Monday, June 30, 2014

ఉపాధి హామీ : విమర్శలు, వాస్తవాలు - రవికుమార్



వ్యవసాయంలో ఉన్న సంక్షోభానికి ఉపాధి హామీ కారణం కాదు. ఆ సంక్షోభ పరిష్కారం భారం మొత్తం ఉపాధి హామీ పథకం మీద వేయడం సరికాదు. వ్యవసాయాన్ని లాభసాటిగా ఒక మెరుగైన జీవనోపాధిగా చేయడానికి ఉపాధి హామీ నిధులను, పథకాన్ని తప్పనిసరిగా గరిష్ఠంగా ఉపయోగించుకోవచ్చు. ఎవరి వ్యవసాయం, ఏ రైతులు, ఏ విధమైన అనుసంధానం అన్న ప్రశ్నల మీద స్పష్టత ఉండాలి.
గ్రామీణ ప్రాంతాల్లో శారీరక శ్రమతో కూడిన పని చేయడానికి ముందుకొచ్చే ఏ వ్యక్తికైనా, వారి కుటుంబం మొత్తానికి కలిపి ఏడాదిలో 100 రోజుల వరకు పని పొందడానికి, పనికి తగ్గ వేతనం పొందడానికి 2005 నుంచి అమలులోకి వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం హక్కు కల్పించింది. ఈ చట్టం ద్వారా కనీస వేతనాలు, మహిళలకు సమాన వేతనాలు, వ్యవసాయ పనుల్లేని కాలంలో ఉపాధి అవకాశాలు కల్పించడంతో శ్రామికులకు అదనపు ఆదాయం ఉపాధిపై భరోసా కలిగింది. భూములుండి శ్రమ చేసేవారికి భూమి అభివృద్ధికి మొక్కల పెంపకానికి ఒక అదనపు పెట్టుబడి సమకూరింది. తద్వారా భూములు సాగులోకొచ్చి వ్యవసాయం చేసుకోవడం ద్వారా ఇంతకు ముందు కూలీలుగా ఉన్నవారు రైతులుగా ఎదిగే అవకాశం కలిగింది. మొత్తంగా శ్రమచేసే వారి బేరమాడే శక్తి పెరిగి ఆ ప్రభావం వ్యవసాయం, ఇతర ఉపాధి రంగాల్లోని వేతనాల రేట్లపై పడి వారికి మరింత లబ్ధి చేకూరింది.
ఈ చట్టం అమలుద్వారా గ్రామీణ జనాభాలో ఎక్కువ శాతం ఉన్న శ్రమ మీద ఆధారపడే కుటుంబాలలో సగానికి పైగా కుటుంబాలు (ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కలిపి 60-70 లక్షలు) ప్రయోజనం పొందగా ఈ చట్టం వల్ల కొన్ని వర్గాలకు నష్టం జరిగిందనే విమర్శ కూడా ఉంది. అందులో ముఖ్యంగా రైతులుగా పిలవబడేవారు, వారికి ప్రాతినిధ్యం వహించే సంఘాలు, ఉపాధి హామీ పథకం వల్ల వ్యవసాయానికి కూలీలు దొరకడం లేదని, ఒకవేళ లభ్యమైనా కూలీరేట్లు విపరీతంగా పెరిగిపోయాయని, దాని ఫలితంగా వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని, మొత్తంగా ఈ పథకం వల్ల వ్యవసాయరంగం నష్టపోతుందనే వాదనను ముందుకు తెచ్చారు. అంతేకాకుండా పథకం అమలులో అవినీతి చోటుచేసుకుంటుందని, పథకంలో చేపట్టిన పనులలో నాణ్యత లోపించి ఎవరికీ పనికిరానివిగా ఉన్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. సమాజంలో ఈ వర్గాల ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రసార మాధ్యమాలు, మధ్యతరగతి ప్రజలు, ఎక్కువ శాతం ప్రజాప్రతినిధులు అవే వాదనలను బలపరుస్తున్నారు.

