Thursday, December 12, 2013

విభజనతో పాటు వర్గీకరణ- గడ్డం దేవదాస్

ఏ ఊరిలో పుడతారో, ఏ ఊరిలో చస్తారో తెలియని ఈ జాతికి తలదాచుకునే ఇల్లు, పాతి పెట్టుకునేందుకు గుంట భూమి లేదు. ఏళ్ళ తరబడి మాల, మాదిగలతో మమేకమై జీవిస్తున్న చిందు, మాస్టీ, డెక్కలి జాతులను వారి అభివృద్ధి క్రమాన్ని మంత్రులెక్కడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ సందర్భంగా వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాలి. అందువల్ల ఎస్సీ వర్గీకరణలో సమతుల్యత దెబ్బతింది. పునర్ వర్గీకరించాలి. తెలంగాణ బిల్లుతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించాలి.
హిందూ మత పునాదులపై ఏర్పడిన కులవ్యవస్థ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలను సృష్టించి, శ్రామిక ప్రజలను కలిసి మెలిసి జీవించకుండా అడ్డుకుంటుంది. ఈ అడ్డును తొలగించే ప్రయత్నానికి పూనుకున్న బౌద్ధాన్ని ఈ దేశ సరిహద్దులను దాటించామని భ్రమపడింది. డా.బి.ఆర్. అంబేద్కర్ నాగపూర్ కేంద్రంగా లక్షలాది ప్రజలతో బౌద్ధాన్ని స్వీకరించడం వల్ల హిందూమతం భవిష్యత్ తలక్రిందులుగా మారింది. దేశ కమ్యూనిస్టులను, సోషలిస్టులను, నక్సల్స్‌ను అణిచి వేసినట్లుగా, అంబేద్కరిస్టులను అణిచి వేయలేకపోయింది. కులం, మతం, పునాదుల నిర్మూలనకే రంపంలా మారిన డా.బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనా విధానం, నాడు, నేడు సజీవమై నిమ్నజాతుల హృదయాలలో పదిలమై యావత్ భారత జాతి ప్రజలను తట్టి లేపుతుంది. బౌద్ధ దమ్మం పుట్టిన ఈ పుణ్య భూమిపై మనువాద పెత్తనం, అది సృష్టించిన ఆర్థిక, రాజకీయ, సాంఘిక అసమానతలను తొలగించలేకపోతే బహుజనులు ఏరకమైన స్వేచ్ఛను అనుభవించలేరని మహాత్ముడు జ్యోతిరావు ఫూలే గ్రహించారు. దీనికి రాజ్యాధికారం ఒకటే పరిష్కార మార్గమని ప్రబోధించాడు. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే శూద్రులకు విద్య తప్పనిసరని ప్రతిపాదించిన ఆ మహాత్ముడు డా.బి.ఆర్. అంబేద్కర్‌కు గురువు కావడం గమనార్హం. ఫూలే పడమర ఆస్తమించిన సూర్యుడైతే, డా.బి.ఆర్. అంబేద్కర్ తూర్పున ఉదయించిన సూర్యుడి వలే గతి క్రమాన్ని ప్రతిబింబింపచేసి భారత్ దిక్సూచికి ధ్రువతారలై నిలిచిపోయారు.
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అతి శూద్రులనే ఈ పంచమ వర్ణాలు క్రమంగా 16వేల కులాలుగా రూపాంతరం చెంది, మానవ అభివృద్ధి క్రమాన్నే అడ్డుకుంటున్నాయి. ఇది శ్రమ విభజన కాదు. శ్రామికుల విభజనగా డా. బి.ఆర్. అంబేద్కర్ విశదీకరిస్తారు. ప్రకృతి విరుద్ధమైన కుల అసమానత నియమాన్ని మనిషి సృష్టించాడు. ప్రకృతి నియమం, దైవ సంకల్పం అసలే కాదు. మనువు సృష్టించిన ఈ కుల అధర్మాన్ని, దాని భావజాలాన్ని నాశనం చేయాలని కోరుతారు. దాన్ని నాశనం చేయకపోతే, అది మనల్ని మనం నిర్మించుకునే సమాజాన్ని నాశనం చేసి తీరుతుందని హెచ్చరించారు.
దేశంలో బహుజనులు ఒక కులం, ఒక వర్ణంగా లేకపోవడం వల్ల రాజకీయ అధికారాన్ని స్థాపించలేకపోతున్నారు.అగ్రకులంగా చలామణిలో ఉన్న సంపన్నులు, కోటీశ్వరులు, భూస్వాముల ఆర్థిక పరిపుష్టి బలమైనందువల్ల రాజకీయ అధికారంలో ఎక్కువ కాలం మనగలుగుతున్నారు. సర్వ సంపదల సృష్టికి బహుజనులు పునాదిగా ఉన్నందువల్లే, విద్యనభ్యసించలేక, నిరక్ష్యరాస్యులుగా, నిరుద్యోగులుగా, చైతన్య రహితులుగా, ముఖ్యంగా కడు పేదలుగా, దేశ దిమ్మరులుగా బతుకులీడుస్తున్నారు. వీరిపై అగ్రకులాల ఆధిపత్యాన్ని నిరంతరం కొనసాగిస్తూ, కఠినమైన నిబంధనల ద్వారా అదుపు చేసి, అణిచివేసేవారు. అణిచివేతే అగ్రకులాలకు ప్రధాన ఆయుధం అయింది.
తరతరాలుగా ఊరికి, ఆస్తికి, విద్యకు, ఆయుధానికి, అధికారానికి దూరంగా విసిరి వేయబడిన జాతుల కోసం డా. బి.ఆర్. అంబేద్కర్ నిరంతరం కృషిచేసి గొప్ప రాజ్యాంగ నిర్మాతగా, భారత దేశ దార్శనికుడైనారు. ఆయన రచించిన కుల నిర్మూలన గ్రంథం బహుజనుల జీవిత కరదీపికైంది. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని బ్రతకగలిగిన జీవులు మాత్రమే బ్రతికి బట్టకడతాయి. తట్టుకోలేనివి, నిలబడనివి పూర్తిగానే అంతరించిపోతాయనే ప్రాకృతిక సూత్రాన్ని కష్టజీవులైన ఈ దేశ బహుజనులకు అన్వయిస్తూ ఇలా అంటారు. సంపన్నులు, కోటీశ్వరులు, భూస్వాములు, పారిశ్రామికవేత్తలు, ఆర్థిక, రాజకీయ, సాంఘిక అణచివేత, వారి ప్రలోభాలను ప్రశ్నించి, ఎదురు తిరగబడిన జాతులు మాత్రమే బ్రతికి బట్టకట్టుతాయి. ఎదురు తిరగనివి, ప్రశ్నించలేని జాతులు కనుమరుగై పోతాయనే సూత్రీకరణ తెలంగాణలోని ఎస్సీ కమ్యూనిటీలోని మాదిగ ఉపకులాలైన చిందు, మాస్టీన్, డెక్కలి వంటి కులాలు కనుమరుగవుతున్న జాబితాలోనివే. డా.బి.ఆర్. అంబేద్కర్ పోరాటాల ఫలితంగా ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ అవకాశాలను మాల, మాదిగలే ఎక్కువ అనుభవిస్తూ తమ క్రింది జాతుల పట్ల దురుసుగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. ఆర్థిక, రాజకీయ పరిపుష్టిని ఆ మేరకు సాధించుకున్న ఎదిగిన పై రెండు కులాలు తమలోని క్రింది కులాలకు సామజికతను ఉల్లంఘిస్తూ, పై కులాలతో సామాజిక న్యాయం, ఆత్మగౌరవం వంటి పద ప్రయోగాలు చేస్తున్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్ ఈ విధంగా అంటారు. నీవు నీ క్రింది కులపోన్ని గౌరవిస్తేనే, పై కులపోడు నిన్ను గౌరవిస్తాడని అంటారు. మాల మాదిగను గౌరవించడం లేదు. మాదిగ చిందు, మాస్టీ, డెక్కలిని గౌరవించడం లేదు. ఈ విధానం అంబేద్కర్ ఆలోచనా విధానానికి పూర్తిగా విరుద్ధమైంది. అసభ్యకరమైంది. మొత్తం ఎస్సీ కమ్యూనిటీలోని యువకులు, విద్యావంతులు, ఉద్యమ సంస్థలు ఆలోచించాల్సిన అవసరం ఉంది.
స్వాతంత్య్ర కాలం నుంచి నేటి వరకు చట్టసభలకు ఎంపికైన ఎస్సీ కమ్యూనిటీ ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ముఖ్యంగా మంత్రులుగా నియమించబడినవారు దోపిడీ పాలకులకు ఏజెంట్లుగా మారి కమ్యూనిటీ ప్రజలకే నష్టం చేస్తున్నారు. ఎస్సీ/ఎస్టీ సబ్‌ప్లాన్ కమిటీ, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థలు అనుసరిస్తున్న విధానాలు సంతృప్తికరంగా లేవు. నిధుల దారి మళ్ళింపు, బ్యాంక్ సబ్సిడీ రుణ పథకమే కావచ్చు, అభివృద్ధి అనేది కులాల వారీగా కాకుండా ఉమ్మడి నిధుల ఖర్చులుగా చూపడం సరికాదు. అనేక షరతులతో సబ్సిడీ రుణ పథకం ఇవ్వ నిరాకరణకే దారితీస్తుంది. స్వంత ఇల్లు, భూమి, ఆస్తి, గ్రామం లేని చిందు, మాస్టీన్, డెక్కలికి మోరి, రోడ్లు, కమ్యూనిటీ భవనాలు, వాటర్ ట్యాంకుల నిర్మాణం వీధి దీపాలతో పనేంటి? విద్యకు, పూజకు నోచుకోలేని ఈ జాతులకు బడి, గుడి దేనికోసం? ఏ ఊరిలో పుడతారో, ఏ ఊరిలో చస్తారో తెలియని ఈ జాతికి తలదాచుకునే ఇల్లు, పాతి పెట్టుకునేందుకు గుంట భూమి లేదు. ఏళ్ళ తరబడి మాల, మాదిగలతో మమేకమై జీవిస్తున్న చిందు, మాస్టీ, డెక్కలి జాతులను వారి అభివృద్ధి క్రమాన్ని మంత్రులెక్కడా పట్టించుకున్న దాఖలాలు లేవు.
ఈ సందర్భంగా వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాలి. అందువల్ల ఎస్సీ వర్గీకరణలో సమతుల్యత దెబ్బతింది. పునర్ వర్గీకరించాలి. తెలంగాణ బిల్లుతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించాలని కోరుతున్నాం.
కావున చిందు, మాస్టీ, డెక్కలి కులాలను ఏ గ్రూపులో చేర్చి ఉమ్మడి రిజర్వేషన్లు అమలు చేయాలనే సంకల్పంతో ఈ జాతులు పోరాడుతున్నాయి. అందుకు మందకృష్ణ మాదిగ అధికారికంగా స్పష్టం చేయాలి. భూమి పుట్టిన నాటి నుంచి నేటికీ స్వంత భూమిలేని ఈ జాతులకు ప్రతి కుటుంబానికి 2 ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలి. జీవన భృతి కోసం, వ్యాపార నిమిత్తం ఎలాంటి షరతులు లేని బ్యాంక్ సబ్సిడీ రుణాలను దరఖాస్తు పెట్టుకున్న ప్రతి వ్యక్తికీ సదుపాయం కల్పించి, గత 66 ఏళ్ళుగా విద్య, ఉద్యోగ, రాజకీయ తదితర రంగాల్లో పూర్తిగానే రిజర్వేషన్లను అనుభవించలేని, ఈ జాతి విద్యావంతుడికి ప్రభుత్వం స్వయంగా పిలిచి ఉద్యోగమివ్వాలని పోరాడాలి. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, కమ్యూనిటీ ప్రజ్రాపతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కుల సంఘాలు, సామాజిక దృక్పథం కలిగిన వ్యక్తులు, శక్తులు, ఉద్యోగ సంఘాలు పూర్తి స్థాయి లో మద్దతు ఇవ్వడమా? లేదా చరిత్రలో జాతి హీనులుగా మిగిలిపోవడమా? తేల్చుకోవాల్సిన అవసరం ఆసన్నమైందని స్పష్టం చేస్తున్నాం.
- గడ్డం దేవదాస్
అంబేద్కరిస్ట్

