Monday, June 17, 2013

అణగారిన జాతికే అధినాయకత్వం ---డా.కాలువ మల్లయ్య


June 17, 2013
'బహుజన హితాయ, బహుజన సుఖాయ' అన్నాడు ప్రపంచానికి మానవీయ బౌద్ధధర్మాన్ని అందించిన గౌతమ బుద్ధుడు. రెండున్నర శతాబ్దాల క్రితమే బుద్ధుడు ఈ మాటలన్నా ఈ దేశంలో బహుజనులు సర్వసంపదలకు సృష్టికర్తలుగా ఉన్నా ఆ సంపదల ననుభవించే స్థితిలో లేరు. ప్రపంచ పీడిత జాతుల ఆశాజ్యోతి అయిన అంబేద్కర్ రాజ్యాధికారంతోనే బహుజనుల స్థితిలో మార్పు వస్తుందన్నాడు. బహుజన రాజ్యాధికారం కోసం నిరంతరం పోరాటాలు జరుగుతూనే ఉన్నా యి. నెల్సన్ మండేలా పోరాటం విజయవంతం కావడం, అమెరికాలో ఓ నల్లజాతీయుడు ఒబామా దేశాధ్యక్షుడు కావడం, భారతదేశంలో అంబేద్కర్ మార్గంలో దళిత బహుజన ఉద్యమాలు ఉధృతం కావడం లాంటివన్నీ బహుజన రాజ్యాధికారం దగ్గర్లోనే ఉందన్న ఆశాభావాన్ని కలిగిస్తున్నాయి. ఏదేమైనా 19వ శతాబ్ది ఖచ్చితంగా బహుజనిజానిదే. సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ రంగాలలో దళిత బహుజనిజానిదే పైచేయి అవుతుండటం గమనించవచ్చు. కావాల్సిన అవసరముంది. అవుతుంది కూడా.

దేశీయతను కాపాడుకోవాలన్నా, ప్రకృతి సమతుల్యత కాపాడబడాలన్నా, మానవీయ విలువలు పెంపొందాలన్నా బహుజన తత్వం, పనీకరణ సంస్కృతి పెరగాల్సి ఉంది. అది బహుజన రాజ్యాధికారంతోనే సాధ్యమవుతుంది. భారతదేశం లాంటి కులాలున్న దేశంలో బహుజన రాజ్యాధికారం ఆవశ్యకత ఎంతో ఉంది. ఎందుకంటే ఈ దేశంలో వేల ఏండ్లుగా బహుజనులుగా చెప్పబడే కులాలవారు పీడితులుగా, అంటరానివాళ్లుగా పీడనకు, అణచివేతకు గురవుతున్నారు. బహుజన రాజ్యాధికారం వచ్చి కుల నిర్మూలన పూర్తిస్థాయిలో జరిగిన కొంతకాలానికిగాని బహుజన కులాల వారికి న్యాయం జరుగదు. ఈ విషయాన్ని ఆనాటి బుద్ధుడు మొదలుకొని ఈనాటి అంబేద్కర్ వరకు ఎంతోమంది తాత్వికులు నొక్కిచెబుతున్నారు.
అయితే బహుజన రాజ్యాధికారం రావడానికి ఎవరు నాయకత్వం వహించాలి? అధిక సంఖ్యలో ఉన్న బి.సీ.లా? ఈ దేశంలోని అత్యంత పీడితులైన దళితులు, గిరిజనులా? అన్న విషయంలోనూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అగ్రవర్ణ పాలకవర్గ పార్టీలు బి.సీ.లు, దళితుల మధ్య ఉన్న మిత్రవైరుధ్యాలను శత్రువైరుధ్యాలుగా చిత్రిస్తూ ఇద్దరి మధ్య ఆజ్యం పోస్తున్నారు. ఈ వైరుధ్యాల నెగదోస్తూ ఇరువర్గాలను తమ పల్లకీలు మోసేవాళ్లుగానే ఉంచుతూ తామే అధికారాలు వెలగబెడుతున్నారు.

