Sunday, February 2, 2014

హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ గుమిగూడిన అక్షరాల సంబరం - క్రాంతి
New 
 
0 
 
0 


 ఒక నగరం.. మూడు రోజులు.. ఏడు దేశాలు.. వంద గొంతులు.. వెరసి హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్. సంభాషణలు.. సంవాదాలు... పుస్తకావిష్కరణలు.. శిక్షణాశిబిరాలు.. కలగలిసిన ఓ సాహితీ ఉత్సవం. కవులు, కళాకారులు, రచయితలు, పాఠకులు, ప్రచురణకర్తలు ఒక వేదికపై చేరిన అపురూప దృశ్యం. చార్మినార్ సాక్షిగా వెల్లివిరిసిన సాహితీ 'సంగతులు'అవి. అవును.. కులీ కుతుబ్‌షా కవిత్వం కురిసిన నేలన... సరోజినీ నాయుడు స్వరం వినిపించిన నేలన.. సురవరం ప్రతాపరెడ్డి, వట్టికోట ఆళ్వార్‌స్వామి, మగ్దూం వంటి మహానుభావులు నడయాడిన నేలన సాహితీ ఉత్సవమంటే తెలుగు నేల పరవశించిపోదా మరి!
నగరంలో నాలుగవ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ జనవరి 24, 25, 26 తేదీలలో రస రమ్యంగా సాగింది. అక్షరాలు గుమికూడి మాటలాడుకున్నట్లు దేశ దేశాల ప్రతినిధులు సాహితీ చర్చల్లో మునిగిపోయారు. అమెరికా, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, స్వీడన్, సింగపూర్ వంటి పలు దేశాలతో పాటు, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రచయితలు, కవులు, కళాకారులు హాజరయ్యారు. ఐదు వేదికల్లో (ఆషియానా, కల్పాస్కూల్, సప్తపర్ణి, కళాకృతి, లా మకాన్) నిర్వహించిన ఫెస్టివల్‌లో సాహితీ చర్చలతో పాటు ఫొటోగ్రఫి, హైకూ, సృజనాత్మక రచన, స్టోరీ టెల్లింగ్ వంటి పలు అంశాలపై వర్క్‌షాప్ లు నిర్వహించారు. ఇక పుస్తకావిష్కరణలు, చిత్రపద్రర్శనలు, ముషాయిరాలు అదనపు అందాల్ని కూర్చాయి. ఐదు వేదికలను అనుసంధానం చేసే వీధికి నిర్వాహకులు లిటరరీ స్ట్రీట్‌గా నామకరణం చేశారు. మొత్తంగా మూడు రోజుల పాటు నగరంలో ఓ 'కొత్త ప్రపంచం' కొలువుతీరింది. స్మార్ట్ ఫోన్‌లు, ల్యాప్ ట్యాప్‌లతో యువత సందడి చేసింది..
నలుగురితో మొదలై..
భారతీయ సాహిత్యాన్ని ప్రపంచ ప్రజల చెంతకు చేర్చే లక్ష్యంతో 'మ్యూజ్ ఇండియా' వెబ్ జర్నల్‌ను ప్రారంభించారు జి.సూర్యప్రకాశ్‌రావు, ఆయన మిత్రులు. మ్యూజ్ ఇండియా కోసం పలువురు రచయితలు దేశీయ సాహిత్యాన్ని ఇంగ్లీషులోకి అనువదించేవారు. అలాంటి రచయితలందరితో ప్రతి సంవత్సరం 'మ్యూజ్ మీట్' నిర్వహించేవారు. అలా వేరు వేరు ప్రాంతాల రచయితలు ఒక చోట కలవడం వారికి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడంతో దానినే లిటరరీ ఫెస్టివల్ గా మలిచారు. జైపూర్ లిటరరీ ఫెస్టివల్ స్ఫూర్తితో 2010 