Tuesday, March 27, 2012

మౌలిక హక్కుల కోసం గళమెత్తిన గిరిజన సదస్సు---మిడియం బాబూరావు


మౌలిక హక్కుల కోసం గళమెత్తిన గిరిజన సదస్సు

అరకొర నిబంధనల ప్రకారం అయినా ఆదివాసీలకు జనాభాలో దామాషాను బట్టి ప్రణాళికా మొత్తంలో కనీసం 8.2 శాతం కేటాయించాల్సి ఉంది. ఈ నిబంధనలను కూడా ప్రభుత్వం తరచూ అతిక్రమిస్తున్నది. ఈ బడ్జెట్‌ (2012-13)లో వీరికి కేటాయించింది 5శాతం మాత్రమే. అంటే రు.11వేల కోట్ల మేర కోతపడింది. 2010 నుంచి ఇంతవరకు రు. 26వేల కోట్ల మేర కోత పెట్టారు. పేదలు హుందాగా జీవించేందుకు అవసరమైన కనీస ప్రమాణాలను కల్పించ నిరాకరిస్తున్నారు. ఆదివాసీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వారికి కరెంటు ఉండదు, నీళ్లుండవు, దవాఖానా ఉండదు, బడి ఉండదు ఇలా అన్నీ సమస్యలే. ఏ సామాజిక గ్రూపు కన్నా పౌష్టికాహార లోపం ఆదివాసీల్లోనే అత్యధికం. అయినా, తెల్ల రేషన్‌ కార్డులు (బిపిఎల్‌ కార్డులు) లేని ఆదివాసీ కుటుంబాలు నేడు 61శాతం దాకా ఉన్నాయి. అంటే వీరిని మార్కెట్‌ శక్తుల దయాదాక్షిణ్యాలకు వదిలి పెట్టేశారు. మార్కెట్‌లో చుక్కలనంటుతున్న ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర సరుకుల ధరలు వీరి జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి.
బడ్జెట్‌లో సాధారణ విద్యకు కేటాయింపులు పెరిగినా, మారుమూల ప్రాంతాల్లోని ఆదివాసీ విద్యార్థులకు అత్యంతావశ్యకమైన రెసిడెన్షియల్‌ స్కాలర్‌షిప్పులు, స్కూళ్ల సంఖ్యను కుదించారు. చాలీ చాలని స్కాలర్‌షిప్పులు. హాస్టళ్ల పరిస్థితి మరీ ఘోరం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆదివాసీ విద్యార్థుల అవకాశాలను దారుణంగా దెబ్బతీస్తున్నారు. ఇదీ ప్రాథమిక స్థాయిలో వున్న వాస్తవిక పరిస్థితి.
వ్యవసాయ సంక్షోభంతో ఆదివాసీలు బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలసవెళ్లక తప్పని పరిస్థితిని సృష్టిస్తున్నది. వలస కూలీలకు ఎలాంటి హక్కులుండవు, ఇలా వలసవెళుతున్న ఆదివాసీల్లో ఎక్కువ భాగం నిర్మాణ లేదా గనుల రంగంలో క్యాజువల్‌, కాంట్రాక్టు కూలీలుగా, ఇంటి పనివారలుగా బతుకు వెళ్లతీస్తున్నారు. వీరికి ఎలాంటి కార్మిక రక్షణ చట్టాలు వర్తించవు. అదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాల్లో ఎస్టీ బ్యాక్‌లాగ్‌ ఖాళీలు పెద్దయెత్తున పేరుకుపోయాయి. ఆదివాసీలకు రాజ్యాంగం నిర్దేశించిన రిజర్వేషన్ల కోటాను కచ్చితంగా అమలు చేసేలా చూసేందుక ఎలాంటి చట్టపరమైన ఏర్పాటు లేదు. గిరిజనేతరులు అక్రమ పద్ధతుల్లో గిరిజనులుగా గుర్తింపు పొందుతున్నారు. బ్యూరోక్రటిక్‌, ఏకపక్షంగా వీరికి గుర్తింపు ఇస్తూ, అసలు గిరిజనులకు ఎస్టీ సర్టిఫికెట్‌ ఇవ్వ నిరాకరిస్తున్న దాఖలాలు అనేకం. చాలా తెగలను గిరిజనులుగా గుర్తించడానికి మొండిగా నిరాకరిస్తున్నారు.
