Monday, July 15, 2013

చర్మకారులకు 'ఉపాధి హామీ' - జాన్‌సన్ చోరగుడి

July 16, 2013

మన ఇంట్లో ఎక్కణ్నించో దుర్వాసన వస్తుంది, విషయం అర్ధంకాదు. మర్నాడు తెలుస్తుంది, ఏదో మూలన ఎలుక చచ్చిందని. ఎలాగో తంటాలు పడి దాన్ని ఇంట్లో నుంచి తీసి బయట పడవేస్తాం. దొడ్లో గేదె చచ్చిపోయింది, ఏమిటి చేయడం ? మనవల్ల ఏమీకాదు కనుక 'మాదిగ' కు కబురు చేస్తే అతను వచ్చి దాన్ని తీస్తాడు. ఏమిటి అతని వృత్తి ? పాడి పరిశ్రమకు - చర్మ ఉత్పత్తుల తయారీ పరిశ్రమకు మధ్య పూర్తి నిర్లక్ష్యానికి గురైన కీలకమైన (లింకు) అంశం- 'మాదిగ' కులవృత్తి.

ఎందుకీమాట అనడం అంటే, దానికి కొంత వివరణ అవసరం. ఉదా: ప్రత్తి పంటకు ఫార్వర్డ్ లింకేజీ అనగానే - గిడ్డంగులు, నూలు మిల్లులు ,వస్త్ర తయారీ పరిశ్రమ, చేనేత రంగం, గార్మెంట్ డిజైనింగ్, రవాణా, ఎగుమతులు.. ఇలా ఉంటుంది జాబితా. అదే పశుగణాభివృద్థి రంగానికి - ఫార్వర్డ్ లింకేజీ అంటే-పాడి పరిశ్రమ, డైరీలు, శీతల గిడ్డంగులు, డైరీ ఉత్పత్తులు, కన్ఫెక్షనరీ,వెటర్నరీ కోర్సులు, ఆసుపత్రులు, బయోగ్యాస్, తోళ్ళ పరిశ్రమ, ట్యానరీలు,చర్మ ఉత్పత్తులు, ఫుట్‌వేర్ పరిశ్రమ, రవాణా, ఎగుమతులు.. ఇదీ ఈ జాబితా. ఈ 'లింక్' మెత్తంలో ఎక్కడా కానరానిది- 'మాదిగ'. నిజానికి ఈ ఫార్వర్డ్ లింకేజ్‌లో ఉన్న పలు దశల్లో మృత పశు వినియోగం చాలా స్వల్ప మైన అప్రధాన అంశం. కాని,అవసరం అయినప్పుడు సకాలంలో ఆ 'సర్వీస్' కనుక వెంటనే అందకపోతే అందువల్ల కలిగే అసౌకర్యం ప్రజాజీవనాన్ని సామూహికంగా ప్రభావితం చేస్తుంది. అలాంటప్పుడు అది 'అత్యవసర సర్వీసు' అవుతున్నది. మెత్తం మీద చనిపోయింది అయినా, చంపబడినది అయినా పశువు శరీర ఉత్పత్తుల్ని వినియోగంలోకి తీసుకురావడంలో ' మాదిగ 'ది కీలక పాత్ర అవుతున్నది.

మన రాష్ట్రంలో మెదటి నుంచీ కూడా చర్మ పరిశ్రమ రంగాన్ని ఒక నిర్లక్షిత కుల కోణంలో నుంచి చూసిన కారణంగా దీని ప్రయోజనాలను మన దగ్గర నుంచి మన పొరుగున ఉన్న తమిళనాడు తన్నుకు పోయింది. ఏడాదికి 482.20 లక్షల పశుగణం ఉంటున్న మన రాష్ట్రంలో ముడి తోళ్ళు శుభ్రం చేసే యూనిట్లు లేని కారణంగా కేవలం 5 శాతం తోళ్ళు మాత్రమే చర్మ ఉత్పత్తులకు పనికివచ్చే విధంగా ఇక్కడ ప్రాసెస్ చేయబడుతున్నాయి. కానీ 158.00 లక్షల పశుగణం మాత్రమే ఉన్న తమిళనాడులో 95 శాతం ముడితోళ్ళను పారిశ్రామిక ఉత్పత్తులకు పనికి వచ్చే విధంగా ప్రాసెస్ చేసుకోగలుగుతుంది. ఇందుకు కారణం తమిళనాడులో చిన్న మధ్యతరహా ట్యానరీ యూనిట్లు 9 వేలు, భారీ యూనిట్లు 70, కాంపోజిట్ యూనిట్లు 40 ఉన్నాయి. అయితే మనవద్ద ఉన్నది అన్నీ కలిపి కేవలం 30 మాత్రమే.


