Friday, August 8, 2014

దళిత విద్యార్థుల నిరసన By ప్రొఫెసర్ జి. హరగోపాల్


Updated : 8/7/2014 4:11:53 AM
Views : 239
ఒకవైపు విద్యావ్యవస్థ, న్యాయవ్యవస్థ, రాజకీయ వ్యవస్థ పేదలకు, దళితులకు వ్యతిరేకంగా బలీయమౌతున్నప్పుడు..పాములు ఎక్కడ ఉన్నాయో, ఎక్కడ ఉంటాయో మనకు తెలియాలి కదా! ప్రజాస్వామ్య విలువల మీద, దళితచైతన్యం మీద ఇంత పెద్ద ఎత్తున దాడి జరుగుతున్నప్పుడు, వామపక్ష విద్యార్థులు విద్యా కాషాయీకరణ మీద నిర్వహించిన చర్చలో దళిత విద్యార్థులు భాగం కావాలా వద్దా అనేది దళితఉద్యమం చర్చించుకోవలసిన అంశం. 

రెండు రోజుల క్రితం (5-8-2014) హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సం ఘం వారు విద్య-కాషాయీకరణ మీద మాట్లాడమని పిలిచారు. వామపక్ష విద్యార్థుల మీటింగ్ కాబ ట్టి కుడిపక్ష విద్యార్థి సంఘం (Right Wing) నిరసన తెలిపే అవకాశం కొంత ఉంది. అయినా హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఉండే ప్రజాస్వామ్య సంస్కృతి వల్ల చాలా వరకు అలాంటి సంఘటనలు అరుదు. ఈ ప్రసంగానికి విద్యార్థులు చాలా సంఖ్యలోనే గుమిగూడారు.

నా ప్రసంగం ప్రారంభమౌతూనే నలుగురు దళిత విద్యార్థులు నినాదాలు రాసిన ప్లకార్డులు పట్టుకొని సభలో లేచి నిలబడ్డారు. అందులో ముఖ్యంగా ఒకటి- ప్రవీణ్ కుమార్‌పై మీరు చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వండి, రెండు- మానవ హక్కుల నాయకుడిగా కులాన్ని గుర్తిస్తారా లేదా? ఈ రెండు అంశాల మీద చాలా కాలంగా వాదవివాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రవీణ్‌కుమార్‌కు సంక్షేమ స్కూళ్ల ఉపాధ్యాయుల మధ్య ఏర్పడ్డ ఘర్షణ ముఖ్యమంత్రి జోక్యంతో సమసిపోయిందని మిత్రులు చెప్పారు. దాంతో వివాదం పూర్తయ్యిందని నేను భావించాను. కానీ అది ఇంకా ఏదో రూపంలో కొనసాగుతున్నది.ఇది నన్ను ఆశ్చర్యపరిచింది. 

దాదాపు మూడు దశాబ్దాల కాలం అధ్యాపకుడిగా పని చేసిన విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నిరసన తెలపడం ఒక కొత్త అనుభవం.నిరసనకు స్పందనగా విద్యార్థులు అలా చేయడా న్ని నేను తప్పుపట్టడం లేదని, ఒక సభలో దళిత విద్యార్థులు అధ్యాపకుడిని ప్రశ్నించడం ఒకరకంగా ఆహ్వానించవలసిందేనని, మేము చెప్పిన పాఠాలు మళ్లీ మాకే అప్పజెప్తున్నారని అంటూ, ఒక విద్యార్థి సంఘం ఒక అంశం మీద ప్రసంగించడానికి పిలిచినప్పుడు, దళిత విద్యార్థులు లేవనెత్తిన ప్రశ్నల మీద మాట్లాడడం సబబుకాదన్నాను.దళిత విద్యార్థులు నన్ను ప్రత్యేకమైన చర్చకు పిలిస్తే ఈ అంశాల మీద సమగ్రంగా మాట్లాడుకోవచ్చని చెప్పాను. దాంతో విద్యార్థులు ప్రసంగం వినడానికి కూర్చున్నారు.

