Sunday, February 2, 2014

హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ గుమిగూడిన అక్షరాల సంబరం - క్రాంతి




New 
 
0 
 
0 


 



ఒక నగరం.. మూడు రోజులు.. ఏడు దేశాలు.. వంద గొంతులు.. వెరసి హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్. సంభాషణలు.. సంవాదాలు... పుస్తకావిష్కరణలు.. శిక్షణాశిబిరాలు.. కలగలిసిన ఓ సాహితీ ఉత్సవం. కవులు, కళాకారులు, రచయితలు, పాఠకులు, ప్రచురణకర్తలు ఒక వేదికపై చేరిన అపురూప దృశ్యం. చార్మినార్ సాక్షిగా వెల్లివిరిసిన సాహితీ 'సంగతులు'అవి. అవును.. కులీ కుతుబ్‌షా కవిత్వం కురిసిన నేలన... సరోజినీ నాయుడు స్వరం వినిపించిన నేలన.. సురవరం ప్రతాపరెడ్డి, వట్టికోట ఆళ్వార్‌స్వామి, మగ్దూం వంటి మహానుభావులు నడయాడిన నేలన సాహితీ ఉత్సవమంటే తెలుగు నేల పరవశించిపోదా మరి!
నగరంలో నాలుగవ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ జనవరి 24, 25, 26 తేదీలలో రస రమ్యంగా సాగింది. అక్షరాలు గుమికూడి మాటలాడుకున్నట్లు దేశ దేశాల ప్రతినిధులు సాహితీ చర్చల్లో మునిగిపోయారు. అమెరికా, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, స్వీడన్, సింగపూర్ వంటి పలు దేశాలతో పాటు, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రచయితలు, కవులు, కళాకారులు హాజరయ్యారు. ఐదు వేదికల్లో (ఆషియానా, కల్పాస్కూల్, సప్తపర్ణి, కళాకృతి, లా మకాన్) నిర్వహించిన ఫెస్టివల్‌లో సాహితీ చర్చలతో పాటు ఫొటోగ్రఫి, హైకూ, సృజనాత్మక రచన, స్టోరీ టెల్లింగ్ వంటి పలు అంశాలపై వర్క్‌షాప్ లు నిర్వహించారు. ఇక పుస్తకావిష్కరణలు, చిత్రపద్రర్శనలు, ముషాయిరాలు అదనపు అందాల్ని కూర్చాయి. ఐదు వేదికలను అనుసంధానం చేసే వీధికి నిర్వాహకులు లిటరరీ స్ట్రీట్‌గా నామకరణం చేశారు. మొత్తంగా మూడు రోజుల పాటు నగరంలో ఓ 'కొత్త ప్రపంచం' కొలువుతీరింది. స్మార్ట్ ఫోన్‌లు, ల్యాప్ ట్యాప్‌లతో యువత సందడి చేసింది..
నలుగురితో మొదలై..
భారతీయ సాహిత్యాన్ని ప్రపంచ ప్రజల చెంతకు చేర్చే లక్ష్యంతో 'మ్యూజ్ ఇండియా' వెబ్ జర్నల్‌ను ప్రారంభించారు జి.సూర్యప్రకాశ్‌రావు, ఆయన మిత్రులు. మ్యూజ్ ఇండియా కోసం పలువురు రచయితలు దేశీయ సాహిత్యాన్ని ఇంగ్లీషులోకి అనువదించేవారు. అలాంటి రచయితలందరితో ప్రతి సంవత్సరం 'మ్యూజ్ మీట్' నిర్వహించేవారు. అలా వేరు వేరు ప్రాంతాల రచయితలు ఒక చోట కలవడం వారికి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడంతో దానినే లిటరరీ ఫెస్టివల్ గా మలిచారు. జైపూర్ లిటరరీ ఫెస్టివల్ స్ఫూర్తితో 2010 డిసెంబర్ లో మొదటి హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌ను నగరంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. క్రమంగా ఫెస్టివల్‌లో పాల్గొనే ప్రతినిధుల సంఖ్యతో పాటే విదేశీ సాహిత్యానికి ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. అలా వివిధ దేశాల సాహిత్యాన్ని స్థానిక రచయితలకు పరిచయం చేసేందుకుగానూ ప్రతి సంవత్సరం ఒక దేశాన్ని అతిథి దేశంగా పరిచయం చేస్తున్నారు నిర్వాహకులు. ఈసారి లిటరరీ ఫెస్టివల్‌లో ఐర్లాండ్‌ను అతిథి దేశంగా పరిచయం చేయడంతో పాటు, హిందీని ఫోకస్ లాంగ్వేజ్ స్వీరించారు.
చర్చోపచర్చలు
బాలివుడ్ సినీ దర్శకుడు మహేష్ దత్తాని సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా ప్రారంభమైన హెచ్ఎల్ఎఫ్‌లో సినిమా, అనువాద, దళిత, మహిళా సాహిత్యంతోపాటు, వివిధ సాహితీ ప్రక్రియలపైనా చర్చలు సాగాయి. వర్తమాన సాహిత్య ధోరణులపై పలువురు తమ వ్యాఖ్యానాన్ని నమోదు చేశారు. సమావేశాల్లో మహ్మాత్మాగాంధీ మనవడు రాజ్‌మోహన్ గాంధీ మాట్లాడుతూ 'బ్రిటీష్ వాళ్లు ఎన్నో దారుణాలకు ఒడిగట్టి ఉండవచ్చు కానీ, ఎంతో కొంత మేలు కూడా చేశారు' అంటూ వ్యాఖ్యానించారు. 'ఫ్రం ఇండియా టూ పాలస్తీనా' సంఘీభావ వ్యాస సంపుటికి సంపాదకురాలిగా వ్యవహరించిన ప్రముఖ రచయిత్రి గీతా హరిహరణ్ మాట్లాడుతూ పాలస్తీనాలో ప్రజల స్థితిగతులను వివరించారు. సునితీ నామ్ జోషి, ఊర్వశీ బుటాలియా వంటి రచయిత్రులు సాహిత్యంలోనూ పురుషాధిపత్యం కొనసాగుతోందని అభిప్రాయపడ్డారు. తస్లీమా నస్రీన్ వంటి వారు స్త్రీవాద రచయితలకు స్ఫూర్తి కావాలన్నారు.
సమాజంలో వ్యవస్థీకృతమైన కుల అణిచివేతను గురించి ప్రముఖ తమిళ రచయితలు శివకామి, బామ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో వందేళ్ల దళిత సాహిత్యంపై గోగు శ్యామల, ప్రొఫెసర్ వినోదిని, జిలుకర శ్రీనివాస్, గోరటి వెంకన్న, గీతా రామస్వామి మాట్లాడుతూ తెలుగు సమాజంలో దళిత సాహిత్యానికి గల ప్రత్యేకమైన సామాజిక నేపథ్యాన్ని వివరించారు. ప్రముఖ కవి, సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎడ్విన్ థంబూ 'ప్రపంచ సాహిత్యాన్నే కాదు... స్థానిక సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి' అన్నారు. అనువాద సాహిత్యం ప్రపంచవ్యాప్త సాహితీ ధోరణులను తెలుసుకునేందుకు ఉపకరిస్తుందని సస్కీ జైన్, సబా మహ్మద్ బషీర్ అభిప్రాయపడ్డారు. పబ్లిషింగ్ రంగంపై నిర్వహించిన చర్చా కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది. హాపర్‌కొలిన్స్ నిర్వాహకురాలు కార్తిక, 45 శాతం మంది పాఠకులు ఈ బుక్స్ చదువుతున్నారని తెలిపారు. ప్రముఖ సినీ నటుడు బిపిన్ శర్మ పెద్ద స్టార్‌ల చుట్టే సినిమా రంగం తిరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా సాహిత్యంలో వివిధ పార్శ్వాలను తడిమిన ఫెస్టివల్‌లో చర్చలన్నీ ఆంగ్ల సాహిత్యం చుట్టే తిరగడం గమనార్హం.
స్థానికత ఊసేది?
నిజానికి ఈ ఉత్సవాలు ఏమి ఆశిస్తున్నాయి? ఎందుకోసం ఇలాంటి ఉత్సవాల అవసరం ఏర్పడింది? ఇప్పుడిలాంటి ప్రశ్నలు తెలుగు సమాజాన్ని తొలుస్తున్నాయి. 50వేల మందికిపైగా హాజరయ్యే జైపూర్ లిటరరీ ఫెస్టివల్ మొదలు బెంగుళూరు, ఢిల్లీ, కలకత్తా, హైదరాబాద్ వరకు దేశంలో ఏటా 60కి పైగా ఫెస్టివల్స్ జరుగుతుంటాయి. అన్నిటా.. స్థానిక సాహిత్యం, స్థానిక భాషల ప్రస్తావన కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ సమావేశాలు కేవలం ఆంగ్లో ఇండియన్ సాహిత్య ప్రచారం, మార్కెట్ కోసమే జరుగుతున్నాయనేది ప్రధానంగా వినిపించే విమర్శ. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే ఫెస్టివల్స్‌లో ఆంగ్ల సాహిత్యం, విదేశాల్లో ఉండే భారతీయ రచయితల సాహిత్యంపైనే ఎక్కువ దృష్టి సారించడం ఆ వాదనకు మరింత ఊతమిస్తోంది. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌పైనా అలాంటి విమర్శలున్నాయి. తెలుగు సాహిత్యానికి ఫెస్టివల్ తగు ప్రాధాన్యత ఇవ్వడంలేదని, స్థానిక రచయితల భాగస్వామ్యం ఉండడం లేదని పలువురు విమర్శిస్తున్నారు.
మూడు రోజుల పాటు జరిగిన ఈ ఫెస్టివల్‌లో దాదాపు 80కిపైగా సెషన్స్ జరిగితే వాటిలో తెలుగు సాహిత్యానిది ఒకే సెషన్ కావడం గమనార్హం. దశాబ్దాల సామాజిక, ఆర్థిక, రాజకీయ వాతావరణంలోంచి ఉబికి వచ్చిన తెలుగు సాహిత్యానికి ఓ ప్రజాస్వామ్య ఒరవడి ఉంది. అది నిరంతరం ప్రజల పక్షం వహిస్తూ వచ్చింది. అలాంటి సాహితీ ఒరవడి కలిగిన నేలపై వందలాదిమంది సాహితీ ప్రముఖులున్నారు. కానీ సొంత గడ్డపై జరిగే ఫెస్టివల్‌లో తెలుగు రచయితలు వేళ్ల మీద లెక్కపెట్టగల్గినంత మంది మాత్రమే పాల్గొన్నారు. అంపశయ్య నవీన్ మినహా సీనియర్ రచయితలెవరినీ ఫెస్టివల్‌లో భాగస్వాములను చేయలేదు. స్థానిక సాహిత్యంపై ఎక్కడైనా ప్రస్తావన వచ్చినా అదీ ఆంగ్ల, హిందీ సాహిత్యమే కావడం గమనార్హం. ఇలాంటి కొరతను అధిగమించినప్పుడు, అన్ని వర్గాల, అన్ని భాషల సాహిత్యానికి చోటు దొరికినప్పుడు, మార్కెట్ ప్రయోజనాల కంటే ప్రజల ప్రయోజనాలు ప్రముఖమైనప్పుడే ఇలాంటి సాహితీ ఉత్సవాలకు అర్ధముంటుంది. తెలుగు నేలపై అలాంటి అర్థవంతమైన సాహితీ సమ్మేళనాలు జరగాలని కాంక్షిద్దాం.