ఈ నెల 21న న్యూఢిల్లీలోని మౌలంకర్‌ హాల్‌ కిక్కిరిసిపోయింది. 14 రాష్ట్రాల నుంచి వచ్చిన 1500 మంది గిరిజన ప్రతినిధులు భూమి కోసం, భుక్తి కోసం, వివక్షత అంతం కోసం తుదికంటా పోరాడాలని పిలుపునిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ నిర్వహించిన ఈ అఖిలభారత సంఘర్ష్‌ సభను ఆదివాసీ మంచ్‌ ఛైర్మన్‌ బజుబన్‌ రియాన్‌ (ఎం.పి) ప్రారంభించారు. ఈ సదస్సుకు అధ్యక్షవర్గంగా బజుబాన్‌ రియాన్‌(ఎంపి Ê చైర్మన్‌ ఎ.ఎ.ఆర్‌.ఎం), ఎస్‌.ఆర్‌ పిళ్ళై( అధ్యక్షులు, అఖిల భారత కిసాన్‌ సభ), డా|| ఎం. బాబురావు (జాయింట్‌ కన్వీనర్‌, మాజీ ఎంపి), ఉపేన్‌కిస్కు (జాయింట్‌ కన్వీనర్‌ ఎం.ఎల్‌.ఎ), రాజేంద్రసింగ్‌ ముండా(మాజీ ఎం.ఎల్‌.ఎ), ప్రేమాబారు(బి.డి.సి. సభ్యులు) 2002లో రాంచీలో జరిగిన సదస్సుతో మొదలైన అఖిల భారత గిరిజనోద్యమం ఈ దశాబ్ద కాలంగా వివిధ రాష్ట్రాల్లో పోరాటాల విస్తరణకు తోడ్పడింది.
ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌, సిఐటియు నాయకులు డా|| హేమలత, విద్యార్థి నాయకులు శివదాసన్‌, విజరుకృష్ణన్‌, కిసాన్‌ సభ నాయకులు, తపన్‌కుమార్‌ సేన్‌, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.
సదస్సులో నాలుగు అంశాలతో కూడిన ఒక ప్రత్యేక తీర్మానాన్ని బృందాకరత్‌ ప్రవేశపెట్టగా ఉపేన్‌ కిస్కు బలపరిచారు.
ఆ తరువాత ఒక ప్రతినిధి బృందం గిరిజన సంక్షేమశాఖ మంత్రిని కలిసి ఆయనకు ఈ తీర్మాన ప్రతిని అందజేసింది. అందులో 1.భూసేకరణ, పరిహారం, పునరావాస బిల్లు - 2011 లో గిరిజన ప్రాంతాలకు సంబంధించి తీసుకురావాల్సిన మార్పులు., 2. అటవీ హక్కుల చట్టం పటిష్ఠ అమలు.,3. గిరిజనుల పట్ల కేంద్ర ప్రభుత్వ వివక్ష: (ఎ) ముఖ్యంగా గిరిజన ఉప ప్రణాళిక కేటాయింపులు, (బి) తెల్లకారులు ఇవ్వ నిరాకరించడం, ఉన్నవాటిని రద్దుచేయడం. (సిి) గిరిజన విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు పెంచకపోవడం, (డి) గిరిజన విద్య, ఆరోగ్యానికి కేటాయింపులు తగ్గించడం.,4.మైనింగ్‌,అటవీ ఉత్పత్తులకు సంబంధించిన విధాన ప్రకటన వంటి అంశాల గురించి ప్రధానంగా ప్రస్తావించారు.
ఈ తీర్మానంపై జరిగిన చర్చల్లో జాయింట్‌ కన్వీనరు, మాజీ ఎంపి డాక్టర్‌ మిడియం బాబూరావుతో సహా 18 మంది చర్చలో పాల్గొన్నారు. గిరిజనుల పట్ల కొనసాగుతున్న తీవ్ర వివక్షత, రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనలు, తమ జీవనోపాధిపై జరుగుతున్న దాడులను వివరిస్తూ, వీటిని ప్రతిఘటించాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు. తొలుత చర్చను ప్రారంబించిన ప్రేం పర్గీ (రాజస్థాన్‌) ఆహారభద్రత, గిరిజనులకు తెల్లరేషన్‌కార్డులు, ఉచిత బియ్యం సరఫరా లోపభూయిష్టంగా వుందని, గిరిజనులకు పోషకాహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తమిళనాడు నుండి మాట్లాడిన ఢిల్లీబాబు (ఎం.ఎల్‌.ఎ) మాట్లాడుతూ తమిళనాడులోనూ కేరళ, ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మహరాష్ట్ర, గుజరాత్‌లలో అనేక గిరిజన తెగలవారు గిరిజన జాబితాలో చేర్చబడలేదని, ముఖ్యంగా తమిళనాడులో రీ షెడ్యూలింగ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.
