Thursday, April 3, 2014

శాసిస్తామన్నోళ్లే... యాచిస్తున్నారు!-కొంగర మహేష్


Published at: 03-04-2014 07:02 AM
'రాజకీయ నాయకులు పదవుల కోసం వెంపర్లాడుతున్నారు. తమ స్వార్థం ఉద్యమాన్ని తాకట్టు పెట్టేందుకు కూడా వెనకాడటం లేదు. తామే ఉద్యమానికి నాయకత్వం వహించి యావత్ తెలంగాణ ప్రజల చిరకాల కాంక్ష ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తాం. అవసరమైతే అసోం తరహాలో (అస్సాం గణ పరిషత్ మాదిరి) రాజకీయ పార్టీ స్థాపించి ఉద్యమాన్ని నడిపిస్తాం. ఇక ఈ రాజకీయ నాయకులను చేరదీసేది లేదు. వారి దరికి చేరేది లేదు'. ఇవి నాలుగేళ్ల క్రితం 2009 చివర్లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష విరమించినప్పుడు, డిసెంబర్ 9 ప్రకటనను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన (2010 జనవరి 23) నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ కేంద్రమైన ఓయూలో విద్యార్థి నేతలు చేసిన వ్యాఖ్యలు. పడిలేస్తున్న ఉద్యమాన్ని తమ భుజాల మీద మోస్తూ నిలబెట్టి... కదనరంగంలో కాలుదువ్విన యువ గర్జనలకు ప్రజానీకం గొంతు కలిపింది. అడుగులో అడుగేస్తూ ఓ యుద్ధానికే మొగ్గుచూపింది. విద్యార్థుల తెగువ, లాఠీలు, తూటాలకు వెరవని ధైర్యానికి పాలక, ప్రతిపక్షాల గొంతులు ఎండిపోయాయి. ఏం మాట్లాడినా తిరుగుబాటు తప్పదని గ్రహించిన పొలిటికల్ లీడర్లంతా ఇళ్లకే పరిమితమై ఓయూ, కేయూ వంటి వర్సిటీల తదుపరి కార్యాచరణపైనే దృష్టి కేంద్రీకరించిన సందర్భాలు లేకపోలేదు. దీంతో తెలంగాణకు దశ, దిశ ఇక విద్యార్థి యువకిశోరాలే అని ప్రజలంతా అనుకున్నారు. విద్యార్థులు జేఏసీగా ఏర్పడి చేసిన 'ఓయూ డిక్లరేషన్' అన్ని రాజకీయపక్షాల నేతలకు ముచ్చెమటలు పట్టించింది కూడా. పలు ప్రజాసంఘాల నాయకులు, పార్టీలకతీతంగా ఇక్కడి విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. విద్యార్థులు ఏదో చేస్తారని అంతా అనుకున్నారు. విద్యార్థులు ఏం చేయబోతున్నారని యావత్ దేశ ప్రజానీకమంతా ఆసక్తిగా ఓయూ వైపు చూసింది. విద్యార్థుల నాయకత్వంలో మలిదశ తెలంగాణ ఉద్యమం కొత్త రాజకీయాలకు పురుడుపోస్తుందని విశ్లేషణలు జరిగాయి.
ఓయూలో మొదలైన విద్యార్థి, యువత ఏకీకరణ కేయూ నుంచి మిగతా తెలంగాణ అంతటా సరికొత్త ఉద్యమం వ్యాపిస్తుందని అనుకుంటున్న సందర్భంలోనే వారి అడుగులకు బంధనాలు పడ్డాయి... ఉద్దండ రాజకీయనేతలు రంగప్రవేశం చేసి 'డైవర్షన్' వ్యూహాలతో యువరాజకీయ రణన్నినాదాన్ని ఆదిలోనే అంతం చేశారు. మొలకెత్తే విత్తనాన్ని వేరుతో సహా తుంచేస్తే మళ్లీ పుట్టేందుకు అవకాశమే ఉండదన్న దుగ్ధతో కొన్ని స్వార్థపూరిత శక్తులు చాలా జాగ్రత్తగా ఓయూపై కన్నేశాయి. 