) 
-జాన్‌వెస్లీ
Prajashakti news paper dated :  30/3/2012 

మానవీయ విలువలు లేని దేశ బడ్జెట్--- కత్తి పద్మారావు



కేవలం సబ్సిడీల ద్వారా ఉపశమనాల ద్వారా అంకెల గారడీ ద్వారా దేశ సంపద వర్ధిల్లదు. రాజ్యాంగకర్త డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలను ప్రణాళికా సంఘం, బడ్జెట్ రూపకర్తలు తప్పకుండా సమన్వయించుకోవాలి. నూతన జీవన విధానానికి ప్రత్యామ్నాయ సామాజిక ఆర్థిక జీవన విధానాన్ని రూపొందించగలిగినప్పుడే మానవాభ్యుదయం ప్రతిఫలిస్తుంది. లేకుంటే బడ్జెట్, తాబేదారులకు విస్తరి అవుతుంది తప్ప అభివృద్ధి వుండదు.

భారతదేశ ఆర్ధిక పరిస్ధితి మరింత దిగజారడానికి కారణం పరిశీలిస్తే దేశీయ వనరులను, శ్రమను సమన్వయం చేసే ప్రయత్నం మన్మోహన్ ప్రభుత్వం చేయలేకపోవడమే. అంతకు ముందున్న యన్.డి.ఎ. ప్రభుత్వానికి సెక్యులర్ విధానం లేకపోవడం, బడుగు వర్గాల మీద సామాజిక న్యాయ దృష్టి లేకపోవడం వల్ల ఆ ప్రభుత్వాన్ని ప్రజలు దించేశారు. యు.పి.ఎ. కూటమి అధికారానికి వచ్చాక వీరు అంతకంటే తీసికట్టుగా సామాజిక ఆర్ధిక విధానాలను రూపొందించారు.

ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే మెజారిటీ ప్రజలకు పని కల్పించగలగాలి. దానితో పాటు జీవితం మీద ఆశ కల్పించాలి. నిరాశాజనకమైన వాతావరణంలో మనుష్యులు ఉత్తేజంగా వుండలేరు. తప్పక పునర్నిర్మాణాలకు ప్రత్యామ్నాయాలకు పునాదులు వేయాల్సివుంది. అప్పు లు చేసి బ్రతకండి, అప్పులతో జీవించండి వంటి పిలుపులనివ్వడం వల్ల వస్తూత్పత్తిరంగం కుప్పకూలింది. ప్రజలు వస్తు ఉత్పత్తిలో జీవన వ్యవస్ధల్ని పునరుజ్జీవింపచేసుకుంటారు.

వారికే పనిలేదంటే, పనినుంచి ఉత్పత్తి పరికరాల నుంచి తయారైన వస్తువు మార్కెట్టుకు వెళ్లి ధనాన్ని సంపాదించాల్సి వుంది. అయితే సామాజిక ఉత్పత్తులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. జీవనాధార అంశాల పట్ల ప్రభుత్వానికి ప్రభుత్వేతర సంస్ధలకు లక్ష్యం లేదు. ముఖ్యంగా ఆహారం, ఆహార్యం, నివాసం, వాహనం, విద్య, ఆరోగ్యం వంటివన్నీ ఒక క్రమంలో అభివృద్ధి చెందాల్సి వుంది. కానీ మౌలికాంశాల రూపకల్పనలన్నింటిలోనూ ప్రభుత్వం వెనుకబడి వుంది.

ఈ విషయంగా రైల్వే బడ్జెట్టును పరిశీలిస్తే దక్షిణ భారతదేశంలో 2010-2011 ఆర్ధిక సంవత్సరంలో కేవలం 33.7 కోట్ల మందిని రైళ్ల ద్వారా తరలించగలిగారు అంటే బ్రిటీష్ కాలం నుంచి రూపొందిన రవాణా వ్యవస్ధ వేగవంతం కాలేదని అర్ధం. ఆధునిక సమాజంలో వున్న కదలిక సామాజిక చలనాన్ని నిర్ణయిస్తుందనే సూత్రానికి కట్టుబడిందనే అర్ధం. కేంద్ర ప్రభుత్వం పనిమొత్తంలో ప్రధాన బాధ్యత భారత దేశ ప్రజలకు చలనాన్ని పెంచవలసివుంది. ఆయా రాష్ట్రాల్లో ఈ చలనం పట్ల కూడా వివక్ష వుంది. పశ్చిమబెంగాల్లో 44.06 కిలోమీటర్లు వుంటే ఆంధ్రప్రదేశ్‌లో 18.80 కిలోమీటర్లు మాత్రమే రైల్వే లైన్లు వేసివున్నాయి. దీన్నిబట్టి సామాజిక చలనాన్ని పెంపొందించడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వుంది. అంతేగాక విద్య, వ్యాపార, వాణిజ్య రంగాల అభివృద్ధికి రైల్వే వ్యవస్ధ అభివృద్ధి కాకపోవడం కూడా గొడ్డలిపెట్టే అవరోధం అవుతుంది.

2012-2013 బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకానికి 6,300 కోట్లు అంచనా వేశారు. నిజానికి భూమి పంపిణీ ప్రస్తావనే ఈ బడ్జెట్‌లో లేదు. బడ్జెట్‌కు భూమి పంపిణీకి సంబంధం వుంది. భూమి కొనుగోలు ప«థకం డా.బి.ఆర్.అంబేద్కర్ మొదటి బడ్జెట్‌లోనే ప్రతిపాదించారు. ప్రభుత్వం భూములన్నింటిని మల్టీనేషనల్స్ కంపెనీలకు అమ్ముకుంటున్న దశలో దళితులకు, ఆదివాసీలకు, భూమిలేని నిరుపేదలకు భూమిని పంచడం వల్లనే ఉత్పత్తి క్రమం పెరుగుతుంది. భారతదేశ వ్యాప్తంగా వ్యవసాయం ఆయా రాష్ట్రాలలో రెండు, మూడు కులాల చేతుల్లోనే వుంటుంది. వారిచేతుల్లోనే రాజ్యాధికారం వుంది.

వ్యవసాయం కొన్ని కులాల చేతుల్లోనే వుంటే దేశం బాగుపడదు. వ్యవసాయదారుడు భూమిమీద, వ్యవసాయం మీద నిలబడి లేడు. పెట్టుబడిదారులు కొందరు వడ్డీ వ్యాపారస్ధులుగా రూపొందుతుంటే కొందరేమో వ్యవసాయం గిట్టక అప్పులుచేసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటప్పుడు వ్యవసాయ భూములను ప్రభుత్వమే తగురేటుకు కొని దళితులకు, గిరిజనులకు పంచాలనేది అంబేద్కర్ ఆలోచన. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి దళిత గిరిజనుల మీద నిర్లక్ష్యం వుంది. ప్రణబ్‌ముఖర్జీ రాజకీయ నిపుణుడు కాదు. ఆయన 2012-2013 వార్షిక బడ్జెట్ మొత్తం 14,90,925 కోట్లలో పార్లమెంటుకు సమర్పించబడింది. ఇందులో పన్నుల రాబడి 10,77,612 కోట్లు గాక పన్నులకు ఇతర ఆదాయం, లక్షాఅరవై నాలుగు వేల కోట్లు. నికర మార్కెట్ రుణాలు 4, 79,000 కోట్ల రూపాయలుగా తేల్చారు.

ఇందులో ప్రధానంగా 1,93,407 కోట్లు రక్షణకు కేటాయించారు. గత ఏడాది కంటే ఇది 13 శాతం ఎక్కువ. చైనాతో పాకిస్తాన్‌తో పోటిపెట్టి దేశీయ రక్షణకు ఇబ్బడిముబ్బడిగా పెంచే క్రమం కొనసాగుతుంది. ఇందువల్ల ప్రధానమైన పరిణామానికి మూలమైన ప్రాధమిక విద్యకు క్రిందటి బడ్జెట్‌లో 52వేల కోట్లు కాగా, ఇప్పటి బడ్జెట్‌లో 61వేల కోట్లు పెంచారు. 9వేల కోట్లు మాత్రమే పాఠశాలకు పెంచారు. ఇంతవరకు పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు, ప్రహరీలు ఆటస్థలాలు, ఆట వస్తువులు, చాక్‌పీసులు కూడా లేని బడులు వున్నాయి. విద్యాహక్కు చట్టం కింద 25 శాతం పేద విద్యార్ధులను ప్రయివేటు విద్యాలయాల్లో చేరుస్తామన్నారు. అది అమలు జరగడం లేదు.

భారతదేశ వ్యాప్తంగా ప్రాధమిక విద్య కుంటుబడటంతో చైల్డ్‌లేబర్ పెరిగిపోతోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న చిన్న కర్మాగారాలు, గృహనిర్మాణ పనుల్లో కోట్లాది మంది చైల్డ్‌లేబర్ తమ జీవితాన్ని బుగ్గిచేసుకొంటున్నారు. దేశానికి పునాదియైన చిన్నారుల మీద కనికరం లేదు. ప్రాథమిక విద్య అభివృద్ధి చెందాలంటే భూమి పంపకం తల్లిదండ్రుల నికరాదాయంలోకి రావలసిన అవసరం వుంది.

ఉన్నత విద్యలు అభ్యసించే వారు ప్రపంచ సగటు 23 శాతం వుంటే, మన శాతం 12.4 మాత్రమే. సంపన్న వర్గాలే ఎక్కువగా ఈ విద్యకు చేరగలుగుతున్నారు. దేశంలోని 22 కేంద్రీయ విశ్వవిద్యాలయల్లో బ్రాహ్మణవాదం కొనసాగుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ మొదలైన సబ్జెక్టుల్లోకి శూద్రులను, అతిశూద్రులను రానివ్వడం లేదు. విశ్వవిద్యాయలాలు బ్రాహ్మణ అగ్రహారాల్లా నడుస్తున్నాయి. ప్రోగ్రెసివ్ సెక్టారులో కూడా బ్రాహ్మణులే ఎర్రముసుగులతో ఛాంపియన్‌లుగా వుంటున్నారు. ఇటు ఉన్నత విద్యలో బ్రాహ్మణులు, అటు భూస్వామ్య కులవ్యవస్ధలను కొనసాగిస్తున్న శూద్ర అగ్రకులాలు ఈ బడ్జెట్‌ల సారాన్ని పిండుకొంటున్నాయి.

మంత్రులు, అధికార యంత్రాంగంలోను ఉన్నత విద్యలోను ఉన్న కుల వివక్ష కారణంగా దళితులకు కేటాయించిన నిధులు దళితులకు చేరడం లేదు. దారి మళ్ళించబడుతున్నాయి. భారతదేశంలో బ్రిటిష్ వాళ్లు దెబ్బకొట్టిన రెండు అంశాలు చేనేత, వ్యవసాయం. మిల్లు వస్త్రాల వల్ల మొత్తం చేనేత వ్యవస్థలను కుప్పకూల్చి నష్టాల్లోకి నెట్టారు. స్కూల్ డ్రస్‌లు, మిల్ట్రీ, పోలీసు, టీచర్లు, కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ వ్యవస్ధలన్నింటికి చేనేత వస్త్రాలను కంపల్సరీగా కొనడం నిర్ణయిస్తే ఇప్పుడున్న చేనేత కార్మికులు చాలరు. చేనేత మొదటి దళితులే ప్రామినెంట్‌గా నేసేవాళ్ళు. దీనికి ఆదాయ వనరులు పెంచి ఎస్‌సి, బిసిలకు సమాన ప్రతిపత్తి ఇందులో పెంచాలి. నశించిపోతున్న వృత్తులను పునరుద్ధరించడం ద్వా రా సామాజిక ఆర్ధిక పునరుజ్జీవనం జరుగుతుంది. ఆర్ధిక మంత్రికి భారతీయ మూల ప్రకృతుల మీద పట్టూ ఉండాలి. ఆంధ్రదేశంలో దొరుకుతున్న భూవనరులను ఇతర దేశాల కమ్ముకున్న ఉన్నతాధికారులు ఎంత దేశ ద్రోహానికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా హోంశాఖకు కూడా నిధులు తగ్గించారు. ఒక పక్క అవినీతిని నిర్మూలించామంటున్నారు.

మరో ప్రక్క స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) నిష్పత్తి 2007-08లో 17.7 శాతం ఉండగా, అందులో కేంద్రం వాటా 12 శాతం. నేడు అది వరుసగా 15.4 శాతానికి పడిపోయింది. పనుల్లో ఇచ్చే మినహాయింపులు కూడా సబ్సిడీలే. కేంద్ర బడ్జెట్‌లు 2006-2007 నుంచి రాబడులు విషయం ముందే ఒక నిర్ధారణకు వచ్చేస్తున్నాయి. సారాంశం ఏమిటంటే, మినహాయింపులు కనుక లేకపోతే పన్ను జిడిపిలో 5.5 శాతం పెరుగుదల కనిపించి ఉండేది. 2011-2012 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ లక్ష్యాలను, ముఖ్యంగా ఆహారం, పెట్రోలియమ్ ఉత్పత్తులకు సంబంధించి చేరుకోలేదని మనకు తెలుసు. కానీ, అదే బడ్జెట్ అంచనాలకు ఎవరైనా కట్టుబడి ఉండి, మిగిలిన సబ్సిడీలన్నింటినీ మినహాయించినప్పటికీ కూడా, ఇతరత్రా వెచ్చించగలిగిన మొత్తం 1.44 ట్రిలియన్ల వరకు ఉంటుందని నిపుణుల అంచనా.

