Tuesday, May 19, 2015

దేవుడు ప్రజాస్వామ్యవాదా, కాదా? (09-May-2015) By కంచ ఐలయ్యదేవుడు ప్రజాస్వామ్యవాదా, కాదా అనే ప్రశ్న చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నేను నా పీహెచ్‌డీ పుస్తకానికి God as political philosopher (దేవుడి రాజకీయ తత్వం) అని పేరు పెట్టినప్పుడు చాలా మంది నవ్వుకున్నారు. ముఖ్యంగా భారతదేశంలో హిందూ తత్వంలో జీవించే మేధావులకు, విగ్రహారాధన చేసే వారికి ఇది అంతుపట్టని ప్రశ్న. నిత్యజీవితంలో అప్రజాస్వామ్యంగా బతికే వ్యక్తికి ప్రజాస్వామ్య ప్రక్రియను దేవునితో ముడేసే సరికి భయమేస్తుంది. అటువంటి పేరున్న పుస్తకాన్ని ముట్టుకోవాలంటే కూడా భయమేస్తుంది. కాని ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దాన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఈ దేశంలో చాలా ఉంది.
 
ప్రపంచ మానవాళి ముందు మూడు రకాల దేవుళ్ళ ఆలో చన, ఆచరణ సరళులు ఉన్నాయి. (1) అబ్‌స్ర్టాక్ట్‌ (నిరాకార, నిరంతర) దేవుడు. (2) మానవులుగా పుట్టి ముందు ప్రవక్తలుగా మారి క్రమంగా ప్రపంచ దేవులుగా మారిన శక్తులు, వ్యక్తులు. ఈ విధంగా ప్రపంచ ఆధ్యాత్మిక చైతన్యాన్ని మానవ సాంఘీక రాజకీయ విలువల్ని శాసిస్తున్నది గౌతమ బుద్ధుడు, జీసెస్‌ క్రైస్తు. (3) ఊహాజనిత మానవాకార దేవతలు. ఇటువంటి దేవతలు ప్రపంచంలో చాలాచోట్ల ఉన్నప్పటికీ భారతదేశంలో మాత్రమే దేవతలుగా నమ్మేవారు విష్ణువు, ఆయన అవతార సంతతి. రెండవ గ్రూపు శివుడు ఆయన చుట్టూ నిర్మిత దేవతా శక్తులు. ఈ రెండు గుంపు దేవతలను ఇప్పుడు వైష్ణవ దేవతలు, శైవ దేవతలుగా చూస్తున్నాం.
 
ప్రపంచస్థాయిలో వ్యక్తి, కుటుంబ, సామాజిక, రాజ్య ప్రజాస్వామిక విలువలు ఎక్కడ నుంచి వచ్చాయి అనే అంశం మీద ఇంత వరకు సిద్ధాంత చర్చ జరగలేదు. అబ్‌స్ర్టాక్ట్‌ దేవుని వ్యక్తిగత విలువలు, ఆయన (ఇంకా పురుష రూపంలో చలామణి అవుతున్నాడు కనుక) బోధనలు, ఆయన రూపొందించాలనుకునే లేదా రూపొందించిన మానవ విలువలు ముఖ్యమైనవి. ఇవి జనరల్‌గా ప్రపంచ మానవుల చర్చల్లో ఉన్నప్పటికీ బైబిల్‌, ఖురాన్‌ గ్రంథాల్లో ఈ దేవుని చర్చలు సుదీర్ఘంగా కనిపిస్తాయి. ఖురాన్‌ కంటే బైబిల్‌ ముందు రాయబడ్డది కనుక ఓల్డ్‌ టెస్టామెంట్‌ అంతా ఈ దేవుని లక్షణాలు, పనులు ఆచరణ మనకు వివిధ కోణాల్లో కనిపిస్తుంది. ఖురాన్‌ బైబిల్‌ కొనసాగింపు ఒక నిర్దిష్ట కోణం నుంచి కనిపిస్తుంది. ఖురాన్‌ అబ్‌స్ర్టాక్ట్‌ దేవున్ని పదే, పదే నొక్కి వక్కాణించింది.
ఈ దేవుని మొదటి ప్రజాస్వామిక లక్షణం (అదే ఆ పుస్తకాల లక్షణం అవుతుంది) మనుషులందర్నీ ఆయన సమానంగా సృష్టించాడనే సుదీర్ఘ చర్చ. ఈ దేవునిలో కనబడే మరో ఆర్థిక ప్రజాస్వామిక లక్షణం మనుష్యుల్ని అత్యున్నతులుగా సృష్టించి అన్ని జంతువులనూ, క్రిములనూ, సమస్త ప్రకృతిని ఆ మనుషుల అవసరాల కోసం, ఆహారం కోసం (ఆవుతో సహా అన్నిటిని) సృష్టించాడని చెప్పడం. కానీ ఈ రెండు గ్రంథాల్లో దైవ ప్రక్రియకు మానవ గుర్తింపు కలిగించింది ముందు జీసెస్‌ క్రైస్తు ఆ తరువాత ప్రాఫెట్‌ మహహ్మద్‌. చరిత్ర క్రమంలో మహమ్మద్‌ ఒక ప్రాఫెట్‌గా మాత్రమే మిగిలిపోగా జీసెస్‌ ఒక దేవుని స్థాయి పొందారు.
 
