Friday, February 28, 2014

నాకూ సంబురం లేదు- కంచ ఐలయ్య


Published at: 01-03-2014 07:30 AM
 
3 
 
3 
 
0 
 
 

దేశానికి స్వాతంత్య్రం వచ్చిననాడు గాంధీ, అంబేద్కర్, నెహ్రూ ఎవరూ గుర్రాలు, ఒంటెల్ని ఎక్కి ఊరేగి సంబురాలు జరుపలేదు. ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో ఫ్యూఢలిజం ఎంత పూనకంతో ఎగిరిందో మనమంతా చూశాం. ప్రజలు కోరుకునే నాయకులెవరూ ఇటువంటి సంబురాలు చెయ్యరు. కనుకనే తెలంగాణ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది.
ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయింది. తెలంగాణలో పై వర్గాలు సంబురాలు చేసుకుంటుంటే, సీమాంధ్ర ప్రాం తాల్లో పై వర్గాల్లో విషాదం కనిపిస్తుంది. నేను తెలంగాణ వాణ్ణి. చిన్నప్పటినాటి చదువురీత్యా తెలుగు వాణ్ణి, భారతీయుడిని. ఈ ప్రక్రియ అంతటితో నాకు సంబురపడాలనే తపన కలుగలేదు. కొంతమంది అంటున్నట్లు తెలుగు ప్రజలు విడిపోయినందుకు కాదు. నేను తెలుగువాదిని కాదు, ఆంగ్ల భాషా అభివృద్ధి వాదిని.
రాష్ట్రాలు విడిపోవడం, రెండు దేశాల మధ్య సంఘర్షణ వాతావరణాన్ని ఇరు పక్కల సృష్టించడానికి నేను వ్యతిరేకం. శారీరక పోరాటాల కంటే రెండు ప్రాంతాల మధ్య ఒక మానసిక పోరాటం జరగడం, ప్రజాస్వామిక వాతావరణం దెబ్బతిని, ప్రజల మధ్య ద్వేషాలు పెరుగడం... ఈ క్రమంలో జరిగిన పెద్ద నష్టం. నష్టాన్ని పూడ్చడానికి మానవత్వం కీలకమౌతుంది.

