Sunday, February 10, 2013

స్త్రీవాదాన్ని విస్తృతార్థంలో చూద్దాం! - ఎ. సునీత



 స్త్రీల ఉద్యమాలకూ, స్త్రీవాదులకూ, దళిత బహుజన, మైనారిటీ స్త్రీలూ, వారి సమస్యల పట్ల వున్న అవగాహన, నిబద్ధత పట్ల ఆయా సమూహాలకు చెందిన మేధావులు సందేహాలు వ్యక్తం చేయటం ఇరవై ఏళ్ల నుండి జరుగుతోంది. ఢిల్లీ సంఘటన నేపథ్యంలో ఈ విషయం మరింత చర్చనీయాంశం అయింది. 'వివిధ' (21.1.13)లో సుభద్ర వ్యాసం ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీవాదాన్ని విశ్లేషించే ప్రయత్నం చేసి మంచి చర్చకు తెరతీసింది.

సుభద్ర తను పరిశీలించిన పుస్తకాలలో ఎక్కువశాతం అగ్రకుల రచయితలే ఉన్నారన్న పరిశీలన సరైనదే. స్త్రీవాదం అందరి స్త్రీల కోసం పనిచేయాలంటే, స్త్రీవాద ఉద్యమాలూ, స్త్రీవాదము దళిత, బహుజన, మైనారిటీ స్త్రీల జీవితాల గురించీ, దృక్పథాల గురించీ చాలా నేర్చుకోవాలని జూపాక సుభద్ర చెప్పకుండా చేసిన సూచనతో విభేదించడమూ కష్టం. అయితే, ఆయా స్త్రీవాద ప్రచురణలను అంచనా వేయడానికీ, దానిపై ఆధారపడి ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీవాదాన్ని గురించి ఒక అంచనాకు రావటానికి, సుభద్ర అనుసరించిన ప్రచురణల పరిమిత పరిశీలన సరిపోతుందా? 1970లలో స్త్రీవాద ఉద్యమం మొదలయినప్పటి నుండీ 2013 వరకూ, వివిధ చారిత్రక సందర్భాల్లో వచ్చిన రచనలను ఇటువంటి విశ్లేషణా చట్రంలో పరిశీలించటం సాధ్యమేనా? ఈ ముప్ఫై ఏళ్లల్లో స్త్రీవాదంలో ఏ మార్పులూ రాలేదా? ఈ మార్పుల్లో సుభద్ర వంటి దళిత బహుజన మేధావుల పాత్ర ఎలాంటిది? అసలు స్త్రీవాదాన్ని ఆయా సంస్థలకు, గ్రూపులకు కుదించటం సాధ్యమేనా?

స్త్రీవాదంతో గత మూడు దశాబ్దాలుగా ప్రయాణిస్తున్న 'అన్వేషి' సభ్యురాలిగా నేను సుభద్ర మొదలుపెట్టిన చర్చను ముందుకు తీసుకువెళ్లాలంటే, స్త్రీవాదాన్ని అంచనా వేయడానికి తాననుసరించిన పరిమిత పరిశీలనా చట్రం కాక, మరింత విస్తృతమైన విశ్లేషణా చట్రం అవసరం. దానికోసం, స్త్రీవాదం వచ్చిన చారిత్రక సందర్భాన్ని, గత ముప్ఫై ఏళ్లల్లో దళిత ఉద్యమాల నుండీ, దళిత స్త్రీల నుండి వచ్చిన సవాళ్లను గుర్తుచేసుకోవాలి. 1970లలో వచ్చిన స్త్రీవాదులు ప్రధానంగా అగ్రకులాలకి చెందినవారే. అప్పటి స్త్రీవాదులకి, వామపక్ష వాదం నుంచి విడివడి, స్త్రీల సమస్యలు ప్రత్యేకమని, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రత్యేక పోరాటం అవసరమనీ వాదించటం చారిత్రకంగా ప్రధానమయింది. 1980ల వరకూ స్త్రీల వ్యతిరేక చట్టాలను మార్చటం, హింసకు వ్యతిరేకంగా కొత్త చట్టాల కోసం పోరాటాలు జరిగాయి. మథుర, రమీజ బీ వంటి ఆదివాసీ, ముస్లిం స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిపినా, వారి ఆదివాసీ, ముస్లిం అస్తిత్వాలు, వాటితో ముడిపడి ఉన్న సమస్యలు పెద్దగా ముందుకు రాలేదు. అందరు స్త్రీలకూ పిత్రుస్వామ్యమే ప్రధాన శత్రువనే అవగాహనా ఆ రోజుల్లో ఉండింది. ఆ సమయంలోనే 'మనకు తెలియని మన చరిత్ర' పుస్తకం వచ్చింది.