అస్తవ్యస్తపు ప్రాధాన్యాల వల్ల ప్రభుత్వ, ఆరోగ్య, విద్యా రంగాలకు సంబంధించిన పథకాల కన్నా ఆహార సబ్సిడీకి, ఉపాధి హామీ పథకాలంటే మీదే ఎక్కువ ఖర్చు చేస్తున్నట్టు చూపిస్తుంది. ఆహార సబ్సిడీకి రూ.60,750 కోట్లు కేటాయించింది. ఎస్ఆర్ఈడీఏకి 40,000 కోట్లు కేటాయించింది. ఆరోగ్య కార్యక్రమాలకి 26,750 కోట్ల కేటాయించింది. సర్వశిక్షా అభియాన్ 21,000 కోట్లు కేటాయించింది. పేదలకి ఇచ్చే ఆహార ధాన్యాల ఉత్పత్తి కోసం ప్రభుత్వం ప్రతి ఏటా దాదాపు 60,000 కోట్లు వెచ్చిస్తోంది. బడ్జెట్‌లో భారీ వ్యయంతో కూడిన చట్టం ఏదైనా వుంటే అది ఆహార భద్రతా బిల్లుదే.

ఆహార సబ్సిడీల కోసం ఏటా చేస్తున్న ఖర్చును 90,000 కోట్లకు పెంచనుంది. దీనివల్ల ప్రతినెల రూ.2, రూ.3లకే 30 కిలోల బియ్యం పథకాలను రూపొందిస్తుంది. జనరల్ మార్కెట్‌లో కిలో బియ్యం రూ.36 లకు అమ్ముతున్నారు. సబ్సిడీలో ఇచ్చిన రూ.30 కిలోలు అయిపోయిన తర్వాత రూ.35కి జనరల్ మార్కెట్‌లో కొనాల్సి వస్తుంది. పెరిగిన రేట్లను బట్టి ప్రజలు పౌష్టిక ఆహారాన్ని తీసుకోలేక పోతున్నారు. దానివల్ల ఎనిమిక్‌గా మారుతున్నారు. మనం ఆరోగ్య కార్యక్రమాలకి ఎంత ఖర్చు పెట్టినా మనుషుల శ్రమకు తగిన ఉపాధిని కల్పించకుండా ఉత్పత్తిని పెంచుకోకుండా శక్తిమంతమైన ఆహారాన్ని తీసుకోగలిగిన స్థాయికి చేర్చకుండా మానవ అభివృద్ధి, భారతదేశ ఆర్థిక ప్రగతి కుంటు పడక తప్పదుకదా!

ఏ దేశమైనా సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే శ్రామికుడిని గుర్తించాలి. వ్యవసాయ దారుడిని గుర్తించాలి. విద్యావంతుడిని గుర్తించాలి. వారి అభివృద్ధికి , వారి ఉత్పత్తి రంగానికి నిరంతర ఉత్తేజం కలిగించాలి. కేవలం సబ్సిడీల ద్వారా ఉపశమనాల ద్వారా అంకెల గారడీ ద్వారా దేశ సంపద వర్ధిల్లదు. దేశం పురోగతి చెందదు. తప్పకుండా రాజ్యాంగ కర్త డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలను ప్రణాళికా సంఘం, బడ్జెట్ రూపకర్తలు సమన్వయించుకోవాలి. నూతన జీవన విధానానికి ప్రత్యామ్నాయ సామాజిక ఆర్థిక జీవన విధానాన్ని రూపొందించగలిగినప్పుడే మానవాభ్యుదయం ప్రతిఫలిస్తుంది. లేకుంటే బడ్జెట్, తాబేదారులకు విస్తరి అవుతుంది తప్ప అభివృద్ధి వుండదు.
- కత్తి పద్మారావు
Andhra Jyothi News Paper Dated : 31/03/2012 

ముస్లింలను ముంచే యత్నం - కంచ ఐలయ్య



ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో మహబూబ్‌నగర్ అసెంబ్లీ సీటును బిజెపి గెలువడానికి టిఆర్‌యస్, జెఎసిలు పకడ్బందీ ప్లాను వేశాయి. టిఆర్‌యస్ అభ్యర్థి సయ్యద్ ఇబ్రహీంను ఓడించి బిజెపి అభ్యర్థి శ్రీనివాసరెడ్డిని గెలిపించేందుకు ఈ పథకం ముందే వెయ్యబడింది. ముస్లిం ఓట్లను కాంగ్రెస్‌కు పడకుండా చూడడం వల్ల ఈ గెలుపు సాధ్యమైంది. 2014లో ఈ ఎత్తుగడనే వేస్తే ఆదిలాబాద్, కరీంనగర్, ముథోల్, నిర్మల్, నిజామాబాద్ (ఇప్పటికే వారి చేతిలో ఉంది), బోధన్, కామారెడ్డి, కోరుట్ల, జహీరాబాద్, సంగారెడ్డి, తాండూర్ సీట్లను కూడా బిజెపి గెలుచుకోవచ్చు. ఈ అన్ని నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు 25 శాతానికి మించి ఉంటాయి. 

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, 2009 డిసెంబర్ ప్రకటన తరువాత కొత్త మలుపు తిరగిందని తెలిసిందే. ఈ ఉద్యమంలో ముస్లింలు ఏం చెయ్యాలి, ఎటు ఉండాలి అనే అంశంపై చాలా తర్జన భర్జన జరుగుతోంది. ఈనాటి తెలంగాణ అంతా ఒకనాటి ముస్లిం నిజాం పరిపాలనలో ఉండింది. 1948 సెప్టెంబర్ 17న నిజాం పరిపాలన అంతమయి ఆ రాజ్యాన్ని ఇండియన్ యూనియన్‌లో కలిపిన దినాన్ని బిజెపి, ఆర్‌యస్‌యస్ ఆ ప్రాంత ప్రజల విమోచన దినంగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాయి. ఆ తరువాత 1956లో విశాలాంధ్ర ఏర్పడి నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు పాత నైజాం రాష్ట్రాన్ని బూర్గుల రామకృష్ణారావు పరిపాలించాడు. ఆ ఏడు సంవత్సరాల్లో ముస్లింల పరిస్థితి ఎలా తయారైందో ఎవరూ సరిగా అధ్యయనం చెయ్యలేదు. బూర్గుల రామకృష్ణారావు పరిపాలనలో వారికి గౌరవస్థానం దక్కిందా? 

ఆ కాలంలోనే ఆంధ్ర ప్రాంతం నుంచి బ్రాహ్మణ బ్యూరోక్రాట్లు విద్యావేత్తలు, ఇతర ఉద్యోగులు హైదరాబాదుకు, ఇతర జిల్లా కేంద్రాలకు వలస వచ్చారు. ప్రభుత్వ రంగంలో ఉర్దూ స్థానాన్ని తగ్గించి ఇంగ్లీషును ప్రవేశపెట్టారు. వందలాది ముస్లిం ఉద్యోగులు వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకొని ఇంటికి పోవలసివచ్చింది. సెప్టెంబ్ 17ను విముక్తిదినంగా ప్రకటించింది బూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలోనే. 

ఆర్‌యస్‌యస్‌కు, ఆర్యసమాజ్‌కు తెలంగాణలో సిద్ధాంత భూమికను రూపొందించింది ఇక్కడి మైగ్రెంట్ బ్రాహ్మణ వర్గమే. ఆనాటి నుంచి విశాలాంధ్రలో అడుగు పెట్టాక ఆంధ్ర భాష ధాటికి, అధికార యంత్రాంగంలో ఉనికిలో కొచ్చిన బ్రాహ్మణీయ ఇంగ్లీషు ధాటికి ముస్లింలు పూర్తిగా ఉద్యోగాలకు దూరమయ్యారు. ఆ తరువాత తెలంగాణ రెడ్లు, వెలమలు, బ్రాహ్మణులతో జతై ఈ ప్రాంతపు ముస్లింలందర్నీ రజాకార్లుగా వక్రీకరించి ముందు 'త్రికుల రాజ్యాన్ని' (బ్రాహ్మణ, రెడ్డి, వెలమ) స్థాపించారు. 1980 దశకంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ముస్లిం వ్యతిరేక శక్తుల్లో కమ్మలూ చేరారు. ఇప్పుడది 'చార్ కుల' చట్రంగా మారింది. 

1969 ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముస్లింలు భయపడుతూ పాల్గొన్నారు. ఎందుకు? అప్పటికే హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ వంటి అత్యధిక ముస్లింలున్న ప్రాంతాల్లో ముస్లింలు భయ భ్రాంతులకు గురిచెయ్యబడుతున్నారు. వారి 'గెట్టోఅయిజేషన్' అప్పటికే పూర్తయింది. ఈ క్రమంలోనే 1950వ దశకంలో వారి రక్షణార్థం ఎంఐఎం పుట్టింది. ఈ ఎంఐఎం చాలా కాలంగా ప్రత్యేక తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూనే ఉంది. 

వెలమల నాయకత్వంలో 2000 దశకంలో టిఆర్‌యస్ పుట్టింది. ఇది మహారాష్ట్రలోని శివసేన సిద్ధాంతాన్ని తెలంగాణలో అమలు చెయ్య తలపెట్టింది. ఆర్‌యస్‌యస్ ప్రారంభించిన సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని పెద్దఎత్తున జరుప నారంభించింది. ఈ పాటికే తెలంగాణలో ఎన్నో మత కల్లోలాలను, దాడులను ఇక్కడి ముస్లింలు చవి చూశారు. ప్రత్యేక రాష్ట్రమేర్పడితే కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌ల నుంచి బిజెపిని తెలంగాణ కంతా వ్యాపింపజేసి టిఆర్‌యస్‌ను లొంగదీసుకోవచ్చు అనే సిద్ధాంతంతో ఆర్‌యస్‌యస్ తెలంగాణ మొత్తంగా పనిచెయ్యడం ఆరంభించింది. ఈ దశలో ఏర్పడిన రాజకీయ జెఎసిలో బిజెపి చేరి తన వ్యాప్తి సిద్ధాంతాన్ని అమలుచెయ్య మొదలుపెట్టింది. 

బిజెపి (చాపకింద ఆర్‌యస్‌యస్) జెఎసిలో చేరి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో తన క్యాడర్‌ను వ్యాపింపజేసింది. ఎవరెట్ల చచ్చినా తెలంగాణ వస్తే చాలు అనుకునే అగ్రకుల మేధావులు, కొంత మంది బిజెపిలో పనిచేసే బిసి ఉద్యోగులు పొద్దుందనుక టిఆర్‌యస్ ఆఫీసులో, తెల్లందనుక బిజెపి ఆఫీసులో మంతనాలు జరుపడం, ఆర్‌యస్‌యస్ మంత్రాలు నేర్చుకోవడం మొదలుపెట్టారు. దీని ఫలితంగా తెలంగాణ నరేంద్ర మోడీగా ఎదగాలని ఆశపడుతున్న కిషన్‌రెడ్డి తెలంగాణ యాత్ర చేశాడు. దానికి జెఎసి కొబ్బరికాయకొట్టి, జెండా ఊపింది (దురదృష్టవశాత్తు ఆ జెండా ఊపే కార్యక్రమంలో కృష్ణ మాదిగ కూడా పాల్గొన్నారు). 

ఆర్‌యస్‌యస్, బిజెపిల శక్తి మహబూబ్‌నగర్ ఎన్నికల్లో కమలమై పూసింది. ఐతే అక్కడ టిఆర్‌యస్ ఒక ముస్లింను పెట్టింది కూడ గెలిపించడానికి కాదు. అక్కడ అధికంగా ఉన్న ముస్లిం ఓట్లను చీల్చి కాంగ్రెస్‌కు పడకుండా చూసి, బిజెపిని గెలిపించడానికి. 'తెలంగాణ వాదాన్ని గెలిపించండి' అని జెఎసి వారు చెప్పినా టిఆర్‌యస్ వారు చెప్పినా అది బిజెపిని గెలిపించే ఒప్పందంలో భాగమే. దాదాపు ఇప్పటినుంచి 2014 ఎన్నికల వరకు టిఆర్‌యస్‌కు, జెఎసికి కావలసిన ఆర్థిక బలాన్ని, అంగ బలాన్ని ఆర్‌యస్‌యస్ సమకూరుస్తుంది. తెలంగాణ ఉద్యమంలో సంపాదించుకోవడానికి అలవాటుపడ్డ వీరు బిజెపి శక్తుల నుంచి డబ్బులు తీసుకోరని నమ్మడానికి వీలులేదు. రానున్న రెండు సంవత్సరాలు జెఎసి చుట్టున్న వీరంతా బిజెపిని తెలంగాణ రెడ్డి రాజకీయ శక్తిగా ఎదిగించే అవకాశముంది. టిఆర్‌యస్ వెలమల పార్టీ అయితే బిజెపి ఇక్కడ రెడ్ల పార్టీ కావాలనేది జెఎసి ఆలోచన కూడ. 

కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తేనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమనే నినాదం ఇక ముందు బలపడుతుంది. జెఎసి చుట్టూ ఉన్న రెడ్లు, బ్రాహ్మలు, కొంత మంది బిసిలు కిషన్ రెడ్డి చుట్టూ ర్యాలీ అవుతారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఎట్లాగు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదు కనుక (ములాయంసింగ్ యాదవ్ అధికారంలోకి వచ్చాక ఆ అవకాశం పూర్తిగా పోయింది) బిజెపిని కేంద్రంలో అధికారంలోకి తేవడం ఏకైక రాజకీయ కార్యక్రమంగా ఈ శక్తులు పనిచేస్తాయి. తెలంగాణ మత్తు మందు బాగా ఎక్కిన మావోయిస్టు అగ్రకుల శక్తులు కూడ ఈ కూటమికి మద్దతు ఇవ్వడానికి వెనుకంజ వెయ్యరు. తెలంగాణ ఉద్యమ క్రమంలో సాధారణ బిసిలు, ఎస్‌సిలు బాగా నష్టపొయ్యారని ఇంతకు ముందే ఒక వ్యాసంలో చెప్పుకున్నాం. 

ఇప్పుడు ముస్లింలకు ఏం జరుగుతుందో కొంత లోతుగా చూడాలి. నమస్తే తెలంగాణ బ్రాహ్మణ నేతృత్వంలో నడుస్తున్నందు వల్ల అది క్రమంగా బిజెపి కంట్రోల్‌లోకి పోయే అవకాశం లేకపోలేదు. ఈ పత్రిక చుట్టూ పనిచేస్తున్న 'మార్క్సిస్టు మేధావులను' బిజెపి విస్తృతికి బాగా వాడుకుంటారు. వారు ప్రతి నిత్యం కాంగ్రెస్‌ను, టిడిపిని తిడుతూ బిజెపి, టిఆర్‌యస్‌లను పొగిడే పనిచెయ్యక తప్పదు. తెలంగాణ కోసం వారు కూడా ఏ విషమైనా మింగడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదొక విచిత్ర విప్లవ వాదమైంది. 

ఈ అందరూ కలిసి మహబూబ్‌నగర్‌లో బిజెపి జెండా ఎగురవేశారు. ఈ ప్రాంతపు ముస్లింలకు ఒక హెచ్చరిక చేశారు. పార్టీ ఏదైనా కాని, తెలంగాణలో వెలమ, రెడ్లు గెలువడం ప్రధానం. ముస్లింలు వారు చెప్పినట్టు వినకపోతే వారి చేతిలో ఉన్న పత్రిక, టివి ద్వారా వారిని తెలంగాణ ద్రోహులుగా ముద్రిస్తారు. అవసరమైతే వారిపై ఆర్‌యస్‌యస్ తెలంగాణ వీరుల ముసుగులో దాడులు చేస్తుంది. 

టిఆర్‌యస్, జెఎసి, ఆర్‌యస్ యస్‌నే సపోర్టు చేస్తాయి. ఒకసారి ప్రాంతీయ సెంటిమెంటు రెచ్చగొట్టి ఫాసిస్టు పార్టీని ప్రజాస్వామ్య పార్టీగా ముందుకు తెచ్చాక ఫాసిజానికి తెలుసు ఎవరిని ఎట్లా హాండిల్ చెయ్యాలో! ఇప్పుడు తెలంగాణ ముస్లింలు, మొత్తం తెలంగాణ ప్రాంతం ఒక ప్రమాదకర పరిస్థితిలోకి నెట్ట బడ్డది. ఎంత మందిని చంపైనా, ఏ పార్టీని అధికారంలోకి తెచ్చినా తెలంగాణ సాధించాలనే 'తెలంగాణ భ్రమ' మేధావి వర్గం, రాజకీయ నాయకులు ఇక్కడ చాలా మందే తయారయ్యారు. ఈ తెలంగాణ మత్తు వారికి డబ్బును ఆస్తుల్ని కూడా సంపాదిస్తుంది. 

ముస్లింలపై దాడులు చేస్తే తెలంగాణ వస్తుందంటే అందుకు వీరంతా సిద్ధమయ్యే వాతావరణం కనిపిస్తుంది. అది నిజం కాకపోతే- గుజరాత్‌లో ముస్లింల ఊచకోత, ఒరిస్సాలో క్రిస్టియన్ల ఊచకోత, బాబ్రీ మజీద్ కూలదోత చాలా సులభంగా చేసి దేశంలో ఎన్నో అరాచకాలను సృష్టించిన ఆ పార్టీని జెఎసిలో చేర్చుకొని తామూ బొట్లు పెట్టుకొని జెఎసి పేరుతో పాత మార్క్సిస్టులంతా దానికి ప్రచారం ఎందుకు చేస్తున్నారు? రెడ్లకు, వెలమలకు, బ్రాహ్మణులకు మార్క్సిజం ఒక మాయావాదం. తెలంగాణ ప్రపంచకార్మిక విముక్తి సిద్ధాంత ఆచరణ అంశం. ముస్లింల పట్ల, కిందికులాల పట్ల ఈ గుంపుకు ఎప్పుడూ ప్రేమ లేదు. ఎంఐఎం ఇదే భయాన్ని పదేపదే చెబుతూ వచ్చింది. కాని గ్రామీణ ప్రాంతంలోని ముస్లింలు, తెలంగాణ వ్యతిరేక ముద్రకు, దాడులకు భయపడి టిఆర్‌యస్ చుట్టూ చేరారు. మొన్నటి ఎన్నికల్లో టిఆర్‌యస్, జెఎసిలు తమనెంత మోసం చేశాయో తెలిసింది. ఇలానే జరుగుతుందని అసదొద్దీన్ ఓవైసీ చెబుతూనే ఉన్నాడు. 

వచ్చే ఎన్నికల నాటికి బిజెపి తన జాతీయ స్థాయి శక్తిని, డబ్బును తెలగాణ మీదే కేంద్రీకరిస్తుంది. టిఆర్‌యస్‌తో పొత్తుతోనో లేక స్వతంత్రంగానో తెలంగాణ అంతా పోటీ చేస్తుంది. జెఎసి తెల్లందాక బిజెపితో పొద్దుందాక టిఆర్‌యస్‌తో పనిచేస్తుంది. రానున్న రెండేండ్లలో తెలంగాణ ఒక రణ రంగంగా మారుతుంది. బిజెపి చాలా ప్రమాదకరమైన పార్టీ. దాని నినాదం జ్ఞానం, శీలం, ఏకత. దీని ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సైతం కంప్యూటరైజ్‌డ్ కామక్రీడలు చూస్తుంటారు. కర్ణాటకలో, గుజరాత్‌లో ఏమి జరిగిందో అందరికీ తెలుసు. మాజీ విప్లవకారులంతా తెలంగాణ పేరుతో బిజెపి, శివసేన సంస్కృతిలో స్నానం చేస్తే సర్వం సమకూరుతాయని చూస్తున్నారు. 

సాంస్కృతికంగా అందరూ హిందూ వాదులైనందు వల్ల సెక్యులరిజం గీతను ఎటు జరిపినా ఫరావాలేదు. ప్రాంతీయ ఉన్మాదంతో పైసలు, మైనార్టీ వ్యతిరేక ఉన్మాదంతో పవర్ వస్తాయి. తెలంగాణ రాకపోయినా అనుకున్నది జరిగింది. బిసిలు, ఎస్సీలు, ఎస్టీలు గంపెడు మంది చచ్చారు. ఇక చావ వలసింది మైనార్టీలు, ముఖ్యంగా ముస్లింలు. జై తెలంగాణ, జై మార్క్స్, జై మను. ఇప్పుడు తెలంగాణ నినాదం సర్వమానవ చావు నినాదం. ఆ అంతిమ లక్ష్యం బిజెపి మాత్రమే నెరవేర్చగలదు. ఇక రెడ్ల నేతృత్వంలోని జెఎసిలన్నీ దాని చుట్టే తిరుగుతాయి. 

2014లోపే ఆ అంతిమ లక్ష్యాన్ని చేరుతారు. ముస్లింలది మాత్రం అగమ్యగోచర పరిస్థితి. వాళ్లు టిఆర్‌యస్, బిజెపి, వాటి అనుబంధ రాజకీయ జెఎసిలో చేరి పనిచెయ్యకపోతే వాళ్లను 'తెలంగాణ వ్యతిరేకులనే' ముద్ర వేసి వేధిస్తారు. అందులోచేరి పనిచేస్తే మహబూబ్‌నగర్‌లో వారికి పట్టిన గతే పట్టిస్తారు. వారిపై దాడులు చేస్తే ఈ రెండు పార్టీలు ఈ ప్రాంతంలో పూర్తి స్థానాలు గెలుస్తాయనుకుంటే ఆ పని చేస్తారు. ముస్లింలకిప్పుడు ఒక్క అల్లానే దిక్కు. 

- కంచ ఐలయ్య
వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త, సుప్రసిద్ధ రచయిత
Andhra Jayothi News Paper Dated : 30/3/2012 

Thursday, March 29, 2012

ఆ ‘ఆత్మ’లను అర్థం చేసుకున్నారా?!---పొఫెసర్ ఘంటా చక్రపాణి



వరుస ఆత్మహత్యలతో మళ్ళీ తెలంగాణ అల్లకల్లోలమయింది. వరంగల్ నడి బొడ్డున భోజ్యానాయక్ వంటి ఉన్నత విద్యావంతుడు నిట్టనిలువునా కాలిపోయాడు. ఆ జ్వాలలు ఆరిపోకముందే మరో రాజమౌళి మంటల్లో మాడిపోయాడు. ఆ వెంటనే ఉప్పలయ్య... ఇలా వరుసగా రాలిపోతూనే ఉన్నారు. రాజకీయపార్టీలు, పాలకవర్గాలు చేస్తున్న మోసం భరించలేక తెలంగాణలో ఇప్పుడు అందరి గుండెలూ ఆవేదనతో రగిలిపోతున్నాయి. ఆ చావులు చూసినప్పుడు చలించిపోవడం, దుఃఖించడం మినహా వాటిని ఆపలేని నిస్సహాయతలో ఇప్పుడు తెలంగాణ సమాజం మిగిలిపోయింది. ‘సమస్య ఏదైనా, ఎంత క్లిష్టమైనదైనా చావుద్వారా పరిష్కరించడం కుదరదు. చనిపోవడమంటే సమస్యనుంచి పారిపోవడమే! ఆత్మహత్య అటువంటి పిరికితనానికి ప్రతీక లాంటిద’ని ఆత్మహత్యలను ఒక వ్యక్తిగత సమస్యగా చూసేవాళ్ళు చెప్పే మాటలివి. నిజమే సమస్య వ్యక్తిగతమైనది అయినప్పుడు ఆ సమస్యనుంచి తప్పించుకోవడానికి చనిపోవడం ఒక వైయక్తిక పరిష్కారంగా పరిగణిస్తారు. ఇక్కడ సమస్య వ్యక్తిగతమైనది కాదు. చనిపోతున్నవాళ్ళు కూడా తమ వ్యక్తిగత ఆకాంక్షల కోసం ఆత్మహత్యను ఎంచుకోవడం లేదు. తెలంగాణ ఒక విస్తృత సామాజి క ఆకాంక్ష. రాష్ట్ర సాధన అనేది తమ వ్యక్తిగత అవసరాలకంటే ఎక్కువ ప్రధానమైనదిగా భావిస్తున్నవాళ్లు, తమ సమస్యలకు ఒక పరిష్కారంగా నమ్మేవాళ్లు.. ఇంతకాలం అన్నిరకాల ప్రజాస్వామ్య మార్గాల ద్వారా తమ ఆకాంక్షను వ్యక్తపరిచారు. ఏళ్ళతరబడి జీవితం అంటేనే పోరాటమని చాటి చెప్పా రు. ఎవరినుంచీ ఎటువంటి హామీ రాక ఇప్పుడు ఆ త్మాహుతులకు ఒడిగడుతున్నారు. ఆత్మహత్యలు పరిష్కారం కాద ని పోరాడితేనే తెలంగాణ వస్తుందని ఉద్యమకారులే చెప్పడం వాళ్లకు విసుగుపుట్టిస్తోంది. ఉద్యమం ద్వారా కూడా తెలంగాణ ఎం దుకు రాలేదన్న వాళ్ళ ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. సమాజంలో ఒక ప్రశ్నకు సమాధానం దొరకడం లేదంటే ఆ సమాజం చచ్చినట్టే లెక్క! అదే ఇవాళ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. 

