Monday, January 30, 2012

బాలలు.. హక్కులు.. చట్టాలు..


ప్రవాస భారతీయులు అనురూప్, సాగరిక భట్టాచార్యల పిల్లల కస్టడీ వ్యవహారంతో బాలల హక్కులు, చట్టాలపై మరోమారు చర్చ మొదలైంది. నార్వేలో భూవిజ్ఞాన శాస్త్రజ్ఞునిగా పని చేస్తున్న అనురూప్ దంపతులు తమ సంతానం మూడేళ్ల అభిజ్ఞాన్, ఏడాది పాప ఐశ్వర్యలపై మమతానురాగాలను చూపించడం లేదన్న కారణంగా అక్కడి బాలల సంరక్షణ చట్టాల ప్రకారం వారిపై కేసు నమోదయింది. కేసును విచారించిన కుటుంబ న్యాయస్థానం పిల్లలిద్దరినీ వారికి 1 ఏళ్లు నిండేవరకూ తల్లిదంవూడుల నుంచి విడదీసి పిల్లల సంరక్షణాలయానికి తరలించాల్సిందిగా ఆదేశించింది. భారత్‌కు తిరిగి వెళ్తున్నామని, తమ పిల్లల ను తమకు అప్పగించాలంటూ అనురూప్ దంపతులు చేసిన న్యాయపోరాటం ఫలించలేదు. చివరకు భారత విదేశాంగమంత్రి ఎస్.ఎం. కృష్ణ జోక్యంతో గత బుధవారం పిల్లలను వారి మేనమామకు అప్పగించడానికి నార్వే ప్రభుత్వం అంగీకరించినట్లు వార్తలొచ్చాయి.

ఈ ఘటనపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. పిల్లలను కన్న తల్లిదంవూడుల నుంచి విడదీయడం అమానవీయమని, ఏ చట్టం పేరు చెప్పి చేసినా బిడ్డకు తల్లి బలవంతంగా తినిపించడం నేరమెలా అవుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. నార్వే ప్రభుత్వ చర్య తరతరాల భారత సంస్కృతిని, సంప్రదాయాలను అవమానపరచే విధంగా ఉందని అరోపిస్తున్నారు. భూత ల స్వర్గంగా భావించే నార్వేలో పసిపిల్లలు మొదలు వృద్ధుల వరకు అందరి హక్కు ల పరిరక్షణకు సమగ్ర చట్టాలున్నాయని, ఆ చట్టాల ప్రకారం చర్యలు చేబట్టడాన్ని ఎలా తప్పు పట్టగలమని వాదించేవారూ లేకపోలేదు. బాలల హక్కులు, సంరక్షణ విషయంలో ఐక్యరాజ్యసమితి రూపొందించిన ఒడంబడిక (జెనీవా కాన్వెనషన్)ను పాటించే దేశాల్లో నార్వే ముందువరుసలో ఉందని వారు చెబుతున్నారు.

ఈ వాదనల్లోని ఉచితానుచితాలను బేరీజువేసే ముందు బాలల హక్కులు, చట్టాల గురించిన నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎదిగిన వారితో పోల్చితే పిల్లలు అన్ని విషయాల్లో బలహీనులని, వారి పోషణ, పెంపకం బాధ్యత పూర్తిగా తల్లిదంవూడులదేనని పురాతన సమాజం నుంచే మానవులు గుర్తించారు. వారి ఆహారాన్ని వారు సమకూర్చుకునేస్థాయికి చేరేదాకా వాళ్లు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకునేవారు. నాగరిక సమాజంలో మొట్టమొదటగా బాలల హక్కులను గుర్తించింది 150లలోనని చెప్పవచ్చు. 12 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలతో పని చేయించరాదన్న నియమాలను కొన్ని దేశాలు పాటించాయి. వారిని పాఠశాలలకు పంపేందుకు వీలుగా చర్యలు చేబట్టాయి. 1924లో నానాజాతి సమితి బాలల హక్కులపై సమావేశమై ఓ డిక్లరేషన్‌ను విడుదల చేసింది.

1956లో ఐక్యరాజ్యసమితి ఆ డిక్లరేషన్‌ను సవరించిం ది. హక్కులతో పాటు పిల్లలను అర్థం చేసుకు ని వారిపై ప్రేమ కురిపించే విషయంలో గైడ్‌లైన్స్‌ను చేర్చింది. 1979ని అంతర్జాతీయ బాలల సంవత్సరంగా ప్రకటించింది. ఇదే ఏడాదిలో డిక్లరేషన్ స్థానంలో బాలల హక్కులపై ఒక సమగ్ర పత్రాన్ని ఆమోదించాలంటూ పోలండ్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై చర్చలు జరిగి చివరకు 199 నవంబర్ 20న జెనీవాలో సమావేశమైన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ బాలల హక్కులపై ఒడంబడిక పత్రాన్ని ఆమోదించింది. ఈ పత్రంలో 1 ఏళ్ల లోపు వయసున్న వారిని బాలలుగా నిర్వచించారు. వయోజనులకు వర్తించే అన్ని హక్కులూ మరింత ఎక్కువగా పిల్లలకు వర్తిస్తాయని, ఎందుకంటే తమను తాము రక్షించుకోవడం వారికి తెలియదని ఇందులో పేర్కొన్నారు.

ఈ పత్రంపై మొదటగా సంతకం చేసిన దేశాల్లో నార్వే ఒకటి కాగా ఇప్పటి వరకు భారత్ సహా 191 దేశాలు ఒడంబడికకు కట్టుబడివున్నట్లు ప్రకటించాయి.
ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, శాంతి, సౌభ్రాతృత్వంలకు కట్టుబడివున్న దేశంగా పేరుగాంచిన నార్వే బాలల హక్కుల విషయంలో కూడా ముందు వరుస లో ఉంది. 174లోనే బాల కార్మిక వ్యవస్థను నిషేధించింది. 1900లో బాలల సంరక్షణ చట్టాన్ని ఆమోదించింది. మొదటి ప్రపంచ యుద్ధంలో బాలలను సైనికులుగా పోరాటంలోకి దించడాన్ని, వారితో పరిక్షిశమల్లో పని చేయించడాన్ని వ్యతిరేకిస్తూ 1919లో ‘సేవ్ ద చిల్డ్రన్ ఫౌండేషన్’ నార్వేలోనే ఏర్పాటైంది. నానాజాతిసమితి డిక్లరేషన్‌ను, ఆ తర్వాతికాలంలో ఐక్యరాజ్యసమితి ఒడంబడికను వెంట ఆమోదించి చిత్తశుద్ధితో అమలు చేసింది. ఈ దిశలో కీలక చట్టాలను ప్రవేశపెట్టింది. 191లో బాలల వ్యవహారాల పర్యవేక్షణకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన అంబుడ్స్‌మన్‌ను నియమించింది.

నార్వే ఆమోదించిన చట్టాల్లో బాలల చట్టం (191), బాలల సంక్షేమ చట్టం (1992), మానవ హక్కుల చట్టం (2003) ముఖ్యమైనవి. ఈ చట్టాల ప్రకారం సమాజంలో స్వేచ్ఛగా బతకడానికి వీలుగా పిల్లల భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక, నైతిక వికాసానికి తల్లిదంవూడులు తోడ్పడాలి. వారిపై ఎలాంటి వివక్ష కొనసాగకుం డా చూడాలి. శారీరక, మానసిక, లైంగిక హింసలు జరగకుండా సంరక్షించాలి. తినడం లేదని, స్కూలుకు వెళ్లడం లేదని, హోంవర్క్ చేయడం లేదని, చెప్పినట్టు వినడం లేదని, కాని పనులు చేస్తున్నారని వారిని బెదిరించడం, వేధించడం, కొట్ట డం శిక్షార్హమైన నేరం. ఈ చట్టాల కింద నమోదయిన కేసులను విచారించడానికి కౌంటీల స్థాయిలో ఏర్పాటు చేసిన కుటుంబ న్యాయస్థానాలు పిల్లల ప్రయోజనాలే లక్ష్యంగా తీర్పులను ప్రకటిస్తాయి. కాగా, పిల్లల హక్కుల ఉల్లంఘనల విషయంలో వచ్చే ఫిర్యాదులను బాలల సంక్షేమ విభాగం చూసుకుంటుంది.

ఏ ఇంట్లోనైనా తల్లిదంవూడులు తమ పిల్లలను సరిగ్గా పట్టించుకోవడం లేదని, అనారోగ్యంతో ఉన్నా డాక్టర్ వద్దకు తీసుకెళ్లడం లేదని, వారిని వేధిస్తున్నారని లేదా కొడుతున్నారని సమాచారం అందితే ఈ విభాగం నేరుగా రంగంలోకి దిగుతుంది. సంబంధిత బాలుడిని లేదా బాలికను ఆస్పవూతికో, కౌన్సెలింగ్ కేంద్రానికో పంపించి దర్యాప్తు ప్రారంభిస్తుంది. వాస్తవాలు రాబడుతుంది. తమ పొరుగిళ్లలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఏ పౌరుడైనా ఈ విభాగానికి ఫిర్యాదు చేయవచ్చు.

అనురూప్-సాగరిక దంపతుల విషయంలో ఇదే జరిగింది. మూడు సంవత్సరాల అభిజ్ఞాన్‌కు వాళ్లమ్మ తన చేతితో బలవంతంగా తినిపిస్తున్నదని బాలల సంక్షేమ విభాగానికి ఫిర్యాదు అందింది. వెంటనే వాళ్ల ఇంటిపై కొద్ది రోజుల పాటు నిఘా వేయగా భట్టాచార్య దంపతులు తమ పిల్లలను మమతానురాగాలతో పెంచ డం లేదని, వారితో మానసిక అనుబంధం కొరవడిందని, పైగా మూడు సంవత్సరాలు దాటిన అభిజ్ఞాన్‌ను తమ బెడ్‌రూంలోనే పడుకోబెడుతున్నారని తేలింది. ఈ మేరకు అభియోగాలను నమోదు చేసి పిల్లలను స్థానిక కుటుంబ కోర్టులో ప్రవేశపెట్టారు. అభియోగాలను వాస్తవాలుగా నిర్ధారించిన కోర్టు ఇద్దరు పిల్లలను 1 సంవత్సరాలు నిండేవరకు సంరక్ష కేంద్రంలో ఉంచాలని ఆదేశించింది.

ఇక్కడ కొన్ని ప్రశ్నలు తలెత్తడం సహజం. భారతీయ సమాజంలో పిల్లల పెంపకానికి పశ్చిమ దేశాల్లో పిల్లల పెంపకానికి మౌలికంగా కొన్ని తేడాలున్నాయి. పెట్టుబడిదారీ విధానం బాగా అభివృద్ధి చెందిన యూరపులో, అమెరికాలో బాలలకు స్వేచ్ఛ ఎక్కువ. తల్లిదంవూడులిద్దరూ ఉద్యోగాలు చేస్తారు కనుక నెలల వయసులోనే పసికందులను బేబీ కేర్ సెంటర్లలో వేస్తారు. కాస్త పెద్దవగానే ప్లేస్కూలుకు పంపిస్తారు. ఇక వారి చదువుల బాధ్యత ప్రభుత్వమే చూసుకుంటుంది. వృత్తి-ఉద్యోగాల ఎంపికలో కూడా తల్లిదంవూడుల ప్రమేయం తక్కువే. తద్విరుద్ధంగా భారత్‌లో పిల్లలపై పెద్దల అజమాయిషీ కాస్త ఎక్కువేనని చెప్పవచ్చు. భూస్వామ్య విధానం నుంచి పెట్టుబడిదారీ విధానానికి పరివర్తన చెందుతూ ఆధునిక పోకడలు ఇప్పుడిప్పుడే పల్లెలకు పాకుతున్న దశలో మన సమాజం ఇటూ అటూ కాకుండా ఉంది. పట్టణాల్లో పెరిగే పిల్లల కు కాసింత స్వేచ్ఛ ఎక్కువ ఉన్నప్పటికీ పెంపకంలో తల్లిదంవూడులు ఇప్పటికీ సంప్రదాయ పద్ధతులనే పాటిస్తున్నారు. తప్పులు చేసిన పిల్లలను కొట్టడం ఇక్కడ తప్పు కాదు.

ఇళ్లలో తల్లిదంవూడులు, స్కూళ్లలో ఉపాధ్యాయులు బాలలను భయపెట్టడం, వినకపోతే రెండు దెబ్బలు వేయడం మామూలే. పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసమే తాము ఇలా చేస్తున్నామని వీళ్లు చెబుతారు. అలాగే, పేదరికం, ఉపాధిలేమి మూలంగా బాలలచే ఇంటా బయటా పని చేయించడం అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మనం అనురూప్ దంపతుల ప్రవర్తనను అర్థం చేసుకోవాలి.
మన దేశంలో కూడా బాలల హక్కుల పరిరక్షణకు అనేక చట్టాలు వచ్చాయి. 2005లో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం(ఎన్‌సీపీసీఆర్) ఏర్పాటును పార్లమెంట్ ఆమోదించింది. జెనీవా ఒడంబడికలో పేర్కొన్న అంశాలు అమలయ్యేలా చూడడం ఈ కమిషన్ విధుల్లో ముఖ్యమైనది. 196లో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నిరోధక చట్టాలు, 2000లో జువెనైల్ జస్టిస్ చట్టం, 2002 లింగ నిర్ధార ణ పరీక్షల నిషేధ చట్టం, 2010లో బాలలందరికీ తప్పనిసరి ఉచిత విద్యను అందించే చట్టం అమలులోకి వచ్చాయి.

పలు పంచవర్ష ప్రణాళికల్లో బాలల సంక్షే మం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. అయినప్పటికీ పరిస్థితుల్లో చెప్పుకోదగిన మార్పు రాలేదు. ఓ వైపు మహిళలపై, మరోవైపు పిల్లలపై గృహహింస పెరుగుతూనేవుంది. రెచ్చిపోయిన ఉపాధ్యాయులు పలురకాల సాకులతో విద్యార్థులను శిక్షిస్తూనే వున్నారు. చైల్డ్ ట్రాఫికింగ్ వర్ధిల్లుతూనేవుంది. పోషకాహారం కరువైన వీధిబాలలు రోగాల బారిన పడుతూనేవున్నారు. బాలకార్మిక వ్యవస్థ కొనసాగుతూనే వుంది. అభివృద్ధి ఫలాలు సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలకు అందనంత వరకు పెద్దలతో పాటు పిల్లల హక్కుల పరిరక్షణ మేడిపండు చందంగానే ఉంటుంది. నిలువ నీడే కరువైన పేదలు తమ పిల్లలకు వేరుగా పడక గదుల ను ఏర్పాటుచేయడం అసాధ్యం. బాలలు స్వేచ్ఛగా పెరగాలన్నా, పోషకాహారం అంది ఆరోగ్యంగా ఉండాలన్నా, కోరుకున్న చదువులు చదవాలన్నా, ఇష్టమైన వృత్తిని ఎంచుకోవాలన్నా ముందు ఇక్కడి సామాజిక ఆర్థిక పరిస్థితులు సమూలంగా మారాలి. ఈ దిశలో భారత ప్రభుత్వం చర్యలు చేప హక్కుల సంఘా లు, మేధావులు, రాజకీయ పార్టీలు, ప్రజలు ఒత్తిడి తేవాలి.
-డి. మార్కండేయ
dmknamaste@gmail.com 
Namasete Telangana News Paper Dated 31/1/2012

Sunday, January 29, 2012

విగ్రహమా, ఆశయమా ?

విగ్రహమా, ఆశయమా ?
statuesభారత రాజ్యాంగ నిర్మాత, భారతీయ సమాజానికి మానవత్వం గరపడానికి విశేష కృషి చేసిన మహనీయుడు డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి కుల దురహంకారులు చెప్పుల మాల వేసినప్పుడల్లా ఆ విగ్రహానికి పాలాభిషేకం చేయడానికి అలవాటు పడిన ఆయన అభిమానులు కూడా ఆయన ద్వేషించిన హిందూ పవిత్రతా భావజాలాన్ని ఒంటబట్టించుకున్నవారే. అంబేడ్కర్‌ ఎంతగానో ఆశించిన సామాజిక సంస్కరణలను ద్వేషించిన హైందవ సమాజంలో భాగస్థులుగా ఉంటూనే వారు ఆయనను ఆరాధిస్తున్నారు. ఆయన ఆలోచనలను వారు బొత్తిగా జీర్ణించుకోలేదు.. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానంవారు దళిత గోవిందం పేరిట దళిత వాడలలో రామాలయాలు, వెంకటేశ్వరుని విగ్రహాలు నెలకొల్పడానికి సాహసించగలుగుతున్నారు.

సామాజిక సంస్కరణలకు హైందవ భావజాలానికి చుక్కెదురనే వాస్తవాన్ని గ్రహించిన మహాత్మా ఫూలే, అంబేడ్కర్‌, పెరియార్‌లు హైందవానికి ప్రాణ ప్రదమైన బ్రాహ్మణ మతాచారాలను సంప్రదాయాలను ద్వేషించారు. దానికి దన్నుగా వెలిసిన నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను కూకటి వేళ్ళతో పెకలించాలని కృషి చేశారు. కాని అది నిర్మూలన కాకపోగా నానాటికీ మరింతగా బలపడుతున్నది. అదేమంటే బిసి, ఎస్‌సిలు కుల ప్రాతిపదికగా సంఘటితం కావడాన్ని అగ్రకుల వాదులు ఎత్తిచూపుతున్నారు. అగ్రవర్ణాలు కుల సంఘాలు ఏర్పాటు చేసుకొని సంఘటితం కావడం, లోపాయికారీగా కుల దురభిమానాన్ని ప్రదర్శించడం, కుల పరంగా హైందవ దోపిడీ, పీడన కొనసాగాలనే కోరికతో కాగా, బిసి, ఎస్‌సిలు కుల ప్రాతిపదికన ఏకం కావడం కుల వ్యవస్థలో, అగ్రవర్ణ పాలక వర్గాల రాజకీయ పెత్తందారీతనంలో తమకు జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొని కుల రహిత మానవీయ సమాజాన్ని నెకొల్పుకునే మహత్తర ఆశయం కోసమే.

ఈ తేడాను కప్పిపుచ్చి కింది కులాలదే కులతత్వమంటూ అగ్రవర్ణ మేధావులు తప్పుదోవ పట్టిస్తున్నారు. తాము మాత్రం కుల దురభిమానాన్ని ప్రదర్శిస్తూ పోషిస్తూ కులం కుడ్యాలు కూలాలంటూ గొంతు చించుకుంటారు. ఇప్పుడు అంబేడ్కర్‌ విగ్రహానికి అపచారం జరిగిందంటూ గగ్గోలు పెట్టి దానికి పాలాభిషేకం చేస్తున్న దళితులు సైతం హైందవ చట్రంలో చేరిపోయి కుదురుగా కూర్చున్నవారే. వీరికి అంబేడ్కర్‌ ఆశయాలు నిజంగా అర్ధమై ఉంటే పాలాభిషేకాన్ని శుద్ధి కార్యక్రమంగా ఎంచుకుని ఉండేవారు కాదు.
దళితులు అంబేడ్కర్‌ విగ్రహాన్ని కడగడానికి వినియోగిస్తున్న పాలు కూడా బహుశా ఆవు పాలే అయి ఉంటాయి. ఆ విధంగా వారు బ్రాహ్మణ్యాన్ని అక్కున చేర్చుకుంటున్నారు.

ఒక విధంగా వారు దళిత బ్రాహ్మణులు. ఇలా ఎటు తిరిగి బ్రాహ్మణ వాద విలువలే అంతటా చోటు చేసుకున్నచోట అంబేడ్కర్‌ ఆశించిన మార్గంలో ఆయన సామాజిక వర్గం వారు నడవడం సైతం దుస్సాధ్యమే అవుతుంది. మీ దేశ ప్రజలలో అతిపెద్ద వర్గంగా ఉన్న అంటరాని కులాల వారిని ప్రభుత్వం నడిపే పాఠశాలల్లో చదువు నేర్చుకోకుండా అడ్డుకుంటున్న మీరు రాజకీయాధికారానికి ఎలా అర్హులు? అని అంబేడ్కర్‌ ఆ నాడు అగ్రవర్ణ సమాజాన్ని సూటిగా నిలదీశారు. అందరికోసం ఉద్దేశించిన సామాజిక బావులలో నీరు చేదుకోకుండా అస్పృశ్యులను అడ్డుకుంటున్న మీరు రాజకీయాధికారానికి ఎంత మాత్రం అర్హులు కారని ఆయన దృఢ స్వరంతో స్పష్టం చేశారు.

అంటరానివారు తమకు నచ్చిన దుస్తులను, ఆభరణాలను ధరించడానికి కూడా అనుమతించని మీరు దేశాధికారానికి ఎలా అర్హులవుతారని 1930వ దశకంలోనే అంబేడ్కర్‌ అగ్రవర్ణ సమాజాన్ని ప్రశ్నించారు. వారు కోరుకొన్న, కొనుక్కోగలిగిన ఆహారాన్ని కూడా వారు తినకూడదని ఆంక్ష విధించి హింసిస్తున్న మీరు రాజ్యాధికారానికి ఎలా అర్హులవుతారని ఆనాటి కాంగ్రెస్‌ అగ్రవర్ణ నాయకత్వాన్ని అంబేడ్కర్‌ ప్రశ్నించారు. జాతీయ కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయ సంస్కరణలవైపు మొగ్గు చూపించినవారు సామాజిక సంస్కరణలను నిరసించడమే గాక సామాజిక సంస్కరణవాదులను వేధించి, బాధించడం చూసి అంబేడ్కర్‌ ఆవేదన చెందారు. వారి వారసులే నేడు కాంగ్రెస్‌, బిజెపి, వామపక్షాలు సహా పలు పాలక పార్టీలలో ఆధిపత్యం చలాయిస్తున్నారు.

అందుకే బి.వి. రాఘవులు దళితుల ఆలయ ప్రవేశ సైకిల్‌ యాత్రలు, టిటిడి దళిత గోవిందాలు నిస్సిగ్గుగా సాగిపోతున్నాయి. సమాజంలో పరిమిత సంస్కరణలు తీసుకురాదలచిన హైందవ ఉదారవాదులతో కూడిన జట్‌ పట్‌ మండల్‌ సభకు అధ్యక్షత వహించాలని వారు అంబేడ్కర్‌ను కోరినప్పుడు ఆయన వారికి రాసిన సుదీర్ఘ లేఖలో బాగా చదువుకున్నవాడన్న కారణం మీదనో, అన్నీ తెలిసిన జ్ఞాని అయినందునో ఎవరినిపడితే వారిని గురువుగా గౌరవించడాన్ని హిందూ శాస్త్రాలు సమ్మతించవు కదా, అటువంటప్పుడు మీరు నన్ను ఎలా ఆహ్వానించగలిగారు అని మండల్‌ను ప్రశ్నించారు.