- క్రాంతి
99854 11403
అన్ని వర్గాలకూ ప్రాధాన్యం
రచయితలను, పాఠకులను ఒక చోట చేర్చడం ద్వారావేరు వేరు సంస్కృతుల, వేరు వేరు రచనా రీతుల మధ్య సమన్వయం సాధించడం ఫెస్టివల్ ఉద్దేశ్యం. ఔత్సాహిక రచయితలు ప్రచురణకర్తలతో నేరుగా సంభాషించడానికి, భారతీయ సాహిత్యం అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడడానికీ అవకాశముంటుంది. ఈ సారి ఫెస్టివల్‌లో 11 దేశాల ప్రతినిధులతో పాటు తెలుగు, హిందీ, ఉర్ధూ, మళయాళం, కన్నడ, మరాఠి, గుజరాతి, తమిళ్ వంటి పలు భారతీయ భాషలకు చెందిన సాహితీవేత్తలు పాల్గొన్నారు. దాదాపు 10వేల మంది ఫెస్టివల్‌లో పాల్గొన్నారు.
నాలుగేళ్ల లేత ప్రాయంలో హైదరాబాద్ ఫెస్టివల్ సాధించిన విజయమిది. ఫెస్టివల్‌లో దళిత, మహిళా, మైనార్టీతో పాటు అన్ని వర్గాల సాహిత్యానికీ ప్రాధాన్యత కల్పించాం. ఫెస్టివల్‌లో పాల్గొన్న వక్తల్లో 60శాతం మంది మహిళలే ఉండడం గమనార్హం. అంతేకాదు... ఈ సారి యువత భాగస్వామ్యం చెప్పుకోదగ్గస్థాయిలో ఉంది. రాబోయే కాలంలో జరగబోయే ఫెస్టివల్స్‌ను స్థానిక రచయితలు, సాహిత్యం, కళలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేలా రూపొందించాలనుకున్నాం. జైపూర్ ఫెస్టివల్ వలే హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌కు శాశ్వత వేదికంటూ లేదు. అయినా.. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నాం. సాహిత్యాన్ని ప్రజల వద్దకు చేర్చేందుకు ఇలాంటి ఫెస్టివల్స్ అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు, ప్రభుత్వ సహకారం ఉంటే మరింత సృజనాత్మకంగా ఫెస్టివల్‌ను నిర్వహించగలుగుతాం.
- ప్రొఫెసర్ టి.విజయ్‌కుమార్
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ డైరెక్టర్
బహుజన గొంతుక
'ట్రాన్స్‌లేటింగ్ ఏ మూవ్‌మెంట్- 100 ఇయర్స్ ఆఫ్ తెలుగు దళిత్ రైటింగ్' పై జరిగిన చర్చలో వక్తలు తెలుగు సమాజంలోని దళిత సాహిత్యపు ఒరవడిని విశ్లేషించారు. 'దళితులు సమాజంలో నిత్యం భౌతిక, సాంస్కృతిక దాడులను ఎదుర్కొంటున్నారు. కనీస మానవ హక్కులు కూడా వారికి వర్తించడం లేదు. దళితుల ఆహార సంస్కృతిపై అంటరానితనం అమలవుతోంది' అని ప్రముఖ దళిత రచయిత్రి గోగు శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. 'పాఠ్యపుస్తకాల్లో వర్ణవ్యవస్థను బలపరిచే అంశాలను తిరగ రాయాల్సిన అవసరముంది. మనుస్మృతి ఆధారంగా రాసిన పాఠ్యాంశాలు దళితులను కనీసం మనుషులుగా కూడా గుర్తించ నిరాకరిస్తాయి. ఇలాంటి విషయాలనేనా రేపటి తరానికి భోదించాల్సింది' అని ప్రొఫెసర్ వినోదిని ప్రశ్నించారు. 'గ్రామాల్లో నేటికీ అగ్రకుల అధిపత్యం కొనసాగుతోంది. ప్రజాస్వామ్యానికి, మానవత్వానికి చోటులేదు. దళితులకు ఎలాంటి హక్కులూ లేవు. అసలు గ్రామాల్లో మనువాదం తప్ప మానవత్వం లేదు. విదేశాల్లో మనుషుల్ని వ్యక్తులుగా గుర్తిస్తారు కాని భారతదేశంలో మనుషుల్ని ఫలానా కులం వారుగానే గుర్తిస్తారు. ఈ వివక్షను ప్రశ్నిస్తూనే తెలుగుసమాజంలో దళిత సాహిత్యం వెల్లువెత్తింది' అని జిలుకర శ్రీనివాస్ అన్నారు.

Andhra Jyothi Telugu News Paper Dated: 3/2/2014 

సంఘాన్ని చదివిన సాహతీవేత్తను' - ఇంటర్వ్యూ: డా.జిలుకర శ్రీనివాస్, స్కైబాబ -


 
New 
 
0 
 
0 
 
 

కవి, కథకులు, నవలాకారులు, నాటక రచయిత, విమర్శకులు, వినూత్న పరిశోధకులు ఆచార్య కొలకలూరి ఇనాక్. సమాజంలోని అట్టడుగు వర్గంలోంచి ప్రభవించిన ఇనాక్ సమాజంలోని చీకటి కోణాల్ని తన రచనల ద్వారా బలంగా వ్యక్తీకరించారు. ఈ సాహితీ స్రష్టకు పద్మశ్రీ పురస్కారం లభించిన సందర్భంగా 'వివిధ' పాఠకుల కోసం ఆయనతో విపులమైన ఇంటర్వ్యూ..
ఇనాక్ గారూ! మీకు పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు అభినంద నలు. మీ సాహిత్యసేవకు తగినగౌరవం లభించిందని భావిస్తున్నారా?
- నా సాహిత్యానికి గాను పద్మశ్రీ లాంటి అవార్డు రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. నాకే కాదు, తెలుగు భాషకే గౌరవంగా భావిస్తున్నాను.
జాషువా, మీరు ఒకే జిల్లా నుంచి వచ్చారు. మీ మీద ఆయన ప్రభావం ఉందా? ఆయనతో మీ పరిచయం గురించి చెప్పండి?

- జాషువా పుణ్యాత్ముడు. మహానుభావుడు, మహాకవి. మా పల్లెల్లో ఆయనొక సజీవ చైతన్య దైవం. ఆయన్ని చూడటం, తాకటం గొప్ప అనుభవం. ఆయన నివసించే ఇంటిని చూడటం ఒక ఆరాధన. కవి అంటే మా జనంలో గొప్ప గౌరవం. జాషువాను చూసే నాలో కవి కావాలన్న బీజం పడింది. మా పల్లెల ప్రజలు ఆయన పట్ల చూపే భక్తి ప్రేరణ నన్ను రచయితను చేసింది. ఆయన సాహిత్యమంతా నా 18 ఏళ్లకు చదివేశాను. నేనేమయినా రాస్తే కరుణశ్రీ చూచేవారు. సవరించేవారు. ప్రోత్సహించేవారు.
నేను అప్పట్లో పద్యాలు రాసేవాణ్ణి. నా పద్యాలు చదివిన విజ్ఞులు జాషువా రచనలాగో, కరుణశ్రీ రచనలాగో ఉందనేవాళ్లు. అట్లా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. నా పద్యాలు నావిగా ఉండాలి. ఆ ప్రభావాల నుంచి తప్పించుకోవటానికి పద్యం రాయటం మానేశాను. వచనం నన్ను ఆదరించింది. నా పద్యం నేను రాసినట్లే ఉంటుందని ఇప్పుడెవరైనా 'ఆది ఆంధ్రుడు' చదివితే గుర్తిస్తారు.

అంబేద్కరిజం తెలియని రోజుల్లోనే కులానికి వ్యతిరేకంగా రాశానని మీరొకచోట రాసుకున్నారు..
- మా తాతను మునసబు కొట్టి చంపాడు. అట్లా చంపి ఉండకూడదని నా పసి మనస్సు ఏడ్చింది. అది నా మొదటి కథ- ఉత్తరం. నాకప్పటికి 15 ఏళ్లు. నేనప్పటికి అంబేద్కరును ఎరగను. నా ఆకలి, నా అస్పృశ్యతా వ్యధ, నా చుట్టూ జీవితాలు చూచి దుఃఖంతో ఆక్రోశించటానికి నా సాహిత్యం అండయింది. నా సాంఘిక జీవితాన్ని, నన్ను పీడించిన సమాజ ధోరణిని గూర్చి రాశాను. నేను రాసింది పుస్తకాలు చదివి కాదు, సంఘాన్ని చదివి.
క్రైస్తవ నేపథ్యం నుంచి వచ్చిన మీరు తెలుగు సాహిత్యంలో ఎలా స్థిరపడ్డారు?

- క్రైస్తవులంటే ముఖ్యంగా మాలమాదిగలే కదా! వాళ్లు ప్రధానంగా ఉండేది- అప్పట్లో పల్లెల్లోనే. ఆ పల్లెలకు అప్పట్లో తెలుగు తప్ప సంస్కృతం, ఇంగ్లీషు అంతగా రావు. నేను పల్లె ప్రాణిని కాబట్టి తెలుగు ఇష్టమయింది.
అభ్యుదయ,విప్లవ సాహిత్యం ఉధృతంగా వస్తున్న రోజుల్లో ఆ ప్రభావంలో మీరు కొట్టుకుపోలేదు. స్వతంత్రమైన సాహితీ వ్యక్తిత్వంతోపాటు ప్రత్యామ్నాయ దృక్పథాన్ని మీ రచనల్లో వ్యక్తం చేస్తూ వచ్చారు? వర్గ కేంద్రమైన సాహిత్యం పట్ల మీరెందుకు ఆకర్షితులు కాలేదు?
- వర్గ కేంద్రమైన సాహిత్యం నాకిష్టమే. వర్ణ ప్రాంగణంలోని సాహిత్యం నన్ను బాధిస్తుంది. నా సాహిత్యంలో అభ్యుదయం విప్లవం - రెండు ధోరణులూ ఉంటాయి. వీటిపైన వీటికంటే ఎక్కువగా కులం నా గోల. నా గొడవ. దానీ పీడ నాకు వాస్తవం. ఆర్థికంగా పీడితులతోపాటు కుల, మత, వృత్తి పీడితులు నాకు సాహిత్యం ప్రసాదించారు. ఆర్థిక స్వావలంబన వచ్చినంత మాత్రాన జనం కులం ఉక్కు పంజరంలోంచి బయటపడలేరని నా తెలివిడి.
ప్రబంధ సాహిత్యం మీద మీరు చాలా చక్కటి విశ్లేషణలు చేశారు. వసుచరిత్ర రాసిన రామరాజభూషణుడు శూద్రకవి, శుభమూర్తి అని మీరు రాసిన చేసిన పరిశోధన అపురూపమైంది. విమర్శకులు ఆ గ్రంధాన్ని తిరస్కరించలేకపోయారు. అకడమిక్ రంగంలో ఆధిపత్య వర్గాలను ధిక్కరించి మీరు ఆ పరిశోధన చేశారు. అసలు ఆ రచన చేయాలని ఎందుకనిపించింది?

- పీడింపబడేవాడు నాకు తల్లి తండ్రి దైవం సోదరుడు బిడ్డ. శుభమూర్తి నాకు గురువు. నా గురువు బట్రాజుగా పిలవబడి, పీడింపబడి అవమానింపబడి, తృణీకరింపబడ్డాడు. సాహిత్య గురువు సాంఘికంగా సోదరుడు. ఆ మహాకవిని వసుచరిత్రను భక్తితో చదివాను. తెలుగు సాహిత్యంలో అది మహోత్కృష్ట ప్రబంధం. మహా కావ్యం. గొప్ప సాహిత్య సృష్టి. అంత గొప్ప రచన అవతరించటానికి అది పీడన నుంచి పుట్టటం శూద్రుడి గుండె నుంచి ప్రవహించటం కారణమని నాకు అనిపించింది. నేను దళితుణ్ణి పీడితుణ్ణి కావటాన శుభమూర్తి దుఃఖం నాకు వినిపించింది. ఆయన కన్నీటి తడి నా గుండెను తాకింది.
వసుచరిత్ర స్రష్ట పేరు శుభామూర్తి భట్టుమూర్తి అని కులం పేరుతో రామరాజభూషణుడని చేరదీసిన రాజు పేరుదో పిలిచారు. నా పేరు శుభమూర్తి అని ఆయన కంఠోక్తిగా చెప్పుకొన్నా ఇప్పటికీ ఎవరూ అలా పిలవటం లేదు, తలవటం లేదు. ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని పండితులు ఒక దృష్టి నుంచే చూస్తున్నారు. ఇంకో దృష్టి నుంచి చూడవచ్చునని నా అభిప్రాయం. అదే వసుచరిత్ర వైశిష్ట్యం.