డిసెంబర్ లో మొదటి హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌ను నగరంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. క్రమంగా ఫెస్టివల్‌లో పాల్గొనే ప్రతినిధుల సంఖ్యతో పాటే విదేశీ సాహిత్యానికి ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. అలా వివిధ దేశాల సాహిత్యాన్ని స్థానిక రచయితలకు పరిచయం చేసేందుకుగానూ ప్రతి సంవత్సరం ఒక దేశాన్ని అతిథి దేశంగా పరిచయం చేస్తున్నారు నిర్వాహకులు. ఈసారి లిటరరీ ఫెస్టివల్‌లో ఐర్లాండ్‌ను అతిథి దేశంగా పరిచయం చేయడంతో పాటు, హిందీని ఫోకస్ లాంగ్వేజ్ స్వీరించారు.
చర్చోపచర్చలు
బాలివుడ్ సినీ దర్శకుడు మహేష్ దత్తాని సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా ప్రారంభమైన హెచ్ఎల్ఎఫ్‌లో సినిమా, అనువాద, దళిత, మహిళా సాహిత్యంతోపాటు, వివిధ సాహితీ ప్రక్రియలపైనా చర్చలు సాగాయి. వర్తమాన సాహిత్య ధోరణులపై పలువురు తమ వ్యాఖ్యానాన్ని నమోదు చేశారు. సమావేశాల్లో మహ్మాత్మాగాంధీ మనవడు రాజ్‌మోహన్ గాంధీ మాట్లాడుతూ 'బ్రిటీష్ వాళ్లు ఎన్నో దారుణాలకు ఒడిగట్టి ఉండవచ్చు కానీ, ఎంతో కొంత మేలు కూడా చేశారు' అంటూ వ్యాఖ్యానించారు. 'ఫ్రం ఇండియా టూ పాలస్తీనా' సంఘీభావ వ్యాస సంపుటికి సంపాదకురాలిగా వ్యవహరించిన ప్రముఖ రచయిత్రి గీతా హరిహరణ్ మాట్లాడుతూ పాలస్తీనాలో ప్రజల స్థితిగతులను వివరించారు. సునితీ నామ్ జోషి, ఊర్వశీ బుటాలియా వంటి రచయిత్రులు సాహిత్యంలోనూ పురుషాధిపత్యం కొనసాగుతోందని అభిప్రాయపడ్డారు. తస్లీమా నస్రీన్ వంటి వారు స్త్రీవాద రచయితలకు స్ఫూర్తి కావాలన్నారు.
సమాజంలో వ్యవస్థీకృతమైన కుల అణిచివేతను గురించి ప్రముఖ తమిళ రచయితలు శివకామి, బామ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో వందేళ్ల దళిత సాహిత్యంపై గోగు శ్యామల, ప్రొఫెసర్ వినోదిని, జిలుకర శ్రీనివాస్, గోరటి వెంకన్న, గీతా రామస్వామి మాట్లాడుతూ తెలుగు సమాజంలో దళిత సాహిత్యానికి గల ప్రత్యేకమైన సామాజిక నేపథ్యాన్ని వివరించారు. ప్రముఖ కవి, సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎడ్విన్ థంబూ 'ప్రపంచ సాహిత్యాన్నే కాదు... స్థానిక సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి' అన్నారు. అనువాద సాహిత్యం ప్రపంచవ్యాప్త సాహితీ ధోరణులను తెలుసుకునేందుకు ఉపకరిస్తుందని సస్కీ జైన్, సబా మహ్మద్ బషీర్ అభిప్రాయపడ్డారు. పబ్లిషింగ్ రంగంపై నిర్వహించిన చర్చా కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది. హాపర్‌కొలిన్స్ నిర్వాహకురాలు కార్తిక, 45 శాతం మంది పాఠకులు ఈ బుక్స్ చదువుతున్నారని తెలిపారు. ప్రముఖ సినీ నటుడు బిపిన్ శర్మ పెద్ద స్టార్‌ల చుట్టే సినిమా రంగం తిరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా సాహిత్యంలో వివిధ పార్శ్వాలను తడిమిన ఫెస్టివల్‌లో చర్చలన్నీ ఆంగ్ల సాహిత్యం చుట్టే తిరగడం గమనార్హం.