పండితుడైనంత మాత్రాన ఒక ‘అంత్యజుడి’ (దళితుడు)ని హిందువులు ఎంతమాత్రం గురువుగా పరిగణించడానికి వీలు లేదని శివాజీకి గురువైన మరాఠీ సంత్‌ రామదాసు స్పష్టం చేసిన ఉదంతాన్ని అంబేడ్కర్‌ ఆ లేఖలో ప్రస్తావించారు. చాతుర్వర్ణ వ్యవస్థలో మిగిలిన మూడు వర్ణాలూ బ్రాహ్మణుడినే గురువు పీఠంలో కూచోపెట్టాలని హైందవ శాస్త్రాలు స్పష్టంగా చెబుతూ ఉండగా మీరు నన్ను ఆహ్వానించడం విడ్డూరంగా ఉన్నదని అంబేడ్కర్‌ మండల్‌కు స్పష్టం చేశారు. ఆ లేఖ సాంతం చదివిన తర్వాత అంబేడ్కర్‌ అధ్యక్షతన జరగవలసిన సభను జట్‌పట్‌ మండల్‌ రద్దుచేసుకున్నది. ఈ రోజుకి కూడా అగ్రవర్ణ సమాజం దాని చెప్పుచేతల్లో నడుచుకుంటున్న శూద్ర కులాలు అంబేడ్కర్‌ను తాము గర్వించదగిన నేతగా, మార్గదర్శకుడుగా గుర్తించి గౌరవించకపోవడానికి కారణం ఇప్పుడు అర్ధమై ఉండాలి.

మోహన్‌ దాస్‌ కరమ్‌ చంద్‌ గాంధీ కంటె ఉన్నత స్థానంలో ఉంచదగిన మహాత్మా జ్యోతిరావు ఫూలే, అంబేడ్కర్‌లను భారతీయ సమాజం పట్టించుకోకపోవడానికి హేతువు ఇప్పటికైనా తెలిసి ఉండాలి. తూర్పుగోదావరి అమలాపురం, ధవళేశ్వరంలలో తాజాగా సాగిపోయిన అంబేడ్కర్‌ విగ్రహాల విధ్వంస కాండ అణువంతైనా మారని ఈ మను మనస్తత్వం వల్ల ఊడిపడినదే. దీనికి నిరసనగా భగ్గుమన్న దళితులుగాని, వారికి దన్నుగా నిలిచి విధ్వంసకారులను అరెస్ట్‌ చేస్తామని విగ్రహాలను ప్రభుత్వ ఖర్చుతో తిరిగి నెలకొల్పుతామని చెప్పిన పాలకులు, పాలకవర్గాలు గాని అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా ఆధ్యాత్మిక, సామాజిక రంగాలలోని అసమానతలను నిర్మూలించగలిగే పట్టుదల ఆవంతైనా ఉన్నవారు కారు.

వెలివాడల దుష్ట సంస్కృతిని దునుమాడి గ్రామాలలో సామాజిక సమానత్వాన్ని ఆవిష్కరించాలనే పూనిక గలవారు కారు. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను కొనసాగిస్తూనే ఆ వైరుధ్యాలనుండి ఘర్షణలు తల ఎత్తడానికి తావివ్వకుండా పోలీసుల సాయంతో నిర్బంధ శాంతి సామరస్యాలను పోషించడమే లక్ష్యంగా అగ్రవర్ణ పాలకులు ఇటువంటి సందర్భాలలో స్పందిస్తూ ఉంటారు.దళితులను హింసించడంలో రాష్ట్రంలోని పాలక అగ్రవర్ణాలలో ఏ ఒక్కటి రెండోదానికి తీసిపోలేదు. గతంలో పదిరికుప్పం, చుండూరు, కారంచేడులలో దళితుల రక్తాన్ని కళ్ళచూస్తే ఇప్పుడు తరచుగా అంబేడ్కర్‌ విగ్రహాలను అవమానపరచడం ద్వారా వారి ఆత్మగౌరవానికి విద్యుదాఘాతాలిస్తున్నారు.

అప్పటివారు ఇప్పటివీరు ఒక తాను ముక్కలే. ఉన్నట్టుండి ఇప్పుడే విరుచుకుపడిన అంబేడ్కర్‌ విగ్రహ విధ్వంసకాండకు రాష్ట్ర రాజకీయాలలో భారీగా ఊపందుకున్న కుల ఓటు బ్యాంకుల ఆయారాం గయారాం ఘట్టమే కారణమని స్పష్టపడుతున్నది. ముఖ్యంగా పాలక కాంగ్రెస్‌లోని కుల సమీకరణలలో త్వరితగతిన వస్తున్న మార్పే దీనికి మూలం అని బోధపడుతున్నది. తూర్పు గోదావరి జిల్లా సామాజిక పటంలో కాపులు ఎస్సీలకు, కాపులు కొన్ని వర్గాల బీసీలకు మధ్య వైరుధ్యం కొత్తది కాదు. కాంగ్రెస్‌ పార్టీలో రెడ్లతో బాటు ఎస్‌సిలు చిర కాలంగా ప్రాధాన్యం పొందుతున్నారు.

ఇప్పుడు రెడ్ల స్థానాన్ని కాపులు ఆక్రమించుకుంటున్న వైనం ప్రస్ఫుటంగా కనుపిస్తున్నది. మరోవైపు రెడ్లతో బాటు ఎస్‌సిలు సైతం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ వైపు అడుగులు వేస్తున్న జాడలు కానవస్తున్నాయి. ఇద్దరు పిఆర్‌పి కాపులు డిమాండ్‌ చేసి మరీ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రెండు మంత్రి పదవులు సాధించుకోవడం, వారి నేత చిరంజీవిని కాంగ్రెస్‌ అధిష్ఠానం స్వీయావసరం కోసమే అయినప్పటికీ పిలిచి పెద్ద పీట వేయడం, అదే సమయంలో వ్యక్తిగత వ్యవహార శైలి కారణంగానే కావచ్చు పి.శంకరరావు మంత్రి పదవినుంచి బహిష్కృతుడు కావడం ఎస్‌సి నేతలకు బాధ కలిగించింది. ముఖ్యంగా కాపులకు ఎస్‌సిలకు నడుమ పూర్వంనుంచి ఎంతో కొంత ఎడం ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో ఇది తన ప్రభావాన్ని తక్షణమే చూపించింది.

కాంగ్రెస్‌లో కాపులకు ప్రాధాన్యమివ్వడాన్ని ఆ జిల్లాలోని ఆ పార్టీ ఎస్‌సి నేతలు బాహాటంగా విమర్శించడంతో, ఆలోచనాపరంగా బొడ్డూడని కాపు యువకులు కొందరిలో ప్రకోపించిన కుల దురహంకారం ఈ విధ్వంసకాండకు పురికొల్పినట్టు తెలుస్తున్నది. ఇది మామూలే. ఓటు హక్కు కనికట్టు- ఉత్తర ప్రదేశ్‌లో దళిత- బ్రాహ్మణ, ఆంధ్రప్రదేశ్‌లో రెడ్డి- ఎస్సీ వయా క్రైస్తవ, కాంగ్రెస్‌ మైనస్‌ రెడ్డి ఖాళీని కాపుతో పూడ్చడం కాంగ్రెస్‌లో కాపులను నిరాదరిస్తున్నారన్న దానిని చూపి టిడిపి గోదావరిజిల్లాల కాపులను ఆకట్టుకోదలచడం ఈ విధంగా ఇలా కులాల చుట్టూ పార్టీలు, పార్టీల చుట్టూ కులాలు తిరుగుతూ ఉంటాయి. ఒక కులం ఖాళీ చేసిన పార్టీలోకి మరో కులం ప్రవేశిస్తూ, నిష్ర్కమిస్తూ సాగుతుందీ ఆట. కాని అదంతా బ్రాహ్మణీయ కుల వ్యవస్థ సామాజిక చట్రంలోనే సాగుతుంది గనుక దళితుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విగ్రహ విధ్వంసాలు, వస్త్రాపహరణలు, గడ్డివాముల్లో విసిరేసి తగలేయడాలు వంటివి కూడా జరిగిపోతూ ఉంటాయి.

కాంగ్రెస్‌లో రాజకీయ సంస్కరణ వాదులు సామాజిక సంస్కరణ వాదుల సోషల్‌ కాన్షరెన్స్‌ను నామరూపాలు లేకుండా చేసిన చేదు వాస్తవం పడగనీడే ఇప్పటికీ దట్టంగా పరుచుకొని ఉన్నది. జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భావ సమయంలో హిందూ సమాజంలోని బలహీనతలపై దృష్టి సారించడం జరిగింది. దురాచారాల మూలంగా హిందూ సమాజం అత్యంత బలహీన స్థితిలో ఉన్నదని గుర్తించారు. వీటిని తొలగించడానికి రాజకీయ సంస్కరణలతో బాటుగానే సామాజిక సంస్కరణల అవసరమూ ఉందని భావించారు. అందుచేత కాంగ్రెస్‌ పార్టీతో బాటు సోషల్‌ కాన్ఫరెన్స్‌ ఆవిర్భావం కూడా జరిగింది. కొంతకాలం పాటు కాంగ్రెస్‌ పార్టీ, సోషల్‌ కాన్షరెన్స్‌లు కవలపిల్లల్లా కొనసాగాయి.

ఏటా ఒకే పందిరి కింద సమావేశమవుతూ వచ్చాయి. అయితే అదెంతో కాలం సాగలేదు. తొందరలోనే వాటి మధ్య వైరుధ్యం పెరిగింది. ఘర్షణ తల ఎత్తింది. రాజకీయ సంస్కరణలకు ముందు విధిగా హిందూ సమాజాన్ని సంస్కరించవలసి ఉన్నదనే స్పృహకు కాలం చెల్లింది. 1892లో అలహాబాద్‌లో ఎనిమిదవ కాంగ్రెస్‌ సమావేశాలలో డబ్ల్యుసి బెనర్జీ ప్రసంగపాఠంలోని ఈ భాగం గమనిస్తే పరిస్థితి అర్ధమవుతుంది. మన సాంఘిక వ్యవస్థను సంస్కరించుకోనంత వరకు రాజకీయ సంస్కరణలకు మనం అనర్హులమనే వారితో నేను ఏకీభవించను. మన విధవ ఆడపడుచులు పునర్వివాహానికి నోచుకోనందున, మన ఆడపిల్లలు ఇతర దేశాల బాలికల కంటె అతి పిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నందున మన భార్యలు, కుమార్తెలు మనతో బాటు మన కార్లలో మన మిత్రుల ఇళ్ళకు వచ్చే స్వేచ్ఛను అనుభవించలేకపోతున్నందున మనం మన ఆడపిల్లలను పైచదువులు చదివించనందున మనం రాజకీయ సంస్కరణలకు అర్హులం కామా అని బెనర్జీ గద్దిస్తూ, గర్జిస్తూ సాగించిన ప్రసంగానికి ఆరోజున సభికుల హర్షధ్వానాలు మిన్నంటాయని అంబేడ్కర్‌ రాశారు. అగ్రవర్ణాలలోని ఆ పెద్దల వారసులే ఇప్పటికీ రాజకీయాలను నడుపుతున్నారు.వారు విదిల్చే పదవులకు మురిసిపోతూ బిసి, ఎస్‌సి, ఎస్‌టిలు తోకలూపుతున్నారు. అంబేడ్కర్‌ ఇందుకు పూర్తి వ్యతిరేకి. ఫూలే ఆయన గురువు.

జనసంఖ్య- ఓటు హక్కు మేళవింపుతో ఈ వర్గాలకు సంక్రమించిన మెజారిటీ బలంతో రాజ్యాధికారం సంపాదించుకొని తద్వారా సాంస్కృతిక రంగంలోనూ, ఆధ్యాత్మిక సామాజిక రంగాలలోనూ బ్రాహ్మణీయ అగ్రవర్ణ ఆధిపత్యం కోటలను నిలువునా కూల్చగలిగినప్పుడే అంబేడ్కర్‌ ఆశించిన సామాజిక సమానత్వం సిద్ధిస్తుంది. దానికోసం నిజమైన కృషికి నాంది పలకవలసి ఉండగా దానిని విస్మరించి కుల దురహంకారులు కూల్చిన విగ్రహాలను తిరిగి నెలకొల్పుకోవడం, చెప్పుల దండ వేసి అవమానపరచిన అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేయడం శ్లేష్మంలో ఈగలుగా బతకడం కిందికే వస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు, మనకేది కావాలి అంబేడ్కర్‌ విగ్రహమా, ఆయన ఆశయ సాధనా? తేల్చుకోవాలి. మెజారిటీ ప్రజలను బానిసలుగా న్యూనులుగా నీచులుగా వారి శ్రమను సేవలను అల్పమైనవిగా పరిగణించిన స్మృతులు, శాస్త్రాల పునాదుల మీది మతాన్ని విశ్వసించేవారి ఆధిపత్యాలవల్ల అణగారిన సామాజిక వర్గాలకు సమానత్వం ఎన్నటికీ సిద్ధించదు.
- సౌభాగ్య. ఎం
Surya News Paper Dated 30/1/2012 

నిలదీస్తేనే నిలువగలం...!



అనాది నుంచీ ఆదివాసుల జీవితాలు ‘పెనం మీదినుంచి పొయ్యిలో పడ్డ’ చందంగా తయారవుతున్నాయి. ఫలితంగా తరతరాలుగా పేదరికం లో మగ్గిపోతున్నారు. దీనికి పాలకులు, వారు అవలంబిస్తున్న విధానాలే కారణం. పాలకవర్గాలు ఆదివాసీ ప్రాంతాల్లో నిక్షిప్తమై ఉన్న ఖనిజ సంపదను, అటవీ సంపదను, నీళ్లను, భూమిని టాటా, జిందాల్, వేదాంత, పోస్కో, మిట్టల్ తదితర బహుళజాతి కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. సంపన్న వర్గాలకు వనరులను ధారాదత్తం చేసి ఆదివాసులను నిర్వాసితులను చేస్తున్నాయి.ఉత్తర తెలంగాణలో ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్న ప్రాం తంలో అటవీ, ఖనిజ సంపద పుష్కలంగా ఉంది. డోలమైట్, బాక్సైట్ తదితర ఖనిజాలు, భారీనీటి ప్రాజెక్టుల కోసం కావలసిన గోదావరి, మునేరు, ప్రాణహిత, కిన్నెరసాని లాంటి నదులున్నాయి.

వీటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళారీ పెట్టుబడిదారులకు, బహుళజాతి కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నాయి. వీటిని నమ్ముకొని తరతరాలు గా ఆదివాసులు, పీడిత ప్రజలు జీవనం సాగిస్తున్నా రు. పాలకుల విధానాలతో ఆదివాసులు నిర్వాసితులవుతున్నారు.ఆదివాసీ చట్టాల్లో ‘పెసా’ చట్టం, 1/70 చట్టం ప్రకారం గ్రామ సభలకే సర్వాధికారం ఉంది. స్వయం పాల న, రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలు, రాజ్యాంగ అధికరణ 244 కింద ఉదహరించబడిన ఆదివాసుల పరిరక్షణ నియమాల వంటి చట్టాలు, ఆదివాసుల పరిరక్షణ కోసం చేసిన చట్టాలను ఉల్లంఘిస్తూ పాలకులు వారిని బలిచేస్తున్నారు. ఆదివాసులను వారి నివాస ప్రాంతాల నుంచి తరిమేసి, వారి సంస్కృతిని నాశనం చేసి వారికి నిలువ నీడ లేకుండా చేస్తున్నారు. పాలకుల విధానాలను ప్రశ్నిస్తున్న, నిలదీస్తున్న ఆదివాసులను రూపుమాపేందుకు ఏకంగా గ్రీన్‌హంట్ పేరిట ఆదివాసులపై యుద్ధం ప్రకటించారు. గిరిజనులను తుదముట్టిస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టు వల్ల ఖమ్మం, ఉభయగోదావరి జిల్లాల్లో వందలాది గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. పోలవరం నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేకున్నా ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నారు. ఆదివాసులను సమాధి చేసేందుకు టీడీపీ, కాంగ్రెస్ కుట్రలు పన్నుతున్నాయి. మరోవైపు జాతీయ అవసరాల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు నిక్షేపాలను వెలికి తీసే కార్యక్షికమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నాయి. బొగ్గును వెలికి తీసే పనిని ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ.., ఓపెన్ కాస్ట్ విధానంతో విధ్వంసం సృష్టిస్తున్నారు. సింగరేణి గనుల్లో చేపడుతున్న ఓపెన్ కాస్ట్ విధానంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో.. వ్యవసాయమంతా మూలనపడిపోయింది. పంట భూములు కానరాకుండాపోయాయి.

ఖమ్మం జిల్లాలోని మణుగూరు, ఇల్లెందు, గుండాల-1, సీతంపేట, ఆదిలాబాద్‌లో కైరిగూడెం, అబ్బాపూర్, ఎన్‌కేపూర్, కైరిమాదారంలో కొత్తగా ఓపెన్ కాస్ట్‌లు రానున్నాయి. కరీంనగర్ జిల్లాలో తాడిచర్ల, వరంగల్‌లో పెద్దాపూర్ తదితర ప్రాంతాల్లో ఓపెన్ కాస్టులు రాబోతున్నాయి. దీని ఫలితంగా వేలాది ఎకరాల పంట భూములు నాశనమై రైతులు బికారులు కాబోతున్నారు. కొత్తగూడెం-2 ఓపెన్‌కాస్టుతో ఆ ప్రాంతంలో రెండువేల ఎకరాల పంటభూములు నాశనం అవుతున్నాయి. ఇల్లెందు జెకె-3 ఓపెన్ కాస్టుతో ఇల్లెందు సికాయపల్లికి చెందిన వెయ్యి కుటుంబాలు జీవనోపాధిని కోల్పోతున్నాయి. మణుగూరు ఓపెన్ కాస్ట్ కింద 30 గ్రామాలు, మంగిలిగూడెంతోపాటు మరో మూడు గ్రామాల ప్రజలు తమ జీవనోపాధిని కోల్పోతున్నారు.
వరంగల్ జిల్లా కొడిశెలకుంట, బుచ్చిడ్డిపల్లి, యెల్లంపల్లి, రంగయ్యపల్లి ప్రాం తాల్లో డోలమైట్, బాక్సైట్, ఇనుప ఖనిజాలు ఉండటంతో మైనింగ్ మాఫియా కన్నుపడింది.

దీంతో ఆ ప్రాంతంలో మూఢ నమ్మకాలను ప్రచారం చేసి అక్కడి ప్రజలు ఆ ప్రాంతంలోని భూములను వదిలివేసే విధంగా విష ప్రచారం చేస్తున్నా రుపజలను భయవూభాంతులను గురిచేసే ప్రచారం చేయడంతో కొందరు గ్రామాలను వదిలి వెళ్లిపోతున్నారు.గుట్ట నీడ (బొవూడాయి) ఈ గ్రామాలపై పడి మనుషులకు కీడు వస్తుందని ప్రచారం చేసి ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేసే విధంగా మైనింగ్ మాఫియా ప్రచారం చేసింది. ప్రజలు ఊళ్లు విడిచివెళ్లిన తర్వాత ఆ ప్రాంతంలో తవ్వకాలు చేస్తున్నారు. అనేక రకాలుగా ఆదివాసులను నిర్వాసితులను చేస్తున్న ప్రభుత్వం, ఆదిలాబాద్ జిల్లాలో అభయారణ్యం పేరుతో ఆదివాసులను నిర్వాసితులను చేయడానికి పూనుకున్నది. కవ్వాల్ అడవుల్లో, ఖమ్మం జిల్లా వీఆర్‌పురం, చింతూరు అడవులలో, వరంగల్ జిల్లాలో తాడ్వాయి, ఏటూరు నాగారం అడవులను ‘టైగర్ జోన్’లుగా ప్రభుత్వం ప్రకటించింది.ఆదివాసులను ఈ ప్రాంతాల నుంచి తరిమేసి యథేచ్ఛగా ఖనిజ సంపదను, అటవీ సంపదను కొల్లగొట్టడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది. టైగర్‌జోన్ కారణంగా 40 గ్రామాల ప్రజలు రోడ్డునపడుతున్నారు. చింతూర్, వీఆర్‌పురం అడవుల్లో టైగర్‌జోన్ వల్ల 100 గ్రామాల గిరిజనులు నిర్వాసితులు అవుతున్నారు.

వరంగల్ జిల్లా చెల్పూర్ దగ్గర ఒక విద్యుత్ ప్లాంట్ నిర్మాణం పూర్తయింది. మరొకటి నిర్మాణంలో ఉన్నది. వీటిలో స్థానికులకే ఉద్యోగాలు ఇస్తామన్నారు కానీ ఒక్క ఉద్యోగం కూడా స్థానికులకు ఇవ్వలేదు. ఈ విద్యుత్ ప్లాంటు వెదజల్లుతున్న బూడిద వల్ల వేలాది ఎకరాల పంట పొలాలు నాశనమవుతున్నాయి. గిరిజనులు వేసుకున్న పంటలన్నీ బూడిదపాలవుతున్నాయి. ఇలా ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు గిరిజన ప్రాంతాల్లో టైగర్‌జోన్‌లు, ప్రాజెక్టులు, ఖనిజ తవ్వకాల పేరు తో లక్షలాది మంది ఆదివాసులను నిర్వాసితులను చేస్తున్నారు.

రకరకాల ప్రాజెక్టులు, అభివృద్ధి పథకాలు, టైగర్‌జోన్‌ల పేరుతో రాష్ట్రంలోనే కాదు, దేశ వ్యాప్తంగా పాలకులు గిరిజనులపై కత్తిగట్టారు. ‘కాకులను కొట్టి గద్దలకేసినట్లు’ గా.. దేశమూలవాసులైన ఆదివాసులను కొట్టి బడా పెట్టుబడిదారులకు, బహుళజాతి కంపెనీలకు దోచిపెడుతున్నారు. దీనిని దేశవ్యాప్తంగా ఆదివాసులు వ్యతిరేకిస్తున్నారు. తమకు తోచిన పద్ధతిలో నిరసిస్తున్నారు. సంఘటితంగా పోరాడుతున్నారు. సరిగ్గా ఇక్కడే మావోయిస్టు పార్టీ ఆదివాసులకు అండగా నిలిచి వారి పోరాటాలకు నాయకత్వం వహిస్తున్నది. ఆదివాసీ ప్రాంతాలపై జరుగుతున్న అన్ని రకాల దోపిడీని వ్యతిరేకిస్తున్నది.ఈక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బహుళజాతి కంపెనీలకు అండగా నిలిచి ఆదివాసులపై అణచివేతకు దిగుతున్నాయి. గిరిజనులపై ‘గ్రీన్‌హంట్’ పేరుతో యుద్ధా న్ని ప్రకటించాయి. మావోయిస్టులకు మద్దతునిస్తున్నారన్న నెపంతో ఆదివాసులపై పారా మిలిటరీ, పోలీసు బలగాలు దమనకాండను సాగిస్తున్నాయి.

