Tuesday, February 19, 2013

పట్టాలో ఉన్న భూమి పల్లెలో లేదు' - పి.యస్. అజయ్ కుమార్



వ్యవసాయ భూమిని పూర్తిగా మార్కెట్ సరుకుగా మార్చింది మన రాష్ట్రంలోనేనని చెప్పక తప్పదు. దళితులకు 9/77, ఆదివాసీలకు 1/70, బహుజన కౌలు రైతులకు కౌలు (తెలంగాణ, ఆంధ్ర) చట్టాలు, భూమిలేని వారికి 1/73 (సీలింగు) చట్టం.. ఇలా దండిగా చట్టాలు ఉన్నాయి. అసలు సమస్య వాటి 'అమలు '. 


"పట్టా పట్టుకొని/ తాశీల్దారు కాడికెళ్తే / పట్టా చూసిండు- పకా పకా నవ్విండు/ పట్టాలో వున్న భూమి/ మండలంలో లేదన్నడు'' - 'భూమెక్కడో చెప్పరండి' అంటూ పట్టా పట్టుకొని తిరుగుతూ పెద్దలందరిని ప్రశ్నించే ఈ పాట రాష్ట్రంలో భూమిలేని పేదలకు సుపరిచితం. భూమి కావాలని దరఖాస్తులు అందితే వాటిని ముఖ్యమైనవిగా భావించి వెంటనే పరిష్కరించాలి. దశాబ్దాల క్రిందట మద్రాసు రెవెన్యూ బోర్టు స్టాండింగ్ ఆర్డర్సు ఆ మాట చెబుతున్నాయి. రెవెన్యూ శాఖ విధి నిర్వహణలో ప్రభుత్వ భూముల మంజూరు ముఖ్యమైనది. రోజువారీ జరగవలసిన ఈ పాలనా వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ 'విడతలవారీ' కార్యక్రమంగా మార్చింది.



పట్టా మంజూరు చేయడమంటే భూమిపై -సాపేక్షికంగా- ఒక స్థిరమైన హక్కును కల్పించడం. ఇదేమి ఆషామాషీ తంతు కాదు. అందుచేత బ్రిటిష్ వారు విధి విధానాలను పకడ్బందీగా రూపొందించారు. వాటిని తూచ తప్పకుండా నిష్ఠతో పాటిస్తే ఇప్పుడు మనం చూస్తున్న, వింటున్న లాంటి సమస్యలు వచ్చే అవకాశమే లేదు. గడిచిన సంవత్సరం ఆఖరి నెల ఆఖరి రోజున భూ సమస్యలపై రెవెన్యూ మంత్రి వర్యులు ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. అందులో భూమి శిస్తు కమిషనరు నుంచి రెవెన్యూ కార్యదర్శి వరకు ఓ 16 మంది ఐఏఎస్ అధికారులు, జాయింట్ డైరెక్టర్ల నుంచి తాశీల్దారు స్థాయి వరకు మరో 36 మంది, పౌర సమాజ ప్రతినిధులు ఒక నలుగురు పాల్గొన్నారు. పలు అంశాలు అక్కడ చర్చకు వచ్చాయి. అందులో కొన్నింటిని పరిశీలిద్దాం. మావోయిస్టు పార్టీ నేతలతో చర్చలు, ఉభయ కమ్యూనిస్టు పార్టీల 'భూ' పోరాటాల నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి, మునిసిపల్ శాఖ మంత్రి కోనేరు రంగారావు గారి అధ్యక్షతన ఒక కమిటీని వేశారు. 



ఆ కమిటీ వారు ప్రభుత్వానికి 104 సిఫారసులు ఇచ్చారు. వీటిలో 90 ప్రభుత్వామోదం పొందాయి; 14 తిరస్కరింపబడ్డాయి. ఆమోదించిన వాటిలో 75 సిఫారసుల అమలుకు ఆదేశాలు దిగువకు వెళ్ళాయి. మిగతా 15 సిఫార్సుల అమలుకు ఇంకా ఆదేశాలు జారీ కాలేదు. ఇలా ఉండిపోయిన వాటిలో అత్యధికం ఆదివాసీలకు సంబంధించినవే. అయితే అసలు సమస్య అది కాదు. హైదరాబాద్ నుంచి జిల్లాలకు కాగితాలు ఎన్నైనా వెళ్ళవచ్చు కానీ ఎన్ని అమలైనాయి? ఈ సిఫారసుల అమలుకు ఆదేశాలు ఇవ్వకముందు, ఇచ్చాక ప్రజలకు తేడా ఏమైనా తెలుస్తుందా? కోనేరు సిఫారసుల అమలంటే తాఖీదులు దిగువకు పంపడంగా భావిస్తున్నారు. అంతేగానీ వాటి అమలు తీరును సమీక్షించిన వారు లేరు.



