Friday, December 6, 2013

అంబేద్కర్ ఆలోచనలు అనుసరణీయం By దామెర రాజేందర్‌  డిసెంబర్‌ 6న డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ 57వ వర్ధంతి జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా అంబేద్కర్‌ ఆశయాలు, సిద్ధాంతం, ఆలోచనా విధానం అని మాట్లాడే ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచించాల్సిన అవసరముంది. అంబేద్కర్‌ వర్ధంతులు, జయంతుల సందర్భంగా సభలు, సమావేశాలు జరిపి, పూల దండలు వేసి, కొబ్బరికాయలు కొట్టడం, పసందైన ఉపన్యాసాలు చెప్పటం వరకే పరిమితమవుతున్నామా ? అంబేద్కర్‌ను రోల్‌మోడల్‌గా స్వీకరించి ఏ మేరకు ఆచరణాత్మకంగా ఉన్నాం? అని తప్పని సరిగా ఆలోచించాలి. ముఖ్యంగా అంబేద్కర్‌ సిద్ధాంతాన్ని గురించి మాట్లాడే వారు ఈ ఆలోచన చేయడం అవసరం.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆయన స్థాపించిన 'పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ' అనే మాట లేకుండా ఏ ఒక్క విద్యార్థీ విద్యావంతుడు కాలేదు. అందుకు అంబేద్కర్‌ చేసిన కృషి అమోఘమైనది. ఇది ఎవరూ కాదనలేని సత్యం. విద్యకు దూరమవుతున్న అణగారిన వర్గాల ప్రజలకు చదువును అందుబాటులోకి తేవాలని అంబేద్కర్‌ తపనపడ్డాడు. అలాగే విద్యను నిర్ణయిస్తున్న రాజకీయాలేమిటి ? ఎవరు అధికారంలో ఉన్నారు ? వారు ఎవరి ప్రయోజనాల కోసం విద్యా విధానాన్ని, విద్యా వ్యవస్థను నిర్ణయిస్తున్నారు ? అనే విషయాలను కూడా అంబేద్కర్‌ పట్టించుకున్నాడు. అందుకోసం అంబేద్కర్‌ను 'రోల్‌ మోడల్‌'గా స్వీకరించాల్సిన అవసరం ఉంది.
కానీ దురదృష్టకరం ఏంటంటే అంబేద్కర్‌ చెప్పిన దానికి, చేసిన దానికి విరుద్ధమైన పద్ధతులు నేడు కొనసాగుతున్నాయి. జయంతులు, వర్ధంతుల సందర్భంగా కొబ్బరి కాయలు, పూల దండలు, అందమైన మాటలు, వాగ్దానాలు, ప్రతిజ్ఞలతో సరిపెట్టుకునే దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది.
విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, అంబేద్కరిస్టులు విద్యావ్యవస్థలో వస్తున్న మార్పుల గురించి, విద్యా వ్యవస్థను శాసిస్తున్న రాజకీయాల గురించి ఆలోచించడం లేదు. ఆలోచిస్తున్నట్లు, విద్యావ్యవస్థ బాగు కోసం ఘర్షణ పడుతున్నట్లు ఊహల్లో ఉంటున్నారే తప్ప సరైన విధంగా ఆచరణ లేదు. ఇది చాలా దురదృష్టకరం. విద్యా వ్యవస్థను శాసిస్తున్నదెవరు ? ఆ రాజకీయలేమిటి ? అని తప్పనిసరిగా ఆలోచించాలి. ఎందుకంటే కాలేజీలు, యూనివర్సిటీలను రాజకీయాలే పాలిస్తున్నాయి. ఈ రాజకీయాలను పట్టించుకోకుండా విద్యార్థులుగా బ్రతకలేరు. మనుగడ సాగించలేరు. ఈ సత్యాన్ని గ్రహించకపోవడం నష్టదాయకం. అందువల్ల విద్యార్థులుగా రాజకీయాలను పట్టించుకోవాలి. లేకుంటే చదువుకోవడం, బ్రతకడం కూడా కష్టమేనని గ్రహించాల్సిన అవసరం ఉంది. మాయల ఫకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్లు యావత్తు తలరాతలు మార్చే 'కీ' రాజకీయల్లోనే ఉందని గుర్తెరగాలి. ఈ మధ్యకాలంలో కాకతీయ యూనివర్సిటీలో 'మెస్‌' ప్రైవేటీకరణ జరిగితే వ్యతిరేకించే వారు కొందరైతే మాకెందుకులే అని పట్టించుకోకుండా ప్రేక్షక పాత్ర వహించిన వారు కొందరు. ప్రైవేటీకరణ విద్యార్థులకు నష్టం అని అందరికీ తెలుసు. అయినా రాజకీయ ముసుగులో జరిగిన మెస్‌ ప్రైవేటీకరణను అడ్డుకునే రాజకీయ చైతన్యం విద్యార్థుల్లో, విద్యార్థి సంఘాల్లో కొరవడటం నిజంగా దురదృష్టకరం. విద్యార్థి సంఘాలుగా కొంత ఆందోళన ప్రయత్నం చేసినా కాకతీయ యూనివర్సిటీ పరిపాలన కేంద్ర రాజకీయాలను 'ఢ' కొట్టగలిగే రాజకీయ శక్తి విద్యార్థుల్లో లేకపోయింది. అందుకోసమే విద్యార్థులుగా, విద్యార్థి సంఘాలుగా ప్రస్తుతం చేస్తున్న రాజకీయాలే రాజకీయాలనుకునే భ్రమల్లోంచి బయటపడాలి. ప్రత్యక్ష రాజకీయాలను ఆలోచించాలి. అందుకోసం అంబేద్కర్‌ పుస్తకాలను, అంబేద్కర్‌ సిద్ధాంతాన్ని పట్టాలి.
