Sunday, February 2, 2014

సంఘాన్ని చదివిన సాహతీవేత్తను' - ఇంటర్వ్యూ: డా.జిలుకర శ్రీనివాస్, స్కైబాబ -


 
New 
 
0 
 
0 
 
 

కవి, కథకులు, నవలాకారులు, నాటక రచయిత, విమర్శకులు, వినూత్న పరిశోధకులు ఆచార్య కొలకలూరి ఇనాక్. సమాజంలోని అట్టడుగు వర్గంలోంచి ప్రభవించిన ఇనాక్ సమాజంలోని చీకటి కోణాల్ని తన రచనల ద్వారా బలంగా వ్యక్తీకరించారు. ఈ సాహితీ స్రష్టకు పద్మశ్రీ పురస్కారం లభించిన సందర్భంగా 'వివిధ' పాఠకుల కోసం ఆయనతో విపులమైన ఇంటర్వ్యూ..
ఇనాక్ గారూ! మీకు పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు అభినంద నలు. మీ సాహిత్యసేవకు తగినగౌరవం లభించిందని భావిస్తున్నారా?
- నా సాహిత్యానికి గాను పద్మశ్రీ లాంటి అవార్డు రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. నాకే కాదు, తెలుగు భాషకే గౌరవంగా భావిస్తున్నాను.
జాషువా, మీరు ఒకే జిల్లా నుంచి వచ్చారు. మీ మీద ఆయన ప్రభావం ఉందా? ఆయనతో మీ పరిచయం గురించి చెప్పండి?

- జాషువా పుణ్యాత్ముడు. మహానుభావుడు, మహాకవి. మా పల్లెల్లో ఆయనొక సజీవ చైతన్య దైవం. ఆయన్ని చూడటం, తాకటం గొప్ప అనుభవం. ఆయన నివసించే ఇంటిని చూడటం ఒక ఆరాధన. కవి అంటే మా జనంలో గొప్ప గౌరవం. జాషువాను చూసే నాలో కవి కావాలన్న బీజం పడింది. మా పల్లెల ప్రజలు ఆయన పట్ల చూపే భక్తి ప్రేరణ నన్ను రచయితను చేసింది. ఆయన సాహిత్యమంతా నా 18 ఏళ్లకు చదివేశాను. నేనేమయినా రాస్తే కరుణశ్రీ చూచేవారు. సవరించేవారు. ప్రోత్సహించేవారు.
నేను అప్పట్లో పద్యాలు రాసేవాణ్ణి. నా పద్యాలు చదివిన విజ్ఞులు జాషువా రచనలాగో, కరుణశ్రీ రచనలాగో ఉందనేవాళ్లు. అట్లా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. నా పద్యాలు నావిగా ఉండాలి. ఆ ప్రభావాల నుంచి తప్పించుకోవటానికి పద్యం రాయటం మానేశాను. వచనం నన్ను ఆదరించింది. నా పద్యం నేను రాసినట్లే ఉంటుందని ఇప్పుడెవరైనా 'ఆది ఆంధ్రుడు' చదివితే గుర్తిస్తారు.

అంబేద్కరిజం తెలియని రోజుల్లోనే కులానికి వ్యతిరేకంగా రాశానని మీరొకచోట రాసుకున్నారు..
- మా తాతను మునసబు కొట్టి చంపాడు. అట్లా చంపి ఉండకూడదని నా పసి మనస్సు ఏడ్చింది. అది నా మొదటి కథ- ఉత్తరం. నాకప్పటికి 15 ఏళ్లు. నేనప్పటికి అంబేద్కరును ఎరగను. నా ఆకలి, నా అస్పృశ్యతా వ్యధ, నా చుట్టూ జీవితాలు చూచి దుఃఖంతో ఆక్రోశించటానికి నా సాహిత్యం అండయింది. నా సాంఘిక జీవితాన్ని, నన్ను పీడించిన సమాజ ధోరణిని గూర్చి రాశాను. నేను రాసింది పుస్తకాలు చదివి కాదు, సంఘాన్ని చదివి.
క్రైస్తవ నేపథ్యం నుంచి వచ్చిన మీరు తెలుగు సాహిత్యంలో ఎలా స్థిరపడ్డారు?

