Saturday, December 6, 2014

కుల, వర్గ రహిత సమాజమే అంబేద్కర్‌ అభిమతం By జి. రాములు


            డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ భారతదేశం గర్వించదగ్గ సామాజిక విప్లవకారులలో అగ్రగ ణ్యుడు. గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశ రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, సాహిత్య రంగాలలో అంబేద్కర్‌ ప్రభావం అనన్యసామాన్య మైంది. తరతరాలుగా కులపీడనకు గురై, సమాజం నుంచి వెలివేయబడిన బానిసత్వం కంటే హీనంగా చూడబడుతున్న అస్పృశ్య అణగారిన ప్రజలకు ఆయన ఆరాధ్యదైవంగా నిలిచిపోయాడంటే ఆయన గురించి లోతుగా అధ్యయనం చేయాల్సిందెంతో ఉంది. అంబేద్కర్‌ దళితునిగా జీవించడమే కాదు అంటరాని తనం, కుల వివక్షలకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడాడు. తాను స్వయంగా పేదరికాన్ని అనుభవిం చాడు. భూస్వామ్య విధానం దుష్టస్వభావాన్ని గ్రహించాడు. దానికి వ్యతిరేకంగా పోరాడాడు. సమ సమాజం కావాలన్నాడు. 'బోధించు, సమీకరించు, పోరాడు' అన్న అంబేద్కర్‌ నినాదం ఎంతో ప్రఖ్యాతి గాంచింది. ఆయన తన అభిప్రాయాలను నిర్భయం గా బోధించాడు. వాటి అమలుకై సమీకరించాడు. లక్ష్య సాధనకై నిరంతరం పోరాడాడు. చాలా మంది అంబేద్కర్‌ రచనలను అధ్యయనం చేయకుండానే కేవలం కుల సమస్య గురించే ఆయన అధ్యయనం చేశాడని, అంటరాని వాడు కాబట్టి అంటరానితనానికి వ్యతిరేకంగా కృషి చేశాడని, దళితుల రిజర్వేషన్లకై కృషి చేశాడనే చులకన భావన కలిగి ఉన్నారు. కానీ ఆయనకు దేశ ఆర్థిక విధానం, ప్రభుత్వ స్వభావం, ఉత్పత్తి సాధనాలు, కార్మికోద్యమం, భూస్వామ్య విధానం, స్త్రీ సమస్యలు, ఫాసిజం, దేశ సమగ్రత, కుల వ్యవస్థ, దాని అమానుషత్వం పట్ల స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. ఆయన అభిప్రాయాలతో ఏకీభవించొచ్చు లేదా విభేదించొచ్చు. కానీ ఆయన వాటన్నింటినీ అధ్యయనం చేసింది, తనదైన రీతిలో భాష్యం చెప్పింది సుస్పష్టం. అంబేద్కర్‌ చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలనే పరిశీలిద్దాం. ఉత్పత్తి గుర్తించాలన్నాడు. ప్రజలందరికీ భూమిపై సమాన హక్కులుండాలన్నాడు. కులమతాలకతీతంగా భూములను కౌలుకివ్వాలన్నాడు. గ్రామాల్లో భూస్వామిగాని, కౌలుదారుగాని, వ్యవసాయ కూలీలు గాని ఉండరాదన్నాడు. అందరూ సమానమే అన్నాడు. అందరూ ఉత్పత్తిలో భాగం కావాలన్నాడు. ప్రభుత్వమే నీరు, పని చేసే పశువులు, పరికరాలు, ఎరువులు, విత్తనాలు అందజేయాలన్నాడు. అందు కయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలన్నాడు. భూస్వామ్య విధానం సమాజ పురోగతికి ఆటంకమ న్నాడు. చెప్పడమే కాదు భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాడాడు. ఆనాటి మహారాష్ట్రలోని 'కొంకణ' ప్రాంతంలో