Sunday, March 2, 2014

సరోజిని కవిత్వంలో కానరాని దళితులు By నలిగంటి శరత్


 
New 
 
0 
 
0 
 
 

'సరోజినికవిత్వంలో హైదరాబాద్' పేరుతో సామిడి జగన్‌రెడ్డి 'వివిధ'లో రాసిన వ్యాసంలో సంక్షిప్తంగా సరోజినీ నాయుడు సాహిత్య జీవితాన్ని పరిచయం చేశారు. నిర్దిష్టత లోపించిన ఈ వ్యాసం అనేక విషయాలను ఓవర్ సింప్లిఫై చేసింది. ఆమె అనేక రకాల కష్టజీవుల మీద కవిత్వం రాశారని జగన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ బజార్లు కవితలో సబ్బండ వర్ణాల గురించి వర్ణించినట్లు రాశారు. తన వ్యాసానికి దళితుల ఆమోదం సంపాదించడం కోసం మహాత్మా జ్యోతిరావు ఫూలేను, సావిత్రిబాయి ఫూలేను ప్రస్తావించారు. జగన్‌రెడ్డి దృష్టిలో ఆమె పేదల పక్షపాతి. అణగారిన వర్గాల పక్షపాతి. ఇది వొఠ్ఠి అబద్ధమని ఆయనకు కూడా తెలుసు. కానీ ఆమె గురించి ఇంతకాలం ప్రచారంలో పెట్టిన అంశాలను పునరుచ్ఛరించి పాఠకుల మెదళ్లను నిద్ర పుచ్చాలని ఆయన సంకల్పించారు.
నిజమే, ఆమె ఆంగ్లంలో కవిత్వం రాశారు. అయితే, ఏ భాషలో రాశారన్నది ద్వితీయాంశం. కానీ ఏమి రాశారు? ఏ భావజాలంతో రాశారు? తరచి చూస్తే ఆమె కవిత్వం ప్రత్యామ్నాయ మార్గాలనేమీ చూపలేదు. ఆమె దృక్పథమే అందుకు కారణం. అన్ని వర్ణాల గురించీ, వృత్తుల గురించీ హైదరాబాదు బజార్లు కవితలో రాశారని జగన్‌రెడ్డి రశారు. కానీ ఆ కవితలో ఒక్కమాటైనా చెప్పులుకుట్టే వృత్తి గురించి రాయలేదు. ఆమె కవిత్వంలో దళిత జీవితాలకు చోటులేదు. దళితుల గురించీ, దళిత స్త్రీల గురించి ఒక్క ముక్కా ఆమె రాయలేదు. ఆమె ప్రస్తావించింది కేవలం వ్యాపారం గురించే తప్ప వృత్తుల గురించి కాదు. అవి కుల వృత్తులని గుర్తించే నిజాయితీ ఆమెకు లేదు. హైదరాబాదు నగరంలో అమ్మే గాజులు ఆమెకు ఒక దుకాణంలో లభించే సరుకులు మాత్రమే. వాటిని తయారుచేసే కులస్తుల గురించి గానీ, కుల వ్యవస్థ వల్ల బలైపోతున్న బహుజనుల గురించి గాని ఆమెకు ఏ మాత్రం పట్టింపు లేదు. అలా అని ఆమెది వర్గదృష్టి కూడా కాదు. పేద వర్గాల గురించి రాసేంత చైతన్యం కూడా లేదు. ఒక దృశ్యాన్ని అక్షరాలతో బంధించటమే తప్ప ఆ దృశ్యం వెనకున్న సారభూత తత్వాన్ని గ్రహించటం ఆమెకు తెలియదు. ఆమెది అగ్రవర్ణ దృక్పథమని విమర్శిస్తే ఎవరూ నొచ్చుకోవాల్సిన అవసరం లేదు.