సుక్రంజన్‌ యుసేంధీ (చత్తీస్‌గఢ్‌) మాట్లాడుతూ పోలీసు అటవీ సిబ్బంది గిరిజనులను అడవుల్లో సంచరించకుండా నిరోధిస్తున్నారని, పోలీసులు ఒకవైపు, మావోయిష్టులు మరో వైపు గిరిజనులకు నిద్రలేకుండా చేస్తున్నారని, కేసులు పెట్టి విచారణ లేకుండా నిర్భంధిస్తున్నారని, పోలీసుల వేధింపులు ఆపాలని, కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.
హేమంత్‌ (రాజస్థాన్‌) గిరిజన విద్యార్థుల సమస్యలను వివరించారు. డా. పులెన్‌ బస్కీ (ఎంపి, పశ్చిమబెంగాల్‌) మాట్లాడుతూ మావోయిస్టుల అరాచకాలు, కార్యకర్తలపై దాడులను ఖండించారు. గిరిజనుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. బెంగాల్‌ గిరిజనోద్యమాన్ని కాపాడడానికి ఇతర రాష్ట్రాలు సహకరించాలని కోరారు.
పూర్ణోబోరో (అస్సాం) మాట్లాడుతూ దేశంలో గిరిజన ఆరోగ్యం గురించి పసిపిల్లల, గర్భిణీల మరణాల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య వసతులు మెరుగుపరచాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. వి. తిరుపతిరావు (ఆంధ్రప్రదేశ్‌) మాట్లాడుతూ సంవత్సరాల తరబడి వివిధ రాష్ట్రాల్లో గిరిజనులకు కేటాయించిన వివిధ శ్రేణుల ఉద్యోగాలు ఖాళీగా వున్నాయని, ప్రభుత్వాలు బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయడానికి బదులు ఉన్న పోస్టులను రద్దు చేస్తున్నాయని, ప్రభుత్వ రంగ సంస్థల్లో కొన్ని విభాగాల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించడంలేదని, ప్రమోషన్ల విషయంలో గిరిజనుల పట్ల వివక్షత చూపు తున్నారని విమర్శించారు.
మంజూ ముండా (జార్ఖండ్‌) మాట్లా డుతూ నిర్మాణ రంగంలో జార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌, ఒరిస్సా రాష్ట్రాల్లో అత్య ధిక గిరిజనులు కూలీలుగా బతుకీడ్చుతున్నారని అక్కడ కనీస వేతనాలు కానీ, పని ప్రదేశంలో తీసుకోవాల్సిన భద్రతా పరికరాలు అందుబాటులో ఉండటం లేదన్నారు. తరచూ నిర్మాణ రంగ కార్మికులు మరణించడం, దహన ఖర్చులు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొందని వివరించారు. మహిళా కార్మికుల పట్ల లైంగిక వేధింపులను ఖండించారు.
ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ స్మితా గుప్తా (ఢిల్లీ) మాట్లాడుతూ గిరిజన ఉప ప్రణాళికపై తన పరిశోధనా పత్రాన్ని సదస్సులో వివరించారు. గిరిజన గ్రామాల స్థితిగతులపై సర్వే రిపోర్టును ప్రొఫెసర్‌ వికాస్‌ రావల్‌ సదస్సుకు సమర్పించారు.
గిరిజనులు తమ భూములను కోల్పోతున్నారని విద్యుత్‌, ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, కోల్‌ మైనింగ్‌ వల్ల గిరిజనులు నిర్వాసితులౌతున్నారని, న్యాయమైన చట్టబద్ధ్దమైన ఆర్‌ Ê ఆర్‌ ప్యాకేజీలు లేనందున గిరిజనులు వివిధ రాష్ట్రాల్లో తీవ్ర వివక్షతకు గురౌతున్నారని గోపెన్‌ సొరెన్‌ (జార్ఖండ్‌), చమ్రు సొరెన్‌ (ఒరిస్సా), బుద్ధ్దసేన్‌గోండ్‌ (మధ్యప్రదేశ్‌), మిడియం బాబూరావు (ఆంధ్రప్రదేశ్‌) వివరించారు.