ఇరుపక్షాల్లో ఇది ప్రజలందరి పోరాటం అని చెప్పినప్పటికీ రెండు ప్రాంతాల ఆధిపత్య వర్గాలు, కులాలు ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయి. ఒక ప్రాంతపు ఫ్యూఢల్ శక్తులు, మరో ప్రాంతపు పెట్టుబడి ఆధిపత్య శక్తులు గత మూడేళ్లుగా బాహాబాహీకి దిగాయి. ఈ నరాల యుద్ధం టీవీల్లో జరిగింది. అది అన్ని ప్రాంతాల శ్రమ జీవుల్ని, ముఖ్యంగా దళితుల్ని, ఆదివాసుల్ని, వెనుకబడిన తరగతుల వారిని గందరగోళపర్చింది. చివరికి బిల్లు రెండుసభల్లో అదే మానసిక యుద్ధ వాతావరణంలో పాసవ్వడంతో పరిస్థితి భీకర మానసిక ఉప్పెన ఆగిపోయి ఒక పక్క కొంత సంబురాలు, మరోపక్క కొంత ఓటమి ఓదార్పుల్లో ప్రజలున్నారు. ఈ స్థితిలో 1956 నుంచి 2014 నాటి ఈ ప్రజలు సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు లాభనష్టాలు మరో కోణం నుంచి అంచనా వేయాలి.
1956 ముందు తెలంగాణ గ్రామాల్లో పాఠశాలలు లేవు. ఇక్కడి భూస్వామ్య శక్తులు సైతం ఆధునిక విద్య లేక బడులే బందీఖానాలనే స్థితిలో ఉన్నారు. సీమాంధ్ర ప్రాం తంలో బ్రిటిష్ వలసవాదం, క్రిస్టియన్ మిషనరీలు విద్యను ఆదర్శవంతమైందిగా, ఆంగ్ల విద్యను అవకాశాల పట్టుకొమ్మగా ప్రచారం చేశారు. ఆ విలువలు గ్రామ స్థాయి వరకు పాకివున్నాయి. ఆనాడు రాష్ట్రం సమైక్యతను సంతరించుకోకపోతే తెలంగాణలోని భూస్వామ్య పాలక వర్గాలు దాని అభివృద్ధిని ఆకాంక్షించే వారే కాదు. రాజకీయ పాలకులే కాక అటునుంచి హైదరాబాదుకొచ్చిన బ్యూరాక్రటిక్ శక్తులు విద్యాకాంక్ష కొంత ప్రయోజనం ఒనగూర్చింది.
సమైక్యరాష్ట్ర అభివృద్ధి క్రమంలో కమ్మ మైగ్రెంట్స్ (ఎక్కువగా క్రైస్తవ మైగ్రెంట్స్) ఈ ప్రాంతం వచ్చి సెటిల్ అయ్యారు. వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వీరి ప్రభావం వ్యవసాయం ఆధునికత మీద, అంటరానితనాన్ని తగ్గించడంలో విద్యా వ్యాప్తిని పెంచడంలో చాలా వుంది. ఇక్కడి కరుడుకట్టిన రెడ్డి, వెలమ భూస్వామ్య సంస్కృతికి, క్రైస్తవ కమ్మల సంస్కృతికి చాలా తేడా ఉం డేది, ఉన్నది. ఉదాహరణకు చెన్నరావుపేట మండలంలోని తిమ్మారావు గ్రామసంస్కృతి పరిశీలిస్తే ఈనాటికీ తేడాతెలుస్తుంది. ఆ గ్రామ ప్రభావం మొత్తం తాలూకా మీద పడిందంటే అతిశయోక్తికాదు. ఇన్ని పోరాటాలు, ఒడిదుడుకుల మధ్య కూడా విద్యారంగం తెలంగాణలో ఈ స్థాయికైనా ఎదిగిందంటే సమైక్యత ఫలితమని చెప్పక తప్పదు.
విద్యారంగం, ఆధునిక వ్యవసాయం, పట్టణ సంస్కృతి, తిండి, బట్ట వంటి వాటిలో ముందంజలో ఉన్న వారి ప్రభావం వెనుకబడిన వారిమీద పడుతుంది. తెలంగాణ భూస్వాములకు విద్యలో పోటీపడాలనే ఆలోచన సమైక్యతలో వచ్చిందే. అయితే ఇక్కడి భూస్వామ్య వర్గంలో ఈనాటికీ సాంఘిక సంస్కరణ లేదు. అందుకే వీళ్ళు 'తెలంగాణ పునర్నిర్మాణ'మంటే ఇక్కడి నుంచి విద్యారంగాన్ని, జీవన విధానాన్ని, ఆంగ్లేయ విద్యను మళ్ళీ వెనక్కి తీసుకుపోవడమా అనే అనుమానం నాకైతే ఉన్నది.
గత నాలుగేళ్ళు తెలంగాణలోని మూడు అగ్ర కులాలు సంపూర్ణ ఐక్యతను సాధించాయి. ఇక్కడి భూస్వామ్య వర్గానికి ఒక రాజకీయపార్టీ వచ్చింది. సంఘ సంస్కరణతో ముడివడని ఏ రాజకీయ ఉద్యమమైనా అగ్రకుల ఆధిపత్యాన్నే పెంచుతుంది.
రాజకీయ రంగంలో సమైక్యత వలనే జరిగిన కొన్ని కీలక మార్పులున్నాయి. అందులో ముఖ్యమైనవి పటేల్, పట్వారీల రద్దు. అవి రద్దు చేసిన రోజుల్లో ఎన్.టి.రామారావు పాలన మీద ఇక్కడి రెడ్డి, వెలమ, బ్రాహ్మణులు ఎంత కోపంగా ఉన్నారో మనకు తెలుసు. దీనికి తోడు తాలూకాలను రద్దుచేసి మండలాలను ఏర్పర్చడం. ఇది కూడా ఇక్కడి భూస్వామ్య ఆధిపత్యం మీద పెద్దదెబ్బ తీసింది. ఈ వ్యవస్థ ఎన్నికల రంగంలోకి ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చిపెట్టింది. ఈ వ్యవస్థను పునర్నిర్మాణం పేరుతో ముందుకు తీసుకెళ్తారో, వెనక్కి తీసుకెళ్తారో తెలియదు. తెలంగాణలో ఇప్పుడు మాత్రం భూస్వాములను ప్రశ్నించే చైతన్యం జీరోస్థాయికి చేరుకొని వున్నది. ఇది టీఆర్ఎస్ ఘనత. తెలంగాణ భూస్వాములు ఆ పార్టీకి చాలాకాలం విధేయులుగా ఉంటారు. అది కాంగ్రెస్‌లో విలీనమైనా ఆ శక్తులదే పైచేయి.

