Sunday, August 24, 2014

సెంట్రల్‌యూనివర్సిటీలో అడుగడుగునా వివక్ష! By -ఓడపల్లి అనిత


Updated : 8/23/2014 12:26:20 AM
Views : 85
తెలంగాణ రాష్ట్రం కోసం ౧౯౬౯లో పోలీసు తూటాలకు నేలకొరిగిన ౩౬౯మంది నెత్తుటి సాక్షిగా ఏర్పడిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటిలో ఆది నుంచీ తెలంగాణ ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. ౧౯౭౪లో ఆరు సూత్రాల పథకంలో భాగంగా పార్లమెంటు యాక్ట్ ద్వారా ఏర్పడిన యూనివర్సిటీలో ముఖ్యంగా దగాపడ్డ తెలంగాణ ప్రాంతం విద్యా, ఉద్యోగ రంగంలో వెనకబడిపోయిందని నాటి కేంద్ర ప్రభుత్వం ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రాంత విద్యార్థులకు, నిరుద్యోగులకు ౬౦ శాతం విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశించింది. కానీ ఆరు సూత్రా ల పథకాన్ని తుంగలో తొక్కిన ఆంధ్ర పాలకులు ఆ రిజర్వేషన్లు ఎక్కడా కానరాకుండా చేశారు. దాని కారణంగా తెలంగాణ ప్రాంత విద్యార్థుల సంఖ్య ౨౦ శాతమే. యూనివర్సిటీలో ౪౫౦మంది అధ్యాపకులు ఉంటే తెలంగాణ ప్రాం తం వారు ౩౦ మందే. అంటే ౬.౬ శాతం. ఇక బోధనేతర సిబ్బంది సంఖ్య ౫౦ శాతం మాత్రమే ఉన్నారు.

యూనివర్సిటీ ఏర్పడిన నాటి నుంచి ౨౦ఏళ్లకు పైగా వైస్‌చాన్స్‌లర్లు ఆంధ్రప్రాంతం వారే నియమించబడ్డారు. యూనివర్సిటీలో అర్హులైన తెలంగాణ అధ్యాపకులు ఉన్నా ఏనాడు వారికి ఆ అవకాశం దక్కలేదు. యూనివర్సిటీలో సుమారు ౨౫ కీలక పదవుల్లో ఆంధ్రవారినే నియమించారు. అంటే తెలంగాణ ప్రాంత ఉద్యోగులపై యూనివర్సిటీ అధికారులు ఏ మేరకు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారో అర్థంచేసుకోవచ్చు. 
యూనివర్సిటీలో ఆంధ్ర ప్రాంతం వారిది గుత్తాధిపత్యంగా పరిపాలన కొనసాగుతుంది. వివిధ ఉద్యోగాలకోసం ఎంపిక చేసే ప్రక్రియలో ఆంధ్ర ప్రాంతంవారికి అవకాశాలు కల్పిస్తున్నారే తప్ప అర్హత ఉన్న తెలంగాణ వారిని మాత్రం అప్లికేషన్ల స్క్రూటినీలోనే పక్కకు పెడుతున్నారు. రిటైర్ అయిన ఆంధ్ర ప్రాంతం ఉద్యోగులకు మళ్ళీ ఉద్యోగ అవకా శం కల్పిస్తూ రిటైర్ అయిననాటి పే స్కేలును అమలు చేసి జీతాలు ఇస్తున్నా రు. తెలంగాణ ప్రాంత ఉద్యోగులు రిటైర్ అయిన వారికి మరోసారి అవకాశాలు కల్పించకుండా చేయడమే కాకుండా, ఆయా ఉద్యోగాలకు అనర్హులుగా చేస్తున్నారు. యూనివర్సిటీలో ఒప్పంద ఉద్యోగుల నియామకాల్లో తెలంగాణ వారికి తీవ్ర అన్యాయమే జరుగుతున్నది.

తెలంగాణ ఉద్యోగుల పరిస్థితి ఈ విధంగా ఉంటే యూనివర్సిటీలో విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది.౧౯౭౪ నాటి నుంచి ఈ నాటి వరకు రిజర్వేషన్లు అమలు చేయకపోవడం ద్వారా అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్య నోచుకోకుండా పోయారు. యూనివర్సిటీ ఆధ్వర్యంలో దేశంలో ౩౫ సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తారు. తెలంగాణలో మాత్రం విద్యార్థులు అనేక దఫాలుగా పోరాటాలు చేస్తే కానీ వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు కాలేదు. కానీ ఆంధ్రలో మాత్రం ఆ విద్యార్థుల సౌకర్యార్థం కోసం ఆరు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