ప్రవక్తలు, సంఘ సంస్కర్తలు ప్రపంచస్థాయి దేవుళ్ళుగా మారింది ఇద్దరే ఇద్దరు. గౌతమబుద్ధుడు, జీసెస్‌ క్రైస్తు. బుద్ధుడు ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేసిన దేవునిగా చలామణిలో ఉన్నాడు. బుద్ధునికి విహారాల్లో, గుడుల్లో విగ్రహ రూపం ఉన్నప్పటికీ ఆయన టీచింగ్స్‌, జీవించిన విధానం, సంఘ నిర్మాణం తూర్పు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. భారతదేశంలో ఆయన ప్రభావం చాలా ఉంది. ప్రపంచంలో బుద్ధుని కంటే ఎక్కువ స్థాయిలో జీసెస్‌ ప్రభావం ఉంది. ఆయన జీవిత చరిత్ర, టీచింగ్స్‌ నాలుగు గాస్పెల్స్‌ రూపంలో బైబిల్‌లో చేర్చాక ఆయన విగ్రహాంలోగాని, ఆయన్ని ఏ శిలువపై చంపారో ఆ శిలువ విగ్రహంలో గాని చర్చి వెలిసాక ప్రపంచ రూపురేఖలే మారిపోయాయి. బుద్ధుడు, జీసెస్‌ హింసావాద వ్యతిరేకులు. వారి టీచంగ్స్‌ సర్వమానవ సమానత్వాన్ని కోరుకున్నాయి. ఇద్దరి జీవిత ప్రక్రియలో, సంఘ నిర్మాణ, స్ర్తీ పురుష సంబంధాల్లో మార్పు, అంతిమంగా వాళ్ళు కోరుకున్న రాజ్య వ్యవస్థ ప్రజాస్వామ్య విలువల గురించి సుదీర్ఘ చర్చ, ఆచరణకు అనువైన చాలా సూచనలు ఉన్నాయి. వాటి ప్రభావం ప్రపంచ సామాజిక, రాజకీయ వ్యవస్థల మీద చాలా బలంగా ఉంది.
 
బుద్ధుడు తన సంఘ నిర్మాణంలో, తన శిష్యులతో తాను వ్యవహరించిన తీరులో చాలా ప్రజాస్వామిక విలువలున్నాయి. ‘సంఘం శరణం గచ్చామి, దమ్మం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి’ నినాదమే ఆనాటి కులవ్యవస్థను, వర్గ వ్యవస్థను, స్ర్తీ పురుష అసమానతలను దెబ్బతీసేందుకు తోడ్పడ్డది. జీసెస్‌ తన 12 మంది శిష్యులతో వ్యవహరించిన తీరు చాలా ప్రజాస్వామ్య లక్షణాలను కలిగి ఉంది. అంతకంటే సమరిటన్‌ (అక్కడి దళితులు) స్ర్తీలతో, జంటైల్‌ స్ర్తీ-పురుషులతో, బానిసలతో, వేశ్యా స్ర్తీ విముక్తి కోసం ఆయన పోరాటం బుద్ధుని ప్రజాస్వామ్య విలువల కంటే ఒక అడుగు ముందు ఉన్నట్టు కనిపిస్తుంది. ఆయనే మతాన్ని, రాజ్యాన్ని వేరు చెయ్యాలని చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన ఆదర్శప్రాయంగా ప్రజల ముందు పెట్టిన ‘కింగ్‌డమ్‌ ఆఫ్‌ గాడ్‌’ క్రిష్టియన్‌ దేశాల్లో ప్రజాస్వామ్య సూత్రాలను ఎవాల్వ్‌ చెయ్యడానికి బాగా తోడ్పడింది.
 