-
Andhra Jyothi Telugu News Paper Dated : 13/12/2013 

Wednesday, December 11, 2013

ఉన్నతవిద్య ఉన్నత కులాలకేనా? By గిన్నారపు ఆదినారాయణ


ఉన్నత విలువలకు నిలయాలుగా ఉండాల్సిన చదువుల నిలయాలు కులగజ్జికి కేంద్రంగా మారుతున్నాయి. దళిత, వెనుకబడిన విద్యార్థులకు ఉరితాళ్లు పేనుతున్నాయి.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటు న్న విద్యార్థుల్లో తెలంగాణ ప్రాంత విద్యార్థులే ఎక్కువగా ఉండడం విషాదం.

కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యా విధానానికి, ఉత్తమ పరిశోధనా రంగానికి మారుపేర్లు. అలాంటి కేంద్రీయ విశ్వవిద్యాలయాలే వల్లకాడుగా మారి విద్యార్థులను బలి తీసుకుంటున్నాయి. ఢిల్లీ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ విశ్వవిద్యాలయం, ఇఫ్లూ వంటి విద్యాలయాల్లో అనేక ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కారణం ఏమిటి? కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోనే ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? విశ్వవిద్యాలయాలు విద్యార్థిని కేంద్రంగా చేసుకొని పాఠాలు బోధించడం లేదు. ఉపాధ్యాయులు వారికి కావలసిన విషయాన్ని రాబట్టుకోనుటకు వారికి అవార్డులు, రివార్డులు రావాలనే తపనతో విద్యార్థులను హింసా పీడనలకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక మంది విద్యార్థులు మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నా రు. రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి పరిస్థితి లేదు. ఆత్మహత్యలు చేసుకునే విద్యార్థులు కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనా ర్టీ విద్యార్థులు మాత్రమే. దీనికి అగ్రవర్ణ అధ్యాపకుల వేధింపులే కారణమని ఆరోపణలున్నాయి.

విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి కష్టపడి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించి వారి ఆశయాలను నెరవేర్చుకోవాలని వస్తారు. అలా వచ్చిన దళిత విద్యార్థులను ప్రోత్సహిం చి వారి ఆలోచన విధానాన్ని పరిపక్వం చేయాల్సిన ఉపాధ్యాయు లు మొగ్గలోనే తుంచాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటిక్షిగేటెడ్ ఐఎంఏ,ఎంఏ విద్యార్థులను ముఖ్యంగా సెమిస్టరులో అనేక సా ర్లు ఫెయిల్ చేసి మరో సెమిస్టర్‌కు వెళ్ళకుండా వేధిస్తున్నారు. ఎంఫిల్, పీహెచ్‌డీ, ఎంటెక్ వంటి కోర్సుల్లో దళిత వెనుకబడిన ప్రాంత విద్యార్థులు పరిశోధక స్థాయికి రావడం చాలా అరుదు. ఒక వేళ వస్తే ‘గైడ్’ కులవివక్ష కారణంగా ఎంతో వేదన చెందుతు న్నారు. విద్యార్థులను అనేక రకాలుగా ఒత్తిడికి గురిచేసి వారి పరి శోధనా రిపోర్ట్‌కు సంతకం పెట్టకుండా రాత్రి, పగలు ల్యాబ్‌లో ఉంచడం వంటివి చేయడం వల్ల విద్యార్థులు మానసిక హిం సకు గురవుతున్నారు. తోటి విద్యార్థులకు చెప్పుకుంటే చులకనగా చూస్తారనే భయం తో ఎవరికీ చెప్పకుండా నలిగిపోతున్నారు. యూనివర్సిటీలో ఉండే ఇలాంటి సమస్యలను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇవి విద్యార్థులు చేసుకునే ఆత్మహత్యలు కావు, బలవన్మరణాలని చెప్పక తప్పదు.


విశ్వవిద్యాలయాలు విద్యార్థులను మేధావులుగా తయారు చేయడానికి బదులు మతిస్థిమితం లేకుండా చేస్తున్నాయి.ఇటీవల రంగాడ్డి జిల్లాకు చెం దిన వెంక అనే విద్యార్ధి రసాయన శాస్త్రంలో(ఎమ్మెస్సీ గోల్డ్ మెడల్) పరిశోధన చేస్తున్నాడు. ఈ శాఖలో పరిశోధన చేయడమే గొప్ప విషయం. ఇట్లాంటి విద్యార్థులను ఉపాధ్యాయులు హింసా పీడనకు గురిచేసి ఆత్మహత్య చేసుకునే స్థాయికి తీసుకు రావడం దారుణం. 2005లో సునీత అనే తెలుగు పరిశోధక విద్యార్థిని (యూజీసీ), జేఆర్‌ఎఫ్ సాధించిన దళిత విద్యార్థిని మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నది. 2006లో ఢిల్లీకి చెందిన ఆశిష్ ధావన్ అనే ఎమ్మెస్సీ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. 2007లో కేశవ్ అనే కరీంనగర్‌కు చెందిన ఎంఫిల్ తెలుగు పరిశోధక విద్యార్థి ఇంటికి వెళ్లి రైల్ పట్టాలపై ఆత్మహత్య చేసుకు న్నాడు. 2008లో సింతిల్ కుమార్ అనే తమిళనాడుకు చెందిన ఫిజిక్స్ పరిశోధక విద్యార్థి, 2009లో రంగాడ్డి జిల్లాకు చెందిన బాలరాజు అనే తెలుగు పరిశోధక విద్యార్థి, 2012లో రతన్ అనే ఎంఏ మాస్ కమ్యునికేషన్ విద్యార్థి, ఈ ఏడులోనే మల్లికార్జున్ అనే దళిత విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు.

2012లో స్వాతిరాణి అనే కరీంనగర్ విద్యార్థిని కూడా మనోవేదనకు గురై హాస్టల్లో ఉరి వేసుకొని చనిపోయింది. ఆదిలాబాద్‌కు చెందిన స్వరణ్ సింగ్ అనే ఫిజిక్స్ విద్యార్ధి కూడా తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 2013లో వరంగల్ జిల్లా భుపాలపల్లి గ్రామానికి చెందిన పుల్యాల రాజు ఉరివేసుకొని చనిపోయారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మోహిని మిశ్రా భవనంపై నుంచి కిందపడి చనిపోయింది. రంగాడ్డికి చెందిన దేవయ్య అనే పరిశోధక విద్యార్థి మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇలా వీరందరూ వెనుకబడిన ప్రాంతాలకు (ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి), దళితవర్గాలకు చెందిన విద్యార్థులే కావ డం గమనార్హం.

ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) హైదరాబాద్‌లో 2010లో ముత్యం అనే పరిశోధక విద్యార్థి (నిజామాబాద్), 2011లో బాలాజీ అనే పరిశోధక విద్యార్థి (చీరాల), 2012లో మదస్పిర్ కమ్రాన్ అనే జమ్మూకశ్మీర్‌కు చెందిన పరిశోధక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. 2013లో మోయిన్ ఖాన్ అనే పరిశోధక విద్యార్థి (తమిళనాడు), అలాగే ఈ అక్టోబర్ 22న ఉషా సాహు అనే బీఎడ్ విద్యార్థిని (ఒరిస్సా) ఆత్మహత్య చేసుకున్నారు.