'విద్యార్థులు రాజకీయాలు చేస్తే తామేం కావాలంటూ' విస్మయం వ్యక్తం చేస్తూ 'మేం తెలంగాణ కోసం పోరాడుతాం. స్టూడెంట్స్‌కు స్టడీస్ ముఖ్యం.. మీరు చదువుకోండి' అని సలహా ఇచ్చారు. కొంతమంది లంచ్, డిన్నర్ల పేరుతో ఇంటికి పిలిపించుకొని బుజ్జగించి తమవైపు తిప్పుకున్న వారున్నారు. మాటవినని వారిని ఉద్యమ ద్రోహులుగా ముద్రవేసి... జేఏసీ చీలికకు ఆజ్యం పోశారు. ఇట్లా మొదలైన చీలిక... ఆరునెలలకే ఒక్క ఓయూలోనే ఒకటి, రెండు, మూడు ఇలా దాదాపు పది జేఏసీలు ఏర్పడ్డాయంటే ఎన్ని రాజకీయాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో రాజకీయ పార్టీకి చివరికి ఒక్కోకులానికి ఒక్కో జేఏసీ ఏర్పడింది. చిట్టచివరికి ఒక్కరూ, ఇద్దరున్నా జేఏసీలు ఏర్పాటు చేసుకొని తమ పంథా కొనసాగించారు. రాజకీయ పార్టీలకు సరిగ్గా కావాల్సింది కూడా ఇదే.
కనీసం ఓయూ ఉద్యమంలో 'నో ఎంట్రీ' ఎదుర్కొన్న టీడీపీ సైతం స్వతంత్ర జేఏసీ పేరుతో కొనసాగింది. ఇతర పార్టీలు కూడా భావసారూప్యతల పేరుతో విద్యార్థుల్లో సెపరేటు జట్టు కట్టించాయి. అతి కొద్దిమంది మాత్రమే ఏపార్టీతో సంబంధం లేకుండా జేఏసీగా ఏర్పడ్డారు. అప్పటిదాకా పార్టీల ఊసులేకుండా సాగుతున్న ఉద్యమంలో స్పష్టమైన చీలిక తప్పకపోవడంతో ఆరోజుకు ఉన్న జేఏసీని కాపాడుకుంటే చాలన్న విధంగా పరిస్థితి మారిపోయింది.
అయితే తెలంగాణ వస్తే అగ్రవర్ణ పాలన, ఆధిపత్యం తగ్గి దాదాపు 90 శాతంగా ఉన్న అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రాజకీయ ప్రాబల్యం పెరుగుతుందని అందరూ నమ్మారు. రాజ్యాధికారం వీరి చేతుల్లోకే వస్తుందనే అంచనాలు మొదలయ్యాయి. అలాగే ప్రచారం జరిగింది కూడా. ఈ అశతోనే ఆ వర్గాలకు చెందిన ప్రజానీకం ఉద్యమంలో నాయకత్వం తప్ప మిగతా అన్నింట్లో చివరికి ఆత్మహత్యలు చేసుకోవడంలో కూడా ముందున్నారు. ప్రపంచీకరణ నేపథ్యం, భౌగోళిక పరిస్థితులు, ఉద్యమాలు, జనాభా దృష్ట్యా ఎలైట్ వర్గాల పిల్లలు 90వ దశకం వచ్చేసరికి ఆర్ట్స్, సామాజిక శాస్త్రాల పట్ల అనాసక్తి కనబరచడం... విదేశీ విద్య, సాంకేతిక విద్యపై ఆసక్తి కనబర్చడంతో, ఓయూ, కేయూ వంటి తెలంగాణ వర్సిటీల్లో బహుజన వర్గాల పిల్లలే సింహభాగంలో ఉన్నారు. నాటి నుంచి నేటి దాకా ప్రపంచంలో ఎక్కడ ఏపోరాటం జరిగినా తర్కబద్ధంగా స్పందిస్తూ సామాజిక స్పృహతో ముందుకెళ్తున్నారు. తెలంగాణ వస్తే తమకు, భవిష్యత్ తరాలకు ఏదో మంచి జరుగుతుందనే తెగించిపోరాడారు. ఇలాంటి నేపథ్యమున్న అణగారిన వర్గాల విద్యార్థులు రాజకీయంగా బలపడితే... వారి నాయకత్వాన్ని ప్రోత్సహిస్తే ఏదో ఒకనాడు తమ కుర్చీ కిందికి నీరు తప్పదనే భయంతో జంకిన నేతలే విద్యార్థి నాయకత్వాన్ని నిలువునా చీల్చడంలో సఫలమయ్యారు. ఒక్కమాటలో చెప్పాలంటే విద్యార్థి ఉద్యమం నిట్టనిలువునా చీలేంత వరకు నిద్రపోలేదనడంలో ఆశ్చర్యం లేదు.

ఒకవైపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చరిష్మా తగ్గిపోతుండటం 2014 ఎన్నికలు సమీపిస్తుండటంతో... హైకమాండ్‌కు 2009 డిసెంబర్ 9 హామీ గుర్తుకొచ్చి తెలంగాణ బిల్లును సాధారణ మెజార్టీ ఉన్నా 'ఎంతో శ్రమ'కోర్చి పార్లమెంటులో పాస్ చేయించింది. రాష్ట్రపతి ఆమోదంతో 60 ఏళ్ల కల సాకారమైంది. 1969 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఇన్నేళ్ల మహోద్యమ ఫలితానికి విద్యార్థులు, యువత, ప్రజానీకం సమష్టిపోరాటం, అమరుల త్యాగాలే సాక్ష్యాలు. రాజకీయ నేతల పాత్ర ప్రేక్షకపాత్ర. నామమాత్రమే అని చెప్పకతప్పదు. అయితే వచ్చిన రాష్ట్రంలో పునర్నిర్మాణం, సామాజిక తెలంగాణ, బంగారు తెలంగాణ వంటి లక్ష్యాలు మిగిలే ఉన్నాయి. వీటిపై చర్చ ప్రారంభదశలో ఉండగానే రాష్ట్రపతి పాలన, 2014 సార్వత్రక ఎన్నికల ప్రకటన జమిలిగా వచ్చాయి.
రెండు రాష్ట్రాల్లో పాగాకోసం ఎవరి ప్రయత్నాలు వారు ప్రారంభించారు. పొత్తులు, ఎత్తులతో క్షణం తీరికలేకుండా ఉన్నారు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఏ పొలిటికల్ పార్టీ కూడా ఓయూ విద్యార్థుల పోరాట పటిమను పరిగణనలోకి ఏమాత్రం తీసుకోలేదు. తమ పోరాటాన్ని గుర్తించి ఈ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఇవ్వాలని ప్రధాన రాజకీయ పక్షాల నేతలను కలుస్తున్నా... కులం, వర్గం, నియోజకవర్గం వంటివాటితో ప్రసన్నం చేసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. వారి అనైక్యతను పసిగట్టిన పార్టీలు తమదగ్గరికి వచ్చినవారిని కూడా పట్టించుకున్న పాపాన పోలేదు (కేసీఆర్ మాత్రం ఒకే ఒక్క విద్యార్థి నాయకుడిని పిలిచి పార్టీలో చేర్చుకొని టిక్కెట్ ఇస్తానని హామీ ఇచ్చారు). దీంతో చేసేదిలేక కొంతమంది ఎవరికి తోచినట్లు వారు కాంగ్రెస్, ఇతర పార్టీల్లో చేరుతున్నారు. కొంతమంది ఎంఐఎంను కూడా అప్రోచ్ అయ్యారు. కారణాలేమైనప్పటికీ ఆ పార్టీ నాయకత్వం ఒకరిద్దరికి టిక్కెట్లు కన్ఫర్మ్ చేసింది.
మరోవైపు ప్రధాన పార్టీల నుంచి ఒకరిద్దరికి తప్ప మిగతా ఎవరికి స్పష్టమైన హామీ రాకపోవడంతో... విద్యార్థి నేతల పరిస్థితి ఎక్కే గడప.. దిగే గడప అన్న చందంగా మారింది. ప్రతిరోజూ ఏదో పార్టీ దగ్గరకు వెళ్లడం తమ అభ్యర్థనలు వినిపించడం, కాదంటే మళ్లీ మరో పార్టీని ఆశ్రయించడం... ఆర్థించడం... వారం పదిరోజుల నుంచి ఇదే ఓయూ నేతల దినచర్యగా మారింది. కొంతమంది నేతలైతే 'మీ బలమెంత, ఆర్థిక బలాబలాలేంటి?' అంటూ సూటిగానే అడిగి లెక్కలు వేస్తున్నారు. కాస్త అవసరం అనిపించిన వారికి పార్టీ పదవులు ఇస్తూ, అవకాశం ఉంటే ఎన్నికల తర్వాత నామినేటెడ్ పదవులు కట్టబెడతామని చెబుతున్నారు. ఇలాంటి మాటలతో విసిగినవారు, సంతృప్తి చెందనివారు మాత్రం స్వతంత్రంగానైనా ఒక్కొక్కరు ఒక్కోరకంగా... ఐక్యంగా ఉన్నవాళ్లు ఎవరికి వారే విడిపోయి ఇలా టిక్కెట్ల కోసం నేతల దగ్గర యాచిస్తుండటం వారిని ప్రసన్నం చేసుకునేందుకు పడరానిపాట్లు పడుతుండటంతో ఢిల్లీ పెద్దల నుంచి గల్లీ నేతల దాకా విద్యార్థులంటే చులకనైపోయారు. వీరి ఆపసోపాలు గమనిస్తున్న ప్రజల్లోనూ పలుచనైపోయారు. పార్టీ పెట్టకపోయినా ఫ్రంట్‌గా కదిలినా విద్యార్థులను ప్రజలు, ప్రజాసంఘాలు ఆదరించేవారు. ఐక్యంగా ఉండి రాజ కీయ పార్టీ వలే 'లాబీయింగ్' చేసినా ఈ దుస్థితి దాపురించేంది కాదు. ఇప్పుడు కాకపోతే మరో పదేళ్లు, ఇరవయ్యేళ్లకైనా నవ తెలంగాణలో సరికొత్త రాజకీయాలకు నాంది అయ్యేది.
n కొంగర మహేష్
రీసెర్చ్ స్కాలర్, జర్నలిజం డిపార్ట్‌మెంట్, ఓయూ

Andhra Jyothi Telugu News Paper Dated: 3/4/2014 

No comments:

Post a Comment