Thursday, August 7, 2014

బలహీన తాత్తి్వక పునాదులు కానివాళ్ళకు కంచాల్లో! By Dr Kadere Krishana


చారిత్రక, సాంస్కృతిక గందరగోళం
రాష్ట్ర గీతంలో రాచరిక పోకడలు 
రాష్ట్ర చిహ్నంలో లేని పూర్ణకుంభం 
పి.వి.కి ఘన నివాళులు 
సమైక్యవాది దాశరధి జయంతి 
నిజాం మీదే సాయుధ పోరాటం 
ఉద్యమనేత…- నిజాంను పొగడలేదా! 
చాకలి ఐలమ్మ, కొమురం భీం తగరా? 

తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీ. ఒక ఉద్యమ పార్టీకి నిర్ధిష్ఠ లక్ష్యాలతో పాటు తాత్తి్వక పునాదులు బలంగా ఉండాలి, ఉంటాయి. చారిత్రక అవగాహన, సిద్ధాంత లోతులు, సామాజిక పట్టు ఉండి తీరాలి. అలాంటి పార్టీ పాలనా పగ్గాలు చేపడితే- అదే రకంగా వ్యవహరించాలి. కానీ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇవేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. `తాను చెప్పిందే వేదం' అన్నచందంగా ఉంది కేసీఆర్‌ ప్రభుత్వ గమనం. తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాల విషయంలోనూ గందరగోళ వైఖరి అవలంబిస్తున్నట్టు బయటపడుతోంది. ప్రతిపక్షం లేదనుకుంటే తప్పులేదు గానీ, అసలు ప్రజలే లేరనుకుంటే ప్రమాదం. ప్రభుత్వానికి వివేచనతో పాటు విచక్షణా ఉంటే బావుంటుంది. 

తెలంగాణ రాష్ర్ట గీతం- ఎంపికలో ఇలాంటి స్థితే కనిపించింది. కాకతీయ రాజుల, గోల్కొండ నవాబుల ప్రశంస గల ఈ పాటను ఎన్నుకోవడం సరియైంది కాదేమో అనిపిస్తుంది. `కాకతీయ కళాప్రభల కాంతిరేఖ'గా రామప్పను వర్ణించడానికి బదులు- తెలంగాణ శిల్పకారుల వెలుగు రేఖగా చెబితే బాగుండేది. `గోల్కొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినార్‌' అనే కంటే సామాన్యుని కళారూపంగా చూస్తే మరింత సముచితంగా ఉండేది. ఈ పాటలోని ఈ రెండు వాక్యాలు బూర్జువా పెత్తందారీ పోకడలను సూచిస్తున్నాయి. పాటలో ప్రజలు/ ప్రాంతం, పాలక రూపంనుండి కాక సామాజిక దృక్పథంతో ప్రదర్శితమైతే- టిఆర్‌ఎస్‌ వంటి ఉద్యమ పార్టీకి తాత్తి్వక లోతులు బలంగా ఉన్నట్లు తోచేది. రాజరికపు నిరంకుశ ధోరణులు రాష్ర్టగీతంలో చాలా చోట్ల దొర్లడం, మహోన్నత ఉద్యమం నుండి ఉద్భవించిన ప్రభుత్వపు గీతంగా చలామణి కావడం కొంత బాధాకరమే. తెలంగాణ ఉద్యమం కేవలం రాజకీయ మార్పునే కాక, ఆదర్శ సమాజాన్ని కలగన్నదనే సంకేతంకూడా ఈ పాటలోఉంటే అద్భుతంగా ఉండేది. ఏ ప్రాతిపదికన ఒక నిర్ణయం జరిగినా- అది తెలంగాణ ప్రజల పక్షమని రుజువు కావాలి. 

