Thursday, March 8, 2012

పోటెత్తిన తెలంగాణమే మిలియన్ మార్చ్ - విమలక్క



'స్మృతి అనే సంధ్య వెలుగులో/ మనం మరొకసారి కలుసుకుంటె/ మనసారా మాట్లాడుకుందాం' అని ప్రముఖ అరబ్ కవి ఖలీల్ జిబ్రాన్ అన్నట్లు, దూపగొన్న కాకి నీళ్లను వెతికినట్లు, ఇప్పుడు తెలంగాణ ప్రజలు మిలియన్ మార్చ్‌ను వెతుక్కోవాలి. సరిగ్గా దానికి ఏడాది నిండుతున్న సమయంలో వాస్తవాలను వాస్తవాలుగా కుండబద్దలు కొట్టినట్లు మనసారా మాట్లాడుకోవాలి. దాహం తీర్చుకోవడానికి కాకిగులకరాళ్లను ఏరి తెచ్చినట్లు, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలెంచుకున్న మరొక పోరాట ప్రయత్నమే మిలియన్ మార్చ్. ఈ మధ్యకాలంలో ప్రపంచాన్ని కుదిపేసిన జాస్మిన్ రెవల్యూషన్‌లో (మల్లెపూల విప్లవాల్లో) ఈజిప్టు రాజధాని కైరోలోని తెహరీర్ స్క్వేర్‌ను ముట్టడించడాన్ని పోలినదే మిలియన్ మార్చ్. 

తమ ప్రజాకాంక్ష నేరవెరే దాకా హైద్రాబాద్ రాజధాని దిగ్భందాన్ని కొనసాగించాలన్న ప్రజల సంకల్పమే మిలియన్ మార్చ్. ఇది పోటెత్తిన తెలంగాణ ప్రజల మార్చ్. నగరాన్ని ముట్టడించాలన్న ప్రజల సంకల్పాన్ని దెబ్బతీయడానికి యావత్ తెలంగాణనే చుట్టుముట్టి కట్టడిచేయాలన్న పాలకులు పోలీస్ వలయంగా మార్చారు. అడుగడుగునా ఈ విషయవలయాన్ని ఛేదిస్తూ పద్మవ్యూహంలోకి చొచ్చుకుపోయిన అభిమన్యుడిలాగా ప్రజలు నగరంలోనికి చొచ్చుకువచ్చారు. రాష్ట్రంలో పోలీస్‌స్టేషన్‌లన్నీ ప్రజలతో నిండి, హై ద్రాబాద్ నగరమే ఓపెన్ జైలుగా మారినా దాదాపు ఇరవై వేల మంది ప్రజలు ట్యాంక్ బండ్‌కు చేరారు. నిర్భంధాన్ని ఛేదించి వచ్చిన ఈ సంఖ్య ఇరవై లక్షలతో సమానం. 

నాలుగుకోట్ల ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపం. ఆంతరంగిక వలస దోపిడీదార్లపై, వంచనాపూరిత కాంగ్రెస్ పాలకుల పై, రెం డుకండ్ల సిద్ధాంతంపై, చివరకు రాజీవాద ఉద్యమ నాయకత్వంపై, నాలుగు కోణాల్లో వెల్లువెత్తిన ప్రజానిరసన ఇది. దీన్ని కేవలం విగ్రహ విధ్వంస కార్యక్రమంగా చిత్రించిన వలసవాద మీడియా వాస్తవాలకు మసిబూసి మారేడుగాయ జేసింది. అలాగే వలస దోపిడీదార్లతో పా టు నాలుగు రూపాల్లో తెలంగాణ వ్యతిరేక శక్తులకు ప్రతీకగా (సింబాలిక్‌గా) విగ్రహాలపై వ్యక్తమైన ఆగ్రహమే సర్వస్వంగా చిత్రించి సంతృప్తి పడే కోణం తెలంగాణ ఉద్యమంలోను వ్యక్తమయ్యే పరిమితిగా మనముందుకు వచ్చింది. 

