Friday, March 8, 2013

పోరాటాలతోనే విముక్తి ----దేవేంద్ర



womens
‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి’ అనే నినాదంతో శ్రమ విముక్తి కోసం నినదిస్తున్న రోజులవి. స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వ హక్కుల కోసం పోరాటాలు జరుగుతున్న యుగం అది. ఈ పోరాటాల్లో మహిళలు మేము సైతం అంటూ కదిలివచ్చారు. పోరాటాలన్నింటిలో బట్టల మిల్లు ఫ్యాక్టరీ కార్మిక మహిళల పాత్ర అమోఘమని చెప్పాలి. అమెరికాలో మొదటగా ఈ పోరాటాలు పురుషుల కేంద్రంగానే జరిగేవి. 1820లో మహిళలే స్వయంగా, ప్రత్యేకంగా సమ్మెలు చేయడం ప్రారంభించారు. పురుషులకంటే మేమేమి తీసిపోమంటు న్యూయార్క్ నగరంలో అనేక కవాతులు, సమ్మెలు నిర్వహించారు. 1857 మార్చి 8న న్యూయార్క్ నగరంలో 16 గంటల పనిదినం నుంచి 10 గంటలకు తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున కవాతు నిర్వహించారు. ఈ కవాతుపై పోలీసులు దాడి చేసి చెల్లాచెదురు చేశారు. 1859 మార్చిలో వీరు ప్రత్యేకంగా మహిళా లేబర్ యూనియన్ స్థాపించుకొని కార్మిక హక్కుల కోసం పోరాడారు.

1908 మార్చి 8న కుట్టుపని కర్మాగారాల్లోని 15,000 మంది మహిళలు 1857 మార్చి 8 స్ఫూర్తితో న్యూయార్క్ నగరంలో పెద్ద ప్రదర్శన నిర్వహించి వారి డిమాండ్లను సాధించుకున్నారు. 1908 నుంచి మహిళలకు ఓటు హక్కు కోసం పోరాటం ప్రారంభమయ్యింది. 1910లో కోపెన్ హెగెన్‌లో మహిళా కాన్ఫన్స్ జరిగింది. ఈ కాన్ఫన్సులో క్లారా జెట్కిన్ మహిళాహక్కుల గురించి మాట్లాడుతూ మార్చి 8ని అంతర్జాతీయ శ్రామిక మహిళల పోరాటంగా జరపాలని పిలుపునిచ్చారు.

అప్పటి నుంచి ప్రతి ఏటా మార్చి 8న మహిళా దినోత్సవంగా జరపడం ప్రారంభమైంది. 1911లో న్యూయార్క్‌లోని ట్రయాంగిల్ కంపెనీలో విధులు బహిష్కరించడాన్ని ఆపడానికి ద్వారాలు మూయడంతో లోపల ప్రమాదం జరిగి 146 మంది మహిళ లు చనిపోయారు. అందుకే ప్రతి సంవత్సరం మార్చి 8న ఈ మహిళా అమరుల్ని స్మరించడం, వారి స్ఫూర్తితో మహిళా కార్మికుల పోరాటాల ఉధృతి పెరిగింది. ఈ పోరాటాలల్లో ఎంతోమంది మహిళలు జైళ్ల పాలయ్యారు. ప్రాణ త్యాగాలు చేశారు. మార్చి 8ని స్మరించడం అంటే వారి త్యాగాల బాటల్లో నడవడమే.

ఈ క్రమంలో మహిళలు మేము మనుషులమే కదా! మాకు మనసుంది! మాకు పురుషులతో సమానంగా హక్కులను పొందే అధికారం ఉంది కదా! ఈ సమాజం లో స్త్రీ, పురుషులకు మధ్య అంతరం ఎందుకు? దీనికి మూలం పితృస్వామిక సమాజం. కాబట్టి ఈ వివక్షను గమనించి మహిళలు చైతన్యవంతులై సమాజాన్ని మార్చడానికి కృషి చేశారు. ఇది ప్రపంచంలోని మహిళల్ని ఆలోచింపజేసింది. ప్రతిచోట జరుగుతున్న విముక్తి పోరాటాల్లో పాల్గొంటూ శ్రమ విముక్తి జరగకుండా స్త్రీ విముక్తి జరగదని నినదిస్తున్నారు. 