జాతీయోద్యమంలో గాంధీ, నెహ్రూలతో సమానంగా పనిచేసిన హైదరాబాద్ ప్రజల మనిషి అని మరో వ్యాఖ్య జగన్‌రెడ్డి చేశారు. ఇది పచ్చి అబద్ధం. ఆమె అగ్రవర్ణ సమాజ మేలు కోసం పనిచేసింది. అంబేద్కర్ ఉద్యమం హైదరాబాద్ రాజ్యంలో బలంగా వుండేది. కానీ సరోజిని మాత్రం అంబేద్కర్ ఉద్యమం పట్ల చాలా అసహనంతో వుండేది. అంబేద్కర్‌ను 'నాజీ' అని సంబోధించిన సరోజిని ప్రజల మనిషి ఎలా అవుతుందో జగన్‌రెడ్డి చెప్పాలి. నిజమే, ఆమె గాంధీతో కలిసి పనిచేసింది. అంతేతప్ప గాంధీతో సమానమైన నాయకురాలు కాదు. ఆమెకు ఒక ఫిలాసఫీ అంటూ లేదు. గాంధీతత్వమే ఆమె హృదయం. అందువల్ల గాంధీలాగే అంబేద్కర్‌ను వ్యతిరేకించింది. రెండో రౌండ్‌టేబుల్ సమావేశంలో గాంధీతోపాటు సరోజిని కూడా పాల్గొన్నది. ఆ సమావేశంలో అంబేద్కర్‌ను వ్యతిరేకిస్తూ మాట్లాడింది. అణగారిన వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలు, రెండు ఓట్లు, వయోజన ఓటు హక్కు, జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం అనే నాలుగు డిమాండ్లను డా.అంబేద్కర్ డిమాండ్ చేస్తే సరోజిని వ్యతిరేకించింది. స్త్రీలకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు వుండాలన్న అంబేద్కర్ ప్రతిపాదనను ఆమె వ్యతిరేకించింది. ఎస్సీ, ఎస్టీ, బిసీ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు మతాలకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలనే ఆకాంక్షను తీవ్రంగా ఆమె గాంధీతో కలిసి వ్యతిరేకించింది. కమ్యూనల్ అవార్డును బ్రిటీషు ప్రభుత్వం ప్రకటిస్తే, ఎర్రవాడ జైలులో గాంధీ కుట్రపూరిత ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఆమె ఆయన పక్షాన నిలబడింది. అణగారిన వర్గాల విముక్తికి వ్యతిరేకంగా రాజకీయాలు చేసిన సరోజినీ నాయుడు ప్రజల మనిషి ఎలా అయ్యిందో ఎంతకీ అర్థం కావటం లేదు. 1935లో బ్రిటీషు వాళ్లు రాజ్యాంగం రాసే సమయంలో మహిళలకు ప్రత్యేక నియోజకవర్గాలు పెట్టాలని, మహిళా రిజర్వేషన్లలో కూడా అణగారిన కులాల మహిళలకు ప్రత్యేక ప్రాతినిధ్యం వుండాలని అంబేద్కర్ వాదిస్తే ఆయన్ని వ్యతిరేకించిన మహిళ ఆమె. ఆమెది సామాజిక న్యాయం లేని జాతీయవాదం. అంతెందుకు, హైదరాబాద్ రాజ్యంలో దళితులు చేస్తున్న ఉద్యమానికి ఆమె కనీసం మద్దతు ఇవ్వలేదు. హైదరాబాద్ నగరంలో అధిక సంఖ్యలో వుండే మాదిగ, మాల ఉద్యమాలతో ఆమె కనీస సంబంధాలు పెట్టుకోలేదు. పోనీ, స్త్రీలు ఎదుర్కొంటున్న పీడన గురించి రాసిందా అంటే అదీ లేదు. గాజుల గురించి గొప్పగా రాసిన సరోజిని ఆడవాళ్ల చేతులకు గాజులను తొడిగిన మనువాదానికి వ్యతిరేకంగా ఒక్క కవితా రాయలేదు. తెలంగాణ అభిజాత్యంతో అబద్ధాలను చరిత్రగా ప్రచారం చేయాలని ప్రయత్నిస్తే దళితులు సహించరు. చరిత్రను ఇకనైనా నిష్పాక్షికంగా మాట్లాడుకుందాం. అలా మాట్లాడుకోవటం వల్ల సరోజినీ నాయుడు పట్ల గౌరవం పెరుగుతుంది తప్ప తగ్గదు.
-నలిగంటి శరత్
వ్యవస్థాపక అధ్యక్షులు, దళిత బహుజన కల్చరల్ అసోసియేషన్
Andhra Jyothi Telugu News Paper Dated: 3/3/2014 

No comments:

Post a Comment