ఇవి ఆత్మహత్యలు కావు, విశ్వవిద్యాలయాలు చేస్తున్న హత్య లు. యూనివర్సిటీ స్థాయి విద్యార్థి ప్రాణాలు కోల్పోతే అది ఆ కుటుంబానికే కాదు, సమాజానికి తీరని నష్టం. ఇందుకు దారితీస్తున్న పరిస్థితులపై దృష్టిసారించాలి. పరిస్థితులను చక్కదిద్దాలి. లేకుంటే రేపటి భవిష్యత్తు అంధకారం కాకమానదు.
-గిన్నారపు ఆదినారాయణ
రీసెర్చ్ స్కాలర్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాల Namasethe Telangana Telugu News Paper Dated: 12/12/2013 


సామాజిక శాస్త్రాల ఊసేదీ? - డాక్టర్ మనోహరి వెలమాటి

సామాజిక శాస్త్రాల అవసరం, ప్రాధాన్యం మానవ సంబంధాలు ఉన్న అన్ని రంగాలతోనూ పెనవేసుకుని కనిపిస్తున్నా ఆ శాస్త్రాలకు ప్రోత్సాహం కొరవడింది. తత్ఫలితంగా ఒక కొత్త సమాజాన్ని నిర్మించగల ఎందరో గాంధీలను, గురజాడ అప్పారావు వంటి రచయితలను, వీరేశలింగం పంతులు వంటి సంఘ సంస్కర్తలను మన సమాజం కోల్పోతోంది.
ఏ సమాజమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడ సామాజిక శాస్త్రాల అభివృద్ధి తప్పనిసరి. సామాజిక శాస్త్రాలకు ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇచ్చింది అనే దానిపై అక్కడి సమాజ పురోగతి కూడా ఆధారపడివుంటుంది. మన చరిత్ర పుటలను చూస్తే సామాజిక శాస్త్రమనేది మానవజాతి అభివృద్ధిలో అంతర్లీనమైన భాగం. అభివృద్ధిచెందిన దేశాల విశ్వవిద్యాలయాలలో సామాజిక శాస్త్ర పరిశోధనా సంస్కృతికి ఎంతో పురాతన చరిత్ర ఉంది. సామాజిక శాస్త్రాలకు ఎందుకు ప్రాధాన్యమివ్వాలంటే వాటి విజ్ఞానం మెరుగైన సమాజ నిర్మాణానికి తోడ్పడుతుంది. అందరికీ సామాజిక శాస్త్రాల ఉపయోగం కనిపించకపోవచ్చు.
ఎందుకంటే వాటి ప్రభావం దీర్ఘకాలంలో కాని తెలియదు. మనం రోజువారి సమస్యలు ఎదుర్కోవటంలో అతి పెద్ద సవాలు సాంకేతికపరమైనదో లేక మేనేజ్ మెంట్ సంబంధమైనదో కాదు. ప్రజలు, వారి వైవిధ్య సంస్కృతులు, ఇష్టాలు, ప్రాధాన్యాలు, అవసరాలను డీల్ చేయటమే అతిపెద్ద సవాలు అని ఎన్నో అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఇప్పుడున్న ఎన్నో రాజకీయ, సామాజిక సమస్యలకు చారిత్రక రెఫరెన్స్ తో ఒక అర్థవంతమైన విశ్లేషణను ఇవ్వగలిగినవారు చరిత్రకారులు. పురావస్తు శాస్త్రవేత్తలే లేకపోతే భారతదేశపు మహోన్నత సింధులోయ నాగరికత గురించి ప్రపంచానికి తెలిసి ఉండేదా? స్వాతంత్య్రోద్యమ కాలంలో ఎందరో దేశభక్తులు, సమాజ హితం కోరుతూ ప్రజలను ఉత్తేజపరిచి పోరాటాలను జరిపిన నాయకులు, రచయితలు సామాజిక శాస్త్రాలను అధ్యయనం చేసిన వారే. జాతిని ప్రభావితం చేసిన ఎందరో మహానుభావులు నడిచింది సామాజిక శాస్త్రాల బాటలోనే. వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరు, ప్రజల ప్రవర్తనపై పథకాల ప్రభావం - ఈ కోణాలన్నిటినీ సామాజిక శాస్త్రవేత్తలు విశ్లేషిస్తారు.
తద్వారా అవసరమైన పథకాలను సూచించి, మెరుగైన సమాజ నిర్మాణానికి దోహదపడతారు. ఒక ఇంజనీర్ , సాంకేతిక పరిజ్ఞానంతో ఒక మరుగుదొడ్డి నిర్మాణ ం చేయగలవచ్చు. కాని దాన్ని సంఘం ఆమోదించేలా చేసి, పారిశుధ్యాన్ని సాధించటానికి కార్యక్రమాలను రూపకల్పన చేసే సామాజిక శాస్త్రవేత్త లేనిదే అబివృద్ధి అసాధ్యం. మానవ జాతి ఏ దిశలో ప్రయాణం చేస్తుంది, భవిష్యత్ తరాలు ఏ క్రమంలో ఉండబోతున్నాయని విశ్లేషణ చేస్తూ మానవ జాతి లాభపడేలా సంఘాన్ని ఒక త్రాటిపై నడిపించడానికి కృషి చేసేవే సామాజిక శాస్త్రాలు.
కాని ఇప్పుడు పరిస్థితి ఏంటి? మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో మానవీయ, సామాజిక శాస్త్రాలు అంటే చిన్న చూపు. ఒక విశాల దృక్పథంతో శాస్త్రీయంగా సామాజిక శాస్త్రాలను అధ్యయనం చేద్దామనుకునే విద్యార్థులకు రాష్ట్రంలో చాలా తక్కువ విద్యావకాశాలు ఉన్నాయి. ఉన్న కొద్ది అవకాశాల విషయమై కూడా విద్యార్థులకు అవగాహన లేదు. చాలా కళాశాలల్లో సామాజిక శాస్త్రాలు, పాఠ్యగ్రంథాల పరిజ్ఞానం తప్ప ప్రయోగాత్మక పద్ధతులతో బోధనా విధానాలు లేని తరగతి విద్యగానే పరిమితమయ్యింది. రాష్ట్రంలోని అనేక విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అర్హతలు లేని అభ్యర్థులు బోధన చేస్తున్నారు. సుశిక్షితులైన విద్యార్థులుగా సంస్థలు వారిని మలచలేకపోతున్నాయి. సామాజిక శాస్త్రాలలో పట్టా తెచ్చుకున్నా సరైన ఉపాధి అవకాశాలు లేక మళ్ళీ సాఫ్ట్‌వేర్ కోర్సులలోనో, మరే ఇతర రంగంలోనో ఉపాధికి శిక్షణ పొందుతున్నారు. ఈ కోర్సులకు డిమాండ్ తగ్గిపోవడంతో డిగ్రీ స్థాయిలో సైన్సెస్, మేనేజ్ మెంట్, కంప్యూటర్స్, అకౌంట్స్ కోర్సులు తప్ప కళాశాలలు సామాజిక శాస్త్రాల ఊసే ఎత్తటం లేదు. విశ్వవిద్యాలయాల్లో పీజీ స్థాయి నుంచి తప్ప బాచిలర్స్ స్థాయిలో కోర్సులు ఉండవు. దూరదృష్టిలేని ప్రభుత్వ విధానాల వల్ల ఇంజనీరింగ్ కళాశాలలు అవసరానికి మించి పెరుగుతూ వచ్చాయి.
ఆర్ట్స్ కోర్సులు చతికిల బడ్డాయి. ఈ క్రమంలో సామాజిక శాస్త్ర విద్య ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా ఈ పరిస్థితి మారాలంటే ప్రభుత్వం, సమాజం దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. ఒక ప్రసిద్ధ ఆంగ్ల న్యూస్ మాగజిన్ ప్రతి ఏటా నిర్వహించే సర్వేలో భారతదేశంలోని టాప్ 10 ఆర్ట్స్ కళాశాలల్లో ఏ ఒక్క కళాశాల ఆంధ్రప్రదేశ్‌లో లేదు. ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబై మహా నగరాలలో బ్రిటిష్ వారి హయాంలో ఏర్పాటైన స్టీఫెన్స్, లయోలా, ప్రెసిడెన్సీ తదితర కళాశాలలే ఇప్పటికీ ప్రముఖంగా కనిపిస్తాయి. మన రాష్ట్రంలో కూడా సామాజిక శాస్త్రాల అధ్యయనం ఎక్కువగా క్రిస్టియన్ కళాశాలల్లో కనిపిస్తుంది. గత ఏడాది హైదరాబాద్‌లో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోసల్ సైన్సెస్ శాఖను ప్రారంభించడం ఒక మంచి పరిణామం.
