Monday, September 3, 2012

వర్గీక‘రణం’ ఇంకా ఎంతకాలం? ----అద్దంకి దయాకర్


షెడ్యూల్డ్ కులాలను వర్గీకరించాలని చంద్రబాబు మళ్లీ తీర్మానించి మాదిగలకు సామాజిక న్యాయం చేస్తానని ముందుకు రావడం ఆశ్చర్యపడే అంశమేమీ కాదు.1994 నుంచి దండోరా ఉద్యమానికి మద్దతు అంటూ తెలుగుదేశం పార్టీ మాదిగల ఓట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఉన్నది. 2004లో టీడీపీ అధికారం కోల్పోయాక మాదిగలు వర్గీకరణను మరిచిపోయారు. వర్గీకరణ చట్టం 1999 డిసెంబర్‌లో అసెంబ్లీలో ఆమోదం పొంది, 2000 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. దానికి ప్రధాన కారణం ‘దేశం’ ప్రభుత్వ కుతంత్రమే అనేది జగమెరిగిన సత్యం. అయితే రాష్ట్రాలకు రిజర్వేషన్లను విభజించే హక్కులేదని, కులాల వారీగా వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకమని, సూక్ష్మస్థాయిలో వర్గీకరణ చెల్లదని మాలలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆంధ్రవూపదేశ్ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం-2000ను చెల్లదని కొట్టివేసింది. తనకు ఉన్న అధికారంతో కేంద్రపరిధిలోని అంశంలో తలదూర్చి బాబు మొట్టికాయలు తిన్నాడు. అలాగే తాను రాష్ట్రంలో చేసిన చట్టానికి రాజ్యాంగబద్ధత కోసం కనీస ప్రయత్నం చేయలేదు. 2000లో చట్టం చేసి 2004 వరకు చేతులు ముడుచుకుని కూర్చున్నాడు. కేంద్రంలో చక్రం తిప్పిన బాబు తను చేసిన చట్టానికి పార్లమెంటు ఆమోదం కోసం ప్రయత్నించలేదు. ఎందుకంటే రిజర్వేషన్ల వర్గీకరణను కేంద్ర ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలు వ్యతిరేకిస్తాయని తెలుసు. ‘లా- బోర్డు’ సూచనలను పక్కనపెట్టి తన స్వార్థం కోసం మాదిగలను మోసం చేశాడు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాతనైనా మాదిగల పక్షాన నిలబడి పోరాటం చేశాడా అంటే అదీలేదు! దీనికంతటికీ కారణం మాల, మాదిగలు కలిసి ఉంటే తమకు అధికారం దూరమవుతుందనే కుట్ర తప్ప మరొకటి కాదు. 2011 జనాభా లెక్కల ప్రకారం దాదాపు 18 శాతంగా ఉన్న దళితులు ఐక్యంగా ఉంటే మిగతా వారికి అధికారం దక్కదనే కుట్రతోనే అన్ని అగ్రకుల పార్టీలు వర్గీకరణకు మద్దతునిస్తున్నాయి.