మీ 'ఆది ఆంధ్రుడు' కావ్యానికి రాసిన ముందుమాటలో అమరావతీ స్తూపానికి పూర్ణకళశం బహుమతిగా ఇచ్చిన ఒక మాదిగ గురించి వివరంగా తెలిపారు. మీరు సమాజాన్ని, కావ్యవస్తువునీ ఒక చారిత్రక దృక్పథం నుంచి చూస్తుంటారు. ముఖ్యంగా ఈ దేశాన్ని నిర్మించిన ఈ దళితుల చరిత్రను, ఆర్యుల దురాక్రమణను ప్రస్తావిస్తూ వుంటారు. ఇది మీ మెథడాలజీ కదా! ఈ చారిత్రక దృక్పథం మీకెలా ఏర్పడింది.
- నేను సాహిత్యాన్ని సామాజిక నేపథ్యం నుంచి చూస్తాను. రాస్తాను. సంఘాన్ని సాహిత్యంలో ప్రతిబింబింపచేయాలని ఇష్టపడతాను. సాహిత్యం సంఘానికి దశ దిశ నిర్దేశం చేయాలని ఆలోచిస్తాను. ఆలోచన కార్యరూపం దాల్చటానికి, చర్యోన్ముఖం కావటానికి ఇష్టపడతాను. ఈ ఉన్నతి; స్వేచ్ఛ, స్వాతంత్య్రం సమానత్వం అన్న ప్రజాస్వామిక విలువలతో కలిసి ఉండాలని వాంఛిస్తాను; ఈ వాంఛ పరిపూర్ణమయితే రేపటి సమాజపు అస్తిత్వం అవగతమవుతుంది. ఇది భవిష్యద్దృష్టి. ఈ సమాజం వర్తమానంలో ఇలా ఉందంటే ఎటువంటి గతాన్ని వారసత్వంగా ఇవ్వగలిగిందో గుర్తిస్తాము. అటువంటి గతాన్ని వెదుకుతూ పోవటం నాకు అనివార్యం. అట్లాంటి అన్వేషణలో కనిపించినవాడు భుజంగరాయుడు. వాసిరెడ్డి వెంకటాద్రినాయుడి చేత అంటరానితనం నిర్మూలన శాసనం వేయించిన కార్యదక్షుడు. దళితుడు. దళితుల ప్రాచీనతా శైవభం నాకు ఆరాధ్యం. ఎందుకు స్మశానాలు తవ్వుకోవటమంటే ఆ ఎముకలు చెప్పే ఔన్నత్యం తెలుసుకోవటానికి. తెలుసుకొని ఏం చేస్తాను? గుండెల నిండా బలంగా గాలి పీల్చుకొని, ఛాతీ ఎగదట్టి నిర్భయంగా, ఆత్మగౌరవంతో, తలెత్తుకు తిరిగే దళితుల్ని చూస్తాను.

మీ మరో గొప్ప కావ్యం 'కన్నీటి గొంతు'. అందులో శూర్పణఖ హృదయాన్ని ఆవిష్కరించారు. రామాయణం పట్ల మీ విమర్శనాత్మక పరిశీలన చాలా ఆసక్తిగా వుంది. రామున్ని ప్రతినాయకుడిగా చేస్తూ, రావణున్ని ధీరోదాత్త నాయకునిగా స్థాపించారు. కారణమేంటి?
- ధన్యవాదాలు. ఇంతమంది స్త్రీవాదులు సీతకు, అహల్యకు, మంధరకు, కైకకు, శబరికి జరిగిన న్యాయాన్యాయాల గూర్చి ఆవేదనాత్మక రచనలు చేశారు కదా, శూర్పణఖను గూర్చి ఏమీ రాయరేం? ఆమెకు అన్యాయం జరగలేదా? ద్రావిడ చక్రవర్తి అయిన రావణుడిని దశకంఠుడని వికారుడుగా, క్రూరుడుగా, రాక్షసుడుగా చిత్రించడం ఏం సబబు? వాల్మీకి పుట్టలోంచి పుట్టలేదు. ఆర్యుల బుర్రల్లోంచి పుట్టాడు. రామాయణం ఆర్యులు దక్షిణా పథానికి వ్యాపించటానికి పన్నిన రాజకీయ వ్యూహంలో భాగం. మీరు రామాయణాన్ని ప్రచార గ్రంథంగా, ఆర్యులు ద్రావిడుల్ని జయించే యుద్ధ వ్యూహంలో భాగంగా చూస్తే చాలా జీవన సత్యాలు కనిపిస్తాయి.

మీ మునివాహనుడు నాటకంలో తాత్వికత, తర్కం, కళా సౌందర్యం తొణికిసలాడే ఎన్నో సంభాషణలు రాశారు. అంత సోషల్లీ, ఫిలాసాఫికల్లీ, పొలిటికల్లీ సీరియస్ నాటకం రాయాలని ఎందుకనిపించింది? తిరుప్పాణ్ పాత్రను అలా చిత్రించడానికి కారణం?
- మునివాహనుడు చారిత్రక పాత్ర. పాణ్ కులస్థుడు. నాటి దళితుడు. దేవాలయ ప్రవేశం తిరస్కరింపబడ్డవాడు. పన్నెండుమంది ఆళ్వారుల్లో ప్రసిద్ధుడు. పది పాశురాలు పది పరిశోధన గ్రంథాల పెట్టు. తిరుప్పాణ్ ఆళ్వారు అని పిలువబడే దళితుడు మునివాహనుడు అయ్యాడు. అది అద్భుత కథా సందర్భం. దీన్ని గూర్చి వ్యాసం రాశాను. తృప్తి లేదు. నాటకం రాయదగ్గ అంశం అనిపించి రాశాను.
ఊరబావి, తలలేనోడు, కాకి వంటి అద్భుతమైన కథలు రాశా రు. ఎన్నో కథాసంపుటాలు వెలువరించారు. ఏ ఒక్క కథకూ మరో కథతో పోలిక వుండదు. అంత వైవిధ్యాన్ని చూపడం ఎలా సాధ్యం?
- సంఘం, మహారాజా సంఘం. సంఘంలో ఇంత వైవిధ్యమంటే, సంఘాన్ని ఆరాధించే రచయితకు అనంతమైన వైవిధ్యం లభిస్తుంది. గీతకు దిగువనున్న అందరిని గురించీ రాయాలనుకున్నాను. పాత్రలనేకం. వస్తువులనేకం. ఇతివృత్తాలనేకం. సంఘ జీవన వైవిధ్యమే సాహిత్య జీవన వైవిధ్యం.

రాయలసీమ జీవితం మీ సాహిత్యాన్ని ఎలా ప్రభావితం చేసింది?
- ఆంధ్రాచార్యుడికి, అనంతపురంలోనో, తిరుపతిలోనో విద్యార్థులతో జీవితం గడిపే రచయితకు, రాయలసీమ జీవితం అర్థం కావ టం అంత తొందరగా సాధ్యం కాదు. మాండలికం తెలిస్తే చాలనుకొంటారు చాలామంది. అది నిజం కాదు. ఒక ప్రాంత జీవితానికో జీవశక్తి ఉంటుంది. అది అర్థం కావటం వలస రచయితకు అంత సులభం కాదు. నాకు 30 ఏళ్లు పట్టింది. రాయలసీమ జీవితం ఎంత సుకుమారమో, సౌందర్య సమన్వితమో, ప్రశాంతమో; వెలుపల ఉన్న వారికి ఇక్కడి మనుషుల వ్యక్తిత్వ సౌజన్యం, సౌకుమార్యం, మంచితనం, ఓర్పు తెలియవు. సీమ జీవ లక్షణం తెలిశాకే నేను కథలు, నవలలు, నాటకాలు, కవితలు రాశాను. ఒకప్పుడు నాలోంచి గుంటూరును విడదీయటం కష్టంగా ఉండేది. ఇప్పుడు నాలోంచి అనంతపురాన్ని తొలగించటం అసాధ్యం.
జానపద సాహిత్య విమర్శ అనే ప్రత్యేకమైన ప్రక్రియను మీరే మొట్టమొదటగా ప్రతిపాదించారు. ప్రపంచంలో ఎక్కడా అలాంటి ప్రయత్నం జరిగినట్టు లేదు. జానపద సాహిత్య విమర్శకు శాస్త్రప్రతిపత్తి చేకూరుతుందా?
- మీరన్నది నిజమే! 'జానపదుల సాహిత్య విమర్శ' బలమైన ప్రతిపాదన. ప్రపంచంలో ఎక్కడా జానపదుల విమర్శ ఉందని పరిశోధకులు గుర్తించలేదు. నా పరిశోధన గ్రంథాన్ని గొప్ప గ్రంంథం అంటున్నారు. తర్కించలేదు. నిగ్గు తేల్చలేదు.
విస్కాన్‌సిన్‌లో ఇది గొప్ప గ్రంథం. ఇంతకుముందు ఇటువంటి దృక్పథం లేదు. ఇది మొదటి గ్రంథం. తెలుగు జానపదుల్ని సజీవంగా చూపిన పరిశోధన అని నిగ్గు తేలిస్తే ఉస్మానియాలో గుర్తింపు వస్తుంది. ఇల విశాలం. కాలం అనంతం. 'జానపదుల సాహిత్య విమర్శ' ఆద్య గ్రంథం. అది అలా శాశ్వతం.

కంచికచర్ల కోటేశు హత్య మీద మీరొక నాటిక రాశారు. అందులో ఇంకా ఎన్నో హత్యాకాండలు జరుగనున్నాయనే సంకేతాన్నిచ్చారు. ఆ తర్వాత కారంచేడు, చుండూరు జరిగాయి. అలా జరుగుతాయని ఎలా అంచనాకు రాగలిగారు?
- కోటేశు వంటి హత్యలు జరుగుతాయని భయపడ్డాను. భయపడ్డంత జరిగింది. కారంచేడు నుంచి పాతిక చోట్ల అంతే జరిగింది. ఇది ఇంతటితో ఆగదు. ఇంకా సాగుతుంది. ఇంకా పాశవిక దహనకాండ జరుగుతుంది. జాగ్రత్త పడకపోతే ఊళ్లు పేలిపోతాయి. ఎవరి ఊళ్ళు? ఊహించండి! ఆలోచించండి.

లౌకిక, ప్రజాస్వామ్య విలువలను సాహిత్యం కాపాడగలదా?
- కాపాడగలదు. ఆ విలువలతో సాహిత్యం సృష్టి కావటమే అవస రం. సాహిత్యం ప్రజాస్వామ్య విలువలను ప్రతిష్ఠించాలి. ఆ విలువలు ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తాయి.సాహిత్యమే ప్రజల్ని ఆధునీకరించిం ది. సమాజాలను నూత్నీకరించింది. మనిషిని మహోన్నతుణ్ణి చేసింది. చైతన్యవంతులైన ప్రజలు పరస్పర అవగాహనతో సహజీవనం సాగించటానికి సాహిత్యం నిశ్చయమైన, అనివార్యమైన అవసరం.
దళితుడికి దూరంగా ఉండే ఆంధ్రాచార్యత్వం చేపట్టిన మీరు గ్రహించేదేమిటి?
- తెలుగు చదువు బ్రాహ్మణుల విద్య మాత్రమే అనే దశ నుంచి అది మానవ సమూహాల గుత్త సొత్తు అనే దిశకు మారటం నా జీవిత కాలంలోనే చూశాను.
సాహిత్యంలోని ప్రభావిత వ్యవస్థలను ప్రజాస్వామీకరించాలని విమర్శకులంటున్నారు..
- ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థలు ప్రజాస్వామ్యీకరణం చెందాలి. దానికి అపవాదం లేదు. సాహిత్యం మినహాయింపు కాదు.
ఇంటర్వ్యూ: డా.జిలుకర శ్రీనివాస్, స్కైబాబ
-  Andhra Jyothi Telugu News Paper Dated: 3/2/2014

పెట్టుబడికి పుట్టిన సరికొత్త శిశువు! హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్

పెట్టుబడికి పుట్టిన సరికొత్త శిశువు! హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్
సాహితీ సజన చేసేవారికి, పాఠకులకు మధ్య సంబంధాలు పెంచుతూ సాహిత్యానికి ప్రాచుర్యం కల్పిస్తామని ప్రకటించిన హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ 2014 పేరుకు తగ్గట్లుగానే వేడుకగా జరిగింది. విదేశీ ప్రతినిధులు, భారతీయ భాషలకు చెందిన రచయితలు, పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులు, కార్పోరేట్ సంస్థల నిర్వాహకులు, కళాకారులు, ఎన్‌జీవోలు, ప్రభుత్వాధికారులు పాల్గొన్న ఈ సాహితీ సభలను తెలుగు నేలపై జరిగే సంప్రదాయ సాహితీ సభలకు భిన్నంగా నిర్వహించారు. ఆహ్వానము, ఆతిథ్యము, నేపథ్యము భిన్నంగా ఉన్న ఈ సాహితీ సభ ల వెనకున్నవాళ్లు, ముందుండి నిర్వహించినవాళ్లు అనేక కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నారు. ఈ సాహితీ సభలు జరుగకముందే వీటిపై కొందరికి అభిమా నం, మరికొందరికి అనుమానాలు ఉన్నాయి. ఎవరికి ఎన్ని అనుమానాలున్నా మాది కళా వేదిక.

