Saturday, December 20, 2014

మనం మరిచిన ‘మూల’ యోధుడు (శ్యాం సుందర్‌) - ఎ.ఎన్‌. నాగేశ్వర రావు

మనం మరిచిన ‘మూల’ యోధుడు - ఎ.ఎన్‌. నాగేశ్వర రావు

శ్యాం సుందర్‌ లాంటి అనితర సాధ్యమైన విప్లవ కారులు, మేధావులు చాలా అరుదు. సమాజం ఆయన్ని సరైన రీతిలో అర్థం చేసుకోకపోవడమే కాకుండా, వారి జీవితకాలంలో సరయిన గుర్తింపునూ ఇవ్వకపోవడం దురదృష్టకరం. దేశంలో వర్గం, కులం అని విడదీయబడిన శక్తులు నేడు చావోరేవో తేల్చుకొనే పరిస్థితి ఏర్పడింది. సమైక్యతకు గండిపడి, అగ్ర కులాల చేతుల్లో అధికారం కేంద్రీకరించబడిన స్థితిలో దళితులు, మైనారిటీలు, వెనకబడిన కులాలు తమ స్థైర్యాన్ని కోల్పోతున్నాయి. సనాతన సిద్ధాంతాలూ వివిధ రూపాలలో విజృంభిస్తున్నాయి. ఇలాంటి సంక్షుభిత స్థితిలో శ్యాం సుందర్‌ లాంటి వారి ఆలోచనలు, రచనల అవసరం ఉంది.
బలవంతులదే చరిత్ర. అగ్రవర్ణాలదే ఈ దేశ చరిత్ర. జ్ఞాతుల చరిత్ర తప్ప అజ్ఞాతుల చరిత్ర మనకు అక్కర్లేదు. చరిత్ర చీకటి గుయ్యారంలో ఎందరో అగుపడకుండా చిదిమేసిన చరిత్ర మనక్కావాలి. అలాంటి కోవలోనే మూల భారతీయ ఉద్యమ పితామహుఢు బత్తుల శ్యామసుందర్‌ చరిత్ర కూడా నిర్లక్ష్యానికి గురయింది. ఆయన రచనలు మరుగునపడ్డాయి. అలనాటి హైదరాబాదు సంస్థానంలోని ఔరంగాబాదులో 1908 డిసెంబరు 21న బత్తుల శ్యాంసుందర్‌ ఒక పేద దళిత కుటుంబంలో పుట్టారు. ఉస్మానియా విశ్వవిద్యాలయలంలో ఆర్థిక , రాజనీతి, న్యాయశాసా్త్రల్లో ఉన్నత విద్య అభ్యసించారు.
1930-34 సంవత్సరాల మధ్యలో నిమ్న జాతి యువతరాన్ని సమైక్యపరచి ‘యంగ్‌ మెన్స్‌ అసోసియషన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’ను స్థాపించారు. తద్వారా హైదరాబాద్‌ రాష్ట్రంలో దళితుల విద్య, ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యల గురించి పోరాటం సాగించారు. స్వదేశీ లీగ్‌ సభ్యునిగా, హైదరాబాద్‌ లైబ్రరీ సొసైటీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశాలకు బాబాసాహెబ్‌ అంబేద్కర్‌కు మద్దతుగా యూత్‌ లీగ్‌ ఆఫ్‌ అంబేద్కరైట్స్‌ స్థాపించారు. పి.ఆర్‌. వెంకటస్వామి, భాగ్యరెడ్డి వర్మ లాంటి సహచరులతో హైదరాబాద్‌లో దళితులకు ఎన్నో విద్యా వసతి సౌకర్యాల కోసం ఉద్యమించారు. నిజాం నవాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ, అతి సామాన్యమైన జీవితాన్ని గడిపారు. దళిత మైనారిటీ వెనకబడిన వర్గాల విముక్తి కోసం జాతీయ స్థాయిలో ఎన్నెన్నో సంఘాలను స్థాపించారు. సభలు, సమావేశాలు ఏర్పరచి నాటి జాతీయ ప్రాంతీయ నాయకులతో సన్నిహిత రాజకీయ సంబంధాలు కొనసాగించారు. 1946లో నిజాం ప్రభుత్వం నుంచి శాంతి సామాజిక సేవలకుగాను ఖుసురూ-ఎ-డక్కన్‌ అవార్డు, బంగారు పతకం అందుకున్నారు. గ్రాడ్యుయేట్‌ నియోజక వర్గం నుంచి హైదరాబాద్‌ శాసనసభకు, ఉస్మానియా సెనేట్‌ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. నిజాం రాష్ట్రంలో దళిత కులాల ప్రజా ప్రతినిధులను ఆ ప్రజలే ఎన్నుకునేందుకు వీలుగా ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ 24 వేల గ్రామాల నుంచి 50 వేల మందితో బ్రహ్మాండమైన ప్రదర్శన నిర్వహించారు. 1948లో హైదరాబాద్‌ రాష్ట్ర శాసనసభకు డిప్యూటీ స్పీకర్‌గా ఎంపికయ్యారు. దళితుల విద్యా వసతి సౌకర్యాల అభ్యున్నతి కోసం నిజాం నవాబును ఒప్పించి, హైదరాబాద్‌ శాసనసభచే ఆమోదింప చేసి, ఒక కోటి రూపాయల ఫండ్‌ను ఏర్పాటు చేయడంలో శ్యాంసుందర్‌ కీలక పాత్ర నిర్వహించారు. ఆనాటి కాలంలోనే ప్రత్యేక తెలంగాణ కోరుతూ... హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలని ప్రధాన మంత్రికి బహిరంగ లేఖ రాయడం చరిత్ర.
మరాట్వాడాలోని మిళింద్‌ కాలేజీ, విద్యా సంస్థల నిర్మాణానికి డాక్టర్‌ అంబేద్కర్‌ అభ్యర్థన మేరకు నిజాం నుంచి 12 లక్షల రూపాయలను విరాళంగా ఇప్పించారు. హైదరాబాద్‌ స్టేట్‌ ఇండియాలో విలీనం తర్వాత, ఆ 12 లక్షల రూపాయలను తిరిగి చెల్లించాలని అంబేద్కర్‌ మీద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోర్టులో కేసు పెట్టింది. ఆ కేసును న్యాయస్థానంలో సవాల్‌ చేసి శ్యాంసుందర్‌ వాదించి గెలిచారు. న్యాయస్థానంలో ఆయన వాదనా పటిమకు, ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి ఈ వ్యాజ్యం ఒక మచ్చు తునక. దేశవ్యాప్తంగా నిమ్న వర్గాల విద్యావసతుల కోసం డాక్టర్‌ అంబేద్కర్‌ ఏర్పాటు చేసిన పీపుల్స్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీకి ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యనిగా శ్యాం సుందర్‌ ఎంపికయ్యారు. తద్వారా దేశ వ్యాప్తంగా దళితులకు విద్యార్జన కోసం విద్యాలయాల ఏర్పాటులో తన వంతు సాయాన్ని కొనసాగించారు. కేవలం క ట్టుబట్టలతో, అద్దె గదిలో అత్తెసరి వసతులతో శ్యాంసుందర్‌ జీవితాన్ని అతి సామాన్యంగా గడిపారు. నిజాం నవాబు సన్నిహిత మిత్రడై ఉండి కూడా, ఎ ందరో సన్నిహితులు అత్యున్నత పదవుల్లో ఉండినా తన కోసం ఇసుమంతైనా వారిని ఉపయోగించుకోని అభిజాత్యం ఆయనది. ఒక సామాన్య బ్రహ్మచారి, మద్యపాన వ్యతిరేకి, కచ్చితమైన నియమాలతో, సూటిదనం, మచ్చలేని వ్యక్తిగా పేరుబడ్డ శ్యాంసుందర్‌ నిరాడంబరంగా ఉన్నతమైన జీవితాన్ని గడిపారు. ఉర్దూ, మరాఠీ, ఆంగ్లం, హిందీ, కన్నడ భాషలలో పండితులు. లక్షలాది మందిని సమ్మోహితులని చేసే ప్రసంగ శక్తి ఆయనది.
ఐక్యరాజ్య సమితికి హైదరాబాద్‌ రాష్ట్రం నుంచి 90 లక్షల మంది దళితుల ప్రతినిధిగా హాజరయి, వారి సమస్యల గురించి ప్రపంచ స్థాయి ప్రతినిధుల ముందు శ్యాంసుందర సవివరంగా ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని ప్రపంచ పత్రికలన్నీ పతాక స్థాయిలో ప్రచురించాయి. ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచి డైలీ ‘లీ మాండె’ మొదటి పేజీలో హోచిమెన్‌, శ్యాంసుందర్‌ ఫ్రెంచి ప్రధాని కలిసి ఉన్న ఫోటో, సంప్రదింపుల వివరాలు ప్రచురించిందని చెబుతారు. ప్రపంచ నాయకులతో వివిధ దేశాలలో వారి అతిథిగా శ్యాంసుందర్‌ గడిపారని, వారందరితో స్నేహ సంబంధాలు ఉండేవని తెలుస్తోంది. చౌ ఎన్‌ లై మన దేశాన్ని తొలిసారి సందర్శించినపుడు, ఆయన ప్రధాని నెహ్రూతో, హైదరాబాద్‌లో శ్యాంసుందర్‌ అనే మిత్రుణ్ణి కలవాల్సి ఉందని తె లిపారట.
హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో శ్యాం సుందర్‌ను ఢిల్లీ రప్పించారట. ప్రపంచ స్థాయి మేధావులు హెరాల్డు, జెలాస్కీ, జీన్‌ పాల్‌ సారె్త్ర వంటి వారితో శ్యాంసుందర్‌కు సన్నిహిత సంబంధాలు ఉండేవి. వీటన్నింటి వివరాలు తెలియాంటే ఆనాటి సమకాలీన పత్రికలు, ప్రాంతాలు, ఆధారాలు దొరకబుచ్చుకోవాలి. ఇదంతా సులభ సాధ్యం కాదు. ప్రభుత్వపరంగా ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి చేయాల్సిన బాధ్యత ఇది.
ఈ దేశంలో వాస్తవమైన దళిత ఉద్యమం ఏదయినా ఉందంటే అది శ్యాం సుందర్‌ 1948లో ప్రారంభించిన భీం సేన. సుశిక్షితులైన మిలిటెంట్‌ అంకిత భావం కలిగిన దళిత యువతను ఇందులో సమ్మిళితం చేసి, వారి ఆచరణ ద్వారా విప్లవకర భావజాలంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర ప్రాంతాలలో తమ ప్రభావాన్ని కొనసాగిస్తూ అంబేద్కర్‌కు వెన్నుదన్నుగా నిలిచారు. వాస్తవానికి భీంసేన కొనసాగించిన కార్యక్రమాలు మహారాష్ట్రలోని దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమానికి మాతృకగా పనిచేసింది. తద్వారా యావద్భారతదేశ దళిత ఉద్యమానికి భీం సేన ఉద్యమం వేగుచుక్కగా పనిచేసింది.
వాస్తవాల మీద, న్యాయం పునాదుల మీద నిలబడి పీడిత వర్గాల పక్షాన పోరాడే ఆత్మరక్షణ దళంగా భీం సేనను శ్యాంసుదర్‌ తయారు చేశారు. భీం సేనకు ప్రణాళిక-నియమ నిబంధనలు తయారు చేసి వాటిని దళిత యువతరంలో విస్తృతంగా ప్రచారం చేసి సైనికులను తయారు చేశాడు. తరతరాలుగా సైనిక జాతిగా ఉండిన దళిత జాతితో మాజీ సైనికులతో భీంసేన సభ్యులకు తర్ఫీదునిప్పించారు. తనే స్వయంగా రాజకీయ సిద్ధాంతాల గురించి ప్రసంగాలు చేసేవారు. అంబేద్కర్‌ రచనలు విస్తృతంగా భీం సేన ప్రచారంలోకి తెచ్చింది. తమను తాము మూల భారతీయులుగా ఆయన ప్రకటించారు. తన మహత్తర రచన ‘మూల భారతీయులు‘లో దళితుల గురించి చెబుతూ ‘అనాగరికులైన ఆర్యుల రాకకు ముందు ఈ దేశాన్ని పాలించిన పాలకులం మేము. మేం మూల భారతీయులం ఎన్నటికీ హిందువులం కాము. సరికదా భారత దేశంలో హిందూ రాజ్యం ఏర్పడడానికి ఏ రకంగానూ సహకరించం.
అంతేకాదు హిందూ రాజ్యాన్ని ధ్వంసం చేయడానికి ఏ అవకాశమొచ్చినా విడిచి పెట్టం’ అని అంటారు శ్యాం సుందర్‌. డాక్టర్‌ అంబేద్కర్‌ ప్రసిద్ధ రచన ‘కుల నిర్మూలన’లో ప్రతిపాదించిన సిద్ధాంతాలను శ్యాం సుందర్‌ మరింత విస్తృతపరచి ఎన్నో చారిత్రాత్మక గ్రంథాలను రచించడం జరిగింది. కర్ణాటకలో భీం సేన హిందూ కులోన్మాదుల ఆగడాలను అడ్డుకుంది. దళిత కులాల యువత తల పై కెత్తుకొని నడిచే ఆత్మస్థైర్యాన్నిచ్చింది. దళితులు చైతన్యవంతులవడంతో భూస్వామ్యవర్గాలయిన లింగాయత్‌, గౌడ వర్గాలు దళితుల పట్ల అత్యాచారాలు చేసేందుకు జంకారు.
దళిత-ముస్లిం ఐక్య సంఘటన అనేది దేశంలోనే ఒక వినూత్నమైన అత్యవసర విముక్తి సిద్ధాంతంగా, శ్యాంసుందర్‌ మేధోశక్తికి ప్రతీకగా నిలిచింది. సమాజపు అట్టడుగు చీకటి కోణం నుంచి ఎంతో శ్రద్ధాసక్తులతో పరిశోధించడం మూలంగా, ఈ రెండు జాతులు అణచివేతకు గురయి, నేడు ఒకే రకమైన సామాజిక అసమానతలకు లోనయ్యారని శ్యాంసుందర్‌ ఆధారాలతో నిరూపించడం జరిగింది. దేశ చరిత్రలో నిరంతరం పీడింపబడ్డ ఈ రెండు జాతులు ఐక్యమై ఒక బలీయమైన శక్తిగా ఎదిగి, సామాజిక ఆర్థిక విప్లవాన్ని వేగవంతం చేసి భారత దేశ నిజమైన విప్లవాన్ని విజయవంతం చేయాలనేది శ్యాం సుందర్‌ కోరిక. దళిత సమస్యకు పరిష్కారం కనుక్కొనే మార్గంలో భాగంగా ముస్లింలను మిత్ర సహిత బంధంగానూ, హిందూ అగ్రకులాలను శత్రుపూరితంగానూ సిద్ధాంతీకరించాడు. దానితో సనాతన హిందువులు శ్యాంసుందర్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు.
హైదరాబాద్‌ విలీనం అనంతరం ఆయన మీద కేసులు పెట్టి అరెస్టు చేసి శారీరకంగానూ, మానసికంగానూ హింసకు గురిచేశారు. ఏటికి ఎదురీదడం, సమాజ రుగ్మతల మీద పోరాడడం విప్లవకారుల కర్తవ్యం. ఆ బాధ్యతను శ్యాం సుందర్‌ సమర్ధంగా నిర్వర్తించారు. హిందూ కులవాదులు ఆయన మీద బనాయించిన కుట్ర కేసుకు ఆయన సమాధానంగా ‘సజీవ దహనం’ అనే గ్రంథాన్ని రచించారు. అందులో దళితులు హిందువులు కారనే చారిత్రక వాస్తవాన్ని సజీవ సాక్ష్యాలతో భారత న్యాయస్థానానికి, తద్వారా యావద్భారత ప్రజానీకానికి బహిరంగంగా వెల్లడి ంచారు.
శ్యాం సుందర్‌ అభిప్రాయం ప్రకారం పీడిత జాతులకు, దళిత వర్గాలకు మతం ఎలాంటి పరిష్కారాన్ని చూపలేదు. చూపదు. కనుక మత వ్యవస్థ అనేది తిరోగమన మార్గం. కేవలం మతం మార్చుకున్నంత మాత్రాన దళితులకు సంబంధించిన సామాజిక, ఆర్థిక రాజకీయ సమస్యలు తీరుతాయని ఆయన భావించలేదు. మూల భారతీయులైన దళితులకు మతమనేది లేదు. కేవలం ముస్లింలను, క్రిస్టియన్లను ఎదుర్కోవడం కోసం సంఖ్యాబలం కోసం దళితులను హిందువులుగా సనాతన హిందువులు కోరుతున్నారు. ఇది రాజకీయంగా హిందువులకు అవసరం. హిందూ మహాసభ దేశంలో కుల నిర్మూలనా సంఘాలు స్థాపించడం వెనుక అసలు ఉద్దేశం ఇదే. వీరి తొలి కార్యక్రమం దళితులకు హిందువులమనే స్పృహ కలిగించడం. తర్వాత దేవాలయ ప్రవేశం లాంటి పై పై పూతలు, వీటివల్ల దళితుల ఆర్థిక సామాజిక రాజకీయ వివక్ష, తరతరాల వెనుకబాటుతనం పోతాయా? శ్యాం సుందర్‌ హేతుబద్ధమైన తీవ్ర వాదనల ద్వారా, రచనల ద్వారా గొప్ప చర్చను లేవదీశారు. కానీ ఆయన రచనలన్నీ నేడు చార్వాకులు రచనల్లా చీకటిలో చిదిమి వేయబడ్డాయి. వాటిని దొరకబుచ్చుకునే ప్రయత్నం మన తరమన్నా చేయగలిగితే, ఒక మేధావి అంతరంగాన్ని, దేశ సమస్యలపై ఆయన వైఖరిని, వివిధ రకాల మార్గాంతరాలను మనం తెలుసుకోగలం. తద్వారా ఆయన ఉద్యమించిన చరిత్ర బహిర్గతపరచగలుగుతాం.
కర్ణాటక విధానసభలో సభ్యునిగా శ్యాం సుందర్‌ కానసాగినంత కాలం పీడితుల పక్షాన చిచ్చర పిడుగులా పోరాడారు. కర్ణాటక శాసనసభలో నిమ్న వర్గాలకు విద్యా భూసంస్కరణలకు సంబంధించి విస్తృతంగా చర్చించినట్లు ఆయన సమకాలికులు ఇప్పటికీ చెబుతుంటారు. కర్నాటక రాషా్ట్రనికి భూ సంస్కరణల మార్గదర్శిగా శ్యాం సుందర్‌ని పేర్కొంటారు. ఆయన శాసనసభలో చేసిన కీలకమైన ఉపన్యాసాలను కన్నడంలో ముదించడం జరిగింది. కర్ణాటకలో ఆయన స్థాపించిన భీం సేన బలవత్తరమైన విముక్తి సేనగా రూపుదిద్దుకుంది. శ్యాం సుందర్‌ నేతృత్వంలో మెరికల్లాంటి దళిత యువకులు వేలాది మంది సుశిక్షితులుగా మారిన చరిత్ర ఉంది. శ్యాంసుందర్‌ మహారాష్ట్రలో పర్యటిస్తున్నప్పుడు బొం బాయిలోని ఒక దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, భీంసేనను కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే 10వేల మంది సభ్యులు ఉన్నట్లు, సభ్యులంతా నెలకు పదిపైసలు చెల్లిస్తారనీ, మొత్తం దేశవ్యాప్తంగా రెండు లక్షల మంది సభ్యులుంటారని తెలిపారు. మాజీ సైనికులతో స్వయం రక్షణకు సంబంధించి సైనిక శిక్షణను భీం సేన సభ్యులకు అందజేశారు. భీం సేనకు తన సొంత రాజ్యాంగం, జెండా, అజెండా ఉన్నా యి. నిమ్న వర్గాల మీద, దళితుల మీద ఎక్కడ అకృత్యాలు, అత్యా చారాలు జరిగినా భీం సేనకు సమాచారం తెలిసిన వెంటనే అక్కడి ప్రజలకు సహకారంగా రంగంలోకి దిగేది. ఈ సంస్థ కాన్షీరాం తర్వాత కాలంలో స్థాపించిన బాంసెఫ్‌కు మాతృకగా అనిపిస్తుంది
శ్యాం సుందర్‌కు దేశవ్యాప్తంగా రాజకీయ రంగంలో మిత్రులుండేవారు. ఆయన బెంగుళూరులో బస చేసినపుడు వి.వి.గిరి, దేవరాజ్‌ అర్స్‌, ఉమా శంకర్‌ దీక్షిత్‌ లాంటి వాళ్ళు ఎక్కువగా కలిసేవాళ్లు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ధరంసింగ్‌, ఎస్‌.యం.కృష్ణ లాంటి వాళ్ళు మల్లిఖార్జున్‌ ఖర్గె, మొయిలీ లాంటి వాళ్ళు ఆయనకు శాసనసభలో యువ సహచరులు. ఎందరో యువ శాసనసభ్యులు శ్యాం సుందర్‌ ఉపన్యాసాలను, ఆయనతో సాహచర్యాన్ని అభిలషించేవారు. ఆయన గంటల తరబడి దళితుల వెనుకబడిన వర్గాల, మైనారిటీల సమస్యల గురించి చర్చిస్తున్నపుడు వారు ఉత్తేజంతో ఆయన అనుయాయులుగా ఉండేవారని చెబుతారు. హిందీ, ఆంగ్ల, ఉర్దూ, కన్నడ, తెలుగు భాషల్లో ఆయన రచనలు వెలువడ్డాయి. ‘భూ దేవతోంకా మేనిఫెస్టో’, ‘దే బర్న్‌’, భీం సేన అవర్‌ పాస్ట్‌ అండ్‌ ప్రజెంట్‌’ ముఖ్యమైన రచనలు అనేకం ఉన్నాయి.
శ్యాం సుందర్‌ లాంటి అనితర సాధ్యమైన విప్లవ కారులు, మేధావులు అరుదు. సమాజం వారిని సరైన రీతిలో అర్థం చేసుకోకపోవడమే కాకుండా, వారి జీవితకాలంలో సరయిన గుర్తింపును కూడా ఇవ్వకపోవడం దురదృష్టకరం. దేశంలో వర్గం, కులం అని విడదీయబడిన శక్తులు చావోరేవో తేల్చుకొనే పరిస్థితి ఏర్పడింది. సమైక్యతకు గండిపడి, అగ్ర కులాల చేతుల్లో అధికారం కేంద్రీకరించబడిన స్థితిలో దళితులు, మైనారిటీలు, వెనకబడిన కులాలు తమ స్థైర్యాన్ని కోల్పోతున్నాయి. నేడు సనాతన సిద్ధాంతాలు వివిధ రూపాలలో విజృంభిస్తున్నాయి. ఇలాంటి సంక్షుభిత స్థితిలో శ్యాం సుందర్‌ లాంటి వారి ఆలోచనలు, రచనల అవసరం ఉంది.
- ఎ.ఎన్‌. నాగేశ్వర రావు
(నేడు బత్తుల శ్యాంసుందర్‌ జయంతి)
Andhra Jyothi Telugu News Paper Dated: 21/12/2014 

