Monday, April 28, 2014

పాలమూరులో పౌరహక్కులు By హరగోపాల్


Updated : 4/27/2014 1:40:10 AM
Views : 39
కనీసం 2019 ఎన్నికల వరకన్నా స్వేచ్ఛగా ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే వాతావరణం ఏర్పడాలి. డీఎస్పీ గారి ముందు దోషిగా నిలబడి, అనుమతి కావాలి అని బతిమిలాడే పద్ధతికి స్వస్తి చెప్పాలి. పోలీసుస్టేషన్‌కు ఎవ్వరూ వెళ్లినా కనీసం మర్యాదగా మాట్లాడే సంస్కతి నేర్పాలి. ప్రజలు తమ పాలకులు అనే స్పహ కలిగించాలి. ఈ కషి తెలంగాణ నాయకులు చేయకపోతే, పోరాటాల అనుభవమున్న తెలంగాణ ప్రజలు మళ్లీ తిరగబడతారన్న చారిత్రక సత్యాన్ని మరిచిపోవద్దు.

తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలకంటే మహబూబ్‌నగర్ అతి ఎక్కువ వెనకబడిన జిల్లా అనే అంశం తెలంగాణ ఉద్య మ సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల అవగాహనకు వచ్చింది. ఈ జిల్లాలోని కరువు, వలసలు, ఆత్మహత్యలు, పడుకున్న ప్రాజెక్టులు, జోగి ని వ్యవస్థ, మహిళలపై వేధింపులు, దళితుల పరిస్థితులు, మూఢ విశ్వాసాలు, భూస్వామ్య సంబంధాలు, బాధ్యతారహిత రాజకీయ నాయకత్వం జిల్లా వెనుకబాటుతనాన్ని కొట్టవచ్చినట్టు చాటుతున్నాయి. గత రెండు, మూడు దశాబ్దాలుగా పౌర సమాజం నుంచే ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రజాస్వామ్యవాదులు కరువు వ్యతిరేక కమిటీ గా ఏర్పడి, జిల్లా పరిస్థితులను నిశితంగా పరిశీలించడమే కాక సమస్యలను ప్రజల దష్టికి తేవడానికి తమ వంతు పాత్ర నిర్వహించారు. ఈ కమిటీ ప్రజల చైతన్యంలో మార్పు తీసుకవస్తున్నదని గమనించిన పాలకవర్గం కమిటీ కార్యక్రమాలకు ఆటంకాలు కలిగిస్తూ, చివరికి కమిటీ తన కార్యక్రమాలను కొనసాగించకుండా అడ్డుపడ్డారు. 

కొంతవరకు అప్పటి కషికి కొనసాగింపుగా పాలమూరు అధ్యయన వేదిక ఇతర ప్రజా సంఘాలతో కలిసి సమస్యల మీద లోతైన అధ్యయనంతో పాటు నిరంతరంగా చర్చను సజీవంగా ఉంచే ప్రయత్నం చేసింది, చేస్తున్నది.
కరువు వ్యతిరేక పోరాట కమిటీ గతంలో జరిగిన ఎన్నికల సందర్భంలో రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తూ, ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు తీసుకునేది. ఎన్నికలప్పుడు ప్రతిసారి ఏదో మిష మీద పోలీసులు మీటింగులకు అనుమతులు నిరాకరించడం, ఒక్కొక్కసారి వాళ్లతో వాదించి మీటింగ్‌లు పెట్టుకోవడం, ఒక్కొక్కసారి వాళ్లు వద్దన్నా మీటింగ్‌లు పెట్టడం జరిగేది. గతంలో ఒక పర్యాయం (2004 ఎన్నికలు అనుకుంటా) ఎన్నికల సందర్భంలో ఒక్కరోజు ధర్నా చేస్తామని అడిగితే పోలీసులు నిర్దందంగా అనుమతి నిరాకరించారు. ఈ విషయం బాలగోపాల్‌తో ప్రస్తావిస్తే, ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేసి అనుమతి సాధించాడు. హైకోర్టు ఆర్డర్స్‌తో ధర్నా నిర్వహించి కలెక్టరేట్ దాకా ప్రొసెషన్‌లో వెళితే అప్పటి జాయింట్ కలెక్టర్ స్వయాన ప్రొసెషన్‌నుఉద్దేశించి ప్రసంగించాడు. ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ఎన్నికల సందర్భంలో ప్రజలు తమ సమస్యలను కాబోయే ప్రతినిధుల దష్టికి తీసుకపోవడం ఒక సహజ హక్కు. ఇలాంటి అవకాశాలు లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థంలేదు. 

ఎన్నికలప్పుడు కూడా బందోబస్తు పేరు చెప్పి అనుమతులు నిరాకరించడం పోలీసు యంత్రాంగానికి అలవాటైపోయింది.
తెలంగాణ ఉద్యమం దీర్ఘకాలం జరగడానికి, ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు రావడానికి, ప్రజలు ఎదుర్కొన్న నిర్బంధం ఒక కారణం. తమ రాష్ట్రమంటూ వస్తే తమ సమస్యలపై ఉద్యమించడాని కి, పోలీసులు పరాయి పాలకుల దౌర్జన్యం నుంచి బయటపడి, తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉంటారని ప్రజలు ఉద్యమించారు. తీరా రాష్ట్రం ప్రకటించిన తర్వాత జరుగుతున్న ఇప్పటి ఎన్నికలలో పాలమూరు పోలీసుల వైఖరిలో ఎలాంటి మార్పులేదు. ఇప్పుడు మనం మన రాష్ట్రంలో ఉన్నాం అనే ఆనందం ఏం లేదు. ఉద్యమాలు రాజ్య స్వభావంలో కొంచమైన మార్పు తేలేకపోతే దాన్ని ఉద్యమ వైఫల్యంగా పరిగణించవలసి ఉంటుంది. 

2014 ఎన్నికలు 2004 ఎన్నికలకు లేక అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకు ఏ మాత్రం భిన్నంగా లేవని పోలీసు యంత్రాంగం ప్రవర్తనలో రవ్వంత మార్పు లేకపోవడం పాలమూరు లో అనుభవపూర్వకంగా విశదమవుతున్నది. ప్రజా సంఘాలు ఏప్రిల్ 26నాడు ఒక శాంతియుత ర్యాలీ తీస్తామని నాలుగు ఐదు రోజుల ముందే పోలీసులకు రాతపూర్వకంగా ఇచ్చినా డీఎస్పీ అది తన దష్టి కి రాలేదని అనుమతి ఇవ్వనని, చంద్రబాబు మీటింగ్‌తో తాను చాలా ఒత్తిడిలో ఉన్నానని అన్నప్పుడు, ఇంత పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకుంటే తెలంగాణలో కూడా మీరు ఇలా ప్రవర్తిస్తే ఉద్యమానికి ఏం అర్థం? అని అడిగితే,అంత లోతైన విషయాల గురించి తాను ఆలోచించలేదని, అనుమతి అయితే ఇవ్వనని మొండికి వేశాడు. మా సభ్యులు భిన్న ప్రాంతాల నుంచి వస్తున్నారని అందరికి ఇబ్బంది అవుతుందని మా తరఫున ఎలాంటి శాంతిభద్రతల సమస్య ఉండదని అంటే, మా అనుమతి లేకుండామీరు అందరిని ఎలా పిలిచారని ప్రశ్నించాడు.ఈ ప్రవర్తన ఒక మహబూబ్‌నగర్ డీఎస్సీకి మాత్రమే పరిమితమైంది కాదు. ఇది ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు పనికట్టుకుని మొత్తం పోలీసు యంత్రాంగాన్ని ఇలా తయారు చేశారు. తమ పనులు చేసిపెట్టినంత కాలం, వాళ్లు ప్రజలతో ఎలా ప్రవర్తించినా పట్టించుకున్న పాపానపోలేదు.

నిజానికి 2004, 2005 సంవత్సరంలో పాలమూరు జిల్లా అత్యంత దారుణమైన పోలీసు అణచివేతను ఎదుర్కొంది. అప్పటి ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి పాత కాలం కరీంనగర్, వరంగల్, నల్గొండ దొరల ప్రవర్తనను గుర్తుకు తెచ్చాడు. ఎస్పీ నియంతత్వాన్ని మహబూబ్‌నగర్ ప్రజాప్రతినిధుల దష్టికి తీసుకెళితే ఎస్పీని ట్రాన్స్‌ఫర్ చేసేంత పలుకుబడి తమకు లేదని తప్పించుకున్నారు. అప్పటి హోంమంత్రి జానారెడ్డి దష్టికి తీసుకెళితే తాను నిస్సహాయుడినని, తన మాట ఎస్పీ ఖాతరు చేయడం లేదని అన్నాడు (అవి రాజశేఖర్ రెడ్డి, కేవీపీ రాంచందర్‌రావు చక్రంతిప్పిన రోజులు) ఇదే ప్రతినిధులు ఆ ఎస్పీ తర్వాత వచ్చి న ఎస్పీ చారుసిన్హాను (ఆమె నా విద్యార్థి ని) తమ మాట వినలేదని నాలుగైదు నెల ల్లో ట్రాన్స్‌ఫర్ చేయించారు. ఇది పాలమూ రు ప్రజా ప్రతినిధుల ప్రజాస్వామ్య ప్రవర్తన.
ఇప్పుడు కొత్త రాష్ట్ర ఆవిర్భావం జరుగుతున్నది.

ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేసి సాధించుకున్న రాష్ట్రమిది. ఇప్పుడు తెలంగాణ వలస పాలకుల చేతిలో లేదు. ఇది పాత తెలంగాణ కాదు. పాలమూరు నాయకులైనా, తెలంగాణ రాష్ట్ర నాయకులై నా దీన్ని పూర్తిగా గుర్తించవలసిన అగత్యం వాళ్లకుంది. రాష్ట్రం ఏర్పడుతూనే పోలీసు యంత్రాంగం మీద సివిలియన్ అధికారాన్ని పునరుద్ధరించాలి. కలెక్టర్ల అధికారాన్ని, వాళ్ల ఎస్పీ కాన్ఫిడెన్షియల్ రిపోర్టు రాసే పద్ధతి మళ్లా ప్రవేశపెట్టాలి. పోలీసులు కలెక్టర్లను లెక్కచేయకపోవడం, ఎస్పీలు చెబితే కలెక్టర్లను ట్రాన్స్‌ఫర్ చేసే పద్ధతికి పూర్తిగా స్వస్తి చెప్పాలి. సభలకు ధర్నాలకు, ప్రొసెషన్లకు పోలీసుల అనుమతివ్వడం రద్దు చేసి, ప్రజలు కేవలం పోలీసులకు సమాచారం ఇవ్వడానికి మాత్రమే కుదించాలి. 

కనీసం 2019 ఎన్నికల వరకన్నా స్వేచ్ఛగా ప్రజలు తమ సమస్య లు చెప్పుకునే వాతావరణం ఏర్పడాలి. డీఎస్పీ గారి ముందు దోషిగా నిలబడి, అనుమతి కావాలి అని బతిమిలాడే పద్ధతికి స్వస్తి చెప్పాలి. పోలీసుస్టేషన్‌కు ఎవ్వరూ వెళ్లినా కనీసం మర్యాదగా మాట్లాడే సంస్కతి నేర్పాలి. ప్రజలు తమ పాలకులు అనే స్పహ కలిగించాలి. ఈ కషి తెలంగాణ నాయకులు చేయకపోతే, పోరాటాల అనుభవమున్న తెలంగాణ ప్రజలు మళ్లీ తిరగబడతారన్న చారిత్రక సత్యాన్ని మరిచిపోవద్దు. 

Namasete Telangana Telugu News Paper Dated: 27/4/2014 

తెలంగాణలోనూ అగ్రకుల పాలనేనా!----జనగామ నర్సింగ్ బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు


Updated : 4/27/2014 1:35:31 AM
Views : 53
తెలంగాణ రాష్ట్రంలో చాకలి ఐలమ్మ,దొడ్డి కొమురయ్య, కొమురం భీంల స్ఫూర్తితో బహుజన వర్గాలు రాజ్యాధికారం కోసం ప్రయత్నించాలి. తల్లి తెలంగాణ చల్లగా ఉండాలంటే అగ్రకులాలు ఏలే తెలంగాణ కాదు, బహుజనులు ఏలే తెలంగాణ కావాలి.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి ఊపిరైంది బహుజనులే. దేశంలో చిన్న రాష్ర్టాల గురించి మొదటిసారి మాట్లాడింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్. చిన్న రాష్ర్టాల ఏర్పాటు వల్ల పాలనా సౌలభ్యం ఏర్పడి, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతాయ ని పేర్కొన్నారు. అలాగే చిన్న రాష్ర్టా ల ఏర్పాటు వల్ల చిన్న కులాలు అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుందన్నారు. 120 కోట్ల పైగా జనాభా ఉన్న భారత దేశంలో 28 రాష్ర్టాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాం తాలు ఉంటే, 30 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో యాభై రాష్ర్టాలున్నాయి. దీనివల్ల అక్కడ పాలనా సౌలభ్యం వల్ల అభివద్ధి జరిగింది. 

రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ చెప్పిన చిన్న రాష్ర్టాలు అభివద్ధికి సోపానాలు అన్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, పదవులలో ఉన్న (సీమాంధ్ర) ప్రజా ప్రతినిధులు ఈ మాటలు విస్మరించి అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. అంతేకాదు రాష్ట్ర విభజన ప్రక్రియ గురించి ఇష్టం వచ్చిన మాట్లాడడం చూస్తే వారికి ప్రజల పట్ల, రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నదో అర్థమవుతుంది. 

1969లో జరిగిన తెలంగాణ పోరాటంలో 369 మందిని నాటి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం బలిగొన్నది. ఆనాటి ఉద్యమంలో ఉద్యమంలో అమరులైన వారిలో ఎక్కువ మంది బహుజనులే. దేశంలో తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో యావత్ ప్రజానీకం ఎవరికి తోచిన విధంగా రాష్ట్ర ఆకాంక్షను వినిపించారు. వివిధ కులాల వారు వారి కులవత్తుల ద్వారా రాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటిచెప్పారు.అయితే ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలే. ఆంధ్రప్రదేశ్‌లో బహుజనుల జనాభా-ఎస్సీలు 15 శాతం, ఎస్టీలు 7 శాతం, బీసీలు సుమారు 52 శాతం, ముస్లింలు 12 శాతం.

అగ్రకులాల వారు సుమారు 6 శాతం ఉంటారు. ఉమ్మడి రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం రాజకీయ వాటా లభించలేదు. అవశేష ఆంధ్రప్రదేశ్‌లో అగ్రకులాలదే పెత్తనం. బహుజనులు పాలితులుగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అణిచివేయబడినారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇరు ప్రాంతాల అభివద్ధిలో వైఫల్యం, నీళ్లు, నిధుల పంపిణీలో వ్యత్యాసం, అలాగే విద్యా రంగంలోనూ అభివద్ధి , అసమానతలకు సమాధానం చెప్పాల్సింది ఇంత కాలం ఈ రాష్ర్టాన్ని ఏలిన పాలకులే.

మలిదశ తెలంగాణ ఉద్యమంలో బహుజన వర్గాలకు చెందిన విద్యార్థులు ముందున్నారు. విద్యకు దూరమై, వందలాది కేసులతో అనేక రోజులు జైలుపాలయ్యారు. తెలంగాణ కోసం అమరులైన వారి లో కూడా దాదాపు 90 శాతం బహుజనవర్గాల వారే. పోరాటంలో ముందున్నది బహుజనులు కాగా రాజకీయంగా లబ్ధి పొందడంలో ముందున్నది అగ్రకులాల వారే అన్నది నిజం.తెలంగాణ ప్రజలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో బహుజన తెలంగాణ కోరుకుంటున్నారు. మాన్యశ్రీ కాన్షీరాం ఓట్లు మావి-సీట్లు మీవా ఇకపై చెల్ల దు అన్నారు. జనాభా ప్రాతిపదికన బహుజనులు తమ హక్కుల కోసం పోరాడాలన్నారు. తెలంగాణ పోరాటంలో ముందున్నది బహుజనులు కాబట్టి ఈ వర్గాల ప్రయోజనాలు నెరవేరేదాకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అగ్రకుల పాలనను వ్యతిరేకిస్తూ బహుజనులు రాజ్యాధికారం కోసం ప్రయత్నించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రకుల పాలన వల్ల ఈ వర్గాలు అనేక అవమానాలకు గురయ్యాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ అగ్రకులాల పాలనేనా?
తెలంగాణ రాష్ట్రంలో చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, కొమురం భీంల స్ఫూర్తితో బహుజన వర్గాలు రాజ్యాధికారం కోసం ప్రయత్నించాలి. తల్లి తెలంగాణ చల్లగా ఉండాలంటే అగ్రకులాలు ఏలే తెలంగాణ కాదు, బహుజనులు ఏలే తెలంగాణ కావాలి. అన్ని వర్గాలకు అభివద్ధి ఫలాలు దక్కాలంటే సామాజిక తెలంగాణ కావాలి. బహుజన రాజ్యాన్ని నిర్మించడమే బాబా సాహెబ్ అంబేద్కర్‌కు మనం అందించే నివాళి.