తామర తంపరల్లా ఇవాళ తెలంగాణ నిండా ఉద్యమసంస్థలు, పిడి బాకుల్లాంటి ‘జాక్’లు చాలానే పుట్టుకొచ్చాయి. ఆశ్చర్యకరంగా అందరూ రెండు మూడేళ్ళుగా వేరే పనిలేకుండా ఉద్యమమే ఊపిరిగా ఊరూరా తిరుగుతూనే ఉన్నారు. ధూమ్ ధామ్‌లతో మొదలై, మీటింగులు, యాత్రలు, గర్జనలు ఒక్కోరోజు ఒక్కో జిల్లాలో ఏదో ఒక ఉద్యమసంస్థ తన కార్యక్షికమాలను కొనసాగిస్తూనే ఉంది. మరోవైపు తెలంగాణ ప్రజానీకం ఒక సంఘటితశక్తిగా నిలబడింది. రెండేళ్లకు పైగా మునిగాళ్ళ మీద నిలబడే పోరాడుతోంది. ఆ ప్రజానీకానికి తెలంగాణ వచ్చి తీరుతుందన్న విశ్వాసాన్ని ఏ ఒక్క సంస్థా ఎందుకు కల్పించలేకపోయిందన్నది అర్థం కాని ప్రశ్న! మీరే ఒక్కసారి గమనించండి. ఒక సంస్థ ఎన్నికలు, ప్రజాస్వామ్యంలో విశ్వాసాల ప్రకటనకు, రాజకీయ అభివూపాయాల వ్యక్తీకరణకు ఒక అవకాశంగా చూస్తోంది. ఆ సంస్థ తెలంగాణవాదుల్ని గెలిపించడం ద్వారా వాదాన్ని వినిపించాలని అంటుం ది. మరో సంస్థ ఎన్నికలతో తెలంగాణ రాదని ఉద్యమాల ద్వారానే అది సాధ్యమని, కాబట్టి అందర్నీ ఓడించాలని పిలుపునిస్తున్నది. ఇంకొకరు ఆర్థికమూలాలను దెబ్బతీస్తే తప్ప తెలంగాణ రాదని చెప్తున్నారు. ఒకరు రాస్తారోకో అంటే, మరొకరు రైల్‌రోకో అంటున్నప్పుడు ఏమనాలో తెలియక ఇంకొకరు విమానాల రోకో అనడం కూడా ప్రజలు చూశారు. ఉద్యమాల పేరుమీద ఎవరి మనుగడ కోసం వాళ్ళు పరస్పర విరుద్ధంగా మాట్లాడుకోవడం తప్ప ఐక్య కార్యాచరణ లేకపోవడానికి కారణాలు వెతకాలి. 

ఎప్పుడైనా సరే సైద్ధాంతిక, పరస్పర విరుద్ధ రాజకీయ అభివూపాయాలు ఉన్నప్పుడు ఆ సంస్థలు కలిసి పనిచేయడానికి జాయింట్ యాక్షన్ కమిటీ (జాక్)లు ఏర్పడతాయి. కానీ తెలంగాణలో ఇప్పుడు కేంద్రస్థాయిలో కనీ సం డజను జాక్‌లు ఒక్కో విభాగంలో, రంగంలో అరడజను, ఒక్క జిల్లా లో వందలు మొత్తంగా తెలంగాణ ఉద్యమంలో వేలాదిగా జాకులు పుట్టా యి. ఇవన్నీ ఏం చేస్తున్నాయన్నది అర్థంకాని ప్రశ్న. ఈ ప్రశ్న ఎందుకు వస్తోందంటే ఇలాంటి ఆత్మాహుతులు జరిగినప్పుడు అందరూ ‘ఆత్మహత్యలు పరిష్కారం కాదు పోరాటమే మా ర్గం’ అని గంభీరమైన సంతాప సందేశాలు, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. ‘పోరాడాలి’ అని పిలుపునిస్తోన్న మీరేం చేస్తున్నారు? ప్రజలు పోరాడడం లేదని, ఉద్యమాల్లో లేరని ఎందుకు అనుకుంటున్నారు? పిలుపులు ఎవరైనా ఇవ్వగలరు. ఎవ రు ఆచరించాలి, ఎవరు జన సమీకరణ చేయాలి, ఎవరు పోరాడాలి, ఎవరు ఎవరి ఆర్థిక మూలాలను కనిపెట్టాలి, ఎవరు వాటిని దెబ్బకొట్టాలి? ఇవన్నీ నాయకత్వ స్థానంలో ఉన్న మీరే నిర్ణయించాలి. 

ఉద్యమం ఎలా ఉండాలో నిర్దేశించి నడిపించాలి. భోజ్యానాయక్ రెండున్నరేళ్లుగా అందరు తెలంగాణ విద్యార్థుల్లాగే ఉద్యమాల్లోనే ఉన్నాడు. రాజమౌళి తన ప్రాణంపోయే రోజుదాకా ఉద్యమాల్లోనే గడిపాడు. చివరగా ఆయన భోజ్యానాయక్ అంత్యక్షికియల్లో కూడా పాల్గొన్నాడు. అటువంటి ఉద్యమకారుల చావుల సందర్భం గా సంతాపం చెప్పేటప్పుడు ఇంకా పోరాడాలి అంటే ఈ జాకులను, మూకలను ఎలా అర్థం చేసుకోవాలి?! అసలు పోరాటం అంటే ఏమిటి? అన్ని పోరాట రూపాలను అద్భుతంగా ప్రయోగించిన తరువాత కూడా ఇంకా పోరాడాలంటే ఎలా? అదీ పోరాట వేదికలు నడిపిస్తోన్న నాయకులు, ఉద్యమకారులు అంటే ఏమని అర్థం? బహుశా ఇది అర్థం కాకే ‘భోజ్యా.. అంద రూ వస్తున్నారు, తెలంగాణ తెస్తమంటున్నారు..ఇంకెప్పుడు తెస్తారు?’ అన్న ప్రశ్నను తన ప్రాణం పోయేదాకా అడుగుతూనే ఉన్నాడు. దానికి ఎవరైనా సరే సమాధానం చెప్పగలరా? ఆ సమాధానం దొరకకే ఇవాళ అనేకమంది సమిధలై పోతున్నారు. ఈ సంఘాలు, సంస్థలు, జాకులు అన్నీ ఒకే గొడు గు కిందికి ఎందుకు రావడం లేదు? ఒకే ఉద్యమం, ఒకే ఉధృతి ఎందుకు లేదు? ఎవరి మనుగడ, ఎవరి ఉనికి, ఎవరి స్వార్థం వారిది. ఇటువంటి రాజకీయాలు, ఎత్తుగడలు రాజకీయ పార్టీలకు ఉంటాయి. 

కానీ కేవలం తెలంగాణ సాధన ఒక్కటే లక్ష్యం అని చెపుతున్న వారిలో ఈ వైరుధ్యాలు ఎందుకో సమాధానం దొరకదు. నాకు తెలిసినంత వరకు కోదండరామ్ నేతృత్వంలో ఉన్న రాజకీయ జేఏసీ ఒక విశాల వేదిక. బీజేపీనో, టీఆర్‌ఎస్‌నో మహబూబ్‌నగర్లో పోటీ చేయకుండా ఒప్పించడంలో కోదండరామ్ విఫలమై ఉండవచ్చు. కానీ గడిచిన పదేళ్లుగా విద్యావంతుల వేదిక నిర్మించడంలో, రెండేళ్లకుపైగా తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టడంలో ఆయనదే కీలక భూమిక. అటు హిందూ ఛాందసులు అన్న ముద్రపడ్డ బీజేపీని, ఇటు వారికి ఆగర్భ శత్రువులమని చెప్పుకునే నక్సలైటుపార్టీ మిత్రులతో సహవా సం చేయించిన వ్యక్తి అతను. ఆశ్చర్యంగా ఆయనతో, ఆయన రాజకీయ అభివూపాయాలతో చాలాకాలం ఊరేగిన వాళ్ళే ఇవాళ ఆయనకు పోటీగా కుంపట్లు వెలిగించుకుంటున్నారు. వీలయినప్పుడు తెలుగుదేశంపార్టీకి జెండాలు ఊపి, అవకాశం దొరికితే కాంగ్రెస్‌కు కండువాలు కప్పి, కుదిరితే కేసీఆర్‌తో ‘టీ’ ని, కాదంటే కిషన్‌డ్డితో కప్పు ‘కాఫీ’ని తాగేవాళ్ళు ఇప్పుడు సంఘటిత పోరాటాల గురించి, సమైక్య కార్యాచరణ గురించి మాట్లాడుతున్నారు. అంతేతప్ప రెండేళ్లుగా అది ఎందుకు సాధ్యపడలేదో ఆలోచించాలి. అది జరిగి ఉంటే నిజంగానే తెలంగాణ ప్రజలకు ధైర్యం ఇచ్చిన వాళ్ళు అయ్యేవాళ్ళు. తెలంగాణవాదుల్లోని ఈ అనైక్యతే ఇప్పుడు రాజకీయపార్టీల ఐక్యతకు ఆయిష్షు పోస్తున్నది. ఏ ప్రాంతం వాళ్ళైనా, ఏ పక్షం వాళ్లైనా, ఏ కులానికి చెందిన వాళ్లైనా తెలంగాణ వ్యతిరేకులంతా సంఘటితంగానే ఉన్నారు. కానీ ఒకే ప్రాంతానికి చెంది, ఒకే నినాదం అన్న వాళ్ళే వేయిగొంతుకలతో మాట్లాడుతున్నారు. అసలు పోరాటం వదిలేసి ఒకరిమీద ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. ఉద్యమకారులే ఉద్యమం వదిలేసి అసలు ఉద్యమం ఎలా ఉండాలో లెక్చర్లు దంచుతున్నారు. ఉద్యమాల ద్వారానే తెలంగాణ వస్తుంది. 


నిజమే! ఆ ఆశతోనే సకల జనులు సమైక్యంగా పోరాడుతున్నారు. అలాంటి పోరాటాలు పతాకస్థాయి కి చేరిన ప్రతిదశలో అడ్డంగా మాట్లాడి అడ్డు తగిలిన ఉద్యమకారులూ తెలంగాణలో ఉన్నారు. అసలిప్పుడు తెలంగాణే వద్దు అంటున్న మేధావులు కూడా తమ వాదనలు వినిపిస్తున్నారు. ఇది అయోమయానికి కారణం అవుతోంది. అది అర్థం కాకపోవడంవల్లే ఇవాళ అమాయకుల గుండెల్లో అగ్గిమండుతోంది. అది ఆర్పాల్సిన బాధ్యత ముమ్మాటికీ ఉద్యమానిది, ఉద్యమ సంస్థలదే. ఉద్యమాలు నడిపిస్తున్న వారికే ఉద్యమ గతిమీద, గమనం మీద పట్టులేకపోతే ప్రజలకు కచ్చితంగా మిగిలేది అయోమయమే! ఆ అయోమయమే ఇప్పుడు అగ్నికీలల్లో ఆవిరైపోతున్నది. 

ఈ అనైక్యత, అయోమయాన్ని ఆసరా చేసుకుని రాజకీయపార్టీలు ఇప్పు డు కొత్త రాగం ఎత్తుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇంత జటి లం కావడానికి కారణమైన రాజకీయపార్టీల అధినేతలు కూడా ఇప్పుడు చావులకు సంతాపం చెపుతున్నారు. ఆత్మహత్యలకు కారణమైన వాళ్ళే చావు లు సమస్యలకు పరిష్కారం కాదని ఉపదేశాలిస్తున్నారు. ఇది వినడానికే విడ్డూరంగా ఉన్నది. ముఖ్యంగా కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు సమస్య పరిష్కారానికి ప్రయత్నించకుండా ఆత్మహత్యల గురించి మాట్లాడడం బాధ్య తారాహిత్యమే తప్ప ఇంకొకటి కాదు. చనిపోయిన వాళ్ళు, చనిపోతున్న వాళ్ళు పదే పదే వేడుకుంటున్నది తెలంగాణ సంక్షోభానికి పరిష్కారం చూపించాలని. ఆ పరిష్కారం చూపే బాధ్యత ఈ రెండు పార్టీల మీద ఉన్న ది. ముందుగా కిరణ్‌కుమార్ రెడ్డి తను ఇప్పటికి ఇంకా మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న సంగతి గమనించాలి. తెలంగాణ ఆత్మాహుతులు తన ప్రభుత్వ అసమర్థతకు, ఆ ప్రభుత్వానికి వెన్నెముక అయిన కాంగ్రెస్ పార్టీ చేతగానితనానికి నిదర్శనం అన్న సంగతి గుర్తించాలి. 2009 ఎన్నికలకు ముందు రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి రాజశేఖర్‌డ్డి తెలంగాణ రాష్ట్రా న్ని ఏర్పాటు చేస్తే ఈ శాసనసభకు అభ్యంతరం లేదని ప్రకటించారు. అప్పు డు కిరణ్ ప్రభుత్వ చీఫ్‌విప్‌గా ఆ ప్రకటనను రికార్డు చేశారు. 2009 డిసెంబర్ ఏడున శాసనసభా పక్షాల అఖిలపక్ష సమావేశం శాసనసభాపతిగా ఆయన నేతృత్వంలో జరిగింది. ఆ సమావేశం చేసిన ఏకక్షిగీవ తీర్మానం మేర కు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. 