సజనతో పండుగచేసుకుంటున్నాం.సాహిత్యాన్ని సేద్యం చేసేవారు, సాహిత్యాన్ని అభిమానించేవాళ్లు మాతో కలవొచ్చన్న హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ డైరెక్టర్ ఆహ్వానాన్ని మన్నించిన స్థానిక రచయితలు చాలా తక్కు వ. నిర్వాహకులు వ్యక్తిగతంగా ఆహ్వానించిన స్థానిక రచయితలు ఇంకా తక్కువ. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న సాహితీ సభల్లో ప్రాంతేతరులు ఎక్కువగా ఉండడం స్థానిక రచయితలు, కవులకు ఆశ్చ ర్యం కలిగించింది. భారతీయ సాంస్కతిక రాజధానిగా ప్రసిద్ధమైన కలకత్తా నగరం తర్వాత సాహితీ రంగంలో ప్రగతిశీలమైన భావాలకు పదునెక్కించే రచయితలు, కవులు ఉన్న నగరం హైదరాబాద్. రాజకీయ, ఆర్థిక, సామాజిక విషయాల్లో భారతీయ సమాజం కంటే ముందుండే హైదరాబాద్ నగర మేధావులు, కవులు, కళాకారులు ఈ సాహితీ సభ ల్లో మచ్చుకు కొందరు మాత్రమే ఉండడం మేధావుల మెదళ్లనే కాదు సామాన్యుల మెదళ్లనూ తొలుస్తోంది.

హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ డిగ్గీ ప్యాలస్‌లో జరిగే జైపూర్ లిటరరీ ఫెస్ట్‌కున్నంత ఆదరణ లేకపోయినా ఆ స్థాయిలో నిర్వహించడమే తమ భవిష్యత్ కర్త వ్యమని ప్రకటిస్తూ హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ ముగిసింది. జైపూర్ లిటరరీ ఫెస్ట్‌లో తొలి ఏడాది 50 మంది మాత్రమే పాల్గొన్నారు. నేడు 50 వేల మంది పాల్గొంటున్నారు. దానితో పోల్చితే హైదరాబాద్ ఫెస్ట్‌కు ఆదరణ బాగానే ఉంది. నాలుగో ఏడాదే 5 వేల మంది పాల్గొన్నారని హైదరాబాద్ లిటరరీ ట్రస్ట్ తన భవిష్యత్ వ్యూహాన్ని విప్పి చెప్పింది. సాహితీ అభిమానులయిన ట్రస్ట్ నిర్వాహకుల గొంతులోంచి వినిపించే మాటల్లో వ్యూహాలే కానీ విలువల జాడ ఇసుమంతయినా కనిపించట్లేదు. ఎవరెన్ని ప్రశ్నలు సంధించినా కళతో పండుగ చేసుకుందామనే సమాధానం! కుచ్చి కుచ్చి ప్రశ్నిస్తే ...మాకు ఏ జెండా లేదు, ఎజెండా లేదు. సాహిత్యానికి కూడా వేడుక జరపవచ్చని సమాజానికి తెలియజేస్తున్నాం. అం తే! అంటున్నారు నిర్వాహకులు. కానీ ఈ మాటలు నమ్మదగినవేనా? ఏ పరమార్థమూ లేకుండా కార్పోరేట్ సంస్థలు సాహితీ సభలు వెనకుండి నిర్వహిస్తా యా? కార్పొరేట్ శక్తులు ఆర్థిక పోషకులుగా ఉండి నిర్వహించిన హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ పెట్టుబడికి పుట్టిన సరికొత్త శిశువు!

హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో దళిత సాహిత్యంపై నిర్వహించిన కార్యశాలలో దళిత రచయిత్రి గోగు శ్యామల, జె. శ్రీనివాస్, గోరటి వెంకన్న తదితరులు ప్రసంగించారు. దళిత సాహిత్యంతో బ్రాహ్మణాధిక్య సమాజాన్ని ప్రశ్నిస్తున్న ఈ కవులు, రచయితలు ప్రాచీన సాహిత్యంలోని పద్యాలలో దళిత, బహుజనుల్ని అవమానించే పద్యాలున్నాయని ప్రస్తావించారు. ప్రపంచీకరణతో ఆధునిక సమాజంలోనూ అంటరానితనం అమలవుతోంది, ఎక్కువవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రచయితలు చెప్పినట్లుగా ప్రాచీన కాలంలోని కవులు బ్రాహ్మణులు. బ్రాహ్మణుల్ని పోషించిన రాజులు కూడా అగ్రకులాల వారే. రాజ్యాన్ని ప్రశ్నించకుం డా, రాజుల్ని కీర్తించే కవులు భూస్వామ్య శక్తుల కింద నలిగే ప్రజల్ని కించ పరిచారు.

భూస్వామ్య అణిచివేతను కొనసాగించేందుకు భారతీయ సమాజంలో అంటరానితనానికి, అగ్రకులాల ఆధిపత్యానికి ప్రాచీన సాహిత్యం మద్దతు పలికింది. రాజ్యం మారినప్పుడు కొత్త కవులకు పోషకులు లభిస్తారు. పాలకుల సంస్కతి, సంప్రదాయాలను రాజ్యం ఆదరిస్తుంది. పాలితుల సంస్కతి, సంప్రదాయాలను పాలకులు విస్మరిస్తారు. ప్రపంచంలోని అన్ని రాజ్యాలలోనూ ఆధిపత్య శక్తుల సంస్కతి వర్ధిల్లింది ఈ విధంగానే. ప్రపంచీకరణ నేపథ్యంలో అంటరానితనం పెరుగుతున్నమాట నిజమే. పెరుగుతున్న అంటరానితనానికి, అణిచివేతకు పోషకులు ఈ రాజ్యమే. వాటి ఫలితంగా ప్రయోజనాలు పొందేది అగ్రకుల భూస్వామ్య శక్తులు. వారికి మద్దతుగా నిలిచే పెట్టుబడిదారులు. అభివద్ధి నిరోధక భావజాలానికి అండగా నిలిచే ఈ కవల సోదరుల ఆధునిక ఆస్థానం హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్. రాజుల మెప్పు కోసం ఆనాటి కవులు పీడితుల పక్షం నిలువలేదు. ఈ కార్పొరేట్ సాహితీ సభ రాజ్యం మెప్పును కాదనుకుని ప్రజల పక్షం నిలుస్తుందా?

ప్రజలందరికీ సాహిత్యాన్ని చేరువచేస్తామంటున్న ఈ లిటరరీ ఫెస్ట్ ఏ సాహిత్యాన్ని చేరువ చేస్తుంది? ఎవరి కోసం చేరువచేస్తుంది? ఏ విలువల కోసం చేస్తుంది? ఈ అవసరం ఈనాడే ఎందుకొచ్చింది? జాస్మిన్ విప్లవం ప్రజాస్వామిక ఆకాంక్షగా ముందుకొస్తే దానిని తమ స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా అమెరికా మలచుకుంది . సామ్రాజ్యవాదాని కి ప్రపంచమంతా తలవంచినా ఎదిరిస్తూ నిలుస్తున్న ముస్లిం సమాజంలోని ప్రగతిశీల శక్తుల కషిని పెట్టుబడిదారీ శక్తులు ఎటు మళ్లించాయో మనందరికీ తెలుసు. ప్రజా ఉద్యమాల వెల్లువతో అడుగడుగునా ఆటంకాలెదుర్కొంటున్న విదేశీ సామ్రాజ్యవాదానికి, భారతీయ బహుళజాతి కంపెనీలకు ఇప్పుడు సరికొత్త మేధావి వర్గం అవసరమవుతోంది. పోలేపల్లి సెజ్‌ను ప్రశ్నిస్తూ కలాలు పేదల పక్షాన గళాలెత్తాయి. భూమిపుండు ఓపెన్ కాస్ట్ గనులపై పాట కట్టాయి.

ప్రజా ఉద్యమాలకు మేధోపరమైన కషిని అందిస్తు న్న విప్లవ రచయితలు, అభ్యుదయ కవులు, బ్రాహ్మణాధిపత్యాన్ని తూర్పారబడుతున్న దళిత సాహి త్యం, విస్మరించిన ప్రజల అస్తిత్వం కోసం నినదిస్తు న్న ముస్లిం సాహితీ వేదికలు, ఆదివాసీ రచయితలకు హైదరాబాద్ ఆలంబన. హైదారాబాద్‌కు ఈ ఒరవడి ఈనాటిది కాదు. దశాబ్దాల వారసత్వం ఉం ది. పౌరహక్కుల కోసం నినదించిన జయసూర్య, ప్రజా పీడకుడిని దునుమాడిన మగ్ధుం, అరాచకాన్ని ఎదురించి అమరుడైన షోయబుల్లాఖాన్, దళిత, బహుజనుల అభ్యుదయానికి నాంది పలికిన భాగ్యరెడ్డి వర్మ అందించిన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న తెలంగాణ హదయం హైదరాబాద్. పెట్టుబడి కాలు పెట్టిన చోటల్లా వెల్లువెత్తుతున్న ఉద్యమాలకు తోడుగా నిలుస్తున్న సాహితీ సంఘాలు, సాహితీ వేత్తలంటే పెట్టుబడికి కన్నుకుడుతోంది.

ప్రజల పక్షం వహించే ప్రజా సాహిత్యం ఉన్నట్లే ఇప్పుడు రాజ్యం పక్షం వహించే ఓ సాహిత్యం కావాలి. ప్రగతిశీల భావాలున్న రచయితల్ని ఆహ్వానించి ఆదర్శవంతమైన అంశాలపై చర్చలు నిర్వహించినా ఈ సాహితీ సభ అంతిమ లక్ష్యం అదే. ఇది ఆరోపణేమీ కాదు. ఈ సాహితీ సభలకు పోషకులుగా ఉన్న ఆంగ్ల ప్రచురణ కర్తలు అన్నమాటే. హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ లో ఓ ఆంగ్లపుస్తకాల ప్రచురణ సంస్థ నిర్వాహకురాలు మార్కెట్ ఉన్న పుస్తకాలనే మేం ప్రచురిస్తాం, పుస్తక వ్యాపారానికి వాదాల కంటే పాఠకాదరణ ముఖ్యం అని చెప్పుకొచ్చింది. ఓరియంటల్ బ్లాక్ శ్వాన్, ఆక్స్‌ఫర్డ్ ప్రెస్, రోలీ బుక్స్, సాహిత్య్ వంటి సంస్థలు ఈ లిటరరీ ఫెస్ట్ వేదికగా వేలాది మంది యువ పాఠకుల్ని కలుసుకున్నాయి.

నిర్వాహకులు తరలించిన పాఠకులంతా యువతే కావడం ఓ విశే షం. కారణం ఏమై ఉంటుంది? పాఠశాలల్లో తెలు గు మాధ్యమం పోయి ఆంగ్ల మాధ్యమం పెరగడమే. నగరంలోనే కాదు రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య దశాబ్ద కాలంలో గణనీయంగా పెరగింది. వీరు ఇంత కాలం తెలుగు లేదా ఇతర స్థానిక భాషల సాహిత్యం చదివేవారు. వారిని ఆంగ్ల సాహిత్యంవైపుకు మళ్లించుకునేందుకు ఈ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఆ ప్రయత్నానికి హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ దోహదపడుతోంది. ఈ ప్రచురణ సంస్థల పాలసీ పెట్టుబడిదారులకు కూడా అనుకూలమైనదే కావడంతో జతకట్టడానికి ఏ విధమైన సిద్ధాంత అవరాధాలూ ఏర్పడలేదు.