Friday, April 25, 2014

చుండూరు తీర్పు Vaartha Sampadakiyam


భారతీయ శిక్షాస్మృతిలో సాక్ష్యం ఎంతో కీలకమైంది. న్యాయమూర్తులు సాక్ష్యాలు,వాంగ్మూలాలు,రికార్డు లపై ఆధారపడాల్సిందేతప్ప తమ సొంత విచక్షణతో వ్యవ హరించే అవకాశం తక్కువని చెప్పొచ్చు. ఈ సాక్ష్యాలు, రికార్డుల మాయాజాలంలో ఎన్నోకేసులు తారుమారైపోతు న్నాయి.ఎంతోమంది దోషులు చట్టాన్నుంచి తప్పించుకుం టున్నారు. ఇందుకు ప్రధానంగా నిందించాల్సింది, తప్పుప ట్టాల్సింది దర్యాప్తు చేస్తున్న అధికారులనే. చట్టాల్లో ఉన్న లొసుగులతోపాటు దర్యాప్తు అధికారులకు ఉన్న ఇబ్బందులు వారికి ఉన్నమాట నిజమేకావచ్చు.ఏదిఏమైతేనేం నేరాలను రుజువ్ఞ చేసేందుకు అవసరమైన,తిరుగులేని సాక్ష్యాలను సేకరించి న్యాయస్థానాల ముందుపెట్టి, నేరస్థులకు శిక్షలు వేయించడంలో పోలీసులు విఫలమవ్ఞతున్నారు. అందుకే పోలీసులుపెడ్తున్న కేసుల్లో అధికశాతం కేసులు కోర్టుల్లో వీగి పోతున్నాయి. దీంతో అనేకమంది నేరస్థులు నిర్భయంగా స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారు. కేసులన్నా, పోలీసులన్నా భయభక్తులు లేకుండాపోతున్నాయి.మళ్లీమళ్లీ నేరాలకుపాల్ప డుతున్నారు. దీనికితోడు పెరిగిన కేసులకు అనుగుణంగా కోర్టులు, సిబ్బందిని పెంచకపోవడంతో విచారణలు దశాబ్దాల తరబడి జరుగుతున్నాయి. సంవత్సరాల తరబడి జాప్యం జరగడంవల్ల కొందరు సాక్షులు,నిందితులు మరికొందరు బాధితులు,ఫిర్యాదుదారులు మరణిస్తున్నారు. దర్యాప్తుచేస్తు న్న అధికారులు కూడా బదిలీలైపోవడం, మరికొందరు పదవీ విరమణతో కేసులపట్ల పెద్దగాశ్రద్ధ చూపడం లేదు.
నిన్న మంగళవారం వెలువడిన చుండూరు మారణకాండ తీర్పు ఉదహరించవచ్చు. గుంటూరుజిల్లా తెనాలి మండలం, చుండూరులో 1991 ఆగస్టు ఆరోతేదీన ఎనిమిది మంది దళితులు దారుణహత్యకు గురయ్యారు. ఈ సంఘటన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మొత్తంమీద 219మందిపై పోలీసులు ఆనాడు కేసు నమోదు చేసారు. దళితసంఘాల ఉద్యమాలు,ఆందోళనలు, విజ్ఞప్తుల మేరకు భారతదేశంలోనే తొలిసారిగా సంఘటన స్థలంలోనే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి విచారణకు ఆదేశాలు ఇచ్చారు. 1991లో జరిగిన ఉదంతంపై 2004 నవంబరులో ప్రారంభమైన విచారణ 2007 మార్చి నాటికి ప్రత్యేక కోర్టు పూర్తి చేసింది.123మందిని నిర్దోషులుగా తేల్చి,56 మందిని దోషులుగా పేర్కొంటూ అందులో 21 మందికి జీవితకారా గారశిక్ష, మిగిలిన 35 మందికి ఏడాది పాటు సాధారణ జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అనీస్‌ 2007 జూలై 31న తీర్పు వెలువరించారు. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ 2007లో నిందితులు హైకోర్టులో పిటిషన్‌ వేసారు. విచారణచేపట్టిన ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ ఘట నకు బాధ్యులుగా పేర్కొంటూ 21 మందికి జీవితకారాగార శిక్ష, మరో 35మందికి ఏడాదిపాటు జైలుశిక్ష వేస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసి అందరూ నిర్దోషులుగా ప్రక టించింది. దళితులపై దాడికి బాధ్యులను గుర్తించడంలోనూ, సంఘటన జరిగిన ప్రాంతాన్ని రుజువ్ఞ చేయడంలోనూ, చని పోయినవారు ఫలానాసమయంలో చనిపోయారని నిరూ పించడంలోనూ విచారణ కోర్టులో ప్రాసిక్యూషన్‌ విఫలమై నట్లు ధర్మాసనం అభిప్రాయపడింది.అంతేకాదు కిందికోర్టు జరిపిన విచారణలో విధానపరమైన లోపాలున్నాయని హైకోర్టు ప్రస్తావించింది. ఈ విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం కాబట్టి విచారణ కోర్టులు నైతికశిక్ష  విధించిందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. సాక్ష్యాలు చెప్పిన దాని ప్రకారం దాడిచేసిన వారి వివరాలు వేర్వేరుగా ఉన్నాయన్నది. తనకు తీవ్రగాయాలైనా సమీపంలోని పంట కాల్వలోకి దూకి సుమారు మూడు కిలోమీటర్లు ఎదురీదు కుంటూ వెళ్ళానని సాక్ష్యం చెప్పినవ్యక్తి (పిడబ్ల్యు15)క్రాస్‌ ఎగ్జామినేషన్‌లో తనకు ఈతరాదని ఒప్పుకున్నారు. ఈత రాని వ్యక్తి తీవ్రగాయలైనా ఏటికిఎదురీదుతూ వెళ్లానని చెప్పిన సాక్ష్యం ప్రత్యేకకోర్టు పరిగణనలోకి తీసుకోవడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ఇక ఈతరాకపోయినా పది అడు గుల లోతులోఉన్న కాల్వలో ఈదుకుంటూ తెనాలిలోని తన బంధువ్ఞల ఇంటికి చేరుకున్నానని 1991 ఆగస్టు పదోతేదీ వరకు అక్కడే తలదాచుకున్నానని వివరించిన వ్యక్తి ఆచూకీ తెలియకుండాపోయిన తన సమీపబంధువ్ఞల గూర్చి పోలీ సులకు ఫిర్యాదుచేయలేదంటూ ప్రాసిక్యూషన్‌లోని లోపా లను ధర్మాసనం ఎత్తిచూపింది. ప్రధాన సాక్ష్యులు (1నుంచి 7)ఉన్న అందరూ ఈ కేసులో ఆరో నిందితుడిగా ఉన్నవ్యక్తి వికలాంగుడని ఒప్పుకున్నారు. ఒకచేతిని కాలుపైవేయకుండా ముందుకు వెళ్లలేడని స్పష్టంచేసారు. అయినా ఆరోనింది తుడు ముగ్గురిని వెంటాడి చంపాడని చెప్పినసాక్ష్యాన్ని ప్రత్యే కకోర్టు పరిగణనలోకి తీసుకుందని ధర్మాసనం ఆక్షేపించింది.
మొత్తంమీద ఈ కేసులో ప్రాసిక్యూషన్‌లో ఎన్నో లోపా లున్నాయని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తంచేసింది. కుటుంబ సభ్యులను కోల్పోయిన దళిత కుటుంబాలకు కలిగిన వేదన తీర్చలేనిదని ప్రభుత్వం ఎంత సహాయం చేసినా ఆ బాధతీర నిదని అయితే అభియోగాలపై 15ఏళ్లకుపైగా 200మందిపై కొనసాగుతున్న విచారణ,ప్రతిదాడులు,ఆయా కుటుంబాలు సైతం ఎంతో ప్రభావం చూపింది. ఇప్పటికైనా ఈ కక్షలకు స్వస్తిపలికి పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుంటూ మాన వతావిలువలతో కలిసిమెలిసి జీవించాలని ధర్మాసనం హిత వ్ఞపలికింది. మొత్తంమీద ఈ తీర్పుతో దళితసంఘాలు తీవ్ర అసంతృప్తికి గురయ్యాయి.సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సంసి ద్ధమవ్ఞతున్నట్లు ఆ సంఘాలు ప్రకటించాయి. ఏదిఏమైనా అక్కడ మళ్లీ ఉద్రిక్తత ఏర్పడకుండా ప్రశాంతతను కాపా డాల్సిన గురుతరబాధ్యత ప్రభుత్వంపై ఉంది.కేసుల దర్యా ప్తు విషయంలో అధికారులు మరింత పటిష్టంగా పక డ్బందీగా వ్యహరించాల్సిన అవసరం ఉంది.

Vaartha Telugu News Paper Dated : 24/4/2014 

చుండూరు తీర్పు కనువిప్పు కాగలదా? By చలసాని నరేంద్ర


మారణకాండ నిందితుల శిక్ష రద్దు! 
సామాజికాంశాలపై ప్రశ్నలు 
శిక్షల రద్దు ఉద్యమ వైఫల్యమే 
ప్రభుత్వ యంత్రాంగానిదీ అలసత్వమే 
నిందితులను గుర్తించడం జరగలేదు
గ్రామస్థులందర్నీ కేసులో చేర్చారు 
కేసులు నిర్వహించే పటిష్ఠ వ్యవస్థ అవసరం 

ప్రపంచ దృష్టి ఆకర్షించిన గుంటూరు జిల్లా చుండూరు దళితుల మారణకాండలో నిందితులకు సంఘటన జరిగిన సుమారు 23 సంవత్సరాల తరువాత ఇప్పుడు రాష్ట్ర హై కోర్టు కింది కోర్టు విధించిన శిక్షను రద్దు చేయడంతో మరో పర్యాయం ఈ సంఘటన చర్చనీయాంశమవుతున్నది. ఈ సంఘటనను కేవలం ఒక గ్రామానికి చెందిన అంశంగా కాకుండా మొత్తం భారత దేశంలో స్వాతంత్య్రం సిద్ధించిన ఆరు దశాబ్దాల తరువాత ఇంకా కు వివక్ష ప్రదర్శించే పరిస్థితులు కొనసాగనడం సిగ్గు చేటైన అంశం. చుండూరుకన్నా ముందు ప్రకాశంజిల్లా కారంచేడు, ఆ తరువాత గుంటూరు జిల్లా నీరుకొండలో ఇదే విధంగా దళితులపై జరిగిన దాడులు అనేక మౌలిక సామాజిక అంశాలను, ప్రశ్నలను లేవనెత్తాయి. ఇటువంటి సంఘటనలో నిందితులకు హై కోర్టు శిక్షలను రద్దుచేసే పరిస్థితులు నెలకొనడం తీవ్ర విస్మయం కలిగించే అంశం. అందుకు దారితీసిన పరిస్థితులను గుర్తించితే గాని ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా నిరోధించలేము. 
ప్రజా ఉద్యమాల కారణంగా, ఈ సంఘటనలు ముఖ్యంగా దళితులల్లో ఆత్మ గౌరవం అనే ప్రశ్నను లేవనెత్తి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయడంతో అసలు నిందితులను గుర్తించి వారికి శిక్షలు పడేవిధంగా చేయడంపట్ల ఒక వైపు ప్రభుత్వయంత్రాంగం, మరో వైపు ఉద్యమ కారులు విఫలం చెందారని భావించవచ్చు. సంఘటన జరిగిన సమయంలో వారు అనుసరించిన ధోరణులు ఇటువంటి అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నాయి. 

జిల్లా కేంద్రం గుంటూరుకు 20 కి. మి. దూరంలోగల చుండూరు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో, 40 మందికి పైగా పోలీసులు పహారా కాస్తున్న సమయంలో ఘర్షణ జరగడం, 8 మందిని హత్య చేయడమే విస్మయం కలిగించే అంశం కాగా, ఆ గ్రామంలో పోలీసులు ఉండగానే జరిగిన సంఘటనగురించి- అది జరిగిన మూడు రోజుల వరకు జిల్లా కేంద్రంలో గల పోలీస్‌ అధికారులకు గాని, 12 కి మీ దూరంలో గల రెవిన్యూ డివిజన్‌ కేంద్రం తెనాలిలో గల డియస్‌పి, ఆర్‌డిఓ వంటి అధికారులకు గాని సమాచారం అందలేదంటే అసలు ప్రభుత్వ యంత్రాంగం ఉన్నదా అనే అనుమానం కలుగుతున్నది. 
ప్రతి స్థాయిలో అధికారుల బాధ్యతారాహిత్యం ఈ సందర్భంగా వెల్లడి అయినా, బాధ్యులుగా ఎవరినీ గుర్తించడానికి ప్రయత్నం చేయకపోవడం, అక్కడ బాధ్యతారాహిత్యానికి కారకులైన అధికారులకు తరువాత పలు కీలకమైన పోస్టింగ్‌లు ఇవ్వడం, రాష్ట్ర స్థాయిలో ఆధిపత్యం వహించే పదవి ఇవ్వడం గమనార్హం. అయినా ఈ అంశంసంఘటన జరిగిన నాలుగైదు రోజుల వరకు దళిత వాడలోకి, మృతదేహాల వద్దకు ప్రభుత్వ అధికారులు ఎవరినీ, చివరకు పోలీసులను సహితం రానీయలేదు. మొత్తం ప్రభుత్వ అధికార యంత్రాంగం ప్రేక్షకపాత్ర వహించడం మినహా ఏమీ చేయలేదు. అప్పటికే జిల్లా ఎస్‌పి బదిలీ అయినా, ఇంకా విధుల్లో చేరకుండా నిజామాబాదులో విధి నిర్వహణలో ఉన్న ఆర్‌పి మీనా ను రాష్ట్ర డిజిపి వెంటనే వచ్చి పరిస్థితులను అదుపులోకి తేవాలని ఆదేశిస్తే, ఆయన ఆఘమేఘాల మీద గుంటూరుకు పరిగెత్తుకు వచ్చారు. చుండూరులోనే విధి బాధ్యతలు స్వీకరించి నేరుగా దళిత వాడకు వెళ్ళారు. అప్పటి వరకు అధికారులు ఎవ్వరూ అక్కడికి వెళ్ళలేక పోయారు. 

ఆయన దళితులకు న్యాయం చేస్తామని మనోధైర్యం కలిగించే ప్రయత్నం చేసి, మృత దేహాలను శవపరీక్ష కోసం తెనాలి పంపించారు. తెనాలి నుండి తిరిగి వచ్చే సరికి కనీసం అక్కడ ఉన్న మీనాతో మాటమాత్రం అయినా చెప్పకుండా- గ్రామంమధ్య వాటిని ఖననం చేసే ఏర్పాట్లను దళిత వాడ, ఇతర ఉన్నతాధికారులు చేశారు. అక్కడ ఉన్న కోనేరు రంగారావు వంటి నాయకులు శాశ్వతంగా గ్రామస్థులమధ్య వైరం కొనసాగే విధంగా- ఇలా చేస్తున్నరా అని ఉన్నతాధికారులను నిలదీస్తే వారి నోట మాట రాలేదు. 
ఆత్మా గౌరవ పోరాటంగా న్యాయంకోసం చుండూరు దళితులు జరిపిన పోరాటం అనేక విధాలుగా చారిత్రాత్మక మైనది. దేశం మొత్తంమీద ఉన్న దళితులల్లో ఒక ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలిగించే విధంగా జరిగింది. ఆ కృషి ఆ ఉద్యమానికి నాయకత్వం వహించి, మార్గదర్శనం చేసిన కత్తి పద్మారావు, ఆయన సహచరులకే చెందుతుంది. దళితుల్లోని ఆవేశాలను ఉపయోగించుకొని రాష్ట్రంలో తొలిసారిగా మైదాన ప్రాంతంలో తమ స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలని నక్సలైట్‌వర్గాలు ఎంతో ప్రయత్నం చేశాయి. 

తెలంగాణ ప్రాంతంనుండి సీనియర్‌ నాయకులు అంతావచ్చి మకాంవేసే ప్రయత్నం చేశారు. ఇక పలు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతి సరే! అయితే భయంతో, ఆవేదనతో ఉన్న దళితుల ఆవేశాలను రాజకీయ ఉద్యమాలుగా మలచుకొనే అవకాశం ఎవరికీ ఇవ్వకుండా కేవలం వారి భవిష్యత్తు కోసం పటిష్ఠమైన పునాదులు వేసే ప్రయత్నం పద్మారావు చేశారని చెప్పవచ్చు. ఈ సందర్భంగా కొన్ని పొరపాట్లు జరిగినా ఈ విషయంలో ఆయన ప్రదర్శించిన నాయకత్వ పటిమ, చిత్తశుద్ధి లను మాత్రం ఎవ్వరూ శంకించలేరు. అయితే నిందితులపై కేసు నమోదు విషయంలో మొత్తం గ్రామస్థులను ఇరికించే ప్రయత్నం చేశారు. వాస్తవాలను దృష్టిలోఉంచుకొని- అసలు నిందితులను గుర్తించే ప్రయత్నం చేయ లేదు. ఒక వేళ గుర్తించినా ఆ మేరకు కేసుల నమోదుకు ప్రయత్నం చేయలేదు. నాటి యస్‌పి మీనా ఒకొక్క మృతిలో 10 నుండి 12 మంది నిందితులను గుర్తించి పటిష్ఠంగా కేసు నమోదు చేస్తే, తొందరగా విచారణ పూర్తి అయి శిక్షలు పడటానికి అవకాశం ఉంటుందని సూచించారు. అయితే అందుకు నిరాకరించి, ఒకొక్కరి మృతికి 50 మందికి పైగా గుర్తుకు వచ్చిన పేర్లు అన్నీ చేర్చి కేసులు నమోదు చేయడం విచారణ సుదీర్ఘంగా జరగడానికి, హై కోర్టులో శిక్షలను రద్దు చేయడానికి ఒక ప్రధాన కారణం అని భావించవచ్చు. 

ఈ కేసుపట్ల హై కోర్టు న్యాయమూర్తుల దృష్టి కోణం సహితం మరో కారణం కావచ్చు. కేవలం పోలీసులు, న్యాయవాదులు భావించినంత మాత్రంచేత హై కోర్టు శిక్షలను ఖరారు చేయాలని చెప్పలేముగదా! భారత దేశ చరిత్రలోనే నేరం జరిగిన చోట, ఆ గ్రామంలోనే ప్రత్యేక కోర్టును ఏర్పాటుచేసి విచారణ జరపడం ఎంత ప్రత్యేకత సాధించుకున్నా- శిక్షల విషయంలో మాత్రం నిశితమైన దృష్టి కేంద్రికరించ లేదని చెప్పవలసి వస్తుంది. క్రింది కోర్టులో ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించిన బి. చంద్రశేఖర్‌ వంటి న్యాయవాదులు అంకితభావంతో పనిచేయడంతో శిక్షలు పడడం సాధ్యమయింది. ఆయన మృతి చెందడంతో హై కోర్టులో ఏమయినా లోపం జరిగిందా అనే అనుమానం కలుగుతున్నా వాస్తవంగా ఏం జరిగిందో తెలియదు. తొలుత నిందితులుగా పేర్కొన్నవారిలో కొందరు అప్పటికే మృతి చెందారు. కొందరు అసలు గ్రామంలోనే నివాసం ఉండడం లేదు. 280 మందికి పైగా నిందితులుగా పేర్కొంటే వారిలో 39 మంది విచారణ సమయంలోనే మృతి చెందారు. 136 మందిని సాక్షులుగా విచారించారు. 219 మందిని మాత్రమే నిందితులుగా కోర్టు పరిగణలోకి తీసుకొని, వారిలో 21 మందికి జీవిత ఖైదు, మరో 35 మందికి ఒక సంవత్సరం శిక్ష విధించి మిగిలిన వారిని నిరపరాధులుగా వదిలి వేసింది. 