స్థానికత ఊసేది?
నిజానికి ఈ ఉత్సవాలు ఏమి ఆశిస్తున్నాయి? ఎందుకోసం ఇలాంటి ఉత్సవాల అవసరం ఏర్పడింది? ఇప్పుడిలాంటి ప్రశ్నలు తెలుగు సమాజాన్ని తొలుస్తున్నాయి. 50వేల మందికిపైగా హాజరయ్యే జైపూర్ లిటరరీ ఫెస్టివల్ మొదలు బెంగుళూరు, ఢిల్లీ, కలకత్తా, హైదరాబాద్ వరకు దేశంలో ఏటా 60కి పైగా ఫెస్టివల్స్ జరుగుతుంటాయి. అన్నిటా.. స్థానిక సాహిత్యం, స్థానిక భాషల ప్రస్తావన కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ సమావేశాలు కేవలం ఆంగ్లో ఇండియన్ సాహిత్య ప్రచారం, మార్కెట్ కోసమే జరుగుతున్నాయనేది ప్రధానంగా వినిపించే విమర్శ. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే ఫెస్టివల్స్‌లో ఆంగ్ల సాహిత్యం, విదేశాల్లో ఉండే భారతీయ రచయితల సాహిత్యంపైనే ఎక్కువ దృష్టి సారించడం ఆ వాదనకు మరింత ఊతమిస్తోంది. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌పైనా అలాంటి విమర్శలున్నాయి. తెలుగు సాహిత్యానికి ఫెస్టివల్ తగు ప్రాధాన్యత ఇవ్వడంలేదని, స్థానిక రచయితల భాగస్వామ్యం ఉండడం లేదని పలువురు విమర్శిస్తున్నారు.
మూడు రోజుల పాటు జరిగిన ఈ ఫెస్టివల్‌లో దాదాపు 80కిపైగా సెషన్స్ జరిగితే వాటిలో తెలుగు సాహిత్యానిది ఒకే సెషన్ కావడం గమనార్హం. దశాబ్దాల సామాజిక, ఆర్థిక, రాజకీయ వాతావరణంలోంచి ఉబికి వచ్చిన తెలుగు సాహిత్యానికి ఓ ప్రజాస్వామ్య ఒరవడి ఉంది. అది నిరంతరం ప్రజల పక్షం వహిస్తూ వచ్చింది. అలాంటి సాహితీ ఒరవడి కలిగిన నేలపై వందలాదిమంది సాహితీ ప్రముఖులున్నారు. కానీ సొంత గడ్డపై జరిగే ఫెస్టివల్‌లో తెలుగు రచయితలు వేళ్ల మీద లెక్కపెట్టగల్గినంత మంది మాత్రమే పాల్గొన్నారు. అంపశయ్య నవీన్ మినహా సీనియర్ రచయితలెవరినీ ఫెస్టివల్‌లో భాగస్వాములను చేయలేదు. స్థానిక సాహిత్యంపై ఎక్కడైనా ప్రస్తావన వచ్చినా అదీ ఆంగ్ల, హిందీ సాహిత్యమే కావడం గమనార్హం. ఇలాంటి కొరతను అధిగమించినప్పుడు, అన్ని వర్గాల, అన్ని భాషల సాహిత్యానికి చోటు దొరికినప్పుడు, మార్కెట్ ప్రయోజనాల కంటే ప్రజల ప్రయోజనాలు ప్రముఖమైనప్పుడే ఇలాంటి సాహితీ ఉత్సవాలకు అర్ధముంటుంది. తెలుగు నేలపై అలాంటి అర్థవంతమైన సాహితీ సమ్మేళనాలు జరగాలని కాంక్షిద్దాం.