సాఫ్ట్‌వేర్, సెల్‌ఫోన్ టెక్నాలజీ రంగాలలో దేశం రాణిస్తూ ఉండొచ్చు. కాని నిరక్షరాస్యత, అజ్ఞానం, విలువలులేని విద్యా విధానాలు, బాల్యవివాహాలు, పేదరికం, అనారోగ్యం, పారిశుధ్యలోపం, స్త్రీ వివక్ష లాంటి సామాజిక రుగ్మతలతో బాధపడుతూ సమాజం మానవీయ పురోగతి సాధించలేదు. మనుషులుగా సమాజంలో మనం హీనస్థితిలో ఉండి, ఎంత సాంకేతిక పరిజ్ఞానం పెంచుకున్నా లాభమేమిటి? విలువలుపోయి విద్యా వ్యవస్థ దిగజారుతుంటే దానికి తగిన సూచనలిచ్చి సమాజ నిర్మాణానికి తోడ్పడగల విద్యావేత్తలు మన రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? వివిధ రంగాలలో మహిళలు పురోగమిస్తున్నా రోజూ వారిపై ఆటవికంగా జరుగుతున్న అత్యాచారాలు చూసి అయినా సమాజ రుగ్మతలకు చికిత్స చెయ్యాల్సిన సామాజిక శాస్త్రవేత్తల అవసరం గుర్తుకురావడం లేదా? యాంత్రిక జీవన విధానాలతో ఈ పోటీ ప్రపంచంలో నెట్టుకు రాలేక, తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతూ మనస్తాపం చెందుతున్న యువతకు, పెద్దలకు ధైర్యం చెప్పగల మానసిక శాస్త్రవేత్తలు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? ప్రత్యేక రాజకీయవాదాలతో సామాజికంగా, ఆర్థికంగా కుంటుపడుతున్న రాష్ట్రానికి సరైన పరిష్కార మార్గాలు చూపగల రాజకీయ విశ్లేషకుల కొరత కనిపించట్లేదా? ఇలా చెప్పుకుంటూ పోతే సామాజిక శాస్త్రాల అవసరం, ప్రాధాన్యం మానవ సంబంధాలు ఉన్న అన్ని రంగాలతోనూ పెనవేసుకుని కనిపిస్తుంది. కాని ఆ శాస్త్రాలకు ప్రోత్సాహం లేక, ఒక కొత్త సమాజాన్ని నిర్మించగల ఎందరో గాంధీలను , గురజాడ అప్పారావు వంటి రచయితలను, వీరేశలింగం పంతులు వంటి సంఘ సంస్కర్తలను రాష్ట్రం కోల్పోతోంది.
ప్రస్తుతం మనం పలు సంక్షోభాలను ఎదుర్కొంటున్నాం. మన రాష్ట్రానికి, సమాజానికి ఒక దిశను నిర్దేశించగల ఎందరో యువ సామాజిక శాస్త్రవేత్తల అవసరం చాలా ఉంది. మన రోజువారీ జీవితంలో ఎంతో కీలకపాత్ర వహిస్తూ మానవజాతి మనుగడకు అద్దంపట్టే సామాజిక శాస్త్రాలను పునరుద్ధరించాల్సిన సమయం ఆసన్నమయింది. సామాజిక శాస్త్రాలను ఆకర్షణీయ అకడమిక్ చాయిస్‌గా అభివృద్ధి చెయ్యాలి. రాష్ట్రంలో ఆర్ట్స్, హ్యుమానిటీస్ సబ్జెక్ట్స్‌ను పునరుద్ధరించటానికి ప్రఖ్యాత సామాజిక శాస్త్రవేత్తలతో కూడిన ఒక కమిటీని నియమించాలి. మానవ వనరుల అభివృద్ధి కార్యక్రమాలలో సామాజిక శాస్త్రాలకు స్పెషల్ కోటా ఇవ్వాలి. విశ్వవిద్యాలయాల్లోని సామాజిక శాస్త్ర విభాగ వ్యవస్థను, వసతులను సంస్కరించాలి. యువ సామాజిక శాస్త్రవేత్తలను సమాజానికి అందించగల వ్యవస్థలుగా ఆర్ట్స్ కళాశాలలకు కొత్త రూపానివ్వాలి. సంబంధిత జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో అకడమిక్ సంబంధాలు పెంపొందించుకోవాలి. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు అనుబంధంగా ఈ కళాశాలలు పనిచెయ్యాలి. రాష్ట్ర ప్రభుత్వం వివిధ సామాజిక శాస్త్ర పరిశోధనా సంస్థలను ప్రారంభించి, వాటికి అవసరమైన నిధులు కేటాయించాలి.
నాలుగు గోడల మధ్య కేవలం లెక్చర్ విధానంతో సామాజిక శాస్త్రాలను బోధించడం శాస్త్రీయ పద్ధతికాదు. విద్యార్థుల్లో స్వతంత్ర సంక్లిష్ట ఆలోచనా ధోరణి తీసుకురావటానికి అవసరమైనబోధనా విధానాలను ఉపయోగించని పక్షంలో సామాజిక శాస్త్రాల అధ్యయనం సార్థకం కాదు. సమకాలీన సమస్యలకు సులువుగా అనుసంధానించుకోగల సిద్ధాంతాల, విధానాలకు పాఠ్యాంశాలలో ప్రాధాన్యమిస్తే సామాజిక శాస్త్రాల అధ్యయనం అధిక ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది. సామాజిక శాస్త్ర విద్యలో విద్యార్థులకు పరిశోధనా పద్ధతులలో శిక్షణ ఇవ్వటం ఒక కీలక విషయం. ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులు ఏ విధంగా లాబ్‌లో ప్రయోగాత్మకంగా సబ్జెక్ట్‌ను అధ్యయనం చేస్తారో సామాజిక శాస్త్రాల అధ్యయనం కూడా సమాజమే పరిశోధనాలయంగా సాగాలి. కేస్ స్టడీస్, క్షేత్రస్థాయి విచారణ వంటి బోధనా పద్ధతుల ద్వారా విద్యార్థులకు ప్రయోగాత్మక శిక్షణ కూడా అందించవచ్చు.
విశ్వవిద్యాలయాలు, ఆర్ట్స్ కళాశాలలు స్థానిక కమ్యూనిటీతో గట్టి అనుబంధంతో పనిచెయ్యాలి. ఆ ప్రాంత ప్రజల వికాసం, ప్రాంతాభివృద్ధి లో విద్యార్థులకు కీలక బాధ్యత ఇస్తూ వారికి అవసరమైన నైపుణ్యాలు, సామర్థ్యాలు, వనరులను ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల సహాయంతో కళాశాలలు పనిచేయగలగాలి. మన దేశం, రాష్ట్రం ఎదుర్కొంటున్న ఎన్నో సమకాలీన సామాజిక, ఆర్థిక సవాళ్ళను ఛేదించడంలో ఈ యువ సంపద ఎంతో ముఖ్య పాత్ర వహించగలదు. విద్య, ఆరోగ్యం, పారిశుద్యం, మహిళా సాధికారత, పర్యావరణం, గిరిజన వికాసం, నేర నియంత్రణ... ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలలో యువ సామాజిక శాస్త్రవేత్తలను విద్యార్థి దశనుంచి భాగస్వాములను చేసే విధంగా ప్రభుత్వం సంస్థాగత నిర్మాణం చేపట్టాలి. ప్రభుత్వ సంస్థలు/ డిపార్ట్‌మెంట్ల కార్యకలాపాల లో యువతను భాగస్వాములుగా చేసి పని చేస్తే ప్రభుత్వానికి అవసరమైన మానవ వనరులు లభించటంతో పాటూ, సామాజిక అవగాహన, స్పృహ కలిగిన యువతను మనం సమాజానికి అందించవచ్చు. రక్షణ రంగానికి పెట్టే ఖర్చుతో సమాన బడ్జెట్‌ను విద్యకు కూడ ఖర్చు పెట్టాలని స్వతంత్ర భారత దేశ మొదటి విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ సూచించారు. 1964 నాటి కొఠారి కమిషన్ నుంచి నేటి వరకు అనేక విద్యా కమిషన్లు జీడీపీలో ఆరు శాతం విద్యకు కేటాయించాలని సూచించాయి. అందుకు భిన్నంగా కేటాయింపులు తగ్గుతూ వస్తున్నాయి. దేశంలో నాణ్యమైన చదువు అందుబాటులో ఉంటే మంచి చదువుల కోసం ఇతర దేశాలకు వెళ్ళవలసిన అగత్యం ఉండదు. పాతికేళ్ళ లోపు వయస్సుగల 56 కోట్ల యువ జనాభా ఉన్న భారతదేశంలోని యువ వనరులను సమాజాభివృద్ధికి తోడ్పడే వైవిధ్య కోర్సులలో సరైన విద్య-ఉపాధి అవకాశాలతో ప్రోత్సహిస్తే, అది మానవాళి సంక్షేమానికి ఒక గొప్ప ముందడుగు అవుతుంది.
ప్రముఖ అమెరికన్ పాత్రికేయుడు థామస్ ఫ్రైడ్‌మన్ భారత్, చైనాలు ఎదుర్కొంటున్న అత్యధిక జనాభా సమస్యని ప్రస్తావిస్తూ ఇలా అన్నారు: 'ఏదేశమైతే అంతకంతకూ పెరుగుతోన్న జనాభాను 'డెమొగ్రఫిక్ డివిడెండ్'గా విజయవంతంగా మార్చుకోగలదో ఆ దేశమే 21వ శతాబ్దంలో అభివృద్ధిలో అగ్రగామిగా ఉంటుంది'. అలాంటి దిశగా మన ప్రభుత్వాలు అడుగులు వేయాలి. అప్పుడే విద్యార్థులను ఇతరుల అభిప్రాయాలు, హక్కులను గౌరవిస్తూ సామాజిక బాధ్యతతో దేశ సమగ్రాభివృద్ధికి తోడ్పడగల పౌరులుగా తీర్చి దిద్దగలగడం సాధ్యమవుతుంది.
- డాక్టర్ మనోహరి వెలమాటి
సురాజ్య ఉద్యమ సమన్వయకర్త