ఇక రాష్ర్ట చిహ్నం విషయానికివస్తే, ఇందులోనూ ఏకపక్ష ధోరణి ప్రస్ఫుటమయింది. పూర్వాంధ్రప్రదేశ్‌ రాష్ర్ట ముద్రలోని `పూర్ణకుంభం' నామమాత్రంగానైనా ఉంచాల్సింది. అది ఆంధ్ర ప్రాంతాన్నిగానీ, ఆ ప్రాంత ఆధిపత్యాన్ని గానీ చూపేట్టే చిహ్నం ఎంతమాత్రం కాదు. పూర్ణకుంభం చారిత్రక, తాత్తి్వక పునాదులు కలిగినది. అందులోనూ అది తెలంగాణ ప్రాంత గొప్పతనాన్ని విశదీకరిస్తుంది. భారతీయ మూలవాసీ మాతృస్వామ్య ప్రతీక, హరప్పా సింధూ నాగరికత మూలాలు ఇందులో ఉన్నాయి. ప్రసిద్ధ పురాతత్వ పరిశోధకుడు జాన్‌ మార్షల్‌ దీని గురించి ఇలా చెప్పారు. `హరప్పాలో దొరికిన దీర్ఘచతురస్రాకారపు ముద్ర చాలా ముఖ్యమైనది. ఆ ముద్రపై తలకిందులుగా నిలబెట్టిన స్త్రీ మూర్తి. ఆ స్త్రీ మూర్తి గర్భాశయం నుండి పైకి వచ్చిన వృక్షం- ప్రకృతి ఆరాధన, స్త్రీ ప్రాధాన్యత సమాజాల ఘనతను చాటిచెప్పే చిహ్నమది'. దీనిని తెలంగాణ ప్రాంతములోనూ విరివిగా వాడుకున్నట్లు ఆధారాలున్నాయి. ఈ భావజాలం ఉట్టిపడేవిధంగా పూర్ణకలశం రూపొందించిన తాత్తి్వకుడు విధిక అనే చర్మకారుడు. పురాతన సామాజిక వర్గానికి చెందిన కళాకారుణ్ణి గౌరవించినట్లూ ఉండేది. పూర్ణకుంభం ఒక ప్రాంతానికో, ఒక సమూహానికో చెందింది కాదనేది వాస్తవం. దీనిపై ఆచార్య బిరుదు రామరాజు అద్భుతమైన వ్యాసం రాశారు. ఎంతో చరిత్ర, తాత్తి్వక శక్తిని కలిగిన `పూర్ణకలశం' వదులు కోవడాన్ని అవగాహన లోపంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 
ఈ క్రమంలోనే పి.వి.నరసింహారావు జయంతిని ఘనంగా నిర్వహించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. పి.వి. నరసింహారావు ప్రధాని పదవిలో ఉన్నంతకాలం తెలంగాణకు ఒరిగిందేమీ లేదు. పైగా తెలంగాణ స్వరాష్ర్ట ప్రస్తావనా ఎక్కడా ఎత్తినట్లు కనిపించలేదు. తెలంగాణకు మేలు చేసే ఏఒక్క ప్రాజెక్టు ఇవ్వలేదు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతిని నిర్వహించడం దేనికి సంకేతం? ప్రజాస్వామ్య ప్రభుత్వం మొత్తం సమాజానికి ప్రాతినిధƒ్యం వహించాలన్నది వాస్తవమే. కానీ అపాత్రదానం ఉండరాదు. 

ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యమ ఉదాత్తతను చాటే కార్యక్రమం ఏ ఒక్కటీ చేపట్టలేదు. ఇది చాలా దురదృష్టకరం. మరింత దిగ్భ్రాంతిని కలిగించే సంఘటన `దాశరథి జయంతి'ని అధికారికంగా జరపడం. నిజానికి దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణవాది కాదు. పైగా సమైక్యవాది. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో పోరాడిన మాట వాస్తవమే. ఆయన మహాకవి కూడా. అయినప్పటికీ తెలంగాణ సాం„స్కృతిక వారసత్వానికి ప్రాతినిధƒ్యం వహించదగినవాడు కాదు. తెలంగాణ సాయుధ పోరాటం నిజాం నవాబుకు వ్యతిరేకంగా, భూమి కోసం, భుక్తి కోసం జరిగిన పోరాటం. అది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రోద్యమం కాదు. ఒకవేళ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనడమే దాశరథి జయంతి జరపడానికి ప్రాతిపదిక అయితే `ఓ నిజాము పిశాచమా! కానరాడు/ నిన్ను బోలిన రాజు మాకెన్నడేని' అంటాడు దాశరథి. ఆయన పిశాచమా అని సంబోధించిన నిజాము నవాబు చాలా గొప్పవాడని కేసీఆర్‌ ఉద్యమనాయకుడుగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు అభివర్ణించారు. ఒకవైపు గొప్పవాడని అంగీకరిస్తూనే మరోవైపు నిజాం నీచుడన్న వ్యక్తి జయంతిని ఘనంగా నిర్వహించడం ద్వంద్వనీతి కాదా? నోటితో పొగిడి, నొసటితో వెక్కిరించిన చందంగా ఉంది ఈ ప్రభుత్వ విధానం. దాశరథి తెలంగాణ స్వరాష్ర్ట సాంసృ్కతికోద్యమ ప్రాతిపదిక కానేకాదు. ఈ విషయాన్ని దాశరథి కృష్ణమాచార్య సోదరుడు దాశరథి రంగాచార్య స్వయంగా తన ఇంటర్వూ్యల్లో పలుమార్లు ఉద్ఘాటించారు. `సాహితీ కౌముది' పత్రికకు 2002 అక్టోబరులో ఇచ్చిన ఇంటర్వూ్యలో `తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందే భూమి కోసం, భుక్తి కోసం, భాష కోసం. ఆ రోజుల్లో రాజకీయోద్యమం జరిపిన ఆంధ్ర మహాసభ- విశాలాంధ్రనే కోరింది. కమ్యూనిస్టులు విశాలాంధ్రనే కోరారు. ఎందుకంటే రష్యాలో భాషా ప్రయుక్త రాష్ట్రాలుండేవి. వీటన్నిటితో అనుబంధం ఉన్న దాశరథి సహజంగానే విశాలాంధ్రవాది. దాశరథి మహాకవే సందేహం లేదు. ఆ మాటకొస్తే చాలామందే ఉన్నారు మహా కవులు. దాశరథి నిఖార్సయిన సమైక్య విశాలాంధ్రవాది. సాక్ష్యాలివిగో- 