ఈ కారణంచేత మన దగ్గర నుంచి ఏటా 85 శాతం అంటే 321 మిలియన్ల లక్షల తోళ్ళను (పశువులు, గొర్రెలు, మేకలు కలిసి) ముడి ఉప్పుతో భద్రపర్చడం వంటి తాత్కాలిక చర్యల అనంతరం తమిళనాడు పంపుతున్నారు. వాటికి అదనపు విలువను జోడించి వారు ప్రయోజనం పొందుతున్నారు. భారత్ నుంచి ఏటా విదేశాలకు ఎగుమతి అవుతున్న 'ప్రాసెస్' చేయబడిన తోళ్ళలో 1.2 మిలియన్ చదరపు అడుగుల (దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తంలో 60 శాతం) తోళ్ళు తమిళనాడు నుంచి వెళుతున్నాయి. ఈ ఎగుమతులపై దేశానికి వస్తున్న మొత్తం ఆదాయంలో 45 శాతం ఆ రాష్ట్రం తీసుకుంటూ ఉంది. మొత్తం మీద ఏటా రూ.10 వేల కోట్ల టర్నోవర్ అక్కడ ఈ రంగంలో జరుగుతుంది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ప్రస్తుతం 497 చర్మ ఉత్పత్తుల యూనిట్లు అక్కడ పనిచేస్తున్నాయి అంటే దేశ మార్కెట్లో వాటి వాటా ఎంతో అర్థమవుతుంది. పోనీ ఈ నిర్లక్ష్యం వల్ల మనం నష్టపోతున్నట్టు చెబుతున్న లెక్కలు ఉహాజనితం అనుకుందాం. మన రాష్ట్రానికి దక్షిణాన చిట్ట చివరి మండలం తడ వద్ద 2006 ప్రాంతంలో చైనాకు చెందిన 'అపాచే' కంపెనీ 'ఆడిడాస్' స్పోర్ట్స్ బూట్ల ఫ్యాక్టరీని స్థాపించింది.భూమి, కరెంటు ఇతర మౌలిక వసతులు మన ప్రభుత్వం వద్ద తీసుకొని, ముడి సరుకును ఆ కంపెనీ తీసుకుంటున్నది తమిళనాడు దగ్గర ! ఈ రంగంలో రానున్న రోజుల్లో కూడా మనం పోగోట్టుకుంటున్నది ఏమిటి అనే సృహ మాత్రం మనకు రాలేదు.

రాయలసీమ జిల్లాల్లో ఆనాడు పరిశ్రమలు రాకపోవడానికి జరిగిన జాప్యానికి కారణాలు ఇప్పటికే సవిస్తరంగా సామాజిక శాస్త్రవేత్తలు చర్చించడం, రికార్డు చేయడం జరిగింది. సరళీకరణ తర్వాత గడచిన 20 ఏళ్ళలో ఆ పరిస్థితుల్లో వచ్చిన మార్పును కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. మరి ఇంతటి విస్తృత స్థాయిలో పాడి పరిశ్రమ కార్యకలాపాలు ఉన్న కోస్తా జిల్లాల్లో - పాడి పరిశ్రమకు అనుబంధ వాణిజ్య రంగమైన తోళ్ళ పరిశ్రమ నామ మాత్రంగా కూడా ఇక్కడా కాలూనకపోవడానికి కారణాలు ఏమైఉంటాయి ? ఈ ప్రశ్నకు సమాధానంగా ఇంచుమించుగా రాయలసీమ కారణాలనే ఇక్కడ కూడా అనువర్తింపచేయవలసి ఉంటుంది. భూమి ఇందుకు సమస్యకాదు, 950 కి.మీ. సముద్ర తీరం రాష్ట్రం పొడవునా విస్తరించి ఉంది. ఇదే పరిశ్రమ ఆభిృద్థి చెందిన తమిళనాడులో కాలుష్య నియంత్రణ మండలి కనుసన్నలలోనే పైన చెప్పుకున్న వృద్థి రికార్డు అయింది. మరి ఏ కారణం చేత ఆంధ్రప్రదేశ్ ఏటా రూ. 10 వేల కోట్ల టర్నోవర్ ఉన్న వాణిజ్య రంగాన్ని ప్రక్క రాష్ట్రానికి వదులుకుంది ?

