Friday, August 9, 2013

Exclusive story on Manda Krishna Madiga Founder, President Madiga Reservation Porata Samithi (MRPS)గీటురాయి ఒకటే ఉండాలి --Navya Special Story


August 09, 2013
మాది వరంగల్ జిల్లాలోని హంటర్‌రోడ్డు శాయంపేట అనే గ్రామం. బాల్యం నుంచి ఆ గ్రామానికి సంబంధించి నాకున్న తీపి జ్ఞాపకాల కన్నా, ఆ నాడున్న కులవివక్ష కారణంగా మేము పడ్డ అవమానాలే ఎక్కువ. ఆ అవమానాలను కొంతకాలం దిగమింగుతూ కూర్చున్నా, వీటిని ఎదుర్కొనకపోతే చివరికి మనల్ని మనుషులుగా కూడా చూడరనే అభిప్రాయం ఏర్పడుతూ వచ్చింది. మెల్లగా ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే ఒక స్ఫూర్తి మనసులోకి ప్రవేశించి ఆ అవమానాల్ని ఎదుర్కొనేందుకు సిద్ధం చేసింది. అదే సమయంలో ఒక న్యాయమైన సమస్య మీద మాట్లాడాలనుకున్నప్పుడు మాట్లాడే ప్రతి మాటకూ కట్టుబడి ఉండాలనే ఒక భావన మనసులో బలపడుతూ వచ్చింది.

అలా కట్టుబడి ఉండడం వల్ల అదనంగా కష్టాలు, బాధలు కొంత కాలం వచ్చినా అంతిమంగా ఆ బాధలు పోయే రోజు ఒకటి వస్తుందని, అలా కాకుండా మనం న్యాయం అనుకున్న సమస్యను మధ్యలోనే వదిలేస్తే జీవితమంతా ఆ అవమానాలూ, బాధలూ వెంటాడుతూనే ఉంటాయని నాకు బోధపడసాగింది. పుట్టుకతో వచ్చిన కులబంధం ఎంత గొప్పదైనా కులపక్షపాతంతో ఇతర అన్యాయాలను పట్టించుకోకుండా ఉండకూడదని, అవసరమైతే కులాతీతంగా కూడా వ్యవహరించాలని నేననుకుంటాను. ప్రత్యేకించి వర్గీకరణ విషయంలో ఒక సమస్యలోంచి మరో సమస్య పుట్టుకొచ్చి అడుగడుగునా అగ్ని పరీక్షలు పెట్టింది. నిరంతర సంఘర్షణకు గురిచేసింది. ఆ సంఘర్షణ ఎప్పటికప్పుడు ఎన్నో సత్యాల్ని ఆవిష్కరిస్తూ వచ్చింది. విషయం ఒకటే అయినా అందులోంచి పలు సమస్యలు, పలు సత్యాలు బయటపడుతూ వచ్చాయి. గడిచిన దశాబ్దాలన్నీ దళిత సమస్యల మీదే గడిచిపోవడం వల్ల నా జీవితంలో దళితుల అంశాలే సమస్తమైపోయాయి.


మనకు మనమే హానిగా....
విజయభాస్కర రెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంటే 1994లో మంద జగన్నాథం, ఎన్ వెంకటస్వామి (రిటైర్డ్ ఐఏఎస్) వీళ్లిద్దరూ ఎస్సీల్లో ఏబిసిడి వర్గీక రణ జరగాలంటూ ఒక సదస్సు నిర్వహించారు. దానికి సంబంధించిన కరపత్రం ఒకటి నా చేతికి వచ్చింది. 70 శాతం ఉన్న మాదిగలకు 10 శాతం రిజర్వేషన్ ప్రయోజనాలు అందితే, 30 శాతం ఉన్న మాలలకు మిగతా 90 శాతం అందుతున్నాయన్నది ఆ కరపత్రంలోని సారాంశం. ఈ వాస్తవాలు నన్ను ఒక తీవ్రమైన ఆత్మ సంఘర్షణకు గురిచేశాయి. ఏమిటిది? నిరంతరం అవమానాలు పడుతున్న దళితులంతా ఒక్కటని ఇన్నేళ్లు మనం ఉమ్మడి ఉద్యమాల్ని నడిపించుకుంటూ వచ్చాం. కానీ, వీటిలో ఒక వర్గం మరో వర్గానికి అవకాశాలు రాకుండా చేసే ఈ పరిస్థితి ఏమిటి? అనిపించింది.