దళిత బహుజన చైతన్యం 1985లో కారంచేడు సంఘటన తరువాత ఒకరూపం దిద్దుకుని తెలంగాణజిల్లాల్లోకి పాకింది కూడా ఆంధ్ర జిల్లాల్లో పుట్టిపెరిగిన అంబేద్కరిజం వల్లనే. నాలాటి వాళ్ళకెంతో మందికి బొజ్జా తారకం, కత్తి పద్మారావు, జెబీ రాజు వంటివారి నుంచి అంబేద్కరిజంపై పాఠాలు నేర్చుకునే అవకాశం దొరికింది. ఇది సమైక్య రాష్ట్రమై ఉండకపోతే ఆ బంధమేర్పడేది కాదు. ఆ తరువాత వచ్చిన మాదిగ దండోరా చుట్టూ ఏర్పడిన పెద్ద సంస్కరణ చైతన్యం సమైక్యరాష్ట్రంలో వచ్చింది. కృష్ణ మాదిగ తెలంగాణవాడైనా, ఆ చైతన్యం పునాదులు ఒంగోలులో పడ్డాయి.
అంతకంటే ముఖ్యంగా వాళ్ళు తమ తమ పేరు మార్పిడి, మాదిగ వాడల్లో ఆత్మగౌరవ పాఠాలు నేర్చుకున్న విలువలు అటు నుంచి ఇటు దిగుమతి అయినవే. టీడీపీ ఓట్ల రాజకీయం కోసమే అయినా రిజర్వేషన్ వర్గీకరణ వచ్చాక దాన్ని అమలు చేయించుకునే ఉద్యమం రాష్ట్రాన్ని ఊపేసింది. దానికి 2009డిసెంబర్ ప్రకటన తరువాత తెలంగాణ ఇస్తామని కేంద్రం ప్రకటించిన అనంతరం వచ్చిన ఉద్యమానికి చాలా పోలిక ఉన్నది. అయితే మాదిగ దండోరా ఉద్యమానికి బలమైన సాంఘిక సంస్కరణ లక్షణమున్నది.. ఒకప్పుడు కమ్మ క్రిస్టియన్లు మైగ్రెంట్స్‌గా వచ్చి తెలంగాణలో మార్పు తెచ్చినట్లే మాదిగ దండోరా ఉద్యమంలో బలమైన భూమికను పోషించింది క్రిస్టియన్ మాదిగలు.
నాకు తెలిసి తెలంగాణలో ఒక్క భాగ్యరెడ్డివర్మ ఉద్యమంలో -అదీ సంస్కృతీకరించబడ్డ రూపంలో తప్ప కులాలను కదలించిన ఉద్యమాలు పుట్టలేదు. అందుకుకారణం తెలంగాణ భూస్వాముల్లో సంఘ సంస్కర్తలు ఎదక్కపోవడం. ఆ రకంగా మాదిగ దండోరాతో వచ్చిన చైతన్యం అనన్యసామాన్యమైంది. దానితో రాష్ట్రంలోని మాలలు కొంత ఇబ్బంది పడ్డప్పటికీ అది తెలంగాణ జిల్లాల్ని, గ్రామాల్ని ఏ ఉద్యమం చెయ్యనంత మార్పుకు గురిచేసింది.

రాష్ట్రాలు విడిపోయాక రాష్ట్రాల అభివృద్ధికి విద్యారంగం మూలం. దీన్ని గత పదేళ్లుగా తెలంగాణ ప్రాంతంలో కుప్పకూల్చారు. రాష్ట్ర సాధన రాజకీయరంగానికి వదిలివేయకుండా విద్యారంగం బాధ్యతగా చిత్రీకరించారు. అందువల్లే విద్యార్థులు, ఉపాధ్యాయులు రోజూ రోడ్ల మీద ఉన్నారు. దీనివల్ల రేపు అధికారంలో ఉండే ఫ్యూఢల్ శక్తులకు పెద్దగా నష్టం ఉండదు. కానీ తెలంగాణ ప్రాంతపు దళిత బహుజన వర్గాల్లో ఒక బలమైన బ్యూరాక్రటిక్ క్లాస్ రూపొందదు. జీతం తీసుకునే ఉద్యోగులు మాత్రమే కాదు, ప్రతినిత్యం పనితనాన్ని, జ్ఞానాన్ని పెంచుకుంటూ వ్యవస్థ సమర్థతను పెంచే ఉద్యోగ వ్యవస్థ ఏర్పడాలి. దానికి బ్యూరాక్రటిక్ డిసిప్లిన్ చాలా అవసరం. అది అభివృద్ధి కావాలంటే పాలక వర్గం దూరదృష్టికలదిగా తయారవ్వాలి.
గత అరవై ఏళ్ల నుంచి తెలంగాణ ఫ్యూఢల్ వ్యవస్థ ఎందుకు బలహీన పడలేదు? పెట్టుబడిదారీ వర్గం ఎందుకు ఏర్పడలేదు? మున్ము ందు ఏర్పడ్డా దాని కుల వర్గ స్వభావం ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలు కీలకమైనవి. ఇంతకాలం ప్రతి దానికి ఆంధ్రులను తిట్టిన శక్తులకు ఇక్కడ అభివృద్ధి కాముక మేధావివర్గాన్ని డెవలప్‌చేసే వ్యవస్థలు రూపొందకపోతే తెలంగాణ ఇంకా వెనక్కిపోతుంది అని తెలుసు.
ఇక్కడి అగ్రకుల రాజకీయ శక్తులు తెలుగుదేశం అధికారంలో ఉన్న కాలాన్నంతా తీవ్రంగా ద్వేషించుకున్నాయి. ఆ కాలంలో కింది కుల ప్రాతినిధ్యం కాస్తా పెరిగింది. ఇప్పుడంతే కసితో ఎస్.సి., ఎస్.టి.లను ముఖ్యంగా బీసీలను అణగదొక్కాలనే శక్తులు తెలంగాణ ఉద్యమకాలమంతా బలపడ్డాయి. అగ్రకుల ఆధిపత్యాన్ని అడ్డుకోగలిగే కింది కులరాజకీయ శక్తులు ఎదుగలేదు. మీడియా కూడా వాటిని ఎదగనివ్వకుండా జాగ్రత్తపడుతున్నది. మీడియా తల్చుకుంటే నాయకుల్ని ఎలా తయారు చెయ్యగలదో కేజ్రీవాల్ ఎదుగుదల మంచి ఉదాహరణ.