పీడితులైన బి.సీ.లు, అత్యంత పీడితులైన దళితుల మధ్య ఐక్యత ఉంటే తప్ప బహుజన రాజ్యాధికారం సాధ్యం కాదన్న విషయం పాలకవర్గ కులాలకు తెలుసు. అందుకే దళిత, బి.సీ.ల ఐక్యత అసాధ్యమన్న భావాన్ని ప్రచారం చేస్తున్నారు. బి.సీ, దళిత మేధావి వర్గంలోని చాలామంది ఈ ప్రవాహంలో కొట్టుకుపోతూ బహుజన రాజ్యాధికార కాలాన్ని పొడిగిస్తున్నారు. బి.సీ.లు, దళితుల మధ్యనున్న వైరుధ్యాలను, మాల మాదిగల మధ్యనున్న వైరుధ్యాలను పరిష్కరించుకొని సఖ్యతతో, సిద్ధాం త బలంతో పనిచేస్తే తప్ప బహుజన రాజ్యాధికారం రాదన్నది వాస్తవం. వచ్చినా అది స్థిరపడదు. ఈ దేశంలో బహుజన రాజ్యాధికారం స్థిరపడి కుల రహిత మానవీయ సమాజం ఏర్పడాలంటే అందుకు ఎవరు నాయకత్వం వహించాలి? ఎందుకు? అన్న ప్రశ్నలకు రకరకాల సమాధానాలున్నాయి, అభిప్రాయాలున్నాయి, వాదాలున్నాయి.

ఈ దేశంలో బహుజన కులాల రాజ్యాధికారం స్థిరపడి కుల నిర్మూలన జరగాలంటే దళితుల నాయకత్వంలో బి.సీ.లు పనిచేయాలని గట్టిగా నమ్ముతున్నవాన్ని. ముందు దళితులు రాజ్యాధికారానికి వచ్చి స్థిరపడితే దానంతటదే దళితులకు సోదర బాధితులైన బి.సీలు కూడా రాజ్యాధికారంలోకి వచ్చే అవకాశముంది. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన బహుజన కథకుల కచ్చీరులో చెప్పాను. దానికి సహజంగానే దళితుల్నుంచి మద్దతు, బి.సీ. రచయితల్నుంచి వ్యతిరేకత వచ్చింది. ఆ సమావేశంలో నేను మాట్లాడిన మాటలు 'వివిధ'లో రెండు వాక్యాల్లో ప్రచురించారు- 'బి.సీ.ల కంటే, మైనారిటీల కంటే ఎక్కువగా నష్టపోయింది దళితులు. ప్రస్తుతం దళితుల్లో ఉన్న చైతన్యం బీసీల్లో లేదు. బీసీలు చాలామంది పాలకవర్గాలుగా మారిపోయారు. కాబట్టి దళితుల నాయకత్వంలోనే మిగతా బహుజనులు ముందుకెళ్లాలి. అంబేద్కరిజాన్ని స్వీకరించడమే బహుజనులందరికీ సరైన మార్గం.' ఈ వాక్యాలకు చాలామంది స్పందించారు. ఇది సరైందేనని దళితులు చెబితే, దీన్ని మీరెలా సమర్ధిస్తారు అని బీసీలు సవాలు చేసారు.

దీన్ని మీరు ఎలా సమర్థిస్తారో వ్యాసం ద్వారా చెప్పాలని కొందరు కోపగించారు కూడా. ఇదే విషయాన్ని నాలుగేళ్ల క్రితం ఒక టీవీలో గంటసేపు నాతో జరిపిన చర్చా కార్యక్రమంలోనూ చెప్పాను. అప్పుడూ ఇలాంటి స్పందనే వచ్చింది. అది లైవ్ ప్రోగ్రాం కాబట్టి అప్పుడే సమాధానం చెప్పాను. ఈ విషయంలో స్పష్టత అవసరం కాబట్టి ఇది రాస్తున్నాను. దీంతో అందరూ ఏకీభవించకపోవచ్చు కాని ఈ విషయం గురించి నిష్పాక్షికంగా ఆలోచిస్తే బహుజన రాజకీయాలకు మేలు జరుగుతుంది.

భారతదేశానికి తరతరాలుగా, యుగయుగాలుగా శాపంగా పరిణమించిన చాతుర్వర్ణ వ్యవస్థ విభజనలో శూద్రులు నాలుగవ వర్ణం వారిగా, సామాజిక అవసరాలన్నీ తీర్చేవారిగా, సంపదల సృష్టికర్తలుగా ఉన్నారు. అయితే ఎన్ని పనులు చేసినా, ఎంత సంపద సృష్టించినా వీళ్ల చేతుల్లో ఆస్తులు అధికారాలు ఉండవు. ఉత్పత్తి సంబంధమైన ఏ పనులు చేయకున్నా పై మూడు వర్ణాలవారు రాజులుగా, అధికారులుగా, మంత్రులుగా, కోశాధిపతులుగా సర్వసుఖాలను అనుభవించే పరిస్థితులను, నేపథ్యాన్ని కులవ్యవస్థ ఏర్పరిచింది. అంతేకాకుండా శూద్రులకు చదువులు నిరాకరించడంతో పాటు వేదాలు వింటే చెవుల్లో సీసం కరిగించి పోయాలన్న ఆదేశాలనూ జారీ చేసి అమలుపరిచింది. చాకలి, మంగలి లాంటి కులాలను హీనంగా చూసింది.