కొస మెరుపు ఏమంటే.. హైదరాబాద్ నగరాన్ని ఆధునిక అభివద్ధి నమూనాతో ధ్వంసం చేస్తున్న అధికారులు, బాధ్యతాయుతమైన హోదాల్లో ఉండి నగరంలోని ప్రాచీనమైన, చారిత్రకప్రాధాన్యత ఉన్న కట్టడాలను ధ్వంసం చేస్తున్న వాళ్లు ఈ లిటరరీ ఫెస్ట్ సందర్భంగా నిర్వహించిన మై సిటీ - మై డ్రీమ్ పేరుతో ఉపన్యసించడం..!
-నాగవర్ధన్ రాయల
8096677456, Namasete Telangana Telugu News Paper Dated: 3/2/2014

ఆకలి, ఆవేదనే దళిత సాహిత్యం, తమిళ రచయిత్రి బామతో ఇంటర్వ్యూ....


గతంలో సమాజంలో కొన్ని వర్గాలకే సాహిత్యం పరిమితమై ఉండేది. కాల, మాన పరిస్ధితులలో ప్రజల భాషను, ప్రజల సంస్కతిని స్వంతం చేసుకుని వచ్చిన దళిత సాహిత్యం సమాజంలోని అణగారిన వర్గాలలోకి సాహిత్యాన్ని తీసుకెళ్లింది. మొదట్లో దళిత కవుల రచనలు, కవితలు ప్రచురించడానికి ప్రచురణకర్తలు ముందుకు వచ్చేవారు కాదు. ప్రధాన స్రవంతి రచయితలు, కవుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యేది. దళిత సాహిత్యంలో ఉపయోగించిన భాష, సంస్కతిని ప్రజలు ఆదరించారు. ప్రజల నుంచి లభించిన ఆదరణతో దళిత సాహిత్యానికి క్రమంగా ఆదరణ పెరుగుతూ వస్తున్నది. దళిత రచయితల పుస్తకాలను ప్రచురించడానికి ప్రచురణకర్తలు ముందుకు వస్తున్నారని అంటున్నారు తమిళనాడుకు చెందిన దళిత రచయిత్రి బామ. అవార్డులు, పురస్కారాల కన్నా ప్రజల నుంచి గుర్తింపు పొందడం ప్రధానం అంటున్నారు బామ. నగరంలో ఇటీవల జరిగిన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి నగరానికి వచ్చిన తమిళ రచయిత్రి బామతో ఇంటర్వ్యూ....
BAMA-SIVAKAMIదళిత సాహిత్యానికి ఆదరణ ఎలా ఉంది..?
బామ: దేశవ్యాప్తంగా దళిత సాహిత్యానికి ఆదరణ పెరుగుతోంది. ఇదివరకు సామాన్యులకు అర్ధమయ్యే విధంగా సాహిత్యం ఉండేది కాదు. సాహిత్యం కొన్ని వర్గాలకే పరిమితమై ఉండేది. దళిత సాహిత్యం ఆ పరిధి చేరిపేసి ప్రజలకు సాహిత్యాన్ని చేరువచేసింది. ప్రజలకు అర్ధమయ్యే భాషలో, ప్రజల సంస్కతిని ప్రతిభింబించేలా వచ్చిన దళిత సాహిత్యాన్ని ప్రజలు ఆదరిస్తున్నా రు. దాన్నుంచి ప్రేరణ పొందుతున్నారు.

చదువురాని వారు రచనలు చేయగలరా..?
చదువుకు, సాహిత్యానికి సంబంధం లేదు. సాహి త్యం, కవిత్వం హదయంలోంచి పుడుతోంది. దళిత కవులలో చాలా మంది చదువుకోని వారు ఉన్నారు. డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు చేస్తేనే గొప్ప రచయితలు అవుతారనేది అపోహ మాత్రమే. చదువుకోని వాళ్లు, పాఠశాల విద్యకే పరిమితమైన వాళ్లలో కూడా గొప్ప రచయితలు, కవులున్నారు. సామాజిక, ఆర్ధిక కారణాల వల్ల దళితులలో చాలామంది కొన్ని శతాబ్దాల పాటు అక్షరాలకు దూరంగా ఉన్నారు. దళితులు ఎదుర్కొన్న కష్టాలు, సంఘర్షణలోంచి దళిత సాహిత్యం పుట్టింది. ప్రాంతీయ భాషలలో వచ్చిన దళిత సాహిత్యాన్ని ఇతర భాషల వాళ్లు అనువాదం చేయించుకుంటున్నారు. ఇంగ్లిష్ అనువాదాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తున్నది.

రచయితలకు ప్రభుత్వ ప్రోత్సాహం, గుర్తింపు ఎలా ఉంది..?
దళిత రచయితలకు, కవులకు, సాహిత్యానికి, గుర్తిం పు ఉన్నది. ప్రజల నుంచి ప్రోత్సాహం ఉంది. దళిత సాహిత్యం ప్రజలకు అర్ధమయ్యే భాషలో ప్రజల సంస్కతిని, ప్రజల కష్టాలను ప్రతిబింబిస్తున్నది.

సమాజంపై దళిత సాహిత్య ప్రభావం ఎలా ఉంటున్న ది..?
సమాజాన్ని ప్రభావితం చేసే అంశాలలో సాహిత్యం కూడా ఒకటి. దళిత సాహిత్యం ప్రభావం కచ్చితంగా సమాజాన్ని ప్రభావితం చేస్తున్నది. సాహిత్యం సమాజంలో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తుంటుంది. గొప్ప గొప్ప రచయితలు ప్రజలకు అర్థమయ్యే భాషలో సమకాలీన అంశాలు, ప్రజల కష్టాలు ప్రతిబింబించేలా రచనలు చేశారు. చేస్తున్నారు.

ఎన్ని భాషలలో మీరు రచనలు చేశారు..?
నేను తమిళ భాషలోనే రచనలు చేసినా ఆ పుస్తకాలు తెలుగు, హిందీ,కన్నడం, మళయాలం, ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషలలోకి అనువాదమయ్యాయి. నేను రాసిన కరుక్కు నవల, సంగతి, వన్మం, కుసుమ్‌ముక్కరం పుస్తకాలు భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషలలోకి అనువదించారు. అన్ని భాషలకు చెందిన సాహి తీ ప్రియుల నుంచి నా రచనలకు మంచి ఆదరణ లభిస్తున్నది.

మీరిచ్చే సందేశం...
సమాజంలో ప్రతి ఒక్కరు చదువుకోవాలి. విద్య ద్వారా సమాజాన్ని అర్ధం చేసుకుని సమాజాన్ని మార్చే అవకాశం ఉంటుంది. అణగారిన వర్గాలకు విద్యనే ఆయుధం. అంబేద్కర్ చెప్పినట్లు చదువుకుని ఐకమత్యంతో పోరాటం చేసినప్పుడే సమాజంలోని అసమానతలను రూపుమాపగలుగుతాం.

Namasete Telangana Telugu News Paper Dated : 3/2/2014 

Friday, January 31, 2014

నీతి నిలబడితేనే మనం నిలబడతాం - కాకి మాధవరావు (IAS Rtd)

 

వ్యవస్థలో మార్పు కోసం శ్రమించే వారిని వ్యక్తులుగా విడదీసి అశక్తులుగా నిలబెట్టాలని చూస్తుంది సమాజంలోని ఒక వర్గం. అదే పనిగా కుతంత్రాలు చేస్తూ, కుంగదీయాలని కూడా చూస్తుంది. వాటిని ఎదిరించే దిశగా అడుగులు వేయలేకపోతే ఎవరైనా నిలువునా కూలిపోవాల్సి వస్తుంది. ఎన్నో అవరోధాల్ని అడుగడుగునా ఎదుర్కొంటూ నీతికీ నిబద్ధతకూ మారుపేరుగా నిలిచిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు కాకి మాధవరావు. మూడున్నర దశాబ్దాల ఐఏఎస్ అధికారిగా, ఏడు దశాబ్దాల జీవన యాత్రికుడిగా కాకి మాధవరావుకు ఎదురైన కొన్ని సంఘటనలే ఈ వారం 'అనుభవం'
కృష్ణాజిల్లాలోని పెదమద్దాలి మా ఊరు. నేనేదైనా ఒక స్థితికి వచ్చానూ అంటే, అందుకు దోహదం చేసిన బలమైన సంఘటనలు కొన్ని నా బాల్యంలోనే జరిగాయి. మా నాన్న ఒక పాలేరు. చుట్టుపక్కల చాలా ఊళ్లల్లో ఆయనకు బాగా శ్రమించే, నిజాయితీ గల మంచి పాలేరుగా పేరుంది. ఆ రకంగా తనకు లభించిన గుర్తింపు వల్లో ఏమో గానీ, ఆయన నన్ను కూడా పాలేరునే చేద్దామనుకున్నారు. ఆ మాటే అమ్మతో అంటే, లేదు. వాడ్ని బళ్లో వేద్దామంది. "బళ్లో వేస్తే ఏం చేస్తాడు? గాడిదల్ని కాస్తాడా?'' అంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు నాన్న. అయినా, అమ్మ చదివించాల్సిందే అంది. ఎంత మాత్రం వీల్లేదంటూ నాన్న వెళ్లిపోయాడు. నాన్న ఆమోదం లేకుండానే అమ్మ నన్ను స్కూల్లో చేర్పించింది. పగలంతా పనికిపోయే నాన్నకు ఆ విషయం తెలియకుండానే ఉండిపోతుందని కూడా అనుకుంది. కానీ, కొద్ది రోజులకే ఆయనకు తెలిసిపోయింది. నేను చెప్పినా వినకుండా వాడ్ని స్కూల్లో చేరుస్తావా? అంటూ నాన్న ఆ రోజు అమ్మను గొడ్డును బాదినట్టు బాదాడు. అడ్డం వెళితే, మా అన్నయ్యనూ, నన్నూ కూడా తన్నాడు. అంత జరిగినా "ఎన్నాళ్లు కొడతాడో చూద్దాం మీరు మాత్రం చదువు మానేయొద్దు'' అంది. ఆ కారణంగా అమ్మను ఎన్ని సార్లు కొట్టాడో లెక్కలేదు. చివరికి విసుగు పుట్టి వదిలేశాడు. నా చదువు, మా అన్నయ్య చదువు మా నాన్న అయిష్టత మధ్యే కొనసాగింది. మాకు తెలిసి ఆయన తన జీవితంలో ఓటమి అంటూ ఎరగడు. కానీ, ఈ ఒక్క విషయంలో మాత్రం నాన్న ఓడిపోయాడు. చూసే ప్రపంచం చిన్నదైపోయినపుడు ఎంత వారికైనా ఓటమి తప్పదేమోనని నాకనిపిస్తుంది.
చేయని నేరానికి....
సుబ్బయ్యని మా నాన్నకు ఒక సోదరుడు ఉండేవాడు. చెరువులోని తామరాకుల్ని కోసి వాటిని పొట్లాలు కట్టుకునేందుకు మిఠాయి షాప్‌లకూ, మాంసం షాప్‌లకూ అమ్ముతూ బతికేవాడు. ఒక రోజు సాయంత్రం ఏడుగంటల ప్రాంతంలో నేను చెరువు పక్కనుంచి న డుచుకుంటూ ఊళ్లోకి వస్తున్నాను. అప్పుడు నాకు 8 ఏళ్లు ఉంటాయేమో. అప్పటికే చీకటి పడింది. రోజూ లాగే ఆయన తామరాకుల్ని ఎండబె ట్టి ఆ తర్వాత వాటిని ఒకచోటికి చేరుస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో పెద్ద గాలి దుమారం వచ్చింది. ఆ తాకిడికి ఆకులన్నీ ఎగిరిపోతున్నాయి. అది గమనించిన ఆయన "ఓరి దేవుడా నా పొట్టకొట్టావురోయ్, నాకు తిండి లేకుండా చేశావు. ఈ ఆకులన్నీ పోతే నేను ఏమమ్ముకుంటాను? ఏం తింటాను.?'' అంటూ పరుగులు తీస్తూ ఆ ఆకుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏదో కొంత సాయం చేద్దామని నాకు సాధ్యమైనన్ని ఆకుల్ని ఒక చోట చేర్చి, ఆ తర్వాత వచ్చేశాను. ఇంటికి వచ్చేసరికి బాగా ఆలస్యమయింది. మా నాన్న గుడ్లురుముతూ నా మీదికి వచ్చాడు. ఎక్కడికి వెళ్లావు.? ఎందుకు ఆలస్యమయింది? అనేమీ అడక్కుండా, నన్ను చితక బాదేశాడు. ఎందుకు కొడుతున్నాడో నాకు అర్థం కాలేదు. నే ను మంచి పనే కదా చేశాను, పైగా ఆయన సోదరుడికే కదా సాయం చేశాననే మాట నా మనసులో ఉంది. అయినా, ఆలస్యానికి ఇదీ కారణమని చెప్పాలని కూడా నాకనిపించలేదు. నేను తప్పు చేయకపోయినా కొడుతున్నాడనే బాధ నన్ను వేధిస్తోంది. తీవ్రమైన ఒక అంతర్వేదనతో ఆ రాత్రంతా గడిచిపోయింది. దీని మీద నా నిరసనను, నా కోపాన్ని ఆయనకు ఎలాగైనా తెలియచేయాలనుకున్నాను.