Saturday, December 6, 2014

కుల, వర్గ రహిత సమాజమే అంబేద్కర్‌ అభిమతం By జి. రాములు


            డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ భారతదేశం గర్వించదగ్గ సామాజిక విప్లవకారులలో అగ్రగ ణ్యుడు. గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశ రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, సాహిత్య రంగాలలో అంబేద్కర్‌ ప్రభావం అనన్యసామాన్య మైంది. తరతరాలుగా కులపీడనకు గురై, సమాజం నుంచి వెలివేయబడిన బానిసత్వం కంటే హీనంగా చూడబడుతున్న అస్పృశ్య అణగారిన ప్రజలకు ఆయన ఆరాధ్యదైవంగా నిలిచిపోయాడంటే ఆయన గురించి లోతుగా అధ్యయనం చేయాల్సిందెంతో ఉంది. అంబేద్కర్‌ దళితునిగా జీవించడమే కాదు అంటరాని తనం, కుల వివక్షలకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడాడు. తాను స్వయంగా పేదరికాన్ని అనుభవిం చాడు. భూస్వామ్య విధానం దుష్టస్వభావాన్ని గ్రహించాడు. దానికి వ్యతిరేకంగా పోరాడాడు. సమ సమాజం కావాలన్నాడు. 'బోధించు, సమీకరించు, పోరాడు' అన్న అంబేద్కర్‌ నినాదం ఎంతో ప్రఖ్యాతి గాంచింది. ఆయన తన అభిప్రాయాలను నిర్భయం గా బోధించాడు. వాటి అమలుకై సమీకరించాడు. లక్ష్య సాధనకై నిరంతరం పోరాడాడు. చాలా మంది అంబేద్కర్‌ రచనలను అధ్యయనం చేయకుండానే కేవలం కుల సమస్య గురించే ఆయన అధ్యయనం చేశాడని, అంటరాని వాడు కాబట్టి అంటరానితనానికి వ్యతిరేకంగా కృషి చేశాడని, దళితుల రిజర్వేషన్లకై కృషి చేశాడనే చులకన భావన కలిగి ఉన్నారు. కానీ ఆయనకు దేశ ఆర్థిక విధానం, ప్రభుత్వ స్వభావం, ఉత్పత్తి సాధనాలు, కార్మికోద్యమం, భూస్వామ్య విధానం, స్త్రీ సమస్యలు, ఫాసిజం, దేశ సమగ్రత, కుల వ్యవస్థ, దాని అమానుషత్వం పట్ల స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. ఆయన అభిప్రాయాలతో ఏకీభవించొచ్చు లేదా విభేదించొచ్చు. కానీ ఆయన వాటన్నింటినీ అధ్యయనం చేసింది, తనదైన రీతిలో భాష్యం చెప్పింది సుస్పష్టం. అంబేద్కర్‌ చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలనే పరిశీలిద్దాం. ఉత్పత్తి గుర్తించాలన్నాడు. ప్రజలందరికీ భూమిపై సమాన హక్కులుండాలన్నాడు. కులమతాలకతీతంగా భూములను కౌలుకివ్వాలన్నాడు. గ్రామాల్లో భూస్వామిగాని, కౌలుదారుగాని, వ్యవసాయ కూలీలు గాని ఉండరాదన్నాడు. అందరూ సమానమే అన్నాడు. అందరూ ఉత్పత్తిలో భాగం కావాలన్నాడు. ప్రభుత్వమే నీరు, పని చేసే పశువులు, పరికరాలు, ఎరువులు, విత్తనాలు అందజేయాలన్నాడు. అందు కయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలన్నాడు. భూస్వామ్య విధానం సమాజ పురోగతికి ఆటంకమ న్నాడు. చెప్పడమే కాదు భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాడాడు. ఆనాటి మహారాష్ట్రలోని 'కొంకణ' ప్రాంతంలో భూమి మీద హక్కులు 'ఖోటీ'లనబడే భూస్వామ్య వర్గ చేతుల్లో ఉండేవి. వారు రైతులపై శిస్తు రూపాన అధికంగా డబ్బు వసూలు చేసేవారు. అదే విధంగా పండించిన పంటలో కూడా దౌర్జన్యంగా భాగం తీసుకునేవారు. ఇది కొన్ని దశాబ్దాలపాటు కొనసాగింది. ఈ 'ఖోటీ' పద్ధతికి వ్యతిరేకంగా అంబేద్కర్‌ రైతు ఉద్యమాన్ని నడిపాడు. అటు ఉద్యమాన్ని నిర్మిస్తూనే మహారాష్ట్ర శాసనసభలో తానే 'ఖోటీ' నిర్మూలన కొరకు 1937లో బిల్లు ప్రవేశపెట్టాడు. అది చివరకు 1949లో చట్ట రూపం ధరించే వరకూ పోరాడాడు. అదే విధంగా 'దేశ సౌభాగ్యం దేశ పారిశ్రామికీకరణ మీద ఆధారపడి ఉంది. జాతీయ యాజమాన్యంలో అది జరగాలేకాని ప్రయివేటు వ్యక్తుల పరంగా కాదు' అంటూ ప్రైవేటీకరణను అంబేద్కర్‌ ఖండించాడు.
               దేశంలో ప్రస్తుతమున్న కుల, వర్గ పీడనకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి కార్మికవర్గమే నాయకత్వం వహించాలన్నాడు. 'దేశానికి నాయక త్వం అవసరం. అయితే ఆ నాయకత్వాన్ని వారు వహిస్తారా అన్నది ప్రశ్న. దేశానికి అవసరమైన అలాంటి నాయకత్వాన్ని శ్రామికవర్గం మాత్రమే సమకూర్చగలదని చెప్పడానికి నేను సాహసిస్తు న్నాను' అని 1942 డిసెంబర్‌లో 'శ్రామికవర్గం- ఆదర్శవాదం' అనే విషయంపై మాట్లాడుతూ స్పష్టం చేశారు. కార్మికవర్గ సమస్యలు ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. కార్మికవర్గ భవిష్యత్తుకు సాంఘిక న్యాయం, సాంఘిక భద్రత పునాదులు కావాలని, పటిష్టమైన కార్మిక చట్టాలు దోహదపడుతాయని భావించాడు. అందుకు ముఖ్య చట్టాలైన కనీస వేతనాల చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, కార్మిక సంఘాల గుర్తింపు చట్టాల కొరకు కార్మికుల ప్రతినిధిగా ప్రభుత్వ కమిటీలలోనూ, లాయర్‌గా కోర్టులోనూ, చట్టసభల్లో సభ్యునిగానూ అవిరళ కృషిచేశాడు.
            డాక్టర్‌ అంబేద్కర్‌కు ఫాసిజం ప్రమాదం పట్ల స్పష్టమైన అభిప్రాయం ఉంది. అది మానవాళి మనుగడకు ముప్పని గ్రహించాడు. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో ఆయన 1942లో ఆకాశవాణిలో చేసిన ప్రసంగం గమనిస్తే 'ఈనాడు జరుగుతున్న రెండవ ప్రపంచ యుద్ధం కేవలం ప్రపంచాల విభజన కోసం మాత్రమే కాదు. నియంతృత్వం మీద విజయం సాధించి స్వేచ్ఛా సమానత్వాలు నెలకొల్పడానికి మన కార్మికులు తమ సంపూర్ణ మద్దతివ్వాలి. సాధించబోయే విజయం నూతన, సామాజిక వ్యవస్థకు దోహద పడాలి. స్వాతంత్య్రం సాధించినంత మాత్రాన సరిపోదు స్వాతంత్య్ర ఫలితాలు మనం నిర్మించుకోబోయే సమతా సమాజం మీద ఆధారపడి ఉండాలి' అంటూ ఫాసిజానికి వ్యతిరేక పోరాటంలో కార్మికవర్గ ప్రయోజనాలు ఎలా ఉపయోగించుకోవాలో కూడా సూచించాడు. డాక్టర్‌ అంబేద్కర్‌ దేశ సమగ్రత కాపాడాలని కోరాడు. కులాలు, మతాలు, జాతులు, అనేక సంస్కృతులున్న ఈ దేశంలో ఐక్యంగా ఉంటేనే ప్రయోజనమని భావించాడు. 'పాకిస్తాన్‌'లాగా 'దళితస్తాన్‌' 'హరిజన్‌స్థాన్‌' లాంటి నినాదాలివ్వడం ఆ రోజుల్లో పెద్ద సమస్యేమీ కాదు. అయినా ఇవ్వలేదంటేనే ఆయనకు దేశ సమగ్రతపట్ల ఉన్న చిత్తశుద్ధి ద్యోతకమవుతుంది. కుల, వర్గ దోపిడీ లేని రాజ్యం కావాలన్నాడు. అలాంటి రాజ్యం కావాలంటే దానంతటదే రాదన్నాడు. అందుకు పోరాటమే శరణ్యమన్నాడు. రాజ్యాధికారమే పీడిత వర్గాల సామాజికాభివృద్ధికి ఏకైక మార్గం. రాజ్యాధికారం లేకుండా మన అభివృద్ధి అసంభవం అని స్పష్టంగా చెప్పాడు.
స్త్రీలు భారత సమాజంలో నికృష్టమైన జీవితాలు గడుపుతున్నారని 'ప్రతి స్త్రీని శాస్త్ర దాస్యం నుండి విముక్తి' చేయాలన్నాడు. ఈ లక్ష్యం చేరుకునే క్రమంలో 'హిందూకోడ్‌' బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాడు. ఆనాటి సనాతన, సంప్రదాయ అగ్రకుల పాలకులు నిరాకరించారు. ఆ బిల్లు ఆమోదానికి తోడ్పడని ప్రధాని నెహ్రూ వైఖరికి నిరసనగా కేంద్రమంత్రి పదవికే రాజీనామా చేసిన ఆదర్శవంతుడు, త్యాగశీలి అంబేద్కర్‌. శ్రామిక మహిళల 'ప్రసూతి ప్రయోజనాల చట్టం' కొరకు పోరాడిన వారిలో డాక్టర్‌ అంబేద్కర్‌ ముందుపీఠిన ఉన్నాడు. ఈ దేశం అభివృద్ధి కాకపోవడానికి, శ్రామికులంతా ఐక్యం కాకపోవడానికి, దోపిడీ కొనసాగటానికి కుల వ్యవస్థ పెద్ద ఆటంకమని గుర్తించాడు. అందుకే కుల సమస్యలపై ప్రత్యేకంగా ఆయన పరిశోధన చేశాడు. రాజ్యాధికారానికై శ్రమజీవులను ఐక్యం కాకుండా చేస్తున్న ప్రతిబంధ కాల్లో కుల వ్యవస్థ చాలా కీలకమైందిగా గుర్తించాడు. దేశంలో శ్రమ విభజనే కాదు శ్రామికుల మధ్య విభజన అనే తరతరాల అగాధం ఉందన్నాడు. ఇది అగ్రకుల దోపిడీ వర్గాల రక్షణకు పెట్టనికోటలా ఉందన్నాడు. శ్రామికుల మధ్య ఐక్యతకై ప్రత్యేక ప్రయత్నం, నిరంతర ప్రయత్నం జరగాలన్నాడు. 'విప్లవం తేవడానికి భారతదేశంలోని కార్మికవర్గ ప్రజలంతా ఏకం అవుతారా? నా దృష్టిలో ఆ శక్తి ఒక్కటే... అదేమిటంటే తనతోపాటు విప్లవంలో పాల్గొంటున్న వారిలో ఒకరి పట్ల ఒకరు సంపూర్ణ విశ్వాసం చూపగల్గాలి' అన్నాడు. 'మనుషులు తరతరాలుగా సాంఘిక అణచివేతకు గురవుతున్నారు. ఆస్తి సమానత్వం కొరకు మాత్రమే విప్లవంలో పాల్గొనరు. విప్లవం సాధించిన తర్వాత కుల, మత భేదాలు లేకుండా సమానత్వంగా చూడబడతామనే గ్యారంటీ ఉంటేనే అరమరికలు లేకుండా విప్లవోద్యమంలో పాల్గొంటార'న్నాడు.
అందుకే 'కుల నిర్మూలన' అనే చారిత్రాత్మకమైన గ్రంథంలో అనేక విషయాలు రాశాడు. భారతదేశం సామాజిక విప్లవోద్యమ ఆవశ్యకత మిగతా దేశాల న్నింటి కంటే ఎక్కువగా ఉందని భావించాడు. సామాజిక ఉద్యమంలో కీలకమైనది 'కుల వ్యవస్థ వ్యతిరేక పోరాటం' అని భావించాడు. స్వకుల వివాహాలే కులవ్యవస్థను కొనసాగించడంలో కీలక పాత్ర వహిస్తున్నాయని, అందుకు స్వకుల వివాహా లను నిరుత్సాహపర్చాలని విస్తృతంగా ప్రచారం చేశాడు. ఏదైనా పోరాడితేనే పోతుందని, కాబట్టి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడితేనే కులం బలహీన పడుతుందన్నాడు. కుల వ్యవస్థ బలహీన పడటం వర్గ ఐక్యత పటిష్టతకే తోడ్పడుతుందన్నాడు. కుల వ్యవస్థ వర్గ దోపిడీని రక్షిస్తుందన్నాడు. వాస్తవానికి కమ్యూని స్టుల అభిప్రాయాలకు అంబేద్కర్‌ ఆలోచనలకు సామీప్యమే ఎక్కువ. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు 1998 నవంబర్‌ 20న ఆంధ్రజ్యోతికిచ్చిన ఇంటర్వ్యూలో 'అంబేద్కర్‌ అభిప్రాయాలకు, కమ్యూనిస్టుల అభిప్రాయాలకు పెద్దతేడా లేదు. కొన్ని విషయాల్లో కమ్యూనిస్టుల కన్నా ముందున్నారు కూడా. దేశంలో ఉన్న భూమిని జాతీయం చేయాలని చెప్పడం ఎంతో ముందు చూపుతో కూడింది. హిందూ ధర్మశాస్త్రాలను తూర్పారాపట్టాలని, వాటిని ఓడిస్తే తప్ప కుల వ్యవస్థ పోదని చెప్పడం అంబేద్కర్‌ చాలా ప్రధానంశంగా తీసుకున్నాడనే అంశాన్ని రుజువు చేస్తుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయాధికారం కావాలన్నారు. నిజానికి కమ్యూనిస్టులతో అత్యంత చేరువగా అభిప్రాయమున్న వ్యక్తి అంబేద్కర్‌. అయితే రాజ్యాంగ యంత్రం, ప్రజాస్వామ్యం, తదితర విషయాల్లో కొన్ని విభేదాలున్నాయి' అని చెప్పిన అంశాలు సదా గమనంలో ఉండటం అవసరం.
             డాక్టర్‌ అంబేద్కర్‌ 58వ వర్ధంతి సందర్భంగా నిజమైన నివాళి అర్పించడమంటే కుల, వర్గ రహిత సమాజం కొరకు పోరాడటమే. 