పై వాదనల్లో ఒక అంశం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచ అబ్‌స్ర్టాక్ట్‌ గాడ్‌ గాని, బుద్ధుడు, జీసెస్‌లు గాని మానవ సమాజంలో ప్రజాస్వామ్య విలువలు, ఆచరణ, అభివృద్ధికి చాలా తోడ్పడ్డారు. ఇప్పటికే మనుష్యుల్ని రాజ్యం, చట్టాలు, పోలీసు, మిలిటరీ వ్యవస్థల కంటే ఎక్కువగా నియంత్రించే శక్తి దేవుడు. దేవుడు అనే భావం, దాని చుట్టూ భక్తి, ప్రేమ, భయం వ్యవస్థల మీద ప్రభావం పడేసాయి. మానవ గవర్నెన్స్‌లో ఇప్పటికీ దేవుని పాత్ర రాజ్యం పాత్ర కంటే ఎక్కువ.
 
ఈ వెలుగులో చూసినప్పుడు హిందూ వ్యవస్థ నిర్మించి, నమ్మే ఆచరించే వైష్ణవ స్కూల్‌ దేవతలకు గాని, శైవ స్కూల్‌ దేవతలకు గాని ప్రజాస్వామ్య విలువలు, లక్ష్యాలు, ఆచరణ ఉన్నాయా? వైష్ణవాన్ని భారతదేశంలో రాజ్యం, సంస్థలు, పార్టీలు తమ రాజకీయ, ఆధ్యాత్మికంగా ప్రకటించుకుంటున్న ఈ తరుణంలో ఈ స్కూలు దేవతల్లో గాని, వారి చుట్టూ రూపొందించబడ్డ ఆధ్యాత్మిక తాత్వికతలో గాని ప్రజాస్వామిక జీవన విధానాన్ని, రాజ్య వ్యవస్థను కాపాడే లక్షణాలు ఉన్నాయా అన్న అంశాన్ని లోతుగా చర్చించాలి. ఎందుకంటే ఈ దేశాన్ని పరిపాలించే బీజేపీ కాని, కాంగ్రెస్‌లో ఎక్కువ మంది నేతలు గాని, కమ్యూనిస్టు-సోషలిస్టు నేతలు గాని చాలా ప్రాంతీయ పార్టీల నేతలు గాని వైష్ణవ విలువలతో తమ సాంఘీక, రాజకీయ జీవితాన్ని, పార్టీలను నడుపుతున్నారు. కమ్యూనిస్టులు, విప్లవకారులు కూడా ఈ చట్రం బయట లేరు. వారు హేతువాదులమని చెబుతున్నా, వాళ్ళు హిందూ వ్యవస్థ తాత్విక పరిధిలోనే జీవిస్తున్నారు. తమ రాజకీయాలను కూడా ఆ చట్రంలోనే నడుపుతున్నారు.
 