సామాజిక అంశమే అందుకు కారణమైతే, తక్షణమే దానిని సరిచేసుకోవలసి ఉంది. గతాన్ని తవ్వుకోవడం ఇప్పుడు అప్రస్తుతం. తమిళనాడులో ఈ పరిశ్రమలో ప్రధానంగా పనిచేస్తున్నది షెడ్యూల్డు కులాలకు చెందినవారు, ముస్లింలు. 150 ఏళ్ళ క్రితం ఈ పరిశ్రమ అక్కడ స్థిరపడింది. కనుక ఇందుకు సంబంధించిన తొలినాటి ఇక్కట్లన్నీ అక్కడి మొదటి రెండు మూడు తరాలు ఇప్పటికే భరించి ఉండి ఉండాలి. అయితే ప్రస్తుత పరిస్థితి వేరు. ప్రతి పరిశ్రమలోనూ జరిగిన ఆధునిక యాంత్రీకరణ అందులో పనిచేసే శ్రామికుల భౌతిక శ్రమను తగ్గించడమే కాకుండా, వారి సామాజిక గౌరవాన్ని కూడా పెంచింది. లెదర్ టెక్నాలజీ కూడా అందుకు వినహాయింపు కాదు.

ఈ నేపథ్యంలో పాటవ నిర్మాణం (కెపాసిటీ బిల్డింగ్) వైపు మనం దృష్టి సారించగలిగితే వివక్షకు గురైన ఈ రంగానికి ఒనగూరే ప్రయోజనాలు ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంది. మొదటిదిగా అస్సలు రాజ్యం ఈ పనిని శాస్త్రీయ ప్రతిపత్తితో కూడిన నిపుణతగా చూడ్డాన్ని అలవర్చుకొని దాన్ని ప్రోత్సహించాలి. ఉత్పత్తి కులాల స్థాయి 'మాదిగ' లకు కూడా కలిగే విధంగా ఒక సామాజిక ఆమోదం మందుగా తీసుకురాగలగాలి. చట్టానికి లోబడి పనిచేస్తున్న గ్రామ పంచాయతీ వ్యవస్థలో కూడా పలు సేవలు ఉత్పత్తి కులాల ద్వారానే ఇప్పటికీ అధికారికంగా జరగడం వాస్తవం. అటువంటి పరిస్థితుల్లో షెడ్యూల్డు కులాల జాబితాలో ఉన్న అన్ని కులాలను ఒకే మాసగా చూసే స్థూల దృష్టికి ముందుగా ప్రభుత్వ స్థాయిలో 'దృక్పథ బదిలీ ' (యూటిట్యూడ్ షిప్టు) జరగాల్సి ఉంది.

నిపుణులతో వీరికి అవగాహన సదస్సులు ఏర్పాటుచేసి, ఆ తర్వాత యువతీయువకులతో వేర్వేరుగా స్వయం సహాయక బృందాలుగా వీరిని సంఘటిత పర్చాలి. వారికి ఇప్పటికే ఉన్న సాధారణ విద్యార్హతలు ప్రాతిపదికగా ఏ స్థాయి (డిగ్రీ/డిప్లమో /ఐటిఐ) శిక్షణా కోర్సుకు వీరు సరిపోతారో దానికి ప్రభుత్వ ఖర్చుతోనే వారిని పంపాలి. ఈ రంగంలో 35 శాతం ఉద్యోగ అవకాశాలు మహిళలకు ఉన్నాయి. ప్రభుత్వం ముందుగా తన వార్షిక లక్ష్యాలను ప్రకటించి, ఒక్కొక్క గ్రామం నుంచి 10 మంది యువతీ యువకుల్ని శిక్షణకు పంపడం ద్వారా ఈ పరిశ్రమ విస్తరణకు మానవ వనరులను సిద్ధం చేసే పని ప్రారంభించాలి. సమాంతరంగా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఆధునిక ట్యానరీలను మొదటిదశలోనూ శుభ్రంచేసిన తోళ్ళతో చర్మ ఉపకరణాలను ఉత్పత్తిచేసే యూనిట్లను రెండవ దశలోనూ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఇందుకు 'అస్సోఛోమ్', 'ఫిక్కి' సి.ఐ.ఐ' వంటి వాణిజ్య-పారిశ్రామిక వేదికలను భాగస్వాముల్ని చేయాలి.