సంఘటన జరిగిన 23 సంవత్సరాల అనంతరం ఇప్పుడు శిక్షలను రద్దు చేసినా వారిప్పటికే సుదీర్ఘకాలం మానసిక వేదనకు గురయ్యారని చెప్పవచ్చు. అసలు ఇంత సుదీర్ఘకాలం విచారణ జరుగవలసిన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయో ఒకవైపు పోలీస్‌ ఉన్నతాధికారులు, ప్రభుత్వం- మరో వైపు ఉద్యమకారులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ పక్షాలు సహితం సమీక్ష చేసుకోవలసి ఉన్నది. కారంచేడు కేసు విషయంలో సహితం కింది కోర్టు వేసిన శిక్షను హై కోర్టు కొట్టి వేసినా, తిరిగి సుప్రీం కోర్టు మళ్ళీ విధించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ పద్మారావు ఆశాభావ వైఖరిని వ్యక్తంచేశారు. రెండు, రెండున్నర దశాబ్దాల పాటు విచారణ జరగడం, కోర్టుల చుట్టూ తిరగడం- కేవలం నిందితులకుమాత్రమే కాకుండా బాధితులకు, వారి పక్షాన పోరాటం చేస్తున్న వారికి సహితం ఒక విధంగా శిక్ష విధించిన్నట్లే కాగలదు. 
ప్రపంచంలోనే అత్యంత కఠినమైనదిగా భావిస్తున్న యస్‌ సి, యస్‌ టి అత్యాచారాల నిరోధ చట్టాన్ని దళితులకు రక్షణ కల్పించడంకోసం మన దేశంలో తీసుకు వచ్చి సుమారు నాలుగు దశాబ్దాలు అవుతున్నా, దళితులు అత్యంత ధైర్యంతో పోరాటాలు జరిపినా న్యాయస్థానాల్లో న్యాయం లభించడంలో మాత్రం తీవ్ర జాప్యం జరగడం గమనిస్తే, మనకున్న న్యాయ విధానమే ప్రశ్నార్ధకం అవుతున్నది. చట్టంపట్ల సామాన్య ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం వ్యక్తమవుతున్నది. 

ఈ చట్టం క్రింద నమోదు అవుతున్న కేసులలో శిక్షలు పడుతున్న కేసుల సంఖ్య నామమాత్రంగా ఉండƒడాన్ని గమనించాలి. పైగా ఈచట్టం ఉపయోగించుకొని అమాయకులను వేధించే ప్రయత్నం జరుగుతున్నదనే ఆరోపణలు సైతం వింటున్నాము. ఈ చట్టం అమలుపై ఒక సమీక్ష జరుపవలసిన సమయం నేడు ఆసన్నమయింది. చుండూరు కేసు ను సుప్రీ కోర్టులో అప్పీల్‌ చేసే సమయంలో, ఈ చట్టాన్ని మరింత సమర్ధవంతంగా అమలు చేసి, దళితులలో మనో ధైర్యం, విశ్వాసం, అభయం కలిగించేందుకు అవసరమైన మార్పులు, చేర్పుల గురించి అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయాన్ని కోరే ప్రయత్నం కుడా చేయాలి. రాష్ట్ర హై కోర్టు ఈ కేసును కొట్టి వేసే సందర్భంగా- సాక్షుల కథనాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని, లేదా ఒకే విధంగా లేవని, సంఘటన జరిగిన స్థలం, నిందితుల గుర్తింపు వంటి వివరాలను సమకూర్చడంలో ప్రభుత్వం విఫలం అయిందని న్యాయమూర్తులు పేర్కొనడం గమనార్హం. అంటే కేసును పటిష్టంగా రూపొందించడంలో ఒక వైపు బాధితుల తరపున పోరాటం చేసున్న ఉద్యమకారులు, మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం విఫలం అయినట్టు భావించవలసి ఉంటుంది. దళితులు, గిరిజనులు, ఇతర అణగారిన వర్గాలు దాడులకు, అన్యాయానికి గురయిన సమయంలో వారిపక్షాన కోర్టులలో కేసులను పటిష్ఠంగా నిర్వహించే వ్యవస్థను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం, ఉద్యమాకారులు కలసి ప్రయత్నం చేయవలసిన అవసరాన్ని ఈ సంఘటన వెల్లడి చేస్తున్నది.

Surya Telugu News Paper Dated: 26/4/2014 


Tuesday, April 22, 2014

దళితులకు న్యాయం ఎండమావేనా? By దుడ్డు ప్రభాకర్, కులనిర్మూలనా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు


Updated : 4/23/2014 2:00:08 AM
Views : 43
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకుంటున్న మన దేశంలో రాజ్యాంగ చట్టం, పాలనావ్యవస్థ, రక్షణ వ్యవస్థ క్రమంగా ప్రజలకు దూరమవు తున్నాయి. ఈ దశలో న్యాయవ్యవస్థను కూడా ఉపయోగించుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయా అనే ఆందోళన కలు గుతున్నది. దేశంలో పీడిత ప్రజల బతు క్కి భద్రత, రక్షణ కల్పించే దిక్కు లేకుండా పోతున్నది.ఎంతోకొంత ఎస్సీ, ఎస్టీలకు అనివార్య పరిస్థితుల్లో చివరి ఆశగా న్యాయవ్యవస్థ వైపు చూస్తున్నా రు. చివరకు ఇవ్వాళ ఆ ఆశ కూడా ఆవిరవుతున్న పరిస్థితు లు వచ్చాయి. దీనికి నిదర్శనంగా చుండూ రు నరమేధం కేసులో ముద్దాయిలు 21 మంది కూడా నిర్దోషులుగా ప్రకటించబడ్డారు! అయితే ఇక్కడ ఆలోచించాల్సింది..చుండూరులో నరమేధం జరిగింది అవాస్తవమా..!? నిర్దోషులుగా ప్రకటించబడ్డ వారికి ఆ ఊచకోతతో సంబంధమే లేదా? అసలు వారు దోషులే కారా? అంతా.. గజం మిథ్య.. ,పలాయనం మిథ్య.. అన్న నీతేనా..? 

నిజానికి ఆనాడు చుండూరులో ఏం జరిగింది? 1991 ఆగస్టు 6న దళిత నెత్తుటి చరిత్రలో మరో నెత్తుటి మరక చోటు చేసుకున్న రోజు. చుండూరు దళితవాడపై చుండూరు, మోదుకూరు వలివేరు మున్నంగివారి పాలెం గ్రామాలకు చెందిన రెడ్లు, కాపులు మారణాయుధాలతో దళితులపై పథకం ప్రకారం విచక్షణారహితంగా దాడిచేశారు. ఉదయం 11గంటల నుంచి వందమందికి పైగా పోలీసులు లాఠీలతో పల్లెలోకి ప్రవేశింంచి ఉన్నా.., కాపులు, రెడ్లు మూకుమ్మడిగా మారణాయుధాలతో పల్లెపైకి వచ్చారు. దీంతో.. మేం తక్కువ మందిమి ఉన్నం. వాళ్లను ఆపలేం. పారిపోయి ప్రాణాలు దక్కించుకోండి అంటూ పోలీసులు ఇల్లిల్లూ తిరిగి చెప్పారు. ప్రాణభయంతో పారిపోయే దళితుల్ని అగ్రకుల ఉన్మాదశక్తులు ట్రాక్టర్లలో కత్తులు, గొడ్డళ్లు, బరిసెల తో వెంటాడి, వేటాడి నరికారు. శవాలను గోతాల్లో కుక్కి తుంగభద్రలో వేశారు. మూడురోజులు కాల్వ లో వెతగ్గా మొత్తం ఎనిమిది శవాలు దొరికాయి. శరీరమంతా ఛిద్రమై గుర్తించలేనంతగా కుల్లిపోయి ఉన్న రమేష్ అనే డిగ్రీ విద్యార్థి శవాన్ని చూసి అత ని అన్న పరిశుద్ధరావు గుండె పగిలి చనిపోయాడు. హంతకుల అరెస్టు కోసం ఉద్యమం నడుపుతున్న కొమ్మెర్ల అనిల్ కుమార్‌ను పట్టపగలు దళితవాడలో జరుగుతున్న నిరాహారదీక్ష శిబిరంలో పోలీసులు కాల్చిచంపారు. చలో ఢిల్లీ కార్యక్రమంలో రోడ్డు దాటుతుండగా గూడూరు కయమ్మ యాక్సిడెంట్‌లో చనిపోయింది. ఇలా మొత్తం11 మంది చుండూరు బాధితులు పోలీసులు, అగ్రకులాల పకడ్బందీ వ్యూహంలో బలయ్యారు. ఈ చుండూరు దళితుల కు తగిన న్యాయం జరగాలని, నేరస్తులు శిక్షించబడాలని చుండూరు దళితులే కాదు, రాష్ట్రవ్యాప్తంగా దళితులు పోరాటం చేశారు. ఇప్పటిదాకా అలుపెరుగకుండా పోరాడుతున్నారు. ఈ సుదీర్ఘ 16 ఏళ్ల పోరాటం తర్వాత, ఇంత న్యాయం కోసం ఇంత కాలయాపన తర్వాత చుండూరులోని ప్రత్యేక కోర్టు 2007 జూన్ 31న 25 మంది ముద్దాయిలకు జీవితఖైదు, 35 మందికి సంవత్సరకాలం శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 

అయితే ఈ కేసులో అనేక మలుపులు, సుదీర్ఘ విచారణలో అనేక చిత్రవిచిత్రాలు జరిగాయి. సహ జ న్యాయ సూత్రాలకు భిన్నంగా అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. 16 ఏళ్ల తర్వాత ముద్దాయిల కు శిక్షపడితే..దాన్నుంచి తప్పించుకునే క్రమంలో నేరస్తులు పైకోర్టుకు వెళ్లి స్టే ఉత్తర్వులు తెచ్చుకున్నా రు. కేసులో మొత్తం 219 మందిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం, భారత శిక్షాస్మతి 302, 307 సెక్షన్ల కింద పోలీసులు చార్జ్‌షీట్ వేశారు. వీరిలో ఏడుగురిని కొన్ని టెక్నికల్ కారణా లు చూపి కేసు నుంచి మినహాయించి ,పోలీసులు వారిని అరెస్టు చేయలేదు. మిగతా వారిని కేసు నుంచి మినహాయించి కేసును వేరుచేసి 1993లో కేసు విచారణకు వచ్చే సరికి, బాధితులు క్రిస్టియన్ మతానికి చెందిన వారు కాబట్టి వారిని బీసీ (సీ)గా గుర్తించాలని అంటూ కేసును ఎస్సీ,ఎస్టీ అత్యాచారాల చట్టం కిందకు రాదని వాదించారు. కాబట్టి ప్రత్యేక కోర్టును రద్దు చేయాలని ప్రత్యేక కోర్టులో వాదనలు లేవనెత్తారు. హై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. ఇలా కొంత కాలయాపన తర్వాత కోర్టు ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టులోనే విచారణకు సిద్ధపడింది. దీనిపై కూడా అగ్రకుల పెద్దలు హై కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. మరోవైపు చుండూరులోనే కోర్టు పెట్టి విచారణ జరిపితే తమ ప్రాణాలకు రక్షణ ఉండదని అగ్రకులస్తులు మళ్లీ హైకోర్టు నుంచి విచారణ జరగకుండా స్టే తెచ్చుకున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ హక్కుల సంఘానికి చెందినవాడు కాబట్టి వారికి నక్సలైట్లతో సంబంధం ఉంటుంది కాబట్టి అతన్ని తప్పించాలని వాదించి మరి కొంతకాలం కాలయాపన చేశారు. 

ఎట్టకేలకు 2004 డిసెంబర్1న ప్రత్యేక కోర్టులో విచారణ ప్రారంభమైంది. విచారణ ప్రారంభమయ్యే నాటికి ఏడుగురు అరెస్టే కాలేదు. 23 మంది చనిపోయారు. మిగిలిన 183 మందిపై విచారణ ప్రారంభమయ్యింది. 79 మంది సాక్షుల్ని విచారించారు. చివరకు తీర్పు ప్రకటించారు. ఈ తీర్పుతో కంగు తిన్న అగ్రకుల భూస్వాములు తమ ధన,కుల బలం అండతో హైకోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో కూడా అగ్రకుల భూస్వాముల తరఫున అనేక వింత వింత కాలయాపన వాదనలు చేశారు. చాలాకాలం పాటు అంతూ పొం తూ లేని వాదనలతో కోర్టులో కేసు విచారణను అడ్డుకున్నారు. ఈ క్రమంలో బాధితులు దళితుల తరఫున నిలిచిన న్యాయవాదులు కోర్టు చేస్తున్న జాప్యానికి అనేక రూపాల్లో తమ నిరసనను తెలిపారు. జరుగుతున్న తతంగం పట్ల అభ్యంతరాలను తెలిపారు. అయినా కోర్టు తనదైన శైలిలో విచారణ ను కొనసాగించి చివరకు తీర్పును వెలువరించిం ది. ముద్దాయిలపై సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు భావించింది. అందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది! స్వతంత్ర భారతంలో దళితులకు చట్టపరంగా దక్కాల్సిన న్యాయాన్ని ఈ అగ్రకుల భూస్వామ్య వ్యవస్థ దక్కకుండా చేసింది. రాజ్యాంగబద్ధంగా రక్షణ దొరకాల్సిన చోట రక్షణ కరువవుతున్న తీరు.. మన సామాజిక వ్యవస్థ హింసాముఖాన్ని బహిర్గతం చేస్తున్నది. దళితులకు అందని ద్రాక్షగా ఉన్న రక్షణ చట్టాలు, రాజ్యాంగ చట్టాల మూలంగానే నేటిదాకా జరిగిన దళితుల మారణకాండలన్నింటిలో ఎక్కడా దళితులకు న్యాయం దక్కలేదు. దోషులు శిక్షించబడలేదు. ఒక్క చుండూరే కాదు, కారంచేడు, పదిరికుప్పం మొదలు ఖైర్లాంజి దాకా ఏ మారణకాండలోనూ నేరస్తులు శిక్షించబడలేదు. రాజ్యాంగ రక్షణ లు, హక్కులు కొన్ని సామాజిక సమూహాలకు అందని స్థితి సమాజ శ్రేయస్సుకు గొడ్డలి పెట్టు. ఈ వ్యవస్థీకతమైన దురన్యాయాన్ని సామాజిక ఉద్యమాల ద్వారానే ఓడించాలి. పీడితులు, బలహీనులకు అండగా, రక్షణగా రాజ్యాంగాన్ని నిటారుగా నిలబెట్టాలి. ఆత్మగౌరవ పోరాటాల మార్గంలోనే విముక్తి పోరులో మునుముందుకు సాగాలి. అంతిమంగా సమ న్యాయ వ్యవస్థ స్థాపనకు నడుంకట్టి నడవాలి. అప్పుడే చుండూరులూ ఉండవు. చుండూరు లాంటి బాధితులకు అన్యాయాలకు స్థానం ఉండదు. 