ఊళ్లకు ఊళ్లను తగలబెడుతున్నాయి. ఆదివాసీ మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నాయి. పండు ముసలి నుంచి పసి పిల్లల వరకు దొరికిన వారిని దొరికినట్లు కాల్చి చంపుతున్నాయి. సాయుధ పోలీసు, భద్రతా బలగాలకు తోడుగా సల్వాజుడుం లాంటి ప్రైవేటు గూండా సైన్యాన్ని పెంచి పోషించి ఆదివాసులపై అమానుష దాడులకు పాల్పడుతున్నాయి. ఇదం తా మావోయిస్టుల ఏరివేత పేరుతో పాలకులు సాగిస్తున్న దమనకాండ. ఇంత కూ మావోయిస్టులు చేసిన, చేస్తున్న నేరం ఏమిటో దేశ ప్రజల ముందు పాలకులు వెల్లడించకుండానే ఇదంతా చేస్తున్నారు. ఈ దేశ సహజ వనరులపై కన్నేసిన బహుళ జాతి కంపెనీల దోపిడీని ఎదిరించడమే మావోయిస్టులు చేసిన నేర మా? అందరూ ఆలోచించాలి. ఈ మట్టిపై, ఈ ప్రజలపై ప్రేమ ఉన్న వారెవరై నా బహుళజాతి కంపెనీల దోపిడీని వ్యతిరేకించాలి. అభివృద్ధి పేరుతో దేశ వనరులను విదేశీ కంపెనీలకు, కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్న పాలకులను నిలదీయాలి.దేశాన్ని తాకట్టు పెట్టే పాలకుల విధానాలను వ్యతిరేకించాలి.

దేశ సార్వభౌమాధికారం కోసం ప్రజలంతా దీర్ఘకాలిక మిలిటెంట్ పోరాటాలకు సిద్ధమవ్వాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగా సమస్త ప్రజల అభివృద్ధి కోసం, ఆదివాసీ ప్రజల విముక్తి కోసం పోరాడాలి. కొమురం భీం మార్గంలో జల్, జంగల్, జమీన్ కోసం పోరాడాలి. సామ్రాజ్యవాద, దళారీ, నిరంకుశ పెట్టుబడిదారీ, భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా పోరాడుతూ.., మూలవాసులపై తలపెట్టిన గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా పోరాడాలి. తద్వారానే దేశ సార్వభౌమాధికారాన్ని, స్వావలంబనను నిలుపుకోగలం. ఈ రాజీలేని పోరాటం ద్వారా నే సమసమాజ నవ భారతాన్ని నిర్మించుకోవాలి.
-జగన్
మావోయిస్టుపార్టీ ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి 
Namasete Telangana News Paper Dated 30/1/2012 

ఆదివాసీల మనుగడ మింగిన వలసలు



tribals talangana patrika telangana culture telangana politics telangana cinema
(1940-190ల మధ్యకాలంలో భారతీయ ఆదివాసీ సముదాయాలను విస్తృత అధ్యయనం చేసిన జర్మన్ స్కాలర్ క్రిస్టాఫ్ పాన్ ఫ్యూరర్ హైమన్ డార్ఫ్ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణలోని ఆదివాసులతో సహజీవనం చేశాడు. ఆదిలాబాద్ మొదలుకొని శ్రీకాకుళం దాకా విస్తరించిన ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి అధ్యయనం చేశారు. ఆయన పరిశోధన, పరిశీలన నుంచి ఆదివాసీ జీవన స్థితిగతులను అనేక గ్రంథాల్లో వెలువరించారు. అందులో ‘ట్రైబ్స్ ఆఫ్ ఇండియా: ది స్ట్రగుల్ ఫర్ సర్వైవల్’ ఆధారంగా 2000 సంవత్సరంలో ‘మనుగడ కోసం పోరాటం’ పుస్తకం అనువదించబడింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ, గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన మేడారం ‘సమ్మక్క-సారలమ్మ’ జాత ర సందర్భంగా హైమన్‌డార్ఫ్ అనుభవాలను ప్రత్యేకంగా ఆయన మాటల్లోనే..)

ఆదిలాబాద్ జిల్లాలోని గోండులకుండే చాలా సమస్యలు, వరంగల్ జిల్లా పరిధిలోని కోయ ప్రాంతాల్లో కూడా కనిపిస్తాయి. పరిస్థితుల్లో కొద్దిపాటి తేడాలున్నా సమస్యల సారాంశం ఒక్కటే. నిజానికి ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఒక అర్ధశతా బ్దం క్రితం వరకు ఆదివాసీ గ్రామాలు విస్తారంగా కనిపించేవి. పూర్తిగా ఆదివాసీ జనాభాతో కనిపించిన ఈ గ్రామాలన్నీంటిలోనూ కోయలు, గోండులు తదితర సమూహాలు జీవనం సాగిస్తుండేవారు. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోని కొండ ప్రాం తాల కారణంగా అక్కడి మైదాన ప్రాంత అభివృద్ధి చెందిన హిందూ కులాల ప్రజల నుంచి ఆదివాసీలు దూరంగా కనిపించేవారు. ఇదే పరిస్థితి కొద్దిపాటి మార్పులతో వరంగల్ జిల్లాలోని ములుగు, నర్సంపేట తాలూకాల్లోని దట్టమైన అటవీ ప్రాంతా ల్లో కనిపిస్తుంది.

అక్కడ భూములను కబ్జా చేసుకునే పేరాశ గల మైదాన ప్రాంత ప్రజల చొరబాటుకు వీలులేని విధంగా దట్టంగా అడవులు ఉండటం అక్కడి ఆదివాసీలకు వరంగా ఉండేది. దాదాపు రెండు వందల సంవత్సరాలు పాలించిన కాకతీయుల సామ్రాజ్య పతనం తరువాత ఏర్పడిన రాజకీయ సందిగ్ధం కారణంగా ఈ ప్రాంతంలోని మైదాన ప్రాంత హిందూ సముదాయాలన్నీ క్రమంగా వలస ఆ తరువాత కాలంలో ఈ ప్రాంతమంతా ఒకే రకంగా కోయల ప్రాబల్యం కింద ఉండేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా కోయ సముదాయాల ఆవాసంగానే కొనసాగుతూ వస్తున్నది. ప్రస్తుత వరంగల్ జిల్లాకు తూర్పున ఉన్న ఈ ప్రాంతంలోని ఆదివాసులూ, గోదావరి నదికి ఎడమవైపు తీర ప్రాంతంలో నివసిస్తున్నారు. గోల్కొండను ఔరంగజేబు వశం చేసుకున్న తరువాత మొఘల్ రాజ్య పరిధిలోకి ఈ రెండు జిల్లాలు (ఆదిలాబాద్, వరంగల్) వచ్చాయి. ఆ ఆక్రమణ ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసుల జీవితాలను ఛిద్రం చేయలేదు. మొఘల్ పాలన ఆదిలాబాద్‌లోని గోండుల జీవితాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపి, వారి జీవితాల్లో తీవ్ర పరిణామాలకు కారణమయింది.

కానీ అదే మొఘల్ పాలన వరంగల్ జిల్లాలోని కోయల జీవితాలపై ప్రభావాన్ని చూపలేదు. 1724 తరువాత వరంగల్ నిజాం సంస్థాన పరిధిలోకి వచ్చినప్పటికీ నిజాం పాలనలోని చివరి అర్ధశతాబ్దంలోనే ములుగు, నర్సంపేట తాలూకాలోని అటవీ ప్రాంతాల్లో ప్రభుత్వ అటవీ సంక్షేమ పథకాలు మొదలయ్యాయి. నేను మొట్టమొదటి సారి ఈ రెండు తాలూకాలను 1940లో పర్యటించాను. అప్పటికి ఇంకా తారురోడ్లు అంత విస్తారంగా లేవు. కోయలుండే ప్రాంతాలకు వెళ్లాలంటే కాలి నడక లేదా ఎడ్లబండి తప్ప మరో సదుపాయమే లేదు. ఆ అడవుల్లోని ఆదివాసీ భూమి హిందూ, ముస్లిం మతాలకు చెందిన ఆదివాసీయేతరుల హస్తగతం కావడం మొదలైంది. అప్పటికే పాలంపేట పరిసరాల్లోని గ్రామాల్లో నివసిస్తున్న నాయకపోండ్లకు, కోయలకు సెంటు సొంత భూమి కూడా లేదు.

వారంతా ఆదివాసీయేతరులు కబ్జా చేసిన భూ ముల్లో వ్యవసాయ కూలీలుగా, కౌలు రైతులుగా పనిచేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఆదివాసీ భూమిని కబ్జా చేసిన ఆదివాసీయేతరుల్లో ఎక్కువ శాతం రెడ్డి కులస్తులే. ఆదిలాబాద్ జిల్లాలో నిజాం ప్రభుత్వం చేపట్టిన ఆదివాసీ సంక్షేమ పథకాలను వరంగల్ జిల్లాలో కూడా అమలు చేశారు. 1946-1950 కాలంలో ప్రత్యేక సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు వేలాది ఎకరాలకు పట్టాలను కోయలకు, నాయక పోండ్లకు పంపిణీ చేశారు. ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా నిజాం పాలనలోని ఆఖరి సంవత్సరాల్లోనే అమలయ్యాయి. ఆదిలాబాద్‌లో అమలైన కాలంతో పోల్చుకుంటే, వరంగల్‌లో ఈ పథకాలు అమలైన కాలం చాలా తక్కువని చెప్పాలి.

1960లో నేను ములుగు, నర్సంపేట తాలూకాల అటవీ ప్రాంతాలను సందర్శించినప్పుడు ఆదివాసులకు నిజాం ఇచ్చిన పట్టా భూములన్నీ తిరిగి ఆదివాసీయేతరుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఆదివాసీ భూముల్లోకి చొరబడిన ఆదివాసీయేతరుల్లో చాలా మంది గుంటూరు, ఇతర ఆంధ్రా జిల్లాల నుంచి వచ్చిన కమ్మకులస్తు లే. ముఖ్యంగా రోడ్డువైపున ఉండే చెల్వాయి, పస్రా లాంటి ఊళ్లలోనైతే గుంటూరు నుంచి వచ్చిన వాళ్లు ఎక్కువగా కనిపించేవారు. మొదట వీళ్లంతా చాలా ‘న్యాయసమ్మతంగానే’ ఆదివాసుల దగ్గర భూములను కొన్నారు. తరువాత ఆ ప్రాంతంలో కొంత నిలదొక్కుకోగానే ఆదివాసులను వారి భూముల నుంచి నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయించేందుకు అన్ని రకాల పద్ధతులనూ ఉపయోగించారు.ఈ క్రమంలో ఎంతో మంది కోయలు అనతి కాలంలోనే భూమిలేని నిరుపేదలుగా మిగిలిపోయారు. ఈ భూములకు సంబంధించి తహసీల్దార్, పట్వారీ రికార్డుల్లో ఇంకా కోయ ‘యజమాని’ పేరే ఉన్నప్పటికీ, వాస్తవంగా అందులో సాగు చేసుకునేది గుంటూరు నుంచి వచ్చిన ఆదివాసీయేతరులే.

197లో నేను తిరిగి ములుగు వెళ్లేటప్పటికీ భూకబ్జాలు మరింత ఎక్కువయ్యా యి. ఒకప్పుడు చెల్వాయి మహా అయితే 20 కోయ కుటుంబాలున్న ఒక చిన్న ఆదివాసీ గ్రామం. కానీ ఇప్పుడది ఆదివాసీయేతరులున్న పెద్ద గ్రామం. పెద్ద డాబా ఇళ్లు, అంగళ్లు, ఒక హిందూ దేవాలయం, ఒక సినిమా హాలు చెల్వాయిలో వెలిశా యి. అప్పటికి ఉన్న 50 కుటుంబాల్లో కేవలం 15 కుటుంబాలకు మాత్రమే సొంత భూమి ఉన్నది. ఇక్కడ 1940లో చాలా మందికి ప్రభుత్వం పట్టా భూములను పంపిణీ చేసింది. అవన్నీ క్రమంగా ఆదివాసీయేతరులు కోయలకిచ్చిన అప్పుకింద జప్తు చేసుకున్నారు. నిజానికి చెల్వాయిని ప్రభుత్వం ఆదివాసీ గ్రామంగా ప్రకటించినా, అక్కడి ఆదివాసీ భూ బదిలీలను చట్ట వ్యతిరేకం చేసినా భూకబ్జాలను ఆపలేకపోయింది. ‘ఆదివాసీ భూ బదిలీ నిరోధక చట్టం’ కింద కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. అందులో మూడు కేసుల్లో ఆదివాసీలకు భూమి తిరిగి అప్పగించాలని తీర్పు కూడా వచ్చింది. ఆదివాసీయేతరులు తమ పలుకుబడిని ఉపయోగించి హైకోర్టు నుంచి ‘సే’్ట ఆర్డర్లు తెచ్చుకొని ఆ భూముల్లో సాగు చేసుకుంటున్నారు.

అడవి దట్టంగా ఉన్న ప్రాంతాల్లో లక్నవరం సరస్సు నీటిని మళ్లించి భూములను గిరిజనులు సాగులోకి తీసుకొచ్చారు. ఆ భూములన్నీ ఇప్పుడు ఆదివాసీయేతరుల హస్తగతమైపోయాయి. పస్రా చుట్టు పక్కల గ్రామాల్లో ములుగు-ఏటూరునాగారం లను కలుపుతూ వేసిన తారురోడ్డు పొడుగునా ఉన్న భూముల్లో కూడా ఇదే పరిస్థి తి. ఆదివాసీయేతరులు ఈ భూములను కబ్జా చేసుకుని స్థిరపడ్డారు. తారు రోడ్డు కు దూరంగా ఉన్న కోయ గ్రామాలు మాత్రం ఈ కబ్జాలకు గురికాలేదు. కమరం గ్రామంలోని 52 కుటుంబాలకు ఇప్పటికీ సొంత భూమి ఉంది. ఈ గ్రామ పట్వారీ ఒక కోయ. అతనికి 30 ఎకరాల దాకా సొంత భూమి ఉంది. కొన్ని భూములకు సంబంధించిన వివాదాలు మాత్రం కోయలు, ఆదివాసీయేతరుల మధ్య 197 వరకూ అపరిష్కృతంగానే ఉన్నాయి.

కోయల కింద ఉన్న 350 ఎకరాల్లో దాదాపు 150 ఎకరాలు సాగులో ఉన్నది. ఏటూరు నాగారం, ములుగు మధ్య వేసిన తారురోడ్డుకు కొన్ని మైళ్ల దూరంలో ఉన్న చిన్నబోయినపల్లి గ్రామంలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఒకప్పుడు ఇది పూర్తి ఆదివాసీ గ్రామం.197 కల్లా అక్కడ పరిస్థితి తారుమారైంది. గ్రామంలో కోయలవి కేవలం 20 కుటుంబాలయి తే, దాదాపు 0 ఆదివాసీయేతర కుటుంబాలు కనిపించాయి. ఈ ఆదివాసీయేతరులంతా ఒక పదేళ్లలో నల్లగొండజిల్లాలో తమకున్న కొద్దిపాటి భూమిని అమ్మేసుకుని ఇక్కడికి వచ్చి కోయల దగ్గర్నుంచి ఎకరా 200-300 రూపాయలకు కొనుక్కున్నారు. నిజానికి 197లో ఎకరాకు మార్కెట్ విలువ 3000-5000 రూపాయలు పలికేది. కేవలం ఆరు కోయ కుటుంబాలే తమ భూమిని ఎవరికీ ఇవ్వకుండా కాపాడుకున్నాయి.

మూడు కుటుంబాలు మొత్తం భూమిని అమ్మేసుకోగా, మరో 11 కోయ కుటుంబాలు ఏదో కొద్దిపాటి భూమిని మాత్రం మిగుల్చుకుని తక్కినదంతా అమ్మేసుకున్నారు. ఇలా కోయలు తమ భూముల్లో బావులు తవ్వించుకోవ డం, చావులు, పెళ్లిల్ల ఖర్చుల కోసం, దిన కోసం ఏదో ఒక ధరకు అమ్ముకున్నారు. సాంప్రదాయ పద్ధతుల నుంచి వాణిజ్య పంటలవైపు వ్యవసాయం పరిణామం చెందిన క్రమంలో తలెత్తే పరిస్థితులను, పర్యవసానాలను ఎదుర్కోలేకపోవడమే కోయల దుస్థితికి ప్రధాన కారణం. స్థానిక అధికారులు, ప్రభుత్వం కూడా ఆదివాసీ భూ బదిలీలను నిరోధించేందుకు చేసిన చట్టాలను చిత్తశుద్ధితో అమలు చేయకపోవడం, ఒకవేళ అందుకు ప్రయత్నించినా రాజకీయ నాయకులు ఆదివాసీయేతరుల పక్షం వహించి అడ్డుకోవడం వల్ల ఆదివాసీలు పూర్తిగా చితికిపోయారు.

శివపురం, గోగుపల్లి గ్రామాల్లో మాత్రం కోయ లు తమ భూములను, ఇతర కోయ గ్రామాలతో పోల్చుకుంటే కొంత మేరకు నిలుపుకోగలిగారు. ఈ రెండు గ్రామాలు పక్కపక్కనే ఉంటాయి. పైగా ఇక్కడ ఆదివాసీయేతరులు కోయల భూమిని కబ్జా చేసిన కొన్ని కేసుల్లో కోయల పక్షం తీర్పు వచ్చి తిరిగి ఆ భూములను ఆదివాసీలకే అప్పగించారు. ఈ గ్రామాల్లో కోయలు, ఇతర ఆదివాసీయేతరులు ఇప్పు డు సహజీవనం సాగిస్తున్నారు. అప్పుడప్పుడు ఒకరి భూముల్లో మరొకరు కూలీపని చేసుకోవడానికి కూడా వెళ్తుంటారు. ఆదివాసీయేతరులు కోయ ల భూముల్లో పనిచేయడం అరుదు. ఈ పరిస్థితుల్లో భూ బదిలీ నిరోధక చట్టాన్ని అమలు చేయడంలో స్థానిక అధికారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదివాసీయేతరులను సమర్థించే రాజకీయ నాయకులు ఆదివాసీయేతరుల ఆర్థిక పరిస్థితి కోయల ఆర్థిక పరిస్థితి కన్నా మెరుగ్గా లేదన్న వాదన ముందుకు తీసుకువస్తుంటారు. పైగా ఇద్దరి జీవితాలూ ఒకే స్థాయిలో ఉన్నప్పుడు కోయలకు మాత్రం ప్రత్యేక చట్టాలు, సంక్షేమ పథకాలు అమలు చేయడం ఎందుకని కూడా దబాయిస్తారు.

ఏటూరు నాగారం ఉత్తర, దక్షిణ దిక్కుల్లో ఇతర జిల్లాల నుంచి పెద్ద మొత్తంలో వచ్చిన వలసలను గమనించవచ్చు. ఖమ్మం జిల్లాలోని గోదావరినదికి ఇరువైపులా ఉన్న భూ భాగాలన్నింటిలోనూ ఈ ఆక్రమణ విచ్చలవిడిగా కొనసాగింది. ఏడాదిలో కొంత కాలమే అయినప్పటికీ గోదావరి నదిలో పడవ ప్రయాణం ప్రధాన రవాణా మార్గంగా ఉండే అవకాశం ఉండటం వల్ల కూడా కొత్త వాళ్ళంతా ఆదివాసీ ప్రాంతాలకు చాలా సులభంగా వలసవచ్చే వీలుండేది. ఆదివాసీ భూ బదిలీలను నిరోధిస్తూ కేవలం చట్టం తయారు చేసి ఊర్కోవడం వల్ల కూడా కొత్తవాళ్ళంతా ఆదివాసీ ప్రాంతాలకు వలసలు పెరిగాయి. ఆదివాసీ భూ బదిలీలను నిరోధిస్తూ కేవలం చట్టం తయారు చేస్తే సరిపోదన్న విషయం, మనకు ఆదివాసీ ప్రాంతాల్లో తిష్టవేసుకు కూర్చున్న ఆదివాసీయేతరులకు అండగా నిలిచే రాజకీయ నాయకుల పరపతిని చూస్తే అర్థమవుతుంది. అందుకే నైతిక పరమైన, ఆచరణాత్మకమైన సమర్థనను ఆదివాసులకు అందజేయడం వల్ల మాత్రమే వారికి బయటి, చొరబాటు దారులను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వగలుగుతామని అనిపిస్తున్నది.

ఏటూరు నాగారానికి కొన్ని మైళ్ల దూరంలో ఉన్న కోయ గ్రామం బుట్టారం. ఈ గ్రామాన్ని సమగ్ర ఆదివాసీ అభివృద్ధి సంస్థ తన మూల క్షేత్రంగా ప్రకటించింది. ఇక్కడే ‘ఐటీడీఏ’ తన ఆదివాసీ సంక్షేమ పథకాలను అమలు చేయాలనుకున్నది. ఈ పథకంలో భాగంగానే అక్కడ కోయల కోసం 2 పక్కా ఇళ్ళను నిర్మించి ఇవ్వడంతోపాటు, మేలు రకం విత్తనాలను అందజేయడం, 25 పాడి పశువులను సగం ధరకే ఇచ్చి వ్యవసాయం విషయంలో వారికి అవసరమైన సూచనలను అందజేసేందుకు ఒక స్థానిక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఆదివాసీ సంక్షేమ శాఖలోని అధికారుల నిరంతర పర్యవేక్షణ, నిఘాల వల్ల ఆ ప్రాంతాల్లో ఆదివాసీయేతరుల చొరబాటును సమర్థవంతంగా ఆపగలిగారు. 197లో అక్కడ ఉండిన 32 కోయ కుటుంబాల్లో సగటున ప్రతి ఒక్కరికి రెండెకరాల మాగాణి, ఒక ఎకరా మెట్ట భూమి ఉండేది.

వాళ్ల భూముల్లో పండే పంటలతో వాళ్ల ఆహార అవసరాలు తీరకపోయినప్పటికీ వారంతా అటవీ ఫలసాయాన్ని సమీప సంతల్లో అమ్ముకోవడం, పక్క ఊర్లలో కాంట్రాక్టర్ల దగ్గర కూలీ పనిచేయడం ద్వారా వచ్చే ఆదాయంతో ఆలోటును భర్తీ చేసుకునేవారు. ప్రభుత్వం కట్టించి ఇచ్చిన పక్కా ఇళ్లను తమ ధాన్యాలను భద్ర పరచుకునేందుకు గిడ్డంగులుగా ఉపయోగించుకుని వాటి పక్కనే తమ సంప్రదాయ కోయ పద్ధతిలో పాకలు నిర్మించుకుని అందులోనే నివసించేవారు.