Prajashakti Telugu News Paper Dated: 05/12/2014 

Friday, December 5, 2014

చెదలు పట్టిన చైతన్యం - డా. ఎం.ఎఫ్‌. గోపీనాథ్‌



‘మన రాష్ట్రం-మన పాలన’ అనుకున్న మూడవ రోజు నుంచే రైతుల బతుక్కి భరోసా లేక 480 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. ఉద్యమానికి ఊపిరిలూదిన ఉస్మానియా విద్యార్థుల్ని ‘నియామకాలు-నిధులు-నీళ్ళు’ నినాదాలు ఎక్కిరించి నిరాహారదీక్షకు నెట్టబడ్డారు. హైదరాబాద్‌ చుట్టూరా ఉన్న 21 లక్షల ఎకరాల భూమి బడా పెట్టుబడిదారులకు అధికారిక ధారాదత్తం కాబోతున్నది. దళితుల మూడు ఎకరాల భూమి నినాదం అమలు ‘చంద్ర’ మండలంలోనో లేక అంగారక గ్రహంలోనో సాధ్యమయ్యేట్లున్నది.
పాలక వర్గం మేధావుల్ని ఎంత ఎక్కువగా తనలో యిముడ్చుకుంటుందో, అంత స్థిరంగానూ, అంత ప్రమాదకరంగానూ దాని పాలన తయారవుతుంది.
- మార్క్స్‌
ఆంటోనియో గ్రాంసీ 1930ల్లో ఇటలీ సమాజంలో వస్తున్న మార్పుల్ని ఆ సమస్యల పట్ల మేధావుల స్పందనను గురించి వివరించే క్రమంలో మేధావుల్ని రెండు రకాలుగా విభజించాడు. వారినే సాంప్రదాయక మేధావులు, సజీవ మేధావులు అన్నాడు. సాంప్రదాయక మేధావులు యథాతథ వాదులు-పాలక వర్గ పక్షపాతులు. పాలక వర్గాల దోపిడీకి, అరాచకాలకు రంగులద్దుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించేవారు. ఈ కోవలకి చెందినవారే మతాధిపతులు, పూజారులు, సామాజిక శాస్త్రవేత్తలు/ఆర్థిక శాస్త్రవేత్తలు తదితరులూను. ప్రజల సమస్యల పట్ల సానుభూతి, సహా నుభూతి ఉన్న మేధావి వర్గం సాంప్రదాయ మేధావివర్గానికి భిన్నంగా ఉంటుంది. దీన్నే ఆర్గానిక్‌ ఇంటెలెక్చువల్స్‌/ సజీవ మేధావి వర్గం అన్నాడు గ్రాంసీ. ఉదాహరణకు వామపక్ష మేధావులు, తెలంగాణ మేధావులు మొదలగు వారు. సాంప్రదాయక మేధావులతో గానీ, సజీవ మేధావులతో గానీ సమస్య లేదు. సమస్య ఎప్పుడొస్తుంది? సజీవ మేధావులుగా చలామణీలో ఉన్న వామపక్ష, దళిత, తెలంగాణ మేధావులు ఏ ఉద్యమాల గురించి అయితే ప్రజలకు వివరించి, ప్రజల్ని భాగస్వాములుకండని ప్రభోదించారు కదా. మరి ఆ ఉద్యమాల్ని స్వార్థపరులు కొందరు హైజాక్‌చేసి, నిరంకుశ నాయకులుగా తయారయ్యారో, తయారవుతున్నారో ఆ నిరంకుశత్వాన్ని నిరసించవల్సిన ఈ సజీవ మేధావులు సడెన్‌గా బ్రెయిన్‌లెస్‌/ స్పైయిన్‌లెస్‌ మృత జీవులుగా మారిపోతున్నప్పుడు తప్పక సమ స్య వస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో గానీ, తెలంగాణ రాష్ట్రం కొరకు జరిగిన పోరాటంలో గానీ పాల్గొన్న ‘వామపక్షం’ బురఖా వేసుకొన్న మేధావులు, తెలంగాణ ఉద్యమ ముసుగు వేసుకొన్న భూస్వామ్య బ్రాహ్మణీయ శక్తులకు అన్ని విధాల తమ సహాయ, సహకారాలందించారు. సామాజిక తెలంగాణ, ప్రజాస్వామ్య తెలంగాణకు ప్రతిగా కుట్రపూరిత దొరస్వామ్య అనుకూల ‘గెట్టు’ తెలంగాణకే మద్దతుపలికారు. మొదట తెలంగాణ రానియ్యండన్న మోసపూరిత వాదనతో తెలంగాణలోని సోషల్‌ ఆర్గనైజేషన్స్‌ అన్నింటినీ నిర్వీర్యం చేసారు. వామపక్ష విప్లవ పార్టీలకు మద్దతుదారులుగా చలామణి అవుతున్న కొందరు మేధావులు. తెలంగాణ భూస్వామ్య ప్రతినిధి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఏకంగా సివిల్‌ లిబర్టీస్‌ మీటింగ్‌కి గౌరవ అతిథిగా ఆహ్వానించారు.
ఈ మేధావులు ఎందుకు యింతగా దిగజారారు? మావోయిస్ట్‌ ఎజెండానే మా ఎజెండా అన్న కేసీఆర్‌ సాధారణ ప్రజాస్వామ్య హక్కు అయిన సభ జరుపుకునే హక్కుని గూడా (గత సెప్టెంబర్‌ 21న) దక్కనియ్యలేదు. మరి తెలంగాణ మేధావి వర్గం నోరెందుకిప్పట్లేదు? ఇవి క్రోనీ కేపిటలిజం రోజులు. క్రోనీ కాపిటలిజం (ఆశ్రిత పెట్టుబడి), క్రోనీ మేధావుల్ని (ఆశ్రిత మేధావుల్ని) తయారు చేసుకుంది. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యల సందర్భంలో గానీ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ‘బి’ కేటగిరీ విద్యార్థుల ఫీజు ఉమ్మడి రాష్ట్రంలోను, పక్క రాష్ట్రంలోను అంతకు ముందున్న రూ.5 లక్షల 25వేల నుంచి అకస్మాత్తుగా రూ.9.5 లక్షల నుంచి 12 లక్షల వరకు పెంచినప్పుడు కానీ నోరెత్తని తెలంగాణ ఉద్యమ మేధావివర్గం మౌనాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? తెలంగాణ రైతులు అనుభవిస్తున్న కరెంట్‌ కష్టాల్ని తీర్చడానికి మూడు సంవత్సరాలు అవసరమా? ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంతో కుదుర్చుకున్న 1000 మెగావాట్ల కరెంట్‌ని తెలంగాణ రైతులకు అందించటానికి, కరెంట్‌ స్తంభాలు, వైర్లు వేయడానికి మూడు సంవత్సరాలు పడ్తాయా? అంతకన్నా సులువైన మార్గం తెలం గాణ విద్యుత్‌ ఉద్యోగ మేధావులు సూచించలేరా? తెలంగాణ ప్రభుత్వం-ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాల మధ్య జరిగిన సామరస్య ఒప్పందాల్ని కేంద్రప్రభుత్వం తనకు నష్టం లేనంతవరకు ఒప్పుకుని తీరుతుంది. ఉన్న కరెంట్‌లైన్ల ద్వారానే రామగుండం నుంచి కేంద్రానికి వెళ్ళే భాగాన్ని తెలంగాణకి మళ్ళించి వెంటనే తెలంగాణ రైతు ఆత్మహత్యల్ని ఆపవచ్చు. మరి ఇంతటి ప్రాముఖ్యం ఉన్న విషయాన్ని తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన మేధావివర్గం చర్చకెందుకు పెట్టడం లేదు? ప్రత్యేక రాష్ట్రం వస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ‘తెలంగాణ జిందా తిలిస్మాత్‌’ని ప్రజాసమూహాల మెదళ్ళకి నిత్యం పూసిన మేధావివర్గం యిప్పుడు పట్టిన మౌన వ్రతానికి అర్థం ఏమిటి? రైతు ఆత్మహత్యలు పక్క రాష్ట్రంలో లేవా అని ప్రశ్నించే మేధావి వర్గం, కాంగ్రెస్‌, టీడీపీ పాలన వల్లనే ఈ ఆత్మహత్యలు అంటున్న తెలంగాణ మీడియా, కాంగ్రెస్‌ని, టీడీపీని ఓడించి టీఆర్‌ఎస్‌కి అందుకే కదా పట్టం కట్టామని గజ్వేల్‌లోనే ఓ రైతు నిలదీసినప్పుడు ఏమి సమాధానం చెప్పారు? దొరసాని బతుకమ్మకి పది కోట్లు, మెట్రోపాలిస్‌ డ్రింకింగ్‌-డ్యాన్సింగ్‌ పార్టీకి 500 కోట్లు ఖర్చుపెట్టిన తెలంగాణ ప్రభుత్వానికి ఆత్మహత్యలు చేసుకొన్న రైతు కుటుంబాన్ని ఓదార్చే, బతుకు భరోసా ఇచ్చే టైం గానీ లేదా? రైతు కుటుంబాల బాకీలు గరిష్ఠంగా మూడు లక్షల దాకా ఉంటాయేమో. ఆ మాత్రం అయినా అందించి బజారున పడ్డ ఆ కుటుంబాలను ఆదుకోవచ్చు. ఆ మేరకు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన మేధావులు రాష్ట్ర ముఖ్యమంత్రిని ‘బాంచెన్‌ దొరా అప్పుల పాలైన మన రైతుల బాకీ తీర్చి రైతుల బతుక్కి భరోసా యివ్వండని’ అయినా ప్రాధేయపడవచ్చు తప్పులేదు!
దళితులకు మూడెకరాల భూమి, పెట్టుబడి ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో తొలి దళిత ముఖ్యమంత్రి లాంటి నినాదమేనని యిప్పటికే స్పష్టమయింది. మహబూబ్‌నగర్‌లో పంచిన పట్టాలు (భూమికాదు) పట్టుకొని ‘మూడు ఎకరాలు’ భూమెక్కడుందా ఆని వెదుకుతున్నారు దళితులు. దివంగత రాజశేఖర్‌ రెడ్డి అన్నట్లు దళితులకు భూ పంపిణీ ‘ఒక నిరంతర ప్రక్రియ’ అంటే అది ఎప్పటికీ ముగియదు. తెలంగాణ భూమండలం మీద భూమి దొరకట్లేదు కాబట్టి, ‘చంద్ర’ మండలంలోనో, అంగారక గ్రహంలోనో దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానంటారేమో కేసీఆర్‌!
అరవై సంవత్సరాల మన తల్లి తెలంగాణ దాస్య శృంఖలాలు తెంపి వలస పాలకుల కబంధ హస్తాల చెరనుంచి ‘గెట్టు’ తెలంగాణని మాత్రమే సాధించుకున్నామన్న విషయం మరచిపోవద్దు. తెలంగాణ వెనుకబాటుతనానికి కారకులైన ఏ భూస్వామ్య వర్గాలు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి తరిమివేయబడ్డారో ఆ దొరల చేతిలోకే నూతన తెలంగాణ రాష్ట్ర అధికారం బదలాయించబడ్డది. భారతదేశ స్వాతంత్య్ర పోరాట ఫలితం ఏ విధంగానైతే యూరో ఆర్యన్ల నుంచి ఇండో ఆర్యన్ల చేతిలోకి అధికార మార్పిడి జరిగిందో అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్‌ వలన మూడు లక్షల మంది గిరిజనులను బలిచ్చి హైదరాబాద్‌ని పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా, గవర్నర్‌ పాలన క్రింద ఉండే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్న తరువాత ‘గెట్టు’ తెలంగాణ ఇవ్వబడింది. ఇది ఆంధ్ర పెట్టుబడిదారీ వలసవాదానికి, తెలంగాణ భూస్వామ్య నయా పెట్టుబడిదారీ వర్గానికి మధ్య కుదిరిన ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ పవర్‌ ఎగ్రిమెంట్‌ ఫలితమే. తెలంగాణ శ్రమ సంస్కృతి ‘బంగారు బతుకమ్మ దొరసాని’ అవతారం ఎత్తి కళ్ళముందే కదలాడసాగింది. స్వచ్ఛమైన తెలంగాణ భాషా సంస్కృతి, బూతు భాషా సంస్కృతిగా మీడియాకెక్కింది. పండగరోజే యింట్లో పీనుగులున్నట్లు ‘మన రాష్ట్రం-మన పాలన’ అనుకున్న మూడవ రోజు నుంచే రైతుల బతుక్కి భరోసా లేక 480 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు.
ఉద్యమానికి ఊపిరిలూదిన ఉస్మానియా విద్యార్థుల్ని ‘నియామకాలు-నిధులు-నీళ్ళు’ నినాదాలు ఎక్కిరించి నిరాహారదీక్షకు నెట్టబడ్డారు. హైదరాబాద్‌ చుట్టూరా ఉన్న 21 లక్షల ఎకరాల భూమి బడా పెట్టుబడిదారులకు అధికారిక ధారాదత్తం కాబోతున్నది. అయితే దళితుల మూడుఎకరాల భూమి నినాదం అమలు ‘చంద్ర’ మండలం లోనో లేక అంగారక గ్రహంలోనే సాధ్యమయ్యేట్లున్నది. ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో తరతరాలుగా నివసిస్తున్న లక్షల దళిత కుటుంబాలకు ఈ మూడు ఎకరాల భూమి విషయంలో ప్రభుత్వం అధికారిక నిశ్శబ్దం పాటిస్తుంది. ఆంధ్రా వలస పాలకుల హయాంలో మూతపడ్డ అజాంజాహి మిల్స్‌, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ సంగతేందో యిప్పటివరకు నోరు మెదపలేదు. నిజాం, పాలేరు షుగర్‌ ఫ్యాక్టరీలను రైతుల నోళ్ళలో దుమ్ముకొట్టి కారుచౌకగా అమ్మినప్పుడు వేసిన రంకెలు ఏమయ్యాయి? ‘మన ఊరు-మన ప్రణాళిక’ మన దొర-మన దొర దోపిడీగా మరానున్నదా? మావోయిస్ట్‌ ఎజెండానే మన ఎజెండా అన్న నాయకులకు మరి ఆదిలాబాద్‌లో ఎన్‌కౌంటర్లు చెయ్యమని మావోయిస్టులే చెప్పారా? ఇవన్నీ తెలిసిన మేధావి వర్గం మౌనమేలా? తెలంగాణలోని అన్ని కుల/వర్గాల సమస్యలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటునే జిందా తిలిస్మాత్‌గా చూపించిన మేధావివర్గం పట్టిన ఈ నూతన మౌనదీక్షను అర్థం వెతుక్కోలేని స్థితిలో చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలున్నారనే భ్రమకు గురౌతున్నారా ఈ మేధావులు? ఈ 13 సంవత్సరాల్లో దళిత చైతన్యం ధ్వంసం చేయబడ్డది. వామపక్ష భావజాలాన్ని భ్రష్టు పట్టించారు. విద్యార్థుల భవిష్యత్తు అంధకారమౌతుంది. రైతులు ఆత్మహత్యలే పరిష్కారమనుకుంటున్నారు. కరెంట్‌ కష్టాలు తీరేట్లు లేదు. మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల సమస్యల్ని ప్లేబాయ్‌ క్లబ్‌లో, ఫేజ్‌-3 క్లబ్లుల్లో, కరీంనగర్‌ని న్యూయార్క్‌గాను, నిజామాబాద్‌, ఖమ్మంలను లండన్‌ గాను అనుకొని, హైదరాబాద్‌ని గ్లోబల్‌ సిటీ అనుకుని బతికేయండని అంటున్నారు. అట్లా అనుకుంటూ ఈ పాపం అంతా పక్కరాష్ట్రం వాళ్ళ మీదకు నెట్టేసి బతుకులీడుద్దామా? గెట్టు తెలంగాణని గట్టు మీద పెట్టి జన తెలంగాణని సాధించుకుందామా? ఇక బేరసారాల రాజకీయాలను పక్కన బెడదాం.
డా. ఎం.ఎఫ్‌. గోపీనాథ్‌
అధ్యక్షులు, తెలంగాణ జనసమితి