అంటే తెలంగాణ ప్రాం త విద్యార్థుల పట్ల యూనివర్సిటీ అధికారులకు ఎంత వివక్ష ఉందో అర్థం అవుతుంది. ఎంతో ప్రతిభతో యూనివర్సిటీలో చేరిన విద్యార్థుల పట్ల ఆంధ్ర ప్రాం త అధ్యాపకుల కక్షసాధింపు అంతా ఇంతా కాదు. అనేక మంది విద్యార్థులను మానసిక వేదనకు గురిచేయడం, కులం పేరుతో దూషించడం, పరీక్షలో తక్కు వ మార్కులు వేయడం సర్వసాధారణం. ఈ వివక్షతో ఇప్పటికే తెలంగాణ ప్రాంత విద్యార్థులు ముగ్గురు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఈ విద్యార్థుల ఆత్మహత్యలపై అధ్యయనం చేసిన వివిధ కమిటీలు అధ్యాపకులే దోషు లని తేల్చిచెప్పాయి. అయినా ఆయా అధ్యాపకులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంటే యూనివర్సిటీ అధికారులు ఆంధ్ర ప్రాంత అధ్యాపకులకు ఎట్లా వత్తాసు పలుకుతున్నారో అర్థమవుతున్నది.
యూనివర్సిటీలో మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచి తెలంగాణ విద్యార్థుల పట్ల కక్షసాధింపు చర్యలు బాహాటంగానే ఉన్నా యి. యూనివర్సిటీ పరీక్షలో ఎంపికైన విద్యార్థులకు మొదట హాస్టల్ సౌకర్యం కల్పించాలి. 

కానీ తెలంగాణ విద్యార్థులు మెరిట్‌లో సీటు సంపాదించినా హాస్టల్ సౌకర్యం ఇవ్వడం లేదు. ఆరు నెలలు దాటితే తప్ప లోకల్ విద్యార్థులకు హాస్టల్ సీటురాదు. విద్యార్థులు ఈ అన్యాయాన్ని ఎదిరిస్తే నిబంధనల ప్రకార మే వ్యవహరిస్తున్నామని అంటుంటారు. ఎక్కడో ఉన్న నాన్‌లోకల్ విద్యార్థులకు, వెయిట్‌లిస్టులో చేరిన విద్యార్థులకు మాత్రం తక్షణమే హాస్టల్ సౌకర్యం కల్పిస్తున్నారు. అంటే తెలంగాణ ప్రాంత విద్యార్థుల పట్ల ఉన్నత విద్యారంగంలో ఎంత వివక్షత చూపిస్తున్నారో అధికారుల తీరు తేటతెల్లం చేస్తుంది. ఇక యూనివర్సిటీలో అవినీతికి అంతులేదు.
ఉమ్మడి రాష్ర్టంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అనేక మంది తెలంగాణ విద్యార్థులు అన్ని రకాల అన్యాయాలకు గురైనారు.

ప్రస్తుతం యూనివర్సిటీ తెలంగాణ ప్రాంత పరిధిలో ఉన్నది. ఈ యూనివర్సిటీలో నాటి ఆరు సూత్రాల పథకం ప్రకారం ఇక్కడి విద్యార్థులకు ౬౦శాతం సీట్లు రిజర్వు చేయాలి. ఉద్యోగ నియామాకాల్లో తెలంగాణ ప్రాంత ప్రజలకు అవకాశం కల్పించాలి. అనేక సంవత్సరాలుగా ఉన్నత విద్యకు దూరమైన తెలంగాణ విద్యార్థులకు ఎలాంటి నిబంధనలు లేకుండా హాస్టల్ సౌకర్యం కల్పించాలి. ఉన్నతమైన కీలక పదవులల్లో తెలంగాణ ఉద్యోగులనే నియమించాలి. ముఖ్యం గా యూనివర్సిటీ ప్రొఫెసర్, వైస్‌చాన్స్‌లర్, రిజిస్ట్రార్, కంట్రోలర్ ఆఫ్ ఎక్జామినేషన్, ఫైనాన్స్ అధికారి, యూనివర్సిటీ ఇంజనీర్, లైబ్రేరియన్ లాంటి పదవుల్లో తెలంగాణ వారిని నియమించాలి. అర్హులైన తెలంగాణ ఉద్యోగులకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలి. తెలంగాణ విద్యార్థులకు ఆయా సూపర్‌వైజర్ల నుంచి ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా వారి పరిశోధనలు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలి. ఆయా డిపార్ట్‌మెంట్లలో తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సుల్లో సీట్లు పెంచి వారికి అవకాశాలు కల్పించాలి.

యూనివర్సిటీలో అవినీతి అక్రమాలకు చరమగీతం పాడాలి. ఇప్పటి నుంచి బోధన, బోధనేతర, ఉద్యోగాలు తెలంగాణ వారినే నియమించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆయా సెంట్రల్ యూనివర్సిటీలు ఎక్కడ కూడా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. కాబట్టి ఈ యూనివర్సిటీ ౩౦ పరీక్ష కేంద్రాలు రద్దుచేసి తెలంగాణ ప్రాంతానికి మాత్రమే పరిమితం చేయాలి. ఒప్పంద ఉద్యోగాల నియామకాల్లో తెలంగాణ వారినే నియమించాలి. ఇప్పటి వరకు జరిగిన అక్రమ నియామకాలు రద్దు చేయాలి. ఔట్‌సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న నాల్గవ తరగతి సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి. యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి. తెలంగాణ గిరిజనులకు అడ్మిషన్లలో తీవ్ర అన్యాయం జరుగుతున్నది. కాబట్టి వారికి ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలి. అప్పుడే తెలంగాణ ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం జరిగినట్లుగా భావించాలి. 

Namasete Telangana Telugu News Paper Dated: 23/08/2014

No comments:

Post a Comment