ఎవరికి వ్యతిరేకంగా...
అప్పటిదాకా మనలో భాగమనుకున్న వారిపైనే మనం పోరాటం చేయాలా? పోరాటం లేకుండా సామరస్యంగా ఒప్పందం కుదిరే అవకాశం లేదా అనుకున్నాను. అప్పటిదాకా ఎప్పుడూ ఊహించని విషయం కదా! నాలో తీవ్రమైన అంతర్మథనం మొదలయ్యింది. ఈ స్థితిలో ఒకరోజు విప్లవోద్యమ నాయకుడైన కె.సత్యమూర్తి గారి వద్దకు వెళ్లి వారి ముందు ఈ విషయాన్ని ప్రస్తావించాను. 'ఇంతవరకూ మన ఆత్మగౌరవాన్నీ, మన హక్కుల్నీ కాలరాస్తున్న దళితేతరుల మీద పోరాటం చేశాం. కానీ దళితుల్లోనే ఒక వర్గం మరో వర్గ ప్రయోజనాల్ని సొంతం చేసుకుంటోంది. ఈ సమస్యను పరిష్కరించాలి కదా!' అన్నాను. అక్కడున్న వాళ్లంతా మాలలే. నేనొక్కడ్నే మాదిగ. 'ఉమ్మడిగా మనకు అన్యాయం జరిగినప్పుడు దాని కారకుల మీద పోరాడదాం.

మనలో మనకే అన్యాయం జరిగేటప్పుడు మనలో ఎవరికి అన్యాయం జరుగుతోందో వారి వైపు నిలబడదాం' అన్నాను. దానికి వాళ్లు 'ఆ విషయాల్లోకి వెళితే, మనలో మనకే గొడవలు అవుతాయి. మన మధ్యలోనే చీలికలు ఏర్పడతాయి' అన్నారు. 'అలా అంటే మరి సమస్యను వదిలేస్తామా? అన్యాయం పాలైన వర్గానికి న్యాయం జరగాలి కదా!' అన్నాను. దళితుల ఆత్మగౌరవాన్ని పరిరక్షించడానికి ఉద్యమాలు చేసే మనం మాదిగల వైపు ఉండి వారికి అన్యాయం జరుగుతోందని పరిష్కారం కోరితే, ద ళితులు చీలిపోయే పరిస్థితి ఏర్పడుతుందా? ఒకవేళ వారన్నట్లు, ఈ చీలిక పర్యవసానంగా జాతి చీలిపోతుందని వెరచి నేను మౌనంగ ఉండిపోతే, ఈ జాతికి న్యాయం ఎట్లా జరగాలి?


వర్గీకరణే ఏకైక మార్గంగా....
ఈ స్థితిలో రిజర్వేషన్ పద్ధతి గురించి అధ్యయనం చేస్తే బిసిలో ఎబిసిడి వర్గీక రణ ఉందనేది తెలిసింది. ఆ వర్గీకరణ వల్లే ఎవరి వాటా వారు అనుభవించగలుగుతున్నారు. వర్గీక రణతో బిసిల్లో చీలిక రానప్పుడు, ఎస్‌సిల్లో వర్గీకరణ జరిగితే చీలిపోతారని ఎలా అంటున్నారు? ఈ పరిశీలన వర్గీకరణ దిశగా నేను ముందుకు సాగడానికి పునాదిగా నిలిచింది. నా నిర్ణయాన్ని విప్లవకారులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీలన్నీ బలపరిచాయి. 1996లో ఎబిసిడి వర్గీకరణ విషయమై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబాబు నాయుడు గారు రామచంద్రరావు కమీషన్ ఒకటి ఏర్పాటు చేశారు. రిపోర్టు ఇవ్వడానికి ముందు ఒకరోజు రామచంద్రరావు గారు నన్ను పిలిపిస్తే వెళ్లాను. ఆయన నాతో 'నిజమే. మాదిగల కన్నా మాలల జనాభా తక్కువగా ఉంది. మీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల వాటా మీకు అందడం లేదు.