(అ) విమర్శ/అపోహ: ఈ పథకం వల్ల 'రైతులకు', వ్యవసాయానికి నష్టం జరుగుతుంది. వాస్తవం/ భిన్న కోణం: ఈ విమర్శలో ఏ రైతులు, ఎవరి వ్యవసాయం అనే స్పష్టత లేదు. ఈ పదాలు వాడటం ద్వారా అన్ని ప్రాం తాల్లోని మొత్తం రైతులు, వ్యవసాయం నష్టపోతున్న భావన కల్పిస్తున్నారు. ముందుగా అర్థం చేసుకోవలసింది రైతులందరూ ఒక్క తీరుగా లేరనే విషయం. పెద్ద రైతులు, చిన్న, సన్నకారు, మధ్యతరగతి రైతులు, కుటుంబసభ్యులు స్వయంగా కష్టపడి పనిచేసే రైతులు, పూర్తిగా కూలీల మీద ఆధారపడే రైతులు, మహిళా రైతులు, ఇలా రకరకాలుగా ఉన్నారు. అలాగే వ్యవసాయం కూడా మెట్ట, పల్లం, వర్షాధారం, కాల్వల ద్వారా, బోర్లద్వారా సాగునీరు అందే వ్యవసాయం, తిండి పంటలు అందులో మళ్లీ ఎన్నోరకాలు, పత్తి లాంటి పంటలు, పండ్ల తోటలు పెంపకం, వివిధ వాతావరణ పరిస్థితులు, భూమి స్వభావం ఇలా వ్యవసాయం పలురకాలుగా ఉంది. అన్నింటినీ అందరినీ ఒకేగాటన కట్టి వ్యవసాయానికి నష్టం అనటం అవగాహనరాహిత్యం లేదా బుద్ధిపూర్వకంగా చేసే తప్పుడుప్రచారం అవుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సంఖ్యాపరంగా, పనిరోజుల పరంగానూ ఉపాధి పథకాల్లో పాల్గొన్న వారి వివరాలు చూస్తే భూమిలేని కూలీలకన్నా భూమి ఉండి శ్రమ చేసే వ్యక్తులే ఎక్కువ పాల్గొన్నట్లు స్పష్టమవుతుంది. రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో అధ్యయనం చేసిన దాదాపు 160 గ్రామాల్లోని వివరాల ద్వారా ఈ విషయం స్పష్టమయింది. ఏ జిల్లాలో అయితే భూమిలేని వ్యవసాయకూలీలు అధికంగా ఉన్నారో ఆ జిల్లాలో ఉపాధి హమీ పథకంలో తక్కువ మంది పాల్గొన్నారు. ఏ జిల్లాలో అయితే ఎక్కువ మందికి భూమి ఉండి భూమి లేని వ్యవసాయ కూలీల సంఖ్య కొంచెం తక్కువుందో ఆ జిల్లాలో ఉపాధిహామీలో ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.
(ఆ) విమర్శ/ అపోహ : ఈ పథకం వల్ల వ్యవసాయానికి కూలీలు దొరకటం లేదు, వ్యవసాయ పనులున్నప్పుడు ఉపాధి పనులు పెడుతున్నారు. వాస్తవం/ మరో కోణం : సన్న, చిన్న కారు రైతులు ఉపాధి హమీలో ఎక్కువగా పాల్గొంటున్నప్పుడు వారు తమ వ్యవసాయ పనులు చేసుకుని, అనువైన, మిగిలిన రోజుల్లోనే ఉపాధిలో పాల్గొంటున్నారు. అంటే ఉపాధిహామీ వారి వ్యవసాయానికి ఏమాత్రం అడ్డంకిగా లేక మరింత తోడ్పడినప్పుడు, వ్యవసాయం వల్ల ఉపాధి హామీ పనులకు కూలీలు దొరకటం లేదనడం, వ్యవసాయం జరుగుతున్నప్పుడు ఉపాధిహామీ పథకం అమలు చేస్తున్నారనడం వాస్తవం కాదు. క్షేత్రస్థాయి అధ్యయనాల్లో తేలిందేమిటంటే 70 శాతం ఉపాధి పనిరోజులు వ్యవసాయ పనులు లేనప్పుడే జరుగుతున్నాయి. అందులోనూ ఉపాధి హామీలో సగటు 55 రోజుల నుంచి ఏ సంవత్సరం కూడా పని కల్పించలేదు. సంవత్సరానికి వందరోజులు పనిచేసిన వారి సంఖ్య 10-15 శాతం మాత్రమే. వందరోజులు పని సాధించినా కూడా భూమిలేని వ్యవసాయ కూలీలకు తమ జీవనోసాధి సాగించాలంటే మరో 200 రోజులకు పైగా పని అవసరం ఉంటుంది. అయితే ఉపాధి హమీ పథకం వచ్చిన తరువాత సన్న, చిన్నకారు కమతాలు ఉన్న కుటుంబాలు తమ స్వంత వ్యవసాయం మెరుగుపరచుకుని ఇతరుల భూముల్లో కూలీకి వెళ్లటం తగ్గించుకున్నారు.
(ఇ) విమర్శ/ అపోహ : ఈ పథకం వల్ల వ్యవసాయంలో కూలీరేట్లు పెరిగాయి. కూలీలు శ్రమ చేయకుండా పనిచౌర్యానికి పాల్పడుతున్నారు. తేలికగా డబ్బులు పొందుతున్నారు. సోమరుల్లా తయారవుతున్నారు. వాస్తవం/మరోకోణం: ఉపాధి హామీ చట్టం అమల్లోకి రాకముందు దశాబ్దాల పాటు వ్యవసాయ కూలీలకు కనీస వేతనాలు చెల్లించకుండా రైతులు/భూ యజమానులు పనులు చేయించుకుని వారి శ్రమను దోపిడీ చేశారు. ఇప్పుడు ఈ చట్టం సహాయంతో వారు కనీస వేతనాలను సాధించుకున్నారు. అయితే కనీస వేతనాలకు అదనంగా రేట్లు పెరగడం అనేది కేవలం ఉపాధి హామీ చట్టం వల్ల కాదు. శ్రమ చేసే వ్యక్తులకు వివిధ రంగాలలో అవకాశాలు పెరగటం వల్ల, విద్యావకాశాలు పెరిగి కొత్త తరం వ్యవసాయ కూలీలుగా పనిచేయడానికి ఇష్టపడక, భూ యజమానులు/రైతుల కుటంబాలలో కూడా వ్యవసాయంలో పాల్గొనే సభ్యులు తగ్గడం వల్ల శ్రమచేసే వారికి డిమాండు పెరిగి రేట్లు పెరిగాయి. ఒకే ప్రాంతంలో ఒకే రకమైన పంటలు వేయడం వల్ల ఒకేసారి అందరికీ కూలీల అవసరం ఉండటంతో 'రైతుల' మధ్య పోటీ కూడా కూలీ రేట్లు పెరగడానికి దోహదం చేసింది. ఇంతా చేసి కూలీలకిచ్చే రేట్లు వారి కనీస అవసరాలు తీర్చుకోవడానికే సరిపోతున్నాయి కానీ ఆస్తులు కూడబెట్టేంత ఏమీకాదు.
(ఈ) విమర్శ/అపోహ : ఈ పథకంలో చేపట్టిన పనులు నాణ్యతగా లేవు. వ్యవసాయానికి ఉపయోగపడేవి కావు. వాస్తవం/ మరోకోణం : ఉపాధి హామీ పథకంలో ఎక్కువగా చేపట్టిన పనులు ఉమ్మడి వనరుల (ముఖ్యంగా నీటివనరుల) అభివృద్ధి, దళిత, ఆదివాసీ, ఇతర సన్న, చిన్నకారు రైతుల వ్యక్తిగత / అసైన్డ్ భూముల అభివృద్ధి, పండ్లతోటల పెంపకం, పథకంలో లోపాలు, నాణ్యత విషయంలో మెరుగుపరచుకోవాల్సిన అంశాలు ఉన్నప్పటికీ ఈ పనులు పూర్తిగా రావనడం, నిధులు వృథా అవడం సరికాదు. ఏ విధంగా అయితే ఈ వర్గాలను వ్యవసాయదారులుగా గుర్తించడానికి ఆధిపత్య సమాజం నిరాకరిస్తుందో అదేవిధంగా వారి భూముల్లో లేదా వారికి ఉపయోగపడే పనులను కూడా పనికిరానివిగానే చూస్తుంది.