బుట్టారానికి నడక దూరంలో ఉన్న ఓ మోస్తరు పెద్ద గ్రామం రోహిర్. అక్కడ ప్రభుత్వ పథకాలేవీ అమలు కావ డం లేదు. ఆ లోటు అక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. రోహి ర్ ఆదివాసీ గ్రామంగా ప్రభుత్వం గుర్తించినా.. ఆదివాసీ గ్రామ జాబితాలో లేదు. అక్కడ 35 కోయ గడపలు, 25 నాయకపోండ్ల గడపలున్నాయి. తక్కిన 15మంది ఆదివాసీయేతరులు అంతా వలస వచ్చి స్థిరపడినవారే. దాంతో రోహిర్ ఆదివాసీయేతర గ్రామమైపోయింది. గ్రామంలోని భూమి అంతా హిందూ కులాలకు చెందిన ఆదివాసీయేతర హరిజన కులాల వారి చేతిలోనే ఉంది. కోయలు, నాయకపొండ్లలో ఒకరిద్దరికీ ఉన్న ఒకటి అరా ఎకరా భూమి తప్ప దాదాపు అందరూ ఏ భూమిలేనివారే. అక్కడే 12 కోయ కుటుంబాలు అడవిని నరికి సాగుయోగ్యంగా మలచుకుని వ్యవసాయం చేసుకున్నా ,1967లో ఆ భూములన్నీంటినీ ఆదివాసీయేతర భూస్వాములు కబ్జా చేసుకున్నారు.

ఏటూరునాగారంలో నివాసముండే ఈ భూస్వాములు భూములను చూసుకునే వెసులుబాటులేక కొన్ని పొలాలను గ్రామంలో స్ధిరపడ్డ హరిజన కుటుంబాలకు అమ్ముకున్నారు. భూస్వాములు తాము కబ్జా చేసుకున్న భూములను ఆదివాసీ గ్రామాల్లో స్ధిరపడ్డ హరిజన కుటుంబాల వారికి అమ్ముకోవడం ఆదిలాబాద్ జిల్లాలో అంతటా కనిపిస్తుంది. అడవిని సాగుయోగ్యం చేసుకోవడం ఆదివాసీలవంతు. ఆ భూముల్లో ఏ కాస్త పండినా వెంటనే బలవూపయోగంతోనో, పలుకుబడితోనో కబ్జా చేసుకోవడం భూస్వాముల వంతు అన్నట్టుంటుంది.

1940లో పూర్తిగా ఆదివాసీ గ్రామాలనదగిన చాలా గ్రామాలు వరంగల్ అడవు ల్లో దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఏ బాదరబందీలేక హాయిగా ఉండేవి. 197కల్లా ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆదివాసీయేతరుల కంట పడని కోయ గ్రామాలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఎక్కడో మూలన ఒకటీ అరగా ఉన్నా అలాంటి కోయ గ్రామాలను చేరుకోవడం కూడా చాలా ప్రయాసతో కూడుకున్న పని. చాలా దూరాలు కాలినడకన, అతికష్టమైన ఎడ్లబండి మార్గాల్లో వెళితే కానీ చేరుకునే పరిస్థితి ఉండేది కాదు. వర్షాకాలంలో చేరే నీటి వల్ల ఏర్పడే కాలువలు కోయ గ్రామాలను వలసల నుంచి కాపాడే రక్షణ కవచంలాగా ఉండేవి. ఆదివాసీయేతరుల కంట పడ్డా కూడా ఆ కాలంలో మాత్రం కోయల భూములను కబ్జా చేసుకునే వీలులేదు. అయితే ఈ కాలువల మీద ఎప్పుడైతే చిన్న చిన్న వంతెనలు కట్టారో అప్పటి నుంచి వలసలు విపరీతంగా ఈ గ్రామాలకు కూడా విస్తరించాయి. ఈ వంతెనలే ఆదివాసీ సాంప్రదాయ జీవనానికి గండిలా పరిణమించాయి.

197లో నేను మూడు కోయక్షిగామాలను సందర్శించా ను. అక్కడ ఇంకా కోయల సాంప్రదాయ జీవితం తాలూకు ఆహ్లాద వాతావరణం కనిపించింది. ఈ మూడు గ్రామాల్లో కొర్సెల అనే ఊరును 1940లో చూశాను. మళ్లీ ఇప్పుడు. 1940లో అక్కడ గ్రామంలో 15 కోయ గడపలు, ఒక మాది గ కుటుంబం ఉండేవి. 197లో సహజ పెరుగుదలతో పాటు ఇతర పల్లెల్లో ఉన్న కోయలు, ఇక్కడి కోయల బంధువులూ వచ్చి స్థిరపడటం మూలానా మొత్తం కోయ కుటుంబాలు 42 అయ్యాయి. ఇటీవలే (197) సమగ్ర ఆదివాసీ అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఇక్కడ 5,35,600 రూపాయల వ్యయంతో ఒక చెరువును నిర్మించింది. ఈ చెరువు కింద దాదాపు వంద ఎకరాలు సాగులో ఉన్నది. అటవీ శాఖ రిజర్వ్ అడవిలోనుంచి వంద ఎకరాలు ఆదివాసులకు ఇస్తే వాటికి కూడా ఈ చెరువు నీరు సరిపోతుంది.

కోయల ఇళ్లన్నీ వరి భూములు, కూరగాయల తోటలకు మధ్య ఉండేవి. ఇక్కడ నివసించిన కోయలకు చొరబాటుదారుల భయం ఏ కోశాన ఉండేది కాదు. చుట్టు పక్కల ఉన్న అడవుల్లో తమకు కావాల్సిన అటవీ ఫలసాయాన్ని గడ్డలు తదితర ఆహారాన్ని అవసరమొచ్చినప్పుడల్లా పోయి తెచ్చుకునేవారు. పొలం దున్నేందుకు దాదాపు అందరూ ఎద్దులను ఉపయోగించేవారు. ఎద్దులు లేని ఒకటి రెండు కుటుంబాలు మాత్రం ఆవులతో దున్నేవారు. అక్కడ ఒక కోయ ఉపాధ్యాయుడు నడుపుతున్న ఒక ఆశ్రమ పాఠశాల కూడా ఉండేది. అందులో 65మంది విద్యార్థులుండేవారు.

ములుగు తాలూకాకు పక్కన ఉన్న నర్సంపేట తాలూకాలో కూడా కోయల పరిస్థితిలో దాదాపు ఇదే రకమైన ప్రగతి చూడవచ్చు. ఎక్కడైతే రోడ్లు పడ్డాయో ఆ ప్రాంతాల్లోని కోయల భూములన్నీ అన్యాక్షికాంతమైపోయాయి. ప్రధానంగా హిందూ అగ్రకులాలకు చెందిన వారు ఈ భూములన్నీ ఆక్రమించుకున్నారు. కొన్ని సందర్భాల్లో బంజారాలు కూడా కోయ భూములను ఆక్రమించుకున్నారు. ప్రధానంగా ఈ వలసలన్నీ కూడా 1960-70ల మధ్య కాలంలోనే విచ్చలవిడిగా జరిగా యి. ఈ వలసల తీవ్రతకు నిలువుటద్దంగా సీతనగరంలో జరిగిన మార్పులనే ఉదహరించవచ్చు. అక్కడ కూడా తక్కిన కోయ గ్రామాల్లాగే తమ పూర్వీకుపూవరో అడవిని నరికి సాగుయోగ్యం చేసుకుని వ్యవసాయం సాగించిన భూములను ఆధా రం చేసుకునే కోయలున్నారు. అయితే నిజాం కాలంలో అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తికి ఈ గ్రామం తాలూకు ‘మఖ్తా’ ఇచ్చారు.

అతను స్థానికంగా నివాసముండక పోయినా కోయలను తమ తమ భూముల్లోనే కొనసాగిస్తూ నామమావూతమైన కప్పం వసూలు చేసేవాడు. హైదరాబాద్ సంస్థానం విలీనం తరువాత, వరంగల్ జిల్లాకు చెందిన కొద్ది మంది రెడ్లు, తెలగ కులానికి చెందినవారు అబ్దుల్ అజీజ్ దగ్గర సీతనగరంలోని భూములను కొన్నారు. మూడు తరాల నుంచి సాగు చేసుకుంటున్న కోయల ను ఏ మాత్రం పట్టించుకోకుండా అబ్దుల్ అజీజ్ ఆ భూములను అమ్మాడు. అయితే కొద్ది మంది కోయలు తమ భూములను నిలబెట్టుకునేందుకు అప్పో సప్పో చేసి అబ్దుల్ అజీజ్ దగ్గరి నుంచి తిరిగి కొనుక్కున్నారు. నిజానికి అప్పటికున్న నిబంధన ప్రకారం కోయలు ఆ భూమికి ‘శిఖ్మేదారులు’. అంటే వాటాదారులు. ఆ కారణంగా ఎవ్వరికీ పైసా కూడా చెల్లించకుండానే వాళ్ళకు పట్టాలొచ్చేవి.

కానీ వాళ్లకు ఈ లొసుగులు తెలియకపోవడం, స్థానిక రెవెన్యూ అధికారులు చెప్పకపోవడం వల్ల ఉత్తి పుణ్యానికే అప్పుల ఊబిలో కూరుకుపోవడమే కాక సొంత భూములనే ఎవరి దగ్గరో కొనుక్కునే దౌర్భాగ్య పరిస్థితికి నెట్టివేయబడ్డారు. చివరికి కొంత కాలం తరువాత తమ భూములను నిలబెట్టుకునేందుకు రెడ్ల దగ్గర్నుంచి తెచ్చిన అప్పును తిరిగి చెల్లించలేకపోవడంతో భూములన్నింటినీ జప్తు చేసుకున్నారు. ఇలాంటి అనేక అన్యాయాల పర్యవసానంగా 197 కల్లా 44చోట్ల కుటుంబాలకు మొత్తం 1240 ఎకరాల భూమిలో కేవలం 53 ఎకరాలే మిగిలింది. తక్కిన భూములన్నీ 62 రెడ్డి కుటుంబాలు, 30 తెలగ కుటుంబాలు, మిగతా ఇతర ఆదివాసీయేతర కులాల వశమయ్యాయి. ఈ గ్రామం ఆదివాసీ గ్రామంగా గుర్తించబడినప్పటికీ ఇక ఇప్పుడు ఇది మఖ్తా గ్రామంగా ఉన్న కారణంగా ‘ఆదివాసీ భూ బదిలీల చట్టం’ అమలు చేసేందుకు చాలా తిరకాసులు ఎదురయ్యాయి.

పక్కనే ఉన్న చిన్న ఐలాపురంలో కోయల పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. అక్కడ కూడా తాతల కాలం నుంచి వస్తున్న భూముల్లోనే సాగుచేసుకుంటున్నారు. అయితే హైదరాబాద్ సంస్థానపు ఆదివాసీ భూ నియంవూతణ చట్టం, దాదాపు అదే కాలంలో వచ్చిన ‘ఆంధ్ర భూ బదిలీ చట్టం’ అమలులోకి వచ్చిన 20 ఏళ్ల కాలంలో గొల్ల కులానికి చెందిన వాళ్లు కోయ ల భూములన్నీ ఆక్రమించుకున్నారు. 197లో కేవలం కోయ కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. వారికి కూడా సగటున అర ఎకరం మాత్రమే ఉండిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

ఒక్క నర్సంపేట తాలూకాలోనే, అదీ తారు రోడ్లు పడని మారుమూల ప్రాంతా ల్లో మాత్రమే కోయలు తమ భూములనూ, స్వేచ్ఛనూ నిలుపుకోగలిగారు. ఖమ్మంజిల్లాలోని యెల్లనాడు తాలూకా సరిహద్దులను ఆనుకుని ఉన్న మాదాగూడెం, గంగారం లాంటి గ్రామాల్లోనయితే ఉన్న భూములన్నీ కోయలే కలిగిఉన్నారు. వారి పక్కా ఇళ్లు కూడా కోయల మెరుగైన ఆర్థిక పరిస్థితికి సూచికలుగా ఉంటాయి. ఆదివాసీయేతరుల కబ్జాలకూ ముందున్న స్వేచ్ఛ, హోదా అక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పాకాల, ఎల్లనాడులను కలుపుతూ ఒక తారు రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం పథకమొకటి తయారు చేసిందట. అదే కనుక జరిగితే కోయలకు గడ్డు రోజులు దగ్గర పడినట్టే లెక్క.

ఎందుకంటే అంత వరకు ఆదివాసీయేతరులు ప్రవేశించడానికి వీలులేని ఈ ప్రాంతాలన్నీ ఒక్కసారిగా అందుబాటులోకి వస్తాయి. తారు రోడ్డు పడిన ప్రతి చోటికి ఆదివాసీయేతరులు ప్రవేశించి స్థిరపడటం మొత్తం అన్నిచోట్లా జరుగుతున్న పరిణామమే.

ఈ ఉదాహరణలన్నీ ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ గ్రామాలన్నీంటినీ నేను 1940లో మొదటిసారి, 7లో రెండవసారి సందర్శించాను. ఈ మధ్య కాలంలోఆదివాసీ భూ బదిలీ నిరోధక చట్టం, ఆదివాసీ సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన పథకాలు ఎన్ని అమలైనా ఆదివాసీ భూముల కబ్జా మాత్రం అంతకంతకు పెరిగింది. అన్యాక్షికాంతమైన ఆదివాసీ భూములను తిరిగి అప్పగించేందుకు ఆదిలాబాద్ జిల్లాలో అధికార యంత్రాంగాన్ని నియమించినప్పటికీ వీటిని ఆపలేదు. భూమిని ఆదివాసీలకు అప్పగించేందుకు ప్రభుత్వం ఒక డిప్యూటీ కలెక్టర్‌ను నియమించింది. ములుగు నర్సంపేట తాలూకాలో డిప్యూటీ కలెక్టర్‌ను సహకరించేందుకు గాను ఒక్కొక్క తాలూకాకు ఒక్కో డిప్యూటీ తహసీల్దారునూ నియమించారు. ఇంత చేసినా అధికార గణాంకాలు మాత్రం యథేచ్ఛగా సాగిన భూ బదిలీలతో పాటు చట్టాల, అధికారుల ‘సమర్థత’ను చెప్పకేనే చెబుతున్నాయి.

ప్రస్తుతం నవంబర్ 1975 వరుకు జరిగిన పరిణామాలకు సంబంధించిన అధికార గణాంకాలు లభ్యమవుతున్నాయి. లెక్కల ప్రకారం 5,025 మంది ఆదివాసీయేతరులు అక్రమంగా 32,790 ఎకరాల ఆదివాసీ భూమిని ఆక్రమించుకున్నారు. భూ బదిలీ నియంవూతణ చట్టంలోని సెక్షన్ 3 (2)కింద దాదాపు 3,244 ఎకరాల ఆదివాసీ భూమికి సంబంధించి 1924 కేసులు నమోదయ్యాయి. 2,35 ఎకరాలకు సంబంధించిన 1,494 కేసుల్లో ఆదివాసుల పక్షం తీర్పు చెప్పినప్పటికీ, వాస్తవంలో 1,313 ఎకరాల భూమి మాత్రమే ఆదివాసీలకు తిరిగి అప్పగించబడింది. ఈ లోపాలన్నీంటికీ మూల కారణం చట్టంలో ఉన్న అస్పష్టతే. హైదరాబాద్ సంస్థా నం ఉన్న రోజుల్లో తయారైన ఆదివాసీ ప్రాంతాల నియంవూతణ చట్టం, విలీనం తరువాత వచ్చిన ఆంధ్రవూపదేశ్ (షెడ్యూలు ప్రాంతాల) భూ బదిలీ చట్టంగా రూపాంత రం చెందే క్రమంలో అందులోని చాలా విషయాలు గందరగోళంగా తయారయ్యా యి. ఈ అస్పష్టతతో పాటు అధికారుల్లో అలసత్వం అన్నింటికీ మించి రాజకీయ నాయకులు ఆదివాసీయేతరుల పక్షం వహించి, తమ పరపతి, అధికారాలతో ఆదివాసీ సంక్షేమం కోసం రూపొందించిన అన్ని చట్టాలనూ తుంగలో తొక్కారు.
(సేకరణ : నూర శ్రీనివాస్, టీన్యూస్ ప్రతినిధి-వరంగల్)
Namasete Telangana News Paper Dated 30/1/2012 

ప్రాసంగికతే ప్రమాణం


- ఎమెస్కో విజయకుమార్

ట్రావెన్‌కోర్ సంస్థానంలో హరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించాలని మహాత్మాగాంధీ సంస్థానాధిపతికి సూచించారు. ఈ విషయమై సంస్థానాధిపతి మహాత్మాగాంధీ సమక్షంలో అక్కడ పండిత పరిషత్ ఏర్పాటు చేశారు. సుదీర్ఘమైన చ ర్చ జరిగింది. భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి. పండితుల్ని మహాత్మాగాంధీ ఒక ప్రశ్న అడిగారు.

"మీ రాజు ఆజ్ఞాపిస్తే మీరు హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పిస్తారా?''అని. దానికి పండితులు రాజాజ్ఞను పాటిస్తామని సమాధానం చెప్పారు. మహాత్ముడు సంస్థానాధిపతితో "అయ్యా! ఈ విషయంలో మీరు వెంటనే ఉత్తర్వులు జారీ చేయండి'' అని కోరారు. ఆనాటినుంచి అక్కడ హరిజనులకు ఆలయ ప్రవేశం దక్కింది. ఇది సుమారు ఏడు దశాబ్దాల క్రితం మాట. స్థూలంగా కనపడేదేమంటే మహాత్మునిపై గౌరవంతో రాజు అలాంటి ఆదేశాలు ఇచ్చారనేది. కానీ కొంచెం సూక్ష్మంగా పరిశీలిస్తే ఇక్కడ స్పష్టంగా ఒక విషయం అర్థమవుతుంది.

రాజుకు మహాత్మునితో రాజకీయమైన అవసరం ఉంది. ఆ అవసరమే ఉత్తర్వులను జారీచేయడానికి ఉపయోగపడింది. ఇది వాస్తవ సంఘటన. కులానికి సంబంధించిన విషయంలో అత్యంత పట్టింపుతో ఉండే కేరళ వంటి రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన నా వ్యాసానికి తగిన నేపథ్యాన్ని సమకూరుస్తుందని భావిస్తున్నాను. మన దేశం అనేక సంస్కృతుల జీవన విధానాల సమ్మేళనం. వందల వేల తెగలు, భాషలు, యాసలతో ఎప్పుడూ క్రియాశీలంగా ఉండడం మన సంస్కృతికి ఉన్న ప్రధానమైన లక్షణం.

ఇంత వైవిధ్యం ఉన్న దేశం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఈ ప్రాంతం అంతా ఒక దేశంగా పిలవబడటమే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత దేశమనే రాజకీయ స్వరూపం వచ్చి ఉండవచ్చు. కానీ వేల సంవత్సరాలనుంచి హిమాలయాలకి దక్షిణ ప్రాంతాన్ని భరతవర్షంగా పిలుస్తూనే ఉన్నారు. అంటే ఈ దేశాన్ని ఏకం చేస్తున్నది ఓ అంతర్గతమైన సాంస్కృతికధార తప్ప రాజ్యం కాదు అనేది మనకి స్పష్టమవుతుంది.

మన దేశంలో విద్య ప్రధానంగా మౌఖిక సాంప్రదాయంతో ఒకరినుంచి ఒకరికి సంక్రమించేది. ఆ సందర్భం లో అన్ని రకాల వృత్తులకు సంబంధించిన జ్ఞానం అనువంశికంగా ఒకరినుంచి ఒకరికి సంక్రమిస్తూ తరాలు మారుతూ ఉండటం మనం గమనించాలి. ఆ విధానంలో భాగంగానే కుల వ్యవస్థ ఏర్పడిందని మనం భావించవచ్చు. ఏ వ్యవస్థ అయినా సదాశయంతోనే ఏర్పడుతుంది. అయితే ఆ వ్యవస్థను స్వప్రయోజనాలకు ఉపయోగించుకునేవారు ఎప్పుడూ ఉంటారు.

కులం అనే ఒక సమూ హం ఏర్పడిన తర్వాత వ్యక్తితో సంభాషించడం కన్నా సమూహంతో సంభాషించడం పాలనావ్యవస్థకు (రాజ్యానికి) ఉన్న సౌలభ్యం కులవ్యవస్థ పటిష్టం కావడానికి ప్రధానమైన కారణం. మనిషి సమూహంగా ఏర్పడడానికి కులం అవసరమైన సందర్భంలో సమూహాలు రాజ్యానికి అవసరమైనాయి. ఈ నేపథ్యంలో మనం ఆలోచిస్తే ఈ అసమానతలకు ప్రధానమైన కారణం రాజ్యం మాత్రమే.

విద్య సమాజంలో అనేక మార్పులను తీసుకు వచ్చింది. ప్రతికులంలో అగ్రస్థానంలో ఉన్నవారి సహకారంతో రాజ్యం సమూహాలపై అధిపత్యం సంపాదించింది. 'హిందూ మతానంతర భారత దేశం' రచయిత అయిన ఐలయ్య ప్రకారం సమాజంలో విజ్ఞాన శాస్త్రం మొత్తం బహుజన కులాల వల్లే అభివృద్ధి చెందింది. బహుజన కులాలను దూరం చేసుకుంటే వారిపట్ల వివక్ష పాటించే ధోరణి కొనసాగిస్తే హిందూమతం అంతమవుతుంది. ఇక్కడ కొన్ని ప్రధానమైన ప్రశ్నలున్నాయి. అసలు అగ్రకులం ఎవరు? నిమ్న కులం ఎవరు?

సమాజంలో రాజ్యానికి దగ్గరగా ఉండేవాళ్ళు అగ్రకులస్తులు. వారికి రాజును మార్చే శక్తి కూడా ఉంటుంది. వారికి కావలసిందల్లా రాజ్యవ్యవస్థ కొనసాగటం మాత్రమే. ఏ వర్గం నుంచయినా విద్యవల్లగాని, జ్ఞాన సముపార్జనవల్లగానీ సమకూరిన తాత్త్విక జ్ఞానంతో కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమయితే ఆ వర్గం తన అస్తిత్వాన్ని స్పష్టంగా ప్రకటించుకోగలిగితే రాజ్యం వారిని దగ్గరకు తీస్తుంది. అధికారంలో భాగం ఇస్తుంది.