ఈ అవగాహన, 1990-92లలో మారవలసి వచ్చింది. మండల్ కమిషన్ నివేదిక విడుదల, చుండూరు ఊచకోతల సందర్భంలో దళిత ఉద్యమం లేవనెత్తిన ప్రశ్నలూ, బాబ్రి మసీదు కూల్చివేత తరువాత లౌకికవాదంపై ముస్లింలు లేవనెత్తిన సందేహాలూ స్త్రీవాదుల్ని కుదిపేశాయి. స్త్రీలంతా ఒకటి కాదనీ, దళిత, ముస్లిం స్త్రీల జీవితాలను కుల వ్యవస్థా, హిందూ జాతీయవాదం శాసిస్తున్నాయనే అవగాహన స్త్రీవాదులకు నెమ్మదిగా రావటం మొదలయింది. రిజర్వేషన్లను సమర్ధిస్తూ ఏర్పడిన సమతా సంఘటనలో హైదరాబాదులోని స్త్రీవాదులు భాగం కావటం, చుండూరు ఘటన గురించి రాయటం, కులం, జెండర్ మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించటం 1990-2000 మధ్య జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఉద్యమం కూడా కుల సమస్యని పట్టించుకోవటం ఈ దశాబ్దంలో వచ్చిన ముఖ్య మార్పు. స్త్రీల ఉద్యమాల, దళిత ఉద్యమాల మధ్యలో దళిత స్త్రీలు ఎక్కడనే ప్రశ్నని చల్లపల్లి స్వరూపరాణి 1990ల మధ్యలో లేవనెత్తే వరకూ, దళిత స్త్రీల ప్రశ్న ఆంధ్రప్రదేశ్‌లో స్పష్టంగా రాలేదు.

దళిత స్త్రీలు బాధితులు కారనీ, వారికీ ప్రత్యేక దృక్కోణం ఉందనే విషయాన్ని ఆమె చెప్పారు. విషయాలని అర్ధం చేసుకోవటానికి, అప్పటికున్న పితృస్వామ్యాన్ని కేంద్రంగా చేసుకున్న స్త్రీవాద చట్రాన్ని ప్రశ్నించటం ఆంధ్రప్రదేశ్ స్త్రీవాదులలో అప్పుడే మొదలయింది. సూసి తారు, కల్పనా కన్నబిరాన్ ఇటువంటి సందర్భంలోనే తమ తమ సందేహాలను సిద్ధాంతీకరించారు. 2000 నుండి దళిత, ముస్లిం, బహుజన స్త్రీలు స్త్రీవాదాన్ని కుదిపి వేసి, దాన్ని పునర్నిర్వచిస్తున్నారు. సుభద్రతో సహా, చల్లపల్లి స్వరూపరాణి, వినోదిని, షాజహానా, జాజుల గౌరీ, గోగు శ్యామల, సూరేపల్లి సుజాత వంటి అనేక సాహితీ-సిద్ధాంతవేత్తలు తమ తమ రచనల్లో- కుటుంబం, భూమి, ఇల్లు, కమ్యూనిటీ, హింస, హక్కులు, ప్రాంతం, రాజకీయాలు, పంచాయితీలు, మతము- వంటి అనేక విషయాలని తమదైన స్త్రీవాద దృక్పథంలో విశ్లేషించి వాటిని చూడవలసిన దృక్పథాలని పునరాలోచించేలా చేస్తున్నారు. అప్పటికే, 1990లలో కుల సమస్య గురించి ఆలోచించటం మొదలుపెట్టిన అన్వేషి సంస్థ నుండి గోగు శ్యామల 'నల్లపొద్దు' సంకలనాన్ని తీసుకొచ్చారు.