Monday, April 21, 2014

స్వయంపాలన దొరలపాలన కాకూడదు(సంపాదకీయం)-ప్రొ. భంగ్యా భూక్యా


Published at: 22-04-2014 06:32 AM
తెలంగాణ రాష్ట్రంలో మొదటి సారిగా జరుగుతున్న లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు ఒక ప్రత్యేక రాజకీయ, సామాజిక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. ఇవి తెలంగాణ భావి రాజకీయాల్ని నిర్ణయించబోతున్నాయి. ఈ ఎన్నికలలో పార్టీల పొత్తులు వాటి తీరుతెన్నులు తెలంగాణ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాజకీయ పార్టీలన్నీ పాత రాజకీయాల్ని భద్రపర్చడానికే అన్నివిధాలా ప్రయత్నిస్తున్నాయి. ప్రజల స్వయంపాలన ఆకాంక్షను ఈ పరిణామాలు వెనక్కినెట్టే ప్రమాదముంది.
తెలంగాణ ప్రజలు స్వయంపాలన కోసం సర్వాయి పాపడు కాలం నుంచి పోరాడుతూనే ఉన్నారు. కానీ దొరల కుటిల రాజకీయాల వల్ల అది అందినట్టే అంది చేజారిపోతుంది. ఈ విషయాన్ని తెలంగాణ గ్రామాల్లో దర్శనమిచ్చే ఏ స్మారక స్థూపాన్ని అడిగినా చెబుతుంది. దొరలకు వ్యతిరేకంగా జరిగిన 1946 రైతాంగ సాయుధ పోరాటంలో ప్రజలు వీరోచితంగా పోరాడి అనేక విజయాలు సాధించారు. కానీ ఆ విజయాలు ఎంతో కాలం నిలబడలేదు. భారత సైన్యం హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆక్రమించిన వెంటనే దొరలు రాత్రికి రాత్రే సైన్యం పక్కన చేరి ప్రజల మీద దాడులకు ఉసిగొల్పారు. పోరాట కాలంలో ప్రజలు అక్రమించుకున్న భూములను సైన్యం సహాయంతో దొరలు తిరిగి ఆక్రమించుకున్నారు. తదనంతరం ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరి ప్రజలను మరింత దోపిడీకి, అణచివేతకు గురిచేశారు.
1969లో జరిగిన శ్రీకాకుళం ఆదివాసీ పోరాటం తెలంగాణలో బలమైన అతివాద వామపక్ష (నక్సలైట్) ఉద్యమానికి దారితీసింది. నక్సలైట్ ఉద్యమ సిద్ధాంత, రాద్దాంతాలు పక్కన పెడితే, ఇది తెలంగాణ దొరల పెత్తనం మీద పెద్ద ప్రభావాన్నే చూపించింది. చాలామంది దొరలు గ్రామాలని వదిలి పట్టణాల్లో స్థిరపడ్డారు. పట్టణాల్లో ఆంధ్ర పెట్టుబడిదారులతో కలిసి భూస్వామ్య క్యాపిటలిస్టులుగా అవతారమెత్తారు. 1985లో ఎన్.టి. రామారావు కరణం, పటేల్ వ్యవస్థను రద్దు చేయటంతో పట్టణాలకు దొరల వలసలు క్రమంగా పెరిగాయి. ఆంధ్ర పాలక వర్గంతో అధికారాల్ని పంచుకుంటూ ఆర్థికంగా బలపడ్డారు. 1990 ఆర్థిక సంస్కరణలు ఈ దొరలకు మంచి అవకాశం వరించాయి. ఇది వారికి పూర్తిస్థాయి భూస్వామ్య పెట్టుబడిదారులుగా రూపాంతరం చెందటానికి ఉపయోగపడింది. సారా కాంట్రాక్టర్‌లుగా, బీడీ ఆకుల కాంట్రాక్టర్‌లుగా గ్రామాల్లో ఉండే దొరలు ఇప్పుడు అనేక ఆధునిక వ్యాపార రంగాల్లో విస్తరించి ప్రజలను పీడించటం మొదలుపెట్టారు.
ఈ పరిణామాలు దొరల పెత్తనం పోయిందనుకున్న అణగారిన కులాలకు, వర్గాలకు నిరాశే మిగిల్చాయి. దొరల పెత్తనం కొత్త తరహాలో పట్టణాల నుంచి పల్లెలకు విస్తరించింది. ఊరి మధ్యలో ఉండే గడీల పెత్తనం పోయింది. ఫామ్ హౌస్ రూపంలో నూతన గడీలను ఊరి బయట నిర్మించుకుని దొరలు మళ్ళీ పెత్తనం చెలాయించటం మొదలుపెట్టారు. హైవే కాంట్రాక్టర్‌లుగా, గనుల యజమానులుగా, సెజ్‌ల యజమానులుగా, మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ యజమానులుగా, రాజకీయ నాయకులుగా, ఉద్యమకారులుగా దొరలు వస్తున్నారు. తెలంగాణ ఉద్యమం ఆంధ్ర పాలక వర్గానికి వ్యతిరేకంగానే కాకుండా ఇక్కడి దొరల దోపిడీకి, పెత్తనానికి వ్యతిరేకంగా జరిగింది. అణగారిన కులాల వారు తమ కుల అస్తిత్వాలను తెలంగాణ అస్తిత్వంతో జోడించి స్వయంపాలనే ధ్యేయంగా పోరాటాన్ని మొదలుపెట్టారు. ఈ ఉద్యమంలోని బలాన్ని గుర్తించిన దొరలు కొలది కాలంలోనే ఉద్యమాన్ని తమ నాయకత్వంలోకి తెచ్చుకున్నారు.
దొరలకు తెలంగాణ వస్తుందన్న నమ్మకం లేదు, రావడం ఇష్టం కూడా లేదు. దొరలు తెలంగాణ ఉద్యమాన్ని ఒక అవకాశంగానే చూశారు. ఉద్యమాన్ని బూచిగా చూపించి ఆంధ్ర పాలకవర్గ దోపిడీలో అత్యధిక వాటాను పొందటం ఒక ఎత్తైతే, తమ కుల, కుటుంబ నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవటం మరో ప్రధాన అంశంగా మనకు కనిపిస్తుంది. అందుకే దొరలు ప్రతిసారీ ఉప ఎన్నికలు తెచ్చి ప్రజలకు అగ్ని పరీక్ష పెట్టేవారు. కనీసం ప్రచారం కూడా చేసేవారు కాదు. ప్రజలు తెలంగాణ వాదాన్ని గెలిపించుకోవటానికి అయిష్టంగానే తిట్టుకుంటూనే ఈ దొరలకు ఓట్లు వేసేవారు.
ఇప్పుడు ఈ పరిస్థితి లేదు. దొరలను గెలిపించుకోవలసిన అవసరం అణగారిన కులాలకు, వర్గాలకు అవసరం లేదు. అందుకే దొరలకు ఏంచేయాలో తోచని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని అధిగమించటానికి దొరలు పార్టీల సిద్ధాంతాలకు అతీతంగా పొత్తులు, అంతర్గత అవగాహన కుదుర్చుకుంటున్నారు. దొరతనానికి మతోన్మాదంను జోడించే ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉంది.ప్రజలు సంఘటితమవుతున్న ప్రతిసారీ దొరలు ఏదో ఒక రూపంలో వచ్చి దాన్ని విచ్ఛిన్నం చేస్తూ వస్తున్నారు. ఇన్ని రోజులు తెలంగాణ ఉద్యమ రూపంలో కుల ఉద్యమాలను కొంతవరకు విచ్ఛిన్నం చేయగలిగారు. ఇప్పుడు హిందూ మతోన్మాదాన్ని ఉసిగొలిపి కుల చైతన్యాన్ని వెనక్కినెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా ఇండియా పాలక వర్గానికి హిందూత్వ ధోరణులు బలంగా ఉంటాయి. ఈ ప్రాంతంలో పాలక వర్గంగా చలామణి అవుతున్న దొరలకు హిందూత్వ ధోరణులు బలంగానే ఉన్నాయి. అయితే తెలంగాణ ప్రజలు చారిత్రకంగా మత సామరస్యానికి ప్రతీకలుగా వున్నారు. చారిత్రకంగా దక్కన్ ప్రాంతం అనేక మతాలకు, సంస్కృతులకు నిలయంగా ఉంటూ వచ్చింది. ఇక్కడి ముస్లిం పాలకులు కూడా ఇక్కడి సంస్కృతిలో భాగమై పాలించారు. ఏ ఒక్క ముస్లిం పాలకుడు కూడా ఖలీఫా పేరు మీద ప్రమాణ స్వీకారం చేసి సింహాసనం ఎక్కలేదు. దక్కన్‌లో ఇస్లాం వ్యాప్తి కూడా బలవంతంగా జరగలేదు. ప్రజలు సూఫీ ప్రవక్తల భావాలతో ప్రభావితమై స్వచ్ఛందంగానే ఇస్లాంను స్వీకరించారు. అందుకే దక్కన్‌లో ఇప్పటికీ మత సామరస్యం బలంగా వుంది. ఈ సంస్కృతిని దొరలు ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
దొరలు హిందూత్వాన్ని నెత్తిన పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో దానికి ఒక లెజిటమసీని ఇచ్చారు. విచిత్రమేమంటే ఎమ్.ఎల్. పాలిటిక్స్‌కి ప్రతినిధులమని చెప్పుకునేవారు కూడా హిందూత్వ శక్తులను ప్రోత్సహించారు. తెలంగాణలో బీజేపీ తర్వాత హిందూత్వ ధోరణులు బలంగా ఉన్నది టీఆర్ఎస్ పార్టీకే. టీఆర్ఎస్ పార్టీ హావభావాలు, దాని అధినేత చేష్టలు శివసేన పార్టీకి దగ్గరగా ఉన్నాయి. టీఆర్ఎస్‌కు తెలంగాణ శివసేనగా రూపాంతరం చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇది తెలంగాణ సంస్కృతికి, ప్రజలకి చాలా ప్రమాదకర పరిణామమే. ఈ ఎన్నికల్లో పార్టీల అభ్యర్థుల ఎంపిక చూస్తే దొరల ఆధిపత్యంలో ఉన్న పార్టీలు దొరతనాన్ని మతోన్మాదంతో జోడించే ప్రయత్నం చేశాయి. అందుకే బీజేపీ, దొరలకు 8 శాతం స్థానాలు కల్పించింది. బీజేపీ తరువాత దొరలకు అత్యధిక స్థానాలు (47 శాతం) కల్పించింది టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ 37 శాతం సీట్లు దొరలకు కేటాయించగా తెలుగుదేశం 34 శాతం కేటాయించింది. ఈ పరిణామాలు తెలంగాణను దొరల పాలన వైపు తీసుకెళుతున్నాయి.
తెలంగాణలో కనీసం 10 శాతం జనాభా కూడా లేని దొరల కులాలకు దాదాపు 50 శాతం కంటే పైచిలుకు స్థానాలను బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కేటాయించాయి. ఈ పరిణామాలు దేశ ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేసే విధంగా ఉన్నాయి. జనాభాలో 90శాతం ఉన్న ప్రజలకు సముచిత స్థానం కల్పించకుండా కుల రాజకీయాలు చేస్తున్న పార్టీలకు బుద్ధిచెప్పాల్సిన అవసరం వుంది. దొరలను, మతోన్మాద శక్తులను ఈ ఎన్నికల్లో ఓడించటం ఒక చారిత్రక అవసరం. ప్రజాస్వామిక వాదులు, సామాజిక ఉద్యమకారులు ప్రజల పక్షాన నిలబడాల్సిన సమయమిది. మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చి కూర్చుంటే ప్రజలకు అన్యాయం చేసిన వారే అవుతారు. ఎన్నికల్లో ప్రజలందరూ పాల్గొని మన దేశ ప్రజాస్వామ్యాన్ని, లౌకిక స్ఫూర్తిని కాపాడుకోవలసిన చారిత్రక సందర్భమిది.
- ప్రొ. భంగ్యా భూక్యా
ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ

Andhra Jyothi Telugu News Paper Dated: 22/4/2014 

Sunday, April 20, 2014

గిరిజనులకు విభజన అన్యాయాల - జయధీర్ తిరుమలరావు



విభజన నేపథ్యంలో తెలంగాణ గిరిజనులకు అడుగడుగునా అన్యాయం జరిగే అవకాశాలున్నాయి... గిరిజన ఉప ప్రణాళిక, ట్రైకార్, ట్రిప్‌కో, ట్రిమ్‌కో, గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థలలోని ఉద్యోగులు, నిధులను తెలంగాణలోని భూభాగం ప్రకారం కాకుండా షెడ్యూల్ ఏరియా, గిరిజనులకి చెందే 55 శాతం ప్రకారం పంచాలి.
నవ తెలంగాణ నిర్మాణమేమో గానీ ఉన్న తెలంగాణ ప్రయోజనాలకు రాష్ట్ర విభ జన సమయంలో గండిపడే అవకాశం ఏర్పడుతున్నది. సీమాంధ్ర అధికారులు, ఉద్యోగులు ఎక్కడికక్కడ తెలంగాణ ప్రయోజనాలను దాచిపెట్టి యాంత్రిక విభజన పర్వానికి తెరతీస్తున్నారు. న్యాయంగా చెందవలసిన వాటా గురించి ఆలోచించే రాజకీయ సంకల్పం ఓట్ల క్రీడలో మునిగిపోయింది. రాజకీయ చైతన్యం కలిగిన శక్తులు ఇంకా అలసటలోనే జోగుతున్నాయి. మరికొన్ని శక్తులు కప్పుకున్న ముసుగు తొలగించడానికి ఇష్టపడడం లేదు. ఐక్యకార్యాచరణ కమిటీ జాగరూకతతో ఉండాల్సిందిపోయి సభలు, సమావేశాలకే ఎక్కువ పరిమితమవుతోంది.
ఇప్పుడు, ఎప్పటిలాగే వెనకబడిన వర్గాలకి, గిరిజనులకి అన్యాయం జరుగుతున్నది. వెంటనే దీనిని ప్రతిఘటించవలసిన అవసరం ఉంది. రాష్ట్రంలో సుమారు 60లక్షల మంది గిరిజనులు ఉన్నారు. అందులో 55 శాతం మంది తెలంగాణలో నివసిస్తున్నారు. వీరు నివసించే షెడ్యూల్ ఏరియా (ప్రాంతాలు) కూడా అంతే శాతం తెలంగాణలో ఉంది. కాబట్టి గిరిజన సంక్షేమ శాఖలోని ఉద్యోగులు, నిధులు కూడా తెలంగాణ గిరిజనులకు అదే శాతాల్లో (55 శాతం) చెందాల్సి ఉంది. కానీ రాష్ట్రంలోని భూభాగంలో 42 శాతం తెలంగాణకు చెందిందని, 23 జిల్లాల్లో 10 జిల్లాలు తెలంగాణవని, కాబట్టి అదే దామాషాలో తెలంగాణకు గిరిజన సంక్షేమ శాఖలోని ఉద్యోగాలు, నిధులు చెందుతాయని ఆ మేరకు ఆ శాఖ ఉద్యోగులు విభజిస్తున్నారు.
ఈ విధానంలో గిరిజన సంక్షేమ శాఖను విభజిస్తే తెలంగాణ గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. జూన్ 2 నుంచి కొత్తగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 45శాతం గిరిజనులకు 55 శాతం ఉద్యోగాలు, 55 శాతం నిధులు వెళ్తాయి. తెలంగాణ రాష్ట్రంలోని 55శాతం గిరిజనులకేమో 45శాతం ఉద్యోగాలు, అదే దామాషాలో నిధులు వస్తాయి. అంటే 20శాతం ఉద్యోగాలు, నిధులు కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజనులకు చెందనున్నాయన్నమాట. విభజన నేపథ్యంలో తెలంగాణ గిరిజనులకు అడుగడుగునా అన్యాయం జరిగే అవకాశాలున్నాయి. 2013 జనవరిలో గిరిజన ఉపప్రణాళిక కింద ప్రత్యేక నిధులు ఇచ్చారు. ఒక్క గిరిజన సంక్షేమ శాఖ మాత్రమే కాక ఆయా ప్రభుత్వ శాఖలు తమ బడ్జెట్లలో 6 శాతం నిధులను గిరిజనుల కోసం పెట్టడం, సాంప్రదాయానికి భిన్నంగా ఒక సంవత్సరంలో కేటాయించిన నిధులు అదేసంవత్సరంలో ఖర్చు కాకపోయినా అవి రాష్ట్ర ఖజానాకు తిరిగి వెళ్ళకుండా వచ్చే సంవత్సరంలో ఖర్చు చేయడానికి వీలుండటం ఇవి గిరిజన ఉప ప్రణాళిక ప్రత్యేక వెసులుబాట్లు. కాబట్టి సమీప భవిష్యత్‌లో ఈ ప్రణాళిక కింద వచ్చే అధిక నిధులతో గిరిజన సంక్షేమం పెరుగుతుందని అందరూ ఆశిస్తున్నారు. కానీ ఈ నిధులు కూడా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల భూభాగం దామాషా(42:58)లో పంచితే అధిక శాతంలో ఉన్న తెలంగాణ గిరిజనుల సంక్షేమం కుంటు పడుతుందని చెప్పక తప్పదు.
అలాగే ఇప్పుడు రాష్ట్రంలో గిరిజనులకు స్వయం ఉపాధి, అభివృద్ధి పథకాలకు ఎన్నో రుణాలను టైకార్ సంస్థ (గిరిజన ఆర్థిక సహకార సంస్థ) అందజేస్తున్నది. కొత్త రాష్ట్రాల భూభాగాల దామాషా ప్రకారం ఈ సంస్థ నిధులను కూడా విభజిస్తే తెలంగాణ గిరిజనులకు అన్యాయం జరుగుతుందని తెలుస్తూనే ఉంది. గిరిజన ప్రాంతాల్లోనే నదులు, గనులు, వనరులు ఉన్నాయి. వాటిని అభివృద్ధి పరచడానికి, వాటి ఫలాలు కొన్ని ఆ ప్రాంత గిరిజనుల అభివృద్ధికీ ఉపయోగపడాలని ట్రిప్‌కో (గిరిజన పవర్ కంపెనీ), ట్రిమ్‌కో (గిరిజన గనుల కంపెనీ) సంస్థలు ఏర్పడ్డాయి. ఈ సంస్థలనూ కొత్త రాష్ట్రాల భూభాగాల దామాషా (42:58) ప్రకారమే విభజించనున్నారు. మరి షెడ్యూల్ ప్రాంతాలు తెలంగాణలో ఎక్కువ శాతంలో ఉన్నప్పుడు ఎక్కువ శాతం ప్రయోజనాలు తెలంగాణ ప్రజలకు చెందకూడదా?

షెడ్యూల్ ఏరియా ఫైల్ గల్లంతు విషయాన్ని చూద్దాం. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఉన్న పాల్వంచ, ఏటూరు నాగారం ప్రాంతాల మధ్యనున్న ప్రాంతం షెడ్యూల్ ఏరియా (గిరిజన ప్రాంతం) అని 1950 నాటి హైదరాబాదు (తెలంగాణ) ప్రభుత్వం రాష్ట్రపతికి ప్రతిపాదన పంపితే అందుకు రాష్ట్రపతి ముద్రపడి ఆ ప్రాంతం షెడ్యూల్ ఏరియాగానే కొనసాగుతూ వస్తున్నది. షెడ్యూల్ ఏరియాలో బయటి వ్యక్తులు, సంస్థలు లాభాపేక్షతో ఎలాంటి గనుల తవ్వకం, కార్యకలాపాలు చేపట్టకూడదు. కానీ పైన పేర్కొన్న ప్రాంతంలో విపరీతమైన ఖనిజ సంపద ఉందని తెలిసి, దాన్ని కొల్లగొట్టడానికి పన్నాగం పన్నిన కొందరు సీమాంధ్ర వ్యక్తులు, కంపెనీలు ఆ ప్రాంతం షెడ్యూల్ ఏరియా కాదని హైకోర్టులో సవాలు చేస్తున్నారు. తాము నెగ్గితే ఇష్టారాజ్యంగా తెలంగాణ గిరిజన ప్రాంతాన్ని, గనులను దోచుకోవచ్చని పన్నాగం. హైకోర్టులో వారి సవాలును ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగా ఇప్పటి గిరిజన సంక్షేమ శాఖ హైకోర్టు కోరిన విధంగా 1950 నాటి హైదరాబాద్ ప్రభుత్వ షెడ్యూల్ ఏరియా ప్రపోజల్ కాపీని సంపాదించే ప్రయత్నం చేసింది. ఆ కాపీ ఢిల్లీలో దొరుకుతుందేమోనని అక్కడికి, భోపాల్‌కి, హైదరాబాద్‌లోని స్టేట్ ఆఫ్ ఆర్కైవ్స్‌కి అధికారులను పంపించి వెదికించింది. కానీ ఆ కాపీ దొరకలేదు. చిత్రమేమింటే, అంతకు(1950కి)ముందు సంవత్సరాలవి, ఆ తరువాత సంవత్సరాలవి డాక్యుమెంట్లు అన్నిచోట్ల అందుబాటులో ఉన్నాయి. ఈ ఒక్క 1950 సంవత్సరానివే లేవు. అంటే ఎవరో... లాభాపేక్ష కోసం గూడుపుఠాణీ చేసి వాటిని మాయం చేసినట్లు తెలుస్తున్నది.
పైన పేర్కొన్న వలసవాద శక్తుల, పెట్టుబడిదారుల కుటిల ఎత్తుగడలను తెలంగాణ ప్రజలు, ప్రత్యేకించి గిరిజనులు ఇప్పుడే అడ్డుకోకపోతే తీరా తెలంగాణ ఏర్పాటయ్యాక కూడా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లవుతుంది. కాబట్టి వెంటనే గిరిజన సంక్షేమశాఖలోని వివిధ విభాగాలైన గిరిజన ఉప ప్రణాళిక, ట్రైకార్, ట్రిప్‌కో, ట్రిమ్‌కో, గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థలలోని ఉద్యోగులు, నిధులను తెలంగాణలోని భూభాగం ప్రకారం కాకుండా షెడ్యూల్ ఏరియా, గిరిజనులకి చెందే 55శాతం ప్రకారం పంచాలి.
n జయధీర్ తిరుమలరావు

Andhra Jyothi Telugu News Paper Dated: 16/04/2014 

మూడో జెండర్ - (సంపాదకీయం)

మంగళవారం నాడు సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. కొజ్జాలు, హిజ్రాలుగా హీనమైన సామాజిక పరిగణన కలిగిన వారిని మూడో లింగం మనుషులుగా పరిగణించాలని, వారిని సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారిగా గుర్తించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ కె.ఎస్.రాధాకృష్ణన్, జస్టిస్ ఎ.కె. సిక్రిలతో కూడిన సుప్రీంకోర్టు బెంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. స్త్రీలు, పురుషులు అన్న రెండు లింగాలను మాత్రమే భారత రాజ్యాంగం గుర్తించింది. ఈ ఆదేశాలతో ఇకపై మూడో లింగం కూడా అధికారికంగా ఉనికిలో ఉంటుంది. దీర్ఘకాలంగా ప్రపంచవ్యాప్తంగా ట్రాన్స్‌జెండర్స్ తమను అధికారికంగా గుర్తించాలని, తమ కోసం ప్రత్యేకంగా సంక్షేమ, అభివృద్ధి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మానవహక్కుల బృందాలూ వారికి మద్దతుగా అభిప్రాయ సమీకరణ చేస్తున్నాయి. అనేక పాశ్చాత్య దేశాలు మూడోజెండర్‌ను అధికారికంగా గుర్తించాయి. ఈ మధ్యనే ఆస్ట్రేలియా కోర్టు కూడా మూడో జెండర్‌ను గుర్తించాలని ఆదేశించింది. దక్షిణాసియాలో నేపాల్, బంగ్లాదేశ్ తృతీయ ప్రవృత్తి వర్గాన్ని గుర్తించాయి. ఆలస్యంగా అయినా భారత్ మూడోలింగం గుర్తింపును ఇవ్వడం ఆహ్వానించదగినది. భారతీయ సమాజంలో వస్తున్న ఆరోగ్యకరమైన మార్పులకు, అన్ని రకాల వివక్షలకు వ్యతిరేకంగా పెరుగుతున్న చైతన్యానికి ఈ తీర్పు ఒక సంకేతం.
మూడో జెండర్ విషయంలో ఆధునిక సమాజంలో చాలా అపోహలు ఉన్నాయి.