దళితులకు రాజ్యాధికారం అనే కల ఉత్తవూపదేశ్‌లో సాకారం కావడాన్ని గమనించిన పార్టీలు భయంతో పదేపదే వర్గీకరణ జపం చేశాయి. దాని కోసం మందకృష్ణను వాడుకున్నాయి. అయితే అసలు విషయం సుప్రీంకోర్టు రిజర్వేషన్ల వర్గీకరణన చెల్లదన్నది. అప్పుడు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్‌పార్టీ సుప్రీంకోర్టు తీర్పును శిరసావహిస్తామన్నా సమస్య జటిలం కాకుండాపోయేది. లేకుంటే పార్లమెంటు చేత వర్గీకరణ చట్టం చేయించి రాజ్యాంగ బద్ధత కోసం ప్రయత్నించినా బాగుండేది. రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఉషా మెహ్రా కమిషన్‌ను వేయించింది. ఉషా మెహ్రా నేతృత్వం లోని కమిటీ రాష్ట్రంలో పర్యటించి చివరకు మాల, మాదిగలు కాకుండా మిగతా 58 కులాల అభివృద్ధి సంగతి గురించి చెప్పి కులాల వారీగా వర్గీకరణకు రాజ్యాంగ అనుమతి కష్టమని తేల్చింది. సుప్రీంకోర్టు కూడా రాష్ట్రంలో మాదిగలతో పాటు ఇంకా వెనుకబడిన కులాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని, విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని, ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చేందుకు పథకాలను ప్రవేశ పెట్టాలని సూచించింది. ఈ విషయాన్ని పెడచెవిన పెట్టిన వైఎస్ వర్గీకరణకు కట్టబడి ఉంటామని మళ్లీ సమస్యను మొదటికి తెచ్చాడు. సహజంగానే మాదిగలు మళ్లీ ఉద్యమబాటను ఎంచుకున్నారు. అయితే ఆ ఉద్యమం వర్గీకరణ చట్టాన్ని నిరుపయోగంగా తయారు చేసిన చంద్రబాబుపైనా కాదు. ఆ చట్టాన్ని కాపాడేందుకు ప్రయత్నించని వైఎస్‌పైనా కాదు. కేవలం మాలలను శత్రువులుగా చూపిస్తూ ఉద్యమం కొనసాగడం విచారకరం.

అంబేద్కర్ అంటరాని కులాలన్నింటిని ఒక షెడ్యూల్‌లో చేర్చడం ద్వారా వారు ఐకమత్యంగా ఉంటే రాజ్యాధికారం కోసం పోరాడుతారని ఆశించాడు. అది జరగకుండా నిరంతరం దాయాదుల మాదిరిగా కొట్లాడుకునేందుకు అందరూ ప్రయత్నించారు. ఏనాడూ ఇరువర్గాలతో కలిసి చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేయలేదు. మళ్లీ చంద్రబాబు మాదిగలకు వర్గీకరణ అవసరం అంటున్నాడు. మాదిగలకు బాబు మద్దతు ఇచ్చి అన్ని పార్టీల మద్దతు అడుగుతున్నాడు. అయితే పార్టీలు సహజంగానే గతంలో చేసుకున్న తీర్మానాలనే మళ్లీ ప్రవేశపెట్టుకుంటాయి. మాలలు వ్యతిరేకిస్తారు. కాబట్టి మళ్లీ సమస్యను, సమస్యగానే మిగిలించే ప్రయత్నంతో బాబు వర్గీకరణానికి తెరలేపాడు. వర్గీకరణ సమస్య వల్ల 18 ఏళ్లు నిట్టనిలువునా చీలిన షెడ్యూల్డ్ కులాలు, ఇంకా 18 ఏళ్ల దాకా కలిసే పరిస్థితి కనిపించడం లేదు. 18 శాతం ఉన్న దళితుల్లో 9 శాతం మాల ఉపకులాలు ఉంటే, 9 శాతం మాదిగ ఉప కులాలు ఉంటాయి. నేడు 60 కులా లు సామరస్యంగా చర్చించుకునే పరిస్థితులు లేవు. చంద్రబాబు పుణ్యాన ఆ పరిస్థితి కొనసాగుతున్నది. ఈ మధ్యనే ఇరు వర్గాలూ నష్టపోయినట్టగా భావిస్తున్నారు. కలిసి చర్చించుకొని సమస్యకు ఒక పరిష్కారం తేవాలనే ఉద్దేశంతో కొన్ని సమావేశాలు కూడా జరిగాయి. రాజ్యాధికారం సాధించుకునేందుకు మాల, మాదిగలు కలిసిపోవాలని, అందుకోసం సన్నద్దమవ్వాలని భావిస్తున్న తరుణంలో బాబు వర్గీకరణ పిడుగు పేల్చా డు. దీనితో బాబు ఏమీ సాధించలేకపోయినా దళితులను నిరంతరం విడగొట్టగలడు.