సాధారణంగా ప్రభుత్వ పథకాల అమలులో ఉండే లోపాలు ఈ పథకం అమలులోనూ ఉన్నాయి. అయితే ఆ లోపాలను భూతద్దంలో చూపిస్తూ మొత్తం పథకాన్నే పనికిరానిదిగా, వృధా ఖర్చుగా పేర్కొంటూ ఈ పథకాన్ని నిలిపివేయాలనే వాదన సరైందికాదు. అమలు ప్రక్రియలను మరింత పటిష్ఠం చేయడం ద్వారా వాటన్నింటినీ చేయవచ్చు. అమలులో లోపాల కారణంగా పథకాలను, పట్టాలను రద్దు చేసుకుంటూ పోతే రాజ్యాంగాన్ని కూడా రద్దుచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో అతి తక్కువగా అమలుకు నోచుకున్న చట్టం అదే.
వ్యవసాయంలో ఉన్న సంక్షోభానికి ఉపాధి హామీ కారణం కాదు. ఆ సంక్షోభ పరిష్కారం భారం మొత్తం ఉపాధి హామీ పథకం మీద వేయడం కూడా సరికాదు. వ్యవసాయాన్ని లాభసాటిగా ఒక మెరుగైన జీవనోపాధిగా చేయడానికి ఉపాధి హామీ నిధులను, పథకాన్ని తప్పనిసరిగా గరిష్ఠంగా ఉపయోగించుకోవచ్చు. అయితే ఎవరి వ్యవసాయం, ఏ రైతులు, ఏ విధమైన అనుసంధానం అన్న ప్రశ్నల మీద స్పష్టత ఉండాలి. ప్రస్తుతం కొన్ని వర్గాలు సూచిస్తున్నట్లుగా వ్యవసాయంతో ఉపాధి పథకాన్ని అనుసంధానిస్తే అంటే సాధారణ వ్యవసాయ పనులకు ఉపాధి నిధులను ఖర్చుచేస్తే, ప్రభుత్వ ఖర్చుతో కొన్ని వర్గాలను బలవంతంగా ఇతర వర్గాల భూముల్లో కూలీ చేయించినట్లే. వారికి వచ్చే అదనపు ఆదాయాన్ని తగ్గించడంలో పాటు, వారి గౌరవాన్ని, కూలీ బతుకుల నుంచి బయటపడదామన్న ఆకాంక్షలను చిదిమేసినట్లే. ఎంతసేపూ కూలీలుగా మారి చక్కగా పనిచేసి ఎందుకు చూపించరో?