సమాజాన్ని విద్యావంతుల్ని చేయటం, చైతన్యవంతుల్ని చేయటం రాజ్యం బాధ్యత. కానీ, ఇప్పటివరకు ఏ రాజ్యమూ తమ ప్రజలు చైతన్యవంతులు కావాలని కోరుకున్న దాఖలాలు లేవు. అలాగే మా పిల్లలకు మంచి విద్య కావాలి అని ఉద్యమాలు జరిగిన దాఖలాలు లేవు. అందుకు కారణం కూడా రాజ్యమే. విద్యపై పెట్టే పెట్టుబడికి ఫలితాలు వెంటనే కనబడవు. రాజ్యం విద్యపై పెట్టే పెట్టుబడికి ఫలితం 20 సంవత్సరాల తరువాత కనిపిస్తుంది. అందుకే రాజ్యం తాలూకు ఆశయాల్లో మాత్రమే విద్య మిగిలి ఉంది. ఆచరణలో లేదు. కొందరు చైతన్యవంతులైన వ్యక్తులు, సమూహాలను విద్యావంతుల్ని, చైతన్యవంతుల్ని చేశారు. రాజ్యానికి యథాతథ స్థితి ఇష్టం. ఇది వాస్తవ పరిస్థితి.

ఐలయ్య ప్రకారం హిందూ మతంలో సమూలమైన మార్పులు రాకపోతే ఆ మతం అంతమైపోయే ప్రమాదం ఉంది. హిందూ మతం అంతరించిపోయినంత మాత్రాన ప్రపంచం తలకిందులైపోదు. ఏ దేశానికైనా దాని సంస్కృతి జీవగర్ర. ఇక్కడి ప్రజల అస్తిత్వం దేశీయ తాత్త్విక భావనల్లోనే ఉంది. జాతి తాలూకు తాత్త్విక పునాదుల్లో వ్యక్తి తననితాను ప్రకటించుకుంటారు. ఎప్పుడైతే అస్తిత్వాన్ని కోల్పోతాడో అప్పుడు అతనిలో ఆత్మన్యూనతా భావం పెరుగుతుంది. సమాజం బలహీనపడుతుంది. అందుకే భారతీయ భావనల స్థానే విదేశీతత్త్వ భావనలు ఇక్కడ ఆక్రమిస్తే మాత్రం అది ప్రమాదకరమే. అందుకే హిందూమతంలో సమూలమైన మార్పులు రావలసిన అవసరం ఉంది.

హిందూమతంలో మార్పులు వేగవంతం కావలసి ఉంది. దీనికి భారతీయులైన వారందరూ ప్రయత్నించాలి. అసలు హిందూమతానికి క్రైస్తవమూ, ఇస్లాము తదితర మతాలు ప్రత్యామ్నాయాలా అనేది మరో ప్రశ్న. ఐలయ్య తన గ్రంథంలో హిందూమతం హింసను బోధించే మతం అనే భావన కలగజేశారు. మతం అనేది మనిషిని పూర్తి స్థాయిలో నియంత్రించగలిగితే క్రైస్తవాన్ని పాటిస్తున్న అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఇరాన్‌పై ఎందుకు యుద్ధం చేశాయి?

అది ఆధిపత్య భావన కాదా? ఏ ఇస్లాం చెప్పిందని ఒసామాబిన్‌లాడెన్ అమెరికాపై దాడి చేశాడు. మతం ఎవర్నీ నియంత్రించదు. ప్రతివాళ్లు మతాన్ని తమ అవసరాలకు ఉపయోగించుకుంటారు. బలహీనులపై బలవంతులు దాడి చేయడానికి కావలసిన లెజిటమసీని మతం నుంచి స్వీకరిస్తారు. ప్రపంచంలోని ఏ మతం ప్రజాస్వామికం కాదు. అన్ని మతాలు నాశనమైన క్షణాన హిందూమతం సమూలంగా నాశనం అవటానికి ఎవరికీ అభ్యతరం ఉండవలసిన అవసరం లేదు.

ఈ సందర్భంలో ఇంకో విషయాన్ని ప్రస్తావించాలి. ఈ దేశంలో నాలుగు వేల సంవత్సరాలుగా సాహిత్యసృష్టి జరుగుతుంది. మొదటితరం సాహిత్య గ్రంథమైన ఋగ్వేదం నుంచి అనంతమైన సాహితీ సృజన జరిగింది. సాహిత్యం, అది సృజించిననాటి సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబిస్తుంది. అప్పటి సమాజానికి మంచిదైనదాన్ని ప్రబోధిస్తుంది. భారతీయ మత గ్రంథాలుగా భావించబడే సాహిత్యమంతా ఆనాటి సాంస్కృతిక సామాజిక పరిస్థితుల్ని మనముందుంచే సాధనాలుగానే భావించాలి.

ప్రాచీనత ఏ వస్తువుకూ పవిత్రతను ఆపాదించదు. ఆచరణీయత, నిరంతర ప్రాసంగికత మాత్రమే ఏ సాహిత్య వస్తువుకైనా పవిత్రతను తెచ్చిపెడుతుంది. భారతీయ మౌఖిక సాహిత్యంలో అనేకానేక ప్రక్షిప్తాలు ఉండే అవకాశం ఉంది. వాటిని వేదవాక్కులుగా భావించేవారు ఎంత మూర్ఖులో వాటి ప్రమాణంలో భారతీయతను కొలవాలనుకునేవారు కూడా అంతే మూర్ఖులుగా భావించాలి.

అందుకే భారతీయ సాహిత్యం మొత్తాన్ని మతగ్రంథాలుగా భావించటం వాటి ద్వారా భారతీయ మతవ్యవస్థను గణించటం అభిలషణీయం కాదు. విషయం తాలూకు వర్తమాన ప్రాసంగికతను మాత్రమే ప్రమాణంగా తీసుకునే లక్షణం మనం అలవర్చుకోవాలి. మంచిని ఆహ్వానించే గుణం, చెడును తిరస్కరించే ధైర్యం భారతీయ సమాజానికి ఉంది. ఆ ఒక్క లక్షణమే అనేకానేక తాత్త్విక ధారల్ని ఈ గడ్డకి ఆహ్వానించేటట్లు చేసింది.

భారతీయ రాజ్యవ్యవస్థ తన అస్తిత్వాన్ని పటిష్టపరచుకోవడానికి ఉపయోగించిన మరొక ఆయుధం ధర్మం. ఆ ధర్మం బ్రాహ్మణుల ఆధీనం. ధర్మం ఆధారంగా జీవించవలసిన బ్రాహ్మణ వ్యవస్థ తాము చెప్పిందే ధర్మమనే అహంకారాన్ని ప్రదర్శించడానికి రాజ్యం ఉపయోగపడింది. సమాజంలో పొరలుపొరలుగా ఏర్పడ్డ కులవ్యవస్థ కరుడుకట్టుకుపోవడానికి ఇది దోహదపడింది. అయితే ఆలోచనాపరులు, చైతన్యవంతులు ఈ విషయాన్ని గమనించకపోలేదు, ప్రశ్నించకపోలేదు, మార్చడానికి ప్రయత్నించకపోలేదు.

మార్పు జరుగుతూనే వుంది. కాకుంటే అనుకున్నంత వేగంగా జరుగుతుందా అనేదే ప్రశ్న. ఈ విషయాన్నే అరవిందరావు 'ఆత్మవిమర్శా? అంతర్యుద్ధమా?' (ఆంధ్ర జ్యోతి, జనవరి 17) తన వ్యాసంలో వివరించారు. దాన్ని నేను పునశ్చరణ చేయదల్చుకోలేదు. సమాజంలో మనుషుల మధ్య ఏరకమైన వివక్ష క్షంతవ్యం కాదు. చైతన్యవంతమైన సమాజం నిరంతరం మార్పు చెందుతూనే వుంటుంది. గతాన్ని ఇవాళ సమీక్షించగలంగాని, బోనులో నిలబెట్టలేం. అది ఆచరణసాధ్యం కాదు.

- ఎమెస్కో విజయకుమార్
ప్రచురణకర్త 
Andhra Jyothi News Paper Dated 30/1/2012 

సిద్ధాంత విమర్శ సరే, ఆత్మ విమర్శ కావాలి


- కె. శ్రీనివాస్

కమ్యూనిస్టుల మీద ఎంతటి వ్యతిరేకత ఉన్నవారు కూడా ఒప్పుకునే విషయం ఒకటుంది. ఇప్పుడున్న ప్రపంచం అన్యాయమైనదని, దాన్ని మరమ్మత్తు చేసి తీరాలని అనుకోవడమే కాకుండా, దాని కోసం కమ్యూనిస్టులు ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నం కూడా గట్టి విశ్వాసంతో, దీక్షతో, సాహసంతో, త్యాగంతో చేస్తారు. ఇప్పుడు నానా గోత్రాలుగా విడిపోయిన కమ్యూనిస్టులందరికీ వర్తిస్తాయా అంటే- కనీసం కట్టుబాటు, వ్యక్తిగత నిస్వార్థత విషయాల్లో వర్తిస్తాయనే చెప్పాలి. అందువల్ల రాజకీయాల్లో కమ్యూనిస్టులను ప్రత్యేకంగా, సీరియస్‌గా పట్టించుకోవలసి ఉంటుంది.

సత్యం ఒకటే కానీ, పండితులు దాన్ని రకరకాలుగా చెబుతారు- అని వేదం అంటుంది కానీ, నిజానికి, సత్యాలు కూడా అనేకం, ఎవరి సత్యాన్ని వారు చెబుతారు. తామనుకున్నదే సత్యం అనుకోకపోతే లోకంలో ఇన్ని అభిప్రాయాలు ఎందుకుంటాయి, ఇన్ని కమ్యూనిస్టు పార్టీలు ఎందుకుంటాయి? ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలోను, దాన్ని ఎట్లా తమ లక్ష్యానికి అనుగుణంగా మార్చాలనే విషయంలోను కమ్యూనిస్టు పార్టీల మధ్య అనేక తేడాలున్నాయి. ఇతరుల అవగాహనను, పనిపద్ధతులను మితవాదమని, అతివాదమని కమ్యూనిస్టు పార్టీలు పరస్పరం విమర్శలూ చేసుకుంటాయి.

స్థూలంగా చూస్తే, పార్లమెంటరీ విధానంలో పాలుపంచుకుంటూ ప్రధాన స్రవంతి రాజకీయాలలో భాగంగా ఉండే కమ్యూనిస్టులు కొందరు, వ్యవస్థను పూర్తిగా నిరాకరిస్తూ తీవ్రమైన వైఖరితో సాయుధపోరాటమార్గంలో మాత్రమే పనిచేసే కమ్యూనిస్టులు కొందరు, ఉభయచరాలు కొందరు మనకు కనిపిస్తారు. ఆదర్శాలే హాస్యాస్పదంగా భావించే ధోరణి పెరిగిపోయాక, కమ్యూనిజాన్ని ఒకానొక అవశేషంగా భావించేవారూ పెరుగుతున్నారు. అయితే, కమ్యూనిస్టేతర పక్షాలు సర్వభ్రష్టత్వాన్ని సాధించి, ఎటువంటి గౌరవానికీ అభిమానానికీ అర్హత కోల్పోయిన సమయంలో, కమ్యూనిస్టు పార్టీల వైపు కొంత మినహాయింపుతో, ఆశగా చూస్తున్న జనమూ ఉన్నారు.

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ మధ్య రాష్ట్రంలో జరిగాయి. కొద్దిరోజుల్లో ఖమ్మంలో భారత కమ్యూనిస్టు పార్టీ-మార్క్సిస్టు (సిపిఐఎం) రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయకమ్యూనిస్టు పార్టీల విలీనం, ఐక్యత గురించిన చర్చ మొదలయింది. కలిసిపోవాలనే ఆకాంక్ష సిపిఐ నుంచి బలంగా వ్యక్తమయినట్టు, సమస్యలున్నాయి కాబట్టి కలసిపనిచేస్తూ పోదాం అని సిపిఎం భావిస్తున్నట్టు అర్థమవుతోంది.

ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ 1964లో తొలివిభజనకు గురి అయిన నాటి సైద్ధాంతిక సమస్యలు, అనంతర కాలంలో దేశ వ్యవస్థను అర్థం చేసుకోవడంలో, వ్యాఖ్యానించడంలో ఉన్న భేదాలు, ఎమర్జెన్సీలో సిపిఐ వైఖరి- మొదలైనవి రెండు పార్టీల విలీనావకాశాల్లో కనిపిస్తున్న కొన్ని నలుసులు. సాయుధపోరాట మార్గంలో ఉన్న కమ్యూనిస్టుపార్టీలతో కూడా సిపిఐ మిత్రత్వాన్ని ప్రదర్శిస్తుంది కానీ, సిపిఎం అందుకు ఏ మాత్రం సుముఖంగా లేదు.

ఉభయ కమ్యూనిస్టు పార్టీలు వేరువేరుగా పనిచేయడం ప్రారంభించి యాభై ఏళ్లు అవుతోంది కాబట్టి, ఇప్పుడు కలిసిపోవడంలో ఆచరణాత్మక సమస్యలు కూడా ఉంటాయి కానీ, వారు చెప్పుకునే సైద్ధాంతిక అంశాలు అసంగతంగానే కనిపిస్తాయి. సోవియట్ యూనియన్ ఇప్పుడు లేదు. భారతదేశంలో జాతీయ బూర్జువావర్గం పాలిస్తున్నదని సిపిఐ అనుకున్నా, బడాబూర్జువా-భూస్వామ్యవర్గాలు పాలిస్తున్నాయని సిపిఎం అనుకున్నా- వారి రాజకీయ, పోరాట వ్యూహాల్లో ప్రజలకు ఆ తేడా ఏమీ కనిపించదు. కాకపోతే, మార్క్సిస్టు పార్టీ పోరాట పద్ధతులు కొంత మిలిటెంట్‌గా కనిపిస్తాయి.

ఏ ప్రత్యామ్నాయం లేకుండా అధికారంలో కొనసాగిన కాలంలో కాంగ్రెస్ వెంట సిపిఐ నడిచేది. ఇప్పుడు మతతత్వ ప్రమాదాన్ని నిరోధించడానికో, ఉన్నశక్తుల్లో మెరుగైన మిత్రులను ఎంచుకోవాలనే విచక్షణతోనో సిపిఎం కూడా కాంగ్రెస్ మిత్రశిబిరంలోనే ఉన్నది. సిపిఐని రివిజనిస్టులని చేసే విమర్శ తీవ్రత ఇప్పుడు తగ్గింది కానీ, సిపిఐ అంటూ ఒకటి ఉంటే తప్ప, తమకు మిలిటెంట్ పరిగణన లభించదని సిపిఎంకు తెలుసు. ఎమర్జెన్సీ అనంతర కాలంలో సిపిఎం తన పాత స్వభావానికి క్రమంగా ఎడం జరుగుతూనే వచ్చింది. అత్యవసర పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొన్న పార్టీగా బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మొన్న అక్కడ ఘోరపరాజయం పొందడం దాకా సిపిఎం చేసిన ప్రయాణంలో ఈ పరిణామాన్ని గమనించవచ్చు.

కమ్యూనిస్టులు నవ్వులాటగా మార్చిన మాటల్లో 'ఆత్మవిమర్శ' ఒకటి. తప్పులు చేయడం, తప్పు అని తెలిసి కూడా చేయడం- ఆ తరువాత ఆత్మవిమర్శ చేయడం, ఆ పైన కొత్త తప్పులు చేయడం- భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమప్రస్థానంలో ఇదొక ఆనవాయితీ. అలాగే, సిద్ధాంతం సరిఅయినదే కానీ, అన్వయంలోనే లోపాలు అని ఒకసారి, ఆచరణ సరిగానే ఉన్నది, సిద్ధాంతాన్నే మార్చుకోవాలి అని మరోసారి సమయాన్ని బట్టి వాదించడం కూడా కమ్యూనిస్టులకే చెల్లింది. బెంగాల్ పరాభవం తరువాత మార్క్సిస్టు పార్టీ ఆత్మవిమర్శ చేసుకుంటుందని కొందరైనా ఆశించారు.

మీడియాకు ఎటువంటి ప్రకటనలు ఇచ్చారనేది పక్కనబెడితే- మార్క్సిస్టు పార్టీ ఇప్పుడు మౌలిక సైద్ధాంతిక అంశాలపైనే ఆత్మవిమర్శకు పూనుకున్నది. డెంగ్ స్ఫూర్తితో బెంగాల్‌లో చేయతలపెట్టిన ప్రయోగం అటు కార్పొరేట్లను, ఇటు ప్రజలను సంతృప్తిపరచలేదు. దేశమంతటా ఒక విధానం, బెంగాల్‌లో ఒక విధానం ఏమిటని బుద్ధిజీవులు ప్రశ్నించారు. ఎర్రప్రభుత్వం ఆచరణలోని ఈ వైరుధ్యాన్ని పరిష్కరించడానికి పార్టీ పూనుకున్నది. త్వరలో జరగనున్న సిపిఎం 20వ మహాసభల్లో సరికొత్త సైద్ధాంతిక విధానాన్ని చర్చకు పెట్టనున్నది. సోవియట్ కమ్యూనిస్టు పార్టీ 20వ మహాసభలు చరిత్రలో ఎటువంటి సంచలనం సృష్టించాయో, భారత కమ్యూనిస్టు చరిత్రలో ఈ సభలు కూడా అటువంటి కలకలమే సృష్టిస్తాయంటున్నారు.

సోషలిస్టువ్యవస్థలో కూడా మార్కెట్‌కు ప్రాసంగికత ఉంటుందని, కేంద్రీకృత ప్రణాళికారచన ద్వారా మార్కెట్‌ను నియంత్రించవచ్చునని పార్టీ సైద్ధాంతిక పత్రంలో ప్రతిపాదిస్తారని చెబుతున్నారు. అంతే కాకుండా, ఏకపార్టీ వ్యవస్థ కాకుండా, మెరుగైన ప్రజాస్వామిక రూపాలను సోషలిజంలో అనుసరించాలని ప్రతిపాదిస్తారట. ప్రపంచీకరణ కారణంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో సిద్ధాంతాలను సవరించుకోవలసిన అవసరం ఉన్నదని మార్క్సిస్టు పార్టీ అభిప్రాయపడుతున్నది. సహజ వనరులు, భారీపరిశ్రమలు ప్రభుత్వ అధీనంలోనే ఉండాలని, ఒక స్థాయి వరకు వర్తక వాణిజ్యాలను ప్రైవేటురంగంలో అనుమతించవచ్చునని కూడా పార్టీ సిద్ధాంత పత్రం సూచించవచ్చు.

బెంగాల్ అనుభవం పార్టీని రాజీలేని కరకు వైఖరిలోకి మార్చగలదని ఆశించినవారికి ఈ కొత్త సిద్ధాంతాలు రుచించకపోవచ్చు. సోషలిజం వచ్చిన తరువాత ఏం చేయాలన్నది సరే, అక్కడి దాకా చేసే ప్రయాణం ఎట్లా? అన్న ప్రశ్నకు పార్టీ ముసాయిదా రాజకీయ పత్రంలో సంతృప్తికరమైన సమాధానాలు కనిపించవు. కమ్యూనిస్టు పార్టీలు స్వతంత్రంగా పనిచేస్తూ, భావసారూప్యం ఉన్న పార్టీలను వెదుక్కుని వారితో అంశాలవారీగాకానీ, ఎన్నికల రంగంలో కానీ కలసి పనిచేయడం పార్టీ రాజకీయ కార్యక్రమం. తరిగిపోతున్న గ్రామీణ పునాదుల్ని పటిష్టం చేసుకోవడం, అసంఘటిత కార్మికరంగంలో పనిచేయడం, సామాజిక అంశాలపై కూడా పోరాడడం- అన్నది ఉద్యమ కార్యక్రమం.

విప్లవం, సమసమాజం వంటి సుదూర ఆశయాల సంగతి పక్కనబెడితే, సాధారణ ప్రజలు కమ్యూనిస్టు పార్టీల నుంచి, ముఖ్యంగా ఉభయకమ్యూనిస్టుల నుంచి కోరుకుంటున్నది తక్కిన పార్టీల కంటె భిన్నంగా ఉండడం. రాజకీయ ప్రయోజనాలు, ఎన్నికల లెక్కలు చూడకుండా, ప్రజలకు అవసరమైన చోట్ల, అవసరమైన రీతిలో అండగా నిలబడడం. ప్రపంచీకరణ పేరుతో ఆర్థిక వలసీకరణ జరుగుతున్నదని, అమెరికా ఏకధ్రువ ఆధిపత్యానికి, మూడోప్రపంచ దేశాల ప్రజలకు మధ్య ఉన్న వైరుధ్యమే ప్రధానమైనదని భావించేవారు, అందుకు అనుగుణమైన కార్యక్రమాన్ని రూపొందించాలి. సిద్ధాంతాన్ని సమీక్షించుకోగలిగిన వారు తమ ఆచరణలను కూడా సమీక్షించుకోగలగాలి.

విప్లవానంతరం కమ్యూనిస్టుదేశాల్లో శ్రామికవర్గ నియంతృత్వం పార్టీ నియంతృత్వంగా, పార్టీనేత నియంతృత్వంగా పరిణమించిందని గుర్తిస్తున్నవారు, తమ సొంత పార్టీల్లో ఎంత మేరకు ప్రజాస్వామ్యం ఉన్నదో, కేంద్రీకృతప్రజాస్వామ్యం, ఉక్కు క్రమశిక్షణ పేరుతో మైనారిటీ అభిప్రాయాలకు ఏ గతి పడుతున్నదో చూడగలగాలి. అస్తిత్వ ఉద్యమాలన్నీ ప్రపంచీకరణ నేపథ్యంలో మార్కెట్ ప్రోత్సాహం పొందుతున్న ధోరణులని చెప్పగలుగుతున్న ప్రకాశ్ కరత్ వంటి వారు, కమ్యూనిస్టు పార్టీల్లో అగ్రకుల ఆధిపత్యం, పురుషాధిక్యం ఎందుకు కొనసాగుతున్నాయో చూడడానికి అంతర్ముఖులు కావాలి.

రెండు కమ్యూనిస్టు పార్టీలు రెండుగా ఉండడమే సామాన్యులకు హితవుగా ఉంటుంది. పద్ధతి ప్రకారం పనిచేయగలిగిన పార్టీలు ఎన్ని ఎక్కువుంటే అంత మంచిది. రెండు పార్టీలు ఉండబట్టే కదా, ఒకటి తెలంగాణవాదాన్ని, మరొకటి సమైక్యవాదాన్ని సమర్థిస్తున్నాయి? సిపిఐ అంటూ విడిగా ఉండబట్టే కదా, బుద్ధదేవ్ హయాంలో బెంగాల్ తీరుతెన్నులపై మిత్రవిమర్శ అయినా వచ్చింది! పోరాట తీవ్రతలో తేడాలుండవచ్చును కానీ, భిన్నాభిప్రాయలపై సహనం, ఉదారత సిపిఐ అధికంగా కనబరుస్తుందనే అభిప్రాయం ఉన్నది. కలసి పనిచేయగలిగే రంగాలలో కలసి పనిచేయవచ్చు. అధికారానికి రాగలిగే చోట్ల పీఠాలను పంచుకోనూ వచ్చు. కానీ, ప్రజారంగంలో మాత్రం బహుళత్వమే ఆహ్వానించదగింది.