వారి శరీర నిర్మాణం గురించి, లైంగిక ప్రవృత్తి గురించి, మూడో జెండర్‌లోకి పరివర్తన చెందడం గురించి అనేక తప్పుడు అభిప్రాయాలు ఉనికిలో ఉన్నాయి. కొజ్జాలు, హిజ్రాలు అందరూ పురుష స్వలి ంగ సంపర్కులేనని భావిస్తుంటారు. స్వలింగ సంపర్కులు వేరు, కొజ్జాలు వేరు. శరీరనిర్మాణ ంలో లోపం వల్ల మాత్రమే మూడో జెండర్ ఏర్పడుతుందని అనుకునేవారూ ఉంటారు. శారీరకంగా మగ పుటుక పుట్టినా, జెండర్ రీత్యా స్త్రీ ప్రవృత్తి కలిగినవారు, స్త్రీగా పుట్టి పురుష ప్రవృత్తి కలిగినవారు, లైంగికంగా స్త్రీపురుషులిద్దరి పట్లా వాంఛ కలిగినవారు, మరో లింగానికి దగ్గరగా శరీరనిర్మాణాన్ని మార్చుకునేవారు- ఇట్లా ట్రాన్స్‌జెండర్లలో రకరకాలవారున్నారు. మరి కొందరయితే భౌతికంగా తమ లింగానికి అనుగుణంగా లైంగిక ప్రవృత్తి కలిగి ఉంటూనే, ఇతర లిం గాల వేష, వస్త్రధారణలతో ఆనందించే వారుంటారు. మన సమాజం ప్రధానంగా పురుషాధిక్య స్వభావం కలిగినది కాబట్టి, మగతనానికి ప్రాధాన్యం, ఇతర లింగాలకు హీనపరిగణన సహజంగానే నెలకొని ఉన్నాయి. లైంగికత విషయంలో కూడా స్త్రీపురుష శృంగారమే సహజమైనదీ, న్యాయమైనదీ అనే నమ్మకం స్థిరపడిపోయింది. స్త్రీపురుష శృంగారం పునరుత్పత్తితో ముడిపడి ఉండడం కూడా అదే ఏకైక లైంగికత అన్న భావన బలపడడానికి కారణం. జీవరాసులలో పునరుత్పత్తికి రకరకాల పద్ధతులు ఉనికిలో ఉన్నాయని, ఏకలింగ జీవులూ ఉన్నాయని, పరపరాగ సంపర్కంతో పాటు స్వపరాగ సంపర్కపద్ధతిని అనుసరించే వృక్షజాతులు ఉన్నాయని మనకు తెలుసు. స్త్రీపురుష లైంగికత అన్నది కాలక్రమంలో పరిణామక్రమంలో రూపొందిన విధానమే తప్ప, సృష్టిలో అది మాత్రమే సహజమని భావించడం శాస్త్రీయం కాదు. ఈ కారణాల రీత్యానే స్వలింగ సంపర్కులు తమ లైంగికత అసహజమైనదని కానీ, ప్రకృతివిరుద్ధమైనదని కానీ అంగీకరించరు.
మూడోలింగం వారిని హీనంగా హేళన చేయడం ఆధునిక కాలంలోనే పెరిగిపోయిందనుకోవాలి. శృంగారం గురించి, లైంగికత గురించి సమాజంలో గోప్యతను పెంచినది బ్రిటిష్ వలస పాలనే. లైంగికత గురించి బాహాటంగా మాట్లాడుకోవడమే అపచారంగా తొలినాటి ఆధునికత భావించింది. గతకాలంలో, తృతీయలింగం వారికి పెద్ద గౌరవం లేకున్నా, గుర్తింపు, సాంస్కృతిక స్వేచ్ఛ ఉండేవి. రామాయణంలో కూడా మూడోజెండర్ వారి ప్రస్తావన ఉన్నది. భారతంలో అయితే బృహన్నల, శిఖండి ప్రముఖ పాత్రలే. వాత్సాయన కామసూత్రాలు కూడా తృతీయ ప్రవృత్తిని పేర్కొన్నాయి. ఒక గురువు ఆధీనంలో గణజీవనం గడపడం కొజ్జాల పద్ధతి. పుట్టడం ఏ లింగంలో పుట్టినా కొజ్జాలుగా మారడానికి ఒక తంతు, పూజాపునస్కారాలు ఉంటాయి. కొజ్జాలు మాత్రమే ప్రత్యేకంగా పూజించే దేవతలు దేశమంతా ఉన్నారు. పిల్లలు పుట్టినప్పుడు, పెళ్ళిళ్ల వంటి శుభకార్యాలలోను కొజ్జాలకు కానుకలివ్వడం సంప్రదాయబద్ధమైన ఆనవాయితీ. కొజ్జాల లైంగిక జీవనంలో సమాజం కల్పించుకునేది కాదు, నేరమనీ ఘోరమనీ భావించేది కాదు. అయితే, వారిని కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలకు, యాచకవృత్తికి లేదంటే అంతఃపురాల రక్షణకు మాత్రమే పరిమితం చేశారు. వారిని అందరు మనుషులతో పాటు సమస్త శ్రామిక కార్యక్రమాలలో అనుమతించడం జరగాలి. సంప్రదాయమైన గుర్తింపుతో పాటు, ఆధునిక హోదా కూడా రావడం అందుకు తోడ్పడుతుంది. కేవలం చట్టపరమైన గుర్తింపు మాత్రమే చాలదు, ప్రభుత్వం మూడోలింగం వారిని సమానులుగా పరిగణించేందుకు తగిన సానుకూల చర్యలు, ప్రచార కార్యక్రమం చేపట్టాలి.
స్వలింగ సంపర్కాన్ని చట్టవిరుద్ధంగా ఇటీవల సుప్రీంకోర్టు ప్రకటించింది. తగిన విధంగా పీనల్‌కోడ్‌ను సవరిస్తే తప్ప, స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత లభించదు. ట్రాన్స్‌జెండర్లందరూ స్వలింగ సంపర్కులూ, స్వలింగ సంపర్కులందరూ ట్రాన్స్‌జెండర్లూ కాకపోయినప్పటికీ- స్వలింగ సంపర్కానికి చట్టబద్ధమైన అనుమతి లభించడం తృతీయ జెండర్‌కు కూడా అవసరం. అన్నిటికి మించి దేశంలో స్థిరపడిపోయిన లైంగిక భావనల సడలింపు జరగకపోతే, ఆయా గ్రూపుల హక్కులకు రక్షణ లేకపోవడమే కాక, సమాజంలో జెండర్ ప్రజాస్వామికీకరణ జరగదు. మంగళవారం నాటి సుప్రీంకోర్టు తీర్పుతో వేసిన ముందడుగు, మరింత ఉదార సమాజావతరణకి దారితీస్తుందని ఆశిద్దాం