- క్రాంతి
99854 11403
అన్ని వర్గాలకూ ప్రాధాన్యం
రచయితలను, పాఠకులను ఒక చోట చేర్చడం ద్వారావేరు వేరు సంస్కృతుల, వేరు వేరు రచనా రీతుల మధ్య సమన్వయం సాధించడం ఫెస్టివల్ ఉద్దేశ్యం. ఔత్సాహిక రచయితలు ప్రచురణకర్తలతో నేరుగా సంభాషించడానికి, భారతీయ సాహిత్యం అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడడానికీ అవకాశముంటుంది. ఈ సారి ఫెస్టివల్‌లో 11 దేశాల ప్రతినిధులతో పాటు తెలుగు, హిందీ, ఉర్ధూ, మళయాళం, కన్నడ, మరాఠి, గుజరాతి, తమిళ్ వంటి పలు భారతీయ భాషలకు చెందిన సాహితీవేత్తలు పాల్గొన్నారు. దాదాపు 10వేల మంది ఫెస్టివల్‌లో పాల్గొన్నారు.
నాలుగేళ్ల లేత ప్రాయంలో హైదరాబాద్ ఫెస్టివల్ సాధించిన విజయమిది. ఫెస్టివల్‌లో దళిత, మహిళా, మైనార్టీతో పాటు అన్ని వర్గాల సాహిత్యానికీ ప్రాధాన్యత కల్పించాం. ఫెస్టివల్‌లో పాల్గొన్న వక్తల్లో 60శాతం మంది మహిళలే ఉండడం గమనార్హం. అంతేకాదు... ఈ సారి యువత భాగస్వామ్యం చెప్పుకోదగ్గస్థాయిలో ఉంది. రాబోయే కాలంలో జరగబోయే ఫెస్టివల్స్‌ను స్థానిక రచయితలు, సాహిత్యం, కళలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేలా రూపొందించాలనుకున్నాం. జైపూర్ ఫెస్టివల్ వలే హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌కు శాశ్వత వేదికంటూ లేదు. అయినా.. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నాం. సాహిత్యాన్ని ప్రజల వద్దకు చేర్చేందుకు ఇలాంటి ఫెస్టివల్స్ అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు, ప్రభుత్వ సహకారం ఉంటే మరింత సృజనాత్మకంగా ఫెస్టివల్‌ను నిర్వహించగలుగుతాం.
- ప్రొఫెసర్ టి.విజయ్‌కుమార్
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ డైరెక్టర్
బహుజన గొంతుక
'ట్రాన్స్‌లేటింగ్ ఏ మూవ్‌మెంట్- 100 ఇయర్స్ ఆఫ్ తెలుగు దళిత్ రైటింగ్' పై జరిగిన చర్చలో వక్తలు తెలుగు సమాజంలోని దళిత సాహిత్యపు ఒరవడిని విశ్లేషించారు. 'దళితులు సమాజంలో నిత్యం భౌతిక, సాంస్కృతిక దాడులను ఎదుర్కొంటున్నారు. కనీస మానవ హక్కులు కూడా వారికి వర్తించడం లేదు. దళితుల ఆహార సంస్కృతిపై అంటరానితనం అమలవుతోంది' అని ప్రముఖ దళిత రచయిత్రి గోగు శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. 'పాఠ్యపుస్తకాల్లో వర్ణవ్యవస్థను బలపరిచే అంశాలను తిరగ రాయాల్సిన అవసరముంది. మనుస్మృతి ఆధారంగా రాసిన పాఠ్యాంశాలు దళితులను కనీసం మనుషులుగా కూడా గుర్తించ నిరాకరిస్తాయి. ఇలాంటి విషయాలనేనా రేపటి తరానికి భోదించాల్సింది' అని ప్రొఫెసర్ వినోదిని ప్రశ్నించారు. 'గ్రామాల్లో నేటికీ అగ్రకుల అధిపత్యం కొనసాగుతోంది. ప్రజాస్వామ్యానికి, మానవత్వానికి చోటులేదు. దళితులకు ఎలాంటి హక్కులూ లేవు. అసలు గ్రామాల్లో మనువాదం తప్ప మానవత్వం లేదు. విదేశాల్లో మనుషుల్ని వ్యక్తులుగా గుర్తిస్తారు కాని భారతదేశంలో మనుషుల్ని ఫలానా కులం వారుగానే గుర్తిస్తారు. ఈ వివక్షను ప్రశ్నిస్తూనే తెలుగుసమాజంలో దళిత సాహిత్యం వెల్లువెత్తింది' అని జిలుకర శ్రీనివాస్ అన్నారు.

Andhra Jyothi Telugu News Paper Dated: 3/2/2014 

No comments:

Post a Comment