- కె. శ్రీనివాస్ 
Andhra Jyothi News Paper Dated 30/1/2012 

Thursday, January 26, 2012

బక్క బ్రాహ్మలకు అంత బలం ఉందా?



- రావులపాటి సీతారాంరావు

ఏ కులంలో పుట్టాలన్నది నా చేతిలో లేకపోయినప్పటికిని నేను పుట్టిన కులాన్ని ఈసడించుకునేంతగా ప్రభావితం చేసిన కంచ ఐలయ్య రాసిన పుస్తకం 'హిందూ మతానంతర భారతదేశం' చదివిన తర్వాత నాకెన్నో నగ్న సత్యాలు తెలిసిన భావన కలిగింది. రచయిత విజ్ఞప్తి మేరకు సొంతనీతిని దృష్టిలో పెట్టుకోకుండా నా మీద నేను జాలిపడకుండా చదవటం వలన, హిందూ మతమన్నా, హిందూ జాతీయ వాదమన్నా అర్థమయి యీ పనికి మాలిన వ్యవస్థలో ఎందుకు భాగస్వామి నయ్యానా అనే ఆలోచన యీ పుస్తకం చదివినప్పటి నుంచీ నాకు ఊపిరి ఆడనివ్వడం లేదు. 

అన్ని మతాలు సమానమనే లౌకిక తత్వాన్ని ప్రతిపాదించిన భారత రాజ్యాంగం మీద ప్రస్తుతం నాకు నమ్మకం సడలింది. అశాస్త్రీయ, అనైతిక, ఉత్పత్తి వ్యతిరేక విధానాలను అనుసరించిన బ్రాహ్మణీయ హిందూ మతం, ఇతర మతాలతో పోల్చినప్పుడు ఎంత తక్కువ స్థాయిలో వుందో రచయిత తన అపూర్వ వాద పటిమతో వివరించటం వల్ల ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యమేమిటో నా అవగాహనలోకి వచ్చింది! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముద్రించిన యీ సంవత్సరపు డైరీలో అందుకనే కాబోలు హిందూ మతానికి సంబంధించిన ఫోటోను ప్రచురించలేకపోయారు. 

నిజం మాట్లాడితే అల్ బెరూనీ వంటి ముస్లిం మేధావుల వల్ల 'హిందూ' అన్న పేరును యీ మతం నోచుకోగలిగింది, అని రచయిత చెప్పారు. అదే గనుక జరుగక పోయినట్లయితే పేరులేకుండానే యీ మతం వుండిపోయేది! మాది మతం గాదు జీవన విధానం అని గొప్పగా చెప్పుకోటానికి అలవాటుపడ్డ వారికి ఒక 'జస్టిఫికేషన్' అన్నా దొరికేది! 

రచయిత చెప్పినట్లు క్రైస్తవం, బౌద్ధం, ఇస్లాం మతాల్లో మాదిరిగా హిందూయిజం అన్న మాట మత ప్రవక్త పేరు మీదనో లేక ఆధ్యాత్మిక కృషిలోంచే రూపుదిద్దుకోకపోవటం వల్ల, హిందూ పాలకులు, ఆధ్యాత్మిక శక్తులూ బెరూనీ తొలిసారిగా ప్రతిపాదించిన 'హిందూ' అనే పదాన్ని ఆమోదించి, సొంతం చేసుకున్నాయి! ఈ పుస్తక రచయిత మరో నిజాన్ని కూడా బయటపెట్టారు. అదేమిటంటే 'మన బ్రాహ్మణ మేధావులకు క్రియాశీలత లేకపోవటం వల్ల హిందూయిజం అన్న పేరును సైతం పరాయివాళ్ళ నుంచి అరువు తెచ్చుకోవాల్సివచ్చింది' అని! 

భారత జాతి అంతర్యుద్ధ ప్రమాదం అంచున వుందన్న నగ్న సత్యాన్ని గ్రహించి రచయిత యీ పుస్తకం రాశారు. ఆ ప్రమాదాన్ని ఓ హెచ్చరికలా తీసుకొని హిందూ మతాన్ని కాపాడుకొనే ప్రయత్నం చేసుకోవాలనే సంకేతాన్ని యీ మధ్యనే యీ పుస్తకాన్ని చదివిన కొందరు సూచించడం కూడా జరిగింది! 

ఒక ప్రమాదపు అంచున వున్న జాతిని రక్షించేందుకు రాసిన పుస్తకం అని హృదయపూర్వకంగా నమ్మాను. కంచ ఐలయ్య రాసిన కొన్ని వ్యాసాలు చదివిన తర్వాత ఆయన రాసే ప్రతిదీ యుక్తి యుక్తంగా వుంటుందని, ఎలాంటి ప్రిజ్యుడిస్ లేకుండా విషయాన్ని చెప్పే సాధికారిత వుందని అనుకున్నాను. పుస్తకం చదవటం ఆ విధంగానే కొనసాగించాను. హిందూ మతంలోని కులతత్వం వల్లనే శాస్త్రీయ ఆవిష్కరణలు జరగలేదని యీ జాతి దుస్థితికి కేవలం బ్రాహ్మణ మేధావులే మూల కారకులన్న సంగతిని చదువుతున్నప్పుడు గూడా ఆయనను తప్పుపట్టటటానికి నా మనసు ఒప్పుకోలేదు. ఒక జాతి మేలును కోరిన వ్యక్తి సశాస్త్రీయ అవగాహన లేకుండా అలా రాయలేడు గదా అని సరిపుచ్చుకున్నాను. 

"అయితే యీ మతంలో బ్రాహ్మణులూ, వైశ్యులూ, క్షత్రియులు మాత్రమే హిందువులు అన్న సంగతి చాలా మంది మరచిపోతున్నారు. ఈ కులాలకంటే చాలా తక్కువస్థాయి కులాలుగా పరిగణించబడే శూద్రులకు హిందూ మతంతో వున్న సత్సంబంధాలు అంతంత మాత్రమే! వీళ్ళు హిందూ మతం చచ్చిపోతుందన్న విషయాన్ని పసికట్టారంటే మునుగుతున్న నావను వదిలేసినట్టు వదిలి వెళ్ళిపోతారు'' అన్న వాక్యాలు చదివినప్పుడు మాత్రం విభ్రమానికి గురయ్యాను. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం ప్రక్కన పెట్తే ప్రస్తుత ప్రజాస్వామ్య రాజ్యంలో అధికులుగా సంఖ్యాపరంగా ఉన్న వారికే రాజ్యాధికారం వస్తుంది గదా! 

అలాంటప్పుడు కులం, మతం పేరుతో ఓట్ల పాడి గేదెలను పోషిస్తున్న ప్రస్తుత తరుణంలో యీ మతం ముసుగును వదిలి వెళ్ళటం సాధ్యమా? అన్న ప్రశ్నకు 'లేదు' అన్న స్పష్టమైన జవాబు దొరకగానే ఊరట చెందాను. కంచ ఐలయ్య ఊహించినట్లుగా రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్న యీ 'కొత్త బ్రాహ్మణులు' హిందూ మతాన్ని వదిలివెళ్ళే ప్రసక్తే లేదు! బహుశా రచయిత 'మత మార్పిడి'ని దృష్టిలో వుంచుకొని హిందూ మతాన్ని 'మునుగుతున్న నావ'గా అనుకొని వుండొచ్చు. 

కానీ రాజ్యం వీరభోజ్యం అయినప్పుడు ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యానికి రాజకీయ ప్రజాస్వామ్యానికి తేడాలు కనుమరుగవుతాయి. కులం, మతం, ట్రంప్ కార్డులవుతాయి! అలాంటి పరిస్థితుల్లో 'హిందూ మతం' రచయిత ఊహించినట్లుగా చావుకు దగ్గర కాదు! శాస్త్రీయ పరంగా వేసిన అంచనాలకు భిన్నంగా హిందూ మతం మనగలుగుతుంది! రచయిత ఎత్తిచూపిన కులవ్యవస్థే బలంగా మారుతున్న విచిత్ర వైనం రచయిత శాస్త్రీయ అవగాహనను ఆటపట్టిస్తుందా అన్న అనుమానం చదువరికి కలుగక మానదు. 

అయితే అత్యంత సానుభూతితో బ్రాహ్మణేతర కులాలను, వాటి మూలాలను విశ్లేషించిన విధానం ఎవరినైనా ఆకట్టుకుంటుంది. ఒకొక్క కులం అనుసరించిన ఉత్పత్తి, జీవన శైలిని ఆకర్షణీయంగా చెప్పటం జరిగింది. ఆదివాసులను ఉచిత ఉపాధ్యాయులుగా, బడుగు వర్గాల వారిని బడుగువర్గ శాస్త్రజ్ఞులుగా, క్షురకులను, బట్టలను శుద్ధిచేసే వృత్తిని స్వీకరించిన వారిని సామాజిక వైద్యులుగా యాదవులను మీట్ అండ్ మిల్క్ ఎకనామిస్టులుగా చేతి వృత్తుల వారిని అజ్ఞాత ఇంజనీర్లుగా, కాపులను రైతులను ఆహార ఉత్పత్తిదారులుగా అభివర్ణించడేమ గాకుండా, చాలా కన్విన్సింగ్‌గా వారి నేపథ్యాన్ని యీ పుస్తకంలో ఇవ్వటం జరిగింది. 

చారిత్రాకాధారాలతో నిమిత్తం లేకుండానే వారి అణచివేత తీరుతెన్నుల విశ్లేషణతో పాఠకులు ఏకీభవించే అవకాశం వుంది. అప్పటిదాకా ఎంతో సహేతుకంగా సాగిన రచన 'సామాజిక స్మగ్లర్లుగా, కోమటోళ్ళు' అని కించపరిచే రీతిలో వైశ్యుల పూర్వాపరాలను ఎత్తిచూపటంలో నట్టు పడుతుంది. చరిత్రకారుడిగా, విశ్లేషకుడిగా 'బ్రాహ్మణిజాన్ని' ఎంతగా దుయ్యబట్టినా పట్టించుకోని పాఠకుడు అక్కడి నుంచీ 'షాక్'కు గురవుతాడు. గాంధీ-నెహ్రూ, కోమటి-బ్రాహ్మణత్వం శీర్షిక క్రింద బాపనోళ్ళు-కోమటోళ్ళు అనే పదాల ప్రయోగంతో విలువైన అధ్యయన పర్వానికి స్వస్తి చెప్పటమే గాకుండా చాలా నిర్దయగా ఆ కులాల వ్యవహారాలను చీల్చిచెండాడి రచనలో పారదర్శకత పట్ల అనుమానాలకు రచయిత తావిస్తాడు. 

బ్రాహ్మణులను ఆధ్యాత్మిక నియంతలుగా వేలెత్తి చూపటంలో తప్పుపట్టాల్సిన అవసరం లేదనుకున్న పాఠకులకు కూడా 'బ్రాహ్మణులు తమను తాము ఎంతగా ప్రేమించుకుంటారో, శూద్రుల్నీ, ఛండాలుల్నీ, ఆదివాసులను అంతకంటే ఎక్కువగా ద్వేషిస్తారు' అని చెప్పటంతో ఆ కులం పట్ల ఆయనకున్న అమిత ద్వేష భావం తేటతెల్లమవుతుంది. హిందూయిజం బ్రాహ్మణుల నిబిడీకృతరూపం అన్న సూత్రీకరణతో రచయిత కున్న పూర్తి అవగాహన అవగతమవుతుంది. 

భారతదేశపు దౌర్భాగ్యం ఆ కులం వల్లే అని ఈ దేశాన్ని నాటి నుంచీ నేటివరకూ బ్రాహ్మణిజం పట్టి పీడుస్తూ నాశనం చేస్తున్నదని అనడంతో, ఆర్థికంగా, రాజకీయంగా సామాజికంగా చాలా బలహీనులయిన వారుగా మారిన వారికి అంత శక్తి వుందని రచయిత ఎలా ఊహించుకున్నారా అని ఆశ్చర్యం కలుగక మానదు. అయితే రచయిత పుస్తకం మొదట్లోనే బ్రాహ్మణ పాఠకులను హెచ్చరించటం వల్ల ఆ పాఠకులు అంతగా యిబ్బంది పడకపోవచ్చు! ఒక విధంగా రచయిత వారికి అన్ని శక్తియుక్తులను ఆపాదించటం వల్ల మాకింత చరిత్ర వుందా? (మంచిదైనా-చెడ్డదైనా) అని గర్వపడే అవకాశం గూడా లేకపోలేదు. 

ఏది ఏమైనా యీ పుస్తకం చదివిన తర్వాత ఇతర మతాల ఔన్నత్యం అర్థం అవుతుంది. రాజ్యాంగ నిర్మాతలు తలపెట్టిన పరమత సహనం అలవర్చుకునే అవకాశం గూడా కలిగిస్తుంది. ప్రస్తుతం ఆధ్యాత్మిక నియంతృత్వం వదిలి ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యంలోకి అడుగిడాలనే కాంక్ష కూడా కలుగుతుంది! కానీ రచయిత 'లాజిక్'తో తప్పకుండా అంగీకరించాలనే పాఠకుడ్ని గూడా ప్రతిసారీ 'వై ఐయామ్ నాట్ ఎ హిందూ'అని హెచ్చరిస్తూ ఆ ప్రాతిపదికకు సంబంధించిన విషయాలను చెప్పుతూ పోవడంతో ఆయనే హిందువునికాను నిజాయితీతో చెప్తున్నప్పుడు హిందువులం అనబడే మనం ఆయన మాటలు ఎందుకు వినాలి అనే సందేహం ఆసాంతం తొలుస్తూ వుంటుంది. 

మదర్ థెరిస్సా ఆధ్యాత్మిక ప్రజాస్వామిక జీవన విధానానికి ఒక గొప్ప ఉదాహరణ అని కంచ ఐలయ్య చెప్పినప్పుడు ఎవరైనా అంగీకరించక తప్పదు. కానీ హిందూ మతానికి చెందిన ఆదిశంకరాచార్యులు ఆధ్యాత్మిక నియంతృత్వానికి ప్రతీక అని అదే వాక్యంలో చెప్పగానే యీ గొడవ మనకు అర్థం అయ్యేటట్లు లేదు అని కొందరు పాఠకులు అయినా అనుకోకుండా వుండలేరేమో! ఏది ఏమైనా హిందూ మతం, ఎవరు ఎంతగా అభిలషించినా, అంత త్వరగా అంతరించే అవకాశాలు లేవు! 

- రావులపాటి సీతారాంరావు
Andhra Jyothi News Paper Dated 27/1/2012 

ప్రపంచ మేధావికి అవమానం - దుడ్డు ప్రభాకర్



తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత అరాచక గుంపు నాలుగు అంబేద్కర్ విగ్రహాలను ఒక పథకం ప్రకారం ధ్వంసం చేసింది. సాటి మనిషిని మనిషిగా గుర్తించి గౌరవించే సమాజం కోసం, మానవీయ విలువల కోసం జీవితాంతం కృషి చేసిన 'భారతరత్న'కు అవమానం జరిగింది. 

దేశ ప్రజలంతా ఉమ్మడిగా ఖండించాల్సిన ఈ దుశ్చర్యకు నిరసనగా కేవలం దళిత సమాజం మాత్రం స్పందించింది. రాష్ట్ర వ్యాపితంగా ర్యాలీలు, రాస్తారోకోలు నిరసన కార్యక్రమాలు జరిపారు, జరుపుతున్నారు. పలువురు మంత్రులు, పిసిసి చీఫ్, చిరంజీవి పలు రాజకీయ నాయకులు విగ్రహాల విధ్వంసాన్ని ఖండించారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేసి విగ్రహాలు ధ్వంసమైన చోట ప్రభుత్వ ఖర్చుతో కొత్త విగ్రహాలు ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. 

ఈ సందర్భంగా 'కొందరు స్వార్థరాజకీయ ప్రయోజనం కోసం ఈ దుశ్చర్యకు పాల్పడ్డార'ని అన్ని రాజకీయ పక్షాలు ప్రకటించాయి. ఆది నుండి అంబేద్కర్ బొమ్మను తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్న అగ్రకుల నాయకులే ఇలాంటి ప్రకటనలు చేయడం 'దొంగే దొంగ దొంగ' అని అరిచినట్లుంది. 48 గంటల్లో నిందితులను అరెస్టు చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. గతంలో అనేకసార్లు తూర్పుగోదావరి జిల్లాలోనే అంబేద్కర్ విగ్రహాలకు చెప్పుల దండలు వేసిన సంఘటనలు, ధ్వంసం చేసిన సందర్భాలు జరిగాయి. ఇంతవరకూ ఎవ్వరినీ అరెస్టు చేసిన దాఖలాలు కనిపించలేదు. ఇపుడు కూడా అందుకు భిన్నంగా జరుగుతుందని ఊహించలేం. 

గత నెల లండన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ సర్వేలో ప్రపంచ వ్యాపితంగా టాప్ 100 మేధావుల్లో డా. బి.ఆర్. అంబేద్కర్‌కు మొట్టమొదటి స్థానం దక్కింది. అది విదేశీ పత్రికల్లో బ్యానర్ వార్తగా ప్రచురితమయింది. ఇండియాకే గర్వకారణమైన ఈ వార్తను మనదేశ మీడియా గాని, పాలకులు గాని పట్టించుకోలేదు. ప్రపంచ మేధావుల్లో అగ్రగణ్యుడిగా గుర్తింపు పొందిన అంబేద్కర్‌కు ఈ మాతృభూమిలో అవమానాల పరంపర కొనసాగుతూనే వుంది. ప్రపంచ దేశాలలో కీర్తించబడుతున్న ఈ విశ్వమానవుడు నవభారత రాజ్యాంగ నిర్మాత కూడా. 

అలాంటి అంబేద్కర్‌ను ఈ దేశం జాతీయ నాయకుడిగా గుర్తించకపోవడానికి నేటికీ నిరాటంకంగా కొనసాగుతున్న అమానుషమైన నిచ్చెనమెట్ల కులవ్యవస్థే కారణం. ప్రపంచ మేధావిని కేవలం ఒక కులానికి చెందిన వ్యక్తిగా చిత్రీకరించడంలో ఈ దేశ అగ్రకుల బ్రాహ్మణీయ మనువాదుల కుట్ర వుంది. పాలకుల కుటిల కౌటిల్య నీతి దాగి వుంది. ఒక్క అంబేద్కరే కాదు, లోకాయతులు మొదలుకొని కులవ్యవస్థను సవాల్‌చేసిన ప్రతి ఉద్యమకారుడ్ని, మేధావిని, కవిని, కళాకారుడ్ని సాధ్యమైతే అంతం చేయడం, కాకుంటే ఆయాకులాల పరిధిలోకి కుదింపుచేసే కుట్రలు ఈ దేశ చరిత్ర నిండా మనకు కనిపిస్తూనే వున్నాయి. 

అంబేద్కర్‌ను దళితులకే పరిమితం చేయడం వెనుక ఆయన్ని తక్కువ చేయడంతో పాటు ఈ దేశ పాలకులకు మరికొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అంబేద్కర్ విగ్రహాల చాటున దళితుల ఓట్లను కొల్లగొట్టడం, దళితుల్ని మభ్యపెట్టి దోపిడీని సజావుగా కొనసాగించడం లాంటివి ఉదాహరణంగా చెప్పుకోవచ్చు. అనివార్య పరిస్థితుల్లోనే ఈ దేశ పాలకులు అంబేద్కర్‌ను ఆ మాత్రమైనా తెరమీదకు తెచ్చారు. దళితుల్లో రాజకీయ చైతన్యం పెరుగుతున్న దశలో, దేశవ్యాపితంగా దళిత ప్రతిఘటనా పోరాటాలు ముందుకొస్తున్న సందర్భంలో అంబేద్కర్‌కు భారతరత్న ప్రకటించారు. అంబేద్కర్ రచనల్ని వెలుగులోకి తేవడం, అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంటులో పెట్టడం అందులో భాగమే. 

నూతన ఆర్థిక విధానాలు అమలులో భాగంగా దళితుల బతుకులు ఛిద్రమౌతుంటే దళితుల్ని మభ్యపెట్టడానికి, వారి దృష్టి మళ్ళించడానికి పాలకులే పనిగట్టుకొని దళితవాడల్లో అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు దళితుల్ని ప్రోత్సహించారు. నేటికీ అంబేద్కర్ వర్ధంతులు, జయంతుల తంతుతోనే కాలం గడుపుతూ అంబేద్కర్ ఆశయాలను, ఆకాంక్షలను తుంగలో తొక్కుతున్నారు. 

దళితులపై, పీడిత కులాలపై ఈ దేశ పాలకుల, సామ్రాజ్యవాదుల దోపిడీ తీవ్రతరమౌతున్న కొద్దీ పీడకుల వ్యూహాలు మారుతున్నాయి. అంబేద్కర్‌ను కేవలం మాలల నాయకుడిగా చూపడం కోసం మాదిగల ప్రతినిధిగా జగ్జీవన్‌రామ్‌ను తెరమీదకు తెచ్చారు. గత రెండు సంవత్సరాల నుంచి బిసిల ప్రతినిధిగా మహాత్మా జ్యోతిరావుఫూలేను ముందుకు తెచ్చి బిసి నాయకులతో పూలే జయంతి ఉత్సవ కమిటీలను వేస్తున్నారు. 

పాలకుల కుట్రల ఫలితంగా అంబేద్కర్ యావత్భారతదేశ ప్రజల ప్రతినిధి కాలేకపోయినా దళితులకు మరింత దగ్గరయ్యాడు. దళిత ఆత్మగౌరవ పోరాట ప్రతీకగా దళితుల గుండెల్లో నిలిచిపోయాడు. అందువల్లనే దళితుల ఆత్మగౌరవ ప్రతిఘటనా పోరాటాలు ఉధృతంగా నడుస్తున్న రోజుల్లో అంబేద్కర్‌ను పాలకులు కీర్తించారు. ఆ పోరాటాలు బలహీనపడుతున్న క్రమంలో అంబేద్కర్ విగ్రహాలు అవమానించబడుతున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారుతున్న దశలో అట్టడుగుస్థాయి నిరుపేద దళితులు దిక్కులేని వారవుతున్నారు. 

అలాంటి దళితులు ఆత్మగౌరవ చైతన్యాన్ని ప్రదర్శిస్తున్న సందర్భాలలో సహించలేని పెత్తందారీ శక్తులు దళితులపై దాడులతో తృప్తిచెందడం లేదు. దళిత చైతన్యస్ఫూర్తి ప్రధాత అయిన అంబేద్కర్ విగ్రహాలపై దాడులకు తెగబడుతున్నారు. అంబేద్కర్‌ని కుల నాయకుడిగా కుదించడం వల్లనే ఇలాంటి విధ్వంసాలు దేశవ్యాపితంగా నిర్భయంగా, నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అందుకు ఈ దేశ పాలకులను ప్రథమ ముద్దాయిలుగా చేర్చాలి. వారి కుట్రలకు పావులుగా ఉపయోగపడుతున్న దళిత రాజకీయ నాయకులతో సహా అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ సభ్యులు కూడా ఈ నేరంలో భాగస్వాములే. 