అటు తీర్మానం పంపించి ఆ మరుసటి రోజే స్పీకర్‌గా సీమాంధ్ర శాసనసభ్యుల రాజీనామాలను ఆయనే తీసుకుని పరిస్థితి గంభీరంగా ఉన్నదని కేంద్రానికి నివేదించారు. ఆ గంభీరత చల్లారిన తరువాత తెలంగాణ ప్రక్రియ కొనసాగిస్తామని, అది చల్లార్చాల్సిన బాధ్యత రాష్ట్రంలోని రాజకీయ పార్టీలదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ బాధ్యతను కూడా కాంగ్రెస్ పార్టీ కిరణ్‌మీద పెడుతూ ఆయనను ముఖ్యమంవూతిగా చేసింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఈ ప్రశ్నకు సమాధానం దొరకకే ఆత్మాహుతులతో ఆయన వైఖరి పట్ల నిరసన ప్రకటిస్తున్నారని ఎం దుకు అర్థం చేసుకోవడంలేదు. ఇప్పుడు ప్రభుత్వాధినేతగా ఈ చావులన్నిటికీ ఆయన బాధ్యత వహించి తీరాలి. విశ్వాసంతో ఉండండి అని చెప్పడం కాదు. అటువంటి విశ్వాసం కల్పించడం కోసం శాసన సభలో తీర్మానంచేసి పంపాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. అలాగే చంద్రబాబు కూడా బహుశా మొదటిసారిగా ఆత్మహత్యల మీద మాట్లాడారు. కానీ ఆయన మాటలను నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు ఉన్నారా! తెలంగాణకు వ్యతిరేకం కాదని వేయిన్నొక రాగంలో చెపుతున్న బాబు తెలంగాణకు తమపార్టీ అనుకూలమని ఒకే ఒక ముక్క కేంద్రానికి రాసి ఉంటే ఈ సంక్షోభం ముదిరేది కాదు. ఎన్నికల్లో అనుకూలమని, ఆ తరువాత కానేకాదని తమకున్నది రెండు కళ్ళని, తనవాదం తటస్థమని మాటలు మారుస్తూ సంక్షోభానికి కారణమైన ఆ పార్టీ వైఖరిని ప్రజపూవరూ మరిచిపోలేదు. 

ఉద్యమాన్నే కాదు చివరకు ఆత్మహత్యల్లో అసువులు బాసిన వారిని కూడా అవహేళన చేసే విధంగా తెలంగాణ తెలుగుదేశం ఫోరం నేతలు మాట్లాడిన మాటలు ఇంకా ప్రజలకు వినిపిస్తూనే ఉన్నాయి. అదే నేతలు ఇప్పుడు చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటాం అంటున్నారు. అయ్యా! చనిపోయినవాళ్ళు మీరు ఆదుకోవాలని కోరుకోలేదు. మీ బాబు మారాలని కోరుకుంటూ ప్రాణం విడిచారు. మీకు సాధ్యమైతే ఆయనను మార్చండి. నిజంగానే చంద్రబాబు నాయుడు చనిపోతున్న యువకుల మనోభావాలు గౌరవిస్తే, ఇంకెవరూ చనిపోవద్దని కోరుకుంటే ప్రతిపక్ష నాయకుడిగా సభా తీర్మానానికి నోటీసు ఇవ్వాలి, లేదా కేంద్రానికి పార్టీ తరఫున లేఖ ఇవ్వాలి. ఇవేవీ చేయకుండా సంతాప ప్రకటనలతో చేతులు దులుపుకోవడం భావ్యం కాదు. ఆత్మహత్యలు చేసుకుంటున్నవాళ్ళ మరణ వాంగ్మూలాలు మరొక్కసారి చదవండి. వాళ్ళ చివరి మాటలను మళ్ళీ వినండి. వాళ్ళ మాటల్లో నిరాశలేదు. నిస్పృహ లేదు. నిలు నిరసన ఉంది. నిలదీసే ప్రశ్నలున్నాయి. నిప్పును రాజేసినవాళ్ళు, మంట లు ఎగదోసినవాళ్ళు, తెలంగాణను రావణకాష్టం చేసినవాళ్ళు ఆత్మపరిశీల న చేసుకోండి. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. ఆ సమాధానాలు మాత్రమే మండిపోతున్న మనసులకు స్వాంతన చేకూరుస్తాయి. 

పొఫెసర్ ఘంటా చక్రపాణి 
రచయిత సమాజ శాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు 
ఈ మెయిల్: ghantapatham@gmail.co

Namasete Telangana News Paper Dated : 29/03/2012 

ముస్లింలను ముంచే యత్నం - కంచ ఐలయ్య



ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో మహబూబ్‌నగర్ అసెంబ్లీ సీటును బిజెపి గెలువడానికి టిఆర్‌యస్, జెఎసిలు పకడ్బందీ ప్లాను వేశాయి. టిఆర్‌యస్ అభ్యర్థి సయ్యద్ ఇబ్రహీంను ఓడించి బిజెపి అభ్యర్థి శ్రీనివాసరెడ్డిని గెలిపించేందుకు ఈ పథకం ముందే వెయ్యబడింది. ముస్లిం ఓట్లను కాంగ్రెస్‌కు పడకుండా చూడడం వల్ల ఈ గెలుపు సాధ్యమైంది. 2014లో ఈ ఎత్తుగడనే వేస్తే ఆదిలాబాద్, కరీంనగర్, ముథోల్, నిర్మల్, నిజామాబాద్ (ఇప్పటికే వారి చేతిలో ఉంది), బోధన్, కామారెడ్డి, కోరుట్ల, జహీరాబాద్, సంగారెడ్డి, తాండూర్ సీట్లను కూడా బిజెపి గెలుచుకోవచ్చు. ఈ అన్ని నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు 25 శాతానికి మించి ఉంటాయి. 

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, 2009 డిసెంబర్ ప్రకటన తరువాత కొత్త మలుపు తిరగిందని తెలిసిందే. ఈ ఉద్యమంలో ముస్లింలు ఏం చెయ్యాలి, ఎటు ఉండాలి అనే అంశంపై చాలా తర్జన భర్జన జరుగుతోంది. ఈనాటి తెలంగాణ అంతా ఒకనాటి ముస్లిం నిజాం పరిపాలనలో ఉండింది. 1948 సెప్టెంబర్ 17న నిజాం పరిపాలన అంతమయి ఆ రాజ్యాన్ని ఇండియన్ యూనియన్‌లో కలిపిన దినాన్ని బిజెపి, ఆర్‌యస్‌యస్ ఆ ప్రాంత ప్రజల విమోచన దినంగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాయి. ఆ తరువాత 1956లో విశాలాంధ్ర ఏర్పడి నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు పాత నైజాం రాష్ట్రాన్ని బూర్గుల రామకృష్ణారావు పరిపాలించాడు. ఆ ఏడు సంవత్సరాల్లో ముస్లింల పరిస్థితి ఎలా తయారైందో ఎవరూ సరిగా అధ్యయనం చెయ్యలేదు. బూర్గుల రామకృష్ణారావు పరిపాలనలో వారికి గౌరవస్థానం దక్కిందా? 

ఆ కాలంలోనే ఆంధ్ర ప్రాంతం నుంచి బ్రాహ్మణ బ్యూరోక్రాట్లు విద్యావేత్తలు, ఇతర ఉద్యోగులు హైదరాబాదుకు, ఇతర జిల్లా కేంద్రాలకు వలస వచ్చారు. ప్రభుత్వ రంగంలో ఉర్దూ స్థానాన్ని తగ్గించి ఇంగ్లీషును ప్రవేశపెట్టారు. వందలాది ముస్లిం ఉద్యోగులు వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకొని ఇంటికి పోవలసివచ్చింది. సెప్టెంబ్ 17ను విముక్తిదినంగా ప్రకటించింది బూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలోనే. 

ఆర్‌యస్‌యస్‌కు, ఆర్యసమాజ్‌కు తెలంగాణలో సిద్ధాంత భూమికను రూపొందించింది ఇక్కడి మైగ్రెంట్ బ్రాహ్మణ వర్గమే. ఆనాటి నుంచి విశాలాంధ్రలో అడుగు పెట్టాక ఆంధ్ర భాష ధాటికి, అధికార యంత్రాంగంలో ఉనికిలో కొచ్చిన బ్రాహ్మణీయ ఇంగ్లీషు ధాటికి ముస్లింలు పూర్తిగా ఉద్యోగాలకు దూరమయ్యారు. ఆ తరువాత తెలంగాణ రెడ్లు, వెలమలు, బ్రాహ్మణులతో జతై ఈ ప్రాంతపు ముస్లింలందర్నీ రజాకార్లుగా వక్రీకరించి ముందు 'త్రికుల రాజ్యాన్ని' (బ్రాహ్మణ, రెడ్డి, వెలమ) స్థాపించారు. 1980 దశకంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ముస్లిం వ్యతిరేక శక్తుల్లో కమ్మలూ చేరారు. ఇప్పుడది 'చార్ కుల' చట్రంగా మారింది. 

1969 ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముస్లింలు భయపడుతూ పాల్గొన్నారు. ఎందుకు? అప్పటికే హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ వంటి అత్యధిక ముస్లింలున్న ప్రాంతాల్లో ముస్లింలు భయ భ్రాంతులకు గురిచెయ్యబడుతున్నారు. వారి 'గెట్టోఅయిజేషన్' అప్పటికే పూర్తయింది. ఈ క్రమంలోనే 1950వ దశకంలో వారి రక్షణార్థం ఎంఐఎం పుట్టింది. ఈ ఎంఐఎం చాలా కాలంగా ప్రత్యేక తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూనే ఉంది. 

వెలమల నాయకత్వంలో 2000 దశకంలో టిఆర్‌యస్ పుట్టింది. ఇది మహారాష్ట్రలోని శివసేన సిద్ధాంతాన్ని తెలంగాణలో అమలు చెయ్య తలపెట్టింది. ఆర్‌యస్‌యస్ ప్రారంభించిన సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని పెద్దఎత్తున జరుప నారంభించింది. ఈ పాటికే తెలంగాణలో ఎన్నో మత కల్లోలాలను, దాడులను ఇక్కడి ముస్లింలు చవి చూశారు. ప్రత్యేక రాష్ట్రమేర్పడితే కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌ల నుంచి బిజెపిని తెలంగాణ కంతా వ్యాపింపజేసి టిఆర్‌యస్‌ను లొంగదీసుకోవచ్చు అనే సిద్ధాంతంతో ఆర్‌యస్‌యస్ తెలంగాణ మొత్తంగా పనిచెయ్యడం ఆరంభించింది. ఈ దశలో ఏర్పడిన రాజకీయ జెఎసిలో బిజెపి చేరి తన వ్యాప్తి సిద్ధాంతాన్ని అమలుచెయ్య మొదలుపెట్టింది. 

బిజెపి (చాపకింద ఆర్‌యస్‌యస్) జెఎసిలో చేరి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో తన క్యాడర్‌ను వ్యాపింపజేసింది. ఎవరెట్ల చచ్చినా తెలంగాణ వస్తే చాలు అనుకునే అగ్రకుల మేధావులు, కొంత మంది బిజెపిలో పనిచేసే బిసి ఉద్యోగులు పొద్దుందనుక టిఆర్‌యస్ ఆఫీసులో, తెల్లందనుక బిజెపి ఆఫీసులో మంతనాలు జరుపడం, ఆర్‌యస్‌యస్ మంత్రాలు నేర్చుకోవడం మొదలుపెట్టారు. దీని ఫలితంగా తెలంగాణ నరేంద్ర మోడీగా ఎదగాలని ఆశపడుతున్న కిషన్‌రెడ్డి తెలంగాణ యాత్ర చేశాడు. దానికి జెఎసి కొబ్బరికాయకొట్టి, జెండా ఊపింది (దురదృష్టవశాత్తు ఆ జెండా ఊపే కార్యక్రమంలో కృష్ణ మాదిగ కూడా పాల్గొన్నారు). 

ఆర్‌యస్‌యస్, బిజెపిల శక్తి మహబూబ్‌నగర్ ఎన్నికల్లో కమలమై పూసింది. ఐతే అక్కడ టిఆర్‌యస్ ఒక ముస్లింను పెట్టింది కూడ గెలిపించడానికి కాదు. అక్కడ అధికంగా ఉన్న ముస్లిం ఓట్లను చీల్చి కాంగ్రెస్‌కు పడకుండా చూసి, బిజెపిని గెలిపించడానికి. 'తెలంగాణ వాదాన్ని గెలిపించండి' అని జెఎసి వారు చెప్పినా టిఆర్‌యస్ వారు చెప్పినా అది బిజెపిని గెలిపించే ఒప్పందంలో భాగమే. దాదాపు ఇప్పటినుంచి 2014 ఎన్నికల వరకు టిఆర్‌యస్‌కు, జెఎసికి కావలసిన ఆర్థిక బలాన్ని, అంగ బలాన్ని ఆర్‌యస్‌యస్ సమకూరుస్తుంది. తెలంగాణ ఉద్యమంలో సంపాదించుకోవడానికి అలవాటుపడ్డ వీరు బిజెపి శక్తుల నుంచి డబ్బులు తీసుకోరని నమ్మడానికి వీలులేదు. రానున్న రెండు సంవత్సరాలు జెఎసి చుట్టున్న వీరంతా బిజెపిని తెలంగాణ రెడ్డి రాజకీయ శక్తిగా ఎదిగించే అవకాశముంది. టిఆర్‌యస్ వెలమల పార్టీ అయితే బిజెపి ఇక్కడ రెడ్ల పార్టీ కావాలనేది జెఎసి ఆలోచన కూడ. 

కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తేనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమనే నినాదం ఇక ముందు బలపడుతుంది. జెఎసి చుట్టూ ఉన్న రెడ్లు, బ్రాహ్మలు, కొంత మంది బిసిలు కిషన్ రెడ్డి చుట్టూ ర్యాలీ అవుతారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఎట్లాగు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదు కనుక (ములాయంసింగ్ యాదవ్ అధికారంలోకి వచ్చాక ఆ అవకాశం పూర్తిగా పోయింది) బిజెపిని కేంద్రంలో అధికారంలోకి తేవడం ఏకైక రాజకీయ కార్యక్రమంగా ఈ శక్తులు పనిచేస్తాయి. తెలంగాణ మత్తు మందు బాగా ఎక్కిన మావోయిస్టు అగ్రకుల శక్తులు కూడ ఈ కూటమికి మద్దతు ఇవ్వడానికి వెనుకంజ వెయ్యరు. తెలంగాణ ఉద్యమ క్రమంలో సాధారణ బిసిలు, ఎస్‌సిలు బాగా నష్టపొయ్యారని ఇంతకు ముందే ఒక వ్యాసంలో చెప్పుకున్నాం. 