Andhra Jyothi Telugu News Paper Dated: 05/12/2014 

మన్నించు బాబా సాహెబ్‌! By కొంగర మహేష్‌



వేలాది సంవత్సరాలుగా ఈ దేశంలోని మనిషికి పట్టిన మైలను శుభ్రం చేస్తూ, సాటి మనిషి అశుద్ధాన్ని సైతం ఎత్తిపోస్తున్న మట్టిమనుషులను ఇంకా అంటరానివారుగానే చూస్తోన్నవారి మెదళ్లను క్లీన్‌ చేయడానికి ఘనమైన ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దేశంలోని కుల వ్యవస్థను నిర్మూలించడమే అసలైన స్వచ్ఛ భారత్‌గా మారుతుందన్న సత్యాన్ని ఈ పాలకులు ఎప్పటికి గుర్తిస్తారు? కుల నిర్మూలన మాని కులోద్ధరణకు పాటుపడుతున్న ప్రభుత్వాలనే మేం ఇంకా నమ్ముతున్నాం.
‘జయంతులనాడు వచ్చినవాడు వర్ధంతులనాడే కనిపిస్తాడ’ని సామెత!! ఇప్పుడు మీ విషయంలో అదే జరుగుతుంది సాహెబ్‌! మీ జయంతి, వర్ధంతి వేడుకలు కూడా అదే రీతిగా మారిపోయాయి మహాత్మా అంబేద్కరా!! మీరు పుట్టిన ఏప్రిల్‌ 14న, చనిపోయిన డిసెంబర్‌ 6వ తేదీలను ఘనంగా జరుపుకుంటున్నాం. నిన్నా మొన్నటి దాకా ఇందులో ఏప్రిల్‌ నెలను పండుగ మాసంగాను, రెండో సందర్భాన్ని విషాదంగానే అయినా ఘనంగానే స్మరించుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు, పాలకులు, రాజకీయానాయకులకు ఈ రెండు రోజులూ పండుగ రోజులుగా మారాయి. మాకూ అలాగే తయారయ్యాయి. కొందరైతే వాటిని ఎందుకు జరుపుకుంటున్నారో, సందర్భమేమిటో కూడా తెలియకుండా జరుపుకుంటున్నారు. జయంతిని వర్థంతి అంటారు... వర్థంతిని జయంతి అంటారు. ఏదన్నా మీ కోసమేనంటారు. మా గురించి ఎప్పుడూ మాట్లాడని వాళ్ళూ ఈ రెండు రోజులు తెగ మాట్లేడేస్తారు.
అసలు మీ కోసమే తమ జీవితాలు, పరిపాలన అన్నట్లుగా ఊకదంపుడు ఉపన్యాసాలిస్తారు. మిమ్మల్ని ఒకనాడు దేశద్రోహి అన్నవాళ్లకు మీరిప్పుడు దేశభక్తుడుగా కనిపిస్తున్నారు... అంటరానివాడు అన్నవాళ్లకూ ఆరాధ్యదైవమయ్యారు. ఏమైనా అందరి నోళ్లలో అంబేద్కర్‌ ఆలాపనే! ఏం చేస్తాం! కమ్యూనిస్ట్లు నుంచి హిందూ కుల వాదుల దాకా అందరికి ఇప్పుడు మీ అవసరమే మరీ! అందుకే మిమ్మల్ని ఓన్‌ చేసుకోకుండా ఉండలేకపోతున్నారు. ‘అలాంటి వారంతా నా వేడుకలు ఘనంగా చేస్తున్నారు. మరీ నా వారసులుగా మీరేం చేస్తున్నారు నా కోసం?’ అని మాత్రం అడగకండి. ఎందుకంటే మిమ్మల్ని మేం ఎప్పుడో మరిచిపోయాం.. ఒక్క ఫోటోకు దండేసి దండం పెట్టడం.. ఊరూరా, వీధివీధినా మీ విగ్రహాలు ప్రతిష్ఠించడం తప్ప... అసలు మీరు మా కోసమే పుట్టారని మేం గుర్తుంచుకుంటే గదా! మిమ్మల్ని స్మరించుకోవడానికి. మీరు మా కోసమే జీవితాన్ని ధారపోశారని తెలిస్తే గదా,! మీ ఆశయాలను కొనసాగించడానికి! ఇంతకంటే ఇంకేం కృతఘ్నత కావాలి?
హిందూ కుల వ్యవస్థ మనుధర్మ శాసనాలకు బలై.. మూతికి ఉంత, నడుముకు చీపురు... ఎక్కడో ఊరికి దూరంగా విసిరేసినట్లు.. జంతువులుగా కూడా బతుకలేని మాకు.. బతుకంటే ఎంటో చూపించి సమ సమాజంలో ఆత్మగౌరవంతో జీవించేందుకు రాచబాటలు వేసిన మీకు... మీ ఆశయాలు, ఆదర్శాలకు ముళ్లబాటలు వేశాం.. మనిషిని మనిషిగా కూడా చూడలేని ఏ సమాజానికి వ్యతిరేకంగా తుదికంటా పోరాడారో... ఇప్పుడదే వ్యవస్థలో అంటకాగిపోతున్నాం. రాజ్యాధికారంలో వాటా పొందడం మాట అటుంచి మాకు అన్యాయం జరిగినప్పుడు కూడా ఒక్కటిగా నిలబడలేకపోతున్నాం. పైగా మాలోని ఒక్కో గ్రూపు ఒక్కోసారి ఒక్కో అగ్రకులానికి వత్తాసుపలుకుతూ వారి అడుగుల్లో అడుగులేస్తూ వారినే అందలమెక్కించడానికి ఎంతటి శ్రమనైనా ఓర్చు కుంటోంది. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి. పోతున్నాయి. అయినా మా బతుకులు మాత్రం ఏ విధంగానూ మారడం లేదు. ఏవీ కూడా మీ పేరు చెప్పకుండా పుట్టని పార్టీ. సంఘం లేదంటే అతిశయోక్తి లేదు. ఐక్యతను పక్కనబెట్టి విడివిడిగా మీ పేరుతో ఇలా రోజుకో గ్రూపు మీ లోనుంచి పుట్టుకొస్తుంటే దీన్ని చైతన్యమనాలో... అవివేకమనాలో అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం.
దేశ విదేశాల రాజ్యాంగాలను తిరగేసి ప్రపంచంలోని పార్లమెంటరీ ప్రజాస్వామిక దేశాలకే ఆదర్శంగా అందించిన రాజ్యాంగాన్నే తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి ఈ ప్రభుత్వాలు. మీరు ప్రసాదించిన హక్కులు, అవకాశాలు రాజ్యాంగం అమలైన 64 ఏళ్ళలో ఏవీ సరిగ్గా, చట్టబద్ధంగా అమలుకు నోచుకోలేదు. ఆర్థికంగా సామాజికంగా బలంగా ఉన్న వర్గాలతో మేము పోటీపడలేమని అందుకు రిజర్వేషన్లు కల్పించారు. పాలకుల స్వార్ధ బుద్ధి, కుల రాజకీయాల వల్ల ఆరు దశాబ్దాలైనా అవి సక్రమంగా అమలుకాక, అమలైనవి కూడా అందాల్సిన వారికి అందకుండా పోతున్నాయి. మాలో కూడా అందుకున్న వాళ్లే అనుభవిస్తూ.. అత్యంత వెనకబడినవాళ్లకు అందడం లేదు. ఫలితంగా మాలో కూడా అంటరానివాళ్ళలోనే అంటరానివాళ్ళు పుట్టుకొస్తున్నారు. చమర్‌, మహార్‌, మాల, మాదిగలంటూ మా మధ్యే గోడలు, ఎన్నటికీ తేలని గొడవలు. ఇంకా ఎక్కువగా మాట్లాడితే మాకిచ్చే అవకాశాల పరిధిని పెంచాలని పోరాడుతున్నాం కానీ అందరం సమానంగా పంచుకోవడానికి మాత్రం వెనకడుగు వేస్తున్నాం. చివరికి రిజర్వేషన్లు అనేవి లేకపోతే మాకు బతుకులు లేవన్న పరిస్థితి కొచ్చేశాం. మీరిచ్చిన అవకాశంతోనే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి గొప్ప గొప్ప చదువులు చదువుకుంటున్నాం. మేధావుల్లా చలామణి అవుతున్నాం. అయినా సంకుచిత బుద్ధిని వీడటం లేదు.
రాజకీయ రిజర్వేషన్లతో రాజ్యాలేలుతున్నాం. ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులనే పదవులు అనుభవిస్తున్నాం. అయినా మా జీవితాల్లో మార్పులు రావడం లేదు. ఎందుకంటే మీరు చెప్పిన సమాజాన్ని మరచిపోయాం కాబట్టి. ఎన్నికల సమయంలో అధికారికంగా అఫిడవిట్లో సమర్పించే లెక్కల్లో కూడా మనవాళ్లే ముందున్నారు. కానీ ఏం లాభం ‘అదిగో మావాడు కోట్లు సంపాదించాడు’ అని తప్ప గర్వంగా చెప్పుకునేంత పనులేం చేయడంలేదు వారు. వారు జాతి పేరు చెప్పుకునే బాగుపడుతున్నారు, బలపడుతున్నారు. వారు సంపాదించిన సంపదలో కనీసం పది శాతం కూడా తమ జాతికోసం ఖర్చు పెట్టకుండా మీరు బోధించిన ‘పే బ్యాక్‌ టు ద సొసైటీ’కి తూట్లు పొడుస్తున్నారు. సర్వసమస్యలకు పరిష్కారమని మీరు చెప్పిన రాజ్యాధికార ‘మాస్టర్‌ కీ’ని ఎప్పుడో పోగొట్టుకున్నాం. మేం కూడా అగ్రవర్ణాల్లాగే పూటకో మాట, రోజుకో కండువా కప్పుకొని చపలచిత్త మనస్తత్వంతో కాలం వెళ్లదీస్తున్నాం. ‘కులం పునాదుల మీద జాతిని గానీ, నీతినిగాని నిర్మించలేం’ అని మీరంటే వాటి మీదే అధికార బురుజులు నిర్మిస్తున్న వారితోనే చేతులు కలిపి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాం. ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి అగ్రకులాల పంచన చేరి... వారు విదిల్చే తాయిలాల కోసం కాచుక్కూర్చుంటున్నాం. అగ్రకులాల చేతుల్లో ఆటబొమ్మలుగా మారిపోయాం.
హిందుత్వ-మనువాద పునాదితో బాధ్యతలు చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని స్వచ్ఛంగా మారుద్దామనుకుంటున్నారు. అందుకోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు. పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యానికి మంచిదే. కానీ వేలాది సంవత్సరాలుగా ఈ దేశంలోని మనిషికి పట్టిన మైలను శుభ్రం చేస్తూ, సాటి మనిషి అశుద్ధాన్ని సైతం ఎత్తిపోస్తున్న మట్టిమనుషులను ఇంకా అంటరానివారుగానే చూస్తోన్నవారి మెదళ్లను క్లీన్‌ చేయడానికి ఘనమైన ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దేశంలోని కుల వ్యవస్థను నిర్మూలించడమే అసలైన స్వచ్ఛ భారత్‌గా మారుతుందన్న సత్యాన్ని ఈ పాలకులు ఎప్పటికి గుర్తిస్తారు? కుల నిర్మూలన మాని కులోద్ధరణకు పాటుపడు తున్న ప్రభుత్వాలనే మేం ఇంకా నమ్ముతున్నాం. ఏ జెండా పు(ప)డితే ఆ జెండా పట్టుకు వేలాడుతున్న మాతో.. ‘మీ కంటూ ఒక జెండా అజెండా ఉందన్న’ సంగతి చెప్పేదెవరు తండ్రీ! ఇప్పటికీ మిమ్మల్ని అన్యాయంగా పక్కనబెట్టినా, మీ పేరే చెప్పుకుంటూ.. కూర్చున్న కొమ్మలనే నరుక్కుంటున్న అజ్ఞానపు అవివేకంతో దారితప్పిన గొర్రె పిల్లల్లా తలోదిక్కున వెళ్తున్న మమ్మల్ని మన్నించుమనే అర్హత కూడా లేదేమో! రోజురోజుకీ రూపం మార్చుకుంటూ ఆధునిక భారతాన్ని బలి తీసుకుంటున్న కులకోరల్ని నలిపేయడానికి, దారీ తెన్నూ లేకుండా ఆగమైపోతు న్న నీ జాతిని పెడదోవనుంచి విడిపించి, మీరు సూచించిన మా ర్గంలో నడిపించడానికి, మళ్లీ ఎప్పుడు పుడ్తావ్‌ బాబా సాహెబ్‌!?
- కొంగర మహేష్‌
రీసెర్చ్‌ స్కాలర్‌, ఓయూ
(రేపు బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి)

Andhra Jyothi Telugu News Paper Dated: 05/12/2014 

Friday, November 21, 2014

మన కాలం బోధిసత్వుడు - డాక్టర్‌ కదిరె కృష్ణ

కులమత వర్గరహిత వ్యవస్థను సాకారం చేయగలిగేది బౌద్ధం. రాహుల్‌ సాంకృత్యాయన్‌ చెప్పినట్లు మార్క్సిజం బాగా అర్థమైతే బౌద్ధం బాగా అర్థమైనట్లే! కారణం ఈ రెండిటిలో చాలా విషయాలు కామన్‌గా ఉన్న భౌతికవాదం ప్రధానమైనది. ఈ సారాన్ని బాగా ఒంట బట్టించుకున్న వ్యక్తి ‘దొమ్మేటి సత్యనారాయణ బోధి’.
బోధి మొదట సంప్రదాయ హిందూ కుటుంబ ఆచారాలు కలవాడైనా బౌద్ధం పరిచయమైనప్పటి నుంచీ అదే జీవితంగా జీవించిన త్యాగశీలి. నిజానికి బౌద్ధం అంటే త్యాగం. మానవుడు తన భౌతికావసరాలను ప్రకృతి నుంచి పొంది ప్రకృతిలో కలిసిపోవడం,. ఈ మధ్యలో జీవితం నిస్వార్థంగా ఉండడం, ‘స్వంతం’ అనేది లేని సమాజహిత జీవనమే బౌద్ధం. ఇటువంటి జీవితం ఏ కొందరికో సాధ్యమవుతున్న ప్రస్తుత తరుణంలో స్మరించుకోవల్సిన వ్యక్తి సత్యనారాయణ బోధి.
యావద్భారతదేశంలో బౌద్ధ ప్రచాలనకు ఆయన దాదాపు రెండు దశాబ్దాలుగా కృషి చేశారు. అంతకు పూర్వం ట్రేడ్‌ యూనియన్‌ నాయకుడిగా, మార్క్సిస్టుగా ఆదర్శ జీవితం గడిపారు. 1926లో తూర్పుగోదావరి జిల్లా అమలాపురం తాలూకా వక్కలంక గ్రామంలో దొమ్మేటిసుబ్రహ్మణ్యం, మాచరమ్మ దంపతులకు సత్యనారాయణ జన్మించారు. 1952 నుంచి 1984 వరకు రైల్వే శాఖలో వివిధ ఉద్యోగాలు నిర్వహించారు ఎస్‌.ఇ రైల్వేలో షాప్‌ సూపరింటెండెంట్‌గా ఉద్యోగ విరమణ చేశారు.
స్వాతంత్ర్యానికి పూర్వం బెంగాల్‌-నాగపూర్‌ రైల్వేలో పనిచేస్తున్న కాలంలో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. ట్రేడ్‌యూనియన్‌ రంగంలో కార్మికులను ముఖ్యంగా సూపర్వైజర్‌ క్లాస్‌ని సమకట్టి హక్కుల సాధన పోరాటంలో తిరుగులేని నాయకత్వం వహించారు. ఈ క్రమంలోనే 1974 మేలో దేశవ్యాప్తంగా జరిగిన చరిత్రాత్మక రైల్వే సమ్మెలో బలంగా పనిచేయడంతో ఉద్యోగం కోల్పోయారు. ఆ తరువాత జనతా ప్రభుత్వ హయాంలో తిరిగి ఉద్యోగం పొందగలిగారు. బెంగాల్‌ ప్రాంతంలో పనిచేస్తున్న క్రమంలో హేమాహేమీలైన కమ్యూనిస్టు నాయకులందరితో కలిసిపనిచేశారు. వారి ఉపన్యాసాలు వినడమే కాదు తాను వారితో కలసి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చినట్లు నాతో చెప్పారు. మాజీ కేంద్ర మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ ఈయన సహచరుడు. 1984లో ఉద్యోగ విరమణ చేసిన తరువాత సత్యనారాయణ బౌద్ధం వైపు మళ్లారు. 1992 నుంచి ఆయన పూర్తిగా బౌద్ధం ప్రచారంలో మునిగిపోయారు. కేవలం బౌద్ధ ప్రచాలనకే పరిమితం కాక బౌద్ధ సిద్ధాంతాల వ్యాఖ్యానం, అపార జ్ఞానసంపద ఈయన సొంతం. సత్యనారాయణ బోధి రేడియోలో బౌద్ధాన్ని ప్రబోధిస్తుంటే భగవద్గీతను గానం చేసిన ఘంటసాలను మైమరిపిస్తారు. 1994-95లో దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్యవేదికకు తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. ఏ పని చేసినా ఆయనలో నిండైన చిత్తశుద్ధి, నిబ్బరం, వినయశీలత తొణికిసలాడేది.
1996 మే20న విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రం ఏర్పాటు చేసిన ‘మత సామరస్యం- జాతీయ సమగ్రత’ అంశంపై బౌద్ధరీతిలో ప్రారంభమైన ఆయన ఉపన్యాసాలు మొన్నటివరకూ కొనసాగాయి. ఎందరో ఔత్సాహిక బౌద్ధ ప్రచారకుల ప్రసంగాలను ఆయన ప్రోత్సాహంతో తెలుగు సమాజం వినగలిగింది. 1996లో కలకత్తాలోని ‘మహాబోధి’ నిర్వహించిన ‘లే బుద్ధిస్ట్‌ లీడర్స్‌ కాన్ఫరెన్స్‌’లో బోఽధి సమర్పించిన సిద్ధాంత వ్యాసం ఎంతో కీలకమైనదిగా బౌద్ధ నిష్ణాతులు కొనియాడారు. 2001లో ఒక అంతర్జాతీయ సదస్పులో ‘బౌద్ధం-మానవాళి భవిష్యత్తు’ అనే అంశంపై ఆయన సమర్పించిన పరిశోధనాత్మక వ్యాసం పలువురి ప్రశంసలు అందుకుంది. 1997లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన ‘లుంబిని ఉత్సవం’లో ప్రపంచంలోని వివిధ దేశాల బౌద్ధ ప్రతినిధులు పాల్గొనగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి పాల్గొన్న ఏకైక ప్రతినిధి సత్యనారాయణ బోధి. 2004లో కాకతీయ విశ్వవిద్యాలయంలో ‘బౌద్ధ దర్శనం పునాదులు’ అనే పరిశోధనాత్మక వ్యాసం బౌద్ధ సంస్కృతిలోని ప్రాధాన్యాలను వివరణాత్మకంగా మనముందుంచింది. బోఽధి సారథ్యంలో సారనాథ్‌లో జరిగిన 2007 వార్షిక సమావేశాలు చరిత్రాత్మకమైనవి. బౌద్ధంలోని పారమితలపై సత్యనారాయణ బోధి వ్యాఖ్యానం నభూతో నభవిష్యతి. ఆంగ్ల మూలంలోని అనేక బౌద్ధ గ్రంథాలను ఆయన ఆంధ్రీకరించారు. బోధి రేడియో ప్రసంగాలు ‘బౌద్ధచింతన’ పేరుతో పుస్తకరూపం ధరించాయి. బౌద్ధ భిక్షువులు ఆయన సేవను గుర్తించి ‘ధర్మ ప్రియ’ బిరుదుతో కలకత్తాలో సన్మానించారు. నిజజీవితంలో బౌద్ధ ఆచారాలకు సంబంధించి జీవితంలో ప్రతి సందర్భాన్ని ఆచ రించే విధంగా వ్యాఖ్యానించారు. పుట్టుక నుంచి ప్రతి సందర్భంలో బౌద్ధం ఎలా ఆచరించాలో చాలా స్పష్టంగా విశదీకరించారు. పాళీ భాషలో ఆయనకు గల విశేష జ్ఞానం అందుకు సహకరించింది.
బౌద్ధ సారస్వతనిధి దొమ్మేటి సత్యనారాయణ బోధి. బౌద్ధ ధర్మం పట్ల ఆయన ఎంతో అంకిత భావంతో ఉండేవారు. కొన్ని వేల కరపత్రాలు, చిన్న బుక్‌లెట్లు ప్రచురించి ఉచితంగా పంపిణీ చేశారు. ఆఽధునిక సమాజాన్ని పీడిస్తున్న ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, అలౌకిక ధోరణులు, అప్రజాస్వామ్య ఆలోచనలను నిర్మూలించడానికి, మానవతా విలువల పరిరక్షణకు బుద్ధుని ప్రబోధాలు మందు వంటివని బోధి విశ్వసించారు. నిష్పక్షపాత బుద్ధితో బౌద్ధాన్ని వ్యాఖ్యానించడం ఆయన ప్రత్యేకత. దేశవ్యాప్తంగా వివిధ బౌద్ధ సంఘాల నాయకులతో, మాంగ్‌లతో ఆయనకు సత్ససంబంధాలు ఉండేవి. బౌద్ధ మాంగ్‌లను బౌద్ధం విషయంలో నిలదీసేంతటి విషయ పరిజ్ఞానం గల మన కాలం బోధిసత్వుడుగా ఆయనను అభివర్ణిస్తారు. బోఽధిసత్వ గుణ సంపన్నుడు. ఆయన మాట, అక్షరం ప్రసన్నంగా, మానవ జీవితంలోని పరిమళాలను వికసింపజేసే విధంగా ఉంటాయి. తాను మాత్రమే గాక తన కుటుంబాన్నీ అదే మార్గంలో నడిపించిన ఆదర్శవంతుడు. స్వచ్ఛమైన మానవ జీవితానికి భాష్యం చెప్పుతూ జీవితాంతం అణగారిన బీద ప్రజానీకానికి అండగా అరమరికలులేని, సమసమాజం కోసం అనునిత్యం తపించిన మంచి మనిషి సత్యనారాయణ బోధి. ఈ నెల 13న కాకినాడలో ఆయన పరినిర్వాణం పొందారు. బోఽధి సేవలు, కృషి, ప్రేమ, కరుణ, దయశీల, ప్రజ్ఞ ఎందరికో ఆదర్శమైంది. అదే ఆయన్ను చిరస్మరణీయున్ని చేస్తుంది. నమో తస్స సమ్మసంబుద్ధస్స.
- డాక్టర్‌ కదిరె కృష్ణ
Andhra Jyothi Telugu News Paper Dated : 20/11/2014 

Wednesday, November 12, 2014

Justice for marginalised sections among Dalits By Chandraiah Gopani


Ever since united Andhra Pradesh is bifurcated into Andhra Pradesh and Telangana States, both the new governments have started attracting Dalits by announcing welfare programmes. 