భూమి మీద హక్కులు 'ఖోటీ'లనబడే భూస్వామ్య వర్గ చేతుల్లో ఉండేవి. వారు రైతులపై శిస్తు రూపాన అధికంగా డబ్బు వసూలు చేసేవారు. అదే విధంగా పండించిన పంటలో కూడా దౌర్జన్యంగా భాగం తీసుకునేవారు. ఇది కొన్ని దశాబ్దాలపాటు కొనసాగింది. ఈ 'ఖోటీ' పద్ధతికి వ్యతిరేకంగా అంబేద్కర్‌ రైతు ఉద్యమాన్ని నడిపాడు. అటు ఉద్యమాన్ని నిర్మిస్తూనే మహారాష్ట్ర శాసనసభలో తానే 'ఖోటీ' నిర్మూలన కొరకు 1937లో బిల్లు ప్రవేశపెట్టాడు. అది చివరకు 1949లో చట్ట రూపం ధరించే వరకూ పోరాడాడు. అదే విధంగా 'దేశ సౌభాగ్యం దేశ పారిశ్రామికీకరణ మీద ఆధారపడి ఉంది. జాతీయ యాజమాన్యంలో అది జరగాలేకాని ప్రయివేటు వ్యక్తుల పరంగా కాదు' అంటూ ప్రైవేటీకరణను అంబేద్కర్‌ ఖండించాడు.
               దేశంలో ప్రస్తుతమున్న కుల, వర్గ పీడనకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి కార్మికవర్గమే నాయకత్వం వహించాలన్నాడు. 'దేశానికి నాయక త్వం అవసరం. అయితే ఆ నాయకత్వాన్ని వారు వహిస్తారా అన్నది ప్రశ్న. దేశానికి అవసరమైన అలాంటి నాయకత్వాన్ని శ్రామికవర్గం మాత్రమే సమకూర్చగలదని చెప్పడానికి నేను సాహసిస్తు న్నాను' అని 1942 డిసెంబర్‌లో 'శ్రామికవర్గం- ఆదర్శవాదం' అనే విషయంపై మాట్లాడుతూ స్పష్టం చేశారు. కార్మికవర్గ సమస్యలు ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. కార్మికవర్గ భవిష్యత్తుకు సాంఘిక న్యాయం, సాంఘిక భద్రత పునాదులు కావాలని, పటిష్టమైన కార్మిక చట్టాలు దోహదపడుతాయని భావించాడు. అందుకు ముఖ్య చట్టాలైన కనీస వేతనాల చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, కార్మిక సంఘాల గుర్తింపు చట్టాల కొరకు కార్మికుల ప్రతినిధిగా ప్రభుత్వ కమిటీలలోనూ, లాయర్‌గా కోర్టులోనూ, చట్టసభల్లో సభ్యునిగానూ అవిరళ కృషిచేశాడు.
            డాక్టర్‌ అంబేద్కర్‌కు ఫాసిజం ప్రమాదం పట్ల స్పష్టమైన అభిప్రాయం ఉంది. అది మానవాళి మనుగడకు ముప్పని గ్రహించాడు. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో ఆయన 1942లో ఆకాశవాణిలో చేసిన ప్రసంగం గమనిస్తే 'ఈనాడు జరుగుతున్న రెండవ ప్రపంచ యుద్ధం కేవలం ప్రపంచాల విభజన కోసం మాత్రమే కాదు. నియంతృత్వం మీద విజయం సాధించి స్వేచ్ఛా సమానత్వాలు నెలకొల్పడానికి మన కార్మికులు తమ సంపూర్ణ మద్దతివ్వాలి. సాధించబోయే విజయం నూతన, సామాజిక వ్యవస్థకు దోహద పడాలి. స్వాతంత్య్రం సాధించినంత మాత్రాన సరిపోదు స్వాతంత్య్ర ఫలితాలు మనం నిర్మించుకోబోయే సమతా సమాజం మీద ఆధారపడి ఉండాలి' అంటూ ఫాసిజానికి వ్యతిరేక పోరాటంలో కార్మికవర్గ ప్రయోజనాలు ఎలా ఉపయోగించుకోవాలో కూడా సూచించాడు. డాక్టర్‌ అంబేద్కర్‌ దేశ సమగ్రత కాపాడాలని కోరాడు. కులాలు, మతాలు, జాతులు, అనేక సంస్కృతులున్న ఈ దేశంలో ఐక్యంగా ఉంటేనే ప్రయోజనమని భావించాడు. 