వర్గీకరణకు బాబు మద్దతునిస్తే కేంద్రంలో ఏమైనా జరుగుతుందా? అంటే గతంలో మందకృష్ణ జాతీయ పార్టీల మద్దతును లేఖల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. మాయావతి లాంటి చమర్ (మాదిగ) జాతికి చెందిన నాయకురాలే తీవ్రంగా వ్యతిరేకించింది. ఎందుకంటే ఉత్తరభారతంలో ఎక్కువగా చమర్‌లే రాజకీయ, విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు ఉపయోగించుకుంటున్నారు. దీనిపై పార్లమెంటులో చర్చ జరిగి యావత్ దళితులు నిట్టనిలువునా చీలిపోతారని, అది అంబేద్కర్ ఆశయానికి తూట్లు పొడవడమేనని పార్లమెంటు వేదికగా చెప్పారు. ఎస్సీ వర్గీకరణపైన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఇప్పుడది జాతీయ విధానం కావాలి. బాబు రెండుకండ్ల సిద్ధాంతంతో తెలంగాణలో, జగన్ ప్రభావంతో ఆంధ్రలో ప్రాభవం కోల్పోయి, నిస్పృహతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాజ్యాంగ పరంగా అన్ని కులాల పట్ల సమన్యాయం పాటించాలనేది పార్టీలకు ఎన్నికల కమిషన్ నియమావళి సూచిస్తున్నది.అధికారం కోసం బాబు అన్నీ వదులుకుంటారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు, ప్రజాసంఘాలకు వర్గీకరణ సమస్య పరిష్కారం పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక పక్షాన్నే సమర్థించడం కాదు. ఇరు వర్గాల అభివూపాయాలను పరిగణనలోకి తీసుకుని ఉండాల్సింది. ఇప్పుడు బాబు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ఎత్తుగడలను మిగతా పార్టీలు నమ్మవద్దని కోరుతున్నాం.

మాదిగలకు మాలలు వ్యతిరేకమనే ప్రచారం వాస్తవం కాదు. ఎన్నోసార్లు మా సంఘం కులాల వారీగా కాకుండా ఆర్థిక ప్రాతిపదికన వర్గీకరణ జరగాలని కోరాం. ఉమ్మడి ఆంధ్రవూపదేశ్‌లో కులాల వారి వర్గీకరణ జరిగితే తెలంగాణలో మాదిగలు, ఆంధ్రలో మాలలు నష్టపోతారనేది మా భావన. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో వర్గీకరణ కోసం మళ్లీ మాదిగలు పోరా టం చేయాలి. అంటే వర్గీకరణ కాష్టం ఎప్పుడూ రగులుతూనే ఉండా లా? మాల మాదిగ ఉద్యమాల్లో పాల్గొనేది గ్రామీణ ప్రాంత ప్రజలు. లబ్ధి పొందేది పట్టణాల్లోని ధనిక ఎస్సీలు. చదువు, ఉద్యోగం, రాజకీయంతో పనిలేని మాల, మాదిగలకు వర్గీకరణ ద్వారా ఏం లాభం జరుగుతుందని ఇరు వర్గాల నాయకత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలి. పార్టీలు చేసే రాజకీయ ఉద్యమాలకు మాల, మాదిగలను బలి చేయడం, దానికి సామాజిక న్యాయం అని పేరు పెట్టడం ఎంత వరకు సబబు?

ఈ మధ్యనే మందకృష్ణ, కంచెఐలయ్య, గద్దర్ లాంటి ముఖ్యులతో ఈ సమస్య పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలని కోరాము. నిజంగా దళితుల పట్ల నిబద్ధత ఉన్న నాయకుపూవరూ బాధ్యతారహితంగా వ్యవహరించరు. చంద్రబాబు వర్గీకరణను చూసి నట్టుగా కాకుండా ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉన్నది. ఇరు వర్గాలు పట్టింపులకు పోకుండా రాజీకి వస్తే దళిత జాతికి మేలు చేసినవాళ్లం అవుతాం. లేకుంటే చరిత్ర హీనులం కాక తప్పదు.
-అద్దంకి దయాకర్,తెలంగాణ మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు
Namasete Telangana News Paper Dated : 04/09/2012 

No comments:

Post a Comment