- క్రైస్తవులంటే ముఖ్యంగా మాలమాదిగలే కదా! వాళ్లు ప్రధానంగా ఉండేది- అప్పట్లో పల్లెల్లోనే. ఆ పల్లెలకు అప్పట్లో తెలుగు తప్ప సంస్కృతం, ఇంగ్లీషు అంతగా రావు. నేను పల్లె ప్రాణిని కాబట్టి తెలుగు ఇష్టమయింది.
అభ్యుదయ,విప్లవ సాహిత్యం ఉధృతంగా వస్తున్న రోజుల్లో ఆ ప్రభావంలో మీరు కొట్టుకుపోలేదు. స్వతంత్రమైన సాహితీ వ్యక్తిత్వంతోపాటు ప్రత్యామ్నాయ దృక్పథాన్ని మీ రచనల్లో వ్యక్తం చేస్తూ వచ్చారు? వర్గ కేంద్రమైన సాహిత్యం పట్ల మీరెందుకు ఆకర్షితులు కాలేదు?
- వర్గ కేంద్రమైన సాహిత్యం నాకిష్టమే. వర్ణ ప్రాంగణంలోని సాహిత్యం నన్ను బాధిస్తుంది. నా సాహిత్యంలో అభ్యుదయం విప్లవం - రెండు ధోరణులూ ఉంటాయి. వీటిపైన వీటికంటే ఎక్కువగా కులం నా గోల. నా గొడవ. దానీ పీడ నాకు వాస్తవం. ఆర్థికంగా పీడితులతోపాటు కుల, మత, వృత్తి పీడితులు నాకు సాహిత్యం ప్రసాదించారు. ఆర్థిక స్వావలంబన వచ్చినంత మాత్రాన జనం కులం ఉక్కు పంజరంలోంచి బయటపడలేరని నా తెలివిడి.
ప్రబంధ సాహిత్యం మీద మీరు చాలా చక్కటి విశ్లేషణలు చేశారు. వసుచరిత్ర రాసిన రామరాజభూషణుడు శూద్రకవి, శుభమూర్తి అని మీరు రాసిన చేసిన పరిశోధన అపురూపమైంది. విమర్శకులు ఆ గ్రంధాన్ని తిరస్కరించలేకపోయారు. అకడమిక్ రంగంలో ఆధిపత్య వర్గాలను ధిక్కరించి మీరు ఆ పరిశోధన చేశారు. అసలు ఆ రచన చేయాలని ఎందుకనిపించింది?

- పీడింపబడేవాడు నాకు తల్లి తండ్రి దైవం సోదరుడు బిడ్డ. శుభమూర్తి నాకు గురువు. నా గురువు బట్రాజుగా పిలవబడి, పీడింపబడి అవమానింపబడి, తృణీకరింపబడ్డాడు. సాహిత్య గురువు సాంఘికంగా సోదరుడు. ఆ మహాకవిని వసుచరిత్రను భక్తితో చదివాను. తెలుగు సాహిత్యంలో అది మహోత్కృష్ట ప్రబంధం. మహా కావ్యం. గొప్ప సాహిత్య సృష్టి. అంత గొప్ప రచన అవతరించటానికి అది పీడన నుంచి పుట్టటం శూద్రుడి గుండె నుంచి ప్రవహించటం కారణమని నాకు అనిపించింది. నేను దళితుణ్ణి పీడితుణ్ణి కావటాన శుభమూర్తి దుఃఖం నాకు వినిపించింది. ఆయన కన్నీటి తడి నా గుండెను తాకింది.
వసుచరిత్ర స్రష్ట పేరు శుభామూర్తి భట్టుమూర్తి అని కులం పేరుతో రామరాజభూషణుడని చేరదీసిన రాజు పేరుదో పిలిచారు. నా పేరు శుభమూర్తి అని ఆయన కంఠోక్తిగా చెప్పుకొన్నా ఇప్పటికీ ఎవరూ అలా పిలవటం లేదు, తలవటం లేదు. ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని పండితులు ఒక దృష్టి నుంచే చూస్తున్నారు. ఇంకో దృష్టి నుంచి చూడవచ్చునని నా అభిప్రాయం. అదే వసుచరిత్ర వైశిష్ట్యం.