Andhra Jyothi Telugu News Paper Dated : 12/12/2013 

'అణగారిన' దృష్టికోణంలో చరిత్ర - డా. కాలువ మల్లయ్య

దేశచరిత్ర చూసినా/ఏమున్నది గర్వకారణం?/నరజాతి చరిత్ర సమస్తం/పరపీడన పరాయణత్వం' అని అంటూ 'తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరు?' అని ప్రశ్నించారు మహాకవి శ్రీశ్రీ. అయినా జరుగుతున్నదేంటి? రాజుల, రాణుల, నాయకుల చరిత్ర మాత్రమే చరిత్రగా పుస్తకాలకెక్కుతుంది. వాటినే చరిత్రగా చదువుకుంటున్నాం. ఆ యుద్ధాల్లో అసువులు బాసినవారు కాని, దేశ నిర్మాణంలో చెమటోడ్చి ప్రాణాలర్పించిన వారు కాని, చారిత్రక భవన నిర్మాణాల్లో ప్రాణాలు కోల్పోయిన సామాన్యులుకాని చరిత్రకెక్కడం లేదు. ప్రజలే చరిత్ర నిర్మాతలని బరువైన మాటలు చెప్పబడినా చరిత్ర నిర్మాణంలో ప్రజల పాత్రను పట్టించుకున్నవారు లేరు. అంతే కాకుండా రాజుల కాలం నాటి చరిత్రను హిందూ అగ్ర వర్ణ చారిత్రక దృష్టితోనూ, తర్వాతి చరిత్రను ఆంగ్లేయుల పాశ్చాత్య దృష్టికోణంతోనూ రాయడం జరిగింది. ఏ కాలంలోనూ ఈ దేశంలోని సామాన్య మానవుడు, నిజమైన చరిత్ర నిర్మాతలు, సంపదల సృష్టికర్తలైన అణగారిన జాతుల వారు చరిత్ర పుటల్లోకి ఎక్కలేదు.
రాజులు, రాణులు మాత్రమే కాదు సామాన్యులమైన మనమందరం కూడా చరిత్రకెక్కదగిన వారమేనని సాహిత్య ఆధారాల ద్వారా వెయ్యేండ్ల తెలుగువారి సాంఘిక చరిత్రను 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర'గా రాసిన మొట్టమొదటి ప్రజాస్వామిక చరిత్రకారుడు సురవరం ప్రతాపరెడ్డి. అయితే ఇది కేవలం సాంఘిక చరిత్ర మాత్రమే. ఆయా కాలాల్లో ప్రజల ఆచార వ్యవహారాలు, అలవాట్లు, పనిముట్లు, ఆహార విహారాదులు మన సాహిత్య గ్రంథాల్లో వర్ణించిన తీరును ఈ గ్రంథంలో పొందుపరచడం జరిగింది. ఇది మాత్రమే కాదు ప్రజలను చరిత్ర నిర్మాతలుగా నిలబెట్టడానికి ఆయా కాలాల్లో సాంస్కృతిక, ఆర్థిక, చారిత్రక నిర్మాణంలో ప్రజల త్యాగాలను, ప్రజల పాత్రను వాస్తవ దృష్టితో రాసినప్పుడు అది ప్రజల చరిత్ర అవుతుంది. చరిత్ర నిర్మాతల చరిత్ర అవుతుంది. అలాంటి చరిత్రలు ఇంతవరకూ రాలేదు. అలాగే తెలంగాణ చరిత్ర విషయంలోనూ కోస్తాంధ్ర అగ్రవర్ణ దృష్టి కోణమే రాజ్యమేలుతుంది.
అల్లూరి సీతారామరాజును గ్లోరిఫై చేయడం, కొమురం భీంను విస్మరణకు గురిచేయడం, కోస్తాం ధ్ర సంస్కృతీ ఆచార వ్యవహారాలను, పండుగలను ఉన్నతీకరించడం, బతుకమ్మ లాంటి ప్రధాన పండుగలను కూడా విస్మరించడం వెనుక కూడా ఇదే దృష్టి కోణముంది. అలాగే రెండూ రాచరిక పాలనలే అయినా రాయల పాలనను స్వర్ణయుగంగా ఉన్నతీకరించి నైజాం పాలనను ఫ్యూడల్ పాలనగా చిత్రించడం కూడా ఇందులో భాగమే. నిజానికి రజాకారుల విజృంభణను మినహాయిస్తే నిజాం పాలన ఏ ఇతర రాజుల పాలనకూ తీసిపోదు. కోస్తాంధ్ర చరిత్రకారులకు ఆంగ్లేయుల పాలనలో ప్రజాస్వామ్యం, ఆధునికత కనిపించడం, నిజాం పాలనలో ఉన్న మంచినేమాత్రం గుర్తించకుండా చివరి రోజులనే చరిత్రగా రాయడం వెనక ఉన్నది కూడా ఆధిపత్య భావనయేనన్నది వాస్తవం. భారతదేశానికే సాయుధ పోరాట వారసత్వాన్ని అందించిన తెలంగాణ పోరాటాన్ని కొందరు కేవలం నైజాం వ్యతిరేక పోరాటంగా చిత్రించడం కూడా ఇందులో భాగమే. ఏదిఏమైనా చరిత్ర రచనలో ఎవరి వాటా వాళ్ళకు ఇవ్వడంలో అగ్రవర్ణ, పాలక వర్గాల దృష్టి కోణం నుంచి తప్ప అణగారిన జాతుల దృష్టికోణం అన్ని కాలాల్లోను విస్మరణకు గురవుతూనే ఉంది. సాహిత్య, సాంస్కృతిక, సాహిత్య, చారిత్రక రంగాలన్నిటిలోనూ ఇదే పద్ధతి కొనసాగుతుంది.
ఇటీవలి కాలంలో మంద కృష్ణ మాదిగ నిర్వహించిన 'అమరుల తల్లుల కడుపుకోత' మహాసభ ఇలాంటి విషయాలెన్నిటినో బయటకు తెచ్చింది. చరిత్రలో అణగారిన వర్గాల స్థానం గురించి ప్రశ్నించేట్టు చేసిం ది. స్వాతంత్య్రానంతర కాలంలో కాని, అంతకు ముందుకాని తెలంగాణ లో వేలాది మంది అణగారిన జాతుల ప్రజలు బలిదానాలు చేశారు. తెలంగాణ కోసం, భూమికోసం, భుక్తికోసం, ఫ్యూడల్ వ్యవస్థ నిర్మూలన కోసం తమ ప్రాణాలను అర్పించారు. నైజాం వ్యతిరేక, భూపోరాటాల సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మల బలిదానాలతో పాటు ఎంతో మంది అణగారిన కులాల వారు బలయ్యారు. ఈ వర్గాల వారు, ఎవరి పాలన ఉన్నా గ్రామాల్లో దొరల పీడనను అనుభవించారు. అయితే వీళ్ళకు ఆ తర్వాతి చరిత్రలో లభించిన స్థానం ఏమిటి? స్వాతంత్య్రానంతరం కానీ, అంతకు ముందు కాని ప్రత్యేక తెలంగాణ పోరాటంలో చనిపోయిన 369 మందిలో మూడువందల మందికి పైగా పీడిత కులాలకు చెందిన వారే. నలభైఏళ్ళుగా తెలంగాణలో జరుగుతున్న భూపోరాటాల్లోనూ ఈ వర్గాలవారే మెజారిటీ ప్రజలు సమిధలుగా మారారు. అయితే వీటన్నింటిలోనూ నాయకత్వం, పోరాటఫలాలు దక్కించుకున్నది అగ్ర కులాలవారే. చరిత్రలో వీళ్ళకు లభించిన స్థానం దాదాపు శూన్యం. గత పన్నెండేళ్ళుగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతస్థాయిలో కొనసాగుతుంది. వెయ్యినుంచి పన్నెండు వందల వరకు విద్యార్థులు, యువకులు ఈ ఉద్యమంలో మరణించారు.