 విష్ణువు, ఆయన అవతార దేవతలు రాముడు, కృష్ణుడు ఊహాజనిత దేవతలు. వారికి బుద్ధుడికి, జీసెస్‌కు ఉన్నట్టు మానవ జీవన చరిత్ర లేదు. కృష్ణుడు రాసినట్టు చెప్పబడుతున్న ఒక్క ‘భగవత్‌ గీత’ తప్ప వాళ్ళ బోధనలు అంటూ ఏమీలేవు. వాళ్ళ చుట్టూ అల్లిన కథలు, వారి బొమ్మలు ఇప్పుడు మన ముందున్నాయి. మొదట వీరి గురించి ఉన్న కథలల్లో మనకు కనిపించేది వారి హింసాయుత హీరోయిజం. దేవుడే హింసను అనుసరించదగ్గ విలువను ఆచరణలో పెడతాడు. అతని గురించిన వర్ణనలో గాని, అతని విగ్రహ రూపంలో గాని ఆయుధాలు (చక్రం, బాణం, త్రిశూ లం) కొట్టొచ్చేవిగా కనిపిస్తున్నప్పుడు మానవ సంబంధాలపై వారి ప్రభావం ఎలా ఉంటుంది అనేది చాలా ముఖ్యం. వీరిలో ప్రజాస్వామిక ప్రక్రియకు వ్యతిరేక అంశం వారికి అంటగట్టబడ్డ కులపునాదిలో వుంది. 
దేవతలకు కులం ఉండడం నమ్మకస్తుల్లో అప్రజాస్వామిక విలువలను కాపాడడానికి బాగా తోడ్పడే అంశం. అయితే శివునికి కుల పునాది ఉన్నట్టు మనకు కనిపించదు. కానీ వైష్ణవ దేవతలందరూ క్షత్రియ కుల పునాదులు, క్షత్రియులకు ఉండాల్సిన ఆయుధ ధారణ, ఈ దేవతలందరికీ ఉంటుంది. వారి భార్యలతో గాని, ఇతర స్ర్తీలతో ఉండే సంబంధాల్లో గాని ప్రజాస్వామిక సంబంధాలు లేకపోవడం అప్రజాస్వామిక వ్యవస్థల నిర్మాణానికి బాగా తోడ్పడ్డాయి. భారతదేశంలో అప్రజాస్వామిక పౌర సమాజం ఉండడానికి వీరి విలువలే కారణం.
శైవ స్కూలు ఇందుకు కాస్త భిన్నమైంది. ఇది ప్రధానంగా శివుని చుట్టూ మాత్రమే తిరుగుతుంది. శివునికి చాలా ట్రైబల్‌ క్యారక్టర్లు ఉన్న విషయం తెలిసిందే. శివుడు కూడా ఊహాజనిత దేవుడే. ఆయన చుట్టూ ఉన్న కథలు తరువాత కాలాల్లో రచయితలు అల్లినవే. శైవ స్కూలు చేతిలో శూలం, మెడలో పాము, చుట్టూ పులి తోలు, జగ్గు మొదలగు వస్తు సముదాయాలతో ఉంటుంది. ఆ రూపం నుంచి శివలింగ పూజ వరకు ఒక నిర్దిష్ట వ్యక్తి, సమాజ, రాజ్య సూత్రాలతో సంబంధం లేకుండా ఆచరణలో ఉన్నట్లు కనబడుతుంది. సామాజిక ప్రజాస్వామిక సూత్రాలేమీ ఈ స్కూలు రూపొందించిన దాఖలాలు లేవు. అందుకే బీజేపీ వంటి పార్టీలు శివున్ని ఎక్కువగా వాడుకోవడం లేదు. దైవిక, సామాజిక ఆహార అలవాట్లలో వైష్ణవ, శైవాలు - ఒక్క మాటలో హిందూ తాత్వికత - అప్రజాస్వామికంగా ఉండి వెజిటేరియనిజం, మీటేరియనిజం, ఫిషేరియనిజాల మధ్య కూడికలు, తీసివేతలతో కలగలిసి ఉంటుంది. ఈ స్కూల్లో కొన్ని కుల వ్యతిరేక తిరుగుబాట్లు కనబడతాయి. అయినా దీనికి భారతదేశం బయట గుర్తింపేమీ లేదు.
 