2000 తరువాత, 'మట్టిపూలు' వంటి దళిత, బహుజన, మైనారిటీ స్త్రీల రచయిత్రుల వేదికలొస్తే, ఇంకో పక్క దళిత స్త్రీశక్తి వంటి దళిత స్త్రీల హక్కుల సంఘాలు కూడా వచ్చాయి. గోగు శ్యామల, దళిత రాజకీయవేత్త సదాలక్ష్మి జీవిత చరిత్ర 'నేనే బలాన్ని' అనే పుస్తకం రాసారు. దళిత స్త్రీలు స్త్రీవాదాన్ని విస్తృతం చెయ్యటమే కాక, బలంగా, లోతుగా విశ్లేషిస్తున్నారు. 'అన్వేషి' వంటి స్త్రీవాద పరిశోధన కేంద్రాలు, దళిత, మైనారిటీ సమస్యల పరిశోధనకై ప్రత్యేక విభాగాలు ప్రారంభించి, అనేక రకాల పరిశోధనలు జరగడంలో తోడ్పడుతున్నాయి. ఈ రకమైన విస్తృత విశ్లేషణా చట్రంలో చూసినప్పుడు, స్త్రీవాదానికి, దళిత బహుజన స్త్రీల దృక్పథాలకీ మధ్య ఉన్న సంబంధం ఎప్పుడూ ఒకే రకంగా లేదనీ, దృక్పథాలు మారుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీవాదం రకరకాలుగా స్పందిస్తూ వచ్చిందనీ అర్ధమవుతుంది. అప్పుడు, అంటే 1990ల ముందు వచ్చిన రచనలనీ, తరువాత వచ్చిన రచనలనీ, సంఘాల, గ్రూపుల కార్యాచరణని కూడా వేరుగా చూడాలి. 

అగ్రకుల స్త్రీలు రాసినవయినా సరే, వాటిలో దళిత, మైనారిటీ, ఆదివాసీ స్త్రీల ప్రత్యేక చరిత్రలనూ, జీవితాలనూ, దృక్పథాలనూ పరిగణనలోకి తీసుకున్నాయా, ఎంతమేరకు తీసుకున్నాయనే ప్రశ్న వేసుకోవాలి. స్త్రీవాదాన్ని నిర్వచించే విశ్లేషణ చట్రంలో, ఆయా సంఘాల, గ్రూపుల కార్యాచరణలో, దళిత, ఆదివాసీ, మైనారిటీ స్త్రీల సిద్ధాంతాలకూ, రచనలకూ ఎటువంటి పాత్ర ఉందనే ప్రశ్న కూడా అడగాలి. ఈ దృక్పథంలో అన్వేషి పుస్తకం స్త్రీవాద రాజకీయాలూ-వర్తమాన చర్చలు సంకలనంలో, సుభద్ర అంచనా ప్రకారం, గోగు శ్యామల రాసిన ఒక్క వ్యాసం తప్ప మిగిలినవన్నీ అగ్రకుల స్త్రీల జీవితాల చుట్టూ, వారి సమస్యల గురించి మాత్రమే ఉన్నాయి. 1990ల తరువాత స్త్రీవాద సిద్ధాంతాలలో వచ్చిన కొత్త చర్చలని కొన్ని ఇంగ్లిష్‌లో వచ్చినవి తెలుగులోకి అనువదించి, కొన్ని తెలుగులో రాసిన పరిశోధనా వ్యాసాలు కలిపి ఈ పుస్తకాన్ని అన్వేషి వేసింది. దీని కూర్పు 1990లలో మొదలయ్యి, పూర్తి కావటానికి పదేళ్లు పట్టడంతో సుభద్ర విమర్శ కొంత సరైనదే అనిపిస్తుంది.

