Wednesday, August 28, 2013

విద్యావకాశాలు-నైపుణ్యాలు- By -బండమీది శ్రీనివాస్, పరిశోధక విద్యార్థి (ఇఫ్లూ) హైదరాబాద్


రిజర్వుడు కేటగిరిలో మిగిలిపోతున్న బ్యాక్‌లాగ్ ఉద్యోగాల నేపథ్యంలో, వాటికి గల కారణాల ను అధ్యయనం చేయడానికి, కేంద్ర ప్రభుత్వం వివిధ మంత్రిత్వశాఖలతోపాటు యూపీఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ వంటి బోర్డుతో కూడిన 20 మంది సభ్యులు గల కమిటీని ఏర్పాటు చేయడం ముదావహం. 2008లో స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ (SRD)ను ప్రారంభించి, పూర్తి స్థాయిలో బ్యాక్‌లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒకవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను బ్యాక్‌లాగ్ ఉద్యోగాలలో భర్తీ చేస్తూనే,బ్యాక్‌లాగ్‌కు గల కారణాలను సైతం అధ్యయనం చేయడం ప్రారంభించింది. 2013లో ఉద్యోగాల భర్తీ 75 శాతం వరకు జరిగిన బ్యాక్‌లాగ్ ఉద్యోగాలు ఇంకా మిగిలిపోతూనే ఉండడం ఆందోళన కలిగించే అంశం. అదే సందర్భంలో ఆయా మంత్రిత్వశాఖలు నిర్వహించిన ఒక పరిశీలనలో అభ్యర్థులలో నైపుణ్యత లేమిని ప్రధానంగా ప్రస్తావించడం గమనార్హం. దీనికి, సామాజికంగా, ఆర్థికంగా వెనకబడ్డ ఎస్సీ,ఎస్టీ, బీసీల ఉద్యోగ కల్పనకు సంబంధించి, విద్యారంగంలో సంస్థాగత మార్పులను తీసుకురావడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే ప్రధాన కారణం. రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ, బీసీల విద్యావకాశాలను మెరుగుపరచడానికి 1984లో ఏర్పడ్డ సంక్షేమ గురుకులాలు, నేటికి సుమారు మూడు వందల వరకు అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విద్యనందిస్తున్నాయి. 

ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని రకాల వసతులు కల్పిస్తూ, కార్పొరేట్ విద్య సంస్థలకు దీటుగా విద్యార్థులను, చదువుతోపాటు సాంస్కృతిక, క్రీడారంగాలలో రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించే విధం గా తయారు చేస్తున్నాయి. కానీ ఇంటర్మీడియట్ విద్యానంతరం డిగ్రీ చదువుల కోసం గురుకుల కళాశాలలు రెండు మాత్రమే (కర్నూల్, నాగార్జునసాగర్) ఉన్నాయి. నేడు ఉద్యోగానికైనా డిగ్రీ కనీస విద్యార్హత. ఈ తరుణంలో ప్రభుత్వం ఈ కళాశాలల సంఖ్యను పెంచకపోవడం ఉద్యోగార్జన లో పెను ప్రభావమే చూపిస్తుంది. అనేక పరిశోధనలు వెల్లడించినట్టుగా విద్యార్ధి జీవితంలో డిగ్రీ స్థాయి విద్య ఒక కీలక ఘట్టం. ఈ దశలో భావోవూదేకాలు ఎక్కువే. విద్యార్థులు తమ భవిష్యత్తును సమర్థవంతంగా, ప్రణాళికబద్ధంగా ఏర్పరచుకోవడం ఈ దశలోనే ప్రారంభం కావాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మోడల్ స్కూల్స్ స్థాపించి ప్రాథమికోన్నత విద్యను, జిల్లాకో యూనివర్సిటీని ఏర్పరుస్తూ పీజీ విద్యను పెంపొందించే చర్యలు తీసుకున్న, సామాజికంగా వెనకబడినవర్గాల కోసం డిగ్రీ స్థాయి విద్యను అందించే ప్రక్రియలో విఫలమైంది. 

సంక్షేమ కళాశాలలలో వేల సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు తమ ఇంటర్మీడియట్ విద్య వరకు ముగించుకుని, సంక్షేమ డిగ్రీ కళాశాలలు లేక, ఇతర కళాశాలల్లో చదివే ఆర్థికస్తోమత లేక, కూలీలుగా మారుతున్నారు. లేదా ఏదో ప్రభుత్వ కళాశాలల్లో చదువుతూ పార్ట్‌టైం జాబులతో బతుకు బండి లాగుతున్నారు. ఇన్ని సంఘర్షణల నడుమ పోటీ పరీక్షల సంగతేమో గానీ అసలు డిగ్రీ పూర్తి చేయడమే పెను భారంగా మారుతుంది.ఈ ఏడాది పన్నెండు వేలకోట్లతో మన రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళికను అట్టహాసంగా ప్రకటించింది. దాంట్లో 40 శాతం బడ్జెట్‌ని మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేస్తామన్నది. విద్యను ప్రధాన మౌలిక వనరుగా గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైంది.మూడు గురుకుల డిగ్రీ కళాశాలలను మాత్రమే ప్రకటించడంలో గల ఔచిత్యమేమిటి? ప్రభుత్వానికి బడుగుల విద్య పట్ల చిత్తశుద్ధి ఇదే నా? ఇంటర్మీడియేట్ కళాశాలలలో ఇస్తున్న ఐఐటీ, జేఈఈ వంటి కోచింగ్‌ల తరహలో, సివిల్ సర్వీస్ నుంచి వివిధ పోటీ పరీక్షలకు సంసిద్ధం చేసినట్లయితే బడుగు జీవుల బతుకులు బాగుపడతాయి


Namasete Telangana Telugu News Paper Dated : 29/08/2013 

No comments:

Post a Comment