As the two governments are introducing various developmental models to fulfil election promises, a discussion has started among the Dalits or the Scheduled Castes about their development. The initial period of new-born state is an important period for marginalised groups, particularly Dalits. Their alertness, questing, intervention in the naming of various institutions, bringing new symbols, setting new syllabus for school education, forming of various committees and making new legislations play a crucial role in shaping and reshaping the vision and development of the state. 

While the ruling class tries to divide Dalits, it is also true that they are forced to focus on development around the dominant numerically majority caste – either Mala or Madiga – within the Dalits. The numerically smaller castes like Dakkali, Chindu, Mehatar, Mochi, Mateen, Baindla, Gosangi etc., neither  form part of the negotiating agenda nor are politically taken into consideration. This sort of tendency excluded various numerically smaller castes and affected their education, employment, development and political representation for a long time. Until the Dandora Movement (MRPS-1994) demanded their representation in various fields, there had been no much discussion on these castes. 

However, it is shocking to hear that after 68 years of independence India, some of these castes don't have any legal identification proof. Historically, these castes are nomadic moving from one village to another village by performing art forms and begging for their livelihood. To get identification proof or caste and residential proof, they have to undergo many hurdles to get the RDO approval, whereas Mala and Madigas can get the same from the MRO.   

Because of negligence by officials and their lack of understanding about these castes, the smaller Dalit castes are forced to seek either Mala or Madiga caste certificates. There are many cases where Chindu caste people got Madiga certificates and Netakani got Mala certificates. Further, the population of these communities is recorded in government reports in thousands, whereas they exist in lakhs, Thereby, they are counted as a SC numerically minority caste. Consequently, they are counted as politically irrelevant force and neglected.   

Recently, the Telangana government announced some jobs for artistes and land distribution scheme. But, the pertinent question is to what extent these welfare measures will reach the lowest. Besides, both Telugu States announced financial assistance to Dalit students for foreign studies, It is said that already dominant scheduled castes have started negotiations with the governments for major share, which will put minority communities at disadvantage. As long as there is no separate allocation for these communities, they won't get any justice.        

There is an immediate need to revise the Scheduled Caste list because some castes are not present either in Telangana  or Andhra Pradesh – Relli, Adi-Andhra etc are not present in Telangana, while Netakani, Nulaka Chandaiah etc are not present  in Andhra Pradesh. 

In order to be more inclusive, governments should allocate sub-plan funds as per caste population proportion. They also need to recognize and preserve the art forms of the various SC castes.

Within the Dalit movement and among Dalit intellectuals and activists there is a feeling that supporting the SC reservation rationalization and building broader Bahujan politics are contradictory, but they are not contradictory. In fact, they are complimentary. 

The long pending SC reservation rationalization issue is yet to be resolved in the context of state division. Some groups are campaigning against the demand. But the existing inequality among the Dalits clearly demands the necessity of SC categorization. The early resolution of this issue will create feasible conditions for the Dalit unity and also independent politics. 

Therefore, the Dalit intelligentsia, activists and leaders should realise that justice for the most marginalised sections among the Dalits and their viewpoints have a great capacity to deepen the Phule, Ambedkar and Kanshiram philosophical praxis and create conditions for autonomous politics of the oppressed.

The Hans India English Daily News Paper : 12/11/2014 

Sunday, October 26, 2014

హైందవ పునాదులపై ఇండియా - డాక్టర్‌ భంగ్యా భూక్యా



పెరి ఆండర్‌సన్‌ రచించిన ది ఇండియన్‌ ఐడియాలజీ గత రెండు సంవత్సరాలుగా ఇండియన్‌ మేధావి వర్గంలో పెద్ద దుమారాన్నే లేపింది. ఈ వర్గం తీవ్ర అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ పుస్తకాన్ని హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌ అనువదించి ప్రజలకు పరిచయం చేయటం చాలా సంతోషం. ఇండియాను బ్రిటిష్‌ పాలకులే డిస్కవరీ చేశారన్న ఆండర్‌సన్‌ వాదనతో నేను వ్యక్తిగతంగా ఏకీభవించను. కానీ అతను లేవనెత్తిన అనేక వాదనలు, ప్రశ్నలు భారత దేశంలోని వాస్తవాలను ఎత్తి చూపుతున్నాయి. ఎందుకు అత నితో ఏకీభవించనంటే ఇండియాను డిస్కవరి చేసింది హిందూ మేధావి వర్గం. రాజారామ మోహన్‌ రాయ్‌ దగ్గర నుంచి జవహర్‌లాల్‌ నెహ్రూ వరకు ఆంగ్ల విద్యను వంటబట్టించుకున్న తరం ఇండియాను డిస్కవరీ చేయటమే పనిగా పెట్టుకొని వేదకాలం నుంచి నేటి వరకు ఇండియాలో దాగి వున్న హిందూత్వాన్ని వెలికి తీశారు. ఇది ఇండియాను ఒక అప్రకటిత హిందూ దేశంగా తీర్చిదిద్దింది.
ఈ పుస్తకం ప్రధానంగా చెప్పేదేమంటే ప్రతి రాజకీయ పార్టీ సిద్ధాంత రాద్ధాంతాలకు అతీతంగా హైందవ సాంస్కృతిక పునాదుల మీద నిర్మించబడి ఆ సంస్కృతిని బలోపేతం చేసింది. అదే విధంగా సనాతన వాదులు, ప్రగతిశీలవాదులన్న తేడాలేకుండా ప్రతి హిందువూ ఇండియన్‌ హైందవ ధర్మరక్షణకే పాటు పడ్డాడు, పడతాడూ కూడా. ఆందుకే ఆ రోజు వల్లబ్‌ భాయ్‌ పటేల్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ను కాంగ్రెస్‌ పార్టీలో విలీనం కావాలని కోరాడు. ఇప్పుడు ఆరు వందల అడుగుల ఎత్తు పటేల్‌ విగ్రహాన్ని (స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ) నిర్మించటానికి నరేంద్ర మోదీ తాపత్రయపడుతున్నారు. అంటే దేశంలోని ఐక్యత విషయం ప్రక్కన పెడితే, కాంగ్రెసుకి, బీజేపీకి హిందూత్వ విషయానికి వచ్చినప్పుడు ఎటువంటి తేడా లేదు. కాంగ్రెస్‌ లౌకికవాదానికి ఈ దేశం మోసపోయిందని ఈ పుస్తకం బలంగా చెబుతుంది. అంతేకాదు, కాంగ్రెస్‌ దాని నాయకులు గాంధీ, నెహ్రూలు చేసిన మోసాలు ఇన్నీ అన్నీ కావని ఈ పుస్తకం రూఢి చేస్తుంది.
సాధారణంగా వలసవాదానికి వ్యతిరేకంగా జరిగిన అధ్య యనాన్ని మనం జాతీయ ఉద్యమంలాగా భావిస్తాము. మన అగ్రకుల చరిత్రకారులు దీన్ని ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజా ఉద్యమంగా అభివర్ణించారు. అయితే ఈ ఉద్య మం హైందవ ధర్మరక్షణకే జరిగిందన్న విషయం మనకు ఇప్పుడిప్పుడే తెలిసి వస్తుంది. గాంధీకి స్వరాజ్‌ మతపరంగా ఒక తప్పనిసరి ఆవశ్యకత. రాజకీయ రూపం అనేది దీనిని ముందుకు తీసుకెళ్ళే సాధనం తప్ప మరొకటికాదు. మతాన్ని రాజకీయాలతో జోడించి ఉద్యమాన్ని నిర్మించటం గాంధీ ప్రత్యేకత. ఈ క్రమంలో హైందవ మత ఉద్ధరణం ప్రధానాంశం కావటం చూస్తాము. రాజకీయ స్వేచ్ఛ రెండవ అంశం కావటం చూస్తాము. వాస్తవంగా గాంధీ చేసిన రాజకీయ ఉద్యమాలు ఏవీ కచ్చితమైన ఫలితాలను సాధించకుండానే ముగుస్తాయి. అట్టహాసంగా మొదలుపెట్టిన సహాయనిరాకరణ ఉద్యమం చౌరిచౌరాలో జరిగిన హింసాత్మక సంఘటనతో అర్థాంతరంగానే ముగుస్తూంది. కానీ అసలు కారణం హింసకాదు. ఈ ఉద్యమం కొద్ది రోజు ల్లోనే ప్రజా ఉద్యమంగా మారింది. బ్రిటిష్‌ పాలన కంటే ప్రజా విప్లవమే ప్రమాదకరమని భావించి సహాయ నిరాకరణోద్యమాన్ని ముగిస్తారు. అప్పటికి ఇండియా హిందువైజేషన్‌ కాకపోవటం కూడా ఒక ప్రధాన కారణం. దండి సత్యాగ్రహం ఒక ఢిఫెన్సివ్‌ ఆట. క్విట్‌ ఇండియా ఉద్యమం ప్రజల నుంచి వచ్చింది. ఇందులో గాంధీ ప్రమేయం అంతంత మాత్రమే. గాంధీ రాజకీయ ఉద్యమాల్లో విజయం సాధించలేదు. కానీ హైందవ మత విషయంలో విజయాన్ని సాధించారు.
గాంధీ తన ప్రజా జీవితం మొత్తాన్ని హిందూ ధర్మరక్షణ కోసమే వెచ్చించ్చారని ఈ పుస్తకం రూఢీ చేస్తుంది. వ్యక్తిగత, ప్రజా జీవితం రెండూ మత మౌఢ్యంలోనే నడిచాయి. గాంధీ బ్రహ్మచర్యం కూడా హిందువులం మైలపడతామన్న భయం నుంచి రూపు దిద్దుకుంది. వ్యక్తిగత స్థాయిలో అన్ని మతాలు సమానమని నమ్మిన, రాజకీయ స్థాయిలో మాత్రం హిందూ మతం, ఇస్లాం మతం కంటే కాస్త ఎక్కువ అని నమ్మేవారు. ఒక ముస్లిం యువతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న తన కుమారునికి అది ‘ధర్మ విరుద్ధం’ అని హెచ్చరించారు. రాజకీయాల్ని పక్కనబెట్టి ఈ పెళ్లి కాకుండాచూశారు.
గాంధీ లౌకిక వాదంలో హిందూత్వం దాగి ఉందని ముస్లింలు చాలా కొద్దికాలంలోనే కనిపెట్టారు. నాటకీయంగా జరిగిన ఖిలాఫత్‌ ఉద్యమం తరువాత గాంధీ ముస్లింలను వదిలివేశారు. ఆనాటి నుంచి అత్యధిక శాతం ముస్లింలు ఆయనను ఎప్పుడూ నమ్మలేదు. లౌకిక వాదానికి ప్రతీకగా ఉన్న మహమ్మదలీ జిన్నా కూడా గాంధీ హిందూత్వ రాజకీయాలకు విసిగిపోయి కాంగ్రెస్‌ నుంచి బైటికి వచ్చేశారు. నిష్పక్షపాతి అయిన మోతీలాల్‌ నెహ్రూ కాంగ్రెస్‌ పార్టీ కచ్చితంగా హిందూ పార్టీయే అనడం గమనించదగ్గ విషయం. ఈ హైందవ రాజకీయాలే దేశ విభజనకు దారితీశాయి. కానీ చరిత్రలో దేశ విభజనకు జిన్నాను దోషిగా నిలబెట్టారు.
కాంగ్రెస్‌ పార్టీయే పాకిస్థాన్‌ స్థాపనకు నాంది పలికింది. జిన్నా భారత దేశంలో ఒకటి కాదు, రెండు దేశాలున్నాయని 1940లో ప్రకటించారు. ఆ రెండు దేశాలు సహజీవనం చేసేందుకు భారత స్వాతంత్య్రం వీలుకల్పించాలి, ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాల్లో వారికి స్వయంప్రతిపత్తినీ, సార్వభౌమాధికారాన్ని ఇవ్వాలన్నారు. అంటే జిన్నా ప్రత్యేక దేశం కావాలని కోరలేదు. ముస్లింలకు స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకున్నారు. ఈ విషయాన్ని గందరగోళం చేసి కాంగ్రెస్‌ పార్టీ పాకిస్థాన్‌ ప్రతిపాదనను జిన్నాకు అంటగట్టింది. దే శ విభజన బ్రిటిష్‌ ప్రభుత్వానికి కూడా ఇష్టం లేదు. క్యాబెనెట్‌ మిషన్‌ ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్న ప్రాం తాలన్నీ స్వయం పాలనాధికారంతో ఉండే విధంగా ప్లాన్‌ రూపొందించింది. కానీ అది నెహ్రూకు రుచించలేదు. ముస్లింలకు ప్రత్యేక స్వయంప్రతిపత్తి, ఇవ్వడం కంటే దేశ విభజనే మేలని నెహ్రూ భావించారు.
విచిత్రమేమంటే, కాంగ్రెస్‌, ముస్లిం లీగ్‌ దేశ విభజన గురించి మాట్లాడుతున్నప్పుడు జిన్నా మాత్రం అఖండ భారత దేశంలో సంకీర్ణ ప్రభుత ్వం గురించి కలలు కనేవారు. భారత దేశంలో ఆంక్ష లు లేని సంపూర్ణ అధికారంతో కూడిన బలమైన కేంద్ర ప్రభుత్వం కావాలని నెహ్రూ కోరుకున్నారు. అది విభజనతోనే సాధ్యపడుతుందని భావించారు. చివరకు ఈస్ట్‌ బెంగాల్‌ని కూడా జిన్నా కోరుకోలేదు కానీ, ఈ ప్రాంతం ఇండియాతో ఉంటే కోల్‌కతాలో ముస్లింల ప్రాబల్యం పెరుగుతుందని పాకిస్థాన్‌కు అంటకట్టారు. రేపటి భారత్‌లో హిందువుల ఆధిపత్యమే పునాదిగా దేశవిభజన జరిగిందన్న విషయాన్ని ఇక్కడ గుర్తించాలి.
గాంధీ, నెహ్రూల కుల రాజకీయాల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరంలేదు. కుల రాజకీయాలు కాంగ్రెస్‌ పుట్టకలోనే ఉన్నాయి. గాంధీ ప్రకారం అంటరానితనానికి కులానికి మధ్య ఎలాంటి సంబంధమూ లేదు. కానీ అంబేద్కర్‌ కులసమస్యను లేవనెత్తినప్పుడు అగ్రకుల హిందువులంతా ఏకమై అతని ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. గాంధీ దృష్టిలో అంటరానితనం పాపమే కావచ్చు కానీ, అది ఆమరణ దీక్ష చేయాల్సినంత నైతిక సమస్య కాదు. కానీ అంటరాని వాళ్లకి ప్రత్యేక నియోజకవర్గాలు మంజూరు చేయటం మాత్రం ఆయనదృష్టిలో చాలా తీవ్రమైన సమస్య వాటికి వ్యతిరేకంగా ఆయన తన జీవితాన్నే పణంగా పెట్టడానికి సిద్ధం. అగ్రకుల హిందువుల ఒత్తిడికి, గాంధీ బ్లాక్‌మెయిలింగ్‌కు పూనా ఒప్పందం సమయంలో లొంగి పోయినందుకు అంబేద్కర్‌ తను చనిపోయేవరకు బాధపడ్డారు.
వలసవాద వ్యతిరేక ఉద్యమ రూపంలో హిందూయిజం, అగ్రకుల తత్వం బలంగా తన ఆధిపత్యాన్ని సాధించుకుంది. అందుకే స్వతంత్ర భారతంలో మత మైనార్టీలు, అణగారిన కులాలు, ఆదిమ జాతులు భయంకరమైన అణచివేతకు, దోపిడీకి గురవుతున్నాయి. రాజ్యాంగంలో లౌకిక వాదాన్ని లిఖించుకున్నారు, కానీ రాజ్యాంగంలో హిందువులకు తప్ప మరే మతస్థులకు రక్షణ లేదు. హిందూ అణగారిన కులాలకు రిజర్వేషన్‌ కల్పిస్తే మతం అడ్డురాదు. కానీ ముస్లిం, క్రిష్టియన్‌ మతాల్లోని పేదలకు రిజర్వేషన్‌ కల్పిస్తే మతం అడ్డువస్తుంది. అంటే హిందూ మత రక్షణ మన రాజ్యాంగంలో బహిరంగంగానే దాగి ఉంది. ఎందుకు ఒక్క ముస్లిం కూడా ఇండియన్‌ రక్షణ పరిశోధన సంస్థల్లో లేరు? కానీ నేపాల్‌కు చెందిన గూర్ఖాలు ఆర్మీలో ఉండవచ్చు. ఎందుకు కాశ్మీరులోని ముస్లింల మీద, ఈశాన్య రాషా్ట్రల్లోని క్రిష్టియన్‌ ఆదివాసుల మీద నిరంతరం నరమేధం నడుస్తుంది? ఎందుకు ఈ దేశ దళితుల మీద దాడులు జరుగుతున్నాయి? ఈ దేశ అగ్రకుల మేధావి వర్గం ఎందుకు ఈ హింస గురించి మాట్లాడదని ఈ పుస్తకం ప్రశ్నిస్తుంది.
- డాక్టర్‌ భంగ్యా భూక్యా
యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌
Andhra Jyothi Telugu News Paper Dated: 26/10/2014 

