Friday, September 7, 2012

ప్రాణాలు తీసేందుకే ప్రాజెక్టులా? ---జంజర్ల రమేష్‌బాబు



విధ్వంసం, నిర్బంధం పాలనా విధానంగా మారిన కాలంలో మనం ఉన్నాము. ఒక జాతిని మరొక జాతి పీడించే దురన్యాయానికి ఆమోదం లభించే అప్రజాస్వామిక పాలనకు సజీవ సాక్షీభూతులుగా బతుకుతున్న సమాజం మనది. లేకపోతే మూడు లక్షల మంది ఆదివాసులను, లక్షా యాభై వేల ఎకరాల భూమిని, 400 గ్రామాలను, వేలాది ఎకరాల రిజర్వుఫాస్ట్‌ను, పరిసరాలతో తరాలుగా పెనవేసుకున్న అనుబంధాన్ని తెంచివేస్తూ ‘ప్రపంచ ఆదివాసీ దినం’ సందర్భంగా, ఏ చట్టబద్ధ అనుమతులు లేకున్నా పోలవరం ఆపే ప్రసక్తే లేదు’ అని మాట్లాడటం ఊహించగలమా? రాజ్యాంగం కల్పించిన అన్నిరకాల హామీలను, రక్షణలను, హక్కులను బేఖాతరు చేస్తూ ముఖ్యమంత్రి పోలవరాన్ని నిర్మిస్తానని అంటున్నారు. ప్రాజెక్టు నిర్మించడం ద్వారా ఆదివాసులను, దేశాన్ని అభివృద్ధి చేస్తామనే వాళ్ళు దేన్ని అభివృద్ధిగా పేర్కొంటున్నారు? దానికి కొలమానం ఏమిటి? మానవీయ స్పందనను, ప్రజాస్వామిక స్ఫూర్తిని కోల్పోయిన మన ప్రభుత్వాలు ఏ విలువల వైపు పయనిస్తున్నాయి?

తాను తిరగాడే నేలను, బతుకుతెరువునిస్తున్న ప్రాంతాన్ని, పెంచుకున్న అనుబంధాన్ని తెంచుకుని నిర్వాసితుడు కావాలని ఏ మనిషి కోరుకోడు. అందులోనూ అడవితో జీవనం ముడిపడి ఉన్న ఆదివాసులు అసలే కోరుకోరు. కట్టూ,బొట్టూ,కట్టుబాట్లలో వైవిధ్యం కలిగిన ఆదివాసులకు తాము నిర్మించుకున్న ప్రపంచం అంటూ ఒకటి ఉంటుంది. వారికి ఒక ఆవరణం ఉంటుంది. రాజ్యాంగం ద్వారా వారి హక్కులను కాపాడుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు వారికి ప్రధాన శత్రువై ఆదివాసీ జాతి అంతానికి కోరలు చాస్తున్నది. పోలవరాన్ని నిర్మించడం ద్వారా వారి సంస్కృతి, సంప్రదాయాలను, అస్తిత్వాన్ని రూపుమాపే కుట్రకు పాల్పడుతున్నది. 

ప్రభుత్వ అంచనాల ప్రకారమైనా, ‘సెస్’ రిపోర్టు ప్రకారమైనా, ఆంధ్రవూపదేశ్‌లో 276 గ్రామాలు, ఒడిషాలో 24, ఛత్తీస్‌గఢ్‌లో 12 గ్రామాలు, లక్షా యాభై వేల ఎకరాల భూమి 8 వేల ఎకరాల రిజర్వుఫాస్ట్, అరుదైన జీవజాతులు, ఔషధమొక్కలు, పేరాంటాలపల్లి, పాపి కొండలు లాంటి రమణీయ ప్రాంతాలు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా మునిగిపోనున్నాయి. ఇంతచేసి ప్రభుత్వం సాధించే డెల్టా ఆయకట్టు స్థిరీకరణ, కొత్తగా సాగులోకి వచ్చే వ్యవసాయ భూమి ఎంత? ప్రభుత్వం చెపుతున్నట్టుగా ఏడు లక్షల ఇరవై ఒక్కవేల ఎకరాలు అంకెల గారడీ మాత్రమే! తీరవూపాంతంలో నెలకొల్పుతున్న ‘ఇండవూస్టీయల్ కారిడార్’కు నీటిని అందించడం ద్వారా బహుళజాతి కంపెనీల ప్రయోజనాలు కాపాడడం కోసమే. అభివృద్ధి అంటే ప్రకృతివనరులు, వృక్షసంపద, జంతుసంపదలు నాశనం చేయడం కాదని, అలాగే ఒక వర్గం ప్రజల ఆదాయ అవకాశాలను మెరుగుపరచడం కోసం ఇతర ప్రాంతాల ప్రజల భవిష్యత్తును బలి పెట్టడం కాదని అంతర్జాతీయ ప్రాజెక్టుల కమిషన్ తేల్చిచెప్పింది. ప్రజలలో ’భారీ నిర్మాణాల’పట్ల ఉన్న ఆరాధనాభావం వారి అవినీతి కార్యకలాపాలకు చట్టబద్ధత కల్పిస్తున్నది. కాబట్టి అవి ప్రజలను లబ్ధిపొందే వారిగా, నష్టపోయేవారిగా విభజించడం ద్వారా విద్వేషాలను పెంచుతున్నాయి. అందుకే నిర్లజ్జగా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకుంటున్నది. ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న వారిపై అభివృద్ధి వ్యతిరేకులుగా ముద్రలు వేస్తున్నది. ఈ దేశంలో నిరసన తెలపడం కూడా రాజవూదోహాంగా పరిగణించే స్థితి ఉన్నది. ఉద్యమకారులపై రకరకాల చట్టాల పేరిట నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేవలం సాగునీరు, తాగునీరు, అభివృద్ధిలాంటి వాటితోనే ముడిపడి లేదు. ఇది మానవహక్కుల సమస్య. ఇది ఆదివాసుల సమస్య మాత్రమేకాదు, పర్యావరణ సమస్య. రాజ్యాంగం 5,6 షెడూల్డ్ ద్వారా గవర్నరు అధ్వర్యంలో ఆదివాసుల అభివృద్ధిని, వారి ఇష్టాయిష్టాలపై ఆధారపడి గిరిజన సలహామండలి సలహాతో పాలించే వీలు కల్పించింది. 1/70 చట్టం ద్వారా ఏజెన్సీ ఏరియాలో ఆదివాసేతరుల అక్రమ చొరబాట్లను నిషేధించింది. భూముల క్రయ విక్రయాల పట్ల కఠిన వైఖరిని తెలియజేసింది. పెసా లాంటి చట్టం ద్వారా గ్రామసభ ఆ ప్రాంత అభివృద్ధి నిర్ణయించే అధికార కలిగి ఉంటుంది. ఆదివాసులకు అనేక హక్కులు, రక్షణలు ఉన్నాయి. వీటన్నింటిని తుంగలో తొక్కడం ద్వారా ప్రభుత్వం తన దోపిడీ నీతిని బయట పెట్టుకుంటున్నది. నిరంకుశంగా ఏజెన్సీ ఏరియాల్లోకి చొరబడి, ఆ ప్రాంతాల్లో నిక్షిప్తమై ఉన్న ఖనిజ సంపదను, అటవి సంపదను పెట్టుబడిదారులకు, యం.యన్.సి. కంపనీలకు దోచిపె ప్రయత్నిస్తున్నది. 