పార్లమెంటు ఉభయసభల్లో చిదంబరం ప్రకటనను వెనక్కునెట్టేంత శక్తి సీమాంధ్ర కుబేరులకు ఉందనేది మరొకసారి తేలిపోయింది. అది కేవలం చిదంబరం వ్యక్తిగత ప్రకటనే గాదు, కేబినెట్ నిర్ణయమని కూడా తదనంతరం స్పష్టమైపోయింది. ఆనాడు విశాలాంధ్ర భావన సామ్రాజ్యవాద ఆధిపత్య తత్వమన్న జవహర్‌లాల్ నెహ్రూను, నేడు ఏకంగా కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని ఉల్టాపల్టా చేసిన సీమాంధ్ర పాలకుల ఆర్థిక- రాజకీయ ఆధిపత్యాన్ని సవాల్ చేయడానికి తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ (టియుఎఫ్) రాజధాని దిగ్బంధాన్ని ఒక పోరాటరూపంగా స్వీకరించింది. 

మార్చి8తో పాటు మిలియన్ మార్చ్‌ను కూడా కలిపి బాటలో బతుకమ్మ ఆడుదాం రమ్మంటూ ప్రచారంలో పెట్టింది. అందుకే పొలిటికల్ జెఎసి ఇచ్చిన పిలుపును సంపూర్ణంగా బలపరిచింది. దీనికి మద్దతుగా, విస్తృతంగా తెలంగాణ పది జిల్లాల్లో క్యాంపెయిన్ నిర్వహించింది. దీనికి టిఆర్ఎస్ కూడా మద్దతు ప్రకటించినా కార్యక్రమం విజయవంతానికి సంపూర్ణ కృషిచేస్తూ అది తన శక్తియుక్తులన్నీ వెచ్చించలేకపోయింది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ చూసినా రాజధాని దిగ్బంధనం ఆయా పాలకుల ఆర్థిక - రాజకీయ జీవనాడుల దిగ్బంధనంగానే ఉంది. 

అది చైనాలోని తియాన్‌మెన్ స్క్వేర్ అయినా, నేపాల్‌లోని ఖాట్మండు అయినా, ఈజిప్టులోని కైరో అయినా, రాజస్థాన్‌లోని గుజ్జర్‌ల ఆందోళనయినా ఈ అనుభవమే మనకు కనబడుతుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అపహాస్యం పాలయినప్పుడు దాన్ని నిలవేయడానికి ప్రజల ముందు మరో ప్రత్యామ్నాయం లేదు. పైగా శ్రీకృష్ణకమిటీ వంచన గురించి మేము మొదటి నుంచీ చెబుతున్న విషయమే బట్టబయలు కావడంతో ఇక మరో మార్గాంతం లేకపోయింది. ప్రజల ఆగ్రహం కట్టలు తెగిపోయింది. 

అది తాడో పేడో తేల్చుకొనే స్థితికి అడ్డుకట్ట వేయడానికి పాలకులు ప్రయోగించిన నిర్బంధం ఒక ఎత్తయితే, రాజకీయ జెఎసి మొత్తం పోరాట శక్తులన్నింటినీ ఐక్యం చేసి రాజీలేని పోరాటానికి సిద్ధంగాక పోవడం మరో ఎత్తయింది. అందుకే ఇది కూడా దశలవారీ కార్యక్రమంగా, సింబాలిక్ ప్రొటెస్ట్‌గా మారిపోయింది. 2009 డిసెంబర్ 10 నాడు ఏ విద్యార్థుల ఛలో అసెంబ్లీ కార్యక్రమం, డిసెంబర్ 9, 2009న తెలంగాణ అనుకూల ప్రకటనకు అవకాశం కల్పించిందో, తిరిగి మిలియన్ మార్చ్ అటువంటి ప్రకంపనలు సృష్టించలేకపోయింది. దీన్ని పాఠంగా తీసుకోవాల్సిన అవసరం నేడు ఎంతయినా ఉంది. 

మిలియన్ మార్చ్‌కు వివిధ ఉద్యమవేదికలు మద్దతునిచ్చి పాల్గొన్నట్టే మేము సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర అమరవీరుల స్థూపం నుంచి ఊరేగింపుగా బయలుదేరాము. సిటీలైట్ హోటల్ వద్ద మా ర్యాలీని అడ్డుకున్న పోలీసులు టి.యు.ఎఫ్ సెక్రటరీ జనరల్ దిలీప్‌కుమార్‌తో పాటు నన్ను మరో 50 మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు. మహంకాళి పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారు. అక్కడి నుంచి గోడదూకి నేను మరికొంతమంది టి.యు.ఎఫ్ కార్యకర్తలం రహస్యంగా ట్యాంక్‌బండ్ చేరాము. ఎన్డీ కార్యకర్తలు పెండ్లి కార్యక్రమాలతో అక్కడికి దూసుకొచ్చారు. 