Andhra Jyothi Telugu News Paper Dated: 16.4.2014 

తెలంగాణ మాండలికంలో.. కొత్త ముత్యాలు By వేముల ఎల్లయ్య

తెలంగాణ మాండలికంలో.. కొత్త ముత్యాలు

Published at: 07-04-2014 07:59 AM
'సూర' నవలలో గ్రామాలలో నేటికీ మారని, తరాలుగా వెళ్లూనుకున్న కులాలు, కులాంతరాల దొంతరలు, దొరలు, పట్టేండ్ల ఆధిపత్యం, సామాజిక శ్రమదోపిడీ, లైంగిక దోపిడీ దళితులపై కొనసాగుతున్న తీరు కళ్ళకు కట్టినట్లు చూపించారు రచయిత భూతం ముత్యాలు. ఈ నవల దళిత సాహిత్యంలోనే కాక తెలుగు నవలా వికాసంలో కలువగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
'బదనాం', 'పుకారు' పర్యాయపదంగా బుగాడను పేర్కొనవచ్చు. భూతం ముత్యాలు కథా సంకలనానికి శీర్షికగా ఉన్న ఈ కథలో ఒక యువకునికి 'అన్న'లతో ఏమైనా సంబంధం ఉన్నదేమో అన్న అపోహతో పోలీసులు గ్రామాలలో తమకు సహకరించే వేగులతో మాటువేసి ఎప్పటికప్పుడు అతడిని గమనిస్తుంటారు. ఇలా ఎంత మంది అమాయకులు వివక్షకు, దమననీతికి గురవు తున్నారు అనే మీమాంస కలుగక మానదు.
ఒక రచయిత లేక కవి తన భావాన్ని వ్యక్తపరిచే సందర్భంలో, మాతృభాష ప్రాంతీయత, నేటివిటీ స్ఫురించే విధంగా తనదైన మాండలిక భాషలో వ్యక్తపరిస్తేనే ఆ రచనకు గాఢత, స్వచ్ఛత సమకూరుతుంది. ఈ వొరవడి పాశ్చాత్య సాహిత్యంలో పాలకుంతలు తొక్కింది. అదే వొరవడిని తన నేటివిటీకి అనువదించుకుని ఇంతవరకు ఏ రచయిత చేయని నూతన ప్రయోగానికి నాంది పలుకుతూ తెలంగాణ మాండలికాన్ని మన ముందుంచారు భూతం ముత్యాలు. గత పదిహేను సంవత్సరాలుగా సీరియస్ రచనలు చేస్తున్న రచయిత ముత్యాలు. ఈయన కలం నుంచి జాలువారినవే 'సూర' (నవల), 'బుగాడ' (కథలు).
'సూర' దళిత నవల. రచయిత ఇందులో 'గో బ్యాక్ టు విలేజ్' సిద్ధాంతాన్ని బలపరుస్తూ రచన సాగించడం వలన నవలకు బలం చేకూరింది. సంభాషణల్లో యధాతథంగా శుద్ధ గ్రామీణ మాండలిక భాష వాడుకోవడం విశేషం. తెలంగాణ మాండలిక భాషలోని పదజాలం, సామెతలు, సొబగులు ముత్యాలు రచనలో విరివిగా కనువిందుచేసి చదువరులను ఆకట్టుకుంటాయి. తెలంగాణ మాండలికంలో అందునా నల్లగొండ మాండలీకంలో ఈ రచన సాగుతుంది. 'సూర' లో రెండు తరాల వలస దళిత మాల జీవితాలను ఆవిష్కరించారు రచయిత. మొదటి తరానికి చెందిన వారు చెన్నడు, అతని భార్య చెంద్రి. వీరు నిరక్ష్యరాస్యులు. అయితే రెండవ తరానికి చెందినవాడు అతని కొడుకు సూరడు. చెన్నడు, చెంద్రి నిరక్షరాస్యులైనప్పటికీ తమ కొడుకు 'సూర'(కథానాయకుడు)నికి నిరక్ష్యరాస్యత వల్ల కలిగే బాధలు రాకూడదని భావిస్తారు. మొదట్లో సూరడు చదువు పట్ల మారాం చేసినా తన మేనమామ కొడుకు కేశవులు ఆసరాతో చదువులో గాడిన పడతాడు. అదే సమయంలో ఊరి నుంచి అకస్మాత్తుగా పట్నం ఊడిపడతారు నాగిరెడ్డి, కాశిరెడ్డిలు. చెన్నడు, చెంద్రిల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని లబ్ధి పొందడానికి భార్యాభర్తలకు లేనిపోని ఆశలు కల్పిస్తారు. సూరన్ని, కాశిరెడ్డి తీసుకెళ్ళి హాస్టల్‌లో చేర్పిస్తాడు. తర్వాత అదను చూసి చెంద్రిని కాటేస్తడు. ఇది భరించలేని చెంద్రి, తన భర్తతో సొంత ఊరు చేరుకుంటుంది. అక్కడి పాలివాళ్ళతో మూఢనమ్మకాలతో చెన్నడు, చెంద్రి కూరుకుపోతారు. ఇది గ్రామీణ పరిస్థితులకు అద్దం పడుతుంది.
ఇక గ్రామంలో నాగిరెడ్డి మోసాలకు అడ్డు, అదుపు ఉండదు. పెద్దవాడైన సూరనికి ఆ ఊరి దొర బిడ్డ జయలక్ష్మితో పరిచయం ఏర్పడుతుంది. అది వారి మధ్య ప్రేమకు దారితీస్తుంది. జయలక్ష్మి తెగువతో సూరన్ని ప్రేమ వివాహం చేసుకుంటుంది. ఇరువురు పట్నం వెళ్లి కాపురం పెడతారు. మూఢనమ్మకాలతో చిక్కిబొక్కైన చెన్నడు మరణిస్తాడు. సూర, జయలక్ష్మిలు ఊరికి వస్తారు. ఇన్నేండ్లు గడచిన ఊరు మారలే, ఊరి తీరు మారలే. దీనితో కలత చెందిన సూరడు తన జాతిని మేల్కొల్పే లక్ష్యంతో జయలక్ష్మి ఎంత వద్దని వాదిస్తున్నా ఊరిలో 'పూలే, అంబేద్కర్' పాఠశాలను ప్రారంభించి దళితుల కళ్లు తెరిచేలా చేస్తాడు. ఇది అంబేద్కర్ సిద్ధాంతాన్ని బలపరుస్తుంది. కానీ ఏ ఊరైనా దొరలు, పటేండ్లు ఒక్కటే. వారి ధన, బల, అహంకారాల ముందు ఎవరైనా బలాదూర్. నాగిరెడ్డి కుట్రలకు బలైన 'గారీబు' మరికొందరు నాగిరెడ్డిపై కక్ష కడుతారు. అదే సమయంలో ఊరిలో నాగిరెడ్డి దేశగురువు సహాయంతో బొడ్రాయి పండుగ జరుపుతుంటాడు. ఇక్కడ నాగిరెడ్డి సూరన్ని చంపాలని చూస్తే చివరకు గారీబు చేతిలో నాగిరెడ్డి బలి అవుతాడు. తను తవ్వుకున్న గుంటలో తనే పడ్తాడు అన్నట్లు నాగిరెడ్డి మరణిస్తాడు. దెబ్బలు తిని ఆస్పత్రిపాలైన సూరడు నాగిరెడ్డి సావు కబురు విని ఊరు పీడ విరగడైనదని సంతోషిస్తాడు. ఇలా నవల ముగుస్తుంది. ఈ నవల నల్లగొండ మాండలీకంలో అందునా శుద్ధ గ్రామీణ మాండలిక పదజాలం. మిగతా వారికి ఒకేసారి చదివితే అర్థం కాకున్నా, మరో ప్రయత్నంలో నవలలోని సారాన్ని ఆస్వాదిస్తారు. గ్రామాలలో నేటికీ మారని, తరాలుగా వెళ్లూనుకున్న కులాలు, కులాంతరాల దొంతరలు, దొరలు, పట్టేండ్ల ఆధిపత్యం సామాజిక శ్రమదోపిడీ, లైంగిక దోపిడీ దళితులపై కొనసాగుతున్న తీరు కళ్ళకు కట్టినట్లు చూపించారు రచయిత. ఈ నవల దళిత సాహిత్యంలోనే కాక తెలుగు నవలా వికాసంలో కలువగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్కరూ చదువదగ్గ నవల. మాండలికాన్ని ఆస్వాదించాలంటే ఈ నవల చదవాల్సిందే. నేటి రచయితలకు ఈ నవల స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు. మరిన్ని మాండలికాలతో సాహిత్యం సుసంపన్నం కావాలి. లేదంటే మాండలిక భాష అంతరించే ప్రమాదం ఉందని గ్రహించాలి.
భూతం ముత్యాలు మరో రచన 'బుగాడ' కథల సంకలనం. ఇందులో మొత్తం 16 కథలున్నాయి. ఒకటి, రెండు కథలు మినహాయించి మిగతా కథలన్నీ తెలంగాణ మరీ ముఖ్యంగా నల్లగొండ మాండలికంలోనే సాగాయి. ఈ కథలలో ఒక్కో కథ దేనికదే దాని విశిష్టతను చాటుకున్నది. నేటి సమాజంలో అంతరిస్తున్న సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, మానవీయ విలువలు, సమాజ పోకడను పట్టిచూపుతాయి ఈ కథలు. కొన్ని కథలలో స్త్రీల సమస్యలు పరిశీలించాడు. కానీ ఇతడు స్త్రీవాద కవి రచయిత కాదు. అంతమాత్రాన అతడు స్త్రీ పక్షపాతి కాదనలేము. అందుకు ఈ సంకలనంలోని స్త్రీల కథలే నిదర్శనం. ఇతన్ని చలంతో పోల్చలేకపోయినా ఒకటి, రెండు కథలలో చలాన్ని తలపిస్తాడు. 'ఎవరిని వారే దిద్దుకోవాలి' అన్న చాసో మాటలు ఈ రచయితకి వర్తిస్తాయి. అట్ల రాసినవే ఈ కథలు అనిపిస్తాయి.
ఇక కథలను పరిశీలించినట్లయితే మొదటి కథ 'ఊరబోనం'. ఊరబోనం కథలో శ్రావణమాసం, ఆషాఢ మాసంలో జరుపుకొనే బోనాల పండుగను మనముందుంచాడు రచయిత. ఒకప్పుడు ఎంతో భక్తి ప్రపత్తులతో జరుపుకునే పల్లె జనులు నేడు గ్లోబలైజేషన్ పుణ్యమా అని మొఖం చాటేస్తున్నారు. కథనం పూర్తిగా మాండలికంలో సాగి చదువరులలో ఆసక్తిని కలిగిస్తుంది. మరో కథ 'బుగాడ'. ఈ పేరు కథాసంకలనానికి టైటిల్. బుగాడ అంటే ఎన్ని అర్థాలు ఉన్నా 'బదనాం', 'పుకారు' పర్యాయపదంగా ఆ పదాన్ని పేర్కొనవచ్చు. ఇందులో ఒక యువకునికి అన్నలతో ఏమైనా సంబంధం ఉన్నదేమో అన్న అపోహతో పోలీసులు గ్రామాలలో తమకు సహకరించే వేగులతో మాటువేసి ఎప్పటికప్పుడు ఆ యువకున్ని గమనిస్తూ అనుమానించే కథ. కానీ ఈ కథలో కథనం సాగిన తీరు ఆలోచనలో పడవేస్తుంది. ఇలా ఎంత మంది అమాయకులు వివక్షకు, దమననీతికి గురవుతున్నారు అనే మీమాంస కలుగక మానదు. మరో కథ 'జేజి'. ఇది విద్యార్థి బాల్యం గురించి గాధ. పసినాడే ఫ్లోరిన్ విషపు కోరల్లో చిక్కి బాల్యం ఎలా చిధ్రమౌతుందో వర్ణిస్తుంది. నల్లగొండను ఆనుకొని కృష్ణా నది పారుతున్నా నేటికీ తాగునీటికి కొరతే. పేదరికం, అంగవైకల్యం, అక్కరకురాని ప్రభుత్వ వైద్యం, తల్లి పేగుపాశం హృదయాన్ని తాకక మానదు. ఈ కోవకే చేరుతుంది మరో కథ 'రుక్మతి'. అంటే భీమారి (రోగం). ఇదీ బలమైన కథే. మాండలిక కథలకు పత్రికలో చోటుదొరకదు. కానీ ప్రతి ఒక్కరూ చదవాల్సిన కథలు. గుండెలు పిండేసే కథలు. లేతప్రాయంలోనే పసిమొగ్గ గుండెకు చిల్లుపడితే ఆరోగ్యశ్రీ కార్డు ఆదుకోలేక, అప్పుపుట్టక, ఆపరేషన్ చేసే స్తోమత లేక కొడుకును చూసి విలవిలలాడిన తల్లి తన కిడ్నీని అమ్ముకొని కుమారుడిని బ్రతికించుకునే తీరు హృదయాన్ని కలచివేస్తుంది. అదేవిధంగా తెలంగాణ పొద్దుపొడ అనే కథలో వచ్చిన తెలంగాణ ఎలా ఉండాలో, దొరల తెలంగాణ కాకుండా సామాజిక తెలంగాణ రాకుంటే దళితుల బ్రతుకు మారదని తేల్చి చెబుతుంది. అందుకు దళితులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాకముందే దళితులకు హెచ్చరిక చేసాడు రచయిత.
'దూదిపింజె' మరో కథ. ఈ కథలో హాస్టల్‌లో చదువుకునే పోరలు దసరా పండుగ సెలవుల్లో ఊరికి వచ్చి హాయిగా గడుపుదామనుకుంటే తల్లిదండ్రులు వారిని ఊరికే ఉండనివ్వక పత్తిచేళ్ల పనికి తమవెంట తీసుకపోయి పనిచేయించడం. రెక్కాడితే గానీ డొక్కాడని పల్లెజనుల బ్రతుకు, చిత్రణ ఈ కథలో కనిపిస్తుంది. పండుగకి పిల్లలకు బట్టలు కొనే స్తోమత లేక తమతో పాటు పిల్లలను పనికి తీసుకెళ్లడం వారి బీదరికం, వారి దయనీయ స్థితి ఈ కథలో ఆవిష్కరించబడింది. 'మాలోకం' కథలో తాపంతో, తన్మయంతో తీరని కోరికలు, వయస్సు తాపంతో పరుగు తీసే యువతి ఇష్టంలేని పెళ్లి చేసుకుని మొరటు మొగుడితో కాపురం ఇష్టంలేక, అపరిచితుడి చేతిలో పడి వంచనకు గురై వేశ్యావాటికలో తేలుతుంది. ఓ విటుని సహాయంతో బయటపడి నూతన జీవితం ఆరంభిస్తుంది. మన చుట్టూ దారితప్పి మోసపోతున్న యువతులకు అద్దం పడుతుంది ఈ కథ. మరో కథ 'స్నేహం విలువ'. ఈ కథలో విలువలు, స్నేహాలు డబ్బు ముందు దిగదొడుపే అని తెలుపుతుంది. డబ్బుకు, కులానికి అన్నీ బంధాలు తెగిపోవడం నేటి నైజం. 'ఆఖరి ఉత్తరం' అనే కథలో ఇద్దరు యువతీ, యువకులు ప్రణయ గాధను తెలుపుతూనే 'ఆ' అవసరం కోసం తపించే యువకుని మనస్తత్వం కోరిక తీరగానే చేతులు దులుపుకొని దూరం చేసే తీరు కనబడుతుంది. కానీ మహిళలు మాత్రం అలాకాక ప్రేమించే వ్యక్తినే సర్వస్వంగా భావించడం, ఆరాధించడం, తను మోసపోయిన క్షమాగుణం కలిగి ఉండడం స్త్రీల మానసిక స్థితికి దర్పణం పడుతుంది. 'లోగిలి' అనే మరో కథ. ఇందులో జస్ట్ లిఫ్ట్ కోసం అపరిచిత వ్యక్తితో ఎలా మసలుకోవాలో తెలుపుతూనే అతని మాటల గారడీలో పడిపోవడం, తోడు కోసం వెతుకులాటలు, అతనితో తీరని కోరికలు తీర్చుకోవడం, వయస్సు రేపే చిలిపి తుంటరి చేష్టలు కనిపిస్తాయి. ఈ కథలో రచయిత శృంగార రసాన్ని పండించాడు. 'జోగి' అనే మరో కథలో భర్త పెట్టే వేధింపులు భరించలేక అతని దెబ్బలకు విసిగి, వేసారి చావే శరణ్యమని తలుస్తుంది జోగమ్మ. విధి లేని పరిస్థితుల్లో తనకు ఆసరా ఎవరూ లేరని చావే శరణ్యమని రైలు పట్టాలపై పడుకొని మృత్యువుని ఆలింగనం చేసుకోవాలనుకుంటుంది. అప్పుడే తన ఇద్దరు పిల్లలను యాదికి తెచ్చుకొని తను లేకుంటే వారు అనాథలు అవుతారని వేదన చెంది కలత పడి చావును తప్పించుకోవాలనుకుంటుంది. కానీ అంతలో మృత్యుకోరల నుంచి బయటపడే పెనుగులాటలో కాళ్లు రెండూ పోగొట్టుకుంటుంది. ఫలితం అవిటితనం, బ్రతుకు బారం, ఆదరించని సమాజం. ఏటికి ఎదురీదడం సాహసంతో కూడిన పని. విధి వంచితురాలైన జోగమ్మ తాను పుండైన తనువును పడక చేసి వేశ్యగా మారి సమాజంలో పరపతి పొందిన తీరు కన్పిస్తుంది. కానీ ఇది నిజమేనా అనిపించక మానదు. మరో కథ 'మాయమ్మ - మల్లమ్మ'. అమ్మ ఆప్యాయత, అనురాగం, అమ్మ ప్రేమ, ఊరు పరిసరాలు, అమ్మ చుట్టూ అల్లుకున్న మమకారాలు, పెనవేసుకున్న బంధాలు కథలో కనిపిస్తాయి. అమ్మంటే ఊరు. ఊరంటే అమ్మ. అమ్మకు ఊరు పర్యాయపదం. పల్లెలు భారతవని పట్టుకొమ్మలైతే, అమ్మకు అమ్మలాంటి పల్లెకు విడదీయరాని ఆత్మీయానుబంధం వేసాడు రచయిత.
'కుటిలం' మరో కథ. నేటి సమాజంలో మోసానికి ఎవరూ అతీతులు కారు. ఏదీ అతీతం కాదని తెలిపే కథ. నిరుపేదలైన మల్లమ్మ, మల్లయ్యలు వలస వెళ్లి రామోజీ ఫిల్మ్‌సిటీలో బతుకీడుస్తున్న వారి భూమిని ఎలాగైనా కాజేయాలన్న దుర్బుద్ధితో ధనిక వర్గం చేసే దుర్మార్గపు కుట్రకు నిలువెత్తు నిదర్శనం ఈ కథ. పేదలను నిరుపేదలుగా మార్చి ఎలాగైనా వారి భూమిని కాజేసి ఊరిలో వారికి ఏమీ లేకుండా చేసి ఊరి నుంచే వేరుచేసిన తీరు ఈ కథలో కన్పిస్తుంది.
'బొందల గడ్డ' మరో కథ. ఈ కథలో 'కులనిర్మూలన' అంబేద్కర్ సిద్ధాంతం మరో కొత్తకోణంలో ఆవిష్కరించాడు రచయిత. ఇప్పటికీ దళితులపై జరుగుతున్న దాడులు, వారి మాన ప్రాణాలు హరిస్తూనే ఉన్నాయి. అయితే వారి ఉనికినే లేకుండా చేసే సమాజ పోకడ నేటికీ చూస్తూనే ఉన్నాం. నిన్నటి చుండూరు, కారంచేడు మొదలు నేటి లక్ష్మింపేట దాకా కంచికచర్ల కోటేశు నుంచి బీటెక్ తలారి అరుణ, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనూహ్య మరణం వరకు అగ్రవర్ణ దమననీతి కనిపిస్తూనే ఉంది. అధికారం అడ్డంపెట్టుకొని బెల్టు షాపుల నుంచి గుడుంబా సెంటర్లను గ్రామాలలో ఏరులై పారించి దళితుల్ని వ్యసనపరుల్ని చేసి మద్యంలో అంతం చేసే నయావంచన పోకడయే ఈ కథ. దళితులే ఎక్కువగా మద్యం తాగడం, మద్యానికి బానిసలవడం, చావును కొనితెచ్చుకోవడం ఈ కథలో చూపుతాడు రచయిత. ఒక వాస్తవిక విషయాన్ని కథగా మలచిన తీరు ఆశ్చర్యం కలిగించక మానదు. 'జాలుబాయి' మరో కథ. ఈ కథలో ఒకప్పుడు తెలంగాణ పల్లెలు జాలుబాయి నీటితో పంటచేళ్లు ఎలా పసిడి మాగాణాలైనాయో జాలుతో నిండిన బావులు నీటితో కలకలలాడే దృశ్యం ఒకనాడు, నేడు అదృశ్యమై జాలుబాయి జాలు ఎండిపోయిన తీరును ఆవిష్కరించారు రచయిత. అందుకు గ్లోబల్ వార్మింగ్ ఒక కారణమైతే కరువు కాటకాలు మరో కారణంగా చెప్పవచ్చు. అట్లాంటి పల్లెలకు త్రాగునీరు లేక అవస్థలు పడడం, రాజకీయ నాయకులు వాగ్దానాలు గుప్పించడం నల్లగొండకు నక్కలగండి వస్తే తప్పా నల్లగొండ దూప తీరదు. అది నిజమని రచయిత అభిప్రాయం. ఇంత నీతి ఉన్న నవల, కథలను తెలుగు సాహిత్యానికి అందించన ఘనత భూతం ముత్యాలుది.
ఈ సాహిత్యాన్ని విశ్వవిద్యాలయాలు దూరం చేస్తున్నాయి. మనుస్మృతి సూక్తి 'ఏవమేవతు శూద్రసన ప్రభుకర్మ సమాదియత్, ఏతేషామేవా వర్ణనాం శుశ్రూషా మనసుయయా'ని విశ్వవిద్యాలయాల తెలుగు శాఖలు అమలుపరచడమే ఇందుకు నిదర్శనం. అవి, దళిత సాహిత్యాన్ని అవమానపరుస్తూ అవహేళన చేస్తున్నాయి. ఇట్టి సాహిత్యాన్ని ఎవరైనా నాశనం చేయవచ్చు అనే పద్ధతిని తిరిగి దళిత బహుజన అధ్యాపకులచే అణగదొక్కిస్తున్నారు. దళిత సాహిత్యంపై పరిశోధనకు ఆసక్తి చూపుతున్న విద్యార్థులను నిరుత్సాహ పరుస్తూ ఆంధ్రా విశ్వవిద్యాలయాల్లో జరిగిన పరిశోధన చాలు ఇక అవసరం లేదు తెలంగాణలో దళిత సాహిత్యానికి అవకాశాలు లేవు అని విద్యార్థులను తెలంగాణ విశ్వవిద్యాలయ ఆచార్యులు అవహేళన చేస్తూ అవమానిస్తూ వివక్షకు గురిచేస్తున్నారు. దళిత రచయితలూ మేల్కొనండి. ఇటువంటి రచనలను ఆదరించండి. సాహితీ విమర్శకులారా! సాహితీ పాఠకలోకమా! విశ్వకవులమని విర్రవీగుతూ ఊరేగుతున్న వారలారా! ఆలోచించండి. ఏదీ సాహిత్యమో నిగ్గుతేల్చండి. శూద్రుల విజ్ఞానం, విద్యార్జన నేరము ఇక్కడ. అదేవిధంగా వారి సాహిత్యం నేరమై, సమాజానికి దూరమై పోతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా దళిత సాహిత్యం మీద నిషేధాజ్ఞలు కొనసాగుతూనే ఉన్నాయి. దళిత కవులు, రచయితలు బహుపరాక్. మన సాహిత్యాన్ని చదవండి. తెలంగాణ తెలుగులో అగ్రకుల విషభావజాలాన్ని అరికట్టండి. దళిత సాహిత్యాన్ని పండించండి.
- వేముల ఎల్లయ్య

Namasete Telangana Telugu News Paper Dated: 07/04/2014 

Saturday, April 19, 2014

నవ తెలంగాణ-మట్టి మహిళలు By -జూపాక సుభద్ర


తెలంగాణ ఉద్యమం కోటి కలలను ఆరబోసుకున్నది. భౌగోళిక తెలంగాణ బహుజన తెలంగాణ కావాలని ఆశిస్తున్నది. తెలంగాణ ఉద్యమంలో సామాజిక న్యాయాలకు సంబంధించిన ఒప్పందాలు జరగలేదు. బహుజన తెలంగాణ సాకారమైనప్పుడే.. అది నవతెలంగాణగా రూపొందుతుంది. పాలక కులాలు అంటున్నట్లు ఇది పునర్నిర్మాణంగా జరిగితే ఇది ఆధిపత్య కులాలకు ప్రయోజనకారిగా ఉంటుంది. పునర్నిర్మాణమంటే ఆ నిర్మాణాలే తిరిగి తీసుకొచ్చే ప్రయత్నమా!

సీమాంధ్ర రాజకీయాల వల్ల తెలంగాణ పల్లెల్లో చెరువులు ఎండిపోయి మైనర్ ఇరిగేషన్ దెబ్బతిని, భూములన్నీ పెస్టిసైడ్ విషాలతో చౌడు నేలలయ్యాయి. దీంతో రైతుకూలి, కైకిలి చేసుకునే మట్టి మహిళలు పట్టణాలకు వలసపోయారు. ఇండ్లల్లో పాసి పని చేస్తున్నారు. విద్య, ఉపాధులు లేవు. శ్రమ, మానవ గౌరవాలు, మానవహక్కులు లేకుండా తెలంగాణ మట్టి మహిళలు బతుకులీడుస్తున్నారు. దళిత ఆడవాళ్లు సపాయి చీపర్లవుతున్నారు. లంబాడీ తల్లులు తిండిలేక పిల్లల్ని అమ్ముకుంటున్నారు. బీడీ కార్మికులు శ్రమలు కాలిపోతున్న బీడీలవుతున్నారు. చేనేత కార్మిక మహిళలు కూలిగిట్టక శవాలవుతున్నారు. తాగడానికి నీళ్లు లేక ఫ్లోరోసిస్ బారి న పడుతున్నారు. తెలంగాణ దళిత మహిళలు జోగిని, పాకి పనుల లాంటి కుల దురాచార హింసకు, అత్యాచారాలకు గురవుతున్నారు. ఆదివాసీ భూముల్ని పెట్టుబడిదారులు కంపెనీలకు వనరులుగా ఎంచుకొని ఆదివాసులను వెళ్లగొడుతున్నారు. జాతీయ మహిళా కమిషన్ పాలక కులాల మహిళల్ని పాలిత కులాలైన, అణగారిన మహిళల్ని వారి అస్తిత్వాన్ని గుర్తించక తప్పనట్లుంది. అందుకే బిల్లులో ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఆర్థిక సహకారం అందించాలంటున్నది. ఇది మంచి పరిణామం. జాతీయ మహిళా కమిషన్ ఇంకో గొప్ప సాహసం చేసింది. మామూలుగా ప్రభు త్వం తమ సంస్థల్ని తమకు వెన్నుదన్నుగా ఏర్పాటు చేసుకుంటాయి. కానీ జాతీయ మహిళా కమిషన్ ప్రభుత్వ సంస్థగా ఉండి, సైనిక దళానికి ప్రత్యేక అధికార చట్టాన్ని ఉపసంహరించాలని చాలా బలంగా సిఫార్సు చేసింది. ఇది మహిళా కమిషన్ చరిత్రలో గొప్ప సంగతి.

సైనిక దళాల ప్రత్యేక అధికార చట్టం వల్ల కశ్మీర్, ఈశాన్య రాష్ర్టాల ప్రజలు,నక్సలైట్ ఉద్యమప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్ (సల్వాజుడుం) ముఖ్యం గా, ఆదివాసీ మహిళలు నిత్యం సైనిక, పోలీసుదళాల లైంగిక దాడులు, హింసలు ఎదుర్కొంటూ పోరాడుతున్నారు. ఆ మహిళల గోసలు, గొంతు లు, ఈ (అ)నాగరిక లోకానికి వినబడ్తలేవు. ఆదివాసీ మహిళల మాన ప్రాణాలకు భద్రత లేకుండాపోయింది. పోలీసులు, సైనిక దళాలు చేసే లైంగిక దాడుల్ని, అఘాయిత్యాల్ని ప్రభుత్వాలు, చట్టాలు, న్యాయస్థానాలు వారినెట్లా రక్షిస్తాయో వాకపల్లి ఘటన నిదర్శనం. ఇక కల్లోల కశ్మీర్, ఈశాన్య రాష్ర్టాల్లో సైనిక దుశ్చర్యలు ఎంత ఘోరంగా, క్రూరంగా ఉంటాయో అక్కడి మహిళా పోరాటాలు చెబుతున్నాయి. ఇరోం షర్మిల పధ్నాలుగేండ్ల దీక్ష ఉండనేఉన్నది. ఈ యూనిఫాం నేరస్తుల నుంచి రక్షణ కోసం చేసిన సిఫార్సులను అమలు చేసే దిశగా మహిళలు ఉద్యమాలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.


Namasete Telangana Telugu News Paper Dated: 20/4/2014 

ఆది నుంచి ఆదివాసీలపై అణచివేతలే...By -మైపతి అరుణ్‌కుమార్ఆదివాసీ రచయితల సంఘం


వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు కాని ఒక నిర్దోషికి శిక్షపడకూడదు. చట్టం దష్టిలో అందరు సమానులే అనేది రాజ్యాంగనీతి. అందరు ఆమోదించాల్సిన విషయం కూడా! ఈ రాజ్యాంగ నీతిని 33 సంవత్సరాలు వెనుకకు వెళ్ళి ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి గోండు గూడెం సంఘటనతో పోల్చి చూసినపుడు అనేక అనుమానాలు మనకు కలుగుతాయి. అసలు ఇంద్రవెల్లితో పాటు చుట్టు పక్కల గోండుగూడాలలో అమరత్వం పొందిన గోండులు ఈ రాజ్యాంగ పరిధిలోకి రారా? ఒకవేళ వస్తే దీనిపై నేటికి ఎందుకు విచారణ జరగలేదు? న్యాయమనేది ఎందుకు గోండుల దరిచేరలేదు? ఆదివాసులకు అటవీ భూములపై హక్కులను ప్రభుత్వం నేటి కి ఎందుకు కల్పించలేదు?నేటికి ఇంద్రవెల్లిలో 144సెక్షన్ అమలులో ఎందుకున్నది? వర్తమానంలో ఏం జరుగుతున్నది? రాజ్యహింస ప్రజాస్వామ్యంలో కొనసాగింపు ఎందుకుందనేది స్పష్టమవుతుంది. 