Wednesday, October 15, 2014

ఈ తరం దళిత సాహిత్యానికి ఆద్యుడు కుసుమ ధర్మన్న By డాక్టర్‌ కత్తి పద్మారావు


Posted on: Wed 15 Oct 00:58:14.626015 2014

                 సాహిత్యం బలహీనతను పెంచకూడదు. సాహిత్యం మార్పుకు దోహదం కావాల్సిఉంది. ఒక్కొక్కపాట ఒక జాతికి మేల్కొలుపుగా నిలిచింది. పాట కొన్నిసార్లు ఉద్యమాల నుంచి పుడుతుంది. కొన్ని సార్లు జీవితం నుంచి పుడుతుంది. పాట కొన్ని సార్లు ప్రేమ నుంచి పుడుతుంది. పాట తిరుగుబాటు బావుటా అవుతుంది. పాటలు మాటల మూటలేకాదు, అవి జీవితాన్ని సంచలన భరితం చేస్తాయి కూడా.
                 స్వాతంత్య్రోద్యమ కాలంలో తెలుగు నేలను ఒక ఊపు ఊపిన దళిత కవి కుసుమ ధర్మన్న. మాకొద్దీ తెల్లదొరతనం అని ఒక పక్క మోగుతుంటే కుసుమ ధర్మన్న మా కొద్దీ నల్లదొరతనమని ఈ నల్లదొరలను నిలవేశాడు. సామాజిక ఆధిపత్యం ఉన్న కులాలకు రాజ్యాధికారం వస్తే దోచుకోవడం తప్ప మరొకటి ఉండదని నిగ్గు తేల్చాడు. జాతీయోద్యమం కాలంలో ఉన్న భూస్వామ్య, కులాధిపత్య, అస్పృస్యతలతో నలిగిపోతున్న దళితుల దుర్భర జీవితానికి తన పాటలతో అద్దం పట్టిన మహాకవి. కుసుమ ధర్మన్న లయాత్మకమైన తన పాటల్లో తెలుగు సామాజిక జీవనాన్ని దృశ్యీకరించాడు. ఇప్పటికీ గ్రామాల్లోని పెత్తందారీతనం గుట్టును బట్టబయలు చేశాడు. గుర్రం జాషువా కవికి, బోయి భీమ్మన్నకు స్ఫూర్తినిచ్చాడు. మహాకవి కుసుమ ధర్మన్న తన పాటల్లో తెలుగు పదాలు జాలెలు పోశాడు. పదాల్లో వాస్తవాలను, పదాల్లో ఆగ్రహాన్ని, పదాల్లో బతుకుని, పదాల్లో పెత్తందార్ల స్వభావాన్ని ఎండగట్టాడు.
పన్నెండు మాసాలు పాలేరుతనమున్న /పస్తులుబడుచు బతు కాలండి/ఆలి కూలీజేసి తీరాలండి/పిల్లగాడూ పశువుల గాయాలండి ి/పగలు రేయీ పాటుపడ్డానండి/కట్ట గుడ్డా-గూడూ గిట్టదండి/రోగమొస్తే ఆనగ దప్పదండి/అప్పు తీరదీ చిత్రమేమండి/ఈ నిప్పుపైనిక మేము నిలువలేమో తండ్రి/మాకొద్దీ నల్లదొరతనము /దేవ-కనికారము లేక కడుపుమాడ్చే రండి/మాకొద్దీ నల్లదొరతనము-బాబు /మాకొద్దీ నల్లదొరతనము-దేవ/పదిమంది తోపాటు పరువు గలుగకయున్న/మాకొద్దీ నల్ల దొరతనము/పాడిపంటలు మేము కూడబెడితె వారు/కూర్చోని తింటామంటారు/నాములిచ్చి నట్టేట ముంచేరు/యెంచి అప్పునప్పు బెంచుతారు /చెంపగొట్టి కంపలాగు తారు/కోర్టుకెక్కించి కుంగదీసేరు/చీలదీసి కులము చెరుపుతారు/దేవ కూడు గుడ్డ కొంప లేకుండ జేసేరు/మాకొద్దీ నల్లదొర తనము/మాలా మాదిగలంటే మండిపడిపోతారు/ఊరి వెలుపనున్న పూరిగుడిసెలె గాని/బారి కొంపలు మాకు లేవు/గాలి వెలుగు సుంత తొంగిరాదు/ సారమైన కూర కూడు లేదు/కోరికట్ట కోక పంచలేదు/నల్లపూస పుస్తె నగదు లేదు/ దున్ని తినగ పొలము దొడ్డిలేదు/దేశమందారికి మేము చేదు/మా దారిద్రియము జూడ దయపుట్టగారాదు.
                 ఈ పాటలో ధిక్కార స్వరముంది. సమాజ నిజ స్వభావం ఉంది. ఇందులో వాడిన పదజాలం పన్నెండు మాసాలు, పాలేరుతనం, పస్తులు, ఆలికూలి, పిల్లగాడు, గిట్టదు, ఆనగ, నిప్పుపై, పాడిపంటలు, నాము, నట్టేట, చెంపగొట్టి, చీలదీసి కులము, గాలి, వెలుగు, సుంత తొంగిరాదు, సారమైన కూడు కూడలేదు. నల్లపూస పుస్తే నగదు లేదు. దారిద్య్రము, దయాపుట్టగరాదు. ఇందులోని పదాలు, వాక్యాలు మనల్ని కదిలిస్తాయి. సామాజిక జీవన వాస్తవాలను చారిత్రక గతిలో నుంచి చూపిస్తాయి. తెలుగు సామాజిక చరిత్రను ఆనాటి నుంచి ఈనాటి వరకు అర్థం చేసుకొనాలన్నపుడు ఈ పాట నేర్చుకోవడం తప్పనిసరి. దీన్ని బుర్ర కథల్లోను, జెముకుల కథలోనూ కూడా పాడతారు. శృతిబద్ధమైన లయనిబద్ధతే కాక ప్రశ్న, నిలవేయడం, నిజాన్ని చెప్పడం, జీవనగాథను హృదయార్ద్రంగా పాడటం ఇందులోని గొప్పతనం. కరుణరస ప్రధానమైన ఈ పాటలో ద్వితీయార్ధంలో ఎంతో తిరుగుబాటు కూడా ఉంది. సామాజిక విప్లవ నినాదంగా ముందుకు నడిచిన ఈ పాట గుండె నిప్పును మండిస్తుంది. ఒక జాతిని అంటరానివాడుగా చేసి తమకు జీతగాళ్ళుగా, పాలేరులుగా మార్చుకొని వారి శ్రమకు అంటులేకుండా దోచుకొని వారిని అంటరానివారుగావించిన వైనం ఆ పాటలోనే చూడండి.
ఒంటినిండ గుడ్డెందు కంటారు/గోచిగుడ్డ కర్రే గోటంటారు/చుట్టు గుడిసె చాలా సుఖమంటారు/గంజికూడే గుంజు బలమం టారు/దేవ-నోరులేదని మమ్ము దూరాన గెంటేరు/ఆకలిచిచ్చూచేత అడలి చచ్చినగాని /యన్న సత్రము మాకులేదు/నోరుయెండి దోరిన నీరు లేదు/కుడువ పూటకూళ్ళు గానరావు/యెక్క బండి వక్కటైనరాదు/మొక్క దేవుడొక్కడైన లేడు/శ్రమను దీర్చ సత్రమొకటి లేదు/భ్రమలు దీర తాగ బావి లేదు/మేము మనుషులనూ మాట మరచిపోయారండి/మాలమాలని చాలా తూలనాడి మమ్ము/ అంటరాదని గెంటుతారు /ఆసుపత్రి మందుల డుగుతారు /మాల మందూలు చాలా తాగేరు/మాల చనుబాలు మందుకడిగేరు /మాలపొత్తులేక మసలలేరు/మామేలు మెప్పుపొంది మేకై తిరుగుతారు /కుక్క నక్కలకంటె తక్కువగా జూచి/నిక్క తక్కి నిగుడుతారు /సాని ప్రక్కజేర సాగుతారు /కుష్టురోగి సరస కూర్చుంటారు/కుక్క కోతిని కోరి పెంచేరు/పిల్లి పిట్టాల ప్రేమించుతారు /పందిగున్నాల బాధింపరారు/కాకి నీటిని తాకనిస్తారు/మమ్ము దరికి చేరునీరు దడదడ తిట్టేరు.
            ఈ రెండో భాగంలో పాట పాటగానే గాక పశ్న్రలు వెల్లువలా పొంగాయి. పాటలో నాటకీయత, సమాజాన్ని నిలవేసిన తిరుగుబాటు తత్వం, నిజమైన స్వాతంత్య్ర నినాదం మనకు కనిపిస్తుంది. ఈనాడు ఈ పరిస్థితి కోస్తా ఆంధ్రాలో ఎన్నో ఉద్యమాల వల్ల మారినా, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో, రాయలసీమలో కొనసాగుతూనే ఉంది. ఒక కవి వెయ్యి పేజీల్లోని సామాజిక చరిత్రను ఒక పాట ద్వారా మనకు చెప్పాడు. పాట పాడుతున్నప్పుడు కనుకొలకునుల్లో నీరు తిరిగి పీడిస్తున్నవాడు కూడా ఇది తప్పే అనే మార్పుకు గురికావాల్సి ఉంది. ఎందరో భూస్వాముల, కులస్వాముల పిల్లలు ఇలాంటి సాహిత్యం వల్లే మారారు. సాహిత్యం బలహీనతను పెంచకూడదు. సాహిత్యం మార్పుకు దోహదం కావాల్సిఉంది. ఒక్కొక్కపాట ఒక జాతికి మేల్కొలుపుగా నిలిచింది. పాట కొన్నిసార్లు ఉద్యమాల నుంచి పుడుతుంది. కొన్ని సార్లు జీవితం నుంచి పుడుతుంది. పాట కొన్ని సార్లు ప్రేమ నుంచి పుడుతుంది. పాట తిరుగుబాటు బావుటా అవుతుంది. పాటలు మాటల మూటలేకాదు, అవి జీవితాన్ని సంచలన భరితం చేస్తాయి కూడా. పాటలో లాలిత్వం ఎంత ఉందో ధిక్కారం అంతే ఉంది. పాట తేనెల ఊట,దానికి కొంచెం రాగశుద్ధి, భావశుద్ధి కలిగిస్తే అది మెదడును, హృదయాన్ని ఒకేసారి కదిలిస్తుందనటంలో సందేహంలేదు. దళిత పాట తెలుగు సాహిత్యానికి ధికార స్వరాన్నిచ్చింది. కుసుమ ధర్మన్న ఈ తరం దళిత కవిత్వానికి ఆద్యుడు. ఆయన పాట ఒక ఉద్యమం. ఉద్యమాల్లో నుంచి వచ్చిన పాటలు, కవితలు సమాజాన్ని ఉత్తేజపరచటమే కాక చారిత్రక మలుపుకు మైలురాళ్ళుగా నిలుస్తాయి. జాతీయోద్యమ కాలంలో వర్గాధిపత్యాన్ని ఎదిరించే వాళ్ళు, కులాధిపత్యాన్ని ఎదిరించే వాళ్ళు తమ గొంతుల్ని, తమ అస్దిత్వాల్ని ఆనాడే ప్రకటించారు. కులాధిపత్యం, మతోన్మాదం, వర్గాధిపత్యం పునాదులన్నీ ఒక పాదులోనే ఉండడం వల్ల ఎదిరించే శక్తులు కూడా మిత్రత్వానే కలిగి ఉన్నాయి. కుసుమ ధర్మన్న దళిత అస్తిత్వ సాహిత్యాన్ని జాతీయోద్యమ కాలంలో ఉక్కు కంఠంతో వినిపించినవాడు. ఈనాటి దళిత కవులకు స్ఫూరి కుసుమ ధర్మన్న.

(వ్యాసకర్త సామాజిక ఉద్యమ నేత)

Prajashakti Telugu News Paper Dated : 15/10/2014 

Monday, October 6, 2014

బహుజన గీతాకారుడు - డాక్టర్‌ కోయి కోటేశ్వరరావు

ఉన్నతమైన రాజకీయ దృక్పథం, సునిశితమైన కళాత్మక నైపుణ్యాల సమన్వయంలో నుంచే ఉత్తమ రచన ఆవిర్భవిస్తుందంటాడు మావో. వ్యంగ్యం అత్యంత శక్తివంతమైనది. హేళనతో కూడిన హాస్యంతో; పదునైన వ్యంగ్యంతో శత్రువును చీల్చి చెండాడవచ్చునంటాడు అంబేద్కర్‌. మావో, అంబేద్కర్ల అభిప్రాయాలకు అక్షరదర్పణం తెరేష్‌ కవిత్వం. ఈ విధమైన రాజకీయ ఎరుకతో, వ్యంగ్య శైలితో శత్రువు ఆయువుపట్టును పసిగట్టి తదనుగుణంగా యుద్ధం చేయటం తెరేష్‌బాబుకు చద్దికూటితో పెట్టిన విద్య.
పైడి తెరేష్‌బాబు విశాలమైన ప్రాపంచిక దృక్పథం కలిగిన కవి. అందుకే దళితవాదం దగ్గరే ఆగిపోకుండా, ఆత్మబంధువుల అస్తిత్వ ఉద్యమాలకు కొత్త ఊపిరులూదాడు.
మట్టి నవ్వితే పరమాన్నం
నిప్పు నవ్వితే వెలుతురు
నీరు నవ్వితే చైతన్యం
నింగి నవ్వితే తొలకరి
గాలి నవ్వితే ఊపిరి