మా నాన్న ఎప్పుడు క్షవ రం చేయించినా మంగలిని జుత్తు మరీ చిన్నదిగా చేయమని చెప్పేవాడు. నేనే వద్దూ వద్దూ అంటూ ఉండేవాణ్ని. అలాంటి నేను మంగలి వద్దకు వెళ్లి గుండు చేయించుకుని వచ్చాను. అంతే కాదు అమ్మతోనూ, నాన్నతోనూ మాట్లాడటం మానేశాను. ఆ మౌనంలో నాకు ఏవేవో ఆలోచనలు వచ్చేవి. త ప్పు చేయకుండానే ఇలా దండించారే..! నిజంగానే తప్పు చేస్తే ఏం కావాలి? ఒక వేళ నిజంగానే నేను త ప్పు చేసి ఉంటే అప్పుడు నా వద్ద సమాధానం ఉండదు. అందుకే జీవితంలో తప్పంటూ చేయకూడదనే ఒక నిర్ణయానికి వచ్చేశాను. స్నేహితులు, సరదా కబుర్లు, ఆట పాటల లాంటివన్నీ ఆ రోజునుంచి నా జీవితంలోంచి పూర్తిగా అదృశ్యమైపోయాయి. ఫలితంగా, నాలో క్రమంగా పెరుగుతూ వచ్చిన సీరియస్‌నెస్ నన్నొక పుస్తకాల పురుగును చేసింది. నాన్న చేతిలో నేను అన్యాయంగానే హింసకు గురైనా అది నాలో వేరే రకమైన కసిని పెంచింది. హింసను ఒక వైపునుంచే చూస్తే మనం కూలిపోవడం ఖాయం. అలా కాకుండా ఆవలి వైపు నుంచి చూస్తే అది మనల్ని నిలబెడుతుంది కూడాను అని నాకనిపిస్తుంది.
నక్సలైటుగా ముద్రవేసి....
నేను వరంగల్‌లో కలెక్టర్‌గా ఉన్న సమయంలో జనాన్ని తీవ్రమైన ఆందోళనకు గురిచేసే పరిణామాలు కొన్ని జరిగాయి. నక్సలైట్లు అన్న పేరుతో పోలీసులు కొంత మంది స్థానిక యువకుల్ని అడవుల్లోకి తీసుకెళ్లి కొద్ది రోజులు ఉంచేసేవారు. ఆ తర్వాత ఒక ఇన్స్‌పెక్టర్ వాళ్ల తలిదండ్రులను కలిసి, పోలీసులు ఇవ్వాళో రేపో మీ పిల్లాడ్ని కాల్చేస్తారు, మీరు ఇంత డబ్బు ఇస్తే పోలీసులకు చెప్పి విడిపిస్తాను అంటూ బేరం పెట్టేవాడు. మోహన్ రావు అనే సిపిఐ నాయకుడొకాయన నాకీ విషయం చెప్పాడు. వెంటనే ఈ విషయాన్ని నేను ఎస్.పి గారికి చెప్పాను. ఆయన అలాంటిదేమీ లేదని దాటవేశాడు. మళ్లీ ఒకరోజు అదే మోహన్ రావు ఫలానా అడవిలోని ఫలానా కొండ మీద 16 మంది యువకుల్ని బంధించి ఉంచారంటూ సమాచారాన్ని చేరవేశాడు. అప్పుడింక తట్టుకోలేకపోయాను. సబ్-కలెక్టర్‌గా ఉన్న జి. పి. రావును, అసిస్టెంట్-కలెక్టర్‌గా ట్రెయినింగ్‌లో ఉన్న హరిని ఆ ప్రదేశానికి వెళ్లమని చెప్పాను. వీళ్లు అక్కడికి వెళ్లి చూస్తే 16 కాదు 22 మంది ఉన్నారు.

వాళ్లను వెంటనే విడిపించాను.
ఆ సంఘటనతో పోలీసులు నా మీద కన్నెర్ర చేశారు. వివిధ కారణాలతో అప్పటికే నా మీద ద్వేషంతో ఉన్న కొంత మంది ఎం.ఎల్.ఏలు, ఒక మంత్రి ఇదే అదనుగా 'కలెక్టరు నక్సలైటు' అంటూ నా మీద ఒక పిటిషన్ తయారు చేసి అప్పటి రాష్ట్రపతి వి.వి. గిరికి అందచేశారు. ఈ విషయం స్థానిక పత్రికల్లోనూ, వివిధ జాతీయ పత్రికల్లోనూ ప్రచురితమమయ్యింది. కాని ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో మాత్రం నా గురించి చాలా పాజిటివ్ వ్యాసం వచ్చింది. దాని శీర్షిక 'నక్సలైట్ ఇన్ ఐఏఎస్ క్లోత్స్..!' అని. అందులో "అన్యాయంగా తమ భూమిలోంచి తరిమివేయబడ్డ పేదవారికి ఆయన తిరిగి ఆ భూమిని ఇప్పించాడు. గీతకార్మికులకు కాకుండాపోతున్న తాటి, ఈత చెట్లను వారికి అందేలా చేశాడు. ప్రభుత్వం ఇచ్చే కరువు నివారణా నిధులను పేదవాళ్ల పొలాలు చదును చేయడానికి, బావులు తవ్వడానికి ఖర్చు చేశాడు. ఈ చర్యలన్నీ నక్సలిజంలో భాగమే అయితే ఆ కలెక్టరు నక్సలైటే' అంటూ రాశారు. ఈ వ్యాసం కూడా అప్పటి రాష్ట్రపతి వి. వి. గిరి దృష్టికి వెళ్లింది. ఆయన విచారణకు ఆదేశించారు.

ఐ.బి జాయింట్ డైరెక్టర్ కూడా నా వల్ల పోలీసులకు చాలా ఇబ్బందులు ఉంటాయని భావించి కొన్ని కుయుక్తులకు పాల్పడ్డారు. అందులో భాగంగా డి.ఎస్.పితో ఈ కలెక్టర్ మీద ఏదైనా ఒక నెగెటివ్ వాక్యం రాయండి. నేను అతన్ని తన ఉద్యోగ విధుల్లోంచి తొలగిస్తానన్నాడట. అయితే అలా రాయడానికి ఆ డి.ఎస్.పి మనస్సాక్షి ఒప్పుకోలేదు. అందుకే రాయలేదు. పైగా "అతని వల్ల కొంత మంది ఇబ్బంది పడుతున్న మాట నిజమే కానీ, అతనికి నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని చెప్పడం నిజం కాదు'' అంటూ రాశాడు. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నా, నేను అక్కడే కొనసాగడానికి అది దోహదం చేసింది. అయితే, ఐ.బి జాయింట్ డైరెక్టర్ తనతో అన్న మాటల్ని ఆయన తన మనసులోనే దాచుకున్నాడు. వెంటనే నాకు చెబితే, 'నానుంచి ఏమైనా ఆశించి అలా చెబుతున్నాడని నేననుకుంటానేమో అనుకుని ఆ విషయాన్ని నేను రిటైర్ అయ్యేదాకా అంటే 1998 దాకా నాకు చెప్పలేదు. ఆ రహస్యం మరో వ్యక్తికి కూడా తెలిస్తే మంచిదని నేనంటే కేంద్ర ప్రభుత్వంలో సెక్రెటరీగా చేసిన జి. పి. రావు ముందు ఆ నిజాన్ని బయటపెట్టాడు. విధినిర్వహణలో సమస్యలు ఎప్పుడూ తప్పవు. కానీ, అత్యున్నత హోదాలో ఉండే వారు సైతం వక్ర మార్గం పడితే సమాజానికి ఇంక మనుగడేముంటుంది? హోదాల్ని కూడా మనుషుల హృదయాలతోనే కొలవాలన్న సత్యం ఆ సంఘటన నాకు నేర్పింది.
ఔదార్యానికి హద్దులా?
నిజాయితీగా ఉండడమే కాదు. మన నీతిని అనుమానించే పరిస్థితి ఏర్పడకుండా చూసుకోవడం కూడా అవసరమనుకుంటాను. ఎన్. టి. రామారావు ప్రభుత్వం అవినీతిని అంతమొందిస్తాం అంటూ అధికారంలోకి వచ్చింది. అవినీతికి పాల్పడే వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తడం మొదలెట్టాయి. సరిగ్గా అదే సమయంలో మా అబ్బాయి పి.జి పూర్తి చేసుకుని సొంతంగా ఏదైనా పరిశ్రమ స్థాపించాలన్న అభిప్రాయానికి వచ్చాడు. అందుకు నేను అనుమతించలేదు. "నువ్విప్పుడు ఏ రుణంతో ప్రారంభించినా అది నేను అవినీతికి పాల్పడి సంపాదించిన డబ్బుతోనే పెట్టావని అనుకుంటారు. అందువల్ల నువ్వు సివిల్ సర్వీసెస్‌కు చదువుకోవడం మేలు'' అని చెప్పాను. వాడు ససేమిరా అన్నాడు. "ఒకవేళ నువ్వు అంతగా అనుకుంటే నేను రిటైర్ అయ్యేదాకా వేచి ఉండు అప్పుడు పెట్టుకో'' అన్నాను. "16 ఏళ్లు వేచి ఉండడం అంటే చాలా కాలం వృధా అవుతుంది కదా !'' అన్నాడు. "అయితే నా ఇంట్లోంచి బయటికి వెళ్లిపో, నాకూ నీకూ ఏ సంబంధం లేదనుకున్నాక ఇంక ఏమైనా చేసుకో'' అన్నాను. "అంత కఠోరంగా ఎందుకులే నాన్నా మీరు రిటైర్ అయ్యాకే ఆ పరిశ్రమేదో పెడతా'' అన్నాడు. అప్పటికి వాడికి 38 ఏళ్లు వచ్చాయి. అన్న మాట ప్రకారం 1998 దాకా ఖాళీగా ఉండి ఆ తర్వాతే మా గ్రామస్తుడైన సుజనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ వై.ఎస్ చౌద రి (ఎం.పి) గారి కంపెనీలోని ఒక యూనిట్ తీసుకుని దాని మేనేజింగ్ డైరెక్టర్‌గా పని ప్రారంభించాడు.