వ్యవసాయం సంక్షోభంలో ఉంది. వ్యవసాయం చేసే వారికి తగిన ఆదాయం, భద్రత లేదు అనే విషయాలలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే ఈ సమస్యలకు పరిష్కారం ఉపాధి హామీ పథకం లేదా చట్టంలో లేదు. వ్యవసాయం చేయని వర్గాల చేతుల్లో భూములు ఉండటం, వ్యవసాయ కుటుంబాలలో శ్రమ చేయతగిన వ్యక్తులు తగిన సంఖ్యలో లేకపోవడం, మన పరిస్థితులకు తగిన చిన్న తరహా యాంత్రీకరణ లేకపోవడం, రైతులు విత్తనం నుంచి మందుల దాకా అన్ని అంగడిలలో అధిక ధరలకు కొనుక్కోవలసి రావడం, గ్రామ, మండలస్థాయి పరపతి సంఘాలు నిజమైన సాగుదార్ల ప్రయోజనాలు కాపాడలేకపోవడం ఇత్యాది సమస్యల వల్లే వ్యవసాయం సంక్షోభంలో ఉంది. మరి ముందు ఈ సమస్యలన్నీ పరిష్కరించాక మొత్తం వ్యవస్థలో అట్టడుగున ఉన్న కూలీల దగ్గరకు వస్తే బాగుంటుంది. పై చర్యలన్నీ చేబడితే రైతులు శ్రమచేసే కార్మికులకు తగిన వేతనాలు చెల్లించే స్థితిలో ఉంటారు. అలాగే శ్రమ చేసే వారి చేతుల్లోనే ఎక్కువ భూమి ఉంటే ఈ కూలీల కొరత సమస్య కూడా తప్పుతుంది. ఉపాధి హామీ పథకంను సమీక్షించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని ప్రభుత్వాలు మెరుగుపరచాల్సిన కొన్ని అంశాలు : యూపీఏ ప్రభుత్వం ఐదు సంవత్సరాల అమలును సమీక్షించి కొత్త మార్గదర్శకాలను 2012లో విడుదల చేసింది. వాటికనుగుణంగా పథకం అమలు ఏమేరకు మెరుగుపడిందో సమీక్షించి పథకం పారదర్శకంగా, అవినీతి రహితంగా అమలు జరిగేట్లు చర్యలు తీసుకోవాలి; ఇప్పటి వరకు నమోదైన కార్మికులలో సగం మంది, సగటున కేవలం సగంరోజులు(50) మాత్రమే ఉపాధి పొందారు. నిజంగా అవసరమైన వారందరూ ఈ పథకాన్ని తగినంత మేర అందుకోగలుగుతున్నారా? లేకపోతే కారణాలేమిటి? పని అవసరం ఉన్నవారందరూ ఈ చట్టంలో భాగంగా తగినంతగా ఉపాధి పొందడానికి ఏమి మార్పులు తీసుకురావాలో ఆలోచించాలి; ఉపాధి చట్టంలో ఇప్పటికీ పూర్తిగా సాధించలేని అడిగిన 15రోజులలో పని కల్పన, పనిచేసిన 15రోజులలో వేతనాల చెల్లింపును సాధ్యంచేసే విధంగా చట్టం అమలులో మార్పులు తీసుకురావాలి; ఉపాధి హామీలో వివిధవర్గాలు (ఆదివాసీలు, పూర్తిగా భూమిలేని వారు, సన్నకారు రైతులు, మహిళలు..) ఎంతవరకు తమ హక్కులను సాధించుకున్నారు, అందులో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అడ్డంకులు, వారి అవసరాలను గుర్తించి అందుకు తగినట్లుగా వర్గాలవారీగా ఉపాధి హామీ అమలు వ్యూహాలను, కార్యాచరణను తయారుచేసి అమలు చేయాలి.
-రవికుమార్

Andhra Jyothi Telugu News Paper Dated: July .1. 2014 

No comments:

Post a Comment