మీ 'ఆది ఆంధ్రుడు' కావ్యానికి రాసిన ముందుమాటలో అమరావతీ స్తూపానికి పూర్ణకళశం బహుమతిగా ఇచ్చిన ఒక మాదిగ గురించి వివరంగా తెలిపారు. మీరు సమాజాన్ని, కావ్యవస్తువునీ ఒక చారిత్రక దృక్పథం నుంచి చూస్తుంటారు. ముఖ్యంగా ఈ దేశాన్ని నిర్మించిన ఈ దళితుల చరిత్రను, ఆర్యుల దురాక్రమణను ప్రస్తావిస్తూ వుంటారు. ఇది మీ మెథడాలజీ కదా! ఈ చారిత్రక దృక్పథం మీకెలా ఏర్పడింది.
- నేను సాహిత్యాన్ని సామాజిక నేపథ్యం నుంచి చూస్తాను. రాస్తాను. సంఘాన్ని సాహిత్యంలో ప్రతిబింబింపచేయాలని ఇష్టపడతాను. సాహిత్యం సంఘానికి దశ దిశ నిర్దేశం చేయాలని ఆలోచిస్తాను. ఆలోచన కార్యరూపం దాల్చటానికి, చర్యోన్ముఖం కావటానికి ఇష్టపడతాను. ఈ ఉన్నతి; స్వేచ్ఛ, స్వాతంత్య్రం సమానత్వం అన్న ప్రజాస్వామిక విలువలతో కలిసి ఉండాలని వాంఛిస్తాను; ఈ వాంఛ పరిపూర్ణమయితే రేపటి సమాజపు అస్తిత్వం అవగతమవుతుంది. ఇది భవిష్యద్దృష్టి. ఈ సమాజం వర్తమానంలో ఇలా ఉందంటే ఎటువంటి గతాన్ని వారసత్వంగా ఇవ్వగలిగిందో గుర్తిస్తాము. అటువంటి గతాన్ని వెదుకుతూ పోవటం నాకు అనివార్యం. అట్లాంటి అన్వేషణలో కనిపించినవాడు భుజంగరాయుడు. వాసిరెడ్డి వెంకటాద్రినాయుడి చేత అంటరానితనం నిర్మూలన శాసనం వేయించిన కార్యదక్షుడు. దళితుడు. దళితుల ప్రాచీనతా శైవభం నాకు ఆరాధ్యం. ఎందుకు స్మశానాలు తవ్వుకోవటమంటే ఆ ఎముకలు చెప్పే ఔన్నత్యం తెలుసుకోవటానికి. తెలుసుకొని ఏం చేస్తాను? గుండెల నిండా బలంగా గాలి పీల్చుకొని, ఛాతీ ఎగదట్టి నిర్భయంగా, ఆత్మగౌరవంతో, తలెత్తుకు తిరిగే దళితుల్ని చూస్తాను.

మీ మరో గొప్ప కావ్యం 'కన్నీటి గొంతు'. అందులో శూర్పణఖ హృదయాన్ని ఆవిష్కరించారు. రామాయణం పట్ల మీ విమర్శనాత్మక పరిశీలన చాలా ఆసక్తిగా వుంది. రామున్ని ప్రతినాయకుడిగా చేస్తూ, రావణున్ని ధీరోదాత్త నాయకునిగా స్థాపించారు. కారణమేంటి?
- ధన్యవాదాలు. ఇంతమంది స్త్రీవాదులు సీతకు, అహల్యకు, మంధరకు, కైకకు, శబరికి జరిగిన న్యాయాన్యాయాల గూర్చి ఆవేదనాత్మక రచనలు చేశారు కదా, శూర్పణఖను గూర్చి ఏమీ రాయరేం? ఆమెకు అన్యాయం జరగలేదా? ద్రావిడ చక్రవర్తి అయిన రావణుడిని దశకంఠుడని వికారుడుగా, క్రూరుడుగా, రాక్షసుడుగా చిత్రించడం ఏం సబబు? వాల్మీకి పుట్టలోంచి పుట్టలేదు. ఆర్యుల బుర్రల్లోంచి పుట్టాడు. రామాయణం ఆర్యులు దక్షిణా పథానికి వ్యాపించటానికి పన్నిన రాజకీయ వ్యూహంలో భాగం. మీరు రామాయణాన్ని ప్రచార గ్రంథంగా, ఆర్యులు ద్రావిడుల్ని జయించే యుద్ధ వ్యూహంలో భాగంగా చూస్తే చాలా జీవన సత్యాలు కనిపిస్తాయి.