ఈ పంచ నవ్వుల పరమార్థాలను కలగలిపి ఒకచోట రాశి పోస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ‘పైడి’ సాహిత్యంలా ఉంటుంది. నిద్రను నిట్టనిలువునా నరికే వైతాళిక గానం ఎలా ఉంటుంది? వేటగాడి గుండె జారిపోయే సింహనాదం ఎలా ఉంటుంది? నాలుగు పడగల హైందవ నాగరాజు కోరలు పీకే పౌరుషం ఎలా ఉంటుంది? సామ్రాజ్యవాదం పొగరణిచే సాహసం ఎలా ఉంటుంది? గొడ్లు కాసే పిలగాడి పిల్లంగోవి రాగం ఎలా ఉంటుంది? అన్నింటికీ మించి అంబేద్కర్‌ పల్లవైన పాటకు ఆపకుండా చిందేస్తే ఎలా ఉంటుంది? అమ్మతోడు తెరేష్‌బాబు కవిత్వంలా ఉంటుంది. సమకాలీన తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యామ్నాయ భావవిస్ఫోటనం పైడి తెరేష్‌బాబు. అక్షరాలను చండ్ర నిప్పు కణికల్లా మార్చి, మాటలను మర ఫిరంగుల్లా పేల్చి, కవితా వాక్యాల్ని కరెంటు తీగల్లా తీర్చి, నడుస్తున్న కాలం నరాల్లోకి పిడికెడు కొత్త కాంతిని ప్రసరించిన అసాధారణ ప్రతిభా సంపన్నుడు తెరేష్‌బాబు. దళిత సాహిత్యంలో కసిత్వం తప్ప కవిత్వం లేదని సోకాల్డు విమర్శకులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నప్పుడు, దళిత కవులకు వచన కవిత్వమెందుకని ఘనత వహించిన కవిపుంగవులు నోరుపారేసుకుంటున్నప్పుడు, రెప్పపాటులోనే ‘దళితవాదం’పై సవాలక్ష దాడులు జరుగుతున్నప్పుడు ఈ సంక్లిష్ట సందర్భంలో తెరేష్‌ బాబు సరైన జవాబుగా నిలబడ్డాడు. ‘రాత మాకు కొత్తకాదు/ మీరు పలకల బావుల్లో బలపాల కప్పలైనపుడు/ మేం నేలతల్లి గుండెల మీద పైరు పద్యాలమయ్యాం/ మీరు విజ్ఞాన సముద్రాల్లో కాగితప్పడవలైనపుడు/ మేం కర్మాగారపు నెన్నొసట లోహలిపులమయ్యాం/ మా కడుపుల్లో పడ్డాక కదా అక్షరం అగ్నిపునీతమయ్యింది.’’ (నిశాని) అంటూ ‘పైడి’ దళిత పులిలా గాండ్రించి, సాంద్రతరమైన, తాత్విక సమన్వితమైన కవిత్వానికి సంకేతంగా భాసిల్లాడు. సంగీత, సాహిత్య కళా రంగాల్లోను, టి.వి. రేడియో వంటి దృశ్యశ్రవణ మాధ్యమాల్లోను తెరేష్‌బాబు పట్టిందల్లా బంగారమయింది. కవిత, కథ, నాటకం, పాట, గజల్‌ వంటి ప్రక్రియల్లో ఆయన రాసింది రత్నమయింది. ‘నీ చేతికి ఆయుధాన్నివ్వడం కోసం రాలేదు నేను/ నువ్వే ఒక మహా ఆయుధానివన్న స్పృహను నీచేతిలో పెట్టడానికొచ్చాను’ అని తెలుగు పాఠకుడి చేతిలో చేయివేసి బాస చేసిన తెరేష్‌బాబు మహత్తరమైన ఆ బాధ్యతను విజయవంతంగా నెరవేర్చి మూడు దశాబ్దాల తన సాహితీ ప్రస్థానాన్ని ముగించుకొని సెప్టెంబర్‌ 29 సాయంత్రం నేలతల్లి గుండెల్లో కలిసిపోయాడు. కవన నక్షత్రమై గగనమెక్కాడు. పైడి తెరేష్‌బాబు జీవిత సాహిత్య గ్రంథపుటలను తిరగేస్తే కొండంత స్ఫూర్తి కలుగుతుంది.
గాయకుడైన తండ్రి శాంతయ్య ప్రేరణతో, ఒంగోలు కళావాతావరణ ప్రభావంతో బాల్యంలోనే సంగీత సాధనచేసి 14 సంవత్సరాల వయస్సులోనే తెరేష్‌బాబు తబలిస్టుగా పేరు ప్రఖ్యాతులందుకున్నాడు. సాంఘీక, పౌరాణిక నాటకాలకు, పాటకచేరీలకు వాద్య సహకారమందిస్తూ ఆ చిరుసంపాదనతో తన నిరుపేద కుటుంబానికి అండదండలందించాడు. డా. ధారా రామనాథ శాసి్త్ర, పింగళి పాండురంగారావు లాంటి సాహితీవేత్తల ప్రోత్సాహంలో, వర్ధమాన సమితి, ఎఱ్ఱన పీఠం లాంటి సాహిత్య సంస్థల వెలుగు జాడ ల్లో తెరేష్‌బాబు తన సృజనాత్మక ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నాడు. పైడిశ్రీ కలం పేరుతో ఇబ్బడి ముబ్బడిగా రచనలు చేస్తూ కవిగా, నాటక కర్తగా, ప్రయోక్తగా తెరేష్‌బాబు అతి చిన్నవయస్సులోనే ఎంతో పరిణితి సాధించి ఉద్దండ పండితోత్తములకు గుండెల్లో గుబులు పుట్టించాడు. 
‘చీకటి శక్తుల పతనం కోసం/ చేస్తున్నా ఇదిగో శరసంధానం/ ఈ చైతన్య యాగంలో అయితే కాని ప్రాణం పతనం’ అంటూ తన సృజన లక్ష్యాన్ని ప్రకటిస్తూ తెరేష్‌బాబు శరసంధానం (1985) కవితా సంపుటి వెలువరించి ‘పెన్ను’ తిరిగిన సాహితీవేత్తల ప్రశంసలందుకున్నాడు. ‘సముజ్జ్వల కాంతిమతి’, ‘చిరంతన గీతికాస్మృతి’, ‘ఊహావిరచిత రసానందకృతి’, నిశాంత ధీనిధా, ‘గ్రీష్మ నిక్షిప్తాంగ ఘర్మధార’; చక్రడోలా విహారం, తరళ పరి మళ కిరణం లాంటి సంస్కృత సమాస భూయిష్ఠ పద ప్రయోగ శైలి ‘శరసంధానం’ కవి త్వంలో ఆద్యంతం తొణికిసలాడుతుంది. కారంచేడు, చుండూరు సంఘటనల అనంతరం ఆంధ్ర రాష్ట్రంలో వెల్లువెత్తిన ఆత్మగౌరవ పోరాటాలతో దళితవాద చైతన్యం దశ దిశలా వ్యాపించింది. దళిత సాహిత్య ఉధృతి వేగవంతమయింది. ఈ నేపథ్యంలో పైడిశ్రీ సాహిత్య ప్రస్థానం ఒక గుణాత్మకమైన మలుపు తిరిగింది. అప్పటి వరకూ శ్రీశ్రీ శాబ్దిక మహేంద్ర జాలంలో, తిలక్‌ అనుభూతివాదంలో మునిగితేలుతున్న పైడిశ్రీ జనరల్‌ సాహిత్య ఒరవడిని విడిచిపెట్టి నిర్దిష్టమైన ఎరుకతో తన సామాజిక అస్తిత్వ మూలాల ను తడుముకోవటం ప్రారంభించాడు. లౌకిక వాస్తవాల్ని అలౌకిక స్వప్నాలుగా వక్రీకరించే సాహిత్య నైజాన్ని తెరేష్‌ బాబు సమూలంగా తిరస్కరించాడు.
ఇలాంటి తిరస్కారంతో, ధిక్కారంతోనే ఆయన నిశాని అనే సంచలనాత్మక కవిత రాశాడు. మద్దూరి నగేష్‌ బాబు, జి. లక్ష్మీనరసయ్య (వరదయ్య) ఖాజా లాంటి తాత్విక బంధువులతో కలిసి తెరేష్‌బాబు వెలువరించిన ‘నిశాని’ కవిత దళితవాద చర్చోపచర్చలకు కేంద్రబిందువై వర్త మాన సాహిత్యాన్ని కదిపి కుదిపివేసింది. 
కేవలం దళిత కవిత్వంలోనే కాకుండా మొత్తం వచన కవిత్వంలోనే తెరేష్‌బాబు అల్పపీడనం (1996) సంకలనం విశిష్టమైనదని విమర్శకులు అంగీకరించారు. ‘అల్పపీడనం’లోని ‘ఏడుకట్ల సవారి’; ‘బండి చక్రం మీద ఈగ’ లాంటి కవితల ద్వారా తెరేష్‌బాబు దళిత ఉద్యమ నిశ్శబ్దాన్ని ఎత్తిచూపాడు. ‘శస్త్ర చికిత్స చేయడం ఉద్యమం/ కాకుల్ని కొట్టి గద్దలకేసే ఫార్మూలాల్ని ధ్వంసం చేయడం ఉద్యమం’ అంటూ ఉద్యమానికి కొత్త భాష్యం చెప్పాడు. అందరిలాగా గాయాన్ని ఫోటో తీయడం ఈ కవికి చేతకాదు. కష్టపడైనా సరే గాయాన్ని ఎక్స్‌రే తీస్తాడు. అందుకే ‘అల్పపీడనం’లో గాయం తాలూకూ చీమూ నెత్తురులు కనిపించవు. గాయానికి కారణమైన వ్యవస్థ స్వరూప స్వభావాలను పాఠకుడి మనసుపై కవి స్పష్టంగా ముద్రిస్తాడు. తద్వారా పాఠకుడు దేన్ని ఎటాక్‌ చేయాలో తెరేష్‌బాబు సూచిస్తాడు. ‘ఐదోతనం’; ‘కుక్క కరిచిన వార్త’, ‘మట్టి బలపం’ వంటి కవితల్లో తెరేష్‌ స్ర్తీవాద చైతన్యాన్ని అద్భుతంగా కవిత్వీకరించాడు. ‘వాడి తొడల తీట సద్దుమణగటానికి/ కావల్సింది కండరాల చీలిక మాత్రమే’ అంటూ సజ్జెలగూడెం మాదేవమ్మపై జరిగిన అత్యాచారాన్ని రెండు మాటల్లో తెరేష్‌ బాబు ప్రతిభావంతంగా ఆవిష్కరించాడు. ‘పొద్దుపొడవటం ఆలస్యం/ వంటిళ్ళ మీద వర్షించి ఆహార పంటలౌతూ/ పొద్దు గూకటం ఆలస్యం కండరపు నాగేళ్ళు దిగమింగి కడుపు పంటలౌతూ’ అని స్ర్తీలెదుర్కొంటున్న రోజువారి హింసను అక్షరాల్లో తర్జుమా చేశారు. ఉత్పత్తిని, పునరుత్పత్తిని ఇంత ఆర్ద్రంగా కవిత్వీకరించిన దాఖలాలు స్ర్తీవాద సాహిత్యంలో లేవు.
పైడి తెరేష్‌బాబు అత్యుత్తమ ప్రయోగవాది. క్యాసెట్‌ రూపంలో ఆయన వెలువరించిన ‘హిందూ మహాసముద్రం’ తెలుగు దీర్ఘకవితల్లో అగ్రభాగాన నిలుస్తుంది. ‘దళిత సాంస్కృతిక రాజకీయ చైతన్యం పురివిప్పిన తరువాత వచ్చిన మొత్తం కవిత్వంలో ఈ శ్రవ్య కవిత అత్యుత్తమన శ్రేణికి చెందిందనవచ్చు. ఒక కవిత్వపరంగానే కాదు, చారిత్రక అవగాహన సాంస్కృతిక స్పహ విషయంలో కూడా ‘హిందూ మహాసముద్రం’ క్లాసిక్‌ లక్షణాలను సంతరించుకుంది’ అని యస్‌. రామకృష్ణ చెప్పిన మాట అక్షరాలా నిజం. ‘కుహనా సమైక్యతను పాడే సముద్రం నోట్లో కాండ్రించి ఉమ్మడానికి ఇంకా సందేహిస్తారే! ఇది పచ్చి దగా కోరు సముద్రం’ అంటూ హిందూ సామ్రాజ్యవాదంపై తెరేష్‌బాబు నిప్పులు కురిపించాడు. ‘యుద్ధం కన్నా యుద్ధ భయం దుర్భరం/ సైనిక దాడి కన్నా సాంస్కృతిక దాడి ప్రమాదకరం’ అంటూ ప్రపంచీకరణ ప్రభంజనంలో కొట్టుకుపోతున్న గొర్రెల మందల్ని హెచ్చరించాడు తెరేష్‌బాబు. ఒక్క కేబుల్‌ కనెక్షన్‌ ద్వారా అణువణువునూ ఆక్రమిస్తున్న పాలవన్నె విషం పట్ల జాగ్రత్త వహించమని హితవు పలుకుతాడు పైడి. అస్తిత్వ ఉద్యమాల ఉమ్మడి చైతన్యానికి అడ్డుకట్టవేస్తున్న హిందూ సామ్రాజ్యవాదం అమెరికన్‌ సామ్రాజ్యవాదాల పెను ప్రమాదాల తీరుతెన్నుల్ని ‘నాలుగో ప్రపంచం’ కవితా సంకలనం ద్వారా తెరేష్‌బాబు శిల్పసుందరంగా చాటిచెప్పాడు.
పైడి తెరేష్‌బాబు విశాలమైన ప్రాపంచిక దృక్పథం కలిగిన కవి. అందుకే దళితవాదం దగ్గరే ఆగిపోకుండా, ఆత్మబంధువుల అస్తిత్వ ఉద్యమాలకు కొత్త ఊపిరులూదాడు. ప్రాణ స్నేహితుడిలా ప్రజాస్వామ్య పోరాటాలతో కరచాలనం చేశాడు. తెలంగాణ, దండో రా ఉద్యమాలకు మనసారా సంఘీభావం ప్రకటించాడు. ‘ఏకపక్ష దోపిడీకి ఏకైక సూత్రం/ కలిసి ఉంటే కలదు సుఖం/ దగాపడ్డ బిడ్డలకు తారక మంత్రం/ వేరుపడితే ప్రగతి సులభం’ (కావడి కుండలు) అంటూ సమైక్యవాద కుట్రల్ని త్రోసిరాజని, తెలంగాణ ప్రజల జీవనపోరాట సారాంశాన్ని నాలుగు పాదాల్లో ఉదాత్తంగా సూత్రీకరించాడు పైడి. అంతేకాకుండా ‘కుండల్లా విడిపోదాం, కావడి బద్దల్లా కలిసుందాం’ అనే చారిత్రాత్మక నినాదంతో తెలంగాణ సంఘీభావ కవిత్వానికి ఆమోదయోగ్యమైన నిర్వచనాన్ని అందించాడు. ఉన్నతమైన రాజకీయ దృక్పథం సునిశితమైన కళాత్మక నైపుణ్యాల సమన్వయంలో నుంచే ఉత్తమ రచన ఆవిర్భవిస్తుందంటాడు మావో. వ్యంగ్యం అత్యంత శక్తివంతమైనది. హేళనతో కూడిన హాస్యంతో; పదునైన వ్యంగ్యంతో శత్రువును చీల్చి చెండాడవచ్చునంటాడు డా. అంబేద్కర్‌. మావో, అంబేద్కర్ల అభిప్రాయాలకు అక్షరదర్పణం తెరేష్‌ కవిత్వం. ఈ విధమైన రాజకీయ ఎరుకతో, వ్యంగ్య శైలితో శత్రువు ఆయువుపట్టును పసిగట్టి/ తదనుగుణంగా యుద్ధం చేయటం తెరేష్‌బాబుకు చద్దికూటితో పెట్టిన విద్య. జానపద గీతాల్లోని మౌఖిక ఛందోరీతులను తన కవితా నిర్మాణ పద్యాలతో మేళవించి సందర్భానుసారంగా తెరేష్‌బాబు వచన కవితా ప్రక్రియకు కొత్త నడకలు నేర్పాడు. ఒక్కొక్కసారి గజల్‌ నడకలను, ముక్తపదగ్రస్త శైలిని గమ్మత్తుగా సమన్వయపరిచి అపూర్వమైన రచనా శైలితో పాఠకుల్ని వశపరుచుకుంటాడు పైడి తెరేష్‌బాబు. అందుకే ఈ కవితా వీరబాహుడి శైలి సిరాల్లోకి ఇంకిపోకుండా, ఆపాదమస్తకం సిరల్లోకి ధమనుల్లోకి చొచ్చుకుపోతుంది. ‘చీకట్ల కత్తెరలో గొంతుక చిత్రంగా తెగిపోయినా/ నాకేమి కానట్టు/ నాదేమి పోనట్టు/ నవ్వుతూనే చేస్తాను నవగీతాలాపన’ అని సగర్వంగా ప్రకటించిన పైడి మృత్యువుతో పోరాడుతూ కూడా నిన్న మొన్న చుండూరు తీర్పుకు వ్యతిరేకంగా నేతిబీరకాయ లాంటి న్యాయస్థానాలపై అక్షరాల పిడుగులు కురిపించాడు. వార్తలకు, భక్తికి, సంగీతానికి, పర్యావరణానికి ఉన్నట్టే సాహిత్యానికి కూడా ఒక ప్రత్యేక చానల్‌ నెలకొల్పిన వాళ్ళే 21వ శతాబ్దపు వైతాళికులని దార్శనిక దృష్టితో పిలుపునిచ్చాడు. అందుకోసం పరితపించాడు. అందుకే పైడి తెరేష్‌బాబు 21వ శతాబ్దపు వైతాళికుడు. సాహిత్యంలో విజేతగా అందరి మన్ననలందుకున్న తెరేష్‌బాబు మద్యానికి బానిసయ్యాడు. ప్రమాదకరమైన ఈ మద్య బానిసత్వం నుండి దళిత బహుజన కవులు బయటపడకపోతే జాతి తీవ్రంగా నష్టపోతుంది. 
- డాక్టర్‌ కోయి కోటేశ్వరరావు
9440480274

Andhra Jyothi Telugu News Paper Dated : 06/10/2014 

Thursday, September 25, 2014

చెదిరిన ప్రజాస్వామిక తెలంగాణ స్వప్నం By నలమాస కృష్ణ


తెలంగాణ ప్రజల సుదీర్ఘమైన పోరాటం ఫలితంగా రాష్ర్టం ఏర్పడిరది. పోలవరం ప్రాజెక్టువంటి అమానవీయమైన అప్రజాస్వామిక ప్రాజెక్టుతోపాటు అనేక షరతులు విధించడానికి కాంగ్రెస్‌, బిజెపి సహా అన్ని పార్టీల పాత్ర ఉంది. భౌగోళికంగా అసంపూర్ణమైన షరతులతో కూడిన తెలంగాణ ఏర్పడిరది. తెలంగాణ రాష్ర్టంలో తెలంగాణ రాష్ర్ట సమితి అధికారంలోకి వచ్చింది. 60 సంవత్సరాల కోస్తాంధ్ర దోపిడీ పాలనకు ప్రత్యామ్నాయమైన ప్రజాపాలనను అందిస్తామని వాగ్దానం చేసిన టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి రెండునెలలు అయింది. అధికారంలోకి వచ్చి కేవలం 3 నెలల్లో ప్రభుత్వం పూర్తి ఆచరణను సమీక్షించడం సాధ్యంకాదు. కానీ అది చేపడుతున్న కార్యక్రమాలు, రూపొందిస్తున్న విధానాలు, కోస్తాంధ్ర పాలకులు అనుసరించిన అభివృద్ధి, అణచివేత నమూనాకు భిన్నంగాలేవు. గత 60 ఏండ్లలో తెలంగాణలో జరిగిన దోపిడీ, విధ్వంసం, వివక్ష, అణచివేత, పౌర, ప్రజాస్వామిక హక్కుల హననం, హత్యాకాండ, భూమి సమస్య, విద్య, వైద్యం, పారిశ్రామిక విధానం మొదలైన మౌలిక అంశాలపై ప్రభుత్వ అవగాహన-విధానాలు స్థూలంగా స్పష్టం అయినాయి.రైతుల రుణ మాఫీతోపాటు ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసిన ప్రతి అంశానికి టిఆర్‌ఎస్‌ కట్టుబడి ఉందంటూ- మొదటి క్యాబినెట్‌ సమావేశం అనంతరం 40కి పైగా నిర్ణయాలు కెసిఆర్‌ ప్రకటించారు. ప్రజలకు చేసిన వాగ్దానాలు అమలుపరచడం అధికార పార్టీ బాధ్యత.

తెలంగాణలో ఆదివాసులు, దళితులు, సబ్బండ కులాలు ఒక్కటై ఉద్యమించింది ఈ ప్రాంత పీడితప్రజల విముక్తి కోసమే. నేటి తెలంగాణ ఉద్యమం కూడా దోపిడీ, పీడన, వివక్ష, అణచివేత లేని ప్రజాస్వామిక తెలంగాణను కోరుకుంటోంది. కోస్తాంధ్ర, రాయలసీమ దోపిడీవర్గం పోయి ఆ స్థానాన్ని తెలంగాణ బూర్జువా వర్గం ఆక్రమించడాన్ని తెలంగాణ ప్రజలు ఏమాత్రం అంగీకరించరు. తెలంగాణ ఉద్యమంలో అనేక ఉద్యమ, విద్యార్ధి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, మహిళా, మైనార్టీ, కుల సంఘాలు ఉన్నాయి. ఈ పరిస్థితులలో ప్రభుత్వ నిర్ణయాలు రెండు ప్రజానుకూలం, నాలుగు వ్యవతిరేకం అన్న విధంగా తయారు కావడం తెలంగాణ సమాజం తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది.తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం విధించిన షరతులైన ఉమ్మడి రాజధాని, గవర్నర్‌ పాలన, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలైన అంశాలను- టిపిఎఫ్‌ మొదటి నుండి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నది. బిజెపి నేత మోడీ అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రాంతంపై ఉన్న వ్యతిరేకతను బయటపెట్టుకున్నారు. పోలవరం డిజైన్‌ మార్పు అంటూ ద్వంద్వ విధానాలు కొనసాగిస్తూ ఆదివాసుల అంతానికి పరోక్షంగా సహకరిస్తున్న టిఆర్‌ఎస్‌ వైఖరి క్షమార్హం కాదు. గరవ్నర్‌కు విశేష అధికారాలు కట్టబెడుతూ కేంద్రం జులై 4న కేంద్రం లేఖ పంపింది. ఇది తెలంగాణ రాష్ట్రానికున్న అధికారాలను, హక్కులను కేంద్రం హరించడమేనని గర్జించిన టిఆర్‌ఎస్‌ అందుకు చేపట్టిన కార్యాచరణ ఏమీలేదు. పైగా వెంకయ్యనాయుడు, గవర్నర్‌ నరసింహన్‌ దౌత్యంతో కొత్త రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. 

భారతీయ రాజకీయ వ్యవస్థలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ప్రజాస్వామికంగా ఉండవలసిన ఫెడరల్‌ సంబంధాలను కేంద్రం ఏకపక్షంగా అణచివేస్తున్నది. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయకుండా టిఆర్‌ఎస్‌ రాజీ వైఖరి అవలంభిస్తున్నది. ఆంక్షలను అడ్డుకోని టిఆర్‌ఎస్‌, కనీసం అధికారం దక్కినాక కూడా తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడలేకపోతున్నది. హైద్రాబాద్‌పై సర్వాధికారాలు గవర్నర్‌కు కట్టబెడుతుంటే అడ్డుకోలేకపోయిన టిఆర్‌ఎస్‌ వైఖరి- దాని దళారీ బూర్జువా స్వభావానికి, అవకాశవాదానికి నిదర్శనం.తెలంగాణ ప్రజలను ఏ అభివృద్ధి నమూనా దశాబ్దాలుగా పీల్చి పిప్పి చేస్తున్నదో- అదే సామ్రాజ్యవాద, కార్పొరేట్‌ అనుకూల అభివృద్ధి నమూనాను ప్రభుత్వం బహిరంగంగా, సగర్వంగా ప్రకటించింది. కేంద్రీకృతాభివృద్ధి సమాజ వినాశనానికి దారి తీస్తుందనేది అనుభవమే. ఓవైపు గ్రామ ప్రణాళిక అంటూనే మరోవైపు హైద్రాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిధి దాటి దక్షిణ తెలంగాణను కలుపుకుంటూ మరో 60 కి.మీ. పరిధి అవతలి నుండి రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం ప్రతిపాదన చేశారు. దీనివల్ల దక్షిణ తెలంగాణ ఉనికే ఉండదు. హైద్రాబాద్‌ ఔటర్‌ రింగురోడ్డు సృష్టించిన విధ్వంసంనుండి సమీప ప్రాంతాలు కోలుకోలేకుండా అయినాయి. అశాస్త్రీయంగా నగరాల వృద్ధి శాశ్వత సమస్యలకు దారితీస్తుంది. పెద్ద నగరాలు దోపిడీ కేంద్రాలవుతాయి. అనివార్యంగా వలసలకు ప్రోత్సాహం లభిస్తుంది. తాత్కాలిక ప్రాతిపదికనే ఏర్పడే శ్రామిక జీవితాలు దుర్భరంగా మారుతాయి.

పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను దుర్భర దారిద్య్రంలోకినెట్టే పథకానికి మరోపేరే నగరీకరణ-సుందరీకరణ. దీన్ని ప్రోత్సహించడమంటే ప్రపంచ బ్యాంక్‌ కార్యక్రమాన్ని అమలు చేయడమే. కోటిన్నర జనాభాతో హైద్రాబాద్‌ నగరాన్ని నిర్మించాలనే కోరికలో శాస్త్రీయత, హేతుబద్ధత లేదు.ఇన్ఫర్‌మేషన్‌ టెక్నాలజీ, ఇన్వెస్‌‌టమెంట్‌ రీజియన్‌గా హైద్రాబాద్‌ను ప్రకటించడం, ఎగుమతుల ఆధారిత ఫార్మా ఇండస్ట్రీని నెలకొల్పడమంటే రాజధాని నగరాన్ని ఎమ్‌ఎన్‌సిలకు అప్పగించడమే. పారిశ్రామిక విధానం వ్యవసాయాధారితమైనదిగా ఉండాలి. అందుకు భిన్నంగా ప్రభుత్వవిధానం ఉంది. వ్యవసాయ ఆధారితమైన పారిశ్రామిక విధానం చేపడ తామని టిఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రణాళికలో హామీ యిచ్చింది. కాని ఆచరణలో ఐటి ఎగుమతులు, మందుల కంపెనీల ఎగుమతుల కోసం ప్రపంచబ్యాంక్‌ సిఈవో పాత్రను కెసిఆర్‌ స్పష్టంగా నెత్తికెత్తుకున్నారు. సామ్రాజ్యవాద, బహుళజాతి కంపెనీల ప్రతినిధులకు తెలంగాణ నిత్య దర్శమ కేంద్రంగా మారింది. అజిమ్‌ ప్రేమ్‌జీ, అనిల్‌ అంబానీ, కుమార మంగళం బిర్లా, టాటా, జిందాల్‌, ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి, మైక్రోస్టాఫ్‌ యిండియా చైర్మన్‌ భాస్కర్‌ ప్రామాణిక బడా బడా తిమింగలాలను తెలంగాణకు ఆహ్వానిస్తున్నారు. నాడు రాజశేఖర్‌ రెడ్డి, అంతకు పూర్వం చంద్రబాబు నాయుడు కంటే వేగంగా బడా పెట్టుబడులను ఆకర్షించే పనిలో తెలంగాణ ప్రభుత్వం నిమగ్నమెంది. దీని పర్యవసానం ఎంత దారుణంగా ఉంటుందో గత అనుభవాల నుండి అర్థం చేసుకోవచ్చు.

ప్రతి పేద రైతుకు, ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి అని ప్రభుత్వం ప్రకటిం చింది. తెలంగాణలో ఉన్న మిగులు భూమి ఉన్నదెంత? భూస్వాముల చేతుల్లో ఉన్నదెంత? ప్రభుత్వ భూమి ఎంత? ఇప్పటికీ స్పష్టమైన గణాంకాలు ఏవీ లేవు. జిల్లాకు ఒక్కరిద్దరికి భూమి పట్టాలిచ్చి ఇదే ప్రపంచంలో గొప్ప విప్లవం అంటూ తమకు తామే కితాబులిచ్చుకోవడం, అందుకు కొంతమంది ప్రభుత్వ ఆస్థాన మేధావులు భజన చేయడం తెలంగాణ రాష్ట్రంలోనే చెల్లింది. భూమి సమస్యను తరతరాలుగా తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారాన్ని దోపిడీ వర్గ ప్రభుత్వాలు ఎంతమేరకు చూపించగలవో 60 ఏండ్ల భారతదేశ చరిత్రలో జరిగిన భూపంపకాలు, భూసంస్కరణ చట్టాలు నిరూపించాయి. అయినా తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని అమలుచేయించుకోవడం ప్రజల బాధ్యత. దళితులకు భూ పంపిణీతో పాటు సమాజంలో 90 శాతం భూమిలేని రైతుకూలీలకు సంబంధించిన సమస్య పరిష్కరించడమే భూమి సమస్యకు నిజమైన పరిష్కారం. 

గోల్కొండ ఖిల్లాపైన జెండా ఎగరేసి నలుగురికి పట్టాలిచ్చారు. 2004 మావోయిస్టు చర్చల ఫలితంగా రాజశేఖర్‌ రెడ్డి చేపట్టిన కుహనా భూ పంపిణీ కార్యక్రమంవలె ఇది కావద్దంటే భూసేకరణ పంపకం శాస్త్రీయ పద్ధతిలో జరగాలి. దున్నేవాడికే భూమి ప్రాతిపదికన ఈ ప్రభుత్వం భూ పంపకం ఎలాగూ చేయలేదు. కనీసం చట్టబద్ధంగానైనా భూ గరిష్ఠ పరిమితి చట్టాలు అమలు చేయవచ్చుగదా! కాని దళితులకి భూ పంపకం గొప్ప విప్లవమని ప్రజలను మభ్యపెడుతూ- 2000 ఎకరాలు రాజకొండ ప్రాంత భూములను సినిమా పరిశ్రమకు కేటాయించారు. లక్షల ఎకరాలు పరిశ్రమల అధిపతులకు కట్టబెట్టడానికి సర్వే చేయించారు. కాని 80 గజాల యింటి స్థలం కూడా లేని పేదవాని గురించి ఆలోచించే అవసరం ప్రభుత్వానికి లేకుండా పోయింది.భూ అక్రమాలపై సమీక్ష జరపాలనేది తెలంగాణ ఉద్యమంనుంచి వచ్చిన డిమాండ్‌. ప్రభుత్వ నిర్ణయం విధానపరంగా సరైనదే. కానీ అక్రమార్కుల చిట్టా విప్పడం తిమింగలాల నుండి ప్రారంభం ఎందుకు కాలేదో ప్రభుత్వం దగ్గర జవాబు లేదు. యన్‌ కన్వెషన్‌ గురుకుల్‌ ట్రస్టు భూముల అక్రమాలపై చూపించిన ప్రతాపం బడా అక్రమార్కులపై ఎందుకు చూపించడంలేదు? తెలంగాణ ఉద్యమకారులపై అక్రమ కేసుల ఎత్తివేతకు 2001 డెడ్‌లైన్‌ విధించింది ప్రభుత్వం. కానీ, అంతకుముందు 1995 నుండి మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొని తెలంగాణ కొరకు పోరాడినవారి కేసులు సంగతి ఏమిటి? కేసుల ఎత్తివేతల గురించి అధికారిక ఉత్తర్వులు నేటికీ రాలేదు.

ప్రక్క రాష్ట్రంలో సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన వారిపై చంద్రబాబు కేసులు ఎత్తివేశారు. కేసుల ఎత్తివేతపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చాలా ప్రమాదకరమైనది. స్వాతంత్య్రోద్యమంలో నిజాయితిగా పోరాడిన వారు బ్రిటిష్‌ వలస పాలన అనంతరం కూడా జైళ్లల్లో మగ్గారు. ఆ రకమైన చరిత్రనే పునరావృతంచేస్తూ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం నేటికి కేసులు ఎత్తివేయకపోగా తెలంగాణ ప్రజలపై పరోక్ష, ప్రత్యక్ష నిర్బంధ, నిషేధాలను అమలుచేస్తున్నది. సిపిఐ(మావోయిస్టు)తో పాటు దాని అనుబంధ ప్రజాసంఘాలపై నిషేధాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వ విధానం స్పష్టంచేస్తుంది. చట్టాన్ని వ్యతిరేకించేవారిని చట్టవ్యతిరేక పద్ధతుల్లో హత్యలు చేస్తామని హైదరాబాద్‌ శివార్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ ద్వారా రుజువుచేశారు. 
తెలంగాణ ఉద్యమానికి పాటలతో, మాటలతో, కార్యాచరణతో ఊపిరిలూదిన అనేక మందిని టిడిపి, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు పొట్టన బెట్టుకున్నాయి. ప్రజాస్వామిక తెలంగాణ పోరాటంలో అసువులు బాసిన బెల్లి లలిత, శ్రీకాంత్‌, అయిలయ్య, రవీందర్‌ రెడ్డి, కనకాచారి, సుదర్శన్‌, నల్లావసంత్‌, వనిపెంట వెంకటేశ్వర్లు మొదలుకొని- టిపిఎఫ్‌ అధ్యక్షులు ఆకుల భూమయ్య వరకూ, తెలంగాణలో జరిగిన ప్రతి హత్యపైన నిష్పక్షపాత దర్యాప్తుకు ఆదేశించి నిజాన్ని నిగ్గుతేల్చడం ప్రభుత్వ విధి. తెలంగాణలో ఆరు దశాబ్దాలుగా జరిగిన చట్ట ఉల్లంఘ నలు, అక్రమ కేసులు, నిర్బంధాలు, బూటకపు ఎన్‌కౌంటర్లు, నల్లదండు ముఠాల హత్యలపై ప్రభుత్వం ఒక్క మాట మాట్లాడటంలేదు. ఈనాటికీ తెలంగాణలో అక్రమ అరెస్టులు, పోలీసుల వేధింపులు, నిర్బంధాలు, రాజకీయ భావాలకు అప్రకటిత నిషేధాలు నిత్యకృత్యంగా కొనసాగు తున్నాయి. విద్యార్థులపై హైద్రాబాద్‌లో జరిగిన లాఠీచార్జి, మెదక్‌ జిల్లా రైతాంగంపై జరిగిన లాఠీచార్జీలు ప్రభుత్వ పోకడ ఎటో స్పష్టం చేస్తున్నాయి

మహిళల స్వావలంబన కోసం కట్టుబడి ఉన్నామన్న పాలకులు మద్య రహిత తెలంగాణ బదులు మద్యం ఏరులు పారే ఎకై్సజ్‌పాలసీని చేపట్టారు. వరకట్నంగా 51 వేలు `సౌభాగ్యలక్ష్మి' పథకం ద్వారా అందిస్తామంటున్న ప్రభుత్వం, ఈ జనాకర్షణ నినాదం యిచ్చేముందు మహిళల స్థితికి కారణం అయిన వరకట్న దురాచారం కనీసం త…ప్పు అని కూడా అనడం లేదు. వరకట్న నిషేధచట్టం అమలుచేస్తామని అనగకపోగా, వరకట్నం చెల్లిస్తామంటున్నది ప్రభుత్వం. ఆరోగ్యశ్రీకి, విద్యారంగంలో ఫీజు రీయంబర్‌‌సమెంటుకు వరకట్నానికి కూడా ప్రభుత్వానికి కనబడనంత స్పృహలేని స్థితి తెలంగాణ ప్రభుత్వానిది. హైదరాబాద్‌ చుట్టూ, తెలంగాణలో పట్టపగలు అర్ధరాత్రిఅనే తేడాలేకుండా మహిళలపై దాడులు, అత్యాచారాలు చాలా సాధారణ మైనాయి. వందలాది ఇన్నోవ కార్లు, హైఫై టెక్నాలజితో నేరాలను నిరోధిస్తామని, మహిళలకు రక్షణకల్పిస్తామని పదే పదే మాట్లాడుతున్న ప్రభుత్వాధినేతలకు కనీసం సంఘటనలు కూడా పట్టినట్టుగా కల్పించడంలేదు.

విద్య, వైద్యం- ప్రైవేటు వ్యాపారం అయిన నేపథ్యంలో కెజీ నుండి పిజి వరకు ఉచిత నిర్బంధ విద్య అని చెప్పిన టిఆర్‌ఎస్‌ ఈనాటికీ స్పష్టమైన విధానం ప్రకటించలేదు. కార్పొరేటు విద్యావిధానాన్ని రద్దుచేయకుండా ప్రభుత్వరంగంలోనే అందరికీ విద్య ఎలా సాధ్యం? తెలంగాణకు చెందిన పెద్ద విద్యాసంస్థల అధిపతులు గులాబీ కండువాలు కప్పుకున్నారు. కార్పొరేట్‌ సంస్థలతో టిఆర్‌ఎస్‌ గతం నుండి ఒప్పందాల్లో భాగంగానే ప్రభుత్వం విద్యారంగాన్ని విధానం లేని నినాదంగానే కాలం వెళ్ళదీస్తున్నది. వారసత్వ కట్టడాలను, చారిత్రక ప్రదేశాలకు పూర్వ వైభవం తీసుకొస్తామన్న… కేసిఆర్‌ చారిత్రక ఉస్మానియా ఆస్పత్రి కనీస వసతులులేక శిథిలావస్థలోవుంటే దాన్ని పట్టించుకోకుండా కార్పొరేట్‌ ఆస్పత్రుల భజనచేస్తున్నారు. ఇది ప్రభుత్వ ఆలోచనా తీరుకు చిన్న ఉదాహరణ మాత్రమేకాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం సరైన మార్గదర్శకాలను రూపొందించక పోగా భవిష్యత్‌పై కోటి ఆశలతో ఉన్న తెలంగాణ విద్యార్ధి- నిరుద్యోగుల మధ్య వైరుధ్యాన్ని పెంచే విధంగా ప్రభుత్వ విధానంఉంది. ఆందోళనకు పరిష్కారమార్గంగా పోలీసులపై ఆధారపడుతున్నది. లక్ష ఉద్యోగాలు వెంటనే ప్రకటించే అవకాశం ఉన్నా, ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం చేస్తున్నది.

వక్‌‌ఫ భూములు, ఓపెన్‌కాస్‌‌ట మైనింగ్‌, కరీంనగర్‌ గుట్టల తరలింపు, ఇసుక అక్రమ రవాణా, ఆదివాసుల స్వయంపాలన, అసంఘటిత కార్మికుల జీవనభద్రత అంశాలపై ప్రభుత్వ అవగాహన, వైఖరి పై విషయాలకు భిన్నంగా లేదు. ఆదిలాబాద్‌ జిల్లాల్లో కాశీపేట మండలంలో తలపెట్టిన కళ్యాణికుని ఉపరితల బొగ్గుగని ప్రజల పోరాటం వల్ల సింగరేణి యాజమాన్యం వెనక్కి తగ్గింది. తెలంగాణ ప్రభుత్వం బలవంతపు భూసేకరణ కోసం ప్రజలను భయ భ్రాంతులు చేస్తూ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అటవీ మంత్రి జోగురామన్న కవ్వాల్‌ టైగర్‌జోన్‌ నిర్మాణంలో ప్రజలను తరిమికొట్టే కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. కరీంనగర్‌లోని గుట్టలను టిఆర్‌ఎస్‌ నాయకత్వం, వారి అనుచరణగణం వాటాలుగా పంచుకొని ఎదురులేని అక్రమాలకు పాల్పపడుతున్నారు.తెలంగాణ ఉద్యమంలో మేధోపరంగా కీలకపాత్ర వహించిన వారిలో కొంత సెక్షన్‌ను, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలలోని కొందరిని తమవైపు తిప్పుకుని వారికి అధికార పదవుల్లో కొంత వాటా ఇచ్చి ప్రశ్నించే గళాలను మూయించే ప్రయత్నం జరుగుతున్నది. ఉద్యమంలో పేరుపొందిన వారిని ఆకర్షించడం, తమలో భాగం చేసుకోవడమే విధానంగా సాగిస్తున్నది. టిఆర్‌ఎస్‌ను విమర్శించే వారికి జవాబు యివ్వడానికి మేధోపరమైన రక్షణ కవచంగా వీరిని ఉపయోగించుకుంటున్నది. పశ్చిమ బెంగాల్‌లో సింగూర్‌ ప్రజలు టాటా కంపెనీని తన్ని తరిమితే, ఆ ప్రజా ఉద్యమానికి మద్దతిచ్చిన తెలంగాణ ప్రజాస్వామికవాదులు అదే రతన్‌ టాటాకు తెలంగాణ సర్కార్‌ ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానించి తెలంగాణ భూములను ధారాదత్తం చేస్తామంటే నోరు మెదపడంలేని దుస్థితి దాపురించింది.

టాటాలను తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌ కావాలని కెసిఆర్‌ కోరుకుంటున్నారు. 50వేల ఎకరాల భూములు పారిశ్రామిక వేత్తలకు యిస్తామన్నారు. ఇంతకు వారు ఏర్పాటుచేయనున్న పరిశ్రమలేమిటో స్పష్టంగా చెప్పనప్పటికీ సులభంగా గ్రహించవచ్చు. ఈ దేశీ, విదేశీ, బడా, దళారీ పెట్టుబడిదారులు దేశ కార్మికవర్గ మూలుగులను పీల్చి పిప్పిచేస్తూ ప్రజలపై ఘోర అణచివేతకు కారణం అయితున్నారు. ఈదళారీ పెట్టుబడి- కేవలం పెట్టుబడిగానే గాక ప్రజల జీవనాడులను నియంత్రిస్తుంది. రాజకీయ పార్టీలపై అదుపు సాధిస్తుంది. అనేక చారిత్రక ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక కారణాలతోపాటు ప్రపంచీకరణ ద్వారా ఉత్పన్నం అయిన అసమానతలు మలిదశ ఉద్యమానికి కారణం అయినాయి. ప్రపంచీకరణ మూలంగా తలెత్తిన సంోభాన్ని ఎత్తిచూపుతూ ఉద్యమ వేడిని రగిలించడానికి శిథిలావస్థలో ఉన్న చేతివృత్తులు, ప్రత్యామ్నాయంలేని వృత్తి కులాలు, విధ్వంసకర అభివృద్ధి నమూనాను - ఉద్యమం విమర్శించింది. తెలంగాణ ఉద్యమాన్ని ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్‌ ఇప్పుడు గుత్త పెట్టుబడి దారులను తెలంగాణపై దండయాత్రకు దింపింది. యిప్పటికే మూలుగులు పీల్చుతున్న దోపిడీ పెట్టుబడిదారులకు ఈ తిమింగలాలు తోడైతే రేపు రానున్న కాలం ఎంత దుర్భరమో ఊహించడమే కష్టంగా వుంది. m

గుత్తపెట్టుబడికి ఒకనొక లక్షణం ఆర్థిక వ్యవస్థను సైనికీకరించడం దానిలో భాగంగానే వరల్‌‌డ క్లాస్‌ పాలసింగ్‌ సిస్టమ్‌ కొత్త ఇన్నెవా కార్లు, సైకిల్‌ మోటార్లు తప్ప ప్రజలకోసం అనుకుంటె పొరపాటు. ఒకవేళ హైద్రాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ కోసమైతే ఉస్మానియా దావఖానా నుండి మొదలుకొని వందలాది చారిత్రక నిర్మాణాలు సంస్థలు పునరుద్ధరణకు నోచుకునేవి. సబ్బండ కులాలు, సకలశ్రామికుల ఆకాంక్షలు నెరవేరే తీరుగా తెలంగాణ ప్రభుత్వ విధానాలు రూపొందే విధంగా ప్రభుత్వం పై ఒత్తిడి పెంచవలసి ఉంది. అసాధారణమైన త్యాగాల ఫలమైన తెలంగాణను అవకాశవాద స్వార్ధపరుల చేతిలో దోపిడీ కాకుండా కాపాడుకుందాం! అదే సమయంలో కేంద్రంలోని ఫాసిస్టు బిజెపి ప్రభుత్వం, పక్కలో బల్లెంలాగా తెలంగాణ ప్రజా వ్యతిరేకిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ టిడిపి ప్రభుత్వం- అనుసరిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లాంటి విధానాలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేయాల్సి ఉంది. మేకవన్నె పులుల్లా ఉంటే దోపిడీ వర్గపాలకుల స్వభావాన్ని విప్పి చెప్పి విశాలమైన ప్రజాస్వామిక ఉద్యమానికి నిర్మాణం చేయడమే ఈనాటి తక్షణ కర్తవ్యం. తెలంగాణ రాష్ర్టం కోసం అమర వీరులు కన్న కలలు సాకారం కావాలంటే, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే, తెలంగాణ ఉద్యమం ఇచ్చిన పోరాట స్ఫూర్తితోని ప్రజాస్వామిక తెలంగాణ నిర్మించుకోవడం ముందున్న కర్తవ్యం.

Surya Telugu News Paper Dated: 26/09/2014 


రచయిత సెల్‌ నెం: 98499 96300