'పాకిస్తాన్‌'లాగా 'దళితస్తాన్‌' 'హరిజన్‌స్థాన్‌' లాంటి నినాదాలివ్వడం ఆ రోజుల్లో పెద్ద సమస్యేమీ కాదు. అయినా ఇవ్వలేదంటేనే ఆయనకు దేశ సమగ్రతపట్ల ఉన్న చిత్తశుద్ధి ద్యోతకమవుతుంది. కుల, వర్గ దోపిడీ లేని రాజ్యం కావాలన్నాడు. అలాంటి రాజ్యం కావాలంటే దానంతటదే రాదన్నాడు. అందుకు పోరాటమే శరణ్యమన్నాడు. రాజ్యాధికారమే పీడిత వర్గాల సామాజికాభివృద్ధికి ఏకైక మార్గం. రాజ్యాధికారం లేకుండా మన అభివృద్ధి అసంభవం అని స్పష్టంగా చెప్పాడు.
స్త్రీలు భారత సమాజంలో నికృష్టమైన జీవితాలు గడుపుతున్నారని 'ప్రతి స్త్రీని శాస్త్ర దాస్యం నుండి విముక్తి' చేయాలన్నాడు. ఈ లక్ష్యం చేరుకునే క్రమంలో 'హిందూకోడ్‌' బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాడు. ఆనాటి సనాతన, సంప్రదాయ అగ్రకుల పాలకులు నిరాకరించారు. ఆ బిల్లు ఆమోదానికి తోడ్పడని ప్రధాని నెహ్రూ వైఖరికి నిరసనగా కేంద్రమంత్రి పదవికే రాజీనామా చేసిన ఆదర్శవంతుడు, త్యాగశీలి అంబేద్కర్‌. శ్రామిక మహిళల 'ప్రసూతి ప్రయోజనాల చట్టం' కొరకు పోరాడిన వారిలో డాక్టర్‌ అంబేద్కర్‌ ముందుపీఠిన ఉన్నాడు. ఈ దేశం అభివృద్ధి కాకపోవడానికి, శ్రామికులంతా ఐక్యం కాకపోవడానికి, దోపిడీ కొనసాగటానికి కుల వ్యవస్థ పెద్ద ఆటంకమని గుర్తించాడు. అందుకే కుల సమస్యలపై ప్రత్యేకంగా ఆయన పరిశోధన చేశాడు. రాజ్యాధికారానికై శ్రమజీవులను ఐక్యం కాకుండా చేస్తున్న ప్రతిబంధ కాల్లో కుల వ్యవస్థ చాలా కీలకమైందిగా గుర్తించాడు. దేశంలో శ్రమ విభజనే కాదు శ్రామికుల మధ్య విభజన అనే తరతరాల అగాధం ఉందన్నాడు. ఇది అగ్రకుల దోపిడీ వర్గాల రక్షణకు పెట్టనికోటలా ఉందన్నాడు. శ్రామికుల మధ్య ఐక్యతకై ప్రత్యేక ప్రయత్నం, నిరంతర ప్రయత్నం జరగాలన్నాడు. 'విప్లవం తేవడానికి భారతదేశంలోని కార్మికవర్గ ప్రజలంతా ఏకం అవుతారా? నా దృష్టిలో ఆ శక్తి ఒక్కటే... అదేమిటంటే తనతోపాటు విప్లవంలో పాల్గొంటున్న వారిలో ఒకరి పట్ల ఒకరు సంపూర్ణ విశ్వాసం చూపగల్గాలి' అన్నాడు. 'మనుషులు తరతరాలుగా సాంఘిక అణచివేతకు గురవుతున్నారు. ఆస్తి సమానత్వం కొరకు మాత్రమే విప్లవంలో పాల్గొనరు. విప్లవం సాధించిన తర్వాత కుల, మత భేదాలు లేకుండా సమానత్వంగా చూడబడతామనే గ్యారంటీ ఉంటేనే అరమరికలు లేకుండా విప్లవోద్యమంలో పాల్గొంటార'న్నాడు.