ఈ శూద్రుల్లోంచి వచ్చినవారే బి.సీ.లు. వీరు చాతుర్వర్ణ వ్యవస్థ బాధితులే. అయితే చాతుర్వర్ణ వ్యవస్థ విభజన చాలదన్నట్టు శూద్రుల్లోని కొందరికి లేదా ఆదిమ జాతీయులైన దస్యులను, ఈ దేశపు మూలవాసులైన ఆది ద్రవిడులను పంచములని, ఛండాలురని, చమార్‌లని, మాదిగలని, మాలలని..విభజించారు. డప్పులు కొట్టడం, చెప్పులు కుట్టడం, పాలేర్లుగా ఉండటం, వెట్టి చేయడం, మరుగుదొడ్లు శుభ్రం చేయడం, కాష్టాలు కాల్చడం, ఊరును శుభ్రం చేయడం, జంతు కళేబరాలు మోయడం లాంటి కఠినమైన ఎవరూ చేయని పనులప్పగించారు. కష్టానికి తగిన ఫలితం కూడా లేదు. శూద్రులను చదువుకు మాత్రమే దూరం చేస్తే వీళ్లను చదువుకు, ఊరికి, తుదకు గుడి ప్రవేశానికి కూడా దూరం చేసారు. ఊరి బయటుంచారు. ప్రపంచంలోనూ, మన దేశంలోనూ అత్యంత అన్యాయానికి, దుర్మార్గానికి గురయినవాళ్లు ఈ దళితులు. అత్యంత పీడితులు. శూద్రులకు నేటి బి.సీ.లకున్న కొద్దిపాటి వెసులుబాటు కూడా వీళ్లకు లేదు. ఇది మూడు వేల ఏండ్లుగా కొనసాగుతుంది. అందుకే అంబేద్కర్ లాంటి పీడిత తాత్వికులు తమ సమస్యల పరిష్కారానికి దళిత రాజ్యాధికారం కావాలన్నారు. దాంతోనే దేశాన్ని పీడిస్తున్న కులసమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. శూద్రులకంటే దళితులు అన్ని రంగాల్లో, అన్ని రకాలుగా బాధితులు, పీడితులు కాబట్టి ముందు రాజ్యాధికారం దళితులకే రావాల్సిన అవసరముంది. మనం బహుజన రాజ్యాధికారాన్ని ఎందుకు కోరుకుంటున్నాం? ఎక్కువ సంఖ్యలో ఉన్నాం కాబట్టి అన్నది ఒక్కటే సమస్య కాదు.

తరతరాలుగా, వేల ఏండ్లుగా అన్యాయానికి, చదువులకు, సామాజిక న్యాయానికి దూరమయ్యాం కాబట్టే కావాలంటున్నాం. అన్నీ చేసి, సర్వసంపదలు సృష్టించి ఏమీలేని వాళ్లుగా ఉంచబడ్డాం కాబట్టే బహుజన రాజ్యాధికారాన్ని కోరుతున్నాం. మరి బహుజన రాజ్యాధికార కాంక్షకున్న ఈ కారణాలు, అవసరం బి.సీ.ల కంటే దళితుల కెక్కువ ఉంది కాబట్టి దళితుల నాయకత్వం కావాలి. బి.సీ.ల కంటే దళితులు ఎక్కువ పీడనకు, ప్రపంచంలో ఏ జాతి పడనంత వేదనకు గురయ్యారు కాబట్టే దళిత రాజ్యాధికార అవసరముంది. దళితులను కాదని బహుజన రాజ్యాధికారం మాట ఎత్తడమంటేనే అది అభివృద్ధి నిరోధక చర్య అవుతుంది. వెనుకబడిన ఆలోచనవుతుంది.