ఇప్పుడు ముస్లింలకు ఏం జరుగుతుందో కొంత లోతుగా చూడాలి. నమస్తే తెలంగాణ బ్రాహ్మణ నేతృత్వంలో నడుస్తున్నందు వల్ల అది క్రమంగా బిజెపి కంట్రోల్‌లోకి పోయే అవకాశం లేకపోలేదు. ఈ పత్రిక చుట్టూ పనిచేస్తున్న 'మార్క్సిస్టు మేధావులను' బిజెపి విస్తృతికి బాగా వాడుకుంటారు. వారు ప్రతి నిత్యం కాంగ్రెస్‌ను, టిడిపిని తిడుతూ బిజెపి, టిఆర్‌యస్‌లను పొగిడే పనిచెయ్యక తప్పదు. తెలంగాణ కోసం వారు కూడా ఏ విషమైనా మింగడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదొక విచిత్ర విప్లవ వాదమైంది. 

ఈ అందరూ కలిసి మహబూబ్‌నగర్‌లో బిజెపి జెండా ఎగురవేశారు. ఈ ప్రాంతపు ముస్లింలకు ఒక హెచ్చరిక చేశారు. పార్టీ ఏదైనా కాని, తెలంగాణలో వెలమ, రెడ్లు గెలువడం ప్రధానం. ముస్లింలు వారు చెప్పినట్టు వినకపోతే వారి చేతిలో ఉన్న పత్రిక, టివి ద్వారా వారిని తెలంగాణ ద్రోహులుగా ముద్రిస్తారు. అవసరమైతే వారిపై ఆర్‌యస్‌యస్ తెలంగాణ వీరుల ముసుగులో దాడులు చేస్తుంది. 

టిఆర్‌యస్, జెఎసి, ఆర్‌యస్ యస్‌నే సపోర్టు చేస్తాయి. ఒకసారి ప్రాంతీయ సెంటిమెంటు రెచ్చగొట్టి ఫాసిస్టు పార్టీని ప్రజాస్వామ్య పార్టీగా ముందుకు తెచ్చాక ఫాసిజానికి తెలుసు ఎవరిని ఎట్లా హాండిల్ చెయ్యాలో! ఇప్పుడు తెలంగాణ ముస్లింలు, మొత్తం తెలంగాణ ప్రాంతం ఒక ప్రమాదకర పరిస్థితిలోకి నెట్ట బడ్డది. ఎంత మందిని చంపైనా, ఏ పార్టీని అధికారంలోకి తెచ్చినా తెలంగాణ సాధించాలనే 'తెలంగాణ భ్రమ' మేధావి వర్గం, రాజకీయ నాయకులు ఇక్కడ చాలా మందే తయారయ్యారు. ఈ తెలంగాణ మత్తు వారికి డబ్బును ఆస్తుల్ని కూడా సంపాదిస్తుంది. 

ముస్లింలపై దాడులు చేస్తే తెలంగాణ వస్తుందంటే అందుకు వీరంతా సిద్ధమయ్యే వాతావరణం కనిపిస్తుంది. అది నిజం కాకపోతే- గుజరాత్‌లో ముస్లింల ఊచకోత, ఒరిస్సాలో క్రిస్టియన్ల ఊచకోత, బాబ్రీ మజీద్ కూలదోత చాలా సులభంగా చేసి దేశంలో ఎన్నో అరాచకాలను సృష్టించిన ఆ పార్టీని జెఎసిలో చేర్చుకొని తామూ బొట్లు పెట్టుకొని జెఎసి పేరుతో పాత మార్క్సిస్టులంతా దానికి ప్రచారం ఎందుకు చేస్తున్నారు? రెడ్లకు, వెలమలకు, బ్రాహ్మణులకు మార్క్సిజం ఒక మాయావాదం. తెలంగాణ ప్రపంచకార్మిక విముక్తి సిద్ధాంత ఆచరణ అంశం. ముస్లింల పట్ల, కిందికులాల పట్ల ఈ గుంపుకు ఎప్పుడూ ప్రేమ లేదు. ఎంఐఎం ఇదే భయాన్ని పదేపదే చెబుతూ వచ్చింది. కాని గ్రామీణ ప్రాంతంలోని ముస్లింలు, తెలంగాణ వ్యతిరేక ముద్రకు, దాడులకు భయపడి టిఆర్‌యస్ చుట్టూ చేరారు. మొన్నటి ఎన్నికల్లో టిఆర్‌యస్, జెఎసిలు తమనెంత మోసం చేశాయో తెలిసింది. ఇలానే జరుగుతుందని అసదొద్దీన్ ఓవైసీ చెబుతూనే ఉన్నాడు. 

వచ్చే ఎన్నికల నాటికి బిజెపి తన జాతీయ స్థాయి శక్తిని, డబ్బును తెలగాణ మీదే కేంద్రీకరిస్తుంది. టిఆర్‌యస్‌తో పొత్తుతోనో లేక స్వతంత్రంగానో తెలంగాణ అంతా పోటీ చేస్తుంది. జెఎసి తెల్లందాక బిజెపితో పొద్దుందాక టిఆర్‌యస్‌తో పనిచేస్తుంది. రానున్న రెండేండ్లలో తెలంగాణ ఒక రణ రంగంగా మారుతుంది. బిజెపి చాలా ప్రమాదకరమైన పార్టీ. దాని నినాదం జ్ఞానం, శీలం, ఏకత. దీని ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సైతం కంప్యూటరైజ్‌డ్ కామక్రీడలు చూస్తుంటారు. కర్ణాటకలో, గుజరాత్‌లో ఏమి జరిగిందో అందరికీ తెలుసు. మాజీ విప్లవకారులంతా తెలంగాణ పేరుతో బిజెపి, శివసేన సంస్కృతిలో స్నానం చేస్తే సర్వం సమకూరుతాయని చూస్తున్నారు. 

సాంస్కృతికంగా అందరూ హిందూ వాదులైనందు వల్ల సెక్యులరిజం గీతను ఎటు జరిపినా ఫరావాలేదు. ప్రాంతీయ ఉన్మాదంతో పైసలు, మైనార్టీ వ్యతిరేక ఉన్మాదంతో పవర్ వస్తాయి. తెలంగాణ రాకపోయినా అనుకున్నది జరిగింది. బిసిలు, ఎస్సీలు, ఎస్టీలు గంపెడు మంది చచ్చారు. ఇక చావ వలసింది మైనార్టీలు, ముఖ్యంగా ముస్లింలు. జై తెలంగాణ, జై మార్క్స్, జై మను. ఇప్పుడు తెలంగాణ నినాదం సర్వమానవ చావు నినాదం. ఆ అంతిమ లక్ష్యం బిజెపి మాత్రమే నెరవేర్చగలదు. ఇక రెడ్ల నేతృత్వంలోని జెఎసిలన్నీ దాని చుట్టే తిరుగుతాయి. 

2014లోపే ఆ అంతిమ లక్ష్యాన్ని చేరుతారు. ముస్లింలది మాత్రం అగమ్యగోచర పరిస్థితి. వాళ్లు టిఆర్‌యస్, బిజెపి, వాటి అనుబంధ రాజకీయ జెఎసిలో చేరి పనిచెయ్యకపోతే వాళ్లను 'తెలంగాణ వ్యతిరేకులనే' ముద్ర వేసి వేధిస్తారు. అందులోచేరి పనిచేస్తే మహబూబ్‌నగర్‌లో వారికి పట్టిన గతే పట్టిస్తారు. వారిపై దాడులు చేస్తే ఈ రెండు పార్టీలు ఈ ప్రాంతంలో పూర్తి స్థానాలు గెలుస్తాయనుకుంటే ఆ పని చేస్తారు. ముస్లింలకిప్పుడు ఒక్క అల్లానే దిక్కు. 

- కంచ ఐలయ్య
వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త, సుప్రసిద్ధ రచయిత

Andhra Jyothi News Paper Dated : 29/03/2012 

Wednesday, March 28, 2012

పాఠాలు నేర్వని పార్టీలు! - తెలకపల్లి రవి



చరిత్ర బుద్ధిమంతులకు మార్గం చూపిస్తుంది, బుద్ధి హీనులను ఈడ్చుకుపోతుంది అన్నది సుపరిచితమైన నానుడి. మన రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఈ పరమ సత్యాన్ని పదే పదే నిరూపిస్తుంటాయి. విజయం వరించినప్పుడూ పరాజయం పరాభవించినప్పుడూ కూడా పరి పరి విధాల విన్యాసాలలో మునిగిపోయి ప్రజలను నిరుత్సాహ పరుస్తుంటాయి. మొన్నటి ఉప ఎన్నికలలో విజయం సాధించిన టిఆర్ఎస్ నుంచి దారుణంగా దెబ్బతిన్న కాంగ్రెస్ తెలుగుదేశంల వరకు ప్రజల తీర్పును సరిగ్గా స్వీకరించారా అర్థం చేసుకున్నారా అని సందేహం కలుగుతుంది. 

వరంగల్‌లో భోజ్యా నాయక్ ఆత్మహత్య అనంతర పరిణామాలు, శాసనసభలో ప్రతిష్ఠంభన పునరావృతులూ చూస్తుంటే మన నేతల రీతులు అంత సులభంగా మారేవి కావని స్పష్టమవుతుంది. తాము గతం కన్నా మెరుగు పడ్డామని తెలుగుదేశం చెప్పడం, వారికన్నా మేము మెరుగ్గా వున్నామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం. 

తెలంగాణ ప్రాంతంలోని ఆరు స్థానాలు, నెల్లూరు జిల్లా కోవూరు ఎక్కడా ప్రభుత్వ పక్షమైన కాంగ్రెస్ గాని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం గాని గెలవలేకపోయాయి. తెలుగుదేశం తెలంగాణలో మూడు చోట్ల డిపాజిట్ కోల్పోతే కాంగ్రెస్ కొన్ని చోట్ల మూడవ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ రెండు పార్టీల శాసనసభ్యులను చేర్చుకుని ఈ ఉప ఎన్నికలకు కారణమైన టిఆర్ఎస్ నాలుగు చోట్ల విజయం సాధిం చి మహబూబ్‌నగర్‌లో మాత్రం బిజెపి చేతిలో ఓడిపోయింది. 

నాగర్‌కర్నూలులో తెలుగుదేశం మాజీ నాయకుడు నాగం జనార్థనరెడ్డి తెలంగా ణ నగారా తరపున స్వతంత్రుడుగా ఎన్నికైనాడు. కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఈ సారి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఉప ఎన్నికల ఫలితాలు వూహించనివి కాదు గాని వాటి ప్రకంపనాలు మాత్రం వూహించిన దానికంటే తీవ్రంగా వున్నాయి. రాష్ట్ర రాజకీయాలలో కొత్త సమీకరణాలకు పరిణామాలకు సూచికలని చెప్పాలి. 

ఉద్యమాలలోనూ విమర్శలు వివాదాలలోనూ టిఆర్ఎస్ ముందున్నా రాజకీయంగా తెలంగాణలో కాంగ్రెస్ తెలుగుదేశంల తర్వాతి స్థానమే అన్నది నిన్నటి మాట. కేంద్రం అనిశ్చిత వైఖరిని ఉపయోగించుకుంటూ తెలుగుదేశం అస్పష్టతను ఎండగడుతూ ఆ పార్టీ క్రమేణా ప్రథమ లేదా ప్రధాన శక్తిగా ముందుకొస్తున్నదని ఉప ఎన్నికలు నిర్ద్వందంగా తేల్చేశాయి. అభిప్రాయానికి ప్రస్తుత ఫలితాలు ఆస్కారమిస్తున్నాయి. భవిష్యత్తులో తమ స్థానాలను కాపాడుకోవాలనుకుంటే మరింత మందికి ఆకర్షణీయమైన గమ్యంగా ఆ పార్టీ తయారైంది. 

ఆకర్ష ప్రక్రియలతో వలసలకు కేంద్ర బిందువు కానుంది. విజయం సాధించినప్పటికీ తెలంగాణ ఎన్నికల క్షేత్రంలో టిఆర్ఎస్ వూపు కొంత తగ్గిందనే భావన కూడా ఎంతో కొంత నిజం. గెలిచిన అభ్యర్థుల ఆధిక్యతలు తగ్గడం, తెలుగుదేశం రెండు చోట్ల డిపాజిట్టు తెచ్చుకోవడం, మహబూబ్‌నగర్‌లో టిఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోవడం ఇందుకు నిదర్శనాలు. రాష్ట్రం సమైక్యంగా వుండాలని చెప్పే సిపిఎం మూడు చోట్ల పోటీ చేసి ఇదివరికటి పరిమితమైన స్వంత ఓట్లను నిలబెట్టుకోగలిగింది. తెలంగాణ సమస్యపై ఇంతగా దోబూచులాడి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన కాంగ్రెస్ ఎక్కువ చోట్ల ద్వితీయ స్థానంలో వచ్చింది. టిఆర్ఎస్ రాజకీయ విజయాన్ని గుర్తిస్తూనే ఈ భాగాన్ని కూడా పేర్కొంటే వారికి ఆగ్రహం వస్తున్నది. 