దాశరథి 1950లో `రుద్రవీణ' రాశారు. తెలంగాణకు అంకితమూ చేశారు. ఇది 1950 నాటి రచన. అంటే తెలంగాణ నిజాంపాలనలో లేదు. పైగా భారతదేశంలో అంతర్భాగ మయింది. ఆ కాలంలో రాసిన ఈ గ్రంథంలో ఆసాంతం `విశాలాంధ్ర' కోసం పరితపించాడే తప్ప ఏఒక్కచోట ప్రత్యేకతెలంగాణకోసం ఒక సిరాచుక్క విడువలేదు. చూడండి మచ్చుకొకటి- `ఇటునటును తెల్గునేల లారటము చెంది/ కలిసి పోజూచుచున్న యట్టులనె తోచు/ కలిపివేయుమి నాతెలంగాణ తల్లి!/ మూడు కోటుల నొక్కటే ముడి బిగించి' అంటాడు. అదే కవితలో `నాకోర్కె తీర్పు మమ్మా!/ నీకు మదీయాశ్రుకణ వినిర్మిత మాలా/ నీకమ్ము సమర్పించెద/ గాక; విశాలాంధ్రమనెడి కల నిజమగుతన్‌' అంటూ విశాలంధ్ర కోసం వెక్కివెక్కి ఏడ్చాడు దాశరథి మహాకవి. మరో గొప్ప కావ్యంగా పేర్గాంచిన గ్రంథం `మహాంధ్రోదయం'. ఇది 1955లో ముద్రితమయింది. అంకితం సురవరం ప్రతాపరెడ్డికి. 1955 నాటికి దాశరథిలో `విశాల ఆంధ్ర రాష్ర్ట అవతరణ కాంక్ష పెచ్చుపెరిగిపోయింది. ఈ కావ్యంలోనూ ఎక్కడా స్వరాష్ర్ట అవతరణ దీక్ష, స్వయం గౌరవ కాంక్ష కనిపించలేదు. `నా తెలంగాణ కంజాత వల్లి', `నా తెలంగాణ కోటి అందాల వీణ', `నా తెలంగాణ కోటి రతనాల వీణ', `నా తెలంగాణ లేమ, సౌందర్యసీమ'- వంటి తేమలేని మాటలు మాత్రమే ఈ కావ్యంలో కనిపిస్తాయి తప్ప గాఢంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరణే దృగ్గోచరమవుతుందికానీ మరోటిలేదు. ఆంధ్ర రాష్ట్రావతరణ కు ఆద్యులు పొట్టి శ్రీరాములునుద్దేశించి దాశరథి కవితా పంక్తులు `చిమ్మచీకటిలో తూర్పు సెమ్మెమీద/ దివ్వె యొక్కటి వెలిగించి, రువ్వినావు/ ఎవరు నువ్వు' అని ప్రశ్నిస్తాడు. వెంటనే `నీవెరుగవె; శ్రీరాముడ... నిద్రాణాంధ్ర ధరాస్థలి/ నేడు మేలుకొల్పగలను' అని తనే సమాధానమిస్తాడు. 
వాస్తవానికి తెలంగాణ నిద్రావస్థలో లేదు ఆనాడు. నిజాం నవాబు దాష్ఠీకాన్ని ఎదురించి నిప్పుకణికలా ప్రత్యేక హైదరాబాదు రాష్ర్టంగా స్వయం గౌరవంతో ఉన్నది. `మహాంధ్రోదయం' కావ్యంలో కలికితురాయి వంటి `నేనురా తెలగాణ నిగళాలు తెగగొట్టి (దొబ్బి)/ ఆకాశమంత యెత్తార్చినాను' పద్యంలో పోతనను, వేయిస్తంభాల గుడిని స్మరిస్తూ గొప్పగా వర్ణించారు. ఆ వెంటనే ఇలా `కోటి తమ్ములకడ రెండు కోట్ల తెల్గు/ టన్నలను గూర్చి వృత్తాంతమందజేసి/ మూడు కోటులనొక్కటే ముడి బిగించి/ పాడినాను మహాంధ్ర సౌభాగ్యగీతి' అంటూ విశాలాంధ్ర పట్ల గాఢానురక్తి ప్రదర్శించారు. 