కానీ, ఆ పరిశ్రమ నష్టాలే మిగిల్చింది. పరిస్థితి గమనించిన చౌదరి గారు ఆ పరిశ్రమ తిరిగి తానే తీసుకుని ఆ నష్టాలన్నీ తన మీదే వేసుకున్నాడు. నైరాశ్యానికి గురవుతున్న మావాడిని అంతటితో వదిలేయకుండా, తన కంపెనీల్లోని ఒక యూనిట్‌కు మేనేజింగ్ డైరెక్టర్ ఉద్యోగం ఇచ్చి కొండంత అండగా నిలబడ్డాడు. వాస్తవానికి నేను రిటైర్ అయ్యేనాటికి నాకు సొంత ఇల్లే లేదు. అప్పటిదాకా ఉన్న అద్దె ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. నా కొడుకుకే కాదు, మా మొత్తం కుటుంబానికి ఆశ్రయంగా తన కంపెనీ హౌజ్‌ను మాకు ఇచ్చాడు. నేనున్న ఈ దశలో వై. ఎస్. చౌదరి లేని జీవితాన్ని ఊహించడం కూడా కష్టమే. జీవితమంతా ఒక కోణాన్నే చూస్తూ అందులో మనం ఎంత నిష్ణాతులమైనా కావచ్చు. కానీ, జీవితానికి మనుగడనిచ్చే మరో కోణం గురించి ఏమీ తెలియకపోతే ఎంత ప్రమాదమో ఈ పరిణామాలు నాకు తెలియచెప్పాయి. జీవితానికి విలువలు ఎంత ముఖ్యమో, ప్రాణానికి ప్రాణంగా, ఒక ఆలంబనగా నిలిచే స్నేహితులు కూడా అంతే ముఖ్యమని నా జీవితం నాకు నేర్పిన ఒక తాజా సత్యమిది.
'కలెక్టరు నక్సలైటు' అంటూ నా మీద ఒక పిటిషన్ తయారు చేసి అప్పటి రాష్ట్రపతి వి.వి. గిరికి అందచేశారు. ఈ విషయం స్థానిక పత్రికల్లోనూ, వివిధ జాతీయ పత్రికల్లోనూ ప్రచురితమమయ్యింది. కాని ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో మాత్రం నా గురించి చాలా పాజిటివ్ వ్యాసం వచ్చింది. దాని శీర్షిక 'నక్సలైట్ ఇన్ ఐఏఎస్ క్లోత్స్..!' అని.
- బమ్మెర
ఫోటోలు: జి. రాజు

Navya, Andhra Jyothi Telugu News Paper Dated : 31/1/2014 



Tuesday, January 28, 2014

విప్లవ సాహిత్యంలో వస్తురూప వైవిధ్యం By డాక్టర్ సి.కాశీం


నలభై రెండు
ఏళ్లుగా విరసం విప్లవ
రాజకీయాలను ప్రచారం చేయడానికి
పనిచేస్తూనే ఉన్నది. నిషేధాలకు, నిర్బంధాలకు
గురైనా సాహిత్య సజనను కొనసాగిస్తూనే
ఉన్నది. మూడు తరాల రచయితలతో
విరసం నవ నవోన్మేషంగా నడుస్తున్నదనే
వాస్తవాన్ని 24వ మహాసభలు
నిరూపించాయి.

నూరేళ్ల కాళోజీ యాదిలో జనవరి 11,12 తేదీల్లో విరసం 24వ మహాసభలు ఓరుగల్లులో విజయవంతంగా జరిగాయి. జీవితం, కవిత్వం, రాజకీయాలలో ప్రజాస్వామ్య దక్పథాన్ని ప్రదర్శించిన కాళోజీ ప్రతీ మూలమలుపులో ప్రజలవైపు, పోరాటాలవైపు నిలబడ్డాడు. పౌరహక్కులను అడిగిన గొంతులపై ఆయుధం ఎక్కుపెట్టి న దుర్మార్గాన్ని ఎండగడుతూనే కాళోజీ కన్నుమూశారు. ఆట, పాట, మాట అనధికారికంగా బంద్ అయిన ఓరుగల్లు నగరంలో విరసం 24వ మహాసభలు దిగ్విజయంగా జరుపుకున్నది. ప్రజల ప్రత్యామ్నాయ అభివద్ధి నమూనాను విధ్వంసం చేయడానికి పాలకులు బాసగూడలో ఆదివాసులపై జరిపిన దాడిని ప్రతిబింబిస్తూ విరసం కళాకారులు బాసగూడనాటకాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా కవులూ, కళాకారులు నిర్వహించిన ర్యాలీ ఓరుగల్లు నగరాన్ని ఉత్తేజపర్చింది. కిలోమీటర్ల మేర కాగడాలతో ప్రదర్శన జరిగింది. రోడ్లన్నీ పాటలతో పల్లవించాయి.
సాహిత్యం కోణంలో చూసినప్పుడు విప్లవ సాహిత్యం ఎన్ని రూపాలలో వికసించిందో ఈసభలు అద్దం పట్టాయి. కళ్లుండి చూడలేని కొందరు సాహిత్య విమర్శకులకు ఈ సభలలో వచ్చిన విప్లవ సాహిత్యమే సమాధానం చెబుతుంది. చెవులుండి వినలేని పండితులు పుస్తకావిష్కరణల సందర్భంగా విశ్లేషకులు చెప్పిన అభిప్రాయాలైనా వినాల్సింది. విప్లవ సాహిత్యంలో, విరసంలో మూడుతరాల కవులు, రచయితలు ఉన్నారు. ప్రతీ పది సంవత్సరాలకు సంస్థలోకి కొత్త నీరు వచ్చి చేరుతూనే ఉన్నది. బహుశా, ఇట్లాంటి సజీవ లక్షణం ఉన్న సంస్థలు మరోటి లేవంటే అతిశయోక్తి కాదేమో. కథ, కవిత్వం, నవల, నాటకం లాంటి ప్రక్రియలను చేపట్టి సాధికారికంగా నిర్వహిస్తున్నవాళ్లు విరసంలో ఉన్నారు. ఒక రచయితల సంఘం ప్రతీ ఏటా 30 పుస్తకాలను ఆవిష్కరించుకోగలుగుతుందంటే, అవి వాసిలో, రాశిలో తీసిపోని పుస్తకాలుగా మిగులుతున్నాయంటే ఆ ఘనత విరసం కే దక్కింది. ఈసారి మహాసభలలో కూడా విరసం సభ్యులు రాసిన 13 పుస్తకాలు వచ్చాయి. అందులో కవిత్వం 1, కథలు 3, నవలలు 2, సాహిత్య విమర్శ 3, ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యాసాలు 4 ఉన్నాయి. అనువాదాలు, విరసం తన సామాజిక బాధ్యతగా ప్రజలకు అందించాలని భావించిన సాహిత్యాన్ని కూడా ప్రచురించి ప్రచారం చేస్తుంది. అట్లా విరసం ప్రచురణలుగా వచ్చిన పుస్తకాలు 17 ఉన్నాయి. విరసం రచయితలు ఎన్నడూ సాహిత్య విలువల విషయం లో రాజీపడలేదు. సాహిత్య వస్తువుకు ఇచ్చిన ప్రాధాన్యతను, సాహిత్య రూపంలో నిర్లక్ష్యం చేయలేదు. వస్తువును ఆశ్రయించిన రూపం సాహిత్య రచనలో ఉండాలని త్రిపురనేని మధుసూదనరావు చెప్పిన మాటను విరసం రచయితల ఎరుకలో ఉందని ఈ మహాసభల సందర్భంగా వెలువడిన 30 పుస్తకాలను చూస్తే అర్థమవుతుంది.

విరసం వైపు నుంచి మొదట్లో వచ్చినంత బలంగా కవిత్వం రావటం లేదని పరిశీలించకుండానే (విరసం అధికార పత్రిక అరుణతారను కూడా) జడ్జిమెంట్ ఇచ్చే సాహిత్య వాతావరణం నేడు ఉంది. శ్రీశ్రీ, శివసాగర్, చెరబండరాజు, వరవరరావు వంటి లబ్ధప్రతిష్టులైన వారి కవిత్వం దగ్గరే కొందరు విమర్శకులు ఆగిపోయారు. తర్వా త వచ్చిన కొత్త నీళ్లు తాగటానికి తెలుగు సాహిత్య వాతావరణం అలవాటు పడలేదు. సముద్రుడు, ఎమ్మెస్సార్, కౌముది రచనలు విప్లవ కవిత్వంలో తెచ్చి న వస్తు, శిల్పనైపుణ్యాన్ని చూడలేకపోయారు. ఈ తరం లో కూడా కవిత్వానికి విరసంలో లోటులేదు. బలమైన గొంతుకలు ముందుకొచ్చాయి. ముప్పై ఏళ్ల లోపు వయసున్న కవులు విరసంలో బలమైన కవిత్వం రాస్తున్నవాళ్లు అరడజన్‌కు పైగా ఉన్నారు. వీళ్లు కూడా సంస్థ తీసుకున్న గ్రీన్‌హంట్ వ్యతిరేకతను తమ రచనలలో ప్రదర్శిస్తున్నారు. ఈ తరంలోని వాడే ఉదయ్‌భాను.ఈ రెండేళ్లలో గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా రాసిన కవిత్వా న్ని పిల్లనగ్రోవి తుఫాన్ పేరుతో సంకలనం చేసి 24వ మహాసభలలో ఆవిష్కరించాడు. పుస్తకానికి పెట్టిన పేరులోనే గొప్ప సౌందర్యాత్మకత కనిపిస్తుంది. పుటలు తిప్పేస్తే రక్తం స్రవిస్తున్న పిల్లనగ్రోవి పెదవులు మనల్ని కన్నీళ్లు పెట్టిస్తాయి. విషాదగీతిక పిల్లనగ్రోవి తుఫాన్‌గా మారుతున్న కవిసమయం ఇవాల్టి దశ్యం. ఈ విషాద, గం భీర దశ్యాన్ని కలంలో ఒంపుకున్నవాడే కవి అనే బాధ్యతను ఉద య్ గుర్తుచేశాడు.తొలిపొద్దును మింగేసే పాలకులున్నచోట సూర్యాస్తమయం గురించి బాధపడటంలో అర్థం లేదనే కొత్త కవి సమయాలను గ్రీన్‌హంట్ వ్యతిరేక కవిత్వం మనముందు ఉంచింది.

కాంత పున్నం వెన్నెల ఈ మూడు పదాలు ఒకేలా ఉన్నాయి కదా! వెలుగు అని అర్థాన్ని స్ఫూరిస్తున్నాయి. మూడు పదాలను కలిపితే మంచి కవితా పాదం వలె ఉన్నాయి. కాని ఇది ఒక కథ పేరు. ఇట్లాంటి శీర్షిక పెట్టింది చేయి తిరిగిన కథా రచయిత కాదు. చనిపోయిన నిజమైన మనుషుల కోసం-భయవిహ్వాల దిగ్భ్రాంతి లో ఉన్న వారి బంధుమిత్రుల కోసం...చావంటే, శవమంటే అందరిలాగే ఆమడదూరం పరిగెత్తే పద్మకుమారి విచిత్రంగా, అనివార్యం గా అనేక అసహజ మరణాల్లో బంధు మిత్రుల సంఘం సభ్యులతో కలిసి రాష్ట్రమంతా తిరుగుతుంది. కన్నీళ్లు జలజలాకారే చిత్రమైన బాధ్యత. మానసికంగా, శారీరకంగా కల్లోలపరిచే బయటి కల్లోలం. అదిగో అలాంటి స్థితిలో ఇలాంటి కథలు రాయడం వల్ల.. ప్రతీవాక్యం మత్యుశీతల స్పర్శ నుంచి రూపుదిద్దుకున్నదే.. అని అల్లం రాజయ్య ఎన్ని వాక్యాలు పేర్చుకుంటూ పోయినా కాంత పున్నం వెన్నెల కథ గురించి సరిగా చెప్పలేనని మొరాయించాడు. తెలంగాణలో విప్లవ కథా రచనలో లబ్దప్రతిష్టుడిగా పేరున్న అల్లం రాజయ్య విరసం ఈ తరం సభ్యురాలు పద్మకుమారి రాసిన మొట్టమొదటి కథ గురించి ఈ వాక్యాలు రాయటానికి కారణం ఆ కథలో ఉండేబలం.
తెలంగాణ సమాజంలో ముస్లింలకు, ఉత్పత్తి కులాల మధ్య ఉండే సజీవ మానవ సంబంధాల గురించిన అబ్బా, ముస్లిం రైతు రోజు జీవితాన్ని వ్యక్తంచేసేఈద్ నమాజ్, ముస్లిం మహిళల జీవితాలలో వచ్చిన మార్పును చెప్పే సైదాబీ తాయమ్మ సంప్రదాయ కుటుంబాల్లో నుంచి బయటికి వచ్చి జీవించాలంటే స్త్రీకి కలిగే ఇబ్బందులను చిత్రించిన మబ్బులు కమ్మిన ఆకాశం తరగతి గది నాలుగు గోడల మధ్య ఎంత వ్యధ ఉందో చెప్పిన బడిలో చీకటి, ప్రజల కోసం మిగిలేటోళ్లు కథలను కలిపి విరసం సభ్యుడు బాసిత్ కథా సంపుటి వేశాడు. ఈ కథలన్నీ ప్రత్యామ్నాయ ఆలోచనా ధారను ప్రతిబింబించేవి.