సిపిఎం తప్ప మిగిలిన వారికి వచ్చిన ఓట్లన్నీ తెలంగాణ వాదానికి వచ్చినట్టే భావించాలని వాదిస్తున్నారు. మీరు ద్రోహులంటే మీరు దొంగలని ఆరోపించుకున్న పార్టీల నేతలకు వచ్చిన ఓట్లన్నీ ఒకే తరహాలో చూడమంటే కుదిరేపని కాదు. అసంబద్దమే. తెలంగాణ వాదం పేరిట జరుగుతున్న రాజకీయంలో టిఆర్ఎస్ ప్రథమ స్థానంకాగా కాంగ్రెస్ ద్వితీయ స్థానంలో వుంది. ఇంకా ఏం తేల్చుకోలేని సందిగ్ధ తెలుగుదేశం విశ్వసనీయత మరీ కష్టం. ఉప ఎన్నికల ఫలితాల సారాంశం ఇదే. 

ఇక బిజెపి మతతత్వ రాజకీయాలకు ప్రాంతీయ వాదాన్ని సామాజిక సమీకరణలను తోడు చేసుకుని విజయం సాధించింది. తన ఏలుబడిలోని కర్ణాటక గుజరాత్‌లలోనే ఉప ఎన్నికలలో దెబ్బతిన్న పార్టీ ఇక్కడ విజయం సాధించడం ఆశ్చర్యకరమే. ఇది ఆందోళనకరమని బి.వి.రాఘవులు నేరుగానే వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జెఎసి వేదికలో సాగిన అంతర్మధనం, వచ్చిన భిన్నాభిప్రాయాలు కూడా విస్మరించరానివి. 2009 ఎన్నికలు ముగిసి ఫలితాలు రాకముందే కెసిఆర్ మహాకూటమిని వదలి ఎన్‌డిఎ వైపు పరుగులు తీశారు. తర్వాత కాలంలో పార్లమెంటులో కూడా బిజెపి మద్దతు తీసుకున్నారు. కాని తర్వాత వారికి మద్దతు దక్కలేదు. అద్వానీ రథయాత్ర గులాబీ దళాన్ని ఆకర్షించలేదు. 

ఇంకా పలు సందర్భాల్లో ఉభయుల మధ్య పొరపొచ్చాలు కనిపిస్తూనే వున్నాయి. కెసిఆర్ తెలంగాణ జనాభా పొందిక రీత్యా మైనారిటీల ఓట్లకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ తమను దూరం వుంచుతున్నారనే ఆగ్రహం బిజెపిది. మైనారిటీ ఓట్లకు ముప్పు తెచ్చుకోకుండా చూసుకోవడంతో పాటు జాతీయ ముద్ర వల్ల ఆ పార్టీ స్థానాలు ఎగరేసుకుపోకుండా చూడాలనే జాగ్రత్త కెసిఆర్‌ది. ఏమైనా ప్రాంతీయ తత్వం మతతత్వం కూడా కలగలపి రాజకీయం చేయడం ఎలా సాధ్యమో అర్థమవుతుంది. ఈ ఫలితం అన్నిచోట్లా పునరావృతం అవుతుందనే ఆశల్లో బిజెపి నేతల ఆశకు ఆధారాలు తక్కువే. మరోవైపు కాంగ్రెస్ తెలంగాణ నాయకులు కూడా తమ స్వంత వేదికను ఏర్పాటు చేసుకుని స్థానం నిలబెట్టుకోవాలని ప్రయత్నాలు సాగిస్తూ తీవ్ర పరిభాషలో మాట్లాడుతున్నారు. టిఆర్ఎస్ తమకు చేరువ కావాలని కూడా ఆహ్వానిస్తున్నారు. 

కోవూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం 17 స్థానాల పోరాటంలో వారికి ఉత్సాహమివ్వొచ్చు గాని తేడాలు చాలా వుంటాయి. కోవూరులో కూడా వారు ఆశించిన ప్రకటించిన ఆధిక్యత రాలేదు. అయితే తెలుగుదేశం తన నుంచి ఫిరాయించిన నాయకుడి స్థానాన్ని తిరిగి రాబట్టుకోలేకపోవడం వారి ఆత్మ స్థయిరాన్ని దెబ్బతీసే అంశమే. ఈ ఫలితాలకు కొంచెం ముందుగా జరిగిన రాజ్యసభ ఎన్నికల వ్యవహారం కూడా తెలుగుదేశంలో అసంతృప్తికి ఆజ్యం పోస్తున్నది. ఇప్పటికే అనిశ్చితి అంచులలో నెట్టుకొస్తున్న కాంగ్రెస్‌నూ, కిరణ్ ప్రభుత్వాన్ని ఉప ఫలితాలు కుదిపేస్తున్నాయి. 

మంత్రి రవీంద్రారెడ్డి రాజీనామా లేఖ పంపితే ఉప ముఖ్యమంత్రి రాజ నరసింహతో సహా పలువురు ముఖ్యమంత్రి తప్పుకోవాలని చెప్పేశారు. తెలంగాణ ఎంపీల సవాలు మరీ తీవ్రంగా వుంది. కోస్తా జిల్లాల ఎంపీలు అంతకన్నా ముందే అధిష్ఠానానికి అసమ్మతి వినిపించి వచ్చారు. మొత్తంగా కాంగ్రెస్ కలహాల నిలయంగా వుంది. ముఖ్యమంత్రి వర్గీయులూ రంగంలోకి దూకి శాయశక్తులా సమర్థిస్తున్నా కలహాగ్ని చల్లారడం లేదు! 

ఈ నేపథ్యంలో రాష్ట్ర భవిష్యత్తు విషయంలో అనిశ్చితికి స్వస్తి చెప్పి కేంద్రం స్పష్టమైన ప్రకటన చేస్తే గాని పరిస్థితి మారదు. అందుకుబదులుగా ఈ పరిణామాన్ని తమ పదవీ రాజకీయాల కోసం వినియోగించుకునే పాకులాట కాంగ్రెస్‌లో ఎక్కువగా కనిపిస్తున్నది. ఈ మధ్యలో అవినీతి కేసులలో కోర్టుల నోటీసులు... మాజీ మంత్రి శంకర్‌రావు ముఖ్యమంత్రి, మరికొందరిపై ఎర్రచందనం అవినీతి కేసు వేశారు. వైఎస్ వివేకానందరెడ్డి ఆవేదనా స్వరాలు తీవ్రం చేశారు. అవినీతిని ఎదుర్కొనే విషయంలోనూ చర్యలు లేవు. 

మరోవైపు తాను అధికారంలోకొస్తే అవినీతిని నిర్మూలిస్తానని జగన్ చేసిన ప్రకటన హాస్యాస్పదంగానే కనిపిస్తుంది. ఆయనపై దర్యాప్తు నెమ్మదించిందన్న కథనాలకు తగినట్టే కొత్త చర్యలు వేగంగా జరగడం లేదు. రేణుకా చౌదరి తప్ప కాంగ్రెస్ నేతలెవరూ ఆయన అరెస్టును గురించి చెప్పడం లేదు. పైగా కాంగ్రెస్, టిడిపి నేతలు పలువురు తాము జగన్ పార్టీ వైపు చూడటం లేదని వివరణలిచ్చుకోవలసిన స్థితి. నిజానికి ఆ రెండు పార్టీల ముఖ్యుల బంధువులు, సన్నిహితులు చాలా మంది జగన్‌తో వుంటున్నారు. ఈ దఫా ఉప ఎన్నికలలో పరకాల కూడా వుంటుంది గనక టిఆర్ఎస్ ఎలా వ్యవహరిస్తుందనేది వెల్లడవుతుంది. ఏది ఎలా వున్నా ప్రభుత్వంలోనూ రాజకీయాలలోనూ పెను మార్పులు వస్తాయనే ఆయా పార్టీల నాయకులు నమ్ముతున్నారు. 

ఏ రాజకీయ పార్టీలైనా సమగ్ర దృష్టితో విశాల ప్రజా ప్రయోజనాల కోసం నిలబడాలే తప్ప తాత్కాలిక మనుగడ కోసం అవకాశవాదానికి అభద్రతా వ్యూహాలకు పాల్పడటం మంచిది కాదు. కాని శాసనసభలోనూ బయిటా పరిణామాలు చూస్తే ఆవిధమైన ఆశావిశ్వాసాలు కలక్కపోగా ఆందోళనే పెరుగుతుంది. ప్రాంతీయ ఉద్వేగాలను పెంచడం, జగన్ వందిమాగధ స్తోత్రాలు తీవ్రం చేయడం ప్రజల ఆకాంక్షకు విరోధాభాస అనిపిస్తుంది. బహుశా ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌పై సమష్ఠి ఆందోళన వంటివి ఈ సమయంలో పార్టీలను పట్టాలెక్కించడానికి ప్రజా సమస్యలపై పోరాటానికి మార్గదర్శకమవుతాయి. 