అయితే, విషయ పరిశీలనకు వచ్చినప్పుడు, ఆ విమర్శకున్న పరిమితులు కూడా అర్థమవుతాయి. సజయ వ్యాసం భూమి కోసం బహుజన స్త్రీలు, దళిత స్త్రీలు, ఆదివాసి స్త్రీలు చేస్తున్న పోరాటాల గురించి, వారి గొంతుల ద్వారా చర్చించి, ఆ పోరాటాల ఫలితాలు అగ్రకుల పితృస్వామ్యం వల్ల ఏ విధంగా వారి కందకుండా పోతున్నాయనే విషయాన్ని చర్చిస్తుంది. లలిత వ్యాసం ప్రపంచీకరణ నేపథ్యంలో పేద స్త్రీల కోసమంటూ నడిపిస్తున్న పొదుపు కార్యక్రమాలు, ఏ రకంగాను వారి స్వశక్తిని పెంపొందించడం లేదనీ, జిల్లా యంత్రాంగానికి వీరిమీద ఇంకా నియంత్రణ కల్పించేటట్లు ఈ కార్యక్రమాలు రూపొందించబడ్డాయని, పోరాడే సత్తా వున్న దళిత స్త్రీలను వీటిల్లోకి రానివ్వకుండా చేస్తున్నారని చెప్పారు. ఇక తెలుగేతర స్త్రీవాద వ్యాసకర్తల దగ్గరికి వస్తే, వందన సోనల్కర్ వ్యాసంలో అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెడుతూ చేసిన వాదనల నేపథ్యంలో స్త్రీవాదులు రిజర్వేషన్లను, ఉమ్మడి పౌర చట్టం వంటి పౌరసత్వ హక్కులను చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఈ విషయాల పట్ల మహారాష్ట్రలోని దళిత స్త్రీల సంఘాల వాదనలు, వాటిలో కూడా వస్తున్న మార్పులను కూడా చర్చించారు. స్త్రీవాదులంటే ఎవరు, ఏ ఏ సామాజిక నేపథ్యాల నుంచి వచ్చారు, వారి దృక్పథాలు ఏర్పడటంలో దాని పాత్ర ఆవిడ చర్చిస్తారు. ఫ్లావియా అగ్నెస్, బాబ్రీ మస్జిద్ తరువాత చెలరేగిపోయిన హిందుత్వవాద నేపథ్యంలో స్త్రీల ఉద్యమం తన ఎజెండా పునర్‌నిర్వచించుకోవాలని వాదిస్తారు. ముస్లిం స్త్రీల, ముస్లిం కమ్యూనిటీకున్న ప్రత్యేక పరిస్థితులని అర్థం చేసుకోలేని నేపథ్యంలో అది హిందూ స్త్రీల ఉద్యమంగా మిగిలిపోతుందని అంటారు. ముస్లిం స్త్రీల హక్కుల గురించి పనిచేయడమే కాక, క్రైస్తవ వివాహ చట్టంలో మార్పుల కోసం అపారమైన కృషి చేసిన వారు ఫ్లావియా. భారతదేశంలో స్త్రీవాదాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే, అంబేద్కర్ కులం, జెండర్ కలిపి విశ్లేషించిన విధానాన్ని అలవర్చుకోవాలి, అనే వందనా సోనల్కర్ వాదన, ముస్లిం స్త్రీల పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే ఇస్లాం మతం గురించి కాక 1990ల తరువాత హిందూత్వవాద భావజాలాన్ని, ఉమ్మడి పౌరసత్వ రాజకీయాలనీ అర్ధం చేసుకోవాలనే ఫ్లావియా వాదనా ఈ సంకలనంలో విలువైనవి. శ్యామల వ్యాసంపై పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అవసరం వుంది.

అయితే ఇటువంటి విషయ పరిశీలన జరగటానికి, ఇంతకు ముందు చెప్పినట్లు విశ్లేషణ చట్రాన్ని విస్తృతం చేసుకోవటం చాల అవసరం. ముప్ఫయ్యేళ్లలో దళిత ఉద్యమ ఫలితంగా, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఉద్యమాలతోపాటు, స్త్రీవాద ఉద్యమం కూడా కుల సమస్యను అనివార్యంగా సీరియస్‌గా తీసుకోవటం మొదలైంది. అలా గుర్తించిన స్త్రీవాదం గురించిన ప్రశ్నలను మార్చటం కూడా అవసరం. ఇంకా లోతుగా, నిశితంగా అడగటం మరీ అవసరం. స్త్రీవాదం కొన్ని వర్గాల, కులాల స్త్రీలకూ, కొన్ని సంస్థలకూ, గ్రూపులకూ పరిమితం కాకుండా ఉండాలని, రాజకీయంగా జీవించి ఉండాలని ఆశించే వారికి, అగ్రకులంలో పుట్టినవారికైనా, దళితులుగా నిర్వచించుకున్నవారైనా- అందరికీ ఇది ముఖ్యం, అవసరం. ఈ చర్చకు తెరతీసిన సుభద్రకు అభినందనలు.

- ఎ. సునీత
సీనియర్ ఫెలో, అన్వేషి

Andhra Jyothi Telugu News Paper Dated : 11/2/2013

No comments:

Post a Comment