ఈ నిరసనలో నన్ను చాలా ఆశ్చర్యపరిచింది, కొంత చికాకు పరిచింది కమ్యూనిస్టులు ఆకుపచ్చ గడ్డిలో దాక్కున్న ఆకుపచ్చని పాములు అనే నినా దం. ఈ అంశం అక్కడ ఎందుకు లేవదీయవలసి వచ్చిందో, దానికి ప్రవీణ్‌కుమార్ సంఘటనకు ఏం సంబంధమో నాకు అర్థం కాలేదు. దానికి స్పంది స్తూ డాక్టర్ అంబేద్కర్ చేసిన విప్లవము-ప్రతీఘా త విప్లవం అనే వ్యాసాన్ని అందరూ చదవాలని సూచించాను.

దళిత చైతన్యం వెల్లివిరిసిందని భావించిన ఉత్తరప్రదేశ్‌లో బహుజన సమాజ్ పార్టీ, సమాజ్‌వాది పార్టీలు ఎన్నికల్లో పెద్దఎత్తున దెబ్బతినడమే కాక బీజేపీ ఏకంగా 73ఎంపీ సీట్లు గెలుచుకున్నది. బీజేపీ, దానివెనక ఉన్న మతతత్వశక్తుల గురించి అందరికి తెలుసు. ఏ మత సాలెగూడు నుంచి మన దేశం బయటపడాలని అంబేద్కర్ తపించాడో ఆ సాలెగూడు ఈరోజు చాలా విస్తృతంగా అల్లుకుంది. ఆరు, ఏడు దశాబ్దాల దళిత ఉద్యమం, ఆ ఉద్యమ విజయాలు ఏమైనట్టు? అంబేద్కర్ భావజాలం విస్తృతంగా చర్చకు వచ్చి,ఆ ప్రభావం దాదాపు అన్ని రంగాలకు విస్తరించినప్పుడు, మతోన్మాద రాజకీయాలు ఎందుకు ఇంత బలపడినట్టు? ఈ ప్రశ్న మనం అడగాలా వద్దా? దానికి కారణాలు వెతకాల వద్దా? అనే సవాలు మనముందు ఉంది. 

రెండు వారాల కిందట మద్రాసు దళిత సంఘా లు నిర్వహించిన ఒక సదస్సుకు ప్రారంభోపన్యాసం చేయడానికి నన్ను, పి.ఎస్.కృష్ణన్ గారిని పిలిచారు. ఈ సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణం మద్రాసు హైకోర్టు అడ్వొకేట్స్ కొందరు అడ్వొకేట్స్ ఫర్ సోషల్ జస్టిస్ అనే పేర ఏర్పడి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్‌ను రద్దు చేయవలసిందిగా సుప్రీంకోర్టు లో పిటిషన్ వేశారు.సాధారణ పరిస్థితిలో ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చేదే. కానీ ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో ఏదైనా జరగవచ్చు! ఈ చట్టాన్ని రద్దు చేస్తే దళితులకు తిరుగులేని అన్యా యం జరుగుతుంది. చుండూరు కేసును కొట్టివేసిన న్యాయవ్యవస్థ తీరుతెన్నులు ఏమిటో.. తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాల దళితులకు బాగా తెలుసు. ఈ చట్టానికి మద్దతుగా దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని సమీకరించాలని మద్రాసు సభ తీర్మానించింది.