- తెలకపల్లి రవి
Andhra Jyothi News Paper Dated : 29/03/2012 

Tuesday, March 27, 2012

మౌలిక హక్కుల కోసం గళమెత్తిన గిరిజన సదస్సు---మిడియం బాబూరావు


మౌలిక హక్కుల కోసం గళమెత్తిన గిరిజన సదస్సు

అరకొర నిబంధనల ప్రకారం అయినా ఆదివాసీలకు జనాభాలో దామాషాను బట్టి ప్రణాళికా మొత్తంలో కనీసం 8.2 శాతం కేటాయించాల్సి ఉంది. ఈ నిబంధనలను కూడా ప్రభుత్వం తరచూ అతిక్రమిస్తున్నది. ఈ బడ్జెట్‌ (2012-13)లో వీరికి కేటాయించింది 5శాతం మాత్రమే. అంటే రు.11వేల కోట్ల మేర కోతపడింది. 2010 నుంచి ఇంతవరకు రు. 26వేల కోట్ల మేర కోత పెట్టారు. పేదలు హుందాగా జీవించేందుకు అవసరమైన కనీస ప్రమాణాలను కల్పించ నిరాకరిస్తున్నారు. ఆదివాసీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వారికి కరెంటు ఉండదు, నీళ్లుండవు, దవాఖానా ఉండదు, బడి ఉండదు ఇలా అన్నీ సమస్యలే. ఏ సామాజిక గ్రూపు కన్నా పౌష్టికాహార లోపం ఆదివాసీల్లోనే అత్యధికం. అయినా, తెల్ల రేషన్‌ కార్డులు (బిపిఎల్‌ కార్డులు) లేని ఆదివాసీ కుటుంబాలు నేడు 61శాతం దాకా ఉన్నాయి. అంటే వీరిని మార్కెట్‌ శక్తుల దయాదాక్షిణ్యాలకు వదిలి పెట్టేశారు. మార్కెట్‌లో చుక్కలనంటుతున్న ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర సరుకుల ధరలు వీరి జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి.
బడ్జెట్‌లో సాధారణ విద్యకు కేటాయింపులు పెరిగినా, మారుమూల ప్రాంతాల్లోని ఆదివాసీ విద్యార్థులకు అత్యంతావశ్యకమైన రెసిడెన్షియల్‌ స్కాలర్‌షిప్పులు, స్కూళ్ల సంఖ్యను కుదించారు. చాలీ చాలని స్కాలర్‌షిప్పులు. హాస్టళ్ల పరిస్థితి మరీ ఘోరం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆదివాసీ విద్యార్థుల అవకాశాలను దారుణంగా దెబ్బతీస్తున్నారు. ఇదీ ప్రాథమిక స్థాయిలో వున్న వాస్తవిక పరిస్థితి.
వ్యవసాయ సంక్షోభంతో ఆదివాసీలు బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలసవెళ్లక తప్పని పరిస్థితిని సృష్టిస్తున్నది. వలస కూలీలకు ఎలాంటి హక్కులుండవు, ఇలా వలసవెళుతున్న ఆదివాసీల్లో ఎక్కువ భాగం నిర్మాణ లేదా గనుల రంగంలో క్యాజువల్‌, కాంట్రాక్టు కూలీలుగా, ఇంటి పనివారలుగా బతుకు వెళ్లతీస్తున్నారు. వీరికి ఎలాంటి కార్మిక రక్షణ చట్టాలు వర్తించవు. అదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాల్లో ఎస్టీ బ్యాక్‌లాగ్‌ ఖాళీలు పెద్దయెత్తున పేరుకుపోయాయి. ఆదివాసీలకు రాజ్యాంగం నిర్దేశించిన రిజర్వేషన్ల కోటాను కచ్చితంగా అమలు చేసేలా చూసేందుక ఎలాంటి చట్టపరమైన ఏర్పాటు లేదు. గిరిజనేతరులు అక్రమ పద్ధతుల్లో గిరిజనులుగా గుర్తింపు పొందుతున్నారు. బ్యూరోక్రటిక్‌, ఏకపక్షంగా వీరికి గుర్తింపు ఇస్తూ, అసలు గిరిజనులకు ఎస్టీ సర్టిఫికెట్‌ ఇవ్వ నిరాకరిస్తున్న దాఖలాలు అనేకం. చాలా తెగలను గిరిజనులుగా గుర్తించడానికి మొండిగా నిరాకరిస్తున్నారు.
ఈ నెల 21న న్యూఢిల్లీలోని మౌలంకర్‌ హాల్‌ కిక్కిరిసిపోయింది. 14 రాష్ట్రాల నుంచి వచ్చిన 1500 మంది గిరిజన ప్రతినిధులు భూమి కోసం, భుక్తి కోసం, వివక్షత అంతం కోసం తుదికంటా పోరాడాలని పిలుపునిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ నిర్వహించిన ఈ అఖిలభారత సంఘర్ష్‌ సభను ఆదివాసీ మంచ్‌ ఛైర్మన్‌ బజుబన్‌ రియాన్‌ (ఎం.పి) ప్రారంభించారు. ఈ సదస్సుకు అధ్యక్షవర్గంగా బజుబాన్‌ రియాన్‌(ఎంపి Ê చైర్మన్‌ ఎ.ఎ.ఆర్‌.ఎం), ఎస్‌.ఆర్‌ పిళ్ళై( అధ్యక్షులు, అఖిల భారత కిసాన్‌ సభ), డా|| ఎం. బాబురావు (జాయింట్‌ కన్వీనర్‌, మాజీ ఎంపి), ఉపేన్‌కిస్కు (జాయింట్‌ కన్వీనర్‌ ఎం.ఎల్‌.ఎ), రాజేంద్రసింగ్‌ ముండా(మాజీ ఎం.ఎల్‌.ఎ), ప్రేమాబారు(బి.డి.సి. సభ్యులు) 2002లో రాంచీలో జరిగిన సదస్సుతో మొదలైన అఖిల భారత గిరిజనోద్యమం ఈ దశాబ్ద కాలంగా వివిధ రాష్ట్రాల్లో పోరాటాల విస్తరణకు తోడ్పడింది.
ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌, సిఐటియు నాయకులు డా|| హేమలత, విద్యార్థి నాయకులు శివదాసన్‌, విజరుకృష్ణన్‌, కిసాన్‌ సభ నాయకులు, తపన్‌కుమార్‌ సేన్‌, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.
సదస్సులో నాలుగు అంశాలతో కూడిన ఒక ప్రత్యేక తీర్మానాన్ని బృందాకరత్‌ ప్రవేశపెట్టగా ఉపేన్‌ కిస్కు బలపరిచారు.
ఆ తరువాత ఒక ప్రతినిధి బృందం గిరిజన సంక్షేమశాఖ మంత్రిని కలిసి ఆయనకు ఈ తీర్మాన ప్రతిని అందజేసింది. అందులో 1.భూసేకరణ, పరిహారం, పునరావాస బిల్లు - 2011 లో గిరిజన ప్రాంతాలకు సంబంధించి తీసుకురావాల్సిన మార్పులు., 2. అటవీ హక్కుల చట్టం పటిష్ఠ అమలు.,3. గిరిజనుల పట్ల కేంద్ర ప్రభుత్వ వివక్ష: (ఎ) ముఖ్యంగా గిరిజన ఉప ప్రణాళిక కేటాయింపులు, (బి) తెల్లకారులు ఇవ్వ నిరాకరించడం, ఉన్నవాటిని రద్దుచేయడం. (సిి) గిరిజన విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు పెంచకపోవడం, (డి) గిరిజన విద్య, ఆరోగ్యానికి కేటాయింపులు తగ్గించడం.,4.మైనింగ్‌,అటవీ ఉత్పత్తులకు సంబంధించిన విధాన ప్రకటన వంటి అంశాల గురించి ప్రధానంగా ప్రస్తావించారు.
ఈ తీర్మానంపై జరిగిన చర్చల్లో జాయింట్‌ కన్వీనరు, మాజీ ఎంపి డాక్టర్‌ మిడియం బాబూరావుతో సహా 18 మంది చర్చలో పాల్గొన్నారు. గిరిజనుల పట్ల కొనసాగుతున్న తీవ్ర వివక్షత, రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనలు, తమ జీవనోపాధిపై జరుగుతున్న దాడులను వివరిస్తూ, వీటిని ప్రతిఘటించాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు. తొలుత చర్చను ప్రారంబించిన ప్రేం పర్గీ (రాజస్థాన్‌) ఆహారభద్రత, గిరిజనులకు తెల్లరేషన్‌కార్డులు, ఉచిత బియ్యం సరఫరా లోపభూయిష్టంగా వుందని, గిరిజనులకు పోషకాహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తమిళనాడు నుండి మాట్లాడిన ఢిల్లీబాబు (ఎం.ఎల్‌.ఎ) మాట్లాడుతూ తమిళనాడులోనూ కేరళ, ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మహరాష్ట్ర, గుజరాత్‌లలో అనేక గిరిజన తెగలవారు గిరిజన జాబితాలో చేర్చబడలేదని, ముఖ్యంగా తమిళనాడులో రీ షెడ్యూలింగ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.
సుక్రంజన్‌ యుసేంధీ (చత్తీస్‌గఢ్‌) మాట్లాడుతూ పోలీసు అటవీ సిబ్బంది గిరిజనులను అడవుల్లో సంచరించకుండా నిరోధిస్తున్నారని, పోలీసులు ఒకవైపు, మావోయిష్టులు మరో వైపు గిరిజనులకు నిద్రలేకుండా చేస్తున్నారని, కేసులు పెట్టి విచారణ లేకుండా నిర్భంధిస్తున్నారని, పోలీసుల వేధింపులు ఆపాలని, కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.
హేమంత్‌ (రాజస్థాన్‌) గిరిజన విద్యార్థుల సమస్యలను వివరించారు. డా. పులెన్‌ బస్కీ (ఎంపి, పశ్చిమబెంగాల్‌) మాట్లాడుతూ మావోయిస్టుల అరాచకాలు, కార్యకర్తలపై దాడులను ఖండించారు. గిరిజనుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. బెంగాల్‌ గిరిజనోద్యమాన్ని కాపాడడానికి ఇతర రాష్ట్రాలు సహకరించాలని కోరారు.
పూర్ణోబోరో (అస్సాం) మాట్లాడుతూ దేశంలో గిరిజన ఆరోగ్యం గురించి పసిపిల్లల, గర్భిణీల మరణాల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య వసతులు మెరుగుపరచాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. వి. తిరుపతిరావు (ఆంధ్రప్రదేశ్‌) మాట్లాడుతూ సంవత్సరాల తరబడి వివిధ రాష్ట్రాల్లో గిరిజనులకు కేటాయించిన వివిధ శ్రేణుల ఉద్యోగాలు ఖాళీగా వున్నాయని, ప్రభుత్వాలు బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయడానికి బదులు ఉన్న పోస్టులను రద్దు చేస్తున్నాయని, ప్రభుత్వ రంగ సంస్థల్లో కొన్ని విభాగాల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించడంలేదని, ప్రమోషన్ల విషయంలో గిరిజనుల పట్ల వివక్షత చూపు తున్నారని విమర్శించారు.
మంజూ ముండా (జార్ఖండ్‌) మాట్లా డుతూ నిర్మాణ రంగంలో జార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌, ఒరిస్సా రాష్ట్రాల్లో అత్య ధిక గిరిజనులు కూలీలుగా బతుకీడ్చుతున్నారని అక్కడ కనీస వేతనాలు కానీ, పని ప్రదేశంలో తీసుకోవాల్సిన భద్రతా పరికరాలు అందుబాటులో ఉండటం లేదన్నారు. తరచూ నిర్మాణ రంగ కార్మికులు మరణించడం, దహన ఖర్చులు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొందని వివరించారు. మహిళా కార్మికుల పట్ల లైంగిక వేధింపులను ఖండించారు.
ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ స్మితా గుప్తా (ఢిల్లీ) మాట్లాడుతూ గిరిజన ఉప ప్రణాళికపై తన పరిశోధనా పత్రాన్ని సదస్సులో వివరించారు. గిరిజన గ్రామాల స్థితిగతులపై సర్వే రిపోర్టును ప్రొఫెసర్‌ వికాస్‌ రావల్‌ సదస్సుకు సమర్పించారు.
గిరిజనులు తమ భూములను కోల్పోతున్నారని విద్యుత్‌, ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, కోల్‌ మైనింగ్‌ వల్ల గిరిజనులు నిర్వాసితులౌతున్నారని, న్యాయమైన చట్టబద్ధ్దమైన ఆర్‌ Ê ఆర్‌ ప్యాకేజీలు లేనందున గిరిజనులు వివిధ రాష్ట్రాల్లో తీవ్ర వివక్షతకు గురౌతున్నారని గోపెన్‌ సొరెన్‌ (జార్ఖండ్‌), చమ్రు సొరెన్‌ (ఒరిస్సా), బుద్ధ్దసేన్‌గోండ్‌ (మధ్యప్రదేశ్‌), మిడియం బాబూరావు (ఆంధ్రప్రదేశ్‌) వివరించారు.
దేశంలోనే అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయడంలో త్రిపుర ముందున్నదని, ఒక్క దరఖాస్తును కూడా తిరస్కరించకుండా గిరిజనులకు భూమి పంచిన ఘనత త్రిపుర ప్రభుత్వానిదేనని సలీల్‌ దేవ్‌ వర్మ (త్రిపుర) వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో చింతపండు, తునికాకుపై గిరిజన సంఘం చేసిన పోరాటాలను, వాటి రేటు, బోనస్‌సాధించడంలో విజయాలు సోయం శ్రీనివాస్‌ (ఆంధ్రప్రదేశ్‌)వివరించారు. అటవీ హక్కుల చట్టం కేరళలో అమలు కావడం లేదని కోర్టు వ్యాజ్యాల్లో ఉన్నందున గిరిజనులకు భూమి దక్కడం లేదని విద్యాధరణ్‌ ఖని (కేరళ) ఆరోపించారు.
గుజరాత్‌ నుండి మాట్లాడిన హన్‌స్ముక్‌ వర్లీ 50శాతానికి పైగా అటవీ భూమిపై పెట్టిన దరఖాస్తులు తిరస్కరించారని, సర్వే చేయకుండానే పట్టాలు పంపిణీ చేస్తున్నారని చెప్పారు.
చివరిలో భవిష్యత్‌ పోరాట కార్యక్రమాలకు సంబంధించి ధూళిచంద్‌ మీనా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సదస్సు ఆమోదించింది.
ఈ సదస్సును సమీక్షిస్తూ బిమన్‌ బసు ముగింపు ఉపన్యాసం చేశారు. స్వాతంత్య్రోదమంలో గిరిజన పోరాటాలకు ప్రాధాన్యత ఉన్నదని, నాడు భూమికోసం భుక్తికోసం, స్వాతంత్య్రంకోసం మనదేశంలో గిరిజన తెగలు పోరాడాయని, ఆ పోరాట స్పూర్తితో నేడు వివిధ రాష్ట్రాల్లో గిరిజనోద్యమాన్ని అఖిల భారత స్థాయిలో నిర్వహించాలని కోరారు. రాంచి నుండి ఢిల్లీ వరకు గత దశాబ్ద కాలంలో 5 రాష్ట్రాల నుండి 14 రాష్ట్రాలకు గిరిజనోద్యమం విస్తరించడం మెచ్చదగిన విజయమన్నారు. అయినా ప్రభుత్వాలు గిరిజనులను నేటికీి అడవుల నుండి, భూముల నుండి వెళ్ళగొట్టే విధానాలు చేపడుతున్నాయని, షెడ్యూల్‌ ప్రాంతాల్లోగల విలువైన ఖనిజ సంపదను కార్పోరేట్‌ సంస్థలు కొల్లగొడుతున్నాయని ఫలితంగా గిరిజనులు నిర్వాసితులవుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ఎదురించి గిరిజనోద్యమం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
తీర్మానం
దేశంలో తొమ్మిది కోట్ల దాకా వుండి, సమాజంలో అత్యంత వెనుకబడిన, అణగారిన వర్గాలు, ఈ దేశ పౌరులైన ఆదివాసీల పట్ల భారత రాజ్యం, కేంద్ర ప్రభుత్వం అనుసరిసున్న దారుణ వివక్షపై ఈ సంఘర్ష్‌్‌ సభ తన తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్నది. నయా ఉదారవాద విధానాలు వచ్చాక ఈ అన్యాయం మరింత తీవ్రతరమైంది.
ఈ సదస్సు ముందుకు తెచ్చిన డిమాండ్లు
గిరిజన ఉప ప్రణాళిక (టిఎస్‌పి) నిధులను కనీసం 8.5 శాతానికి పెంచాలి. ఆదివాసీలందరికీ ( రెగ్యులర్‌ ప్రభుత్వ సర్వీసులో ఉన్నవారు మినహా) బిపిఎల్‌ కార్డులివ్వాలి. ఆదివాసీ విద్యుర్థుల రెసిడెన్షియల్‌ స్కాలర్‌షిప్పులు, స్టయిపెండ్స్‌ను పెంచాలి. గిరిజన విద్యార్థుల హాస్టళ్లకు కేటాయింపులు పెంచాలి. ఎస్టీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ను మరిన్ని ఏర్పాటు చేయాలి. ఆదివాసీ కూలీల హక్కులకు రక్షణ కల్పించాలి. ఆదివాసీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. ఎస్టీ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ పారదర్శకంగా, కచ్చితంగా, సింపుల్‌గా వుండేలా చూడాలి.
(రచయిత గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) 
-మిడియం బాబూరావు
Prajashakti News Paper Dated : 27/03/2012