మీ మునివాహనుడు నాటకంలో తాత్వికత, తర్కం, కళా సౌందర్యం తొణికిసలాడే ఎన్నో సంభాషణలు రాశారు. అంత సోషల్లీ, ఫిలాసాఫికల్లీ, పొలిటికల్లీ సీరియస్ నాటకం రాయాలని ఎందుకనిపించింది? తిరుప్పాణ్ పాత్రను అలా చిత్రించడానికి కారణం?
- మునివాహనుడు చారిత్రక పాత్ర. పాణ్ కులస్థుడు. నాటి దళితుడు. దేవాలయ ప్రవేశం తిరస్కరింపబడ్డవాడు. పన్నెండుమంది ఆళ్వారుల్లో ప్రసిద్ధుడు. పది పాశురాలు పది పరిశోధన గ్రంథాల పెట్టు. తిరుప్పాణ్ ఆళ్వారు అని పిలువబడే దళితుడు మునివాహనుడు అయ్యాడు. అది అద్భుత కథా సందర్భం. దీన్ని గూర్చి వ్యాసం రాశాను. తృప్తి లేదు. నాటకం రాయదగ్గ అంశం అనిపించి రాశాను.
ఊరబావి, తలలేనోడు, కాకి వంటి అద్భుతమైన కథలు రాశా రు. ఎన్నో కథాసంపుటాలు వెలువరించారు. ఏ ఒక్క కథకూ మరో కథతో పోలిక వుండదు. అంత వైవిధ్యాన్ని చూపడం ఎలా సాధ్యం?
- సంఘం, మహారాజా సంఘం. సంఘంలో ఇంత వైవిధ్యమంటే, సంఘాన్ని ఆరాధించే రచయితకు అనంతమైన వైవిధ్యం లభిస్తుంది. గీతకు దిగువనున్న అందరిని గురించీ రాయాలనుకున్నాను. పాత్రలనేకం. వస్తువులనేకం. ఇతివృత్తాలనేకం. సంఘ జీవన వైవిధ్యమే సాహిత్య జీవన వైవిధ్యం.