విద్య కాషాయీకరణలో భాగంగా భగవద్గీతను బోధించాలని ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి అభిప్రాయపడుతున్నాడు. భగవద్గీతలో రెండు అంశా లు చాలా ప్రభావవంతమైనవి. ఒకటి-వర్ణవ్యవస్థ భగవంతుడి ఆదేశంగా మనుషులు అసమానులని ప్రతిపాదిస్తూ కులవ్యవస్థను సమర్థించడం; రెండు- మనుషులు తమ తమ బాధ్యతలను నిర్వహిస్తూ శ్రమ ఫలితాలను భగవంతుడికి వదిలివేయాలనేది. అంటే హక్కులు అనే భావనకు భగవద్గీతలో స్థానం లేదు. ఈ మధ్య ఈ రాజకీయాలను విశ్వసించే వారు ఐదు నక్షత్రాల హోటళ్లలో బస చేసే విదేశీయులకు హిందూమతం, అలాగే భారతీయ ఆచారాలను పునరుద్ధరించడానికి తాము చేస్తున్న కృషి గురించి ప్రసంగాలు చేస్తున్నారు. 

ఒకవైపు విద్యావ్యవస్థ, న్యాయవ్యవస్థ, రాజకీయ వ్యవస్థ పేదలకు, దళితులకు వ్యతిరేకంగా బలీయమౌతున్నప్పుడు..పాములు ఎక్కడ ఉన్నాయో, ఎక్క డ ఉంటాయో మనకు తెలియాలి కదా! ప్రజాస్వా మ్య విలువల మీద, దళిత చైతన్యం మీద ఇంత పెద్ద ఎత్తున దాడి జరుగుతున్నప్పుడు, వామపక్ష విద్యార్థులు విద్యా కాషాయీకరణ మీద నిర్వహించిన చర్చలో దళిత విద్యార్థులు భాగం కావాలా వద్దా అనే ది దళిత ఉద్యమం చర్చించుకోవలసిన అంశం. 

haragopal
తెలంగాణ రాష్ట్రంలో విప్లవ ఉద్యమాల వలన వివిధ సామాజిక, పౌరహక్కుల ఉద్యమాల వల్ల కారంచేడు, చుండూరు లాంటి దుర్మార్గాలు జరగడానికి అంత అవకాశం లేదు. మొత్తం దేశంలో దళిత ఆత్మగౌరవానికి హిందూ ముస్లింల సఖ్యతకు, ఇది వికాసం చెందడానికి కావలసిన చారిత్రక సంద ర్భం తెలంగాణలో ఉన్నది. దళితుల తరఫున నిలబడే ప్రముఖ దళిత నాయకులే కాక, చాలా ప్రజాస్వామిక గొంతులున్నాయి.అద్భుతమైన దళిత వాగ్గేయకారులున్నారు.కమ్యూనిస్టుల గురించి మనం ఏం మాట్లాడినా, సామాజిక మార్పు కోసం చాలామంది యువకులు ప్రాణత్యాగం చేశారు.

పార్లమెంటరీ వామపక్షాలలో, అలాగే విప్లవ రాజకీయాలలో పొరపాట్లు ఉండవచ్చు. దాన్ని సరిదిద్దవలసిన అవసరం ఉంది. కానీ వాళ్లను దాక్కున్న పాములు అనడం ఏం న్యాయం?
విద్యార్థులు నిరసన తెలపడం ఒకవైపున అనుభవమైతే, మొన్న ఒక దళిత మిత్రుడి అభినందన సభ కు వెళితే, దళిత నాయకుడు జె.బి. రాజుగారు హరగోపాల్ గారూ మీ గురించి మా వాళ్లు కొన్ని అపవాదులు నా దగ్గరికి వచ్చి చెబుతుంటారు. నేను మాత్రం ఆయన మనవాడు అని చెప్పి పంపిస్తుంటానని అన్నాడు. అలాగే మద్రాసులో కొందరు దళిత మిత్రులు మీ మీద ఫేస్‌బుక్‌లో దళిత వ్యతిరేకిగా ప్రచారం జరుగుతున్నది. అయినా మీ పట్ల మాకు గౌరవం తగ్గలేదని అన్నారు. బహుశా సంధి కాలంలో జీవించడం వల్ల పరస్పర విరుద్ధ అనుభవాల నుంచి జీవనయానం జరగడం ఒక గొప్ప అనుభవమే.
Namasete Telangana Telugu News Paper Dated: 07/08/2014 

No comments:

Post a Comment