అంబేద్కర్ తన జీవితాంతం తను ఎంచుకున్న పద్ధతిలో కులనిర్మూలన కోసం నిజాయితీగా పోరాడారు. కుల పునాదులపై నిర్మితమై బలోపేతమౌతున్న హిందూమత వ్యవస్థపై రాజీలేని పోరాటం చేశారు. అంటరానితనం లేని సమాజం కోసం కలలుగన్నారు. కనుకనే ప్రపంచంలో అత్యధిక విగ్రహాలున్న రెండవ వ్యక్తిగా ప్రజల ఆరాధ్యులుగా నిలిచారు. 

ప్రజా ధనాన్ని దోపిడీ చేసిన అవినీతిపరులు, వేటగాళ్ళ విగ్రహాలు వీధివీధినా వెలుస్తుంటే సామాజిక న్యాయస్ఫూర్తి ప్రధాత, రాజ్యాంగ రూపకర్త అయిన అంబేద్కర్ విగ్రహాలు కూల్చబడుతున్నాయి. దళిత ఆత్మగౌరవ ప్రతిఘటనా పోరాట చైతన్యం పెరిగినపుడు మాత్రమే దళిత ఆత్మగౌరవ ప్రతీక అయిన అంబేద్కర్ విగ్రహాలపై దాడులు ఆగుతాయి. అంబేద్కర్ ప్రతిమలను కాపాడుకోవలసిన బాధ్యత దళితులది మాత్రమే కాదు. ఈ దేశ ప్రజాస్వామిక వాదులందరి కర్తవ్యంగా వుండాలి. 

- దుడ్డు ప్రభాకర్
కులనిర్మూలనా పోరాట సమితి, రాష్ట్ర అధ్యక్షులు
Andhra Jyothi News Paper Dated 27/1/2012

Wednesday, January 25, 2012

గర్హనీయం


తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో చోటుచేసుకున్న సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం కలకలం రేపింది. సహజంగానే ఈ సంఘటనపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అంబేద్కర్‌ విగ్రహాలపై జరిగిన ఈ దాడి ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సంఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్‌ రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమవుతోంది. జాతినేతలు, దేశ అభ్యున్నతికి కృషి చేసిన వారి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం, స్మరించుకోవడం, వారి స్ఫూర్తిని అభివృధ్ధిలో ప్రతిఫలింపచేసుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ అటువంటి జాతీయనేత! భారత రాజ్యాంగ నిర్మాతగా భారత జాతియావత్తు ఆయనకు నివాళులర్పిస్తుంది. అనితరసాధ్యమైన ఆయన కృషినుండి, మేధస్సు నుండి కుల,మతాలకు అతీతంగా జాతి నిరంతరం స్ఫూర్తి పొందుతోంది. పార్టీలు, కుల,మతాలకు అతీతంగా అంబేద్కర్‌ను దేశవ్యాప్తంగా ప్రజలు గౌరవిస్తారు. నిమ్నవర్గాల నుండి ఎదిగిన అంబేద్కర్‌ తన జీవితాంతం వారి అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారు. సమాజంలో పాతుకుపోయిన కులవివక్షకు, అంటరానితనానికి నిరసనగా గళమెత్తారు. పట్టుబట్టి దళితులకు హక్కులు సాధించారు. ఈ లక్ష్యసాధన కోసం ఛాందసవాదుల నుండి ఎదురైన ప్రతిఘటనలను, అవమానాలను ఆయన జీవితకాలం భరించారు. వాటికి వ్యతిరేకంగా పోరాడారు. దళితజన అభివృద్ధే ధ్యేయంగా అంబేద్కర్‌ చేసిన కృషే వారికి ఆయనను తిరుగులేని నాయకుడిని చేసింది. దేశవ్యాప్తంగా దళితులందరూ 'మనవాడు' అని ప్రేమపూర్వకంగా చెప్పుకునేలా చేసింది. మహానగరాల నుండి మారుమూల పల్లెల్లోని దళితవాడల వరకు వీధివీధిన ఏర్పాటైన అంబేద్కర్‌ విగ్రహాలే దీనికి తిరుగులేని సాక్ష్యం! తరతరాలుగా అణచివేతకు, పీడనకు గురై, దగాపడిన జన సమూహానికి ఆయన విగ్రహాన్ని చూస్తే చాలు పోరాట స్ఫూర్తి రగులుతుంది. దేనినైనా సాధించగలమన్న ధీమా వస్తుంది. అందుకే దళితులకు సంబంధించి ఏ కార్యక్రమమైనా అంబేద్కర్‌ ప్రస్తావన లేకుండా ముగియదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు, ఎన్జీఓలు దళితుల కోసం చేపట్టే ఏ కార్యక్రమమైనా అంబేద్కర్‌ విగ్రహాల వద్ద నుండే ప్రారంభమౌతున్నాయి. పర్యటనల మధ్యలో అంబేద్కర్‌ విగ్రహం కనపడితే దిగి నివాళులర్పించకుండా ముందుకు సాగే నేతలు దాదాపుగా కనపడరు. దళితుల ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యాలుగా అంబేద్కర్‌ విగ్రహాలు ఆచరణలో నిలిచాయి. అటువంటి విగ్రహాలపై దాడి అత్యంతగర్హనీయం. ఒకరు రెచ్చగొట్టారనో, మరొకరు అవమానపరిచారనో కారణమేదైతేనేం ఏకంగా ఐదు అంబేద్కర్‌ విగ్రహాలను నేలకూల్చారు. ఇదేదో యాధృచ్ఛికంగా జరిగిన పొరపాటు సంఘటనగా దీనిని కొట్టివేయడానికి వీలులేదు. పక్కా ప్రణాళకతో ఒక వ్యూహం ప్రకారంమే ఈ విగ్రహా విధ్వంసం చోటుచేసుకుందన్న విషయం స్పష్టంగా కనపడుతోంది. ఒకే మండల పరిధిలో, దాదాపుగా ఒకే సమయంలో, ఒకే రకంగా ఈ దాడులు జరిగాయి. పగలంతా పనులు చేసి అలసిసొలసిన జనం గాఢనిద్రపోయే సమయంలో విధ్వంసకులు గుట్టుచప్పుడు కాకుండా ఈ దుర్మార్గానికి తలపడ్డారు. ఐదు ప్రాంతాల్లో విధ్వంసాలు జరిగినా ఒక్కరు కూడా స్థానిక ప్రజలకు చిక్కలేదంటే ఇదే కారణం. పకడ్బందీగా ప్రణాళిక రూపొందించి తమ ధ్వంసరచనను అమలు చేసిన అగంతకులు గుట్టుచప్పుడు కాకుండా తప్పుకున్నారు. తెల్లవారిన తరువాత ఈ దుర్మార్గాన్ని చూసిన ప్రజానీకం భగ్గుమంది. దళితసంఘాలే కాదు ప్రజాతంత్రవాదులంతా నిరసనగా గళమెత్తారు. ప్రదర్శనలు జరిపారు. ఇంత జరుగుతున్నా . రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రం చలనం లేదు. నిర్లిప్త ధోరణినే ఈ విధ్వంసం పట్లా ప్రభుత్వ పెద్దలు చూపించారు. సోమవారం ఉదయానికే రాష్ట్రమంతా విగ్రహాల విధ్వంసం విషయం తెలిసిపోయినప్పటికీ ఆ విషయమే పట్టన్నట్టు వారు వ్యవహరించారు. సోమవారం సాయంత్రం వరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి విగ్రహవిధ్వంసంపై ఒక్క ప్రకటన కూడా రాకపోవడం గమనార్హం. దళితుల పట్ల, వివక్షపట్ల, అంటరానితనాన్ని నిర్మూలించాలన్న లక్ష్యం పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశు ద్దిఉందో దాని స్పందనే తెలియచేస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా నిరసనల జోరు పెరిగిన తరువాతే అనివార్యంగా ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పందించింది. హడావిడిగా ఈ సంఘటనపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి విగ్రహ విధ్వంసకులను కనుగొనేందుకు ప్రత్యేకబృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దోషులు ఎంతపెద్దవారైనా వదలవద్దని కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. విగ్రహాలను ప్రభుత్వ ఖర్చుతో పున: ప్రతిష్టాస్తామని కూడా ఆయన చెప్పారు. ఈ ఆదేశాలు కాగితాలకే పరిమితం కాకూడదు. దర్యాప్తు యంత్రాంగానికి చిత్తశు ద్ది ఉంటే ఈ వ్యవహారంలో దోషులెవ్వరో కనుగొనడం పెద్దపనేమి కాదు. ఆ దిశలో తక్షణమే చర్యలు ప్రారంభించి దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలి. సంకుచిత రాజకీయ దృష్టితో ప్రవర్తించరాదు. మంగళవారం సాయంత్రానికి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. వారి వివరాలను అధికారికంగా వెల్లడించాల్సిఉంది. విగ్రహాలపై దాడిచేసిన వారితో పాటు ఈ విధ్వంసకాండకు కుట్ర చేసిందెవ్వరన్న అంశాన్ని దర్యాప్తు బృందాలు తేల్చాలి. కుట్ర చేసినవారితో పాటు, వారికి సహకరించిన వారిని కూడా కఠినంగా శిక్షించాలి. దళితుల పట్ల ప్రభుత్వ తీరు ఎలా ఉందో కన్పిస్తోంది గనుకే దుండగలు ఈ దుశ్చర్యకు తెగబడ్డారు. దళితులపై దాడులు జరిగిన సంఘటనల్లోనూ, వివక్షను ప్రదర్శించిన సందర్భాల్లోనూ చట్టాన్ని ఉల్లం ఘించిన వారిపై కేసులు నమోదు చేయకుండా సర్ధుబాటు చేయడానికి ప్రభుత్వం, దాని యంత్రాంగం అధికారపార్టీ పూనుకోవడం దాచినా దాగనిసత్యం. భవిష్యత్తులో ఈ తరహా సంఘటనలు పునరావృత్తం కాకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. 
Prajashakti News Paper dated 24/1/2012 Sampadakiyam 

అడుగడుగునా హక్కుల ఉల్లంఘన




భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. ఆ రోజు దేశమంతా రిపబ్లిక్ డేగా జరుపుకుంటుంది. ఆ రాజ్యాంగం భారతదేశ పౌరులకు 19వ అధికరణ కింద ప్రాథమిక హక్కులను కల్పించింది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి చెందిన ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు ఉన్నాయా.? లేక అవి హరించబడినాయా.?అనే ప్రశ్న ఈరోజు ప్రతి పౌరుడి మనస్సులో కలుగుతుంది. 50 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు తమకు అన్ని రంగాల్లో అన్యాయం జరిగిందని, ఇంకా అది కొనసాగుతుందని, తమను సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పాలకులు, అధికారు లు రెండవ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని, తమ ప్రాంతానికి న్యాయ పరంగా దక్కాల్సిన వనరులు, ఉద్యోగాలు, పెట్టుబడులు దక్కకుండా పోతున్నాయని, తమ ప్రాంతానికి చెందిన విలువైన భూములు దోపిడీకి గురవుతున్నాయని, ఇక ఏమాత్రం కలసి ఉండలేమని, తెలం గాణ ప్రజలు ఉద్య మిస్తున్నారు. కలసి వుంటే తమ సంస్కక్షుతి, జీవన విధానం, మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని, అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.

ఈ పోరాటాన్ని ప్రజల ఆకాంక్షలను గుర్తించామంటూ అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీల ఎన్నికల ప్రణాళికలలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని చేర్చాయి. ఉద్యమ తీవ్రతను గుర్తించిన కేంద్ర ప్రభు త్వ ఆదేశం మేరకు అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కు అనుకూలమని అన్ని పార్టీలు చెప్పా యి. ఆ విషయాన్ని పరిశీలనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభించనున్నామని ప్రకటించగానే కంటి తుడుపు చర్యగా తెలంగాణకు అనుకూలమని చెప్పిన దోపిడీవర్గాలు ఏకమై తెలంగాణ రాష్ట్ర ప్రక్రియకు అడ్డుపడడం జరిగింది. పాలక, ప్రతిపక్ష పార్టీలు సిగ్గుఎగ్గు లేకుండా ఏకమై కుట్రలతో, కుతంవూతాలతో తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను అడ్డుకోవడం చూసి కోపోవూదిక్తులైన సబ్బండ వర్ణాలు, వర్గాలు ఏకమై ఉద్యమబాట పట్టడం జరిగింది.

ఈ ఏకీకృత ఉద్యమాన్ని చూసి ఓర్వలేని సీమాంధ్ర ప్రభుత్వం అనేక సందర్భాలలో ఉద్యమాన్ని హింసవైపు మళ్ళించే చర్యలకు పాల్పడింది. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా జరుపుతున్న ఉద్యమాన్ని అణచాలని ఏకైక లక్ష్యంతో ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న ఉద్యమకారులపై వందలాదిగా అక్రమ కేసులు బనాయించి, ైజైలుకు తరలించింది. మిగతా ఉద్యమ కారులను ఉద్యమానికి దూరం చేసే కుట్రలు పన్నింది. భారత శిక్షాస్మృతి (ఐపిసి)లోని అనేక అత్యంత తీవ్రమైన అభియోగాలు మోపి, ఉద్యమంలో చురుగా పాల్గొంటున్న ఉద్యమ కారుల భవిష్యత్తును నాశనం చేసే చర్యలకు పూనుకుంది. అంతే కాకుండా విద్యార్థులపై పాశవిక దాడులకు పాల్పడి, వారిని శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేసి వారి ప్రాథమిక హక్కులు భంగం కలిగించే చర్యలకు పాల్పడింది.

ఎలాంటి శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకపోయిన అనేక సందర్భాలలో బాష్పవాయువు గోళాలు ప్రయోగించి, లాఠీచార్జీలు చేసి మానవ హక్కుల హరణకు పాల్పడింది. శ్రీకృష్ణకమిటీని ప్రలోభాలకు గురిచేసి తమకు అనుకూలంగా రిపోర్ట్ ఇప్పించుకున్న సీమాంధ్ర పాలకులు ఆ రిపోర్ట్‌లోని చీకటి అధ్యాయాన్ని అమలు పరిచే విధం గా పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నది. మొత్తంగా చూసినటె్లైతే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చేసిన ప్రకటన అమలుకు నోచుకోవడం లేదు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా.? ఉద్యమిస్తున్న ఉద్యమకారులపై వివక్షతో, తీవ్రమైన అసహానంతో తీవ్ర నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు మోపుతూ, తప్పుడు కేసులు మోపు తూ వారిని మానసికంగా, శారీరకంగా హింసిస్తూ, వారి భవిష్యత్తును కాలరాసే చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ ఉల్లంఘన కాదా.?విద్యార్థులపై మోపిన అన్ని అక్రమ కేసులను వెంటనే ఎత్తివేస్తామని హామీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ హామీని నిలబెట్టుకోకుండా ఇంకా అనేక అక్రమ కేసులు బనాయించి ఉద్యమ కారులను చిత్రహింసలకు గురిచేసి జైళ్ళలో మగ్గే విధంగా చర్యలు చేపట్టడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా.? తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ, అణచివేతను చూసి తట్టుకోలేక, ఇక తెలంగాణ రాష్ట్రం రాదేమోనని నిస్పక్షుహకు గురై, తమ బలిదానం చూసైన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రీతిగా స్పందిస్తాయేమోనని భావించి ఏడు వందల మంది యువకులు ఆత్మార్పణ చేసుకున్నారు. అయినా చూస్తూ నోరు మెదపని ప్రభుత్వాల చర్య రాజ్యాంగ ఉల్లంఘన కాదా.?

సమాచార చట్టం అమల్లోకి వచ్చిన తరువాత కూడా శ్రీకృష్ణ కమిటీ ఎలాంటి సమాచారం ఈ ప్రాంత ప్రజలకు తెలియకుండా చీకటి అధ్యాయాన్ని తమ రిపోర్ట్‌లో పెట్టింది. శ్రీకృష్ణకమి టీ ఇక్కడి ఉద్యమాన్ని ప్రలోభాలకు, అణచివేతకు గురిచేసి ఉద్యమ తీవ్రతను తగ్గించాలని చూడడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా? ఈ ప్రశ్నలు తెలంగాణలోని ప్రతి పౌరుడి మనస్సులో ఉదయిస్తున్నాయి. రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులు హరించబడ్డాయా.? మేము ఈ దేశ పౌరులమేనా.? ఈ ప్రాంతంలో రాజ్యాంగం అమల్లో లేదా..? నియంత పాలనలో గానీ, ఎమ్జన్సీ పాలనలో ఉన్నామా.? రేపు ఏదైన జరగకూడనిది జరిగితే భవిష్యత్తులో హింసాత్మక ఉద్యమం చెలరేగితే ప్రభుత్వాల బాధ్యత అవుతుంది తప్ప ప్రజల బాధ్యత కాబోదు. 

-తన్నీరు శ్రీరంగరావు
తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కో- కన్వీ
Namasete telangana news paper dated 26/1/2012 

ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం



మనకు రాజ్యాగం సిద్ధించి 62 సంవత్సరాలు పూర్తయింది. ఈ 62 సంత్సరాలలో మన రాజ్యాంగ అమలు ప్రక్రియలో చాలా వొడిదుడుకులు ఎదుర్కొనడం జరిగింది. కానీ సుమారు వంద రాజ్యాంగ సవరణలు జరిగిన తరువాత కూడా మన రాజ్యాంగ స్ఫూర్తి చెక్కు చెదరకుండా ఉందంటే ఇది ఒక అద్భుతమని చెప్పవచ్చు. రాజ్యాం గ నిర్మాతలు ఈ రాజ్యాంగాన్ని ఒక జీవనదిలా సాగాలని అభిలాషించినారు. మనకు సంక్రమించిన ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛ, స్వతంవూతాలు చాలా వరకు సద్వినియోగం అయిన కొన్ని విషయాలలో దుర్వినియోగం జరిగిన మాట వాస్తవం. ఈ హక్కులను దుర్వినియోగం చేసినప్పుడు ఆ రాజ్యాంగ ఫలాలు అందరికీ అందడం లేదనే అభివూపాయం ఏర్పడుతుం ది. 62 సంవత్సరాలలో పరిణామాలను విశ్లేషిస్తే కొన్ని ముఖ్య సంఘటనలను ఈ సందర్భంలో గుర్తు చేసుకోవచ్చు.

1975లో ఎమ్జన్సీ ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం చేసిన ప్రభుత్వ, అధికార దుర్వినియోగం, మేనకాగాంధీ కేసులో 1978లో సుప్రీం కోర్టు ఇచ్చిన వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కులకు సంబంధించిన కీలక తీర్పు, 1980 దశకం నుంచి చాలా ప్రాచుర్యం పొందిన పిఐఎల్ (పిల్), ఇప్పుడు ప్రతి పౌరునికి ఏదో విధంగా లాభం చేస్తున్న ధర్మాసన చైతన్యం, పంచాయితీరాజ్, మున్సిపాలిటీలకు సంబంధించిన 73 మరియు 74వ సవరణలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఓబీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల నేపథ్యంలో ఇచ్చిన మండల కమిషన్ తీర్పు, 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో తెచ్చిన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, ఈ మధ్య 2002 సంవత్సరంలో ప్రాథమిక హక్కుగా చదువుకునే హక్కును గుర్తించడం మొదలైనవి దేశ విదేశాలలోని అందరి దృష్టిని ఆకర్షించాయి.

సుప్రీంకోర్టు ఈ మధ్య అనేక కీలకమైన తీర్పులు ఇచ్చింది. రాంజెఠ్మాలానీ కేసులో (2011) నల్లడబ్బు వెతికితీత విషయమై, రిలయన్స్ కేసు లో కేజీ బేసిన్‌లో లభ్యమైన సహజ వాయువు నిక్షేపాల సద్వినియోగం గురించి, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ప్రయివేటు పోలీస్ వ్యవస్థ సల్వాజుడుం రాజ్యాంగ, న్యాయ వ్యతిరేక స్వభావం గూర్చి, పోలీసుల ద్వారా జరిగే నకిలీ ఎన్‌కౌంటర్‌లో మరణాల గూర్చి గుర్తించుకోదగిన తీర్పులు ఇచ్చిం ది. సమాచార హక్కుకు సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం దుర్వినియోగానికి సంబంధించి ఇచ్చిన తీర్పులు కూడా ప్రధానమైనవి.

అరుణా షాన్‌బాగ్ కేసులో- పరోక్షంగా కొన్ని ప్రత్యే క పరిస్థితులో స్పక్షుహాలేకుండా కేవలం వైద్య పరికరాల ద్వారా ఇచ్చే సహాయంతోనే బతికే వారు స్వచ్ఛందంగా మరణించే హక్కుకు సంబంధించి సుప్రీంకోర్టు చాలా కీలకమైన తీర్పులను ఇవ్వడం జరిగింది. అన్నా హజారే నాయకత్వంలో జరుగుతున్న అవినీతి వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో 2జీ స్ప్రెక్టమ్, కామన్ క్రీడలు, అక్రమ మైనింగ్, అక్రమ ఆస్తుల కేసుల విషయంలో కూడా సుప్రీం కోర్టు కొన్ని కీలకమైన తీర్పులను ఇవ్వడం జరిగింది. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన పారదర్శక, జవాబుదారీతనం ఉన్న ప్రభుత్వాలు శాసించాలనే సిద్ధాంతం కొంత వరకు ఈ తీర్పుల ద్వారా నెరవేరిందని చెప్పవచ్చు.

మన రాష్ట్రంలో ఉధృతంగా నడుస్తున్న తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఇంత వరకు కేంద్ర ప్రభుత్వం చేసినదంతా రాజ్యాం గ వ్యతిరేకమనేది అందరికీ తెలిసిన విష యం. సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి స్పష్టం గా ప్రకటన చేయడం, ఈ ప్రకటనకు ముందు రాష్ట్రంలోని దాదాపు అన్ని ముఖ్యమైన రాజకీయ పార్టీలు తమ సమ్మతిని ఇవ్వడం, ప్రకటన వచ్చిన పన్నెండు గంటల లోపల ప్లేట్ ఫిరాయించడం రాజకీయ దిగజారుడు తనానికి నిలు నిదర్శనం. రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడుకు సాధ్యమైనంత వరకు తప్పుడు అర్థం వచ్చేలా గోబెల్స్ ప్రచారం చేయడం కేంద్ర ప్రభుత్వానికి, నిబద్ధతలేని రాజకీయ స్వార్థ పరులకే చెల్లింది.

