Friday, September 28, 2012

జీవ వైవి«ధ్యాల వైరుధ్యాలు! - సుజాత సూరేపల్లి



ఎన్ని రకాలుగా అడవులని, సహజ వనరులని నాశనం చేయవచ్చో పరిశోధనలు చేస్తున్న పెద్ద దేశాలకి, వాటికి ఊడిగం చేస్తూన్న చిన్న దేశాలకి ఇట్లాంటి సదస్సు అవసరమా అన్నది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న... ఒక్కో సంస్కృతిని ఒక్కో రకంగా పేర్లుపెట్టి, బొందపెడుతున్న మనం జీవులను, వైవిధ్యం గురించి మాట్లాడుట నయా జీవన విధానానికి ఒక నమూనా... వైవిధ్యాల వైరుధ్యాలతో మునిగి ఉన్న ప్రపంచ దేశాలకి తెలంగాణ పోరాటం ఒక కనువిప్పు కావాలి. 


దాదాపు ఏడు వేల కోట్ల బడ్జెట్, 193 దేశాల నుంచి పదివేల మంది ప్రతినిధుల రాక, అట్టహాసంగా ప్రపంచ జీవ వైవిధ్య సదస్సు. అది కూడా తెలంగాణ ముఖ్య పట్టణం, రాజధాని హైదరాబాద్‌లో. ఐక్యరాజ్యసమితికి, ప్రపంచ దేశాలకి, ఆర్థికంగా ముందున్న దేశాలకి జీవ వైవిధ్యం గురించి మాట్లాడాలని ఒక తలంపు వచ్చింది. అవి పర్యావరణం, జీవావరణం, ఆవరణం లాంటి అందమైన పదాలే కావొచ్చు కానీ అవి కూడా ఉన్నవి ఈ సృష్టిలో అని చెప్పుకోవడానికి ఇది ఒక మంచి మోఖా! ఇంతకు ముందెన్నడు ఇంత పెద్ద సదస్సు జరగలేదని తెగ హైరానా పడుతున్నారు పాలకులు.



ప్రపంచంలో భిన్న వైవిధ్యాలు ఉన్న 17 దేశాలలో మన దేశం ఒకటి. అంతే కాదు జీవ వైవిధ్యాన్ని అతి వేగంగా కోల్పోతున్న దేశాలలో కూడా మన దేశం ఒకటి. వైవిధ్యం గురించి మాట్లాడే అర్హత మనకు కానీ, ఒక పక్క పర్యావరణాన్ని నాశనం చేస్తూ దానికి అభివృద్ధి అని పేరు పెడుతూ రెండు పాత్రలలో బాగా జీవిస్తున్న ఏ దేశానికి గానీ లేదు. ఎన్ని రకాలుగా అడవులని, సహజ వనరులని నాశనం చేయవచ్చో పరిశోధనలు చేస్తున్న పెద్ద దేశాలకి, వాటికి ఊడిగం చేస్తూన్న చిన్న దేశాలకి ఇలాంటి సదస్సు అవసరమా అన్నది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న.



అయినా ఫరవాలేదు. మనం ఇప్పటికైనా వైవిధ్యాల గురించి మాట్లాడుతున్నాం (కనీసం అనుకుందాం). వైవిధ్యంలో అందం, ఆనందం ఉంది. అది మనుషులకి, జీవులకి చరాచర రాసులకి ఒకేలాఉంటుంది అని చెప్పడానికి అతి పెద్ద చదువులు, సోకాల్డ్ తెలివితేటలు అవసరం లేదు. ఇక్కడ ఒక పశువుల కాపరిని, వ్యవసాయదారుని, మత్స్యకారుని, ఒక అడవిబిడ్డను అడిగితే చెప్తారు ప్రకృతిని ప్రేమించడం అంటే ఏమిటో. చెట్టులో, పుట్టలో, జంతువులలో, పంచ భూతాలని పూజ చేస్తూన్న ప్రజలకి జీవవైరుధ్యం గురించి ఒక అవగాహన జీవితంలో ఒక భాగంగానే ఉంటుంది.



కానీ ప్రపంచమంతా ఒకే మూసలో పోసినట్టు ఉండాలనే తపనతో భిన్న సంస్కృతులను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తున్న ప్రపంచీకరణ నమూనాలు ఇప్పుడు వైవిధ్యం అని మాట్లాడడం వైరుధ్యమా? పరిహాసమా? ఏమో కొన్ని వేలకోట్లు పెట్టి, అన్నిదేశాల నుంచి ప్రతినిధుల మేళాల నిర్వహణ ద్వారానే జవా బు దొరుకుతుంది అనుకోవచ్చు. అది కూడా హైటెక్ హంగామాలతో మాత్రమే. వేతనాలకి, జీతాలకి, తాగునీరుకి, విద్యకి, వైద్యానికి పైసల్లేవ్ అనే ప్రభుత్వాలకు ఏడు వేలకోట్లు కుచ్ భి నహీన్! గరీబీ హఠావో కాదు గరీబోన్ కో హఠావో అన్నట్టుగానే ఉంది ఇప్పుడు పరిస్థితి.



