Monday, June 30, 2014

అభివృద్ధి పేరిట గ్రామీణ ఉపాధికి ఎస‌రు


పేదలకిచ్చే రాయితీల మీద అభివృద్ధి నిరోధక ప్రచారకులు దాడి చేయడం ప్రారంభించారు. ఇలాంటి పరిస్థితుల్లో దళితులకు, కూలీలకు రాయితీలివ్వడం వల్లే రైతుల అభివృద్ధి ఆగిపోయిందని నమ్మించగల్గుతున్నారు. సామాజిక సమానత్వం కోసం చేసే రిజర్వేషన్లు లాంటి వాటికే పరిమితం కాకుండా, వాలంటైన్స్‌ డే జరుపుకోవడం దగ్గర నుంచి పేదలకిచ్చే రాయితీల వరకు అన్నింటికీ వ్యతిరేకంగా అగ్రవర్ణాల యువకుల్లోనే గాదు - మధ్యతరగతి కులాల యువకుల్లో కూడా ద్వేషాన్ని బిజెపి నూరిపోసింది. ఇప్పటికే అగ్రవర్ణాలు, మధ్యతరగతి కులాలు ఒకవైపు - దళితులు, పేదలు మరోవైపు చేరేలా బిజెపి అగాధాన్ని ఏర్పరచింది. మధ్య తరగతిని బలపరచి వీరి మధ్య విభజన మరింత బలపడడానికి వీలుగా ప్రయత్నిస్తున్నది. అగ్ర వర్ణాలు, మధ్యతరగతి కులాలు తన వెంట గట్టిపడాలంటే - దళితులకు వ్యతిరేకంగా వీళ్ళను రెచ్చగొట్టాలి.
                             అభివృద్ధి పేరిట పేదల సంక్షేమానికి వ్యతిరేకంగా మధ్య తరగతిని రెచ్చగొట్టి లబ్ధిపొందే ప్రయత్నం బిజెపి ఈ ఎన్నికల్లో చేసింది. అభివృద్ధి అనే తమ నినాదానికి మధ్యతరగతేగాదు పేదలు కూడా ఆకర్షితులయ్యారని బిజెపి వాదిస్తోంది. ఏదో చిన్నచిన్న వాటితో పేదలు సంతృప్తి పడకుండా ఇంకా కొన్ని కావాలని కోరుకోవడం మంచిదే. కానీ పేదలు - అందునా దళితులు బిజెపి వైపు ఈ ఎన్నికల్లో మొగ్గారనడంలో అసలు వాస్తవం లేదు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఓట్ల వివరాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. మాయావతి వెనకున్న అగ్రవర్ణాలు ఈ ఎన్నికల్లో ఆమెను వదిలేశాయి. ఆ కొరతను పూరించడానికి ముస్లింల నుంచి తగినంత మద్దతు రాలేదు. అందువల్లే బిఎస్‌పికి సీట్లు రాలేదు. కానీ బిఎస్‌పికి ఉత్తరప్రదేశ్‌లో 20 శాతం ఓట్లు వచ్చాయి. మాయావతికి 20 శాతం ఓట్లు వచ్చాయంటే అవి దళితుల ఓట్లేనన్నది వాస్తవం. దేశం మొత్తంలోనూ, ఉత్తర భారతదేశంలోనూ - అగ్రవర్ణాలు ప్రధానంగా, మధ్యతరగతి (కులాలు) బిజెపికి ఓటు వేశాయి. బిజెపి అభివృద్ధి నినాదం వైపు ఆకర్షితులైన ఈ తరగతులు తమ అభివృద్ధికి దళితులు, వ్యవసాయ కూలీలు ఆటంకంగా ఉన్నారని ఎన్నికల్లో ప్రచారం చేశాయి. ఉపాధి హామీ పథకం వల్ల కూలీలు పనికి రావడం లేదని, దీని వల్లే వ్యవసాయం పూర్తిగా దెబ్బతిని పోతోందని ప్రచారం చేశాయి. బిజెపి అభివృద్ధి నినాదం పట్టణ-మధ్యతరగతిని, గ్రామీణ ప్రాంతాల్లో మధ్యతరగతి కులాలను బాగా ఆకర్షించింది. ఈ ఎన్నికల్లో పేదలు బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో మతోన్మాద ప్రచారాన్ని బిజెపి వినియోగించినా, అభివృద్ధి నినాదం పట్టణ మధ్యతరగతిని, గ్రామీణ ప్రాంతాల్లోని ఉన్నతవర్గాలను బాగా ఆకర్షించింది. ఈ పునాది మీదే ఆధారపడి బిజెపి ఎన్నికల ప్రచారం సాగింది. అందువల్ల పేదలకు వ్యతిరేకంగా బిజెపి మధ్య తరగతి వర్గాలను బాగా నిలబెట్టింది.