మీ వాదనను నేను పూర్తిగా సమర్థిస్తున్నా'' అన్నారు. నేను "చాలా సంతోషం సార్! సాధ్యమైనంత త్వరగా రిపోర్టు పంపండి సార్!' అన్నా. ఆ తరువాత కొద్ది క్షణాలకే 'మీ వాదన వరకైతే నేను సమర్థిస్తా కానీ, ఇక్కడో సమస్య ఉంది. దానికి పరిష్కారం చెప్పండి' అంటూ'షెడ్యూల్డ్ కులాల్లో మీ కంటే వెనుకబడిన వారు కూడా ఉన్నారు కదా! రెల్లి, పైడి, పాకితో పాటు చాలా ఉపకులాలు ఈ 50 ఏళ్ల కాలంలో రిజర్వేషన్ ఫలాలు ఏ మాత్రం పొంద లేదు. వాళ్లను నేను ఏం చేయాలి? ' అన్నారు. 'మళ్లీ ఇదో కొత్త సమస్య వచ్చిపడింది కదా!' అనిపించింది. కొద్ది క్షణాలు ఆగి 'సార్! ఈ కులాల గురించి శాస్త్రీయంగా నేను అంత లోతైన పరిశీలన ఏదీ చేయలేదు.

మాల మాదిగల మధ్య అసమానతలు ఉన్నాయని మాత్రమే నాకు తెలుసు. అందువల్ల మాదిగలకు అన్యాయం జరుగుతోందని, వారికి న్యాయం జరగాలని పోరాటం చేస్తూ వచ్చాను. మీ కమీషన్ రిపోర్టులో మాదిగల కంటే వెనుకబడిన కులాలు ఉన్నట్లు తేలితే నా సమాధానం ఒక్కటే సార్! రిజర్వేషన్ల పంపిణీలో మొదటి ముద్ద వాళ్లకు పెట్టండి సార్!' అన్నాను. 'ఆ మాట వినగానే వెంటనే లేచి నన్ను కౌగిలించుకుని, తన హర్షం వ్యక్తం చే స్తూ 'మీకు అన్యాయం జరిగింది కాబట్టి అవకాశాల్లో మొదటి భాగం కూడా మాకే కావాలని అంటావనుకున్నాను. కాని మీ కంటే వెనుకబడిన వర్గానికి ఇవ్వాలని నువ్వు చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. నే నిప్పుడు అదే చేయబోతున్నాను కూడా' అన్నారు. నా మాటలు ఎంతో మంది మా కుల మేధావుల్ని తీవ్రమైన ఆగ్రహానికి గురిచేశాయి. వారి స్పందన నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. న్యాయాన్యాయాలతో ప్రమేయం లేకుండా అంతా మాకే దక్కాలనుకోలేను కదా!


గొంతులేని గోడు
మేధావులు కొందరు తమకు విరుద్ధంగా ఏదో జరగబోతోందని ఆందోళనకు గురై ఈ విషయంలో అడ్డుపడే ప్రయత్నాలు చేశారు. ఒకరోజు ఒక సమావేశం ఏర్పరిచి దానికి నన్ను పిలిచారు. ఆ సభలో నన్ను ఉద్దేశించి 'నువ్వు తప్పు చేస్తున్నావు. మాలల వల్ల మనకు అన్యాయం జరిగిందని చెప్పి, పోరాటం చేస్తున్నావని మీకు నైతిక మద్దతు ఇస్తూ వచ్చాం. ఇవ్వాళ ఎంతో పోరాటం తర్వాత ఎ,బి,సి,డి వర్గీకరణ జరుగుతుందని అందరూ అనుకుంటున్న సమయంలో వచ్చే ఫలితాలు పెద్ద సంఖ్యలోఉన్న మాదిగలకు కాకుండా వే రే వాళ్లకు ఇవ్వమని నువ్వు చెప్పినట్లుగా మాకు సమాచారం అందింది.