అందుకే 'కుల నిర్మూలన' అనే చారిత్రాత్మకమైన గ్రంథంలో అనేక విషయాలు రాశాడు. భారతదేశం సామాజిక విప్లవోద్యమ ఆవశ్యకత మిగతా దేశాల న్నింటి కంటే ఎక్కువగా ఉందని భావించాడు. సామాజిక ఉద్యమంలో కీలకమైనది 'కుల వ్యవస్థ వ్యతిరేక పోరాటం' అని భావించాడు. స్వకుల వివాహాలే కులవ్యవస్థను కొనసాగించడంలో కీలక పాత్ర వహిస్తున్నాయని, అందుకు స్వకుల వివాహా లను నిరుత్సాహపర్చాలని విస్తృతంగా ప్రచారం చేశాడు. ఏదైనా పోరాడితేనే పోతుందని, కాబట్టి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడితేనే కులం బలహీన పడుతుందన్నాడు. కుల వ్యవస్థ బలహీన పడటం వర్గ ఐక్యత పటిష్టతకే తోడ్పడుతుందన్నాడు. కుల వ్యవస్థ వర్గ దోపిడీని రక్షిస్తుందన్నాడు. వాస్తవానికి కమ్యూని స్టుల అభిప్రాయాలకు అంబేద్కర్‌ ఆలోచనలకు సామీప్యమే ఎక్కువ. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు 1998 నవంబర్‌ 20న ఆంధ్రజ్యోతికిచ్చిన ఇంటర్వ్యూలో 'అంబేద్కర్‌ అభిప్రాయాలకు, కమ్యూనిస్టుల అభిప్రాయాలకు పెద్దతేడా లేదు. కొన్ని విషయాల్లో కమ్యూనిస్టుల కన్నా ముందున్నారు కూడా. దేశంలో ఉన్న భూమిని జాతీయం చేయాలని చెప్పడం ఎంతో ముందు చూపుతో కూడింది. హిందూ ధర్మశాస్త్రాలను తూర్పారాపట్టాలని, వాటిని ఓడిస్తే తప్ప కుల వ్యవస్థ పోదని చెప్పడం అంబేద్కర్‌ చాలా ప్రధానంశంగా తీసుకున్నాడనే అంశాన్ని రుజువు చేస్తుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయాధికారం కావాలన్నారు. నిజానికి కమ్యూనిస్టులతో అత్యంత చేరువగా అభిప్రాయమున్న వ్యక్తి అంబేద్కర్‌. అయితే రాజ్యాంగ యంత్రం, ప్రజాస్వామ్యం, తదితర విషయాల్లో కొన్ని విభేదాలున్నాయి' అని చెప్పిన అంశాలు సదా గమనంలో ఉండటం అవసరం.
             డాక్టర్‌ అంబేద్కర్‌ 58వ వర్ధంతి సందర్భంగా నిజమైన నివాళి అర్పించడమంటే కుల, వర్గ రహిత సమాజం కొరకు పోరాడటమే. 

Prajashakti Telugu News Paper Dated: 05/12/2014 

2 comments:

  1. communistu agrahaaramaina polit beuro 1998 daaka ambedkar ni yendu ku aadiposukunnattu .b.v raghavulu cheppithe kaani dalitha communistulaku theliyadu .vaallu yeppudu yemi chebithe adi follow avvadame prasninche dahirya dalitha communist cadre ku unda?
    ambedkar nu thelusukuntunna dalithulu communistu partylanu nammadam ledu kaabatte communist agrahara polit bearonlu konga japam chestunnayi. 1920 nundi ippathi daaka ambedkar nu chinna choopu choosinde kaaka vyathireka pracharam chesina ee agrakula communist manuvaada criminals nu ,vaari chemchalanu yela aamodinchagalam.jai bheem.

    ReplyDelete
  2. SMARTKiDZ is a National branded Play School in India. Being inspired by Waldorf and Montessori Methodology we have designed our Course Curriculum and Syllabus which caters to the holistic development of the child and Offers Play School Franchise in India for more Details visit https://www.smartkidzindia.com/

    ReplyDelete