అసలు వైవిధ్యాలని వ్యతిరేకించే ప్రభుత్వాలు ఇంత పెద్ద వ్యవహారానికి ముందుకు రావడాన్ని అభినందించాలి. ప్రపంచం అంతా తెల్ల తోలు తొడుక్కోవాలని, అందరూ ఒకేరకమైన పిజ్జా, బర్గర్ లాంటి ఆహారం తినాలని, నైకి, అడిడాస్ కంపెనీల బూట్లు, పేక మేడల ఇండ్లు, ఒకే రకమైన కార్లు, కంపెనీలు, ప్లేస్టేషన్లు, టాబ్లెట్లు, నోట్‌బుక్‌లు వాడాలని, వాల్ మార్ట్‌లు, పెద్ద పెద్ద మాల్స్ తప్ప, చిన్నచిన్న సంతలు, అంగళ్లు, కిరాణా దుకాణాలు ఉండకుండా అన్నీ ఒకేలాగా ఉండాలని శాసిస్తున్న దేశాలు ఇప్పుడు వైవిధ్యాల గురించి మాట్లాడుతున్నై బ్రదర్! ఒక్కో సంస్కృతికి ఒక్కో రకంగా పేర్లుపెట్టి, బొందపెడుతున్న మనం జీవులను, వైవిధ్యం గురించి మాట్లాడుట నయా జీవన విధానానికి ఒక నమూనా.



ఇక రాజకీయ చర్చలోకి వస్తే ఇక్కడ జరుగుతున్న జీవ వైరుధ్యం గురించి మాట్లాడుకుంటే, సెప్టెంబర్ 30న తెలంగాణ వాదులు తలపెట్టిన మార్చ్‌ని బంద్ పెట్టున్రి అని కొంత మంది నాయకులు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు. కొన్ని సంస్థలు వీటికి అనుగుణంగా మాత్రమే పనిచేసే ప్రభుత్వ విభాగాలు మార్చ్ జరపొద్దని డిమాండ్ చేస్తున్నాయి. ఎక్కడపడితే అక్కడ ఉద్యమకారులని అరెస్ట్ చేస్తున్నారు. వందలకొద్దీ పోలీసులు రోడ్లమీద తనిఖీలు చేస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది అని కూడా వాపోతున్నారు ఇంకా కొందరు. అసలు హైదరాబాద్ బ్రాండ్ ఇక్కడ నివసించే వాళ్ళని అడగాలి. అతి గొప్ప సంస్కృతికి చిహ్నంగా నిలిచింది హైదరాబాద్. 



'గంగా జమునా తెహజీబ్' అని బ్రాండ్ ఉన్న తెలంగాణ గడ్డ ఇక్కడ భాష, తిండి, సంస్కృతి సంప్రదాయాలని వలసవాద సంస్కృతిలో కోల్పోయింది. ఈ భూమి మొత్తం ఆక్రమణకి గురై అల్లాడుతున్నది. మాకు మా బతుకు కావాలె, పరాన్న భుక్కులై మా జీవితాలను, ప్రాంతాలను ఆక్రమించిన ఈ వలసాంధ్ర సంస్కృతి నుంచి మేము విముక్తి కొరకు పోరాడుతున్నాము. అందులో భాగంగానే ఇప్పుడు మార్చ్ చేస్తున్నాం అన్న సంగతి. 1969లో 360 మంది యువకులు రాజ్యహింసకి బలైతే, 2009 నుంచి దాదాపు 800 మంది ఉద్యమకారులు, యువకులు ఆత్మ బలిదానాలిచ్చినారు. జొన్నరొట్టెకి, పుల్ల అట్టుకి, అట్ల తద్దికి, బతుకమ్మకి ఉన్న సంస్కృతిని కాపాడాలనే ఈ తెలంగాణ ఆరాటం, దాని కోసం తెగబడి కొట్లాడుతున్నది. అవును నీ ఇడ్లి బండికి అడ్డా, జాగా నీది నీకే ఉండాలని కదా కొట్లాడుతున్నది. కాని పచ్చల్లతోనివచ్చి, పొట్ట చేతబట్టుకొని వచ్చి ఇక్కడ జీవితాలని కబ్జా చేసి, నా భాషని, యాసని ఎక్కిరిస్తే ఇంకెక్కడి వైవిధ్యం భాయ్? ఇక్కడ కోట్లకొద్ది మనుషులుబతికినా జీవచ్ఛవాల లెక్క మిగిలున్నారు.