అభివృద్ధి కలను మీడియా నమ్మేట్లు చేసింది
                             గ్లోబలైజేషన్‌లో ప్రపంచీకరణను అంగీకరించే ప్రతి పార్టీ దాని ఎజెండాకు లోబడి పని చేయాల్సిందే. దేశంలో ఏ పార్టీ అయినా పెట్టుబడి రాకపోకలను ఆటంకపర్చరాదు. ఒకవేళ ఆటంకపరిస్తే ద్రవ్య పెట్టుబడి ఆ దేశాన్ని సంక్షోభంలోకి నెట్టి పారిపోతుంది. ఇక్కడ ఉన్న బిజెపి కార్పొరేట్‌ పెట్టుబడితో లింకయి ఉన్నది. ప్రపంచీకరణతో తెగతెంపులు చేసుకోలేదు. కాబట్టి బిజెపి ద్రవ్య పెట్టుబడి ఎజెండాను తప్పక అమలు చేయాల్సి ఉంది. ఈ పని కాంగ్రెస్‌ కంటే బిజెపియే బలంగా చేయగలదని కార్పొరేట్లు నమ్మాయి. అందరికీ అన్నీ ఇచ్చా అనే 'గుజరాత్‌ నమూనా అభివృద్ది' ఒక భ్రమే అయినా దాన్నెక్కువగా కార్పొరేట్లు ముందుకు తెచ్చాయి. గుజరాత్‌ నమూనా అభివృద్ధిలో మానవాభివృద్ధి సూచిక చాలా తక్కువ స్థాయిలో ఉన్నది. ప్రత్యేకంగా అభివృద్ధి రేటు కూడా పెద్దగా ఎక్కువగా లేదు. గుజరాత్‌ కంటే బీహార్‌, తమిళనాడు వృద్ధి రేటులో ముందున్నాయి. గుజరాత్‌ అభివృద్ధి రేటు కేరళకు సమానంగా ఉంటే, కేరళ మానవాభివృద్ధి సూచిక దేశంలోనే ముందు ఉన్నది. ఈ వాస్తవాలను మరుగుపర్చి గుజరాత్‌ నమూనా అభివృద్ధి అన్న నినాదాన్ని కార్పొరేట్లు ముందుకు తెచ్చారు. గుజరాత్‌ నమూనాను ఆకాశానికెత్తడం మీడియా చేసిన పని. దీన్ని అంగీకరించడానికి కూడా చాలా మంది సిద్ధంగానే ఉన్నారు. ఎందుకంటే వామ పక్షాలు తప్ప అన్ని పార్టీల ఆర్థిక విధానాలు కూడా అవే కాబట్టి. ధరల పెరుగుదల, నిరు ద్యోగం, అవినీతి లాంటి వైఫ ల్యాలకు కారణం కాంగ్రెస్‌ చేతగానితనంగా ప్రచారం చేశారు. అంతేగాని విధా నాల్లోనే లోపం ఉందని చెప్పడానికి చాలా మంది ధైర్యం చేయలేదు. సమర్థవంతమైన పాలన ఎవరు ఇవ్వగలరో, ఎవరైతే ధైర్యంగా నిర్ణయాలు చేయగలరో అలాంటి వారు కావాలనుకున్నారు. మోడీయే అందుకు తగిన వాడని మీడియా చేసిన ప్రచారం మందికెక్కింది. ఎవరైనా గుజరాత్‌ నమూనా వట్టి బూటకమని చెప్పినా నమ్మే స్థితి లేదు. కారణం మీడియా చేసిన మితిమీరిన ప్రచారమే. కానీ ఇది ఎప్పటికీ నిలిచేదిగాదు. కారణం ఇది వాస్తవం కాదు, కల మాత్రమే. అయితే మోడీ చేయబోయేది పేదలకు ఇచ్చే రాయితీలను కుదించి కార్పొరేట్లకు దోచిపెట్టడమే. పేదలకు ఇచ్చే రాయితీలే నేటి వైఫల్యాలకు కారణమని కార్పొరేట్లు ఇంత కాలం ప్రచారం చేస్తూ వచ్చారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించే గ్రామీణ ఉపాధి హామీ పథకమే వ్యవసాయ అభివృద్ధికి ఆటంకమని భూస్వాములు, ధనిక రైతులు ప్రచారం చేస్తూ వచ్చారు. ఇప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అవినీతి ముద్ర వేసి మధ్య తరగతి మద్దతుతో గెలిచిన బిజెపి దాన్ని నీరు గార్చే ప్రయత్నం చేపట్టింది.