దాశరథి సాహిత్యములో భూతద్దం పెట్టి వెతికినా తెలంగాణ రాష్ర్టం గురించిగానీ, హైదరాబాద్‌ స్టేట్‌ను ప్రత్యేక రాష్ర్టంగా తీర్చిదిద్దుకోవాలనే తపన గానీ కనిపించదు. సరికదా హైదరాబాద్‌ స్టేట్‌, ఆంధ్రరాష్ర్టం (మద్రాసు రాష్ర్ట అంతర్భాగమైన ఆంధ్రప్రాంతం) ఒక్క రాష్ర్టంగా అవతరించాలనే ప్రగాఢంగా కాంక్షించాడు, ఆరాటపడ్డాడు. ఇందుకు `మూడు చెరగుల నేలల మూడు కోట్లు/ ముడివడినయట్లు కన్నుల ముందు తోచె' నంటూ భ్రాంతినొంది `ఈనాడు మహాంధ్రోదయ/ మైనది, కోట్లాది జనము/ తెలుగులక్ష్మి పాదాలకు/ వెలుగుల పారణనిడిరి' అని అబ్బురపడ్డాడు. అలాగే ఆంధ్ర రాష్ర్టం ఏర్పడ్డప్పుడు `మంగళాత్రికమ్ముల పొంగిపోయె/ ఆంధ్రరాష్ర్టము వచ్చె, మహాంధ్ర రాజ్య/ మేరుపడు రోజు పొలిమేర జేరి నిలిచె/ నా తెలంగాణ తల్లి ఆనందపడగ' అంటూ రాబోయే విశాలంధ్ర కోసం పొంగిపోయి గంతులేశాడు. పైగా ఆంధ్రరాష్ర్ట ప్రజలు అగ్రజులంటూ పొగడ్త అందుకున్నాడు. `కలిసిపో గోరుచుందు/ రగ్రజుల తోడ వీలైనయంత వడిగ' అంటూ అత్యుత్సాహమూ కనబరుస్తాడు మహాంధ్రోదయ మహాకవి. `తెలుగు బాడితిన్‌ తెలుగు బాబులు...', `నా తెలంగాణ కోటి రతనమ్ముల వీణ...', `ఎన్నినాళ్ల స్వప్నమిది సత్యమైనది? ఎన్ని నోళ్ళ పిలుపుకిది జవాబు?...(అమృతాభిషేకం కావ్యం)' వంటి పద్యాలు ఎన్నో విశాలాంధ్ర కోసం రాశారే తప్ప స్వరాష్ర్టం కోసం ఎక్కడా తపించలేదు. విశాలాంధ్ర కోసం దాశరథి పడని పాట్లు లేవు. నషాలం ఎక్కేదాకా `విశాలాంధ్ర' నిషా ఎక్కించాడీ కవి పుంగవుడు. 

1975 నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, `తిమిరంతో సమరం' (దాశరథి మరోకావ్యం) కావ్యానికి ముందుమాట రాస్తూ `దాశరథి ముపై్పఏళ్లుగా తెలంగాణ దొరల పాలనకు వ్యతిరేకంగానూ, నిజాం నిరంకుశ పాలనను ఎదిరిస్తూను, రెండు ప్రాంతాల తెలుగువారు ఏకం కావాలని ఉద్భోధిస్తూనూ... ఆంధ్రప్రదేశ్‌ ముక్కలు చేయాలనే, రెండు వేర్పాటు ఉద్యమాలలోనూ ఐకమత్యం కోసం బలమైన కంఠంతో ప్రజలను ప్రబోధిస్తూను' అంటారు. ఇక్కడ అర్థమయ్యేదేమిటంటే, విశాలాంధ్ర గూర్చి రాస్తే రాసిండు గానీ, 1969 నాటి ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 1969 ఉద్యమం ప్రజా ఉద్యమం. సుమారు 370 మంది విద్యార్థులు, యువకులు అశువులు బాసారు. 

