Saturday, April 19, 2014

నవ తెలంగాణ-మట్టి మహిళలు By -జూపాక సుభద్ర


తెలంగాణ ఉద్యమం కోటి కలలను ఆరబోసుకున్నది. భౌగోళిక తెలంగాణ బహుజన తెలంగాణ కావాలని ఆశిస్తున్నది. తెలంగాణ ఉద్యమంలో సామాజిక న్యాయాలకు సంబంధించిన ఒప్పందాలు జరగలేదు. బహుజన తెలంగాణ సాకారమైనప్పుడే.. అది నవతెలంగాణగా రూపొందుతుంది. పాలక కులాలు అంటున్నట్లు ఇది పునర్నిర్మాణంగా జరిగితే ఇది ఆధిపత్య కులాలకు ప్రయోజనకారిగా ఉంటుంది. పునర్నిర్మాణమంటే ఆ నిర్మాణాలే తిరిగి తీసుకొచ్చే ప్రయత్నమా!

సీమాంధ్ర రాజకీయాల వల్ల తెలంగాణ పల్లెల్లో చెరువులు ఎండిపోయి మైనర్ ఇరిగేషన్ దెబ్బతిని, భూములన్నీ పెస్టిసైడ్ విషాలతో చౌడు నేలలయ్యాయి. దీంతో రైతుకూలి, కైకిలి చేసుకునే మట్టి మహిళలు పట్టణాలకు వలసపోయారు. ఇండ్లల్లో పాసి పని చేస్తున్నారు. విద్య, ఉపాధులు లేవు. శ్రమ, మానవ గౌరవాలు, మానవహక్కులు లేకుండా తెలంగాణ మట్టి మహిళలు బతుకులీడుస్తున్నారు. దళిత ఆడవాళ్లు సపాయి చీపర్లవుతున్నారు. లంబాడీ తల్లులు తిండిలేక పిల్లల్ని అమ్ముకుంటున్నారు. బీడీ కార్మికులు శ్రమలు కాలిపోతున్న బీడీలవుతున్నారు. చేనేత కార్మిక మహిళలు కూలిగిట్టక శవాలవుతున్నారు. తాగడానికి నీళ్లు లేక ఫ్లోరోసిస్ బారి న పడుతున్నారు. తెలంగాణ దళిత మహిళలు జోగిని, పాకి పనుల లాంటి కుల దురాచార హింసకు, అత్యాచారాలకు గురవుతున్నారు. ఆదివాసీ భూముల్ని పెట్టుబడిదారులు కంపెనీలకు వనరులుగా ఎంచుకొని ఆదివాసులను వెళ్లగొడుతున్నారు. జాతీయ మహిళా కమిషన్ పాలక కులాల మహిళల్ని పాలిత కులాలైన, అణగారిన మహిళల్ని వారి అస్తిత్వాన్ని గుర్తించక తప్పనట్లుంది. అందుకే బిల్లులో ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఆర్థిక సహకారం అందించాలంటున్నది. ఇది మంచి పరిణామం. జాతీయ మహిళా కమిషన్ ఇంకో గొప్ప సాహసం చేసింది. మామూలుగా ప్రభు త్వం తమ సంస్థల్ని తమకు వెన్నుదన్నుగా ఏర్పాటు చేసుకుంటాయి. కానీ జాతీయ మహిళా కమిషన్ ప్రభుత్వ సంస్థగా ఉండి, సైనిక దళానికి ప్రత్యేక అధికార చట్టాన్ని ఉపసంహరించాలని చాలా బలంగా సిఫార్సు చేసింది. ఇది మహిళా కమిషన్ చరిత్రలో గొప్ప సంగతి.

సైనిక దళాల ప్రత్యేక అధికార చట్టం వల్ల కశ్మీర్, ఈశాన్య రాష్ర్టాల ప్రజలు,నక్సలైట్ ఉద్యమప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్ (సల్వాజుడుం) ముఖ్యం గా, ఆదివాసీ మహిళలు నిత్యం సైనిక, పోలీసుదళాల లైంగిక దాడులు, హింసలు ఎదుర్కొంటూ పోరాడుతున్నారు. ఆ మహిళల గోసలు, గొంతు లు, ఈ (అ)నాగరిక లోకానికి వినబడ్తలేవు. ఆదివాసీ మహిళల మాన ప్రాణాలకు భద్రత లేకుండాపోయింది. పోలీసులు, సైనిక దళాలు చేసే లైంగిక దాడుల్ని, అఘాయిత్యాల్ని ప్రభుత్వాలు, చట్టాలు, న్యాయస్థానాలు వారినెట్లా రక్షిస్తాయో వాకపల్లి ఘటన నిదర్శనం. ఇక కల్లోల కశ్మీర్, ఈశాన్య రాష్ర్టాల్లో సైనిక దుశ్చర్యలు ఎంత ఘోరంగా, క్రూరంగా ఉంటాయో అక్కడి మహిళా పోరాటాలు చెబుతున్నాయి. ఇరోం షర్మిల పధ్నాలుగేండ్ల దీక్ష ఉండనేఉన్నది. ఈ యూనిఫాం నేరస్తుల నుంచి రక్షణ కోసం చేసిన సిఫార్సులను అమలు చేసే దిశగా మహిళలు ఉద్యమాలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.


Namasete Telangana Telugu News Paper Dated: 20/4/2014 

No comments:

Post a Comment