అందుకు మేము ఒప్పుకోం. ఒకవేళ అదే నీ విధానమైతే మేమెవరమూ నీకు అండగా నిలబడం' అన్నారు. ఆ సమయంలో నాకు అనిపించిందొక్కటే. మాదిగలు ఇంత పెద్ద సంఖ్యలో ఉండి కూడా వారు అడగనంత వరకు వారి సమస్యే ఎవరికీ అర్థం కాలేదు. ఇన్నేళ్లుగా అన్యాయాలకు ఆహుతి అవుతున్నా, మాదిగలు సంఘటితమై గొంతు విప్పిన తరువాతే కదా సమస్య చర్చకొచ్చింది. మరి ఆ ఉపతెగల వాళ్లు గొంతు విప్పే స్థితికి ఎప్పుడు రావాలి? దానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది? అప్పటిదాకా వారికి రావలసిన వాటా ఏదీ అందకుండానే పోవాలా?


బతుక్కి అర్థం ఏముంది?
"రిజర్వేషన్ అంటే ఏమిటో, మానవ హక్కులు అంటే ఏమిటో తెలియని స్థితిలో వాళ్లింకా ఉన్నారు. వాళ్లకు చెందవలసిన అవకాశాల్ని వారికి ఇవ్వకపోతే మన బ్రతుక్కి అర్థం లేదు. మన ఉద్యమానికి అర్థం లేదు. నా వ్యక్తిత్వానికి అర్థం లేదు. మీరు ఏమైనా అనుకోండి. నేను ఎ,బి,సి, డి గ్రూపులో 'ఎ' గ్రూపునే వారికి ఇవ్వాలని కోరతా'' అన్నాను. ఆ మేధావి వర్గం అంతా 'నువ్వు మా మాట వినాల్సిందే' అన్నారు. అందుకు నేను 'అట్లా అనుకుంటే రిజర్వేషన్లన్నీ మాకే ఇమ్మంటూ మాదిగల కోసమే మీరు ఉద్యమం నడుపుకోండి. రెల్లి, పైడి, పాకీ కులాలకే ముందు ఇవ్వాలని నేను ఉద్యమం నడుపుతాను'' అంటూ కరాఖండీగా చెప్పేశాను. అంటే నా సొంతకులంతోనే పోరాటం చేయడానికి నేను సిద్ధపడిపోయా. అయితే నా వ్యక్తిత్వం, ఉద్యమం నడిపే తీరు వారికి తెలుసు కాబట్టి అడ్డుకుంటే మరింత మొండిగా ఆ వైపు నిలబడతాడనుకుని నా వాదనను అంగీకరించారు.

నెలల తరబడి నేను అనుభవించిన ఆత్మక్షోభకు ఆ రోజు అలా తెరపడింది. ఆ రోజే కనుక నేను మొత్తం నా కులానికే రావాలని అడిగి ఉంటే ఏమాత్రం సామాజిక స్పృహ లేని ఒక పక్కా కులతత్వవాదిగా మిగిలిపోయే వాడ్ని. వారికి కేటాయించిన రిజర్వేషన్లతో రెల్లి, పైడి, పాకీ కులస్థులు, విద్యా ఉద్యోగాల్లో ఏనాడూ ఏమీ పొందని వారు ఈ రోజు తమ వాటాను తాము పొందుతూ కొందరైనా ప్రభుత్వ ఉపాధి అవకాశాలు అందుకుంటూ ఎంతో కొంత స్థిరమైన జీవితాన్ని గడుపుతున్నారు. స్వార్థం అనేది మనిషిని ఎదుటి వారికి జరిగే అన్యాయాన్ని చూడనివ్వదు. మనము, మన కుటుంబం, మన వర్గం తప్ప మరి దేన్నీ పట్టించుకోనివ్వదు. అన్యాయం జరిగిన వర్గం వైపు ఉండాలనే నిజాయితీ ఉంటే, ఎదుటి వారికి జరిగిన అన్యాయం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అదే మనిషికి స్థిరమైన నడక నేర్పుతుంది.


 బమ్మెర
ఫోటోలు: బాబూరావు
Andhra Jyothi Telugu News Paper Dated : 09/08/2013 

No comments:

Post a Comment