ఇవి పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేక చర్య లు. ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్య్రం, ఇతర ప్రాథమిక హక్కులు భంగపడే విధంగా ఎంతో శక్తి వంతమైన పీడి యాక్ట్ లేదా జాతీ య భద్ర త చట్టాలను దుర్వినియోగం చేయడం కూడా రాజ్యాంగ వ్యతిరేకమే. ఏది ఏమైనా ప్రతి పౌరుడు, రాజకీయ నాయకుడు, అధికారి, ప్రతి ఒక్క రు మన గొప్ప రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించవల్సిన అవసరం ఎంతైన ఉంది. అలా జరగని నాడు కొన్ని ఇతర దేశాల మాదిరిగా మిలటరీ పాలనలో మగ్గవలసి వస్తుంది. 
-డాక్టర్ జీబీ రెడ్డి
ఓయూ లా కాలేజీ మాజీ ప్రిన్సిప
Namasete telangana news paper dated 26/1/2012 

ఆత్మవిమర్శా? అంతర్యుద్ధమా? - కె.అరవిందరావు



'హిందూమతానంతర భారతదేశం'పై జరుగుతున్న చర్చను గమనించిన తర్వాత రెండు పక్షాలకు కొన్ని ప్రశ్నలు సంధించాల్సిన అవసరం ఉందని తోచింది. రెండు పక్షాల వారు కొంత ఆత్మవిమర్శ చేసుకోవాలనే ఈ ప్రశ్నలు. మొదటిగా హిందూ మతాన్ని అవలంబించే ఒక consumer లేదా వినియోగదారుడిగా ధర్మాధిపతులకు కొన్ని ప్రశ్నలు. 

1. అనాదిగా మన దేశంలో హిందూ ధర్మం/ మతం ఎన్నో దాడు లు ఎదుర్కొన్నా ఇంకా బలంగా ఉండడానికి కారణం ఉపనిషత్తుల్లో ప్రతిపాదించిన సమన్వయ దృక్పథం. పండితులు ఎన్ని రకాలుగా దేవుణ్ణి గూర్చి చెప్పినా సత్యం ఒకటే అని, భిన్నత్వంలో ఏకత్వం పాటించిన జాతి మనది. ఉపనిషత్ సిద్ధాంతాన్ని ప్రజల్లో ఎందుకు సరిగా ప్రచారం చేయడం లేదు? ఎందుకు ఆచరించడం లేదు? 

2. సమాజాన్ని సంఘటితంగా ఉంచటమే అన్ని మతాల ఉద్దేశం. అలా చేయడానికి దేశకాల పరిస్థితులను బట్టి ధర్మాన్ని అన్వయింపజేసుకోవాలి- శంకరాచార్యులే 'యస్మిన్ దేశే కాలే నిమిత్తేచ యాధర్మో అనుష్ఠీయతే తదేవదేశాంతరే కాలాంతరే అధర్మ ఇతివ్యవహ్రియతే' అన్నారు. అంటే ఒక ప్రదేశంలో, ఒక కాలంలో, ఒక సందర్భంగా ధర్మం అని అన్నదే మరొక ప్రదేశంలో, కాలంలో, నిమిత్తాలలో అధర్మం అనిపించుకుంటుంది. ధర్మం మూల స్వరూపం మారకుండా దాని ఆచరణలో మార్పును తెస్తూ సమాజంలో అన్ని వర్గాలను కలుపుకొని పోవాలి. దళిత వాడల్లో కూడా సంచారం చేసి వారిలో మతం ఉన్నతమయినది అనే భావన తేవాలి కదా! 

3. ప్రజల అవగాహనా స్థాయిని బట్టి (అధికార భేదం అంటారు) వారికి విషయం బోధించాలని మన ప్రాచీనుల సిద్ధాంతం. ఇతిహాసాలు, పురాణాల ద్వారా వేదాంత శాస్త్రంలోని విలువల్ని బోధించడం మన ప్రాచీన ప్రణాళిక. వేదాంత సిద్ధాం తం మామూలుగా అందరికీ అర్థం కాదు కనుక దాన్ని కథల ద్వారా చెప్పడం జరిగింది. పురాణ కథల్లో మనకు సింబాలిజం (ప్రతీకవాదం) కనిపిస్తుంది. పురాణాల్ని ప్రవచనం చేసేవారు దార్శనిక దృష్టితో ప్రవచనం చేస్తే వాటి పట్ల సరైన అవగాహన కల్గుతుంది. కేవలం పురాణ ధోరణిలో చిలవలు పలవలుగా వర్ణించి చెప్పడం వల్ల వాటిపై వెగటు ఏర్పడుతుంది. సరైన ప్రవచనకారుల్ని నిర్మించడం పీఠాధిపతుల ధర్మం. ఇది జరుగుతున్నదా? 

4. మనం ఈనాడు శూద్రులని భావించే వారందరూ మన సిద్ధాం తం ప్రకారం ద్విజులే. ద్విజులంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు; 'కృషి, గోరక్ష, వాణిజ్యం, వైశ్వకర్మ'అని భగవద్గీత చెప్పినదాని ప్రకారం సేద్యం, వాణిజ్యం చేసేవారు, పశువుల కాపర్లు (కృష్ణుడు ఈ కోవవాడే) వీళ్ళందరూ ద్విజులే. వేదం చదవడానికి అర్హులే. ఇవి మనం ఆచరణలో చూపవచ్చుకదా? 

5. మతం విశ్వాసాల సమాహారం. తత్త్వశాస్త్రం ఆలోచనకు సంబంధించింది. ఉపనిషత్తులలో భగవంతుని తత్త్వాన్ని గురించి విశ్లేషించేది తత్త్వశాస్త్రం. ప్రాథమిక దశలో మానవుడు దేవుడంటే ఒక రూపం, కొన్ని శక్తులు (గుణాలు) కల అంటే ఒక సాకార, సగుణ స్వరూపాన్ని ఏర్పా టు చేసుకుంటారు. కొంత ఆలోచించిన తర్వాత అన్ని దేవతారూపాలు ఒకటే అని గ్రహించి ఒక నిరాకార స్వరూపం, దుష్టశిక్షణ, శిష్ట రక్షణ లాంటి గుణాలు ఉన్న స్వరూపం అంటే ఒక నిరాకార, సగుణ స్వరూ పం ఊహించుకుంటారు. మన దేశంలో సాంఖ్యులు, పతంజలియోగశాస్త్రం, తార్కికులు, ఇలాంటి దేవుణ్ణే చెపుతారు. పాశ్చాత్య మతాలు కూడా ఇలాంటి దేవుణ్ణే చెపుతాయి. 

ఈ మతాల్లో దేవుడొక్కడు నిరాకారుడైనా స్వర్గం, బంగారు వీథులు, అప్సరసలు, నరకయాతనలు వర్ణించబడ్డాయి. శైవం, వైష్ణవంలాగ ఈ మతాలు ఏకేశ్వరోపాసన ప్రతిపాదిస్తాయి. దేవుడు అనేది కేవలం నిరాకారమే కాక నిర్గుణమైన బ్రహ్మకు కేవలం ఉపాసకుల సౌకర్య నిమిత్తం సగుణ రూపకల్పన (ఉపాసనాకార సిధ్యర్థం బ్రహ్మోణో రూపకల్పనా) అన్ని అన్నారు. ఇట్టి ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం లేదు. ప్రజలింకా మూర్తి పూజ స్థాయిలోనే ఉన్నారని భావించి యజ్ఞయాగాదులు చేయించడం సరైనదేనా? 

6. మనది హిందూ మతం కాదు, హిందూ ధర్మం అని చెప్పడం వల్ల ప్రతి పక్షికి మీరే ఒక ఆయుధం ఇచ్చినట్లవుతుంది. మీకు మతమే లేదు అని ఎదుటివాడు వాదించే అవకాశం మనమే ఇస్తున్నాం. హిందూ మతం అనేక విశ్వాసాల సమాహారం. వైదిక తత్త్వం గొడుగు క్రింద ఉన్నవే శైవం, వైష్ణవం మొదలైనవి. అన్నీ వేదం ప్రామాణ్యాన్ని అంగీకరించాయి. మనకు మతమే లేదని వాదిస్తే విద్యాధికులు కూడా నిజమే అనుకునే పరిస్థితి వస్తుంది. ఏ విశ్వాసాల సమాహారమైనా మతమే. కాబట్టి మన మతంలో pluralism భిన్నత్వం ఉంది. దానిలోనే ఏకత్వం ఉంది. దీన్ని ఎందుకు ప్రచారం చేయడం లేదు? 

7. జ్ఞాని వేదాలకు, వర్ణాశ్రమాలకు అతీతంగా ఎదుగుతాడని వేద మే చెపుతుంది. జ్ఞాని స్థాయిలో తమ మత గ్రంథమే నిరర్ధకమవుతుందని ఏ మతమూ చెప్పలేదు. అంత ధైర్యంగా చెప్పిన గ్రంథాలు మన ఉపనిషత్తులు. ఇలాంటి వాటిపై ప్రతిపక్షిని ప్రశ్నించవచ్చు కదా? 

8. ఉపనిషత్తుల్లో చెప్పిన ఉదార, తాత్త్విక సత్యాలను పక్కనపెట్టి కర్మకాండలో చెప్పిన యజ్ఞాలు, ఆచారాలకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అవే హిందూమతం అని భావించే ప్రమాదం ఉంది. అలాగే కేవలం ధనవంతులు, కొన్ని వర్ణాల వారు మాత్రమే వీటిని ఆచరించగలరు. బహుళ ప్రజానీకం వీటికి దూరమవుతారు. వారి దృష్టిలో ఆచరణలో ఉన్నదే హిందూయిజం . కమ్యూనిస్టులు ఎంత చెప్పినా మతం అనేది మనిషి అవసరాలలో ఒకటి (basic human needs) తన అవసరం ఒక మతంలో తీరనప్పుడు మరొక మతాన్ని మనిషి ఆశ్రయిస్తాడు. ప్రజల ధార్మిక అవసరాన్ని తీర్చడానికి మన ప్రణాళిక ఏమిటి? 

9. మిగతా మతాల్లో మత విశ్వాసం వేరు, తత్త్వ శాస్త్రం వేరు. హిందూ మతంలో తత్త్వ శాస్త్రం , మతం రెండూ కలిసి ఉన్నాయి. తత్త్వశాస్త్రాన్ని పురాణకథల రూపంలో అందించడం వల్ల క్రమేణా తత్త్వాన్ని మరచి మూర్తి పూజకు ప్రాధాన్యం వచ్చింది. ఉదాహరణకు నిర్గుణ తత్త్వాన్ని ఆధారంగా చేసుకొని ఏదో ఒక శక్తి ప్రపంచాన్ని నిర్మించాలి అనే భావాన్ని పడుకున్న శివునిపై శక్తి కూర్చొని ఉన్నట్లు, మనస్సనే (కోరికలు తీర్చే) చెరకు విల్లును ధరించినట్లు ఐదు ఇంద్రియాలు బాణాలు అయినట్లు ఒక ప్రతీక రూపంలో చెప్పడం జరిగింది. చాలా పురాణ కథల్లో ఇలాంటి ప్రతీకలు కనిపిస్తాయి. దీనిలో భావం తెలియనంతవరకు మూఢనమ్మకాలుగా వ్యవహరింపబడతాయి. ఈ విషయాల్ని ఇటీవలి కాలం వరకూ అనేక మంది పండితులు ప్రవచనాల్లో పాఠాల్లో చెప్పేవారు. ఇప్పుడు అలాంటి పండితులు, పండిత పుత్రులు సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రవేశించడంతో ఆ రంగంలో ఒక శూన్యత ఏర్పడింది. దీన్ని భర్తీ చేయడానికి మీకు ప్రణాళిక ఉండాలి కదా? 

10. శంకరాచార్యులు ఉపనిషణ్మత స్థాపన చేసినప్పుడు తత్కాలీన సిద్ధాంతాలను అంటే సాంఖ్య, బౌద్ధ, జైన, పాతంజల సిద్ధాంతాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి వారి వాదాల్ని ఎదుర్కొన్నారు. ఈనాటి దుష్ప్రచారాలను మ త విశ్వాసాలపై వస్తున్న విమర్శలను ఎదుర్కోవడానికి పండిత వాతావరణం ఉందా? 

11. ప్రతిపక్షుల్ని కేవలం వాదంలో గెలిచే వారే కాని మిగతా దేశాల్లో లాగ రాజుల సహాయంతో మిగతా మతాల్ని మన దేశంలో అణచివేయలేదు. క్రీ.శ. 1వ శతాబ్దంలోనే క్రైస్తవ మతం కేరళలో వచ్చిం ది. అలాగే ఇస్లాం వచ్చింది. మతాధిపతులు విలన్లయితే వారిని ప్రారంభంలోనే అణచి వేసే వారు కాని అలా జరుగలేదు. మన మతంలోని ఉదారతత్త్వాన్ని గూర్చి గర్వంగా చెప్పవచ్చు కదా. కాళిదాసు, విశాఖదత్తుడు లాంటి వారి నాటకాలు చూస్తే అన్ని మతాల వారు ఒకే రాజు ఆస్థానంలో శాస్త్ర చర్చలు చేసినట్లు కనబడుతుంది. ఎవరినీ చంపించినట్లు చరిత్రలో లేదు. ఏదో ఒక రాజు మూర్ఖంగా ఒకరిని చంపడం ఉదాహరణగా చెప్పలేము. మిగతా ఖండాల్లో రాజులు క్రూరంగా మిగ తా మతాల్ని అణచివేయడం వల్ల ప్రాచీన మతాలు అంతరించాయి. ఇక్కడ రాజుల్లో సహనం వల్ల మిగతా మతాలు వెల్లి విరిశాయి. ఈ రెం డు పద్ధతుల్లో ఏది నాగరికత? దీన్ని, సరిగా గర్వంగా చెప్పాలి కదా? 

12. వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణుడు ఒకడికే భిక్షాటనం, సన్యాసం విధించబడింది. ఇతరులకు లేదు. భిక్షాటనం చేయడం వల్ల సమస్తాన్ని త్యజించి, దైన్యంలేని పేదరికంలో గడిపారు. శంకరాచార్యులు భిక్షాటనం చేయడం, ఆమలకం భిక్షగా తీసుకోవడం చరిత్రలో చదువుతాం. ఇలాంటి ఉదాహరణలు గర్వకారణాలు కదా? ఇన్ని శతాబ్దాలుగా ధర్మాన్ని అనుసరించిన బ్రాహ్మణులు నేడు కూడా దిశా నిర్దేశనం చేసి తద్వారా సిద్ధాంతాల్ని రక్షించాలి కదా? 

13. చాలా మంది మేధావులకు కూడా తత్త్వశాస్త్ర పరిజ్ఞానం లేకపోవడానికి కారణ ం ఏమిటి? ధర్మ రక్షకులు అధ్యాపనం అనే విధిని మరవడం వల్ల విషయాన్ని తెలిపేవారులేరు. దీని వల్ల మీరు ఋషి ఋణం ఎలా తీర్చుకుంటున్నారు? ఈనాడు రాష్ట్రం మొత్తంలో వేదాంత శాస్త్రం, పాఠం చెప్పగలిగినవారే వేళ్ళపై లెక్కించే సంఖ్యలో ఉండడానికి కారణం ఏమిటి? శాస్త్ర రక్షణలో మన ప్రణాళిక ఏమిటి? ప్రభుత్వం కాని, సమాజం కాని ఈ విషయంలో నిర్లిప్తతతో ఉన్నప్పుడు ధార్మిక సంస్థల పాత్ర ఏమిటి? 

హిందూ మతాన్ని విమర్శిస్తున్న వారికి కొన్ని ప్రశ్నలు:
1. మేధావుల్లో ఋజుత్వం ఉండాలని అందరూ ఆశిస్తారు. అందర్నీ ఒకే కొలబద్దతో, ఒకే ప్రమాణంతో విశ్లేషించే పద్ధతి ఉండాలి. లేకుంటే ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతారు. ఒకే మతాన్ని నిందించడంలో మీ అజెండా ఏమిటి? మిగతా మతాల్లోని లోపాలను గూర్చి చాలా గ్రంథాలున్నాయి గదా? వాటిని ప్రజలకు తెలిపారా? ఉదా. Thomas payne అనే రచయిత క్రైస్తవంపై తీవ్ర విమర్శలు చేశారు. అలాంటి గ్రంథాలను గూర్చి చెపుతున్నారా? 

2. ఈనాడు దేశంలో మతాల సంఘర్షణ తీవ్రంగా ఉందని మీకు తెలుసు. ఒకే మతాన్ని విమర్శించడం వల్ల మీరు మిగతా మతాలకు ఏజెంటుగా కనపడడం లేదా? మీ ప్రవర్తన ఒక మతాన్ని డిఫెన్స్‌లో పెట్టి మరొక మతాన్ని రెచ్చగొట్టే రీతిలో లేదా? 

3. Proxy war అనేది మీకు తెలుసు. ఉదాహరణకు మావోయిస్ట్‌లను బలపరచి దేశంలోని విచ్ఛిన్నకర శక్తులను ప్రోత్సహించి దేశాన్ని బలహీనపరచడం పొరుగురాజ్యాల పాలసీగా ఉంటుంది. ఇప్పుడు దీనికి తోడు మత విషయంలో కూడా ఒక విధమైన politico-religious proxy war వేళ్ళూనుకుంటున్నది. మన దేశంలోని విచ్ఛిన్నకర శక్తులు, మేధావులు, వేర్పాటువాదులు లాంటి వార్ని చేరదీసి సత్కరించి వారి ద్వారా దళిత అధ్యయనాలు లేదా మానవహక్కుల అధ్యయనాలనే పేరిట అనేక సంస్థల ద్వారా ధనం రావడం, మేధావులైన వారు ఆ ప్రణాళికలో విదేశాలకు వెళ్ళడం, వారి ఆదేశాల మేరకు దళితుల్ని రెచ్చగొట్టే రచనలు చేయడం, వేర్పాటువాద ధోరణులు రెచ్చగొట్టడం proxy warకాదా? 

4. ఇటీవల రాజీవ్ మల్హోత్రా అనే అతను 'Breaking India' అనే గ్రంథంలో వ్యక్తిగతంగా కంచ ఐలయ్య ను ప్రస్తావిస్తూ వారు భారతదేశంలో 200 మిలియన్ దళితులు అణచివేతకు గురవుతున్నారని, ఆ జనులకు మానవహక్కులు లేవని, ఈ విషయంలో అమెరికా ప్రభు త్వం జోక్యం చేసుకోవాలని మెమొరాండం ఇచ్చినట్లు ఆరోపించారు. ఇది నిజమైతే ఇది దేశ వ్యతిరేక చర్య కాదా? దేశ సమగ్రతను, దేశ సార్వభౌమత్వాన్ని మీరు తిరస్కరించినట్లే కదా? ఈ ఆరోపణ పట్ల మీ సమాధానం ఏమిటి? మీరు భారత ప్రభుత్వంపై ఉద్యమం చేయవచ్చు కాని, అమెరికా జోక్యాన్ని కోరడం తప్పుకాదా? 

5. ఒక కుటుంబంలోని వ్యక్తుల మధ్య మనస్పర్థలు కాని, అపోహలు కాని ఉన్నప్పుడు వాళ్ళ విభేదాల్ని మరింత రెచ్చగొట్టి పడగొట్టడం సరైనదా? వారికి సర్ది చెప్పి కుటుంబ సమైక్యత నిలపడం సరైన మార్గమా? మొదటి పక్షంలో పిల్లుల తగాదా కోతి తీర్చినట్లు పాశ్చాత్య దేశాలకు లాభం చేకూర్చడం ఎంతవరకు సమంజసం? 

ప్రభుత్వానికి కూడా కొన్ని విషయాలు తెలియడం అవసరం. అవి:
1. ఒక మతం అజ్ఞానం, మరో మతం అతి తెలివిగా వ్యూహాత్మకంగా దూసుకుపోవడం- రెంటి వల్ల demographic change జనాభాలో మార్పు గణనీయంగా ఉందనీ, ముఖ్యంగా దక్షిణ భారతదేశ catchment area గా ఆ మతం పరిగణిస్తున్నదని గమనించాలి. ప్రజల్లో ఏదో ఒక వర్గం critical mass of population దాటినప్పుడు, దాన్ని నియంత్రించే వారు పాశ్చాత్యులయినప్పుడు ఇండియాకు, సూడాన్‌కు తేడా లేదు ఒక మతం ఫాసిస్టు ధోరణితో ఇంకో మతాన్ని అణగద్రొక్కుతున్నారనే నెపంతో అంతర్జాతీయ శాంతి సేనల్ని దింపవచ్చ. బహుశ పదిహేనేళ్ళ తరువాత దేశ సమగ్రతలో ఇదొక మౌలిక మైన ప్రశ్న కావచ్చు. 

2. ఒక మతాన్ని రక్షించడం ప్రభుత్వ ధర్మం కాదు. కాని కొన్ని ప్రభుత్వ సంస్థలు ఈ రంగంలో ఉన్నాయి. అన్నీ మతాలకూ ఉన్నాయి. oriental కళాశాలలు మూత పడే స్థితిలో ఉండడం కూడా పై పరిస్థితికి ఒక ముఖ్య కారణం. వీటిలో తయారైన పండితులు ఒక తరం వారికి మార్గదర్శకంగా ఉన్నారు. ఇప్పుడా కళాశాలలు మూతపడడంతో ఒక మతానికి సంబంధించిన సిద్ధాంత గ్రంథాలన్నీ శాశ్వతంగా సమాధిలోకి వెళ్ళే స్థితి ఉంది. దీని పట్ల ఈ సంస్థలకు బాధ్యత లేదా? 

3. Cultural heritage అనే పేరిట తాళపత్రాలు, శిథిలాలు రక్షించడానికి వేల కోట్ల వ్యయంతో విభాగాలున్నాయి. మేధాపరమైన వారసత్వాన్ని కేవలం స్కాలర్స్ రూపంలోనే రక్షించాలి. దీనికి సరైన వాతావరణాన్ని నిర్మించడం పై ప్రభుత్వ సంస్థల బాధ్యత కాదా? ఈ పని చేపట్టకపోవడంతో ఒక మతం మరింత అజ్ఞానంలో కూరుకుపోవడం దాని వల్ల దేశ సమగ్రతకే సమ్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని కూడా ప్రభుత్వం గమనించాలి. 

మన దేశంలో అంతర్యుద్ధం వస్తుందని ఐలయ్య తమ గ్రంథం 'హిందూ మతానంతర భారతదేశం' లో స్పష్టంగా చెప్పారు. ప్రమాద ఘంటిక మోగిస్తే సరే గాని, అంతర్యుద్ధం వైపు ప్రయత్నం చేయకూడదని విజ్ఞప్తి. 

- కె.అరవిందరావు ఐపిఎస్ (రిటైర్డ్)
పూర్వ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్
Andhra Jyothi News Paper Dated 17/1/2012