సాహిత్యంలో నవలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. నవలా ప్రక్రియను చేపట్టి సాధికారికంగా నడిపినవారు విరసంలో గత నలభై ఏళ్లుగా ఉన్నారు. ఈ వరుసలోనే విరసం సీనియర్ సభ్యురాలు నల్లూరి రుక్మిణి రాసిన ఒండ్రుమట్టి నవలను ఈ సభల్లోనే ఆవిష్కరించారు. నవల అనే రెండో మాట దాని రూపశిల్పాలను, దాని కాల్పనికతను కళాత్మకతను సూచిస్తుంది. ఈ రెండు అంశాలు ఒక రసాయనిక సమ్మేళనంలో మేలు కలయిక సాధించడమే ఒండ్రుమట్టి సాధించిన విజయం అని ఎన్. వేణుగోపాల్ ముందుమాట లో ఈ నవల వస్తు శిల్ప వైశిష్ట్యాన్ని వివరించారు.
ఒండ్రుమట్టి నవలతో పాటు వసంతగీతం నవలను కూడా ఇదే సభలలో ఆవిష్కరించారు. ఈ నవలా రచయిత అల్లం రాజయ్య. కొలిమంటుకున్నది, కొమురంభీం వంటి పూర్తి నిడివి ఉన్న నవలలు, అతడు లాంటి పాక్షిక నవలతో తెలుగు సమాజంపై విశేష ప్రభావాన్ని వేసిన అల్లం రాజయ్య చేతి నుంచి వసంతగీతం జాలు వారింది. అడవి వెన్నెల లాంటి పదునైన, అందమైన, ఉద్విగ్నమైన కథా కథనశైలితో మలచిన నవల వసంతగీతం. ఈ శైలి రాజయ్య సొంతం. వసంతగీతం నవల నిర్దిష్టమైన సమకాలీన చారిత్రక నవల. 1985-86 మధ్యకాలంలో నవలా వస్తువు. అట్లే ఆదిలాబాద్ జిల్లా పార్టీ నాయకత్వంలో ఒక దళం దైనందిన జీవి తం, పోరాట ఆచరణ,త్యాగాలు చిత్రించిన రాజకీయార్థిక చారిత్రక నవల ఇది అని వరవరరావు చెప్పారు. ఇట్లాంటి అద్భుత నవల లు విరసం అల్లం రాజయ్య నుంచి రావటం వర్తమాన చరిత్రకొక నమ్మకం.


ప్రజా ప్రత్యామ్నాయాల్లో నూరేళ్ల కాళోజీ గుర్తులో జరిగాయి కనుక కాళోజీతో సుదీర్ఘకాలం కలిసి నడిచిన వరవరరావు రాసిన నూరేళ్ల కాళోజీ పుస్తకం ఈ సభల్లోనే వచ్చింది. ఒక చేత తర్కం, మరో చేత గతితర్కం పట్టుకొని తెలుగు సాహిత్యాన్ని వ్యాఖ్యానించే విప్లవ సాహిత్య విమర్శకుడు చెంచయ్య ప్రతి విరసం సభలకు ఒక పుస్తకంతో వస్తాడు. ఈ సభల్లో సామాజికంవ్యాస సంపుటిని తెచ్చాడు. వివిధ సందర్భాలతో సాహిత్యం-సమాజం కలపోతగా రాసిన వ్యాసాలివి. ఒక రచనను మనం చదువుతుంటే ఆ రచయితే మన ముందు కూర్చొని మాట్లాడుతున్నట్టు అన్పించడమంటేనే పదాలు మాట్లాడటం. ఈ శక్తి కొందరు రచయితలకే ఉంటుంది. ఇందులో కష్ణాబాయి ఉంది. బహుశా, ఆమె నలభై ఏళ్లలో రాసిన రచనల సర్వస్వం ఈ సాహిత్య సమాలోచన. ఈ మహాసభలలో ఆవిష్కరించడం ఒక సందర్భం.

విరసం తెలంగాణ ఏర్పాటును సైద్ధాంతికంగానే గత నలభై ఏళ్లు గా సమర్థిస్తున్నది. అంతేకాదు రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగే పోరాటాలలో భాగమవుతున్నది. 90వ దశకంలో ప్రారంభమైన మలిదశ తెలంగాణ ఉద్యమానికి విరసం కలాన్ని, గళాన్ని తోడు చేసింది. విరసం సభ్యులు కవిత్వం, కథలు, వ్యాసాలు ప్రచురించారు. సంస్థ సభ్యుడు కాశీం రాసిననేను తెలంగాణోన్ని మాట్లాడుతున్న(వ్యాసాలు)పుస్తకాన్ని ఈ సభల్లోనే ఆవిష్కరించారుపజాస్వామ్య తెలంగాణ ఎట్లా ఉండాలో ఈ రచన ద్వారా తెలంగాణ సమాజానికి కావల్సిన సమాచారం అందుతుంది.
ఇక విరసం ప్రచురించి ఈ సభలో ఆవిష్కరించిన సాహిత్యంలో దండకారణ్య కథలు అగ్రస్థానంలో నిలుస్తాయి. ప్రజల ప్రత్యామ్నా యం ఎట్లా పుష్పించి వికసిస్తున్నదో ఈ కథల్లో చూడవచ్చు. ఒక రకంగా విరసం, విప్లవోద్యమం ఆవల ఉన్న రచయితలెవరికి తెలియని ఒక కొత్త జీవితాన్ని, సాహిత్య వస్తువును, ఘర్షణను, యుద్ధా న్ని ఈ కథల్లో దర్శిస్తాం. యుద్ధరంగ కథకులతో ఆత్మీయ కరచాల నం చేసే అవకాశం తెలుగు సమాజానికి ఈ కథలు కల్పించాయి. అమ్మ పొలం దున్నుతున్నది/నాన్న ఊయల ఊపుతాడు/ చందు అన్నం వండుతాడు/ పెదనాన్న బియ్యం చెరుగుతాడు అనే వాక్యాలను మనమెప్పుడైనా మన పుస్తకాలలో చదివామా? లేదే?! కాని ఇవ్వాళ దండకారణ్యంలో జనతన సర్కార్ నడుపుతున్న పాఠశాల లో ఈ వాక్యాలను పిల్లలు చదువుతుంటారు. ఈ శాస్త్రీయమైన విద్య మనకు పరిచయం కావాలంటే ఈ కథలు చదివి తీరాలి.

రక్తం బొట్టు చిందకపోవచ్చు, చిందినా కనిపించకపోవచ్చు, అవయవాలు తెగిపడకపోవచ్చు, తెగిపడినా మాయం కావచ్చు. కత్తి దూసుకుపోతుంది. పిడిపట్టిన చేయి మాత్రం దొరకదు. తూటా పేలకపోవచ్చు. కాని మనుషులు నేల రాలుతారు. శత్రువు పడక గదిలో కూర్చొని ఉంటాడు. కాని పోల్చుకోలేము. దీనినే ఎల్‌ఐసీ అంటాం. మంద్రస్థాయి యుద్ధం అని నైఘంటికార్థం. ప్రపంచ పోలీస్ అమెరికా నుంచి మొదలు ప్రతీ దేశంలో ప్రజా వ్యతిరేక పాలకులందరు పాటిస్తూ అమలు చేస్తున్న ప్రతిఘాతక యుద్ధ నీతి ని తెలుగు పాఠకులకు పరిచయం చేయటానికి విరసం సభ్యుడు రివేరా అనువదించిన మంద్రస్థాయి యుద్ధం పుస్తకాన్ని ఈ సభ ల్లో ఆవిష్కరించారు.
1969లో విద్యార్థి ఉద్యమం నాయకుడిగా, 1998 నుంచి జనసభ కన్వీనర్, ప్రజాఫ్రంట్ అధ్యక్షుడిగా ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాడిన ఆకుల భూమయ్య డిసెంబర్ 24, 2013న హత్య కు గురయ్యాడు. ఆయన వివిధ సందర్భాలలో ప్రజాస్వామ్య తెలంగాణ కోసం రాసిన వ్యాసాలను ఆకుల భూమయ్య రచనలు పేరు తో ఈ సభల్లో ఆవిష్కరించారు. ఆయన ఇచ్చిన ఆఖరి ఉపన్యాసా న్ని కూడా బుక్‌లెట్ రూపంలో తెచ్చారు. తెలంగాణ ప్రాంతం వలెనే తన అస్తి త్వం కోసం 1936 నుంచి పెనుగులాడుతున్న ప్రాంతం రాయలసీమ. శ్రీబాగ్ ఒడంబడిక నుంచి కోస్తాంధ్ర పాలకులు ఉల్లంఘనలకే పాల్పడ్డారని చరిత్ర చెబుతున్న సత్యం. దీని నుంచి ప్రజల పెనుగులాట ప్రత్యే క రాష్ట్ర ఆకాంక్షగా ఉద్యమ రూపం తీసుకోవాలని విరసం కోరుకోవటమే కాదు దానికి కావల్సిన సైద్ధాంతిక భావజాలాన్ని ఇవ్వటం కోసం నేటి రాయలసీమ పుస్తకాన్ని ప్రచురించి ఆవిష్కరించింది.

వరంగల్ విప్లవోద్యమంలో ఆర్కేది చెరగని సంతకం.అతని జ్ఞాపకాలతో వరంగల్ మిత్రులు తెచ్చిన పుస్తకం ఆర్కే పోరాట జలపాతాన్నిఇక్కడే ఆవిష్కరించారు. అతని సహచరి భారతి రెండు పోరాట గాథలపేరుతో రాసిన కథల్ని విరసం ప్రచురించిం ది. ప్రజలు తమ చరిత్రను తామే నిర్మించుకుంటారనటానికి ఈ గాథలు నిదర్శనం. మనం తప్పక తెలుసుకోవాల్సిన మనుషులు కొందరుంటారు.వాళ్లు చచ్చిబతికిన ధన్యులు తరం తాలూకు జ్ఞాపకాలను ఈతరానికి అందించాలని విరసం భావించి ఆదర్శజీవులు అమరులుపేరుతో పుస్తకాన్నితెచ్చి ఆవిష్కరించింది.
ప్రజల సంస్కతి, కళలు వర్థిల్లాలనేది విరసం నినాదం. సంస్కతిలో భాగమైన ఉత్పత్తి కులాల ఆహారం కూడా వర్థిల్లాలి. అగ్రకుల సమాజం చేత నిరాకరించబడిన దళితుల, ఆదివాసుల ప్రధాన ఆహారమైన బీఫ్‌ను విప్లవోద్యమం, విరసం తన ఆచరణలో భాగం చేసుకున్నది. దానిని అందరికి అలవాటు చేయాలని రెండో రోజు సభలలో బీఫ్ కూరను వడ్డించింది.ఈ ఆహారం ప్రజలందరి తిండి గా మారాలనే అవగాహనను పెంపొందించటానికి బీఫ్ రాజకీయాలు పుస్తకాన్ని సభల్లో ఆవిష్కరించింది.

ఇక నందిని సిధారెడ్డి తెలంగాణ నెనరున్న కవి మిత్రుడు. విరసానికి మిత్రుడు, విప్లవానికి ప్రేమికుడు. మంజీర మీద రాసిన, మట్టి మీద రాసిన మనిషితనం తప్పిపోని ఆర్థ్రత అతని కవిత్వం నిండా పారుతుంది.ఇక్కడి చెట్లగాలి(కవిత్వం)ని మోసుకొని విరసం సభలకు వచ్చి ఆవిష్కరించాడు.నిత్యజీవితంలో సోషలిజం (భూసారం శివన్న),విప్లవ మేధావి మహిత, అరణ్యపర్వం (ఆలూరి భుజంగరావు కథలు),పువ్వర్తి అమరులు, అరుణతార సాహి త్య విమర్శ, అరుణతార, సజన డీవీడీలు, రేపు (కథ) పుస్తకాలను కూడా ఈ సభల్లో ఆవిష్కరించారు.
నలభై రెండు ఏళ్లుగా విరసం విప్లవ రాజకీయాలను ప్రచారం చేయడానికి పనిచేస్తూనే ఉన్నది. నిషేధాలకు, నిర్బంధాలకు గురైనా సాహిత్య సజనను కొనసాగిస్తూనే ఉన్నది. మూడు తరాల రచయితలతో విరసం నవ నవోన్మేషంగా నడుస్తున్నదనే వాస్తవాన్ని ఈ మహాసభలు నిరూపించాయి.-
9701444450 Namasete Telangana Telugu News Paper Dated : 27/1/2014 

Thursday, January 16, 2014

వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్లు అవసరం రాజశేఖర్‌