దేశంలోనే అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయడంలో త్రిపుర ముందున్నదని, ఒక్క దరఖాస్తును కూడా తిరస్కరించకుండా గిరిజనులకు భూమి పంచిన ఘనత త్రిపుర ప్రభుత్వానిదేనని సలీల్‌ దేవ్‌ వర్మ (త్రిపుర) వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో చింతపండు, తునికాకుపై గిరిజన సంఘం చేసిన పోరాటాలను, వాటి రేటు, బోనస్‌సాధించడంలో విజయాలు సోయం శ్రీనివాస్‌ (ఆంధ్రప్రదేశ్‌)వివరించారు. అటవీ హక్కుల చట్టం కేరళలో అమలు కావడం లేదని కోర్టు వ్యాజ్యాల్లో ఉన్నందున గిరిజనులకు భూమి దక్కడం లేదని విద్యాధరణ్‌ ఖని (కేరళ) ఆరోపించారు.
గుజరాత్‌ నుండి మాట్లాడిన హన్‌స్ముక్‌ వర్లీ 50శాతానికి పైగా అటవీ భూమిపై పెట్టిన దరఖాస్తులు తిరస్కరించారని, సర్వే చేయకుండానే పట్టాలు పంపిణీ చేస్తున్నారని చెప్పారు.
చివరిలో భవిష్యత్‌ పోరాట కార్యక్రమాలకు సంబంధించి ధూళిచంద్‌ మీనా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సదస్సు ఆమోదించింది.
ఈ సదస్సును సమీక్షిస్తూ బిమన్‌ బసు ముగింపు ఉపన్యాసం చేశారు. స్వాతంత్య్రోదమంలో గిరిజన పోరాటాలకు ప్రాధాన్యత ఉన్నదని, నాడు భూమికోసం భుక్తికోసం, స్వాతంత్య్రంకోసం మనదేశంలో గిరిజన తెగలు పోరాడాయని, ఆ పోరాట స్పూర్తితో నేడు వివిధ రాష్ట్రాల్లో గిరిజనోద్యమాన్ని అఖిల భారత స్థాయిలో నిర్వహించాలని కోరారు. రాంచి నుండి ఢిల్లీ వరకు గత దశాబ్ద కాలంలో 5 రాష్ట్రాల నుండి 14 రాష్ట్రాలకు గిరిజనోద్యమం విస్తరించడం మెచ్చదగిన విజయమన్నారు. అయినా ప్రభుత్వాలు గిరిజనులను నేటికీి అడవుల నుండి, భూముల నుండి వెళ్ళగొట్టే విధానాలు చేపడుతున్నాయని, షెడ్యూల్‌ ప్రాంతాల్లోగల విలువైన ఖనిజ సంపదను కార్పోరేట్‌ సంస్థలు కొల్లగొడుతున్నాయని ఫలితంగా గిరిజనులు నిర్వాసితులవుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ఎదురించి గిరిజనోద్యమం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
తీర్మానం
దేశంలో తొమ్మిది కోట్ల దాకా వుండి, సమాజంలో అత్యంత వెనుకబడిన, అణగారిన వర్గాలు, ఈ దేశ పౌరులైన ఆదివాసీల పట్ల భారత రాజ్యం, కేంద్ర ప్రభుత్వం అనుసరిసున్న దారుణ వివక్షపై ఈ సంఘర్ష్‌్‌ సభ తన తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్నది. నయా ఉదారవాద విధానాలు వచ్చాక ఈ అన్యాయం మరింత తీవ్రతరమైంది.
ఈ సదస్సు ముందుకు తెచ్చిన డిమాండ్లు
గిరిజన ఉప ప్రణాళిక (టిఎస్‌పి) నిధులను కనీసం 8.5 శాతానికి పెంచాలి. ఆదివాసీలందరికీ ( రెగ్యులర్‌ ప్రభుత్వ సర్వీసులో ఉన్నవారు మినహా) బిపిఎల్‌ కార్డులివ్వాలి. ఆదివాసీ విద్యుర్థుల రెసిడెన్షియల్‌ స్కాలర్‌షిప్పులు, స్టయిపెండ్స్‌ను పెంచాలి. గిరిజన విద్యార్థుల హాస్టళ్లకు కేటాయింపులు పెంచాలి. ఎస్టీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ను మరిన్ని ఏర్పాటు చేయాలి. ఆదివాసీ కూలీల హక్కులకు రక్షణ కల్పించాలి. ఆదివాసీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. ఎస్టీ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ పారదర్శకంగా, కచ్చితంగా, సింపుల్‌గా వుండేలా చూడాలి.
(రచయిత గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) 
-మిడియం బాబూరావు
Prajashakti News Paper Dated : 27/03/2012 

No comments:

Post a Comment