హరీష్‌రావు పడవపై వచ్చాడు. కానీ పోచమ్మ గుడిదగ్గరి నుంచి నిచ్చెన వేసుకొని తెలంగాణ ఉపాధ్యాయ వేదిక (టి.టి.ఎఫ్) కార్యకర్తలు మొట్టమొదటిగా ట్యాంక్ బండ్ చేరి తెలంగాణ విజయకేతనం ఎగరేశారు. నేను ట్యాంక్‌బండ్ చేరానన్న టివి వార్తలు చూసి పోలీసు ఉన్నతాధికారులు మొట్టికాయలు వేయడంతో, నాతో పాటు అరెస్టయిన సహచరులందరిని చితకబాదిన స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అత్తమీది కోపం దుత్తమీద తీశాడు. అయితే అడుగడుగునా సాగిన నిర్బంధం, పాలకుల మోసం, సీమాంధ్ర కుబేరుల పరిహాసం, 

శ్రీకృష్ణ కమిషన్ వంచన, రెండు కండ్ల పేరిట రెండు మూతల వైనం, రాజీవాద తెలంగాణ నాయకత్వపు చర్యలన్నీ తీవ్రమైన కోపాగ్నిగా మారాయి. అక్కడ కె.కేశవరావు, మధుయాష్కీగౌడ్‌లపై జరిగిన దాడి ప్రభుత్వంపై చేసిన తిరుగుబాటు మాత్రమే. ప్రజానుకూల ప్రతిమలను మినహాయించి జరిగిన విగ్రహ విధ్వంసం సీమాంధ్ర దోపిడీ శక్తులపై వ్యక్తమైన ఆగ్రహం మాత్రమే. రాజీవాద నాయకత్వంపై కూడా ప్రజలు ఇదే బుద్ధిచెప్పడానికి సిద్ధపడ్డారు. 

కావునే మిలియన్ మార్చ్‌ను ఎంతగా అణిచివేయజూసినా, రాజకీయంగా విద్రోహం తలపెట్టజూసినా (ఖ్చిఛ్చ్టజ్డ్ఛీ) ప్రజల ప్రతిఘటనా శక్తిని నిలువరించలేరని నిరూపించిన అపురూప ఘట్టం. దీనిని మరొకసారి తెలంగాణ కోసం పోరాడే ఉద్యమశక్తులన్నీ కలిసికట్టుగా జరిపి తెలంగాణ సాధించుకునే దాకా పట్టుదలగా కొనసాగించాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీల రాజీవాద చర్యలను ఓడిస్తూ తెలంగాణ విద్యావంతుల వేదిక, ఉద్యోగ సంఘాలు, ఉద్యమ వేదికలన్నీ పూనుకొని నిజమైన ఐక్యత కోసం పాటుపడి రాజీలేని పోరాటానికి సిద్ధం కావాలి. 

వనరులను, కొలువులను సంరక్షించుకుంటూ వలసపాలకులు పరాయీకరించిన హైద్రాబాద్‌ను తెలంగాణీకరించడానికి పూనుకునే లక్ష్యంతో ముందుకు సాగడానికి దోహదపడకుంటే 'మిలియన్ మార్చ్' ఒక ఘటన మాత్రమే అవుతుంది. అదే సరైన గుణపాఠాలతో మరో మార్చ్‌కు సిద్ధమై హైద్రాబాద్‌ను ఆర్థిక - రాజకీయ దిగ్బంధనం చేసే దిశగా పయనిస్తే తెలంగాణ సాకారమవుతుంది. మిలియన్ మార్చ్ సజీవ చరిత్రగా మలచడానికి మార్చి 10, 2012 నాడు నిజమైన తెలంగాణ శక్తులంతా ప్రతినబూనుదాం. తెలంగాణ ప్రజలకు నేనిస్తున్న సందేశం ఇదే. 

- విమలక్క
కో చైర్‌పర్సన్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్
(మిలియన్ మార్చ్‌కు రేపటితో ఏడాది)
Andhra Jyothi News Paper Dated : 09/03/2012 

No comments:

Post a Comment