మన దేశంలో స్త్రీ,పురుష సమానత్వం కోసం, వారి హక్కుల కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. మహిళలపై సాంఘిక దురాచారాలు, జరుగుతున్న హింసను నిర్మూలించేందుకు సంస్కరణోద్యమాలు జరిగాయి. ఈ సంస్కరణోద్యమంలో పురుషులు, స్త్రీలు కలిసి నడిపించారు. తెల్లదొరలు పోయి నల్లదొరలు వచ్చాక జరుగుతున్న ఎన్నో సామాజిక ఉద్యమాల్లో మహిళల పాత్ర రోజురోజుకు పెరుగుతున్నది. వరకట్నానికి, కుటుంబ హింసకు వ్యతిరేకంగా పోరాటాల నిర్మాణం జరిగింది. మహిళల కోసం ప్రత్యేక చట్టాలను, చట్టాల్లో మార్పులను సాధించింది. 1984లో అత్యాచారాల నిరోధక చట్టంలో సవరణ, జ్యోతిసింగ్ పాండే సంఘటన నేపథ్యంలో జరిగిన పోరాటాల ఫలితంగా కొన్ని మార్పుల్ని సాధించింది. 2005లో గృహ హింస నిరోధక చట్టం మహిళా ఉద్యమాల కృషి ఫలితమే. 2013 మార్చి 3న పనిస్థలాల్లో మహిళలపై లైంగిక దాడుల నిరోధక చట్టం మహిళా ఉద్యమాల విజయంగా భావించాలి. సారా వ్యతిరేక పోరాటం, అశ్లీల చిత్రాలకు వ్యతిరేకంగా, అందాల పోటీలకు వ్యతిరేకంగా, ప్రేమ పేరుతో జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలు మహిళల చైతన్య పటిమని చాటి చెప్పాయి. 

మహిళా ఉద్యమాలు మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళల పోరాట స్ఫూర్తి తో ముందుకు నడుస్తున్నాయి. ఇంతవరకు వివిధ మహిళా ఉద్యమా ల్లో, సామాజిక ఉద్యమాల్లో ప్రాణ త్యాగం చేసి అమరులైన మహిళా అమరుల స్ఫూర్తి మహిళా ఉద్యమానికి ఊతమిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మార్చి 8ని ఒక ఉత్సవంగా అంటే పండుగలాగా జరుపుతున్నాయి. ఈ రోజున ప్రభుత్వ ఆఫీసులల్లో, వేడుకలల్లో అందాల పోటీలు, డాన్స్‌ల పోటీలు, ముగ్గుల, వంటలు పోటీలు నిర్వహిస్తున్నాయి.

మార్చి 8 స్ఫూర్తి మహిళను వ్యక్తిత్వమున్న మనిషిగా, సమస్యలతో తలపడే వ్యక్తిగా నిలబెడుతుం ది. కానీ ప్రభుత్వాలు మహిళలు ‘వంటింటికి, ఇంటికి చాకిరి చేసే బానిసగా’ అందాలు వలకబోసే భోగ వస్తువుగా దిగజారుస్తున్నాయి. మార్చి 8 స్ఫూర్తితో స్త్రీలను చైతన్యవంతుల్ని చేయాల్సిన ప్రభుత్వాలు ఈ విధంగా ఎందుకు చేస్తున్నాయి? ప్రభుత్వాలు మహిళా అభివృద్ధికి పాటుపడుతాం కల్ల బొల్లి మాటలు చెబుతున్నాయి. మహిళా ఉన్నతి ఉద్యమాల ద్వారానే జరిగింది, కానీ ప్రభుత్వాల వల్లకాదనేది వాస్తవం. నిజంగా మహిళా ఉన్నతి కోరే ప్రభుత్వాలైతే మార్చి 8ని స్ఫూర్తిదాయకంగా నిర్వహించేవి కదా! అందుకే మహిళలుగా మనం పితృస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడుతూ, మన సమస్యల పరిష్కా రం కోసం ప్రభుత్వాల మెడలు వంచితేనే మన లక్ష్యాన్ని సాధించగలం. ఇదే మార్చి 8 స్ఫూర్తి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని దేశంలోని ప్రతి మహిళ అర్థం చేసుకునే విధంగా ప్రచారం జరగాలి. ఇలా జరగాలంటే ప్రభుత్వం నిర్వహించే వేడుకల విధానంలో మార్పు రావాలి. మార్చి 8ని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించా లి. సావివూతీబాయి ఫూలే, చాకలి ఐలమ్మ, బెల్లి లలిత, పంచాది నిర్మల లాంటి మహిళా అమరుల జీవిత చరివూతలను, వారి త్యాగాన్ని ప్రచారం చేసి,వారి స్ఫూర్తిని ప్రజలకు తెలియజెయ్యాలి.

-దేవేంద్ర, చైతన్య మహిళా సం

Namasete Telangana  News Paper Dated : 8/3/2013

No comments:

Post a Comment