పాలకులారా! చంచా యుగకర్తలారా! ఎవరికన్నా ఇక్కడి వేదన అర్థమయ్యే మనస్సుంటే అర్థం చేసుకోండి. తెలంగాణ చరిత్ర తెలుసుంటే పోలీసులు, కేసులు అరెస్టులు ఇక్కడ పుట్టిన బిడ్డని ఏమీ చేయలేవని మీరు తెలుసుకోలేనంత పనికిమాలిన వాళ్ళు అని ఇక్కడి ప్రజలు అనుకోవట్లేదు. రక్తాలు ఏర్లు అయి పారిన గడ్డ ఇది. జైళ్ళు మొత్తం నిండి, యేండ్ల కొద్ది జీవితాలను అంకితం చేసి ఉద్యమాలను నడిపిస్తున్న బిడ్డలను కన్న గడ్డ ఇది. భూమికోసం, భుక్తికోసం, విముక్తి కోసం ఇయ్యాల తెలంగాణ మొత్తం కదిలొస్తున్నది. తెలంగాణ జీవితాన్ని కాపాడుకోవడానికి, ఇక్కడి ప్రాంత వైవిధ్యాన్ని గురించి ప్రపంచానికి చెప్పడానికి ఇది మంచి సమయంగా భావించండి. ఇది ప్రజల యాత్ర, పోరు, మరొక స్వతంత్ర పోరాటం అని చెప్పటానికి తెలంగాణ గడ్డ ఇల్లిల్లు కదిలొస్తున్నది. ఇది వేల కోట్లు వెచ్చించి చేస్తూన్న సదస్సు కంటే గొప్పది, ఇట్లాంటి పోరాటం చూడడం ఇక్కడకి వచ్చే ప్రతనిధులకి మీరిచ్చే బహుమానం.



మీకు గత అనుభవాలు పాఠాలు నేర్పలేదా? మీరు అడ్డంపడి ఎప్పుడైనా ఏ కార్యక్రమం అన్నా ఆపగలిగినారా? ఆడవాళ్ళు, ఆదివాసీలు, ముస్లింలు, హిందువులు, అన్ని కులాల వాళ్ళు, అన్ని ఉద్యోగ సంఘాలు సద్దన్నం మూటలు కట్టుకొని సంసిద్ధంగానే వొస్తున్నరు తెలంగాణ మార్చ్‌కి. రెచ్చగొడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ప్రతిసారి ఒకరో ఇద్దరో అమాయకులు బలి అయినారు మీరుచేసే చేష్టల తోటి. ఇదే ట్రెండ్ మళ్లీ కొనసాగకుండా కాపాడుకోవాలే.



ఉద్యమనాయకులు ఒక మెట్టు దిగివచ్చి తమ పార్టీలను కాపాడుదాం అనే ఆశతో ఉన్నారు. కేంద్రం మల్లొక చచ్చు ప్రకటన ఇచ్చి సదస్సును ఎలాగైనా జరపాలని చూస్తున్నది. ఉద్యమాన్ని చల్లబరచాలని చూస్తే ఉప్పెనలై ఉరికొస్తారు ఇక్కడి ప్రజలు. కానీయండి, ఈ జీవన పోరాటానికి మద్దతు తెలపకపోయినా ఫరావాలేదు. కనీసం అడ్డం పడకండి. విన్నపాలు, వేడుకోలు ఇక జాన్తానై. వైవిధ్యాల వైరుధ్యాలతో మునిగి ఉన్న ప్రపంచ దేశాలకి తెలంగాణ పోరా టం ఒక కనువిప్పుకావాలి. అతిథుల కొరకు మీరు పడే ఆరాటంలో ఈ ప్రాంతం వారు ప్రాణాలకు తెగించి చేస్తూన్న పోరాటానికి పదో వంతు సహాయాన్నన్నా అందించిండి.



చివరగా ఢిల్లీలో చక్రం తిప్పుతున్న నాయకులకి, ఇక్కడ ఉండి ఒకటి రెండు సినిమా డైలాగ్‌లు లాగా టీవీల ముందు కూర్చుని మాట్లాడుతున్న వారికి కూడా ఇదే ఆఖరి పిలుపు. ఇప్పుడు మార్చ్‌కి రాకపోతే ఇంకెప్పుడు మీరు వోట్ల కోసం ప్రజల వద్దకు మార్చ్ చేయడానికి అర్హులు కాదు. ప్రతి ఒక్కరి రాజకీయ డ్రామాల చిట్టా తెలంగాణ ప్రజల వద్ద భద్రంగా ఉంది. ప్రజా పోరాటాలకు విలువనిస్తే ఇంత పెద్ద సదస్సులు పెట్టుకునే అవకాశం ఏ దేశానికి రాకపోవచ్చు. ఇదే తెలంగాణ ప్రపంచానికి ఇచ్చే సందేశం.



- సుజాత సూరేపల్లి
Andhra Jyothi News Paper Dated : 29/09/2012 

No comments:

Post a Comment