ఇంతమంది త్యాగా ల ఫలంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబోతుంది. ఈ ఉద్యమంలో మరణించిన వాళ్ళంతా ఎవరు? రేపు తెలంగాణ వస్తే వీళ్ళకిచ్చే నివాళి ఏమిటి? వీళ్ళ ప్రాణ త్యాగాలకు కట్టే విలువేమిటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది కడుపుకోత మహాసభ. వీటికి సమాధానాలను వెతుక్కున్నేట్టు చేసింది. మంద కృష్ణ మాదిగ ఏ ఉద్దేశంతో, ఏ ప్రయోజనం కోసం కడుపుకోత మహాసభ నిర్వహించినా చరిత్ర నిర్మాణంలో అణగారిన జాతులకు ఇవ్వాల్సిన స్థానాన్ని ప్రశ్నించేట్టు చేసింది. ఆ మహాసభలో మాట్లాడిన అమరుల తల్లుల మాటలు అక్కడున్న వేలాది మంది హృదయాలు ద్రవించేట్టు చేశాయి. అందరి కనుగడ్ల నిండా కన్నీళ్లను నింపాయి. చాలా మందిని భోరు భోరున ఏడ్చేట్టు చేశాయి. తెలంగాణ అమరవీరుల గురించి అందరూ ఆలోచించేట్టు చేసాయి.
ఓ దిక్కు వేలాది మంది తెలంగాణ తల్లులు రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన తనయులకోసం కడుపుకోతతో అలమటిస్తుంటే సీమాంధ్ర తల్లులు తమ కుమారులు, కుమార్తెల భవిష్యత్తు ఏమిటని హైదరాబాద్‌లో ఉద్యోగాల గురించి మాట్లాడటం ఎంత అసహజమో అర్థమవుతుంది గదా. హైదరాబాద్‌లో ఇతర రాష్ట్రాలవారి లాగే తమ బిడ్డలూ ఉద్యోగాలు చేసుకోవచ్చన్న విషయం వాళ్ళకు తెలియదా? హైదరాబాద్‌లో సీమాంధ్రులు ఉద్యోగం చేసినంతమంది రేపటి సీమాంధ్ర రాజధానిలో తెలంగాణ వాళ్లు ఉద్యోగాలు చేయడానికి సీమాంధ్ర తల్లులు ఒప్పుకుంటారా? ఓ దిక్కు సీమాంధ్ర తల్లులు అసహజమైన డిమాండ్ల తో తెలంగాణను అడ్డుకుంటానికి ప్రయత్నిస్తుంటే సీమాంధ్ర నాయకు లు చేస్తున్నదేమిటి? పొట్టిశ్రీరాములు త్యాగాన్ని వేయిమంది+369 మంది త్యాగాలకంటే గొప్పదిగా ప్రచారం చేయడం ఎంత అమానుషం? తెలంగాణ తల్లుల కడుపుకోతను పట్టించుకోకుండా అమరవీరుల త్యాగాలకు ఏ మాత్రం విలువీయకుండా తమ ఆధిపత్యం కోసం, ఆర్థిక దోపిడీ కోసం సీమాంధ్ర నాయకులు తెలంగాణను అడ్డుకోవాలని చూడటం వెనుక ఎంత మోసకారితనముంది? హైదరాబాద్‌తో తెలంగాణ పౌరులకున్న నాలుగువందల పైచిలుకు ఏండ్ల పేగు బంధాన్ని కాదని, యాభై ఏండ్లు రాజధానిగా ఉన్న కర్మానికి యు.టి.చేయాలని వాదించడం సీమాంధ్ర రాజకీయల కుట్రలో భాగమే కదా. ఇలా సీమాం ధ్రులు వెయ్యి మంది ప్రాణ త్యాగాలను, అంతకు ముందు జరిగిన నాలుగువందల మంది ప్రాణ త్యాగాలను కించ పరచటం ఎంత అమానుష చర్యో అర్థమవుతుంది కదా! వీళ్ళంతా తెలంగాణలోని అణగారిన జాతుల ప్రజలేనన్నది కాదనలేని సత్యం.
చరిత్రలో అణగారిన జాతులకు తగిన స్థాన మివ్వాలన్నా, వారి త్యాగాల రుణం చెల్లించుకోవాలన్నా చరిత్రను ఆధిపత్య జాతుల, ఆధిపత్యకులాల దృష్టి కోణంలోంచి కాకుండా అణగారిన జాతుల, కులాల దృష్టి కోణంలోంచి రాయాలి. ప్రపంచరిత్రను పాశ్చాత్య తెల్ల జాతుల వారి దృష్టికోణం లోంచి కాకుండా పీడిత, నల్ల జాతులవారి దృష్టి కోణంలోంచి రాసినప్పుడే సరైన న్యాయం జరుగుతుంది. అలాగే భారత దేశచరిత్రను పాశ్చాత్య, బ్రాహ్మణీయ, ఆర్యజాతుల దృష్టికోణంలోంచి కాకుండా దేశీయ, ద్రావిడ, పీడితకులాల దృష్టి కోణం లోంచి చూసి తీరాలి. తెలంగాణ చరిత్రను కూడా ఇలాంటి దృష్టి కోణం లోంచి చూడాలని అమరుల తల్లుల కడుపుకోత మహాసభ రుజువు చేసింది. అదే సరైన చారిత్రక దృష్టికోణమవుతుంది. మానవీయ దృష్టి కోణమూ అవుతుంది. అందుకోసం సీమాంధ్ర రాజకీయులు, ప్రజలు మరిన్ని బలిదానాలు జరుగకుండా తెలంగాణ ప్రక్రియ వేగవంతం కావడానికి అడ్డంకులు వేయకూడదు. తెలంగాణ లోని రాజకీయ పార్టీలు ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశమున్నా అణగారిన జాతుల్నుంచి వచ్చిన వ్యక్తి పీడిత కులాల అధికారం, సామాజిక న్యాయం ధ్యేయంగా, సిద్ధాంత బలంతో ముఖ్యమంత్రి అయి తీరాలి. ఆ దిశగా రాజకీయాలు నడవాలి.
తెలంగాణ వస్తే అణగారిన జాతుల, పీడితకులాల వారి బతుకులు బాగుపడుతాయని తెలంగాణ కోసం తమ అమూల్యమైన ప్రాణాలు త్యాగం చేసిన వెయ్యి మంది అమరుల పేరు మీద అమరుల స్మారక పార్కును ఏర్పాటు చేయడం సముచితమైన చర్య. ఇందులో వెయ్యిమంది అమరవీరులు విగ్రహాలను ఏర్పాటు చేసి దాన్ని పర్యాటక స్థలంగా తీర్చి దిద్దాలి. దీన్ని త్యాగమూర్తుల స్ఫూర్తిదాయక కేంద్రంగా రూపొందించాలి. మొదటిసారి జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోవడానికి కారకుడైన అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి పేరు మీదున్న పార్కును అమరవీరులు స్మారక పార్కుగా తీర్చిదిద్దడమే సరైన చర్య. అంతేకాకుండా హైదరాబాద్ నడిబొడ్డులో అమర వీరుల స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేయాలి. అమరుల కుటుంబాలకు తెలంగాణ రాజ్యాధికారంలో తగిన పాత్ర ఇవ్వాలి. మొత్తంగా సిద్ధాంత బలంతో కూడిన సామాజిక న్యాయ తెలంగాణ ఏర్పడినప్పుడే అమరుల త్యాగాలకు సరైన నివాళి ఇచ్చినట్టువుతుంది. ఇలాంటి తెలంగాణ చరిత్ర రచన, చరిత్ర నిర్మాణం, చరిత్ర నిర్మాణంలో అణగారిన జాతుల దృష్టి కోణం భారతదేశ చరిత్ర పునర్నిర్మాణానికి ప్రపంచ చరిత్ర నిర్మాణానికి మార్గదర్శకమవుతుంది. అందుకోసం అమరవీరుల పార్కు స్ఫూర్తి ప్రదాతగా ఉండేట్టు తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి సంతకం పార్కు నిర్మాణంకు సంబంధించిన ఫైలు మీద చేసి తీరాలి.
-డా. కాలువ మల్లయ్య