పైన మనం చర్చించిన మూడు అంటే - నిరాకార దేవుడు, బుద్ధుడు, జీసస్‌, హిందూ ఊహాజనిత ఆకార దేవతల - స్కూళ్ళు రాజకీయ వ్యవస్థల్ని ఎలా ప్రభావితం చేశాయో చూడ్డం ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం. నిరాకార దేవుని ప్రభావం ఈనాడు ముస్లిం దేశాల్లో చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్రభావం ప్రధానంగా ఖురాన్‌లోని సూత్రీకరణల నుంచి సమాజ ప్రాక్టీసుగా మారింది. వీటితో పాటు ప్రాఫెట్‌ మహమ్మద్‌ టీచింగ్స్‌ (అహదీస్‌) వాటికి జోడయ్యాయి. ఈ దేశాలన్నిటిలో ప్రజాస్వామ్యం బలంగా నిలదొక్కుకోలేకపోతున్నది. నియంతృత్వం ప్రజాస్వామ్యం కలగాపులగంగా అమల్లో ఉంటున్నది. ఈనాడు మనం ప్రజాస్వామ్య దేశాలుగా చూసే క్రైస్తవ దేశాల్లో ఏసుక్రీస్తు ప్రభావంతో పాటు నిరాకార దేవుని ప్రభావం కూడా ఉన్నది. ఈ దేశాల్లో బైబిల్‌ అధ్యయనం ఒక కీలకమైన పాత్ర పోషించింది. బైబిల్‌ అధ్యయనం నుండి ‘పాజిటివిజం’ ఆ క్రమంలో ప్రజాస్వామ్య సూత్రీకరణలు పుట్టుకొచ్చాయి. ఈనాడు క్రైస్తు ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో రాజకీయ, సాంఘీక ప్రజాస్వామ్యం నిలదొక్కుకున్నాయి.
తూర్పు దేశాలైన బుద్ధిస్టు దేశాల్లో సోషలిజం-ప్రజాస్వామ్యం కలగాపులగంగా ఉన్నాయి. ఈ దేశాల్లో ఆర్థిక అభివృద్ధి (చైనా, జపాన్‌, కొరియా, వియత్నాం మొదలగునవి) స్టెడీగా బలంగా జరుగుతున్నది. సమాజ ఆధునికీకరణతో పాటు స్ర్తీ ఆధునికీకరణ చాలా వేగంగా జరుగుతుంది. ఈ అన్ని దేశాల్లో బాల్యవివాహాలు ఆగిపొయ్యాయి, వితంతు వివాహాలు చాలా గౌరవ ప్రదంగా జరుగుతున్నాయి. వీటన్నిటికి కారణం సభ్య సమాజంలో బౌద్ధం ప్రభావం ఎక్కువగా ఉండడం.
 
ఇగ మిగిలినవి భారతదేశం, నేపాల్‌. భారతదేశంలో క్రైస్తవ విలువలు గలిగిన బ్రిటిష్‌ విలువల్లో భాగంగా 1947 నాటి ప్రజాస్వామిక వ్యవస్థ ఒక రూపానికి వచ్చింది. ఇక్కడి వైష్ణవ విలువలు రాజకీయ ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోవాలని చూసినా బ్రిటిష్‌ వారు ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంపై రుద్ది పోయారు. బుద్ధిస్టు అంబేద్కర్‌, హేతువాద నెహ్రూల ప్రయత్నం వల్ల ఒక మంచి రాజ్యాంగం, రాజకీయ ప్రజాస్వామ్య ప్రాక్టీసు ఇక్కడ నిలదొక్కుకున్నాయి. కాని సభ్యసమాజంలో వైష్ణవ, శైవ అసమానత, అంటరాని తనాన్ని కాపాడే విలువలు ఇంకా బలంగా ఉన్నాయి. హిందూ దేవతల్ని, ఈ మత పుస్తకాల్ని, ప్రజల - ముఖ్యంగా బ్రాహ్మణీయుల ప్రాక్టీస్టును - పత్రికల్లో ప్రచారం చేస్తున్న మేధావులు ఈ అంశంపై తేల్చాలి గదా!
 
ఒక వ్యక్తి నమ్మే దేవునికి ప్రజాస్వామిక విలువలు లేకపోతే అతనికి/ఆమెకు ఆ విలువలు ఎక్కడి నుండి వస్తాయి? అసలు తమ దేవతలను కూడా ఇంత హింసాయుతంగా, ఇంత అప్రజాస్వామికంగా, ఇంత స్ర్తీ వ్యతిరేకులుగా ఎందుకు రూపొందించుకున్నారో చెప్పాలి గదా! ఇంత విగ్రహారాధన (పుస్తకారాధన కాదు) మతంలో ఉంటే విగ్రహాల నుంచి ప్రజలు ప్రజాస్వామిక విలువల్ని ఎట్లా నేర్చుకుంటారో చెప్పాలి గదా! మార్పు లేని మతం మంచిదెట్టయితదో చెప్పాలి గదా!
కంచ ఐలయ్య
సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త
Article Published in Andhra Jyothi Telugu News Paper Dated :09/05/2015 

No comments:

Post a Comment