పోలవరవం నిర్మాణం పట్ల అభ్యంతరాలు కేవలం ఆంధ్రవూపదేశ్‌కే పరిమితమై లేవు. తమ రాష్ట్రాలలోని ఆదివాసీప్రాంతాల మునక పట్ల, వారి నిర్వాసిత్వం పట్ల ఒడిషా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు సైతం అభ్యంతరాలను వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. 1986 రిపోర్టులో కేంద్ర జల సంఘానికి తెలియజేసిన వివరాల ప్రకారం ఈప్రాజెక్టు సామర్థ్యం 36లక్షల క్యూసెక్కులుగా నిర్ణయించింది. కాని తదనంతరం దానిని 50లక్షల క్యూసెక్కుల సామర్థ్యంగా పెంచబడింది. డిజైన్ మార్చినా దానికి తగిన అనుమతులు తీసుకోలేదని సి.డబ్యూ.సి. దృష్టికి తీసుకురావడంతో నివేదికను తిప్పి పంపడం జరిగింది. 1986లో భారీవరదల కారణంగా (36 లక్షల క్యూసెక్కులు,182అడుగుల నీరు) భద్రాచలం రామాలయం గుడి మెట్ల వరకు మునిగిపోయింది. డ్యామ్ నిర్మాణం తర్వాత 50లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రమాదం ఉంటుందని అంటున్నారు. 2010 అగస్టు 7న నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ తీసిన ఉపక్షిగహ చిత్రం 28.5 లక్షల క్యూసెక్కుల నీరు వల్ల 369 గ్రామాలు మునుగుతాయని హెచ్చరించింది. అంటే 50 లక్షల క్యూసెక్కుల నీటితో మునిగే గ్రామాలను ఊహించగలమా? అంతే గాక ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాజెక్టు కింద ఉన్నవూపాంతాలు, 25 నుంచి 30 లక్షల జనాభా, ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి అంతా కూడా జల సమాధి అవుతుంది. 

అందుకే విధ్వంసకర అభివృద్ధికి సజీవసాక్ష్యంగా నిలుస్తు న్న  Telaపోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆదివాసులు మరోసా రి పోరాటానికి సిద్ధమవుతున్నారు. పచ్చికబయళ్ళలో, వెన్నె ల రాత్రుల్లో జరుపుకునే అకాడి పండుగలకు, కొత్తల పండుగలకు, గోదావరి తీరానికి దూరం అవుతామనే అందోళన చెందుతున్నారు. తమ సంస్కృతిని, సంప్రదాయాలను, జాతి ని అంతం చేసే అధికారం ప్రభుత్వాలకు ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు. జల్, జంగల్, జమీన్ కోసం, ఆత్మ గౌరవం కోసం పోరాడిన తమ ఆదివాసీ వీరులు రాంజీగోండు, బిర్సాముండా, గుండాధర్, కొమరంభీమ్, సమ్మక్క సారలమ్మల ను గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పపూల వనాలలో దాచుకున్న విల్లంబులను తీసేలా తమ ను రెచ్చగొట్టవద్దని హెచ్చరిస్తున్నారు. అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసం పాలకులకు పట్టడం లేదు. పర్యావరణం, జీవావరణం అన్న పదాలు వారికి నచ్చడం లేదు. అభివృద్ధి అంటే అర్థమే నిర్వాసిత్వానికి పర్యాయ పదంగా ఉండటమే నేటి సమాజపు విషాదం. 

-జంజర్ల రమేష్‌బాబు 
పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక ఐక్య పోరాట వేదిక (పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ‘ గిరిజన సంక్షేమ పరిషత్’ చేస్తున్న రిలే నిరాహార దీక్షల సందర్భంగా

Namasete telangana news papaer date: 2/09/2012 

No comments:

Post a Comment