Andhra Jyothi Telugu News Paper Dated : 11/12/2013 

Friday, December 6, 2013

ఇంకెన్నాళ్ళీ గారడీలు - దుడ్డు ప్రభాకర్

వంట పని దగ్గర్నుండి పంట పనుల వరకు యంత్రాలను ఉపయోగిస్తున్న కంప్యూటర్ యుగమిది. అయినప్పటికీ మనిషి మలాన్ని చేతులతో గంపల్లోకి ఎత్తి నెత్తిన పెట్టుకొని ఊరి బయటకు మోసుకెళ్ళి పారబోసే మనుషులు ఈ హైటెక్ యుగంలో కూడా దర్శనమిస్తున్నారు. వారే ఈ నిచ్చెన మెట్ల కులవ్యవస్థలో అట్టడుగు మెట్టైన దళితులు. వారే పారిశుద్ధ్య కార్మికులు, పాకీ పని వారుగా, సఫాయి కార్మికులుగా, సచ్చడి వారుగా పిలబడుతున్నారు. ఒక చోట రెల్లి, ఇంకోచోట హడ్డి, మరోచోట మాదిగ కావచ్చు కానీ వీరంతా దళితులు. దళితుల్లో దళితులు. దరిద్రులైన దళితులు. తమజానెడు పొట్టకోసం, బిడ్డల గిన్నెల్లో పిడికెడు మెతుకుల కోసం కోడి కూతకు ముందే నిద్రలేచి వీధుల వెంట పరుగులు తీస్తూవుంటారు. రెక్కలతో పాటు రేకుముక్క, చీపురు, గంప వాళ్ళ ఆస్తులు. బిడ్డల ముడ్డి కడగడానికి కూడా ఇష్టపడని కన్నతల్లులున్న ఈ దేశంలో ఈ కంపు జీవితాలు ఇంకా ఇలా కొనసాగుతూనే ఉన్నాయి.
అంబేద్కర్ వర్ధంతి రోజైన డిసెంబర్ 6, 2013న కేంద్ర ప్రభుత్వం సఫాయి కార్మికుల సంక్షేమం కోసం అంటూ ఒక చట్టం చేసింది. తద్వారా యంత్ర పరికరాలు లేకుండా చేతులద్వారా మరుగుదొడ్లను శుభ్రం చేసే సఫాయి పనికి పూర్తి చెక్ పెడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం భుజాలు చరుసుకుంటుంది. కేంద్ర గణాంక శాఖ వివరాల ప్రకారం మన రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 1,73,690 అపరిశుభ్ర మరుగుదొడ్లున్నట్లు, వీటిలో 7,111 మరుగుదొడ్లను మనుషులతో శుభ్రం చేయిస్తున్నారని చెప్పుకోవడానికి పాలకులు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. వందల ఏళ్ళ ఆధునిక భారత చరిత్రలో, స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్న 66 ఏళ్ళ తర్వాత కూడా ఈ మనుషుల్ని చూసి సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. డిసెంబర్ 6న ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దెయిర్ రిహాబిలిటేషన్ యాక్స్ 2013ను దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అన్ని పట్టణ ప్రాంతాల్లో అమలులోకి తేనుంది. విశేషమేమంటే అంటరాని వారి బతుకుల్ని సంస్కరించడానికి ఒక అంటరాని వాడి వర్ధంతి రోజున చట్టం తెస్తున్నామహో! అని యూపీఏ ప్రభుత్వం చెప్పకనే చెబుతుంది. ఇప్పుడు కూడా కులం అంబేద్కర్‌ని వదల్లేదు. ఆ భారత రత్న, రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ చనిపోయిన 57 ఏళ్ళ తర్వాత కూడా ఆయన్ని కులం వెంటాడుతూనే వుంది. తన జీవితాంతం అగ్రకుల బ్రాహ్మణీయ పాలకుల కుట్రలకు బలై అంటరాని వాడిగా, దళితులకు మాత్రమే ఆరాద్యుడుగా కుదించబడిన అంబేద్కర్ వర్ధంతి రోజున చట్టాన్ని తెచ్చి విస్తృత ప్రచారం ద్వారా దళితుల ఓట్లు కొల్లగొట్టవచ్చని పాలకులు తమ అగ్రకుల దురహంకార స్వభావాన్ని నిర్లజ్జగా, నిర్భయంగా చాటుకుంటున్నారు. ఈ దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కోసం పోరాడి, ఆ లక్ష్యాన్ని రాజ్యాంగంలో పొందుపరచని సామాజిక విప్లవ కారుడిని సంస్కరణ వాదిగా, అంటరానివాడిగా ప్రచారం చెయ్యడంలో భాగంగానే ఈ బరితెగింపుకు సిద్ధపడ్డారు. ఈ వైఖరి రాజ్యాంగాన్ని అవమాన పరచడమే.
ఈ చట్టం పట్టణ ప్రాంతంలో మాత్రమే అమలవుతుందని చెబుతున్నారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై తొలుత 50 వేల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష, లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. అతిక్రమణలు ఇంకా కొనసాగితే 5 లక్షల జరిమానా లేదా ఐదేళ్ళ జైలు శిక్ష. లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. అన్ని పట్టణాలలో సర్వే చేపట్టి సఫాయి పనివారిని గుర్తించి వారికి విధిగా ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించాల్సి ఉంటుంది. ఈ చట్టాన్ని అమలు జరిపి ఆరు నెలల్లో డ్రైలెట్రిన్స్ లేకుండా చేస్తామని ఇదొక చారిత్రాత్మక చట్టమని 2014 ఎన్నికల దాకా దళిత రాజకీయ నాయకులతో, ప్రభుత్వేతర సంస్థల(యన్.జీ.ఓ)తో దళితవాడల్ని ప్రచార హోరులో ముంచెత్తనున్నారు.
పట్టణాలలోని సఫాయి కార్మికులను మాత్రమే ఈ చట్టపరిధిలోకి తెచ్చారు. డ్రైనేజీలోకి, మ్యాన్ హోల్స్‌లోకి దిగి శుభ్రం చేసే మున్సిపల్ వర్కర్స్ విషవాయువుల ప్రభావం వల్ల నిత్యం మరణిస్తూ ఉంటారు. ఆ పనిలో కూడా యంత్రాలు ఉపయోగించడం లేదు కాబట్టి వారిని కూడా ఈ చట్ట పరిధిలోకి తేవాలి. దేశవ్యాపితంగా గ్రామాలలో మేజర్ పంచాయతీల్లో వ్యక్తిగత డ్రైలెట్రీన్‌లు శుభ్రం చేసే వారి సంగతేంటి? అనేక గ్రామాల్లో ఊరి చివర ఇంకా కామన్ లెట్రిన్స్ దర్శనమిస్తున్నాయి. వాటిని శుభ్రం చేసే వారిని నిర్లక్ష్యం చేశారు. ఈనాటికి గ్రామీణ ప్రాంతాలలో అధునాతన లెట్రిన్ల సెప్టిక్ ట్యాంకుల్లో దిగి మలాన్ని బక్కెట్లో ఎత్తి డబ్బాలలో నింపి రిక్షాద్వారా ఊరు బయట పారబోస్తున్నారు. వాళ్ళంతా దళితులు, యానాదులే. వాళ్ళను కూడా ఈ చట్ట పరిధిలోకి తేవాలి. చచ్చిన పశు కళేబరాల్ని, అనాధ శవాల్ని, గుర్తుతెలియని శవాల్ని ఆసుపత్రికి తరలించే వాళ్ళు, పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత బయటపెట్టే వాళ్ళు, శ్మశానానికి మోసేవాళ్ళు వీళ్ళందరూ దళితులే. వీరు అపరిశుభ్ర, అవమానకర పనులు చేతులతోనే చేస్తున్నారు. యంత్రాలతో కాదు. వీళ్ళను కూడా ఈ చట్ట పరిధిలో చేర్చాలి. ఈ చట్టం ఎన్నికల గారడీలో భాగంగానే హడావిడిగా చేయబడింది.
సమగ్రమైన పరిశీలనలేని కారణంగానే పట్టణాలకే పరిమితం చేశారు. ఆ మేరకు చట్టాలు చేసినా పాలకులకు వాటిని అమలు చెయ్యడంలో చిత్తశుద్ధి ఉండదు. ప్రస్తుతం నిర్వీర్యమై అంపశ్యమీద పడుకోబెట్టబడివున్న ఎస్సీ/ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989 మనకొక ఉదాహరణ మాత్రమే. 1992లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం దేశంలో 14 లక్షల మంది కార్మికులు మలాన్ని చేతులతో ఎత్తే పనిలో వున్నారు. మన రాష్ట్రంలో దాదాపు ఎనిమిది వేల మందికి పైగా ఉన్నారు. చేతులతో మలాన్ని ఎత్తే మనుషులను పనిలో పెట్టుకోవడం, డ్రైలెట్రిన్స్‌పై నిషేధం విధిస్తూ 1993లో భారత ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. అది అమలుకి నోచుకోలేదు.
ఈనాటికీ ప్రభుత్వరంగ సంస్థల్లో అధికారికంగానే ఆ పని కొనసాగుతుంది. రైల్వే వ్యవస్థలో అది బహిరంగంగానే జరుగుతుంది. నేటికీ రాష్ట్రంలో వందలాది డ్రైలెట్రిన్స్ నడుస్తున్నాయని ప్రస్తుత కేంద్ర గణాంక శాఖ వివరాలు తెలియజేస్తున్నాయి. చట్టం చేయబడినప్పటికీ కొనసాగుతున్న సఫాయి కార్మికుల దీనస్థితిపై 2005లో సుప్రీంకోర్టు స్పందించి వివిధ మంత్రిత్వ శాఖ అధికారులకు హెచ్చరికలతో కూడిన తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని అధికారులకు తమ శాఖల్లో పాకీ పనివారున్నారా? అనే విషయం పరిశీలించి ఆరునెలల లోపు నివేదిక పంపాలని ఆదేశించింది. ఎవ్వరూ నివేదిక పంపిన దాఖలాలు లేవు. మళ్ళీ చట్టం చేయవలసి వచ్చిందంటే ఈ దేశంలోని అధికారులకు, రాజకీయ నాయకులకు కోర్టులు, చట్టాల పట్ల ఏ పాటి గౌరవమున్నదో అర్థమవుతుంది. దళితుల్ని కేవలం ఓటర్లుగా చూస్తున్న ఈ పాలకులు దళితుల ఓట్లు కొల్లగొట్టే లక్ష్యంతోనే ఇలాంటి గారడీలు చేస్తుంటారు. అంతవరకే. ఆ చట్టాల అమలు పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించరు. అందుకే అనేక దళితహక్కుల పరిరక్షణ చట్టాలు నిర్జీవం చేయబడుతున్నాయి. ఈ ఆధునిక మనువాద సమాజంలో దళితులు సాటి మనుషులుగా చూడనిరాకరించబడుతూనే ఉన్నారు. అంబేద్కర్ మహాశయుని లక్ష్యమైన కులనిర్మూలన జరగనంతకాలం ఇలాంటి గారడీలు, పీడన, అణచివేత, అవమానాలు జరుగుతూనే వుంటాయి. అంబేద్కర్ వర్ధంతి సాక్షిగా కులనిర్మూలన లక్ష్యంతో చట్టాల అమలుకై పోరాటాలు చేద్దాం.
- దుడ్డు ప్రభాకర్
రాష్ట్ర అధ్యక్షులు, కులనిర్మూలనా పోరాట సమితి
(నేడు అంబేద్కర్ వర్ధంతి)