దళితుల నాయకత్వంలో రాజ్యాధికారమంటే బి.సీలకు వద్దని కాదు. బహుజనులందరికీ రాజ్యధికారం. దళిత రాజ్యాధికారంతో దానంతటదే బి.సీ.ల, మొత్తంగా బహుజనుల రాజ్యాధికారం వస్తుంది. దళిత రాజ్యాధికారాన్ని ప్రపంచమంతా సానుభూతితో ఆమోదిస్తుంది. అమెరికన్లు నీగ్రోలకు చేసిన అన్యాయానికిగాను ఒబామాను ఎన్నుకొని కొంత వరకయినా క్షమాపణలు చెప్పుకున్నట్టు ఈ దేశంలో దళితులను అంటరానివారుగా ఉంచిన పాపానికి భారతజాతి వాళ్లకు రాజ్యాధికారమిచ్చి క్షమాపణలు చెప్పుకోవాల్సిందే. అంటరానితనం పాటించడంలో చాలామంది బి.సీలకూ భాగస్వామ్యముంది. దళితుల నుంచి వచ్చిన అంబేద్కర్‌లాంటివారు బి.సీల నుంచి రాలేదు. అంబేద్కర్ కేవలం దళితులకే నాయకుడు కాడు. మొత్తం పీడిత జాతులకు నాయకుడు. పీడిత రాజ్యాధికారాన్ని కోరేవాడు.
కుల సమస్యను పెంచి పోషించింది, ఉన్నతీకరించింది, అగ్రవర్ణ రాజ్యాధికార భావనను సుస్థిరం చేసింది హిందూమతం. అందులోని బ్రాహ్మణిజమే ఈ దేశ బహుజనులకు శాపమైంది. మరి అలాంటి హిందూమతాన్ని, అందులోని భావజాలాన్ని మోస్తున్నవారిలో బి.సీ.లే ఎక్కువున్నారు. బి.సీలు డీక్లాసిఫై అయ్యి దళితీకరణం చెందడానికి బదులు, సాంస్కృతీకరణం చెందుతూ బ్రాహ్మణీకరణం చెందుతున్నారు. ఏ కులవ్యవస్థయితే తమ జీవితాలకు గొడ్డలిపెట్టుగా ఉందో దాన్ని నిర్మూలించకుండా పై వర్గంలో చేరడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగమే గొల్లలు యాదవులుగా, కంసాలులు విశ్వబ్రాహ్మణులుగా, శాలీలు పద్మ బ్రాహ్మణులుగా, మంగలివాళ్లు నాయీ బ్రాహ్మణులుగా, బెస్తలు గంగపుత్రులుగా, తెనుగోల్లు ముదిరాజ్‌లుగా బ్రాహ్మణీకరణం చెందడం. మాలమాదిగలు హరిజనులు, దళితుల్లాంటి పదాలను కూడా స్వీకరించకుండా మాల, మాదిగలుగా పేరు చివరన వాడుతున్నారు. డీక్లాసిఫై అయ్యి సంస్కృతీకరణకు దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా ఓ మతంగా కాకుండా ధర్మంగా ఉన్న కులాలకతీతంగా ఉన్న బౌద్ధధర్మాన్ని స్వీకరించినవారిలోనూ దళితులే ఎక్కువున్నారు. కులపరంగానైనా, పీడిత జాతుల పరంగానైనా దళితుల్లో వచ్చిన ఉద్యమాలు, చైతన్యం బి.సీ.ల్లో రాలేదు. ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఓ దామోదర రాజనరసింహ, ప్రజాయుద్ధ వీరుల్లో ఓ గద్దర్, ప్రజాపోరాటాల్లో ఓ కృష్ణమాదిగ లాంటి నాయకులు దళితుల్లోంచి రావడమే సాధ్యం. అంబేద్కర్ ఏర్పరచిన దళిత రాజ్యాధికార సాంస్కృతిక నేపథ్యం, దేశవ్యాప్తంగా, మన రాష్ట్రంలోనూ ప్రవాహంలా వచ్చిన దళిత సాహిత్య నేపథ్య బలం బి.సీ.లకు లేదు.

ఇలా బహుజన రాజ్యాధికారానికి దళిత నాయకత్వం తప్పనిసరిగా అవసరమే అని అర్థమవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో దళితులకంటే కూడా ఎక్కువ పీడితులైన, హీన స్థితిలో ఉన్న బి.సీ.కులాలవారు కొందరున్నా, బి.సీ.ల సంఖ్యాబలమే ఎక్కువయినా బి.సీ.లంతా సహృదయంతో ఆలోచించి దళిత నాయకత్వాన్ని స్వీకరించాలి.
- డా.కాలువ మల్లయ్య
98493 77578
Andhra Pradesh Telugu News Paper Dated : 17/6/2013 

No comments:

Post a Comment