మీడియా
                             హిందూత్వ శక్తులు అధికారానికి రావడానికి మీడియా పాత్ర కూడా తక్కువేంకాదు. ప్రజల్లో ప్రభావం కల్గించడానికి మీడియా (ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్‌ మీడియా) పాత్ర ఈ ఎన్నికల ఫలితాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. భారతదేశం సాధించిన ప్రగతిని ప్రసార రంగంలో చూడవచ్చు. అంతేగాదు మీడియా మన ఆధునికత యొక్క లక్షణమేగాదు, ఫలితం కూడా. ఇప్పుడు అదే ఆధునికత మన దేశంలో సాధించిన ఆధునిక ప్రగతిని వెనక్కు తిప్పడానికి వినియోగిం చబడుతోంది.
పేదల మీద దాడి
                             అన్నా హజారే అందుకున్న అవినీతి వ్యతిరేక పోరాటం ఇప్పుడు పేదలకు వ్యతిరేకంగా తిరిగింది. పేదలకిచ్చే రాయితీల మీద అభివృద్ధి నిరోధక ప్రచారకులు దాడి చేయడం ప్రారంభించారు. ఇలాంటి పరిస్థితుల్లో దళితులకు, కూలీలకు రాయితీలివ్వడం వల్లే రైతుల అభివృద్ధి ఆగిపోయిందని నమ్మించగల్గు తున్నారు. సామాజిక సమానత్వం కోసం చేసే రిజర్వేషన్లు లాంటి వాటికే పరిమితం కాకుండా, వాలం టైన్స్‌ డే జరుపుకోవడం దగ్గర నుంచి పేదలకిచ్చే రాయితీల వరకు అన్నింటికీ వ్యతిరేకంగా అగ్రవర్ణాల యువకుల్లోనే గాదు - మధ్యతరగతి కులాల యువకుల్లో కూడా ద్వేషాన్ని బిజెపి నూరిపోసింది. ఇప్పటికే అగ్రవర్ణాలు, మధ్యతరగతి కులాలు ఒకవైపు - దళితులు, పేదలు మరోవైపు చేరేలా బిజెపి అగాధాన్ని ఏర్పరచింది. మధ్య తరగతిని బలపరచి వీరి మధ్య విభజన మరింత బలపడడానికి వీలుగా ప్రయత్నిస్తున్నది. అగ్ర వర్ణాలు, మధ్యతరగతి కులాలు తన వెంట గట్టిపడాలంటే - దళితులకు వ్యతిరేకంగా వీళ్ళను రెచ్చగొట్టాలి. అందుకోసమే ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చి, అగ్రవర్ణాలను-మధ్యతరగతి కులాలను సంతృప్తి పరిచే కార్యక్రమం మొదలయింది. ఇది మతోన్మాదాన్ని పెంచడంతోనే ఆగిపోదు. ఈ దేశంలో గత వందేళ్ళుగా సాధించిన సామాజిక విప్లవాన్ని వెనక్కుగొట్టే ప్రయత్నానికి దారితీస్తోంది. వలసాధిపత్యానికి వ్యతిరేకంగా సాగిన పోరాటం ద్వారాను, జ్యోతిరావ్‌ఫూలె, ఇవి రామస్వామి నాయకర్‌, అంబేద్కర్‌ లాంటి వారు సాధించిన సామాజిక ఫలితాలను వెనక్కుగొట్టే ప్రయత్నం ఇందులో ఇమిడి ఉన్నది. విప్లవ ప్రతీఘాతక ప్రయత్నాలకు అవకాశం ఉంది. సామాజిక అణచివేత, దళితులను తక్కువ చేసి చూసే నీతిభాహ్యమైన చర్యలు మళ్లీ తీవ్రమయ్యే ప్రమాదం కూడా ఉంది. హిందూ సమాజంలో ప్రధానమైంది కులం. అసమానతలతో కూడిన కులదొంతరలను కూడా ఇది ప్రోత్సహిస్తోంది. కాబట్టి ఇది సామాజిక ప్రతీఘాతక విప్లవ ప్రయత్నంగా భావించవచ్చు.