ఇప్పటివరకు విడతల వారీగా ఇచ్చిన డి-పట్టాలు ఎన్నింటికి ఇంకా భూమి అప్పగించాలి? అధికారిక లెక్క ప్రకారం 23,455.61 ఎకరాలు. మెదక్ జిల్లాలో ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా ఇప్పించిన పట్టాలకు ఇప్పటికీ భూమి చూపించలేదు. ప్రజల మాట దేవుడెరుగు, ఇది దేశ ప్రధానిని అవమానించడం కాదా? ఇది కాస్త వివాదం అయి రాజధానికి చేరడంతో, 'పట్టాలు ఇచ్చినా సాగు చేయలేదని', కనుక వాటిని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. భూమి చూపండంటూ రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నవారి చేతిలో అధికారులు ఈ నోటీసులు పెట్టారు. ప్రశ్న ఏమిటంటే, అసలు భూమిలేకుండా పట్టాలు ఎలా ఇచ్చారు? సర్వే డివిజన్ వర్కు ఎక్కడ చేశారు? రెవెన్యూ ఇన్‌స్పెక్టరు నిర్వహించవలసిన విచారణ ఏమయ్యింది? పద్ధతి ప్రకారం నింపవలసిన ప్రొఫార్మాలలో రాసిందంతా అబద్ధాలేనా?



సాగు యోగ్యమైన ప్రభుత్వ భూములను పెద్దలు ఆక్రమించారు. ఇలాంటి వారిని చట్ట ప్రకారం తొలగించాలి. ఎప్పుడో 1905లో బ్రిటిష్‌వారు చేసిన భూ ఆక్రమణ చట్టాన్ని అలంకారంగా పెట్టుకు కూర్చున్నారు. వారిని తొలగిస్తే గానీ పేదలకు భూములు రావు. నెల్లూరు జిల్లాలో ఒక్క వాకాడు, మనిపోడు మొదలైన మండలాలలో అన్యాక్రాంతమైన యానాది ఆదివాసీల అసైన్ మెంట్ భూమి ఒక లక్ష ఎకరాలకు పైగా ఉంటుంది. ఇందులో అధిక శాతం భూస్వాములే. ఈ భూముల విషయంలో యానాదుల పట్ల సానుభూతిని చూపిస్తున్నారని అక్కడి జిల్లా జాయింట్ కలెక్టర్‌ను రెండు నెలలకే బదిలీ చేశారు.



అంతెందుకు అదే జిల్లాకు కలెక్టరుగా వచ్చి పెద్దల భూ దందాలపై కొరడా ఝళిపించిన ఒక ఐఏఎస్ అధికారిని తొమ్మిది నెలలకే బదిలీ చేయించారు. మహబూబ్ నగర్, వరంగల్, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో యానాది ఆదివాసీలతో సహకార సంఘాలను ఏర్పాటు చేసి వాటికి భారీగా ప్రభుత్వ భూములు కేటాయించారు. ఆ సొసైటీలను అధికారులు, స్థానిక రాజకీయ భూ కబ్జాదార్లు పాతరేసి భూములను గుంజుకున్నారు. కాగితాల మీద సొసైటీలు 'డిఫాల్టు' అయినట్లుగా ఉంటాయి. భూములేమో భూస్వాములు సాగుచేసుకుంటూ ఉంటారు. వీటిని స్వాధీనం చేసుకొని సొసైటీలను పునరుద్ధరించడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. లేనిదల్లా చిత్తశుద్ధి, రాజకీయ సంకల్పం. దీనికి పరిష్కారం ఏమిటి కనిపెట్టారంటే సొసైటీలను రద్దు చేసి ఆ భూములను స్వాధీనం చేసుకొని 'పేదలకు' పంపిణీ చేయడం. సొసైటీల రద్దు ఐదు నిమిషాల్లో జరుగుతుంది. తరువాతి కథ చూసేందుకు 'వెండి తెర' అవసరం లేదు.



ఏకరువు పెట్టిన సమస్యలన్నింటికీ ఒకటే జవాబు- 'జిల్లా జాయింట్ కలెక్టర్లను ఆదేశిస్తాం' అని. ఆదేశించనవసరం లేదు, చట్టాలను అమలుపరిస్తే తాము అడ్డుపడమని, బదిలీతో శంకరగిరి మాన్యాలకు పంపించమని చెపితే చాలు. కొసమెరుపు ఏమిటంటే ముందు ప్రస్తావించిన సమావేశం అయిన రెండురోజుల తరువాత జనవరి 3, 4 తేదీలలో జరిగిన జిల్లా జాయింట్ కలెక్టర్ల సమావేశంలో 'అనర్హుల నుంచి ప్రభుత్వ భూముల స్వాధీనం' అన్న ఊసేలేదు. పేదల సాగుకు ఇక్కడి డి-ఫారం పట్టా భూములను కొనకూడదు. అందుకు రెండు వేల రూపాయల జరిమానా, ఆరునెలలు జైలు శిక్ష ఉంది. రాష్ట్రంలోని వివిధ మండల రెవెన్యూ కార్యాలయాలలో నమోదై విచారణ జరగనివి 1,31,554 కేసులు. ఆంధ్రప్రదేశ్ ఎసైన్‌మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం 9/77 ఇతర భూమి చట్టాలకు భిన్నంగా సూటిగా, స్పష్టంగా ఉంటుంది.