Andhra Jyothi Telugu News Paper Dated: 06/12/2013 

- See more at: http://www.andhrajyothy.com/node/38064#sthash.c4qtdhLQ.dpuf

అంబేద్కర్ ఆలోచనలు అనుసరణీయం By దామెర రాజేందర్‌



  డిసెంబర్‌ 6న డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ 57వ వర్ధంతి జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా అంబేద్కర్‌ ఆశయాలు, సిద్ధాంతం, ఆలోచనా విధానం అని మాట్లాడే ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచించాల్సిన అవసరముంది. అంబేద్కర్‌ వర్ధంతులు, జయంతుల సందర్భంగా సభలు, సమావేశాలు జరిపి, పూల దండలు వేసి, కొబ్బరికాయలు కొట్టడం, పసందైన ఉపన్యాసాలు చెప్పటం వరకే పరిమితమవుతున్నామా ? అంబేద్కర్‌ను రోల్‌మోడల్‌గా స్వీకరించి ఏ మేరకు ఆచరణాత్మకంగా ఉన్నాం? అని తప్పని సరిగా ఆలోచించాలి. ముఖ్యంగా అంబేద్కర్‌ సిద్ధాంతాన్ని గురించి మాట్లాడే వారు ఈ ఆలోచన చేయడం అవసరం.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆయన స్థాపించిన 'పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ' అనే మాట లేకుండా ఏ ఒక్క విద్యార్థీ విద్యావంతుడు కాలేదు. అందుకు అంబేద్కర్‌ చేసిన కృషి అమోఘమైనది. ఇది ఎవరూ కాదనలేని సత్యం. విద్యకు దూరమవుతున్న అణగారిన వర్గాల ప్రజలకు చదువును అందుబాటులోకి తేవాలని అంబేద్కర్‌ తపనపడ్డాడు. అలాగే విద్యను నిర్ణయిస్తున్న రాజకీయాలేమిటి ? ఎవరు అధికారంలో ఉన్నారు ? వారు ఎవరి ప్రయోజనాల కోసం విద్యా విధానాన్ని, విద్యా వ్యవస్థను నిర్ణయిస్తున్నారు ? అనే విషయాలను కూడా అంబేద్కర్‌ పట్టించుకున్నాడు. అందుకోసం అంబేద్కర్‌ను 'రోల్‌ మోడల్‌'గా స్వీకరించాల్సిన అవసరం ఉంది.
కానీ దురదృష్టకరం ఏంటంటే అంబేద్కర్‌ చెప్పిన దానికి, చేసిన దానికి విరుద్ధమైన పద్ధతులు నేడు కొనసాగుతున్నాయి. జయంతులు, వర్ధంతుల సందర్భంగా కొబ్బరి కాయలు, పూల దండలు, అందమైన మాటలు, వాగ్దానాలు, ప్రతిజ్ఞలతో సరిపెట్టుకునే దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది.
విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, అంబేద్కరిస్టులు విద్యావ్యవస్థలో వస్తున్న మార్పుల గురించి, విద్యా వ్యవస్థను శాసిస్తున్న రాజకీయాల గురించి ఆలోచించడం లేదు. ఆలోచిస్తున్నట్లు, విద్యావ్యవస్థ బాగు కోసం ఘర్షణ పడుతున్నట్లు ఊహల్లో ఉంటున్నారే తప్ప సరైన విధంగా ఆచరణ లేదు. ఇది చాలా దురదృష్టకరం. విద్యా వ్యవస్థను శాసిస్తున్నదెవరు ? ఆ రాజకీయలేమిటి ? అని తప్పనిసరిగా ఆలోచించాలి. ఎందుకంటే కాలేజీలు, యూనివర్సిటీలను రాజకీయాలే పాలిస్తున్నాయి. ఈ రాజకీయాలను పట్టించుకోకుండా విద్యార్థులుగా బ్రతకలేరు. మనుగడ సాగించలేరు. ఈ సత్యాన్ని గ్రహించకపోవడం నష్టదాయకం. అందువల్ల విద్యార్థులుగా రాజకీయాలను పట్టించుకోవాలి. లేకుంటే చదువుకోవడం, బ్రతకడం కూడా కష్టమేనని గ్రహించాల్సిన అవసరం ఉంది. మాయల ఫకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్లు యావత్తు తలరాతలు మార్చే 'కీ' రాజకీయల్లోనే ఉందని గుర్తెరగాలి. ఈ మధ్యకాలంలో కాకతీయ యూనివర్సిటీలో 'మెస్‌' ప్రైవేటీకరణ జరిగితే వ్యతిరేకించే వారు కొందరైతే మాకెందుకులే అని పట్టించుకోకుండా ప్రేక్షక పాత్ర వహించిన వారు కొందరు. ప్రైవేటీకరణ విద్యార్థులకు నష్టం అని అందరికీ తెలుసు. అయినా రాజకీయ ముసుగులో జరిగిన మెస్‌ ప్రైవేటీకరణను అడ్డుకునే రాజకీయ చైతన్యం విద్యార్థుల్లో, విద్యార్థి సంఘాల్లో కొరవడటం నిజంగా దురదృష్టకరం. విద్యార్థి సంఘాలుగా కొంత ఆందోళన ప్రయత్నం చేసినా కాకతీయ యూనివర్సిటీ పరిపాలన కేంద్ర రాజకీయాలను 'ఢ' కొట్టగలిగే రాజకీయ శక్తి విద్యార్థుల్లో లేకపోయింది. అందుకోసమే విద్యార్థులుగా, విద్యార్థి సంఘాలుగా ప్రస్తుతం చేస్తున్న రాజకీయాలే రాజకీయాలనుకునే భ్రమల్లోంచి బయటపడాలి. ప్రత్యక్ష రాజకీయాలను ఆలోచించాలి. అందుకోసం అంబేద్కర్‌ పుస్తకాలను, అంబేద్కర్‌ సిద్ధాంతాన్ని పట్టాలి.
'భారతీయ గ్రామాల్లో అందరూ ఒక్కటి కాదు. అవి అగ్రకులాలు, అంటరాని వారు అనే రెండు భాగాలుగా విభజించబడి ఉన్నాయి. అగ్రకులాల వారు పాలకులవుతారు. అంటరాని వారు కేవలం వారికి సేవలు చేసే బానిసలుగా మిగులుతున్నారు' అని అంబేద్కర్‌ అన్నారు. ఇది నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి వ్యవస్థ పోవాలి. అందుకు ఎవరు కృషి చేయాలి ? ఎవరు ఏం చేస్తున్నారు ? ఈ వ్యవస్థ ఇలాగే ఉండాలని కోరుకునే అగ్రవర్ణాలు, ఈ హిందూ సమాజాన్ని నిలకడగా ఉంచే అధికార పాలకవర్గాలు ఈ అసమానతలను పోగెట్టేందుకు ఎలాగూ పూనుకోవు. ఎందుకంటే వారి దోపిడీ కొనసాగడం కోసం ఈ వ్యవస్థ ఇలాగే ఉండాలని కోరుకుంటారు కాబట్టి. కానీ అంబేద్కర్‌ వారసులమనుకునే వారు, కుల సంఘాలు, అంబేద్కర్‌ సంఘాలు, కుల నిర్మూలన కోసం ఏర్పడ్డ సంఘాలు, అంబేద్కర్‌ అవార్డు గ్రహీతలు, దళిత మేధావులు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘాలు, కుల నిర్మూలన గురించి మాట్లాడే రాజకీయ పార్టీలు, దళితుల, అణగారిన వర్గాల రాజ్యాధికారం కోసం ఏర్పడ్డ సంఘాలు, పార్టీలు, ఈ వ్యవస్థ మార్పు కోసం ఆచరణాత్మకంగా చేస్తున్న కృషి ఏమిటి ? అంబేద్కర్‌ మార్గాన్ని ఎంత మేరకు ఆచరిస్తున్నారు ? అని చూసినపుడు అవి అట్టడుగు వర్గాల ప్రజల జీవితాలను మార్చగలిగే విధంగా లేవు. అంబేద్కర్‌ చెప్పిన స్థితి ఇంకా కొనసాగుతూ ఉండటమే దీనికి కారణం.
'అస్పృశ్యతను పాటించడమంటే మండే బొగ్గును తమ నాలుకల మీద పెట్టుకునేంత అత్యంత ప్రమాదకరమైందని హిందూ సవర్ణులు తెలుసుకునేలా తీవ్రంగా మనం స్పందించాలి' అంటాడు అంబేద్కర్‌'. ఇలాంటి స్పందన నేడు కొరవడింది. ఇలాంటి స్పందన నిజంగానే ఉంటే పరిస్థితులు మరోలా ఉంటాయి. ఒక సిద్ధాంతాన్ని కాని, ఒక ఆలోచనను కాని అది ఎలాంటిదైనప్పటికీ నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్టంగా అన్వయించినప్పుడు వచ్చే ఫలితాలు వేరు. అన్వయిస్తున్నట్లు నటించనప్పుడు వచ్చే ఫలితాలు వేరు. ఆచరణలో పెట్టినప్పుడు వచ్చే ఫలితాలు వేరు. మాటలకే పరిమితమైనప్పుడు వచ్చే ఫలితాలు వేరు. ఇది గ్రహించనంత కాలం ఫలితాలు ఫెయిల్యూర్‌ గానే ఉంటాయి. ముఖ్యంగా ఈ వ్యవస్థ మారాలనుకునే వారు ఆచరణాత్మక కృషి చేసినప్పుడే సరైన ఫలితాలు వస్తాయి.
డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం సాక్షిగా ప్రతిజ్ఞ చేద్దాం. హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం. ప్రజానీకాన్ని నిలువునా ముంచుతున్న ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలపై పోరాడుదాం. సామాజిక అసమానతలపై తిరుగుబాటు చేద్దాం. చట్టాల అమలుకు పోరాడుదాం. 'అడుక్కుంటే వచ్చేది భిక్ష, పోరాడితే వచ్చేది హక్కు'. అందుకోసం 'హక్కులకోసం బిచ్చమెత్తకండి పోరాడి సాధించండి' అన్న ఆయన మాటలను నిజం చేద్దాం. 'మేకల్ని బలి ఇస్తారు కానీ సింహాలను ఇవ్వరు. కాబట్టి సింహాల్లా గర్జించండి' అని ఆయన ఉద్బోధించారు. బోధించు, సమీకరించు, పోరాడు అనే ఆయన నినాదాలను, ఆలోచనా విధానాన్ని ఆచరణలో రుజువు చేస్తూ సామాజిక, వర్గ రహిత సమాజం కోసం ముందుకు సాగినప్పుడే ఆయనకు నిజమైన వారసులమవుతాం. అదే ఆయనకు నిజమైన నివాళి.
(వ్యాసకర్త ఎపి బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి) 
దామెర రాజేందర్‌

Prajashakti Telugu News Paper Dated: 06/12/2013 

Tribute to Nelson Rolihlahla Mandela By Sakshi Education


Education NewsNelson Rolihlahla Mandela, the South African anti-racism revolutionary who was imprisoned for 27-long years and later became the first black President of South Africa passed away on 5 December. The world mourned departure of Mandela, who left an inspirational legacy and never-dying spirit which will continue to show path for generations to come. 

He was the first black South African to hold the office, and the first elected in a fully representative, multiracial election. After entering into the office, he had focused on dismantling the legacy of apartheid (Apartheid -"the state of being apart" was a system of racial segregation enforced through legislation by the National Party (NP) governments, who were the ruling party of South Africa from 1948 to 1994, under which the rights of the majority black inhabitants of South Africa were curtailed and Afrikaner minority rule was maintained.) through tackling institutionalised racism, poverty and inequality, and fostering racial reconciliation.

Born in Thembu royal family, Mandela attended the Fort Hare University and the University of Witwatersrand, where he studied law. Living in Johannesburg, he became involved in anti-colonial politics, joining the ANC and becoming a founding member of its Youth League. After the pro-apartheid South African National Party came to power in 1948, he rose to prominence in 1952 with ANC’s Defiance Campaign and eventually presided over the 1955 Congress of the People. 

Working as a lawyer, he was repeatedly arrested for seditious activities and was unsuccessfully prosecuted in the Treason Trial from 1956 to 1961. Although initially committed to non-violent protest, he co-founded the militant Umkhonto we Sizwe (MK) in 1961 in association with the South African Communist Party, leading a sabotage campaign against the apartheid government. In 1962 he was arrested, convicted of conspiracy to overthrow the government, and sentenced to life imprisonment in the Rivonia Trial.

Mandela served 27 years in prison, initially on Robben Island, and later in Pollsmoor Prison and then in Victor Verster Prison. An international campaign lobbied for his release, which was granted in 1990 amid escalating civil strife. Then he opened negotiations with President F.W. de Klerk to abolish apartheid and establish multiracial elections in 1994, in which he led the ANC to victory. 

As South Africa's first black President, Mandela formed a Government of National Unity in an attempt to defuse racial tension. He also promulgated a new constitution and created the Truth and Reconciliation Commission to investigate past human rights abuses. Continuing the former government's liberal economic policy, his administration introduced measures to encourage land reform, combat poverty, and expand healthcare services. 

Mandela was politically an African nationalist and democratic socialist and believed that developing countries should grow their stature in world affairs. He served as Secretary General of the Non-Aligned Movement from 1998 to 1999. Internationally, he acted as mediator between Libya and the United Kingdom in the Pan Am Flight 103 bombing trial, and oversaw military intervention in Lesotho. He declined to run for a second term, and was succeeded by his deputy, Thabo Mbeki. Mandela subsequently became an elder statesman, focusing on charitable work in combating poverty and HIV/AIDS through the Nelson Mandela Foundation.

Mandela developed a special relationship with India. He chose India for his first international visit as President of South Africa. He was considered as the living legacy of Mahatma Gandhi. He was the only foreigner awarded Bharat Ratna, the highest civilian award of India; considering Khan Abdul Ghaffar Khan’s intimate relationship with India and its independence movement. 

Though Western critics had denounced Mandela for his Marxist ties, he nevertheless gained international acclaim for his activism, having received more than 250 honours, including the 1993 Nobel Peace Prize, the US Presidential Medal of Freedom, the Soviet Order of Lenin and the Bharat Ratna. He is held in deep respect within South Africa, where he is often referred to by his Xhosa clan name Madiba or as Tata (Father); he is often described as "The Father of the Nation". Mandela died following a long illness on 5 December 2013 at his home in Johannesburg.

Sakshiedcaution.com expresses its deep condolences for Mandelas and the country of South Africa and remembers the man, whose life was full of humanitarian achievements.