ఇంద్రవెల్లిలో ఆనాడు ఏం జరిగింది? అడవిపై హక్కు కోసం పోడు భూములు, పట్టాల కోసం ఆదివాసీ రైతుకూలిసంఘం ఇంద్రవెల్లిలో సంత జరుపుకునే రోజున బహిరంగసభకు పిలుపునిచ్చింది. ఈసభకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.సభకు వచ్చే గోండులకు మాత్రం రెండు రకాల ధక్పథాలున్నాయి. ఒకటి సంతలో వారానికి సరిపడు సరుకులు కోనుక్కోవటం (పిల్లాపాపలతో సంతలకు వెళ్ళటం ఆదివాసీ సంప్రదాయం)ఒకటైతే, రెండవది- సభకు హాజరవటం. సాయంత్రం మూడు గంటలు అయేటప్పటికి గూడాల నుంచి గోండులు చీమల దండుల్లా ఇంద్రవెల్లికి చేరుకుంటున్నారు. అప్పటికి ఆర్.డి.ఓ. సభకు అనుమతులు రద్దుచేశామని ప్రకటించటం 144 సెక్షన్ విధించటం జరిగిపోయాయి. సభకు అనుమతి లేదని పోలీసులు తెలుగులో ప్రచారం చేస్తున్నారు. గోండు భాష తప్ప, తెలుగు అర్థం చేసుకోలేని చాలామంది గోండులకు ఆ హడావిడి, పోలీసుల కవాతులు ఏమిటో అర్థం కాలేదు.ఒక్కసారిగా బెదిరింపులు, లాఠీచార్జి, తోపులాట అదికాస్త 420 రౌండ్లు కాల్పుల వరకు వచ్చింది. చెట్లు ఎక్కి మరీ కసితో గోండులపై పోలీసులు కాల్పులు జరిపారు. గాయాలతో పిల్లాపాపలతో చెట్టుకొకరు, పుట్టకొకరుగా గోండులు పరుగులు తీశారు. 

ఎండతీవ్రత, నీరులేక చనిపోయిన సంఘటనలున్నాయని స్థానికులు అంటారు. గోండుల సంప్రదాయా నికి వ్యతిరేకంగా పోలీసులు శవాలను కుప్పలు కుప్పలుగా వేసి కాల్చి ఆదివాసులను మరింత గాయపరిచారు.ఎంతమంది చనిపోయారో కూడా నేటికి ప్రభుత్వం దగ్గర రికార్డు కాని పరిస్థితి. ప్రభుత్వం 13 మంది మాత్రమే మతులు అని కాకి లెక్కలేసిం ది కూర్చుంది.పక్కకున్న పిట్టబొంగరం గోండు గూడెంలో నీటికి బదులు రక్తం పారిం దంటే ఈ మారణహోమాన్ని అంచనా వేయవచ్చు. ఈ సంఘటన అనంతరం ప్రభు త్వం కొన్ని ఆదివాసుల కోసం ప్రత్యేక అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా అవి ప్రచా రానికే పరిమితమయ్యాయి.నేడు.. ఇంద్రవెల్లి గిరిజనేతరుల వలసల కేంద్రమైంది. గోండుల ఆశయం మాత్రం నెరవేరకపోగా.. స్థూపం మాత్రం అమరుల జ్ఞాపకంగా మిగిలింది. 

స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ రాజ్యం 1836లో 1000 మంది గోండులతో సహా, ఆదివాసీ రాజు అయిన రాంజీ గోండును నిర్మల్‌లోని మర్రిచెట్టుకు ఉరితీసి రాజ్య క్రూరత్వాన్ని చాటుకుంది. ఇది రాజ్య ఆక్రమణలో భాగమైంది. 1940లో జోడెఘాట్ కేంద్రంగా జల్, జంగల్, జమీన్ కోసం నడిపిన పోరాటంలో కొమరంభీంతో సహా 11 మంది కాల్చివేయబడ్డారు. అది రాజ్య నిర్బంధంలో భాగమయింది. ప్రజాస్వామ్య పాలనలో జరిగిన ఇంద్రవెల్లి దుర్ఘటనకు కారణమేంటనే ప్రశ్నలు సమాధానాలు దొరకనేలేదు. కాని నేటికి వాకపల్లి, బల్లుగూడ, బాసగూడ, ఆలుబాక,ఎడ్సమెట్ట లాంటివి రాజ్యహింసలో కొనసాగింపుగానే ఉన్న వి. బహుశా ఇటువంటి నిర్బంధం అణిచివేత, దోపిడీకి వ్యతిరేకం గా ఉద్యమించినట్టు, ఉత్తరాంధ్రలోని సవర జాతాపులు నడిపిన శ్రీకాకుళ గిరిజన రైతాంగ సాయుధ పోరాటం కూడా చరిత్రలో నిలిచిపోయింది. రాజ్యహింసకు రక్తసిక్తమైంది. భూస్వామ్య వలస దోపిడీ నుంచి విముక్తి కోసం, భూమిపై హక్కు కోసం నడిపిన ఈ పోరాటం దేశ చరిత్రలోనే ఒక మైలురాయి. దీని తర్వాత ప్రభు త్వం ఆదివాసుల ఆరాట పోరాటాల వెలుగులో 1/70 చట్టాన్ని తెచ్చింది.

ఈ చట్టం ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాలో (ఆదివాసీ ప్రాం తం) లో గిరిజనేతరులు, భూములు కలిగి వుండటం, స్థిర చర ఆస్తులు కలిగి వుండటం నిషేధం. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే ఆదివాసుల భూములు 48శాతం గిరిజనేతరుల చేతుల్లో ఉన్నవి. అయినా ఈ చట్టాన్ని అమలు చేసి ఆదివాసులకు భూములిప్పించే సాహసం నేటికి ఏ ప్రభుత్వం చేయలేదు. కాని ఈ పోరాటం ఆదివాసులకు చైతన్యాన్ని మిగిల్చింది. ఈ చైతన్యం ఇంద్రవెల్లి మీదుగా అడవిపై హక్కు కోరుతూ అమరత్వాన్ని మూటగుట్టుకొని దండ కారణ్యంలో గూడు కట్టుకున్నది. జగిత్యాల జైత్రయాత్ర మైదానం మీదుగా వచ్చి మళ్ళీ సిరొంచ, గడ్చిరోలి మీదుగా అబుజ్‌మాడ్‌లోని గోండుల వారసత్వాన్నందుకొని దండకారణ్యంలో నేడు సామ్రాజ్యవాద విషసంస్కతిని, పెట్టుబడిదారీ, బహుళజాతి సంస్థ ల నుంచి దేశాన్ని విముక్తి చేసే దిశగా జనతన సర్కార్‌ను ఏర్పాటు చేస్తున్నది. మనం ఇవ్వాళ.. చూస్తున్న దేశ పరిణామాలలో ఇది ఒకటి. 

భారత పరిపాలన వ్యవస్థ జనతన సర్కారు పరిపాలన వ్యవస్థ ను ఆదివాసీ ప్రాంతాలలో సరిపోల్చి చూసినప్పుడు అనేక విషయా లు అవగతమవుతాయి. 1950 జనవరి 26 న అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగంలోని 244(1) అధికరణం ఆదివాసీ ప్రాంతాలపై స్వయం పాలన, నిర్ణయాధికారం వారికే ఉండాలనంటున్నది. 67 సంవత్సరాలుగా దీనిని ప్రభుత్వాలు ఎందుకు అమలు చేసి ఆదివాసీల అభివద్ధికి దోహదపడలేదు? 1996లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడిన పెసా చట్టం ప్రతి ఆదివాసీ గూడాన్ని గ్రామసభగా పరిగణించి మా వూళ్ళో మా రాజ్యం పాలనా హక్కును ఆదివాసులకిచ్చింది. 2006 ఆడవి హక్కుల చట్టం ఆదివాసులకు అడవిపై సర్వాధికారాలు కల్పించింది. కాని వీటి అమలు మాత్రం కాగితాలకే పరిమిత మైంది. 
ఇదే రాజ్యాంగానికి వ్యతిరేకంగా.. ఆపరేషన్ గ్రీన్‌హంట్ పేరుతో ఆదివాసీలపై మానవ హక్కుల ఉల్లంఘనా చర్యలు జరుగుతున్నాయి. పోలవరం, కంతనపల్లి ప్రాజెక్టుల పేరిట ఆదివాసీ గూడెలను జలసమాధి చేస్తున్నారు. బాక్సైట్, లాటరైట్, గ్రానైట్ పేరిట, ఓపెన్‌కాస్టుల పేరిట జీవన విద్వంసం చేస్తున్నారు. టైగర్ జోన్, ఎలిఫెంట్ జోన్‌ల పేరిట అడవి నుంచి ఆదివాసీల గెంటివేస్తున్నారు. వాకపల్లి, బల్లుగూ డ, సత్యమంగళం లాంటి లైంగిక దాడు లు నిత్యకత్యమయ్యాయి. 

అన్యమత ప్రచారాలతో ఆదివాసీ ఉమ్మడి సాంస్కతిక జీవన వ్యవస్థపై సాంస్కతిక దాడి జరుగుతున్నది. ఈ పరిస్థితులలో ఆదివా సీల మనుగడ ఏమిటనేది ప్రశ్న. ఇప్పుడు ఆదివాసుల మనుగడకే ప్రమాదం వచ్చి పడిందని స్పష్టంగా కనబడుతూనే ఉన్న ది. ఆదివాసీల ఉమ్మడి జీనవ వ్యవస్థను బలోపేతం చేస్తూ సాంస్కతిక, జీవన వ్యవస్థను సంరక్షిస్తూ, నిర్మాణం చేస్తూ ఆదివాసీ గూడాలకు స్వయంపాలనా హక్కుల్ని కల్పిస్తున్న జనతన సర్కార్ వైపు ఆదివాసీలు చూస్తున్నారు. దేశానికి స్వా తంత్య్రం వచ్చినప్పుడు ఆదివాసీలదే ఈ దేశమనీ, దేశంలోని వారంతా బ్రిటిష్ వారిలాగే వలస వచ్చిన వారే అని చరిత్ర చెబుతున్నది. భారత సమాజంలో ఆదివా సీలు తమ అస్తిత్వం కోసం ప్రత్యేక భార తం కావాలని ఆదివాసీలు నినదించేరోజు పునరావతమయ్యే పరిస్థితి వస్తు న్నది. ఇలాంటి పోరాటాలను ప్రభుత్వం అణచివేయ జూసి మరొక చారిత్రక పోరాటాన్ని ఆదివాసీల నుంచి కొనితెచ్చుకుంటున్నది. ఇవ్వాళ.. మధ్య భారతం కేంద్రంగా జనతన సర్కార్‌లు చెబుతున్నది ఇదే..







Namasete Telangana Telugu News Paper Dated: 20/4/2014 

బాబా సాహెబ్ బాటలో కాంగ్రెస్ By కొప్పుల రాజు IAS


హిందూ సమాజంలోని అణచివేత దుర్లక్షణాలన్నింటిమీద తిరుగుబాటు చిహ్నం అంబేద్కర్ అని జవహర్‌లాల్ నెహ్రూ అన్నారు. అంటరానితనానికి, సామాజిక అణచివేతకు శ్రమను, ఉత్పాదక వత్తిని నీచంగా చూసే కుల వ్యవస్థకు దాని దుష్ట విలువలకు వ్యతిరేకంగా మొక్కవోని పోరాటం చేసి నోరులేని కోట్లాదిమంది మూగ భారతీయులకు అంబేద్కర్ దఢమైన కంఠాన్ని ఇచ్చారు. ఆయన కేవలం రాజ్యాంగ నిర్మాతే కాదు, అణగారిన వర్గాల విముక్తి ప్రదాత. మహాత్మా జ్యోతిబాఫూలేను స్ఫూర్తిగా తీసుకుని అంబేద్కర్ సాగించిన సామాజిక విప్లవోద్యమం మహోన్నతమైనది.

దేశం ఎదుర్కొంటున్న ఇతర పలు సవాళ్ళను గాంధీ, నెహ్రూలు తమదైన పద్ధతిలో పరిష్కరించే ప్రయత్నం చేశారు.. డాక్టర్ అంబేద్కర్ మాత్రం కులవ్యవస్థ చిమ్మిన కాలకూట విష ప్రభావం నుంచి సమాజాన్ని సమూలంగా విముక్తి చేసేందుకు కంకణం కట్టుకున్నారు. దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించారన్న కీర్తి కిరీటం మీద విహరిస్తున్న గాంధీ, నెహ్రూలకు భారతీయ సమాజాన్ని అమానుషం చేస్తున్న కుల వ్యవస్థను వివక్షను రూపుమాపవలసిన తక్షణ అవసరాన్ని గుర్తు చేశారు. బ్రిటీష్ పాలనలో లండన్‌లో జరిగిన రౌండ్ సమావేశాలలో దీనిని కీలక చర్చనీయాంశం చేయగలిగారు. గాంధీజీకి అప్రియమైనప్పటికీ సాటి ఎస్సీల కోసం బ్రిటీష్ ప్రభుత్వం నుంచి కొన్ని రాయితీలు పొందడంలోనూ కతకత్యుడయ్యారు.

అంబేద్కర్ అంటరాని మహర్ కులంలో పుట్టారు. అయినా ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులలో ఒకడుగా సమున్నత స్థాయిని సాధించారు. అంతర్జాతీయంగా పేరెన్నికగన్న విద్యాసంస్థలలో న్యాయ, తత్వ, ఆర్థిక శాస్ర్తా లు చదువుకున్నారు. లోతుగా అధ్యయనం చేశారు. ఒక అమెరికన్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పొందారు. అనేక గొప్ప గ్రంథాలు రచించారు. ఆయన రచించిన కుల నిర్మూలనగ్రంథం చైతన్యశీలమైన, శక్తివంతమై న రచన. సాటి దళితుల దుస్థితిపై అంబేద్కర్ అనేక వ్యాసాలు, రచనలు వెలువరించారు. కుల వ్యవస్థ, అంటరానితనం మూలాలను ఛేదించి వాటిలోని దుర్మార్గాన్ని, డొల్లతనాన్ని ఎండగట్టారు. 
జవహర్‌లాల్ నెహ్రూ ఆహ్వానంమీద తొలి ప్రభుత్వంలో న్యాయశాఖమంత్రి పదవిని అంబేద్కర్ చేపట్టారు. రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన కమిటీకి అధ్యక్షుడుగా నియమితుడయ్యారు. 

రెండున్నర ఏండ్లు వివేచనతో, పీడిత జనపక్షపాతంతో కషిచేసి ఆ చరిత్రాత్మక కర్తవ్యాన్ని నిర్వర్తించారు. అనేక క్లిష్టమైన ప్రశ్నలకు విశాల మానవత, సమ్మిళిత ప్రజాస్వామిక దష్టితో రాజ్యాంగ సభలో అంబేద్కర్ ఇచ్చిన సమాధానాలు, వివరణలు గణనీయమైనవి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం పరమాశయాలుగా రూపొంది న ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలతో కూడిన రాజ్యాంగాన్ని ఆయన ఆవిష్కరించారు. దానికి గొప్ప ఉప క్రమణికను అందించారు. ఆదేశిక సూత్రాలను విధిగా తక్షణమే అమలు చేయాలని లేనప్పటికీ వాటిని అమలులోకి తేవడం ప్రభుత్వాల నైతిక భాద్యత అని స్పష్టంచేయడం ద్వారా సమున్నత సమాజ నిర్మాణం దిశగా అవి పనిచేయవలసిన ఆవశ్యకతను కల్పించారు. మత స్వేచ్ఛను ప్రాథమిక హక్కులలో చేర్చి సర్వమత సమభావంతో సెక్యులర్ దేశంగా వర్ధిల్లడానికి పునాదులను రాజ్యాంగంలోనే నిర్మించారు. బలమైన కేంద్రం, స్వతంత్ర రాష్ర్టాలు ఉండే ఫెడరల్ వ్యవస్థను నెలకొల్పారు.

అంబేద్కర్ తాను బాల్యంలో అనుభవించిన అంటరానితనం గురించి చెప్పుకొన్నారు. పాఠశాలలో మంచి నీళ్ళు అడిగితే బంట్రోతు పైనుంచి పోసేవాడని ఆత్మకథలో రాసుకున్నారు. మరుగుదొడ్లు ఊడ్చే పనిని, ఆ రంగంలో సామర్ధ్యాన్ని బట్టి గాక కులాన్ని బట్టి అప్పగిస్తారని, ఈ పనిని ఎస్సీల చేతనే చేయిస్తున్నారని అంబేద్కర్ ఎత్తిచూపారు. అందుకే జాతీయ సలహా మండలి ఛైర్మన్ సోనియా సూచన మేరకు మరుగుదొడ్లను ఊడ్చే పనిని పారిశుధ్య సమస్యగానే కాక సామాజిక సమస్యగా కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం గుర్తించింది.


ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల జీవన పరిస్థితులను మెరుగుపరచి సమానమైన గౌరవాన్ని వికాసాన్ని పొందేలా చేయడానికి వారిపట్ల సానుకూల వివక్షను, ధర్మపక్షపాతాన్ని చూపే అధికరణలను రాజ్యాంగంలో చేర్చేలా చేసిన అసమాన ఘనత, మానవత అంబేద్కర్‌ది. అంటరానితనాన్ని నిషేధిస్తున్న ఆర్టికల్ 17, మత, భాషాపరమైన అల్పసంఖ్యాకవర్గాలకు రక్షణ కల్పిస్తున్న ఆర్టికల్ 30, విద్యా ఉద్యోగ రంగాలలో ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి తోడ్పడుతున్న ఆర్టికల్ 46 ఆయన పీడితజన పక్షపాతానికి నిదర్శనాలు. 

అంబేద్కర్ స్త్రీల విముక్తికోసం రాజ్యాంగంలో ప్రత్యేక అధికరణలు చేర్చారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో సమాన హక్కులు కల్పిస్తున్న ఆర్టికల్ 15, మహిళల పట్ల సానుకూల వివక్షతో ధర్మపక్షపాతంతో వ్యవహరించేలా చేస్తున్న ఆర్టికల్ 15(3), స్త్రీ, పురుషులకు సమాన ఉపాధి అవకాశాలు, సమాన పనికి సమాన వేతనం కల్పిస్తున్న ఆర్టికల్ 39 వంటి అనేక సాధనాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. వీటిని అనుసరించి పార్లమెం టు పలు విప్లవాత్మక చట్టాలు చేసింది. తొలి ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్న అంబేద్కర్ స్త్రీని బానిసగా చేస్తున్న హిందూ మత దుష్ట విలువలను పరిహరించే హిందూ స్మతి బిల్లును రూపొందించారు.