అగ్రకుల నాయకత్వం వైరుద్ధ్యాల్లో ఉన్నప్పుడు దళిత బహుజన నాయకత్వం ఎదగడం కొంత సులభం. ఆ స్థితి కోస్తాంధ్రలో కాంగ్రెస్ పార్టీ చుట్టూ కొంత కనబడుతంది. అక్కడి ప్రాంతీయ పార్టీలు ముగ్గురు అగ్రకుల నాయకుల చేతుల్లో ఉండడంతో కాంగ్రెసు కిందికులాల మీద ఆధారపడక తప్పదు. కానీ తెలంగాణలో పరిస్థితి అది కాదు. టీడీపీ కూడా ఒక బీసీనో, ఎస్.సి.నో బలమైన నాయకుడుగా ఎదుగనిచ్చే పరిస్థితి కనబడటం లేదు. ముందు ముందు వాళ్ల అవసరాలరీత్యా సీమాంధ్ర ప్రాంత నాయకులు కూడా, తెలంగాణ అగ్ర కులాలతో గూడుపుఠాణీ చేసే అవకాశమే ఎక్కువ ఉన్నది.
టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో చేరకుండా ఉంటే రాష్ట్రం సాధించిన ప్రతిష్ఠను ఒక్క అగ్రకులం మూటకట్టుకొని మిగతా రెండు అగ్రకులాలను (రెడ్డి, బ్రాహ్మణ) తాబేదార్ల ద్వారా బుజ్జగించి కింది కులాలను తొక్కేసి ఆ ప్రక్రియకు పునర్‌నిర్మాణం అని పేరు పెట్టే అవకాశం లేకపోలేదు. అది కాంగ్రెస్‌లో విలీనమైతే పరిస్థితి కొంత వేరుగా ఉంటుంది.
రాష్ట్రం ఏర్పడ్డాకే సామాజిక న్యాయం గురించి మాట్లాడాలి అన్న మేధావులు కొత్త రాష్ట్రంలో కుటుంబ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశం లేకపోలేదు. దిక్కులేని శక్తులు కమ్యూనిస్టుల మీదనో, విప్లవకారుల మీదనో ఆధారపడే అవకాశం లేదు. ఆ శక్తులన్నీ 'జై తెలంగాణ' జెండాలు మోసి కనిపించకుండా పోయాయి. కొద్దో, గొప్పో ఉన్నవి అగ్రకులాల అనుబంధంతో ఉన్నాయి.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిననాడు కూడా గాంధీ, అంబేద్కర్, నెహ్రూ ఎవరూ గుర్రాలు, ఒంటెల్ని ఎక్కి ఊరేగి సంబురాలు జరుపలేదు. కానీ ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో ఫ్యూఢలిజం ఎంత పూనకంతో ఎగిరిందో మనమంతా చూశాం. ప్రజలు కోరుకునే నాయకులెవరూ ఇటువంటి సంబురాలు చెయ్యరు. కనుకనే తెలంగాణ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. సీమాంధ్ర ప్రజల్లో ముఖ్యంగా శ్రమ జీవుల్లో, బరువు బాధ ఉంటే, రెండు రాష్ట్రాల్లోని వారంతా కలిసి కష్టాలు పంచుకుందామని చెప్పాల్పిన అవసరం ఎంతైనా ఉన్నది.
- కంచ ఐలయ్య
సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త

Andhra Jyothi Telugu News Paper Dated: 01/03/2014 

No comments:

Post a Comment