రాయలసీమ జీవితం మీ సాహిత్యాన్ని ఎలా ప్రభావితం చేసింది?
- ఆంధ్రాచార్యుడికి, అనంతపురంలోనో, తిరుపతిలోనో విద్యార్థులతో జీవితం గడిపే రచయితకు, రాయలసీమ జీవితం అర్థం కావ టం అంత తొందరగా సాధ్యం కాదు. మాండలికం తెలిస్తే చాలనుకొంటారు చాలామంది. అది నిజం కాదు. ఒక ప్రాంత జీవితానికో జీవశక్తి ఉంటుంది. అది అర్థం కావటం వలస రచయితకు అంత సులభం కాదు. నాకు 30 ఏళ్లు పట్టింది. రాయలసీమ జీవితం ఎంత సుకుమారమో, సౌందర్య సమన్వితమో, ప్రశాంతమో; వెలుపల ఉన్న వారికి ఇక్కడి మనుషుల వ్యక్తిత్వ సౌజన్యం, సౌకుమార్యం, మంచితనం, ఓర్పు తెలియవు. సీమ జీవ లక్షణం తెలిశాకే నేను కథలు, నవలలు, నాటకాలు, కవితలు రాశాను. ఒకప్పుడు నాలోంచి గుంటూరును విడదీయటం కష్టంగా ఉండేది. ఇప్పుడు నాలోంచి అనంతపురాన్ని తొలగించటం అసాధ్యం.
జానపద సాహిత్య విమర్శ అనే ప్రత్యేకమైన ప్రక్రియను మీరే మొట్టమొదటగా ప్రతిపాదించారు. ప్రపంచంలో ఎక్కడా అలాంటి ప్రయత్నం జరిగినట్టు లేదు. జానపద సాహిత్య విమర్శకు శాస్త్రప్రతిపత్తి చేకూరుతుందా?
- మీరన్నది నిజమే! 'జానపదుల సాహిత్య విమర్శ' బలమైన ప్రతిపాదన. ప్రపంచంలో ఎక్కడా జానపదుల విమర్శ ఉందని పరిశోధకులు గుర్తించలేదు. నా పరిశోధన గ్రంథాన్ని గొప్ప గ్రంంథం అంటున్నారు. తర్కించలేదు. నిగ్గు తేల్చలేదు.
విస్కాన్‌సిన్‌లో ఇది గొప్ప గ్రంథం. ఇంతకుముందు ఇటువంటి దృక్పథం లేదు. ఇది మొదటి గ్రంథం. తెలుగు జానపదుల్ని సజీవంగా చూపిన పరిశోధన అని నిగ్గు తేలిస్తే ఉస్మానియాలో గుర్తింపు వస్తుంది. ఇల విశాలం. కాలం అనంతం. 'జానపదుల సాహిత్య విమర్శ' ఆద్య గ్రంథం. అది అలా శాశ్వతం.

కంచికచర్ల కోటేశు హత్య మీద మీరొక నాటిక రాశారు. అందులో ఇంకా ఎన్నో హత్యాకాండలు జరుగనున్నాయనే సంకేతాన్నిచ్చారు. ఆ తర్వాత కారంచేడు, చుండూరు జరిగాయి. అలా జరుగుతాయని ఎలా అంచనాకు రాగలిగారు?
- కోటేశు వంటి హత్యలు జరుగుతాయని భయపడ్డాను. భయపడ్డంత జరిగింది. కారంచేడు నుంచి పాతిక చోట్ల అంతే జరిగింది. ఇది ఇంతటితో ఆగదు. ఇంకా సాగుతుంది. ఇంకా పాశవిక దహనకాండ జరుగుతుంది. జాగ్రత్త పడకపోతే ఊళ్లు పేలిపోతాయి. ఎవరి ఊళ్ళు? ఊహించండి! ఆలోచించండి.

లౌకిక, ప్రజాస్వామ్య విలువలను సాహిత్యం కాపాడగలదా?
- కాపాడగలదు. ఆ విలువలతో సాహిత్యం సృష్టి కావటమే అవస రం. సాహిత్యం ప్రజాస్వామ్య విలువలను ప్రతిష్ఠించాలి. ఆ విలువలు ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తాయి.సాహిత్యమే ప్రజల్ని ఆధునీకరించిం ది. సమాజాలను నూత్నీకరించింది. మనిషిని మహోన్నతుణ్ణి చేసింది. చైతన్యవంతులైన ప్రజలు పరస్పర అవగాహనతో సహజీవనం సాగించటానికి సాహిత్యం నిశ్చయమైన, అనివార్యమైన అవసరం.
దళితుడికి దూరంగా ఉండే ఆంధ్రాచార్యత్వం చేపట్టిన మీరు గ్రహించేదేమిటి?
- తెలుగు చదువు బ్రాహ్మణుల విద్య మాత్రమే అనే దశ నుంచి అది మానవ సమూహాల గుత్త సొత్తు అనే దిశకు మారటం నా జీవిత కాలంలోనే చూశాను.
సాహిత్యంలోని ప్రభావిత వ్యవస్థలను ప్రజాస్వామీకరించాలని విమర్శకులంటున్నారు..
- ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థలు ప్రజాస్వామ్యీకరణం చెందాలి. దానికి అపవాదం లేదు. సాహిత్యం మినహాయింపు కాదు.
ఇంటర్వ్యూ: డా.జిలుకర శ్రీనివాస్, స్కైబాబ
-  Andhra Jyothi Telugu News Paper Dated: 3/2/2014

No comments:

Post a Comment