హిందువులలో బహు భార్యత్వాన్ని నిషేధించి మహిళలకు ఆస్తి హక్కును, విడాకుల హక్కును ఇతర అనేక వెసులుబాట్లను స్వేచ్ఛలను కల్పించదలచిన ఈ బిల్లును పితస్వామ్య వ్యవస్థకు పెను సవాలుగా భావించిన ఆనాటి ఛాందసులు పార్లమెంటులో దానిని వ్యతిరేకించి చట్టం కానివ్వకుండా చేశారు. దానితో ఆయన న్యాయశాఖ మంత్రి పదవినుంచి వైదొలిగారు.

దళితుల, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఏ చట్టాలు రావాలని, ఏ చర్యలు చేపట్టాలని అంబేద్కర్ కోరుకున్నారో వాటిని సాకారం చేసిన, చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందుతుంది. ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం పరిధిని విస్తరింపచేసింది. మహిళలకు గహహింస నుంచి రక్షణ కల్పిం చే చట్టం కాంగ్రెస్ తీసుకువచ్చిందే. స్థానిక సంస్థలలో మహిళలకు, ఓబీసీలకు రిజర్వేషన్ల కల్పన, నిర్భయ చట్టం, పని స్థలాలలో మహిళల వేధింపును అంతమొందించే చట్టం, కేంద్ర ఉన్నత విద్యాసంస్థలలో ఓబీసీలకు రిజర్వేషన్ల కల్పన కాంగ్రెస్ సాకారం చేసినవే. మహిళలకు చట్ట సభలలో 33శాతం రిజర్వేషన్ల కోసం కషిని చేపట్టిన ఖ్యాతి దానిదే. ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడానికి 117వ రాజ్యాంగ సవరణ బిల్లు 2012 కు రాజ్యసభ ఆమోదం సాధించడం, ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక సవరణ బిల్లును ఆర్డినెన్స్ ద్వారా అమలులోకి తెచ్చి, దళితులను న్యూనత పరిచే మరి అనేక కుల దురహంకార దుశ్చర్యలకు శిక్షపడేలా చేసిన గొప్పతనం కాంగ్రెస్ పార్టీదే. కేంద్ర స్థాయిలో ఎస్టీ, ఎస్టీ ఉప ప్రణాళికలకు చట్టబద్ధత కల్పించి వారి ఆభివద్ధికి ఉద్దేశించిన నిధులు వారి కోసమే ఖర్చయ్యేలా చేయాలని కాంగ్రెస్ పార్టీ దీక్ష పూనింది.

దేశంలోని ప్రతి బ్లాక్‌లోనూ అణగారినవర్గాలు, ముఖ్యంగా దళితుల కోసం నవోదయ విద్యాలయాల మాదిరి ఉన్నత ప్రమాణాల పాఠశాలను నెలకొల్పాలని, ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పన దిశగా జాతీయస్థాయి ఏకాభిప్రాయాన్ని సాధించడానికి గట్టి కషి చేయాలని, ప్రభుత్వంలో, ప్రభుత్వరంగ సంస్థల్లో ఎస్టీ, ఎస్టీ లకు, ఇతర బలహీన వర్గాలకు రిజర్వ్ చేసిన ఉద్యోగాలన్నీ తప్పనిసరిగా వారితో నే భర్తీ అయ్యేలా చూడాలని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివద్ధి కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ అంశాలన్నీ కూడా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ త్రికరణశుద్ధిగా అమలుచేస్తోంది.

పునాదులలో సామాజిక ప్రజాస్వామ్యం నెలకొంటే గాని రాజకీయ ప్రజాస్వామ్యం మనుగడ సాగించజాలదు అని అంబేద్కర్ స్పష్టపరిచారు. ఈ దష్టితోనే కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశంలో సామాజిక న్యాయసాధనకు అగ్ర ప్రాధాన్యమిచ్చి అహరహం పట్టుదలతో కషి చేస్తున్నా యి. అంబేద్కర్ రాజ్యాంగ పిత, నిర్మాతే కాదు గొప్ప స్వాతంత్య్ర యోధుడు, రాజకీయ నాయకుడు, తత్వవేత్త, రచయిత, ఆర్ధికవేత్త, సంపాదకుడు. భారతదేశంలో బౌద్ధమత పునరుద్ధరణకు అవిరళ కషిచేసినవాడు. అటువంటి అసమాన మహనీయుని జన్మదినాన కేవలం పుష్పార్చనతో సరిపుచ్చడానికి బదులు ఆయన మహోన్నత, మానవీయ ఆశయాలను ఆచరణలో పెట్టడానికి నడుంబిగించడమే ఆయనకు సరైన నివాళి.

బానిసత్వాన్ని అంతమొందించగల పరమాయుధం విద్య. అణగారిన ప్రజానీకాన్ని తట్టి లేపి సామాజిక హోదాను ఆర్ధిక పురోభివద్ధిని, రాజకీయ స్వాతంత్య్రాన్ని సాధించుకునేలా చేసేది విద్య. - అంబేద్కర్ 

Namasete Telangana Telugu News Paper Dated: 13/4/2014 

Thursday, April 3, 2014

శాసిస్తామన్నోళ్లే... యాచిస్తున్నారు!-కొంగర మహేష్


Published at: 03-04-2014 07:02 AM
'రాజకీయ నాయకులు పదవుల కోసం వెంపర్లాడుతున్నారు. తమ స్వార్థం ఉద్యమాన్ని తాకట్టు పెట్టేందుకు కూడా వెనకాడటం లేదు. తామే ఉద్యమానికి నాయకత్వం వహించి యావత్ తెలంగాణ ప్రజల చిరకాల కాంక్ష ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తాం. అవసరమైతే అసోం తరహాలో (అస్సాం గణ పరిషత్ మాదిరి) రాజకీయ పార్టీ స్థాపించి ఉద్యమాన్ని నడిపిస్తాం. ఇక ఈ రాజకీయ నాయకులను చేరదీసేది లేదు. వారి దరికి చేరేది లేదు'. ఇవి నాలుగేళ్ల క్రితం 2009 చివర్లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష విరమించినప్పుడు, డిసెంబర్ 9 ప్రకటనను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన (2010 జనవరి 23) నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ కేంద్రమైన ఓయూలో విద్యార్థి నేతలు చేసిన వ్యాఖ్యలు. పడిలేస్తున్న ఉద్యమాన్ని తమ భుజాల మీద మోస్తూ నిలబెట్టి... కదనరంగంలో కాలుదువ్విన యువ గర్జనలకు ప్రజానీకం గొంతు కలిపింది. అడుగులో అడుగేస్తూ ఓ యుద్ధానికే మొగ్గుచూపింది. విద్యార్థుల తెగువ, లాఠీలు, తూటాలకు వెరవని ధైర్యానికి పాలక, ప్రతిపక్షాల గొంతులు ఎండిపోయాయి. ఏం మాట్లాడినా తిరుగుబాటు తప్పదని గ్రహించిన పొలిటికల్ లీడర్లంతా ఇళ్లకే పరిమితమై ఓయూ, కేయూ వంటి వర్సిటీల తదుపరి కార్యాచరణపైనే దృష్టి కేంద్రీకరించిన సందర్భాలు లేకపోలేదు. దీంతో తెలంగాణకు దశ, దిశ ఇక విద్యార్థి యువకిశోరాలే అని ప్రజలంతా అనుకున్నారు. విద్యార్థులు జేఏసీగా ఏర్పడి చేసిన 'ఓయూ డిక్లరేషన్' అన్ని రాజకీయపక్షాల నేతలకు ముచ్చెమటలు పట్టించింది కూడా. పలు ప్రజాసంఘాల నాయకులు, పార్టీలకతీతంగా ఇక్కడి విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. విద్యార్థులు ఏదో చేస్తారని అంతా అనుకున్నారు. విద్యార్థులు ఏం చేయబోతున్నారని యావత్ దేశ ప్రజానీకమంతా ఆసక్తిగా ఓయూ వైపు చూసింది. విద్యార్థుల నాయకత్వంలో మలిదశ తెలంగాణ ఉద్యమం కొత్త రాజకీయాలకు పురుడుపోస్తుందని విశ్లేషణలు జరిగాయి.
ఓయూలో మొదలైన విద్యార్థి, యువత ఏకీకరణ కేయూ నుంచి మిగతా తెలంగాణ అంతటా సరికొత్త ఉద్యమం వ్యాపిస్తుందని అనుకుంటున్న సందర్భంలోనే వారి అడుగులకు బంధనాలు పడ్డాయి... ఉద్దండ రాజకీయనేతలు రంగప్రవేశం చేసి 'డైవర్షన్' వ్యూహాలతో యువరాజకీయ రణన్నినాదాన్ని ఆదిలోనే అంతం చేశారు. మొలకెత్తే విత్తనాన్ని వేరుతో సహా తుంచేస్తే మళ్లీ పుట్టేందుకు అవకాశమే ఉండదన్న దుగ్ధతో కొన్ని స్వార్థపూరిత శక్తులు చాలా జాగ్రత్తగా ఓయూపై కన్నేశాయి. 'విద్యార్థులు రాజకీయాలు చేస్తే తామేం కావాలంటూ' విస్మయం వ్యక్తం చేస్తూ 'మేం తెలంగాణ కోసం పోరాడుతాం. స్టూడెంట్స్‌కు స్టడీస్ ముఖ్యం.. మీరు చదువుకోండి' అని సలహా ఇచ్చారు. కొంతమంది లంచ్, డిన్నర్ల పేరుతో ఇంటికి పిలిపించుకొని బుజ్జగించి తమవైపు తిప్పుకున్న వారున్నారు. మాటవినని వారిని ఉద్యమ ద్రోహులుగా ముద్రవేసి... జేఏసీ చీలికకు ఆజ్యం పోశారు. ఇట్లా మొదలైన చీలిక... ఆరునెలలకే ఒక్క ఓయూలోనే ఒకటి, రెండు, మూడు ఇలా దాదాపు పది జేఏసీలు ఏర్పడ్డాయంటే ఎన్ని రాజకీయాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో రాజకీయ పార్టీకి చివరికి ఒక్కోకులానికి ఒక్కో జేఏసీ ఏర్పడింది. చిట్టచివరికి ఒక్కరూ, ఇద్దరున్నా జేఏసీలు ఏర్పాటు చేసుకొని తమ పంథా కొనసాగించారు. రాజకీయ పార్టీలకు సరిగ్గా కావాల్సింది కూడా ఇదే.
కనీసం ఓయూ ఉద్యమంలో 'నో ఎంట్రీ' ఎదుర్కొన్న టీడీపీ సైతం స్వతంత్ర జేఏసీ పేరుతో కొనసాగింది. ఇతర పార్టీలు కూడా భావసారూప్యతల పేరుతో విద్యార్థుల్లో సెపరేటు జట్టు కట్టించాయి. అతి కొద్దిమంది మాత్రమే ఏపార్టీతో సంబంధం లేకుండా జేఏసీగా ఏర్పడ్డారు. అప్పటిదాకా పార్టీల ఊసులేకుండా సాగుతున్న ఉద్యమంలో స్పష్టమైన చీలిక తప్పకపోవడంతో ఆరోజుకు ఉన్న జేఏసీని కాపాడుకుంటే చాలన్న విధంగా పరిస్థితి మారిపోయింది.
అయితే తెలంగాణ వస్తే అగ్రవర్ణ పాలన, ఆధిపత్యం తగ్గి దాదాపు 90 శాతంగా ఉన్న అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రాజకీయ ప్రాబల్యం పెరుగుతుందని అందరూ నమ్మారు. రాజ్యాధికారం వీరి చేతుల్లోకే వస్తుందనే అంచనాలు మొదలయ్యాయి. అలాగే ప్రచారం జరిగింది కూడా. ఈ అశతోనే ఆ వర్గాలకు చెందిన ప్రజానీకం ఉద్యమంలో నాయకత్వం తప్ప మిగతా అన్నింట్లో చివరికి ఆత్మహత్యలు చేసుకోవడంలో కూడా ముందున్నారు. ప్రపంచీకరణ నేపథ్యం, భౌగోళిక పరిస్థితులు, ఉద్యమాలు, జనాభా దృష్ట్యా ఎలైట్ వర్గాల పిల్లలు 90వ దశకం వచ్చేసరికి ఆర్ట్స్, సామాజిక శాస్త్రాల పట్ల అనాసక్తి కనబరచడం... విదేశీ విద్య, సాంకేతిక విద్యపై ఆసక్తి కనబర్చడంతో, ఓయూ, కేయూ వంటి తెలంగాణ వర్సిటీల్లో బహుజన వర్గాల పిల్లలే సింహభాగంలో ఉన్నారు. నాటి నుంచి నేటి దాకా ప్రపంచంలో ఎక్కడ ఏపోరాటం జరిగినా తర్కబద్ధంగా స్పందిస్తూ సామాజిక స్పృహతో ముందుకెళ్తున్నారు. తెలంగాణ వస్తే తమకు, భవిష్యత్ తరాలకు ఏదో మంచి జరుగుతుందనే తెగించిపోరాడారు. ఇలాంటి నేపథ్యమున్న అణగారిన వర్గాల విద్యార్థులు రాజకీయంగా బలపడితే... వారి నాయకత్వాన్ని ప్రోత్సహిస్తే ఏదో ఒకనాడు తమ కుర్చీ కిందికి నీరు తప్పదనే భయంతో జంకిన నేతలే విద్యార్థి నాయకత్వాన్ని నిలువునా చీల్చడంలో సఫలమయ్యారు. ఒక్కమాటలో చెప్పాలంటే విద్యార్థి ఉద్యమం నిట్టనిలువునా చీలేంత వరకు నిద్రపోలేదనడంలో ఆశ్చర్యం లేదు.

ఒకవైపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చరిష్మా తగ్గిపోతుండటం 2014 ఎన్నికలు సమీపిస్తుండటంతో... హైకమాండ్‌కు 2009 డిసెంబర్ 9 హామీ గుర్తుకొచ్చి తెలంగాణ బిల్లును సాధారణ మెజార్టీ ఉన్నా 'ఎంతో శ్రమ'కోర్చి పార్లమెంటులో పాస్ చేయించింది. రాష్ట్రపతి ఆమోదంతో 60 ఏళ్ల కల సాకారమైంది. 1969 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఇన్నేళ్ల మహోద్యమ ఫలితానికి విద్యార్థులు, యువత, ప్రజానీకం సమష్టిపోరాటం, అమరుల త్యాగాలే సాక్ష్యాలు. రాజకీయ నేతల పాత్ర ప్రేక్షకపాత్ర. నామమాత్రమే అని చెప్పకతప్పదు. అయితే వచ్చిన రాష్ట్రంలో పునర్నిర్మాణం, సామాజిక తెలంగాణ, బంగారు తెలంగాణ వంటి లక్ష్యాలు మిగిలే ఉన్నాయి. వీటిపై చర్చ ప్రారంభదశలో ఉండగానే రాష్ట్రపతి పాలన, 2014 సార్వత్రక ఎన్నికల ప్రకటన జమిలిగా వచ్చాయి.
రెండు రాష్ట్రాల్లో పాగాకోసం ఎవరి ప్రయత్నాలు వారు ప్రారంభించారు. పొత్తులు, ఎత్తులతో క్షణం తీరికలేకుండా ఉన్నారు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఏ పొలిటికల్ పార్టీ కూడా ఓయూ విద్యార్థుల పోరాట పటిమను పరిగణనలోకి ఏమాత్రం తీసుకోలేదు. తమ పోరాటాన్ని గుర్తించి ఈ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఇవ్వాలని ప్రధాన రాజకీయ పక్షాల నేతలను కలుస్తున్నా... కులం, వర్గం, నియోజకవర్గం వంటివాటితో ప్రసన్నం చేసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. వారి అనైక్యతను పసిగట్టిన పార్టీలు తమదగ్గరికి వచ్చినవారిని కూడా పట్టించుకున్న పాపాన పోలేదు (కేసీఆర్ మాత్రం ఒకే ఒక్క విద్యార్థి నాయకుడిని పిలిచి పార్టీలో చేర్చుకొని టిక్కెట్ ఇస్తానని హామీ ఇచ్చారు). దీంతో చేసేదిలేక కొంతమంది ఎవరికి తోచినట్లు వారు కాంగ్రెస్, ఇతర పార్టీల్లో చేరుతున్నారు. కొంతమంది ఎంఐఎంను కూడా అప్రోచ్ అయ్యారు. కారణాలేమైనప్పటికీ ఆ పార్టీ నాయకత్వం ఒకరిద్దరికి టిక్కెట్లు కన్ఫర్మ్ చేసింది.
మరోవైపు ప్రధాన పార్టీల నుంచి ఒకరిద్దరికి తప్ప మిగతా ఎవరికి స్పష్టమైన హామీ రాకపోవడంతో... విద్యార్థి నేతల పరిస్థితి ఎక్కే గడప.. దిగే గడప అన్న చందంగా మారింది. ప్రతిరోజూ ఏదో పార్టీ దగ్గరకు వెళ్లడం తమ అభ్యర్థనలు వినిపించడం, కాదంటే మళ్లీ మరో పార్టీని ఆశ్రయించడం... ఆర్థించడం... వారం పదిరోజుల నుంచి ఇదే ఓయూ నేతల దినచర్యగా మారింది. కొంతమంది నేతలైతే 'మీ బలమెంత, ఆర్థిక బలాబలాలేంటి?' అంటూ సూటిగానే అడిగి లెక్కలు వేస్తున్నారు. కాస్త అవసరం అనిపించిన వారికి పార్టీ పదవులు ఇస్తూ, అవకాశం ఉంటే ఎన్నికల తర్వాత నామినేటెడ్ పదవులు కట్టబెడతామని చెబుతున్నారు. ఇలాంటి మాటలతో విసిగినవారు, సంతృప్తి చెందనివారు మాత్రం స్వతంత్రంగానైనా ఒక్కొక్కరు ఒక్కోరకంగా... ఐక్యంగా ఉన్నవాళ్లు ఎవరికి వారే విడిపోయి ఇలా టిక్కెట్ల కోసం నేతల దగ్గర యాచిస్తుండటం వారిని ప్రసన్నం చేసుకునేందుకు పడరానిపాట్లు పడుతుండటంతో ఢిల్లీ పెద్దల నుంచి గల్లీ నేతల దాకా విద్యార్థులంటే చులకనైపోయారు. వీరి ఆపసోపాలు గమనిస్తున్న ప్రజల్లోనూ పలుచనైపోయారు. పార్టీ పెట్టకపోయినా ఫ్రంట్‌గా కదిలినా విద్యార్థులను ప్రజలు, ప్రజాసంఘాలు ఆదరించేవారు. ఐక్యంగా ఉండి రాజ కీయ పార్టీ వలే 'లాబీయింగ్' చేసినా ఈ దుస్థితి దాపురించేంది కాదు. ఇప్పుడు కాకపోతే మరో పదేళ్లు, ఇరవయ్యేళ్లకైనా నవ తెలంగాణలో సరికొత్త రాజకీయాలకు నాంది అయ్యేది.
n కొంగర మహేష్
రీసెర్చ్ స్కాలర్, జర్నలిజం డిపార్ట్‌మెంట్, ఓయూ

Andhra Jyothi Telugu News Paper Dated: 3/4/2014