తన 'ఇడుపులపాయ' ఎస్టేట్‌లో ప్రభుత్వ భూములు ఉన్న విషయం మీడియాకు పొక్కిందని తెలుసుకోగానే అప్పటి 'మహానేత' తమ వ్యవహారం ఫైసలా అయ్యేంతరవకు చట్టంలోని నేరం-శిక్ష క్లాజును త్రిశంకు స్వర్గంలో పెట్టి, తదుపరి చట్టాన్నే మార్చేశారు. దళిత ఉద్యమ నేత ప్రముఖ న్యాయవాది బొజ్జా తారకం అడ్డుపడకపోయి ఉంటే అన్యాక్రాంతం పొందిన వారికే వాటిని ఖరీదుకు ఇచ్చేసి ఉండేవారు. సరే, గుడ్డిదో, మెల్లదో ఆ చట్టంతో పూర్తిచేయవలసిన విచారణలు ఎందుకు జరగటం లేదు? ఎవరు అడ్డం పడుతున్నారు? యథావిధిగా జనవరిలో జరిగిన జాయింట్ కలెక్టర్ల సమీక్షా సమావేశంలో ఆ కేసుల ఊసే లేదు.



ఆదివాసీలకు సంబంధించిన అంశాన్నిప్రస్తావించి ఈ చర్చ ముగిద్దాం. కోనేరు కమిటీ ఇచ్చిన 104 సిఫార్సులలో 41, అంటే మొత్తం సిఫారసులలో 39 శాతం ఆదివాసీలవే. ఆమోదించిన 90లో ఇంకా ఆదేశాలు ఇవ్వవలసిన సిఫార్సులూ వారికి చెందినవే. ఇందులో అతి ముఖ్యమైనది భూ బదిలీ నిషేధ చట్టం 1/70. ఈ కేసులు విచారణ చేయవలసిన కోర్టులకు అధికారులు లేరు. వారికి సిబ్బంది, మౌలిక వసతులూ లేవు. రేపో మాపో పదవీ విరమణ చేసేవారు, కలెక్టరు లేదా ఆ జిల్లా గౌరవనీయ మంత్రివర్యుల అనుగ్రహానికి పాత్రులు కాని వారిని ఇక్కడ 'పనిష్మెంట్ పోస్టింగు' క్రింద నియమిస్తారు.



కుర్చీలో కూర్చున్న మరుక్షణమే అక్కడ నుంచి పారిపోవడానికి పైరవీలు లేదా గిరిజనేతరులతో లాలూచిపడి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడాలూ. సచిన్ టెండూల్కర్ ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ భూమినెందుకు కొన్నాడు? సొంత రాష్ట్రమైన మహారాష్ట్రలో ఎందుకు కొనలేదు? వ్యవసాయం చేయనివారు ఆ భూములను కొనకుండా ఏదో ఒక స్థాయిలో ఆ రాష్ట్రంలో రక్షిత చట్టాలున్నాయి. అమితాబ్ బచ్చన్ వివాదమూ అదే. వ్యవసాయ భూమిని పూర్తిగా మార్కెట్ సరుకుగా మార్చింది మన రాష్ట్రంలోనేనని చెప్పక తప్పదు. ఒక్క వాక్యంలో చెప్పాలంటే దళితులకు 9/77, ఆదివాసీలకు 1/70, బహుజన కౌలు రైతులకు కౌలు (తెలంగాణ, ఆంధ్ర) చట్టాలు, భూమిలేని వారికి 1/73 (సీలింగు) చట్టం.. ఇలా దండిగా చట్టాలున్నాయి. అసలు సమస్య వాటి 'అమలు'. భూమి ఎక్కడ ఉందంటే ఎక్కడికీ పోలేదు; అక్కడే ఉంది. అయితే కన్పించనివ్వకుండా ఒక 'మాయ' కమ్మి ఉంది. అంతే! మరి ఆ మాయ మాంత్రికులు మంత్రులేనా!?



- పి.యస్. అజయ్ కుమార్
రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్


Andhra Jyothi Telugu News Paper Dated : 19/2/2013

No comments:

Post a Comment