హక్కుల ఆధారిత విధానం
                             ఎన్నికల్లో పరాజయం పాలవడానికి కాంగ్రెస్‌ చేసే విశ్లేషణలు, వ్యాఖ్యానాలు బిజెపి అభివృద్ధి నిరోధకత్వంతో పోటీ పడేవిగా ఉన్నాయి. ఉదాహరణకు 'హక్కులు ఆధారంగా కాంగ్రెస్‌ తీసుకున్న చర్యలే' మన పరాజయానికి కారణమని కమలనాథన్‌ ప్రకటించారు. ఉపాధి హామీ పథకం, ఆహారభద్రత లాంటి వాటి వల్ల పరాజయం కల్గిందన్నారు. 'కాంగ్రెస్‌ ఈజ్‌ మోడిఫైడ్‌' అన్నారు కొందరు. ఉపాధి పొందడం ఒక హక్కు, ఆహార భద్రత పొందడం ఒక హక్కు. వీటిని హక్కుగా గుర్తించినప్పుడు - దానికి షరతులు విధించరాదు. 'హక్కుల ఆధారంగా విధానం' అంటే హక్కులకు పరిమితులు విధించడం గాదు. ముందు వాటిని సంస్థాగతం చేయాలి. టార్గెటెడ్‌గాకుండా అంటే ఎంపిక చేసిన వారికి పరిమితం కాకుండా సార్వజనీన (యూనివర్సల్‌) ఆహార భద్రత కావాలి. ఉపాధి హామీ పథకం కూడా 100 రోజుల పనికి పరిమితం కాకుండా - పని కోరేవారందరికీ అవకాశం కల్పించేదిగా ఉండాలి. పరిమితుల విధింపు వల్ల ప్రయోజనం పొందేవారికి వ్యతిరేకంగా పొందనివారిని రెచ్చగొట్టేదానికి అవకాశం ఇస్తోంది. నయా ఉదారవాదం కూడా ఇలాంటి పరిమితులతో కూడిన రాయితీలనే అనుమతిస్తుంది. ఇది వెనకబడ్డ ప్రజానీకానికి, బాగా వెనకబడ్డ ప్రజా నీకానికి మధ్య తంపులు పెట్టడానికి దారితీస్తోంది. కాబట్టి హక్కుల ఆధారిత విధానం అలా ఉండరాదు. హక్కుగా గుర్తించిన ప్రతి అంశాన్నీ పరిమితులు లేకుండా ఉండేదిగా ఉండాలి. 'ఆహారభద్రత కానివ్వండి, ఉపాధి హామీ కానివ్వండి, వృద్ధాప్య మరియు వికలాంగుల పింఛన్లు కానివ్వండి' పరిమి తులు లేకుండా ఇలాంటి వారందరికీ పెన్షన్లు అమల య్యేదిగా ఉండాలి. ఇవి బాధితులందరికీ అందేవిగా ఉండాలి. పరిమితులు లేని ఆరోగ్య హక్కు - పరిమితులు లేని విద్యాహక్కు ఉండాలి. అప్పుడే సరుకులుగా మారిన ఆరోగ్యం, విద్య ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.
- పెనుమల్లి మధు 
(వ్యాసకర్త సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి)

Prajashakti Telugu News Paper Dated: 27:06.2014 

No comments:

Post a Comment