'భారతీయ గ్రామాల్లో అందరూ ఒక్కటి కాదు. అవి అగ్రకులాలు, అంటరాని వారు అనే రెండు భాగాలుగా విభజించబడి ఉన్నాయి. అగ్రకులాల వారు పాలకులవుతారు. అంటరాని వారు కేవలం వారికి సేవలు చేసే బానిసలుగా మిగులుతున్నారు' అని అంబేద్కర్‌ అన్నారు. ఇది నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి వ్యవస్థ పోవాలి. అందుకు ఎవరు కృషి చేయాలి ? ఎవరు ఏం చేస్తున్నారు ? ఈ వ్యవస్థ ఇలాగే ఉండాలని కోరుకునే అగ్రవర్ణాలు, ఈ హిందూ సమాజాన్ని నిలకడగా ఉంచే అధికార పాలకవర్గాలు ఈ అసమానతలను పోగెట్టేందుకు ఎలాగూ పూనుకోవు. ఎందుకంటే వారి దోపిడీ కొనసాగడం కోసం ఈ వ్యవస్థ ఇలాగే ఉండాలని కోరుకుంటారు కాబట్టి. కానీ అంబేద్కర్‌ వారసులమనుకునే వారు, కుల సంఘాలు, అంబేద్కర్‌ సంఘాలు, కుల నిర్మూలన కోసం ఏర్పడ్డ సంఘాలు, అంబేద్కర్‌ అవార్డు గ్రహీతలు, దళిత మేధావులు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘాలు, కుల నిర్మూలన గురించి మాట్లాడే రాజకీయ పార్టీలు, దళితుల, అణగారిన వర్గాల రాజ్యాధికారం కోసం ఏర్పడ్డ సంఘాలు, పార్టీలు, ఈ వ్యవస్థ మార్పు కోసం ఆచరణాత్మకంగా చేస్తున్న కృషి ఏమిటి ? అంబేద్కర్‌ మార్గాన్ని ఎంత మేరకు ఆచరిస్తున్నారు ? అని చూసినపుడు అవి అట్టడుగు వర్గాల ప్రజల జీవితాలను మార్చగలిగే విధంగా లేవు. అంబేద్కర్‌ చెప్పిన స్థితి ఇంకా కొనసాగుతూ ఉండటమే దీనికి కారణం.
'అస్పృశ్యతను పాటించడమంటే మండే బొగ్గును తమ నాలుకల మీద పెట్టుకునేంత అత్యంత ప్రమాదకరమైందని హిందూ సవర్ణులు తెలుసుకునేలా తీవ్రంగా మనం స్పందించాలి' అంటాడు అంబేద్కర్‌'. ఇలాంటి స్పందన నేడు కొరవడింది. ఇలాంటి స్పందన నిజంగానే ఉంటే పరిస్థితులు మరోలా ఉంటాయి. ఒక సిద్ధాంతాన్ని కాని, ఒక ఆలోచనను కాని అది ఎలాంటిదైనప్పటికీ నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్టంగా అన్వయించినప్పుడు వచ్చే ఫలితాలు వేరు. అన్వయిస్తున్నట్లు నటించనప్పుడు వచ్చే ఫలితాలు వేరు. ఆచరణలో పెట్టినప్పుడు వచ్చే ఫలితాలు వేరు. మాటలకే పరిమితమైనప్పుడు వచ్చే ఫలితాలు వేరు. ఇది గ్రహించనంత కాలం ఫలితాలు ఫెయిల్యూర్‌ గానే ఉంటాయి. ముఖ్యంగా ఈ వ్యవస్థ మారాలనుకునే వారు ఆచరణాత్మక కృషి చేసినప్పుడే సరైన ఫలితాలు వస్తాయి.
డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం సాక్షిగా ప్రతిజ్ఞ చేద్దాం. హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం. ప్రజానీకాన్ని నిలువునా ముంచుతున్న ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలపై పోరాడుదాం. సామాజిక అసమానతలపై తిరుగుబాటు చేద్దాం. చట్టాల అమలుకు పోరాడుదాం. 'అడుక్కుంటే వచ్చేది భిక్ష, పోరాడితే వచ్చేది హక్కు'. అందుకోసం 'హక్కులకోసం బిచ్చమెత్తకండి పోరాడి సాధించండి' అన్న ఆయన మాటలను నిజం చేద్దాం. 'మేకల్ని బలి ఇస్తారు కానీ సింహాలను ఇవ్వరు. కాబట్టి సింహాల్లా గర్జించండి' అని ఆయన ఉద్బోధించారు. బోధించు, సమీకరించు, పోరాడు అనే ఆయన నినాదాలను, ఆలోచనా విధానాన్ని ఆచరణలో రుజువు చేస్తూ సామాజిక, వర్గ రహిత సమాజం కోసం ముందుకు సాగినప్పుడే ఆయనకు నిజమైన వారసులమవుతాం. అదే ఆయనకు నిజమైన నివాళి.
(వ్యాసకర్త ఎపి బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి) 
దామెర రాజేందర్‌

Prajashakti Telugu News Paper Dated: 06/12/2013 

No comments:

Post a Comment