అయినా దాశరథి చలించలేదు. పైగా ఎలా నిరసించారో చూడండి.. `కుడి కంటిని ఎడమ కన్ను పొడిచేనా/ కుడిచేతిని ఎడమచేయి నరికేనా/ ఒక దేహం, ఒక గేహం మరిచారా/ ఒక్క తెలుగు, ఒక్క వెలుగు మరిచారా!' అంటూ ప్రత్యేక రాష్ర్ట ఉద్యమం పట్ల దాశరథి అక్కసు వెళ్లగక్కారు. ఇదీ ఆయన దృక్పథం! అంతేగాక, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని వెర్రితలలు వేస్తున్న అనాకారి ఉద్యమంగా వర్ణించాడు దాశరథి మహాకవి. `ఆంధ్రజాతి అల్లరిపాలవుతుందా?/ విశాలత మరచిపోయి వెర్రితలలు వేస్తుందా' అంటూ గొంతు పెంచి మరింత హెచ్చరిక చేస్తారు కళాప్రపూర్ణ దాశరథి. `ఒక్క పుష్కరమైనదేమొ ఒక వల్లె ఉంటిమి/ కలత లేమి లేక ఒక్క కంచములో తింటిమి'- అలాంటి వారము విడిపోవడమేమిటని ప్రశ్నిస్తూ 1969 మహోద్యమాన్ని తప్పుపడతాడు. విడిపోవడమనే ఆలోచన మానేసి కలిసి ఉండే మార్గం కోసం ప్రయత్నాలు కొనసాగించాలని హితవు పలికాడు. `కలిసియుండు మార్గమునే కనుగొనవలెను/ విడిపోయే ఆలోచన విడిచివేయవలెను' అంటూ సమైక్యవాదాన్ని బలమంతా కూడదీసుకొని బలపరిచారు కృష్ణమాచార్యులు. ఇందుకోసం `తెలుగు జాతి ఏకంగా/ విలసిల్లుట కోసమై/ బ్రతుకును బలిపెడతాను' అని తన జీవితాన్ని అర్పణం చేయడం కోసం కూడా వెనుకాడలేదు. మొన్నటి వరకు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆంధ్రా పెట్టుబడిదారులు వాదించిన వాదనను దాశరథి ఆనాడే చేశాడు. చూడండి- `కమ్మని తెలంగాణ/ తొమ్మిది జిల్లాలేనా/ బహుళాంధ్రకు తెలంగాణ పర్యాయపదం కాదా?', `సమగ్రాంధ్ర దీపావళి/ సమైక్యాంధ్ర దీపావళి/ విడిపోయే తత్వంపై/ విరుచుకుపడు దీపావళి' అంటూ ప్రత్యేక రాష్ర్ట ఉద్యమకారులపై శ్రీకృ„ష్ణుడై విరుచుకుపడతాడు. దాశరథి కోటి రతనాల వీణ- తెలంగాణ నాదాన్ని కాక విశాలాంధ్ర కోసం మ్రోగిందని ఆయన సాహిత్యమే సాక్ష్యమిస్తుంది.

తెలంగాణ ప్రభుత్వం దాశరథి కృష్ణమాచార్యులు జయంతి చేయడానికి ఆయనకున్న అర్హత ఏమిటి? తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోరాట యోధులు, అమరవీరులు, రక్తతర్పణ కావించిన సమరయోధులను ఎందరినో ఈ కార్యక్రమం చేసి అవమానించినట్లయింది. చాకలి ఐలమ్మ, కొమరం భీం, ప్రొ జయశంకర్‌, తెలంగాణ సాంసృ్కతిక వీరుడు కాళోజి నారాయణ రావు, శ్రీకాంతాచారి వంటి వీరుల జయంతులను గాలికొదిలి బ్రాహ్మణీయ భావజాలాధిపత్యాన్ని కనబరచడం తెలంగాణ ఉద్యమాన్ని పరిహసించడమవుతుంది. వేలాది ప్రాణత్యాగాలను అపహాస్యం చేసినట్టు భావించక తప్పదు. నిజంగా తెలంగాణ చారిత్రక, సాంసృ్కతిక, స్వయంగౌరవ, స్వయంపాలన కొరకు అహర్నిశలు శ్రమించిన మహాపురు„షులను, బుద్ధి జీవులను, పోరాట యోధులను గుర్తించాలన్నదే తెలంగాణ ప్రజల ఆకాంక్ష. అప్పుడే బంగారు తెలంగాణ సాకారమైనట్లు.

Surya Telugu News Paper Dated: 07/08/2014 

No comments:

Post a Comment