ఇక్కడ ఒక సత్యాన్ని ఒప్పుకోక తప్పదు. పశ్చిమ దేశాల మాదిరిగా కాకుండా మానవశాస్త్ర అధ్యయనాన్ని (ఆంత్రోపోలాజికల్ స్టడీస్) మొదటి నుంచి మనం వెనక వరసలోనే కూర్చోబెడుతున్నాం. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా ఉద్యమాలు (వాటి రూపాలు అనేకం కావచ్చు), పారిశ్రామిక అలజడులు, పోలీస్ స్టేషన్లలో రిజిస్టర్ అవుతున్న శాంతిభద్రతల కేసులు, చిల్లర దొంగతనాలు, సెటిల్‌మెంట్లు దందాలు చేసే ఛోటా నాయకుల వద్ద పనిచేసే కిరాయి గుండాలు... ఈ తరహా కార్యకలాపాలు మొత్తంలో కన్పించే సామాజిక వర్గ స్వరూపం ఎటువంటిదో అధ్యయనం కనుక చేయగలిగితే ఆసక్తికరమైన ఆవిష్కరణలు అందులో నుంచి బయటికొస్తాయి. అంతేకాదు 150 ఏళ్ళ క్రితం తమిళనాడు తరలిపోయిన మన వాణిజ్య వనరు ఈ సుదీర్ఘకాలంలో మన సామాజిక ముఖ చిత్రం మీద మిగిల్చిన 'నల్లగుర్తులు' కూడా చూడగలిగితే స్పష్టంగా కన్పిస్తాయి. అంతా మన స్వయంకృతం కనుక ఇప్పటికైనా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దృష్టి మన పరిశ్రమ -వాణిజ్య వర్గాలు కూడా అలవర్చుకోవడం అనివార్యం.
'లెదర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్' (లిడ్‌క్యాప్) ఇందు కోసం చేస్తున్న ప్రయత్నాలు, దాని స్థాయి ఈ రంగానికి ఉన్న డిమాండ్ ముందు ఎంత మాత్రం చాలదు. ఒక పెద్ద కుదుపుతో ఇప్పుడు ఇక్కడ ఇది మొదలవ్వాలి. ఆగస్టు 15న తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 'జాతీయ ఉపాధి హామీ' పథకాన్ని వ్యవసాయరంగంతో పాటు చేనేత రంగానికీ విస్తరించాలనే ప్రతిపాదన కేంద్రం వద్ద చేస్తానని ప్రకటించారు. అయితే వరసలో వాటి కంటే ముందు ఉండవల్సింది చర్మకార వృత్తి. మారుతున్న మన అవసరాల కొద్దీ వైద్య ఆరోగ్య శాఖను మూడు మంత్రిత్వ శాఖలుగా చేసినట్లు, పశు సంవర్ధక శాఖకు దాని అనుబంధ సర్వీసులతో మరొక శాఖను కనుక ఇందుకోసం ఏర్పాటు చేస్తే దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక సంస్కరణల అమలు రెండవ దశలో వున్న ఈ తరుణంలో ఇంకా ఈ రంగాన్ని ఒక 'సంక్షేమ శాఖ' గానేకాక వాణిజ్య వ్యవస్థ రంగంగా కూడా చూడాదానికి ఎంత మాత్రం జాప్యం చేయనవసరం లేదు.
-జాన్‌సన్ చోరగుడి

Andhra Jyothi Telugu News Paper Dated : 16/07/2013

No comments:

Post a Comment